10, జూన్ 2009, బుధవారం

నేనూ ప్రేమించాను
చదువుకునే రోజుల్లో పెద్దవాళ్ళ ప్రభావం వల్ల ప్రేమ అంటే అదేదో నేరం ,ఘోరం ,పాపం లా ఫీల్ అయిన నేను పీకలలోతు ప్రేమలో కూరుకుపోతా అని,ప్రేమలో తీయదనాన్ని రుచి చూస్తా అని కలలో అయినా అనుకోలేదు ...నా పెళ్లి కుదిరాకా తాంబుళాలు అయిన సాయంత్రం, పాపం మా ఆయన తన ఫోన్ నెంబర్ ఉన్న విజిటింగ్ కార్డ్ నాకు ఎవరు చూడకుండా ఒక పాపతో అందించారు..అసలే భారి బరువున్న పట్టు చీరతో,నగలతో
వచ్చేపోయే జనాల తో హడావుడిగా ఉన్న నేను విసుగు వల్ల అది ఎక్కడో పెట్టేసాను..


ఆ తరువాత దాని విషయమే మర్చిపోయాను ,అందులోనూ మా పెద్దమ్మ కూతురు పెళ్ళి కూడా అదే సమయం లో కుదరడం ,తన పెళ్ళి కూడా నా పెళ్ళికి రెండు రోజుల ముందు అవ్వడం వల్ల వచ్చిన చుట్టాలు పదిసార్లు అటు ఇటు తిరగలేక మా ఇంట్లోనే ఉండిపోయారు ....అంగుళం ఖాళీ లేదు ,పైగా మా తాంబూళాలు అయిన మరుసటి రోజే తుఫాన్ వల్ల కరెంట్ పోల్స్ పడిపోయి , తీగలన్నీ తెగిపోయి మా ఏరియా అంతా పదిహేను రోజుల పాటు కరెంట్ తీసిపడేసాడు ..ఇలా పలు కారణాలవల్ల ఆయన విషయమే మర్చిపోయాను ...


ఇది ఇలా ఉండగా ఒక రోజు అమ్మ,పెద్దమ్మ, పిన్నులు అందరూ పెళ్లి బట్టలవి కొనడానికి షాప్ కి వెళ్ళారు, కుళాయి వస్తే నీళ్ళు పట్టే బాధ్యత మాకప్పగించి ....నా కంటే ముందు అక్క పెళ్లి అవ్వడం వల్ల,పెళ్లి కూతురన్న మురిపం అసలు లేనేలేదు నాకు ,అన్నీ దానికే :( అలా నేను ,మా చెల్లి ఆ చీకట్లో రాత్రి 8 గంటలకు అది నీళ్ళు పడుతుంటే నేను బిందెలతో మోస్తూ ,సగం ఒంపేస్తూ నానా పాట్లు పడుతున్నాం ... ఇదే సినిమాల్లో అయితే హీరోయిన్ ఎంత వయ్యారంగా చుక్క వలగకుండా మోస్తుంది ,అసలే కరెంట్ లేక మోటార్ పని చేయడం లేదు ఇక్కడ నా చేతులు పడిపోతున్నాయి నీళ్ళు బోరింగ్ కొట్టలేక ,సరిగ్గా తీసుకువెళ్ళు మా చెల్లి విసుక్కుంది ...ఆహా.......ఖాళీ బిందె ఇస్తే నేను అంతకన్నా వయ్యారంగా మోస్తా అని తగవు వేసుకోబోతున్నంతలో ఫోన్ రింగ్ అయింది .... ఈ దిక్కుమాలిన ఫోన్ ఒకటి పని ,పాట ఉండదు ఇప్పుడే వస్తా అని తడి బట్టలు కాళ్ళకు అడ్డం పడుతున్నా కుళాయి ఎక్కడ కట్టేస్తాడో అని పరుగు పరుగున ఇంట్లోకి వచ్చాను ...


