21, ఏప్రిల్ 2009, మంగళవారం

కాల మహిమనేనూ,మా అక్క ఒకే ఇంట్లో పుట్టినప్పటికీ మా ఇద్దరికీ ఏ విషయం లోనూ ఒకే అభిప్రాయం ఉండేది కాదు,ముఖ్యం గా డబ్బు విషయం లో అస్సలు లేదు... నేను చిన్నప్పటి నుండి మహా పొదుపు ( అంటే మావాళ్ళు కాస్త వక్రీకరించి పిసినారి అనేవాళ్ళు గాని అది ముమ్మాటికీ పొదుపే అన్నమాట ,మీరు వాళ్ళలా అస్సలు అలా అనుకోకండి,సరేనా ) అలా పొదుపుగా ఉండడానికి ఒక కారణం ఉంది , అది ఏంటంటే నేను ఎప్పుడు మా అమ్మా, నాన్నలు మాట్లాడుకోవడం విన్నా ఆ సంభాషణ ఇలా ఉండేది..

అమ్మ: ఏమండీ ఈ నెల ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ కావాలి ఖర్చులకి,మా తమ్మూడి కూతురు ఫంక్షన్ ,ఏదో ఒకటి కొనాలి ..
నాన్న :మొన్న 3000 ఇచ్చాను కదా, అందులో ఏం మిగల లేదా??
అమ్మ: ఇంకేం 3000 బాబు.. ఎప్పుడో అయిపోయాయి మీ పిల్లలకు పండగలకు డ్రెస్సులు కొనద్దా ..పాపం వాళ్ళకు సంవత్సరానికి కొనేదే రెండు జతలు, మద్యలో పండగలకు పుట్టినరోజులకు కొనేదే ఉండదు ..
నాన్న: మరి అంతకు మొన్న 1000 ఇచ్చాను అది??
అమ్మ: ఇంకేం వెయ్యి మీ పెద్దమ్మ గారి అమ్మాయి ఇంటికి వస్తే వాళ్ళకు బట్టలు పెట్టాము కదా
నాన్న: మరి అంతకు ముందో వెయ్యి ఇచ్చాను కదా ... ( ఈ సారి అమ్మకు కోపం ఒక రేంజ్ లో వచ్చేది )అంటే నేనేమన్నా తినేస్తున్నానా అలా అడుగుతారు ,మొన్న ఫలానా వాళ్ళ పెళ్ళి కి చదివింపులు అందులోనుండే ఇచ్చాను, మొన్న చుట్టాల తాకిడికి విపరీతమైన ఖర్చు ,ఈ నెల గ్యాసు ఇట్టే అయిపోయింది పైగా చలికాలం వేడి నీళ్ళూ కూడా కాయాలి కదా ,మీకందరికీ ఎసర్లులా మరగకపోతే స్నానం చేసినట్లే ఉండదాయే... మీకేమో లుంగీలూ సరిపోవడం లేదని రెండు తీసుకున్నాను .. కనీసం నా కోసం ఒక్క చీరన్నా కొనుక్కున్నానా ,ఆ విషయం అసలు అడిగారా మీరూ.. అంతేలేండి మీ వాళ్ళు అంటే పరిగెట్టుకుని అడగక పోయినా సరే అన్నీ చూస్తారు ఏటొచ్చీ మా వాళ్ళేకదా పై వాళ్ళూ ,,అక్కడ మాత్రం బాగా లెక్కలు అడుగుతారు ..వాళ్ళు మీకు ఎంత చేసినా అంతే .. (ఇంక కళ్ళ నీళ్ళు జర జర వచ్చేసేవి )..
నాన్న: అయ్యబాబోయి ఇప్పుడేమన్నానే బాబు ఈ నెల ఖర్చు విపరీతం గా ఉంది అందుకే అన్నాను సరేలే ఇస్తాను .. ఏంటో ప్రతి నెలా ఖర్చు పెరుగుతుందే కాని తగ్గడం లేదు ..


ఈ టైపు లో ఇంచుమించుగా ఇదే మాట్లాడుకోవడం విని విని మా నాన్న మీద విపరీతమైన జాలి వచ్చేసేది..అయ్యో పాపం ఎన్ని కష్టాలో కదా పైగా ఇంత మంది ఆడపిల్లలం ..మా చదువులు ,పెళ్ళీళ్ళు ఎలా చేస్తారో అనే భయం వల్లో మరొకటో తెలియదు కాని డబ్బులు అస్సలు ఖర్చు చేసేదాన్ని కాదు .. ఇంటికి చుట్టాలొచ్చినా, ఎవరన్నా ఏదన్నా కొనుక్కోమని డబులిచ్చినా అస్సలు ఖర్చుపెట్టేదాన్ని కాదు ..మిగిలిన వాళ్ళు అయిస్ క్రీములూ అని డ్రింకులని కొన్నా నేను అహనాపెళ్ళంట కోటా లాగా చూసి ఆనందపడిపోయేదాన్ని ,పైగా మనం మున్సిపల్ స్కూల్ విధ్యార్ధినులం కాబట్టి పుస్తకాల విషయం లో కూడా ఖర్చు చెప్పేదాన్ని కాదు ...అక్క, చెల్లెళ్ళ పుస్తకాల్లో మిగిలిన పేపర్స్ చింపేసి బైండింగు చేసుకుని మరీ రాసేదాన్ని కాని నాన్నను డబ్బులు అడిగేదాన్ని కాదు ...ఇవన్నీ కాక నాకు మరొక గొప్ప సులక్షణం ఉంది ... నేను దాచిన డబ్బులు నాకోసం కొనుక్కోను ..పెళ్ళికి ముందు మా నాన్నకి పెళ్ళయ్యాక మా ఆయనకు ఎవరికో ఒకరికి ఇస్తానుగాని నాకోసం కొనుక్కోబుద్ది కాదు ..ఇదేం అలవాటో నాకు అర్దం కాదు ...కాకపోతే వాళ్ళు ఆ డబ్బులను సద్వినియోగం చేయాలన్నమాట ..మొన్న ఎంతో కష్టపడి కూరలకిచ్చిన డబ్బులను కొంత దాచి ఒక 600 $ మా ఆయనకిస్తే ఎంచక్కా రాత్రికి ఒక క్రికెట్ బేట్ ,బాల్స్ చెత్త చెదారం కొనేసి వచ్చేసారు.. దెబ్బకి కుక్కలా ఏడ్చాను అదివేరే విషయం అనుకోండి..


