21, ఏప్రిల్ 2010, బుధవారం

నేనూ ప్లైట్ ఎక్కేసానోచ్చి,,,


ఏదో సామెత ఉందిలే ...కొందరిని చూస్తే మొట్ట బుద్ది వేస్తుంది అంట..అలా నా మొహం చూడగానే తిట్టబుద్ది వేస్తుందేమో ??.. ఈ విషయం నాకు ఎయిర్ పోర్ట్ లో ఆ రోజే తెలిసొచ్చింది..అమ్మా వాళ్లకు టాటా చెప్పి మళ్లీ వెనక్కు చూడకుండా మా ఆయన చెప్పిన వాళ్ళిద్దరి వెనుక బయలు దేరాను.. అప్పటి వరకు తాపీ ధర్మారావులా ఉన్నవాడు కాస్తా హడావుడిగా పరుగులు పెట్టడం మొదలు పెట్టాడు మావారి ఫ్రెండ్ ..

నాకేమో నా లగేజ్ తో చాలా కష్టం గా ఉంది.. మరి వంట్లో బాగోక పోవడం వల్ల వచ్చిన నీరసమో లేక నేను మహా బలవంతురాలిని అవ్వడం వల్లనో కాని నాకు పట్టపగలే అరుందతి నక్షత్రం తో సహా బోలెడు చుక్కలు కనిపించ సాగాయి ...దానికి తోడు కొత్త దేశం మోజుతో కళ్ళకు పెట్టుకునే కాటుక నుండి ,కాళ్ళ కు వేసుకున్న చెప్పులవరకు అన్ని క్రొత్తవే కొన్నానేమో ..నా చెప్పులు అలవాటులేక ఊరికే,ఊరికే జారిపోవడం మొదలు పెట్టేసరికి నా సామిరంగా పండగే పండగ ...

ముందు లగేజ్ వెయిట్ వేయించి ,చెకిన్ అయ్యి .. ఆ తరువాత అతని వెనుక క్యూలో నించున్నా..నాకసలు ఏమి తెలియదేమో అతను ఎక్కడ పాస్ పోర్ట్ ,వీసా ,టిక్కెట్స్ చూపుతున్నాడో అక్కడ నేనూ పరుగులు పెట్టి చూపుతున్నా.. ఈ లోపల ఒక ఆవిడ ప్రక్కకు పిలిచి మెటల్ డిటెక్టర్ తో చెక్ చేయడం మొదలు పెట్టింది.. ఒక ప్రక్క చెక్ చేస్తూ ..మేడం ఏదో మీ దయ ..పిల్లా పాపలున్నారు ఒక యాబై ఇవ్వండి అంది .. నాకేం అంటుందో అర్ధం కాక ఆమె వైపు అయోమయం గా చూసాను.. ఆమె మళ్లీ అదే మాట అనేసరికి ,ఎయిర్ పోర్ట్ లో ఇలా కూడా అడుగుతారా అని ఆక్చర్యం తో కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తుంటే ..ఆ పరికరం నుండి ..కీ .. .కీ మని సౌండ్ వస్తుంది ..

ఒక్కసారిగా భయం వేసింది ..ఇదేంటి!! ఏమన్నా మారణాయుధాలు తీసుకు వెళితే డిటెక్టర్ వల్ల పట్టుపడిపోతారు అని మా ఆయన అన్నట్లు గుర్తు ..కొంపదీసి డబ్బులు ఇవ్వలేదని ఇలా భయ పెడుతుందా అనిపించింది .. ఆమె మళ్లీ ఇంకో పరికరం తీసింది... దానితో చెక్ చేస్తుంటే ..మళ్లీ కీ..కీ మంటుంది.. మేడం పిన్నులేమన్నా పెట్టారా అడిగింది ఆమె ... అప్పుడు గుర్తువచ్చింది నా మంగళ సూత్రానికి ఎప్పుడూ చీర కోసం సేప్టిపిన్నులు పెట్టి ఉంచుతా .. హమ్మయ్య అదా సంగతి ..ఊపిరి పీల్చుకున్నా..మేడం మిగిలిన వాళ్ళను చెక్ చెయ్యాలి తొందరగా ఇవ్వండి ..ఆమె కంగారుగా అంది.. నా దగ్గర యాబై లేవండి అన్నాను మెల్లిగా .. ఏంటి మేడం ..చిల్లర లేక పోతే వంద అన్నా ఇవ్వండి.. మీకు వంద అంటే ఎంత చెప్పండి ..ఆమె వదల లేదు.. ఉహు ఇరవయ్యే ఉంది అని తీసి చూపించా ..అప్పుడు ఆమె చూసిన చూపు ఇప్పటికి గుర్తు వచ్చినా విరక్తి వచ్చేస్తుంది ...

మొత్తానికి ఆ ఇరవై ఆమెకు చదివించుకుని బయట పడ్డాను.. ప్లైట్ లోపలికి వెళ్ళడానికి పిలుపు కోసం అందరం కూర్చుని వెయిట్ చేస్తున్నాం.. ఆ అమ్మాయికి మర్చిపోయిన ఏడుపు మళ్లీ గుర్తు వచ్చినట్లుఉంది .. మళ్లీ మొదలు పెట్టింది.. ఆ అబ్బాయి జాలిగా ఓదారుస్తున్నాడు.. అటే చూస్తే బాగోదని చూపు తిప్పుకున్నా ... అమ్మా ,నాన్న ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు ..ఇంకో నాలుగైదు గంటల్లో వేరే దేశం వెళ్ళిపోతున్నా లాంటి ఆలోచనలు మళ్లీ బెంగ పెట్టేస్తున్నాయి.. దేవుడా ,దేవుడా ప్లీజ్ ధైర్యం ఇవ్వవా అనుకుంటూ కళ్ళు మూసుకుని కూర్చున్నా ..

ఏదో కలకలం వినబడితే గబుక్కున కళ్ళు తెరిచా..ఎదురుగా ఆ అబ్బాయి లేడు.. అందరూ హడావుడి గా క్యూలో నించుంటున్నారు.. అతని వెనుక అప్పటికే ఒక అయిదుగురు ఉన్నారు .. ఆ బేగ్ పట్టుకుని పడుతూ లేస్తూ వాళ్ళ వెనుక నించున్నా..అందరి టికెట్స్ ,వీసాలు మళ్లీ చెక్ చేస్తూ లోపలి పంపుతున్నాడు ఒక అతను..నేను కూడా చూపిస్తుంటే' సెక్యూరిటి చెకింగ్ కా టేగ్ కహా హై 'అన్నాడు ..ఒక్క ముక్క అర్ధం కాలేదు.. అంటే ??అన్నాను అయోమయం గా ..నన్ను పక్కకు ఉండమని చెప్పి మిగిలిన వాళ్ళను చెక్ చేస్తూ సెక్యూరిటి చెకింగ్ చేయిన్చుకురండి అన్నాడు హిందీ లో .. ఏంటి సార్ అన్నాను భయం గా.. మా ఆయన ఫ్రెండ్ వెళ్ళిపోయాడు లోపలికి ..

ఎక్కడికి వెళ్ళాలో ఏమిటో ఏం అర్ధం కావడం లేదు ..అతను సమాధానం ఇవ్వడం లేదు.. ఇచ్చినా అర్ధం కావడం లేదు.. ఏడుపొచ్చేస్తుంది ... అసలు పంపుతారా నన్ను లోపలికి ??...అమ్మా ,నాన్న ఉన్నారా బయట ??? వెళ్ళిపోయి ఉంటారు .. కనీసం ఫోన్ చేద్దామన్న పైసాలేదు ..ఏం చెయ్యాలి ??? దానికి తోడు ఈ బేగ్ ఒకటి ఎటు పరిగెట్టుకుని వెళ్ళడానికి వీలులేకుండా.. అందరూ వెళ్ళిపోతున్నారు .. సార్ ఏంటి సార్ మళ్లీ అడిగాను కళ్ళ లో నీళ్ళు తిరుగుతుంటే ..'ఉస్ సే పూచో 'అని అటు వెళుతున్న ఒక ఆమెను చూపించాడు .. ఆమె హడావుడిగా అటు ఇటు తిరుగుతుంది.. ఆవిడ దగ్గరకు పరుగులు తీసా.. ..మేడం సెక్యూరిటి చెకింగ్ అంటున్నారు..టేగ్ అంటున్నారు .. ఎక్కడ మేడం అన్నాను ... ఏంటీ!!!! సెక్యూరిటి చెక్ చేయించకుండా ఎలా వచ్చ్చావ్ ఇక్కడికి అంది విచిత్రం గా చూస్తూ ...నాకసలు ఏం జరుగుతుందో అర్ధం కాలేదు ..ఎక్కడో ఏదో మిస్ అయ్యింది ...మా ఆయన ఫ్రెండ్ మీదా బాగా కోపం వచ్చింది ..అలా ఎలా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు ??

ఫస్ట్ టైం మేడం నాకు ఏమి తెలియదు అన్నాను భయం గా ...అలాంటప్పుడు అన్నీ తెలుసుకుని రావాలి.. ఫ్లైట్ టైం అయిపోతుంది పద పద అంది.. ఆమె వెనుక పరుగు పెట్టాను ..బేగ్ బాగా బరువు ఉండటం వల్ల ఆమెను అందుకోలేక పోతున్నా ...తమ్ముడు ,అమ్మ మాటలు గుర్తొచ్చి బాగా తిట్టుకున్నా..ఏంటి??మళ్లీ ఏమైంది అంది ఆమె విసుగ్గా..బేగ్ వైపు చూసాను ... ఆమె బేగ్ ని మరొక వైపు పట్టుకుని .. ఏంటమ్మా ఏం మోసుకోచ్చేస్తున్నావ్.. అసలు నిన్ను ఎలా పంపారు ఇంత బరువుతో లోపలికి .. 7 కేజిలకంటే ఎక్కువ తీసుకురాకూడదు తెలుసా అంది ... ఉహు అన్నాను .. బాగా తెలివి మీరిపోయారు.. చిన్న బేగ్ అంటే ఎవరికీ అనుమానం రాదనీ ఇలాంటి తెలివి తేటలు ఉపయోగిస్తారు అంటూ తిడుతూనే ఉంది .. ఉక్రోషం,కోపం తో చెంప తడిచిపోతుంది కాని ఏమి చేయలేను..

అందరూ వెళ్లిపోయారని కాబోలు చెక్ చేసేవాళ్లిద్దరూ కబుర్లు చెప్పుకుంటున్నారు ...ఆవిడ వాళ్ళతో ఏదో చెప్పి వెళ్ళిపోయింది .. వాడికేదో డవుట్ వచ్చినట్లుంది ..ఏంటమ్మా ,ఏది ఆ బేగ్ ఓపెన్ చేయి అన్నాడు అందులో ఒకతను ... అవును ,కీ ఎక్కడుంది ??? నా హేండ్ బేగ్ వెతకడం మొదలు పెట్టా ..కంగారు వల్ల కనిపించడం లేదు ...వాళ్ళేమో చిరాకు పడుతున్నారు ..చివరికి దొరికాక బేగ్ ఓపెన్ చేసి చూసారు ...హుమ్ కారం,పసుపు, పచ్చళ్ళు ఈ ఆడోళ్ళు మారరు ..అంతరిక్షానికి పంపినా అప్పడాల పేకెట్ మోసుకు వెళతారు .. కానియ్ అని ప్రక్కనున్న వాడితో జోకాడు వాడు.. నాకు వళ్ళుమండి పోతుంది కాని బలవంతం గా నవ్వాను .. అక్కడి నుండి బయట పడి వస్తుంటే నా పేరు ఎనౌన్స్ చేస్తున్నారు ..భయం తో ఒకటే కంగారు ,ఏడుపు ...అందరూ నా వైపు చూస్తున్నా సరే ఒక చేత్తో కన్నీళ్ళు తుడుచుకుంటూ మరొక చేత్తో బేగ్ మోసుకుంటూ పరుగులు పెట్టా ... నన్ను చూడగానే ఎయిర్ హోస్టెస్ కమ్,కమ్ అంది హడావుడిగా .. హమ్మయ్యా ప్లైట్ లో కొచ్చేసాను..మరికొన్ని విశేషాలు తరువాత పోస్ట్ లో ..

14, ఏప్రిల్ 2010, బుధవారం

నా విదేశీ పయనం


అన్నీ తెలిసిన వాళ్ళకన్నా చెప్పచ్చు ...ఏమీ తెలియని వాళ్ళకైనా చెప్పచ్చు.. నాకులా తెలిసీ , తెలియని వాళ్లకు చెప్పడం చాలా కష్టం .. ఈ మాట నేననలేదు .. మా ఆయన తరుచూ నా గురించి చెప్పే మాటలు ఇవి .. విదేశాలకు వెళ్ళే చాన్స్ వచ్చింది అనే ఆనందం అర నిమిషం అయినా పడలేదు..ఏ మూలనో ఉన్న బెంగ మాత్రం చుట్టు ముట్టేసింది.. ప్రక్కింటికి వెళ్ళాలంటే పది మంది తోడు లేనిదే వెళ్ళని నేను ఒంటరిగా కొన్ని వేల కిలో మీటర్లు దూరంగా వెళ్ళిపోవాలా !!!!!పైగా ఎక్జాంస్ లో బట్టీ పట్టి రాసిన నాలుగు ఇంగ్లిష్ ముక్కలు తప్ప ,ఎవరితోనూ గట్టిగా నాలుగు మాటలు మాట్లాడెరుగనే ..దేవుడా ...నా వల్ల అయ్యే పనేనా!!! అని రోజూ దిగాలు పడిపోయేదాన్ని...

దానికి తోడు మా ఆయన చెప్పిన కబుర్లు అగ్నికి ఆజ్యం తోడైనట్లు ఒకటే టెన్షన్ తెప్పించేవి.. "బుజ్జీ,ఇక్కడ ఎయిర్ పోర్ట్ ఎంత పెద్దదో తెలుసా !!! నేను మొదటి సారి కన్ఫ్యూజ్ అయిపోయి అమెరికా కి వెళ్ళే మరొక ప్లైట్ వైపు వెళ్ళిపోయా.. బయటకు ఎలా రావాలో తెలియదు ... ఇక్కడి వాళ్ళ భాష మనకి ,మన భాష వాళ్లకు అర్ధం అయి చావదు.. డ కి 'ద' అని, ట కి 'త' అని మార్చి పలుకుతారు నత్తి వాళ్ళ లాగా ...ఇప్పుడూ ..."టూ డాలర్స్ తర్టి ఫైవ్ సెంట్స్" అనాలనుకో.. వాళ్ళేమో "తూ దాలర్స్ తర్తి ఫైవ్ సేన్త్స్" అని పలుకుతారు..అబ్బా ...బయటకు వచ్చేసరికి గంట పట్టింది" .....

ఇలాంటి కబుర్లు మొదట్లో నవ్వులాటగా అనిపించేది కాని ..తరువాత ,తరువాత అదే విషయం నాకన్వయించుకుని భయపడేదాన్ని ...నేను సింగ పూర్ లో విమానాశ్రయం లో తప్పడిపోయినట్లు.. అలా ఏదో అమెరికాయో ,ఆస్ట్రేలియాయో వెళ్ళే విమానం ఎక్కేసినట్లు ( ఎవరిని పడితే వాళ్ళను ఎక్కిన్చుకోవడానికి అది ఆర్టిసి బస్సు లెక్క కాదని అప్పటికి తెలియదన్నమాట ) ఇంకేదో దేశానికి వెళ్ళిపోయి ,భాష రాక ,తిండి లేక ఏంటో ఏంటో అయిపోయినట్లు ఒకటే ఆలోచన.. దానికి తోడు ఆ రాత్రి శ్రీదేవిది ఏదో హిందీ సినిమా చూసాను ...ఆమె ఇలాగే ఏదో దేశానికి వెళుతుంటే ఎవరోతన బేగ్ లో డ్రగ్స్ పెట్టేస్తారు... ఆ తరువాత నానా బాధలు పడి హీరో సహాయం తో బయట పడుతుంది ... ఇంకేంటి ఈ పాటికి మీకర్ధం అయిపోయి ఉండాలి సీన్ ...

