27, జనవరి 2009, మంగళవారం

పిరికి ప్రేమలూ జిందాబాద్ !!!మా నాన్న గారి ఆకరి తమ్ముడు పేరుకి చిన్నాన్న అనే గాని,మా పెద్దక్క కంటే ఒక నాలుగైదేళ్ళే పెద్దవాడు అవ్వడం మూలానా మా పిల్లలలో పిల్లాడిగా బాగ కలసిపోయేవాడు..మమ్మలిని కొట్టడం ,తిట్టడం,ఏడిపించడం ఇలాంటివన్నీ మహా బాగా చేసేవాడు...అయితే అందరి లాగానే ఒక వయసు వచ్చేసరికి ప్రేమలో పడ్డాడు.. మళ్ళీ ఎక్కడో అంటే కష్టం అనుకున్నాడో ఏమో మా ఇంటికి రెండు ఇళ్ళ అవతల ఉన్న మేడ మీద అమ్మాయిలో తన భానుప్రియని చూసుకున్నాడు..(తను భాను ప్రియ కి పేద్ద విసన కర్ర లేండి ..) ఇంచు మించు గా దగ్గర వయసు అవ్వడం వల్ల ఈ ప్రేమ విషయం మా ఇద్దరు అక్కలకి చెప్పేసాడు..వాళ్ళూ కూడా తెగ సపోర్ట్ ఇచ్చేవారు తనకి ..


చిన్నాన్నా! పిన్ని మేడ మీదకు ఎక్కింది అనో లేకపోతే పిన్ని ఫలానా దగ్గర కనబడింది అనో information అందించేవాళ్ళు .. వాళ్ళు అలా పిన్ని,పిన్ని అంటుంటే తన మొహం చూడాలి ఎంత వెలిగిపోయేదో .. వెంటనే తను కూడా మేడ ఎక్కేసేవాడు ఆ అమ్మాయి ఎక్కంగానే....ఆ అమ్మాయికీ ..ఎర్రగా బుర్రగా ఉన్న మా చిన్నాన్న చూడటం ఇష్టమో లేక నిజం గా పని ఉండేదో నాకు తెలియదు కాని సాయంత్రం అవ్వగానే బట్టలు ఆరబెట్టడానికో లేక ఆరిన బట్టలు మడత బేట్టడానికనో,మొక్కలకు నీళ్ళు పొయ్యడానికనో ఠంచనుగా వచ్చేసేది ..

ఎటోచ్చి అటు పెద్దాళ్ళ list లోకి ఇటూ చిన్న పిల్లల list లోకి చేరంది నేను మా తమ్ముడు ,చెల్లెలు మాత్రమే ..అందరం పిన్నమ్మ పెద్దమ్మ పిల్లలవడం చేత ఒకే వయసుకు చెందిన వాళ్ళం ....ఇక ఇంట్లో యే చిన్న తప్పు జరిగినా మా అమ్మా వాళ్ళకు దొరికేది మేమే .. గాడిదల్లా ఎదిగారు ఆ మాత్రం తెలియదా అనో.. ఆరిందల్లా అన్నిటిలోకి వస్తారు చిన్నపిల్లలు చిన్నపిల్లల్లాగ ఉండండి అనో అన్నిటికి మమ్మలనే దులిపేసేవారు..


అయితే మా వీది లో వాళ్ళు ఆవులిస్తే పేగులేం ఖర్మ నరాలు, నాడులు తో సహా లెక్క పెట్టెసే అంత గొప్ప వాళ్ళు ..కాబట్టి ఈ చోటీ సి ప్రేం కహాని కనిపెట్టేసి మరింత ఆరా కోసం స్కూల్ కి వెళుతున్న మా అక్కని ఆపి ఆ విషయం ఈ విషయం మాటాడుతూ ..మీ చిన్నాన్న రోజూ సాయంత్రాలు మేడ ఎందుకు ఎక్కుతున్నాడంటావ్ అన్నారంట..మా అక్క పైకి నోట్లో వేలు పెడితే కొరకలేనంత అమాయకం గా కనబడుతుంది కాని అదాటుగా ఉంటే వేలేం ఖర్మా చేయిమొత్తం నమిలేస్తుంది.. ఏమో ..అనేసి ..పరుగు పరుగున వచ్చి మా చిన్నాన్న చెవిలో చెప్పేసింది ..ఇంక తనకి చెమట్లు పట్టేసేయి.. దానికి కారణం ఏంటంటే అప్పటికే మార్చ్ ,సెప్టెంబర్ లో పోయిన సబ్జెక్టులనే మళ్ళీ మళ్ళీ కడుతూ .. చచ్చే చీవాట్లు తింటున్నాడు అన్నగారిల చేత ..ఇప్పుడు ఈ విషయం తెలిసిందా ..అంతే సంగతులు...

కాబట్టి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నంతలో ఆ మహానుభావుని కంట్లో చక్కగా ఒక మూలన కబుర్లు చెప్పేసుకుని కిలకిలా నవ్వేసుకుంటున్న మేము కనబడ్డాం ..ఇంకేముంది ఒక దిక్కుమాలిన ఐడియా వచ్చేసింది అయ్యగారికి ..వెంటనే మాకు కాస్త దూరంలో బట్టలు ఉతుక్కుంటూ ఇరుగమ్మల మీద ,పొరుగమ్మల మీదా సీరియస్సుగా చాడీలు చెప్పేసుకుంటున్న వదినగార్ల దగ్గరకు వెళ్ళి .. వదినా ..ఎంత సేపూ మీ కబుర్లు మీవేనా.. పిల్లల చదువే పట్టించుకోరా...ఇప్పుడంటే చిన్న క్లాసులు చదివినా చదవక పోయినా పట్టించుకోరు ,ముందు ముందు పబ్లిక్ ఎక్జాంస్ వస్తాయి ఎంత కష్టమో తెలుసా .. వాళ్ళు చూసావా చదువూ సంద్యా లేకుండా ఎలా అల్లరి చేస్తున్నారో అన్నాడు.. ఇదేమిట్రా బాబు ఉరుము లేని పిడుగులాగా హఠత్తుగా మా చదువుల మీద పడ్డాడు అనుకున్నాం మా మొహాలు ఒకరివి ఒకరు చూసుకుంటూ..


నీ చదువు నువ్వు చూసుకోవయ్యా.. వాళ్ళ గురించి నీకెందుకు గాని అని అనాలి కదా మా అమ్మా వాళ్ళయినా .. అబ్బే ..ఎవరి భర్తలను వాళ్ళు తిట్టుకునే చాన్స్ వస్తే ఎందుకు వదులుకుంటారు వాళ్ళు ..ఏం చెస్తాం బాబు ప్రొద్దున్ననుండి అరవచాకిరి చేసినా మీ అన్నగారికి పట్టదాయే ..ఒక పనిమనిషా పాడా మా మొహాలకి (ఉత్తినే ...నాన్న పనిమనిషిని పెట్టమన్నా అది సరిగా చేయదు అని అమ్మే ఒప్పుకోదు)ఇంక వీళ్ళ చదువులు పట్టించుకునే తీరికెక్కడిదీ ..అయినా మాకేమన్నా డిగ్రీయా బొగ్రీయా ..మమ్మల్ని ఎలాగూ పట్టించుకోరూ పిల్లల చదువులన్నా పట్టించుకోపోతే ఎలాగా అంది అమ్మ ఆ కోపం అంతా బట్టల మీద చూపిస్తూ...సరేలే అక్కా ..మొన్న ఎవరో మీ పాప ఎంత చదువుతుంది అని అడిగితే మీ మరిది గారు దాన్ని పిలిచి అడిగి చెప్పారు నేనెవరికి చెప్పుకోను అంది పిన్ని..ఈ లోపల మా పెద్దమ్మ.. మీ బావగారికి మా మీదే కాదు ఆయనమీద ఆయనకే శ్రద్ద ఉండదు.. మొన్న కాయకూరలు తరిగి కడిగిన నీళ్ళు చారనుకుని అన్నం లో వేసుకు తినేసారు.. నేనెవరికి చెప్పుకోను అని వాపోయింది ..


అబ్బా మొదలెడితే ఆపరనుకున్నాడో ,ఏమో సరేలే వదినా ఏం చెస్తాం..అలా అని పిల్లలని వదిలేస్తామా ఈ రోజునుండి నేనే వాళ్ళకు సాయంత్రాలు కాసేపు నా చదువు ఆపుకుని ప్రేవేట్ చెబుతా అన్నాడు..వెంటనే మా అమ్మా వాళ్ళూ బాబు కాఫి తాగుతావా.. చలవ చేస్తుంది మజ్జిగ తాగకూడదు అని మర్యాదలు చెసేస్తుంటే మా చదువు మీద ఈ అకాల ప్రేమ ఏమిటో తెలియక జుట్టు పీక్కున్నాం మేము ..


ఆ తరువాత నుండి మా తిప్పలు ఏమని చెప్పనూ .. సాయంత్రం కాగానే మమ్మల్ని బలవంతం గా లాక్కుపోయి చదువు చెప్పెవాడు..పోని శుబ్బరంగా చెప్పచ్చుగా ...ఆ అమ్మాయిని ఆకర్షించడానికి మమ్మల్ని వీర ఉతుకుడు ఉతికేసేవాడు..
మా తమ్ముడి తో ఒరే సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు జరిగింది ..?
అదా నాన్న .. మరేమో 1857 ...అంతే ఫేడిలమని వాడిని ఒక్కటి పీకీ సిఫాయిల తిరుగుబాటు 1857 లో జరిగింది అనేవాడు..ఇప్పుడు నేను అదే కదా అన్నాను వాడు ఏడుపు మొహం పెట్టగానే ఎంట్రా పెద్దోళ్ళను ఎదిరిస్తావా .. మళ్ళీ ఫేడేల్ ..ఫేడేల్ ..
అదికాదు నాన్నా వాడు అదే అన్నాడు మా చెల్లి మెల్లిగా గొణికింది.. ఏంటే నీ నోరు పైకి లేస్తుంది సరే నీ సంగతి చెబుతా 17*13 ఎంతా ?చెప్పు.. .. అదా నాన్నా ఉండు చెబుతా అదీ 17*13 కదా.. ఉండే ..అనే లోపల దానికీ వీపు మీద ఒక్కటి స్కేల్ తో ఇచ్చేవాడు.. మేము 12*12 వరకు నిద్రలో లేపినా చెప్పగలము.. 17 ఎక్కం అంటే ఎలా చెబుతాం !!ఇంత జరిగాకా ఆ మాట అనడానికి నేనేమన్నా తెలివి తక్కువదాన్నా .. నోరు మూసుకుని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టుకునే వాళ్ళం మనసులో ...
ఇలా ఆ పిల్ల తో ప్రేమ కాదు గాని మాకు ఆకాశం లో పగలే చుక్కలు చూపించేవాడు.. మమ్మల్ని ఎన్ని తిట్ట్లు తిడితే అంత బాగ చదువు చెప్పేస్తున్నాడు అనుకునే వారు మా అమాయకపు తల్లులూ .. అమ్మా మాకు ప్రేవేట్ వద్దమ్మా..మాకు మేమే బాగా చదువుకుంటున్నాం అన్నామో ,ఆపకుండా అరగంట తిట్టి పడేసేవారు.. ఇలా ఆ బలవంతపు ట్యూషన్ 3 నెలలు చెప్పాడు.. ఆ తరువాత శెలవలకు మేము మా అమ్మమ్మల ఊరికి చెక్కేసాము.. ఆ తరువాత ఏం పాట్లు పడ్డాడో నాకు అయితే తెలియదు ..