సరే డబ్బు విషయం లో నేను ఇలా ఉంటే మా అక్క నాకు పక్కా వ్యతిరేఖం ...ఈ రోజంటే చిరంజీవి ప్రేమే లక్ష్యం ,సేవే మార్గం అంటున్నాడు గాని అది ఒక పదిహేనేళ్ళ ముందే ఈ స్లోగన్ ని బట్టీపట్టేసింది ... వాళ్ళ స్కూల్ లో ఎప్పుడూ రెడ్ క్రాసు ,బ్లూక్రాసు అని ఏంటో ,ఏంటో తెగ ఉండేవి ..అందులోనూ ఇది లీడర్ ఒకటీ .. దీనిపని ఏంటంటే ఎప్పుడూ డబ్బులు వసూల్ చేయడం అవి వాటికి జమ చేయడం .. ప్రొద్దున లేస్తే.. నాన్నా దానికి చారిటి ఇవ్వండి, దీనికి డబ్బులు ఇవ్వండి అని ఒకటే గొడవ.. ఇంట్లో ఎక్కడన్నా డబ్బులు దొరికాయంటే చాలు ఎవరివి ,ఏంటి అని అడిగేది కాదు తీసుకువెళ్ళీ వాటికి ఇచ్చేసేది .. దీని బాధ పడలేక నా డబ్బులు పిల్లి ముప్పై మూడు ఇళ్ళల్లో తన పిల్లలని దాచినట్లు నేనూ అలా దాచుకోవలసి వచ్చేది .. అంతటితో ఆగేదా ,విపరీతమైన దాన ధర్మాలు.. అమ్మ ఒకసారి షాప్ కి వెళ్ళి ఏదో కొనుక్కు రావే అని డబ్బులిచ్చి పంపితే దారిలో అడుక్కుంటున్న ముసలావిడకు ఇచ్చేసి వచ్చేసింది.. ఇంటికెవరన్నా వచ్చి అడుక్కుంటే వాళ్ళకు అన్నం పెట్టీ పంపేవరకూ ఊరుకునేది కాదు ..ఒక సారి ఇలాగే మండుటెండలో ఒక సోది చెప్పే అమ్మాయి చిన్నపిల్లను వేసుకుని వెళుతుంటే ..ఆవిడకు చిన్న పిల్లను అలా కష్ట పెట్టద్దు అని దారంతా బుద్దులు చెప్పి ఇంటికి తీసుకొచ్చి మరీ అన్నం పెట్టి పంపింది ..ఆవిడ వెళీపోతూ వెళిపోతూ రెండు జతల చెప్పులను కూడా తీసుకు పోయింది అక్కడ పెట్టినవి..(అంటే ఆ అమ్మాయి వచ్చేటప్పటికి ఉన్న చెప్పులు వెళ్ళగానే మాయం అయిపోయాయి ..వేరే చాన్స్ లేదు ...ఒకవేళ ఆమే కాక పోతే పాపం శమించు గాక )


సరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే నాకు మరొక జలక్ ఇచ్చేది అడపాదడపా... రాత్రిళ్ళు పడుకునేటప్పుడు ఇలా చెప్పేది.. మెరుపు కలలు సినిమాలో కాజోల్ లాగా కన్నే మేరి మాతయో ఏదోనమ్మా అది అయిపోతాదట .. అలా అయిపోయి పేదలకు,దీనులకు సేవ చేస్తుందట..అందుకని ఆ సంవత్సరం కాంగానే బస్ ఎక్కి అక్కడెక్కడో ఏదో సేవాసదన్ ఉందిట అక్కడకు వెళ్ళి సేవ చేసి తరిస్తా అనేది ..ఇక చూస్కోండి నాకు అలా ఇలా భయం వేసేది కాదు .. అది కాదక్క సేవ ఇక్కడ నుండి కూడా చేయచ్చు కదే అంటే.. నన్ను పెద్ద అఙ్ఞానిని చూసినట్లు చూసి ఆగ్నస్ ఇలాగే అనుకుంటే మధర్ ధెరిసా అయిఉండేదా ..మంచిపనులు చేయాలంటే ఇంట్లో నుండి చేయలేం అని ఒక గంట క్లాసు పీకి అమ్మావాళ్ళకు ఇవేమి చెప్పద్దు వాళ్ళను నువ్వే చూసుకోవాలమ్మా అని రెండు పెద్ద పెద్ద డయిలాగులు చెప్పి ఎంచక్కా దున్నపోతు లా పడుకునేది.. ఇక నేను జాగారమే రోజూ ఇదెక్కడ వెళ్ళిపోతుందో అని రాత్రిళ్ళు పడుకునేదాన్ని కాదు ..పగలు పొద్దెక్కేవరకు లేవకుండా నానా తిట్లు తినేదాన్ని ....


మా అక్క అంటే మా ఇంట్లో అందరికీ మహా ఇష్టం ..నాన్నకు మరీనూ ...మీ అందరికన్న ముందు ఇదేరా నాన్న అని పిలిచింది అని తెగ మురిసిపోయేవారు.. అది ఆడింది ఆట ,పాడింది పాటలా ఉండేది.. పాపం ఆ పెద్ద కూతురు బిరుదువల్లే దాని చదువు మద్యలోనే అటక ఎక్కేసింది.. ఒక సారి మా తాతగారు (అమ్మ నాన్న) హడావుడిగా ఒక సంబంధం తీసుకు వచ్చారు .. అప్పుడే నా కూతురికి పెళ్ళి ఏంటి నేను చేయను అని మా నాన్న ... అదెలా కుదురుతుంది వెనకాలా ఇంకా ఉన్నారు.. మంచిది వచ్చినపుడు వదులుకోకూడదు ..అబ్బాయి కి బోలెడు ఆస్తి ,మంచి వ్యాపారం.. చదువు దేముంది .పిల్ల సంతొషం గా ఉండాలి గాని, మొన్న రెండోదాన్ని చూసే మా ఊర్లో నీకు ఇంత పెద్ద మనవరాలు ఉందా అని తెగ ఆక్చర్య పోయారు అని ఒకటే ఊదరకొట్టేసి పాపం మా నాన్నను హడలెత్తించేసారు.. ఇంకేంటి కట్ చేస్తే మా అక్క పెళ్ళీ ఘనం గా జరిగిపోయింది ...


మా ఇంట్లో అక్క పెళ్ళికి మేము పెట్టుకున్నంత బెంగ ఇంకే మిగిలిన ఆడపిల్లల మీద ఎవరూ పెట్టుకోలేదు... తాళి కడుతున్నపుడు ఇంక మీ ఇంటి ఆడపిల్ల వారి ఇంటి పిల్ల అయిపోయింది, ఇంటిపేరుతో సహా ఇక మీ ఇంటికి సంభందం తెగిపోయింది అని ఎవరో అనంగానే ...నాన్న బాధ ,మా బాధ వర్ణించలేము ... ఎన్ని రాత్రిళ్ళు పడుకోలేదో నేను అయితే ...అందరం ఒకే సమయాని అన్నం తినడం అలవాటేమో పొరపాటున దానికి కూడా అన్నం వడ్డించేసి కళ్ల నీళ్ళు పెట్టుకునే వాళ్ళం.. నాన్న సంగతి చెప్పనక్కరలేదు అంతా మీ నాన్న వల్లే .. నా కూతురిని నా నుండి వేరుచేసాడు అని అమ్మ మీద చూపించేసేవారు .. అందులోనూ అక్క వెళ్ళే ప్రతిసారి నాన్న!!అక్కడ ఎవ్వరూ నాకు తెలియదు.. ఉండలేకపోతున్నా ..నన్ను పంపకండి నాన్న ..చాలా దిగులేస్తుంది అనగానే.. పైకి.. అదేం లేదమ్మా ..అలవాటు అయిపోతుంది ..అమ్మ చూడు నీలాగే వచ్చేయలేదా అని సర్ది చెప్పి పంపి వెక్కి వెక్కి ఏడ్చెవారు .. పైగా అక్క కూడా చిన్నపిల్లఏమో అప్పటికి , దాని లెటెర్ అంతా నాన్న,నాన్న ఎప్పుడొస్తావ్ నన్ను మన ఇంటికి ఎప్పుడు తీసుకువెళతావ్ అని చాలా దిగాలుగా రాసేది ...


