అప్పుడెప్పుడో రాద్దామనుకున్నా పోస్ట్ అన్నమాట ఇది..నా జ్ఞాపకాల్లో ముఖ్యమైనదినూ పనిలో పని సింగపూర్ ,ఇండోనేషియ,మలేషియా చూడాలనుకునే వాళ్లకు ఉపయోగకరంగా ఉంటుంది అనీను రాస్తున్నా..
ముందు మలేషియా గురించి చెప్పుకుందాం..మేమసలు సింగపూర్ రాక మునుపు ఓ వెన్నెల రాత్రి చందమామను చూస్తూ విదేశాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ మలేషియా ప్రస్తావన వచ్చింది ...నీకు తెలుసా బుజ్జీ సింగపూర్ నుండి మలేషియాకు సముద్రంలో వంతెన కట్టేసారట ...మా ఉదయ్ లేడూ..వాడు చెప్పాడు.. టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందో కదా అనగానే నేను ఓ రేంజ్లో ఆశ్చర్యంగా నోరుతెరుచుకుని ఉండిపోయాను ...
"నిజ్జంగానా...మన గోదావరి బ్రిడ్జ్ చూసే నాకు మతిపోతుంది ఎలా కట్టారా అని..... అలాంటిది ఆ అలల్లో ఇంకో దేశానికి వంతెన కట్టేయడమే ..హ్మ్మం మానవుడు సామాన్యుడు కాదండి ...ఈ లెక్కన రామాయణం నిజమే నన్నమాట ..." అని బోలెడు బోలెడు హాచ్చర్య పడిపోయాను..
విధి విచిత్రమైనది..బోలెడు అద్భుతాలు చూపిస్తుంది... ఆ మాట అనుకున్న సంవత్సరం కూడా తిరక్కుండానే నన్ను మలేషియా ఎంబసి దగ్గర నించో పెట్టింది ...సింగపూర్ వచ్చ్సిన నెలరోజులకే నేనే నేనే వీసా తెచ్చాను.. వద్దులెండి అదో పెద్ద కధ ...ఆ విషయం తరువాత చెప్పుకుందాం..ప్యాకేజ్ లలో కాకుండా మనకు మనమే స్వయంగా వెళ్లి చూసేసోద్దాం అని మా ఆయన అనేసరికి సరే అని మరుసటి రోజు రాత్రి వుడ్ లాండ్స్ అనే ఊరికి బయలు దేరాం ...మా సింగపూర్లో ఏ మూల నుండి ఏ మూలకి వెళ్ళినా గట్టిగా గంటన్నర జర్నీ ఉంటుంది ....ఇక రాత్రే ఎందుకు బయలుదేరాం అంటే .. సింగపూర్ నుండి కౌలాలం పూర్ (మలేషియా రాజధాని ) బస్లో ఒక నాలుగు గంటలు జర్నీ ఉంటుంది అంతే ...కాబట్టి రాత్రి జర్నీ వల్ల మనకు రోజు మొత్తం కలసి వస్తుంది కదా..
అయితే ట్రైన్ లో కూడా వెళ్ళొచ్చు..కాని మీరు మాత్రం ట్రైన్లో అస్సలు వెళ్లొద్దు..పరమ ,శుద్ద వేస్ట్.. మేము నెక్స్ట్ టైం ట్రైన్ లో వెళ్లి మా చెప్పులు తెగేలా కొట్టుకున్నాం ...ఎందుకంటే ట్రైన్లో వెళితే టిక్కెట్ రేట్ త్రిబుల్ ఉంటుంది..పైగా జర్నీ వచ్చీ పన్నెండు గంటలు ...(బస్సులో ఎంత స్లో వెళ్ళినా నాలుగు గంటలే ) ఇంకా రాత్రి పడుకున్నప్పుడు ఆ కుదుపులకు ట్రైన్ పడిపోతుందేమో అన్నంత భయం వేసేసింది.. మన ఇండియాలో ట్రైన్లు లో ఎంత హాయిగా పడుకుంటాం..ఇదయితే ప్రొద్దున్న లేచ్చేసరికి ముసుగేసి చితక్కోట్టేసినట్లు ఒళ్ళంతా నెప్పులే నెప్పులు...వచ్చేప్పుడు భయపడి కూర్చుని వచ్చాం ... మరెందుకు ట్రైన్ పెట్టారో ..ఇంకెందుకు జనాలు దానిలో వెళతారో ఆ ట్రైన్ పెట్టినవాడికే తెలియాలి..
