19, జులై 2010, సోమవారం

ఇంకొన్ని ముచ్చట్లు -2

క్రికెట్కి వెళ్ళివచ్చిన తరువాత రోజున ఎప్పటిలాగే ఇద్దరం సరదాగా కాయగూరలు కొనడానికి మార్కెట్కి వెళుతుంటే మా ఆయన హఠాత్తుగా బుజ్జీ! నువ్వెంత అందంగా ఉంటావో తెలుసా ..అసలు తాంబూళాల్లో అయితే సూపరు..ఆ రోజు నువ్వు కట్టుకున్న గ్రీన్ చీరలో అదిరిపోయావు ..రోజూ ఆ ఫొటోసే ముందేసుకుని కూర్చునేవాడిని ..దిష్ఠి తగులుతుందని మా అమ్మ తిట్టేది.. అనేసరికి నా కాళ్ళు అలా నేలకు రెండు ఇంచుల పైకి తేలడం మొదలు పెట్టాయి.. పెళ్ళయి అన్ని నెలల తరువాత భార్య అందాన్ని భర్త సమయమూ, సంధర్భం లేకుండా పొగుడుతున్నాడంటే దానివెనుక అనేకానేక కుట్రలు,కుతంత్రాలు ఉంటాయన్న కఠోర సత్యం అప్పటికి నాకింకా తెలియదన్నమాట..

ఆ పళం గా ముద్దొచ్చినపుడే అన్నీ అడిగేయాలని మొదలు పెట్టేసాను..మరి ఆ రోజు కట్టుకున్న ఎర్రంచు పట్టు చీరలో ఎలా ఉన్నాను?? ఆ తరువాత కట్టుకున్న వంగపండు కలర్ చీర నాకు నప్పిందా??... పెళ్ళికి ముందు నేను మీ కాలేజ్ లోనే చదివుంటే మీరు నన్ను ప్రేమించేవారా? ఒకవేళ ప్రేమిస్తే నేను ఒప్పుకోక పోతే ఏమి చేసేవాళ్ళు ??లాంటి ప్రశ్నలన్నీ చక చక అడిగి ,టక టకా నాకు కావలసిన సమాధానాలను రాబట్టేసుకుని తెగ మురిసిపోయాను ..( మరి మామూలు రోజుల్లో గనుక అలాంటి ప్రశ్నలు అడిగితే మరి ఇంతమంచి నిజాలు బయటకు చెప్తారేంటి :D )

అప్పుడు మాశ్రీవారు మెల్లిగా వల విసిరారు..బుజ్జీ ,మొన్న వెళ్ళిన క్రికెట్ మేచ్ భలే ఉందికదా!.. భలే ఎంజాయ్ చేసామే !అంటూ.. సరిగ్గా ఆయన ఊహించినట్లుగానే ..పాపం ఇంత పొగిడారు కదా మనం కూడా నాలుగు పొగిడేస్తే ఓ పని అయిపోతుంది అని .. అవునండీ చా..లా ఎంజాయ్ చేసాం.. అసలు ఎంతమందికి వస్తుంది చెప్పండి అటువంటి అవకాశం ..పైకి వద్దు ,వద్దు అన్నా గాని ఎంత మంది అతిరధమాహరధులను చూడగలిగాను.. మీరెంత మంచివారండి అంటూ దొరికిపోయాను ..అందుకే బుజ్జీ మళ్ళీ ఎంజాయ్ చేద్దామని' ఫైనల్ మేచ్ 'కి కూడా టికెట్స్ తీసుకున్నాను ..రేపు రెడీ అయిపో అన్నారు సింపుల్ గా .. ఆ..అంటూ నిలువు గ్రుడ్లేసుకుని అమ్మా!!,నేను రాను ..నా వల్ల కాదు అని మొదలు పెట్టాను..కానీ అప్పటికే నోరుజారడంవల్ల ఇక తప్పలేదు..

ఆ మరుసటి రోజు మళ్ళీ ప్రొద్దున్నే లేచి తిండీ,నీళ్ళు గట్రా మూట గట్టుకుని గ్రౌండ్ కి బయలుదేరాం...దారిలో ఎప్పటిలాగే పెద్ద క్యూ..చాలామంది సార్ ప్లీజ్ ఎక్స్ ట్రా టిక్కెట్స్ ఉంటే ఇవ్వండి అని బ్రతిమాలుతున్నారు.. నేను ఎప్పటిలాగే ఫోజు కొట్టుకుంటూ లోపలికి వెళ్ళాను..మళ్లీ ఒక చోట ప్లేస్ చూసుకుని ఇలా కూర్చున్నామో లేదో ఆట మొదలైంది ...వెస్ట్ ఇండీస్ బౌలింగ్ అనుకుంటా.. ఒక్కొక్కరూ తాడిచెట్లలా ఇంత పొడవున్నారు..వాడు ఆడమ్స్ ,వీడు వాల్ష్ ఏవేవో పేర్లు చెబుతున్నారు మా ఆయన.. అందరికీ ఇంచుమించుగా గుండే ..ఒక్కళ్ళకూ పెద్ద జుట్టులేదు.. ఒకవేళ ఉన్నా దువ్వెన ఎలా దిగుతుంది ఆ రింగుల జుట్టులో అనుకుంటూ చూస్తున్నా..

ఈలోపల ఆకాశం మేఘావృతం అయిపోవడం మొదలైంది.. ఏమండీ గొడుగు కూడా తెచ్చుకోలేదు అన్నాను భయం గా ఆకాశం చూస్తూ.. నేను ఎంత నెగిటివ్ గా ఆలోచిస్తానో మా ఆయన అంత పాజిటివ్ గా ఆలోచిస్తారు..అబ్బే ఏమీ కాదు అవి దొంగ మబ్బులు.. గాలి ఎలా వీస్తుందో చూసావ్ కదా ..తేలిపోతాయి.. అలా అన్నారో లేదో 'టప్' మని ఒక చినుకు నాపై పడింది ..నేను మా ఆయన వైపు చూసాను ..అది 'చిరుజల్లు ' అన్నారు .. అంతే దభ,ధభా మని వర్షం మొదలైపోయింది.. అందరూ పరుగులు పెడుతున్నారు ... అప్పటికప్పుడు ఆట కోసం వేసిన షల్టర్లు ఏ మాత్రం రక్షణ ఇవ్వడంలేదు..అయినా జనాలు వాటి క్రిందే నించుంటున్నారు దారిలేక.. అక్కడ ప్లేస్ లేక నా చున్నీయే గొడుగులా కప్పుకుని అక్కినేని,బి.సరోజల్లా చెట్టా పట్టగ చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెట్టాం ..