అయితే తరువాత తరువాతా మెల్లిగా అక్కడిపరిస్థితులు అలవాటు పడినా దాని మాటల్లో చెప్పినపుడు చాల బాధ అనిపించేది.. మా అక్క అత్తవారింట్లో మహా పొదుపు.. మహా అంటే మహా అన్నమాట :) ఇక్కడ అమ్మగారు పిల్టర్ నీళ్ళు తప్ప వేరే నీళ్ళతో మొహం కూడా కడిగేది కాదు ..అక్కడ తాగేది కూడా ఆకులు అలములూ పడిపోయి ఉన్న బావి నీళ్ళాయే .. అప్పటివరకూ డ్రెస్సులలో చిన్నపిల్లలా అటు ఇటు తిరిగే పిల్ల ఒక్క సారిగా బారెడు బారెడు చీరలు కట్టుకుని ఆరిందలా కుటుంభ బాధ్యతలు అన్నీ దానివే అయిపోయినట్లు వచ్చేవారికి ,వెళ్ళేవారికి మర్యాధలు పలకరింపులు ఇలా చాలా మార్పు వచ్చేసింది దానిలో ..


అయితే పెళ్ళి అయిన చాలానాళ్ళవరకు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు ... మొన్నామద్య పట్టుబట్టీ వాళ్ళీంటికి తీసుకు వెళ్ళింది ..వాళ్ళ ఇంటి ముందే షాప్ చేసి చాల చక్కగా టక టక మంటూ అటు పనులు, ఇటు షాప్ చక్కబెట్టుకుంటున్న అక్కను చూసి మా అక్కేనా అని ఆక్చర్యపొయాను .. ఇల్లు చక్కగా పొందికగా పెట్టుకుంది అన్నీ చూస్తూ అక్కడ కృష్ణుని మెడలో వేసిన ఇత్తడి పూసల లా ఉన్న హారం చూసి ఇదేంటే ఇలా వెలిసిపోయిన హారం వేసావ్ అన్నాను.. అది చూసి అడక్కేబాబు ఏడుపు వరదగొదావరిలా పొంగుకొస్తుంది దాన్ని చూస్తే అంది .. ఏం అంటే.. ఆ మద్య ఒక సోది అమ్మాయి వచ్చీ వద్దు మొర్రో అని అంటున్నా మొహమాట పెట్టేసి సోది చెప్పిందంట ,దాని సారం ఏంటంటే దీని ఇంటికి సిరి రాబోతుంది అంట ..కాని గ్రహబలం వల్ల ఇది వాటిని అందుకోలేకపోతుంది అంట అని ఏదో ఏదో చెప్పింది అంట ....అంతకు ముందు మా బావా ఏదో క్రికెట్ మేచ్ విషయం లో బెట్ కాయాబోతే ఎందుకులే మనకు అని ఇది బలవంతం గా ఆపేస్తే చాలా మొత్తంలో లాభం ఆగిపోయిందంట .. ఇలా రెండు,మూడు జరిగాయి అంట ... అయితే మా అక్క ఇదంతా సోదిలే యాదృచ్చికం అని కొట్టి పడేసి మర్చిపోయిందంట కాని ఆ రోజునుండి ఒకటే కలలు ఇంటినిండా బంగారం ,బంగారం ....నన్ను కాదనకు అని... ఇదేంటా ఇలా వస్తున్నాయి అని అనుకున్నాకా.. ఒక నొక ముహుర్తాన ఒక అతను వచ్చీ ఏమండీ మీవారు ఉన్నారా అని అడిగి బయటకు వెళ్ళారని తెలుసుకున్నాక తెగ బాధ పడి ..మా ఇంట్లో తరతరాల నుండి ఉన్న కొన్ని నగలున్నాయండి ...ప్రస్థుతానికి చాలా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాం ..కాబట్టి వాటిని అమ్మకానికి తీసుకు వచ్చాను ... బయట అమ్మజూపితే పురాతన నగలు కాబట్టి నన్ను అనుమానించే అవకాశం ఉంది అని ఇంకేంటో ఏంటో చెప్పి ఇది ఆకు రాయి దీని మీద గీటు పెడితే బంగారమో కాదో తెలిసిపోతుంది అని మా అప్పలమ్మకు మరి ఏ విధం గా చెప్పాడో తెలియదు మొత్తానికి నమ్మించేసేడు.. ఇది వాళ్ళయనకు పోన్ చేసి చెప్పిందంట .. అసలే మా బావ గారు ఇలాంటి విషయాల్లో చాలా ఆలోచిస్తారు.. వద్దు వద్దు అని చెప్పినా మా అక్కకి ఆ సోది ఆవిడ,కలలు , సూచనలు అన్ని గుర్తు వచ్చేసి ..అమ్మ బాబోయి మనం చాలా నష్ట పోతాం ఇది తీసుకోకపోతే,.. లేకపోతే విచిత్రం కాక పొతే ఇన్ని సూచనలా అని వినకుండా ఒక పదివేలు ఇచ్చి ఒక హారం తీసుకుంది అంట ..వాడు వెళ్ళేవరకూ చేతిలో తళ తళా మెరుస్తుంది అంటా అలా వెళ్ళగానే ఇంకేంటి ...అంతా విష్ణు మాయ అయిపోయింది ...


అంతా విని నేను నోరు వెళ్ళబెట్టి అలా ఉండిపోయాను..అక్కా నువ్వు నువ్వేనా... మూఢనమ్మకాలను ఖండ ఖండాలుగా ఖండించిపారేసే నువ్వా ఈ పని చేసింది .. డబ్బు కంటే సేవా,ప్రేమా,దయ ,కరుణ ,కారం,ఉప్పు,చింతపండు ముఖ్యమని క్లాసుపీకే నువ్వా ఈ పని చేసింది ,అని బోలెడు ఆక్చర్య పోతుంటే ... అలా మళ్ళీ మళ్ళీ గుర్తుచేయకే బాబు.. టైమే టైము ... ఇదే ఇంకొకరికి జరిగితే నీకంటే ఘాటుగా వాళ్ళను తిట్టిపడేసేదాన్నీ.. ఇలా ఎలా చేసారు అని తెగ ఆక్చర్యపడిపోయేదాన్ని ... ఇంకా నయం ఎప్పుడూ ఇంట్లో వ్యాపార పని మీద ఒక యాబై వేలు తక్కువ కాకుండ ఇంట్లో పెట్టేవారు ఆయన ..ఆ రోజు నా అదృష్టం.. తక్కువే ఉన్నాయి.. అమ్మో, మా ఇంటి ఎదురుగా ఉన్న గుడి అమ్మవార్లే కాపాడారు .. లేకపోతే అదెవరో నాకేదో చెప్పడమేమిటీ,నాకు కలలు రావడం ఏమిటీ ,నేను ముందు వెనుకలు ఆలోచించకపోవడం ఏమిటీ ...అయినా ఇంత స్వార్ధం నాకు ఎక్కడినుండి వచ్చిందో ..లేక వాడి మాటల గారడీనో ..మొత్తానికి ఇదీ కధ .. హుం అందుకే మళ్ళీ ఇలాంటి పనులు చేయకుండా ఎదురుగా పెట్టుకుని ఈ గొలుసు మరీ జాగ్రత్తగా ఉంటున్నా అంది...


