13, సెప్టెంబర్ 2011, మంగళవారం

పాడమని నన్నడగవలెనా!!!!

చిన్నప్పటి నుండి నాకు రెండు తీరని కోరికలు ఉండిపోయాయి ..ఒకటి .. " పంచభూతములు ముఖ పంచకమై...చతుర్వేదములు ప్రాకారములై " అంటూ సాగరసంగమం కమల్ హాసన్ లా కదక్, కూచిపూడి మణిపురి , ఒడిస్సీ ,భరతనాట్యం ఇలా అన్ని నృత్యాలు నేర్చేసుకుని స్టేజ్ ఎక్కి మరీ ఆహా ఓహో అనిపించేసుకోవాలని.. రెండోదేమో అదే స్టేజ్ మీద కుడిచేయి ఒక తిరగా, ఒక బోర్లా వేస్తూ ..సరిగమపదనిస సనిదపమగరిస అంటూ బోలెడు కచేరీలు ఇచ్చేయాలని .....

నాకు తెలుసు మీరందరూ దిగులు దిగులుగా,భయం భయంగా చూస్తున్నారని ...ఆ మాత్రం జాలి, మీ ఆరోగ్యం పట్ల శ్రద్ద నాకు లేవనుకున్నారా !! అందుకే మొదటిదాన్ని చెప్పకుండా మీకోసం త్యాగం చేస్తున్నాను..దానికి ప్రతిఫలంగా రెండోవ విషయం వినాలి ...:)


అంటే అసలు ఈ పాటలు పాడాలి అన్న కాన్సెప్ట్ నాలో ఎప్పటినుండి మొదలైంది అంటే ..శంకరాభరణం సినిమాలో సోమయాజులు వరలక్ష్మిని ..తెల్లవారుజామున పీకల్లోతు నీటిలో ముంచేసి
సా రి గ రీ గ పదా పా
స రి గ ప దా ప గ రీ
రి గ ప ద సా నీ దా పా అని .... సంగీతం నేర్పే సీన్ చూసినదగ్గరనుండి .." ఓస్ ఇంతేనా ????ఇంత సింపులా పాడటం అంటే?" అనేసుకున్నాను .. ఆ పళంగా రెండు రోజులు ప్రొద్దున్నే లేచి మా ఇంట్లో నీళ్ళ కుండీలో అమ్మ చూడాకుండా ఒక ఐదు నిమిషాలు "ఖష్ట పడి " సాధన చేసేసాను... ఇంకేముంది నాకు సంగీతం వచ్చేసింది ...

అయితే ఒట్టి సంగీతం వచ్చేస్తే సరిపోతుందేమిటీ!! .. పాటలు కూడా రావాలిగా ..అప్పట్లో అప్పుడప్పుడు రేడియో పాటలు..వారానికోసారి టీవిలో వచ్చే చిత్రలహరి తప్ప పాటలు నేర్చుకోవడానికి వేరే ప్రత్యమ్నాయం ఉండేదికాదు ... అప్పుడెలాగా?? అని ఆలోచిస్తే మా అక్క గుర్తొచ్చింది..దాని నోట్ బుక్స్ నిండా స్కూల్ లో వాళ్ళ మిస్ లు నేర్పే పాటలే.. అంతే ..మా పై మేడ ఎక్కేసి అబ్బో తెగ ప్రాక్టీస్ చేసేసాను....ఇంకేంటి కచేరి చేయడం ఒక్కటే మిగిలింది.... ఇక శ్రోతల్ని సమకూర్చుకోవడమే..

సరిగ్గా అదే టైమ్లో మా పెద్దమ్మ.. మా పెద్దక్క లెక్కల్లో క్లాస్ ఫస్ట్ వస్తుందని వద్దు వద్దని మొత్తుకున్నా బలవంతంగా ఓ ట్యూషన్ లో జాయిన్చేసేసింది.. అది ఏడుస్తుంటే నవ్విన పాపానికి నేరుగా మా అమ్మదగ్గరకు వెళ్లి .."పిన్నీ నేనైతే క్లాస్ ఫస్టే..మన బుజ్జయితే స్కూల్ ఫస్ట్ వస్తుంది "అని చెప్పిన మరుసటి రోజే దానితో పాటు నేనూ అదే ట్యూషన్లో చేరాల్సి వచ్చింది...