ఎంత గుబురు చెట్టయితే ఏం లాభం ..వర్షం వర్షమేగా.. ఫుల్ గా.. ముద్ద ముద్దగా తడిచిపోయాం.. నా క్రొత్త డ్రెస్ బురద బురద అయిపోయింది ... అదొక్కటేనా ప్రొద్దున్నే పావుకేజీ 'కొబ్బరి నూని 'తలకు పట్టించి మరీ వచ్చానేమో నాకు పండగే పండగ ...చిరాకొచ్చేస్తుంది..ఇదంతా అవసరమా!!..వద్దు ,వద్దన్నా వినిపించుకోరుకదా కోపంగా అరిచాను ... నీకసలు టేస్ట్ తెలియదు బుజ్జి ..ఎంచక్కా పైన వర్షం ,ప్రక్కన నేను ఉన్నా..ఎంత రొమాంటిక్ గా ఆలోచించచ్చు .. మా ఆయన ఏడిపిస్తుంటే తిట్టుకుంటూ నించున్నా కాసేపటికి వర్షం ఆగింది ..ఇంక నావల్ల కాదు ఇంటికి వెళిపోదాం అన్నాను.. నోరుముయ్యి ఓవర్లు కుదిస్తారు.. చూసి వెళదాం అన్నారు ..

ఆయన అన్నట్లే ఓవర్లు తగ్గించారు..అందరూ తడిచిన బట్టలు పిండుకుని,బెంచ్ లు తుడుచుకుని కూర్చుంటున్నారు..ఆ తరువాత వాళ్ళేం ఆడుతున్నారో నేనేం చూస్తున్నానో నాకేం అర్ధం కాలేదు ...ఆ చల్లగాలికి వణుకొచ్చేస్తుంది జ్వరం వచ్చినట్లు.. కాసేపు జరగలేదు ఆట.. మళ్ళీ భోరున వర్షం..ఛీ ఆ వచ్చే వానేదో ఫుల్ గా ఒకేసారి వచ్చి ఏడచ్చుగా ఇలా సగం, సగం వచ్చి ఎటు కాకుండా చేస్తుంది ..శుబ్బరంగా మేచ్ డ్రా అయిపోయేది..పీడా పోయేది అని వందసార్లు తిట్టుకుని ఉంటాను..చివరకు మేచ్ రేపటికి 'పోస్ట్ పోన్' అయింది "అందరూ ఇంటికి వెళ్ళిపోయి రేప్పొద్దిన్నే వచ్చేయండహో" అని ఎనౌన్స్ చేసేసరికి మా ఆయన,నేను ఇద్దరం గతుక్కుమన్నాం..

ఆ రాత్రి పడుకుంటున్నపుడు మొదలయ్యాయి తిట్లు నాకు.. అంతా "నీవల్లే" ..వచ్చినప్పటి నుండి మేచ్ ఆగిపోవాలి ,ఆగిపోవాలి అని గొడవ గొడవ చేసావ్ కదా ..అలాగే జరిగింది ..ఇప్పుడు సంతోషమే కదా అని ఉడికిపోతూ 'గయ్' మన్నారు.. ఇది మరీ బాగుంది ..నేను ఆగిపోవాలి అంటే ఆగిపోతుందా అన్నాను ఆవలిస్తూ.. ఎందకు ఆగదు ..కొంతమంది నోటి పవరు అంతే.. మళ్ళీ రేపు అంటే ఎలా వెళతాను అక్కడికి..మా బాస్ ని ఈ సారి లీవ్ అడిగితే డైరెక్ట్ గా ఇంటికి పంపేస్తాడు..తిరిగే లేదు ..డబ్బులన్నీ వేస్టు అన్నారు దిగాలుగా ... పాపం జాలేసింది నాకు ..

పోని మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా అమ్మేయండి ..ఒక ఉచిత సలహా పడేసాను.. ఉహు నాకు మన ఇండియన్స్ అంత క్లోజ్ గా తెలియదు.. మా ఆఫీస్ లో అందరూ చైనీస్ యే..వాళ్ళూ చూడరు ..అదీ వీక్ డేస్ లో అస్సలు వెళ్ళరు అన్నారు నిట్టూరుస్తూ.. పోనీ మీకు ఎవరు టిక్కెట్టు అమ్మారో వాళ్ళకే తిరిగి ఇచ్చేయండి 'వద్దు' అని అన్నాను ..చెత్త సలహాలు ఇచ్చావంటే తంతాను అన్నారు విసుగ్గా.. అయితే ఏం చేద్దామంటారు ??అన్నాను కళ్ళుమూసుకుని.. పోని ఒక పనిచేస్తే?? అన్నారు ఉత్సాహంగా .. నేను నిద్రలోకి జారుకుంటూ' ఊ ' అన్నాను.. రేపు ప్రొద్దున్న మన ఇద్దరం అక్కడికి వెళదాం ..నువ్వు మేచ్ చూస్తూ ఉండూ.. మా ఆఫీస్ ప్రక్కనే కాబట్టి నేను ఆఫీస్ కి వెళ్ళీ, మళ్ళీ కరెక్ట్ గా మధ్యాహ్నం లంచ్ టైముకు నీదగ్గర కి వచ్చేస్తా..అన్నం తినేసాక మళ్ళీ వెళ్ళీ ,మళ్ళా సాయంత్రం ఒక గంట ముందే పర్మిషన్ తీసుకుని వచ్చేస్తా ..అప్పుడు ఇద్దరం కాసేపు మేచ్ చూసి ఇంటికి వెళ్ళిపోదాం సరేనా అన్నారు..

అంతే నా నిద్రమత్తు టక్కున మంత్రం వేసినట్లు మాయమై పోయి ఉలిక్కిపడి.. ఏంటీ !!మళ్ళీ రావాలా ?..అదీ ఒక్కదాన్నే చూడాలా?.. నావల్ల కాదు ..టిక్కట్స్ మిగిలితే చింపి చెత్త బుట్ట లో వేసుకోండి ..నాకు కుదరదు అన్నాను.. అది కాదు బుజ్జీ ..పోనీ ఒక పనిచేద్దాం, అక్కడకు వెళ్ళాక ఎవరన్నా కొనుక్కుంటే వాళ్ళకు అమ్మేసి ఇంటికి పంపించేస్తాను నిన్ను అన్నారు బ్రతిమాలుతూ.."పైకి నా నోరు కనబడుతుంది కాని చివరకు అన్నీ మావారు చెప్పినట్లే జరుగుతాయి ..అయినా సరే ఎందుకు వాదిస్తానో నాకు ఇప్పటికీ అర్ధం అయ్యి ఏడవదు. ."