కాలమహిమనా లేక పెళ్ళి తరువాత బాధ్యతల పేరుతో వచ్చే స్వార్ధమా మరేంటో కాని అలాంటి కన్‌ఫ్యూజ్ పరిస్థితి మాత్రం నాకు జరగకుండా చూడు స్వామి అని దణ్ణం పెట్టేసుకున్నా .. అసలే నేను పొదుపు మరి ...( మీరు వేరే అర్ధాలు తీయకండి మరి .. అది కేవలం పొదుపుమాత్రమే ..మీరు నమ్మాలి )

8, ఏప్రిల్ 2009, బుధవారం

కాలేజి ప్రేమలు ( రెండో భాగం)ఎప్పుడైతే వాడు నావైపుకు తిరిగాడో ఓరి దేవుడోయ్ అనుకుని నేను సువర్ణ వెనకాతలకు వెళ్ళిపోయాను ,వాడి ఫ్రెండ్స్ నా భయాన్ని చూడగానే హి.హి..హి అని ముప్పై ఆరు పళ్ళూ బయట పెట్టి నవ్వారు,మరీ ఎక్కువ నటించేయకు నువ్వు అని నన్ను అని మళ్ళీ దాన్నీ బ్రతిమాలడటం మొదలెట్టాడు..నాకు అంత ఉక్రోషం,కోపం లోనూ వాడు గబుక్కున గుర్తు వచ్చేసాడు..


వాడు బాబ్జీ గాడు ,నా 5వ తరగతిలో నా క్లాస్ మేట్ ,చిన్నపుడు తెల్లగా బూరె బుగ్గలేసుకుని క్లాసులో వెనుక బెంచీలో ఎవ్వరితో మాట్లాడకుండా ఒక బుక్ ముందేసుకుని ఒక్కడే కూర్చునేవాడు..వాడు నిజంగా చదువుతున్నాడో మరి కళ్ళు తెరిచే నిద్రపోయేవాడో తెలియదుగాని మా తెలుగు మేస్టారుకి మాత్రం మహా ఇష్టం వాడంటే ...ఎందుకో నాకూ తెలియదు.. వాడురా నిజమైన విధ్యార్ది అంటే ,నేటి బాలలే రేపటి పౌరులు ,వీడిలాంటి పౌరులే దేశానికి వెన్నుముక ,గాడిదగుడ్డు..కంకరపాసు అని రోజూ వాడిని పొగడకుండా ఉండేవారు కాదు,బాబ్జీ ఇల్లు మా ఇంటి దారిలోనే కాబట్టి తరచూ చూస్తునేదాన్ని ,తరువాత నేను స్కూల్ మారాకా మద్య మద్య లో కనబడేవాడు..మళ్ళీ ఇన్నాళ్ళకు ..మనిషి ఏ మాత్రం గుర్తుపట్టకుందా పొడవు ,లావు పైగా చేతులకు నాలుగు ఉంగరాలు, మెడలో గొలుసు ఒక హీరో హోండా ..ఎలాంటి బాబ్జీ ఎలా అయిపోయాడు.. ఇప్పుడు గనుక మా తెలుగు మాస్టారు చూస్తే ఏమయిపోయేవారో అనిపించింది ..


వీదిలో మా వాళ్ళేమైనా వస్తున్నారేమో అని అటు ఇటు చూస్తూ నడుస్తున్నా ...ఇదిగో గుర్తుంది కదా 29 ,బాగా గుర్తు పెట్టుకో నేను మాట మీద నిలబడే మనిషిని అని ఒకటికి రెండు సార్లు అని దాని చేతిలో లెటెర్ పెట్టి మరీ వెళ్ళిపోయాడు ,వాడు వెళ్ళాక హమ్మయ అని ఊపిరి పీల్చుకుని ఏమే వాడు బాబ్జీ గాడు కదా అన్నాను ..నీకెలా తెలుసు అంది .. వీడితోనె చదివి ఏడ్చానులే చిన్నపుడు,నీకెలా తెలుసు ఇంతకీ అన్నాను ..మాటల్లోనే వాళ్ళింటికొచ్చేసాం ..


నాకో ఫ్రెండు ఉందిలే లలిత అని ,దానికి వాసూ అని బోయ్ ఫ్రెండ్ ఉన్నాడు. వాడికి వీడు ఫ్రెండు ,అయితే మా ఇద్దరికీ ఇంకో ఫ్రెండు ఉంది ఆ అమ్మాయిని వీడి ఫ్రెండ్ ఏడిపిస్తుంటే నేను వాడితో గొడవపడ్డాను.. అప్పుడు వీడు వాడి వైపూ నేను ఆ అమ్మాయి వైపూ వెళ్ళి తిట్టుకున్నాం ..అప్పటి నుండి నా మీద కక్ష్య గట్టీ ఇలా ఏడిపిస్తున్నాడు అంది (ఇప్పుడు మీకు ఎంత అర్దం అయిందో నాకూ అంతే అర్దం అయింది అప్పుడు)నాకు చిరాకొచ్చింది ,అయినా నీకు పనీ పాట ఏమీ ఉండదా అందరి విషయాల్లోకి వెళతావ్ ,ఎవరు ఎవరిని ఏడిపిస్తే నీకేంటి,ఇప్పటికే నీ గురించి ఎంత బేడ్ గా చెపుతున్నారో తెలుసా ఈ అబ్బాయిలు బయట అన్నాను ..


అది నా వైపు కోపం గా చూసింది ,రేపు నిన్నెవరన్నా ఏదన్నా అంటే ..నేను నీకులా నాకెందుకు అని ఊరుకోను ,ఫ్రెండ్స్ అన్నాకా కాస్తా వేల్యూ ఇవ్వాలి ,అడ్డమైనోళ్ళకీ భయపడాల్సినపనిలేదు అంది... నాకు మనసులో గుచ్చుకుంది కొంచెం ..దొంగవెదవ యే ఫ్రెండ్ దగ్గరో బెట్ కాసి ఉంటాడు నన్ను పడేస్తానని అందుకని ఇలా చంపుతున్నాడు ,వాళ్ళ నాన్న సారా కాంట్రాక్టర్ లే ,అందుకే కొవ్వు పట్టి ఏడుస్తున్నాడు ,చూసావా పోలీసులన్నా లెక్క లేనట్లు ఎలా మాట్లాడుతున్నాడో అంది . ..ఏడ్చాడులే నిన్ను భయపెడదామని ..వంటి మీద ఆడపిల్లలా ఆ బంగారం చూసావా ..వీడు సామాన్యుడు కాదే బాబు ..అవి చూసి ప్రేమించేస్తారనుకున్నట్లున్నాడు .. . అన్నాను ,


