20, నవంబర్ 2009, శుక్రవారం

ధన్యవాదాలు


మొన్నా మద్య మావారిని బ్రతిమాలుకుని నా పొస్టు లన్నీ ప్రింట్ ఔట్ తీయించి అమ్మావాళ్ళకు ఇప్పించాను.సరే అసలు రిజల్ట్ ఎలా ఉంటుందో అని మా ఇంటికి ఫొన్ చేసి మా చెల్లితో కాసేపు నా పొస్ట్లుల గురించి, మన బ్లాగర్ల గురించి మాట్లాడిన విషయాలు మీతో ముచ్చటించాలాని ఇలా వచ్చాను ..కొంచం అటు, ఇటుగా మా సంభాషణ..

అక్కా నువ్వా !!నీ గురించే అనుకుంటున్నాం ...

నువ్వెప్పుడొచ్చావే ఊరినుండీ ..అది సరేగాని, నేను నా బ్లాగ్ లో కొన్ని పోస్ట్లులు పంపాను చదివారా??..

అదే తల్లీ ఇప్పటివరకూ మాట్లాడుకుంటున్నది..

మా చెల్లి మాటలు పూర్తయ్యేలోపల అక్క లాక్కుని..ఒరే బుజ్జమ్మా ఎంత బాగా రాసావురా,ఎదురుగా నువ్వు కూర్చుని మాట్లాడినట్లు గానే ఉంది ..ఎంత గుర్తే బాబు నీకు ..నీ పెళ్ళి చూపుల్లో ,మీ ఆయన్ని కటకటాల దగ్గరనుండీ చూడమని చెప్పాను అదీ.. మీ కుసుమ గురించిచదివా.. ఇంకా స్వాతంటే ఆ బక్కిది ...పేరుమర్చిపోయా..దాని పేరేంటి??..ఆ.. ఇంకా సువర్ణ మీ ఫ్రెండ్స్ అందరూ గుర్తుకొచ్చేసారురా .. అయ్యో, ఇందాకా కాల్ చేయాల్సింది ..మీ బావ,నాన్న పిలుస్తున్నారు.. ఆటోలో ఉన్నారు ..ఇంకో గంటలో బండి ఉంది..నాన్న సంగతి తెలిసిందే కదా గంట ముందే ప్లాట్ఫాం దగ్గర నించోవలసిందే..ఆరోగ్యం జాగ్రతమ్మా ..మళ్ళీ మా చెల్లి దగ్గరకొచ్చింది ఫోన్..

నువ్వు మరీ మురిసిపోకు..అది చదివింది ఆ మూడు కధలే.....నువ్వొక పోస్ట్లోలో దాన్ని పిసినారి పుల్లమ్మలా రాసావని దానికి తెలిస్తే బుజ్జమ్మ కాస్తా బజ్జమ్మ అయిపోతుంది.. .

ఏ ..అన్ని పొస్ట్లు ఎందుకని చదవలేదూ ..

అంత తీరిక ఏది ..దానికీ, వాళ్ళాయనకూ ఆ షాప్ ఉంటే చాలు అన్నం,నీళ్ళు అక్కరలేదు,ఒక్క రోజు కూడా ఉండనివ్వరు బావ,తెలిసిన విషయమే కదా..

హూం..ఇంతకూ అమ్మ చదివిందా..

చదివిందా.. అని మెల్లగా అడుగుతావేంటి ..యే రోజు వాటిని చదివిందో, ఆ రోజునుండి అమ్మకు, నాన్నకు మధ్య వన్ సైడ్ యుద్దం నిరవధికంగా సాగుతూనేఉంది..అందులోనూ ఒక పోస్ట్ లో అమ్మ గురించి తెగపొగిడేసి రాసావ్ కదా,ఆ పుత్రికోత్సాహం తట్టుకోలేక పోతుంది పాపం ..అసలు నాన్న వల్లే నీ ప్రతిభ మట్టిలో మాణిక్యం లా అయిపోయిందంటా ,లేకపోతే ఈ పాటికి నా కూతురు రాధ-మదు సీరియల్ లాంటిదో, చక్రవాకం సీరియల్ లాంటిదో రాసిపడేసేది అంతా మీవల్లే,మీవల్లే అని పదే పదే చెప్పి పాపం నాన్న కూడా అంతా నావల్లే,నావల్లే అని అమాయకంగా కుమిలిపోయేలా హిప్నటైజ్ చేసిపడేస్తుంది ..

ఇంక నోరుముయ్యి గాడిదా.. కనీసం బాగా రాసావ్ అని ఒక్కమాట అన్నావే..

అంటే, ఇంక ఆప్షన్ లేదా అక్కా.. బాగా రాసావ్ అని ఒప్పేసుకోవలసిందేనా?? ..సరే కుళ్ళకు తల్లీ ..నీ పొస్ట్ లే కాదు దానికి వచ్చిన వాఖ్యలు కూడా కంఠతా వచ్చేలా చదివాను ..

నేను నమ్మను, అయితే నాకు మొదటి సారిగా వాఖ్య రాసిన వాళ్ళ పేరేమిటో చెప్పు చూద్దాం..

అరుణాంక్ ..

అంత కరెక్ట్ గా ఎలాచెప్పావే??

హి హి..చేతిలో నువ్వు పంపిన కాగితాలున్నాయి..లేకపోతే ఇదేమన్నా ఎక్జామా కంఠతా పట్టడానికి మొహం చూడు..

అరుణాంక్ గారు చాలా మంచివారు తెలుసా..

ఎందుకూ? వాఖ్య రాసినందుకా ..

నీ మొహం ..ఒక సారి తన బ్లాగ్లో వాళ్ల ఆవిడ ఊరెళితే తలుచుకుంటూ గజల్ శ్రీనివాస్ గారు పాడిన 'ఇల్లు ఇపుడు ఇల్లులా లేనేలేదు ' అనే పాట లింకిచ్చారు ఎంత బాగుందో..

మరింకేం సేవ్ చేసి నువ్వు ఇండియా వచ్చినపుడు బావగారిని వినమని చెప్పు..

ఎవరూ, మీ బావా .. నేనిలా ప్లైట్ ఎక్కంగానే ..నో నాగమణీ, ఎంజాయ్ అని ఎస్ ఎం ఎస్ లు ఇచ్చుకుంటారు..మళ్ళీ నన్ను తలుచుకుని పాటలు వినడం ఒకటి, ఆ క్రికెట్ బేట్ కి అంకితం అయిపోతారు ..

హ హ అన్నట్లు ఇంకొకటి గమనించాను అక్కోయ్ .. నీ బ్లాగ్ ని రెగ్యులర్గా చదివేవాళ్ళు కూడా ఉన్నారక్కా వేణు శ్రీకాంత్,పరిమళం,లక్ష్మి,సిరి సిరి మువ్వ ,శేఖర్ పెదగోపు ,కిషన్ అబ్బో చాలామంది.

ఆ .. వేణు శ్రీకాంత్ గారు అయితే నా ప్రతి పోస్ట్ తప్పని సరిగా చదివి వ్యాఖ్య రాస్తారు ..తనకి పాటలంటే చాల ఇష్టం అందుకని మంచి మంచి పాటలన్నీ ఒక బ్లాగ్ లో రాస్తుంటారు ..పరిమళం గారున్నారే ..ఆవిడ ఎంత మంచారో తెలుసా తన ప్రొఫైల్ లో నేను తెలుగుమాత్రమే తెలిసిన ఒక మామూలు అమ్మాయినీ అని అమాయకం గా రాసినా, ఎంత బాగా రాస్తారో తెలుసా..తనపొస్టు లన్నీ అచ్చమైన కోనసీమ అందాన్నీ కళ్ళముందు నిలుపుతాయి ..ఇంక లక్ష్మి గారు ఉన్నారు కదా తను 'ఇస్రో ' లో పే..ద్ద మేనేజర్ తెలుసా.. అయినా కొంచం కూడా గర్వం ఉండదు..మళ్ళీ పోస్ట్ లయితే అదిరిపోతాయి..ఇంక శేఖర్ అచ్చం వేణు గారిలాగే చాలా సింపుల్ గా,మంచిగా ,ఇంకా హాస్యం గా కూడా రాస్తారు .. ఇక మువ్వ గారి అసలు పేరు వరూధిని..తను బాగా వ్రాసిన ప్రతి ఒక్కరినీ అభినందిస్తారు,తన పోస్ట్లు కూడా బాగుంటాయి ..ఇంక ఆ కిషన్ ఉన్నాడే, తను కోనసీమ అమ్మాయినే కట్టుకుంటా అని కంకణం కట్టుకున్నాడు అట ,తన ప్రొఫైల్ లో రోజుకో ఫొటో మారుస్తాడు కాని పాపం ఇంకా ఎవరూ పడలేదు..

