23, ఆగస్టు 2010, సోమవారం

వరలక్ష్మి వ్రతం


ఇప్పుడుమనం వరలక్ష్మి వ్రత విధానం ...మరియు దానికి కావలసిన పూజా సామాగ్రి ఏమిటో తెలుసుకుందాం ...ఆగండాగండిఎప్పుడూ పాత విషయాలేనా అప్పుడప్పుడు వెరైటీగా ఇలా క్కూడా ప్రయత్నించాలి... ఏం వద్దా !! అయితే సరే ... కాని ఈసారి చెప్పబోయే విశేషాలు ఇవే...

చిన్నపుడు సినిమాల ప్రభావమో,సీరియళ్ళ పైత్యమో విదేశాల నుండి వచ్చిన వారైనా ,బాగాడబ్బుండే ఆడవాళ్ళ గురించి విన్నా మనసులో ఒక రూపం మెదిలేది. స్లీవ్లెస్ జాకిట్టు ఉన్న చీర కట్టి,భుజాలవరకు కత్తిరించినజుట్టుతో ,చేతిలో ఒక బొచ్చు కుక్కపిల్ల ,చుట్టూ పదిమంది మహిళా మండలి సభ్యులు ,బోలెడు ఇంగ్లీష్ కబుర్లు.... .. ఈరకంగా చిత్రం గీసేసి భారతీయ సంస్క్రతి ,సాంప్రదాయాలు మంట గలసి పోతున్నాయని తెగ ఫీలయి పోయేదాన్ని..

మొదటి సారి ఇక్కడకు వచ్చినపుడు మావారు తీసుకు వెళ్ళిన క్లబ్స్ లో ఎక్కువ ఫారినర్స్ ,నార్త్ ఇండియన్స్ ఉండటం వల్ల నేను వేసిన బొమ్మలో మార్పులు చేర్పులు ఉన్నపటికీ ఫీలింగ్ మాత్రం అదే....దానికి తోడూ అమ్మాయిలు పార్టికి రావడంరావడం అసలే మాత్రం మొహమాటం పడకుండా బీర్ ఎక్కడ ??బీరేక్కడ అని ఒకటే హడావుడి పడిపోయేవారు ....నాకిప్పటికీ గుర్తు ఒక అమ్మాయి అయితే వాళ్ళ నాలుగేళ్ల పాప, అమ్మ చేతిలో బీరు కావాలని ఏడుస్తుంటే ఒక స్పూన్పట్టేసింది ఆవిడ టక్కున ... నేను అయ్యో అదేంటండి అని నోరేల్లబెడితే ,ఇప్పుడు వద్దూ అన్నాం అనుకో అది వినదు ..అడగ్గానేపట్టేసామనుకో అది పట్టించుకోదు...పైగా ఇది కొంచెం చేదుగా ఉంటుంది దానికి నచ్చదులే అంది సింపుల్గా...

అలా పలుకారణాలవల్ల ఇక ఈ దేశం లో మన సంస్కృతీ సాంప్రదాయాలకు ఏకైక పట్టుకొమ్మను, బుట్ట బొమ్మను నేనే అని ఒక గాట్టినమ్మకానికి వచ్చేసాను...అక్కడి తో ఊరుకోకుండా ఒక చీర కట్టుకున్నా,తెలుగు మాట్లాడినా, పూజ చేసినా ,పుణ్యం చేసినా అన్నిటికీ నేను కాబట్టిఇలా చేస్తున్నా అదే ఇంకొకరైతేనా.... అని నాకు నేనే తెగ పోగిడేసుకునేదాన్ని.....ఇలా ఉండగా ఒక సంవత్సరం యదావిధిగా వరలక్ష్మి వ్రతం వచ్చింది... ఆ పళంగా అమ్మకు ఫోన్ చేసి అమ్మా ఎలా చేయాలమ్మా పూజ అని అడిగాను. దేశం కాని దేశంలో ఏం చేసుకుంటావే?ఇంత పరమాన్నం వండి ,నైవేద్యం పెట్టి దణ్ణం పెట్టేసుకో అంది . అసలేటి,ఏటనుకున్నావ్ నన్ను ఆయ్అని గదమాయించేసి వివరాలన్నీ చక చకా అడిగేసి ఫోన్ పెట్టేసాను...

తరువాత సరుకులు అన్నీ ఓ పెద్ద లిస్టు రాసుకున్నాను ... ముస్తఫా వెళ్లి వీధి వీధి తిరిగి ఆయన కసురుకున్నా ,విసుక్కున్నా'లక్ష్మి రూపు' తో సహా సామాను మొత్తం వెతికిసాధించాను.

ముందు రోజే ఇల్లంతా దులిపి శుభ్రం చేసేసాను..ఆ ప్రొద్దున్నే మా ఇంటి ఎదురుగా బోలెడు మామిడి చెట్లు ఉంటాయి కాబట్టి మామిడాకులు తెప్పించి తోరణాలు కట్టాను

అమ్మ వారికి బేసి సంఖ్యలో ఫలహారాలు చేయాలి అని అమ్మ చెప్పిందికాబట్టి ,మూడు అయితే గొప్ప గా ఉండదు తోమ్మిదయితే చేయలేను అని అయిదురకాలు పిండి వంటలు చేసాను. వాకిలి కడిగిముగ్గు వేసాను . చిన్న ముగ్గే లేండి .అసలే మాది మధ్య పోర్షన్ .అటు ఇటు తిరిగేవారికి ఇబ్బంది అని .లేపోతే మధ్యాహ్నం వరకు అదే పనిలో ఉండేదాన్ని.

