28, నవంబర్ 2010, ఆదివారం

సెంతోసా


సంతోసా అనేది సింగపూర్ ప్రక్కనే ఉన్న చిన్న దీవి.. ఇక్కడకు వెళ్ళాలంటే హార్బర్ ఫ్రంట్ దగ్గర నుండి ట్రైన్,కేబుల్ కార్,బస్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.. అంటే ఒక పదినిమిషాలు జర్నీ అంతే... అయితే ఈ దీవిలో విశేషాలు చూడాలంటే ఒక రోజు మొత్తం సరిపోదు కాబట్టి ప్రొద్దున్నే వెళ్ళిపోవడం మంచిది.. భోజనం,చిరుతిళ్ళు వగైరాలు తీసుకు వెళితే మరీ మంచిది .. లేకపోతే లోపల రేట్లకు పట్ట పగలే సుక్కల్ సుక్కల్ కనబడతాయి మల్లా... ఆ తరువాత మీ ఇష్టం..దీవి లోపలకు వెళ్ళాకా అక్కడి నుండి ఎక్కడకు వెళ్ళాలన్నా బస్,ట్రైన్,ట్రాం ల ఉచిత సౌకర్యాలు అడుగడుగునా ఉంటాయి.. అంటే ఎంట్రన్సు ఫీజ్ రూపం లో 4 $ ముందే వసూలు చేసేస్తాడనుకోండి ...అయినా సరే తక్కువే ..


అక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం..మెరి లైన్ (merlion ) : Mother of singapore అంటారు దీన్ని..సగం సింహం , సగం చేప ఆకారం లో రాజసం ఉట్టిపడుతున్న దీన్ని సింగపూర్ సింబల్ గా భావిస్తారు..దీని గురించి ఏదో కధ మా అమ్మాయి వెంటపడి చాలా సార్లు చెప్తుంటే నేను వినిపించుకునేదాన్ని కాదు ..ఇప్పుడు చెప్పమని నేను దాని వెనుకాతల పడుతున్న అది వినిపించుకోవడం లేదు .. అయితే ఈ మెరి లైన్ తల పైకి ఎక్కి చూస్తే సింగ పూర్ మొత్తం కనబడుతుంది.. అన్నట్లు మర్చిపోయా దీనిలో ఒక షో ఉండేది ... ఒక చేపల ఎక్వేరియం లాంటి దానిలో ఉన్నట్లుండి ఒక అబ్బాయి వస్తాడు (చిన్న సైజ్ ఆత్మలా ) సింగపూర్ హిస్టరీ మొత్తం చెప్తాడు ..కాని భలే ఉంటుంది చూడటానికి..ఈ మధ్య కాలం లో నేను వెళ్ళలేదు ..మరి ఇప్పుడుందో లేదో ...under water world : మనం క్రింద ఉండీ మన పైన సముద్రం ఉండీ వాటిలో రంగు రంగుల రకరకాల చేపలు ,షార్కులు ,తాబేళ్లు వెళ్ళుతున్నాయనుకోండి ఎలా ఉంటుంది??? బాగుంటుంది కదా..అదే అన్న మాట ఈ అండర్ వాటర్ వరల్డ్ ..ఇంకా సీ హార్సులు,జెల్లి ఫిష్లు, ఇలా చాలా చూడచ్చు అస్సలు మిస్ కాకండి..మనకి కాసింత డబ్బు ,ఇంటరెస్ట్ మెండుగా ఉంటే మనం కూడా లోపలకి దిగచ్చు..దీనికి అనుసంధానం గా డాల్ఫిన్ షో ఒకటి పెట్టాడు..డాల్ఫిన్ విన్యాసాలు అన్నమాట..అది కూడా చూడచ్చు..imeges of singapore : ఇదేంటంటే ఇక్కడ అన్ని మనుషుల్లా ఉండే బొమ్మలు ఉంటాయి..సింగపూర్ కి జపనీస్ కి వచ్చిన గొడవలు,ఇక్కడకు వలసలు ఎలా వచ్చారు,ఇక్కడి వాళ్ళ బిన్న జీవన విధానాలు ఇవన్ని అచ్చం గా మనుషుల్లా ఉండే బొమ్మలు తో చూపిస్తారు..వాటి మధ్యలో నడుస్తూ మంద్రం గా వినిపిస్తున్న సంగీతం, డిం లైట్ ల మధ్యలో భలే ఉంటుందిలే..అంటే నా కళ్ళ తో చూడాలన్న మాట ..మా ఆయన కళ్ళతో చూస్తే నచ్చదు..
butterfly park : ఇది శుద్ద వేస్ట్..వాటికి కూడా నాకులా బద్ధకం అనుకుంటా..ఎక్కడికి వెళ్ళినా బజ్జున్నాయి.. ఒక్కటీ బయటకు రాదు.. వీటి కంటే మా కాలేజ్ లో వందలు సీతాకోక చిలకలు ఉండేవి.....బీచ్ : ఇక్కడ ఇంచు మించుగా మూడు నాలుగు బీచ్ లు ఉన్నాయి..palawan బీచ్,సిలోసా బీచ్ ఇలా ..అబ్బాయిల కళ్ళకు ,చిన్నపిల్లల ఆటలకు ఒకటే పండగ... పాల్వాన్ బీచ్ లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఉంటుంది..మధ్యలో కి వెళ్లి గెంతితే భలే బాగుంటుంది..
డ్రాగన్ ఫౌంటైన్ : ఈ బొమ్మ ఎక్కడ చూసారో చెప్పుకోండి..చంద్రలేఖ సినిమాలో నాగార్జున సాహసమే చేయరా డింబకా అనే సాంగ్లో అనుకుంటా చూపించాడు..