అబ్బా ఇంతమంది బ్లాగ్ పేర్లు ఎలా గుర్తు పెట్టుకున్నావు అక్కా బాబు ..కొంత మంది పేరు లయితే అచ్చం ఒకలాగే ఉన్నాయి.. సృజనలు 3 ,నరేంద్ర చెన్ను పాటి,నరేష్ నందం ..శివ బండారు ,శివ చెరువు కంఫ్యూజ్ గా లేదూ..

గుర్తుపెట్టు కోనక్కరలేదు వాళ్ళ బ్లాగ్ మీద క్లిక్ చేస్తే వాళ్ళ బ్లాగ్ కనబడుతుంది ..అందులో ఒక సృజన ను సుజ్జి అంటారు తను చిన్న,చిన్న కవితలు రాస్తుంది బాగుంటాయ్ ..ఇంకో అమ్మాయి స్మృతుల సవ్వడి అని బ్లాగ్ లో తన పెళ్ళి అయిన తరువాత విషయాలు భలే రాస్తుంది .. ఇంకో అమ్మాయి సృజనారామానుజన్ తను కవితలు అవి రాస్తుంది కాని తన బ్లాగ్లో 50% తన ఫ్రెండ్ గీతాచార్య గురించి రాస్తుంది అన్నమాట ..

గీతాచార్యా !! ఏదో ప్రొఫెసర్ పేరులా ఉంది కదక్కా..
నిజంగా ప్రొఫెసరేనే తను..
అవునా !!ఎందులో ..
ఏమో నాకేం తెలుసూ ప్రొఫెసర్ అని తెలుసంతే ..

ఇవేం పేర్లక్కా జీడిపప్పు,జిలేబీ ,మలక్ పేట్ రౌడీ అనీ అవన్నా పర్లేదు అడ్డగాడిదా ,పిచ్చోడు అని విచిత్రంగా ..

ఓ వాళ్లా ఊరికే సరదాగా అలా పెట్టుకున్నారు..జీడిపప్పు గారు ఎక్కువగా అమెరికా గురించి రాస్తుంటారు.. ఇంకా పిచ్చోడుగారు ఎవరి పోస్ట్లు బాగున్నా వాళ్లకు ప్రొత్సాహం గా వాఖ్యను రాస్తారు తను పోస్ట్లేం రాయరు..ఇక మలక్ పేట్ రౌడీ గారు ఏవో వీడియో మిక్సింగ్ లు మామూలు పోస్ట్లు రాస్తారుగాని వాళ్ళ అమ్మ గారు తెలుగు పండిట్ అనుకుంటా ఈయనకూడా పద్యాలు రాస్తుంటారు కానీ తక్కువ ..ఇక వీకెండ్ వస్తే చాలు బ్లాగ్లోకం అంతా కిష్కింద కాండ చేసేస్తారు..ఈయనకు తోడుగా మంచుపల్లకి,ధన్రాజ్ మన్మధ ,నాగ ప్రసాద్,శశాంక్ ఇలా కొందరు ఫ్రెండ్స్ కలిసి ఇంక అల్లరే అల్లరన్నమాట..

అబ్బో ..ఈ పేర్లు బాగున్నాయి చూడక్కా నీహారికా,భావన,ప్రపుల్ల చంద్ర ,సునీత ,అన్వేషీ ...

కదా!! నేనూ అదే అనుకుంటా..ప్రపుల్ల చంద్ర గారేమో జపాన్ లో ఉంటారు ఫొటోస్ అవి తీస్తారు ..ఇంకా రాణి గారు ,మధురవాణి గారు వీళ్లందరూ ఫొటోస్ ఎంత బాగా తీస్తారు తెలుసా..నీహారిక, గారు ,నేనూ ఒకసారి అలిగిన వేళనే చూడాలి అని పేరుతో ఒకేసారి పోస్ట్లు వేసాం విచిత్రంగా ..ఇంక భావనగారు పేరు లోనే భావుకత్వం వినిపిస్తుంది ఎంత బాగారాస్తారో చెప్పడం కాదు చదివితే తెలుస్తుంది..సునీత గారు ఒక పోస్ట్లో రక రకాల మొక్కలు,పూల చెట్లు గురించి వ్రాసారే ,ఎన్నేన్ని రకాలో తెలుసా ..వెంటనే తనదగ్గర గార్డెనింగ్ నేర్చుకోవాలనిపించింది.. అమ్మో ఒక్కొక్కరిలో ఒక్కో టాలేంట్ .. ఇంక అన్వేషి ,నాకేమో అన్నయ్య లాంటివాడన్నమాట ..

ఆహా.. బ్లాగ్స్ లో సెంటిమెంట్లు కూడా నా తల్లీ .. ఇంక అక్క, తమ్ముడు ఎవరూ లేరా..

అక్క కాదుగాని వదిన వుంది హ హ ..అన్వేషి వైఫ్ లే.. ఇంకో అబ్బాయి మనోహర్ అని తను అక్కా ,అక్కా అని కామెంట్స్ రాస్తాడు చూడూ ..

ఇంకేం తమ్ముడు కూడా దొరికేసాడు నీకు..

అసలు బ్లాగ్ లోకంలో బోలెడు మంది నిజమైన అక్కా చెళ్ళెళ్ళు,భార్యా భర్తలు ఉన్నారే ..రమణి- మేధ, ప్రియ-వైష్ణవి ,జయ-మాలా కుమార్ ..అసలు ఈ మాలా కుమార్ గారు ఉన్నారు చూడూ తను పెద్దావిడే గానీ ఎంత బాగా చలాకిగా పొస్ట్లు రాస్తారో ..ఇంకా శ్రీ లలిత గారు ,భమిడి పాటి సూర్యలక్ష్మి గారు ,p.sm లక్ష్మి గారు వీళ్ళందరూ పెద్ద వాళ్ళమైపోయాం మనకెందుకు అని అనుకోకుండా భలే పోస్ట్లు రాస్తారు..ఒక్కోకరిదీ ఒక్కో శైలి ..ఒక్కో పొస్ట్ రాస్తే అమ్మో బాబోయ్ అని మళ్లీ 15 డేస్ ఇంకో పోస్ట్ వేయను నేను ..అదే తృష్ణగారు ఇంకా మురళిగారు,అమ్మ వొడీ లాంటి వారైతే రోజుకో పోస్ట్ ..మళ్ళీ బ్రహ్మాండమైన విషయాలు రాస్తారు తెలుసా ..రాజకీయాలు,నవలలు గురించి అబ్బా ఒక్కటికాదు ...కొత్త పాళిగారని ఒక ఆయన ఉన్నారు ఆయన భరతనాట్యం కళాకారులన్నమాట ..ఒక సారెప్పుడో నెట్ లో చూసా ఆయన ఫొటోస్ ..ఇంక జ్యోతిగారి సంగతి సరే సరి ఒక ప్రక్క వంటల బ్లాగ్స్ ,మరొక పక్క బ్లాగ్లో వచ్చే సందేహాలకు పరిష్కారాలు చెప్తూ మరొక బ్లాగ్ ఇంకో ప్రక్క ప్రమదావనం అని ఇలా చాలా చాలా చూస్తారు.భాస్కర్ రామరాజు గారని భలే రాస్తారులే ఆయన కూడా వంటలగురించి .

ప్రమధావనం ఏంటక్కా? ..
అంటే అమ్మాయిలందరూ అందులో మాట్లాడుకుంటారు ,మంచి పనులవి చేస్తారంటా..నేను చేరలేదు..
ఎందుకని??..
నా సంగతి తెలిసిందే కదే నేను మెయిల్ చెక్ చేయడమే అమావాస్యకో ,పున్నానికో చూస్తా నా పనులకు పోస్ట్లు రాయడానికే తీరిక ఉండటం లేదు.. అయినా ఏదైనా పోస్ట్ గురించి మాట్లాడాలంటే తను మెయిల్ ఇస్తారు కదా.

ఒహ్ ఆవిడ గురించేనా ఇంతకు ముందొక పోస్ట్లో రాసావ్..ఇంకా ఎవరో సుజాత,అబ్రకదబ్ర గారు ఉషగారు అని ...

ఆ ..ఆవిడే ..సుజాత గారైతే జర్నలిస్టో మరి ఎడిటరో తెలియదు కాని మొత్తానికి పత్రికా ఆఫిస్లో చేస్తారని తెలుసు అందుకే ఆమె అంత అలావోకగా పొస్ట్లు రాసేస్తారు.. ఇంక అబ్రకదబ్ర గారైతే అమ్మో ఆయనకు బోలెడువచ్చు పియానో అంటా,, ఇంకా ఫొటోస్ తీస్తారు ఇంకా మంచి బొమ్మ లేస్తారు..ఇంకా కధలు రాస్తారు ..బొమ్మలైతేరా... పెన్ను ఉంటుందా దాని చుక్కలతో ఒక బొమ్మ వేసారు తెలుసా భలే ఉంది ..

అంతేలేక్కా ,నేను వెంకటేశ్వర సహస్ర నామాలతో వెంకటేశ్వర స్వామిని వేస్తే ఒక్క సారన్నా పొగిడావా..