ఆ మరుసటి రోజు నాన్న దగ్గరకు వెళ్లి నాన్నా!! ఉహు నేను వెళ్ళను అన్నాను దీనంగా... అసలు నేనుఈ మాట ఎప్పుడు అంటానా అని ఎదురు చూస్తున్న నాన్న .. అలాగే తల్లీ.. రేపు మీ ఆయనకు చెప్పేద్దాం అన్నారు నన్ను దగ్గరకు తీసుకుని ... ఎప్పటి నుండి మమ్మల్ని గమనిస్తుందో తెలియదు గాని అమ్మ 'కయ్ 'మంది... బాగుందండి మీ ఇద్దరి వరుసా ...అదంటే చిన్నపిల్ల ...దానికి ధైర్యం చెప్పడం మానేసి ...మీరూ అలాగే మాట్లాడుతారే... ఆ అబ్బాయి అక్కడ ఎన్నాళ్ళు ఉంటాడో ఏమో ... అంత ఇష్టం లేని వాళ్ళు ముందే చెప్పచ్చుగా వెళ్ళద్దని..ఇలా భార్యాభర్తలను ఎన్నాళ్లని విడదీస్తారు ...అని మొదలుపెట్టేసింది.. అసలు నువ్వు దాని కన్నతల్లి వేనా!!నా కూతురిని అంత దూరం పంపించేయమంటావా.. ఏం అక్కరలేదు..అప్పుడప్పుడు వచ్చి చూసి వెళతాడులే ... నాన్న ఊరుకోలేదు ....మా అమ్మ మాత్రం ఊరుకుందా.. ఇది మరీ బాగుంది ..మేము రాలేదా మావాళ్ళను వదిలి..పైగా ఎప్పుడన్నా పుట్టింటికి వెళితే, ఒక్క రోజు ఎక్కువ ఉంటే చాలు మీరు ,మీ అమ్మగారు అలిగేసేవారు ... ఇలా చేస్తారు కాబట్టే మగవాళ్ళకు కూతురి మీద అంత మమకారం పెడతాడు దేవుడు ... రేపు వాళ్ళాయన అడిగితే ఏం చెప్తారు అని తిరిగి వాదించింది అమ్మ..

కాసేపు వాద, ప్రతివాదనలు అయ్యాకా సరేలేమ్మా ..ఒక్కదానివే వెళ్ళద్దు ..మీ ఆయన్ను వచ్చి తీసుకు వెళ్ళమంటాను అన్నారు నాన్న ... ఆ మాట అన్నాకా కాసింత ధైర్యం అనిపించింది... అన్నట్లు గానే నాన్న మరుసటి రోజు మా వారి తో ఫోన్ లో విషయం మాట్లాడారు కూడా...అది కాదు బాబు ..అమ్మాయికి చిన్నప్పటి నుండి ఒక్కరితే ఎక్కడికీ వెళ్ళడం అలవాటు లేదు .. నువ్వొచ్చి తీసుకు వెళ్ళరాదు..టికెట్ నేను కొంటా అన్నారు ...అటు మా ఆయన ఏమన్నారో తెలియదు కాని నీతో మాట్లాడుతాడట అని ఫోన్ నాకిచ్చారు ...'హలో 'అనడం పాపం ..మొదలు పెట్టేసారు మా ఆయన దండకం ...నీకసలు బుద్దుందా ...నిన్న గాక మొన్న జాబ్ లో జాయిన్ అయ్యాను, వెంటనే లీవ్ అంటే ఇంటికి పొమ్మంటారు..నీకూ,మీ నాన్నకు బాగా ఆటలుగా ఉంది..అక్కడ ఫ్లైట్ లో ఎక్కితే ఇక్కడ నేను రిసీవ్ చేసుకుంటాను ..మద్యలో నిన్నెవడు ఎత్తుకుపోతాడు.. వేషాలు వెయ్యకుండా నోరుమూసుకుని రా అని తిట్టి పడేసారు ... అది కాదండి ..మరీ ..నాకేమో బొత్తిగా ఇంగ్లిష్ లో మాట్లాడటం రాదు అన్నాను గునుస్తూ .. అవును మరీ ..ఇక్కడ రాగానే నీకు ఎక్జాం పెడతారు కదా మొహం చూడు అని పెట్టేసారు ఫోన్ ..

బోలెడు కోపం వచ్చింది కాని ఏం చెయ్యను ...నాన్నకు చెప్పానంటే 'ఆయ్'.. నా కూతురిని అలా అంటాడా ..నేను పంపను అని మొండికేస్తారు ఎలారా బాబు అనుకుంటుండగా సాయంత్రం మళ్ళా ఫోన్ వచ్చింది ...నా ఫ్రెండ్ ఒక అబ్బాయి పెళ్లి కోసం ఇండియా కొచ్చాడు ...అతను వచ్చే నెల ఇక్కడికి వస్తున్నాడు ..అతనితో వచ్చేసేయ్ సరేనా అన్నారు.. 'హమ్మయా' అనిపించింది.అక్కడి నుండి మొదలైంది హడావుడి ..సూట్కేస్ కొనడం ..బట్టలు కొనుక్కోవడం వగైరాలు..ముఖ్యం గా తాళం కప్పలు..శ్రీదేవి సినిమా మహాత్యం ...

అమ్మా!! లగేజ్ ౩౦ కేజీల కంటే ఎక్కువ ఉండ కూడదట అన్నాను బట్టలు సర్దుతున్న అమ్మతో ...ఇది మరీ బాగుందే.. సూట్ కేసే 10 కేజీలు బరువుంది ..ఇంకేం పెట్టను ఇందులో అంది అమ్మ విసుక్కుంటూ .. ఏముంటాయిలే ... నావి అయిదు రకాల చీరలు ,ఒక అయిదు రకాల డ్రెస్సులు ,మరో అయిదు నైటీలు ఇంతేగా .. పైగా ఒక చిన్న బేగ్ హేండ్ లగేజ్ కూడా తెచ్చుకోవచ్చట అన్నాను.. మరీ.. వంట సామాను ఏమి వద్దా ..అక్కడ కప్పలు, పంది మాంసం తింటావా అంది అమ్మ.. యాక్ ..అవును కదా ..క్రొత్త కాపురం .. అందులోను ఒక సారి... మా ఆయన తిండికి చాలా ఇబ్బంది అయిపోతుంది , ఈ బ్రెడ్డు ,జాము తినలేకపోతున్నా అన్నారు...మద్యాహ్నం బయట ఏదో నూడిల్స్ గట్రా తినేసి కడుపు నింపుకుంటున్నారట.. నావల్ల కాదు బాబోయ్ ఆ తిండి అనిపించింది.. మరేం చేద్దాం అన్నాను అమ్మతో.. ఏముంది మీ ఇద్దరేగా ... నాలుగు నెలలకు సరిపడే వంట సామాగ్రి నేను సర్దుతాగా నువ్వు కంగారు పడకు అమ్మ హామీ ఇచ్చేసింది ... లగేజ్ మాత్రం ౩౦ కేజీలు మించకూడదు సుమా ... అమ్మకు మళ్లీ చెప్పాను..


వర్షాకాలమేమో అప్పుడే చక్కగా మబ్బులు పట్టి చినుకులు స్టార్ట్ అయ్యాయి ..నేను హైదరాబాద్ కి వెళ్ళడానికి ట్రైన్ ఎక్కాను .. తమ్ముళ్ళు,పిన్నులు,చిన్నాన్నలు,పెద్దమ్మ,పెదనాన్న అందరు స్టేషన్ కి వచ్చారు ...మనస్సు భారం అయిపోతుంటే నిట్టూర్చి క్రింద బేగ్ (హేండ్ లగేజ్) తీసుకోబోయాను ... ఆక్చర్యం ..బేగ్ లేవలేదు నేను పైకి లేచా..ఇదేంటి ..ఇంత బరువుంది ..మళ్లీ ప్రయత్నించా ..ఉహు అస్సలు లేవలేదు ... ఏం పెట్టావమ్మా ఇందులో అన్నాను అయోమయం గా ... మరీ సూట్ కేస్ ౩౦ కేజీలు మించద్దు అన్నావు కదే.. అందుకే హేండ్ బేగ్ లో రెండు కేజీల మినపప్పు,రెండు కేజీల పెసరపప్పు, రెండు కేజీల ఇడ్లి రవ్వ ,పంచదార,చింత పండు,మషాలా పొడి,కారం,పసుపు,తాలింపు సామాను ...చివరాకరికి అంట్లు తోమే పీచు కూడా పెట్టేసా ఇందులో ... అమ్మ గర్వం గా చెప్పింది..

అయ్య బాబోయ్ అమ్మా !!నేనసలు మోయ్యగలనా అన్నాను కోపంగా... ఊరుకో, నువ్వు మొయ్యడం ఏమిటి లోపల కూలీలు ఉంటారుగా అంది.. 'ఒక వేళ లేకపోతే 'అరిచాను.. ప్రక్కన ఉన్న మా తమ్ముడి వైపు చూస్తూ ,ఇదేంట్రా ఇలా అంటుంది... బోడి ట్రైన్ ప్లాట్ ఫాం మీదే బోలెడు కూలీలు ఉంటారు .. ఎయిర్ పోర్ట్ లో ఉండరా అంది.. అవునక్కా ఒక వేళ లేరనుకో ప్రక్కనున్న వాళ్ళను ఎవరినన్నా హెల్ప్ చెయ్యమంటే ఆ మాత్రం చెయ్యరా ..అయినా మీ ఆడవాళ్ళకు బోలెడన్ని సదుపాయాలు.. మా మగవాళ్ళం 100 కేజీల బస్తా మోసినా ఎవడూ చూడడు కాని,అమ్మాయి నెమలి పించం పట్టుకున్నా మోయలేరేమో అని గిన్జుకుంటారు బోలెడు మంది ...నీకంత శ్రమ ఎవరూ ఇవ్వరులే ,అయినా బావ గారి ఫ్రెండ్ వస్తాడు గా ఆయన మోస్తాడులే ..ఆ మాత్రం హెల్ప్ చెయ్యడా అన్నాడు.. వీడొకడు , నిరంతర స్త్రీ ద్వేషి ..ప్రపంచం లో బాధలు,కష్టాలు అబ్బాయిలు మాత్రమే పడుతున్నారని 'ఘాట్టి' ఫీలింగ్ ... ఇంక తప్పక సరే అని బయలు దేరాను ...


హైదరాబాద్ చేరుకొని హోటల్ లో విడిది అయ్యాకా ఎయిర్ పోర్ట్ చేరుకున్నా ... రాత్రి అస్సలు నిద్ర పట్టలేదు.. నాన్న అస్తమాను నా బెర్త్ దగ్గర కొచ్చి దుప్పటి కప్పడం,తల నిరమడమే సరిపోయింది ... కాసింత కదిలిస్తే చాలు ఏడ్చేయడానికి సిద్దంగా ఉన్నారు ..ఏంటో!!! అమ్మా ,నాన్నకళ్ళ నీళ్ళు పెడితే నేను తట్టుకోలేను..అదీ నాగురించి ..అందుకే పెళ్లి కాగానే అప్పగింతల సీన్ ఎక్కడ పెడతారో అని చూపు తిప్పకుండా మా ఆయనతో కబుర్లు చెప్తూనే ఉన్నా..కార్ లో కూడా గబుక్కున టాటా చెప్పేసి మొహం తిప్పేసాను.. ఇప్పటికీ మా ఆయన దెప్పుతారు నీకసలు మీవాళ్ళంటే ప్రేమ ఉందా అని .. మీకేం తెలుసు నా బాధ అని అనుకుంటాను ...ఇప్పుడు మళ్లీ అదే సీన్ ...రాత్రి నుండి ఏమి తెలియనట్లు ఈ చీర ఎందుకు కట్టుకున్నావ్.ఆ డ్రెస్ ఎందుకు పెట్టావ్ అని లోడ లోడా కబుర్లు చెప్పి నటించేస్తున్నా .... అమ్మ మాత్రం నా కోసం పైకి అస్సలు తేలదు..నా బేల తనం బాగా తెలుసు ...


నాన్నా,అమ్మా విజిటర్ పాస్ తీసుకున్నారు .. ఇంతకూ మావారు చెప్పిన ఫ్రెండ్ ఇంకా రాలేదు.. నాకసలే ఆ పరిసరాలు చూస్తుంటే టెన్షన్ టెన్షన్ గా ఉంది..కొంపదీసి ఈ రోజు జర్నీ కేన్సిల్ చేసుకోలేదు కదా ఆ అబ్బాయి అని అనిపించింది.. కంగారు పడుకులే వస్తాడు అని నాన్నచెప్తూ, నీ దగ్గర డబ్బులు ఏమన్నా ఉన్నాయా అమ్మా అన్నారు.. అప్పుడు గుర్తు వచ్చింది ..20 రూపాయలు తప్పా పైసా లేదు.. ఉహు అన్నాను.. నాన్న 5000 తీసి నా చేతిలో పెట్టాబోయారు ...ప్రక్క నున్న అతను' ఎందుకండీ అవి ..ఆ దేశం లో మన కరెన్సీ నాలుక గీసుకోవడానికి కూడా పని చెయ్యదు , ప్లైట్ లో ఎలాగు ఫుడ్ గట్రా వాళ్ళే పెడతారు ,అక్కడ చేరగానే మీ అల్లుడు రిసీవ్ చేసుకుంటారు ..అనవసరం అన్నాడు ' ...నాన్న, నేను మోహ మొహం చూసుకున్నాం ... పోనీ ఒక 1000 రూపాయిలయినా తీసుకో అన్నారు.. వద్దులే నాన్న ..నాకేం అవసరం తిరిగి ఇచ్చేశాను.. అదే నేను చేసిన పెద్ద తప్పని నాకు తెలియదు ...


ఈ లోపల మావారికి తెలిసిన ఫ్రెండ్ వచ్చాడు ... కొత్తగా పెళ్లి అయిన కళ కొట్టొచ్చినట్లు కనబడుతుంది ... ప్రక్కనున్న వాళ్ళావిడ చెయ్యి అర నిమిషం కూడా వదలకుండా ,ఆప్యాయం గా ఆమె కళ్ళ లో చూస్తూనే ఉన్నాడు..క్రొత్త గా పెళ్లి అయిన వాళ్ళను చూస్తే భలే నవ్వొస్తుంది నాకు.. అంగుళం దూరం కూడా విడిచి ఉండలేనట్లు ఉంటారు..అదే ఒక సంవత్సరం అయ్యిందో మినిమం రెండు అడుగులు దూరం కొలుచుకుని మరీ నడుస్తారు ..ఇంకా పిల్లలు గట్రా పుడితే ..హుమ్ ఎందుకు అడుగుతారు లెండి :).. మా అమ్మాయి బాబు అని పరిచయం చేసారు నాన్న ..అర సెకను నా వైపు చూసి చిన్నగా నవ్వి (?) మళ్లీ తన గొడవలో పడిపోయాడు ...పాపం మా నాన్న, నా గురించి చెప్పడానికి( అంటే మా అమ్మాయికి ఏమీ తెలియదు.. కాస్త జాగ్రత్త గా వాళ్ళాయన దగ్గరకు తీసుకు వెళ్ళు ..గట్రా గట్రా ) బాగా ప్రిపెరయ్యి వచ్చారేమో ఆ అబ్బాయి అవకాసం ఇవ్వక పోయేసరికి సతమతమైపోతున్నారు..అబ్బా పర్లేదులే నాన్నా అని వారించాను..

వచ్చి అరగంట అయినా వాళ్ళు అసలు తెమలరే ...అక్కడే కబుర్లు వాళ్ళ వాళ్ళ తోటి ..నాకేమో టైం అయ్యే కొద్ది టెన్షన్ ..ఈ లోపల ఉన్నట్లుండి సీన్ మారిపోయింది .. ఆ అబ్బాయి ఆ అమ్మాయిని జాలిగా చూస్తున్నాడు.. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మను ,నాన్నను పట్టుకుని భోరున ఏడుస్తుంది..అప్పగింతలు ...అంటే బయలుదేరుతున్నాం అన్నమాట.. నాకు కంగారోచ్చేసింది నాన్నను తలుచుకుని ...ఇప్పటి వరకు ఎంత జాగ్రత్తగా విషయం ఏమార్చాను.. నాన్న వైపు చూసాను.. నాన్న ఆ అమ్మాయి తండ్రిని ఓదార్చడం లో బిజీ గా ఉన్నారు .... అంత టెన్షన్ లోను నవ్వొచ్చింది..

