31, మే 2010, సోమవారం

కొంచెం ఇష్టం ...కొంచెం కష్టం

'సిమే 'లో ఉన్నది కొద్ది రోజులే అయినా ,ఆ రోజులని భారతదేశపు చరిత్రలో గుప్తుల యుగంని స్వర్ణ యుగం తో పోల్చినట్లు , నా డైరీలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గరోజులు .. అతి ముఖ్యం గా వ్రాయవలసింది నా నిద్ర గురించి..అప్పట్లో నిద్రా దేవి చాన్స్ దొరికిందంటే చాలు జోల పాడటానికి రెడీగా నా వెనుకేతిరుగుతూ ఉండేది..ప్రొద్దున్న ఆరు గంటలకు నిద్రలేచి వంట చేసి,టిఫిన్ పెట్టి ,లంచ్ బాక్స్ తో మా ఆయన్ని 7 గంటలకల్లా ఆఫీసుకు పంపగానే స్నానపానాదులు ముగించుకుని ,పూజ చేసుకుని ఎనిమిది కల్లా టిఫిన్ తినేసేదాన్నా .. అంతే మంచమెక్కి పడుకున్నానంటే మళ్ళా లేవడం, లేవడం మద్యహ్నం ఒంటిగంటకే... భోజనం చేసి మా బెడ్ రూం లోనే ఉన్న పోర్టబుల్ టివి లో ఆ నాలుగు భాషల్లో వచ్చే (తమిళ్,ఇంగ్లిష్,మలయ్,చైనీస్ ) చానెల్స్ ని ఒక రెండు గంటలు చూస్తూ చూస్తూ మళ్లీ నిద్ర పోయి ,అయిదు కల్లా నిద్రలేచేదాన్ని..ఆ తరువాత కాసింత అన్నం ,కూర వండేసి స్నానం,పూజ అయ్యేసరికి మావారు గుమ్మంలో ఉండేవారు ...

ఇద్దరం అలా MRT (రైల్వే స్టేషన్ ) వరకు కబుర్లు చెప్పుకుంటూ నడుచుకుంటూ వెళ్లి ,అక్కడే ఉన్న చిన్న మార్కెట్ లో మరుసటి రోజుకు కావలసిన కూరగాయలను కొనేవాళ్ళం.. ఒక్కో వంకాయా మోచేతి వరకు ఇంత పెద్దది ఉంటే ,అమ్మ బాబోయ్ !!!మన ఇద్దరికీ ఒక్క వంకాయ తో రెండు పూటలా కూర వచ్చేస్తుందండి అని తెగ మురిసి పోయేదాన్ని.. ఆ హైబ్రిడ్ కాయలు రుచి, పచి ఉండవని తరువాత తెలిసిందనుకోండీ ... ఆ తరువాత ఇద్దరం మళ్లీ కబుర్లేసుకుని ... మావారు తన కాలేజ్ లో ఆయన గారిని ఆరాధించిన అమ్మాయిల దగ్గరనుండి ,అనేకానేక సాహసాల వరకు .. బోలెడు కోతలు కసా బిసా మని కోసేస్తున్నా( ఏమో ఇప్పుడు తలుచుకుంటే అలాగే అనిపిస్తుంది మరి ) అమాయకం గా నమ్మేస్తూ ఇంటికోచ్చేసేదాన్ని ...

అప్పుడు ఎంచక్కా భోజనం తింటూ 'చెస్ ' ఆడుకునేవాళ్ళం .."ఎవరు గెలిచేవారు?? "లాంటి సుత్తి ప్రశ్నలు అడక్కండి..నాకు కోపం వస్తుంది..అసలు నన్ను అడిగితే ,మనం ఓడిపోతేనే కదా ఎదుటి వాళ్ళు గెలిచేది ...అదే మనం గెలిస్తే వాళ్ళు గెలవగలరేంటీ???అదీ పాయింటు ... అందుకే ఒక యాబై సార్లు ఆడితే ,నలబై తొమ్మిది సార్లు నేనే ఓడిపోయేదాన్నిఅన్నమాట .ఆ తరువాతా మళ్లీ ఎట్టి పరిస్థితుల్లో పది అయ్యేసరికి గాఢ నిద్రలో తేలియాడాల్సిందే... అమ్మాయిలందరికీ కుళ్ళు వచ్చేస్తుంది కదూ ..మరదే, ఒకానొక సమయం లో అసలు ప్రపంచం లో నా అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరేమో అని పొరపాటున అనేసుకున్నా కూడా..కాని, మళ్లీ అలాంటి మాటలు అనకుండా విధి చాలా జాగ్రత్తలు తీసుకుంది మరెందుకో ???...

సరే విషయంలో కొచ్చేస్తే అంతా బాగానే ఉంది కాని ...ఎప్పుడూ కధలో హీరో ,హీరోయిన్లే ఉంటే బోరు కొడుతుందని అనుకున్నాడో ఏమో ..నాకో విలన్ తయారయ్యాడు..వాడి పేరు సందీప్ ..గుజరాతి.. మా ఓనర్ వాళ్ళింట్లో మరొక రూం లో పేయింగ్ గెస్ట్ ...మరి అతను స్టూడెన్టో లేక జాబ్ చేసేవాడో తెలియదు కాని ఎక్కువగా ఇంట్లోనే ఉండేవాడు ... అతను ,నేను ఒక్క మాట కూడా మాట్లాడుకోకపోయినా వాడిని చూసి తెగ భయపడిపోయేదాన్ని ..ఇంతా చేసి వాడు ఏం చేసేవాడయ్యా అంటే నన్ను చూసి 'కిసుక్కున' నవ్వడం.. 'ఓస్' .. ఈ మాత్రందానికే అంత భయపడిపోవడం ఎందుకో అని అనేయకండి మరి... పూర్తిగా వినండి ...

మా ఇంట్లో నాలుగు బర్నర్ల స్టవ్ ఉంది అని చెప్పాకదా ... అదేమో ,బటన్స్ ఎక్కడో ఉండేవి,దాని బర్నర్లు ఎక్కడో ఉండేవి..దేనిది దేనిదో మా చెడ్డ కన్ఫ్యూజ్ అయిపోయేది నాకు...పైగా స్టవ్ వెలిగించడానికి లైటర్ రూపంలో మరొక బటన్ ..అసలే నిద్ర మత్తులో వంటేమో.. సరిఅయిన నాబ్ తిప్పి ,లైటర్ బటన్ ప్రెస్ చేసి స్టవ్ వెలిగించే సరికి, నాకు తాతలు దిగివచ్చేవారు కొద్ది రోజుల పాటు.. సరిగ్గా అదే సమయానికి కిచెన్ దగ్గర బాత్రుం లోకి వెళుతూ నా పాట్లు చూసి, అసలేమాత్రం మర్యాద లేకుండా కిచ, కిచమని నవ్వుతూ వెళ్ళేవాడు ఆ అబ్బాయి .. అదొక్కటేనా ..ఆ వాషింగ్ మిషన్ లో బట్టలు వేయడం మరొక యజ్ఞం ... దాన్ని 'ఆన్ ' చేయడానికి దాని చుట్టూ మినిమం ౩ సార్లు ప్రదిక్షణలు చేయవలసి వచ్చేది ... అన్నిటికన్నా కష్టమైన పని బట్టలు ఆరబెట్టడం ... అంత పొడవు కర్రల పైన బట్టలు ఆరబెట్టి ,దాని చివర్లు పట్టుకుని బయట ఉన్న హోల్స్ లోకి వాటిని గ్రుచ్చేసరికి కర్ర తోపాటు నేనూ .. తుఫాన్ వచ్చినపుడు తాడి చెట్టులా ఆ మూలకు ,ఈ మూలకు ఒరిగిపోయేదాన్ని... అయినా ఏ మాత్రం కరుణించకుండా ప్రతి సన్నివేశానికి ఫక్కున నవ్వుతూనే ఉండేవాడు దొంగమొహం గాడు..