సరే ఎంత వరకూ చెప్పుకున్నాం..హా..వుడ్లాన్డ్స్ లో ఇమిగ్రేషన్ దగ్గర .. వీసాలు గట్రాలు లగేజ్లు అన్ని చెక్ చేసుకున్నకా ... అక్కడి నుండి జోహార్ బరు (JB )అనే ఊరుకి బస్ ఉంటుంది ...ఇంకేంటి అదే మలేషియా ..అంటే మలేషియా బోర్డర్ అన్నమాట ....అంటే సముద్రంలో కట్టిన వంతెన మీద మరో దేశానికి ..అచ్చంగా మరో దేశానికి వెళ్ళిపోతాం అన్నమాట..అసలు చదువుతున్న మీకే ఇంత ఒళ్ళు పులకరించిపోతుంటే వెళుతున్న నాకెలా ఉండి ఉంటుంది..ఆ అనుభూతిని సొంతం చేసుకోవడానికి ప్రిపేర్ అవుతూ గట్టిగా ఊపిరి పీల్చి తన్మయంగా కళ్ళు మూసుకుని మెల్లిగా కళ్ళు తెరిచేసరికి బస్ ఆపేసాడు ...పద పద మలేషియా వచ్చేసింది అన్నారు మా ఆయన :(... అప్పుడే వచ్చేసామా !!!! మరి వంతెనో అనగానే ..ఇందాక దాటేసాం కదా అన్నారు..అదన్నమాట సంగతి ...అంటే మన ఊర్లో గోదావరి బ్రిడ్జ్లో సగంలో సగం...ఛీ ఎందుకులెండి ఓ పిల్లకాలువ పైన ఉన్నంత బ్రిడ్జ్ ఉందన్నమాట అంతే...పాపం మా సింగపూరోళ్లు దూరమైతే కట్టేసేవాళ్ళమ్మా ..కాని ప్రక్క ప్రక్కనే ఉన్నాయి రెండు దేశాలునూ... వాళ్ళుమాత్రం ఏం చేస్తారూ!!!..
అలా జే బి బస్ స్టాండ్లో నిన్చున్నామా ...అక్కడ వరుసగా బోలెడు బస్సులున్నాయి ...కౌలాలంపూర్ కౌలాలం పూర్ అని పిలిచిమరీ టిక్కెట్స్ ఇస్తున్నారు..మేము రాత్రి ఒంటిగంటకు ఒక బస్ ఎక్కాం .... చెప్పానుగా మధ్యలో వాడు అరగంట రెస్ట్ రూమ్స్ దగ్గర ఆపినా నాలుగు గంటలే జర్నీ ...సరే సరిగ్గా అయిదింటికల్లా మలేషియాలో పుదురాయ బస్ స్టాప్లో దిగాం ...మేము మొదటి సారి మలేషియా వెళ్ళినప్పుడు హోటల్ గెంటింగ్ (జెంటింగ్) లో తీసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయాం అనుకోండి ...కాని ముందు నేను కే ఎల్ లో ముఖ్యమైన ప్లేస్లు చెప్పేస్తాను ...
