12, మే 2012, శనివారం

సంతూర్ సంతూర్


ఎక్క్యూజ్ మీ..... ఏం కాలేజ్ చదువుతున్నారు ....
కాలేజ్ నేనా ??????
మమ్మీ!!!!!!!! ...
పసుపు చందనా గుణాల కలయికా సంతూర్
చర్మం మిల మిల మెరిసే ఇక సంతూర్ సంతూర్
.....................................

యాడ్ చూడగానే ఘాడంగా నిట్టూర్చాను ఆ రోజు  ప్రొద్దున్న జరిగిన సంఘటన గుర్తొచ్చి .....
అచ్చం ఇలాగే ఆ యాడ్లో అమ్మాయిలా  ఒక్కదాన్నే నడుచుకుంటూ వెళుతుంటే ఒక అమ్మాయి పరిగెత్తుకుని వచ్చి నా ఎదురుగా నించుని ఆయాసం తీర్చుకుంటూ "ఎక్స్క్యూజ్ మీ!!! ..ఏం కాలేజ్ చదువుతున్నారు" అంది.....చేతిలో ఏదో అడ్డ్రెస్ పుచ్చుకుని ....
"కాలేజ్ నేనా !!! " రెండో డైలాగ్ ఫర్ఫెక్ట్ గా చెప్పాను ఏడుపు మొహం వేసుకుని...
ఆ అమ్మాయికి డవుట్ వచ్చి మూడో డైలాగ్ చెప్పేవాళ్ల  కోసం చుట్టూ చూసి నా కాళ్ళ వైపు చూసింది అనుమానంగా...
గొప్ప అవమానం అయిపోయింది.."నేను తొమ్మిదో తరగతి చదువుతున్నా "కోపంగా అనేసి మా స్కూల్లోకి పరిగెత్తాను..
ఆ అమ్మాయి టైడ్ యాడ్లో మురికి  చొక్కా అబ్బాయి తెల్లషర్ట్ అబ్బాయిని చూసి అవాక్కయిపోయినట్లు  అవాక్కయిపోయింది...

రెండో సంఘటన.....

"బుజ్జీ బుజ్జీ బుజ్జీ ...నీ వళ్ళంతా గజ్జి ...."మా పెద్ద తమ్ముడు ఆరువందల అరవయ్యోసారి ఏడిపించడం మొదలెట్టాడు..
నేను చెవులు గట్టిగా మూసుకుని ..."ఆ... ఏంటో ...నాకేం వినిపించడం లేదు ...నువ్వు ఏదో పెదాలు కదుపుతున్నావు అంతే..నా కసలు వినిపించనే లేదు.." పైకి బింకంగా అనేసి మా అమ్మ దగ్గరకు పరిగెత్తుకు వెళ్లి...
రెండుకాళ్ళు నేల కేసి టప, టపా కొడుతూ .."అన్ని ముద్దు పేర్లు ఉండగా ఎందుకమ్మా నాకు బుజ్జీ అని పెట్టావు..పెద్దమ్మ చూడు ఎంచక్కా పెద్దక్కను చిన్నూ అంటుంది.. దీన్నేమో శారు అంటారు ...దాన్ని బేబి అంటారు.. నన్నే ఎందుకమ్మా బుజ్జీ,బజ్జీ అని సుత్తి పేరుతో పిలుస్తారూ.. అని  ఏడుస్తూ అడిగాను..
"ఎహే ఆపు..బుజ్జిగా  ఉండేదానివి కాబట్టి బుజ్జీ అనేవాళ్ళం.. వాళ్ళు నీకులా లేరుకాబట్టి అనలేదు " మా అమ్మ సింపుల్గా కొట్టిపడేసింది..
"అది బుజ్జిగా కాదులే వదినా బండదానిలా ఉండేది ... ఎత్తుకోలేక చచ్చేవాళ్ళం ....కదా పెద్దోదినా..  మా ఆఖరు చిన్నాన్న పెద్దమ్మను రంగంలో దింపాడు..(కావాలనే అన్నాడు నాకు తెలుసు )
"మరే...పుట్టినప్పుడు ఎంచక్కా ౩ కేజీల బరువుతో ఎంత  బొద్దుగా ఉండేదని .... మోయలేక పోయేవాళ్ళం ..పెద్దమ్మ తూకాలు, కొలతలతో సహా ఆధారాలు ఇచ్చేసింది..
"అచ్చే ..మూడు కేజీలు కాదక్కా మూడున్నర అనుకుంటా " .... మా అమ్మను చూసినప్పుడల్లా అమయాకత్వానికి  కేరాఫ్ అడ్రెస్స్ మా ఇల్లే అనుకుంటాను ...

