29, జనవరి 2010, శుక్రవారం

ప్రేమ కధలు పలు రకాలు




ఈ మద్య ఇలా సిస్టం ఆన్ చేసి కూడలి చూస్తుంటే చాలు కొట్టేసుకుందాం,నరికేసుకుందాం,నువ్వెంత అంటే నువ్వెంత ...అబ్బబబ్బా దెబ్బకు సిస్టం కూడా ఆవేశం తో రగిలిపోయి 'ఢాం' అనేస్తుందేమో అని భయమేసి పరిగెత్తుకుని ఇలా వచ్చేసానన్నమాట.(అసలు కారణం అది కాదనీ, మీకు తెలుసన్న విషయం నాకు మాత్రం తెలియదు )..కాబట్టి ఏతా వాతా నేను చెప్పొచ్చేదేంటంటే ఈ కక్షలు ,కార్పణ్యాలు,ఆవేశాలు,ఆక్రోశాల
మద్యలో ప్రేమ అనే దాన్నికూడా దేవుడు మనకు ఇచ్చాడన్న గొప్ప విషయం నిన్న రాత్రి నాకు హఠాత్తుగా గుర్తు వచ్చేసిందన్నమాట.ఆ వెంటనే చిన్నప్పటి ప్రేమ కధలు హలో అంటూ పలకరించేసాయి.. మచ్చుక్కి అందులో ఒక కధ ...కధ అంటే కధ కాదండోయ్ నిజమే..


నా హైస్కూల్ నుండి కాలేజ్ వరకు నేను , స్వాతి జిగరీ దోస్తులం ... ఆగండాగండి ,మీరు స్నేహమేరా జీవితం లెవల్ లో ఉహించేసుకోకండి.. వేరే దారిలేక ,ఇంకెవరు ఇంటి వరకు వచ్చే తోడు లేక మరి ఆ రకం గా ముందుకు సాగిపోయానన్నమాట ...అది ఆర్యా 2లో అల్లు అర్జున్ కి ఏ మాత్రం తీసిపోదు .. అరగంట కోమారు నరకం అంచున అరంగుళం దూరంలో నించో పెట్టేది నన్ను . ఆ విషయం ప్రక్కన పెడితే , మేము కాలేజ్ కి వెళ్ళేదారిలో ఒక అబ్బాయి ఉండే వాడు..తెలిసిన వాళ్ళఅబ్బాయే ..పేరు తెలియదు కాని బాగా తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులున్నాయి..మరి అందువలనో లేక చదువు అబ్బలేదో గాని ,మద్యలో చదువు మానేసి వాళ్ళ వ్యాపారాలు గట్రా చూసుకునేవాడు ..వాడికున్న ప్రత్యేకత ఏంటంటే అమృతం తాగిన అమీర్ ఖాన్ లా చిన్నప్పటి నుండి పెద్దయ్యేవరకు ఒకటే మొహం..మరి ఉన్నట్లుండి ఏమోచ్చిందో తెలియదు గాని మా వెనుక పడటం మొదలు పెట్టాడు.. అలా ఒక నెల కాదు రెండు నెలలు కాదు ఏకం గా ఒక సంవత్సరం పడ్డాడు..ఇంత జరుగుతున్నా మా మట్టి బుర్రలకు అసలేమాత్రం అర్ధం కాలేదు...దానికిబోలెడు కారణాలు ఉన్నాయి ...అతనిని చిన్నప్పటి నుండి అదే వీధిలో చూసి ,చూసి ఏదో పని మీద తిరుగుతున్నాడేమోలే అనుకోవడం ఒకటైతే ,మేమిద్దరం కబుర్ల పోగులు అవ్వడం వల్ల మూడో వ్యక్తిని పట్టించుకోకపోవడం మరొక కారణం.. ఈ రెండు కాకుండా అమోఘమైన విషయం మరొకటుంది ...అది చెప్పాలంటే ఇంకో బుల్లి ప్లాష్ బ్యాక్ కి వెళ్ళాలి..