కే ఎల్ లో ముఖ్య మైనవి ఊ..మామూలుగా ట్విన్ టవర్స్ ...ఇంకా కే ఎల్ టవర్ ...ఇంకా బటూ కేవ్స్ ,ఇంకా జెంటింగ్,ఇంకా సన్ వే లగూన్ ,ఇంకా అండర్ వాటర్ వరల్డ్.. ఓపిక ఉంటే బర్డ్స్ పార్క్,జూ ఇలా అన్నమాట..అయితే ఇక్కడ హోటల్ వాడు అరేంజ్ చేసిన టాక్సీ ఎక్కామో సీన్ సితారే అన్నమాట.. వాడు గంటకు 80 రింగేట్స్ అడిగాడు ...అంటే రోజులో ఒక ఏడుగంటలు తిరిగామనుకోండి ఎంతవుతుందో లేక్కేసుకోండి ... మా ఆయన సరే అనేసారు ఎంచక్కా తల ఊపేసి ...నేను ఆ అరాచకాన్ని సహించలేక మేము బయటకొచ్చి తింటున్న తమిళ్ ఫుడ్ సెంటర్ వాడిని అడిగాను..
ఇక్కడ హోటల్ అంటే గుర్తొచ్చింది ...మలేషియాలో ఫుడ్ సూపర్ డూపర్ చీప్ (అంటే మా సింగపూర్ తో పోలిస్తే )మాకు పది డాలర్లకు వచ్చేది అక్కడ ఐదు డాలర్లకే వస్తుంది..సగానికి సగం తేడా ఉంటుంది..అది ఫుడ్ అయినా బట్టలయినా సరే ... అంటే కళ్ళు చెదిరే షాపింగ్ కాంప్లెక్స్లో కొద్దిగా బేండ్ వేస్తాడు...కాబట్టి బట్టలు లాంటివి బయట షాప్స్లో కొంటే బాగా కలిసొస్తుంది.. అయితే ఇక్కడ మరొక విషయం తమిళియన్స్ ...అబ్బా నాకు తమిలియన్స్లో నచ్చేవిషయం ఏమిటంటే వాళ్ళ ప్రాంతం వారి పై ఇంకా వాళ్ళ భాష పై ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం.. ఎలాంటి సహాయం అయినా అడగకుండా చేస్తారు..అదే కొద్దిగా తమిళ్ ముక్కలు రాకపోయినా మాట్లాడటాని ట్రై చేసామనుకోండి మనకు నీరాజనాలే..
అందుకే ఆ హోటల్ తమిళ్ ఓనర్ తో " అన్నా.... ఎనకు తమిళ్ తెరియాదు ....ఆనా రొంబ పుడికం.... కొంజెం కొంజెం పురియుం.. ..హెల్ప్ పన్ను" అని ఎంతో ఇదిగా నా తమిళ్ సీరియల్స్ ప్రతిభను ఉపయోగించి అడిగేసరికి అతనే ఒక కేబ్ అబ్బాయిని పిలిచి దగ్గరుండి బేరమాడి మాకు హెల్ప్ చేసాడు .. ఎంతో చెప్పనా..... మొత్తం రోజంతటికీ ౩౦౦ రింగేట్స్ ...కాబట్టి ఎంచక్కా నేను చెప్పినట్లు చెయ్యండి ..
ఆ కేబ్ అబ్బాయి ఎంచక్కా అసలు లిస్టు లో లేని చాలా ప్లేస్లు తిప్పాడు ...ఏవో ముస్లిం భవనాలు,హైకోర్ట్ , ఇంకా ఏంటో ఏంటో లే ...మనం అవన్నీ వదిలేసి ముఖ్యమైనవి చెప్పుకుందాం...