ఆ ప్రొద్దున్న నాకు అస్సలుబాలేదు..బాగా చిరాగ్గా,విసుగ్గా ఉండటం వల్ల ఏమండీ ఈ టైంలో నావల్ల కాదు మీరు వెళ్ళండి అని బ్రతిమాలినా లాక్కువెళ్ళిపోయారు ..చేసేదిలేక మళ్ళీ సరంజామాతో బయలుదేరాను కనీసం ఎవరన్నా టిక్కెట్టు కొనకపోతారా అన్న ఆశతో ..మేము వెళ్ళే సరికి బయట బోలెడుమంది ఉన్నారు ..హమ్మయ్యా అనుకుని దగ్గరకు వెళ్ళాం..మేము ఇంకా ఏమీ అనకముందే "సార్ టిక్కెట్స్ కావాలా?" అన్నాడు ఆ అబ్బాయి.. మేము మొహమొహాలు చూసుకున్నాం.. సగం రేట్ కి ఇచ్చేస్తా తీసుకోండి అన్నాడు అతను.. ప్రక్కన చూస్తే అందరూ సార్ సార్ టిక్కెట్స్ కావాలా ??అని బ్రతిమాలుతూ అడుగుతున్నారు .. అందరూ ఆఫీస్ కి వెళ్ళడానికి రెడీ అయి ఉన్నారు.. నేను బిక్క మొహం వేసుకుని మా ఆయన వైపు చూసాను.. నువ్వెళ్ళి కూర్చో నేను లంచ్ కొచ్చేస్తానే అని మాహా ఆనందంగా వెళ్ళారు మా ఆయన..

మళ్ళీ ఆట మొదలైంది ..నాకేం తోచడం లేదు..కాసేపు ఆట చూసాను ఉహు ఏమి ఆడుతున్నారో ఏమి అర్ధం కావట్లేదు ..సరే అని ఇంకాసేపు ఫొటోస్ తీశాను.. చూపమని అడక్కండీ ..మనమసలే ఫొటోస్ తీయడంలో క్వీనులం కదా ..అంచేత సాగరసంగమం సినిమాలో కమలహాసన్ కు 'భంగిమా' అంటూ ఫొటోస్ తీసే కుర్రాడిలా మా గొప్పగా తీశాను.. మరి కాసేపు ఫోర్ లైన్ దగ్గర తచ్చాడాను.. ఆ తరువాత పెన్ తీసుకుని నా అర చేతి లో ముగ్గులు పెట్టుకున్నాను.. ఇంక ఆ తరువాత ఏం చేయాలో అర్ధం కాలేదు ..గోళ్ళు కొరుక్కుంటూ కూర్చున్నాను..ఎండమండిపోతుంది ..ఎలాగో ఒకలా లంచ్ టైం వరకూ గడిపేసాను ..సరిగ్గా లంచ్ టైముకు మావారు వచ్చారు ..హమ్మయ్యా ప్రాణం లేచోచ్చినట్లు అనిపించింది.. ఆ తరువాత గంట టైము ఎలా గడించిందో తెలియదు.. మళ్లీ వస్తానే అని మావారు బేగ్ పట్టుకుని వెళ్ళిపోయారు .. మళ్లీ ఒంటరిగా కూర్చున్నా ..

అప్పుడు మొదలైంది 'పడమటికి' దిగుతున్న సూర్యుని ఎండ మొహానికి కొడుతూ ..అసలే చిరాకు,విసుగు దానిమీద చిర చిర లాడుతూ వేడి.. అన్నటికంటే ఎక్కువగా దాహం వేసి బాగా వాటర్ తాగానేమో నాకు నరకం కనబడిపోతుంది..ఎక్కడన్నా 'రెస్ట్ రూములు' ఉన్నాయేమో అని చూసాను.. ఉహు కనబడలేదు .. ఎండ వేడికి కళ్ళు తిరుగుతుంటే కాస్త నీడ పట్టుకువెళ్లి కూర్చున్నా .. జింబాబ్వే మేచ్ కంటే ఫైనల్ మేచ్ కే జనాలు తక్కువగా ఉన్నారు..నిన్నటి వర్షం దెబ్బ అనుకుంటా..వెస్ట్ ఇండీస్ వాళ్ళు వీర ఉతుకుడు ఉతుకుతున్నారు మన ప్లేయర్లను ..అందరూ "అయ్యో"," ఓ" ..అంటూ మూలుగుతూ తెగ బాధ పడిపోతున్నారు..నా గోల నాది ..

చాలా విసుగ్గా అనిపించింది..దేవుడా ఏమిటి నాకీ పరీక్షా అనుకుంటుంటే ...." ఒరే రాత్రి తాగింది దిగలేదా ఏంట్రా ..అలా ఆడుతున్నారు" అంటూ మన తెలుగు మాటలు వినిపించాయి ... హమ్మయ్యా అనిపించింది..కాస్త మాటల్లో పడితే టైము తెలియదు కదా అని ఆనందం గా ప్రక్కకు చూసాను .. పాతికేళ్ళ లోపు అబ్బాయిలు ఒక అయిదుగురు నా ప్రక్కన కూర్చున్నారు..ఇందాక నేను గమనించలేదు కాని నా ప్రక్కన ఉన్న అబ్బాయి చేతిలో ఈనాడు పేపర్ ఉంది ..హుం నీరసం వచ్చింది ..అందరూ అబ్బాయిలే ..ఏం మాట్లాడుతాం అని నిట్టూర్చి వాళ్ళ మాటలు వింటున్నా.. అబ్బాయిల సంగతి తెలియనిదేముంది..ఎంచక్కా బోలెడు తిట్లు చెవుల త్రుప్పువదిలేటట్లు తిడుతున్నారు మన ఆటగాళ్లను.. ఒక్కోసారి నవ్వొస్తుంది..ఒక్కోసారి అబ్బా ఏంట్రా బాబు వీళ్ళు అనిపిస్తుంది..

నా ప్రక్కనున్న అబ్బాయికి ఎందుకు అనుమానం వచ్చిందో ..అరే..ఆగండిరా ..అమ్మాయుంది అన్నాడు.. అంతే అప్పటివరకు ఆటలో లీనం అయి వాళ్ళను తిడుతున్నవాళ్ళు కాస్తా నా వైపు తిరిగారు.. దాని మొహం అది తెలుగుది కాదురా తమిళ్ పొన్ను ..మొహానికి ఆ విభూధి కనిపించడంల్లా వాళ్ళు అలాగే పెడతారు అని ఒకడు ..అబ్బెబ్బే అది మలయాళీ పెణ్ కుట్టి అని మరొకడు ...కాదేహే ఖచ్చితంగా కన్నడ భామ ..నేను రాసిస్తా కావాలంటే ..వాళ్ళే ఇంత డేరింగ్ గా ఒక్కళ్ళే ఊరి మీదకు తిరుగుతారు ... మహా ఖతర్నాక్ లు అని మరొకడు.. ఏంట్రా ఆకాశంలోకి చూస్తుంది గుడ్డిదానిలాగా ..కళ్ళు లేవా అని మరొకడు..ఒక్కటి కాదు వాళ్ళిష్టం ...

