14, అక్టోబర్ 2009, బుధవారం

నేను- మా ఆయన - క్రికెట్టులాస్ట్ పోస్ట్లో క్రికెట్ అంటే ఎందుకు ఇష్టం లేదో చెప్పాను కదా...మా పెద్ద అక్క అంటూ ఉండేది ..అమ్మాయిలు పుట్టింట్లో ఏది ఇష్ట పడరో అత్తింట్లో అదే మనకు ఎదురవుతుంది అని ..అంత పవర్ ఫుల్ మాటలను ఆ రోజుల్లో పెద్దగా పట్టించుకోలేదు:( మా ఆయన తనకి క్రికెట్ ఇష్టమంటే కాసింత భయపడినా పోనీలే యే 4 ,5 నెలలకోమారు ఆడేదానికి గొడవచేయడం ఎందుకులే అని మొదట్లో ఊరుకున్నాను.. కానీ నాకేం తెలుసు మా ఆయన వారానికి 2 సార్లు గ్రౌండ్ కి పారిపోతారని..శనివారం లీగ్ మేచ్ లని,ఆదివారం ఫ్రెండ్లీలని ఏంటో, ఏంటో అని పారిపోతారు..ఒక వేళ యే వారమన్నా మేచ్ లేదంటే, ప్రాక్టిస్ అనో ,ఆఖరికి ఎంపైరింగ్ చాన్స్ కూడా వదలరు.. భర్త క్రికెట్ కి వెళుతుంటే దేవుడా, దేవుడా ఈ రోజు వర్షం వచ్చేలా చేయవా అని కోరుకునే భార్యామణిని నేనే అనుకుంటా ..మా ఆయనకు క్రికెట్ అంటే ఇష్టం కాదు బాబోయ్ ప్రాణం..

నా కష్టాలన్నీ ఎలా మొదలు పెట్టి, ఏమని రాయాలో కూడా తెలియడం లేదు.. వచ్చిన క్రొత్తలో మా ఆయన ఎంతో ప్రేమగా, నా క్రికెట్ బట్టలన్నీ మురికిగా అయిపోయాయి కాస్త ఉతకవా , నాకు సరిగా ఉతకడం రాదుకదా అని జాలిగా అనేసరికి ,హృదయం ద్రవించిపోయి ..మై హూన్ నా డియర్, నేను మీ భార్యను,ఇది నా భాద్యత అని ఎక్స్ ట్రా లు చేసి ఆ బట్టలను బ్లీచ్ నీళ్ళలో ముంచి, సర్ఫ్ లో నాన బెట్టి చేతులు పడిపోయేలా బ్రష్ కొట్టి తెల్లగా మల్లెపూవులా ఉతికి ఇస్తే, రాత్రికి నూనెలో ఊరబేట్టిన ఊరగాయలా బురదలో ముంచి తెచ్చి ఇచ్చేవారు ..ఇదేంటండీ అని గట్టిగా అడిగితే మరి క్రికెట్ అంటే కేరం బోర్డ్ అనుకున్నావా షర్ట్ నలగకుండా వచ్చేయడానికి అని తిరిగి నన్నే అనేవారు..దెబ్బకు నాలో ఉన్న సతీ సావిత్రీ ని ప్రక్కన కూర్చోపెట్టి, నావల్ల కాదు నాయనా అని వాషింగ్ మిషన్ లో వేసేసేయడం మొదలు పెట్టాను..

అసలు క్రికెట్ మేచ్ ఉంది అంటే ఎంత హడావుడి పడతారంటే ,నాలుగు రోజులముందు నుండే వెదర్ రిపోర్ట్ చూడటం మొదలు పెడతారు..ఒక వేళ వాడు వర్షం వచ్చే సూచనలున్నాయి అంటే చూడాలి అయ్యగారి టెన్షన్ ..అదొక్కటేనా ,రేపు మేచ్ అనగానే ఈ రోజు రాత్రే క్రికెట్ కిట్ సర్దేసుకున్నా ,తెల్లారు జామున 5 గంటలకు లేచి మళ్లీ మొదలు పెడతారు సర్దుడు.. ఆ ముందు రోజు రాత్రి నుండే 'టీం 'లో ఎవరినీ ప్రశాంతం గా ఉండనివ్వరు.. సార్.. రేపు ఇన్నిగంటలకు మీరు బయలు దేరాలి గుర్తుందా అని వాళ్ళకి ఒకటే ఫోన్లు..తెల్లారిందంటే అందరికీ అలారం పీస్లా కాల్ చేసి నిద్రలేచారా ,రెడీ అయ్యారా అంటూ మేలుకొలుపులు ...అబ్బబ్బబ్బా ఒక్క గోలకాదు..మీరాడే తొక్కలో క్రికెట్కి ఇంత బిల్డప్పులు అవసరమా అంటే అనవే అను నెక్స్ట్ మంత్ జయసూర్యా వస్తున్నాడు అతనికి నేనే బౌలింగ్ వేస్తా అప్పుడు నువ్వే తెలుసుకుంటావ్ అని ఉడికిపోయేవారు .. గాడిదగ్రుడ్డు వాడెవడో వస్తే నాకేంటి అని తిరిగి తిట్టేదాన్ని..

ఒకసారి మేచ్ లేదు ఇంట్లోనే ఉన్నారు ..మద్యాహ్నం అవ్వగానే బుజ్జీ, ఏంటో ఈ రొజు కాస్త నీరసం గా ఉన్నట్లు కనబడతున్నావ్.. పోని ముస్తఫా వెళ్ళి నేను కూరలు తీసుకురానా ??నువ్వు రెస్ట్ తీసుకో అని అనేసరికి కరిగి కన్నీరయిపోయాను..పాపిష్టిదాన్ని ,ఏదో కాస్త సర్దాపడి క్రికెట్ కి వెళితే ఎన్నేన్ని మాటలనేదాన్ని అని నన్ను తిట్టేసుకుని, మరీ ఎక్కువ తీసుకురాకండి మోయలేరు ,ఏం తెచ్చినా తేవకపోయినా ఉల్లిపాయలు,టమోటాలు 1 కిలో తేవడం మరువకండే అని ప్రేమగా పంపించాను ..వెళ్ళిన మనిషి సాయంత్ర 6 అయినా రారే??..పోని ఫోన్ చేస్తే అది మెసేజ్ కి వెళ్ళిపోతుంది..ఈ లోపల ఆయన ఫ్రెండ్ భార్య నుండి ఫోన్ ..ఏమండీ ,మావారు ఫోన్ చేస్తె లిఫ్ట్ చేయడం లేదు ..మీవారికి మీరు 'కాల్' చేసి ఆయనకు 'కాల్' చేయమని చెప్పరా అని... ఈ రోజు మావారి కి మేచ్ లేదండి అన్నాను గర్వంగా ..తెలుసు అండి కాని మావారు ఆడుతున్న మేచ్ చూడడానికి వెళ్ళారుగా మా ఆయనతో కలిసి అంది ఆమె ..హార్నీ, ఎంత మోసం అనుకుని నేను కారాలు ,మిరియాలు ఒక గంట మెత్తగా నూరాకా ..అబ్బబ్బా ఎంత ట్రాఫిక్ అనుకున్నావే బాబు ...మధ్యలో నేను ఎక్కిన బస్ 2 గంటలు ఆగిపోయింది తెలుసా అన్నారు..ఎక్కడా ??మీ ఫ్రెండ్ ఆడుతున్న స్పోర్ట్స్ క్లబ్ దగ్గరేనా అన్నాను కోపంగా.. హి..హి దార్లోనే కదా అని అటువెళ్ళాను.. ఆ రెండు టీంలు మంచి టీంలు అందుకని ..,కానీ బుజ్జీ నీకు రెండు వారాలు సరిపడా కూరలు తెచ్చేసా అన్నారు.. నిజంగానే ఆయన చేతిలో పెద్ద పెద్ద బేగ్లు ..