ముచ్చటగా మూడో సంఘటన ......

"నా పెద్ద మనవరాలిని ( మా అక్క అన్నమాట) ఈ ఇంటి కోడలిని చేసుకుంటా అని నా కూతురుకి మాటిచ్చాను.. అది కాదని ఇంకేవరినయినా తీసుకొచ్చి నా కొడుక్కి ( మా చిన్న మావయ్య) చేసారో ....ఖబడ్దార్ ...." మా అమ్మమ్మ హోల్సేల్గా అందరికి కలిపి వార్నింగ్ ఇచ్చింది .....

"మేనరికాలు మంచివి కావంటా ... పిల్లలు అంగ వైకల్యంతో పుడతారంట ... రేపు జరగరానిది ఏదైనా జరిగితే అప్పుడు ఏడ్చి లాభం ఉండదు.. వాడికి బయట సంబంధమే చేస్తాను ఎవరు అడ్డం వస్తారో చూస్తాను .."మా తాతయ్య మా అమ్మమ్మకు మాత్రమే వార్నింగ్ ఇచ్చారు..

"అమ్మా ...నేను దాన్ని చిన్నప్పటి నుండి ఎత్తుకుని తిప్పాను..చిన్న పిల్ల ..దానికి నాకు పదేళ్ళు తేడా ఉంది ....పెళ్లయినా మానేస్తాను కాని దాన్ని  చేసుకోనంతే "మా మావయ్య బెదిరించాడు..

"నువ్వు నోరు ముయ్యి, దాన్ని నువ్వు చూసి నాలుగేళ్లయింది .... ఇప్పుడెంత చక్కగా ఉందో తెలుసా ....ఆడపిల్ల ఎంతలో ఎదిగిపోవాలి ... నా మాట కాదని వేరే ఎవరినైనా చేసుకున్నావో నా ఫోటో మాత్రమే చూస్తావు తర్వాతా "  ..

అంతే ఆ తరువాత పే..ద్ద...ఆ  పే..ద్ద ..ఆ  గొడవలు అయిపోయి  మా అమ్మమ్మ ఊరికి ,మాకు దాదాపు ఆరు సంవత్సరాలు రాకపోకలు లేకుండా అయిపోయాయి... చివరాఖరికి మా అమ్మమ్మను బలవంతంగా ఒప్పించేసి మా మావయ్యకు వేరే అమ్మాయితో  పెళ్లి కుదిరాక, పది రోజులు ముందుగా నన్ను పంపించారు పెళ్ళికి  ...
 
అదేంటో అమ్మమ్మ ఇల్లంటే ఆడపిల్లలకు గొప్ప అలుసు కదా.. బస్సు దిగగానే రోడ్ మీదే మొదలు పెట్టాను నా చిట్టా పద్దు కోరికలు.."మావయ్య నాకు విసిఆర్ కావాలి .. ముఖ్యంగా  అమీర్ ఖాన్   ఖయామత్ సే ఖయామతక్   సినిమా  తెప్పించాలి... ఇంకా 1942   ఏ  లవ్ స్టోరి కావాలి  ....ఇంకా  "..

"ఇంక  నోరు మూస్తావా ... ఇది పల్లెటూరు ..ఇక్కడ హిందీ సినిమాలు ఎవరు చూస్తారు ???...ఆడపిల్లన్నాకా సుబ్బరంగా పెద్ద వాళ్లకు హెల్ప్ చెయ్యాలి ..ఇలాంటి పిచ్చి సినిమాలు చూడకూడదు.." మావయ్య క్లాస్ పీకాడు...