హహ ఒక అమ్మాయి ఉంటుందే కిరణ్ అని ఆ అమ్మాయి బొమ్మలు చూస్తుంటే నువ్వు చిన్నపుడు బయట మెట్లమీద నీ స్కూల్ బాక్స్ వళ్ళో పెట్టుకుని తెగ వేసేసేదానివి కదా.. అక్కేమో , అలా కాదు ఇలా అని చెప్పేది అదే సీన్ గుర్తొస్తుంది.. ఇంకా లీలామోహనం అనే బ్లాగ్ ఆయన క్రిష్ణుని బొమ్మలు బాగా వేస్తారు..
ఇంక ఉష గారి గురించి చెప్పాలంటే ఒక్క రోజు పడుతుంది..బాబోయ్ ఆమె కవితలొక్కటే కాదు, పెద్ద పూల తోట పెంచుతుంది తెలుసా ..తను 100 మంది కి ఒక్క చేత్తో వంట చేస్తుంది అంట టెన్షన్ పడకుండా..మనకు ఒక్కరికి వండటమే చేతకాదు ...

మనకి అని నన్ను కలుపుతావే..నేను బాగానే చేస్తా..

నీ మొహంలే , ఇంకా వాళ్ళిళ్ళు చా..లా పెద్దది .. ఇంటి ఎదురుగా బోలెడు పూల మొక్కలు,కొలను,బాతులూ ..అస్సలు ఆవిడకు గర్వం ఉండదు తెలుసా ఎంత టాలెంట్ ఉన్నా..

ఇవన్నీ నువ్వెక్కడ చూసావ్ ..

ఇంకెక్కడ బ్లాగ్లోనే ఒక సారి ఫొటోస్ పెట్టారులే..

అమ్మో ఆవిడ వ్యాఖ్యలు కూడా చదవడానికి కష్టం గా ఉన్నాయక్కా..చాలా గ్రాంధికం,భావుకత్వం కలిపి రాస్తారు కదా..ఇంట్లో కూడా ఇలాగే మాట్లాడుతారా??..

ఏమో ..కాని తన కవితలు చదివి చాలా మంది చర్చలకు వస్తారు ..వాళ్ళందరూ కూడా భలే రాస్తారు వాళ్లకు అర్ధం అవుతుంది ..ఈ లెక్కన మనవి మాంచి మట్టి బుర్రలన్నమాట..

ఇదిగో మళ్ళీ నన్ను కలుపుతావ్ ...

ఇంకా ఉషగారిలాగే రాధిక గారని ఒక అమ్మాయి కవితలు రాస్తుంది ఎంత హాయిగా ఉంటాయో..నిషిగంధ అని ఇంకో అమ్మాయి ఉంది..తనోసారి ఒక కవిత రాసిందే ..ఒక పువ్వేమో అయ్యో నా ఫ్రెండ్స్ అందరినీ కోసుకుని వెళ్ళిపోయారు ..ఒంటరినైపోయాను నేను దేవుని గుడిలో లేనూ ,కనీసం అమ్మాయి జడలో లేనూ అని ఫీల్ అవుతుంది ..అబ్బ ఎంత బాగుందో తెలుసా కవిత ..

మరి మిగిలిన వారివి కూడా ప్రింట్ తీసిపంపకపొయావా అక్కా ...

చాల్లే నాకే ఓ దిక్కూ దివాణా లేదు ..మళ్ళీ వాళ్ళందరివీ తెమ్మంటే మీ బావతో పడగలనా.. అయినా ఎక్కడన్నా సేవ్ చేసి పెట్టుకుంటా ..అందులోనూ పద్మార్పిత గారి కవితలు అంటే మీ బావగారికి మహా ఇష్టం..అయ్యగారు పెళ్ళికాకముందు ఇలాగే కవితలు రాసేసేవారంట ..ఆవిడ ప్రేమ మీద రాస్తుందిలే..

అమ్మో ,అయితే ఎవరైనా అమ్మాయికి ఇచ్చే ఉంటారక్కా ఈ లెక్కన..

పాపం మీ బావకో సెంటిమెంటుంది ..ఈయనగారు ఎవరిని ఇష్టపడేవారో ఆ అమ్మాయికి నెక్స్ట్ మంత్ లో పెళ్ళి అయిపోయేదంట .అలా ఆ పిల్లలు బ్రతికిపోయారన్నమాట బావ కవితలు చదవకుండా ...

హ హ బావ గారిని అనకపోతే తోచదుకదా నీకు..

నీమొహం లే అలా దిష్టి తీసుకుంటా గాని.ఇంకా శృతిగారని తను బాగా రాస్తారు..

ఏంటీ అందరూ అమ్మాయిలే రాస్తారా కవితలు..

అయ్యబాబోయ్ అబ్బాయిలు ఈ మాట వింటే కవితలతో పొడిచేస్తారు నన్ను ..బొల్లోజు బాబా గారు,దిలీప్ గారు అర్జున్ పణిప్రదీప్,బృఃహస్పతిగారు,రెడ్డి గారు,ఆనంధ్,ఆత్రేయ గారు ప్రేమికుడు ఒక్కరా ఇద్దరా అసలు 80% కవితలే రాస్తారు..ఇంకా దుర్గేశ్వరగారని ఆయన దేవుని మీద రాస్తారు.

మరి హాస్యం నువ్వు ఒక్కదానివేనా రాసేది ..

ఇంకా నయం, మహా మహులున్నారు రిషిగారు అని ఇంకా శ్రీవిద్య అని ఆ అమ్మాయి పోస్ట్లు చూస్తే నువ్వే గుర్తు వస్తావే బాబు..ఇంకా సుభద్ర అని ఒక అమ్మాయుంది, తను రాస్తే అర్జెంట్ గా మా ఇంటి ప్రక్కన ఉంటే బాగుండును ఈ అమ్మాయి బోలెడు కబుర్లు చెప్పుకోవచ్చు అనిపిస్తుంది ..ఇంకా లలితగారు అని తను రాసింది చదివితే , మా ఫ్రెండ్ కళ్యాణియే, కళ్యాణి తన పోస్ట్ చదివినపుడల్లా కళ్యాణీని ఊహించుకుంటా ..అశోక్ వర్మా అని ఆ అబ్బాయికూడా భలే రాస్తాడు ,ఇప్పుడేందుకో రాయడం లేదు.

ఇంతకీ సింగపూర్ వాళ్ళు ఎవరూ లేరా ??.

ఉన్నారు...శ్రావ్యా,మహిపాల్ ఇలా ఉన్నారు కొంతమంది .. ఇంకా అఙ్ఞాతలుగా వచ్చే వాళ్ళు చాలమంది పేర్లు రాయరు వాళ్ళు కాని రాజ్ కుమార్,పద్మ అని కొంతమంది రెగ్యులర్ గా నా పోస్ట్లు చదువుతారు .. ఇంకా వినయ్,మాఊరూ,హరేకృష్ణ ,చైతన్య ,శ్రీనివాస్,స్వప్న,కిరణ్మయి,కుమార్,బోనగిరి,శరత్,నుతక్కి,రుత్,ఆదిత్య,భవాని,సురబి,జాహ్నవి,శేఖర్,ప్రభాకర్,సందీప్,మహేష్,బ్లాగాగ్ని,సుధాకర్,శివరంజని,అభిసారిక, ...
అబ్బా ఆపక్కా బాబు శాంతి స్వరూప్ ఏమన్నా పూనాడా జాబులూ- జవాబులు కార్యక్రమంలా వరసపెట్టి పేర్లు చదువుతున్నావ్ ..ఇంక నీకు అలుపు రాదా...

ఓసి గాడిదా..

నువ్వు గాడిదా అన్నా,ఇంకేమన్నాసరే , నేను మా ఆయనకు కాల్ చేయాలి..గంటన్నర నుండి మాట్లడుకుంటున్నాం ..తను కాల్ చేసారేమో ఎంగేజ్ వస్తుండి ఉంటుంది ..

హూం సరే కాని..

అని అలా ముగించేసానన్నమాట..అదన్నమాట సంగతి.. కాబట్టి ఇన్నాళ్ళూ నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు :)

14, నవంబర్ 2009, శనివారం

తికమక-మకతికఒక సారి నేనూ ,మా అక్క ఏదో షాప్ కి వెళుతున్నాం..ఉన్నట్లు ఉండి మా అక్క మాట్లాడటం మానేసి..ష్..ష్ అంటూ నన్ను దాటుకుని ముందుకు వెళ్ళి ,ఒక బడ్డీ షాప్ దగ్గర అటు తిరిగి ఏదో కొంటున్న అమ్మాయిని వెనుకనుండి వీపు మీద ఒక్క దరువేసింది..పాపం ఆ పిల్ల ఊహించని ఆ పరిణామానికి జడుసుకుని కాసేపు బిత్తర చూపులు చూసింది .. ఆ వెంటనే మా అక్క ..ఏమే సత్యవేణీ !!నేనూ..గుర్తు పట్టలేదా అని పళ్ళన్నీ బయట పెట్టి ఇకిలించింది గాని, సదరు బాధితురాలు సత్యవేణికి మాత్రం ఇదెవరో గుర్తు రాలేదు సరి కదా ,ఇది చేసిన పనికి కాసింత కోపం గా ఎవరండి మీరూ అంది .. నాకు సీన్ అర్ధం అయిపోయి, అక్కా ఇంక చాలు పద నువ్వు..ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నట్లున్నావ్ అన్నాను చెయ్యి పట్టుకుని లాగుతూ..అది నా చేయి విదిలించి నీ మొహం.. అదీ, నేనూ అయిదో క్లాస్లో ఫ్రెండ్స్ మి,కాసింత పెద్ద వాళ్ళం అయిపోయాం కదా అందుకే గుర్తు పట్టలేదు కదా సత్యవేణీ అంది ..