సరే అని చూద్దును కదా 3 పెద్ద పెద్ద కట్టల తోటకూరా,3 కట్టల మునగాకు ,3 కట్టల పుదీనా..3 కట్టల పొన్నగంటి ఆకు,3 కట్టల గోంగూరా, 3 కట్టల కొత్తిమీర ,3 కట్టల పాల కూర.. ఏంటండీ ఇది ,నేనేమన్నా మేకను అనుకున్నారా ఇన్ని ఆకులు తెచ్చారు అన్నాను తెల్లబోతూ ...అంటే ఈ మద్య నీరసం అంటున్నావ్ కదే ,నీకు ఐరన్ బాగా పడుతుందనీ అని నసిగారు.. నేను సీరియస్ గా చూసేసరికి చిన్నగా నవ్వి మేచ్ టైము అయిపోతుంటే చేతికందింది కొనేసా ,నిజం చెప్పేసా కదా ఇంకలా చూడకు అన్నారు..భగవంతుడా అనుకుని పోనీ ఉల్లిపాయలు,టమాటాలు తెచ్చారా?? అన్నాను..ఉల్లిపాయలు మర్చిపోయా కాని టమోటాలు తెచ్చాను అన్నారు.సంతోషం, ఏవి ఇలా ఇవ్వండి అన్నాను ..2 బుల్లి టమాటాలు చేతిలో పెట్టారు ..ఇదేంటీ?? కిలో తెమ్మాన్నా కదా అన్నాను అయోమయంగా.. అవి కిలో ఉండవా బుజ్జి అన్నారు అమాయకంగా చూస్తూ ...మహానుభావా.. ఒక్కసారి మీ అమ్మగారిని తీసుకొస్తే పాదాభివందనం చేసుకుంటాను అన్నాను .. అన్నిటికి మద్యలో మా అమ్మను లాగుతావే అనుకుంటూ వెళ్ళిపోయారు.. క్రికెట్ పేరు చెపితే చాలు మా ఆయనకు అసలేం గుర్తుండదన్నమాట.

పోనీ ఆయనగారు ఆడే మేచ్ లు ప్రక్కన పెడితే ఇంట్లో అన్నా ప్రశాంతంగా ఉండనిస్తారా అంటే అదీ లేదు..ఈ.ఎస్.పి.ఎన్ ,స్టార్ స్ఫోర్ట్స్ చానెల్స్ ని ముందేసుకుని కూర్చుంటారు..ఆ చానెల్ వాళ్ళకు అంతకన్నా పనీ పాటా ఉండదు,ఎప్పుడో 25 యేళ్ళనాటి మేచ్ లను మళ్ళీ పది సార్లు త్రిప్పి, త్రిప్పి వేస్తుంటారు.. పోని చూసి వదిలేస్తారా ..ఈ బాల్ తర్వాత బాల్ చూడు బుజ్జీ భలే క్రాస్ అయ్యి వికెట్ కి తగులుతుంది.. నెక్స్ట్ ఓవెర్ లో వీడు సిక్స్ కొడతాడు అని అంటుంటే మీరు చెప్పండి తిక్క నషాళానికి అంటుందా లేదా..

ఒక రోజు ఎంతో విచారంగా అంతా బ్రాంతియేనా ,జీవితానా వెలుగింతేనా అని పాడుకుందామని మొదలు పెట్టాబోయేంతలో, నా అంతరాత్మ డింగుమని వచ్చి ఎంత సేపూ మీ ఆయన్ని తిట్టేబదులు, అచ్చిక బుచ్చికలాడి నీ వైపు మార్చుకోవచ్చు కదా,అసలు తప్పంతా నీదే, నీదే, నీదే అని నాలుగు వైపులా రౌండులు తిరిగి మరి వాయించేసింది ..ఛీ,ఛీ చిన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు మరీ ఎక్కువగా చూడటం తప్పైపోయింది అని తిట్టుకున్నా ..ఇదీ పోయింటే కదా ఓ సారి ట్రై చేద్దాం అనుకున్నా..

ఓ రోజు మా ఆయన ఇంటికి రాగానే ,హడావుడిగా టి.వి పెట్టి, నిన్న రాత్రి తెల్లార్లూ జాగారం చేసి చూసిన..మనోళ్ళు ఓడిపోయిన మేచ్ ను ప్రొద్దున్న రెండుసార్లు హైలెట్స్ చూసి, ఆఫిస్ కి వెళ్ళాకా అడ్డమైన పేపర్లలో మళ్ళీ చదివీ ,ముచ్చటగా మూడో సారి చూస్తుండగా...నేను ఎంతో ఆహ్లాదంగా నవ్వుతూ ప్రక్కన కూర్చుని.. ఏమండీ !ప్రొద్దు గూకింది..పక్షులు ఇళ్ళకు చేరే వేళయ్యింది..మనం ఎంచక్కా ఆ ఎదురుగా ఉన్న పార్కులో బెంచ్ మీద కూర్చుని , ప్రక్కనే ఉన్న సెంటుమల్లి చెట్టు నుండి వచ్చే పరిమళాలను పీలుస్తూ ,పైన చందమామను చూస్తూ ,పక్షుల కిల ,కిల రావాలను వింటూ కబుర్లు చెప్పుకుందామా అన్నాను గొముగా.. ఏమనీ,చిన్నపుడు మీ ఎదురింటమ్మాయి 20 చుక్కల ముగ్గువేస్తే నువ్వు ఆవిడకు దీటుగా 30 చుక్కల ముగ్గు ఎలా వేసావో ,మీ అక్క పెళ్ళి అయి వెళుతుంటే మీ నాన్న ,నువ్వు గోలు గోలు మని ఎలా ఏడ్చారో 108 సారి చెప్తావ్ అంతే కదా.. ఆ సుత్తి కోసం అన్ని సెటప్పులవసరం అంటావా ??.. కావాలంటే ఫ్రిజ్ పైన ఉన్న జాస్మిన్ రూం ఫ్రెష్ నర్ స్ప్రే చేసి ,ఆ సీలింగ్ లైట్ నే చందమామ అనుకుని ఇక్కడే చెప్పు అన్నారు టి.వీ పైనించి కళ్ళు త్రిప్పకుండా ..అప్పుడే నాకొక డవుటొచ్చింది.. తెలిసినవారు చెప్పండి..పెళ్ళాం,బిడ్డలని పట్టించుకోకుండా ఇంట్లో వదిలేసి ఇలా క్రికెట్కి,టీ.విలకు అతుక్కునిపోయి హింసించేవాళ్ల పై గృహహింస చట్టం క్రింద కేసు వేసే వీలుందా..???