కొన్నాళ్ళు పోయాకా ఒక రోజు ఆ ఇంటి నుండి పెద్దవాళ్ళు వచ్చి ఆ అమ్మాయి పెళ్ళి శుభలేఖ ఇచ్చి బోజనాలకు పిలిచి వెళ్ళిపోయారు..పిల్లల్లందరం పెళ్ళి బోజనాలంటే అదో సరదా కాబట్టి గెంతులేసాం.. అమ్మా వాళ్ళు ఏం చీరలు కట్టుకోవాలి అనే హడావుడిలో వాళ్ళు పడిపోయారు.. కాని దేవదాసులా శూన్యంలోకి చూస్తూ బాధ పడుతున్న మా చిన్నాన్నను మాత్రం మేము పట్టించుకోలేదు..


మరి ఎన్నాళ్ళు బాధ పడ్డాడొ తెలియదు గాని చాలా నాళ్ళ తరువాత ఒక సారి నేను మా చెల్లీ ఒకప్పుడు తను చదివే గదిలో exams కి చదువుకుంటుంటే మా చెల్లి ఏదో book కోసం వెదుకుతూ అడుగున ఎర్రగా మెరుస్తున్న ఒక డైరీ ని బయటకు లాగింది ..పైన మా చిన్నాన్న పేరు ఉంది.. ఇద్దరం మొహామొహాలు చూసుకున్నాం ..ఎందుకు లేవే ఇతరుల డైరీ చదవ కూడదు కదా అన్నాను నసుగుతూ ..నాకూ మనసులో చదవాలన్న ఆశక్తి చాలా ఉన్నా సరే ..నీ మొహం అసలు డైరీ రాసేదే ఇతరులు చదవడానికి.. లేక పోతే రాయడం ఎందుకంటా .. పోనీ రాసారే అనుకుందాం..ఎక్కడబడితే అక్కడ పడెయడమే.. అది వాళ్ళ తప్పు మనది కాదు అని లాజిక్ లాగేసరికి ఇద్దరం మెల్లిగా అది పుచ్చుకుని మేడ ఎక్కేసి మొదటి పేజి తీయగానే "ఈ డైరీ చదివిన వాళ్ళు గాడిదలు" అని రాసుంది.. చూసావా అక్కా ఎవరన్నా చదువుతారని ముందే ఎలా రాసాడొ .. రాసిన వాడు ఇంకా పెద్ద గాడిద అని ఇంకో పేజీ తిప్పింది ..ఈ డైరీ చదివితే వచ్చే జన్మలో దున్నపోతులయి పుడతారు అని రాసుంది.. ఓర్నీ ..మొత్తం శాపనార్దాలే రాసాడా ఏంటి అని చదువుతున్నాం ... మొదట అంతా నేను పలనా చోట బట్టలు కొనుక్కున్నాను పలానా చోట అన్నం తిన్నాను.. ఇలా సోది ..అలా ఒక 20 పేజీలు విసిగించాకా ఒక చోట మా ఇద్దరి కళ్ళు ఆగిఫొయాయి.. ఈ రోజు అతనిని చూసాను ..ఎంత అందం గా ఉన్నాడో.. రోజూ చూస్తాను.. కానీ ఈ రొజు చాలా అందం గా అనిపించాడు అని రాసుంది..ఇదేంటే ఎవరితడు అనుకుని మళ్ళి చదవడం మొదలెట్టాం ...నేను అతని కోసమే పుట్టానేమో అనిపిస్తుంది.. అవి కళ్ళా కాదు నేరేడు పళ్ళూ.. అంటు ఒక అర పేజి కవిత్వం .. ఇద్దరం కాసింత అయోమయం గా చుస్తున్నాం ....అలా అతని గురించి ఒక 20 పేజీలు చదివాకా కాసింత భయం వేసింది.. ఏమి చదువుతున్నామో అర్దం కాకా.... తరువత పేజీలోచూద్దుము కదా ......ఈ రోజు అతను వాళ్ళ అమ్మ గారితో గుడికి వచ్చాడు చీరలో అతనెంత బాగున్నాడో.. రోజు అతనిని మేడ మీద చూసినా ఎప్పుడూ కొత్తగా అనిపిస్తునే ఉంటాడు ... అప్పుడు అర్దం అయింది తను ఎవరి గురించి రాస్తున్నాడో.. ఎక్కడ చదివే వాళ్ళకు అర్దం అయిపోతుందో అని 'ఆమే' అనే బదులు 'అతడు ' అని రాస్తున్నాడని....ఇంక పడి పడీ నవ్వాము... చివరిలో ఆ అమ్మాయి పెళ్ళి అయ్యాకా చాలా బాధగా ఎదొ ఎదో రాసుకుని ఇంకా ఆడైరీ ముగించేసాడు..మనసంతా ఏదోలా అయిపోయింది ఇద్దరికీ..

ఇప్పుడు తనకి పెళ్ళి అయింది మా పిన్ని ఎంతో మంచిది.. కాని ఎప్పూడన్నా ఆ అమ్మాయి పుట్టింటికి వచ్చినపుడు చూస్తె తన కళ్ళల్లో ఒక్క మెరుపులాంటిది మెరిసి మాయ మవుతుంది.. నిజమే తన ప్రేమ పిరికిది కావచ్చు..(అది ప్రేమ అనుకోండి ఆకర్షణ అనుకోండి) ఆ అమ్మాయి కూడా మా చిన్నాన్న ప్రేమ ఇంట్లో ఒప్పుకోరని తెలిసి కూడా మేడ ఎక్కి ఉండవచ్చు .. కానీ ఇప్పటి ఈ కాలపు యువత లాగా అప్పటి వాళ్లు తల్లిదండ్రుల గురించి,భవిష్యత్ గురించీ ఆలోచించకుండా ప్రాణాలు తీసుకోనూ లేదూ ధైర్యం గా ఇంకొకరి ప్రాణాలు తీసేయనూ లేదూ...ఒకప్పటి భాధని తీపి ఙ్ఞాపకాలుగా మనసులో నింపుకుని భవిష్యత్ వైపు అడుగు వేసేవారు ఆ కాలం లో చాలా మంది.. ఏమో ఒకరకం గా ఈనాటి ఈ ఆవేశపు ప్రేమలకంటే ఆనాటి పిరికి ప్రేమలే మంచివేమో అనిపిస్తుంది

19, జనవరి 2009, సోమవారం

నేను భారతీయురాలిగా తప్ప పుట్టానేమో !!!నాకు చిన్నప్పుడు ఉన్న అపోహలలో ఒకటి ..విదేశాలలో కాగడా పెట్టి వెదికినా అడుక్కునే వాళ్ళు కనబడరని.. అయితే నేను విదేశానికి(సింగపూర్) వచ్చాక తెలిసింది అది తప్పని..అయితే ఇక్కడ కాస్త తక్కువ మంది ఉంటారు అంతే ...ఇక్కడ బెగ్గర్స్ లో కొంచెం చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే ఊరికే అడుక్కోరు .. కళ్ళు లేక పోయినా, కాళ్ళు, చేతులు లేక పోయినా ఎదో ఒక వాయిద్యాన్ని వాయిస్తూ, పాడుతూనో లేక కొంచెం తక్కువ ఖరీదు ఉన్న వస్తువును ఎక్కువ రేటు కి అమ్ముతూనో అడుక్కుంటారు .. అది కూడా బాగ వయసు అయిపోయిన ముసలి వారు అమ్ముతారు.జనరల్ గా వీరు రైల్వే స్టేషన్ బయట అప్పుడప్పుడు కన బడతారు ..


అయితే మిగిలిన ప్రాంతాలకు చాలా తక్కువ గాని మేమున్న అపార్టుమెంట్ దగ్గర మాత్రం నెలకు నాలుగు,ఐదు సార్లు తప్పని సరిగా వస్తారు ఇలా డబ్బులు అడిగేవారు...మరి మాది పస్ట్ ఫ్లోర్ అనో లేక మేముండే ప్లేస్ లో చాలా వరకు ముస్లిం లు ఉండటం మూలానో తెలియదు..ముస్లింలుంటే ఎక్కువగా బెగ్గర్స్ రావడం ఏంటబ్బా అనుకుంటున్నారు కదా .. ఇళ్ళకు వచ్చే బెగ్గర్స్ లో 70 యేళ్ళు పైబడిన ముస్లిం ఆడవాళ్ళు (మలేషియా ముస్లింస్) .. వస్తారు..వీళ్ళు తలుపుతట్టి సలామాలేకుం అని అంటారు.. అయితే వీళ్ళు చాలా వరకు ముస్లింలనే అడుగుతారు డబ్బులు .. తలుపు తెరవగానే మన వేషదారణ చూడగానే చిన్నగా నవ్వుతూ 'సారీ' చెప్పి వెళ్ళిపోతారు..