మా ఇంట్లో వాళ్ళు పొరపాటున హిందువుల్లో పుట్టేసారుగాని లేక పొతే ఆడపిల్లలందరికి బురఖాలేసేసి ఇంట్లో కూర్చో పెట్టేసేవారు ,రోడ్డు మీద వెళ్ళినపుడు నవ్వకూడదు,దిక్కులు చూడకూడదు ,పక్కింటికి వెళ్ళాలన్నా పదిమంది తోడుండాలి ...నో ..షాపింగులు ,నో సినిమాలు నత్తింగ్ ...అబ్బో సవాలక్షా కండిషన్లు ..పోనీ లోకజ్ఞానానికి చక్కగా యండమూరి నవలలో, సులోచన రాణివో కనీసం ఆంద్ర జ్యోతి,ఆంద్ర ప్రభ వార పత్రికలో కొనచ్చుగా ..హూం..అసలేమాత్రం కనికరం చూపించే వాళ్ళు కాదు గాని ,వంతులేసుకుని మరీ భాలమిత్ర ,భాలజ్యోతి, చందమామ ,జాబిల్లి మాత్రం తెగ తెచ్చేసేవాళ్ళు ....అలా అవి తెగ చదివి ,చదివి మా అమ్మ భాషలో గాడిద లా ఎదిగినా సరే చక్కం గా మహేష్ బాబునో,అనిల్ కుంబ్లే గురించో కలలు కనడం మానేసి ,విక్రమార్కుడు బేతాళుడు ని మోసుకుంటూ కధలు చెపుతున్నట్లో ,రాజు గారుసింహాలను,పులులను చంపేసి ప్రజలను కన్న బిడ్డల్లా పరిపాలిస్తున్నట్లో, కుందేలు,తాబేలు పందాలు వేసుకున్టున్నట్లో ఉహించుకుంటూ నిద్రలో జారుకునేదాన్ని..


అలాంటి రోజుల్లో నేను ఎనిమిదో , తొమ్మిదో (?)తరగతి చదువుతుండగా , మా ట్యూషన్లో ఒక అబ్బాయికి ఖర్మ కాలి నన్ను ఇష్టపడ్డాడు.. పడి ఊరుకోకుండా పాపం న్యూ ఇయర్ రాగానే నేను ,స్వాతి వస్తుంటే నన్ను పక్కకు పిలిచి, నాచేతిలో ఒక తెల్ల కవరు ఒకటి పెట్టేసి ,ఇక్కడ కాదు ఇంటికి వెళ్లి చూడవా అని అనేసి పారిపోయాడు.. మనమంత సేపు ఆగలేము కదా, ఏంటే ఇది అని మా స్వాతిది ప్రక్కన ఉండగానే ఓపెన్ చేసి చూసాను..అదో ఖరీదైన గ్రీటింగ్ కార్డ్ ...చక్కగా రెండు ఆటిన్ సింబల్స్ , వాటిని తెరవగానే ఒక్కో దానిలో ఒక్కో తెల్ల పావురం ,ఆ పావురం రెక్కలు తీయగానే ఒకటి నువ్వు, ఒకటినేను అని చిన్న పదాలు ...లోపల మేటరు జోలికి పోలేదు మనకసలే ఇంగ్లిష్ లో అరివీర భయంకరం గా మార్కులు వచ్చేవి అప్పట్లో ...ముందు జాగ్రత్తగా లోపల పేరు వ్రాయలేదు ఆ అబ్బాయి ...అప్పటి వరకు అర్ధ రూపాయి గ్రీటింగులు తప్ప ఖరీదయినవి చూడలేదేమో ,నాకా గ్రీటింగ్ పిచ్చ ,పిచ్చగా నచ్చేసి మురిసిపోతుంటే ,మా స్వాతి తట్టుకోలేక బొరున ఏడ్చేయడం మొదలెట్టింది ..

చూసావా, నా మొహానికి రూపాయి గ్రీటింగ్ పడేసి నీకెంత మంచిది ఇచ్చాడో ,నాకే అందరూ ఇలా చేస్తారు ,నేనంటే ఎవ్వరికి ఇష్టం లేదు అని దారంతా ఒకటే ఏడుపు ( కంగారు పడకండి ...పాపం వాళ్ళింట్లో కనీసం బాల మిత్ర ,చందమామలు కూడా కొనరు.. అదన్నమాట సంగతి) ..ఒక ప్రక్క నుండి అంత మంచి గ్రీటింగ్ దానికి ఇవ్వడానికి మనసొప్పడం లేదు..ఇవ్వక పొతే వారం రోజులు ఏడ్చి ,ఏడ్చి చంపేస్తుంది ...వాడు చెప్పినట్లు ఇంటికి వెళ్లి చూసినా బాగుండేది అని తిట్టుకుని ,తిట్టుకుని దానికి ఇచ్చేశాను ...