ఇలా మా కాపురం కొంచెం ఇష్టం,కొంచెం కష్టం గా జరిగిపోతున్న సమయంలో ఒక రోజు నేను తీవ్రంగా అలిగి కూర్చున్న వేళ, మా ఆయన రాజీ కొచ్చారు..తప్పు ,తప్పు నన్ను రాజీ పడేలా చేసారు.. అసలు మగవాళ్ళలో ఉన్న గొప్పతనం అదే, తగ్గుతున్నట్లు నటిస్తూ తొక్కేస్తారు.. సరే కధలో కొచ్చేస్తే ..అదికాదు బుజ్జీ నీతో ఇదే చిక్కు ,ఎంత సేపూ నీకన్యాయం జరిగిపోతుంది అని ఆలోచిస్తావ్ కానీ ,ఎలా ఆనందం గా ఉండాలని ఆలోచించవు..ఇప్పుడు నన్ను క్రికెట్ కి వెళ్ళ కుండా ఆపలేవు,పోనీ నువ్వు రావచ్చుకదా నాతో .. అప్పుడు యేం గొడవా రాదు ఎప్పుడూ నా దగ్గరే ఉంటావ్ ,మా ఫ్రెండ్స్ భార్యలు లందరూ వస్తారు ..పైగా ఎంత హాయిగా ఎంజాయ్ చేస్తారో తెలుసా ..తొక్కలోది ఒక్క రన్ తీస్తేనే చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేస్తారు వాళ్ళ హజ్బెండ్ని,కానీ నువ్వేమో రావు అన్నారు.. పైకి నేను రాను,నా కిష్టం ఉండదు అని కాసేపు తగవులాడినా,మనసులో .. పోని ఇంట్లో ఇలా తిట్టుకుంటు కూర్చుని చేసేదేముంది కనీసం కళ్ళముందు అయినా ఉంటారని సరే అన్నాను ..

ఇంట్లో సోఫా ప్రక్కన టేబుల్ పై మంచి నీళ్ళ బాటిల్ ఉంటే ,దాన్ని తీసుకోవడానికి బద్దకం వేసి నన్ను పిలిచి మరీ మంచినీళ్ళు తెప్పించుకునే మా ఆయన ,రెండు బస్తాల్లాంటి క్రికెట్ కిట్లను రెండు చేతులకు తగిలించుకుని మరీ కేబ్ కోసం పరిగెడుతుంటే నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు నాకు.. సరే ,వస్తా అని మాటిచ్చాను కాబట్టి ఆయనతో బయలు దేరాను..కేబ్ దిగి రోడ్ కి అవతల వైపు ఉన్న క్రికెట్ గ్రౌండ్ చూస్తూ బ్రిడ్జ్ ఎక్కుతుంటే .. నాకు ఈ బ్రిడ్జ్ ని చూస్తే ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా ..అక్కడ గ్రౌండ్ చూస్తే నా మనసాగదు, ఇప్పుడు ఇదంతా దాటాలా అనిపిస్తుంది ..ఇలా మాయమై అలా అక్కడకు చేరిపోవాలని ఉంటుంది అన్నారు.. ఒక్క రోజన్నా నా గురించి ఇలా అన్నారా ??..పైగా ఏమన్నా అంటే నీ మీద ప్రేమ మనసులో ఉంటుంది.. సినిమా డయిలాగులు చెప్తేనే ప్రేమనుకుంటావ్ నువ్వు అని తిరిగి నన్నే తిడతారు ..ఏంటో ఈ మగవాళ్ళు ..ఈ జన్మకు అర్ధం కారు తిట్టుకుంటూ క్రికెట్ క్లబ్ కి చేరుకున్నాం..అలా క్లబ్ లో అడుగుపెట్టామో లేదో ,మా ఆయన నన్ను ఒక టేబుల్ దగ్గర కూర్చో పెట్టి ..ఇదిగో ఇక్కడి నుండి చూస్తే బాగా కనబడుతుంది.. అందరినీ పరిచయం చేసుకో ..మొద్దులా కూర్చోకు.. ఏం కావాలంటే అది తెప్పించుకో అని నా మాట కూడా వినకుండా ఫ్రెండ్స్ మద్యలోకి పారిపోయారు ...

ఓ మారు చుట్టూరా చూసాను.. అక్కడక్కడా ఫారినర్స్ ,చాలా మంది నార్త్ ఇండియన్స్ .. స్లీవ్లెస్ డ్రేస్లతో ,రీ బౌండింగ్ హెయిర్లతో ..చక్కగా ఒక బీరో ,వైనో త్రాగుతూ కిల ,కిలా కబుర్లు చెప్పేసుకుంటున్నారు..మన అవతారం చూసుకున్నాం.. చక్కగా బిగించిన జడ తో, తిలకం బొట్టు తో( ఇది మా నాన్న ఆర్డర్ ..పెళ్ళయిన అమ్మాయిలు స్టిక్కర్లు పెట్టకూడదంట ) ఆ క్రింద కొంచెం కుంకుమ బొట్టుతో ( ఇది మా అత్తగారి ఆర్డర్) పట్టీలు కూడా మిస్ అవ్వకుండా అప్పుడే ఎర్ర ప్లయిట్ దిగి వచ్చిన అచ్చమైన అప్పలమ్మలా ఉన్న నేను సహజంగానే నచ్చలేదు వాళ్ళకు.దాంతో పలకరిస్తే ఒక నవ్వు పడేసి (కొందరు అది కూడాలేదు) మొహాలు తిప్పేసుకున్నారు ..మనకసలే పావుగంట కంటే మౌనంగా ఉండటం అలవాటులేదాయే.. అలా తిరునాళ్ళలో తప్పి పోయిన పిల్లలా దిక్కులు చూస్తుంటే ,ఎవరో తెలుగులో మాట్లాడుతున్న ముక్కలు విని ప్రాణం లేచొచ్చినట్లు అనిపించి ఆమె ప్రక్కన చేరిపోయాను..