మొదట్లో నాకు తెలిసేదికాదు .. అసలు ఎందుకు తలుపు కొడుతున్నారో ..నన్ను చూడగానే ఎందుకు వెళ్ళిపోతున్నారో.. తరువాత తెలుసుకున్నాక నేనే వాళ్ళను ఆపి డబ్బులిచ్చేదాన్ని..ఎందుకంటే పగటి పూట చాలా వరకూ తలుపులు తీయరు ..ఎవరి ఉద్యోగాలు వారివి..తాళాలు వేసుకు వెళ్ళి పోతారు..యే దేశస్తులన్నా పిడికెడు మెతుకులు తినకపోతే ఆకలి అందరికీ ఒకలాగే వేస్తుంది కదా..అలా ఇచ్చినపుడు వాళ్ళ కళ్ళలో ఆత్మీయత చూస్తేనే అబ్బో నేను చాలా మంచి పని చేసేసా అని తెగ ఫీలింగ్ వచ్చేసేది..ఇలా వీళ్ళే కాకుండా అప్పుడప్పుడూ తల్లికి బాలేదనో, తండ్రికి బాలేదనో ( అచ్చం మనదేశం లాగే )చెబుతూ కొంచం పెద్ద వాళ్ళను తోడు తీసుకు వచ్చీ డాక్టర్ సర్టిఫికెట్లు చూపిస్తూ చేతి తో తయారు చేసిన ఫ్లవర్ వాజ్ లనో, హాండ్ బేగ్ లనో కొనుక్కోమని దీనం గా అడుగుతారు కొంతమంది చిన్నపిల్లలు .. మరి ఇక్కడ నిజమో ,అభద్దమో తెలియదుకాని(ఇక్కడ డాక్టర్స్ దొంగ సర్టిఫికెట్లు ఎట్టి పరిస్తితుల్లోను ఇవ్వరు ) నాకు ఇంత చిన్నపిల్లలను చూస్తేనే కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగిపోతాయి .. అంత అమాయకపు పిల్లలకి అలాంటి కష్టాలు ఎందుకు ఇచ్చావ్ దేవుడా అని చాలా బాధ పడతా ..తప్పో ,ఒప్పో ఇంక వాళ్ళను నిజమా ,అభద్దమా అని ఆరాలు తీసి డబ్బులు ఇవ్వబుద్ది వేయదు .. నాకు తోచింది ఇస్తాను..


ఇలా చాలా మంది ఏదో ఒక రోగమనో మరి ఇంకొకటో చెప్పి అప్పుడప్పుడూ ఏవో ఒకటి కొనమని అడుగుతారు..నేను కొన్ని కొనడమో లేక ఎంతోకొంత ఇచ్చి పంపడమో చేసేదాన్ని..ఈ సోదంతా ఏమిట్రా బాబు అనుకుంటున్నారా.. మరి చేసిన చెత్త పని సమర్దించుకోవాలంటే ఆ మాత్రం చెప్పుకోవాలిగా..ఒక సారి సాయంత్రం చీకట్లు ముసురుతుండగా ..పనులయ్యాక తీరికగా సొఫాలో పడుకుని T.V చూస్తున్నా ..ఇంతలో ఎవరో తలుపులు కొట్టి సలామాలేకుం అన్నారు..నేను మాములుగానే పాపం ఎవరో వచ్చి ఉంటారు .. ఎక్కువగా ఆడవాళ్ళు వస్తారుగా మగవాళ్ళు తక్కువ కదా అనుకుంటూ ,నెలాఖరు రోజులు కాబట్టి ఏమీ కొనే ఉద్దేశం లేకపోవడం తో ఒక 2$ నోట్ తీసుకుని బయటకు వచ్చాను.. ఎదురుగా ఒక 30 యేళ్ళ లోపు యువకుడు బలిష్టం గా , పొడవుగా ఉన్నాడు..చేతిలో డబ్బులు వేయడానికి తెచ్చుకున్న డబ్బా ఉంది..ఇదేంటబ్బా ఈ అబ్బాయికి ఏమైంది??? .. చూడటానికి గ్రుడ్డి , అంగ వైకల్యం లాంటివి ఏమీ కూడా లేనట్లు ఉంది..ఏదన్నా చారిటీ కోసం వచ్చాడేమో అనుకున్నాను .. ఆ అబ్బాయి నా రాకను గమనించినట్లున్నాడు అటు ఎటో చూస్తున్నవాడు గభ గభ తన చేతిలొ ఏదో కవర్ తెరవడం మొదలు పెట్టాడు.. ఎక్కువగా ఏదో ఒక జబ్బు ఉన్నవాళ్ళే అలా డాక్టర్ సర్టిఫికెట్లు తీస్తారు.. నాకు గుండే అంతా పిండేసినట్లు అయిపోయింది..పాపం యే తల్లి కన్న బిడ్డో చూడటానికి చక్కగా రాకుమారుడిలా ఉన్నాడు ..ఇప్పుడు తను ఏదో రోగం చెబుతాడు ఇంక మనసంతా పీకేస్తుంది ..ఇంక వేదాంతం వచ్చేస్తుంది,ఎన్ని తిన్నా, ఏం చెసినా ఎన్నాళ్ళు బ్రతుకుతాం అనుకుంటూ ..ఎందుకులే అసలే దేశం కాని దేశం లో ఉన్నాను అనుకుని.. Its OK అని వారించి 2$ నోట్ అతనికి ఇచ్చాను ..ఈ లోపలే అతను ఏదో వాళ్ళ బాషలో (మలయ్ బాష)గట్టిగా చదువుతూ ఒక ఫొటో చూపిస్తూ ఏదో చెబుతున్నాడు.. కొద్దిగా చీకటి చీకటిగా ఉండటం వల్ల నాకు స్పష్టంగా కనబడటం లేదు ..సరిగా విందును కదా అతను చూపిస్తుంది మన కాశ్మీర్ ఫొటో ..నాకు అతను ఏం చెబుతున్నాడో తెలియదుకాని మన కాశ్మీర్ గురించే .. అతని మొహం లో ఏదో కోపం నేను బిత్తరపోయి ఆ కంఠానికి బెదిరిపొయా .. ఈ లోపల మా వాకిలి బయట లైట్లు వెలిగాయి ఆ వెలుతురులో నా మొహం చూసాడతను ... నా మొహానికి ఉన్న సిందూరం చూస్తుండగానే నా మెదడు మరి నాకేం చెప్పిందో గాని గబుక్కున తలుపులు వేసేసా ..


అసలే ముంబాయి మారణహోమాన్ని..అనేక బాంబ్ దాడులను చూసి చూసి ఉన్నానేమో ఆ పిరికితనం నన్ను ఆవహించింది.. తలుపేసాక గాని నేను చేసిన సిగ్గుమాలిన పని నాకు గుర్తు రాలేదు.. నా కన్న తల్లిని,నా మాతృ భూమిని తిడుతూ ఉంటే నేను వాడికి డబ్బులిచ్చానా!!!..నాలాంటి దేశ ద్రోహులు ఎక్కడన్నా ఉంటారా ..కనీసం వాడితో మా ఇండియాను తిడతావా అని ఎందుకు అడగలేకపోయాను.. ఎందుకు భయ పడ్డాను అసలు ..చంపేస్తాడనా ?? మరి హేమంత్ కర్కరే ..ఉన్ని క్రిష్నన్ ఇంకా అహర్నిశలు సరిహద్దులో మనకోసం చలిలో కుటుంబాలను సైతం వదిలేసి మరీ ప్రాణలకు తెగించి పోరాడుతున్నారుగా ..వీళ్ళందరూ భయపడితే???? నాకు చాలా ఏడుపొచ్చింది .. బాగా ఏడ్చాను.. నా పరిస్తితుల్లో ఇంకెవరన్నా ఉంటే ఏంచేసేవారో తెలియదు కానీ నేను తప్పు చేసాను..ఇంత జరిగినా కూడా భవిష్యత్తులో ఇలాంటి సంఘటన లాంటిది జరిగితే దైర్యం గా ఎదుర్కుంటానో లేదో కూడా తెలియదు.. చాలా రోజులు అన్నం కూడా తినాలనిపించేది కాదు..కాని ఓకటి చాలా బాధగా భయం గా అనిపించింది .. మనకూ... పాకిస్తానికి గొడవ .. అతను పాకిస్తాని కాదు.. మలయ్ వాడు.. అసలతనికి సంబందం లేదు..అయినా తన పొట్ట కూటి కోసమో మరి యే కారణానికో ప్రశాంతం గా ఉన్న మిగిలిన ముస్లిం ల మనసు పాడు చేస్తూ .. ఇలా కక్ష లు పెంచుకుంటే మానవ జాతి మనుగడ ఎలా ???

12, జనవరి 2009, సోమవారం

చెప్పాలని ఉంది !!!


మా ఇంట్లో మా అక్కకు ,చెల్లెళ్ళకు చిత్రలేఖనం లోను పాటలు పాడటం లోను మంచి నైపుణ్యం ఉంది .చాలా సార్లు స్కూల్ లో చక్కని బహుమతులు గెలుచుకుని వచ్చారు. ఎటూ ఏమీ రాని దాన్ని నేను ఒక్కదాన్నే .. వాళ్ళు అలా బహుమతులు తెచ్చినపుడు నాన్న కళ్ళల్లో కనబడే మెరుపు.. అమ్మ అందరికి గొప్పగా చెప్పుకుని పడే ఉత్సాహం.. ఇంట్లో మిగిలిన వాళ్ళ పొగడ్తలు చూసిన నాకు ఒకింత బాధ కలిగేది .. అయ్యో నాకేం రాదు కదా అని ...నేను ఇలా చిన్నబుచ్చు కోవడం ఎప్పటినుండి గమనిస్తుందో మా అక్క... అందరి చేతా నన్నూ ఎలాగన్నా శబాష్ అనిపించాలని తెగ ఆరాట పడేది..

ఒక రోజు నా చేతికి పెన్ను, పేపర్ ఇచ్చి ...చెల్లీ !! నువ్వూ చాలా బాగా బొమ్మలేయగలవ్ ..కానీ నీ మీద నీకు నమ్మకం ఉండదు అంతే ,కాబట్టి ఏకాగ్రతగా ఒక సారి ఈ పులి బొమ్మ వేసి చూడు అని ఎంతో ఇదిగా చెప్పింది..సరే ఇంక నాకు చాలా ఉత్సాహాం వచ్చేసి ఒక గంట ఎవరితోను మాట్లాడకుండా చాలా ఏకాగ్రతతో వేసేసాను .. వేసాక చూస్తే అది ఏనుగో ,జిరాఫీ యో మరి ఎలుగుబంటొ తెలియక నేనే తికమక పడిపోయా ఇంక దాని సంగతి వేరే ఏమి చెప్పను ..ఇంక దానితో నా ఉత్సాహం కి ఆనకట్ట పడిపోయింది .