ఈ లోపల అది లెటెర్ ఓపెన్ చేసింది మొత్తం అలికేసినట్లు ముద్దగా ఉంది ఏమి అర్దం కావడం లేదు ... ఎందుకే ఇలాంటివన్నీ రాస్తారు ,కనీసం రాసిందేంటొ అర్దం కాకుండా అన్నాను ,వాడి మొహం ఇంకు తో రాసింది మాత్రం అర్దం అయి చచ్చిందనుకున్నావా.. ఉండు చూపిస్తా ఎందుకైనా మంచిదని కొన్ని దాచా అని ఒక లెటెర్ తెచ్చి ఇచ్చింది .. రెండు లైన్లు చదివేసరికి నాకు అరగంట పట్టింది.. నాకు మళ్ళీ మా తెలుగు మాస్టార్ గుర్తు వచ్చారు... వీడి కంటే వీడు ఇచ్చిన లెటెర్స్ భరించలేకపోతున్నానే బాబు,అవి చదువుతుంటే ఒక్కో సారి నా మీద నాకే జాలేస్తుంది అంది.. నేను పడి పడి నవ్వా ..ఉన్నట్లుండి ఏమై చచ్చిందో రక్తం తో మొదలెట్టాడు.. నేను ఒప్పుకునే వరకూ బ్లెడ్ తోనే రాస్తాడంట ,ఆ చేతి మీద ఆ ప్లాస్టర్లు చూసావా ,వీడికేమైనా అయితే నాకు చుట్టుకుంటుంది అంది దిగులుగా .. వాడి మొహం ,నమ్మేస్తున్నావా.. రోజు యే కోడి నో మేకనో వేసేస్తున్నట్లున్నాడు .. ఏం కాదులే అన్నాను... అది కాదే ఈ నెల 29 వరకూ చూస్తాడంట ఆ రోజు ఒప్పుకోకపోతే చస్తా అని బెదిరిస్తున్నాడు ,పైగా నేనే కారణం అని చెబుతాడంట అంది ...ఈ సారి దానితో పాటు నాకు భయం వేసింది ,యే ఫ్రెండ్ ప్రోద్భలం తో అన్నా అలా చేయడానికి ట్రై చేస్తే అని, కాని బయటకు చెప్పకుండా ..ఇలాంటి సినిమా కధలు చాలా చూసాం .. నమ్మకే ,అంతా ఒట్టిదే భయపెట్టడానికి అన్నాను.. మాములుగా అయితే భయ పడేదాన్ని కాదు మా అక్క పెళ్ళి కుదిరింది కదా ,వీడి బెదిరింపులు చూస్తుంటే ఒక్కోసారి భయం వేస్తుంది ,మాటంటే మాటే ..నా సంగతి నీకు తెలియదు నేను మహా మూర్ఖుడిని అని హింసపెట్టేస్తున్నాడు, చెప్పుకోడానికి కూడా ఎవరూ లేరు .. అక్క పెళ్ళి ఎలాగు అమ్మమ్మ ఇంటి దగ్గర కదా అక్కడకు వెళ్ళిపోయింది అంది దిగులుగా ..


పోనీ ఇలాంటివి ఎంత కాలం దాస్తావ్ ,మీ అమ్మగారికి చెప్పేసేయి ఎందుకైనా మంచిది అన్నాను... ఎక్కడే తను ఇంటికొచ్చేసరికే రాత్రి అయిపోతుంది ,పైగా ఒక్కరే పెళ్ళి పనులు చూసుకోవాలి..ఇప్పుడు ఇలాంటివి చెపితే ఏమన్నా ఉందా అంది.. సరే కంగారుపడకు ఏం కాదులే కొన్నాళ్ళు తిరిగి వాడే పోతాడులే అనేసి ఇంటికి వచ్చేసాను ..కాని నాకు దానికంటే ఎక్కువ భయం పట్టుకుంది .. అలా చేస్తాడేమో ,ఇలా చేస్తాడేమో అని ఒకటే ఆలోచనలు ...అందులోనూ ఫ్రెండ్స్ కి వేల్యూ ఇవ్వాలే అని అది అన్నమాటలొకటి గుచ్చుకునేవి పోనీ నాన్నకు చెపితే వాడి పని నాన్న చెబుతారు ,చిన్నపుడు ఒకసారి ట్రైన్ లో ఒక అమ్మాయిని ఎవరో అబ్బాయి ఏడిపిస్తే వాడి వీపు చెళ్ళూమనిపించారు ,అప్పటి నుండి నాన్న నాకు హీరో లా కనబడేవారు..కాని ఇప్పుడు ఏమని చెప్పను?? ఇది అడ్డమైన గోడవల్లో ఈ సమస్య తెచ్చుకుందని చెబితే ముందు నన్ను తిడతారు ఇలా సాగిపోయేవి నా ఆలోచనలు ..


రోజూ కాలేజ్ కి వచ్చినపుడు దాన్ని అడిగేదాన్ని ఇంకా ఏడిపిస్తున్నాడా ,ఇంకా లెటెర్స్ ఇస్తున్నాడా అని ..చివరకు 29 వచ్చేసింది ఆ రోజు అది కాలేజ్ కి రాలేదు .. ఆ మరుసటి రోజుకూడా .. ఇంక చూసుకోండీ నాకు టెన్షన్ .. వాడి బాధ పడలేక మానేసిందా లేక నిజం గా ఏదన్నా చేసుకున్నాడా వాడు ..ఉండబట్టలేక మరుసటి రోజు వాళ్ళింటికి వెళ్ళాను .. నేను వెళ్ళేసరికి ఫుల్ల్ జ్వరం తో ఉంది ....ఎవరూ లేరు ఇంట్లో .. నన్ను చూడగానే వాడికి ఇష్టం అని చెప్పేసానే అంది ఏడుస్తూ ,అదేంటే ఎందుకు అలా చెప్పావ్ అన్నాను సగం అర్దం అయి కానట్టు ఉంది ... 29 న బ్లేడ్ పట్టుకుని మరీ వచ్చాడంట చెప్పకపోతే ఇక్కడే నరం కోసేసుకుంటా అని,ఒకవేళ ఫ్రెండ్ ఎవరితో అన్న బెట్ కాసేడేమో చెబితే పీడా పోతుంది అని ఒప్పేసుకుంది అంట ... ఇంక అక్కడి నుండి పెళ్ళెపుడు ,లేచిపోదామా అని ఇంటి చుట్టూ అరుస్తూ తిరుగుతున్నాడంట ,వీదిలో వాళ్ళందరూ ఏమనుకుంటారే అంది ..నాకేం చెప్పాలో అర్దం కాలేదు.. మా నాన్నగారికి చెపుతా భయపడకు.. వాడిని బాగా తంతారు అని ఎదో ధైర్యం చెబుతున్నా గాని ఇవన్నీ జరగని పనులని తెలుసు ...


అది కళ్ళు తుడుచుకుని నేను ఇంక కాలేజ్ కి రానే మా అక్క పెళ్ళి అయ్యేవరకు,ఆ తరువాత చెప్తా వాడి పని,నేనే చంపేస్తా వాడిని అని కసేపు అంటుంది కసేపు దిగాలుగా అయిపోతుంది ... సరిగ్గా అప్పుడు వచ్చారు వాళ్ళ అమ్మమ్మ గారు .. దీని ఏడుపు చూడగానే ఏమైంది అని కంగారుగా అడిగారు.. నేను,అది ఒకదానికి ఒకటి సంభందం లేకుండా మాట్లాడేసి సర్ది చెపుతున్నాం,అవిడ నమ్మీనమ్మనట్లు చూస్తుంది .. నాకెందుకొచ్చిందో ధైర్యం ఉన్నట్లు ఉండి ..ఇలా నానిస్తే పెద్ద గొడవలు అయిపోతాయేమో అనిపించింది అసలే ఎదర పెళ్ళి ఒకటి ఉంది బోలెడు అప్పులు చేసారు పైగా.. అందుకే కొన్ని కొన్ని కట్ చేసి వాడు ఏడిపించడం ,పెళ్ళి చేసుకుంటా అని వేదించడం వరకూ చెప్పేసాను..