అయ్యో ...వీటన్నిటిని కూడా క్షమించేయగలను ...కాని, మావారి ఫ్రెండ్స్ నుండి ఫోన్ వచ్చినపుడు మాత్రం వాడి మొహం చూస్తే ..'ఎర్రగా' పదికి తగ్గకుండా వాతలు పెట్టేయాలన్నంత కసి వచ్చేసేది ..నాకసలే A for apple .. B for boy అని అరటిపండు వలిచినట్లు ముద్దుగా ,స్పష్టం గా మాట్లాడితేనే ఒక పట్టాన ఇంగ్లీష్ అర్ధం అయ్యి చావదు ... అలాంటిది పీస్ పీస్ పావలా కాస్ టైపులో ఏదో యాసలో మాట్లాడితే అసలు అర్ధం కాదు.. అప్పుడప్పుడే మాయదారి క్రికెట్ క్లబ్బులు అలవాటు పడుతుండటం వల్ల మెల్లి,మెల్లిగా ఫ్రెండ్స్ మొదలయ్యారు మా ఆయనకు..సాయంత్రం అయిదయిందంటే చాలు .. పొలోమని 'కాల్ 'చేసి ఆయన గురించి వాకబు చేసేవారు.. అప్పటికి మొబైల్ లేకపోవడం వల్ల 'లేండ్ ఫోనే' గతి ..తప్పక హాల్లో కొచ్చి మాట్లాడేదాన్ని... అత్త తిట్టినందుకు కాదుగాని తోడికోడలు నవ్వినందుకు అని .. వాళ్ళ ఇంగ్లీష్ అర్ధమవ్వనందుకు కాదుగాని ఎక్కడ వీడు నవ్వుతాడో అని భయమేసిచచ్చేది ...

మా ఆయన ఆఫీస్ కి వెళ్ళాడు అని ఒక్క ముక్క చెప్పడానికి .. వాడు చూస్తున్నాడు అన్న టెన్షన్లో he ..she .. go ..went ..to.. office అంటూ స్త్రీ,పురుష లింగ భేదాలు లేకుండా భూత ,భవిష్య ,వర్త మాన కాలాలన్నిటిలోను సమాధానం చెప్పేదాన్ని వాడి వైపు చూస్తూ... వాడు కూడా యే మాత్రం మేనర్స్ లేకుండా అక్కడే సోఫాలో కూర్చుని నవ్వు భయటకు రాకుండా పెదాలు బిగించి నన్ను ఎంత కుళ్ల బెట్టాలో అంతా పెట్టేవాడు ... పోనీ ఎదుటి వాళ్ళన్నా ..అయ్యో పాపం ,పిల్ల మాట్లాడటానికి కష్టబడుతుంది ..మనం ఎందుకు బాధ పెట్టడం అని కొంచెమన్నా ఇంగితం తో ఆలోచించాలా!! ..అబ్బే ...మీ ఆయన ఆఫీసుకు వెళ్ళాడా ??..ఇంకా రాలేదా ?? ఎప్పుడొస్తాడు? నువ్వెవరు? అంటూ ఒకటే ప్రశ్నల వర్షం.. రోజు వచ్చే ఫోన్లే..ఎప్పుడూ అడిగే ప్రశ్నలే ..అయినా వాడిని చూడగానే నోట్లోంచి మాట వచ్చేది కాదు..


ఈ బాధ పడలేక రోజూ అర చేతిలో ముఖ్య మైన ప్రశ్నలకు సమాధానం రాసుకుని ఫోన్ రాగానే క్రీగంట వీడిని చూస్తూ .. ఒక ప్రక్క చేతిని చూస్తూ సమాధానాలు చెప్పేదాన్ని.. ఈ తెలివి తేటలు ఎక్జామ్లో చూపించి ఉంటే నా సామిరంగా కాలేజ్ ఫస్ట్ వచ్చేసేదాన్ని కదా... హుమ్(భారి నిట్టూర్పు) ... అయితే మా ఆయన ఫ్రెండ్స్ ఏమన్నా తక్కువ తిన్నారా?? ఆన్సర్ షీట్ లో లేని క్రొత్త ప్రశ్నలన్నీ కని పెట్టి మరీ అడిగేవారు .. నాలుగు రోజులయ్యే సరికి చిరాకొచ్చేసి " ఇంకోసారి మీ ఫ్రెండ్స్ నుండి ఇంటికి ఫోన్ వచ్చిందో మర్యాద దక్కదంతే "అని 'ఘాట్టిగా ' వార్నింగ్ ఇచ్చేసా మా ఆయనకు ... వెంటనే యే మాత్రం తడుముకోకుండా" కాళ్ళు విరగ కొడతా అరిచావంటే "అని ముద్దుగా సమాధానం ఇచ్చేసారు మా ఆయన కూడా..అలాంటి కధకు సంభందం లేని విషయాలను మనం పెద్దగా పట్టిన్చుకోకూడదన్నమాట ..

సరే ..ఇదిలా జరుగుతుండగా ఒక రోజు మద్యాహ్నం యధాప్రకారం నేను సుష్టుగా తిని, బెస్టుగా పడుకున్న తరుణం లో ఎవరో తలుపులను టక,టకా మని కొడుతున్న శబ్దం.. టైం చూస్తే నాలుగే అయ్యింది.. ఎవరబ్బా ??అనుకుని తలుపు తీస్తే ఎదురుగా సందీప్ ..."ఫోన్ "అని చెప్పి సోఫాలో కూర్చున్నాడు ... ఈ టైములో ఎవరూ? సాదారణంగా మా ఆయన ఆ టైమ్లో చేసేవారు కాదు నేను పడుకుంటానని.. రిసీవర్ చెవి దగ్గర పెట్టుకుని 'హలో' అన్నాను ..అంతే "కోరమండల ఎక్స్ ప్రెస్ " ఒకటి ఆడ గొంతు తో ఇటు నుండి అటు ఆగమేఘాల మీద వెళ్ళిన శబ్దం.. నాకు ఇప్పటికీ తెలియని విషయం ఏమిటంటే, ఈ "సింగపూరియన్స్" ఎవరో వెనుక తరుముకొస్తున్నట్లు అంత హడావుడిగా ఎందుకు మాట్లాడుతారో ??? ...చేసేది ఏమి లేకా ...సారి ..కమ్ ఎగైన్ అన్నాను ... మళ్లీ" కోరమండల ఎక్స్ ప్రెస్ " ఈ సారి అటు నుండి ఇటు పరిగెత్తింది కాని ఒక్క ముక్క అర్ధం కాలేదు..

వద్దు ,వద్దు అనుకుంటూనే భయం భయం గా సోఫా వైపు చూసాను ..వాడు మాత్రం తన పాత్రకు ఏ మాత్రం అన్యాయం చేయకుండా తెగ నవ్వేసుకుంటున్నాడు 'టివి' చూస్తూ ...దొంగ సచ్చినోడా నీకేం పనిరా ఇక్కడ ?లోపలి పోయి ఏడచ్చుగా అని తిట్టుకున్నాగాని.. ఏం చేయాలో అర్ధం కాలేదు ... పోనీ ,ఫోన్ పెట్టేస్తే? ఉహు లాభం లేదు ..మళ్లీ కాల్ చేస్తుంది.. ఏం చేయాలి ఇప్పుడు?? ... అనుకుంటుండగానే అయిడియా తళుక్కుమంది ...