అమ్మ కళ్ళు తుడుచుకుంటుంది .. చూసావా ...ఆ అబ్బాయి నా లగేజ్ మోసేస్తాడు అన్నావ్ ...అతనే బోలెడు బేగ్ లు మోసుకొచ్చాడు.. నువ్వస్సలు తిన్నమైనదానివి కాదు... వెనక్కి తీసుకు పో అన్నాను ... నోరుముయ్యి.. ఆ ఫ్లైట్ వరకు మోయలేవేంటి ... కాసేపు కష్టపడితే నాలుగు నెలలు హాయిగా ఉంటావ్ అంది .. సరేలే దిగగానే ఫోన్ చేస్తా గాని నే వెళ్ళగానే ఇద్దరూ ఇక్కడ గాన కచేరి పెట్టకండి ...హోటల్ కి వెళ్ళండి .. నాన్న జాగ్రత్త ..అమ్మకి మాత్రం వినబడేలా అని గభ,గభా లోపలికి నడిచా.. కాని లోపలి వెళ్ళాకా ఆ కచేరి నేను ఇస్తా అని అనుకోలేదు .. :)

2, ఏప్రిల్ 2010, శుక్రవారం

నేనూ -నా విదేశీ కలలు


మనసు భలే విచిత్రమైనది ..మనం కోరుకున్నది జరగకపోతే ఒక బాధ ,తీరా జరిగితే ఇంకొక బాధ ,సరేలే అని అదే విషయం దూరమవుతే మరొక బాధ..హూం.. మనసు గతి ఇంతే ,మనిషి బ్రతుకంతే అని ఊరికే అన్నారా!! ..హయ్యో అసలు విషయం మానేసి ఏమిటి ఈ వేదాంతం??? ...ఇంతకూ ఎక్కడున్నాం?? సారి ..ఇంకా సోది మొదలు పెట్టేలేదు కదా..

చిన్నప్పుడు ఆకాశంలో విమానం గాని ,హెలికాప్టర్ గాని వెళుతుందంటే చాలు మా మేడ పై ఎక్కేసి తెగ చేతులు ఊపేసి, టాటాలు చెప్పేసేవాళ్ళం ..కొంచెం పెద్దయ్యాకా తెలివితేటలు పెరిగిపోయి ...అవునూ! ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్లకు చేతులు ఊపుతూ మనం ఇంత సంభర పడిపోతున్నాం కదా ... అసలు వాళ్ళు మనల్ని చూస్తున్నారా? చూసినా మనం కనబడతామా ? కనబడినా మనల్ని పట్టించుకుంటారా ??? ఆ మాత్రం దానికి అప్పలమ్మాలా గాల్లో చేతులు ఊపుతూ ఎందుకు ఈ వృదా ప్రయాసా అని అనేసుకోవడమే కాకుండా ఇదే నేను గనక విమానం ఎక్కితే , కిటికీ ప్రక్కనే కూర్చుని, ఫోజులు కొట్టకుండా తప్పకుండా టాటా చెప్తాను అని తీర్మానిన్చేసుకునేదాన్ని ...

అదిగో అప్పటినుండి విమానం ఎక్కాలని ఆశ మొదలైపోయింది ...కాని విమానం ఎక్కాలంటే విదేశాలకి వెళ్ళాలి ( ప్రక్క రాష్ట్రం కి వెళ్ళాలన్నా విమానం ఎక్కచ్చు అన్న విషయం అప్పటికి నాకు తెలియదు లేండి ) ... పావుగంట జర్నీ ఉన్న అమ్మమ్మ ఊరు పంపాలంటే అరగంట ఆలోచించే మా నాన్న విదేశాలకు పంపడం సాధ్యమా!! అని భారిగా నిట్టూర్చి ఆ విషయం మర్చిపోయాగాని.. "సాధ్యమే" అని బల్ల గుద్ది మరీ చెప్పింది పడమటి సంధ్యా రాగం లో విజయ శాంతి ... ఆ రోజు టి .వి లో సినిమా చూస్తున్నంత సేపూ ఎంత గింజుకున్నా విజయ శాంతి ప్లేస్ లో నేనే కనబడ్డాను.. సంధ్య నా పేరే అనిపించింది .. అలా ఆ సినిమాలో అమెరికా అబ్బాయి ' టాం ' ని వలచాను ,వరించాను, ప్రేమించాను ... వాడు మాత్రం విజయ శాంతిని పెళ్లి చేసుకుని పిల్లని కన్నాడు గాని నన్ను మాత్రం కన్నెత్తి చూడలేదు ...

కాని సినిమా అయిపోయాకా గొప్ప అవిడియా వచ్చేసింది ... ఎంచక్కా ఒక తెల్ల తోలు పిల్లాడిని ప్రేమించేసి , అతనే నన్ను ఎక్కడో చూసి ఇష్టపడి పెళ్లి సంబంధం మాట్లాడటానికి మా ఇంటికి వచ్చినట్లు సీన్ క్రియేట్ చేస్తే ( హమ్మా..మళ్ళా నేను ఇరుక్కోకూడదు కదా ..ఊహాలు కూడా చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటా నేను ) ... 'అమెరికా 'అబ్బాయి, అందులోను బోలెడు డబ్బున్న అబ్బాయి, పైగా కట్నం గట్రా తీసుకోకుండా పెళ్లి చేసుకుంటాను అంటే నాన్న మాత్రం ఎలా కాదనగలరు??? (ఒకవేళ అలా జరిగి ఉంటే ,ఇద్దరికీ తోలు తీసి ఇంటిల్లి పాదికి చెప్పులు కుట్టిన్చేసేవారని అప్పటికి నా బుజ్జి మెదడుకి తెలియదు ) అనేసుకుని మా స్కూల్ నుండి ఇంటికి వచ్చే దారంతా జల్లెడ వేసి మరీ గాలించాను ..అబ్బే.. విదేశం నుండి కాదు కదా ,కనీసం ప్రక్క రాష్ట్రం వాడు కూడా కనబడలేదు ... అలా నా ఊహలన్నీ ఊసులు గానే మిగిలి పోయాయి..

అలా ఆ విషయం మర్చిపోతుండగా మళ్లీ గుర్తు చేస్తూ వచ్చింది మా పెద్దమ్మ గారి అక్కయ్య కూతురు 'సౌదీ' నుండి .. తనని అందరూ దేవతలా చూసేవారు ..మా వీధే కాదు..పేట మొత్తానికి విమానం ఎక్కిన మొదటి అమ్మాయి తను.. కాలేజ్ నుండి రాగానే తన ప్రక్కన చేరిపోయి తను చెప్పే విషయాలను చేటంత చెవులతో ,ఆల్చిప్పల్లా కళ్ళు పెద్దవి చేసుకుని మరీ వినేదాన్ని ... అక్కడ మాములుగా మనం వేసుకునే డ్రెస్సులతో రోడ్ మీద నడవకూడదంట... బురఖా వేసుకోవాలి అని పోటోస్ చూపిస్తే ఆ బురఖాని 10 వేల రూపాయల పట్టు చీరలా ఎంతో అపురూపం గా చూసేదాన్ని.. మన దేవుళ్ళ పటాలు తీసుకు వెళ్ళనివ్వరు అట ..అందుకే పెట్టె అడుగున చీర మడతల మద్యలో బుల్లి దేవుళ్ళ పోటోస్ ని జాగ్రత్తగా తీసుకు వెళ్ళింది అట ..ఇంకా అక్కడ పాలు ,పెరుగు గట్ర మనకులా ఇళ్ళకు వచ్చి 'అమ్మా పాలు' అని అమ్మరంట ... అన్నీ డబ్బాల్లో దొరుకుతాయంట...దొంగతనాలు జరగవుట .... ఏ వస్తువు రోడ్ మీద పడిపోయినా అలా వదిలేసి వెళ్లిపోవాలట .. ఎక్కడ తవ్వినా మనకు నీళ్ళు వచ్చినట్లు వాళ్లకు పెట్రోలు వస్తుందంట .. దారంతా కొబ్బరి చెట్లకు మల్లే ఖర్జూరం చెట్లు ఉంటాయంటా... బంగారం బోలెడు చవకట ..అబ్బో ఎన్నెన్ని విశేషాలో .... రెండు చేతుల మద్యలో ముఖాన్ని పెట్టుకుని రెప్ప వాల్చ కుండా వినేదాన్ని..

ఇంటర్ అవ్వగానే డిగ్రి చదువుకు నాన్న ససేమిరా అన్నారు..పెద్ద చదువులు చదివితే అంతకు తగ్గ మొగుళ్ళను నేను వెదకలేను అని ఖరాకండిగా చెప్పేసరికి ... అప్పటి వరకు నేలకు రెండు అడుగుల ఎత్తులో తేలే నా పాదాలకు భూమి మీద నిలబడటం ఏంటో తెలిసొచ్చింది .. మద్య తరగతి ఆడపిల్లల తండ్రికి ప్రతీకలాంటి నాన్న కడుపున పుట్టీ ఏమిటీ ఆకాశానికి నిచ్చెనలు ..దిగు దిగు అని మనసు హెచ్చరించింది .. దెబ్బకు దిగి పోయి ఎక్కడో గంతకు తగ్గ బొంత దొరుకుతాడులే.. ఇన్ని ఊహాలు మనకేలా అని నిజ జీవితం లోకి వచ్చి పడ్డాను.. అయితే అమ్మ బలవంతం తో మళ్ళా డిగ్రీ పేరు తో కాలేజ్ లోకి అడుగు పెట్టాననుకోండి అది వేరే విషయం ...

అలా అప్పుడు ఎక్కడో వదిలేసి మర్చిపోయిన విషయాన్ని,మా వారు వెదికి తీసుకొచ్చి మరీ కళ్ళ ముందు నిలబెడతారని ఊహించనైనా ఊహించలేదు నేను.. ఆరు నెలల్లో రెండు సార్లు మిస్ కేరి అవ్వడం వల్ల, అమ్మా వాళ్ళింట్లో రెస్ట్ తీసుకుంటూ టివి లో పాత సినిమా చూస్తున్నాను ... తనకి పిల్లలు పుట్టరని భర్తకు మరో పెళ్లి చేయాలని ఒప్పిస్తూ ఉంటుంది ఆ మహాసాధ్వి ...టిడ..టిడ..టోయ్ ... ఇంకేంటి వీరోయిన్ ప్లేస్లో నేను ,వీరో మా ఆయన ..మా ఆయన్ని ఒప్పిస్తూ కళ్ళల్లో నీళ్ళతో నేను (కంగారు పడకండి అప్పటికింకా నా వయసు నిండా ఇరవయ్యే .. అందుకే అలా అన్నమాట ) చాలా ఉద్వేగ భరితమైన సీన్ మద్యలో మా ఆయన వచ్చి డిష్టర్బ్ చేసినందుకు గొప్ప చిరాకొచ్చింది గాని ,విషయం వినేసరికి ఏంటీ !!!!!!!!! అని ఒక్క అరుపు అరిచాను ...

అది కాదు బుజ్జి ,మొన్నటి వరకు నువ్వు ప్రెగ్నెంట్ గా ఉన్నావు కదా అప్పుడు చెబితే ఎక్కువ ఆలోచిస్తావని చెప్పలేదు ..అనుకోకుండా నాకు సింగపూర్ లో జాబ్ వచ్చింది .. వచ్చే ఆదివారమే వెళ్ళాలి అన్నారు మెల్లి గా .... అంతే కళ్ళలో నుండి నీళ్ళు జల జలా వచ్చేసాయి.. మా ఆయన నన్ను వదిలేసి వేరే దేశానికి వెళతారా ??ఇంకేమన్నా ఉందా ??? ..నేను ఉండగలనా ???? ఒక పావుగంట వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉన్నా.. మరి నా కన్నె కలలన్ని రెక్కలొచ్చి కాకుల్లా ఎక్కడికి వెళ్లిపోయాయో తెలియదు గాని ,అప్పటికి నేను సగటు భార్య స్థానం లోకి వచ్చి అర్ధ సంవత్సరం పైనే అయిపోయింది... అది కాదు బుజ్జీ ,నాకు మాత్రం నిన్ను వదిలి వెళ్ళడం ఇష్టం అనుకుంటున్నావా?? ఒక ౩ నెలల్లో నిన్ను నాతో తీసుకు వేళ్ళనూ...మనకి ఆస్తులేమున్నాయి చెప్పు .ఇపుడు సంపాదిస్తుంది మనవరకు సరిపోతుంది ...మనకు పిల్లలు పుడితే అప్పుడు వాళ్ళను బాగా చూసుకోవాలి కదా ,ఖర్చులు పెరుగుతాయి కదా ...అయినా ఎంతా, ఒక్క మూడేళ్ళు ... ఆ తరువాత వెనక్కి వచ్చేద్దాం ...సరేనా అంటూ పలు ,పలు విధంబులుగా మభ్య పెట్టగా మూడు ఉహు...హు లు ముప్పది ప్లీజ్ లమధ్య ఒప్పుకోక తప్పలేదు ....

మా ఆయన కోసం మొదటి సారి హైదరాబాద్ లో ఎయిర్ పోర్ట్ వచ్చి ,విమానం ఎలా ఉంటుందో దగ్గర నుండి చూసాను ... ఆయన విమానం ఎక్కుతున్నంత సేపు ఆనందం గా ఉన్నా దిగి అక్కడకు చేరుకున్నాను అని ఫోన్ చేసే వరకు ఒక్క నిమిషం స్థిమితం గా ఉండలేక పోయాను ...
పైకి నిమిషాని ఆరు సార్లు అరుస్తాను గాని మా ఆయన మీద నాకు ఎంత ప్రేమఉందో అప్పుడు గాని తెలియలేదు.. పైగా అప్పట్లో ఫోన్ బిల్ విపరీతం గా అవ్వడం వల్ల ,క్రొత్తగా జాయిన్ అవ్వడం వల్ల ఎక్కువ గా ఫోన్ చేసేవారు కాదు ..అప్పుడప్పుడు లెటర్స్ వ్రాసేవారు ..వాటినే ముప్పై సార్లు చదువుతూ ఉండేదాన్ని ...

ఎవరన్నా తెలిసిన వాళ్ళు కనబడితే నేను సింగపూర్ వెళుతున్నా అని గొప్ప గా చెప్పేదాన్ని కాని, ఆ తిక్క మొహాలకు సిరిపురం లా వినబడి ఏడ్చేది కాబోలు ..అది సరే గాని ఇంకేంటే విశేషాలు అనేవారు ....ఒక వేళ పట్టుబట్టి చెప్పినా అమ్మో సింగపూరే ..ఎలా పంపించావ్ ...ఇంక నీ బ్రతుకు ఇక్కడే ..ఆ దేశం లో పెళ్ళాలకు వీసా ఇవ్వరంటా..ఒక వేళ నువ్వు వెళ్ళినా ౩ నెలల తర్వాత పంపేస్తారంటా మాకు తెలిసిన వాళ్లకు ఇలాగే జరిగింది ... అని నాలుగైదు కధలు చెప్పి భయపెట్టేసే వాళ్ళు..అమ్మా వాళ్లకు చెపితే ,సరేలేమ్మా అంతగా అయితే ఇక్కడున్టావ్ ,నష్టం ఏంటి ,ఎలాగూ ౩ ఏళ్ళు తర్వాత వచ్చేస్తాడు గా అనేవారు.. నాకు చాలా దిగాలుగా అనిపించేది.. పెళ్లి మంత్రాలు ఎంత పవర్ఫుల్ కాక పొతే ..సంవత్సరం పరిచయానికే ఇంత ప్రేమ పెంచేసుకుంటామా!! అనిపించేసేది..