ట్విన్ టవర్స్ ..మొదటి సారి మలేషియా వెళ్ళినప్పుడు నేను ట్విన్ టవర్స్ చూడలేదు.. సుత్తిలే ఎవడు చూస్తాడు టీవి లో చూసాం గా అని..మనకు ఏది ఓ పట్టాన ఎక్కదుగా... కౌలాలం పూర్లో ఎక్కడ తిరుగు... ఈ ట్విన్ టవర్ కనబడుతూనే ఉంటుంది ... కాని ఆ తరువాత చాలా సార్లు వీటిని చూడటానికే ప్రత్యేకంగా వెళ్లాను అంటే అర్ధం చేసుకోండి ..ఎంత బాగుంటుందో.. వీటిని పగలు చూస్తే ఏం బాగోవు మామూలుగా ఉంటుంది ...కాని రాత్రి చూస్తే మాత్రం అక్కడే కూర్చుని వాటిని చూస్తూ తెల్లార్లూ గడిపేద్దాం అనిపిస్తుంది.. ఎంత బాగుంటుందో..నాకు వర్ణించడం రావట్లేదు మరి.. ఇది కట్టించడానికి ఏదో కారణం చెప్పాడబ్బా కేబ్ వాడు ...సమయానికి నాకు గుర్తురావడం లేదు..అయితే ఈ టవర్స్ ని ఎక్కాలంటే ప్రొద్దున్నే లేచి అయిదుగంట్లకో ఎప్పుడో క్యూలో నించుంటే ఒక రెందొందలమంది పంపుతాడట... హిహిహిహి మనసంగతి తెలుసుగా ..ఇప్పటికోచ్చి ఎక్కలేదు ఎన్నిసార్లు వెళ్ళినా..
ఇంకొకటి కే ఎల్ టవర్ దీన్ని కూడా నేను ఎక్కలేదు ..దూరం నుండి చూసాను అంతే... కాబట్టి తెలియదు దీని గురించి..
ఇక బటు కేవ్స్ ..ఇది సూపర్ డూపర్ ..చాలా సినిమాల్లో ఈ గుడిని తీసారు.. పే........ద్ద సుభ్రమణ్య స్వామీ విగ్రహం ఉంటుంది ... సూపర్ అంతే ...అక్కడో నాలుగు వందల మెట్ల ఎత్తోలో గుడి ఉంటుంది పైన గుహలో ... ఆ మేట్లేక్కేసరికి కాళ్ళు పడిపోతాయి.. కాని లోపల చాలా బాగుంటుంది.. ఇంకా దారంతా కోతులు ..ఆ జనాలను చూస్తే నాకు తిరపతి గుర్తొచ్చింది.. అన్నట్లు మర్చిపోయాను ఈ పూజలు వ్రతాలూ అంటే ఏ మాటకామాట చెప్పుకోవాలి..తమిళియన్సే ...బాగా చేస్తారు...
ఇంకా సన్వే లగూన్ ....ఇదేమో పెద్ద వాటర్ వరల్డ్ అన్నమాట ...దీని దగ్గరకు వెళ్ళాలంటే అలా ఎన్ని ఫ్లోర్స్ క్రిందకు దిగాలో ...బయట నుండి చూస్తేనే సూపర్ డూపర్ బంపర్ ఉంటుంది ...అసలు పిల్లలు ఉన్నవాళ్ళు దీనికోసమే మలేషియా వెళతారు...
అండర్ వాటర్ వరల్డ్..ఇది అచ్చం సింగపూర్ లానే ఉంటుంది ...అస్సలేం తేడా ఉండదు.. ఆ చేపలు గట్రాలు అన్ని సేమ్ సేమ్ కాని ... ఆ లోపల డెకరేషన్ కి నేను పడిపోయాను..అదేదో బృందావనం లా ఇంకేదో లోకంలా ...లోపల అన్ని లతలు తీగలు ,పళ్ళు,కాయలు అబ్బబ్బబ్బా నాకయితే ఎంత నచ్చేసిందో.. నా కోసమయినా వెళ్ళండి అంతే అంతే ...