ఇంట్లో గదిలో నలుగురైదుగురు చుట్టాలు పిచ్చా పాటి మాట్లాడుకుంటున్నారు కొవ్వొత్తి వెలుగులో , నాన్న అప్పుడే వచ్చారు ఫోన్ దగ్గరకు ..నేను తడి వల్ల పడిపోబోతూ నిలదొక్కుకున్నా ... వాళ్ళలో ఒకరు ఆ..ఆ ..ఆ అంత కంగారేమిటి పడతావ్ అంటుండగానే ఫోన్ లిఫ్ట్ చేసాను ...హలో అన్నాను , హలో అటునుండి మెల్లిగా వినబడింది ... హలో ఎవరు ...మళ్ళి రెట్టించాను ...
అటు నుండి తడ బాటుగా నా పేరు చెప్పి నువ్వేనా అన్నారు.. అవును నేనే మీరెవరు అన్నాను ....నేను.. అని తన పేరు చెప్పారు ...మా ఆయన.. ఒక్క క్షణం నా మట్టి బుర్రకు తట్టలేదు ... ఎవరు అనుకుంటుండగానే అర్ధం అయింది తను అని.. ఆ తరువాత మెదడు కాసేపు మొద్దుబారిపోయింది..ఇప్పుడేం మాట్లాడాలి???.. ఎదురుగా మా నాన్న నా వైపు చూస్తూ .. ఆ పక్కనే అమ్మలక్కలందరూ కబుర్లాపి నా మొహం లోకేచూస్తూ ఉన్నారు..

పాపం మా ఆయన అటుపక్కన నేనేదో మాట్లాడేస్తా అని చాలా ఊహించేసుకుని వచ్చిన వారు కాస్తా, నేను మౌనమ్ అయిపోయే సరికి ఏం మాట్లాడాలో తెలియక బాగున్నావా అన్నారు ..
ఊ అన్నాను..
భోజనం చేసావా ..
ఊ ..
మీకు తుఫాన్ అంట కదా

కరెంట్ లేదు అంట కదా

కష్టం కదా

ఏంటి బిజీనా
ఊ..ఉహు హు
నేను రేపు ఫోన్ చేయనా ఇదే టైం కి ???

ఉంటాను బై ..

ఎవరమ్మా నాన్న అన్నారు.. ఏమని చెప్పాలి ? అతను ఫోన్ చేసాడు అనాలా? మీ అల్లుడు గారు అననా??.. చీ.. మరి చండాలం గా ఉంటుందేమో ..మెల్లగా మా ఆయన పేరు చెప్పాను..


అప్పుడు మొదలు పెట్టింది అందులో ఒక ఆమె ... నేను ముందే అనుకున్నా ఈ పిల్ల పడుతూ ,పరిగెడుతూ వస్తున్నపుడే ... నిన్నగాక మొన్న తాంబూళాలు అవ్వలేదు , అప్పుడే ఫోన్ నెంబర్లు వరకు వచ్చేసిందా !!!! అని మా వైపు చూసి అని ,మిగిలిన వాళ్ళతో మా రోజుల్లో అయితేనా పెళ్లి చూపులే ఉండేవే కావు.. నేను మీ బావగారిని పెళ్లి పీటలమీద చూడటమే ...అంది , మరొక ఆవిడ ఏమనుకుందో ,మన రోజులు వేరులేవదినా , అయినా తాంబూళాలు అయ్యాయి అంటే సగం పెళ్లి అయిపోయినట్లే కదా అని సర్దబోయింది.. ఏంటి సగం పెళ్లి అయిపోవడం ..మా ఊర్లో ఫలానా వాళ్ళ మనువరాలు ఇలాగే తాంబూళాలు అవ్వడం పాపం ఒకటే ఫోన్లు ,ఇక ఇకలు ,పక పకలు ...ఆడది నవ్వితే మగాడు ఊరుకుంటాడా ,వాడు మాట్లాడితే ఇంటికి వచ్చేయడం మొదలేట్టెసాడు ...వాళ్ళ అమ్మనాన్నకన్నా బుద్ది ఉండాలా ... వాడితో ఒకటే సినిమాలు ,షికార్లు.. హవ్వ చెప్పుకుంటే సిగ్గుగాని మొగుడూ పెళ్ళాల్లా తిరిగేసారు.. ఆ తరువాత ఇంకేముంది ఎవడో ఆకాశ రామన్న ఈ పిల్ల మంచిదికాదని లెటెర్ వేసాడంట ..సంబందం కేన్సిల్ చేసేసుకున్నారు.. ఆవిడ ఇంకా ఇంట్రెస్టింగ్ గా చెబుతుంది కాని నాకు గుండేల్లో గూడ్స్ బండి పరిగెట్టెయడం మొదలయింది మా నాన్నను చూసి ... నువ్వు బయటకు వెళ్ళూ అన్నారు నాన్న కాస్త సీరియస్సుగా ... ఇంటికొచ్చిన చుట్టాలను ఏమీ అనలేక నాన్న ఆ కోపం నా మీద చూపారని తెలుసు కానీ .. ఏంటో అవమానం క్రింద అనిపించింది.. అది కాస్త మా ఆయన మీద కోపం క్రింద మారింది ..అసలు ఈయనగారిని ఎవరు ఫోన్ చేయమన్నారు..కొద్దిరోజుల్లో పెళ్ళి అయిపోతుంది కదా ... అని అర్దంపర్దం లేకుండా కాసేపు తిట్టుకున్నాను గాని ఆయన చేసింది తప్పుకాదని తెలుసు.. అలా కోపం కాస్త జాలి క్రింద ఆ తరువాత నాకోసం ఒక అబ్బాయి ఫోన్ చేసాడన్న అదొక సరదా ఫీలింగ్ క్రింద అనిపించింది ...