అంతా విని ఆమె నాకులా ఆవేశపడిపోలేదూ ,దాన్ని తిట్టనూలేదూ .. ఏం చేస్తున్నాడు లెటెర్స్ ఏమన్నా ఉన్నాయా లాంటివి అడిగీ వాళ్ళ ఇల్లు చూపిస్తావా అమ్మా అని అడిగారు,ఒక పక్క మా ఇంట్లో తెలిస్తే అని భయం గా ఉన్నా ఆ మాత్రం కష్టం లో ఫ్రెండ్ ని ఆదుకోపోతే ఎలా అని సరే అండి అన్నాను .. దారంతా ఆలోచనలే ఈవిడ మాటలు వాళ్ళు లెక్క చేస్తారా,వాళ్ళు గాని ఇలా అంటే మేము అలా అనాలి ..వాడు రాసిన లెటెర్స్ చూపించాలి ,బెదరకూడదు,తడబడ కూడదు ,తప్పు వాడిదే అని తేల్చి మళ్ళీ వెనుక పడకుండా చూడాలి ఇలా యమా సీరియస్సుగా ఆలోచిస్తున్న నాకు ఆ పసుపు రంగు చీర కు పచ్చ బోర్డర్ ఉంటే ఎంత బాగుంటుందో ,ఆవిడ ఎరుపు రంగు వేసుకుంది అన్న మాటలకు ఈ లోకం లో వచ్చాను .. నాకు ఇదివరకు పోచంపల్లి లో అలాంటి డిజైన్ ఉండేది.. ఆ పారిజాతం పూల చెట్టు ఉన్న ఇల్లు చూసావా ఆవిడకు ఎంత గోరోజనం అనుకున్నావ్ పూలన్నీ నేల పాలు చేస్తుంది గాని బయట వాళ్ళకు ఒక్క పువ్వు ఇవ్వదు , ఇక్కడంటే పూలకు కరువు గాని మా ఊర్లో పారిజాతలు,సన్నజాజులు,కనకాంబరాలు,మందారాలు,నిత్యమల్లులు లేని ఇల్లు ఇల్లుకాదనుకో ....అంటూ పెళ్ళికో ,పేరాంటానికో వెళుతున్నంత కూల్ గా వస్తున్న ఆవిడను చూసి నాకు మాట రాలేదు ...దారంతా ఇదే సోది ..


చివరకు వాళ్ళింటి కొచ్చాం ... ఇల్లు పెద్దదే ..ఉయ్యాల బల్ల కూడా పెద్దది బాగుంది అన్నారు లోపలికి వస్తూ .. ఈ లోపల బాబ్జి వాళ్ళ అమ్మగారు బయటకు వచ్చారు.. ఈవిడ పలాన పలాన అని పరిచయం చేసుకున్నారు.. ఆవిడ ఏమనుకుందో లోపలికి రండి అంది పిలాలా, మానాల అన్నట్లు..లోపలికి వచ్చాకా మమ్మల్ని చూడగానే బాబ్జిగాడి గుండెల్లో కిలో రాయి పడిపోయింది ..నాకు వాడి మొహం లో భయం చూడగానే ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది..ఆవిడకు మాత్రమే వినిపించేలా వాడే వాడే అన్నాను.. అదిగో అబ్బాయి కూడా వచ్చేసాడు .. ఏమీ లేదమ్మా మీ అబ్బాయికి మా మనవరాలు నచ్చిందంటా ,రోజూ ఇదిగో రక్తం తో కూడా లెటెర్స్ రాసి ఇస్తున్నాడు.. చూసావా ఆ చేతినిండా ఆ ప్లాస్టర్స్ ..నిన్న చేయి కూడా కోసుకోబోయాడంట ..చివరకు మా పిల్ల ఆపింది కాని ఏమయ్యి ఉండేది ఆవిడ అదే కూల్ గా మాట్లాడుతుంది ...


బాబ్జి వాళ్ళ అమ్మ ఏం మాట్లాడాలో తెలియక ఏమ్రా ,నిజమా అని నిలదీసింది ...దాని సంగతి నీకు తెలియదమ్మా..దానికి నేను అంటే ఇష్టం వాడేదో అర్దం పర్దం లేకుండా పొగరుగా మాట్లాడుతున్నాడు..పోనీలేమ్మా అబ్బాయిని అనడానికేముంది ఈ కాలం పిల్లలందరూ అలాగే ఉన్నారు.. చివరకు మా పిల్ల కూడా ఇష్టపడింది అని చెపుతున్నాడు కదా.. మా పెద్ద మనవరాలి పెళ్ళి కుదిరిందీ ,పిల్లలు ఎలాగూ ఇష్టపడుతున్నారుగా మాకు కుల పట్టింపు పెద్దగా లేదు జాతకం ఇస్తే ఒకేసారి ముహర్తం పెట్టించేస్తాము ...ఖర్చులో ఖర్చు ... పెళ్ళయ్యాక చదువుకుంటారు తప్పేముంది తేలిగ్గా అనేసింది ఆవిడ ...నాకు సౌండ్లేదు ..అటు బాబ్జి వాళ్ళమ్మ ఏం మాట్లాడుతున్నారు మీరు, మీ వయసుకు మర్యాద ఇస్తుంటే... ఆయన్ని పిలిపిస్తాను ,విషయం తేల్చెస్తారు అని ఫోన్ తీసి ఫైటింగ్ మొదలు పెట్టేసింది .. నేను చల్లగా వచ్చేసాను అక్కడినుండి..


ఆ తరువాత ఏమైందో ఏంటో నాకు తెలియదు మళ్ళీ సోమవారం కాలేజ్ కి వెళ్ళాక సువర్ణను అడిగాను ఏంటే ఆవిడ పెళ్ళి కుదిర్చేసారా అని.. ఏం పెళ్ళీ అంటుంది తెల్లబోయి.. మొన్న ఇలా జరిగింది అంటే... అవునా, మాకేం చెప్పలేదే ,వెళ్ళి వాళ్ళకు విషయం చెప్పి వచ్చాను అన్నారు అంతే అంది ...నాకిప్పటికీ మిస్టరీయే అక్కడేం జరిగిందో అని,ఒక వేళ వాళ్ళను భయపెట్టడానికి అలా అన్నారో,లేక ఎలాగో కలిగిన కుటుంభం కదా పెళ్ళి కుదిర్చేద్దాం అనుకున్నారో ,అసలేం జరిగిందో ,ఏమో కాని ఆ తరువాత బాబ్జీ గాడు లేడు వాడి బేచ్ లేదు వాడి హోండా బండిలేదు..