కొన్ని రోజులు పోయాకా ఒకసారి నాకు ఎందుకో ఏదన్నా కవిత రాయాలనిపించింది.. అప్పట్లో కవితలంటే చివరిలో తప్పని సరిగా ప్రాస రావలనుకునేదాన్ని..అలా ఊహించి ,ఊహించి రాధాక్రిష్ణుల బొమ్మ చూస్తూ ఒక కవిత రాసేసా..
ఓ వెన్న దొంగా
అమ్మ లేదని బెంగా
రాధమ్మ చెంతనే ఉందిగా
అంటూ ఏంటో ..ఏంటో ఒక తవిక రాసేసి మా అక్కకు చూపించాను.. అది చూడ గానే మా అక్క కళ్ళనిండా ఆనంద భాష్పాలు.. ఎంత బాగా రాసావే ..ఆగు ఇప్పుడే అందరికి చూపిస్తా అని మా నాన్న గారి దగ్గరకు పరుగులు పెట్టింది ..అప్పుడే ఊరి నుండి మా అత్త వచ్చి అమ్మా నాన్నలతో మాట్లాడుతుంది .. మా అక్క ..చూడండి నాన్న ఎంత బాగా రాసిందో కవిత అని అనే లోపల ఏది నన్ను చూడనీ అని మా అత్త లాక్కుంది ..నేనేమో సిగ్గుగా గోడమీద పెచ్చులు లాగుతున్నా ..మా అత్త అది చదివి ..చూసారా వదిన గారు చిన్నపిల్లలు ఎంత తెలివి మీరిపోతున్నారో,అమ్మ అక్కరలేదూ బొమ్మ అక్కరలేదూ.. పెళ్ళాం ఉంటే చాలని ఎలా రాసిందో.. వీళ్ళకి ఇంత చిన్న వయసులోనే చాలా ముదురు ఆలోచనలు వచ్చేస్తున్నాయి అంది ..ఓరి దేవుడో నేనేదో ఊసుపోకా రాస్తే నా వీపూ చిట్లేలా ఉంది అని ఆ పేపర్ పట్టుకుని అక్కడినుండి పరుగులు పెట్టా..ఆ తరువాత నేను ,అక్కా కలిసి మా అత్తని తిట్టుకున్నాం అనుకోండి .. కాని ఆ దెబ్బతో నేను ఏమన్నా అలాంటి తవికలు రాస్తే మా అక్కకు చూపుకుని చింపేసేదాన్ని.. అలా నా కవితా హృదయం బ్రద్దలైపోయింది..

కొన్నాళ్ళు పోయాకా ఒక పత్రికలో చదివిన దాన్ని స్పూర్తిగా చేసుకుని మళ్ళీ ఒకటి రాసాను ..అ.. ఆ..ఇ.. ల మీద.(ఇలాంటివి మీరూ చదివే ఉంటారు)
అ రే అరుణ్
ఆ గరా
ఇ లా చూడూ
ఈ రోజేమైందో తెలుసా ...
ఈ టైపులో 'క్ష 'వరకు ఏదో ..ఏదో మళ్ళీ రాసేసా..అది చూడగానే మా అక్క ఎగిరి గెంతేసి .. ఈ సారి నువ్వంటే ఏంటో చూపిస్తా అని పరుగు పరుగున పోయి వరండాలో తులసీ రామాయణం చదువుకుంటున్న మా తాతయ్యను పిలిచి తాతయ్యా ! చెల్లి చూడూ అ.. ఆ లతో ఒకటి రాసింది అంది. మా తాతయ్య దానివైపు చూస్తూ అ.. ఆ..లతోనే కదా అందరూ రాస్తారు ..అన్నాడు.. అదికాదు తాతయ్య ఇది చదువు అని తాతయ్యకు ఇచ్చింది .. మా తాతయ్య అది చదివి ఏంటమ్మా నాకేం అర్దం కావడం లేదు అన్నాడు.. నాకు గాలి తీసేసినట్లు అయింది..అది కాదే తాతయ్య ముసలోడు కదా అందుకే అర్దం కాలేదు ..పాపం అక్క ఓదారుస్తుంటే నాకు ఎందుకో ఏడుపురావడానికి బదులు దాని తపన చూసి జాలేసింది..

ఒక సారి మా ఇంట్లో పిల్లకాయలందరూ గోల చేస్తుంటే మా పిన్నులు ,కాస్తా వీళ్ళు అల్లరి చేయకుండా చూడవే అని నాకు అప్ప గించారు ..సరే అని నేను ,అక్కా వాళ్ళను ఆడిస్తున్నాం ..మా అక్క ఎన్ని కధలు చెప్పినా ఈ కధా నాకు తెలుసు కొత్తది చెప్పు అని ఒకటే గొడవ వాళ్ళు..సరే అని నేను ఊహించి అప్పటికప్పుడు ఒక కధ చెప్పేసా.. అదివిని మా అక్క .. చెల్లీ! నువ్వు సామన్యురాలివి కాదు నీలో ఒక రచయిత్రి దాగుంది..మట్టి లో మాణిక్యం లా నీకు అవకాశం రావడం లేదు అంది.. పోనీ అని ఊరుకుందా .. మా ఇంట్లో మా నాన్న గారు ప్రతి నెలా బాలజ్యోతి తెచ్చేవారు (మాకు 18 ఏళ్ళు వచ్చేవరకు స్వాతి,ఆంద్రభూమి వంటి పత్రికలు నిషిద్దం ..18 ఏళ్ళు వచ్చాకా అసలు కొనడమే మానేసారనుకోండి అది వేరే విషయం) ఆ బాల జ్యోతిలో ఆ నెల కధల పోటీ లు వేసాడు .. పేజీ కి ఒక వైపే రాయాలి, నాలుగు పేజీలకంటే ఎక్కువ రాయకూడదు ఇలాంటి నిబందనలతో ఒక ప్రకటన ఉంది.అది చూపిస్తూ ..చెల్లీ, నీ టాలెంటు అంతా ఉపయోగించి ఒక కధ రాసేయి మిగిలింది నేను చూసుకుంటా అంది,నాకూ మనసులో ఎక్కడో కాస్త ఆశ ఉన్నా అంతకుముందు జరిగిన సంఘటలను బట్టి ఎందుకులేవే అన్నాను ..ఆయ్..ఇంత మంచి అవకాసం వస్తే ఎందుకూ అంటావా ,నీ గురించి నీకు తెలియదు అని రెండుపొగిడేసి కధరాయడానికి కూర్చోపెట్టింది..

సరే అనుకుని ఇంక నేను విజృబించేసి ఒక కధ రాసి దాని చేతికి ఇచ్చేసా .. అది చదవగానే తెగ సంతోష పడిపోయి చెల్లి, నీకేనే మొదటి ప్రైజు .. ఇంక దీనిని ఎవరూ అడ్డుకోలేరు అని మా తమ్ముడిని పిలిచి మొత్తానికి పోస్ట్ చేయించేసింది .. చేయించింది ఊరుకోవచ్చుగా .... అబ్బే.. ఆ ఆనందాన్ని తట్టుకోలేక ఇంట్లోని వాళ్ళందరితోనూ దీని కధ పత్రికలో పడాబోతుంది .. అంత బాగా రాసింది అని ఠాం ఠాం చేసేసింది.. ఇంక మా తమ్ముళ్ళు ఊరుకుంటారా ... అక్కా నీకు డబ్బులొస్తాయి కదా ఆ డబ్బులు ఏంచేస్తావ్ ..మాకు కేకులు కొనిపెట్టవా అని అప్పుడే రిక్వెస్ట్ లు మొదలెట్టారు.. నేనూ కూడా మనసులో నేనేదో గొప్పగా రాసేసా అని ఫీల్ అయిపోయా ..
మరుసటి నెల అయింది ఆ తరువాత 2 నెలలు అయ్యాయి కాని నా కధ పడలేదు ..ఇంక మా తమ్ముళ్ళు ఏడిపించడం మొదలు పెట్టారు...కధ వెనకకు కూడా తిప్పి పంపలేదంటే చెత్త బుట్టలో వేసేసి ఉంటాడు అని ..సరే ఇంకేం చేస్తాం ఉడుక్కుని ఊరుకున్నా..
కొన్ని రోజులయ్యాకా మా పుస్తకాలన్నీ సర్దుకుంటుంటే అందులో ఒక పేపర్ కనబడింది ఏంటా అని చూస్తే అది నేను రాసిన కధలో 3 వ పేజీ ...ఇదేంటి ఇక్కడుంది ఇది అని అక్కా..అని ఒక్క అరుపు అరిచా .. ఏంటే అని వచ్చీ నా చేతిలో పేపర్ చూసి ఇదేంటే ఇది ఇక్కడ ఉంది అని ..మెల్లిగా నవ్వుతూ ఈ పేపర్ పెట్టడం మర్చిపోయినట్లున్న కంగారులో అంది ...గాడిదా.. శుబ్బరంగా ఉన్నదాన్ని నీ అతి ప్రేమతో నానా తిట్లు తినిపించావ్ కదా అని వెనుకబడ్డా..
ఇప్పుడు మా అక్క సాదరణ గృహిణి..ఖాళిగా ఉండకుండా వాళ్ళ ఇంటి ముందు గది అంతా షాప్ చేసేసి 24 గంటలు మహా బిజీగా ఉంటుంది ..మొన్న ఎందుకో అక్క నాకోసం పడ్డ తపన గుర్తువచ్చీ .. నా బ్లాగ్ లో మీ అందరి అభిమానం గురించి చెప్పి తను సంతోష పడితే చూసి నేను సంతొష పడదామని ఫోన్ చేసా...
మా సంభాషణ ఇలా సాగింది ....

నేను : అక్కా..
అక్క: నువ్వా చెల్లీ!!బాగున్నావా అమ్మా..
నేను: అక్కా నేనేమో జాజిపూలు అని..
షాప్ కొచ్చిన అమ్మాయి: ఏమండీ ఇదెంతా ??
అక్క:అదా అండి 100 రూపాయలు..ఏంటమ్మా జాజి పూలు కొనుక్కున్నావా అక్కడ మన పువ్వులు దొరుకుతాయా..
నేను:అది కాదక్కా ..నేను బ్లాగ్ ఒకటి..
మా అక్క పెద్ద కూతురు : అమ్మా స్కూల్ కి టైము అవుతుంది జడ వేయి ...
అక్క : ఆగు పిన్ని మాట్లాడుతుంది..ఏంటమ్మా బావగారా బయటికి వెళ్ళారు ..అది 80 కి రాదండి .. కావలంటే 90 చేసుకోండి..
నేను:అది కాదక్కా నేను కధలు రాస్తున్నాను ..
అక్క రెండో అమ్మాయి: అమ్మా ఆకలి..
అక్క: నా బంగారం కదా అక్కడ ప్లేట్ లో పెట్టెసా తినేసేయమ్మా..ఏంటీ తినవా.....నేనే పెట్టాలంటే ఎలాగా !!తంతా జాగర్తా .. ఇంకో మాట లేదండి 90 కి వస్తుంది లేదంటే లేదు.. చెప్పమ్మా కదలు రాసావా ఇండియా కొచ్చినపుడు చదువుతాలే..
ఇలా అష్టావదానం చేస్తున్న అక్కతో ఆ హడావుడిలో చెప్పినా ఇంతకు ముందు లా తను సంతోష పడగలదా?ఈలోపల పిల్లలు కొట్టుకోవడం వాళ్ళ ఏడుపులు మద్య తరువాత చేస్తా అని పెట్టేసా..