ఆ తరువాత ఇంటర్నెట్ లో ప్రింట్ అవుట్ చేసిన పుస్తకం ప్రకారం గట్టి గట్టిగా మంత్రాలు చదువుతూ ( మరి మా ఆయన వినాలి కదా నోరు తిరగని మంత్రాలు అలోవకగా చదివేయడం... ఎందులో అయినా గొప్పగా ఉండాలి నేను ) పూజ తరువాత చారుమతి దేవి కధ మెల్లిగా మనసులో చదువుకుంటూ ముగించాను . ..ఇది మాత్రం మెల్లిగానే ఎందుకు అని ఈ పాటికి డౌట్ రావాలే మీకు..... మరి చారుమతి దేవి కధ అంతా ఆడవాళ్ళు కలలో కూడా పొరపాటున అనుకోవడానికి సాహసించని విషయాలే....అసలు కధ ప్రారంభమే ఆవిడ ప్రొద్దున్నే లేచి అత్తా,మామలను సేవించి భర్తను దైవ సమానం గా భావించి ,పాద పూజ చేసుకుని గయ్యాళి కాకా ,మితముగా భాషించి ... అసలు అసలు ఎక్కడన్నా కుదిరేపనులేనా ఇవి అని అడుగుతున్నాను...పైగా ఇన్ని చేస్తే గాని వరలక్ష్మి దేవి కరుణించదు అంట... చూడండి దేనికి దేనికి లింకో ... ఇప్పుడు ఇలాంటివి గట్టిగా చదివితే మా ఆయనకు లేని పోనీ డవుట్లు వచ్చెవూ.... అందుకే అన్నమాట...
అప్పుడు చివరాఖరున తోరాలు చేతికి కట్టుకుని అక్షింతలు ఆయనకు ఇచ్చి కాళ్ళకు దణ్ణం పెట్టేసుకున్నా.. అలా పెట్టినపుడల్లా రోజూ వరలక్ష్మి వ్రతం వస్తే బాగుండును అని గొణుక్కుంటూ ఆయన, ఆ రోజు ఏదన్నా చిరాకు పెట్టినా చిరునవ్వుతో ఊరుకుని మరుసటి రోజు చక్ర వడ్డీ ,బారు వడ్డీ వేసి మరీ తీర్చేసుకోవడం నాకు ...అనాదిగా వస్తున్నా అలవాటు..అలా పూజ అయ్యాకా ఇంట్లో ఏదో అవసరం అయితే కొనడానికి భయటకు వెళ్లాను..విదేశాలు అనుకుంటాం కాని పైకి మహారాణి పోజులు కొట్టినా పనిమనిషి కన్నా హీనం ...ఇంట్లో బాత్రుమ్లు కడగడం దగ్గరి నుండి,బట్టలు ఇస్త్రిలు,దర్జీ పని,చాకలి పని ,పిల్లల హోంవర్కులు, ఉప్పులు పప్పులు కొనడం ,బిల్లులు కట్టడం హూం ..ఏమిటో అంతా భ్రమ ....ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి... ఎంతవరకు చెప్పానూ?? ఆ .. అలా వెళుతుండగా ఎదురుగా ఎవరో అమ్మాయి నా వైపు చూస్తూ ... నా తిక-మక సంగతి తెలుసు కదా ...నవ్వాలా?వద్దా అనుకుని అయోమయం గా చూస్తుంటే దగ్గరి కొచ్చి ..ఎప్పుడి ఇరికిన్గే ? ఎంద బ్లాకు?ఉంగళ్ పేర్ ఎన్నా? అని అడిగేస్తుంటే ...అబ్బో మనకు తమిళ్ సూపర్ అర్ధం అయిపోతుందనుకుని సమాధానాలు చెప్పేస్తున్నా.. నేను తెలుగుదాన్ని అని తెలుసుకొని ' హమ్మయ్యా 'అని భారిగా నిట్టూర్చి ఏమండి మా బ్లాక్ అదే సాయంత్రం తాంబూలం తీసుకోవడానికి మా ఇంటికి రారూ అని ప్రేమగా అడిగేసరికి ....ఓ మనకులా మరొక శాల్తి ఉంది అన్నమాట తెలుగుదనం నిలబెట్టడానికి, నా రేంజ్ లో కాక పోయినా ఏదో ప్రయత్నించి ఉంటుంది అనుకుని 'ఓ ఎస్' అని మాట ఇచ్చేశాను ..

ఇంటికి రాగానే ఫోన్ ... 'హలో' అన్నాను ... మీరు పలానా ఫలానా అమ్మాయి ఫ్రెండ్ కదండీ అని అవతల ఎవరో.. అవునండి అన్నాను..నా పేరు కవిత ... నేను ఫలానా బ్లాక్ లో ఉంటాను ... ఈ రోజు సాయంత్రం తాంబూలం తీసుకోవడానికి మా ఇంటికి రారూ ప్లీజ్ అంటూ అభ్యర్ధన .... అబ్బో ...అనుకుని ...తప్పకుండా అన్నాను ..దేంక్ యూ కాని సాయంత్రం ఆరు దాటాక రండి ..నేను ఇప్పుడు ఆఫీస్ నుండి బయలు దేరుతున్నా ...సర్దుకోవాలిగా అంది.. నా తల్లే ..నువ్వు ఇప్పుడు మొదలు పెట్టి ఎప్పుడు పూజ చేస్తావ్ అమ్మా అనుకుని సరే అనేసి పెట్టేసా పోన్ ...

సాయంత్రం ముందు తమిళ్ మాట్లాడిన అమ్మాయి ఇంటికి బయలుదేరా ప్రక్కనే కదా అని..ఆ అమ్మాయి ఇంటికి వెళ్లి చూద్దును కదా గుమ్మం లో ఈ మూలా నుండి ఆ మూలా వరకు పెద్ద పెద్ద ముగ్గులు :( పైగా ఎదురుగా తులసి కోట ... దాని గూట్లో దీపం.. ఇంకా లోపలికి రానే లేదు ఆమె గభ గభా పసుపు గిన్నె తో వచ్చేసి కాళ్ళకు రాసి ,గంధం మెడకు పూసి, మల్లెమాల నా జడలో తురిమింది.. అయ్య బాబోయ్ ఇలా క్కూడా ఇక్కడ చేస్తారా అని చూస్తుంటే ...సాధారం గా పూజ గదిలో తీసుకు వెళ్ళింది ..ఆ అలంకరణ ను చూసే సరికి కళ్ళు తిరిగాయి ... తొమ్మిది రకాల పిండి వంటలు ...భారి ఎత్తున చేసింది ...