నా దిగులు కాదు గాని ,రోజు పాపం మా చెల్లెళ్ళకు చిరాకు తెప్పించేసేదాన్ని ... ఈ పాటికి మీ బావగారు నిద్ర లేచి ఉంటారు .. ఈ పాటికి బ్రష్ చేసి ఉంటారు .. అక్కడికి ,ఇక్కడికి రెండున్నర గంటలు తేడా అంటా ...నాకు వీసా వస్తుందంటావా ??? ఒక వేళ అక్కడికి వెళితే నేను ఉండగలనంటావా అని చెప్పిందే చెప్పి నస పెట్టేసేదాన్ని.. ఫోన్ రానంత వరకు ఒక బెంగ ,ఫోన్ పెట్టేసేక ఒక బెంగ .. ఏదన్నా అద్భుతం జరిగి మా ఆయన గంట మాట్లాడేవరకు ఫోన్ కార్డ్ అవ్వకుండా ఉంటే భలే ఉంటుంది కదా అనుకునేదాన్ని.. అద్భుతం.. అదే జరిగింది ... ఏం జరిగిందో ఏమో.. కార్డ్ లో డబ్బులు అయిపోయినా రెండున్నర గంటలకు పైనే మాట్లాడుకున్నాం ..అక్కడి విశేషాలన్ని పూస గుచ్చినట్లు చెప్పారు ..

ఇక్కడ బుజ్జీ.. అబ్బాయిలు చిటికిన వేలు కనబడకుండా బట్టలు వేసుకుంటారా ..అమ్మాయిలేమో పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటారు తెలుసా..

అవునా ..మీరు గాని చూస్తున్నారా వాళ్ళను ??..

ఛీ.ఛీ ఆ పంది మొహాలను ఎవరు చూస్తారు ..మన ఇండియన్ అమ్మాయిలు కనబడితేనే చూస్తాను ...

హమ్మయ్యా అదే కదా ... @#$%^ ఏంటి,మళ్లీ చెప్పండి !!!!!

లేకపోతే నాకింక ఇదే పనే ...ఆఫీస్ లో పనిమానేసి వాళ్ళను వీళ్ళను చూస్తూ ఉంటా.. పైగా ఇక్కడ చట్టాలన్నీ అమ్మాయిలకు అనుకూలం గా ఉంటాయి..వెధవ వేషాలేస్తే కేన్ దెబ్బలే ..

అంటే???..
అంటే సన్నటి పేక బెత్తం లాంటి దానితో కొడతారంట...

ఓస్ అంతే కదా..

ఆగు ..పూర్తిగా విను .. ఆ దెబ్బకు వాడి వీపు అర అంగుళం మేరకు విడిపోతుంది అంట ..

అమ్మో !!!!..

అది తగ్గాకా మళ్లీ మిగిలిన దెబ్బలు కొడతారు ..

ఇంక చెప్పకండి బాబు ...

ఇక్కడ రోడ్లు ఎంత నీట్ గా ఉంటాయో తెలుసా... అద్దం లా ఉంటాయి.. మనదేశం లా ఉమ్ములు ,చెత్త పోస్తే బోలెడు డబ్బులు పైన్ వేస్తారు ...

చిన్నపిల్లలు ,ముసలి వాళ్ళు చేసినా అలాగే వేస్తారా??? ...

అవును వాళ్ళ ఇంట్లో వాళ్ళు కట్టాల్సిందే ...

ఇది మరీ బాగుంది ... చేతిలో చెత్త ఉంటే??

ఎక్కడికక్కడ డస్ట్ బిన్లు ఉంటాయి రోడ్ పొడవునా ...

ఓ ..మరీ ..ఉమ్మోస్తే ...

చెప్పాగా డస్ట్ బిన్లు ఉంటాయి అని ..

మరీ బాత్రుం కొస్తే??

.......
చెప్పండీ ...చిన్నపిల్లలు ,షుగర్ పేషంట్లు ఉంటారు ..మరి అప్పుడూ..దారి పొడవునా బాత్రుమ్లు ఉంటాయా ??..నేను రెట్టించాను ..

ఆహా.. ఇక్కడ ఎటు చూసినా అపార్ట్మెంట్లు ఉంటాయి కదా ..మనకు దగ్గర లో ఉన్న ఇంటికి వెళ్లి ,మీ ఇంట్లో బాత్రుం కి వెళతాను అని చెప్పడమే..

నిజ్జమ్మా!!! (బోలెడు ఆక్చర్యం ..ఇంకా బోలెడు అనుమానం గా)

నిజమేనే ..అది గవర్నమెంట్ రూలు .. మరి శుభ్రం గా ఉండాలంటే ఎలా.. మొన్న నేను అలాగే వెళ్లి వచ్చా..

అవునా !!!! మిమ్మల్ని ఏమి అనలేదా..

ఎందుకంటారు ...పైగా వాళ్ళ దేశాన్ని శుభ్రం గా ఉంచుతున్నందుకు మనల్ని కొత్త అల్లుడిలా గౌరవం గా చూస్తారు..

సరే ,ఆయన సంగతి తెలిసి నమ్మేసాను ...నమ్మేసినదాన్ని ఉరుకున్నానా !!!.. నాలాంటి పది మందికి చెప్పి నమ్మించాను.. వాళ్ళు ఇంకో పదిమందికి చెప్పి 'ఛీ' అనిపిచుకుని 'ధూ' అనేసారు నన్ను అది వేరే సంగతి అనుకోండి.. అలా బోలెడు విశేషాలు చెప్పుకున్నాకా వీసా గురించి అందరూ అనే మాటలు అన్నీ చెప్పాను ...అలా నా భయాలు బాధలు అన్నీ ఓపిగ్గా విన్నాకా చివర్లో మెల్లిగా చెప్పారు నీకు వీసా వచ్చింది ... మరుసటి నెలలోనే నువ్వు రావాల్సి ఉంటుంది అని.. భయం ,ఆనందం ,బెంగ అన్ని కలగలిపి ఏంటో నాకే తెలియదు ... అలా ఇరవై ఏళ్లకే నేను విదేశాలకు వెళ్ళే చాన్స్ వచ్చింది ..

23, మార్చి 2010, మంగళవారం

పెనం మీంచి పొయ్యిలో పడ్డట్లు -2



మొత్తానికి ఇండియా వెళ్ళే రోజు రానే వచ్చింది ...15 రోజులు ట్రిప్.... ఎప్పటిలాగే ఇండియా వెళ్ళుతున్నా అనే ఆనందం కంటే 15 రోజుల్లో తిరిగి వెనక్కి వచ్చేయాలి అని బెంగతో నేనూ, నా జన్మ భూమి ఎంతో అందమైన దేశము అని అరిగిపోయిన రికార్డులా అరనిమిషానికి ఒక మారు పాడేస్తూ ఆనంద పడిపోతూ మా ఆయన మొత్తానికి సొంత గూటికి చేరుకున్నాం.నేను ముందు గానే ఎందుకైనా మంచిదని టైటిల్ తో సహా జరిగిన సీన్లన్ని నాన్నకు పోన్లో వాయిన్చేయడం వల్ల, మా నాన్న ఊరంతా గాలించి పేరు ప్రక్కన ధర్మామీటర్ లోని డిగ్రీల మల్లే బోలెడు డిగ్రీలున్నా ఒక డాక్టర్ గారి దగ్గరకు తీసుకు వెళ్ళారు.

ఎలా అయినా రాజును చూసిన కళ్ళతో మొగుడిని చూస్తే మొట్ట బుద్ది వేస్తుంది అని హాస్పిటల్ కాస్త బాగానే ఉన్నా అంతగా నచ్చలేదు. 'ఒసే' దీన్నే ఎక్స్ ట్రాలు అందురు అని ఒక ప్రక్కనుండి నా మనసు క్లాస్ పీకుతూ ఉండగానే .. డాక్టర్ గారి ఎదురుగా కూర్చున్నాం నేనూ ,నాన్న .ఏమిటి మీ ప్రోబ్లెం అని డాక్టర్ అనగానే నా పంటి బాధలన్నీ తన బాధలు గా నాన్న చెప్పుతుంటుంటే ,నేను దీనం గా మొహం పెట్టుకుని కూర్చున్నా ..సరే పదమ్మా చెక్ చేస్తాను అనడం పాపం ముందు జాగ్రత్తగా ఆల్రెడీ రెండు సార్లు పళ్ళు క్లీనింగ్ చేయిన్చుకున్నానండి అయినా తగ్గలేదు అని చెప్పేసాను గభ గభా .ఆయన నా వైపు చూసి ఎక్కడా? అన్నారు .నేను సింగ పూర్ లో అనగానే ..."విచిత్రం".. డాక్టర్ గారి కళ్ళల్లో రెండు మతాబులు ,నాలుగు చిచ్చు బుడ్డులు భలే వెలిగాయి.

అంతే ఆ క్షణం నుండి డాక్టర్ గారు నన్ను ఎంత ప్రేమ గా ,ఆప్యాయం గా చుసుకున్నారంటే సడన్ గా నాకు ఆరేళ్ళు ఏమో ,నేను ఆయన ముద్దుల కూతురినేమో అని నాకే డవుట్ వచ్చేసింది ....అన్నం తిన్నావా అమ్మా అని అడిగినా " అచ్చి కుచ్చులూ,బుజ్జి కన్నలూ 'ఆమ్' తిన్నావా తల్లీ" అని అడిగినట్లు అనిపించింది..నాకు మరొక అలవాటు కూడా ఉంది టెన్షన్ గా ఉన్నపుడు ఎవరన్నా కాసింత ప్రేమ గా మాట్లాడితే చాలు నిద్ర ముంచు కోచ్చేస్తుంది..అలా ఆవలింతలు తీస్తుంటే ,అసలే మాత్రం విసుక్కోకుండా పళ్ళు చెక్ చేస్తూ మొహం ఆవుదం తాగినట్లు ( సినిమాల్లో క్రిటికల్ కండిషన్లో ఉన్న పేషంట్లను చూసి డాక్టర్లు పెట్టే ఎక్స్ ప్రెషన్ వంటిది ) పెట్టేసరికి దెబ్బకు నిద్ర ఎగిరిపోయి ఏమైంది డాక్టర్ ?అన్నాను భయం గా..

ఇంతటి సహన శీలతా ,ఓర్పు ఉన్నాయి కాబట్టే భుమాతను స్త్రీ తో పోలుస్తారమ్మా అన్నాడు (నిజంగానే )....ఆ మాటకు ఆనంద పడాలో ,భయపడాలో తేల్చుకోలేక అయోమయం గా చూస్తుంటే ...నీకు తెలియకుండానే ఎంత బాధ అనుభావిస్తున్నావో తెలుసా అమ్మా ! నీ రెండు జ్ఞానదంతాలు పుచ్చిపోయాయి.. వాటిని పీకేయాలి , నాలుగు పళ్ళు రంధ్రాలు పడిపోయాయి... వాటికి ఫిల్లింగ్ చేయాలి , కొన్ని పళ్ళు అరిగిపోయాయి ,కొన్ని పళ్ళ మద్య గ్యాప్ లు వస్తున్నాయి, కొన్నిపళ్ళు గార పట్టడానికి రెడీగా ఉన్నాయి..వీటికి అన్నిటికీ ట్రీట్ మెంట్ చేయాలి ... అనగానే నాకో సారి భూమి గుండ్రముగా ఉండును అని చిన్నప్పుడు చదువుకున్న పాఠం గుర్తు వచ్చింది ...కాని పైకి గంభీరంగా (మరి ఇప్పుడే కదా పొగిడాడు ..మళ్ళా పిరికిది అనుకుంటాడు)డాక్టర్ గారు !!!మరి ఇప్పుడేం చెయ్యాలి??,నేను 15 రోజులే ఉంటాను ఇక్కడ ... కళ్ళలో నీళ్ళు తిరిగిపోతుంటే ఆపుకుంటూ అడిగాను...

మరేం పర్లేదమ్మా,కంగారు పడకు ..నువ్వు వెళ్ళేలోపు చక్కగా నిన్ను క్లోజప్ టూత్ పేస్ట్ మాడల్ లా పంపిస్తాను కదా ..నో ప్రోబ్లెం ..
ముందు ఈ రోజు సగం క్లీనింగ్ చేసేసి ( సగమే ఎందుకో నాకర్ధం కాలేదు )రేపు ఫిల్లింగ్స్ చేసేసి ,ఎల్లుండి ,అవతలెల్లుండి దంతాలు పీకేస్తాను .. మిగిలిన ట్రీట్ మెంట్ టైమును బట్టి చూద్దాం ...సరేనా తల్లీ అనగానే కాస్త ధైర్యం వచ్చి సరే అన్నాను.. క్లీనింగ్ చేసినపుడు నాలుక అటుఇటు అలా కదపకు అమ్మా నా చెయ్యి తెగిపోతుంది అని అంత ఓపిగ్గా చెబుతుంటే .. ఇండియాలో డాక్టర్లకు సహనం తక్కువ ,కోపం ఎక్కువ అనే వాళ్ళను చితక్కోట్టేయాలి అనిపించింది ...

మొత్తానికి బయటకు వచ్చాకా ..నాన్న కౌంటర్ దగ్గర , బాబూ బిల్లెంత ?అని వెయ్యిరుపాయల నోటు బయటకు తీసి అడుగుతుంటే 2800 అన్నాడు ఆ అబ్బాయి ...ఏంటీ రూపాయిలే?? అని నాన్న నోరు వెళ్లబెడితే ,బండెడు టాబ్లెట్స్ చేతిలో పెట్టి ఏమోనండి డాక్టర్ గారు చెప్పారు అన్నాడు ....మొత్తం ట్రీట్ మెంట్ అంతటికీ కలిపా ఈ బిల్లు ???నాన్న కోపంగా అడిగారు ....అవునండి అటునుండి అంతే స్పీడ్ గా వచ్చింది సమాధానం ... ఈ సారి నాన్న కొంచెం తగ్గి ట్రీట్ మెంట్ మొత్తానికా???(అనుమానంగా )ఇంకాస్త తగ్గరా???(ఆశగా ) మళ్లీ అడిగారు..ఇంక నేను ఆగలేకపోయాను ..నాన్నా!!! నన్నేమయినా అనండిగాని దేవుడిలాంటి డాక్టర్ గారిని ఏమన్నా అంటే నేను సహించనూ ,భరించను. డొక్కులో క్లీనింగ్ కే అక్కడ 6000 తీసుకుంటారు ..ఇన్ని ప్రొబ్లెంస్ కి ఇక్కడ కనీసం ౩౦౦౦ కూడా కాలేదు ...ముందు బిల్లు కట్టేయండి అని చెప్పి బలవంతంగా బయటకు లాక్కోచ్చేసాను ...


ఆ తరువాత రోజు కూడా డాక్టర్ గారు అంతే ఆప్యాయంగా కబుర్లు చెబుతూ నాలుగు దంతాలకు ఫిల్లింగ్స్ పెట్టారు .. చివరకు ఒక కార్బన్ పేపర్ లాంటిది ఇచ్చి గట్టిగా కొరుకమ్మా అన్నారు.. అది ఫిల్లింగ్స్ సరిగ్గా చేసారో లేదో సరి చూడటానికన్న మాట... కొంచెం కొరకగానే విపరీతమైన నెప్పి ... ఆయన మళ్లీ పదునైన పరికరం తో సరిచేసి ఇప్పుడు ఎలా ఉంది ?అన్నారు.. మళ్లీ నెప్పి ..మూడు సార్లు సరి చేసినా నెప్పి మాత్రం తగ్గలేదు .. పరవాలేదులే రేపు వస్తావ్ గా అప్పుడు సరి చేస్తా అన్నారు.. ఆసరికే బోలెడు మొహమాటం వచ్చేస్తుంది నాకు ..పాపం డాక్టర్ గారిని ఎంత ఇబ్బంది పెట్టేస్తున్నా ..అయినా సరే విసుక్కోకుండా ఎంత చక్కగా మాట్లాడుతున్నారు అనుకుని బయటకు వచ్చేసా ..