మాములుగా అయితే సైలెంట్ గా విని ఉరుకునేదాన్ని..మనకసలే బోలెడు ధైర్యం ఎక్కువకదా..కాని ఆ రోజు నాకున్న చిరాకు కి, విసుగుకి ఎవరోకరిని బాగా తిట్టాలన్నంత కసి గా ఉందేమో ఇంక వాళ్ళ పని అయిపొయింది..' ఠాట్' నేను విభూది పెడితే నీకేంటి ,ఒంటరిగా వస్తే నీకేంటి ఇంకోసారి ఏమన్నా అన్నారో పోలీసులకు కాల్ చేస్తాను ఖబడ్దార్ అని ఒక పది నిమిషాలు ఆపకుండా తిట్టిపడేసాను .. తిట్టేసాక గాని భయంవేయలేదు..అయినా చుట్టూ జనాలు ఉన్నారు కాబట్టి కాసింత ధైర్యం గా అక్కడే కుర్చుని చూస్తున్నా.. దెబ్బకి వాళ్ళు సైలెంట్ ..

నా ప్రక్కన ఉన్న అబ్బాయి కొంచెం సేపయ్యాకా మీరు "తెలుగా" అండీ అన్నాడు.. నేను ఏం మాట్లాడకుండా నా భయాన్ని కనబడనివ్వకుండా సైలెంట్గా ఎక్కడకో చూసుకుంటున్నా.. నేనేమి అనలేదు కదండీ ..అప్పటికీ వాళ్ళను వద్దని వారిస్తున్నాను కదా అన్నాడు మెల్లిగా.. నేనేం మాట్లాడకపోయేసరికి నేను మిమ్మల్ని 'సిస్టర్' అని పిలవచ్చా అన్నాడు ... నాకెందుకో నవ్వు వచ్చింది.. అయినా సీరియస్ గా మొహం పెట్టి అంటే అక్కా?చెల్లా? అన్నాను ... మీ వయసు ఎంత ?అన్నాడు వెంటనే. మొన్నే ఇరవై వచ్చింది అన్నాను ..అయితే నాకు ఇరవై మూడు చెల్లెమ్మా అన్నాడు.. నాకు ఎవరూ అన్నయ్యలు లేరేమో ఎవరైనా చెల్లెమ్మా అంటే చాలు పట్టుకోలేరు నన్ను ..ఇంక మొదలు పెట్టేసాను కబుర్లు ...

అలా కాసేపు అతని ఫ్రెండ్స్ కి రక్త సంబంధం,చెల్లెలి కాపురం ,పుట్టింటి పట్టు చీర లాంటి సెంటిమెంట్ సినిమాలను ఫ్రీగా చూపెట్టాకా మాటలో మధ్యలో చెప్పాడు తను ..అతని పేరు నాయుడు అంటా ..వైజాగ్ వాళ్ళ ఊరు.. ఇక్కడ పని చేస్తే బోలెడు డబ్బులు ఇస్తారని మభ్య పెట్టి ,ఒక ఏజెంట్ లక్షన్నర రూపాయలు తీసుకుని ఇక్కడికి తీసుకొచ్చాడు అంటా.. పాపం పాస్పోర్ట్ గట్రా అతనే తీసుకుని వెట్టిచాకిరి చేయిస్తున్నాడు. .అసలే ఎండకన్నెరగకుండా పెరిగాడేమో రాత్రి పగలు పని చేయాలంటే నరకం గా ఉంది ..వెనకకు వెళ్ళే దారిలేదు ..సంపాదించినదంతా ఏజెంట్ లాగేసుకున్టున్నాడు..జ్వరమోచ్చినా, నెప్పోచ్చినా చూసే నాధుడు లేడు అని చాలా బాధపడ్డాడు..

షిప్ లో పని ..పాపం పని అలవాటు కాక ఏక్సిడెంట్ లో చిటికెనవేలు'కట్' అయ్యి తీసేశారు అంట..మా అమ్మకి చెప్పలేదు ..ఏడుస్తుంది ..కాకపొతే ఇన్సురెన్స్ ,మూడు నెలలు లీవు ఇచ్చారనుకో..ఒక్కడినే ఇంట్లో ఉంటే అసలేం తోచడం లేదు అన్నాడు..నాకు జాలేసింది .. వెంటనే మా ఆయన "ఆఫీస్ ఫోన్ నెంబర్ "ఇచ్చేశాను తోచక పొతే ఆయనకు కాల్ చేయి అన్నయ్యా అని.. ఆ తరువాత మా ఆయన ఒకటే తిట్లు.. ఎవడే వాడు?? , నిమిషానికి ఒక సారి కాల్ చేస్తాడు ..బావా ఏం చేస్తున్నావు?,బావా ఎలా ఉన్నావు?,బావా చెల్లి ఏం కూర వండింది ?అనుకుంటూ ...అరె బాబు, నాకు పని ఉంది పది నిమిషాలు ఆగరా అంటే .. కరెక్ట్ గా పదినిమిషాలు సెకన్లతో సహా లెక్కగట్టి మళ్లీ ఫోన్ చేసి బావా పని అయిపోయిందా ఏదన్నా మాట్లాడు అంటాడు ...ఇంకోసారి ఎవరికన్నా ఫోన్ నెంబర్లు,ఇంటి అడ్రేస్లు ఇచ్చావో కాళ్ళు విరక్కోడతా అని వార్నింగ్ ఇచ్చారనుకోండి అది వేరే విషయం అన్నమాట ...

అలా కాసేపు కబుర్లలో పడ్డాగాని నా బాధలకు తోడూ ఎండవల్ల తల తిరిగిపోవడం ,వికారం మొదలయిపోయి కాసేపు మౌనంగా ఉండిపోయాను ..ఈ లోపల వెస్ట్ ఇండీస్ ఓవర్లు అవ్వక ముందే గెలిచేసింది.. అప్పటికే చాలామంది మూటాముల్లె సర్దుకుని ఇంటికి వెళ్ళిపోయారు .. మేన్ ఆఫ్ ది మేచ్ నో ఏదో ఇస్తున్నారు.. అన్నయ్యా వాళ్ళు వెళ్ళారు గ్రౌండ్ లోకి .. నేను మా ఆయన కోసం ఎదురు చూస్తూ కూర్చున్నా.. ఇంతకీ రారు అంతకి రారు ...గ్రౌండ్ టక టక ఖాళి అయిపోతుంది ... నాకు కోపం ,ఏడుపు రెండు వచ్చేస్తున్నాయి ..

