28, నవంబర్ 2011, సోమవారం

నేను చూసిన మలేషియా

అప్పుడెప్పుడో రాద్దామనుకున్నా పోస్ట్ అన్నమాట ఇది..నా జ్ఞాపకాల్లో ముఖ్యమైనదినూ పనిలో పని సింగపూర్ ,ఇండోనేషియ,మలేషియా చూడాలనుకునే వాళ్లకు ఉపయోగకరంగా ఉంటుంది అనీను రాస్తున్నా..

ముందు మలేషియా గురించి చెప్పుకుందాం..మేమసలు సింగపూర్ రాక మునుపు ఓ వెన్నెల రాత్రి చందమామను చూస్తూ విదేశాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ మలేషియా ప్రస్తావన వచ్చింది ...నీకు తెలుసా బుజ్జీ సింగపూర్ నుండి మలేషియాకు సముద్రంలో వంతెన కట్టేసారట ...మా ఉదయ్ లేడూ..వాడు చెప్పాడు.. టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందో కదా అనగానే నేను ఓ రేంజ్లో ఆశ్చర్యంగా నోరుతెరుచుకుని ఉండిపోయాను ...

"నిజ్జంగానా...మన గోదావరి బ్రిడ్జ్ చూసే నాకు మతిపోతుంది ఎలా కట్టారా అని..... అలాంటిది ఆ అలల్లో ఇంకో దేశానికి వంతెన కట్టేయడమే ..హ్మ్మం మానవుడు సామాన్యుడు కాదండి ...ఈ లెక్కన రామాయణం నిజమే నన్నమాట ..." అని బోలెడు బోలెడు హాచ్చర్య పడిపోయాను..

విధి విచిత్రమైనది..బోలెడు అద్భుతాలు చూపిస్తుంది... ఆ మాట అనుకున్న సంవత్సరం కూడా తిరక్కుండానే నన్ను మలేషియా ఎంబసి దగ్గర నించో పెట్టింది ...సింగపూర్ వచ్చ్సిన నెలరోజులకే నేనే నేనే వీసా తెచ్చాను.. వద్దులెండి అదో పెద్ద కధ ...ఆ విషయం తరువాత చెప్పుకుందాం..ప్యాకేజ్ లలో కాకుండా మనకు మనమే స్వయంగా వెళ్లి చూసేసోద్దాం అని మా ఆయన అనేసరికి సరే అని మరుసటి రోజు రాత్రి వుడ్ లాండ్స్ అనే ఊరికి బయలు దేరాం ...మా సింగపూర్లో ఏ మూల నుండి ఏ మూలకి వెళ్ళినా గట్టిగా గంటన్నర జర్నీ ఉంటుంది ....ఇక రాత్రే ఎందుకు బయలుదేరాం అంటే .. సింగపూర్ నుండి కౌలాలం పూర్ (మలేషియా రాజధాని ) బస్లో ఒక నాలుగు గంటలు జర్నీ ఉంటుంది అంతే ...కాబట్టి రాత్రి జర్నీ వల్ల మనకు రోజు మొత్తం కలసి వస్తుంది కదా..


అయితే ట్రైన్ లో కూడా వెళ్ళొచ్చు..కాని మీరు మాత్రం ట్రైన్లో అస్సలు వెళ్లొద్దు..పరమ ,శుద్ద వేస్ట్.. మేము నెక్స్ట్ టైం ట్రైన్ లో వెళ్లి మా చెప్పులు తెగేలా కొట్టుకున్నాం ...ఎందుకంటే ట్రైన్లో వెళితే టిక్కెట్ రేట్ త్రిబుల్ ఉంటుంది..పైగా జర్నీ వచ్చీ పన్నెండు గంటలు ...(బస్సులో ఎంత స్లో వెళ్ళినా నాలుగు గంటలే ) ఇంకా రాత్రి పడుకున్నప్పుడు ఆ కుదుపులకు ట్రైన్ పడిపోతుందేమో అన్నంత భయం వేసేసింది.. మన ఇండియాలో ట్రైన్లు లో ఎంత హాయిగా పడుకుంటాం..ఇదయితే ప్రొద్దున్న లేచ్చేసరికి ముసుగేసి చితక్కోట్టేసినట్లు ఒళ్ళంతా నెప్పులే నెప్పులు...వచ్చేప్పుడు భయపడి కూర్చుని వచ్చాం ... మరెందుకు ట్రైన్ పెట్టారో ..ఇంకెందుకు జనాలు దానిలో వెళతారో ఆ ట్రైన్ పెట్టినవాడికే తెలియాలి..