మెరిలైన్ వాక్ : ఇందాకా చెప్పాను గా మెరి లైన్ అక్కడ నుండి నడిచుకుంటూ వెళ్లేదారి ఉంటుంది ..ఆ దారి అంతా పార్క్ లా రక రకాల ఫౌంటైన్ లతో బాగుంటుంది.. ఒక్కప్పుడు ఇవన్నీ ఫ్రీ ..ఇప్పుడు అన్నిటికి బేండ్ వాయిస్తున్నాడు ...
ఫోర్ట్ సిలోసా : దీనికైతే నేను వెళ్ళలేదు ..నాకు ఇంటరెస్ట్ అనిపించలేదు..బహుసా యుద్ధం లో వాడే ఫిరంగులు అవి చూపుతాడనుకుంటా??
స్కయ్ టవర్ : దీని పైకి ఎక్కితే సింగపూర్,అటు మలేసియా ,ఇండోనేసియ బోర్డర్లతో సహా చూసేసేయచ్చంటా..కాని నేను వెళ్లలేదు.. అంటే నాకేం భయం కాదు ..కాని అలా చిన్న పిల్లల్లా టవర్లు గట్రాలు ఎక్కి తొంగి చూడటం నాకు పెద్దగా నచ్చదు ..మీరు నమ్మాలి ..
అదనపు ఎట్రాక్షన్స్: రైడ్స్ బాగుంటాయి కాని కొద్దిగా ఎక్కువ రేటే ..దాని కంటే ప్రక్కన యూనివర్సల్ స్టూడియోకి వెళ్ళితే చాలా సేపు ఎంజాయ్ చేయవచ్చు ..(దీని గురించి ఇంకోసారి చెప్తా..)చిన్న చిన్న చేపలతో ఫుట్ దేరఫీ బాగుంటుంది..పిల్లలకు వాటర్ వరల్డ్ ..ఏవో గార్డెన్స్ అవీ ఉన్నాయి..కాకపొతే అవి చూసే టైం మనకు దక్కదు ..
song of the sea : ఇది ఒక మ్యూజికల్ ఫౌంటైన్ అండ్ లేజర్ షో.. దీని గురించి చెప్పకూడదు చూడాలంతే..చాలా బాగుంటుంది..ఇది రెండే షోలు ఉంటుంది రాత్రి ...అది అయిపోయాకా ఇక పదండి పదండి అని అన్ని క్లోజ్ చేసేస్తారు :)
ఇదన్న మాట సంతోసా ..ఇంకొన్నిటి గురించి రాయలేదు ..కాని ఫుల్ ఎంజాయ్ చేయచ్చు..