ఇందాకా ఆ అమ్మాయి ' బేంక్ ఆఫ్ ఇండియా' నుండి కాల్ చేస్తున్నా అంది..అంటే ' ఇండియన్' అయి ఉండచ్చు... కాబట్టి కొద్దో గొప్పో హిందీ తెలిసి ఉండచ్చు..మనకసలే హిందీ సినిమాలు చూసిన లోక జ్ఞానం సూపరు ఉంది కాబట్టి.. విషయం ఏంటో అర్ధం అయితే చాలు మేనేజ్ చేసేద్దాం అనుకుని చీకట్లో రాయి విసురుతూ .."ఆప్ కో హిందీ మాలుమ్ హై" అన్నాను గుస గుసగా ... నా మాట ఇంకా పూర్తి కానే లేదు ..ఇందాక చెప్పిన స్పీడ్ కి 'డబల్ 'వేసుకుని మరీ మాట్లాడింది ఆపకుండా పదినిమిషాలు ...చివర్లో హై ,హో ,హు లు తప్పించి ఒక్క ముక్క అర్ధం అయితే ఒట్టు ... సైన్స్ ఎక్జాం రోజున సోషల్ చదువుకు వెళ్ళిన విధ్యార్దిలా తయారయ్యింది నా పరిస్థితి.. ఓరి దేవుడోయ్ ..నాకెక్కడ దొరికావే బాబు ...అనుకుని ,సోఫా వైపు చూసే ధైర్యం లేక, చివరకు నా ఓటమి అంగీకరిస్తూ... నాకు అర్ధం కావడం లేదు ..మా ఆయన ఫోన్ నెంబర్ ఇస్తా ఆయనకు చెయ్యండి అని చెప్పి గదిలో కొచ్చి ఒక గంట కుళ్లిపోయి,ఉడికి పోయి ఆ ఫళంగా కళ్ళల్లో నీళ్లు పెట్టేసుకున్నా ...

సాయంత్రం మా ఆయన రాగానే ఏమండీ ..ఇందాకా ఎవరో అమ్మాయి ఫోన్ చేసింది.. మీ నెంబర్ ఇచ్చాను ..ఏమిటండి సంగతి అన్నాను .. ఆ ..అవునే మర్చిపోయా..బేంక్ లో NRI ఎకౌంటు ఒకటి ఓపెన్ చేశా ..దానికి సంబంధించి ఏదో లెటర్ పంపిందంట ...అది అడ్రెస్స్ సరిగ్గా లేకపోవడం వల్ల వెనక్కు వచ్చేసిందంట ...వచ్చి కలెక్ట్ చేసుకోమంది.. రేపు నువ్వు వెళ్లి తీసుకొచ్చేయి అన్నారు సింపుల్ గా ... ఒక్కోసారి మా ఆయనను చూస్తే ..క్షణం క్షణం లోని వెంకటేష్ గుర్తు వస్తాడు ...అందులో హీరో గోడలు,మేడలు,మిద్దెలు ఎక్కేసి ..శ్రీదేవిని ..ఆ వచ్చేయి ,దూకేయ్, ఎక్కేయ్ అని సింపుల్గా చెప్పేస్తుంటాడు....

అలాగా.. దేశం కాని దేశం లో ..వచ్చి పది రోజులు కాక మునుపే ..ఒక్కదాన్నీ బయటకు వెళ్లి రమ్మంటే అసలేమనుకోవాలి ఈ మనిషిని ... పైగా నా అంత ధైర్యవంతురాలితో అనవలసిన మాటలేనా అవి అని అడుగుతున్నా... అంతే.. అదేమాట మాట అడిగేశాను ఆవేశంగా ఆయన్ని ...మా ఆయనేమన్నా తక్కువ తిన్నారేంటి ... ఛీ నోర్ముయ్ ..ఎప్పుడు నాకేం తెలియదు తెలియదు అనుకుంటే ఎప్పటికీ ఏమీ తెలియదు ...ఇంకెప్పుడు నేర్చుకుంటావ్.. మొన్న ఫలానా ఫ్రెండ్ వాళ్ళ ఆవిడ శ్రీలంక ఎయిర్ లైన్స్ లో ఇద్దరు పిల్లలతో రెండు విమానాలు మారి మరీ వచ్చేసింది ఇక్కడకు తెలుసా ..మళ్లీ ఒక్క ఇంగ్లీష్ ముక్కరాదు...వాళ్ళందరూ రావడం లేదూ... ఇక్కడ నాకు తెలియదు ..రాదు అంటే కుదరదు ... రేపు వెళ్లి తీసుకు వచ్చేసేయ్ అని కరాఖండిగా చెప్పేసారు ...(ఆ ఫ్రెండ్ కూడా ప్రతిదానికి నాతో పోల్చి ఆ అమ్మాయితో పనులు చేయిన్చేసు కుంటాడంట..ఒకసారి ఆ అమ్మాయే చెప్పింది )

ఇంకొక అమ్మాయితో పోల్చేసరికి పౌరుషం వచ్చేసింది కాని భయం దాన్ని అదిగమించేస్తుంది .తిరగబడి లాభం లేదని ..అది కాదండి,మరి... నాకు బొత్తిగా దారి తెలియదు ..ఒక్కసారేగా ట్రైన్ ఎక్కించారు..ఎటు వెళ్ళాలో ఏమో అన్నాను బ్రతిమాలే పొజిషన్ కొచ్చేసి ... ఇక్కడ అడ్రెస్స్ కనుక్కోవడం చాలా ఈజీ బుజ్జి.. ఇప్పుడు మనం రైల్వే స్టేషన్కి వెళ్తామా ...అక్కడ ఎక్కడ పడితే అక్కడ మేప్ లు ఉంటాయి .. అప్పుడు 'బూన్ లే 'కు( ఇప్పుడు లాస్ట్ స్టాప్ 'జూ కూన్' వరకు పెంచాడు) వెళ్ళే వైపు వచ్చిన ట్రైన్ ఎక్కావనుకో ' టాన్జుంగ్ పాగర్ ' దగ్గర దిగిపో... అక్కడ 'స్టేషన్ కంట్రోల్ 'దగ్గర కేపిటల్ టవర్ కు వెళ్ళే దారి ఎక్కడో కనుక్కుని ,అటు నుండి తిన్నంగా వెళ్ళిపోతే ' బేంక్ ఆఫ్ ఇండియా 'అని బోర్డ్ కనబడుతుంది.. వెళ్లి తెచ్చేసేయ్ ..సరేనా అన్నారు ...

చెప్పద్దూ... నాకు అరచేయి పిడికిలి బిగించి మా ఆయన్ని వంగో పెట్టి గిబుక్కు ,గిబుక్కుమని కొట్టాలన్నంత కసి వచ్చేసింది కాని ,పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం తో ఈ సారి ఏడుపు మొహం తో ..ఒక వేళ 'తప్పిపొతే' ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించాను... ఎహే ఎందుకు తప్పిపోతావ్ ... అంతగా అయితే దారిలో ఏదో ఒక టాక్సీ పట్టుకుని ఇంటి అడ్రెస్ చెప్పి వచ్చేసేయ్ అన్నారు ముసుగుతన్ని ... కలకంటి కంట కన్నీరు ఒలికినా కనికరం కలగదే ఈ కఠిన మానవుడికి అని అతిలోక సుందరి రేంజ్ లో తిట్టుకుని ఏమ్ చేయాలా అని ఆలోచనలో పడ్డాను ...

11, మే 2010, మంగళవారం

జోరుగా హుషారుగా షికారు పోదమా !!!