ఆ మరుసటి రోజు మద్యాహ్నం అమ్మ పక్కకు పిలిచింది.. కొంచం తడబడుతూ, మోహమాట పడుతూ ఆ అబ్బాయి ఫోన్ చేసాడంట కదమ్మా..అంది. ఊ ..అన్నాను.. మన ఇంటి సంగతి తెలిసిందే కదమ్మా ...పాడు జనాలు..కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు ... పెళ్ళి ఇంట్లో అపశకునాలు మాట్లాడుతారు..వయసొచ్చిందే గాని బుద్దిలేదు ... ఉమ్మడిలో ఎందుకమ్మా నలుగురి నోట్లో పడటం ... నలుగురితో పాటు నారాయణ ...కాస్త పెళ్ళి అయ్యేంతవరకూ ఎవరి కళ్ళలో పడకు ..దిష్టికళ్ళు .. నేను చెప్పింది అర్దం అయ్యిందా .. నాన్న చెప్పమన్నారు అని వెళ్ళిపోయింది..


ఎంత ఉక్రోషం వచ్చిందంటే ఆ అబ్బాయితో ఇంక మాట్లాడకు అని ఎంత చక్కగా చెప్పింది.. అక్కడికి నేనే ఫోన్ చేసినట్లు ...ఆ అబ్బాయితో మాట్లాడలేక ఉండలేక పోతున్నట్లు ..అందరూ నన్నే అంటారేంటి ..అయినా ఈ రోజుల్లో పెళ్ళి చూపుల్లో మాట్లాడకుండా,ఫోన్ లు చెయకుండా ఎవరన్నా ఉంటారా.. మొదటి సారిగా ఉమ్మడి కుటుంభలో పుట్టినందుకు కోపం వచ్చింది ...చీమ చిటుక్కుమన్నా ఇంటిల్లిపాదికీ తెలిసిపోతుంది ..అని తిట్టుకుంటుంటే అప్పుడు గుర్తు వచ్చింది రేపు ఇదే టైముకు కాల్ చేయనా అని అనగానే ,చిలకలా ఊ అనడం .... మరి ఇప్పుడెలా.. ఇంతలా చెప్పిన తరువాత కూడా మాట్లాడితే బాగుంటుందా ... కాసేపు ఏం చేయాలో తోచలేదు ...ఆ తరువాత వచ్చింది అయిడియా ... బయట S.T.D నుండి చేస్తే...ఇంట్లో బాగా జనాలు ఉన్నారు ,నేనే తరువాత చేస్తా అని ఏదో నచ్చ చెప్పితే, ఆ తరువాత సంగతి తరువాత.. అనుకుని ఆయన ఇచ్చిన ఫోన్ నెంబర్ ఎలాగో అలా వెదికి, ప్రెండ్ ఇంటికి వెళతాను అన్నాను .. ఎందుకూ అమ్మ,అమ్మమ్మ ఒకేసారి అడిగారు .. పెళ్ళికుదిరింది కదా శుభలేఖలు ఇచ్చే టైము లేదు, మిగిలిన వాళ్ళకు ఎలాగూ పెళ్ళిళ్ళు అయిపోయాయి ,మిగిలిన ఒకరిద్దరినన్నా పిలుద్దామని అన్నాను... అయ్య బాబోయ్ విఘ్నేశ్వర బియ్యం కట్టిన ఇంట్లో పెళ్ళి కూతురు పసుపు కాళ్ళతో బయటకు వెళ్ళడమే .. ఏమనుకుంటున్నావ్..ఇంకేమన్నా ఉందా ..మా అమ్మమ్మ మొదలెట్టేసింది .. ఏంటమ్మా .. ఇంక ఫ్రెండ్స్ ని కూడా పిలుచుకోవద్దా .. ఇన్ని రూల్స్ ఏంటీ ..నేను వెళతాను విసుగ్గా అన్నాను..ఇంక నాకు ,మా అమ్మమ్మకు చిన్న పాటి యుద్దం మొదలైంది.. చివరకు అమ్మ ...కాస్త చదవాగానే పెద్దదానివి అయిపోయావనుకున్నావా ... పెద్దవాళ్ళను అలా ఎదిరించచ్చా ... ప్రతిదానికీ గారం చేస్తుంటే ఇలాగే ఉంటుంది చెప్పింది విను కావాలంటే ఫోన్ చేయి మీ ఫ్రెండ్స్ కి..అసలే ఈ రోజు లక్ష్మి పూజ ..నీ చేత చేయిస్తున్నా ...పెళ్ళి అంటే ఏమనుకున్నావ్..నాన్నకు చెబుతా మరి..అని వెళ్ళిపోయింది ...