21, నవంబర్ 2010, ఆదివారం

కార్తికమాసపు భోజనాల్లో నా వంతు వంట

వచ్చేసారా.. రండి రండి రండి ...కూర్చోండి ..ఆ ..ఇప్పుడు చేయి తల పై పెట్టుకుని ప్రమాణం చేయండి.. నేను నేస్తం బ్లాగ్ పూర్తిగా చదివిన పిమ్మటే బ్లాగ్ క్లోజ్ చేస్తాను ..సగం మధ్యలో పారిపోను అనండి.. అదిగో అదేమరి ...మీతో వచ్చిన చిక్కు ...అలా మొహమాట పడకూడదు ...మర్యాదగా కూర్చోండి ...అద్గది వేరీ గుడ్..

ఈ రోజున నేను చెప్పబోయే వంటకం పేరు" ఉలవచారు".. ఏంటి అలా లేస్తున్నారు..తప్పు కదా ...మీ ప్రాణానికి నేనూ గ్యారంటీ..సరేనా ...అసలు ఉలవచారే ఎందుకు చెప్తున్నానంటే కొన్ని కారణాలు ఉన్నాయి ......
అందులో ఒకటి : వేరే వంటలు సమయానికి గుర్తురాక...
రెండు: పేరు కూసింత గ్రాండ్ గా ఉంది అని ,
మూడు : పాత కక్షలు కొన్ని సెటిల్ చేసుకోవాలి....
మిమ్మల్ని ఆట్టే టెన్షన్ పెట్టకుండా డైరెక్ట్ గా మూడో పాయింట్ కోచ్చేస్తాను ...

మరి ఒకసారేమో గూగుల్ బజ్ లో క్రొత్తగా వచ్చినపుడు ఏం రాయాలో తోచకా ,ఈ రోజు ఉలవ చారు చేసానోచ్ అని ఒక పోస్ట్ వేసాను..వేయగానే అందరూ అమ్మో అమ్మో ఉలవచారే !!!!రెసిపి నాకూ చెప్పరా, నాకూ చెప్పరా ..ప్లీజ్ అని అనేస్తారని తెగ ఆశ పడ్డానా!!!.. మంచు గారు వచ్చి" ఓస్ ఉలవచారా" ....మా ఊర్లో ప్రియావాడి ప్రోడక్ట్ సూపరుంటుంది.. మీ అంత టైం వేస్ట్ చేయక్కరలేదు ...5 నిమిషాలు చాలు అని తీసిపడేసారు :( ....పైగా మీరు ఉలవచారు కూడా చేయగలరా ???అని నేను కుళ్ళుకునే నవ్వు ఒకటి పడేసారు ... మరి రివేంజ్ తీర్చుకోవద్దూ ... ఆయన బ్లాగులో తిరామిసు వంటకం చూసారా?? ...ఏమండీ అన్నానంటే అన్నాను అంటారుగాని ఆ పంచదార,గుడ్డు తప్పించి ఒక్కటంటే ఒక్కటి మన వంటగదిలో ఉంటుందా ???? పైగా లేడీ ఫింగెర్స్ అంటే మన బెండకాయలనుకున్నా ..ఫోటోలో చూస్తే అవేవో బ్రెడ్ ముక్కల్లా ఉన్నాయి ... కాబట్టి వండే పదార్దాలే తెలియని ఆయన మాటలు మీరు పట్టించుకోనక్కర లేదని నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను..