సరే, పలకరింపులయ్యాకా ,మీరు కెప్టన్ గారి వైఫా మరి చెప్పరే నేను ఫలానా అతని వైపుని ..మీ వారు చాలా బాగా ఆడతారు అన్నాది..ఆహా అన్నాను.. పాపం వాళ్ళయనను నేనూ పొగుడుతా అనుకుని కాసేపు చూసింది కాని మనకసలు ఎవరి పేరూ తెలియదు కాబట్టి ఊరుకున్నా..కాసేపు ఆగి మావారు ఆల్రౌండరే ,మొన్న 3 వికెట్లు తీసి 20 రన్లు చేసారు..'మేన్ ఆఫ్ ది మేచ్ 'ఆయనకే వచ్చింది మీవారు చెప్పలేదా అంది.. నాకు క్రికెట్ అంత గా ఇష్టం ఉండదు లెండి.. ఇంట్లో అంతగా మాట్లాడుకోము దాని గురించి అన్నాను..తను అలా క్రికెట్ విషయాలు తప్ప ఇంకొకటి మాట్లాడక పోవడం నాకు నచ్చలేదు.. నాకైతే క్రికెట్ పిచ్చి ,అయ్ లవ్ క్రికెట్ అంది తన్మయత్వంగా కళ్ళు మూసుకుని..నాకెక్కడ దొరికావే బాబు నువ్వు తిట్టుకున్నాను విసుగ్గా..ఆమె మద్య మద్యలో 'ఫోర్'..' సిక్స్' అని గట్టిగా అరిచి చప్పట్లు కొడుతూ మీకు తెలుసా ప్రతి వీక్ మేచ్ ఆడమని మావారిని అడుగుతా కాని ,ఆయన ఆడరు.. మహా లేజీ మా వారు అంది ముద్దు,ముద్దు గా విసుక్కుంటూ.. ఇదేంటబ్బా ఈ అమ్మాయికి లేస మాత్రం బాధలేదు ఒక వేళ తప్పు నాదేనా?? నేనే ఎక్కువగా ఆలోచించి బంగారం లాంటి మా ఆయన్ని బాధ పెట్టేస్తున్నానా??? లాంటి ఆలోచనలు వచ్చేసాయి అరనిమిషంలో ..

మీరేంటీ అసలు చప్పట్లు కొట్టడంలేదు ..కమాన్ మనం ఎంకరేజ్ చెస్తేనే వాళ్ళు బాగా ఆడతారు అంది .. మరీ,మరీ మీకు బాధ అనిపించదా మీవారితో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతారని అన్నాను ఆరాగా ...బాధ ఎందుకు మేచ్ అయిపోయిన వెంటనే మా ఆయన నన్ను షాపింగుకి తీసుకు వెళతారుగా ..అది మా ఇద్దరిమద్యా ఒప్పందం అంది 'కమాన్.. సిక్స్ మారో 'అంటూ అరుస్తూ .. ఓసినీ !!ఇదా సంగతి ..నాకా దిక్కుమాలిన షాపింగ్ అలవాటు లేదే.. పైగా ఆయనగారు కొన్నా, వద్దులేద్దురు ఇప్పుడేం అవసరం అంటూ వెనక్కులాగుతా.. పుట్టుకతో వచ్చిన బుద్ది .. మనసులో తిట్టుకుంటూ చప్పట్లు కొట్టాను.. అదేంటీ ఎందుకు క్లాప్స్ కొడుతున్నారు అంది నావైపు విచిత్రంగా చూస్తూ..ఎంకరేజ్ చేద్దామని అన్నాను..అవుటయ్యింది మీ ఆయనే అంది నెమ్మదిగా... గొడవ వదిలిపోయింది మనసులో తిట్టుకుని హి..హి అని ఒక నవ్వు విసిరాను ..

కానీ ఆ రోజు మేచ్ అయిపోయినా ఎంతకీ రారు..అంతకీ రారు నా దగ్గరకు.. ఫ్రెష్ అవ్వాలని డ్రెస్సింగ్ రూం లో ఒక గంట ,ఎందుకు ఓడిపోయారో సుత్తికొట్టుకుంటూ 2 గంటలు..నీది తప్పని కాదు నీవల్లే ఓడిపోయాం అని ఒకరినొకరు తిట్టుకుంటూ ఒక 2 గంటలు... విసుగొచ్చి బాబూ , మళ్ళీ ఇంకోసారి వస్తే పాత చెప్పు తీసుకుని కొట్టండి అని తిట్టి ఇంటికివచ్చేసాము ..అబ్బే, ఆ రోజు మేచ్ ఫలానా వాడివల్ల ఓడిపోయాం అందుకే లేట్ అయింది అని ఎంత చెప్పినా తరువాత నేను వెళ్ళలేదు..ఆ తరువాతా వాళ్ళ 'టీం' లో చాలా మంది తెలుగువాళ్ళు పరిచయం అయ్యారు..

ఒకరోజు ఒక ఫ్రెండ్ వైఫ్ తో ఫోన్ లోమాట్లాడుతుంటుంటే, మాటల మధ్యలో క్రికెట్ గురించి వచ్చి.. అబ్బా ఏం క్రికెట్టోనండి బాబు ప్రొద్దున వెళ్ళిన మనుషులు రాత్రివరకూ రారు.. పైగా ఇంటర్ నేష్నల్ మేచ్లా ఫ్లెడ్ లైట్స్ వెలుగులో కూడా ఆడతారంట అన్నాను .. ఏంటీ, వాళ్ళు చెప్పిన మాటలు నమ్మేసారా అన్ని అబద్దాలే నమ్మకండి అంది..కాదులెద్దూ చాలా సార్లు మా ఆయన ఫీల్డింగ్లో ఉండగా ఫోన్ చేసాను ..మేచ్ నైట్ 7 వరకూ జరుగుతుంది అన్నాను .. ప్లిచ్ ,మీరింకా ఎదగాలండీ బాబు...అసలు వీళ్ళు ఫీల్డింగ్ చేసినపుడు ఫోన్ లిఫ్ట్ చేయడం ఒకటి ..మీలాగే మొదట్లో మేమూ అమాయకం గా నమ్మేసాం.. ఒకసారి సర్ ప్రైజ్ చేద్దామని నేను, ఇంకో ఫ్రెండ్ గ్రౌండ్ కి వెళ్ళి చూస్తే అందరూ హాయిగా కబుర్లు చెప్పుకుంటున్నారు ..ఇంట్లో మేచ్ ఇంకా అవ్వలేదని చెప్పి ఇదా మీరుచేసే పని అని చెట్టు చాటున నించుని మా ఆయనకు ఫోన్ చేసాం.. వెంటనే మా ఆయన అరే ..ఫీల్డింగ్ లో ఉన్నాను అని ఒకటే జీవించేస్తున్నారు... మా ఫ్రెండ్ వాళ్ళ ఆయనైతే బాత్రూం లో ఉండగానే అరే మేచ్ మాంచి సస్పెన్స్లో ఉంది డిస్టర్బ్ చేయకూ అని తలుపు తీసి మమ్మల్ని చూసి కంగారు పడిపోయారు అంది.. నాకు డవుటొచ్చి ఒక్క నిమిషం నేను మళ్ళీ చేస్తా అని ..మా ఆయనకు ఫోన్ చేసాను.. అబ్బా ,ఫోన్ పెట్టేసేయ్ బంతి గాల్లో ఉంది కేచ్ చేయాలి మా ఆయన అటు ఫోన్ ఆఫ్ చేసేసారు ...