6, ఏప్రిల్ 2009, సోమవారం

కాలేజి ప్రేమలుచిన్నపుడు ఒక కోరిక ఉండేది ...సినిమాల్లో హీరోయిన్ లాగా క్లాస్ రూంలో లెక్చరర్ పాఠాలు చెబుతుంటే, నేను డెస్క్ మీద సీరియస్సుగా బుక్ పెట్టి అవన్నీ వినేసి రాసేస్తుంటే ,మా అమ్మ కిటికీలోంచి చూస్తూ మా అమ్మాయి ఎంత బాగా చదివేస్తున్నాదో అని తెగ ఆనందభాష్పాలు కార్చేస్తుంటే చూడాలని(ఇక్కడ వెంకీ గుర్తొస్తే నా తప్పు కాదు ) .. అమ్మ కాలేజ్ కి వచ్చి మనల్ని చూసే అంత సీన్ ఉండదని తెలుసు కాని అదోసరదా...


తను చిన్నపుడు చదువుకోవాలని తెగ సరదా పడేది కాని మా తాతయ్య ఎంత చాదస్తం అంటే ఆయనకు 3 కూతుర్లు ఉన్నారన్న విషయం చాలా మందికి తెలియనే తెలియదట,నా చిన్నపుడు శెలవలకి వాళ్ళింటికి వెళ్ళేటప్పుడు చూసేదాన్ని ...మా ఆఖరి పిన్ని కి ఇంట్లోనే ఒక 80 యేళ్ళ ముసలి పంతులుగారిని ఇంటికి పిలిపించి చదువు చెప్పించేవారు .. ఆయన చెప్పేది తనకి అర్దం అయ్యేది కాదు తను చెప్పేది ఆయనకు వినబడేది కాదు ...కనీసం సంవత్సరానికి 2 మాస్టార్లు మారేవారు.. వయసు అయిపోవడం వల్ల టపా కట్టి.. అలాంటి ఇంట్లో నుండి రావడం వల్లో ఏమో ,అమ్మ మేము బాగా చదువుకోవాలని అనుకునేది ..


ఆ కారణం చేత కాలేజ్ మా ఇంటికి కాస్త దూరం అయినా సరే (అంటే 40 నిమిషాలు నడక ) పట్టుబట్టి జాయిన్ చేసింది.. అది కూడా అమ్మాయిల కాలేజే అనుకోండి.. మా కాలేజ్ ఎంత బాగుండేదంటే ఏదో పార్క్ లో ఉన్నట్లే ..ఎటు చూసినా పచ్చని చెట్ట్లు ,ఎర్రని పూలు ,నేరేడు,బొప్పాయి జామా ,సెంటుమల్లి ,మెత్తని పచ్చిక అబ్బా అందులోనూ కాలేజ్ ఓపెన్ చేయగానే వర్షాలు ఒకటి స్టార్ట్ అవుతాయేమో వర్షంలో తడిచి ఫ్రెష్ గా స్నానం చేసి వచ్చిన ప్రకృతికాంతలా భలేగుండేది .. అప్పటి వరకు బుల్లి బుల్లి స్కూల్స్ లో చదివిన నాకు అదో అందమైన లోకం లో ఉన్నట్లు అనిపించేది.. యూనీఫాం లు ,రెండు జడలు ,స్కూల్ బేగ్ లు గట్రా పోయి స్టైల్ గా రెండు పుస్తకాలు, రంగు రంగుల డ్రెస్లు ,వదులుగా అల్లిన జడ ,నుదిటి మీద రింగులు తిరిగిన ముంగురులు ( అంటే నేను అలా పీక్కునేదాన్ని లెండి) అలా హీరోయిన్లా ఫీల్ అయిపోయేదాన్ని ..


ఇంక జాయిన్ అయ్యాకా నా కల తీరే రోజు వచ్చేసింది కాబట్టి అవసరం ఉన్నా లేక పోయినా సార్ ఏం చెప్పినా చెప్పకపోయినా తెగ రాసేసేదాన్ని బుక్ లో ..ఇక్కడ నాకు విపరీతం గా నచ్చేసిన విషయం లెక్చరర్లు మమ్మల్ని 'ఏమండీ,' మీరూ అని సంబోధించడం.. అప్పటి వరకూ ఏయ్, అమ్మాయ్ దీనికి సమాధానం చెప్పు అని అనే టీచర్లు పోయి ,మీరు చెప్పగలరా దీనికి సమాధానం అని ఎంతో వినయంగా అడిగే సార్ లను చూస్తుంటే తెగ ముచ్చట వేసేది...ఇంకా నచ్చిన విషయం ఏంటంటే ఎలెక్షన్లు ... మా కాలేజ్ ఇంటెర్ ,డిగ్రీ కలిపి ఉండేది, కాబట్టి డిగ్రీ అమ్మాయిలు ప్రెసిడెంట్ గా ,సెక్రట్రీ గా ఇలా పోటి చేసే అమ్మాయిలందరూ మంచి మంచి చీరలు కట్టుకుని బొమ్మల్లా తయారయి నాకు ఓటెయ్యండమ్మా ప్లీజ్,ప్లీజ్ మా మంచి చెల్లాయిలు కదూ అని అభ్యర్దిస్తుంటే మనిషికి ఒక్క ఓటు హక్కు ఎందుకుంది ఒక 5,6 ఉండచ్చుకదా అనిపించేసేది..


ఆ తరువాత మెల్లి మెల్లిగా నాకు కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవ్వడం మొదలైంది.. ముఖ్యం గా హాస్టల్ అమ్మాయిలు .. పక్కన ఉన్న పల్లెటూర్లనుండి వచ్చి కాలేజ్ హాస్టల్ లో చదివేవారు.. వాళ్ళకు నేను వేసుకున్న డ్రెస్లంటే మహా ఇష్టం .. మా అక్క చెల్లెళ్ళు అందరం ఇంచుమించుగా ఒకటే పొడవు అవ్వడం వల్ల ఒకరి డ్రెస్స్ లు ఒకరం వేసేసుకునేవాళ్ళం... ఇది నీది ఇది నాది అని ఉండేది కాదు అందుకే రోజుకో డ్రెస్స్ తో తెగ పోజులు కొట్టేసేదాన్ని .. అప్పుడప్పుడూ హాస్టల్ అమ్మాయిలకు నా డ్రెస్లు ఇచ్చేదాన్ని..ఇంట్లో అనుమానం వస్తే మా అక్క ఉందిగా నాకు అమాయకం గా ..దాని మీద తోసేసేదాన్ని ..మొన్న వేసుకుంది ఎక్కడ పెట్టేసిందో అని ...


కాలేజ్ దూరం అవ్వడం వల్ల అమ్మ బాక్స్ పెట్టేది ... నాలా బాక్స్ తెచ్చుకున్న వాళ్ళందరితో కలిసి తినేవాళ్ళం ..వండుకున్నమ్మకు ఒకటే కూర అన్న చందాన భలే ఎంజోయ్ చేస్తూ తినే వాళ్ళం.. అదిగో సరిగ్గా అప్పుడు పరిచయం అయింది సువర్ణ ..సువర్ణ మొదటి నుండి నాకు ప్రత్యేకం గా అనిపించేది , తను పైకి చాలా మొండిలా కనిపిస్తుంది గాని మహా సున్నితం ... పొగరుగా మాట్లాడినట్లు అనిపిస్తుంది కాని ఎవరికైన కొంచెం బాధ కలిగినా తట్టుకోలేదు .. ఒక సారి ఎవరో అమ్మాయి మనీ పోగొట్టుకుని ఏడుస్తుంటే తను ఫీజ్ కోసం తెచ్చిన డబ్బు ఇచ్చేసింది .. నిజానికి తనది కలిగిన కుటుంభం కాదు .. మరీ అంత ఎక్కువ చేయకూడదు ముందు నీ సంగతి చూసుకో అని మందలించేదాన్ని నేను ...