అలా లెక్కలేనన్ని తిట్లు తిట్టుకుంటూ లెక్కలు చేసుకుంటూ రోజులు లెక్కపెట్టుకుంటుంటే ..ఒక శుభముహుర్తాన మా సార్ వాళ్ళ పాప పుట్టినరోజు వచ్చింది ..అందరం ఎప్పటిలా పుస్తకాలు ముందేసుకోగానే సార్ వాళ్ళ అమ్మగారు .."అరే ..పండగ పూట పాఠాలేమిటిరా ఈ రోజు పిల్లల చేత నాలుగు పాటలు పాడించరాదూ" అనేసరికి ఎగిరి గెంతులేసేయాలనిపించింది .. అసలే ఆయనకు వాళ్ళ అమ్మగారంటే మహా గౌరవం (భయం?) ఉండేది.. సరే ఎవరన్నా వచ్చి మంచిపాటలు పాడండి అన్నారు..

నాకేమో నేర్చుకున్న పాటలన్నీ పాడేయాలని ఉందికాని... మరీ నాకు నేనుగా అంటే లోకువ అయిపోతానని సార్ పిలుపు కోసం ఎదురుచూస్తున్నా ..అబ్బే ..ఆయన నన్ను పట్టించుకుంటే కదా.. ఎవరెవరినో పిలుస్తున్నారు.. ఇహ లాభం లేదని నా పక్కదానితో గుస గుసగా .."హే నాకు చాలా పాటలు తెలుసు కానీ ఏమో బాబు నాకు భయం "అన్నాను సిగ్గుపడుతూ.. ఆ పిల్ల నావైపు ఓసారి చూసి "ఓహో " అనేసి మళ్లీ తలతిప్పేసుకుంది..ఎవర్తివే నువ్వు గాడిద అని కసిగా తిట్టుకుని ఇటు మా అక్క వైపు తిరిగాను.. నేనింకా విషయం చెప్పకముందే ..నీకెందుకే నోరుమూసుకుని కూర్చో అనేసింది కుళ్ళు మొహంది .... దున్నపోతా అని అనుకుంటుంటే మా గుసగుసలకు సార్ నా వైపు చూసి నువ్వు పాడతావమ్మా అన్నారు ....

ఆట్టే బెట్టు చేస్తే మొదటికే మోసం అని ' ఊ ' అని తల ఊపాను మొహమాటంగా .. ఆలోపలే సార్ వాళ్ళ అమ్మగారు ఇద్దరుముగ్గురు ఫ్రెండ్స్ని కూడా తీసుకు వచ్చేసారు షోకి ... నేను గట్టిగా ఊపిరిపీల్చి శ్రావ్యంగా మొదలుపెట్టాను .."ఏసయ్య ఇంటి ముందు సిరిమల్లె చెట్టు సిరిమల్లె చెట్టు " మొదటి లైన్ పూర్తవ్వగానే సార్ వాళ్ళ అమ్మగారు ఫ్రెండ్స్ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూడటం మొదలు పెట్టారు ...ఏదో తేడా తెలుస్తుందికాని అదేమిటో తెలియడం లేదు ... ఇంకో నాలుగైదు లైన్స్ పాడగానే వాళ్ళందరూ మూకుమ్మడిగా మా సార్ ని చూడటం మొదలు పెట్టారు...

మా సార్ మధ్యలో ఆపేసి పాప ఇంకో మంచి పాట పాడమ్మా అన్నారు.. ఓస్ అంతే కదా అనుకుని గొంతు సవరించుకుని మరొక పాట మొదలు పెట్టాను "దేవుడే నాకాశ్రయంబు " ... పాట మొదలు పెట్టిన అయిదు నిమిషాలకే వాళ్ళ అమ్మగారి ఫ్రెండ్స్ మూతి మూడు వంకర్లు తిప్పి.. వస్తాను కామాక్షిగారు పొయ్యి మీద ఎసరు మరిగిపోతుంది అని మనిషికో వంక పెట్టి వెళ్ళిపోయారు.. ఆవిడ రుస రుసలాడుతూ కొడుకు వైపు ఒక్క చూపు చూసి లోపలికి వెళ్ళిపోయింది..ఆ తరువాత మా సార్ ఇక పాటలు చాలు పుస్తకాలు తీయండి అనో గసురు గసిరి ఓ గంట ఎక్కువ వాయించేశారు .. "బుద్దుందా అసలు ..రోజంతా మడి చీరతోనే తిరుగుతూ మనం వెళ్ళగానే ఇల్లంతా కడిగేసుకునే చాదస్తం ఆవిడది ..అక్కడ ఆ పాటలు పాడుతావా " అని ఆ రోజంతా మా పెద్దక్క తిట్లతో తెల్లారిపోయింది నాకు .."