ఆ అమ్మాయి కొరకొరా చూస్తూ నేను సత్యవేణీకాదు ,నాగమణీ కాదు మీరసలు ఎవరో నాకు తెలియదు అంది.. బట్టీ కొట్టువాడు వెటకారం గా కిసుక్కున నవ్వాడు.. నాకు గొప్ప అవమానంగా అనిపించింది.. కాని, మా అవతారం కదలదే ..అది కాదు సత్యవేణి! నువ్వూ,నేనూ చిన్నప్పుడు ఫలానా ,ఫలాన స్కూల్ లో చదివాం కదా అని ఫ్లాష్ బ్యాక్ తవ్వకాలు మొదలెట్టింది కాని నేను బలవంతంగా లాక్కొ చ్చేసా..నిజంగా అది నా ఫ్రెండేనే అంది అక్క వెనక్కి వెనక్కి చూస్తూ ..ఇంక నోరు మూస్తావా ..అయినా ఆ పిల్ల నా పేరు అదికాదు మొర్రో అన్నా వినవేంటి.. అంత మనుషులని గుర్తు పట్టలేవా ..ఇలా అయితే ఫ్యూచర్ లో చాల కష్టం అక్క నీకు అని తిడుతూ ఇంటికి లాక్కొచ్చేసాను.. కాని అప్పటికి నాకు తెలియదు విధి నా వైపు చూసి విచిత్రం గా నవ్విందని..

అలా ఎందుకు నవ్విందో పెళ్ళయిన కొత్తలోనే తెలిసింది నాకు.. ఒక రోజు నేనూ,మా ఆయన గుడికి వెళ్ళాం ..పూజారి ఇస్తున్న తీర్ధం తాగుతూ ఎదురుగా చూసా.. నాకు కాసింత దూరంలో ఒక ఆవిడ నా వైపు చూస్తున్నట్లు అనిపించింది..ఈవిడ నా వైపు చూస్తుంది ఏమిటీ ?..ఈ ఊళ్ళో మనకు తెలిసిన వాళ్ళెవరబ్బా?నిజంగా నావైపేనా చూస్తుంది ??మళ్ళీ చూసాను ఆమె వైపు ..ఈ సారి ఆవిడ ఇంకెవరితోనోమాట్లాడుతుంది . నన్ను కాదేమోలే అనుకునేంతలో ఆమె మళ్లీ నా వైపు చూసి సన్నగా నవ్వినట్ట్లు అనిపించింది ..ఏంటో ..మనకెందుకులే అనుకుని నేను ఇంటికొచ్చేసాను ..

ఆ మరుసటి రోజు మా అత్తగారు బయట నుండి రావడం ,రావడం నన్ను పిలిచి..నిన్న గుడిలో' పెద్ద అత్తగారు' వచ్చారంట కదా అన్నారు.పెద్ద అత్తగారా?? ఆవిడ ఎవరు అన్నట్లు గా చూస్తున్నా .. నిన్ను చూసి పలకరింపుగా నవ్వినా నువ్వు నవ్వలేదంటా.. కనీసం పలకరించలేదంటా అన్నారు .. అప్పుడు లీల గా గుర్తు వచ్చింది నిన్నటి విషయం.. ఓ ఆవిడా !! ఆవిడ ఎవరో నాకు తెలియదు అత్తయ్యగారు ..నన్ను కాదనుకున్నాను అన్నాను మెల్లగా..మా అత్తగారు బోలెడు ఆక్చర్య పోతూ అలా ఎలా గుర్తు పట్టలేదమ్మాయ్ పోయిన వారం ఆవిడని, వాళ్ళ అమ్మాయిని అందరినీ పరిచయం చేసాను కదా ..పాపం అవతల పెద్దావిడ ఎంత బాధ పడ్డారనుకున్నావూ,తప్పు కదా అని కాసేపు ట్యూషన్ చెప్పి వెళ్ళారు నాకు.. అయ్యో పాపం పెద్దావిడ మనసు ఎంత నొచ్చుకుందో .. ఆవిడ నవ్వినప్పుడైనా ఒక నవ్వు నవ్వాల్సింది .. అయినా పెళ్ళయిన దగ్గర నుండి ఎవరో ఒకరు రావడం..పలకరించడం ..ఎంతమందిని అని గుర్తు పెట్టుకుంటా అని స్వగతంలో అనుకుని అప్పటికి ఆ విషయం మర్చిపోయా..


సరే ఆ తరువాత ఇక్కడకు వచ్చాకా ఒక సారి మార్కెట్కి వెళ్ళాను మా ఆయనతో..నువ్వు కూరలు కొంటూ ఉండూ నేను ఫ్రూట్స్ కొంటాను అని ఆయన అటు ప్రక్కకు వెళ్ళారు.. నేను మా ఆయనకు నచ్చని కాకర కాయ,వంకాయ,క్యాబేజీ సీరియస్సుగా బాస్కెట్లో వేస్తూ ఎదురుగా చూసాను.. ఎవరో అబ్బాయి (తమిళియన్)నన్ను చూస్తున్నట్లు అనిపించింది .. నన్నా?? అబ్బే ,నన్ను అయి ఉండదు అనుకుంటూ ఒక సారి అటుఇటూ చూసా.. కాసింత దూరంలో మా ఆయన యాపిల్స్ కొంటూ కనిపించారు.. వెనుక ఒక ఇద్దరు చైనీస్ అటు తిరిగి ఏవో మాట్లాడుకుంటూన్నారు..ఇంకెవరు లేరు .. అంటే నన్నే కదా ??? మళ్ళీ ఎదురుగా చూసాను ..ఈ సారి చిన్నగా నవ్వాడు..

నాకు విషయం అర్ధం అయిపోయింది.." ఓరి దుర్మార్గుడా "పెళ్ళి అయిన అమ్మాయికి సైట్ కొడతావా..కళ్ళు పోతాయ్ అని ఆవేశ పడబోయాను కాని , నాకు పెళ్ళి అయిందన్న విషయం నాకు తెలుసు, పాపం ఆ అబ్బాయి కి ఎలా తెలుస్తుంది?? ఇలా మెట్టెలు ,మంగళ సూత్రాలు కనబడకుండా, చుడిదార్లలో తిరుగుతూ ఉంటే ??అనుకుని ఆగిపోయాను.. ఒక ప్రక్క నా మనసు, నిన్ను పెళ్ళయినా ఒక అబ్బాయి చూస్తున్నాడంటే ఈ లెక్కన నువ్వు గొప్ప అందగత్తెవే బాబు అని డండనక డండనకా అని డాన్స్ వేస్తుంది అది వేరే విషయం అనుకోండి ..


సరే నాకు పెళ్ళి అయిన విషయం ఆ అబ్బాయికి తెలియ చెప్పి పశ్చాత్తాపం పడేలా చేయాలని కంకణం కట్టుకున్నా కాని ఎలాగో తెలియలేదు ..తెలుగు సినిమా హీరోయిన్ లా ఒక సారి మంగళ సూత్రాలను కళ్ళకు అద్దుకుంటే ?? అనిపించింది కాని మరీ అంత బాగోదేమో అనిపించింది ..ఆ వెంటనే మహత్తరమైన అయిడియా వచ్చి గభ గభా మా ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన చేతిని నా చేతులతో చుట్టి నుంచున్నా..నా వైపు ఒక సారి చూసి కూరలు కొనేసావా అన్నారు ..'ఊ' అని అటు చూసాను ..ఈ సారి ఆ అబ్బాయి' హాయ్' అని చేయి ఊపాడు.. అయ్యబాబోయ్ ..ఎంత ధైర్యం..ప్రక్కన మా ఆయన ఉండగా కూడా హాయ్ చెప్తాడా !!వీడి చేతులు పడిపోనూ అని వాడి జీవితం మీద వాడికే విరక్తి వచ్చేటటువంటి అసహ్యకరమైన చూపు ఒకటి అతని మీద విసిరి మొహం తిప్పేసుకున్నాను..