ఇంకేం చేయలేక ఇంట్లో ఉండిపోయా ...రాత్రి అవుతుంది గాని ఎంత టెన్షన్ అనిపించిందో .. ఆ అబ్బాయి ఫొన్ చేయడం మర్చిపొతే బాగుండును ఈ రోజు ,మా ఫోన్ పాడైపోతే బాగుండును ఇలా పిచ్చ ఆలోచనలు..రాత్రి పూజలో కూర్చున్నా గాని అతి చిన్న శబ్ధం కూడా భయంకరంగా వినిపించింది నాకు ... దేవుడా దేవుడా ఫోన్ రాకుండా చూడు స్వామి అనుకున్నంతలో ట్రింగ్ ట్రింగ్ మంటు ఫోన్ రానే వచ్చింది ... నీరసం వచ్చేసింది నాకు .. మా తమ్ముడు.... అక్కా!!!, బావ గారు నీకు కాల్ చేసారు ,రమ్మంటున్నారు అని ఇంత నోరు వేసుకుని అరిచాడు ఆ రూం నుండి.. నేను ఎవరి వైపూ చూడకుండా తల వంచుకు కూర్చున్నా..అందరూ నా వైపే చూస్తున్నారని తెలుసు ... మా నాన్న ఫోన్ తీసారు ..ఆ... బాబూ అమ్మాయి పూజలో ఉంది మద్యలో లేవకూడదు .. అమ్మ ఎలా ఉంది ,మీ నాన్న గారు బాగున్నారా నాన్న మాటలు చిన్న గా వినబడుతున్నాయి ..తల వంచుకున్నా గానీ ఏదో చెప్పలేని బాధ ... ఏమని అనుకున్నాడో.. కాబోయే భార్య తో ఎవరు మాట్లాడాలని అనుకోరు..మరీ ఇంత పంతం ఏంటీ మా వాళ్ళకు .. నిన్న కూడా ఊ ,ఉహు తప్ప ఇంకేం మాట్లాడలేదు ...ఏం ఫీల్ అయ్యాడో.. ఇంకోసారి ఫోన్ చేస్తాడా బుద్దున్నవాడెవడైనా .. ఇంక అంతే ఈ ఇంట్లో .. వీళ్ళ గోల తప్ప ఎదుటివాళ్ళ గోల వినిపించుకోరు.. ఎప్పుడో వాళ్ళ చిన్నప్పటి రోజులకీ ఇప్పటి రోజులకీ ముడేసుకుని కూర్చుంటారు అంతే .. అతనికి ఇక్కడి పరిస్థితి అర్దం కాదు.. దీనికి బాగా పొగరు,పోజు .. మరీ స్టైల్ కొడుతుంది అనేసుకుని ఉంటాడు.. మనసంతా భారం గా అయిపోయింది ... అది అతనిమీద జాలో ,లేక నన్ను అపార్దం చేసుకున్నాడేమో అన్న దిగులో,మా వాళ్ళ పై కోపమో ఏంటో నాకే అర్ధం కాలేదు..