అయితే ఎంత ఫ్రెండ్ అయినప్పటికీ ఇంటికి వెళ్ళేటప్పుడు తనతో కలిసి వెళ్ళాలంటే కాస్త భయం గా ఉండేది ..సువర్ణది ఒక విలక్షణమైన మనస్థత్వం ..ఎంత సున్నితమైనది అయినప్పటికీ అబ్బాయిల విషయం వచ్చేసరికి అపర కాళి అయిపోయేది .. మేము కాలేజ్ కి వచ్చేదారిలో చాలా మంది అబ్బాయిలు కాచుకుని ఉండేవారు వచ్చేపోయే అమ్మాయిలను ఏదో ఒకటి అంటూ .. కొంతమంది గులాభీలు ,చేమంతులు అని పొగిడితే ఇంకొందరు కాస్త తిండి తగ్గించుతల్లీ నీ కట్నం కూడపెట్టే చాన్స్ మీ నాన్నకు ఇవ్వు అని వెటకారం చెసేవారు.. వీరి మాటలకు ముసి ముసి నవ్వులు నవ్వుకుని కొందరు వెళ్ళిపోయేవారు ఇంకొంతమంది విన్నా విననట్లుగా పట్టించుకోకుండా వెళ్ళిపోయేవారు ఇంకొందరు .. ( నేను ఈ కోవలోకొస్తా అన్నమాట) , అయితే సువర్ణ అందరిలా ఊరుకునేది కాదు ... అసలు తననే కాదు ఇంకొకరిని అన్నా సహించేది కాదు .. మాటవరసకు నువ్వు మందారం లా ఉన్నావు అని ఎవరన్నా అన్నారనుకోండి .. నువ్వు మాత్రం ముళ్ళపందిలా ఉన్నావ్ .. నీకెందుకురా నేను ఎలా ఉంటే అని గొడవకు దిగేది ..ఒక వేళ పక్క వాళ్ళను అంటే ,అదెలా ఉంటే నీకెందుకురా ముందు నీ మొహం అద్దం లో చూసుకో అని తగవు పెట్టుకునేది ..


పోని ఇంతా చేసి పురుష ద్వేషిణి యా అంటే అదీ కాదు... ప్రేమికులు ఎవరన్నా విడిపోతే వాళ్ళకు బుద్దులు చెప్పి మరీ కలిపేది ... నీకెందుకే ఇవన్నీ అంటే కయ్యిమనేది .. నీలాంటి వాళ్ళవల్లే దేశం పాడైపోతుంది అన్నీ మనకెందుకు అనుకుంటావ్ అని తిట్టి పడేసేది ...
అయితే ఈ రకమైన మనస్థత్వానికి కారణం కొంత వరకూ వాళ్ళ నాన్నగారే అనుకునేదాన్ని నేను .. వారి కుటుంభంలో మరే కారణమో తెలియదుకాని తన తల్లి తండ్రులు విడిగా ఉండేవారు .. తన అమ్మగారే జాబ్ చేస్తూ కుటుంభాన్ని పోషించేవారు.. మరి అందువల్లో ఎందువల్లో తెలియదుకాని ఇలా అయినదానికి ,కానిదానికి అబ్బాయిలతో గొడవ పెట్టుకుని వారి వల్ల చాలా చెడ్డ పేరు తెచ్చేసుకుంది .... చివరకు మా ఇంట్లో తమ్ముళ్ళు ,అక్కలు కూడా ఫలనా అమ్మాయి నీ ఫ్రెండా !! ఆ అమ్మాయి మంచిది కాదంట ఇంక స్నేహం మానేసేయి అని నా మీద ఒత్తిడి తెచ్చేవారు ... నేను అటు వాళ్ళతో వాదించలేక ఇటు తనను అకారణం గా దూరం చేయలేక సతమతమయ్యేదాన్ని...ఇదిలా ఉండగా ఒక సారి తనతో కలిసి వాళ్ళింటికి వెళ్ళాను పని ఉండి .. కొంత దూరం వెళ్ళాక ఒక అబ్బాయి సువ్వి ప్లీజ్ రా ప్లీజ్ రా అని వెనకాతల పడటం మొదలెట్టాడు.. వాడి వెనకాతల ఒక గ్రూపు . యెహె పో.. ఒక్కసారి చెబితే అర్దం కాదా.. ఎక్కువ చేస్తే పోలీసులకు చెబుతా జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుంది ఇది ..... పోలీసులే కదా ఎవరి నెంబర్ కావాలో చెప్పు నేను ఇస్తా .. ప్రొద్దున్న లేస్తే మా బాబు చుట్టు తిరుగుతారు ..కాని నువ్వు మాత్రం కాదనకే బాబు నేనేమైపోతాను అని గారాలు కురుస్తున్నాడు వాడు.. ఈ శాల్తీని ఎక్కడో చూసానబ్బా??? నాకు గుర్తు రావడం లేదు .. ఈ లోపల జేబులో నుండి ఒక లెటెర్ తీసాడు.. అది చూడగానే ఇది మొహం అసహ్యం గా పెట్టింది .. . మళ్ళీ రాసావా దిక్కుమాలిన రక్తం తోటి ...ఏం తమాషాగా ఉందా ఊరుకుంటుంటే ..ఇలాంటివి మళ్ళీ ఇస్తే చెప్పు తీసికొడతా ఇది రెచ్చిపోయి తిడుతుంది.. నాకు తెలుసే బంగారం.. నామీద ఎంత ప్రేమ లేకపోతే నా రక్తాన్ని అలా తీయద్దు అంటావ్ ..సరేలే నెక్స్ట్ టైం ఇంకుతోనే రాస్తాను గాని ఈ సారికి అడ్జస్ట్ అయిపో అన్నాడు.. దీనికి కోపం వల్లో భయం వల్లో మాట తడబడిపోయి సరిగా మాట్లాడలేకపోతుంది ... సిగ్గులేదు ఈ వయసులో ప్రేమేంటీ ..నాకిష్టం లేదంటే ఇలా చంపుకు తింటావేంటి నా సంగతి నీకు తెలియదు బెదిరించింది.. నా సంగతీ నీకు తెలియదు.. నీకు ఆ విషయం బాగా తెలుసు .. ఎంటమ్మా ఈ వయసులో ప్రేమేంటీ అనేదానివి మొన్న లలితని వాసుగాడినీ ఎలా కలిపావే ఎదవ స్టోరీలు చెప్పకు ..వాడు ఏక వచనంలో మాట్లాడుతున్నాడు..
నా బుర్ర అంతా వీడిని ఎక్కడ చూసానా అని ఆలోచన ఒక పక్క ,భయం ఇంకోపక్కా.. ఈ లోపల నా వైపు తిరిగి మీరైనా చెప్పండీ మీ ఫ్రెండుకి అన్నాడు.. దెబ్బకు 102 నాకు ...
(చాలా పెద్ద పెద్ద పోస్ట్లు రాసేస్తున్నా, చదివేవారికి ఇబ్బందిగా ఉంటుందేమో.. ఎంత చిన్నగా రాద్దామన్న నా వల్ల కావడం లేదు అందుకే తరువాత భాగం తరువాత రాస్తాను )