ఇన్నేసి మందులు వ్రాస్తున్నాడేంటే బాబు ఈ డాక్టర్ అంటూ నాన్న మందులు తీసుకోవడానికి కౌంటర్ దగ్గరకు వెళ్ళగానే ఈ సారి బిల్లు 8000రూపాయలు చేతిలో పెట్టాడు .. ఏంటిదీ!! అన్నారు నాన్న అయోమయంగా ... 'ఈ రోజు బిల్లు సార్' ఆ అబ్బాయి జంకుగానే అన్నాడు.. ఏమయ్యా ,ఈ మాత్రం మందులకు 8000 రూపాయలా !!...ఎవరన్నా వింటే నవ్విపోతారు ..అక్కరలేదు నేను బయట కొనుక్కుంటా అన్నారు బిల్లు కాగితం లాక్కుని ... ఈ బిల్లు మందులకు కాదండి, ట్రీట్ మెంట్ కి అన్నాడు ఆ అబ్బాయి.. మరి నిన్న మొత్తం ట్రీట్ మెంట్ కని 2800 తీసుకున్నావ్ అన్నారు నాన్న..అవునండి అది నిన్న మొత్తానికి ..ఇది ఈ రోజు మొత్తం ట్రీట్ మెంట్ కి అన్నాడు.. ఆ తరువాతా వాడికీ , నాన్నకు చిన్నపాటి యుద్ధం జరిగాకా.. రేపు చెప్తా మీ డాక్టర్ సంగతి అని బిల్లు కట్టేసి బయటకువచ్చేసారు ...


అది కాదునాన్న ,పాపం డాక్టర్ గారు చాలా మంచోరు ఎక్కడో తేడా జరిగి ఉంటుంది అన్నాను ..నీ మొహం ..అసలు ఇదంతా నీవల్లే ..నిన్ననే తేల్చేవాడిని..నువ్వే లాక్కోచ్చేసావు అని నాలుగు తిట్టి పడేసారు..ఆ మరుసటి రోజు అపాయ్ ట్మెంట్ కోసం కాల్ చేస్తే డాక్టర్ గారు ఊరు వెళ్ళారని ఒక సారి ,వొంట్లో బాలేదని మరోసారి ,చెయ్యి తెగిందని ఇంకోసారి ఇలా కధలు చెప్పాడు కాని అపాయంట్ మెంట్ మాత్రం ఇవ్వలేదు వాడు.. అది కాదు నా బాధ ..ఆ డాక్టర్ ఫిల్లింగ్స్ సరిగ్గా చేయకపోయే సరికి పన్నుకి ,పన్ను తగిలితే చాలు ముక్కోటి దేవుళ్ళు కనిపించేవారు..విపరీతమైన బాధ ..అన్నం కాదు కదా కనీసం ఇడ్లీ కూడా తినలేని పరిస్థితి .. సూపులో ,జావలో త్రాగి కడుపు నింపు కోవడమే గతి అయ్యింది.. ఈ లోపల నాకు మా అత్తగారి ఇంటి నుండి ఒకటే పిలుపులు.. ఎప్పుడోస్తావ్?? ఎప్పుడోస్తావ్?? అంటూ ..చేసేది లేక సరే నాన్నా!మిగిలిన ట్రీట్ మెంట్ మా అత్తగారి ఇంటి దగ్గర చేయించుకుంటా అని మూటా,ముల్లే సర్దుకుని బయలు దేరా..


విషయం విన్నాకా ..బాగా అయ్యింది ..నేను ఇక్కడ చూపిస్తా రావే అంటే ,అహా ..మా నాన్న సూపరు,మా నాన్న డూపరు అని వెళ్ళావ్ కదా బాగా తిక్క కుదిరిందా అని కాసేపు మా ఆయన ఉడికిన్చాకా, సరే సాయంత్రం డాక్టర్ గారి దగ్గరకు తీసుకు వెళతా అని బయటకు వెళ్ళారు ..అలా వెళ్ళిన మనిషి రాత్రి అయినా ఇంటికి రారే ...సరిపోయింది వాడితో పెట్టుకుంటే అంతే...ఎంచక్కా మన ఇంటి ప్రక్కన చక్కని డెంటిస్ట్ ఉంది. బాగా చూస్తుంది ,మావయ్య గారిని తోడు తీసుకు వెళ్ళు అన్నారు అత్తయ్య.. సరే అని ఆవిడ దగ్గర వెళ్లాం ఇద్దరమూ ...వెళ్ళిన గంట అయినా రాదే ఆ డాక్టరమ్మ .. ఆ నర్సుని అమ్మా తల్లీ!! డాక్టర్ ఎప్పుడొస్తారు అని పొరపాటున అడిగామో ..ఏంటండీ..మీకన్నా ముందు వచ్చిన వాళ్ళే కిమ్మనడం లేదు మీరు అలా కంగారు పడితే ఎలాగా !!! కాసేపు వెయిట్ చేయండీ అని కసిరి పడేస్తుంది ...అలా ఇంకో గంట గడిచాకా ఇలియానాలా సూపర్ గా ఉన్న ఒక ఆమె టక టకా లోపలి వెళ్ళింది... ఆహా .. ఈ అమ్మాయి కనుక డాక్టర్ అయితే ఎంచక్కా డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను అని చెప్పేది కదా అని ఆలోచనల్లో ఉంటే నన్ను పిలిచారు ...

ఆవిడ అంతా విని ముందు ఆ దంతాలు పీకేద్దాం .. ఫలానా చోట ఎక్సరే చేయించుకు రా అంది.. అంతకు ముందు డాక్టర్ నీ పలువరుస క్రమం గా ఉంది ఎక్సరే అక్కరలేదు అన్నాడే??? అని మనసులో అనుకొని.. సరే అని మళ్ళా ఎందు కొచ్చిన గొడవలే అని బుద్దిగా ఎక్సరే తీయించుకుని వచ్చా.. ఈలోపల డాక్టర్ గారికి బోలెడు అవిడియాలు వచ్చేసాయి ..అవునూ!! ఇప్పుడు పై పన్ను పీకాం అనుకో క్రిందపన్ను ..పైన ఖాళీ గా ఉన్న ప్లేస్ లో గుచ్చుకుని నొప్పి వస్తే ???ఇంకా ప్రాబ్లం అవుతుంది ..కాబట్టి రూట్ కెనాల్ చేయిన్చేద్దాం ఏమంటావ్ అంది.. మళ్లీ నాకు ఇంతకు ముందు డాక్టర్ నీ జ్ఞానదంతాలు క్రింద దంతాలు రాలేదు ..వాటికి రూట్ కెనాల్ అవసరం లేదు అని అన్నట్లు గుర్తు ..అయినా సరే .. రూట్ కెనాల్ అంటే ఏమిటి??? డాక్టర్ గారు అన్నాను ...అంటే ..నీ పంటి కి చిగుళ్ళకు మద్య ఉన్న నరాన్ని కట్ చేసేసి వాటి నిండా సిమ్మేంట్ నింపేసి పైన కేప్ పెట్టేస్తాం..దాంతో పన్ను స్పర్శ లేకుండా అయిపోయి బాధించదు అంది సింపుల్ గా.. ఒసినీ.. నీ తాపీ తనం దొంగలు తోలా.. ఇంత భయంకరం గా చెప్తావేంటే బాబు అని అనుకుని రేపు చెప్తా ఏ విషయము అనేసి ఇంటి కొచ్చేసా..


మరేం పర్లేదమ్మా చేయిన్చేసుకో అని మావయ్యగారు అంటున్నా నాకు భయం గానే అనిపించి మీ అబ్బాయి రానివ్వండి అప్పుడు చూద్దాం అనేసి, ఆయన రాగానే ..ఏమండీ ఇలా అంది ఆవిడ ఏం చెయ్యను అన్నాను..ఆవిడ దగ్గరకు వెళ్ళావా !!!ఆవిడకు ఏమి రాదంట నీలాంటి వాళ్ళ పై ప్రయోగాలు చేసి నేర్చుకుంటుంది అంట ..మొన్న మా ఫ్రెండ్ కి పన్ను పీకితే బుగ్గ వాచి పోయి నాలుగు నెలలు బాధ పడ్డాడు అన్నారు ....దెబ్బకు దిగోచ్చేసి మా ఆయన గడ్డం పుచ్చుకిని బ్రతిమాలుతూ మీరే సూపరు ,మీరే డూపరు ఈ బాధ నేను భరించలేను అవతల వారం రోజులు కూడా లేదు తిరిగి వెళ్ళడానికి ..అన్నం తినక నీరసం వచ్చేస్తుంది మీరెలా చెప్తే అలా వింటా అని చెంపలు వాయిన్చేసుకుంటే ..సరే అని మరుసటి రోజు మరో డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్ళారు..

నాకస్సలు ఆ హాస్పిటల్ నచ్చలేదు ..ఏం బాలేదంతే..ఆ మాట అంటే తంతారని నోరుమూసుకు కూర్చున్నా ... అక్కడ నాకో క్రొత్త నిజం తెలిసింది.. ఎప్పుడూ కూడా హాస్పిటల్లో మనం లాస్ట్ పేషంట్ అవ్వకూడదు ...ఇంటికి వెళ్ళిపోదాం అనే హడావుడిలో మనల్ని అస్సలు చూడరు ..నా ఖర్మ కాలి అతని దగ్గరకు మా ఆయన ఆ రెండురోజులు ఊరి మీద పెత్తనాలన్నీ అయ్యాకా ఆఖరునే తీసుకు వెళ్ళేవారు ...ఆ డాక్టర్ నన్ను చూడగానే ..అబ్బా!! ఇంకా ఒక పేషంట్ ఉందా అని ఒక ఎక్స్ ప్రెషన్ ఇచ్చి ,విషయం తెలుసుకుని అబ్బే పన్ను పీకేయాలి రెండు వైపులా ..ఈ చిగుళ్ళు ఉన్నాయి చూసారా ఇవన్నీ 'బేడ్ బ్లెడ్' తో వాపు వచ్చాయి ..క్లీనింగ్ చేయాలి అన్నాడు..

@!#$%^&*&** దొంగామోహాల్లారా ఎన్ని సార్లు క్లీనింగ్ అంటారురా బాబు అని మనసులో తిట్టుకుని ..మొన్న చేయించుకున్నానండి అన్నాను ... నాకే ఎదురు చెప్తావా అని నా వైపు ఒక సారి చూసి ఒక సూది లాంటి పదునైన పరికరం తో చూసావా ఇదంతా అని కస్స్ మని గుచ్చి ఒక్క లాగు లాగాడు.. ఒకటే రక్తం ..ఏడుపొచ్చేసింది బాధకు ... ఓ పని చేద్దాం రేపు రెండు పళ్ళు పీకేసి ఎల్లుండి క్లీనింగ్ చేసేద్దాం అన్నాడు ..మరి క్రింద పన్ను పైన గ్రుచ్చుకుని నెప్పి రాదా ??అన్నారు మా ఆయన ...అసలు క్రింద జ్ఞాన దంతాలు లేవు చిన్నప్పుడు పీకిన్చేసుకుని ఉంటుంది మీ ఆవిడ అన్నాడు ..ఉహు ..నేను చిన్నపుడు అసలు డెంటిస్ట్ దగ్గరకే వెళ్ళలేదు అన్నాను.. అలా ఎలా కుదురుతుంది, నీకు గుర్తుండి ఉండదు అన్నాడు .. మళ్లీ ఏమంటే ఏం తంటాయో అని ఇంటి కొచ్చేసాం..

ఇంటికి రాగానే 'ఛీ ' చెత్త డాక్టర్ ..నా కొద్దు... నాకు భయం వేస్తుంది అన్నాను ... నీకందరూ మీ నాన్నలా జోల పాడతారే.... ఇతను మంచి డాక్టర్.. ఇప్పుడు మారాం చేస్తే ఇంక నీ బ్రతుకు సూపులకే అంకితం చూసుకో అన్నారు.. మరుసటి రోజు ..ఏమండీ!! నాకు భయం వేస్తుంది నా ప్రక్కనే ఉండండి అని బ్రతిమాలుకున్నా గాని మా ఆయనకు కరెక్ట్ గా ఏదో పోన్ వచ్చి బయటే ఉండిపోయారు.. నేను ఎప్పుడూ అలా భయపడలేదు ...కాళ్ళు చేతులు ఒణికి పోయాయి..నొప్పి కంటే ముందు భయం ..పన్ను పీకినప్పుడైతే ఏడ్చేసా .... ఏడ్చుకుంటూ బయటకు వస్తుంటే ముందు కంగారు పడిపోయి తరువాతా ఒకటే నవ్వు మా ఆయన ...పిరికిదానా అని.. ఆ తరువాత క్లీనింగ్ సంగతి ఏం అడుగుతారు లెండి ..మద్యలో పారిపోదామా అనిపించింది ..

మా ఆయన డాక్టర్ కి బిల్ కడుతుంటే అప్పుడు గుర్తు వచ్చింది ఫిల్లింగ్స్ సరిగా చేయలేదని.. బాబ్బాబు నాకసలు బాధ ఇది ..దీన్ని సరి చేయి అంటే.... అబ్బే ఏమి లేదు అంతా బాగానే ఉంది ..కొద్ది రోజుల్లో సరి అయిపోతుంది అంటాడు.. ఒర్నాయనా నీకో దణ్ణం పెడతా ... ఏమి లేక పోయినా కాస్త సరి చేయి తండ్రి నా తృప్తికి అని బ్రతిమాలితే ..ఇంక తప్పదని కాసింత అలా అలా లెవెల్ చేసాడు ..కాసింత పర్వాలేదు అనిపించింది .... కాని అతను చేసిన క్లీనింగ్ కి నరాలు అన్నీ నెప్పి ...ఆ ముక్క పొరపాటున మా ఆయనతో అనగానే .. అయితే పదా మా ఊర్లో ఒక డెంటల్ కాలేజ్ ఉంది అక్కడికి వెళదాం అన్నారు ...బాబూ చాలు ఇంక మద్యాహ్నం ట్రైన్ ఉంది ...నేనెక్కడికి రాను అన్నా బలవంతంగా లాక్కెళ్ళారు...అందులో అబ్బాయి ..మీ ఆవిడ కు పళ్ళు సరిగ్గా పీకలేదనుకుంటా అండీ.. ఇన్ ఫెక్షన్ ఉంది ..బహుసా పన్ను ముక్క లోపల ఉండి పోయిందేమో అన్నాడు...దెబ్బకు నీరసం వచ్చింది ...

మళ్ళాస్కానింగులు ,గట్రాలు అయ్యాకా ఈ రోజు ఆంధ్రా బంద్ కాలేజ్ మూసేస్తున్నాం అనేసరికి ఏమని చెప్పను నా బాధ ... మొత్తానికి ఎలా అయితేనో ఒక ప్రొఫెసర్ తో బ్రతిమాలి చెక్ చేయించుకుంటే ..పన్ను ఎప్పుడు పీకాడు..ఎంత టైము పట్టింది లాంటి ఇన్వెస్టిగేషన్ చేసాకా అబ్బే ఏం లేదమ్మా సెన్సిటివ్ టూత్ పేస్ట్ వాడు చాలు అని వెళ్ళిపోయాడు ..బ్రతుకు జీవుడా అని మరొక్క ప్రాబ్లం మా ఆయనకు చెప్పకుండా ఇక్కడికొచ్చి పడ్డాను.. ఇంతకు ముందు తీపే తినలేని పరస్థితి ...ఇప్పుడు ..హుం ఎందుకులేండి అదంతా ..కాబట్టి సామెతలు వినాలి అంతే గాని ఎందుకు? ఏమిటి? ఎలా? అని ఆరాలు తియ్యకూడదు ..అదన్నమాట సంగతి ... :)

10, మార్చి 2010, బుధవారం

పెనం మీంచి పొయ్యిలో పడ్డట్లు




నేనెప్పుడన్నా పొరపాటున ఫలానా విషయం తెలియదు అనుకున్నాను అనుకోండీ ..వెంటనే ఆ విషయం మీద ప్రాక్టికల్స్ తో సహా నా జీవితం లో జరిగిపోయి రిజల్ట్ చేతికొచ్చేస్తుంది...పైన చెప్పిన సామెత విషయంకూడా అలా అనుకున్నదే ..పలితం ఇలా పోస్ట్ రూపం లో మీ ముందు ఉండటం.. సరే విషయంలో కి వచ్చేద్దాం..