మరుసటి రోజు ఇంట్లో అందరూ పెళ్ళిమాటలు మాట్లాడుతుండగా మెల్లిగా ఫోన్ దగ్గరకు వచ్చాను.. చేయనా ,వద్దా..ఎలా మాట్లాడాలి అనుకుంటూ..ఫోన్ అప్పట్లో మద్య గదిలో ఉండేది ఎవరు ఎటు తిరిగినా ఆ గదిలో నుండే వస్తారు కాబట్టి ఏం చేయాలో తోచలేదు ...ఇంతలో హఠాత్తుగా మళ్ళీ ఫొన్ రింగ్ అయింది, మొదటి రింగ్ కే హెల్లో అన్నాను పక్కనే ఉన్నాను కాబట్టి ... ఏంటి ఫోన్ పక్కనే ఉన్నావా అన్నారు .. ఎవరూ అన్నాను ఎవరో అర్దం కాక ... నువ్వేనా అన్నారు నా పేరు చెప్పి.. అవును అనగానే హమ్మయ్యా కంగారు పెట్టెసావ్ కదా గొంతు గుర్తుపట్టలేదా అన్నారు నవ్వుతూ తన పేరు చెప్పి.. ఒక్క రోజుకే ఎలా గుర్తు పట్టెస్తాను ..నాకు కనీసం ఒక 3 నెలలు పడుతుంది ... ఈ విషయం లో గ్రేటే మీరు అన్నాను.. ఇంకా నయం సంవత్సరం అనలేదు అని నిన్న మాట్లాడలేదే అన్నారు.. అది..పూజలో ఉన్నాను మద్యలో లేవకూడదనీ అని నసిగాను.. ఒక పక్క నుండి భయం ఎవరన్నా చూస్తున్నారేమో అని ..హూం నిన్న ఏం చేసానో తెలుసా ,నా ఫ్రెండ్ వాళ్ళ పాపతో దీపావళి టపాసులు కాల్పిస్తూ నీకు ఫోన్ చేయాలన్న విషయం గుర్తువచ్చి మద్యలో వదిలేసి వచ్చేసా ..వాడు బాగా పెట్టాడు నాకు అన్నారు.. అయ్యో అవునా మరి అదేం పని అన్నాను ఈ లోపల అమ్మమ్మ(పిన్ని అమ్మ ) వచ్చింది ఎవరే అనుకుంటూ .. ఫ్రెండ్ అన్నాను .. తను మంచం మీద కూర్చుంది..ఏంటీ మీ ఫ్రెండ్ వచ్చిందా అన్నారు ... ఆ, వచ్చింది .. నేను తరువాత మాట్లాడతాను ,ఖాళీ ఉన్నపుడు నేనే కాల్ చేస్తా... ఉంటాను అన్నాను... హేయ్ ఆగు,ఏంటి తరవాతా మాట్లాడేది .. ఎన్నాళ్ళకు దొరికావ్ మాట్లాడడానికి ..మీ ఫ్రెండ్ ని తరువాత రమ్మని చెప్పు ... అన్నారు.. బాగోదు అన్నాను అమ్మమ్మకు అనుమానం రాకుండా చూసుకుంటూ.. బాగానే ఉంటుంది గాని చెప్పు ఇంకా అన్నారు.. ఇంటినిండా ఒకటే జనాలు .. మా అక్క పెళ్ళి కూడా ఇప్పుడే గా .. మాట్లాడడానికి కుదరడం లేదు అన్నాను హింట్ ఇస్తూ ..మా ఆయనది నాకన్నా మట్టి బుర్ర ..అవునా .. ఇంకా చెప్పు అన్నారు.. ఏమనాలో అర్దం కాలేదు ..సరే ఇంక ఉంటాను అన్నాను .. ఇందాక నుండి బాగానే మాట్లాడవుగా ..ఏమైంది..ఓహ్ ఫ్రెండ్ వచ్చిందన్నావుగా సరే రేపు కాల్ చేస్తాను ఈ టైం కి ఇక్కడే ఉండు .. అన్నారు వద్దు ..వద్దు అన్నాను కొంచెం కంగారుగా .. ఎందుకని అన్నారు.. నాకెక్కడ దొరికావయ్య మహానుభావా అనుకుని కొంచెం పని ఉంది అన్నాను ..సరే అయితే పని అయ్యాకా నువ్వే కాల్ చేయి లేదా నేనే కాల్ చేస్తా అన్నారు..వద్దు కుదిరితే చేస్తా అన్నాను ...తొక్కేం కాదు ..నువ్వు ఇలాగే అంటావ్ రేపు నేనే కాల్ చేస్తా .. మీ ఫ్రెండ్స్ ఎవరినీ ఇంటికి రావద్దని చెప్పు అని పెట్టేసారు... మళ్ళీ రేపు ఫోన్ కోసం టెన్షన్ పడాలీ.. ఏంటే బాబు నీకీ కష్టాలు నామీద నేనే బోలెడు జాలి పడ్డాను ...