మరి ఎప్పుడు వచ్చాడో తెలియదు 'హలో 'అన్నాడు వెనుక నుండీ ..అంతే.. నేను భయం తో దేవుడా,దేవుడా ఇదేంటి ఈ అబ్బాయి ఇలా వచ్చేసాడు..ఏం గొడవ జరుగుతుందో ఏమో అనుకుని మా ఆయన వెనుకకి పారిపోయి ,ఆయన టీ షర్ట్ పట్టుకుని, ఏవండి అటు వెళదాం అక్కడ బ్రెడ్ కొనాలి అని వెనక్కి లాగేయడం మొదలు పెట్టాను ..ఏంటా కంగారు !!అని నన్ను వారిస్తూ ఆ అబ్బాయి వైపు చూస్తూ.. ఓ ..హాయ్ ఏంటి ఇలా వచ్చారు అన్నారు అతనికి చేయి కలుపుతూ ..అంటే వీళ్ళిద్దరూ ఫ్రెండ్సా ??అని అవాక్కయి చూస్తుండగా..వీకెండ్ కదా సామాను కొనడానికి వచ్చాను...మీరు అటు ఉన్నారు కదా కనబడలేదు ..మీ వైఫ్ ని పలకరించాను .. ఇంకేంటి విశేషాలు అని కాసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు అతను..

అతను అలా వెళ్ళగానే మా ఆయన చీవాట్లు ..అవతల ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే అలా లాగేస్తావే?? ఏమనుకుంటాడు..కనీసం పలకరించాలిగా అలా గుడ్లప్పగించి చూసే బదులు అన్నారు.. అంటే మీ ఫ్రెండ్ అనుకోలేదు అండి అన్నాను..అనుకోక పోవడం ఏమిటీ ..మొన్న వారం ఫలానా పార్టీలో అతన్ని, ఆయన వైప్ ని పరిచయం చేసాకదా..వాళ్ళవిడతో మాట్లాడావ్ కదా అన్నారు..మా ఆయన కూడా వాళ్ళ అమ్మగారిలాగే ..ఒక 10 నిమిషాల్లో 10మందిని పరిచయం చేసి గుర్తు పెట్టెసుకో అంటే ఎలాగా??..ఓ ...వాళ్ళా ..అప్పుడు అతనికి మీసం లేదేమో కదా ?అన్నాను గుర్తు వచ్చీ, రానట్లుగా ఉంటే..నీ మొహం ఇంక పద అన్నారు.. ఇంకా నయం అతనివైపు చండాలంగా చూసా అని తెలిస్తే ఇంకేమనేవారో ..


ఆ తరువాత ఒక సారి ఇండియా వెళ్ళినపుడు మా ఆడపడుచు పాప బారసాల జరుగుతూ ఉంటే నేను మాంచి బిజీగా అటు ,ఇటూ తిరుగుతూ పనులు చక్కపెట్టుకుంటుంటే మళ్ళీ షరా మామూలే..ఒకావిడ నా వైపు చూస్తూ కనబడింది.. హే భగవాన్!! ఏమిటి నాకీ పరీక్షా ..అన్నీ బాగానే గుర్తుంటాయి కాని ,ఇలా అప్పుడప్పుడూ ఏదో పార్టీలలోనో, ఫంక్షన్లలోనో పరిచయం అయిన వాళ్ళు చాలా తక్కువగా గుర్తుంటారు..అదేంటోగాని వాళ్ళకు మాత్రం నేను బాగా గుర్తుంటాను..మీరు ఫలానా పార్టీకి ఫలానా డ్రెస్ వేసుకున్నారు కదా ,ఫలానా నగలు పెట్టుకున్నారు కదా అని చెప్తుంటే వాళ్ళ ఙ్ఞాపక శక్తికి నేను నోరెళ్ళబెడతుంటా..మరినాకేం వచ్చి ఏడ్చిందో తెలియదు గాని ఈ తికమకతో మా చెడ్డ బాధ అయిపోతుంది నాకు..

సరే ఏది ఏమయినా ఈసారి మా అత్తగారితో ట్యూషన్ తప్పించుకోవాలంటే నేనే ఆవిడను ముందు పలకరించేస్తే ఒక పని అయిపోతుంది అనుకుని ఆవిడ దగ్గరకు వెళ్ళాను..ఇప్పుడు ఏమని పలకరిచాలి?..సదరు మహిళ నాకు అక్క అవుతుందా?? పిన్నా?? వదినా?? ఏమని పిలవాలి అని కాసేపు తర్జన బర్జనలు పడ్డాకా ,సరే వరసలేకుండా మేనేజ్ చేసేద్దాం అనుకుని హి హి బాగున్నారా అండి అన్నాను .. ఆవిడ నవ్వుతూ ఆ బాగున్నాను అన్నారు.. హమ్మయ్యా ఒక పలకరింపు అయ్యింది నెక్స్ట్ ఏమనాలి??? అదేంటి ఇప్పుడు వచ్చారు ప్రొద్దున్నే రావాల్సింది అన్నాను.. ఎక్కడా ..పిల్లలతో కుదరలేదు ఆవిడ జవాబు..హమ్మయ్యా పిల్లలున్నారన్నమాట ఈమెకు ..వెంటనే ఆవిడ వయసును బట్టి పిల్లల వయసు అంచనా వేస్తూ ..మరే ,పిల్లలని కూడా తీసుకురావలసిందండి ఆడుకునేవాళ్ళు అన్నాను నా తెలివికి మురిసిపోతూ.. అమ్మో వాళ్ళతో వస్తే ఇంక నన్ను కుదురుగా కూర్చోనిచ్చినట్లే ..మా అత్తగారి దగ్గర వదిలివచ్చా అంది.. హమ్మయ్య దిగ్విజయం గా 'పలకరింపు' అయిపోయింది ..ఇంక ఇక్కడ నుండి వెళ్ళిపోవడం మంచిది అనుకుని అటుతిరిగానో లేదో ఆమె నా చేయి పట్టుకుని వెనక్కి లాగుతూ ఇంతకూ నేను నీకు ఎలా తెలుసూ?? అంది..నాకు పచ్చివెల్క్కాయ గొంతుక్కి అడ్డుపడినట్లు అనిపించింది..

ఇదేంటబ్బా ఇలా అంటుంది ??అంటే నేనే తొందరపడి ముందే కూసేసానా?? అనుకుంటుండగా..అదే నేనూ చూస్తున్నా ఇందాక నుండి ..ఈ అమ్మాయికి నువ్వెలా తెలుసా ??..అన్నీ తెలిసినట్లే మాట్లాడుతుంది అనుకుంటున్నా అంది ప్రక్కన ఉన్న మరొక ముసలావిడ..నాకేం చెప్పాలో అర్ధం కాలేదు ..నా బుర్ర యమఫాస్ట్ గా పనిచేయడం మొదలు పెట్టింది..వెంటనే అయిడియా తళుక్కున మెరిసింది.. మనమసలే షార్ప్ కదా.. జెనరల్ గా బంధువులందరూ పెళ్ళికి వస్తారు కాబట్టి, అయ్యో మీరు తెలియకపోవడం ఏమిటండి ..మా పెళ్ళికి వచ్చారు కదా అన్నాను తెలివిగా.. మీ పెళ్ళికి నేను రాలేదే ??అంది ఆవిడ మళ్ళీ క్వచ్చన్ మార్క్ ఫేస్ పెట్టి ..ఓర్నాయనో అనుకుని, అంటే మా పెళ్ళంటే మా పెళ్ళికాదు భారతి పెళ్ళికి అన్నాను ఈసారన్నా కరెక్ట్ కాకపోతుందా అని ఆశగా చూస్తూ ..భారతి పెళ్ళి కి కూడా నేను రాలేదూ అంది దీర్ఘం తీస్తూ ఆవిడ ..నువ్వెక్కడ దొరికేవే బాబు లాయర్లాగా ఈ ప్రశ్నలు అనుకుంటూ ..అంటే అదీ.. మొత్తానికి ఈ మధ్య ఎప్పుడో కలిసాం అనుకుంటలేండి ..లేకపోతే ఎలా గుర్తుపడతాను అన్నాను ఒక వెర్రి నవ్వు విసిరి.. అబ్బే ,గత 3 యేళ్ళుగా నేను ఆంధ్రాలోనే లేను ..మరి ఎక్కడ కలిసి ఉంటాం ??అంది నావైపు చూస్తూ ...ఏట్లో. అని కసిగా అందామనుకుని సంభాళించుకుని ,పొయ్యి మీద పాలు పెట్టాను పొంగుతున్నట్లున్నాయి ఇప్పుడే వస్తానండి అని అక్కడనుండి బయటకు వచ్చేసా... అలా ఆ గండం అప్పటికి గడిచింది..కాని విధి నన్ను పరిక్షిస్తునే ఉంది ..