సింగపూర్లో నా మొదటి సాహసం ఉప్మా చేసి పెట్టడం.అంతకన్నా విచిత్రం మా ఆయన కిక్కురుమనకుండా తినడం..మా ఇంట్లో అందరూ,ఉప్మా అనేపదాన్ని ఏకగ్రీవంగా నిషేదించడమే కాకుండా ఆ పదం వింటేనే ఆమడ దూరం పారిపోతారు మరి ..అంతా బ్రెడ్ ముక్కల మహిమ ..
టిఫిన్ చేసాక మా ఇంటి ఓనర్ ని పరిచయం చేసారు ( ఈవిడ గురించి మరెప్పుడన్నా బోలెడు చాడీలు చెప్పేసుకున్దామే) .ఆ గుమ్మం వరకు వచ్చి' టాటా' చెపుతుంటే ,ఏం క్రిందవరకు రావచ్చుగా అన్నారు. ఇలా నైటీ తోనా?? అన్నాను ..ఏం పర్లేదు, ఇక్కడ ఎవరూ పట్టించుకోరు అన్నారు...ఆహా ..ఎన్నెన్ని విచిత్రాలు జరుగుతున్నాయి ఈ రోజు .. పెళ్లి అయిన క్రొత్తలో ,క్రొత్తలో ఏంటి నా మొహం.. పెళ్ళికి ముందే .. ఎంతో గోముగా ఏమండీ !! నేను పెళ్ళయ్యాకా డ్రెస్ లు వేసుకోవచ్చా ??అంటే మాట మార్చేసేవారు తెలివిగా.. అయినా పట్టువదలని విక్రమార్కిని లా పెళ్ళయ్యాక అడిగితే ..అదికాదు ,మరేమో మా తరం లో నేనే పెద్ద కొడుకుని,నువ్వే పెద్ద కోడలివి.. అందుకే నువ్వు చీరలలోనే కంటిన్యూ అయిపో అని నన్నే ఏమార్చేసిన మా ఆయన.. నైటీ లో బయటకు వచ్చేయమని చెప్పడమా ??ఎంత విచిత్రం అనుకుంటూ క్రిందకు వచ్చేసా..

రాత్రి గమనించలేదు గాని అదంతా ఒక కాలనీ లా ఉంది . చుట్టూ చెట్లతో ఏదో పార్క్ లో ఇల్లు కట్టినట్లే .. ఎటు చూసినా అపార్ట్మెంట్లు.. ప్రతి అపార్ట్మెంట్ క్రింద కూర్చోవడానికి సిమెంట్ బెంచీలు ,టేబుళ్లు..వాటి పై చదరంగపు గడులు.. ముసలి వాళ్ళు ఆడుకోవడానికి అంట ...ఇంకా ఎవరి లెటర్ బాక్స్ లు వాళ్లకు వరుసగా ఉన్నాయి..

ప్రతి బ్లాక్ (అపార్ట్మెంట్) కి ఒక ప్లే గ్రౌండ్ ..పిల్లలకు దెబ్బలు తగలకుండా మెత్తని నేల.. నాలుగైదు బ్లాక్ లకు ఒక జిం .. ఒక పార్క్ .. వాకింగ్ లు ,వ్యాయామాలు గట్రా చేసుకోవడానికి.. మొత్తం దేశం అంతా ఇలాగే ఉంటుందా?? అన్నాను.. ఆ .. సింగపూర్లో ఏ మూలకు వెళ్ళినా ఇలాగే ఉంటుంది .. ప్రతి ఊరు ఒక్కలాగే ఉంటుంది.. ఇక్కడి ప్రభుత్వం ప్రజల హెల్త్ కి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తుంది అన్నారు..ఈ లోపల ఒకటే సౌండ్స్ ..గడ్డి కట్ చేసే వాళ్ళు , రోడ్లు శుబ్రం చేసేవాళ్ళు ,నేలను కడిగేవాళ్ళు .. ఎవరి గోల వాళ్ళది.. ఇక్కడ అంతా బాగానే ఉంటుంది కాని ఈ శబ్ధ కాలుష్యం ఎక్కువ అని నవ్వారు ... హుమ్ అని నిట్టుర్చాను ...ఎవరో అపార్ట్మెంట్ క్రింద ఉన్న తలుపులు తెరిచి, లోపల ఉన్న బాక్సులను తీసి క్రొత్తవి పెడుతున్నారు .. అవేంటి?? అన్నాను .. అవి చెత్త బాక్స్ లు.. ఎవరి వంటగది లోపల వాళ్లకు ఒక డస్ట్ బిన్ డోర్ ఉంటుంది . దాన్ని తెరిచి తుక్కు పడేస్తాం.. అవి క్రింద ఈ బాక్స్ లలో పడతాయి.. వీళ్లు ప్రొద్దున్న ,మద్యాహ్నం క్లీన్ చేస్తారు అన్నారు..

అబ్బా.. ఎటు వంటి కష్టం లేకుండా భలే అమర్చుకున్నారండి అన్నీ అన్నాను.. ఈ లోపల రోడ్ వచ్చేసింది ... సరే ఇంక నువ్వు వెళ్ళు ,బస్ స్టాప్ కి వెళతా నేను..సాయంత్రం ఒక గంట ముందు వచ్చేస్తాను అలా బయటకు వెళదాం అన్నారు ..' ఊ' అని టాటా చెప్పి వెనక్కి తిరిగి అయోమయం లో పడిపోయాను .. అన్ని అపార్ట్మెంట్లు ఒకలాగే ఉన్నాయి ..అవే లెటర్ బాక్స్ లు ,అవే కుర్చీలు,టేబుళ్లు ..ఇందులో మా ఇల్లు ఏది??అటు ,ఇటు చూసా కంగారుగా .. ఎవ్వరూ లేరు ..నేను ఎవరితోనైనా వెళుతుంటే, కబుర్లు చెప్తూ అనుసరించేస్తుంటా కాని ఎటు వెళుతున్నానో గమనించను .అదే నాతో వచ్చిన పెద్ద చిక్కు ..ఇక్కడ అదేంటో అర్ధం కాదు ఇన్ని కుటుంభాలు ఉన్నా ఒక్కరూ కనబడరు .చిన్నపిల్లల ఏడుపు కాని ,అరుపులు కాని.. ఉహు .. అలా వెతుక్కుంటూ వెళ్ళడం మొదలు పెట్టాను.. మా ఆయన ఆఫీస్ ఫోన్ నెంబర్ కూడా ఇంట్లోనే ఉండిపోయింది ..పైగా చేతిలో పైసా లేదు ఫోన్ చేద్దామన్నా.. రాత్రి మా అపార్ట్మెంట్ నెంబర్ ఎంతో చెప్పారు గుర్తు లేదు.. ఏడుపోచ్చేస్తుంది .. ఎలారా భగవంతుడా అని చూస్తుంటే ఆ ముందు రోజు మెట్లదగ్గర పడి ఉన్న సిగరెట్టు ముక్కలు, చెత్త కనబడ్డాయి.. హమ్మయ్యా !!!ఊపిరి పీల్చుకున్నాను ..