"నాకు సినిమాలు చూపించవా!!!! ..నేను మా ఊరు వెళ్ళిపోతాను పో..నా బ్యాగ్ నాకిచ్చేసే..అమ్మమ్మ కి చెప్తాను నీ పని "...అని రోడ్ మీద చిందులు తోక్కేస్తుంటే .... అల్లం మామ్మ చూసింది దూరం నుంచి..(ఆవిడ పేరేమిటో తెలియదు అల్లం మామ్మ అంటారు)..

"ఎవర్రా చిన్నోడా నీతో ఉన్న అమ్మాయి " ఘాట్టిగా పిలిచ్చింది ....

"చూసేసిన్దిరా బాబు "విసుక్కుంటూ ...మా అక్క కూతురు మామ్మా అన్నాడు.. "ఎవరూ మన పెద్దమ్మడు కూతురే... దీన్నేనా చిన్నపిల్ల అని చేసుకోనన్నావు "నన్ను దగ్గరకు తీసుకుని అడిగింది ఆరాగా ..నేను ఎంచక్కా జామకాయ తింటూ పక్కన కూర్చున్నాను..

 మరి ఎక్కడి నుండి వచ్చిందో మా అమ్మమ్మ .... "ఇదికాదు పిన్ని దీనికంటే పెద్దది.. మహా లక్ష్మిలా ఉంటుంది ..వెధవ సచ్చినోడికి చిన్నపిల్లలా కనబడిందట "..మా అమ్మమ్మ మొటికలు విరిచేసింది..

 "ఇది చిన్నపిల్లేంటి ..బంగారు బొమ్మలా ఉంది ..చక్కగా చీరకట్టి రూపయకాసంత బొట్టు పెడితే  ఇద్దరు పిల్లల తల్లిలా ఉంటుంది ... నీకేం పోయేకాలంరా అని కయ్ మంది అల్లం మామ్మ ..

వాళ్ళ పొగడ్తలకు సంతోషించాలో ,లేక వేరే కోణంలో బాధపడాలో తేల్చుకోక మునుపే ఎంచక్కా నాలుగు వీధుల్లో ఆడవాళ్ళు  పోగయిపోయి (పల్లెటూరు కదా...ఒక ఇంటి సమస్య ఊరంతటికి  కావాలి  ) మా మావయ్యని, పనిలో పని మా తాతయ్యని బోలెడు తిట్లు, శాపనార్ధాలు పెట్టేసి మా అమ్మమ్మని ఓదార్చి వెళ్ళిపోయారు..(మా అల్లం మామ్మ మాత్రం  ఆ తరువాత దాదాపు  అయిదేళ్ళు మా మావయ్యను ఏకి, పీకి పందిరేసిందట  ..ఈ ముక్క మా చిన్నత్త వచ్చినప్పుడల్లా చెప్పి నవ్వుతుంది)

ఆ దెబ్బతో మా మావయ్య నన్ను ఇంటికి తీసుకువెళ్ళి .."నిన్నేవడే  పది రోజులు ముందు రమ్మనాడు..నీకు అమీర్ ఖాన్ ,సల్మాన్ ఖాన్  ,షారుఖ్ ఖాన్  ఏ ఖాన్ కావాలంటే ఆ సిన్మాలు ..మా వూర్లో దొరక్కపోతే పక్కూరు నుండి అయినా  తెచ్చి పడేస్తాను  కాని నువ్వు గుమ్మం దాటి బయటకురాకు తల్లో "అని దీనంగా వేడుకున్నాడు..

అక్కడితో ఊరుకున్నాడా దొంగ మొహం ....ఎంచక్కా పెళ్ళిలో కట్టుకుందామని  నేను ముచ్చట పడి  కొనుక్కున్న పరికిణి ,వోణి వేయనివ్వకుండా "అక్కా దీన్ని చూసి ఇదే పెద్దదనుకుని సంబంధాలు వచ్చేస్తున్నాయి..తర్వాత   నీఇష్టం" అని మా అమ్మ మనసు చెడగోట్టేసాడు... ఆ దెబ్బతో నేను అరిచి గీ పెట్టినా మా అక్క పెళ్లి అయ్యేంత వరకూ మహా తల్లి నన్ను పరికిణి ,వోణి వెయ్యనివ్వలేదు.. ఆ తరువాత నేను కొత్తవి కొనుక్కునేలోపే నా పెళ్లి చేసేసారు ..అలా నా జీవితంలో పరికిణి ,వోణి అనేది ఒక కల క్రింద మిగిలిపోయింది.