ఇక రెండవ బాణం నలభీమ పాకం భాస్కర రామ రాజుగారి పై ఎక్కుపెట్టడం అయినది ...ఎందుకంటే..మరి అంత కష్టపడి పోస్ట్ వేస్తే ..అయ్యో కొత్తగా వచ్చింది ఏదో ముచ్చట పడుతుంది..నువ్వు అంత గొప్ప వంటకం చేసావా ..బాగుంది అని ప్రోత్సహించకపోతే పోనీ సైలెంట్ గా ఉండచ్చుగా ...అబ్బే నాకసలు ఉలవచారు అంటే ఇష్టమే ఉండదు అని చప్పగా తేల్చేసారు ..పోనీ అక్కడితో ఊరుకున్నారా?? మీ ఇంటి మైసూర్ పాక్ ఒక ముక్క పంపితే మా ఇంట్లో కుంకుడు కాయలు కొట్టుకుంటా అన్నారు కూడా..వా..ఆ..ఆ...... మరి రాజుగారు ఒక సారి కీర దోసకాయల పచ్చడి ఎలా చేయాలి అని రాస్తే నేను ముక్కలన్నీ తరిగి పచ్చడి చేసే లోపు ముక్కలన్నీ చేదేక్కి పోయాయా !!అప్పుడు ఒక్కమాట అయినా అన్నానా రాజుగారిని ????..పైగా రాజుగారూ!!రాజు గారూ !! కీర దోసకాయ చేదు రాకూడదంటే ఏం చేయాలి ?అని కామెంట్ పెడితే రిప్లయ్ కూడా ఇవ్వలేదు .. ( స్వగతం: లేకపోతే నిన్న సోనాలి బింద్రే లాంటి నన్ను పట్టుకుని అక్కా అని పిలుస్తారా..ఆయ్) కాబట్టి మీరు అస్సలు వాళ్ళ మాటలు నమ్మ కూడదు .. నా మాట మాత్రమే నమ్మాలి ...ఎందుకంటే ఇది నా బ్లాగు ,నా పోస్ట్ అందుకే అన్నమాట..

ఆ ఇంతకూ ఎంత వరకూ చెప్పానూ?? ..మర్చిపోయాను ఇంకా మొదలు పెట్టలేదు కదా ..."ఉలవచారు" కృష్ణా జిల్లా వాళ్ళ ప్రియమైన వంటకం ...ఇంకా ఉలవల్లో బోలెడు పోషకాలు ఉన్నాయంట అవి అసైన్స్ కబుర్లు తారగారిని అడిగి చెప్తాను ...(ఇప్పుడు తారగారు అదేదో సినిమాలో ఆంటీ మత్ కహోనా టైపులో "గారు" మత్ కహోనా అంటారు :))

ఇక తయారి విధానం ...