సాయంత్రం మావారు రాగానే ఎక్కడికి వెళదాం ??బీచ్ కి వెళదామా అన్నారు.. సరే అన్నాను.. ఆరైనా చీకటి పడకపోయే సరికి ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ బస్ స్టాప్ వరకు వచ్చేసాం.. సింగపూర్ లో మరొక మెచ్చుకో తగిన విషయం .. షెల్టర్లు .. ఉన్నట్లు ఉండి వర్షం వచ్చినా తడవకుండా ఇంటికి వెళ్ళిపోవడానికి వీలుగా ఈ షెల్టర్లు ఉంటాయి.. అలాగే ప్రయాణ వాహనాలు కూడా చాలా వీలుగా ఉంటాయి.. ఎక్కడకు వెళ్ళాలన్నా ప్రతి అయిదు ,పది నిమిషాలకు ఒక బస్ కాని ,ట్రైన్ కాని ఉంటుంది .. పైగా ఏ బస్ ఎన్ని నిమిషాలకు ఏ స్టాప్ కి వెళుతుందో,ఎన్ని నిమిషాలకు బస్ వస్తుందో ఇన్ఫర్మేషన్ క్షణాల్లో తెలుసుకోవచ్చు..ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేసుకోవడం ఇక్కడి ప్రజలకు ఇష్టం ఉండదనుకుంటా .. ఈలోపల మా వారు బుజ్జీ, ఈ కార్డ్ ఇక నీ దగ్గరే ఉంచుకో అన్నారు ఒక నీలంరంగు కార్డ్ ఇస్తూ ..ఏమిటి ఇది అన్నాను దాన్ని చూస్తూ..ఇదిఫేర్ కార్డ్ ..ఇక్కడ ఎక్కడ ట్రావెల్ చేయాలన్నా ఇది ఉండాల్సిందే..బస్ లోను,ట్రైన్ లోను ఉపయోగిస్తాం ..మనకులా కండక్టర్ లు ఉండరు అన్నారు ..
ఈ లోపల బస్ వచ్చింది .. ఎక్కిన వాళ్ళందరూ అక్కడ ఒక చిన్న బోర్డ్ పైన ఈ కార్డ్ చూపుతున్నారు..అందులో నుండి 'కీ'అని సౌండ్ వస్తుంది ..ఏమిటండీ అది?? అన్నాను.. దీనిలో డబ్బులుంటాయి ..ఇది ఆ మిషన్ దగ్గర చూపితే అది ఏ స్టాప్ లో ఎక్కావో లెక్క గట్టి, దిగే స్టాప్ లో మళ్లీ చూపినపుడు అన్ని డబ్బులు కట్ చేస్తుంది అన్నారు..నాకు భలే విచిత్రం అనిపించింది ..

ఒకవేళ మనం కార్డ్ తేవడం మర్చిపోతే ??అన్నాను.. అప్పుడు బస్ డ్రైవర్ని అడిగి ఎంత డబ్బులు అవుతాయో అన్నీ అక్కడున్న పెట్టెలో వేయాలి ..అప్పుడు టికెట్ ఇస్తాడు అన్నారు..ఒక వేళ డబ్బులుకుడా మర్చిపోతే?? అన్నాను.. అప్పుడు బయటికి పోమ్మా ..అని మెడ పట్టుకుని తోసేస్తాడు అన్నారు నా తలపై చిన్నగా కొడుతూ..అబ్బా ..ఊరికే అడుగుతున్నాను బాబు ఇంకేం మాయాజాలాలు ఉన్నాయో అని అన్నాను..

బస్ లో చాలామంది చైనా వాళ్ళు ఎక్కుతున్నారు ,దిగుతున్నారు ..ఒక్క రైనా డ్రైవర్ కళ్ళు కప్పి టికెట్ లేకుండా ప్రయాణం చేస్తారేమో అని చూస్తున్నా ..ఒక్కళ్ళు కూడా అలా చేయడం లేదు..ఆఖరికి డబ్బై ఏళ్ళ ముసలాయన కూడా మెల్లిగా కార్డ్ టేప్ చేసి వస్తున్నాడు ..నాకు చాలా ఆక్చర్యం అనిపించింది..

ఏమండి ,ఒక వేళ టికెట్ తీసుకోకుండా డ్రైవర్ కి తెలియకుండా ట్రావెల్ చేసాం అనుకోండి అప్పుడేమవుతుంది?? అన్నాను.. ఏంటే ,ఇందాకడ నుండి చూస్తున్నా, కొంపదీసి అలా చేద్దామని అనుకుంటున్నావా ఏంటి ??కంగారుగా అన్నారు.అబ్బా ,అడిగి తెలుసుకుంటున్నా అండీ అన్నాను.. ఒక్కోసారి టికెట్ కలెక్టర్ వస్తాడు ..అతను మన కార్డ్ చెక్ చేస్తాడు అన్నారు.ఒక వేళ మనం టేప్ చేయకపోతే పోలీసులకు చెప్పేస్తాడా?? అన్నాను.. లేదు.. ఛీ !! నీదీ ఒక బ్రతుకేనా అన్నట్లుగా ఒక లుక్ ఇస్తాడు అంతే అన్నారు..'ఓస్ 'ఈ మాత్రం దానికే వీళ్లు ఇంత భయపడిపోతున్నారా!! హుమ్.. ఎలాగైనా ఈ దేశం ఇంత అభివృద్ది చెందడం లో ప్రజల పాత్ర ఎంతైనా ఉంది అనిపించేసింది ..

మా ఆయన కాసేపటికి నీ ప్రక్కన ఉన్న బటన్ నొక్కు అన్నారు.. ఏంటండి ఇది అన్నాను.. అది నొక్కితే డ్రైవర్ దగ్గర లైట్ వెలుగుతుంది ..అంటే రాబోయే స్టాప్ లో మేము దిగిపోతున్నాం ఆపు అని చెప్పడం.. అదే స్టాప్ లో ఎవరూ దిగడం ,ఎక్కడం చేయలేదనుకో ముందుకి వెళ్లి పోతాడన్నమాట ..టైం వేస్ట్ కాకుండా ప్రతి సీట్ దగ్గర ఈ బటన్స్ ఉంటాయి అన్నారు..భలే ఉంది అనుకునేంతలో స్టాప్ వచ్చింది దిగిపోయాం..అలా నడుచుకుంటూ బీచ్ దగ్గరకు చేరుకున్నాం ..'ఈస్ట్ కోస్ట్ పార్క్ ' ..సైకిలింగ్ చేసేవాళ్ళు ,గుజ్జన గూళ్ళు కట్టే వాళ్ళు, సముద్రం లో విన్యాసాలు చేసేవాళ్ళు , అలలతో ఆడేవాళ్ళు ..చాలా మంది రకరకాల వ్యాపకాలలో ఉన్నారు .. రా ..ఆ రాళ్ళ పై కూర్చుందాం అన్నారు.. నాన్న గుర్తు వచ్చారు.. ఎప్పుడన్నా సముద్ర తీరం వెళితే దూరం నుండి చూపించి అదే సముద్రం,ఇవే అలలు అని చూపించేవారు.. లోపలికి దిగని చ్చేవారు కాదు.. ఈ మాత్రం దానికి ఇంట్లో టివిలో చూడచ్చు కదా ..ఇంత దూరం రావాలేంటి ? నా ఆఖరు చెల్లి విసుక్కునేది..ఎందుకో నవ్వొచ్చింది ..వద్దులే ఇక్కడే కూర్చుందాం అన్నాను ..

నాకెందుకో అంత అందం గా అనిపించలేదు ఇక్కడ .. ఇండియాలో అయితే మనిషంత అలలు ఎగసి పడతాయి..ఇక్కడ నదిలో కెరటాల్లా అలా పాదాలకు తాకుతున్నాయి అంతే.. చాలా మంది చైనీయులు పిల్లలతో చేరారు .. ఏ జంట చూసినా అబ్బాయిలు పిల్లలని ఎత్తుకోవడమే ..అమ్మాయిలు కబుర్లు చెప్పుకుంటూ వస్తున్నారు.. వీరిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే పగలైనా ,రాత్రి అయినా ఆ హుషారు అలా మెయింటైన్ చేస్తారు ..పైగా ప్రొద్దున నుండి రాత్రి వరకు తల పైన ఒక్క వెంట్రుక చెరగకుండా జాగ్రత్త పడతారు.. పొట్టి పొట్టి బట్టలు వేసుకున్నా ఇక్కడి అమ్మాయిలకు అసహ్యం గా, ఎబ్బెట్టుగా ఉండదు.. వారి శరీర సౌష్టవం అలా ఉంటుంది కాబోలు..

