11, జూన్ 2010, శుక్రవారం

నేనూ-నా సాహసాలు

చేతులకి గోరింటాకు పెట్టేసుకో అన్నంత ఈజీగా మావారు బ్యాంక్ కు వెళ్లి లెటర్ తెచ్చేసేయి అని చెప్పేసి హాయిగా పడుకున్నారు గాని నాకు ఒకటే భయం,ఆలోచనలు.. అక్కడకు ఎలా వెళ్ళాలి?.. సరే, ఏదో రకంగా వెళ్ళినా ఎలా మాట్లాడాలి? ఏమని మాట్లాడాలి?..నాతో ఒక్క మాట మాట్లాడని సందీప్ గాడిని చూస్తేనే భయం తో త..త్త...త్త, మ..మ్మ..మ్మా అంటున్నా కదా ..ఇంక ఆ జెట్ స్పీడ్ పిల్ల తో ఎలా మాట్లాడాలి??.. పైగా బ్యాంక్ అంటే బోలెడు మంది ఉంటారు..గ్రామర్ తప్పులు మాట్లాడితే అందరూ కోవై సరళను చూసినట్లు చూసి నవ్వుతారేమో ...ఇటు చూస్తే ఈ మనిషి దగ్గర సామ ,దాన ,బేధ ,దండో పాయాలు ఏవీ పని చేసేలా లేవు.. హే భగవాన్ ఏమిటినాకు ఈ పరీక్ష??అని పరి పరి విధంబుల బాధపడిన పిమ్మట ఇక వెళ్ళాలనే నిర్ణయించుకున్నాను..

ఆ వెంటనే ఆయన్ని లేపేసి ..ఏమండీ ..ఇప్పుడూ.. బ్యాంక్ కు వెళ్ళామనుకోండి.. అక్కడ వాళ్ళను ఏమని అడగాలి అన్నాను ... ఆ.. కాఫీలు తాగారా ..ప్రొద్దున మీ ఇంట్లో ఏం టిఫిన్ వండారు అని అడుగు అని దుప్పటి ముసుగేసారు .. అబ్బా చెప్పండి ..లేక పొతే నేను వెళ్ళను అన్నాను బాసింపట్టు వేసుకు కూర్చుని ..అబ్బా..నాకెక్కడ దొరికావే..నిద్ర పోనివ్వవు ..ఇందాక చెప్పాను గా ... అదే ..మీ బ్యాంక్ నుండి నిన్న ఎవరో అమ్మాయి నాకు ఫోన్ చేసింది.. ఏదో లెటర్ పంపారట ...మా వారి మాటలకు అడ్డు తగులుతూ .. ఉహు ..హు .. ఇంగ్లీష్ లో చెప్పండి అన్నాను శ్రద్దగా వింటూ ... సరే ..వన్ ఆఫ్ యువర్ బ్యాంక్ పీపుల్ కాల్డ్ మీ ఎస్టర్ డే ....................మావారు చెప్తుంటే జాగ్రత్త గా వినడం మొదలు పెట్టాను.. అయిపోగానే అహ..హా ఇందాక సరిగ్గా వినలా ..ఇంకోసారి చెప్పండి అని ఓసారి..ముచ్చటగా మూడో సారి ..ఇదే ఇదే లాస్ట్ సారి అని బోలెడు తిట్ల మధ్య ఆయన చెప్పింది జాగ్రత్త గా విని ఆ రాత్రంతా నిద్రలో కూడా 'వన్ ఆఫ్ యువర్ బ్యాంక్ పీపుల్ '.. 'వన్ ఆఫ్ యువర్'.. అంటూనే నిద్ర పోయా..