అవన్నీ ప్లేట్ లో పెట్టి ఇస్తే గదిలో కుర్చున్నానా ....అక్కడ ఉన్న అతిధులు అందరు అష్టలక్ష్ముల ఆడబడుచుల్లా ధగ ధగ లాడే చీరలు,నగలు మెడ కి గంధాలు ,చేతులకు తోరాలు ,కాళ్ళకు పసుపు ఏది మిస్ అవ్వకుండా అప్పుడే చారుమతి దేవి ఇంటి నుండి ఇళ్ళకు తిరిగి వెళుతున్నా ఇరుగుపోరుల్లా కళ కళ లాడుతున్నారు.. ఇక కబుర్లయితే మీరు మొన్న విష్ణు సహస్ర నామ పారాయణం పెట్టుకున్నపుడు పిలిస్తే రాలేదేం అని ఒకరంటే ,అదే రోజున లలితా సహస్ర నామ పారాయణం మా ఫ్రెండ్ ఇంట్లో అప్పుడు ... ఈ సారి వస్తానేం అని మరొకరు..ఇంకొకరు వాళ్ళ అమ్మాయిని పిలిచి గోవింద నామాలు మా పిల్ల ఎంత బాగా చెప్తుందో చూడండి అని అంటే వేరేఒకరు మా బాబు భవద్గీత లో సగం శ్లోకాలు తప్పులేకుండా వల్లెవేయిస్తాడు అని మరొకరు...వెంటనే కళ్ళ ముందు బావిలో కప్పు బెక,బెకా మని అరిచిన సీన్ కనబడింది.. అంటే మధ్య మధ్యలో ఆఫీస్ లో పెంచని హైక్ ల గురించి ,షేర్ మార్కెట్ కబుర్లు వినబడుతున్నాయనుకోండి ... అయినా సరే పూర్తీ ఇండియా వాతావరణం..


ఆ తరువాత కవిత ఇంటికి వెళ్లాను ... ఈ పిల్ల ఏం చేస్తుందిలే అని అంత తేలిగ్గా అనుకున్నానా ... తను అంతకన్నా భారిగా ఏకంగా కొబ్బరికాయకు జడ,కళ్ళు,ముక్కు అన్నీ ఓపిగ్గా అలంకరించి అమ్మవారిని చేసింది ...పన్నెండు రకాల వంటలు గట్రా చేసి మరీ నన్ను షాక్ చేసింది.. ఆ వచ్చిన వారందరూ మా ఇంటికి రండో,మా ఇంటికి రండో అని నన్ను,మిగిలిన వారిని బ్రతిమాలుతున్నారు.. ఒకరిద్దరి ఇంటికి వెళ్లి టైం చాలా అయ్యిందని వచ్చేసాను...ఇన్ని జాకెట్ ముక్కలు,కుంకుమ భరిణలు , పసుపు ,పూలు,పిండి వంటల పేకెట్లు వేసుకుని ఇంటి కొచ్చాను .... అవన్నీ చూసుకుని తెగ బాధ పడిపోయాను నాలుగు రోజులు.. వాళ్ళల్లా నేను చేయలేక పోయానే అని కాదు... అసలు ఎందుకు అలా చెయ్యాలి వాళ్ళు ...ఒక్క విషయం లో కూడా నన్ను గొప్పగా ఉంచరు కదా అని ... ప్లిచ్

2, ఆగస్టు 2010, సోమవారం

గురువులను పూజింపుము ..పెళ్లి చేసుకోకుము

నాకు చిన్నప్పటి నుండి "చదువురానివాడివని దిగులు చెందకు" అనే పాటన్నా,"చదువుకున్న వాడికంటే మడేలన్న మిన్న"అనే సామెతలన్నా చాలా ఇష్టం.. ఎందుకంటే చదువు కోకపోయినా పర్లేదని అన్నారు కదా ( వాళ్ళు ఏ ఉద్దేశంతో అలా అన్నా నేను మాత్రం అలాగే అనేసుకుంటా) ... నాకు చదువుకోవడమంటే మహా బద్దకం ..అసలునేను డిగ్రీవరకు ఒక్కసారి కూడా పరీక్ష తప్పకుండా పాస్ అయ్యాను అంటే దానికి కారణం మళ్ళీ ఎక్కడ సెప్టెంబర్ కి కట్టాల్సి వస్తుందో అని.. అలాంటి నేను పెళ్ళి చేసుకుంటే చదువు చెప్పే 'టీచర్ని' తప్ప ఇంకెవరిని చేసుకోకూడదు అని కఠోరమైన నిర్ణయానికి వచ్చేసాను ఓ రోజు ..

అలాంటి గొప్ప నిర్ణయం తీసుకోవడానికి కారణం మా లెక్చరర్ 'శేషగిరి రావు'గారు ... నాకు తెలుసు మీరు మనసులో ఏమనుకుంటున్నారో..ఛీ ఛీ కళ్ళుపోతాయి లెంపలేసుకోండి.. ఆయన నాకు తండ్రి లాంటివారు... ఆ సార్ అంటే నాకే కాదు మా క్లాస్ వాళ్ళందరికీ చాలా ఇష్టం అన్నమాట.. పాఠం ఎలాగూ చక్కగా చెప్పేవారు అనుకోండి అంతకంటే మధ్య మధ్య లో ఆయన చెప్పే కబుర్లు నాకు చాలా నచ్చేసేవి..అలాంటి కబుర్లలో ఒకటి ..

ఒకసారి మా సారు ఎక్కడికో నడుచుకుంటూ వెళుతుంటే దారిలో ఆయన ప్రక్కనే ఒక కారు ఆగిందంట.. మా సార్ ప్రక్కకు తప్పుకుని వెళ్ళేంతలో ఆ కార్లో నుండి ఒక అబ్బాయి క్రిందకు దిగి సార్ , రండి సార్ ఎక్కడకు వెళ్ళాలి నేను తీసుకు వెళతాను అన్నాడంట.. మా సార్ కళ్ళ జోడు సవరించుకుని ,ఎవరు బాబు నువ్వు ?అనగానే ,నేను ఫలానా ,ఫలనా టైములో మీ స్టూడెంట్ని సార్..మీలాంటి వారి దయవల్ల ఇప్పుడు కలెక్టర్ని అయ్యాను..ఇదంతా మీ ఆశ్వీర్వాద ఫలితమే అన్నాడంటా ఎంతో గౌరవంగా ..వెంటనే మా సార్ కళ్ళల్లో ఆనంద బాష్పాలు.. నేను సరిగ్గా చెప్పలేకపోతున్నా కాని అంతటి ఉద్వేగ భరితమైన సంఘటనని మా సార్ మా గొప్పగా వర్ణించారు .. పైగా పిల్లలు ప్రయోజకులు అయితే తండ్రి ఎంత ఆనందపడతాడో గురువులు అంతకంటే ఎక్కువ సంతోషిస్తారు ..అని పే..ద్ద డవిలాగు చెప్పేసరికి నేను అలా డ్రీంస్ లోకి వెళ్ళి మా సార్ ప్లేస్లో నన్ను ఊహించుకోడానికి ప్రయత్నించాను కాని ..అబ్బే ..నాకొకటి చదవడం చేతకాదుగాని పక్కోళ్ళకు ఏం చెప్తాంలే ..కాబట్టి ఎంచక్కా ఒక 'సార్ 'ని చేసుకుంటే కనీసం మా ఆయన అయినా ఇలా స్టూడెంట్స్ చేత పొగిడించుకుంటే చూసి ఆనందించేద్దాం అని నిర్ణయించేసుకున్నా....