ఆ రోజునుండి మొదలైనాయి నా పాట్లు.. అటు తనకి చెప్పలేక, ఇటు మాట్లాడలేక.. ఒక వేళ చెప్పినా తనకి అర్దం కాదు ..మా అక్కా వాళ్ళింట్లో ఫోన్ అది పడుకునే రూం లోనే ఉంటుంది కాబట్టి దానికా ప్రోబ్లెం లేదు...నాకా వీలు లేదే ...


మెల్లిగా నేను తనమాటలకు అలవాటు పడటం మొదలు పెట్టాను.. ఎక్కడ ఫోన్ వస్తుందో అని భయం ప్లేస్ లో ఈ రోజింకా ఫోన్ చేయలేదేంటి అని నాకు తెలియకుండానే ఎదురు చూడటం మొదలైంది ...ఈ లోపల మా అక్క వచ్చింది.. అదెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న నేను రాగానే దాన్ని మేడ మీదకు తీసుకువెళ్ళి నా బాధలన్నీ ఇంకో రెండు కలగలిపి మరీ చెప్పాను.. అది వెంటనే ముందు నాకు చీవాట్లు వేసేసింది.. బుద్ది ఉందా నీకు ,వాళ్ళేదో అంటే దిక్కుమాలిన మొహమాటం ఒకటి వేసుకుని అతనితో మాట్లాడటం మానేస్తావా ... మంచాడు కాబట్టి మళ్ళీ, మళ్ళీ పిలిచి మాట్లాడాడు లేక పోతే దీనికి ఈ పెళ్ళి ఇష్టం లేదనుకునేవాడు.. అయినా ఇప్పుడు మాట్లాడితేనే కదా మీ ఇద్దరికీ మద్య ఫ్రెండ్షిప్ కుదిరేది ..దేనికి పనికొస్తావే తినడానికి తప్ప.. అని దులిపేసింది..ఇది మరీ బాగుందే అందరూ నన్ను అనేవాళ్ళే అన్నాను ... ఏడ్చావ్ ఏవరేమంటారు నేనూ చూస్తా.. నాన్నకి నేను చెప్తాలే .. నన్నూ ఇలాగే... మీ బావతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా పెళ్ళి చెసేసారు.. అది సరే గాని నువ్వు అన్నా బయటకు వెళ్ళి ఫ్రీగా మాట్లాడచ్చు కదా అంది..జరిగిన ఆ ముచ్చట కూడా చెప్పాను .. ఏమనుకుంటాడే ఇదెంత పీనాసో అని అనుకునే ఉంటాడు అంది.. అలా అనలేదు కాని నువ్వు కాల్ చేయచ్చు కదా మీ ఇంట్లో అంత ఫ్రీగా లేకపోతే అన్నాడు రెండు సార్లు ..పైగా ఎల్లుండి అక్క పెళ్ళి కదా రేపు పెళ్ళి కూతురిని చేయడం అదీ ఉంటుంది కదా అందుకే కాల్ చేయద్దని మరీ,మరీ చెప్పాను అన్నాను...హూం ..సరేలే ఈ రోజు బయటకు నాతో రా శుభలేఖలు పంచడం తో పాటు ఫోన్ కూడా చేద్దువు గాని అని ఇంట్లో వాళ్ళతో గొడవ పడి మరీ నన్ను బయటకు తీసుకు వెళ్ళింది ..