ఓసారి కూడలి లో బ్లాగులను చూస్తూ ,మా ఆయన గారు కొన్న జామకాయ ముక్కల పేకెట్ ని ముందు పెట్టుకుని తినడం మొదలు పెట్టాను.. షాప్ వాడు ముక్కలతో పాటు బ్రౌన్ కలర్ లో ఉన్న ఒక పొడిని కూడాఇచ్చాడు ..అది ముంచుకుని నోట్లో పెట్టుకుంటుంటే ఉప్ప,ఉప్ప గా చప్ప,చప్పగా ఏదోలా ఉంది. వీళ్ళ టేస్ట్ తగలబడ,ఏమిటి ఇలా ఉంది అని తిట్టుకుంటూ తింటున్నా ..అంత బాధ పడి తినేబదులు ఆ పొడిని ప్రక్కన పడేసి తినచ్చుగా లాంటి ప్రశ్నలు అడక్కండి నాక్కోపం వస్తుంది. సరే అలా తిట్టుకుంటూ తింటూ లాస్ట్ ముక్క నోట్లో పెట్టుకునేసరికి ఒక్కసారిగా విపరీతమైన బాధ ..దంతాల దగ్గర నరాలన్నీ లాగేస్తూ ..'దేవుడా' అంటూ చెంపలపై చేతులు పెట్టుకుని ఒక అర్ధ గంట అలాగే కూర్చుండి పోయాను .. అది మొదలు ఆ రోజునుండి తీపి తిన్నా, జామ, యాపిల్ లాంటి పళ్ళు తిన్నా నెప్పి మొదలై పోయింది.అదేంటో అప్పటి వరకు పెద్దగా ఇష్టపడని తీపి మీద ఒకటే మనసులాగేసేది..ఏ పార్టీలోనో ,పంక్షన్ లోనో గులాబ్ జాంనో, రసగుల్లానో తినడం..ఇంటికొచ్చి అరగంట గోలు గొలున ఏడవడం నాకు మామూలైపోయింది ..

ఎప్పుడన్నా .. ఏమండీ! నా జ్ఞానదంతాలు నెప్పి అనగానే ..అందుకేనే జ్ఞానం లేని వాళ్లకు జ్ఞానదంతాలు వస్తే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ యే వస్తాయి ..అలా ప్రకృతి విరుద్దం గా ఏది జరగ కూడదు అని తీసి పడేసేవారు మావారు ..అప్పటి నుండిమార్కెట్ లో ఉన్న సెన్సిటివ్ టూత్ పేస్ట్ లన్ని వాడి పడేసాను ..ఫలితం శూన్యం.. ఇలాకాదని ఇంటర్నెట్ ముందేసుకుని గూగుల్ లో ఫలానా ఫలానా సమస్యకు హోమ్ రెమిడి ఉందా అనగానే ప్రేమగా ఆయుర్వేదం లో 60 రకాలా పరిష్కారాలు చూపించింది.. ఏది చూసినా ఉత్తరేణి ఆకు, గుంటగలగర ఆకు అని తెలియని పదార్ధాలన్నీ ఉన్నాయి కాని సింపుల్ గా ఉన్నవస్తువులు లేవు..సరే దొరకని వాటిని ప్రక్కన పడేసి తెలిసిన లవంగం,కర్పూరం,దాల్చిన చెక్క,సొంఠి వంటి వాటిని పొడి చేసి మరి వాడాను ..ఉహు ..అస్సలేమాత్రం తగ్గలేదు..


నాకు తెలుసు ,నాకు తెలుసు ఇప్పుడు మీ మనసులో ఏమనుకుంటున్నారో...అంత కష్టపడేపదులు ఎంచక్కా డాక్టర్ దగ్గరకు వెళ్ళచ్చుకదా అని కదా ..హమ్మా ..నన్ను అనేద్దామనే !!! ఇలాంటి ప్రశ్నలకు నా దగ్గర ప్లాష్ బ్యాక్ ల రూపంలో సమాధానాలు ఉంటాయి.. కాచుకోండి మరి..చాలా రోజుల క్రితం ఒక రోజు బ్రష్ చేసుకుంటుంటే చిగుళ్ళ నుండి నెప్పి,బ్లడ్ రావడం గమనించాను ..వెంటనే మా ఆయనకు చెప్పేద్దాం అనుకున్నా గాని నువ్వు సరిగ్గా బ్రష్ చేసుకుని ఏడ్చి ఉండవు అంటారు అని, నా కోల్గేట్ పేస్ట్ పై ఎక్సట్రా ఉప్పు జల్లి మరీ తోమాను .. సమస్య తగ్గలేదు కదా ఇంకొంచం ఎక్కువ అయ్యింది ..ఇలా లాభం లేదని ఒక రోజు రాత్రంతా మా ఆయన్ని కూర్చోపెట్టి ఈ వారం రోజులు" నేను పడిన కష్టాలు- వాటి పలితాలు "అనే శీర్షికన మొత్తం స్టోరి అంతా హృదయవికారం గా వర్ణించే సరికి తట్టుకోలేక ఆ మరుసటి రోజే డెంటిస్ట్ దగ్గరకు తీసుకువెళ్ళారు ..

వెళ్ళిన తరువాత డాక్టర్ విషయమంతా విని,ఆహ్లాదకరమైన చిరునవ్వు ఒకటి నవ్వి నర్స్ వైపు చూసాడు.. ఆ అమ్మాయి నా భుజం చుట్టూ చేతులు వేసి ,అత్తగారిని చూసి కొత్తకోడలు ఇచ్చే మర్యాదలా ఎంతో ఇదిగా లోపలికి తీసుకు వెళ్ళింది..అదేంటో చిన్నప్పటి నుండి నన్ను ఎవరైనా ఆప్యాయంగా చూస్తే చాలు, ఆస్తి లో సగభాగం రాసిచ్చేయాలన్నంత ఆవేశం వచ్చేస్తుంది నాకు. రూం చూద్దును కదా ఇంద్ర భవనంలా ఎంత బాగుందో .. పైగా ఆ ఎక్విప్మెంట్ అదీ..అబ్బో ..ఏదేమైనా విదేశాలు ,విదేశాలే అనుకున్నా గాని ఒక ప్రక్క భయం గా ఉంది ఆ పరికరాలు అవి చూస్తుంటే.. .ఏదో టేబ్లేట్స్ ఇస్తారనుకుంటే ఆపరేషన్ చేస్తున్నట్లు ఇక్కడకు తీసుకు వచ్చా రేంటి ? అని బోలెడు అనుమానాలు ..నోరు తెరవమని డాక్టరు గారు అనేసరికి భయంతో అంత ఎ.సిలోను చమటలు పట్టేసాయి ...ఆ తరువాత గుయ్..య్...య్ మని శబ్దం చేస్తూన్న పదునైన పరికరం తో పళ్ళను క్లీన్ చేయడం అంతా తెలుస్తూనే ఉంది..విచిత్రం నెప్పే లేదు ..పైగా అయిస్ ముక్క పెట్టినట్లు నోరుచల్లగా ఉంది.. క్లీనింగ్ అయిపోగానే బయటకు వస్తుంటే మా ఆయన బిల్ పే చేస్తూ కనబడ్డారు ..

బయటకు రాగానే ఏమండీ అసలు టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందో తెలుసా,లోపల బెడ్ ఉంటుందా దానికి స్విచ్ నొక్కగానే అదే పైకి ,క్రిందకు ఎడ్జస్ట్ అయిపోతుంది ..ఇంకా పదునుగా ,సూది లాంటి దానితో మన పంటిని క్లీన్ చేస్తున్నా నెప్పేరాలేదు ..పైగా నోట్లో నీరు బయటకు వెళ్ళడానికి మరొక పైపు తెలుసా ...నేను ఉత్సాహం ఆపుకోలేక జరిగింది చెప్తుంటే మా ఆయన అటు ఇటు చూస్తూ మెల్లిగా , పస్ట్ టైం డెంటిస్ట్ దగ్గరకు వెళ్ళడం ఇదేనా బుజ్జి ?అన్నారు..అవును ఏం? అన్నాను ...గట్టిగా మాట్లాడకే బాబు విన్నవాళ్ళు నిన్ను చూసి కాదు ,నన్ను చూసి నవ్వుతారు అన్నారు ... ఛీ .. మీతో అస్సలు ఏం చెప్పకూడదు అని తిట్టుకుని అయ్యో టేబ్లేట్స్ ఇవ్వలేదండి డాక్టర్ అన్నాను కంగారుగా.. ఎందుకూ ..క్లీనింగ్ చేసాడుగా ఇంక అవసరం లేదు అన్నారు. ఇంత సులువుగా ప్రాబ్లం పోయిందా ???..ఇట్స్
గాన్ ,గాయబ్,పోయి పోచ్చే అని తెగ ఆనంద పడిపోయాను.. ..

మరుసటి రోజు బ్రష్ చేసుకుంటూ ..న...హీ..!!!యే నహీ హోసక్తా!!! అనే అరుపుకి మా అపార్ట్మెంట్ దద్దరిల్లిపోయింది ..మా ఆయనకు విషయం అర్ధం అయిపోయి అటునుండి అటే ఆఫీస్ కి పారిపోయారు .. ఆ తరువాత వారం రోజులు అయినా సమస్య ఏ మాత్రం తగ్గలేదు సరి కదా పెరిగింది ..ఈ సారి మరో డాక్టర్ దగ్గరకు వెళ్ళాము ..మళ్లీ సీన్ రిపీటెడ్..డాక్టర్ చిరు మందహాసం ,నర్స్ మృదు స్వభావం ... కట్ చేస్తే 200 $ బిల్ కడుతూ మా ఆయన ... ఆ తరువాత విషయం తెలుసుకున్న మావారి ఫ్రెండ్ ..భలే వాడివే ఇక్కడి డెంటిస్ట్ దగ్గరకు తీసుకు వెళ్ళావా ..వీళ్ళకు మన ఇండియన్ డాక్టర్స్ కంటే ఎక్స్పీరియన్స్ తక్కువ ..పిడుక్కి ,బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్లు ( ఈ సామెతకర్ధం అడక్కండి ..నాకు తెలుసుకోవాలని ఏ మాత్రం ఇంటరెస్ట్ లేదు ..ఇపుడే చెబుతున్నా) ఏం చెప్పినా క్లీనింగ్ అంటారు..మీరింకా నయం 400 $ తో బయట పడ్డారు..మా ఫ్రెండ్ అయితే పన్ను నెప్పి వస్తే పన్ను పీకి చేతిలో 9000 $ బిల్ చేతిలో పెట్టారు..అని ఓదార్చాడు..

ఆ తరువాత ఈ సమస్య గురించి నాన్నకు చెప్పితే ..ఈ మద్య కాలం లో బ్రష్ మార్చావా అమ్మా అన్నారు ..అవును నాన్న అన్నాను.. ఏ మాత్రం అది హార్డ్ గా ఉండి ఉంటుంది కొత్తది మార్చు అన్నారు.. అంతే సమస్య మటుమాయం ..ప్లాష్ బ్యాక్ అయిపొయింది ...మీకు అర్ధం అయిపోయి ఉంటుంది ఇక్కడి డాక్టర్ల దగ్గరకు ఎందుకు వెళ్ళ లేదో నేను .. ఇంక చేసేది లేక ఇండియా ట్రిప్ కోసం చకోర పక్షిలా ఎదురుచూసాను .. కాని అప్పటికి నేను ఇంకా పెనం మీదనే ఉన్నాను అన్న విషయం తెలుసుకోలేకపోయాను ..ఆ విషయాలు తరువాతి పోస్ట్లో ..

19, ఫిబ్రవరి 2010, శుక్రవారం

ప్రేమ కధలు పలురకాలు - 5





అలా స్వాతిని తీసుకుని బయటకు వచ్చేసాక ,ఏమైందే అన్నాను ఆత్రుతగా.. ఇందాకేమో నేను వస్తున్నానా!, అప్పుడు గీతాంజలి గాడి ఫ్రెండ్స్ లేరూ,అదేనే ఆ నల్లోడును, పొట్టి గా ఉంటాడు వాడూను వాళ్ళిద్దరూ నా దగ్గరకొచ్చి మీ ఫ్రెండ్ పేరు ఏంటండి? అని అడిగారు అంది.. అవునా చెప్పేసావా అన్నాను కంగారుగా ... నిన్నటివరకు పేరు తెలియకుండా ప్రేమేన్టిరా దొంగ మొహం గాడా అని తిట్టుకున్నా నాకే మళ్లీ భయం ..అదేంటో?? ... ఉహు ,మీకెందుకు అని గభ గభా వచ్చేసా అంది.. ఉఫ్.. హమ్మయ్యా అనిపించింది..

కాసేపాగి నాకో డవుటు వస్తుందే అంది ఏదో ఆలోచిస్తూ ..ఇదేవర్తిరా బాబు నిమిషం ,నిమిషానికి టెన్షన్ పెడుతూ అనుకుని ఏంటి ?అన్నాను నీరసం గా .. ఆ గీతాంజలి గాడి ఫ్రెండ్స్ ఉన్నారు కదా ,వాళ్ళలో ఒకళ్ళు నీకు లైన్ వేస్తున్నారు అంది ఏదో కనుగున్నట్లు పోజు పెడుతూ.. నాకు అంత టెన్షన్ లోనూ నవ్వువచ్చింది..డవుటు కాదు కన్ఫర్మేనే ,మొన్న దీపావళికి మీ ఇంటిదగ్గర పటాసులు కాల్చేరు కదా ,ఆ ముందు రోజు మన వెనుక వాళ్ళే వచ్చారు, నీ మాటలువిని మీ ఇంటి ముందు ఆ హడావుడి చేసారు..ఎంతైనా ఫ్రెండ్ కదా అందుకే గీతాంజలి గాడు వాడికి హెల్ప్ చేసి ఉంటాడు ...మనమేమో మా అమ్మమ్మకు భయపడిపోయారేమో అనేసుకున్నాం ..అది కాకుండా నేను ఎప్పుడు గమనించినా వాడు నీ వైపే చూస్తున్నట్లు అనిపిస్తుంది ..నాకు ఆ నల్లోడి మీదే పెద్ద డవుట్ ..మనం ఎలాగైనా కనిపెట్టాలి అంది సీరియస్ గా ..

ఓరి దేవుడోయ్ దీన్ని ఇలా వదిలేస్తే లేనిపోని సమస్యలు తెచ్చేలా ఉంది అనిపించింది.. మనకేందుకే ఇవన్నీ!! ...మనమేమన్నా వస్తువులమా ! ఈ అమ్మాయిని నువ్వు ఇష్టపడు, ఈ అమ్మాయిని నేను ఇష్టపడతా అని పంచేసుకోడానికి..వాళ్ళ పద్దతి ఏమి నాకు నచ్చ లేదు.. చాలు ఇన్నాళ్ళు వాళ్లకు ఇచ్చిన అలుసు ..ఇంక మన జాగ్రత్తలో మనం ఉందాం అన్నాను.. అంటే ఏం చేద్దాం అయోమయం గా అడిగింది ...

ముందు రోజు నేను వేసుకున్న ప్లాన్ లన్ని వరుసగా చెప్పేసాను ..ముందు మనం రూట్ మార్చేద్దాం ..వాళ్లకు కనబడితేనే కదా సమస్యలన్నీ అన్నాను ..అయ్యబాబోయ్!! ఇప్పటికే చాలా దూరం ..ఇంకా అంత తిప్పి నడుస్తే అయిపోతాం అంది.. ఏం పర్లేదు ఒక అరగంట ముందు రా అన్నాను.. మరి మద్యాహ్నమో ??..తిని వెంటనే బయలుదేరుతేనే టైం సరిపోదు అంది.. అందుకే బాక్స్ తెచ్చేసుకుందాం అన్నాను ..బాక్సా !!నీకేం తల్లి నువ్వు నాన్వెజ్ తింటావ్ ..మీ అమ్మగారు ఆమ్లెట్ అనో కోడి గ్రుడ్డు పులుసనో ఏదో ఒకటి వండుతారు .. నాకు ప్రొద్దున్నే కుదరదని పప్పు ,పచ్చడి-పప్పు పచ్చడి .. అదే వండుతారు ..పోనీ నువ్వన్నా నీబాక్స్ షేర్ చేస్తావా అంటే ససేమిరా అంటావ్ నేను తినలేను బాబు అంది..