ప్రొద్దున లేవగానే ఆఖరి ప్రయత్నంగా గార ,నయగారాలు చూపబోయాను కాని అక్కడున్నది ఎవరూ.. మా ఆయన .. నోరుమూసుకుని తీసుకురా అని ఆఫీస్కి వెళ్ళిపోయారు.. చేసేదేమీ లేకా దేవుడా నువ్వే దిక్కు అని తయారయ్యి పేపర్ మీద మా ఇంటి అడ్రెస్సు, బయట తప్పి పొతే కాల్ చేయడానికి చిల్లర నాణాలు గట్రా గట్రా సరంజామాతో బయటకు వచ్చాను.. పట్టపురాణికి మల్లే నా ఏకాంత మందిరాన్ని వదిలి బయటకు రాని నేను అలా వేళగాని వేళలో ఒక్కదాన్నే బయటకు వెళుతుంటే మా ఇంటి ఓనరు ,సందీప్ గాడు దెబ్బకి షాక్ ... ఎక్కడికి? అంది మా ఓనర్ ...నాకు కొంచెం ఆనందం వేసేసింది ...బ్యాంక్ కి వెళుతున్నా అన్నాను స్టైల్ గా ... ఒక్కదానివేనా? దారి తెలుసా అంది ఆక్చర్యంగా ... ఓ ..యా ... అది పెద్ద విషయం కాదు .. MRT లో టాన్జుంగ్ పాగార్ వెళ్లి ,కేపిటల్ టవర్ మీదుగా స్ట్రైట్ గా వెళ్ళడమే..సింపుల్ ... ఫోజుగా అంటూ క్రీగంట వాళ్ళను చూస్తూనే టకటక బయటకు వచ్చేసి లిఫ్ట్ అద్దం లో నా మొహం చూసుకుని ఛీ..ధూ నీకిది అవసరం అంటావా .... అని సత్కరించుకున్నా..

బయటకు వచ్చానే గాని ఎలా వెళ్ళాలి ? దేవుడా..దేవుడా.. అని అలా నడవడం మొదలు పెట్టాను.... తెలియదు తెలియదు అనుకుంటున్నా గాని రోజూ అటే వెళుతుండటం వల్ల బాగానే దారి తెలిసినట్లు అనిపించింది ...మెల్లిగా రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చేసా ..బయట చిన్న చిన్న పిల్లలు చారిటీ ఇవ్వమని డిబ్బీలు చూపుతున్నారు.. డబ్బులు వేస్తే ఒక స్టిక్కర్ ఇస్తున్నారు ..అంటే ఇంకెవ్వరు చారిటి అడగరు అది అంటిన్చుకుంటే... ఇక్కడ స్కూల్ పిల్లలు ఇటువంటి కార్యక్రమాలకు చురుకుగా పాల్గొంటారు .. లోపలికి వెళ్ళగానే ఎదురుగా సిగరెట్టు కాల్చడం ,ఆహారం తినడం , డురియన్ అనే ఫ్రూట్ తీసుకువెళ్ళడం గాని చేస్తే జరిమానా అని బోర్డ్ ఉంది ... అవన్నీ నాదగ్గర ఉన్నాయేమో అని చెక్ చేసుకున్నా ..లేవు..

అన్నట్టు డురియన్ ఫ్రూట్ అనగానే చిన్న విషయం గుర్తొచ్చింది ..మన పనస పండులా ఉండే దీన్ని సింగ పురియన్స్ ఎంత ఇష్టపడతారో ,ఇండియన్స్ అంత దూరం పారి పోతారు ..ఎందుకంటే దీని స్మెల్ చూడగానే వికారం,తలనెప్పి వచ్చేస్తుంది అట ...నేనసలే ఎలాంటి దాన్ని అంటే బెంజి కారు ఎక్కించినా వేక్...వేక్ మని డోక్కుంటా... 'కేబ్ ' ఎక్కే విషయం లో నాకు ,మా ఆయనకు కాంతారావు కత్తి యుద్దమే.. ఇదంతా విని నేను ఆ పండు చూడగానే కెవ్వున అరిచి పారిపోతాననుకున్నారా ..హి హి హి అక్కడే డురియన్ పైన కాలు వేసారు ..నాకు ఆ పండు అంటే మహా ఇష్టం .. అదేంటో మావారు బాబోయ్ ,అమ్మోయ్ అని కర్చీఫ్ ముక్కు కు అడ్డం పెట్టుకుని తెగ కష్ట పడిపోతుంటారా ..నేనేమో ఎంచక్కా రెండు పేకేట్స్ కొనుక్కుని తింటూ మరీ ఇంటికొస్తా.. ఇదిగో అలా అసహ్యం గా చూస్తే నేను తరువాత కధ చెప్పనంతే ..