ఒక రోజు మా ఆయన,నేను బస్ ఎక్కబోతూ జనాలు ఎక్కువ గా ఉండటం వల్ల ఆయన వెనుక డోర్ దగ్గర, నేను ఫ్రంట్ డోర్ దగ్గర ఎక్కేసాం ..ఒకటే జనాలు ..ఆయనకు నాకు మధ్య ఓ 10 మంది నించున్నారు..ఎదురుగా చూస్తే ఒక అతను ఎవరో ఫ్రెండ్స్ తో మాట్లాడున్నాడు.. ఇతను మొన్న మా ఆయన తో బీచ్ వెళ్ళినపుడు పరిచయం అయిన వ్యక్తే కదా?..అచ్చం అలాగే ఉన్నాడు ..డవుటేలేదు అతనే ,అతనే ...అయినా ఎందుకైనా మంచిది ఓ సారి మా ఆయన వైపు చూస్తే విషయం తెలుస్తుంది అనుకుంటూ మా ఆయన వైపు చూసాను.. మా ఆయన్ సెల్ లో బిజీగా ఏదో మాట్లాడేస్తున్నారు..అంబికా దర్బార్బత్తిలా ఆ సెల్ ఆయన చెవుకి ,చేతికి మధ్య అనుసంధానం అయి ఉంటుంది ఎప్పుడూ..

ఈ లోపల అతను నా వైపు చూసాడు.. పలకరించాలా?? వద్దా??..నిజంగా అతనేనా?కాదా? అనుకుంటుండగా అతను నన్ను చూసి సన్నగా నవ్వినట్లు అనిపించింది ...అతనే అయి ఉంటాడు ..అదిగో ఆ చెవికి పోగు కూడా పెట్టుకున్నాడు ..ఇప్పుడు పలకరించక పోతే బాగోదు అనుకుని హి హి బాగున్నారా అన్నాను నవ్వుతూ ..క్యా ? అన్నాడు నా వైపు చూస్తూ ..అదే మొన్న బీచ్ ..మీరు ,మీ వైఫ్ వచ్చారు అన్నాను ముక్కలు మింగుతూ ..సారీ అయ్ డొంట్ నో తమిళ్ అన్నాడు..ఇదేంటబ్బా తమిళ్ అంటాడేంటి ??మొన్న శుబ్బరంగా తెలుగులో మాట్లాడాడు కదా ???..అంటే...అంటే అతను ఇతను కాదా ??...

నాకు ఏంచేయాలో అర్ధం కాలేదు..పోనీ అక్కడనుండి తప్పుకుందామన్నా అటుఇటు కాలు కదపలేనంత జనాలు ...ఏమండీ !!వెనక్కి తిరిగి పిలిచాను..ఆయన అటు తిరిగి ఇంకా మాట్లాడుతునే ఉన్నారు..జీ బోలియే అంటూ అతనేదో హిందీలో మాట్లాడుతున్నాడు.. నాకు ఏడుపొకటి తక్కువ ..అందులోనూ నాకసలు హిందీలో 'ఇదరాయియే 'తప్ప ఇంకేం తెలియదు.. అతనేం అంటూన్నాడో అర్ధం కావడం లేదు.. అతని ఫ్రెండ్స్ ఏదో అడుగుతున్నారు అతనిని ..ఇతనేదో చెప్తూ నవ్వుతున్నాడు...నాకేంటో చాలా అవమానంగా అనిపించింది ..కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా ,ఎప్పుడొచ్చారో మా ఆయన నా వెనుకనొచ్చి నెక్స్ట్ స్టాపే దిగాలి పదా అన్నారు ..బస్ ఆగగానే ఏమండీ !ఆ రెడ్ షర్ట్ అబ్బాయి మీ ఫ్రెండే కదా అన్నాను.. ఎవరూ అన్నారు వెనుకకు తిరిగి చూస్తూ .. అదేనండి ఒకసారి బీచ్లో పరిచయం అయ్యారు కదా అన్నాను ..ఎవర్తివే నువ్వు ..అసలేమన్నా పోలిక ఉందా అతనికీ ఇతనికీ.. మొహం చూడు అన్నారు.. అయ్యో అతనేనండి చెవికి పోగు కూడా ఉంది అన్నాను.. ఏదో సామెత ఉందిలే ..అలాగా.. చెవిపోగులున్న వాళ్ళందరూ నా ఫ్రెండే నా అన్నారు ..ఇలా తికమక -మక తికలో ఇప్పటికీ కొట్టుమిట్టాడుతున్నా :(


అసలు కొసమెరుపేమిటంటే ,ఒక సారి మా ఆయన ,ఫ్రెండ్ మేరేజ్ డే పార్టీకీ తీసుకు వెళ్ళారు ..ఆ ఫ్రెండ్ వైఫ్ ని పలుకరించి ఇంటికొచ్చేసా ..ఆ తరువాతా 3 నెలలకు ఆమె నాతో ఏదో అవసరం వచ్చి నాకు కాల్ చేసింది..కాసేపు మాట్లాడి పెట్టేసాకా, ఆమె ప్రతి రోజూ సర్దాగా కాల్ చేసి 2 గంటలు మాట్లాడటం మొదలు పెట్టింది..అలా 3 మంత్స్ లో ఆమె ,నేను బాగా క్లోజ్ ఫ్రెండ్స్ మి అయిపోయాం..ఒక రోజు మార్కెట్కి వెళితే ఒక ఆమె నా ప్రక్కనే నిలబడి ఏవో కొంటూ 'హాయ్' అంది.. హాయ్ అని పలకరించి ,ఒక్క నిమిషం చిన్న పని ఉంది ఇప్పుడే వస్తా అని మా ఆయన దగ్గరకు పరిగెట్టీ ,ఏమండీ !ఆవిడెవరో మీ ఫ్రెండ్ అనుకుంటా నాకు' హాయ్' చెప్తుంది ఇంతకు ముందు నాకేమన్నా పరిచయం చేసారా ?అన్నాను గుసగుసగా ..ఎవరూ.. అని వెనుకకు తిరిగి చూసి, ఒసే గాడిదా ఆమె ఎవరో తెలుసా ..రోజూ నేను వచ్చేసరికి ఫోన్లో గంటల తరబడి ఉప్పర సోది చెప్తూ కనబడతావ్ ..మీ సునీత .. నువ్వు గుర్తుపట్టలేదని తెలిస్తే కళ్ళు తిరిగి పడిపోతుంది వెళ్ళి పలకరించు అన్నారు.. :(

2, నవంబర్ 2009, సోమవారం

ఆహా ఏమి రుచి (కార్తీక వనభోజనాల స్పెషల్ )


జ్యోతిగారి పుణ్యామా అని మళ్లీ వంటల మీద పోస్ట్ తో మీ దగ్గర కొచ్చేసాను ..మరి కార్తికమాసం కదా ,వనభోజనాలు పెట్టు కోవలసిందే ..ఏం కూర చెప్పబోతున్నానో తెలుసా..సా..సా.. టట్ట డాయ్ ..ఈ రోజు చెప్పబోయే కూర గుత్తివంకాయ కూర..'ఓస్ 'గుత్తొంకాయ కూరా అనేయకండి..నా మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటాయ్ ..నా కొచ్చిన వంటల్లో కాసింత బాగా వచ్చినది అదేమరి.. అయితే మిగిలిన వారిలా అంత వీజీగా కూర గురించి చెప్పేస్తాననుకున్నారా ..అమ్మా ఆశ,దోస,పిజ్జా,బర్గర్ .. అసలు నేను గుత్తొంకాయ కూర ఎలా, ఎప్పుడు, ఎందుకు నేర్చుకున్నానో చెప్పక పొతే నాకు నిద్ర పట్టదు..మీరు విని తీరాల్సిందే ...తప్పదు..


మరి పుట్టింట్లో నా వంట ప్రావిణ్యం గురించి ఓ మారు దమయంతి హిడింభి పాకం అనే పోస్ట్ లో చెప్పాకదా ..అలాంటి సమయం లో ఒక శుభముహార్తాన పెళ్లి చేసుకుని అత్తగారి ఇంటికి వెళ్ళాకా ,మా అమ్మ మాటి మాటికీ, నువ్వు వంట నేర్చుకోక పొతే పెళ్ళయ్యాక అత్తవారింట్లో తెలిసొస్తుంది అని ఎందుకనేదో బాగా తెలిసొచ్చింది..రావడం ,రావడమే మా అత్తగారు అమ్మాయ్, నేను అలా బయటకు వెళ్ళొస్తా ,నువ్వు 'దోసకాయ -పెసరపప్పు' వండేయ్ అని చెప్పేసి చక్కాగా వెళ్లిపోయారు..మా ఇంట్లో అసలు దోసకాయ వండనే వండరు ..దానికి తోడు పెసరపప్పా!!.. ఎలా? అనుకునేంతలో మా ఆయన గుర్తు వచ్చారు ..ఉహు ..ఆయనగారిని అడగడం శుద్ద దండగ .. ముందు రోజు, మొదటి సారి అన్నం వారుస్తుంటే ,గంజి చేతి మీద పడి, ఏమండీ!!! నా చేతి మీద గంజి పడింది..బాబోయ్ , నా చేతి మీద గంజి పడింది.. అని కంగారుగా అంటే ..లెక్క ప్రకారం అయ్యో ,అయ్యో బర్నాల్ ఏది ,ఆయిల్ ఏది,ఎంత కష్టం వచ్చింది నీకు అని అనాలా,వద్దా??? ..అబ్బే .. అంటే నీకు అన్నం వార్చడం కూడా రాదా బుజ్జీ ??అన్నారు బోలెడు హాచ్చర్య పోతూ ..నేను 'మా టివి సుమ' లా అవాక్కయిపోయి , ఓరి 'దుర్మార్గుడా' అని అర్ధం వచ్చేలా ఒక చూపు చూడగానే ..అదీ ..ఇప్పుడు సైకిల్ నేర్చుకున్నామనుకో ,నాలుగైదు దెబ్బలు తగిలాకే నేర్చుకోగలం ..వంట కూడా అంతే..అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది ..అదేం పెద్ద విషయం కాదు అని తేల్చేసారు.. అలాంటి నా శ్రీవారిని ఈ విషయం లో సలహా అడిగితే ఇంకేమన్నా ఉందా ??..