ఏమ్మా! ఇంకా బావ రాలేదా ?అన్నాడు నాయుడన్నయ్య.. ఉహు అన్నాను అప్పటికే కళ్ళల్లో నీళ్ళు ఊరుతున్నాయి.. మరి ఇంటికి వెళ్ళిపోతావా అన్నాడు.. లేదన్నయ్యా వచ్చేస్తారు అన్నాను.. అసలు నాకు దారి తెలిస్తే కదా వెళ్ళడానికి ..అదెక్కడో ఊరికి మూలగా ఉంది గ్రౌండ్ ... సరే ,ఇంక పదరా అనవసరం గా డబ్బులు తగలేట్టుకుని వచ్చాం ప్రక్కన అబ్బాయి అన్నాడు.. సరే నేను వెళ్ళనా అన్నాడు అన్నయ్య.. ఉహు వద్దు మా ఆయన వచ్చేవరకు ఉండవా అని గొంతువరకూ వచ్చింది ..కాని ఎవరో తెలియదు ,ఏం పనో ఏమో అనుకుని.. పర్లేదు ,మీరు వెళ్ళండి అన్నాను చిన్నగా నవ్వుతూ... తను వెళ్ళబోతూ నా వెనుక ఉన్న తమిళియన్స్ ని చూసి ..ఇక్కడ ఎందుకు చెప్పు ..బయట ఎంట్రెన్స్ దగ్గర వెయిట్ చేయకూడదూ అన్నాడు.. ఏమోలే, మళ్లీ ఆయన వెదుక్కుంటారు.. పర్వాలేదు ఇక్కడే ఉంటా.. వచ్చేస్తారు అన్నాను..నాకసలు నడిచే ఓపిక కూడలేదు నిజానికి.. సరే ,జాగ్రత్త ..ఎక్కువ సేపు ఇక్కడ ఉండకు ..అవసరం అయితే బయట వెయిట్ చేయి అని వెళ్ళిపోయాడు..

తను వెళ్లిపోయాకా చాలా దిగాలుగా అనిపించింది.. అక్కడే కూర్చుని వెళ్ళిపోతున్న జనాలను,దాదాపుగా ఖాళి అయిన గ్రౌండ్ను చూస్తూ ఉంటే గట్టిగా నవ్వులు వినబడ్డాయి ..ఎవరా అని వెనక్కి తిరిగి చూస్తే ..ఎప్పుడోచ్చారో తెలియదు మచ్చా, మాపుళే అంటూ దాదాపు పదిమంది వరకు అబ్బాయిలు.. బీరు సీసాలు గట్రా లు తెచ్చుకుని నవ్వులు నా వైపు చూస్తూ ..భయం వేసింది .. అప్పట్లో తమిళ్ కొద్దిగా కూడా అర్ధం అయ్యేదికాదు ..అసలేం అంటున్నారో తెలియదు ..మన తెలుగబ్బాయిలను చూసి తెగ పోజుగా తిట్టేసాను కాని వాళ్ళను చూస్తేనే భయం వేసింది..నాయుడన్నయ్య ఎందుకు చెప్పాడో అప్పుడర్ధం అయి పరుగు పరుగున బయటకు వచ్చేసాను ..

బయట కూడా పెద్దగా జనాలు లేరు ..అందరూ వెళ్ళిపోతున్నారు ...ఇంక నా వల్ల కాక నేను ఇంటికి వెళ్ళిపోదామని ఒకరిద్దరిని 'సిమే' కి వెళ్ళే బస్ ఎక్కడ ఎక్కాలి అని అడిగాను .. తెలియదంటే తెలియదన్నారు ... దూరంగా ఏదో బస్ స్టాప్ కనబడితే అక్కడికి పరుగుపెట్టి అడిగాను .. వాళ్ళూ తెలియదు అన్నారు .. ఈ లోపల ఈయన గ్రౌండ్కి వచ్చేసారేమో ..వెతుక్కున్టున్నారేమో అని అటు పరుగులు తీసా మళ్లీ .. అక్కడా ఎవరు లేరూ.. ఎటు బ్లూ షర్ట్ కనబడితే అటు వెళ్లి చూసేదాన్ని ... దాదాపు గా జనాలు పలచబడ్డారు.. అప్పుడు మొదలైంది ఏడుపు వరదలా... ఎవరన్నా చూస్తున్నారేమో,నవ్వుతారేమో ఇంకేం లేదు ..ఏడుస్తూనే ఉన్నా,కళ్ళు తుడుచుకుంటునే ఉన్నా....

అలా అక్కడే ఒక చోట ఆగి నించుని చూస్తుంటే ప్రక్కన ఎవరో షూ లేస్ కట్టుకుంటున్నారు మెట్లపై కూర్చుని..యాదాలాపం గా అతని వైపు చూసాను.. అతను అతనేనా ?? అనుకుంటూ కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తుంటే తను ఒక నిమిషం నా వైపు చూసాడు ఆక్చర్యంగా ..నిజానికి వేలాదిమంది అభిమానులు అతనిని చూడగానే పరుగులు పెట్టి చుట్టుముడతారు ...బహుసా నేనేనేమో అతని కెరీర్లో ఏడుపుమొహం వేసుకుని ,మొహమంతా కాటుక పులుముకొని ,కనీసం చిరునవ్వు కూడా నవ్వకుండా నించుంది .."అతనే సచిన్ టెండూల్కర్ "... అప్పటికి అతని వయసు పాతికలో ఉంటుందేమో ...అప్పుడే ఫ్రిజ్ లో తీసిన ఫ్రెష్ యాపిల్ లా ఎంత బాగున్నాడో. అంత ఎండలో రోజంతా ఆడినా అసలు అలసట లేకుండా అంత తెల్లగా ఎలా ఉన్నాడో నాకు ఇప్పటికీ అర్ధం కాదు ...

కాస్త దూరంలో క్రికెటర్లు హోటల్ కు వెళ్ళే బస్ ఉంది ... విచిత్రం ఏంటంటే అసలు సేక్యూరిటినే లేదు..ఎవరో ఒకరిద్దరు పోలీసులున్నారంతే ..ఇంకా పెద్ద విచిత్రం ఎగబడి చూసే జనాలు అసలు లేరు ..బహుసా ఆ రోజుల్లో మన ఇండియన్స్ తక్కువ అవ్వడం వల్ల అనుకుంటా ..ఇప్పుడయితే భారీ బందోబస్తు చేయాలి ... ఒక్కొక్కరు నా ప్రక్క నుండే కిట్లు పట్టుకుని బస్ ఎక్కారు.. గంగూలి ,ద్రావిడ్ ,వెంకటేష్ ప్రసాద్ ...(అలా చూస్తారేంటి కాస్త కుళ్ళుకోండీ ..అన్నీ నేనే చెప్పాలి )ఎవరెవరో గుర్తు లేదు ఇంకా...కానీ చాలా మంది బస్ ఎక్కుతూ మన అవతారాన్ని ఒకమారు దర్శించి ఎవర్తిరా ఇది అన్నట్లు అయోమయం మొహం పెట్టి ఎక్కారు..