సరే ఎంత వరకూ చెప్పుకున్నాం..హా..వుడ్లాన్డ్స్ లో ఇమిగ్రేషన్ దగ్గర .. వీసాలు గట్రాలు లగేజ్లు అన్ని చెక్ చేసుకున్నకా ... అక్కడి నుండి జోహార్ బరు (JB )అనే ఊరుకి బస్ ఉంటుంది ...ఇంకేంటి అదే మలేషియా ..అంటే మలేషియా బోర్డర్ అన్నమాట ....అంటే సముద్రంలో కట్టిన వంతెన మీద మరో దేశానికి ..అచ్చంగా మరో దేశానికి వెళ్ళిపోతాం అన్నమాట..అసలు చదువుతున్న మీకే ఇంత ఒళ్ళు పులకరించిపోతుంటే వెళుతున్న నాకెలా ఉండి ఉంటుంది..ఆ అనుభూతిని సొంతం చేసుకోవడానికి ప్రిపేర్ అవుతూ గట్టిగా ఊపిరి పీల్చి తన్మయంగా కళ్ళు మూసుకుని మెల్లిగా కళ్ళు తెరిచేసరికి బస్ ఆపేసాడు ...పద పద మలేషియా వచ్చేసింది అన్నారు మా ఆయన :(... అప్పుడే వచ్చేసామా !!!! మరి వంతెనో అనగానే ..ఇందాక దాటేసాం కదా అన్నారు..అదన్నమాట సంగతి ...అంటే మన ఊర్లో గోదావరి బ్రిడ్జ్లో సగంలో సగం...ఛీ ఎందుకులెండి ఓ పిల్లకాలువ పైన ఉన్నంత బ్రిడ్జ్ ఉందన్నమాట అంతే...పాపం మా సింగపూరోళ్లు దూరమైతే కట్టేసేవాళ్ళమ్మా ..కాని ప్రక్క ప్రక్కనే ఉన్నాయి రెండు దేశాలునూ... వాళ్ళుమాత్రం ఏం చేస్తారూ!!!..



అలా జే బి బస్ స్టాండ్లో నిన్చున్నామా ...అక్కడ వరుసగా బోలెడు బస్సులున్నాయి ...కౌలాలంపూర్ కౌలాలం పూర్ అని పిలిచిమరీ టిక్కెట్స్ ఇస్తున్నారు..మేము రాత్రి ఒంటిగంటకు ఒక బస్ ఎక్కాం .... చెప్పానుగా మధ్యలో వాడు అరగంట రెస్ట్ రూమ్స్ దగ్గర ఆపినా నాలుగు గంటలే జర్నీ ...సరే సరిగ్గా అయిదింటికల్లా మలేషియాలో పుదురాయ బస్ స్టాప్లో దిగాం ...మేము మొదటి సారి మలేషియా వెళ్ళినప్పుడు హోటల్ గెంటింగ్ (జెంటింగ్) లో తీసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయాం అనుకోండి ...కాని ముందు నేను కే ఎల్ లో ముఖ్యమైన ప్లేస్లు చెప్పేస్తాను ...



కే ఎల్ లో ముఖ్య మైనవి ఊ..మామూలుగా ట్విన్ టవర్స్ ...ఇంకా కే ఎల్ టవర్ ...ఇంకా బటూ కేవ్స్ ,ఇంకా జెంటింగ్,ఇంకా సన్ వే లగూన్ ,ఇంకా అండర్ వాటర్ వరల్డ్.. ఓపిక ఉంటే బర్డ్స్ పార్క్,జూ ఇలా అన్నమాట..అయితే ఇక్కడ హోటల్ వాడు అరేంజ్ చేసిన టాక్సీ ఎక్కామో సీన్ సితారే అన్నమాట.. వాడు గంటకు 80 రింగేట్స్ అడిగాడు ...అంటే రోజులో ఒక ఏడుగంటలు తిరిగామనుకోండి ఎంతవుతుందో లేక్కేసుకోండి ... మా ఆయన సరే అనేసారు ఎంచక్కా తల ఊపేసి ...నేను ఆ అరాచకాన్ని సహించలేక మేము బయటకొచ్చి తింటున్న తమిళ్ ఫుడ్ సెంటర్ వాడిని అడిగాను..