పస్ట్ టైం భయం లేకుండా మా ఆయనతో మాట్లాడే చాన్స్ వచ్చేసింది నాకు ... ఏంటో నెంబర్ డైల్ చేస్తుంటే చాలా హుషార్ అనిపించింది.. అటునుండి హలో అని వినబడగానే హాయ్ ఎలా ఉన్నారు అన్నాను ..ఏవరూ అటునుండి ప్రశ్న.. చ్చా.. గొంతువినంగానే గుర్తుపట్టేసే మేధావులు కదా చెప్పుకోండి చూద్దాం అన్నాను..ఏమో అండి మీకు తెలుసా నేను అటునుండి ప్రశ్న .. మీరు కేవలం గొంతు మాత్రమే గుర్తుపట్టి మాట్లాడతారు..నేను శ్వాస విని కూడా గుర్తుపట్టేస్తా.. నాకు హుషారులో మాటలు వరదలా వచ్చేస్తున్నాయి ..మీ పేరేంటండి మళ్ళీ ప్రశ్న.. హూం ఈ మనిషికసలు కొంచెం కూడా సరదా లేదు గెస్ చేయడానికి అని కాస్త తిట్టుకుని నేనూ అని నా పేరు చెప్పాను.. ఒహ్ మీరా అండి, మావాడు ఇప్పుడే బయటకు వెళ్ళాడు ...ఇప్పుడే వచ్చేస్తాడు ..మీరు కాల్ చేసారని రాగానే చెప్తాను ...సారీ అండి మీరనుకోలేదు ఆయన ఫ్రెండ్ కంగారు పడిపోతున్నాడు ..నేను ఎప్పుడు ఫోన్ పెట్టేసానో నాకే తెలియదు.. కాసేపు అయోమయం గా అనిపించింది .. ఏం మాట్లాడాను పది సార్లు గుర్తు తెచ్చుకున్నాను.. తను అనుకుని ఎక్కువతక్కువ వాగలేదు కదా.. చాలా సిగ్గుగా అనిపించింది.. ఎవరూ అని కనుక్కోకుండా ఎందుకొచ్చిన బేషజాలు నాకు ..ఇలాగే కావాలి నాకు ..అసలు బుద్దిలేదు అని నన్ను నేను తిట్టుకుంటూనే ఉన్నాను.. ఏమనుకున్నాడో ..ఆ అబ్బాయి తనకి ఏమని వర్ణించి చెప్పాడో ...జోకులేసుకుంటున్నారేమో ...వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్పేసాడేమో అతను.. మిగిలిన వాళ్ళు నవ్వుతుంటే ఇతనికి చిన్నతనం గా అనిపించిందేమో ...ఇలాంటి ఏమోలతో చాలా చాలా అనుకుని ఇంటికొచ్చేసాను.. యెహే పో ఎక్కువ ఆలోచించక ఒక్కోసారి అలా అవుతుంది అని అక్క తిడుతున్నా వినదే నా మనసు..