అంటే మా అనిల్ నన్ను చూడలేదు లెండి ..లేకపోతే తప్పకుండా నా కోసం ఆగి పోయేవాడు :) ..ఆ టైములో వాళ్ళను ఆటోగ్రాఫ్ అడుగుదాం అనిగాని ఫొటోస్ తీద్దాం అనిగాని నాకేం అనిపించలేదు..నా ఏడుపు నాది ..మా ఆయన తెగ తిడతారు ఆ విషయం మీద ఇప్పటికీ.. అలా క్రికెటర్లు అందరూ వెళ్లిపోయాకా పూర్తిగా నిర్మానుష్యం అయిపొయింది ఆ ప్లేసు ..ఇంక ఏడ్చే ఓపిక లేకా మెల్లిగా టెండూల్కర్ కూర్చున్న మెట్ల మీదే కూలబడి గడ్డి పీకుతూ ఉన్నా.. పది నిమిషాలు పోయాకా వచ్చారు మా శ్రీవారు తాపీగా .. అరేయ్ ,ఇక్కడ ఉన్నావా .. నేను గ్రౌండ్ లో వెదుకుతున్నా ..అసలేమైంది అంటే ఆఫీస్లో చా..లా ..పని ఉంది ..దానికి తోడూ ట్రాఫిక్ జామ్ అయ్యింది అంటూ ... ఆ తరువాత ఏం జరిగింది అనేది మీ ఉహా శక్తికి వదిలేస్తున్నా ...అన్నీ ఇక్కడ చెప్ప కూడదంట లలితగారు చెప్పారు... అందుకే ఉష్.. గప్చిప్ అని ..

10, జులై 2010, శనివారం

ఇంకొన్ని ముచ్చట్లు ..

వెనుకటికెవరో నాలాంటి వాడిని "దేవుడిని ఇక నమ్మనని ప్రొద్దున్నే అని సాయంత్రం గుడికొచ్చావేం"? అని అడిగితే..మరీ శివరాత్రి పూటే నమ్మటం మానేస్తే దేవుడికి కోపం వస్తుందేమో రేపటినుండి మానేస్తా అన్నాడంట"..అలాగా.. 'ఛీ.ఛీ' నాకు క్రికెట్ అనే పదం అంటేనే పరమ చిరాకు అని దాని మీదే పోస్ట్ లు వేస్తున్నా వరుసగా.. :)

సరే కధలోకి వచ్చేస్తే నేను సింగ పూర్ వెళ్ళిన నెలరోజుల లోపే ఒక రోజు సాయంత్రం పని అయిపోయాకా మావారి గురించి ఎదురు చూస్తూ ,ఇండియానుండి తెచ్చిన ఆంధ్ర భూమి పత్రికను క్రింద తారీఖు ,వారం,పేజ్ నెంబర్లతో సహా వదల కుండా ముప్పయ్ మూడోసారి సీరియస్ గా చదువుతుంటే తలుపు తీసుకుని లోపలికి వచ్చారు మావారు..ఎప్పటిలా బేగ్ ఆ మూలన, షూస్ ఇంకో మూలనా పడేసి మంచానికి అడ్డంగా పడిపోయి.."అసలు భార్యంటే ఎలా ఉండాలి ..భర్త ఇంటికి రాగానే ..అయ్యో ఎంత అలసిపోయారో ,మంచి నీళ్ళు కావాలా?(వాటర్ బాటిల్ ప్రక్కనే ఉంటుంది ..అయినా సరే) కాళ్ళు పట్టామంటారా "అంటూ ఎంత ఇదై అదై పోవాలి..మనకసలు అలాంటివేమీ లేవు..సత్య భామ పోజులివ్వడం తప్ప అని రొటీన్ గా శివాలెత్తి పోకుండా ..ఎంతో సౌమ్యంగా నా ప్రక్కనే చేరిపోయి బుజ్జీ!! అని గారంగా పిలిచారు ...నాకు కుడికన్ను అదురుతుండగా 'ఆ.. ఏంటీ' అన్నాను ...నీకో విషయం తెలుసారా ..సింగపూర్లో ఇంటర్నేష్నల్ క్రికెట్ మేచ్ జరుగుతుంది ఫలానా రోజున ..ట్రయాంగిల్ సిరీస్ అన్నారు ఉత్సాహంగా ..'అయితే' ?? అన్నాను భృకుటి ముడిచి ..అయితే అని సింపుల్గా అంటావేంటీ.. మళ్ళా ,మళ్ళా ఈ అవకాశం వస్తుందో లేదోఅని .. అని ఆగారు..'లేదోఅని ' రెట్టించాను.. నీకు ,నాకు టికెట్స్ తీసుకున్నాను అన్నారు మెల్లగా..

అంతే ఒక్క సారిగా 'గయ్' మన్నాను..మొన్నే కదా పొదుపు -వాటి లాభాలు-పాటించవలసిన పద్దతులు అనే విషయం మీద అరగంట క్లాస్ పీకాను ..పైగా ఒకప్రక్కన చెల్లెలి పెళ్ళికి కొంచెం డబ్బు ఇవ్వాలన్నారు.. ఇంకోప్రక్క అప్పు చేసి వచ్చాను అన్నారు ..మరో ప్రక్క ఇల్లూ,వాకిలీ లేదు .. ఇప్పుడిలా అంటే ఏమిటర్ధం?..అని తిట్టిపడేసాను.. అబ్బా !అవన్నీ నేను చూసుకుంటాను.. నీకు తెలుసుగా నాకు క్రికెట్ ఎంత ఇష్టమో ..ఈ టికెట్స్ కోసం ఎంత కష్టపడ్డానో తెలుసా..పైగా బోలెడు మంది క్రికెటర్స్ వస్తున్నారు..పైగా నీకిష్టం అయిన కూంబ్లె కూడా వస్తున్నాడు అన్నారు..ఉహు..వద్దు వాడికీ పెళ్ళి అయిపోయింది ..నాకు అయిపోయింది నేను చూడను అన్నాను మొండికేస్తూ..

ఎవర్తివే నువ్వు ..ఇలా వేపుకుతింటున్నావ్ అని కాసేపు గొణుక్కున్నా నా వీక్నెస్ బాగ తెలుసు కాబట్టి ప్లేట్ మార్చేసారు .. అది కాదు బుజ్జి..ఇప్పుడూ ..నువ్వు మేచ్ కి వచ్చావు అనుకో .. టి.వి లో నువ్వు కనబడతావు కదా ..అప్పుడు మీ అమ్మా,నాన్నలు ఎంత సంబరపడిపోతారు ..పైగా మీ బంధువులందరూ మీ నాన్నకు ఫోన్ చేసి మన బుజ్జి టివిలో కనబడింది అంటే మీ నాన్న ఎంత గొప్పగా ఫీల్ అవుతారో తెలుసా ..ఇంకా నువ్వెలా ఉన్నావో కూడా మీ నాన్నకు ఫ్రీగా కనబడుతుంది ..వాళ్ళెంత ఆనంద పడిపోతారో ఊహించూ అని ఒక సెంటిమెంటు సినిమా కళ్ళముందు చూపించేసరికి' సరే' అని ఒప్పేసుకున్నాను.. ఆ వెంటనే మా వాళ్ళకు ఫోన్ చేసి ఆ రోజున ఏం డ్రెస్ వేసుకుంటున్నానో ,ఏ రంగు గాజులో,ఎటువంటి జూకాలో ,ఏ రంగు రబ్బర్ బేండ్ తలకు పెట్టుకుంటున్నానో ప్రతీదీ వదలకుండా చెప్పేసాను..