ఇక్కడ హోటల్ అంటే గుర్తొచ్చింది ...మలేషియాలో ఫుడ్ సూపర్ డూపర్ చీప్ (అంటే మా సింగపూర్ తో పోలిస్తే )మాకు పది డాలర్లకు వచ్చేది అక్కడ ఐదు డాలర్లకే వస్తుంది..సగానికి సగం తేడా ఉంటుంది..అది ఫుడ్ అయినా బట్టలయినా సరే ... అంటే కళ్ళు చెదిరే షాపింగ్ కాంప్లెక్స్లో కొద్దిగా బేండ్ వేస్తాడు...కాబట్టి బట్టలు లాంటివి బయట షాప్స్లో కొంటే బాగా కలిసొస్తుంది.. అయితే ఇక్కడ మరొక విషయం తమిళియన్స్ ...అబ్బా నాకు తమిలియన్స్లో నచ్చేవిషయం ఏమిటంటే వాళ్ళ ప్రాంతం వారి పై ఇంకా వాళ్ళ భాష పై ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం.. ఎలాంటి సహాయం అయినా అడగకుండా చేస్తారు..అదే కొద్దిగా తమిళ్ ముక్కలు రాకపోయినా మాట్లాడటాని ట్రై చేసామనుకోండి మనకు నీరాజనాలే..



అందుకే ఆ హోటల్ తమిళ్ ఓనర్ తో " అన్నా.... ఎనకు తమిళ్ తెరియాదు ....ఆనా రొంబ పుడికం.... కొంజెం కొంజెం పురియుం.. ..హెల్ప్ పన్ను" అని ఎంతో ఇదిగా నా తమిళ్ సీరియల్స్ ప్రతిభను ఉపయోగించి అడిగేసరికి అతనే ఒక కేబ్ అబ్బాయిని పిలిచి దగ్గరుండి బేరమాడి మాకు హెల్ప్ చేసాడు .. ఎంతో చెప్పనా..... మొత్తం రోజంతటికీ ౩౦౦ రింగేట్స్ ...కాబట్టి ఎంచక్కా నేను చెప్పినట్లు చెయ్యండి ..



ఆ కేబ్ అబ్బాయి ఎంచక్కా అసలు లిస్టు లో లేని చాలా ప్లేస్లు తిప్పాడు ...ఏవో ముస్లిం భవనాలు,హైకోర్ట్ , ఇంకా ఏంటో ఏంటో లే ...మనం అవన్నీ వదిలేసి ముఖ్యమైనవి చెప్పుకుందాం...




ట్విన్ టవర్స్ ..మొదటి సారి మలేషియా వెళ్ళినప్పుడు నేను ట్విన్ టవర్స్ చూడలేదు.. సుత్తిలే ఎవడు చూస్తాడు టీవి లో చూసాం గా అని..మనకు ఏది ఓ పట్టాన ఎక్కదుగా... కౌలాలం పూర్లో ఎక్కడ తిరుగు... ఈ ట్విన్ టవర్ కనబడుతూనే ఉంటుంది ... కాని ఆ తరువాత చాలా సార్లు వీటిని చూడటానికే ప్రత్యేకంగా వెళ్లాను అంటే అర్ధం చేసుకోండి ..ఎంత బాగుంటుందో.. వీటిని పగలు చూస్తే ఏం బాగోవు మామూలుగా ఉంటుంది ...కాని రాత్రి చూస్తే మాత్రం అక్కడే కూర్చుని వాటిని చూస్తూ తెల్లార్లూ గడిపేద్దాం అనిపిస్తుంది.. ఎంత బాగుంటుందో..నాకు వర్ణించడం రావట్లేదు మరి.. ఇది కట్టించడానికి ఏదో కారణం చెప్పాడబ్బా కేబ్ వాడు ...సమయానికి నాకు గుర్తురావడం లేదు..అయితే ఈ టవర్స్ ని ఎక్కాలంటే ప్రొద్దున్నే లేచి అయిదుగంట్లకో ఎప్పుడో క్యూలో నించుంటే ఒక రెందొందలమంది పంపుతాడట... హిహిహిహి మనసంగతి తెలుసుగా ..ఇప్పటికోచ్చి ఎక్కలేదు ఎన్నిసార్లు వెళ్ళినా..