కాని ఆ రాత్రి అస్సలు నిద్ర పట్టలేదు ,ఒక ప్రక్క స్వాతిదాన్ని తిట్టుకుంటూనే రేపెలా అయినా వాడిని బ్రతిమాలి అలాంటి గ్రీటింగ్ ఇంకొకటి తెప్పించుకోవాలి అనేసుకున్నా..కాని ఎలాగో తెలియడం లేదు. అంత ఖరీదయిన గ్రీటింగ్ ఒక్క సారి ఇవ్వడమే గొప్పా ,ఇంకోసారి అడిగితే ఇస్తాడా?? అని డవుటు ..మొత్తానికి బోలెడన్ని ప్లాన్ లు వేసుకుని మరుసటి రోజు ఆ అబ్బాయి దగ్గరకు వెళ్లాను... పాపం నన్ను చూడగానే టెన్షన్ టెన్షన్ గా ,భయం భయం గా ,సిగ్గు ,సిగ్గుగా అనేక రకాల ఫీలింగ్స్ పెట్టాడు...నేను కూడా అవే ఫీలింగ్స్ తో ఆ అబ్బాయి దగ్గరకు వెళ్లి, శ్రీనూ! మరేమో నిన్న నువ్విచ్చిన గ్రీటింగ్ ఎంత బాగుందో ,కాని మా చెల్లి తీసేసుకుంది.అది చూసి ఇంకో చెల్లి కూడా అలాంటిదే కావాలని ఏడుస్తుంది ...మా అమ్మగారేమో ఆ అబ్బాయిని ఇంకొకటి కొనమను డబ్బులిచ్చేద్దాం అన్నారు ( పెద్దవాళ్ళ పేరు చెపితే తప్పక కొంటాడని, పైగా డబ్బులడగడానికి మొహమాట పడతాడని మాస్టరు ప్లాన్ అన్నమాట )అంటూ ,నాకు వచ్చిన గ్రీటింగ్ లలో ఓ నాలుగు మంచివి వాడి చేతిలో పెట్టి ,వీటిని తీసుకుని బదులు గా అలాంటి గ్రీటింగ్ ఇంకొకటి కొనివ్వవా..డబ్బులిమ్మన్నా ఇచ్చేస్తాను అని ఎంతో ఇదిగా అడిగాను .... దాంతో ఆ అబ్బాయి కి' తారే జమీన్ పర్ 'అన్నమాట ...ఆ తరువాత నేను కనీ ,కనిపించగానే పారిపోయేవాడు..


అంతటి ఘన చరిత్ర ఉంది మా ఇద్దరికీ ...ఆ కారణం గా ఆ అబ్బాయి మాకు గీతలు గీస్తున్నాడని తెలుసుకోవడానికి ఆ మాత్రం టైం పట్టింది ... ఈ లోపల వాడికో బేచ్ తయారైంది,వాళ్ళ పనేంటయ్యా అంటే మమ్మల్ని జాగ్రత్తగా కాలేజ్ కి దింపి ,అంతే జాగ్రత్త గా ఇంటి వరకు తోడు రావడం ..అడపా ,దడపా మేము ఏమ్ మాట్లాడుకున్నా విని ,మేమొచ్చేసరికి ఆ టాపిక్ మీద చర్చలు జరపడం వగైరాలన్నమాట ..పనులన్నీ ఫ్రెండ్స్ చేసి కష్ట పడుతుంటే మన హీరో గారు తన బండికి ఆనుకుని, మెడలోమఫ్లర్ చుట్టుకుని చేతులు కట్టుకుని మావైపు ఆరాధనగా చూస్తూనిలబడేవాడు ...దాంతో మా స్వాతి వాడికి గీతాంజలి గాడు అని నామకరణం చేసేసింది ..అంతా బాగానే ఉంది గాని ఇంతకీ వాడు ఎవరికీ లైన్ వేస్తున్నట్లు అనేది మా ఇద్దరికీ మిలియన్ డాలర్ల ప్రశ్న ... అందువల్ల ముందుగానే అబ్బెబ్బే నాగురించి కాదంటే నా గురించి కాదనీ కంగారు పడిపోయేవాళ్ళం...