8, అక్టోబర్ 2009, గురువారం

ఈ క్రికెట్ ని ఎవరు కనిపెట్టారో గాని ...
ఈ క్రికెట్ ని ఎవరు కనిపెట్టారో గాని వాళ్ళను చితక్కోట్టి ,చిత్రబాణాలు పెట్టేయాలన్నంత కోపం వచ్చేస్తుంది నాకు .ఆ ఆట వస్తే చాలు ఇంక పెళ్ళాం ,పిల్లలు ఎవరిని పట్టించుకోరు ఏంటో..నాకు తెలుసు మీలో చాలామంది క్రికెట్ ప్రియులకు ఆవేశం పొంగిపొర్లి వచ్చేస్తుందని..అయినా సరే నాకు క్రికెట్ అంటే ఇష్టం లేదూ... లేదూ ..లేదూ.. నాకు ఈ ఆట తెలియడమే దాని మీద ద్వేషం తో చూస్తుండగా తెలిసింది.అందుకే అదంటే అస్సలు ఇష్టం లేకుండా పోయింది. మీరు మొహమాట పడినా ,ఇబ్బంది పడినా తప్పదు నాతో పాటు ఓ మారు ఫ్లాష్ బేక్ కి రావలసిందే ..

నాకో తమ్ముడున్నాడు (మా పెద్దమ్మ కొడుకు) వాడికీ, నాకు మధ్య పచ్చగడ్డి వేయకముందే భగ్గుమంటుంది.వాడు నాకంటే 25 రోజులు చిన్నోడు. అంటే నాకు తమ్ముడే కదా అవుతాడు ..మరి రూల్ ప్రకారం నేను అక్కే కదా అవుతాను ,కాని నన్ను అక్కా అని పిలవరా అని ఎంత మొత్తుకున్నా అక్కా లేదు ,అరటికాయ తొక్కాలేదు అని బుజ్జి అని పిలిచేవాడు ,అదీ నా ఫ్రెండ్స్ ముందు. వాళ్ళు ఊరుకుంటారా, ఏమే బుజ్జమ్మా మీ తమ్ముడు పిలుస్తున్నాడు ,ఓయ్ బుజ్జులూ మీ తమ్ముడు పిలుస్తుంటే పలుకవేంటి అని చిత్ర విచిత్రాలుగా నా పేరుని మార్చేసి ఏడిపించేసేవారు ..

పోని అక్కడితో ఊరుకునేవాడా ,మా స్కూల్ మొత్తానికీ చండశాసనురాలని పేరు తెచ్చుకున్న సత్యవేణి టీచర్.. హోం వర్క్ ఎందుకు తప్పుచేసావురా అని అడగగానే మా బుజ్జక్క చెప్పిందండి ఇలా చేయమని అని నా మీద తోసేసేవాడు..అంతే మా క్లాసుకి బుజ్జి ని తీసుకురమ్మన్నారు అని వర్తమానం అందేది ...ఇంక రాగానే ఏమే బుజ్జిదానా, నీ మొహానికి రాకపోతే రాదని చెప్పాలి గాని ఇలా తప్పుడు హోంవర్క్ చేయిస్తావా అని నేను కాదు మొర్రో అని అన్నావినకుండా 100 గుంజీలు తీయించి పంపేది . ఒరే ఎందుకురా అలా చెప్పావ్ అంటే మరి అలా చెప్పకపొతే నన్నుకొడుతుంది కదా అనేవాడు సింపుల్ గా ..

వీడికంటే మా చెల్లిని చూస్తే మరీ వళ్ళు మండేది..నేనే కదా దానికి అక్కను ,మరి లెక్క ప్రకారం నాకే కదా అది సపోర్ట్ చేయాలి..అబ్బే, దానికి అంత తెలివెక్కడ ఏడ్చింది .. అన్నయ్యా !మా నాన్న నిన్న కోవాలు తెచ్చారు తింటావా,అన్నయ్యా! నేను ఈ బొమ్మవేసాను బాగుందా అంటూ 24 గంటలు వాడి చుట్టూ రంగులరాట్నం తిరిగినట్లు తిరిగేది..మేమందరం పరికిణీ, వోణీ వేసుకుని తిరిగినా వాడికి తెలుగుదనం కనబడదట ,కాని మా చెల్లి నైటీలో తిరిగినా తెలుగుతల్లి ముద్దు బిడ్డలా ,సంస్కృతి సాంప్రదాయాలకు పట్టుకొమ్మలా కనబడుతుంది అంట, దాని ఫేస్ వేల్యూ అలాంటిందంట.. ఈ ముక్కవాడే చెప్పాడు .

సరే అలాంటి మా తమ్ముడితో ఒక రోజు ఫ్రెష్ గా గొడవేసుకుని ,మేడ మీద మిగతా పిల్లలను ముందు కూర్చో పెట్టుకుని టీచర్ ఆట సీరియస్సుగా ఆడుతుంటే.. వీడు,మా ఆఖరు చిన్నాన్న ఒక కర్రముక్కా, ఒక బంతి పట్టుకుని వచ్చారు .. ఎవరన్నా క్రికెట్ ఆడతారా మా చిన్నాన్న పిలిచాడు.అందరూ నా వైపు చూసారు .మరి నా చేతిలో ఉప్పు బద్దలున్నాయి .అవి ఆశ చూపించే వాళ్ళకు పాఠాలు చెపుతున్నా.. నేను తల అడ్డంగాఊపాను వెళ్ళద్దు అని.. మా తమ్ముడు మా చెల్లి వైపు చూసి నువ్వు రావే అన్నాడు .. నువ్వు నా చెల్లివి ,నా మాటే వినాలి అని ఎంత అరిచినా నేను అన్నయ్యతోనే ఆడతా అని గొప్ప అవమానం చేసి వెళ్ళిపోయింది అది వాడిదగ్గరకు..