హా ఇక్కడ ఇంకొకటి చెప్పాలి ..ఇక్కడ ఎక్కడకు వెళ్ళినా చాక్లెట్ ఫ్యాక్టరీలని,లెదర్ ఫ్యాక్టరీలని అంతా ప్యూర్ చాక్లెట్ ,లెదర్ దొరుకుతుందని కేబ్ వాళ్ళు మనల్ని మొహమాటం కూడా పెట్టకుండా తీసుకు వెళ్ళిపోతారు ...వాళ్లకు వాళ్లకు ఏవో ఒప్పందాలు ఉంటాయన్నమాట..ఆ వస్తువులు ధర బయట వాటికి కనీసం అధమ పక్షం ఒక పదిహేను రేట్లు ఎక్కువ ఉంటుంది..అయినా జనాలు కోనేస్తూ ఉంటారేమిటో... నేను చెప్పేది చెప్పాను మరి..వెళ్ళేవాళ్ళు ఉంటే ఆలోచించుకోండి :)
ఇక బర్డ్స్ పార్క్ ,జూలు మిగిలినవి నేను చూడలేదు ..టైం లేదు ..మరి నాకు తెలియదు..కాకపొతే మా సింగపూర్ కి మలేషియాకి తేడా ఏమిటంటే మా వాళ్ళు ప్లేస్ లేక పది ఎకరంలో కట్టినదాన్ని మలేషియావాళ్ళు యాబై ఎకరాల్లో కడతారు అది సంగతి.. నీట్ నెస్ గాని మిగిలిన ఏ విషయమైనా సరే మా దేశం తో పోల్చుకోలేము దాన్ని ..( మా సింగపూర్ని బాగా పొగుడుకున్నా కదా) ... అయితే ఇక్కడ మేము వెళ్ళిన కొత్తలో ఎవరూ ఇంగ్లిష్ మాట్లాడక చాలా ఇబ్బంది అయ్యేది కాని ఈ మధ్య పర్లేదు..అలాగే ఇక్కడ లోకల్ ట్రైన్స్ భలే ఉంటాయి ..మొకమల్ క్లాత్ తో అదేదో రాజ్ మహల్ లో ఉన్నట్లు..కాకపొతే అబ్బ ప్రతి ట్రైన్ అరగంటకోసారి వస్తుంది ....చిరాకు బాబు ..
ఇప్పుడు జెంటింగ్ ... జెంటింగ్ కి వెళ్ళాలంటే తెల్లవారు జామున వెళితే ఉంటుంది కదా......సూ..ప..ర్ అంతే ...అసలు ఎంత బాగుంటుందో.. అక్కడకు రోప్ వే ఉంటుంది.. అంటే తెలుసుకదా కేబుల్ కార్ లో వెళ్ళడం అన్నమాట..తెల్లవారు జామున మబ్బుల్లో , ఆ చలిలో క్రింద లోయలు ,పైన ఆకాశం ..మధ్యలో ఒక్క తాడుకి వ్రేల్లాడుతున్న పెట్టెలో మనం ....ఓ సారి ఊహించుకోండి ...కొద్దిగా భయం వేసినా కాసేపటికి బాగా ఎంజాయ్ చేస్తాం.. మా సింగపూర్ తో పోలిస్తే ఇక్కడ చాలా చీప్ ...ఈ రోప్ వే మీద జర్నీ చేయడం.. అప్పుడు ..ఎంచక్కా జెంటింగ్ వెళ్ళిపోతాం ...