నా సంగతి తెలిసిందే కదా ..కొన్నాళ్ళు డ్రీంస్ వేసి మర్చిపోయిన ఆ విషయాన్ని.. పెళ్ళయిన కొత్తలో ఒక శుభ ముహూర్తాన మావారు మళ్ళీ గుర్తు చేసారు ..విషయమేమిటంటే మావారు, వారి ఫ్రెండ్ కలసి ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నారు.. అందులో నా పతిదేవులు సాయంత్రాలు క్లాసులు చెప్తారు.. ఆ మాట వినగానే నేను ఒక్కసారిగా ఎగిరి గెంతేసాను ...ఏమండీ మీరు నిజం గా సారా??..పిల్లలకు నిజంగా పాఠాలు చెప్తారా??.. మిమ్మల్ని వాళ్ళు గౌరవిస్తారా?అభిమానిస్తారా? లాంటి ప్రశ్నలు చక చకా అడిగేసాను...రేపు తీసుకు వెళతాను కదా ..నువ్వే చూద్దువు..అన్నట్లు మర్చిపోయాను.. 'సార్ 'పెళ్ళాం అంటే 'సార్' పెళ్ళాం లా ఉండాలి.. అక్కడ ఇంటిలోలాగే గంతులు,గారాలు వేయకూడదు..హుందాగా ఉండాలి అర్ధం అయ్యిందా అన్నారు.. మీరు మరీనూ ఆ మాత్రం నాకు తెలియదా ఏంటి అని ముద్దుగా విసుక్కుని ఆ రాత్రంతా మావారిని బోలెడు అంత ఆరాధనగా చూస్తూ ఉండిపోయాను..

ప్రొద్దున్నే బకెట్టుడు గెంజి లో నానబెట్టి ఉతికి ఇస్త్రీ చేసిన కాటన్ చీరను కట్టుకుని ,మాములు కంటే కొంచెం పెద్ద బొట్టు పెట్టుకుని నీట్ గా రెడీ అయిపోయా..ఇన్స్టిట్యూట్ రాగానే నలుగురు అబ్బాయిలు బిల బిల మంటూ మావారిని చుట్టుముట్టేసారు.. సరిగ్గా అదే అదే నాకు కావలసింది..వాళ్ళు సార్ ,సార్ అంటూ ఈయన వెనుక వెనుకనే తిరుగుతుంటే నేను గంభీరంగా ఆనంద పడిపోతూ వాళ్ళ వెనుకనే నడిచా ... ఈ లోపల అటు వెళుతున్న ఒక అమ్మాయిని పిలిచి నన్ను మేడ మీదకు తీసుకు వెళ్ళమని చెప్పి,ఇప్పుడే వస్తా లోపల కూర్చో అని వెళ్ళిపోయారు ఆయన..

ఒక రెండు గదులలో వరుసగా బోలెడు కంప్యూటర్స్ ,నాలుగైదు గదుల్లో బోలెడు మంది విధ్యార్ధులు తో కళ,కళ లాడుతుంది ..ఆఫీస్ రూం లో కూర్చో బెట్టి ఆ అమ్మాయి (పేరు శ్రీదేవో ..భూదేవో ఏదో చెప్పిందమ్మా మర్చిపోయా)నన్ను ఎంతో ఆరాధనగా చూస్తూ మేడం..మీరు సార్ వైఫా ... అసలు శుభలేఖ కూడా ఇవ్వలేదు చూసారు సార్ అంది కొంచెం కోపంగా.. నాకు బోలెడు ఆనందం వేసేసింది నన్ను" మేడం "అని పిలిచేసరికి.. నేను హుందాగా చిన్న చిరునవ్వు నవ్వి ఊరుకున్నా... అంతే మొదలు పెట్టింది.. మేడం మీరేమేమి సబ్జెక్ట్లు నేర్చుకున్నారు? .. ORACLE కి క్రొత్త మేడం వస్తారు అని చెప్పారు..అది మీరేనా? మేడం మేడం నాకు C++ లో చాలా డవుట్స్ ఉన్నాయి .. నాకు చెప్పరూ... అంటూ ఒకటే గారాలు... నాకు గొంతు తడారిపోయింది ..ఓర్నాయనో ఇది నన్ను చాలా పెద్ద లెవెల్ లో ఊహించుకుంటున్నట్లు ఉంది .. ఇప్పుడుగాని నాకేమి తెలియదు అని తెలిసిందో అసహ్యంగా ఉంటుంది అనేసుకుని మంచి నీళ్ళు ఎక్కడుంటాయి అన్నాను చిన్నగా దగ్గి .. రండి మేడం అని నన్ను ఇంకో రూంలో తీసుకు వెళ్ళింది..అక్కడా వదలదే... ఓరి భగవతుడోయ్ ఎలారా దేవుడా అని అనుకునేంతలో మావారు వచ్చారు ..ఆ అమ్మాయి వెళ్ళిపోయింది.. హమ్మయ్యా.. 'మేడం 'గా పిలిపించుకోవడం కష్టమే సుమా అనుకున్నా ..

మావారు తన అనుచరగణం తో అక్కడున్న ఒక కంప్యూటర్ ఆన్ చేసి ఏంటో, ఏంటో చెప్తున్నారు..మిగిలిన పిల్లలు శ్రద్దగా ఏవో అడుగుతున్నారు.. అప్పటివరకు కంప్యూటర్ గురించి వినడం తప్పా చూడలేదు నేను.. ఈయన ఇక్కడ మౌస్ కదుపుతుంటే అక్కడ పోయింటర్ అలోఒకగా కదులుతుంది.. విండోస్ ని ఓపెన్ చేసి ,క్లోజ్ చేస్తుంటే నాకు అంతా క్రొత్తగా అనిపించింది అప్పట్లో ...పైగా మరొక కంప్యూటర్ లో బ్లాక్ స్క్రీన్ మీద ఏంటో ,ఏంటో లైన్లు పైకి స్క్రోల్ అయిపోతుంటే మా వారు కీ బోర్డ్ టక టకలాడిస్తూ వాళ్ళకు ఏదేదో చెప్పేస్తున్నారు... నాకా సన్నివేశం కన్నుల పండుగగా అనిపించి మురిసిపోతుంటే... వచ్చారు మావారి ఫ్రెండ్ తన క్లాస్ ముగించుకుని ..