సరే స్టేషన్ కంట్రోల్ దగ్గర కార్డ్ పెట్టి తలుపులు తెరుచుకోగానే లోపలికి వెళ్ళాను... ట్రైన్ ఎక్కే ప్లేస్ దగ్గర అటు ,ఇటు మేప్ లు ఉన్నాయి ..'బూన్ లే' వైపు ఎక్కవలసిన ట్రైన్ ఎక్కాను గాని..కరెక్టేనా అనుకుని నెక్స్ట్ స్టాప్ 'తానామెరా' ఎనౌన్స్ చేసేవరకు భయం భయంగా విని హమ్మయా అనుకుని ఊపిరి పీల్చుకున్నా ...అప్పట్లో ఇండియన్స్ చాలా తక్కువ ఉండేవారు ..ఇప్పుడూ ఎటు చూసిన వారే అనుకోండి.. ఇక్కడి చైనా వాళ్ళు చిన్నపిల్లలగా ఉన్నపుడు ఎంత బాగుంటారో ...కాని అదేంటో పాపం పెద్ద అవ్వగానే చపాతికి కళ్ళు,ముక్కు అతికించినట్లు తప్పడిగా అయిపోతారు.. కాని తలవెంట్రుకల నుండి ,కాలి గోళ్ల వరకు ఎంత శ్రద్ద తీసుకుంటారో ...

అలా ట్రైన్ లో నుండి బయట కు త్రొంగి చూస్తుంటే భలే అనిపించింది.. ఈ దేశం మొత్తం ఎక్కడికి వెళ్ళినా ఒక్కలాగే ఉంటుంది ... ఫలానా వూరు ఎక్కువ ,తక్కువ అని ఉండదు ... ఈ లోపల ఒక ముసలావిడ నా ఎదురుగా వచ్చి నించుంది.. ఇక్కడ రూల్ గుర్తు వచ్చి లేచి సీట్ ఇచ్చేసా.. నాకేంటో చాలా గొప్ప పని చేసేసా అన్న ఫీలింగ్ వచ్చేసింది ... ఈ లోపల బయట అంతా చీకటి పడిపోయింది ..అంటే అండర్ గ్రౌండ్ లో కోచ్చేసాం అన్నమాట ....మళ్లీ 'వన్ ఆఫ్ యువర్ బ్యాంక్ పీపుల్ ' అని పాఠం అప్పచేప్పుకున్నా కాసేపు ... నేను దిగవలసిన ప్లేస్ రాగానే దిగిపోయాను .. బయటకు రాగానే మావారు 'కేపిటల్ టవర్' ఎటో అడగమన్నారు కదా అని గుర్తు వచ్చింది ..మెల్లిగా అటు వెళుతున్న అబ్బాయిని 'కేపిటల్ టవర్ ' అన్నాను.. గో స్ట్రయిట్ అన్నాడు చిన్నగా నవ్వి ..

ఇక్కడ ఇంగ్లీష్ విషయం లో అనవసరంగా భయపడ్డాగాని నిజానికి సింగపూర్ లో వాడేది ఎక్కువగా సింగ్లీష్ ... ఇంగ్లీష్ భాషాభిమానులు ఎవరైనా ఉంటే ఈ పేరా వదిలేసి చదవండి..ఆనక తట్టుకోలేక కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే నాది పూచి కాదు ... సింగ్లీష్ అనేది పూర్తిగా నాలాంటి వాళ్ళకోసం ప్రత్యేక శ్రద్ద తో రాసినది.. ఇప్పుడు నువ్వు డిన్నర్ తిన్నావా ? అని అడగాలనుకోండి ..మన ఇంగ్లీష్ లో అసహ్యంగా 'డిడ్ యు హేవ్ యువర్ డిన్నర్' అని ఇంత గ్రామరేసుకుని అడుగుతామా.. అదే సింగ్లీష్ లో అయితే 'డిన్నర్ ఫినిషా ' అని సింపుల్గా అనేస్తాం అన్నమాటా.. అదొక్కటేనా' యు గో వేరా' ? 'ఈట్ ఎ రెడియా '? డూ వాట్ ఆ ? అబ్బో ఇలాంటివి చాలా ఉన్నాయి..గ్రామర్ గట్రాలు పీకి పడేసి చివర్లో 'ఆ'లు ... 'లా'లు పెట్టేస్తే సరిపోతుంది..మొత్తం సింగపూర్ అంతా 'కెన్'.'.కేనాట్ 'ల పై ఆధార పడి ఉంటుంది ..ఓ సారి మా తోడికోడలు ఏదో డ్రెస్ కొని 'ఈజ్ ఇట్ వాషబుల్' అంది .. పాపం పది సార్లు చెప్పినా వాడికి అర్ధం కావడం లేదు .. నన్ను పిలిచి విషయం చెప్పగానే 'వాషింగ్ కెన్నా' అన్నా అంతే కెన్ లా ,కెన్ లా అని ఆనందం గా చెప్పాడు.. పాపం ఇంత చక్కని భాషను వద్దు అని ఇక్కడి ప్రభుత్వం ఇంగ్లీషే మాట్లాడమని ప్రజలను వేపుకు తింటుంది ..హేమిటో