ముందుగా ఉలవలు నానబెట్టాలి ...ఎన్ని అంటే ..ఊ ..ఒక దోసెడు నిండా తీసుకోండి ...వాటిని బాగా కడిగి నీరుపోసి ఒక రాత్రి అంతా నానబెట్టాలి..
తరువాత ప్రొద్దున్న అవ్వగానే వాటిని కుక్కర్లో వేసి ఒక మూడు పెద్ద గ్లాసుల నీరు పోసి రెండు.మూడు విజిల్స్ వచ్చేవరకూ ఉంచి తరువాతా నీరు ని వడబోసి గింజలు వేరుగా పెట్టుకోవాలి (అసలైతే గిన్నెలో పోసి మరగనివ్వాలి ..మరి నాకంత ఓపికలేదు..మీరు కుక్కర్ వద్దు అనుకుంటే అలా చేయవచ్చు )...ఆ నీటిలో కొద్దిగా చింతపండు పులుసు ,ఉల్లి పాయ ముక్కలు,టమాట ముక్కలు ఇంకా కరివేపాకు,కొత్తిమీర ,పసుపు,ఉప్పు,కారం వేసి మరగనివ్వాలి..అలా మరగనివ్వాలి మరగనివ్వాలి మరగనివ్వాలి అలా మరగనిస్తూనే ఉండాలి..అప్పుడు ఉడకబెట్టి ప్రక్కకు తీసిన ఉలవ గింజలలో ఒక గుప్పెడు మిక్సిలో మెత్తగా రుబ్బి దాన్ని ఈ చార్లో కలిపేయాలి ... ఉలవచారు మరిగినకొద్దీ రుచి అన్నమాట ...అంటే గిన్నెలో పావు వంతు పైనే మరిగిపోవాలి.. అప్పుడు టేస్ట్ చూసుకుని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి తో తాలింపు వేసుకోవాలి.. ఆఖరున వెన్నపూస పైన వేయాలి అంట.. మనకి అంత ఓపిక లేక ఆ పని చేయలేదు..:)
అంతే ఉలవచారు రెడీ ....

ఇప్పుడు కొన్ని నిబంధనలు అన్నమాట ..

1 .క్రొత్తగా ఉలవచారు తినేవారు ..చేయ బోయేముందు ఆహా సూపరు ఉంటుంది అని అనేసుకుని ఎక్కువ ఊహించుకుని చేయకూడదు ..ఎప్పుడూ ఎక్కువ అంచనాలు వేసి చేస్తే అస్సలు బాగోదు ..స్వానుభవం మీద చెప్తున్నా ..ఆ ఏం బాగుంటుంది లే ..మనకసలు వంట వచ్చా పాడా ...ఒక మాదిరిగా ఉంటుంది అనుకుని మొదలు పెట్టాలన్నమాట..

2 .అలాగే పెళ్లానికో ,భర్తకో పెట్టేటప్పుడు భలే ఉంటుంది భలే ఉంటుంది అని ముందుగానే అంచనాలు పెంచకూడదు ... తింటున్నపుడు మధ్యలో అడగాలి ఎలా ఉంది అని..తినేసిన తరువాత అడగకండెం ... నేను మొదటి సారి తను తింటున్నపుడు అడగడం మర్చిపోయి ఆ సాయంత్రం అడిగితే.. మధ్యాహ్నం నువ్వు చారు వండేవా ?? అన్నారు :( అందుకే అన్నమాట..

౩.అలాగే చారు సరిగ్గా కుదరలేదనుకోండి .. ఇది నా తప్పే ..నాకే వంట రాలేదు పాపం మధ్యలో నేస్తం ఏం చేస్తుంది అనుకోవాలి ..ఇది అసలైన నిబంధన అన్నమాట ..నిన్న ఇంకా చాలా చాలా చెప్దామనుకున్నాగాని గుర్తురావడం లేదు అదీ సంగతి ...

ఏంటలా చూస్తారు.. మనిషన్నాకా కాసింత ధైర్యం ,కూసింత నమ్మకం ఉండాలి... ఏం మా ఆయన తినలేదా? నేను తినలేదా ? మేమిద్దరం బాగానే ఉన్నాంగా ...ఏం పర్లేదు దేవుడి మీద భారం మీద వేసి చేసేయండి.. అయిపోగానే సూపరుంది సూపరుంది అని నాకు వ్యాఖ్య ఇవ్వండి ( వేరే పదం వాడటానికి మీకు చాయిస్ లేదు ..ఎందుకంటే కామెంట్ మోడరేషన్ నా చేతుల్లో ఉంది..ఉహహ్హహ (వికటాట్టాహాసం))
(మంచుగారిని భాస్కర్ గారిని నొప్పిస్తే క్షమించగలరు ..సరదాకు రాసాను :))