వెంటనే మా శ్రీవారు .. ఆ..వచ్చావా ..నీకు చెప్పేను కదా ఈ రోజు తీసుకు వస్తానని ...ఏలా చెప్తావో తెలియదు 3 నెలలలో తను క్లాస్ చెప్పే రేంజ్లో నేర్చేసుకోవాలి అన్నారు నన్ను చూపిస్తూ ...నేనుఅయోమయం గా మావారిని, అతనిని మార్చి మార్చి చూస్తుంటే ..మరీ 3 నెలలలో నేర్చుకోగలదా 6 నెలల కోర్సులో జాయిన్ చేస్తే సరి ఏమంటావ్ అన్నారు ..పాపం ఆయనకు నన్ను చూడగానే అర్ధం అయిపోయి ఉంటుంది మన గురించి..ఏం అక్కరలేదు ఏం క్లాసులుంటే అందులో కూర్చోపెట్టేయి అదే వస్తుంది అని నా చేతికి ఒక పెన్ను ,పుస్తకం ఇచ్చేసి ఒక క్లాస్ లో తోసేసారు.. అయ్యబాబోయ్ 3 నెలల లో ఇవన్నీ నేర్చేసుకోవాలా..కనీసం ఒక్క ముక్క కూడా చెప్పలేదు నాకు ఇంటిదగ్గర..అందులోను డిగ్రీ ఎక్జాంస్ అప్పుడే రాసి వచ్చి ఊపిరి పీల్చుకుంటున్నా.. మళ్ళీ మొదలా !!!అని ఏడుపు మొహం వేసుకుని కూర్చున్నా..

అంతకు ముందే కంప్యూటర్ని చూసానేమో నాకు భయం తో చమటలు పట్టేసాయి..పైగా సార్ పెళ్ళానికి ఏమీ రాదు అని తెలిస్తే ఎంత అవమానం..అసలెందుకు టీచర్ని చేసుకోవాలనుకున్నానా అని తెగ బాధ పడిపోయా.. క్రొత్తగా జాయిన్ అయ్యారా ఇంతకు ముందు చూడలేదు మిమ్మల్ని అంది ప్రక్కన అమ్మాయి.. ఊ అన్నాను..మరి ఇప్పుడు వచ్చారేం ?ఆల్ రెడీ క్లాస్లు మొదలై 10 రోజులైపోయాయి.. చాలా కష్టం గా ఉంది ఏం అర్ధం కావట్లేదు అంది..నువ్వుండవే బాబు అసలే టెన్షన్లో ఉంటే అనుకుని బాగానే చెప్తారా సార్లు ఇక్కడ అన్నాను..పర్లేదు బాగానే చెప్తారు.. అదేంటో ఈ సార్( మావారి ఫ్రెండ్ ) క్లాస్ మొదలు పెడతారా ఒకటే నిద్ర ముంచుకొచ్చేస్తుంది నాకు .. మేడం ( మావారి ఫ్రెండ్ భార్య ) చాలా బాగా చెప్తారు కాని గంట చెప్పల్సిన క్లాస్ గంటన్నర వదలదు..అబ్బా ఒకటే చిరాకు అనుకో అంది..

ఓ.. మరి ఫలానా సారు ఎలా చెప్తారు ?అన్నాను మావారి గురించి అడుగుతూ ...అంత టెన్షన్లో కూడా దిక్కుమాలిన ఆశక్తి వదల్లేదు నన్ను.. ఛీ..ఛీ అతని గురించి అడక్కు..మహ వళ్ళుమంట నాకు... అమ్మాయిలంటే అస్సలు పడదు ..ఆ ..అనకూడదు ..ఊ అనకూడదు ..ప్రక్కకు చూడకూడదు ... ఇక్కడి కేదో మనం అబ్బాయిలకోసమే వచ్చినట్లు తెగ బాధపడిపోతుంటారు.. మహా అనుమానం మనిషి..ఎవర్తి చేసుకుంటుదో కాని అంతే ఇంక అంది... ఓ..ఎందుకలాగా ???అన్నాను .. ఏమో ..అసలు మా అందరికీ డవుటేమిటంటే అంటుండగా మా వారి ఫ్రెండ్ వచ్చేసారు క్లాస్కి ..( ఇప్పటికీ తెలియదు వాళ్ళ డవుటేమిటో.. ప్లిచ్ )

COBOL అని బోర్డ్ పైన రాసి అతను క్లాస్ మొదలుపెట్టారు.. "కోబాల్ అనేది ఒక డైనోసార్ లాంటిది ...మనం కాసింత ఏమరుపాటుగా ఉన్నామో గబుక్కున మింగేస్తుంది...చిన్న తప్పు చేస్తే పేజీలకు పేజీలు రాసిన ప్రోగ్రాం హుళక్కి..." అదొక్కట్టే నాకు అర్ధం అయ్యింది.. ఆ తరువాత ఆయన ఏం చెపుతున్నాడో ,నేను ఏం వింటున్నానో ఒక్క ముక్క అర్ధం అయితే ఒట్టు .. దానికి తోడు నా ప్రక్కనున్నది ఏం మూహుర్తానా అన్నాదో కాని నాకు ఒకటే నిద్ర వచ్చేయడం మొదలైంది..భలవంతంగా కళ్ళు తెరిచి చూస్తున్నా కాని కనురెప్పలు వాలిపోతున్నాయి .. ఎదురుగా బ్లాక్ బోర్డ్ కనబడటం మానేసి అక్కడ చక్కగా ఇస్త్రీ చేసిన దుప్పటి, దిండు తో మంచం కనబడటం మొదలైంది.. మొదటి ఆవలింతను ఆపుకున్నా.. రెండో ఆవలింత గుర్తుంది.. ఆ తరువాత నాకు తెలియదు ఏమైందో... పాపం అప్పటికీ సార్ నా ప్రక్కనే నించుని గుర్రం లా 3 సార్లు సకిలించారట ..అబ్బే మనకు తెలిస్తే కదా...