ఇలా ఉండగా మరి మా అమ్మకు ఎవరు ఏం చెప్పారో మరి పాపం..ఒక రోజు నా దగ్గరకొచ్చి బుజ్జీ! మరేమో ఈ రోజు నుండి రాత్రిళ్ళు నువ్వు చపాతి తిను అంది ...నేనసలు మూడు పూటలా ఆరు సార్లు అన్నం పెట్టినా తింటాను గానీ ఒక పూట టిఫిన్ తినమంటే ఏడుస్తా .." ఏంటి చపాతీయా..ఛీ ఛీ నావల్లకాదు "అని తేల్చి  చెప్పేసాను  ... అలాకాదుగాని  రాత్రిళ్ళు చపాతి తింటే చాలా మంచిదంట తినాల్సిందే అని ఆర్డరేసి వెళ్ళింది.. సరే అని చపాతి ప్లేట్ ముందు పెట్టుకోగానే మా అక్క ఎదురుగా ఆవకాయ అన్నం నెయ్యి వేసుకుని ఎంచక్కా తింటుంటే ఆగలేక ఆ పళ్ళెం పక్కన పడేసి మామూలుగానే అన్నం తినేసా..అమ్మొచ్చి ప్లేట్ చూసి "అదేంటి చపాతి తినలేదా "అంది ... "ఉహు నాకొద్దు ఆ ఆరోగ్యమేదో నువ్వే తెచ్చుకో ..అయినా వాళ్ళెవరికీ పెట్టకుండా నాకే పెడతావేంటి..వాళ్ళకు అక్కరలేదా ఆరోగ్యం  "విసుగ్గా అన్నా.."ఒసే గాడిదా..నువ్వు ఇలా అన్నం తింటే వళ్ళు తగ్గదు.. ఎవడూ నిన్ను పెళ్లి చేసుకోడు" కోపంగా అనేసి వెళ్ళిపోయింది...

అంతే మేటర్ క్లియర్గా అర్ధం అయిపోయింది.. ఆ షాక్ కి ముందు ఏడుపోచ్చ్సింది, తరువాత కోపం వచ్చింది ,ఆ తరువాత నోట్లోంచి పాట వచ్చింది..దేవుడి రూంలోకి వెళ్లి నాకు తెలిసిన దేవుడి పాటలన్నీ పాడేసుకుని ...హే భగవాన్ ..నేనేం తప్పు చేసాను... తిండి కూడా ఏం తినను కదా మరెందుకు ఇలా నన్ను లావుగా చేసేస్తున్నావు..నాకసలే ఎక్సర్ సైజులు,డైటింగు లు  గట్రాలు పడవు..నువ్వేం చేస్తావో నాకేం తెలియదు పెళ్లి అయ్యేలోపు నేను సన్నంగా మెరుపు తీగలా అయిపోవాలంతే అని కోరేసుకున్నా ...(దేవుడికి నేనంటే చాలా ఇష్టం .... నిజంగా నిజంగా నేను ఏమి చెయ్యకుండానే పెళ్లి టైంకి దాదాపు 12 కేజీలు తగ్గిపోయా ..ఆఖరికి పిల్లలు పుట్టినా సరే యాబై కేజీలు  ఇప్పటివరకు దాటలేదు ...ఇక మీదట విషయం తెలియదనుకోండి ముందు జాగ్రత్తగా చెప్పేస్తున్నా :D)