మొత్తానికి అనుకున్న రోజు వచ్చింది..కల్లాంగ్ స్టేడియం లో మేచ్.. ఆ రోజు మావారు లీవ్ పెట్టేసుకున్నారు.. మంచినీళ్ళు,తిండి గట్రా పేక్ చేసుకుని ఇద్దరం బయలుదేరాం .. మేము వెళ్ళేసరికి చాంతాండంత 'క్యూ' ఉంది.. బోలెడు మంది బయట సార్,సార్ ఎక్స్ ట్రా టికెట్ ఉంటే ఇవ్వండి అని బ్రతిమాలుతున్నారు .. చూసావారా ..నేను చెబితే నమ్మేవా..మనకు భలే లక్కీగా దొరికాయి టిక్కేట్స్ అన్నారు.. నేను అలా ఫోజులు కొట్టే సందర్భాలను అస్సలు మిస్ చేసుకోను.. స్టైల్ గా వాళ్ళను చూస్తూ మాకు టికెట్స్ ఉన్నాయి తెలుసా అని లుక్కులిస్తూ లోపలికి వచ్చేసా..ఒక బెంచ్ పైన చోటు చూసుకుని ఇద్దరం సర్ధుకు కూర్చున్నాం .. కూర్చున్నదగ్గరనుండీ నా చూపులు ఎన్ని కెమారాలున్నాయి?? ఎక్కడెక్కడ ఉన్నాయి?? వెదుక్కోవడమే సరిపోయింది..

ఏమండీ!! మరేమో టి.వి లో మన మీద కొచ్చి షూట్ చేసినట్లు కనబడుతుంది కదా ..మరేమో ఇక్కడ ఎక్కడో ఫోర్ లైన్ లో కెమేరాలు కనబడుతున్నాయేంటీ? అన్నాను ఆరాగా.. అంటే అందులో 'జూం' ఉంటుంది కదా ..అక్కడి నుండి తీసినా కనబడతాం అన్నమాటా అన్నారు...ఓ..మరి అక్కడి నుండి తీస్తే .. వాళ్ళు మనల్నే తీస్తున్నట్లు మనకెలా తెలుస్తుంది??.. పైగా చాలా మంది ప్రేక్షకులు వాళ్ళు టి.వీలో కనబడగానే టాటాలు చెప్పేసి ..నవ్వేస్తుంటారు..వాళ్ళకెలా తెలిసిపోతుంది ??అన్నాను అనుమానంగా.. అంటే అక్కడ ఎదురుగా ఒక పెద్ద టీ.వి ఉంటుంది అందులో మేచ్ కనబడుతుంది ..దానిలో చూసి.. వాళ్ళను చూసుకుని కనిపెట్టేస్తారు అన్నమాట అన్నారు..మరి ఇక్కడ టీ.వి ఎక్కడ ఉంది?? అన్నాను అటు,ఇటు చూస్తూ.. 'యెహె పో' ..ముందు మేచ్ చూడు అన్నారు చిరాగ్గా..

మేచ్ మొదలైపోయిందా అప్పుడే అన్నాను బోలెడు ఆక్చర్యపోతూ ..అప్పుడే రెండు ఓవర్లు కూడా అయిపోయాయి..ఏం చూస్తున్నావ్ అన్నారు.. గ్రౌండ్ వైపు చూసాను.. ఎక్కడో అర అంగుళం అంతమనుషులు కనబడుతున్నారు.. ఎవరు బేటింగో ?ఎవరు బౌలరో ?ఏంటో? ఏమీ అర్ధం కావడంలేదు ..గ్రౌండ్ లో మేచ్ అంటే ఇంత భయంకరం గా కనబడుతుందా?? ఆ మాత్రందానికి ఇన్ని డబ్బులు పెట్టుకుని చూడాలా మేచ్ అన్నాను..ఇంతలో ఎవరో 'ఫోర్' అన్నారు.. అబ్బా మధ్యలో మాట్లాడకు.. 'ఫోర్' అంటా మిస్ అయిపోయా అన్నారు మా ఆయన.. తిక్క కోపం వచ్చింది.. ఇదే టివీ లో అయితే అన్ని ఏంగిల్స్ లోనూ పది సార్లు చూపుతాడు విసుక్కుంటూ అన్నాను..

ఈ లోపల జనాలందరూ 'ఓ'అని మూలిగారు.. ఏమైంది? అన్నాను ..అవుటయ్యారు అన్నారు మా ఆయన .. ఎవరూ? అన్నాను .. గంగూలీ అనుకుంటా? అన్నారు..ఎలా? అన్నాను ..ఏమో బౌల్డేమో?.. కాదు..కాదు'కేచ్' అనుకుంటా అన్నారు ..ఈసారి మా ఆయనను చూసి జాలేసింది.. ఇక్కడ పెద్ద టి.వి ఉంటుంది ..అందులో మనం కనబడతాం అన్నారూ అన్నాను ... అంటే చిన్న గ్రౌండ్ కదా అలాంటి ఎక్విప్మెంట్స్ లేవనుకుంటా అన్నారు..మరి నాకు నేను ఎలా కనబడతాను ?..పైగా చెత్తలా ఉంది ఈ గ్రౌండ్ ..నాకేం నచ్చలేదు..ఇండియాలోనే మంచి,మంచి గ్రౌండ్లు ఉంటాయి ..ఇక్కడ టాయిలెట్స్ కూడా సరిగాలేవు అన్నాను విసుక్కుంటూ.. అంటే సింగపూర్లో క్రికెట్ ఎవరూ చూడరు కదా ..పుట్ బాల్ కు ఉన్న క్రేజ్ క్రికెట్కు ఇక్కడ ఉండదు..అందుకే ఆపధర్మంగా ఈ గ్రౌండ్ ఏర్పాటు చేసి ఉంటారు అన్నారు... అలాంటప్పుడు మరి ఇక్కడ ఎందుకు మేచ్ లు పెట్టారు చెత్తలాగా విసుగ్గా అన్నాను..

ఇంక దీనితో లాభం లేదనుకున్నారేమో ..బుజ్జీ ఒక పని చేయి .. ఆ ఫోర్ లైన్ ఉంది కదా అక్కడ నించో ..ఎవరన్నా నీ వైపుకు బాల్ ఫోర్ కొట్టారనుకో ..అప్పుడు అన్ని కెమెరాలు నిన్ను కూడా బాల్ తో పాటు కవర్ చేస్తాయి అని నా నస వదిలించుకునే ఒక సలహా పడేసారు..నాక్కూడా నిజమే అనిపించేసి అమాయకంగా ఆ లైన్ లో నించుని కెమెరాల వైపే చూస్తూ నించున్నా.. కానీ ఇటు మనవాళ్ళు గాని అటు జింబాంబ్వే వాళ్ళు గాని ఒక్కడన్నా ఫోర్ కొట్టిన పాపాన పోలేదు .. ఎంత ఆశగా చూసానంటే ..అబ్బే..రెండు టీముల్లో ఒక్కడికి కూడా జాలి లేదు.. ఎవరూ నేను ఉన్న వైపు ఫోర్ కాదు కదా కనీసం డబల్స్ కూడా కొట్టలేదు ఆట మొత్తానికి..