ఆ రోజు రాత్రి మావారు ఈ రోజు ఏం నేర్చుకున్నావ్ అనగానే మాటమారుస్తూ ..ఏమండీ మీ గురించి ఒక అమ్మాయి ఇలా అంది అని చెప్పాను..ఎవరా అన్నాది ??అన్నారు కోపంగా .. అమ్మో! పేరు చెప్పామంటే అయిపోతుంది ఆ పిల్ల అనుకుని నాకు తెలియదు పేరు ..అయినా మరీ అంత ఇది గా తిట్టి ఎందుకు వాళ్ళను బాధ పెడతారు అన్నాను..తిట్టాలా కొట్టాలా.. మొదట్లో నేనూ బాగానే ఉండేవాడిని.. ఒక అమ్మాయి రోజు ఫోన్ చేసి మరీ విసిగించేది ప్రేమిస్తున్నా..పెళ్ళి చేసుకో ..నువ్వు లేక బ్రతక లేను ..నా పేరున 2 లక్షలు బేంక్ బేలెన్స్ ఉంది అంటూ.. అన్నారు..

నాకలాంటి స్టోరీలు మాంచి ఇంట్రెస్ట్ ఏమో ..మరి అంత ప్రేమిస్తే పాపం చేసుకోలేదేం అన్నాను..మనసులో ఎక్కడో ఆశ.. అయ్యబాబోయ్ నిన్ను మిస్ అయిపోయే వాడిని దాన్ని చేసుకుంటే..అదెక్కడ ,నువ్వెక్కడ అంటారేమో అని.. హూం..నా భ్రమ గాని ఈ మనిషి అంటారా ..ఛీ..ఛీ సార్ ని అయి ఉండి స్టూడెంట్ని లవ్ చేయడమా??..ఇంకేమన్నా ఉందా?..ఇంకే ఆడపిల్ల తల్లిదండ్రులైనా మా దగ్గర జాయిన్ చేస్తారా? అన్నారు ... లేకపోతే చేసుకునేవారన్న మాట అన్నాను ...ఏ మాటకామాట చెప్పుకోవాలి ఆ అమ్మాయి బాగుంటుంది అన్నారు ఉడికిస్తూ ..ఇంతకీ ఏం చెప్పి వదిలించుకున్నారు అన్నాను కోపం కనబడనీయకుండా ...

నాదంతా పాము కరవా కూడదు ..కర్ర ఇరగా కూడదు టైపు.. రోజూ క్లాస్ కి రాగానే ఆ అమ్మాయినే లేపి కష్టమైన ప్రశ్నలన్నీ అడిగేవాడిని... అదెలాగో చెప్పలేదని తెలుసు ...చెడామడా తిట్టి పడేసేవాడిని.. అందులో అబ్బాయిల ఎదురుగా తిట్టేవాడినేమో పాపం నాలుగు రోజులకి సెట్ అయిపోయింది ... అప్పటి నుండి ముందు జాగ్రత్తగా అమ్మాయిలు కాసింత మాట్లాడుతున్నారో వాళ్ళకు కూడా ఇదే పద్దతి.. అన్నారు.. ఇది మరీ బాగుంది ఎవరో ఒకరు అలా చేసారని అందరినీ ఒక గాటన కట్టేస్తారా అని పైకి అనేసుకున్నా గాని హమ్మయ్యా మా ఆయన రాముడు మంచిబాలుడేనన్నమాట అనేసుకుని తెగ ముచ్చటపడిపోయా..(అదిగో అదిగో అలా నవ్వకూడదు కొన్ని చోట్ల నమ్మాలి మనం )

సరే ఆ రోజంటే అలా మాటదాటేసాగాని రోజూ ఆ క్లాసులను ఎలా తప్పించుకోవాలో అర్ధం అయ్యేది కాదు..అందులోనూ ఆ నిద్రను ఆపుకోవడం అసలయ్యేది కాదు...టాం అండ్ జెర్రీలో జెర్రీలా కనురెప్పల మద్యలో అగ్గిపుల్లలు పెట్టేసుకుంటే బాగుంటుంది అనిపించేసేది...అయినా పద్దతి గా అ ఆ ఇ ఈ లతో మొదలు పెట్టి గుణింతాలు నేర్పాలి గాని ఇలా ఏకంగా వ్యాక్యాలు మొదలెట్టేస్తాను అంటే ఎలాగా ? దానికి తోడు వారానికి ఒకమారు పెట్టే టెస్ట్ లు... ఇంకేమన్నా ఉందా అందులో సున్నా వస్తే??? చిన్నపుడు ఎప్పుడూ స్కూల్ ఎగ్గొట్టడానికి వేషాలు వెయ్యలేదు కాని మా ఆయన పుణ్యమా అని అవీ మొదలుపెట్టేసాను..

రేపు టెస్ట్ ఉంది అనగానే రాత్రి నుండే నాకు జ్వరం వచ్చేసింది ...కళ్ళు తిరిగిపోతున్నాయి..అమ్మో బాబోయ్ అని ఒకటే హడావుడి చేసేసి, ప్రొద్దున్నే మా ఆయన వెళ్ళేవరకూ ముసుగు తీసేదాన్ని కాదు..అలా కొన్ని సార్లు చేసాకా ఒక శుభ ముహుర్తాన మావారి ఫ్రెండ్ నా ఎదురుగానే రేపు టెస్ట్ ఉంది కదా ఖచ్చితంగా రేపు మీ ఆవిడకు జ్వరం వస్తుంది అని జోకేసి, పనిలో పనిగా నా నిద్ర గురించి కూడా చెప్పేసి చక్కా వెళ్ళిపోయారు ... అక్కడ మావారు పైకి పెద్దగా పట్టించుకోనట్టుకనిపించేసరికి ,హమ్మయ్యా ఈయనకు అర్ధం అయి ఉండదులే అని ఊపిరి పీల్చుకున్నాను ...

ఆ రాత్రి నిద్ర పోయేముందు ఏదీ నీ నోట్స్ తీసుకురా అన్నారు... ఓరి దేవుడోయ్ అనుకుని నాకు నిద్ర వస్తుందండీ రేపు చూపిస్తా అని ఆవళింత తీసాను.. ముందెళ్ళి నోట్స్చూపించూ అన్నారు సీరియస్సుగా ..ఇంక మన పప్పులు ఉడకవని ఈసురోమంటు తీసుకొచ్చాను.. ఆయన బుక్ అటు ఇటు త్రిప్పి ఏంటీ ఏమీ రాయడం లేదా అన్నారు నా వైపు చూస్తూ... అంటే ..అదీ..మరీ అని నానుస్తుంటే ...ఏంటీ క్లాసులో నిద్రపోతున్నావంటా అన్నారు.. ఉహుహు ఒక్కసారే ...అంటే నిద్రపోలేదు ఆవళించేను అన్నాను... ఇలా కాదుగాని అసలు ఏం నేర్చుకున్నావ్ ఈ నెలలో చెప్పు అన్నారు... COBOL ,Dbase ,BASIC , C++ నేను వెళ్ళే క్లాసుల పేర్లు చెప్పేసా .. నాకు వాటి పేర్లు తప్ప ఇంకేం తెలియదు అసలు...