స్వాతి వాళ్ళు శాకాహారులు ..వాళ్ళింట్లో ఏం ఫంక్షన్ వచ్చినా నన్ను తప్పక పిలుస్తారు .. ఇంక అక్కడ చూడాలి తతంగం.. అరటి ఆకును భోజనం చేసేటపుడు తాక కూడాదంట.. 'అంటు'.. నేనేమో పదిసార్లు ఆ ఆకును నా ముందుకు లాక్కునేదాన్ని.. అందరూ నా వైపు చూడటమే.. అదేకాదు ముందు పప్పే వేసుకుతినాలి..తరువాత ఫలానా తినాలి .. ఇలా చాలా రూల్స్ ఉండేవి.. పైగా వాళ్ళ అమ్మమ్మగారికి నేను అంటే బోలెడంత అభిమానం.. నన్ను వాళ్ళ ఇంటి అమ్మాయిలా ఫీల్ అయ్యి ఆ పద్దతులు అన్నీ నా చేత కూడా చేయించేవారు .. ఇప్పుడు స్వాతికి నేను ఇలాంటివి అన్నీ అలవాటు చేస్తే ఇంకేమన్నా ఉందా..ముఖ్యం గా నాతో పోలుస్తూ స్వాతిదాన్ని తిట్టరు కదా.. అదీ సంగతి ..

అందుకే నీకు అంతగా తినాలంటే ఇంకేవరినన్నా అడుక్కో..నేను పెట్టను అని ఖరాఖండిగా చెప్పేసేదాన్ని ..అది ఇలా సందర్భం వచ్చినపుడల్లా దెప్పేస్తూ ఉంటుంది ..ఇదిగో నువ్వు నేను చెప్పినట్లు చేస్తే నాతో రా..లేదూ ,నువ్వు వేరుగా వెళ్ళు, నేను వేరుగా వెళ్తా ..అసలే ఎక్జాంస్ వచ్చేస్తున్నాయి ..వాడు నా వెనుకాతల పడుతున్నాడా?..వీడు ఎవరిని చూస్తున్నాడు?? లాంటి వాటి తో టైం వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు ,తర్వాత నీ ఇష్టం అని ఖచ్చితం గా చెప్పేసాను.. దానికి ఎక్జాం పేరు చెప్తే చాలు సెట్ అయిపోతుందని తెలుసు.. ఇంక తప్పక సరే అనేసింది..

అక్కడినుండి మా పని దాగుడు మూతల దండాకోర్ ..పిల్లి వచ్చే ఎలకా బద్రం అన్నట్లు అయిపొయింది.. మేము కనిపించక పోయేసరికి వాళ్ళు ఊరంతా తిరిగి వెతకడం మొదలు పెట్టారు.. మద్య మద్యలో కనిపించినా ఎందుకు వచ్చిన గొడవ అని హడావుడిగా వెళ్ళిపోయేవాళ్ళం ఒక్క ముక్క కూడా మాట్లాడుకోకుండా ..ఆ తరువాత ఎక్జాంస్ గోల లో పడిపోయి,వేసవి సెలవలు వచ్చేసరికి ఆ విషయం దాదాపుగా మర్చిపోయాము..

ఒక రోజు హుషారుగా ఒక పేపర్ మీద కవితలు (??) రాసేసుకుంటుంటే అమ్మ నన్ను పక్క రూం లోకి పిలిచింది .. ఏంటమ్మా అని గదిలోకి వెళ్ళగానే తలుపులు వేసి నీతో మాట్లాడాలి అంది.. ఎప్పుడూ లేంది ఎందుకలా అంటుందో తెలియక ఏమైంది ?? అన్నాను అయోమయం గా.. ఏంటీ , నీ వెనక ఎవరో పడుతున్నారు అంట ??నిజమేనా అంది.. ఉరుములేని పిడుగులా అలా హఠాత్తుగా అనేసరికి నోరు ఎండిపోయింది దెబ్బకు..మా అమ్మ కోపంగా అంటుందో,అనుమానంగా అంటుందో నాకు తెలియడం లేదు .. అమ్మ మొహం లోకి సూటిగా చూడాలంటే భయమేస్తుంది ... మనసులో దేవుడా ..దేవుడా.. దేవుడా అనుకుంటూ ..నా వెనుకనా !! అబ్బే లేదే ..ఎవరు చెప్పారు అన్నాను.. ఎవరు చెప్తే ఏంటి ? అంత కోళ్ల ఫారం పెట్టుకోవాలని ఇష్టమున్నదానికి చదువెందుకే.. నాన్నకు చెప్పక పోయావా అంది.. కోళ్ల ఫారం ???నేను కాలేజ్ కి ఎండలో వెళుతున్నపుడు విసుగొచ్చినపుడు తరచూ స్వాతి తో అనేమాట ... 'కోళ్ల ఫారమా '!!కోళ్ల ఫారం ఏంటి??.. నాకు భయం తో అరిచేతులు నిండా,వళ్ళంతా చెమట పట్టేసి నీళ్ళు కారిపోతున్నాయి..

మరి నువ్వు చెప్పేవని వాడు కోళ్ల ఫారం పెడుతున్నాడంట ..అనేసరికి తల గిర్రున తిరిగింది ..ఓరి వీడి నోరు పడిపోను ..బయట అందరికీ ఇలా చెప్పుతున్నాడు కాబోలు ..అయిపోయింది ...అంతా తెలుసు అమ్మకి ..అయినా ఎలా తెలిసింది ?? ఇంక జరిగింది చెప్పేయడం మంచిది అనుకుని, అమ్మా!! అసలు ఆ అబ్బాయి తో నేనసలు మాట్లాడలేదమ్మా ..వాడెవడో పేరు కూడా తెలియదు నాకు అన్నాను ..మరి ఇందాకా నా వెనుక అసలు ఎవరు పడలేదన్నావ్ అంది ..అమ్మా తల్లీ, లేడి డిటెక్టివ్ .. అసలు వాడెవడో ,ఏమిటో తెలియదు..నా వెనకపడుతున్నాడో ,స్వాతిదాని వెనుక పడుతున్నాడో అస్సలు తెలియదు.. మాతో అస్సలు ఒక్క మాట కూడా అనలేదు ఆ అబ్బాయి .. మేము మాట్లాడే మాటలన్నీ విని అలా లేని ,పోనివి ప్రచారం చేస్తున్నట్లున్నాడు..నమ్ముఅమ్మా అన్నాను దీనంగా..మరి మాకు ముందే ఎందుకు చెప్పలేదు అంది..ఏమని చెప్పమంటావ్ ?? మా వెనుక నడుస్తారు అంతే..ఎందుకని ??అడిగామనుకో ..రోడ్ మీ తాత గారిదా అంటారు అప్పుడేం చేస్తావ్ అన్నాను..

అమ్మ కాస్త మెత్తబడినట్లుగానే అనిపించింది ..హమ్మయ్యా అనుకున్నానో లేదో ..తన కళ్ళ లోనుండి నీళ్ళు జల, జలా వచ్చేస్తున్నాయి..నాకు భయం వేసింది ..అమ్మా నిజమమ్మా ..కావాలంటే స్వాతిదాన్ని అడుగు ..కాలేజ్ కి వెళుతుంటే ఇవన్ని మామూలే ..మరీ పెద్ద గొడవ అయితే చెప్దాంలే అనుకున్నా, అంతే తప్పా దాచేయాలని కాదు అన్నాను బ్రతిమాలుకుంటూ..మీకన్నీ చిన్న విషయాలలాగే ఉంటాయే.. బయటికి వెళ్ళిన పిల్లలు ఇంటికి వచ్చేవరకు మాకు గుండెలు ఎలా ఉంటాయో తెలుసా.. గట్టిగా అంటే మా మీద నమ్మకాలు లేవా అంటారు..బయటేమో రోజులు బాగుండటం లేదు.. మీ అంత చదువుకోకపోయినా మీకంటే జీవితాన్ని ఎక్కువ వడబోసిన వాళ్ళం .. ఇప్పుడుకాదు మీరు పెద్దయ్యాక ఒక ఆడపిల్ల తల్లి అవుతారు చూడు అప్పుడు తెలుస్తుంది ఆ బాధ అంది కళ్ళు తుడుచుకుంటూ..

నాకేం మాట్లాడాలనిపించలేదు..కాసేపు మౌనంగా ఉండిపోయా .. ఇదిగో మనం ఉమ్మడి కుటుంభం లో ఉన్నాం.. చిన్న మాట వచ్చిన ఫలానా వాళ్ళ కుటుంభం లో అమ్మాయి అని ఇంటి పేరు మొత్తం చెప్పి మాటలు అంటారు..మిగిలిన వాళ్ళ పిల్లలు కూడా నీకు చేల్లెళ్ళే కదా ..ఆ మాట వాళ్ళు కూడా పడాలి కదా.. అదెంత తలవంపులు చెప్పు ..తోడికోడళ్ళ దగ్గర నేను తలెత్తుకోగాలనా.. నామాట సరే ,నాన్న సంగతి తెలుసుగా ..ఒక ట్రైన్ ఎక్కినా ముప్పై మూడు భోగీలు మారుస్తారు ..మీకిదంతా చాదస్తం క్రింద అనిపిస్తుంది.. అందమంది ఆడపిల్లల తండ్రి కి ఎంత భయమో ఆలోచించరు.. మేమేం చెప్పినా విసుగ్గా అనిపిస్తుంది అంది ..

కాసేపు అలా క్లాస్ తిసుకున్నాకా సరేలే ..ఇంక వెళ్ళు అంది.. వెళ్ళబోతూ అమ్మా ,ఎలా తెలిసింది నీకు అన్నాను కొంచం భయపడుతూనే ..మళ్లీ ఏం అంటుందో అని భయం.. వాళ్ళ ఫ్రెండ్స్ లో ఒక అబ్బాయి అమ్మ కి మనం తెలుసులే..మొన్న అందరూ వాళ్ళింట్లో నీ గురించి మాట్లాడుకున్టున్నారట..ఈవిడ చాటుగా విని, ఎవరని గట్టిగా అడిగితే నీ గురించి చెప్పారంట..వాళ్ళింటి పిల్లను అల్లరి పెడతారా అని వాళ్ళను తిట్టి నాకొచ్చి చెప్పింది.. ఏమండీ 'ఇదీ సంగతి' ..రోజులు బాగుండటం లేదు ..ఫలానా వాళ్ళబ్బాయి ఇలా వెంటపడుతున్నాడంట ..జాగ్రత్త అని అంది ..ఓ ..అని బయటకు వచ్చేసాను ..

అక్కడి నుండి ఒకటే భయం ..నాన్నకు చెప్తే అందరూ కలసి వాడిని తంతారేమో అని..అసలే బక్క ప్రాణి .. నిజం చెప్పాలంటే పాపం కాస్త మంచివాడే. ఎప్పుడూ వేధించలేదు.. ఆ దిక్కుమాలిన ఫ్రెండ్స్ వెనక నుండి అలా చెయ్యి ,ఇలా చెయ్యి అని ముందుకు తోసారు తప్ప.. తనకంత ధైర్యం కూడా లేదు .. అనవసరం గా చిక్కుకు పోయాడు ..అమ్మకు చెప్పాలనిపించింది ..ఎందుకు లేమ్మా ..మరీ ఎక్కువ చేస్తే అప్పుడు చూద్దాం లే అని ..ఇంకేమన్నా ఉందా అసలు అనుకుని ఊరుకున్నా ..

ఆ తరువాత నేను ఎప్పుడు కనబడినా ఒక సారి చూసి తల వంచుకు వెళ్ళిపోయేవాడు .. ఆ గేంగ్ కుడా లేదు ..పాపం కొట్టారేమో ?? అనిపించేది.. అమ్మని అడగాలంటే భయమేసింది ...అసలు నాన్న ఈ విషయం మీద నాకు ఎక్కడ క్లాస్ తీస్తారో అని సగం భయం వేసేది కాని ,అసలు నన్ను అడగనే లేదు.. అమ్మ ఏం చెప్పిందో?.. ఆ తరువాత ఈ విషయం స్వాతికి తెలిసాక ..ఏమే .పడక పడక ఒక్కడు నా వెనుక పడితే వాడిని కొట్టిన్చేస్తావా? అంత కుళ్ళు ఏంటే బాబు నీకు అంటూ ఏడిపించేది ..

చాలానాళ్ళ తరువాత ఒక సారి అమ్మని అడిగాను ఏమైందమ్మా కొట్టారా?? అని.. లేదమ్మా ,నాన్న వెళ్లి వాళ్ళ పెద్ద వాళ్లకి విషయం చెప్పారంట ..వాళ్ళు ,నాన్న ఎదురుగానే ఆ అబ్బాయిని పిలిచి తిట్టి ,ఇంకెప్పుడు ఇలా జరగదండి అని చెప్పారంట అంది..హమ్మయ్యా అని ఉపిరి పీల్చుకున్నా ..గొడవలేకుండా సమస్య తీరిపోయినందుకు దేవుడా అని దణ్ణం పెట్టేసుకున్నా..

మొన్న ఇండియా వెళితే ఆ అబ్బాయి కనబడ్డాడు..వాళ్ళ ఆవిడతో ..ఒక చిన్న బాబు తో .. చాలా ఆప్యాయంగా వాళ్ళ ఆవిడకు ఏదో చెప్పేస్తూ నన్ను చూసి ..నేనా ,కాదా అన్నట్లు ఒక్క క్షణం చూసి గబుక్కున తల తిప్పేసుకున్నాడు.. చిన్నప్పటి విషయాలు గుర్తు వచ్చి నవ్వు వచ్చింది :)

14, ఫిబ్రవరి 2010, ఆదివారం

ప్రేమ కధలు పలురకాలు - 4



ఆ రోజంతా అలా తిరుగుతున్నానే గాని భయం భయం గా అనిపించింది..ఏవో ఆలోచనలు.. ఒక ప్రక్కనుండి దైర్యం ...'నేనేం తప్పు చేయలేదే' ..వాడు నావెనుకపడితే నాదా తప్పు ?నేనెందుకు భయపడాలి అనిపిస్తుంది..మరొక ప్రక్క ఇప్పుడే ఇంత చనువు తీసుకుంటున్నారు ,నాలుగు రోజులు ఆగితే ఇంకేం అంటారో ??ఏదో రోజున ఖచ్చితంగా నువ్వంటే నాకిష్టం అని డైరెక్ట్ గా చెప్పేస్తాడు ఏమో అని భయం..అప్పటి సంగతి కదా ,అంతవరకూ వస్తే నువ్వంటే నాకిష్టం లేదు అని చెప్పేద్దాం అని కాసేపు అనిపిస్తే , ఇన్నాళ్ళూ ఇహి హి.. హ హహ అని నవ్వుతూ వాడెదురుగా తిరిగి ,ఆనక తీరిగ్గా నువ్వంటే నాకిష్టం లేదు అని చెప్పితే, వాడు ఊరుకుంటాడా??వెనుకపడటం మానేస్తాడా ?? అని ఇంకాసేపు అనిపించేది..


చాలా మంది అమ్మాయిలు ఇదే పని చేస్తారు , వాళ్లకు ఇష్టం లేకపోయినా 'ఎవరో ఒక అబ్బాయి తన చుట్టూ తిరుగుతుంటే గర్వంగా ఎంజాయ్ చేసి 'చివరకు అబ్బే ,నాకలాంటి అభిప్రాయం లేదనో, ఇంకొందరు మరి కొంచం ఎక్కువ చేసి నేను నిన్ను అన్నయ్యలా భావిస్తున్నాననో అని చప్పున తీసి పడేసి పాపం వాళ్ళ మనసులు ఎంత గాయం చేస్తారో ఊహించరు.." ముందే నువ్వంటే నాకిష్టం లేదన్న భావన వాళ్ళలో కలిగించరు" అదే పలు సమస్యలకు కారణం అవుతుంది ..(కొంతమంది అబ్బాయిలు ఒక వేళ అలా చేసినా పట్టించుకోరు,అది మరో సమస్య అనుకోండి ) బహుసా ,అలాంటి గిల్టీ ఫీలింగ్ అనుకుంటా స్థిమితంగా ఉండనివ్వడం లేదు నన్ను ..