ఫ్లాష్ బ్యాకులు అయిపోయాయి..అలా నా బండతనం  వల్ల ..ఛీ ఛీ...కాదు కాదు.. నా బొద్దుతనం వల్ల ఎన్ని బాధలు పడ్డానో ఒకటా రెండా ఎన్నని చెప్పను.. ఆ దెబ్బతో పైన చెప్పిన సంతూర్ యాడ్ నా మనసుమీద తీవ్ర ప్రభావం చూపేసింది.. నేను కూడా పెళ్లయినా సరే,పిల్లలు పుట్టినాసరే...స్లిమ్ముగా ,చక్కగా మెరుపు తీగలా ఉంటే,ఆ యాడ్ లోలా నన్ను కూడా ఏం కాలేజ్ అనడిగితే ,నా కూతురు మమ్మీ అని పరిగేట్టుకొస్తే  ఎంత బాగుంటుందో కదా అని తెగ కలలు కనేసేదాన్ని..అసలందుకే నాకు ముందు అమ్మాయే పుట్టాలని కోరుకున్నాను కూడా :P
అలా పెళ్లికాకుండానే ఒక చిన్నపిల్లకి తల్లిగా  మారాకా  ఎలా ఉండాలో  అని తీవ్రంగా ఆలోచిస్తుండగానే పెళ్ళయిపోయింది..నేను సింగపూర్ వెళ్ళిపోయాను...పిల్లలు పుట్టేసారు  ..వాళ్లకు నెస్టంలు  తినిపించాడాలు,డైపర్లు మార్చడంలు ,స్కూళ్ళు,చదువులు, చట్టుబండలు   వరసపెట్టేసాయి ...ఇంకేంటి నేను ఆ గోలలో పడి యాడ్ సంగతి మర్చిపోయాను ..

ఆ తరువాత ఇన్నాళ్ళకు మొన్న టివి పెట్టి చూస్తుంటే మహేష్ బాబు  సంతూర్ యాడ్లో వచ్చి "దేవుడు వరమిచ్చినా  పూజారి పడనివ్వలేదని..నువ్వు సన్నంగా అయినా ,మొదట నీకు కూతురు పుట్టినా  నీ కోరిక తీర్చుకోలేకపోయావు..రాసి పెట్టి ఉండాలి" అని  సోప్ పుచ్చుకు కొట్టినంత పనిచేసేసరికి టక్కున ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చింది.. ఆ వెంటనే బడేలు కొంగలా నా అంత ఎత్తు ఎదిగిన నా కూతురు ని చూసి ఏడుపొచ్చింది(మా ఆడపడుచు పోలిక,పైగా ఇంతెత్తు హీలొకటి వేస్తుంది గాడిద ) ..ఎంత పనయ్యింది దేవుడా  !!!! .... ఎంచక్కా దానికి 3 ఏళ్ళ వయసు వచ్చేసరికి ఇండియా వచ్చినప్పుడల్లా   దాన్ని తీసుకుని మా కాలేజ్  వైపు తిరిగితే ఎవరో ఒకరు నా కల తీర్చేవారు కదా (మనిషి ఆశా జీవి) ఇప్పుడు ఎవరంటారు నా మొహం  అని ఘాడంగా నిట్టూర్చి  ఊరుకున్నా ...

చెప్పానుగా దేవుడికి నేనంటే   బోలెడు ఇష్టం అని ...నమ్మట్లేదుగా మీరెవరూ.. సరే వినండి...

అయితే మొన్న మా పక్క పోర్షన్ వాళ్ళ అబ్బాయి పెళ్లి జరిగిందని కొత్తకోడలితో సత్యన్నారాయణ స్వామి  వ్రతం చేస్తున్నారు .... పేరంటానికి రమ్మంటేనూ....     ఆ ....జస్ట్ తాంబూలమే కదా అని డ్రెస్ వేసుకుని  వెళ్లాను.. జనాలందరూ హడావుడిగా తిరుగుతుంటే పెళ్లి కొడుకు చెల్లెలు రెండు మూడుసార్లు నన్ను చూసి నవ్వింది ..నేను కూడా నవ్వాను..