ఆహా..అయితే కోబాల్ గురించి చెప్పు అన్నారు .. అలా అడిగితే ఏం చెప్పేది నా మొహం ...ప్రతిదానికి తెల్ల మొహం వేస్తే తంతారని గుర్తు తెచ్చుకోగా.. కోగా ..ఆయన ఫ్రెండ్ చెప్పిన మొదటి ముక్క గుర్తువచ్చింది ,,కోబాల్ ఒక డైనోసార్లాంటిది ...ఏమరు పాటుగా ఉంటే మింగేస్తుంది అన్నాను... చెప్తున్నపుడు నాకు భయం తో నవ్వు కూడా వస్తుంది కాని మా 68 KGs గోల్డ్ కి అబ్బే ... మొత్తానికి ఇదన్న మాటా నువ్వు నేర్చుకుంటుంది..కోబాల్ అంటే డైనోసారు,డ్రాగను కాదు ఒక లాంగ్వేజ్ అన్నారు ..ఏ దేశపు లాంగ్వేజ్ అండి అన్నాను మళ్ళీ వినడం లేదు అనుకుంటారేమో ,ఎదో ఒకటి అనేస్తే పోలా అనుకుని..మా ఆయన నావైపు ఒక్క చూపు చూసారు ..అంటే నా ఉద్దేశం ఏ రాష్ట్రపు లాంగ్వేజ్ అని వెంటనే సరిచేసుకున్నా భయంగా...

అసలేమన్నా వింటున్నావా క్లాస్ లో .. బుద్ది ఉందా.. ఆ బుక్కు ,పెన్ ఇలా ఇవ్వు అని కూర్చో పెట్టి దీన్ని CPU అంటారు..దాన్ని కీబోర్డ్ అంటారు అని బొమ్మలు గీసేసి RAM అంటే ఇది ..ప్రోగ్రాం అంటే అది ..కాంప్యూటర్లో ఫలానా ఫలానా వాటిని లాంగ్వేజ్ లు అంటారు.. వీటిని ఆపరేటింగ్ సిస్టేం అంటారు అని రెండు గంటలు ఏక బిగిన క్లాస్ చెప్పేసారు .. ఆ క్షణంలో మా చెప్పుల స్టాండ్ దగ్గరకు పరుగు,పరుగున వెళ్ళి బాగా పాత చెప్పు వెతుక్కుని టపా, టపా మని బుద్దొచ్చేలా కొట్టుకోవాలనిపించింది.. టీచర్ ని చేసుకోవాలని కలలు కన్నందుకు..

అలా రాత్రిళ్ళు ఇంట్లో ,పగలు ఇన్స్టిట్యూట్లో పాఠాలు నేర్చుకుని ,నేర్చుకుని నిద్రలో కూడా అవే కలలు వచ్చేవి..ఈ లోపల మావారి క్లాసులు స్టార్ట్ అయ్యాయి.. UNIX,Windows చెప్పేవారు తను ...ముందే వార్నింగ్.. నావైపు చూసి క్లాస్లో నవ్వావో నాకు నవ్వు వస్తుంది..అలాంటి తిక్క వేషాలు వేయకు అని... నాకేంటో వద్దన్న పనే చేయాలనిపిస్తుంది.. పొరపాటున నవ్వానో ఎక్కడ నన్ను లేపి ఏం ప్రశ్న అడిగేస్తారో అని భయం..ఆయన గారి ప్లాష్ బ్యాక్ విన్నాకా ఆ ధైర్యం చేయలేకపోయా .. కాని నవ్వు ఆపుకుందామంటే తెరలు తెరలుగా వచ్చేస్తుందే..ఇక ఇలా కాదని ఆ రాత్రి ఏ వార్తల్లోనో,సీరియల్స్ లోనో జరిగిన నేరాన్నో..ఘోరాన్నో బాగా గుర్తు తెచ్చుకుని బిగుసుకుపోయి కూర్చునేదాన్ని...

దేవుడా పొరపాటున అనుకున్న విషయాన్ని ఇలా నిజం చేసేసి ఆడుకుంటావా జగన్నాటక సూత్రదారి అని ఊరికే అన్నారా నిన్ను..ఎలాగన్నా గట్టెక్కించవా అని కోరుకుంటుండాగానే మళ్ళీ టెస్ట్.. ఈ సారి నిజంగా జ్వరం వచ్చినా వదిలే ప్రశక్తి లేదు అని ముందు గానే తెలుసు కాబట్టి మా ఆయన్ని మెల్లగా కాకా పట్టడం మొదలుపెట్టా ..ఏమండీ.. మరీ.. ఏం ప్రశ్నలు ఇస్తారండి కొంచెం చెప్పరా అని ఎన్ని హొయలు ఒలికించినా నోరు మూసుకుని చదువు..అర్ధం కాకపోతే అడుగు వేషాలు వెయ్యకు అని ముద్దుగా చెప్పేవారేగాని పొరపాటున ప్రశ్నా పత్రం లీక్ చేసేవారు కాదు.. పోనీ చదివేద్దామా అంటే వందల కమాండ్లు .. ఎన్నని గుర్తు పెట్టుకోవాలి..

చివరకు ఎలాగోలా చదివి,నాకు రానివన్నీ లిస్ట్ రాసుకుని ఒక అర్ధరాత్రి మా ఆయన గాఢ నిద్రలో ఉండగా కచ్చ కొద్దీ అప్పుడే నిద్ర లేపి ,రానివి అడగమన్నారుగా చెప్పండి అన్నాను లైటు వేసి బుద్దిగా కూర్చుని..ఇప్పుడా అన్నారు మత్తుగా సగం కళ్ళు తెరిచి.. ఇప్పుడే ..ఇప్పుడంటే ఇప్పుడే ..మళ్ళీ రేపే టెస్ట్ అన్నాను పంతంగా... ప్రొద్దున్న చెప్తా అన్నారు అటు తిరిగి.. ఆహా..నిద్ర మీకేనా వచ్చేది..ఏం పడతాయో చెప్పమంటే పోజు కొట్టారుగా.. నాకు ప్రొద్దున కుదరదు ఇప్పుడే చెప్పాలి అని భీష్మించ్కుని కూర్చున్నా..ఒక రెండు నిమిషాలు పేపర్ చూసి ఊ ..ఇవి చెప్పడం ఇప్పుడు కుదరదు కాని రేపు ఇవి ఇవ్వనులే సరేనా.. ఇంక పడుకో అన్నారు ..అలా రండి దారికి అని అనేసుకుని హమ్మయ్యా సగం చదివే గోల వదిలింది అని హాయిగా పడుకుండిపోయా ..