సరే ,ఎలాగోలా దీనిలో నుండి బయట పడాలి.. ఎవరన్నా హెల్ప్ చేస్తే బాగుండును,ఏదన్నా సలహా ఇస్తే బాగుండును అనిపించింది..ఎవరికి చెప్పాలి ??? స్వాతికి చెప్పితే? అమ్మో !!దానికా ...కొంచెం కూడా ఆలోచించదు.. సలహా కాదు కదా ,ఇన్నాళ్ళు నేను దానికి చేసినదానికి అంతకంతకు బదులు తీర్చుకుంటుంది.. నన్నేదో ఏడిపిస్తున్నాను అనుకుని పూర్తిగా ముంచేస్తుంది.. ఇప్పటి వరకు వాడికి కనీసం డవుటుండి ఉంటుంది నా కిష్టమా ?లేదా? అని ,ఇది కన్ఫర్మ్ చేసేస్తుంది ఇష్టం అని .. ఇంకేమన్నా ఉందా ...వద్దు,వద్దు ... ఇంకెవరున్నారు?? పోనీ అక్కకు చెప్తే ?? ...

అవును ,అక్క అయితే చిటికలో సమస్య తీర్చేస్తుంది అనిపించింది కాని ,అది నాన్నపార్టి..నాన్నకు చెప్పేస్తుంది ఏమో ??.. చిన్నపుడు ఎవరో దానికి లెటర్ ఇస్తే చదవడానికి అర్ధం కాక ,నాన్నకు ఇచ్చి చదవమని చెప్పిన ఘనురాలది ..దానికి బోలెడు ధైర్యం ..నాన్న అంటే అస్సలు భయం లేదు ..నాన్నా అంతే, అది ఏమన్నా ఏమనరు.. అది చేసినతప్పు మేము చేస్తే మాత్రం అక్షింతలే మాకు..ఒక సారి ఎక్కడికో వెళుతుంటే ఎవరో అబ్బాయి దాన్ని చూసి ఏదో అన్నాడట ...ఇదేమో నాన్నా వాడు చూసారా ఇలా అన్నాడు అని టక్కున పిలిచి చెప్పింది..అసలే నాన్నకు హిట్లర్ అని పేరు చిరంజీవిలా .. సైకిల్ మీద పారిపోబోతున్న వాడి చొక్కా పట్టుకుని కిందకు లాగి గూబ గుయ్యిమనిపించారు ...

సరే ఇదేదో బాగుంది కదా అని ,నేనూ ఒక మారు నాన్నతో వస్తూ ఎవరో ఏదో అంటే ( అలాంటి సందర్భం గురించి చాలానాళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చిందిలెండి..పక్కన పెద్ద వాళ్ళు ఉండగా ఎవరు ఏమనరు కదా ) నాన్నా !చూడండి వాడేదో అంటున్నాడు అనగానే ,నిన్నెవరే దిక్కులు చూడమన్నాడు ,కాళ్ళు విరక్కోడతా .. సరిగ్గా కూర్చో ..అని ఒక్క కసురు కసిరారు ..అంతే, పొరపాటున కూడా మళ్లీ అక్కను అనుకరించే సాహసం చేయలేదు.:(

'చక్కగా ఉన్న మొహానికి ఎందుకే అడ్డమైన చెత్తా రాస్తావు 'అమ్మ తిడుతూనే ఉంది అక్క పట్టించుకోకుండా ఒక గిన్నెలో పసుపు,శనగ పిండి ,రోజ్ వాటర్ ,తేనే ఏంటో ఏంటో మిక్స్ చేస్తూ గదిలోకి వచ్చింది ..ఇది ఒకర్తి ,మా అందరికన్నా తెల్లగా ఉన్నా ఇంకేంటో చేసేస్తూ ఉంటుంది ఆ మొహానికి తిట్టుకుంటుంటే సడెన్ గా లైట్ వెలిగింది.. ఇది బాగుంటుంది,తెల్లగా ఉంటుంది,బాగా చదువుతుంది ,అన్నిటికంటే ముఖ్యం గా కో ఎడ్యుకేషన్ లో చదివింది ..ఖచ్చితంగా దీనికి ఇలాంటి సమస్యలు ఎదురయ్యే ఉంటాయి ..అలా అనుకోగానే మెల్లగా దాని దగ్గరకొచ్చి అక్కా! మరి మీ కాలేజ్ లో ఎవరూ నిన్నేమనేవారు కాదా అన్నాను.. ఎందుకనే వారు కాదు ,మా సార్లకి ,మేడంస్ కి నేనంటే ఎంత ఇష్టమో తెలుసా, నా రికార్డ్స్ అందరికంటే నీట్ గా ఉండేవి ,మేత్స్ సార్ అయితే మరీ అభిమానించేవారు ..ఇది డబ్బా మొదలుపెట్టేసింది..

ఎహే!! ..అది కాదు 'అబ్బాయిలు ఎవరూ నీ వెనుక పడేవారు కాదా' అన్నాను.. అది మొహానికి ఆ పేస్ట్ పూసుకుంటూ ..అదా ,మా క్లాస్ లో వాళ్లకి అంత ధైర్యం లేదులే, మాది డిగ్రి కాలేజ్ కాదు కదా ,ఇంటర్ అబ్బాయిలకు మా సార్లంటే మహా భయం ..ప్రాక్టికల్స్ లో మార్కులు కత్తిరించేస్తారని ..పైగా సైన్స్ అబ్బాయిలు చాలా మంచోళ్ళే.. అలాంటి వెధవ వేషాలు వెయ్యరు ...ఆ ఆర్ట్స్అబ్బాయిలు ఉంటారు కదా ,వెధవలకి పని పాటా ఉండదు ,వచ్చే పోయే అమ్మాయిలని కామెంట్ చెయ్యడం తప్పా విసుక్కుంటూ అంది..

ఇది ఒకర్తి ..ఆర్ట్స్ అంటేనే పడదు..ఆ స్వాతిది కూడా అంతే ..వీళ్ళ దృష్టిలో ఆర్ట్స్ తీసుకున్న వాళ్ళంతా చదువు ,సంధ్య లేని వాళ్ళు..ఒత్తి పోకిరి వాళ్ళు ..ఇద్దరినీ ఒక చోట కూర్చో పెడితే చాలు సైన్స్ గ్రూప్ ని పొగిడేసుకుంటూ ,ఆర్ట్స్ గ్రూప్ ని తిట్టుకుంటూ గంటలు గంటలు గడిపేస్తారు .. అందుకేనేమో ఇద్దరికీ ఇంటర్ అయిపోగానే పెళ్ళిళ్ళు అయిపోయి ,చివరకు ఆ ఆర్ట్స్ నే గతి అయ్యి డిగ్రీలు గట్టెక్కించారు.. అందుకే ఊరికే ఎవరినీ అనకూడదన్నమాట . .

సరే మామూలు రోజుల్లో ఈ విషయం మీద గొడవేసుకునేదాన్ని కాని ,ప్రస్తుతానికి అవసరం నాది కదా .. అందుకే ,అదేలేక్కా ..ఆ ఆర్ట్స్ వాళ్ళే నీ వెనుకాలా పడలేదా ??ఆరాగా అడిగాను..ఏంటీ !!! ,ఆ పోకిరిగాళ్ళు ,ఆ చదువు సంధ్య లేనోళ్ళు నా వెనుక పడటమా!!! ఎంత ధైర్యం ?? .. మా సైన్స్ అమ్మాయిలను చూడటానికే భయపడేవారు తెలుసా అంది .. ఒసినీ సైన్స్ తగలబడ అని మనసులో అనుకుని .. "ఒకవేళ పడితే ??" ..మళ్లీ,మళ్లీ అదే ప్రశ్న ఓపిగ్గా అడిగాను .. " నాన్నకు చెప్పి చితక్కోట్టిన్చేసేదాన్ని "ఇంక మాట్లాడించకు..అని కళ్ళ మీద రెండు దోసకాయ ముక్కలు గుండ్రం గా కట్ చేసినవి పెట్టేసుకుని పడుకుంది ..ఇంకేం మాట్లాడిస్తాను నా మొహం అనుకుని బయటకు వచ్చేసా...

మెట్ల మీద కూర్చున్నా గాని ఏం చెయ్యాలో అర్ధం కాలేదు.. అసలే గీతాంజలి గాడు చదవడం లేదు..దీనికి చదువు ,సంధ్య లేని వాడు అని తెలిస్తే బిపి పెరిగిపోతుంది.. నాన్నకు చెప్పేస్తుంది ..వెంటనే నాకు గీతాంజలి గాడు కళ్ళ ముందు కనబడ్డాడు దీనంగా ..'గట్టిగా తూస్తే పాపం కిలో మాంసం కూడా రాదు వాడికి '.. వాడి సంగతి సరే ,నా విషయం ఏంటి?? .. పోనీ ఇంట్లో చెప్పకుండా వదిలేస్తే ,ఖచ్చితంగా ఏదో రోజున తెలుస్తుంది..అప్పుడన్నా వాడిని తంతారు ..ముందే ఎందుకు చెప్పలేదు? అంటారు ,చదువు లేదు ఏమి లేదు నోరు మూసుకుని ఇంట్లో కూర్చో అని అన్నా అంటారు ..అది కూడా ఒక తంటా ..ఇదంతా ఎందుకు నాన్నకు నేనే మెల్లిగా చెప్పేదాం అనుకున్నా..


నాన్న సంగతి నాకు బాగా తెలుసు ..లాయర్ లా సవాలక్ష ప్రశ్నలు వేస్తారు .. కనీసం వాడు నాతో ఒక్క మాట అన్నాఅనలేదు.. వాడు నన్ను ఏడిపిస్తున్నాడని ఎలా చెప్పేది???..అసలే అందరం అమ్మాయిలం అవ్వడం వల్లో,లేదా తల్లిదండ్రులకు పిల్లల మీద ఉన్న సహజ భయం వల్లో పది సార్లు చెప్తారు జాగ్రత్తలు మాకు .. అలా ఆలోచిస్తుంటే టక్కున దీపావళి రోజున అందరు పడుకుంటే ,నేనే పెద్ద పని ఉన్నట్లు బయటకు వచ్చి చూడటం గుర్తు వచ్చింది .. ఆ రోజు నాన్న లోపలకు రమ్మని కసిరారు అందరి ఎదురుగా ..దెబ్బకు గిర్రున తిరిగింది తల నాకు .. అయిపోయింది..వాడి కోసమే వచ్చాను అనుకుంటారు .. ఈ ఒక్క విషయం చాలు ..నా మీద అనుమానం రావడానికి ... వాడు నా వెనుక పడుతున్నాడన్నా విషయం ఇంట్లో వాళ్ళందరికీ తెలిస్తే ప్రతి ఒక్కరు నన్నే గమనించడం మొదలు పెడతారు..మా ఇంట్లో తుమ్మినా,దగ్గినా అందరికి తెలియాల్సిందే .. ఒక్క కుటుంభంతో ముడిపడిలేదు మా ఇల్లు ..నాలుగు రకాల మాటలు వచ్చేస్తాయి ..నాన్నకు మాట వస్తే ఇంకేమన్నా ఉందా?? ..తట్టుకోలేరు ..ఎలా?

ఎందుకో ఏడుపొచ్చేసింది..దేవుడా దేవుడా ఏం గొడవలు లేకుండా ఈ సమస్య గట్టేక్కెల చెయ్యవా అని దణ్ణం పెట్టేసుకున్నా ..గీతాంజలి గాడిమీద చాలా కోపం వచ్చేసింది.. అంతా వాడి వల్లే ..వాడిని బాగా తన్నాలి అప్పుడు గాని బుద్ది రాదు ..తిట్టుకుని ,తిట్టుకుని పడుకున్నా .. రాత్రంతా నిద్ర పట్టలేదు ..ప్రొద్దున అసలు కాలేజ్ కి వెళ్ళాలనిపించలేదు ..ఏం కారణం చెప్పి మానేయాలో తెలియలేదు..ఈ స్వాతిది టంచనుగా టైముకి వచ్చేస్తుంది ..ఒక్క రోజుకూడా మానదు..ముభావం గా ఉండి తయారవుతున్నాను ... మరి ఎప్పటి నుండి గమనిస్తున్నారో నాన్న..ఇలారా అని పిలిచారు..ఏంటి నాన్నా అన్నాను ..ఏంటమ్మా మొహం అలా ఉంది.. నీరసం గా ఉందా అన్నారు దగ్గరకు పిలిచి..ఆ మాత్రం ప్రేమకే కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసాయి.. చలేస్తుంది నాన్న .జ్వరం వచ్చిందేమో అన్నాను.. నుదిటి మీద చెయ్యి వేసి ఏమి లేదమ్మా, ఉండు ధర్మామీటర్ తెస్తా అన్నారు ..

ఏంటి జ్వరానికే ఏడ్చేస్తున్నావా ??ఇంత పిరికోళ్ళేటే బాబు ..రేపు అత్తారిళ్ళదగ్గర ఇలాగే చేస్తే మిమ్మల్ని కాదు మమ్మల్ని అంటారు ..అమ్మతిడుతుంది..నువ్వు ఇంక ఆగు ,పాపం దానికెంత బాధగా ఉందో ఏడుస్తుంది ..అది ఆలోచించవే ..నాన్న కసిరి నా నోటికి ధర్మా మీటర్ అందించారు.. ఇలాగే వెనకేసుకుని రండి ..ఇది మరీ తట్టుకోలేదు ఏ చిన్నవిషయాన్ని..అమ్మ తిడుతూ వెళ్ళిపోయింది .. హమ్మయ్యా ,అనిపించింది ..అసలే నిన్న ఎండలో బయటకు వెళ్ళకు అని ఎన్ని సార్లు చెప్పినా వినకుండా సార్ ఇంటికి వెళ్ళా ..ఆ విషయం ఎక్కడ అనేసి అందుకే జ్వరం వచ్చింది అంటుందేమో అని భయమేసింది..

ఏమి లేదమ్మా,నార్మల్ ఉంది ..పోనీ ఒక పని చేద్దాం ..ఈ రోజుకి కాలేజ్ మానేసేయ్ ..నేను స్నానం చేసి వచ్చాక మళ్లీ చెక్ చేద్దాం .. జ్వరం ఉంటే హాస్పిటల్ కి తీసుకు వెళతా సరేనా అంటూ నాన్నవెళ్ళిపోయారు..ఎందుకో టెన్షన్ తగ్గినట్లు అనిపించింది .."అనవసరం గా భయపడుతున్నానేమో " అనుకున్నాను.. ఈ లోపల స్వాతి వచ్చింది..నా నోట్లో ధర్మా మీటర్ ,ఇతర తతంగాలు చూసాకా ..ఏంటి జ్వరమా? అంది ..ఉహు ..అలా అనిపిస్తుంది అన్నాను.. అయితే రావా కాలేజ్ కి అంది.. రాను అన్నాను.. నీతో ఒక విషయం చెప్పాలి అంది గుసగుసగా .. నాకు తగ్గుతున్న టెన్షన్ మళ్ళ పెరిగిపోయింది.. గీతాంజలి గాడి గురించా?? అన్నాను భయం గా .. ఆ .. నీకెలా తెలుసు అంది ఆక్చర్యం గా .. కొంపదీసి దీనికి విషయం తెలిసిపోయిందా ??.. ఏం జరుగుంటుంది ?? అమ్మా ,నేను కాలేజ్ కి వెళతాను జ్వరం తగ్గిపోయింది అని అమ్మ వద్దన్నా ఇంపార్టెంట్ క్లాస్ ఉందని చెప్పి స్వాతిని తీసుకుని బయటకు వచ్చేసాను ..