తనకి తీరిక ఉన్నపుడు నాకు కాళీ ఉండదు..లేదా వాళ్ళకు తీరికైన సమయం మాకు అర్దరాత్రి అవుతుంది .. లేదా ఈ హడావుడి లైఫ్ లో అలసట వల్ల ఫొన్ చేయడమే కుదరదు..ఎంత తాపత్రయ పడేది నా కోసం.. ఏంత ప్రేమ చూపేది..అచ్చం అమ్మలా..ఆ చిన్న వయసులో అదంతా తెలిసేది కాదు నాకు ..ఇప్పుడు ఈ హడవుడి జీవితంలో కనీసం పాత ఙ్ఞాపకాలు తలుచుకునే తీరిక కూడా ఉండటం లేదు నాకు ..
ఒక్కోసారి అనిపిస్తుంది ....ఏందుకీ హడావుడి బ్రతుకులు ...ఏమైపోయాయి ఆ రోజులూ...

7, జనవరి 2009, బుధవారం

తప్పు ఎవరిదీ ???కార్తీక మాసం వచ్చిందంటే మా ఇంట్లో పిల్లలందరికీ నా మీద కోపం పీకలవరకు వచ్చేసేది..ఎందుకంటే నాకు ఆ మాసం లో అమ్మావాళ్ళతో తెల్లారకుండానే లేచి ,తల స్నానం చేసి ,చలికి వణుకుతూ ..బియ్యంపిండితో ముగ్గులు వేసి, నేతి దీపాలను నీళ్ళ పళ్ళెం లో వదులుతూ పూజ చేయాలంటే మహా ఇష్టం గా ఉండేది ..నా ఇష్టం కాస్తా మా అక్కా వాళ్ళకు యమా కష్టం గా ఉండేది . మా పిన్నులూ ,పెద్దమలూ చూసి ఊరుకుంటారా .. అదిగో దాన్ని చూసి నేర్చుకోండి .. మీరు ఉన్నారు ఎందుకూ..బారెడు పొద్దెక్కేవరకూ మంచం దిగరు .. అని ఆ మాసం అంతా తిడుతూనే ఉండేవారు..(మనలో మనమాట ..అసలు వాళ్ళను తిట్టంచడానికే సగం అలా చేసే దాన్ని అనుకోండి .. ష్..)పాపం అలా తెల్లరా గట్టానే లేవలేక ఇటు వీళ్ళ తిట్లు తినలేక నానా బాధలు పడేవారు..
అయితే మా ఇంటికి నాలుగు ఇళ్ళ అవతల సీతం పిన్ని కూతురు బంగారి ..నేనే అంటే నాకంటే నాలుగు ఆకులు .పువ్వులు ఎక్కువే తినేసింది..నేనింకా కార్తీక సొమ వారాలే చేసేదాన్ని ,అది నెల మొత్తం పూజలే..8th క్లాస్ చదువుతున్న బంగారి పేరుకు తగ్గట్టు బంగారు చాయతో మిల మిలా మెరిసిపోతూ ఉండెది ,మనిషి కాస్త పొట్టేకాని మహా కళగా ఉండేది మొహం.

ఒక సారి బంగారి మా ఇంట్కికి వచ్చి అక్కా.. రేపటినుండి కార్తీక మాసం కదా, రోజూ గుడికి వెళ్ళి దీపాలు వెలిగిస్తా ..ఈ నెల అంతా సాయంత్రాలు కాస్త గుడివరకూ తోడు రావా అని అడిగింది.ఏంటీ రోజూనా!! నా వల్ల కాదే బాబు... అయినా ఇంత చిన్న వయసులో నీకవసరం అంటావా ఈ పూజలు అన్నాను..ఏం చేయనక్కా ..మా అమ్మని చన్నీళ్ళ స్నానం చేయకూడదు అని డాక్టర్ గట్టిగా చెప్పాడు.. నేను చేయలేదంటే ఇంక తను మొదలు పెడుతుంది.. మా అమ్మ సంగతి తెలిసిందేగా ..ప్లీజక్కా ఒక్క దాన్నే వెళితే బోరు కొడుతుంది .. నువ్వురా అనేసరికి సరేలే అని ఒప్పుకోక తప్పింది కాదు..


మరుసటి రోజునుండి ఇద్దరం సాయంత్రాలు మా ఇంటికి కొంచెం దూరం లో ఉన్నశివకేశవుల గుడికి వెళ్ళడం మొదలు పెట్టాం ..రెండు రోజులయ్యాకా నేను గమనించిందేంటంటే ఆ దారిలో కొత్తగా ఎవరో ఒక అబ్బాయి మెడికల్ షాప్ పెట్టుకున్నాడు.. ఆ అబ్బాయి మమ్మల్నే చూసేవాడు అదేపనిగా మేము వెళుతుంటే ..ఇవన్నీ ఒక వయసులో సహజమే కాబట్టీ నేను గమనించనట్టు ఉన్నాను..కాని బంగారి.. అక్కా, గమనించావా ఆ అబ్బాయి మనల్నే చూస్తున్నాడు అంది..నాకు తిక్కలేసింది.. దీని వయసెంతా .. ఇవన్నీ చూడటం అవసరమా అని మనసులో తిట్టుకుని .. సరేలే మనకెందుకూ అని వేరే టాపిక్ మార్చేసా ...


మళ్ళీ రెండు రోజులు పోయాకా నాకు అర్దం అయిందేంటి అంటే ఆ అబ్బాయి బంగారినే చూస్తున్నాడు ఎంతో ఆసక్తిగా.. ఈలోపల బంగారి ..అక్కా,ఆ అబ్బాయి నన్నే చూస్తున్నాడు అక్కా అంది .. ఎక్కడ మళ్ళీ నేను నన్ను చూస్తున్నాడని అనేసుకుంటానేమో అని..
దీని ఆసక్తి తగలయ్యా అని తిట్టుకోబోయి నేను మాత్రం చేస్తున్న పనేంటి.. నేనూ గమనించానుగా .అసలు అమ్మాయిలకి అబ్బాయిలు వెనుక నుండి చూసినా ముందు అద్దంలో చూసినట్లు కనబడిపోతుంది అనుకుంటా అనుకుని ఊరుకున్నా..

అప్పటి నుండి బంగారిలో మార్పు మొదలైంది .. సరిగ్గా ఆ షాప్ దగ్గరకు కి రాగానే గల గలా మాట్లాడటం,కిల కిలా నవ్వడం చేసేది..ఈ మాటలు,శబ్దాల వల్ల అతను వేరే పనిలో ఉన్నా అది ఆపు చేసి మరీ చూసేవాడు..నాకు మహా చిరాకు వచ్చేసేది ..ఈ దిక్కుమాలిన సినిమాలు, సీరియళ్ళు బాగా చెడగొడుతున్నాయి పిల్లల్ని..అరే..దీని వయసులో నాకు ఏమీ తెలిసేదే కాదు ..ఒక సారి నేను స్కూల్ కి వెళుతుంటే ఎవరో అబ్బాయి సైకిల్ మీద అటూ ఇటూ చక్కర్లు కొడుతుంటే పాపం ఈ అబ్బాయికి ఎన్ని పనులో ..ఎన్ని సార్లు అటు ఇటూ తిరుగుతున్నాడు అని తెగ జాలి పడిపోయాను..తీరా చూస్తే రెండో రోజు సాయంత్రం ఎవరూ లేని సమయం చూసి మీరంటే నాకు చాలా ఇష్టం అండి అన్నాడు ..దెబ్బకు కళ్ళనుండి నీటి కుండలను జోరు జోరుగా ఒంపేసేసరికి అడ్రస్సు లేకుండా పారి పోయాడు.. అది వేరే విషయం అనుకోండి..

సరే చిన్న పిల్ల దీనికి అంటే బుద్దిలేదు .. లోకం తెలియదు..వీడి బుద్ది ఎందుకు గడ్డితింది.. దానికంటే కనీసం 12 ..13 యేళ్ళు పెద్దవాడుంటాడు ,ఆడపిల్ల కనబడితే చాలు వయసు వరసా తెలియదు వెదవలకి అని తిట్టుకున్నాను..ఆ విసుగు అంతా కోపం రూపం లో బయటకు వచ్చేసేది..ఎహే .. ఎందుకంత గట్టిగా మాట్లాడుతావ్ నెమ్మదిగా మాట్లాడు అనో,అబ్బా కాస్తా మెల్లగా నవ్వచ్చుగా అనో తిట్టేదాన్ని..
ఒక్కోసారి ఈ కోపానికి కారణం వాడు బంగారిని చూస్తున్నాడనా???..లేక నన్ను చూడటం లేదనా అనే అనుమానం కూడా వచ్చి చచ్చేది .. నా అంతరాత్మకు నా మీదా అస్సలు నమ్మకం ఉండి ఏడవదు ..


ఇదిలా ఉండగా మరో రెండు రోజులకు మెల్లిగా ఇద్దరు ఫ్రెండ్స్ తయరయ్యారు వాడికి ..అప్పటి వరకూ యే మూలన ఉండి ఏడుస్తారో గాని ఇలాంటి విషయాల్లో భలే వచ్చేస్తారు.. చెల్లీ... బావా అని దిక్కుమాలిన వరసలు కలుపుకుంటూ .. వీళ్ళ ఫ్రెండ్స్ మీద వీళ్ళకే నమ్మకం ఉండదనుకుంటా అందుకే చెల్లి ని చేసేస్తారు అర్జెంటుగా కసిగా తిట్టుకున్నా ..అదిగో నేను అనుకున్నట్లుగానే అయింది .. ఒక సారి వస్తుంటే వారిలో ఒకడు ..ఎంతైనా చెల్లెమ్మ కళే వేరురా ,వస్తుంటే లక్ష్మీ దేవి నడిచి వస్తున్నట్లుగా ఉంటుంది అన్నాడు ..ఛా ..అనుకుని క్రీగంట బంగారిని చూసాను ..తల వంచుకుని కనబడకుండా ముసి ముసి నవ్వులు నవ్వేసుకుంటుంది..నాకు భయం వేసింది .. ఇలాగే కొనసాగితే కొన్నాళ్ళకు ప్రేమా దోమా అని అనడం ఖాయం..అందుకే దానికి దారంతా తల్లిదండ్రులు మనకోసం పడే కష్టాలు.. బాగా చదువు వలన వచ్చే లాభాలు .. ఇలాంటివి పని గట్టుకుని మరీ చెప్పేదాన్నీ.. చక్కగా ఇటు నేను చెప్పేవన్ని చిలకలా వినేది అటు చూస్తునే ఉండేది..