కాసేపయ్యాకా ,మా ఆయన బయటకువెళ్ళారు ఇప్పుడే వస్తానని.. డ్రింక్స్ ఏవో తాగుతున్నారు ఆటగాళ్ళు.. నాకు చాలా బోర్ గా అనిపించింది.. అలా చూస్తుంటే గంగూలి ,ద్రవిడ్ అనుకుంటా అటు వెళుతూ కనబడ్డారు..నాకు వెంటనే ఒక ఆలోచన వచ్చింది.. వాళ్ళదగ్గర ఆటోగ్రాఫ్ అడిగితే మా వారికి చూపిస్తే ..భలే సంతోషపడిపోతారు కదా అనుకుని అటు పరిగెత్తాను.. ఈ లోపలే నన్ను తోసుకుంటూ ఒక యాబై మంది ..సార్ ఆటో గ్రాఫ్ ప్లీజ్ అంటూ వాళ్ళ మీద పడ్డారు..వాళ్ళు కొంతమందికి ఇస్తున్నారు,మరి కొంతమందికి సారీ చెబుతున్నారు.. ఇంకేం వెళతాం..హూం అని భారీ గా నిట్టూర్చీ వెనక్కి తిరిగాను..

' హెల్లో' ఎవరో పిలుస్తున్నట్లు అనిపించి వెనక్కి తిరిగాను.. ఫోర్ లైన్లోనుండి జింబాంబ్వే ప్లేయర్ ఎవరో నావైపే చూస్తున్నాడు.. నేను అటు,ఇటు చూసాను ..నన్నా? కాదా అని.. మళ్ళీ పిలిచాడు దగ్గరకు రమ్మని సైగ చేస్తూ..నా ఇంగ్లీష్ పాండిత్యం మీకు తెలిసిందే కదా ...'ఆ అంటే ఈ 'రాదు నన్ను ఎందుకు పిలుస్తున్నాడో ఏంటో??అని భయం భయం గా దగ్గరకు వెళ్ళాను.. ఆటో గ్రాఫ్ కావాలా అన్నాడు సైగ చేస్తూ..ఊ..ఉహుహు అన్నాను ఏమనాలో తెలియక ..బుక్ ఇవ్వు అన్నాడు ... నా దగ్గర ఉన్న బుక్ గబుక్కున అతనికి ఇచ్చాను.. 'పెన్ ' అన్నాడు సైగ చేస్తూ..హేండ్ బేగ్ గభ గభ చూసాను .. అక్కడ అవతల మళ్ళా మేచ్ మొదలై పోతుంది..అతను కంగారు పడుతున్నాడు..నా దగ్గర పెన్ లేదు.. జాలేసి పెన్ లేదు ...వద్దులే ..పర్వాలేదు అని సైగ చేసాను..అతను నవ్వి మరెవరినో పెన్ అడిగి సైన్ చేసాడు.. అతనికి ధేంక్స్ చెప్పి వచ్చి పేరు చూసాను ..ఆ పేరు గుడ్విన్ ..నాకు జింబాంబ్వే క్రికెటర్స్ లో తెలిసిన ఒకే పేరు అది..

అలా మొత్తానికి మేచ్ మొత్తం బోరు,బోరుగా చిరాకు చిరాకుగా జరిగింది..ఆ మేచ్ లో మనవాళ్ళు గెలిచారు(ట) ..అయిపోయాకా అందరూ పొలోమని ఇళ్ళకు పారిపోయారు ..మా ఆయన మాత్రం గ్రౌండ్ లోకి తీసుకువెళ్ళారు.. ' రవి శాస్త్రి ' కోసం.. నాకేంటో రవి శాస్త్రి అంత ఇష్టం ఉండడు..జిడ్డుగాడు.. చెత్తలా ఆడతాడు అని మ ఇంట్లో పెద్ద పేరు.. అలా అంటే మా ఆయన ఒప్పుకోరు ..సిక్స్ సిక్స్ లు కొట్టిన ఘనత శాస్త్రిదేనే మనవాళ్ళలో అని వాదిస్తారు..సర్లే పోని ముచ్చట పడుతున్నారు కదా అని వెళ్ళాను..అప్పటికే ఎవరి మీదో ధుమ ధుమలాడుతున్నాడు అయ్యగారు.. మొహం పింక్ కలర్ లో కందిపోయి ఉంది ..కాని చాలా బాగున్నాడు..మొన్న టి.వీ లో చూస్తే జుట్టు పీకేసిన కోడిలా చాలా భయంకరం గా ఉన్నాడు పాపం.. ఈ లోపల కెమేరా ఆన్..స్టార్ట్ అని అరిచారు ఎవరో ..అంతే కోల్గేట్ మాడల్ లా తీయగా నవ్వుతూ ఏంటో చెబుతున్నాడు ..అప్పుడు చాలా ఆక్చర్యం వేసింది ..వెంట వెంటనే మూడ్ మార్చుకోవాలంటే కష్టం కదా అనుకున్నా..

అతని మాటలు అయిపోగానే మేము ఎదురుగా నించున్నాం..మావారి దగ్గర పెన్ తీసుకుని ఆటోగ్రాఫ్ అడిగాను.. అసలే మావారి ఫేవరెట్ ప్లేయర్ కదా..అప్పటికి సింగపూర్లో క్రికెట్ అంత గా పట్టించుకునేవారు కాదు కాబట్టి మాకు చాలా ఫ్రీగా ఉంది..జనాలు లేకుండా.. రవి ఒక సారి నవ్వి సంతకం పెట్టి పెన్ జేబులో పెట్టుకుని వెళ్ళిపోయాడు.. దానితో మావారు గోల గోల..అది ఈయనగారి సెంటిమెంట్ పెన్ అంట ..కాసేపు అయ్యాకా పోనిలే రవి నా పెన్ తీసుకున్నాడు అని తెగ ఆనందపడ్డారు.. అయ్యో ఎంత అమాయకం అండి కాసేపటిలో యే చెత్త బుట్టలోనో పడేస్తాడు అనుకున్నా మనసులో.. అలా క్రికెటర్లను అందరిని చూసుకుని ఇంటికొచ్చేసాము..ఇంటికి వచ్చాకా నేను కనబడ్డానా అని తెగ ఆత్రుతగా అడిగాను..అంటే కనబడ్డావనుకుంటా..నువ్వే అనుకుంటా..చూసామనుకుంటా అని నన్ను తృప్తిపరిచే మాటలు మావాళ్ళు మొదలు పెట్టారు..కొద్దిగా నిరాశగా అనిపించినా పోనిలే బాబు ఒక పని అయిపోయింది మా ఆయన కల తీరిందికదా అనేసుకున్నా అమాయకంగా

కాని కధ అక్కడితో అయిపోలేదు మొదలయ్యింది :)