మా నల్ల పిల్లల వెనుక ఎవరు పడతారు ఖచ్చితం గా వాడు నీ వెనుకే పడుతున్నాడు అనేది అది.. కలరు కాదమ్మా ముఖ్యం మొహం ఎవరిది కళగా ఉన్నదనేది పాయింట్, పైగా మా కుటుంభం గురించి వాడికి బాగా తెలుసు తోలు తీసేస్తారు కాబట్టి ఖచ్చితం గా నీ వెనుకే అనేదాన్ని నేను ..అంత లేదు ఎంత సేపు మా పెదనాన్నలు ,చిన్నాన్నలు అని నువ్వే డప్పు కొట్టుకుని భయపడిపోవాలి తప్ప బయట అంత సీన్ మీవాళ్లకు నిజంగా లేదు అని అది ,ఇలా తగవు లేసుకునే వాళ్ళం...అయితే ఎంత వాదించుకున్నా దాని దగ్గర నేను సరిపోయేదాన్ని కాదు. వీడు పగలూ ,రాత్రుళ్ళు తేడా లేకుండా ఆ కూలింగ్ గ్లాసెస్ పెట్టి పెట్టి నిజంగా గుడ్డోడు అయిపోయి ఉంటాడే.. లేకపోతే మీ ఇంట్లో నీకంటే బాగుండే మీ అక్కని వదిలేసి ,కాస్త కళగా ఏడ్చే ఎదురింటి అమ్మాయిని వదిలేసి నిన్నెలా ఇష్టపడుతున్నాడే బాబు తింగరోడు అనో ,లేకపోతే మరొకటో అని నన్ను తెగ ఏడిపించేసేది... ఒక్కోసారి ఎంత ఉక్రోషం వచ్చేసేదంటే ఒక గంటో, రెండు గంటలో మౌనం గా ఉండిపోయేదాన్ని మాట్లాడకుండా...అయితే అలా పైకి అనేది గాని దానికీ మనసులో మహా భయంగా ఉండేది ఎక్కడ వాడు దాన్ని ఇష్టపడుతున్నాడేమో అని...

నిన్న జ్యోతిర్మయి గారి క్లాసులో అయిపోయేదాన్నే ,ఒకటే నిద్ర వచ్చేసిందనుకో.. మొన్నే ఆవలించారని ఇద్దరిని బయటకు పంపేసారు.. ఆవిడ క్లాసులన్నీ మద్యాహ్నమే తగలడతాయి ...అప్పుడే శుబ్బరం గా మేసి ఉంటామేమో,పైగా ఆవిడ పాఠం జోల పాటలా సా..గుతూ ఉంటుంటే ..ఆహా ..ఏం నిద్ర తన్నుకొస్తుందే బాబు ...నేను చెప్పుకుంటూనే వెళుతున్నా ఇది మాత్రం ఊ అనడం లేదు ,ఆ అనడంలేదు .. ఏంటా అని దాని వైపు చూసేసరికి ఈ రోజు డేటెంతే అంది కనురెప్ప వాల్చకుండా ఎదురుగా చూస్తూ..ఫిబ్రవరి 14 ఎందుకూ ? అని అడుగుతూ ఎదురుగా చూసి హడలిపోయాను..గీతాంజలి గాడు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు.. అది రోజూ చూసే సీనే కాని ,ఈ రోజు హీరోగారు పెళ్ళి కొడుకులా తెల్ల షరాయి ,లాల్చీ వేసుకుని చేతిలో ఒక కవరు,ఎర్ర గులాబీ పట్టుకుని నించున్నాడు ...వెనుక ఫ్రెండ్సేమో మరేం పర్లేదు మేమున్నామని భుజం తడుతున్నారు..

వీడెవడే బాబు మన ప్రాణానికి ఇలా తయారయ్యాడు ఏం చేద్దాం అంది భయం గా..మొహం సీరియస్సుగా పెట్టి మనల్ని కాదన్నట్టు వెళ్ళిపోదాం అన్నాను..గోడవేం జరిగినా నీకింకా పర్వాలేదే కనీసం నువ్వు చెప్పేది వింటారు మీ ఇంట్లో.. మా కొంపలో అలాక్కాదు వాడి వెనుక నేనే పడినట్లు చెప్పేస్తారు మా నాన్నకు ...ఆ ముక్క చాలు పుస్తకాలు అటకెక్కించేసి నన్ను ఇంట్లో కూర్చోపెట్టేయడానికి అంది ...ఒక ప్రక్క నా భయం నాది ఒక వేళ వాడు నాకే ఇస్తే ఏం చేయాలి? ముక్కలు ముక్కలుగా చింపేసి నాకిలాంటివి నచ్చవు అంటే ???కక్ష పెట్టుకుంటాడా??..అసలే మెడికల్ షాప్ అమ్మాయి మీద యాసిడ్ పోసారంట మొన్నెవరో ..పోనీ, చూడండి మా ఇంట్లో ఇలాంటివి తెలిస్తే చంపేస్తారు,చదువు మానిపించేస్తారు దయ చేసి నా వెనుక పడకండి అని కళ్ళ నీళ్ళు పెట్టేసుకుంటే ..ఛీ ఛీ..వాడెవడో ముందు ఏడవడం ఏంటి చాండాలంగా ..నా ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి స్వాతి భయం తో చమటలు తుడుచుకుంటునే ఉంది ..మేము వాడికి దగ్గరలోకి వచ్చేసాము ...
మిగిలింది తరువాత వ్రాస్తానే :)