ఆ మరుసటి రోజు చక్కగా పరికిణి ,వొణి వేసుకుని తన బారు జుట్టు వదులుగా జడ అల్లుకుని వచ్చింది .. చెప్పద్దూ భలే ముచ్చటగా ఉంది.. కొంచం పొడవుగా 18 ఏళ్ళ అమ్మయిలా కనబడుతుంది..అది ఏంచేసినా నాకు మహా కోపం వచ్చేస్తుంది నాకు .. అక్కా బాగున్నానా అంది ..తెగ సిగ్గు పడిపోతూ ..ఇప్పుడు ఇదెందుకేసుకున్నావ్ .. అక్కడ నేల అంతా చిత్తడి పుత్తడిగా ఉంటుంది.. పాడై పోతుంది .. వెళ్ళి డ్రెస్ వేసుకునిరా అన్నాను.. ఎంత వద్దు అనుకున్న కోపం తొంగి చూసేస్తుంది నా మాటలో ..అది పట్టించుకోకుండా ..అక్కా .. మా అమ్మ చెప్పులేసుకున్నా బాగున్నాయా అంది దాని హై హీలు చూపిస్తూ..అదన్న మాట సంగతి అందుకే అంత పొడవు కనబడుతుంది..
అసలు నీకో విషయం తెలుసా ఎత్తు చెప్పులేసుకుంటే నడుము నెప్పి..వెన్ను నెప్పి వస్తుంది అందుకే నేను వేసుకోను అన్నాను..ఈ లోపల మా అక్క వచ్చింది .. ఎవరూ మన బంగారే!! ఎంత బాగున్నవే బాబు.. అంది.చూడక్క హీలు వేసుకుంటే నడుము నెప్పివస్తుంది అంటుంది అంది నావైపు చూస్తూ..దాని మొహం ..దానికి అలా నడవడం చేతకాదు.. నేను వేసుకోవడం లేదేంటి.. నువ్వు ఇలా కంటిన్యూ అయిపో నా మాట వినీ అంది..సర్లే నా పరువు పోయేలా ఉంది అని ఇంక బయలు దేరా..

ఆ రోజు ఆ అబ్బాయి మొహం చూడాలి సుర్యా బల్బు లా ఎలా వెలిగిపోయిందో..అసలు ఆ చూపుల్లో భావాలు నాకర్దం కాలేదు..ఇంక విసుగొచ్చి బంగారి మనం వేరే వీదీ లో వెళదామే ఈ రోడ్ అంతా గతుకులే అన్నాను..అక్కా ఇదే బెటెర్ .. దగ్గర అంది ..ఇంక నిన్ను బాగు చేయడం నావల్ల కాదు అని ఊరుకున్నా..ఇక అది పరికిణి,వోణీ లకు పరిమితం అయిపోయింది..

ఒక రోజు మా కాలేజ్ నుండి వస్తుంటే ఆ అబ్బాయి ఫ్రెండ్స్ కనబడ్డారు..మనకెందుకులే అనుకుని నేను వెళుతుంటే .. నా వైపుకొచ్చీ చెల్లెమ్మ మీ ఫ్రెండా అండీ అన్నాడు..నేను కోపం గా ఒక్క చూపు చూసా.. అయినా పట్టించుకోకుండా చెల్లెమ్మ పేరేమిటండీ అన్నాడు ..
నాకోపక్క భయం గా కూడా ఉంది .. మా ఇంట్లో చిన్నానలో, తమ్ముళ్ళో ఎవరో ఒకరు దారిలో నాకు కనబడుతునే ఉంటారు.. మల్లీ ఇదో ఇష్యూ అవుతుంది .అయినా కోపం తట్టుకోలేకా మీకో విషయం తెలుసా వాళ్ళ నాన్న S.I అన్నాను ..అన్నాక గాని సిగ్గువేయలేదు.. చిన్న పిల్లలకు బూచివస్తాడు అన్నం తినమ్మా టైపులో అలా అంటే వాళ్ళు ఎలా నమ్ముతారు ..అవునా అండీ..యే ఏరియా.. వీళ్ల నాన్న గారు కూడా s.I నే.. అన్నాడు..పక్కోడిని చూపిస్తూ..వాళ్ళు నన్ను ఆట పట్టిస్తున్నారో లేదా నిజమో తెలియదుకాని నాకు పోలీసు ని చూస్తేనే మహా భయం..ఇంక ఇంటికి పరుగులాంటి నడకతో వచ్చేసా.

ఆ తరువాత బంగారికి చెప్పాను నీ గురించి ఇలా అడుగుతున్నారు .. వాళ్ళ ఫ్రెండ్ నాన్న అసలే s.i అంటా అని ..అది కూడా భయ పడినట్లు ఉంది దెబ్బకు అక్కడికొచ్చేసరికి ఏమీ మాట్లాడకుండా తల వంచుకునేది..ఎమైందో తెలియకా ..కిలకిలలు,గల గలలు ఆగిపోయే సరికి నా వైపు అనుమానం గా చూసేవారు..

ఒక రోజు మేము వస్తుంటే ఆ అబ్బాయి గభ గభ గా షాప్ దిగి మా ఎదురుగా వచ్చాడు..ఇద్దరికి గుండెల్లో ధడే.. చెల్లెమ్మా అన్నాడు.. నా వైపు చూసి కాదు బంగారిని చూసి .. నేను నోట మాట రాకా అలా చూస్తూ ఉండిపోయా ..soRRy అమ్మా ఇలా పిలచ్చో లేదో ..మా చెల్లి నీకు లాగే ఉంటుంది ..అతని గొంతు గద్గద మయ్యింది..(మరేం అయిందో..?) వేరేగా అనుకోకమ్మా అని వెళ్ళి పోయాడు.

నాకు పాతాళం లోకి కూరుకుపోతున్నట్లు అనిపించింది..చీ ఎంత తప్పుగా ఆలోచించాను..ఒక అమ్మాయిని అబ్బాయి చూస్తే ఇంక అదేనా?ప్రస్తుత సమాజం లో పరిస్తితి బట్టి అలా ఆలోచించానా?లేకా నా ఆలోచనలే సరిగా గా లేవా??.. ఇంకెప్పుడూ అనవసర విషయాలు అతిగా ఆలోచించకూడదు అనుకున్నా.. ఆ రోజంతా ఎదో బాధగా అనిపించింది.. మరుసటి రోజు వెళుతుంటే అక్కా ఈ వీది లో నుండి వద్దు వేరే వీది నుండి వెళదాం అంది బంగారు..ఎందుకు అని అడగలేదు,, ఎందుకంటె ఎక్కువగా ఆలోచించడం మానేసి నేను చాలా సేపయ్యింది ..

4, జనవరి 2009, ఆదివారం

మన్నించు మిత్రమా !!!మా friends అందరూ ఏకగ్రీవంగా నాకు పెట్టిన బిరుదేమిటంటే నేను వొఠ్ఠీ అనుమానపు పిరికి పిశాచిని అని...పోని అంతటితో ఊరుకున్నారా??..అనేకానేక jokes వేసి ఏడిపించేవారు..అందులో మచ్చుక్కి ఒకటి ..పెళ్ళి పీటల మీద కూర్చుంటూ ..పెళ్ళికొడుకుని చూసీ ..మొన్న పెళ్ళి చూపూల్లో చూసింది ఇతనినేనా ?లేక పొరపాటున వేరే కళ్యాణ మండపానికి వెళ్ళాబోయి ఇక్కడికి వచ్చేసాడా ?అనే కంత్రీ అనుమానపు ఆలొచనలు నాకు తప్పా ఎవరికీ రావంటా ...సరే నా విషయం పక్కన పెడితే, మా సత్యవేణి నాకు పక్కా వ్యతిరేకం...తన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే .. ఎక్కడో వీధి చివరన ఎర్రరంగుచొక్కా వేసుకున్నవాడిని చూసి .."నిన్న పెళ్ళి చూపులకు వచ్చిన వాడు కూడా ఇదే రంగు షర్ట్ వేసుకున్నాడు కదా .. కాబట్టి ఇతనే అతను అని నిర్ణయించేసుకుని దగ్గరకు వెళ్ళి హాయ్ అని పలుకరించే టైపు"..

అలాంటి సత్యవేణి ఇంటికి వెళ్ళాను ఒకసారి .. తను పెళ్ళి అయ్యాక నాలుగు నెలల తరువాత పుట్టింటికి వచ్చింది.. ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటుండగా ఫొనె మోగింది..చేసిన వాళ్ళు మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్ అయిన లత అనే అమ్మాయి.విషయం ఏమిటంటే ..అనుకోకుండా ఒక NRI అబ్బాయితో పెళ్ళి కుదిరి వారం రోజుల్లో పెళ్ళి అయిపోయింది కాబట్టి ఎవరిని పిలవడానికి అవ్వలేదు ..రేపు రిసెప్షన్కి తప్పనిసరిగా రండి .. ఇంటికి వచ్చి పిలవనందుకు ఏమి అనుకోవద్దు అని రెండు ప్లీజ్లు రెండు సారీల మధ్య ఎంతో ప్రేమగా పిలిచింది ..

చెబితే మీరు నమ్మరు గాని ..మా ఇంట్లో మేమందరం ఆడపిల్లలమనో మరి ఉమ్మడి లో మాట వస్తుందనో తెలియదు కాని ఎక్కడికి పంపేవాళ్ళు కాదు .. నేనూ కూడా ఇంట్రెస్ట్ లేక సగం.. బద్దకంతో సగం ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు..ఈ కారణాల వల్ల నాకు మా ఇల్లు , స్కూల్,కాలేజ్ ,కొద్దిపాటి ఫ్రెండ్స్ఇళ్ళు తప్ప ఇంక ఎక్కడికి దారి తెలియదు .కాబట్టి .. మీ ఇల్లు తెలియదు కదే ,ఎక్కడా??? అని అడిగాను.. ఈ లోపల సత్యవేణి నా దగ్గర నుండి ఫోన్ లాక్కుని నాకు తెలుసులేవే రేపు నేను తీసుకు వెళతాగా అంది..

దాని సంగతి ముందే తెలుసుకాబట్టి.. "తల్లీ నాకసలే ఏమీ తెలియదు ..ఎందుకైనా మంచిది మళ్ళీ నువ్వు అడుగు "అన్నాను..అది చిరాకుగా లత తో అబ్బా దీనితో ఇదేనే బాబు మహా చిక్కు.. చెప్పినా నమ్మదు. మీ ఇల్లు పలనా ఫలనా దగ్గర రాములవారి గుడి వస్తుంది కదా అక్కడినుండి రెండో వీధిలో లెఫ్ట్ తిరిగితే వస్తుంది కదా అంది..అవతల అదేం అన్నాదో తెలియదు .. ఒక రెండు నిమిషాలు మాట్లాడేసి రేపు అందరికంటే ముందు మేమే వస్తాం.. నువ్వేం ఫీల్ అవ్వకు అని పెట్టేసింది.