ఆ ప్రక్కన ఏదో ఫుడ్ కోర్ట్ జనాలతో కళ కళ లాడుతుంది .. నాకు ఇక్కడ నవ్వొచ్చే విషయం ఏమిటంటే .. ప్రజలు ఫుడ్ కోర్ట్ ఉంటే చాలు ఈగల్లా ముసిరిపోతారు.. ఇంక ఎప్పటికి తిండి దొరకని వారిలా ఏ మార్కెట్ లలో చూసినా , షాపింగ్ మాల్స్ చూసినా,హోటల్స్, ఎటు చూసినా జనాలే.. ఇంట్లో ఉదయం పూట ఎవరూ ఉండరు ..అందుకే అంత నిశ్శబ్దం గా ఉంటుంది అపార్ట్మెంట్స్ దగ్గర..కాకపొతే తిండికి,అందానికి,ఆరోగ్యానికి వీరిచ్చే ప్రాధాన్యత ఇంకెవరు ఇవ్వరేమో ...

అలా కాసేపు నడుచుకుంటూ వెళుతుంటే కొందరు నవ్వుతూ పలకరిస్తున్నారు ..ఇంకొందరు మనం తగిలితే మైల పడిపోతాం అన్నట్లు తప్పుకు వెళుతున్నారు.. యువజంటలు మాత్రం ఈ లోకాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు .. ఇదేంటండి !!వీళ్ళకు అమ్మా,నాన్న చూస్తారేమో అని భయం ఉండదా!! అన్నాను.. వాళ్లకు తెలియక పొతే కదా భయపడటానికి.. ఇక్కడ ఒక వయసు వచ్చేసరికి అమ్మాయి ,అబ్బాయిలు ఎవరో ఒకరిని పార్టనర్ గా ఎన్నుకుంటారు..తల్లిదండ్రులు చూడరు.. ఒకవేళ చూసుకోక పొతే వాళ్లకు సరి అయిన పాట్నర్స్ దొరకడం కష్టం అవుతుంది ... అందుకని తల్లిదండ్రులే ఎవరినన్నా ప్రేమించన్డో అని పోరతారు అన్నారు ..

ఇదేమి సంస్కృతీ అండీ బాబు.. మరి చదువులు, చట్టుబండలు ఎలా సాగుతాయి ఇలా చిన్న వయసులోనే ప్రేమించేస్తే ??అన్నాను.. అందుకే గా ఇక్కడ మనలాంటి వాళ్ళు బ్రతకగలుగుతుంది.. ఇంటర్ అవ్వగానే ఇక్కడ తప్పని సరిగా మిలటరీ లో చేరాలి ..రెండు సంవత్సరాలు గవర్నమెంట్ బాగా తర్ఫీదు ఇస్తుంది.. ఈ లోపల వాడికి చదువు మీద ఇంటరెస్ట్ పోతుంది..వీడి మీద బెంగతో ఆ పిల్ల చదువు ఆపేసి ఏ చిన్న ఉద్యోగంలోనో సెటిల్ అయిపోతుంది.. అందుకే ఇక్కడ అతి తక్కువ మంది ఉంటారు పెద్ద లెవల్ లో ఉన్నవాళ్ళు అన్నారు..అక్కడి నుండి ఇద్దరం MRT (రైల్వే స్టేషన్ )కి వెళ్లాం..నాకు బస్ కంటే ట్రైన్ బాగా నచ్చింది.. చల్లగా ,విశాలంగా ,శుభ్రంగా ఉంది.. టికెట్స్ తీసుకోవాలన్నా,కార్డ్స్ లో డబ్బులు ఫిల్ చేయాలన్నా అన్నీ మిషన్ల ద్వారానే.. బస్ లోగాని, ట్రైన్ లో గాని తినడం,తాగడం నిషేధం ..

అన్నిటికంటే నచ్చిన విషయం ముసలివాళ్ళు,చిన్నపిల్లల తల్లులు,ప్రెగ్నెంట్ అయిన వారు వస్తే లేచి సీట్ ఇచ్చేస్తున్నారు.. ఇక్కడ ఎంత దూరం వెళ్ళాలన్నా గంటన్నరలో వెళ్ళిపోతాం..చిన్న దేశం కదా .. సరదాగా అనిపించింది..అలాగే ట్రైన్ కూడా.. అయితే అండర్ గ్రౌండ్ లోనో లేదా బ్రిడ్జ్ పైనా తప్ప రోడ్ మీద ప్రయాణం చేయదు ..ట్రాఫిక్ కి ఇబ్బంది లేకుండా ..కొన్ని చోట్ల భూగర్భం లో రెండు అంతస్తుల్లో రైల్వే మార్గాలు వేసి
ఉన్నాయి .. చక్కని ప్లానింగ్ ఉన్న దేశం..బస్సు స్టేషన్ ,రైల్వే స్టేషన్ ఎప్పుడూ ప్రక్క ప్రక్కనే ఉంటాయి. ఏ ఊర్లో అయినా సరే ..ఆతరువాత మావారు పని చేసిన ఆఫీస్ చూపించి 'రాఫిల్స్ ప్లేస్' తీసుకు వెళ్ళారు .. ఆకాశాన్ని అంటేంత బిల్డింగులు గట్రా అలా చూస్తూ ఉండి పోయాను..

6, మే 2010, గురువారం

అదో మరపురాని రోజు...


'సిమే' .. సింగపూర్లో నేను విడిది చేసిన మొట్టమొదటి ప్రదేశం.. ఉన్నది కొద్ది నెలలే అయినా మరుపురాని అనేక అనుభూతులకు నిలయం ... చాలా రోజులతరువాత మా వారిని చూసానన్న ఆనందం వల్లో ఏమో 'కేబ్ 'ఎక్కగానే ఇంక ఊరు చూడటం మానేసి కబుర్లలో పడిపోయాను .. అదికాదు బుజ్జీ, మరేమో క్రొత్తగా జాయిన్ అయ్యాను కదా..పైగా జీతం కూడా ఎక్కువ కాదు.. ఇంకా చెల్లి పెళ్లికనీ కొంత డబ్బు ఇస్తా అన్నాను అందుకనీ ..అని ఆగారు మావారు ...అందుకనీ?? రెట్టించాను .. అందుకనీ ఇల్లు షేరింగ్ కి తీసుకోవలసి వచ్చింది అన్నారు నసుగుతూ .. షేరింగ్?? అంటే ?? అన్నాను అర్ధం కాక .. అంటే మనం ఓనర్ తో కలసి ఉంటాం ... మనకొక బెడ్ రూం ఇస్తారు ..కిచెన్ ఇద్దరం ఉపయోగించుకోవచ్చు ..వాషింగ్ మిషన్,ఫ్రిజ్ అన్నీ కూడా ... నాకు విసుగొచ్చింది.. ఎలా అండి!!! మీరేమో ఆఫీస్ కి వెళ్ళిపోతారు.. ఎవరో ,ఏమిటో తెలియని వాళ్ళతో ఎలా కలసి ఉండేది ?? పైగా వాళ్ళ బాష ,నా భాష ఒకరికొకరికి అర్ధం కావద్దూ అన్నాను దీనంగా.. ఆ విషయం లో బెంగ పెట్టుకోవద్దులే ..వాళ్ళు మన తెలుగు వాళ్ళే.. అందుకే కాసింత అద్దె ఎక్కువైనా'సరే 'అనేసా అన్నారు... నిజ్జంగానా !!!బోలెడు ఆనందం వేసేసింది ... ఇన్నాళ్ళు ఎలారా బాబు ఒక్కదాన్నే ఈ దేశం కాని దేశం లో అని తెగ ఫీల్ అయిపోయేదాన్ని..