సరే అలా 'కేపిటల్ టవర్ ' మీదుగా వెళుతుంటే ఒక చోట బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డ్ కనబడింది ...అప్పటివరకు మర్చిపోయిన భయం మళ్లీ కౌగలించుకుంది ... లోపలికి వెళ్ళగానే చాలా మంది అనేక కౌంటర్ ల దగ్గర నిలబడి ఉన్నారు.. అక్కడే నించుని కాసేపు ధైర్యం చెప్పుకుంటుంటే ఒక ఆమె పిలిచి ఎస్ ,వాట్ కెన్ ఐ డూ ఫర్ యు మేడం అంది ... అంతే మళ్లీ మర్చిపోతానేమో అని రాత్రి నేర్చుకున్న పాఠం టక టక టక అప్పచెప్పేసాను.. మరి ఏమనిపించిందో ఆమెకు అర నిమిషం నావైపు చూస్తూనే ఉంది.. ఇంకేం అడక్కే బాబు అని దీనం గా చూసాను .. ప్రక్కనే ఉన్న లెటర్ తీసి నా చేతిలో పెట్టింది మారు మాట్లాడకుండా..దేవుడా ! గట్టిగా ఊపిరి పీల్చుకుని ఇంకో మాట మాట్లాడే అవకాశం ఆమెకు ఇవ్వకుండా బయటకు పరుగో పరుగు ...

తరువాత చేతిలో లెటర్ చూసుకుని ఒకటే ఆనందం...కళ్ళ లో నీళ్ళు వచ్చేసాయి ..చిన్నపుడు పెన్సిల్ ముక్క కొనాలన్నా నా ఫ్రెండ్ ని ముందు పెట్టి నువ్వు అడుగు, నువ్వు అడుగు అని వెనుక నిన్చునేదాన్ని ..అలాంటి నేనేంటి ?,ఇంత దూరం రావడం ఏమిటి,?ఇలా ఒక్కదాన్నే పని పూర్తి చేయడమేమిటి?? దారంతా నవ్వేసుకుంటూ ,ఎగురుకుంటూ స్టేషన్ కొచ్చేసాను.. అక్కడ ఫోన్ లు చూడగానే ..ప్రొద్దున నన్ను మావారు పెట్టిన నస గుర్తువచ్చి కోపం వచ్చేసింది ..అందుకే మా ఆయన్ని ఏడిపించాలనిపించింది .. ఏమండీ..నేను తప్పిపోయాను ..ఎక్కడున్నానో తెలియడం లేదు ... అని ఏడుస్తూ ఇంకో ముక్క మాట్లాడకుండా ఫోన్ కట్ చేసేసి ఒక పది నిమిషాల తరువాత కాల్ చేసి చెప్దాం అని ఫోన్ దగ్గరకు వెళ్లాను.. కానీ!! హుమ్..అసలే ఆఫీస్లో చాలా బిజీగా ఉంటున్నా అంటున్నారు ..ఇప్పుడు ఇలా చెపితే టెన్షన్ పడిపోతారేమో ..పాపం లే అనిపించి నిజం చెప్పేసా ...


అదేమరి ... ఇంత సున్నిత మనస్కులు అయితే ఎలా అండి... వెళ్లి కళ్ళు కడుక్కుని రండి ..ఇలాంటి త్యాగాలు నేను చాలానే చేసాను ...మళ్లీ వీలున్నపుడు చెప్తానే :)