నాకు తెలుసు నాకు తెలుసు .. ఇప్పుడేమనుకుంటున్నారో ... ఆ అమ్మాయి వచ్చ్చి" ఎక్స్క్యూజ్మీ ..మీరేం కాలేజ్ "అని అనిఉంటుంది  అనుకుంటున్నారు కదా... హిహిహి కాదు వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్లి ఎవరా అమ్మాయి నేను ఇదే చూడటం అన్నాది..ఆయనేమో ఆ హడావుడిలో నన్ను పరిచయం చేస్తూ" నువ్వు చూడలేదు కదూ  ఈ అమ్మాయిని..ఈ మధ్యనే ఇండియా వచ్చింది..మన  పక్కింటిఆవిడ మనవరాలు"..అని మా అత్తగారి వైపు నా వైపు చూపిస్తూ  పరిచయం చేసారు...  నేనేం ఢాం  అని పడిపోలేదు...అంటే పొరపాటున కోడలు అనాబోయి మనవరాలు అనేసారనుకుని ..చిన్నగా నవ్వాను...ఓ పక్కాంటీ  మనవరాలా  అని ఆ అమ్మాయి పలకరింపుగా నవ్వింది..""అవును వాళ్ళ తమ్ముడు కూడా ఉండాలి బయట ఆడుకుంటున్నట్లున్నాడు"" అన్నారు ఆయన  ...
అప్పుడు ..అప్పుడు  వెలిగింది లైటు ..అప్పుడు " ఢాం  "అని పడిపోయాను ..( చెప్పానా దేవుడున్నాడని..) మా అత్తగారి ఫేస్ ఎక్ప్రేషన్స్ గట్రాలు నేనేం చూడలేదమ్మా ..అందుకే నో కామెంట్ అన్నమాట .... ఈ లోపల రాబోయే ప్రమాదాన్ని గ్రహించిన  వాళ్ళ ఆవిడ పరిగెత్తుకొచ్చి " ఏమండోయ్ ఈ అమ్మాయి ఆవిడ  పెద్దకోడలు ....మనవరాలు కాదు  అని అరిచి సారి అండీ మా ఆయన పొరబడ్డారు" అంది...

ఆ తరువాత ఆయన కూడా నాలుగు సార్లు నా దగ్గరకోచ్చ్చి" సారి అమ్మా..పొరబడ్డాను..మీ అమ్మాయి నీ పోలికలే కదా..కాస్త పొడవు కదా.. అయినా మీ అమ్మాయిని దూరం నుండి చూసాను అందుకే సరిగ్గా గుర్తుపట్టలేక నిన్నే తను అనుకున్నా .." అని మొత్తుకున్నా సరే నా మెదడేంటో ఆయన చెప్పిన మొదటి మాటకే ఫిక్స్ అయిపోయింది ..పైగా వాళ్ళమ్మాయి అయితే ఇది మీకు బెస్ట్ కాంప్లిమెంట్ యూ నో అన్నాది కూడా...
అయితే  మిగిలినవాళ్ళు అసూయతో రక రకాల కారణాలు చెప్పి నన్ను చాలా చాలా  డిసప్పొయింట్ చెయ్యాలని చూసారుగాని (అంటే మా ఆయన , ఇతర కుటుంభ సబ్యులు వగైరాలన్నమాట )..ఇష్ష్ ..
తప్పు కదా పెదరాయుడు లాంటి పక్కింటి పెదనాన్న గారు  అబధ్దం చెప్తారా? కళ్ళుపోతాయ్.. లెంపలేసుకోండీ..
 పైగా  పెద్దవాళ్ళ మాటలు మనం తప్పు పట్టకూడదు కూడానూ   అందుకని అవన్ని ఇగ్నోర్ చేసేసాను..మీరు కూడా చేసేయండి..మనసులో అటువంటి వ్యతిరేకపు ఆలోచనలు రానివ్వకండి.. రావులేండి మంచివాళ్ళకు అటువంటి అనుమానాలు రావు......ఆ విషయం మీకు కూడా తెలుసనుకోండి..

ఇదంతా కాదుగాని నాకో గొప్ప డవుటేమిటంటే సంతూర్ సోప్ యాడ్ చూస్తేనే ఇంత చిన్నదానిలా కనబడిపోతుంటే అది వాడితే ఎలా ఉంటుందా అని.. బహుసా ఒక పాతికేళ్ళ తరువాత.. 
ఎక్స్క్యూజ్ మీ
ఏం కాలేజ్ చదువుతున్నారు మీరు
కాలేజ్ నేనా!!!!
అమ్మమ్మా.... ( నా మనవరాలు పరిగెత్తుకొస్తూ )