ఇంకొకటి కే ఎల్ టవర్ దీన్ని కూడా నేను ఎక్కలేదు ..దూరం నుండి చూసాను అంతే... కాబట్టి తెలియదు దీని గురించి..








ఇక బటు కేవ్స్ ..ఇది సూపర్ డూపర్ ..చాలా సినిమాల్లో ఈ గుడిని తీసారు.. పే........ద్ద సుభ్రమణ్య స్వామీ విగ్రహం ఉంటుంది ... సూపర్ అంతే ...అక్కడో నాలుగు వందల మెట్ల ఎత్తోలో గుడి ఉంటుంది పైన గుహలో ... ఆ మేట్లేక్కేసరికి కాళ్ళు పడిపోతాయి.. కాని లోపల చాలా బాగుంటుంది.. ఇంకా దారంతా కోతులు ..ఆ జనాలను చూస్తే నాకు తిరపతి గుర్తొచ్చింది.. అన్నట్లు మర్చిపోయాను ఈ పూజలు వ్రతాలూ అంటే ఏ మాటకామాట చెప్పుకోవాలి..తమిళియన్సే ...బాగా చేస్తారు...







ఇంకా సన్వే లగూన్ ....ఇదేమో పెద్ద వాటర్ వరల్డ్ అన్నమాట ...దీని దగ్గరకు వెళ్ళాలంటే అలా ఎన్ని ఫ్లోర్స్ క్రిందకు దిగాలో ...బయట నుండి చూస్తేనే సూపర్ డూపర్ బంపర్ ఉంటుంది ...అసలు పిల్లలు ఉన్నవాళ్ళు దీనికోసమే మలేషియా వెళతారు...




అండర్ వాటర్ వరల్డ్..ఇది అచ్చం సింగపూర్ లానే ఉంటుంది ...అస్సలేం తేడా ఉండదు.. ఆ చేపలు గట్రాలు అన్ని సేమ్ సేమ్ కాని ... ఆ లోపల డెకరేషన్ కి నేను పడిపోయాను..అదేదో బృందావనం లా ఇంకేదో లోకంలా ...లోపల అన్ని లతలు తీగలు ,పళ్ళు,కాయలు అబ్బబ్బబ్బా నాకయితే ఎంత నచ్చేసిందో.. నా కోసమయినా వెళ్ళండి అంతే అంతే ...

హా ఇక్కడ ఇంకొకటి చెప్పాలి ..ఇక్కడ ఎక్కడకు వెళ్ళినా చాక్లెట్ ఫ్యాక్టరీలని,లెదర్ ఫ్యాక్టరీలని అంతా ప్యూర్ చాక్లెట్ ,లెదర్ దొరుకుతుందని కేబ్ వాళ్ళు మనల్ని మొహమాటం కూడా పెట్టకుండా తీసుకు వెళ్ళిపోతారు ...వాళ్లకు వాళ్లకు ఏవో ఒప్పందాలు ఉంటాయన్నమాట..ఆ వస్తువులు ధర బయట వాటికి కనీసం అధమ పక్షం ఒక పదిహేను రేట్లు ఎక్కువ ఉంటుంది..అయినా జనాలు కోనేస్తూ ఉంటారేమిటో... నేను చెప్పేది చెప్పాను మరి..వెళ్ళేవాళ్ళు ఉంటే ఆలోచించుకోండి :)