ఆ దెబ్బతో కొన్నాళ్ళు పాడుతా తీయగా కార్యక్రమం వాయిదా వేసాను ... కాని మనకి అవకాశాలు తంపానుతంపరలుగా తన్నుకోచ్చేస్తే ఏం చేసేది ??? ఓ రోజు మా స్కూల్లో ఇన్స్పెక్షనో పాడో గుర్తులేదుగాని ఒక అతను వచ్చారు.. మా సార్లు అందరూ కంగారుగా వాళ్ళ వెనుక పరుగులు పెడుతున్నారు .. అతను రావడం రావడం ఖర్మకాలి(ఎవరి ఖర్మ అనేది ముందు ముందు తెలుస్తుంది) మా క్లాస్ కు వచ్చారు.. వచ్చిరాగానే మీలో దేశభక్తి ఎంత మందికి ఉంది అన్నారు.. మొత్తం చేతులు ఎత్తేసాం.. మీలో దేశభక్తి గీతాలు ఎవరికి వచ్చు అన్నారు.. నేను ,మా స్వాతి నిన్చున్నాం.. మరి మేమే రోజు ప్రేయర్లో వందేమాతరం పాడేది.. దేశభక్తి అంటే దేశం లో ఉన్న లోపాలు కప్పేసి సుజలాం సుఫలాం అంటూ లేనివి ఉన్నట్లు పాడేయడం కాదు... లోపాలేమిటో తెలుసుకుని వాటిని పారద్రోలడం ..అసలు మన దేశం లో పేదరికం పై ఉన్న కవితలు, పాటలు ఎవరికైనా తెలుసా అన్నారు ..పాపం ఆయన ఉద్దేశం శ్రీ శ్రీ గురించో మరొకరి గురించి చెప్తామని కాబోలు... మాకు అప్పట్లో అంత నాలెడ్జ్ ఎక్కడిది...మేమందరం తీవ్రంగా ఆలోచిస్తుంటే ఆయన చూపు నా మీద పడింది..

ఏది ఓ మంచి పాట పాడు అన్నారు ఆయన నా వైపు చూస్తూ..(చెప్పానుగా తలరాత) నేనేమిటంటే నాగేశ్వరరావు పాట " పాడవోయి భారతీయుడా" పాట గుర్తుతెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాను ..ఆయన ఉన్నట్లుండి నన్ను అడిగేసరికి ఆ కంగారులో మర్చిపోయాను ..ఎంత గింజుకున్నా గుర్తురాదే ... పోనీ రాదనీ చెప్దామా అంటే రాక రాక వచ్చిన అవకాసం .. ఈ లోపల అనుకోకుండా చిన్నప్పుడు రేడియోలో విన్న ఒక పాట గుర్తు వచ్చింది.. పూర్తిగా గుర్తులేదు ఏదో పల్లవి ... ఏదైతే ఏమిటిలే అని మొదలుపెట్టేసాను ఆలోచించకుండా... ఎవరూ భయపడకండెం.. ఆ పాటేమిటంటే ....

ఇల్లూ వాకిలి లేదు...
వెనకా ముందు లేరు..( ఈ ముక్కను ఎలకల మందు లేదు అని పాడేదాన్ని ...నాకు సరిగా వినిపించకా)
ఎక్కడికని పోనూ....

పాట ఇంకా పల్లవి అవ్వనేలేదు మా సార్లు,మేడం లు గోడకి దభేల్ ధబెల్ మని మూకుమ్మడిగా తల కొట్టేసుకుని నా నోరు మూయించేసారు అంతే... మరి నాకేం తెలుసు అది ఐటం సాంగ్ అని ..పాపం ఒక అమ్మాయి బీదరికంతో ఎలకల మందు మింగిచనిపోదాం అనుకుంటూ అలా పాడేదనుకునేదాన్ని ... ఆ తరువాత మా హెడ్ మాస్టార్ నన్ను ప్రత్యేకంగా పిలిపించి స్పెషల్ గా పొగిడేసరికి మళ్లీ ఇంకోసారి అవుట్ డోర్ కచేరీలు పెట్టలేదు ...అయినా తిరిగే కాలు పాడే నోరు ఊరుకుంటాయా ??? అసలు ఇదంతాకాదు ఇంట గెలిచి రచ్చగెలవమన్నారు కాబట్టి ముందు ఇంట్లోవాళ్ళతో శభాష్ అనిపించుకోవాలాని కఠోర సాధన చేసాను ...