మాటల మధ్యలోనే ఇంటికోచ్చేసాము.."అంకుల్ " 6 $ అన్నాడు టాక్సీ డ్రైవర్ .. నాకు' మహేష్ బాబు 'చాచి పెట్టి కొట్టినట్లు అనిపించింది.. ఆ టాక్సీ డ్రైవర్ కి దాదాపు అరవై పైనే ఉంటాయి .. ఇదేంటండి మరీ విడ్డూరం, మీరు అంకులేంటీ!!! అన్నాను.. అదా ,అలా అపార్ధం చేసేసుకోకు ..ఇక్కడ అపరిచిత వ్యక్తులని అంకుల్,ఆంటీ అని పిలుస్తారు అన్నారు ... హుమ్..గొప్ప పనిచేస్తారు అనుకుంటుంటే ..అమ్మా ,నాన్నా గుర్తువచ్చారు.. ఏమండీ! ఇంటికి వెళ్ళగానే పోన్ చేద్దాం అన్నారూ అన్నాను..అప్పటికి మావారి దగ్గర మొబైల్ లేదు ..(ఇది జరిగి మరి దాదాపు పదేళ్ళు అవుతుంది ) సరే పదా ,అని నన్ను ఆ బిల్డింగ్ క్రిందకు తీసుకు వెళ్ళారు..

ఒక చోట ఒక టెలిపోన్ బాక్స్ ఉంది .. ఇదేంటండి ఇక్కడ ఎవరూలేరూ , ఎవరిదీ ఈ పోన్ అన్నాను.. గవర్నమెంట్ ది.. ఇక్కడ అన్ని బిల్డింగ్ ల క్రింద టెలిపోన్ బాక్స్ లు ఉంటాయి అంటూ ఒక కార్డ్ తీసి ఏవేవో నెంబర్స్ నొక్కారు ... ఇదేంటి అన్నాను ఆక్చర్యం గా .. ఇవి పోన్ కార్డ్స్ లే అని.. అమ్మా,నాన్నకు ,అత్తయ్యమావయ్యకు కాల్ చేసి చెప్పారు నేను క్షేమం గా చేరాను అని .. అక్కడి నుండి నడుచుకుని వస్తుంటే మెట్లదగ్గర బోలెడు సిగరెట్టు ముక్కలు ,పేపర్లు ... ఇదేంటి ఇంత చెత్త ఉంది ఇక్కడ?? అసలు ఇక్కడ ఎంత శుభ్రంగా ఉంటుంది అంటే మన మొహం అద్దంలో చూసినట్లు ఉంటుంది అన్నారూ,పైగా ఇందాకా ఎక్కడపడితే అక్కడ చేత్తవేయకు పైన్ వేసేస్తారు అన్నారూ అని సాగదీసి అడిగాను ..అబ్బా,మాట వరసకు అంటే నిజంగా మొహం చూసేసుకున్టావా ..ఎవరో నీలాంటి వాళ్ళే తర్కంగా వేసి ఉంటారు.. అయినా ఏం పెట్టావే బాబు ,ఈ బేగ్ ఇంత బరువుంది అని విసుక్కున్టూ ఒక ఇంటి ముందు ఆగి తలుపు తీసారు ...

మెల్లిగా లోపలికి అడుగు పెట్టి చూసాను .. ఎంత బాగుందో.. చక్కగా ,నీట్ గా విశాలంగా,ఖరీదైన పర్నిచర్ తో నాకు చాలా నచ్చేసింది హాల్.. అబ్బా !!!భలే ఉందండి ఇల్లు అటు ,ఇటు తిరుగుతూ అన్నాను.. ఉష్ ..ష్ మెల్లిగా మెల్లిగా మాట్లాడు.. లోపల ఇంకా జనాలున్నారు అని చెప్పాను కదా అన్నారు కంగారుగా.. హుమ్..మళ్లీ అదొకటి ఉంది కదూ అనుకుంటుంటే మా రూం తలుపులు ఓపెన్ చేసారు .. ఇదేంటండీ ,ప్రతి రూం కి తాళాలు ఉంటాయా అన్నాను.. ఊ.. డోర్ పడగానే ఆటోమేటిక్ గా లాక్ అయిపోతాయి జాగ్రత్త ..తాళం నీదగ్గరే పెట్టుకోయేం అన్నారు.. నాకన్నీ విచిత్రంగా విచిత్రం గా అనిపిస్తున్నాయి..

విశాలమైన బెడ్ రూం ..తెల్లని కప్ బోర్డ్స్ .. ఆ ప్రక్కనే అటాచ్డ్ బాత్ రూం .. అలా చూస్తూ మంచం చూడగానే తిక్క కోపం వచ్చింది.. దుప్పటి అనేది కనబడకుండా అడ్డం గా టవల్స్ ,వైర్లు,పుస్తకాలు,బట్టలు .. మీరున్నారు కదా ,హంస తూలికా తల్పం ఇచ్చినా అడ్డంగా తువ్వాలు ఆరబెడతారు తిట్టుకుంటూ వాటిని సర్దడం మొదలు పెట్టాను.. అంతేలేవే పాపం ఇన్నాళ్ళు ఎలా తిన్నాడో, ఏంటో.. అబ్బే ఏమీ లేదు..క్రొత్త జాబ్ ..ఎంత వర్కో తెలుసా అన్నారు.. కడుపు తరుక్కుపోయింది ..అసలు ఆయనకు కోడిగ్రుడ్లు ఉడకపెట్టడం కూడా రాదు.. పాపం ఏం తిన్నారో ఇన్నాళ్ళు?? .. దాదాపు ఎనిమిది కేజీలు తక్కువ కాకుండా తగ్గిపోయారు ...నేను పూర్తిగా బాధ పడకముందే అబ్బా!! అవన్నీ ఇప్పుడు సర్దేయాలా, రేపు నేను ఆఫీస్ కి వెళ్ళగానే ఖాళినే కదా .. పద ఆకలి వేస్తుంది భోజనం చేసేద్దాం అన్నారు.. అయ్యో ఇంకా తినలేదా ??వంట చేయనా అన్నాను.. అక్కరలేదు ,నేను వండేసా ఇద్దరికీ .. అంటే అన్నం ,పెరుగు,పచ్చడి అన్నారు.. అబ్బో అన్నం కూడా వండటం వచ్చేసిందా అన్నాను నవ్వుతూ.. అదేమన్న బ్రహ్మ విద్యేంటి.. ఒక కప్పు బియ్యం, రెండుకప్పుల నీళ్ళునూ అంటూ నన్ను కిచెన్ లోకి తీసుకు వెళ్ళారు ...

నేనెప్పుడు అంత ఆధునికమైన వంట గది చూడనే లేదు .. స్టవ్ అయితే నాలుగు బర్నర్లు ఉన్నాయి ... ఇదెలా వెలిగిస్తారండి అన్నాను లైటర్ కోసం చూస్తూ .. లైటర్ అక్కరలేదే ఈ బటన్స్ నొక్కగానే ఆటోమేటిక్ గా వెలుగుతాయి అని చూపించారు .. విమానం శబ్దం వినగానే కిటికీ దగ్గర కొచ్చి నించున్నా.. ఎయిర్ పోర్ట్ ఇక్కడ దగ్గర... ప్రతి పది నిమిషాలకొకటి వెళుతుంది అన్నారు ..ఓ ..అనుకుంటూ యాదాలాపంగా ముందుకు చూసాను ..ఎదురు అపార్ట్మెంట్ ముందు అన్నీ బోలెడు కర్రలు గ్రుచ్చి ఉన్నాయి... ఏమిటండి అవి అన్నాను.. ఇక్కడ అపార్ట్మెంట్ పైకి వెళ్ళనివ్వరు కదా బట్టలు ఆరబెట్టడానికి ..అందుకనీ కర్రల పై ఆరబెట్టి అలా పెడతారు ..వర్షం వస్తే ఇదిగో వంటగది పైన అలా తగిలిస్తారు అని చూపించారు ... హమ్మయ్యో !!!భలే తెలివండి వీళ్ళకు అన్నాను..