ఇది బేట్ అన్నమాట, చిన్నాన్న బాల్ వేస్తే నేను బేట్ తో కొడతా, నువ్వు బాల్ ని కేచ్ పట్టడానికి ట్రై చేయాలన్న మాట ..అని కాసేపేదో చెప్పి ఆట మొదలు పెట్టారు.ఇంకేంటీ ఒక్కొక్కరూ నువ్వూ వద్దు.. నీ ఆట వద్దు అని అందరూ వాళ్ళ బేచ్ లో చేరిపోయారు..అలా క్రికెట్ అంటే తెలిసే లోపే అదంటే కోపం వచ్చేసింది ..అక్కడి నుండి ఈ క్రికెట్ వల్ల నేను పడిన బాధ అంతా ఇంతా కాదు ..

అవి కొత్తగా మా వూర్లో కేబుల్ టి.వి వచ్చిన రోజులు..నేను చక్కగా మాయా బజార్ సినిమా వస్తుంటే చూస్తున్నాను ..మా ఇంటి మొత్తానికి ఫస్ట్ టి.వి మా నాన్నే కొన్నారు ..ఇంతలో మా చిన్నాన్న,తమ్ముడు లోపలికి వచ్చి .. ఏయ్ లేవే,24 గంటలు సినిమాలు ,చదువు సంధ్యా లేకుండా అని బలవంతం గా నన్ను సోఫా నుండి లేపేసి ,దూరదర్శన్ పెట్టేసి క్రికెట్ పెట్టుకుని చూస్తున్నారు ... అమ్మా... ఇది మా ఇల్లు, మా టి.వి ,నా ఇష్టం నేను సినిమా చూసుకుంటా అని అరిచాను ..పోవే, మీ నాన్న నీ కంటే ముందు నాకు అన్నయ్య అని నన్ను తోసేసి తలుపేసేసుకున్నారు.. దొంగ మొహాల్లారా అని తిట్టుకుంటూ తలుపులు బాదుతుంటే మా నాన్న అనుకోకుండా ఇంటికొచ్చారు.. హమ్మయ్యా అనుకుని .. నాన్నా !చూడండి నాన్న ఎన్ టి రామారావు సినిమావస్తుంటే ఏదో క్రికెట్ అంట చెత్త ఆట ..అదిపెట్టారు అని కంప్లయింట్ ఇచ్చాను .మా నాన్నకు ఎన్ టి ఆర్ పేరు చెపితే చాలు.. అందుకే మాయా బజార్ ..నాన్న మాయా బజార్ వేస్తున్నాడు అని ఊరించి చెప్పాను..

ఏంటీ.. మాయాబజారే అని హడావుడిగా వచ్చి, ఏరా కేబుల్ టి.వీ లో మయాబజార్ వస్తుంటే ఏంటో పెడతారేంటి (మా నాన్నకు అప్పటికి క్రికెట్ అంటే ఏంటో తెలియదు) అని చానెల్ మార్చేసారు ..మా చిన్నాన్న ,తమ్ముడు చెరో ప్రక్కకు చేరి పోయి బ్రతిమాలడం మొదలెట్టేసారు.. అన్నయ్యా,అన్నయ్య ప్లీజ్ అన్నయ్యా క్రికెట్ చాలా బాగుంటుంది ..మన ఇండియా ఇంగ్లాండ్ తో ఆడుతుంది అన్నయ్యా..అన్నాడు మా
చిన్నాన్న. తర్వాత చూద్దువుగాని మాయ బజార్ సినిమా వస్తుంది అంటూ మా నాన్న ఒప్పుకోలేదు.. ఎన్ని సార్లు చూస్తావ్ నాన్న బాబు ఆ సినిమా, మొన్న కూడా వి.సి.ఆర్ తెచ్చి అందరికీ చూపించేసావ్ కదా ,అయినా ఆ రామారావు ఎలా నచ్చుతాడు నీకు ..ఓవరేక్షన్ గాడు.. మొన్న ఏదో సినిమాలో ఒక నిక్కరేసుకుని అమ్మా !నేను 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానమ్మా అని ఎగురుకుంటూ చెప్తున్నాడు..నిక్కరేసుకుంటే బాలాకుమారుడైపోతాడా..ఆ సావిత్రి ఒకరిది స్క్రీనంతా ఆవిడే కనబడుతుంది ..ఎప్పుడు చూసినా ఈ..ఈ అని ఏడ్చుకుంటూ ఎలా భరిస్తారునాన్నా బాబు మా తమ్ముడు విసుక్కున్నాడు..

మా నాన్నకు బీ.పీ పెరిగి పోయింది..అయినా నేను ప్రక్కనే ఉన్నాను కదా ఇంకొంచం పెంచడానికి.. ఒరే ఆ మహా నటులని అంటే కళ్ళు పోతాయ్.. ఇప్పటి అమ్మాయిలూ ఉన్నారు ఒక్కదానికి నటించడం చేత కాదు ..పైగా అందరూ సిగరెట్లూ,మందూ తాగుతారంట ఛీ ..ఛీ మా నాన్న ప్రపంచంలో అసహ్యమంతా మొహంలో నింపేసారు.. ఏం మీ సావిత్రి మాత్రం తాగలేదా పీపాలు పీపాలు ..వీడు తగ్గలేదు ...మా నాన్నకు టక్కున ఏమనాలో తెలియలేదు పాపం..అప్పటి మహాను భావులకి బోలెడు బాధలురా అన్నారు చివరికి ..ఇప్పటివాళ్ళకు అంతకన్నా ఎక్కువ బాధలు అందుకే వీళ్ళూ తాగుతున్నారు వీడు వాదించాడు.. మా చిన్నాన మధ్యలో వీడిని ఆపు చేసేసి అన్నయ్యా.. ఆ కేబుల్ వాడు నా ఫ్రెండే, నీకు వరుసగా వారం రోజులు ఎన్ టి ఆర్ సినిమాలే వేయించుతా అనే సరికి ఇంక మా నాన్న మెత్తబడి క్రికెట్ పెట్టేసారు నేను ఎంత అరిచి గోల చేసినా సరే ..