ఒక శుభ ముహూర్తాన నాన్న ఆదివారం పూట మధ్యాహ్నం సుబ్బరంగా తిని పడుకుంటే మెల్లగా "నన్ను దోచుకుందువటే వన్నెలదొరసాని " ఆ పాట పాడటం మొదలు పెట్టాను..మరి నాన్న ఎన్ టి రామారావు ఫేన్ కదేంటి ..తేడా రానిస్తానా!! కాసేపటికి మా నాన్న శారదా !! అంటూ ఒక్క అరుపు అరిచారు ..ఏమిటి నాన్న గారు మా అక్క పరుగున వచ్చింది ... నువ్వు పాడుతున్న రాగామేంటి ..ఎంచుకున్న తాళ మేమిటి ..అని పాపం శంకరాభరణం శాస్త్రి గారిలా క్లాస్ పీకబోయారు కాని అది మధ్యలో ఆపేసి" పాడింది నేను కాదు బుజ్జీ" అనేసి చక్కా వెళ్ళిపోయింది..గొప్ప అవమానం అయిపోయింది.. మెల్లగా మా చెల్లి పక్కకు చేరి ..మరీ అంత చండాలంగా పాడానంటావా అనుమానంగా (కొద్దిగా ఆశగా) అడిగాను..అది నావైపు ఒక సారి చూసి నిట్టూర్చీ ... చెప్తే ఏడుస్తావని ఊరుకున్నాం గాని అక్కా వారం రోజులనుండి మాకు చెవుల్లో రక్తాలు కారిపోతున్నాయి... అనేసింది (ఇప్పటికీ ఈ విషయం తలుచుకుని ఏడిపిస్తూనే ఉంటారు మా వాళ్ళు :()

ఇంకేం చేస్తాం అలా ఒక వర్ధమాన గాయినిని తూటాలవంటి మాటలతో తోక్కేసారు.. పెళ్ళయ్యాకా అసలు పాడే ప్రయత్నమే చేయలేదు ...నాకు తెలుసు మీరేమనుకుంటున్నారో..మా ఆయన వంకలు పెట్టి ఉంటారనేగా ...హి హి హి హి కాదు ...నేను మొదలు పెట్టగానే రెండో లైన్ నుండి ఆయన పాడటం మొదలెట్టేస్తారు :( ఆ బాధకంటే ఇలా బాత్ రూం సింగర్ గా మిగిలిపోవడమే ఉత్తమం అని కేవలం నా పాటకు నేనే శ్రోతనై అలా మిగిలిపోయాను ...

అక్కడితో ఆగిపోతే అసలు ఈ రోజు ఈ పోస్ట్ పుట్టేదేకాదు ... మొన్నో మధ్య ఒక ఫ్రెండ్ వాళ్ళింట్లో సత్యన్నారాయణ స్వామివారి వ్రతం అని పిలిస్తే వెళ్లాను ... పూజ అయ్యాకా దంపతులను హారతి ఇచ్చి లేపాలి.. ఎవరన్నా పాడండమ్మా అంటే..అమ్మో నాకు రాదంటే నాకు రాదు అని మెలికలు తిరిగిపోతున్నారు జనాలు.. నాకు జరిగిన అనుభవాల దృష్యా నేను లేవలేదు ... ఎందుకు చెప్పండి పిలిచి తిట్టించుకోవడం..కాని అవకాసం తరుముకొస్తే ఏం చేస్తాం..అక్కడ చీరకట్టుకున్న ఏకైక మహిళను నేనే ...అందుకని అందరూ నన్ను లాక్కోచ్చేసారు ...భయం భయం గా "క్షీరాబ్ది కన్యకకు నీరాజనం" అని అన్నమాచర్య కీర్తన కొద్దిగా పాడాను..హమ్మయ్యా ఎవరూ మాట్లాడలేదు ...ఒక పనైపోయిన్దిరా బాబు అని వెళ్లిపోతుంటే పూజ చేసిన పంతులుగారు పిలిచి చాలా బాగా పాడావమ్మా" గాన సరస్వతి" లా అన్నారు...అందరూ అవునవును అన్నారు చప్పట్లు కొట్టి..

ఇంక మీకు నేను విడమరచి చెప్పక్కరలేదనుకుంటా నేను ఇంటికి వెళ్ళేంతవరకూ నేలకు నాలుగు అడుగుల పైన నడిచానని .. మా ఆయనకు చెప్తే ...అంటే బుజ్జీ ముసలాయనకదా సరిగ్గా వినిపించి ఉండదు ... పొరపాటు పడటం మానవ సహజం.. నువ్వు మామూలుగా నడిచేయచ్చు అనేసారు :( అయినా సరే నేను ఒప్పుకోనుగాక ఒప్పుకోను..చిన్నప్పుడే నాలో ఒక చిత్ర ,ఒక శ్రేయగోషల్ ,ఒక గోపికా పూర్ణిమ ఉన్నారు అంతే అంతే అంతే ...అంతే బాబు..ఇక ఎవ్వరి మాటలు నమ్మదలుచుకోలేదు నాకు తెలుసు మీరేమంటున్నారో ..మీ పాట ఒకటి మాకూ వినిపించచ్చుకదా అని కదా.. హమ్మా పొరపాట్లు అన్ని సార్లు జరుగుతాయ్ ఏంటి ....మీరు మరీను