సరే ,వంట గదిలో కాలుకాలిన పిల్లిలా కాసేపు తచ్చాడాక ,ఎదురుగా గుమ్మంలో కుర్చీలో కూర్చుని ఏదో చదువుకుంటున్న మా మరిది గారు కనిపించారు.. అతనిని అడిగితే బాగుంటుందా ??.. వండకుండా మా అత్తగారు వచ్చేవరకు కూర్చుంటే ,ఆవిడ ఏమనుకుంటారో? .. పైగా భోజనాల వేళయింది ..సరే తప్పదు అనుకుని డైరెక్ట్ గా మా మరిది గారి దగ్గరకు వెళ్లి నించున్నా .. నన్ను చూడగానే చెప్పండి వదినా అన్నాడు లేచి నించుంటూ .. ఒక సారి ' దోసకాయ పెసరప్పు' ఎలా వండాలో చెప్పవా అన్నాను ... అసలే 'ఉపోద్ఘాతం' లేకుండా డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేసరికి, మా మరిదికి అర్ధం కాక అరనిమిషం లో ఆరు ఎక్స్ ప్రేషన్స్ మార్చీ, చివరకు చిన్నగా నవ్వుకుంటూ రండి అని వంటగదిలో తీసుకు వెళ్లి ,మళ్లీ నేను ఎటువంటి షాక్ లు ఇవ్వకుండా కూర తనే వండేసి ,ఇలా వండాలి అని చెప్పి వెళ్ళిపోయాడు ...అలా ఆ గండం గట్టిక్కిన్దిరా దేవుడా అనుకుని ఊపిరి పీల్చుకుని రెండు రోజులు అవ్వక ముందే మళ్ళా మా అత్తగారు నాకు మరొక 'అగ్ని పరిక్ష ' పెట్టారు ..


ఓ రోజు ఆవిడ బయటనుండి రాగానే ఈ కూర వండేయ్ అని నా చేతిలో గులాబిరంగు జొన్నపొత్తు లాంటిది నా చేతిలో పెట్టారు.. అసలేంటో అది నాకు తెలియదు.. ఏంటండి ఇది అన్నాను అయోమయంగా..ఇది తెలియదా 'అరటిపువ్వు' అన్నారు..అసలు అరటి చెట్టుకి పువ్వు అనేది ఒకటి ఉంటుంది అని అప్పుడే తెలిసింది నాకు .. నీకీ కూర రాదా ??అన్నారు ఆమె..ఈ సారి రిస్క్ తీసుకోదలచుకోలేదు .. అత్తయ్య గారు కలలో గాని, ఇలలో గానీ ఈ కూర గురించి వినలేదు,కనలేదు, తినలేదు అని చెప్పేసాను ..మరేం పర్లేదు, నాక్కూడా తెలియదు .. మొన్నో పత్రికలో అరటి పువ్వు కూర గురించి రాసాడు ..అది తెస్తా ..చూసి వండేద్దాం ..'కమాన్ ఫాలో' మీ అనగానే ఆవిడ వెనుక బుద్దిగా వెళ్ళిపోయా ..

ఆ తరువాత ఏమని చెప్పను నా తిప్పలు .. ౩ నెలల పత్రికలన్నీ దుమ్ము దులిపి ముందేసుకుని ఏ పేజిలో ఏముందో చూసి , ఆ వంటకాన్ని వెదికి పట్టుకునే సరికి నాకు తాతలు కనిపించారు .. మా అత్తగారు ఆ పత్రిక ముందు పెట్టుకుని ..ముందు మనం అరటిపువ్వు వలిచి అందులో దొంగలని,పోలీసులని వేరు ,వేరు చేయాలన్నమాట అన్నారు.. ఒక్క నిమిషం ఏం అర్ధం కాలేదు.. ఈవిడ వంట ఎలా చెయ్యాలో చెప్తున్నారా? లేక సినిమా స్టోరి చెప్తున్నారా అనుకుని ,అత్తయ్యా ! వంట, సినిమా పేజి వెనుక వైపు ఉంది అన్నాను.. నాకు తెలుసు ..ఆ అరటి పువ్వు వలిస్తే లోపల తెల్లగా ఉంటాయ్ వాటిని పోలిసులంటాం ...వాటిని వలిస్తే లోపల నల్లగా ఉంటాయ్ అవిదొంగలన్నమాట ...అన్నారు..ఇదేం వంటరా బాబు అనుకుని , అలా కాసేపు దొంగా ,పోలీసుల ఆట ఆడాకా, ఒక కలవరాయి నా ముందు పెట్టి వేయించిన జీలకర్ర, ధనియాలు,ఎండుమిర్చి ఇంకా ఏమిటేన్టో ఒక్కొక్కటి ఇచ్చి నూరమన్నారు.. దెబ్బకు చేతులు పడిపోయి ఈ పత్రికోడిని తగలయ్యా ,ఆ వేసే వంటలేవో సింపుల్ గా అయిపోయేవి చెప్పచ్చుకదా ..ఇంత కష్టపడి తినకపోతే వచ్చే నష్టమేంటో అనుకుని, మొత్తానికి ఇద్దరం కలసి వంటకానిచ్చాం ...


తయారయిన ఆ కూర చూడగానే, నాకు అదేదేదో సినిమాలో శ్రీలక్ష్మి వంటలా " అరటికాయ లంబా,లంబా "అని దానికి పేరు పెట్టాలనిపించింది ..కాని నాకసలే పెద్దలంటే గౌరవమ్,అభిమానం మెండుకాబట్టి పైకి చెప్పలేదు..మద్యాహ్నం అందరం భోజనాలకు కూర్చోగానే మా మామ గారు నల్లటి ఆ లేహ్యాన్ని చూడగానే ,ఏంటమ్మా అది అని విషయం తెలుసుకుని ,మీ ఇద్దరు వండారా !!అయితే మీరే తినండి నాకొద్దు అని ఖరాకండిగా చెప్పేశారు ..ఆసరికే ముందు జాగ్రత్తగా మా మరిది ,ఆడపడుచు కంచాలు ప్రక్కకు పెట్టేసారు ..నాకు గాని వడ్డించారో కంచాలు లెగిసిపోతాయి మా ఆయన బాలయ్యలా పవర్ ఫుల్ వార్నింగ్ ఇచ్చారు.. పొండి బడాయి ..మీరు తినకపోతే నష్టమా ..రామ్మా మనిద్దరం ఎంచక్కా అంతా తినేద్దాం అని మా అత్తగారు నేను దీనంగా చూస్తున్నా సరే పట్టించుకోకుండా పెట్టేసారు..మొదటి ముద్ద నోట్లో పెట్టగానే నాకేంటో విశ్వ రహాస్యాన్ని చేధించిన అనుభూతి కలిగింది..ఒకటే చేదు పుట్ట...ఎలా ఉంది ?అన్న మా అత్తగారి మాటలకు ఎన్ని రకాలుగా తల ఊపచ్చో అన్ని రకాలుగాను ఊపేసా.. తరువాత తను నోట్లో పెట్టుకుని కాసేపు నాలాంటి ఎక్స్ ప్రెషన్ ఇచ్చాకా బాగుంది కాని ,కాసింత చిరు చేదు తగిలినట్లు ఉంది కదా అన్నారు.. ఏమనాలో తెలియక 'ఊ' అన్నాను ..రెండో ముద్ద నోట్లో పెట్టబోతూ ఏమనుకున్నారో ..ఈసారికి వద్దులే ,మళ్లీ బాగా చేసుకుని తిందాం అన్నారు కూర ప్రక్కకు తీసేస్తూ ..బ్రతుకు జీవుడా అనుకుని మా అత్తగారి మనసు మారక ముందే ఆ కూర డస్ట్ బిన్ లో పడేసి వచ్చేసాను.. పాపం మా అత్తగారు ఆ కూర మీద ప్రయోగాలు ఇప్పటికి చేస్తూనే ఉన్నారనుకోండి..సక్సెస్ అయ్యారా లేదా అనేది దేవరహస్యం ...