ఒరే అందరూ దెయ్యాల్లా తెల్ల బట్టలేసుకున్నారేంట్రా మా నాన్న అనుమానం ..ఇది టెస్ట్ మేచ్ అన్నయ్యా వన్ డేలు అయితే కలర్ బట్టలేసుకుంటారు ..మా చిన్నాన సమాధానం.. మా నాన్న మూడ్ మారిపోకుండా మా తమ్ముడు అందుకున్నాడు ..మనోళ్ళు బౌలింగ్ అన్నమాట ..ఇప్పుడు వీడు బాల్ వేస్తే నాన్నా ,ఆ తెల్లోడు కొడతాడు ..అది ఆ చివ్వర్న గీత దాటితే 4 అన్నమాట ..ఆ కొట్టిన బంతి మనోళ్ళు పట్టుకుంటే వాడు అవుటయి పోతాడు అన్నాడు .. అదిగో అవుటయి పోయాడు కదా మా నాన్న క్రింద వెళుతున్న బంతిని తీసుకువస్తున్న ఫీల్డర్ని చూస్తూ అన్నారు..అబ్బా అలా నేల మీద బాల్ కాదు నాన్న, గాల్లో పట్టుకోవాలి నేలను తాకకుండా పాపం ఓపికగా చెప్తున్నాడు..నేను తిట్టుకుంటునే చూస్తున్నాను ..

ఏంటిరా ఎంత సేపు ఇలా ఆడతారు మా నాన్నకు విసుగొచ్చింది ..ఇది టెస్ట్ అన్నయ్యా అందుకే ఇలా స్లో ఉంటుంది అయినా చూడగా చూడగా బాగుంటుంది.. ఇప్పుడు బాల్ వేస్తున్న అబ్బాయి చాలా బాగా వేస్తాడు బౌలింగ్ ..అన్నాడు చిన్నాన్న .. ఎవరా అబ్బాయి? మా నాన్న లేని ఆసక్తి తెచ్చుకుని అడిగారు..కూంబ్లే ..చెప్పాడు.. మరి మన ఆంద్రావాళ్ళు లేరా ?? అడిగారు.. ఎందుకులేరు అజారుద్దిన్ ఉన్నాడుకదా.. ఇంకా టేండూల్కర్ అని ఒక అబ్బాయి ఉన్నాడు అన్నాయ్యా భలే ఆడుతాడులే చెప్పాడు చిన్నాన్న..ఇవేం పేర్లురా వీళ్ళసలు ఇండియా వాళ్ళేనా ?మా నాన్న అనుమానం..అంటే అవి ఇంటి పేర్లు నాన్న, కూంబ్లే అసలు పేరు అనిల్ అన్నమాట ..మా వాడు వివరించాడు ..నేను టి.వి వైపు చూసాను హోం వర్క్ చేసుకుంటునే .అలా క్రికెట్ లో నాకు మొదటి సారి తెలిసిన అబ్బాయి అనిల్ కూంబ్లే.. నాకు చాలా బాగా నచ్చేసాడు.. బోలెడు అందంగా ఎంతో మంచాడిలా ఇంకెంతో అమాయకంగా ..హూం .. అసలు అనిల్ గురించి చెప్పాలంటే ప్రత్యేకం గా ఓ పోస్ట్ వేయాలి..

అలా అనిల్ ని చూసి మురిసిపోతుంటే టక్కున ఒకడిని అవుట్ చేసేసాడు ... మా వాళ్ళు 'అవుట్' అని ఎగిరేస్తుంటే మా నాన్న అయోమయంగా మొహం పెట్టి మరి బంతి గాల్లో ఎగరలేదు ..ఎవడూ పట్టుకోలేదు ఇదెలా అవుట్ అవుతుంది అన్నారు ..అంటే నాన్నా దీన్ని ఎల్.బి.డబల్యు అంటారు వికెట్ కి కాలు అడ్డం పెడితే, ఆ కాలుకి బాల్ తాకితే అప్పుడు అవుట్ అన్నమాట ...మా తమ్ముడు వివరించాడు..మా నాన్న కాసేపు బుర్ర గోక్కున్నారు.. కాసేపాగి మా నాన్న అదేంటిరా బాల్ కాల్ కి తగిలింది కదా అయినా అవుట్ ఇవ్వలేదు మళ్ళీ అడిగారు ..అంటే అన్నయ్యా కాలుకి తగిలిన ప్రతి బాల్ ని ఎల్.బి.డబల్యూ ఇవ్వరు సరిగా తగలాలి అన్నాడు ఎలా చెప్పాలో తెలియక చిన్నాన్న.. మా నాన్నకు చిరాకొచ్చేసింది ..యెహే తియ్ ..చక్కగా ఎంటివోడి సినిమా వస్తుంటే అని చానెల్ మార్చేసారు.. కూంబ్లే వరకూ బాగానే ఉన్నా నాకసలు క్రికెట్ ఇష్టం లేదు కాబట్టి నేను పండగ చేసేసుకున్నాను వాళ్ళను వెక్కిరిస్తూ ..


మరి అప్పటికి నాకు తెలియదుకదా క్రికెట్ అప్పటికే మా ఇంట్లో పునాదులను వేసేసి స్ట్రాంగ్ గా అయిపోయిందని..ఒకరోజు అమ్మతో బయటకు వెళ్ళి వచ్చేసరికి మా నాన్న,తమ్ముళ్ళు,చెల్లాయిలు అందరూ టి.వి కి అతుక్కుపోయి ఉన్నారు.. ఏంటా అని చూస్తే ఇండియా-పాకిస్తాన్ షార్జా కప్ మేచ్ వస్తుంది ..ఎవరికి క్రికెట్ తెలిసినా పరలేదు కాని మా నాన్నకు తెలిస్తే ఇంకేమన్నా ఉందా?? ..నాన్నా!! ఈ రోజు ఇంకో చానెల్ లో ఘంటశాల ప్రోగ్రాం ఉంది గుర్తు చేసాను ..అది రేపమ్మా అన్నారు నాన్న కళ్ళు తిప్పకుండా..ఓయ్ రేపు ఎక్జాం పెట్టుకుని ఇక్కడేం పనే మా ఆఖరు చిన్నాన్న నా నోరు మూయించేసాడు.. ఈ పాకిస్థాన్ వోళ్ళకి మనం మెతగ్గా ఉంటే అలుసురా.. ఏమన్నారూ ..ఈ కప్ గెలిస్తే కాశ్మీర్ మాకు ఇచ్చేస్తారా అని అడిగారా..దొంగవెదవలు మా నాన్న ఆవేశ పడిపోతూ అంటున్న మాటలు లీలగా వినబడుతున్నాయి సావిట్లో చదువుతుంటే ..అలా మా నాన్నకు పాకిస్థాన్ ని చూపించేసి క్రికెట్ని అలవాటు చేసి పడేసారు ...