ఇంతకీ దగ్గరా ...దూరమా అన్నాను...మా అమ్మని ఎలా బ్రతిమాలుకోవాలో ఆలోచిస్తూ ..దూరం అంటే రాను అంటాననో లేక దానికి లత ఇల్లు పెద్ద దూరం అనిపించలేదో తెలియదు కాని .. అబ్బే ఇక్కడేనే ,నా బండి మీద వెళితే 10 నిమిషాలు ,నేను తీసుకు వెళతాగా ..నువ్వు అట్టే కంగారు పడకు అంది..ఇంక తప్పేది లేదు కాబట్టి సరే ..కానీ తొందరగా వచ్చేద్దామే బాబు ,మా ఇంట్లో సంగతి తెలుసుగా అన్నాను లేచివెళ్ళబోతూ ..

ఇదిగో కాస్త తొందరగా 10 గంటలకల్లారా.. మరీ.. భోజనం టైముకి వెళితే చండాలంగా ఉంటుంది..తిన్నాక ఎలాగూ నువ్వు అక్కడ ఉండనివ్వవు కదా అంది.సరే అని ఇంటి కొచ్చేసాను.మరుసటి రోజు ఇక్కదేనమ్మా ...ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాగా అని ఒప్పించి.. గిఫ్ట్ కొనగా మిగిలిన డబ్బులని పర్స్ లో వేసుకుని హడావుడిగ సత్య ఇంటికి బయలుదేరాను..అసలే తోందరగా రమ్మంది అరగంట ఆలస్యం అయింది..ఎన్ని తిట్ట్లు తినాలో అనుకుని .

తీరా వెళ్ళి చూద్దును కదా.. అమ్మగారు దుప్పటి ముసుగేసి పడుకుంది.ఓసి గాడిదా అనుకుని లేపితే అప్పుడే వచ్చేసావ ఇదిగో 5 నిమిషాల్లో తయరైపోతాను అని గంట చేసి నా తిట్ల మధ్యలో మేకప్పు పూర్తి చేసి బయటకు వచ్చి బండిని ఒక సారి చూసి పెట్రోల్ అయిపోయింది అంది మెల్లిగా నసుగుతూ ..ముందు కోపం వచ్చినా, అంతా మన మంచికే అంటారు.. ఇది బండేలా నడుపుతుందో ..ఎందుకొచ్చిన గొడవ.. ఇక్కడే అంటుందిగా అనుకుని ఆటో లో పోదాం అన్నాను.సరే అనుకుని దారిలో ఆటో అబ్బాయిని పిలిచి ఎక్కాము. నాకేలాగు ఏమి తెలియదు కాబట్టి నేను మహరాణి లా కూర్చున్నా .. ఆ తిప్పలేవో అదే పడుతుంది అని.

తను ఆటో వాడితో ఏదో చెప్పింది ..అతను ఏదో అన్నాడు .. మొత్తానికి ఆటో స్టార్ట్ అయింది ..ఇంక నిన్న సగం చెప్పి వదిలేసిన వాళ్ళ అత్తగారి గయ్యాళితనం గురించి తన బాధలు ,కష్టాల గురించి మళ్ళీ మొదలెట్టింది.నేను కూడా అయ్యో పాపం.. అలా అందా ..నీకెన్ని కష్టాలొచ్చాయి ..ఆవిడ మరీ అంత రాకాసా అని వంత పాడసాగాను .చల్లగాలి తాకుతుంటే ఆ ప్రయాణం చాలా హాయిగా అనిపించింది ..మాటల మధ్యలో ఎంత దూరం వెళుతున్నామో గమనించలేదు నేను ..ఇంతలో .." ఎంత దూరం అమ్మా ఇక్కడ అంటావ్, అక్కడ అంటావ్ సరిగా ఏది చెప్పవు, నాకు తిరుగు బేరం కూడా దొరకదేమో ఇటువెళితే "అన్నాడు ఆటో అబ్బాయి విసుగ్గా ...

అప్పుడు చూసా బయటకు ..రోడ్ కి అటు ఇటు చెట్లు,చేమలు దూరంగా పొలాలు ..అసలెక్కడ ఉన్నాం టైం చూసుకున్నా గబుక్కున ..బయలు దేరి 45 నిమిషాలు అయింది .ఇదేంటే చాల సేపైంది.. ఎక్కడ వాళ్ళిల్లు ఇంకా రాలేదేంటి అన్నాను కంగారుగా .
ఇక్కడేనే వచ్చేస్తుంది ఇంకో 2నిమిషాలు.. ఈ ఆటో వాడు మరీ నెమ్మదిగా వెళుతున్నాడు అంటూ తనసోది మళ్ళీ మొదలేట్టింది..ఇంక నా కళ్ళు రోడ్ కి అతుక్కుపోయాయి.. ఇంకో పది నిమిషాలయినా లత ఇల్లు కనబడలేదు..నాకు కంగారు మొదలైంది..

అడ్రెస్ కరెక్టేనా మళ్ళీ అడిగేలోపల" ఆ గుడేనా అమ్మా" అన్నాడు ఆటో వాడు.. అదే అదే అంది సత్య .హమ్మయ్య అనుకుని ఊపిరి పీల్చుకున్నా ..అప్పుడు గుర్తువచ్చింది ...నేను దగ్గరే కదా పైగా దాని బండి మీద వెళతాం కదా అన్న ధీమాతో డబ్బులు ఎక్కువ తేలేదు. ఆ మాటే అన్నాను దాని చెవిలో గుసగుసగా ..నీ పిసినారితనం సంగతి నాకు తెలియదేంటి ..నేను తెచ్చాలే అని అటు ఇటు చూసి నా బేగ్ ఏదే అంది.ఏ బేగ్ అన్నాను అయోమయం గా అప్పుడే నా కుడికన్ను అదరడం మొదలైంది..అదేనే , రెడ్ గా ఉంటుంది నా హేండ్ బేగ్ అంది మళ్ళీ వెదుకుతూ ..అయిపోయింది మర్చిపోయిందన్నమాట .. హెలో ...ఇది మైసూర్ ప్యాలేస్ కాదుతల్లీ అంతాగా వెదికేయకు ,నువ్వు వచ్చేటపుడు గిఫ్ట్ పేకేట్ తప్ప ఇంకేం తేలేదు అన్నాను ..

నాకు ఆతోవాడి మొహంలో చూడాలంటేనే భయం మొదలైంది .అప్పటికే విసిగిపోయాడు ఇది తిప్పిన తిప్పుళ్ళకు . అంతా నీవల్లే హడావుడిపెట్టేసావ్ వచ్చేటపుడు అంది ..మొత్తానికి నాదగ్గర ఉన్న డబ్బులన్నీ వెదికి వెదికి ఇచ్చినా ఇవ్వవలసిన దానికంటే తక్కువే ఉన్నాయి..ఇంకా ఆటోవాడు తిట్టిన తిట్లేమి రాయగలను లేండి ..తలుచుకుంటే ఇప్పుడు కూడా తల గోడకేసి ఢాం ..ఢాం అని కొట్టు కోవాలనిపిస్తుంది ..సరే వచ్చేటప్పుడు మన వాళ్ళను డబ్బులడుగుదాములే అనుకుని చుట్టూ చూసా.. ఏదో చిన్న ఊరులా ఉంది ,అక్కడ అక్కడ ఇళ్ళు ఉన్నాయి ..ఇంకా లోపలకు వెళితే ఎక్కువ ఇళ్ళువస్తాయేమో అనుకున్నా.. మిట్ట మధ్యాహ్నం అయిందేమో ఎండ ఎర్రగా కాస్తుంది.

ఇక్కడనుండి రెండో వీధిలో వెళ్ళాలే .. ఇదేంటే ఊరు ఇలా మారిపోయింది..వీధులే కనబడటం లేదు అంది ..అటు,ఇటు చూస్తూ ."నీ ఎంకమ్మ అలా భయపెట్టకే బాబు కరెక్ట్ గానే తీసుకొచ్చావా" అన్నాను ..అబ్బా అలా కంగారు పెట్టకు గుడి వచ్చేసిందిగా ..ఇక్కడే అంది..అప్పుడు చూసా ...అది అమ్మవారి గుడి.. "రాములవారి గుడన్నావ్..అమ్మవారి గుడిఇది" అన్నాను ..నా నోరు తడి ఆరిపోయింది దెబ్బకు .

అదేం పట్టించుకోకుండా ఈ గుడేనే ,రాములవారి గుడి అనుకున్నట్లున్నా .. అని ముందుకు నడించింది .ఇదేనే .. కరెక్టే .. కాకపోతే అప్పటికి ఇప్పటికి కొంచం తేడా ఉంది ఊరు అంతే అంది.ఎన్నాళ్ళు అయింది నువు ఇక్కడకు వచ్చి అన్నాను అనుమానం గా ..ఒక సంవత్సరం అయిందేమో.. లత ఒక సారి తీసుకొచ్చింది అంది ..అయిపోయింది ఇప్పటివరకు ఉన్న కొంచం ఆశ కూడా పోయింది ..ఇంక దీనికేమి గుర్తు ఉంటుంది దారి ..ఇంక చేసేది ఏమి లేక దాని వెనుకే తిరుగుతున్నా..అలా తిరుగుతున్నామే కాని లత ఇల్లు మాత్రం కనబడటం లేదు.. ఎండకు భయపడి కాబోలు అందరు తలుపులేసుకుని ఇళ్ళలోనే ఉన్నారు ..

నాకు ఆకలి దంచేస్తుంది.. పాపం తనని కనీసం తిండి కూడ తిననివ్వకుండా తీసుకొచ్చేసా..ఇంక చేసేదేమి లేక ఎవరినన్నా అడుగుదాం అనుకుని తలుపు కొట్టాం ..చాలా మంది తలుపులు తెరవలేదు నాకు మొదటి సారిగా భయం వేసింది ఆ ప్లేస్ చూసి..ఒకరిద్దరు తలుపులు తెరిచినా ఎదో భాషలో మాట్లాడుతున్నారు.. అది తెలుగు మాత్రం కాదు.. ఎక్కడికొచ్చెసాం బాబోయ్ అనిపించింది..కొందరు తెలుగు మాట్లాడినా మేము చెప్పే అడ్రెస్స్ తెలియదంటున్నారు ..అందరూ భోజనాలు చేసి పడుకునే టైము అది.. అందుకని విసుగు కనబడుతుంది వాళ్ళ మాటల్లో..