మొదటి సారి తన ఫోన్ కోసం నిమిషం నిమిషం ఎదురు చూసాను.. నేను ఫోన్ చేసాను అని తెలియగానే తప్పకుండా ఫోన్ చేయాలి కదా.. ఇంకా ఎందుకు చేయలేదు ఒక పక్క ఉక్రోషం ....మరొక పక్క కోపం.. నిద్ర రాదు.. ఆకలి వేయదు.. ఏడుపు వస్తుంది తప్ప... మరుసటి రోజు కూడా ఎదురుచూస్తునే ఉన్నాను ...ఫోన్ చేస్తారని.. నాకు నేనే చేయాలంటే భయం వేసింది ... ఎక్కడో ....నేను ఫోన్ చేసానని తెలిసినా తను పట్టించుకోలేదన్న వళ్ళుమంట కొంచెం ... ఆ రోజంతా అలాగే గడిచిపోయింది.. మరుసటి రోజు అక్క పెళ్ళిలో అందరు కిల కిలా..కల కలా తిరుగుతున్నా నాకు మాత్రం ఎవరితో మాట్లాడ బుద్దివేయదు ..నవ్వబుద్ది వేయదు ... మనసంతా పిండేసినట్లు ఒకటే బాధ ... నేనూ కూడా పెళ్ళి పెద్దలా కూర్చున్నా కుర్చీలో ఒక్కదాన్నే విడిగా ... పెళ్ళివాళ్ళు వచ్చేసారు అన్నమాట వినగానే హడావుడి మొదలైంది .... అప్పుడు గుర్తు వచ్చింది తను మాటి మాటికీ అనే వారు మీ అక్క పెళ్ళికి వస్తాను.. పెళ్ళి కొడుకు తరుపు నుండి.. తను కూడా మా వూరే కదా.. మాకు తెలిసిన వాళ్ళే ..అని ఏడిపించే వారు ..నేను వద్దని బ్రతిమాలేదాన్ని ..ఒక వేళ
నన్ను సర్ ప్రైజ్ చేయాలని నిజంగానే వచ్చేసాడేమో ...అందుకే ఫోన్ చేయలేదేమో ...ఆ ఆలోచన రావడం పాపం పెళ్ళి పందిరి అంతా రంగుల రాట్నంలా తిరుగుతునే ఉన్నాను...ఎక్కడో ఆశ వచ్చారని.. పెళ్ళి అయిపోయి ఇంటికి వచ్చేసాం గాని తను కనబడలేదు..


మరుసటి రోజు డల్ గా కూర్చున్నా ... కొత్త ఆలోచనలేం రాక నా మెదడు కాసేపు నిశ్శబ్ధంగా ఉంది.. మా ఇంట్లో వాళ్ళందరూ అమ్మానాన్నల మీద బెంగనేమో అనుకుని అంతకుముందే బోలెడు ధైర్యం చెప్పారు..మా నాన్న నా చిన్నప్పటినుండి వాడుతున్న బజాజ్ స్కూటర్ మీద కూర్చుని ఆలోచిస్తున్నాను.. ఎప్పటి నుండో ప్రేమగా చూసుకున్న వారినందరినీ వదిలి వెళుతున్నందుకు బాధ పడకుండా నిన్నగాక మొన్న వచ్చిన అతని గురించి అలా ఎదురుచూడటం నామీద నాకే కోపం వచ్చేస్తుంది ... సరిగ్గా అప్పుడు ఎవరో తలుపు తీసుకు వచ్చి, నా పేరు చెప్పి మీరేనా అండి అన్నారు..నేనే అన్నాను ఎవరూ అని చూస్తూ ..మీకు కొరియర్ అని ఒక పేకెట్ ఇచ్చారు..నేను అది ఓపెన్ చేస్తుండగానే అక్కకు బావగారు కొరియర్ పంపారూ అని మా పిన్ని కొడుకు లాక్కుని ఒకటె పరుగు ...మొదటి సారి పీ .టి ఉషలా పరిగెట్టి అందరిమీదా ఇష్టం వచ్చినట్లు అరిచేసి దాన్ని పట్టుకుని రూంలోకి పోయి తలుపు వేసుకుని ఓపెన్ చేస్తె మావారు నాకు మొదటి సారి పంపిన కానుక ముదురు ఆరెంజ్ కలర్ చీర ... చిన్న లెటెర్ ..అది అందుకున్న తరువాత ,చదివిన తరువాత మనసులో భారం అంతా తీరిపోయినట్లు వెక్కి వెక్కి ఏడ్చాను... అలా నేనూ ప్రేమించాను ... ప్రతి ప్రేమికులూ అనుభవించే ఆనందాన్ని, బాధను అనుభవించాను ఆ చీర ఇప్పటికీ నా దగ్గరే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా ... ఆ తరువాతా ఆయన నాకు ఎన్నికొన్నా దాని స్థానం దానిదే ...