ఆ తరువాత మా నాన్న క్రికెట్ కి ఎంత అలవాటు పడిపోయారంటే ..రాత్రి పడుకున్నపుడు కూడా ఆ ద్రావిడ్ ఇలా కొట్టకుండా అలాకొట్టాల్సింది .. వాడు ఫుల్ టాస్ వేయకుండా ఉంటే బాగుండేది ..వీడు ఫ్రంట్ ఫుట్ కొచ్చి ఆడకుండా ఉంటే బాగుండేది అని ఒకటే గొణుగుడు ..పోనీ అక్కడి తో ఆగేవారా.. ఆదివారం వస్తే చాలు మమ్మల్ని కూర్చో పెట్టుకుని రాత్రి భలే కల వచ్చిందిరా అంటూ లగాన్ సినిమా లో లాస్ట్ సీన్ చూపించేసేవారు ..కాకపోతే అక్కడ అమీర్ ఖాన్ ప్లేస్ లో మా నాన్న ఉంటారన్నమాట .. ఇలాంటి సమయం లో నాకు సపోర్ట్ మా అమ్మ మాత్రమే ..

దిక్కుమాలిన క్రికెట్టు..దిక్కుమాలిన క్రికెట్టు..ఇల్లంతా తొక్కిపడేస్తున్నారు అందరూ..ఇంకోసారి క్రికెట్ పెడితే టి.వి బయట పడేస్తా అని బెదిరించి నాకు కాస్త ఊరటనిచ్చేది .. మరి వంట చేస్తూ మధ్య మధ్యలో చూస్తూ ఎప్పుడు ఆ ఆటను అర్ధం చేసుకున్నాదో తెలియదు కాని తరువాతా తీరికగా తోటికోడళ్ళ సమావేశం లో నిన్న అసలు మనోళ్ళు గెలాల్సిన ఆట అంట, వెదవలు మేచ్ ఫిక్సింగ్ చేసేసి ఉంటారు..చెడ్డ బాధవేసేసిందనుకో.. అనేది .మా పెద్దమ్మ పిన్నులు కూడా ఆల్రెడీ నిష్ణాతులు అయిపోయారు ఈ క్రికెట్ విషయంలో.. అది కాదులే అక్కా గంగూలీ వాళ్ళ ఆవిడను వదిలేసి నగ్మా వెనకాత పడిన దగ్గర నుండి ఏది కలిసిరావడం లేదు ..మరి ఆడదాని ఉసురు ఊరికేపొతుందా అంటూ మా పిన్ని ..ఏదేమైనా కపిల్ దేవ్ చాలా మంచాడంట ..చాలానాళ్ళు పిల్లలు లేకపోయినా పెళ్ళాన్ని అసలేమి అనకుండా బాగా చూసుకునే వాడంట .ఆడపిల్ల పుట్టేసరికి ఎంత ఆనందం పడిపోయాడో అంట అని మా పెద్దమ్మ... ఇరుగమ్మల మీద పొరుగమ్మల మీద చెప్పుకోవడం మానేసి క్రికెట్ విషయాలు చర్చించేసుకోవడం మొదలెట్టేసారు మా ఇంట్లో..

ఇలా మా ఇంట్లో నా క్రికెట్ వ్యతిరేకోద్యమం మూలన పడిపోయింది.. ఆ సమయంలోనే అనుకున్నా దేవుడా మా ఆయనకు ఏ ఆట మీద ఇంట్రెస్ట్ ఉన్నా, క్రికెట్ మీద మాత్రం అసహ్యం ఉండేటట్లు చేయి స్వామి అని .. ఇప్పుడు మీరు నామీద బోలెడు జాలి పడతారని తెలుసు.చూసారా ఎంత అమాయకురాలిని కాకపోతే భారతదేశంలో క్రికెట్ అంటే చెవులు, ముక్కు కొసేసుకునే అబ్బాయిల సంగతి తెలిసికూడా అలా కోరుకున్నాను.. పెళ్లయ్యాకా మా ఇంట్లో (అత్తగారి ) ఎక్కడా క్రికెట్ కు సంభందించిన వస్తువులేమి కనబడా పోయేసరికి ..ఆహా, కల నిజమాయెగా అని పాడేసుకున్నా కూడా..

ఆ తరువాత ఇక్కడకు వచ్చాకా మరుసటి రోజు మా ఆయన తో అలా బీచ్ కి వెళ్ళి బోలెడు కబుర్లు చెపుతూ ,ఊరంతా తిరిగి రావాలని ఎన్నెన్నో ప్లాన్లను వేసేసుకుని నిద్ర లో జారుకున్నాను ..మరుసటి రోజు పక్షుల కల కల రావాలకు మెలుకువ వచ్చి, చిరనవ్వుపెదవులపై పూస్తుంటే మెల్లగా కళ్ళు తెరిచాను..ఎదురుగా మా ఆయన హాస్పిటల్ లో కంపౌండర్ లా తెల్లటి డ్రెస్స్ వేసుకుని బేట్ ని అన్ని ఏంగిల్స్లో తిప్పేస్తూ పొజులిస్తున్నారు.. దెబ్బకు మత్తు వదిలిపోయి మీరూ ..క్రికెట్ ఆడతారా అన్నాను భయంగా ..మా ఆయన ఒక్క నిమిషం బోలెడు ఆక్చర్యపోయి వెంటనే తేరుకుని, ఏమిటా ప్రశ్న..నేను ఆల్రవుండర్ నే ... పైగా మా టీంకి నేనే కెప్టెన్ ని అని భీముడిలా ఆ బేట్ని భుజం మీద పెట్తుకుని ఒక నవ్వు నవ్వారు.. దేవుడా..నేను కళ్లు తిరిగి మంచం మీద పడిపోయాను.. తలుపేసుకో వచ్చేసరికి రాత్రి అవుతాది మా ఆయన మాటలు లీలగా వినబడ్డాయి..
ఇక్కడి తో కధ అయిపోలేదు మొదలైంది ఆ విషయాలు నెక్స్ట్ పోస్ట్ లో

2, అక్టోబర్ 2009, శుక్రవారం

నేనో సినిమా సమీక్ష రాసాను

నేనో సినిమాకి సమీక్ష రాసాను.. ఏంటో నాకీ మధ్య చాలా విషయాలు తెలిసిపోతున్నాయి.లేకపోతే నేస్తం ఏమిటీ సినిమా సమీక్షలు రాయడం ఏమిటీ !!కదా ..మీరూ బోలెడు ఆక్చర్యపడిపోతున్నారు కదూ.. చదివే మీరే ఇంత హాచ్చర్య పడితే రాసిన నేను ఎంత పడిపోవాలి..చదివి ఎలా ఉందో చెప్పండేం ..(మనలో మనమాట.. బాగోపోయినా సరే సూపర్ ఉందని చెప్పండేం ..ప్లీజ్ ..ప్లీజ్ )
ఇదిగో ఆ లింకులు ...

http://gituhere.wordpress.com/2009/10/02/nestham-gruhalakshmi/

or

http://booksandgalfriends.blogspot.com/2009/10/blog-post.html
(ఈ అవకాశం ఇచ్చిన గీతా చార్య గారికి కృతఙ్ఞతలు )