జెంటింగ్ లో ఏముంటుంది అంటే ఏమీ ఉండదు... పెద్ద కొండ పై బాగా డబ్బులు వదిలించుకోవడానికి కావలసిన అన్ని హంగులు ఉంటాయి..ఇండోర్ అవుట్ డోర్ గేమ్స్ ... ఇండోర్ గేమ్స్ చిన్నపిల్లలు పెదా వాళ్ళు అందరూ ఎంజాయ్ చెయ్యొచ్చు.. కాని అవుట్ డోర్ గేమ్స్ నాకులాంటి ధైర్యస్తులు మాత్రమే వెళ్ళాలి..ఏంటలా చూస్తారేంటి ..నమ్మరా.. ఇప్పుడంటే భయమేస్తుంది కాని ఓ పదేళ్ళక్రితం "నువ్వు నాకు నచ్చావ్లో బ్రహ్మానందం ఎక్కిన రోలర్ కోస్టర్ లో నాలుగు సార్లు ఎక్కేసాను తెలుసా..ఇంక ఈ గేమ్స్లోకి వెళ్ళమంటే టైం ఏం ఉండదు ...అలా ఆడుకోవడమే ఆడుకోవడమే ఆడుకోవడమే..హా మర్చిపోయాను ఇక్కడ పెద్ద జూద గృహం ఉంది.. అబ్బా...అదే ఏదో అంటారుగా కేసినో ఏదో అదన్నమాట ..నేను మొదటి సారి అందులో పది రింగెట్లు జూదమాడి గెలిచాను ...కాని మా ఆయన మళ్ళీ ఆడించి ఇంకు ఇరవై తగలేయించి బయటకు తీసుకొచ్చారు :(...
అలా మన దగ్గరున్న డబ్బులు ,ఓపిక అన్ని అయ్యేవరకూ ఆడుకుని కాసేపు ఆ కొండ ప్రాంతం అంతా తిరిగి సాయంత్రం మళ్ళీ అదే రోప్ వేలో క్రిందకు వెళ్లి పోవచ్చు ..కాని పైన భోజనాలు పిచ్చ రేట్లు ..క్రింద ప్యాక్ చేయించుకుని తెచ్చుకు తినండి ..ఇక షాపింగ్ అయితే మన తెలివి పై ఆధారపడి ఉంటుంది..ఉదాహరణకు ఒక విషయం చేపాతాను..
కౌలాలం పూర్లో చైనా బజార్ అని ఒకటుంటుంది..మన సంతల లెక్కన టెంట్ లేసుకుని అమ్ముతారు.. మొదటి సారి వచ్చినప్పుడు మా ఆయన ఒక సంతలో ఫ్రెండ్స్ కి లైటర్స్ కొంటా అన్నారు .. మొదటి దుకాణం వాడి దగ్గర అడిగితే రివాల్వర్ మోడల్ లో ఉన్న లైటర్ ౩౦ రింగేట్స్ అన్నాడు.. మా ఆయనగారు 25 రింగేట్స్ కి బేరమాడి నా వైపో లుక్కిచ్చారు.. ఒక పది కోనేసాం ... నెక్స్ట్ షాప్ వాడి దగ్గరకు వెళ్లి ఇదెంత బాబు అనగానే ఇది 25 కాని మీకు 20 కి ఇస్తాను అన్నాడు ..ఆ నెక్స్ట్ షాప్ వాడు 15 కే ఇస్తా అన్నాడు..ఇంకో షాప్ వాడి దగ్గరకు వెళితే అయిదు కి ఇస్తా అన్నాడు.. ఇక ఆఖరి షాప్ వాడు పది రింగేట్స్ కి మూడు అన్నాడు ... ఇక ముందుకు వెళితే ఊరికే ఇస్తానంటాడేమో అని భయమేసి వెళ్ళ లేదనుకోండి..అలాగే హ్యాండ్ బ్యాగ్ 350 రింగేట్స్ కొంటే ముందు షాప్లో 50 రింగేట్స్ కి బెరమాడింది ఇంకో అమ్మాయి..:( కాబట్టి నేను చెప్పొచ్చేదేమిటంటే ఇక్కడ బేరాలు ఆడగలిగే సత్తా ఉన్నవాళ్ళు మాత్రమే ఆ షాప్స్ కి వెళ్లి లాభములు పొందగలరు..లేదా బేండ్ బజాయింపే...మామూలు పెద్ద షాప్స్ లో ఫిక్స్డ్ రేట్లే లెండి..
అదన్నమాట నేను చూసిన మలేషియా..