భోజనం ఇక్కడ వద్దులే మళ్లీ ఎవరన్నా వస్తే ఇబ్బందిగా ఉంటుంది..బెడ్ రూం లో తినేద్దాం అన్నారు ..సరే అని కంచాలు,గ్లాసులు అన్నీ మోసుకు వెళ్లాం..అన్నం ,ఆవకాయ పచ్చడి వేసుకుని పెరుగు కోసం గిన్నెపై మూత తీస్తే బ్రౌన్ గా ఉంది పెరుగు.. ఇదేంటండి ఈ కలర్ లో ఉంది అన్నాను అయోమయం గా చూస్తూ.. అలాగే ఉంటుందిలే నువ్వు తిను అన్నారు ... కొంచెం వేసుకుని అన్నంలో కలుపుకుని ఒక్క ముద్ద పెట్టుకున్నానో లేదో' యాక్ ' తీపి పానకం ... అబ్బా!! ఏంటండీ ,ఇదేం పెరుగండి బాబు అన్నాను.. మరి చాక్లెట్ పాలతో తోడుపెడితే తియ్యగా ఉండదేంటి అన్నారు తను మాములుగా తినేస్తూ.. బాబోయ్ చాక్లెట్ మిల్కా !!!దానితో పెరుగా అన్నాను అసహ్యం గా మొహం పెట్టి...మరేం చేయను, నాకేమో ఇక్కడ ఎక్కడ ఏముంటాయో తెలియదు..మా ఆఫీస్ లో అందరు చైనా వాళ్ళే ..వాళ్లకు మన ఫుడ్ గురించి అసలు తెలియదు.. అందుకే ఇలా ఏది పెడితే అది తినేస్తున్నా అన్నారు.. నాకు కళ్ళలోంచి నీళ్ళు తిరిగాయి ..మా ఇంట్లో ఆయనకు నచ్చని కూర చేస్తే చిన్నపాటి యుద్ధం జరిగిపోయేది.. పాపం అనిపించింది ..పోనీ ఇంటి ఓనర్ తెలుగువాళ్ళే అంటున్నారుగా వాళ్ళని అడగచ్చుగా ఏ వస్తువులు ఎక్కడ దొరుకుతాయో అన్నాను.. ఆ మాట ఆయనకు ఎందుకో నచ్చలేదు ..కాస్త మొహం చిరాగ్గా పెట్టి ..అది సరేగాని మన భాషే అని ఆమెతో ఒకటే సోది వేయకు ..నీ పని ఏదో నువ్వు చూసుకో.. సరేనా అన్నారు...ఎందుకనీ అన్నాను విసుగ్గా.. నాకసలే నోరు కట్టుకుని కుర్చోవాలంటే మహా చిరాకు.. ఎందుకని అంటే ఏం చెప్పను..ఇదేమన్నా మన ఊరు అనుకున్నావా .. ఎవరి పని వాళ్ళు చూసుకోవాలి అన్నారు .. హుమ్.. అని నిట్టూర్చి పచ్చడి కలుపుకుని ఎలాగో భోజనం తినేసాను..

ఇండియా నుండి అంట్లు తోముకునే పీచు తో సహా తెచ్చా అని గొప్పలు పోతుంటే ...అదే మరి తెలివి తక్కువతనం అంటే ...ఇక్కడ ఎవరూ తినరా ,గిన్నెలు తోముకోరా భలే ఆలోచిస్తావ్ అని కాసేపు ఏడిపించారు.. నేను మాత్రం ఉరుకుంటానా .. చాక్లెట్ మిల్క్ తో పెరుగు చేసుకుంటారు కాబట్టే తెచ్చాను అని తిరగబడిపోయాను అనుకోండి అది వేరే విషయం ..ఉన్నట్లు ఉండి ఒక్కసారిగా' ఢాం ' అంటూ సౌండ్ వచ్చేసరికి కంగారు పడిపోయాను ...ఓరి దేవుడోయ్ ..ఏంటండి అది అన్నాను కిటికీ లోనుండి బయటికి చూస్తూ ... ఎప్పుడు ముసిరిందో తెలియదు మబ్బు..నల్లగా కమ్మేసింది.. ఒకటే మెరుపులు ,ఉరుములు ,వర్షం... అవి కూడా మామూలు పిడుగులు కాదు..భయంకరం గా ప్రక్కనే పడుతున్నట్లు..చెవులు చిల్లులు పడుతూ ... నేను ఎప్పుడూ వినలేదు అంత సౌండ్ .. ఇదేంటండి ఇప్పటివరకు వెన్నెల పుచ్చ పువ్వులా విరగ కాసింది ..ఎప్పుడు మబ్బేసింది అన్నాను అయోమయంగా .. ఇక్కడ అంతే ,అప్పటి కప్పుడు ఎండ మండిపోతుందా ..రెండో నిమిషంలో వర్షం వచ్చేస్తుంది ...ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎండాకాలం,వర్షాకాలం అని సీజన్ ఉండదు మనకులా .. ఎప్పుడూ ఒకేలా ఉంటుంది.. వారం లో ఒకటి రెండు సార్లు వర్షం తప్పనిసరిగా పడుతుంది అన్నారు.. అవునా అన్నాను ఆక్చర్యం గా ...

నాకు అన్ని విషయాలు చాలా క్రొత్తగా ,అయోమయంగా అనిపించాయి.. అలా ఎప్పుడు నిద్రలో జారుకున్నానో తెలియదు .. తెల్లవారు జామున బుజ్జీ లే ..లే అని ఎవరో పిలుస్తున్నట్లు.. అంత ఘాడ నిద్ర లో లేపుతుంటే చాలా ఏడుపోచ్చేస్తుంది.. ఏంటండీ అన్నాను విసుగ్గా ... ఆరయ్యింది ...వంట చేస్తానన్నవుగా లేచి బాక్స్ పెట్టు అన్నారు.. నాకసలే తెల్లవారు జామున విపరీతంగా నిద్ర పడుతుంది ..అందులోను అంత చల్లని వాతావరణం లో లేవడమే? అమ్మో నావల్ల కాదు .. రేపటినుండి వండుతా .. ఈ రోజు బయట తినేయండి ..ముసుగు కప్పెసా..కాని అవతల ఉన్నది ఎవరూ..జాలి,దయ అనే పదాలకి అర్ధం తెలియని మా ఆయన ... ఓయ్ ..నిన్నేమో పెద్ద పతివ్రతా శిరోమణి లా ..ఇంకేముందండి ,నేను వచ్చేసానుకదా..వండి ఉద్దరించేస్తా అని కబుర్లు చెప్పావ్.. లే..లే అని ఒకటే గోల ...

ఏడుపు మొహం వేసుకుని లేచి కిటికీ లోంచి చూసాను..చిమ్మ చీకటి ..అబ్బా ..ఇంకా ఆరయ్యి ఉండదు అండీ.. చూసారా ఎంత చీకటిగా ఉందో అన్నాను మళ్లీ పడుకుంటూ.. నీ మొహం ఇక్కడ సెవెన్ అయితే గాని తెల్లారదు ... రాత్రి సెవెన్ దాటితే గాని చీకటి పడదు .. నిజానికి ఇక్కడి గవర్నమెంట్ షేర్ మార్కెట్ కోసం ఇలా టైం ముందుకు జరిపిందంట.. ఇంక లే, అని నసపెట్టి తను హాయిగా పడుకున్నారు .. ఛీ, వీళ్ళకు పనిపాట ఏం ఉండదు అనుకుంటా.. దిక్కుమాలిన దేశం తిట్టుకుంటూ లేచి బయటకు చూసాను ఆ సరికే చాలా అపార్ట్మెంట్లో లైట్లు దేదీప్యమానం గా వెలిగిపోతున్నాయి.. చాలా మంది హడావుడిగా ఆ పాటికే పరుగులు పెడుతున్నారు.. నిన్న సామాను సర్దుతా అంటే ఒప్పుకోలేదు ఇప్పుడు వంట ఎలా చేయను నా మొహం ..ఆ చీకట్లో కావలసిన సామాను తడుముకుని వంటగదిలోకి వెళ్లాను..