అక్కడితో ఊరుకోకుండా ఆ మరుసటి సాయంత్రం ఎంచక్కా ప్రక్కన ఉన్నదానికి కూడా ఫలానా, ఫలానా పడవులే అని చెప్పి దాన్ని కూడా చదవనివ్వలేదు.... మా ఆయన సీరియస్సుగా ..పేపర్ ముందుగా తయారు చేయడానికి టైం సరిపోలేదు.. నేను చెప్తాను నోట్ చేసుకోండి అని మొదలు పెట్టారు.. సగం పేపర్ రాసేసరికి నాకు కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసేయి..నేను ఏమైయితే నాకు రావు అన్నానో అచ్చం గా అవే చెప్పడం మొదలుపెట్టారు.. నేను మిర్రి మిర్రి మా ఆయన వైపు చూస్తుంటే, చిన్న గా నవ్వుతూ మొహం తిప్పేసుకున్నారు..పేపర్ ,పెన్ నేల కేసి కొట్టి పోవోయ్ ఏం చేసుకుంటావో చేసుకో నేను చదవను అని అరవాలన్నంత కసి వచ్చింది..కాని బిక్క మొహం వేసుకుని ఎలాగో టెస్ట్ రాసి బయటకు వచ్చాను.. ఆఫీస్ రూంలో రాగానే సారీరా ..మరీ ..రాత్రి చూపిన పేపర్లో ప్రశ్నలే గుర్తువచ్చాయి టైముకి ..ఇంతకూ ఎలా రాసావ్ అన్నారు నవ్వుతూ..నాతో మాట్లాడకండి..నేనసలు మాట్లాడను అని అక్కడినుండి లేచి లాబ్ లో కూర్చున్నా ...

అప్పుడొచ్చాడు ఫణి..మావారి ప్రియతమ శిష్యుడు ...ఎందుకోమరి తెగ ఇష్టం ఆయన అంటే..ఒక్కమాట అననివ్వడు నన్ను కూడా.. మా ఇంటికి కూడా తరుచూ రావడం వల్ల కాసింత బాగానే పరిచయం.. ఏంటి మేడం ఇక్కడ కూర్చున్నారు? ఎక్జాం బాగా రాసారా ?అన్నాడు .. అసలు ఆ విషయం అడగకు ఫణి.. మీ సార్ అంతా మోసం..అబద్ధాల కోరు.. అని నాకు జరిగిన అన్యాయం అంతా చెప్పాను..తను హి హి హి అని కాసేపు నవ్వి నిజమేకదండి మరి.. నిద్రలో లేపి మరీ చదివిస్తే అలాగే అవుతుంది అని కాసేపు వెనకేసుకొచ్చి ..పోనీలేండి మీ పేపర్లు నేను ,నవీన్ దిద్దుతాం..నేను మార్కులు వేసేస్తాలే అన్నాడు..

నాకు బోలెడు ఆనందం వేసేసి ..నిజంగానా ఫణి ??అని కసేపు ఆనంద పడిపోయాగాని.. అమ్మో! మా ఆయన ఖచ్చితం గా నా పేపర్ చూస్తారు ..ఆన్సర్లు లేకుండా మార్కులు వేస్తే తెలిసిపోదూ??..ఆయనకు తెలియదేంటి నాకెన్ని మార్కులు వస్తాయో అన్నాను దిగులుగా ..పోనీ నేను రాసేస్తా అన్నాడు.. అప్పటికి గాని బుద్దిరాదు రైటింగ్ తేడా వస్తుంది అన్నాను నిట్టూరుస్తూ..మరైతే ఎలా అన్నాడు.. ఆ పేపర్ ఏదో నాకు తెచ్చి ఇచ్చేస్తే నేనే రాసేస్తా అన్నాను మెల్లిగా..అన్ని నా నోటితోనే చెప్పించాలా అని తిట్టుకుంటూ.. పాపం ఏమనకుండా పేపరు తెచ్చి ఇచ్చేసాడు.. కాకపోతే నా దురదృష్టం ,, అసలా పేపర్లే దిద్దలేదు ఎందుకో..లేకపోతేనా క్లాస్ ఫస్ట్ వచ్చేసేదాన్ని..ప్లిచ్ ..

ఆ తరువాత ఫణి నే నాగోల పడలేక ఒక విషయం చెప్పాడు..అదికాదు మేడం ..మీరు ఇలా తలా ,తోకా లేని క్లాసులు ఎన్ని విన్నా అర్ధం కాదు.. కాబట్టి ముందుగా పైంట్ బ్రష్ నేర్చుకోండి ..అందులో File అంటే ఏంటో save,cut,copy,paste ఇలా అన్నీ తెలుస్తాయి .. అలా మీకే ఒక అవగాహన వస్తుంది ఆ తరువాతా మీరే నేర్చుకోగలరు అని సలహా పడేసాడు.. నీ కడుపు చల్లగా మంచి మాట చెప్పావురా బాబు అని మా వారి మీద యుద్దం చేసి అదే పట్టున చాలా ..చాలా సబ్జెక్ట్లు నేర్చేసుకున్నా..( మర్చిపోయా కూడా ..ఇప్పుడు ఎవరూ డవుట్లు అడక్కండి..ముందు జాగ్రత్తగా చెప్పేస్తున్నా..) ఇప్పటికీ మా ఆయన్ని తిడుతునే ఉంటా మీతో పెట్టుకుంటే ఇప్పటికీ కంప్యూటర్ గురించి ఏమీ తెలిసేది కాదని :)

కాబట్టి పై కధలో తెలుసుకున్న నీతి ఏమి?? 2 వ్యాక్యములకు మించకుండా సమాధానం చెప్పండి (గమనిక: నాకు అనుకూలంగా చెప్పక పోయారో వ్యాఖ్య ప్రచురించబడదు హి..హి హి )