నా గుండెల్లో ధడ మొదలైంది.. పెళ్ళికదా అని కాస్తొ,కూస్తొ బంగారం వేసుకున్నాం..అంగుళం మేరకు పౌడర్లతో నింపేసాం మోహాలకి ..ఇలా అందరి దగ్గరకు వెళ్ళి అడిగితే ఒంటరివాళ్ళం కదా అని యేపక్కకో లాక్కు పోతే ??? ఈ ఆలోచన చిన్నగా మొదలై ఇంకా నా మెదడును దొలిచెయడం స్టార్ట్ చేసింది.అసలే ఇక్కడ ఎవరూ పట్టించుకోవడం లేదు.. అరిచినా గీపెట్టినా ఎవరూ రారు ..అంతే ,ఇంక చాలు వెదికింది.. పదా పోదాం అన్నాను సత్యతో .. మన ఇంటికి ఎలా వెళ్ళాలో దారన్నా తెలియాలి కదా అంది ..నాకు కొపం తిట్ల రూపంలో వచ్చేసింది.. చంపేస్తా .. నోరు ముసుకూని నావెనుక రా.. మీ అత్తగారు ఊరికే తిట్టలేదు నిన్ను.. ఇలా తింగరి మంగరి పనులు చేసావనే తిట్టి ఉంటారు అని శుబ్బరంగా తిట్టి పడేసా..పాపం ఏమి అనకుండా నా వెనుకే వచ్చేసింది..అలా వెతుక్కుంటూ వెతుక్కుంటూ రొడ్ మీదకు వచ్చేసాం..

అలా రోడ్ మీదా పిచ్చి మొహాల్లా నడుస్తున్నాం .. కొంచం ముసలి వాళ్ళు దొరికితే దారి అడిగే వాళ్ళం.. కొందరు తెలియదు అనేవారు కొందరు అటు అంటే కొందరు ఇటు అనేవారు.. ఎటో తెలియకా నడుస్తునే ఉన్నాం .. అప్పుడప్పుడూ వచ్చే లారీలూ,సైకిళ్ళు తప్ప ఒక్క ఆటో కూడా కనబడదు ..సాయంత్రం అయిపోయింది కసేపటిలో చీకటి పడిపోతుంది అనే ఆలోచనే భయంకరం గా అనిపించింది.ఇంకా నయం వర్షం లేదు మా కష్టాలకి తోడుగా ..అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది..ఇంకా రాలేదు అని ..నాన్నమ్మ వీధి గుమ్మానికి అతుక్కుపోయి ఉంటుంది ..మా ఇంట్లో వాళ్ళకంటే మా వీధిలో వాళ్ళు మరీ గమనిస్తారు నా రాకపోకలు.. పనిపాటా ఉండదు..నాకు ఏడుపొచ్చేస్తుంది..ఏమికాదులేవే సత్య దైర్యం చెబుతుంది..

దూరం గా చిన్న చిన్న ఇళ్ళు ,బడ్డి కొట్ట్లు కనబడుతుంటే కొంచం ప్రాణం లేచొచ్చినట్లు అయింది..ఎవరన్నా దారి చెబుతారెమో అని..ఈ లోపల ఒకఆటోరావడం చూసి పదవే ఆటో ఎక్కేద్దాం అంది ఉత్సాహంగా సత్య..అయినా భయమే నాకు.. మొన్నే పేపర్ లో ఆటో వాడి దురాగతాలు చదివాను ...చీ ..నా ఖర్మ కాకపోతే అన్ని ఇప్పూడే గుర్తు రావాలా..నేను వద్దు అని చెప్పే లోపే తను ఆటో ఆపు చేసింది .. అడ్రెస్ చెప్పే లోపల అతను నా వైపు చూసి హే.. నీ పేరు ఫలాన ఫలానా పేరు కధా ???అన్నాడు..
ఏక వచనం తో సంబోధిన్చినందుకు కోపం వచ్చినా నా పేరు చెప్పేసరికి ఆక్చర్యపోయాను....flashbackకి వెళ్ళే ఓపిక కూడా లేదు..

హమ్మయా వీరికి ఓకరికొకరు తెలుసేమో అనుకుందేమొ ఆసరికే ఆటొఎక్కి కూర్చుంది సత్య."గుర్తు పట్టలేదానన్ను.. ఎలా గుర్తుంటాం లే .. దెబ్బలు తిన్నది మేము కదా .. కొట్టించినోళ్ళకు ఏం గుర్తుంటుంది" అన్నాడు ..ఆసరికే ఆటోలోకి లాగేసింది నన్ను సత్య..
"నేను ...ప్రసాదుని అప్పుడు మీ ఇంట్లో వాల్లందరితోను కొట్టించేవ్ కదా" అన్నాడు ఆటో నడుపుతూ..అప్పుడుగుర్తు వచ్చింది ..అదెప్పుడు సంగతీ ..నేను 7th చదివేటప్పుడు క్లాస్లీ లీడర్ గా ఉండేవాడు ..పక్క అమ్మాయితో మాట్లాడా అని నా చేతి మీదా 3 సార్లు ఫేడెల్.. ఫేడెల్ మని ఇచ్చాడు పేక బెత్తం తో లీడర్ని అనే హుషార్ లో ...

స్కూల్ మానేయడానికి దొరికిందికదా చాన్స్ అని కాస్త ఎక్కువగానే నటించేసా ఆ రోజు ..మా అమ్మ ఆ రోజు తోడికోడళ్ళ సమావేశం లో ఇంకొంచం కలిపి పాపం దాని చేయి ఇంతలావున వాచిపోయింది ..అన్నం కూడా తినలేక పోయింది అని చెప్పింది..వాళ్ళు మా చిన్నాన్నలకు రాగానే ఇంకొన్ని వేసి చెప్పారు..ఇంకేముంది మరుసటి రోజు ఒకరి తరువాత ఒకరుగా మా స్కూల్ కి రావడం ప్రసాద్ గురించి చెప్పడం..చివరకు మా నాన్న గారు వచ్చేసరికి మా హెడ్మాష్టార్ కి జీవితం మీద విరక్తి వచ్చేసి మాష్టార్ ని, ప్రసాద్ని పిలిపించి గట్టిగా తిట్టేసారు..

ఆ కోపంలో మా సార్.. నేను అల్లరి చేయకుండా చూడరా అంటే కొడతావా అని పాపం వీర ఉతుకుడు ఉతికేసారు ..మరేమయిందో తెలియదు తరువాత రోజు నుండి తను స్కూల్ రావడం మానేసాడు..అందరూ నన్ను ఏడిపించేవారు నీతో పెట్టుకుంటే బ్రతుకు బస్టేండే అని..మళ్ళీ ఇన్నాళ్ళకు కనబడ్డాడు.కనబడితే కనబడ్డాడు ..నన్ను ..నే కొట్టించిన దెబ్బలను కూడా కలిపి గుర్తు పెట్టుకున్నాడు..అసలు వీడు మంచివాడేనా ..నా మీద కసి ఏమి పెట్టుకోలేదుకదా ..నా వల్లే వాడి జీవితం ఆటొకి పరిమితం అయిపోయింది అని .. ఎవో పిచ్చి ఆలోచనలు..దారిలో ఎవరినన్నా ఎక్కించుకుని ఎక్కడికన్న తీసుకు పోయి .. రామ,రామ.. ఎటు తిప్పినా అవే ఆలోచనలా..

చూడూ దారిలో ఎవరినీ ఎక్కించుకోకు అన్నాను.. నా వైపు ఒక సారి చూసి తల తిప్పుకున్నాడు ..మాట్లాడితే తంతాననుకుందొ ఏమో సైలెంట్ గా చూస్తుంది సత్య..మెల్లిగా చీకట్లు ముసురుకుంటున్నాయి చాలా సేపైంది ఆటో ఎక్కి .. దేవుడా దేవుడా అనుకుంటూ కూర్చున్నా .అసలే అలసిపోయిందేమో చల్లగాలికి నిద్ర వచ్చేసినట్లుంది నా భుజం మీద పడుకుండిపోయింది సత్య .ఒక్కరం కూడా మాట్లాడుకోలేదు దారిలో ..దూరంగా ఇళ్ళు కనబడటం స్టార్ట్ అయ్యింది.. అంటే మా ఊరు వచ్చేసిందా? మెల్లిగా అవన్నీ నాకు తెలిసిన ప్లేస్ లాగానే అనిపించసాగాయి.. అంటే మా ఊరు వచ్చేసాం అన్నమాట.. ఒక్క సారిగా మనసు దూది పింజెలా తేలికైపోయింది..

ఎప్పుడు లేచిందో సత్య ..ఇటు వెళితే మన శ్రీ లక్ష్మి ఇల్లు వస్తుంది ,అటు వెళితే మన సరోజ ఇల్లు అంటూ నా వైపు చూసి ఆగిపోయింది ..నా మనసంతా తప్పు చేసిన ఫీలింగ్ తో నిండి పోయింది .. అయ్యో పాపం ఆపదలో దేవుడు పంపినట్లు వస్తే కనీసం ఎలా ఉన్నావ్ ..ఎక్కడ ఉన్నావ్ అని కూడా అడగలేదు ..అర్దం పర్దం లేని అనుమానానలను వేసుకుని..ఇంత సేపయ్యాకా ఏం అని పలకరించను ?అని మధనపడ్డాను..ఇంతలో తనే అన్నాడు .. మీ ఇల్లు ఇటు అనుకుంటా కదా అని...ఆ అవును .. అక్కడ రైట్ తీసుకో అన్నాను..గుర్తులేదు మర్చిపోయా .. చాలా రోజులైపోయింది కదా .. నువ్వు మాత్రం ఏమి మారలేదు ..అలాగే ఉన్నావ్ .. అందుకే వెంటనే గుర్తుపట్టేసా అన్నాడు..సారీ గుర్తు పట్టలేకపోయాను నిన్ను అన్నాను ..ఎలా గుర్తుంటుందిలే బాగా లావు అయ్యాను కదా మీసాలు కూడా వచ్చేసాయి.. అన్నాడు నవ్వుతూ..ఈ లోపల మా ఇల్లు వచ్చేసింది .

ఆ సరికే మా అమ్మ, నాన్న్నమ్మ బయట చూస్తున్నారు నా కోసం.. ఎలాగూ అక్షింతలు తప్పవు ..ఎంతైంది అన్నాను తనతో .. భలేదానివే ఫ్రెండ్స్ దగ్గర డబ్బులేంటి.. అసలు నేను ఇటు రాను.. నువ్వు కదా అని వచ్చాను. చాలా ఆనందంగా ఉంది.. చిన్నప్పటి ఫ్రెండ్స్ కలుసుకుంటే బాగుంటుంది అన్నాడు..అప్పటికే నాన్నమ్మ ఎక్కడికెళ్ళావ్? అమ్మ భయపడిపోయింది .. అంటుంటే ..తను ఇంక మాట్లాడే సీను లేదని అనుకున్నాడు కాబోలు మరైతే నేను వెళ్తా అని నవ్వి వెళ్ళిపోయాడు ..నాకు అప్రయత్నంగా కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి.. ఆటో వీధి మలుపు తిరిగేవరకు చూస్తూ ఉండిపోయా.. మన్నించు మిత్రమా అనుకుంటూ ...