ఇదంతా సరే ,వంకాయ కూర చెప్తా అని ఈ సోది అంతా చెప్తావేంటి అంటున్నారు కదా.. సరే అక్కడికే వస్తున్నా..అలా వంట శాలను ప్రయోగ శాలలా మార్చేసి రాజ్యమేలుతున్న తరుణంలో మా అత్తగారు ఊరు వెళ్ళారు ..(అదే మా బంటిగాడు తప్పి పోయిన టైములో ) వెళ్ళేటప్పుడే చెప్పారు కూరల పాపమ్మ ఇంటికొస్తుంది తనదగ్గర కూరలు తీసుకోమని .. హమ్మయ్యా అనుకున్నా ..ఇంక నా ఇష్టా రాజ్యం కదా .. సింపుల్గా అయిపోయే ఇగుర్లు చేసిపడేద్దాం అనేసుకున్నా కాని నాకేం తెలుసు కూరలమ్మే పాపమ్మ దగ్గర నా ఆటలు సాగవని..

మరుసటి రోజు పాపమ్మ రాగానే ఆ ములక్కాడలివ్వు చాలు అన్నాను .. ఏటి, ఈ ములక్కాడ ఓ మూలకొస్తుంది అనుకున్నావా ..నవ నవలాడే గుత్తోంకాయలు ఉన్నాయి తీసుకో మీ మామగారికి చాలా ఇట్టం అంది ఇంత నోరేసుకుని.. మనకసలు ఎలా వండాలో తెలిస్తే కదా.. అందుకని నాకొద్దు ,ఇవి చాలు అన్నాను ..ఓసోస్ ,గొప్ప బేరమే ఈ ములక్కాడలు తీసుకున్టావనా ఇన్ని మెట్లెక్కి పైకొచ్చింది ... ఎక్కడైనా కోడళ్ళు అత్తగారు అలా బయటకు ఎలితే సాలు నాలుగు రకాలు వండేసుకుని తినేద్దామనుకుంటారు.. నువ్వేటి మిగిలినోళ్ళ కడుపులు కూడా మాడ్చేసేలా ఉన్నావ్ అంది.. నువ్వెక్కడ దొరికేవే బాబు అని కంగారుగా చుట్టూ ప్రక్కల చూసాను ఎవరన్నా వింటున్నారేమో అని.. అబ్బా ,ష్..ష్.. నెమ్మదిగా మాట్లాడు ...అదికాదు పాపమ్మా నాకు గుత్తొంకాయ వండటం రాదు అన్నాను మెల్లిగా నసుగుతూ..అంతే .. పాపమ్మ వినకూడని మాట విన్న దానిలా తత్తర పడి, బిత్తర పోయి ...ఏటి, గుత్తొంకాయ వండటం రాకుండానే కాపురానికోచ్చేసావా , నాకు తెలిసి ఓల్ ఆంధ్రాలో గుత్తొంకాయ కూరా,గోంగూర పచ్చడి రాని ఆడపిల్ల లేనే లేదు అంది ... అటువంటి కారణ జన్మురాలిని నేనున్నాగాని ..అమ్మా తల్లీ ..తిట్లు ఆపి కూర ఎలా చెయ్యాలో చెప్పితే కొంటా లేదా నన్నిలా వదిలే అన్నాను.. ఇది మరీ బాగుంది ..కూరలమ్మే పెతి సోటా ఎలా సేయ్యాలో సేప్పుకుంటూ పొతే ఇంక నేను యాపారం సేసినట్టే అని కాసేపు గొణుక్కుని ఈ రెసిపి చెప్పింది .. కాబట్టి బేగెల్లి ఒక పేపరు పెన్ను అట్టుకుని లగెత్తు కొచ్చేయండి ఓ పాలి..


ముందు ఒక అరకిలో గుత్తు వంకాయాలు ఉప్పు వేసిన నీళ్ళలో నాలుగు వైపులా చీరి అందులో వేసుకుని ప్రక్కన పెట్టుకోవాలి.. బాణాలిలో ఒక స్పూన్ నూనె వేడి చేసి 5 ఎండు మిరపకాయలు ,రెండు పెద్ద చెంచాల వేరు శనగ గుళ్ళు వేసి దోరగా వేపి ప్రక్కన పెట్టుకోవాలి .. ఇప్పుడు మిక్సిలో రెండు ఉల్లిపాయాలు ( మీడియం సైజు)ముక్కలు ,అర అంగుళం అల్లం, నాలుగైదు వెల్లుల్లి ,వేపిన ఈ ఎండుమిర్చి ,వేరు శనగ వేసి ,ఉప్పు ,మషాలా పొడి ( మా ఆయనకు పడదు కాబట్టి నేను ధనియాల పొడి మాత్రమే వేసి వదిలేస్తా..అలాక్కుడా బాగుంటుంది ) వేసి మెత్తగా చేసుకోవాలి ..ఇప్పుడు ఈ వంకాయలను నీళ్ళను పిండేసి మషాలా వంకాయల్లో కూరాలి..బాణాలి వేడి చేసి నూనె వేసి ( నాన్ స్టిక్ కాకపొతే ఎక్కువ ఆయిల్ పడుతుంది) ఈ వంకాయలను జాగ్రత్త గా దానిలో వేయాలి .. వంకాయలు మగ్గుతున్నపుడే కూరాకా మిగిలిన మషాలా వేసేసి బాగా మగ్గాక ఒక చిన్న గిన్నెలో చింత పండు లో కొంచెం నీరు పోసి చిక్కగా తీసి దాన్ని వంకాయలో వేసి మగ్గనివ్వాలి చివ్వర్లో ఉప్పు,కారం సరి చూసుకుని దగ్గరకు రాగానే కొత్తిమిర జల్లి కూర దింపేయడమే ..


అయితే మరి నేనెలా వండానో ఆ రోజు అని మీరందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తూ గోళ్ళు కొరికేసుకుంటున్న విషయం మీకు తెలియక పోయినా నాకు తెలుసు ..అలా పాపమ్మ చెప్పి వెళ్ళిపోగానే 'గుత్తివంకాయ్ కూరోయ్ మామా గుట్టుగా నేను వండితిని' అని పాడేసుకుంటూ వంట చేశా ..కూర అయిపో వస్తున్నదనగా ఎలా వచ్చిందా అని ఒక వంకాయ తిన్నా ..ఉడకలేదేమో అన్న డవుటుతో ఇంకొక సారి టేస్ట్ చేశా.. ఉప్పు సరిందా? లేదా? అని ఒకసారి, కారం తక్కువైందేమో ?అని ఒకసారి ,అసలే కొత్త వంట మళ్లి తేడా చేస్తే బాగోదని మరొక సారి ఇలా ఎంతో శ్రద్దగా వంట చేసేసరికి అది పావుకిలో కూర కూడా మిగలలేదు..నాకేంటో ఎన్ని సార్లు తిన్నా బాలేదేమో ?,ఎదుటి వాళ్లకు నచ్చుతుందో లేదో? కొత్త వంట కదా అని ఫీలింగ్ అందుకే యధాప్రకారం ములక్కాడ టమాటా వండేసా..

మా మావయ్య గారు రాగానే ఆయనకు ములక్కాడ కూర పెట్టి నేను ఎంచక్కా గుత్తివంకాయ వేసుకుని తినేస్తున్నా ..పాపం మా మావయ్యగారు ఒక నిమిషం చూసి అదేంటమ్మా అన్నారు.. గుత్తివంకాయ మావయ్యగారు అన్నాను..మరి నాకు పెట్టలేదే అన్నారు ..అసలే మా మావయ్యగారికి ఆ కూర అంటే చాలా ఇష్టమంట .. బాగా రాలేదు అండి అన్నాను నా త్యాగనిరతి చూపిస్తూ..బాగుందో లేదో చెప్పాల్సింది మేము కదా అని ఆ గిన్నె తీసుకుని తిని ..భలే ఉంది ఇంకా పట్రామ్మా అన్నారు.. అంటే మావయ్యగారు ఇంక లేదు అన్నాను.. మరీ రెండువంకాయలే వండావా అన్నారు..అంటే అరకిలో వండాగాని టేస్ట్ చూసేసరికి ఇలా అయిపొయింది అన్నాను.. అబద్దం చెప్పచ్చుకాని మా పాపమ్మ చెప్పేస్తుంది కదా అన్న భయం తో నిజం చెప్పేసా.. అప్పటి నుండి మా మావయ్యగారు ఎప్పుడూ ఏడిపిస్తారు నన్ను ..కూర వండు గాని టేస్ట్ మాత్రం చూడకు అని..


కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే ..ఈ కూర వండి టేస్ట్ చూడకుండా మీ వాళ్లకు పెట్టండి ..బాగుంటే నా పేరు చెప్పుకుని పండగ చేసుకోండి.. లేదనుకోండి నాకు సంబంధం లేదు కావాలంటే మా పాపమ్మను మొహమాట పడకుండా తిట్టుకోండి.. ఏం పర్లేదు.. :)