ఇక బర్డ్స్ పార్క్ ,జూలు మిగిలినవి నేను చూడలేదు ..టైం లేదు ..మరి నాకు తెలియదు..కాకపొతే మా సింగపూర్ కి మలేషియాకి తేడా ఏమిటంటే మా వాళ్ళు ప్లేస్ లేక పది ఎకరంలో కట్టినదాన్ని మలేషియావాళ్ళు యాబై ఎకరాల్లో కడతారు అది సంగతి.. నీట్ నెస్ గాని మిగిలిన ఏ విషయమైనా సరే మా దేశం తో పోల్చుకోలేము దాన్ని ..( మా సింగపూర్ని బాగా పొగుడుకున్నా కదా) ... అయితే ఇక్కడ మేము వెళ్ళిన కొత్తలో ఎవరూ ఇంగ్లిష్ మాట్లాడక చాలా ఇబ్బంది అయ్యేది కాని ఈ మధ్య పర్లేదు..అలాగే ఇక్కడ లోకల్ ట్రైన్స్ భలే ఉంటాయి ..మొకమల్ క్లాత్ తో అదేదో రాజ్ మహల్ లో ఉన్నట్లు..కాకపొతే అబ్బ ప్రతి ట్రైన్ అరగంటకోసారి వస్తుంది ....చిరాకు బాబు ..



ఇప్పుడు జెంటింగ్ ... జెంటింగ్ కి వెళ్ళాలంటే తెల్లవారు జామున వెళితే ఉంటుంది కదా......సూ..ప..ర్ అంతే ...అసలు ఎంత బాగుంటుందో.. అక్కడకు రోప్ వే ఉంటుంది.. అంటే తెలుసుకదా కేబుల్ కార్ లో వెళ్ళడం అన్నమాట..తెల్లవారు జామున మబ్బుల్లో , ఆ చలిలో క్రింద లోయలు ,పైన ఆకాశం ..మధ్యలో ఒక్క తాడుకి వ్రేల్లాడుతున్న పెట్టెలో మనం ....ఓ సారి ఊహించుకోండి ...కొద్దిగా భయం వేసినా కాసేపటికి బాగా ఎంజాయ్ చేస్తాం.. మా సింగపూర్ తో పోలిస్తే ఇక్కడ చాలా చీప్ ...ఈ రోప్ వే మీద జర్నీ చేయడం.. అప్పుడు ..ఎంచక్కా జెంటింగ్ వెళ్ళిపోతాం ...



జెంటింగ్ లో ఏముంటుంది అంటే ఏమీ ఉండదు... పెద్ద కొండ పై బాగా డబ్బులు వదిలించుకోవడానికి కావలసిన అన్ని హంగులు ఉంటాయి..ఇండోర్ అవుట్ డోర్ గేమ్స్ ... ఇండోర్ గేమ్స్ చిన్నపిల్లలు పెదా వాళ్ళు అందరూ ఎంజాయ్ చెయ్యొచ్చు.. కాని అవుట్ డోర్ గేమ్స్ నాకులాంటి ధైర్యస్తులు మాత్రమే వెళ్ళాలి..ఏంటలా చూస్తారేంటి ..నమ్మరా.. ఇప్పుడంటే భయమేస్తుంది కాని ఓ పదేళ్ళక్రితం "నువ్వు నాకు నచ్చావ్లో బ్రహ్మానందం ఎక్కిన రోలర్ కోస్టర్ లో నాలుగు సార్లు ఎక్కేసాను తెలుసా..ఇంక ఈ గేమ్స్లోకి వెళ్ళమంటే టైం ఏం ఉండదు ...అలా ఆడుకోవడమే ఆడుకోవడమే ఆడుకోవడమే..హా మర్చిపోయాను ఇక్కడ పెద్ద జూద గృహం ఉంది.. అబ్బా...అదే ఏదో అంటారుగా కేసినో ఏదో అదన్నమాట ..నేను మొదటి సారి అందులో పది రింగెట్లు జూదమాడి గెలిచాను ...కాని మా ఆయన మళ్ళీ ఆడించి ఇంకు ఇరవై తగలేయించి బయటకు తీసుకొచ్చారు :(...


అలా మన దగ్గరున్న డబ్బులు ,ఓపిక అన్ని అయ్యేవరకూ ఆడుకుని కాసేపు ఆ కొండ ప్రాంతం అంతా తిరిగి సాయంత్రం మళ్ళీ అదే రోప్ వేలో క్రిందకు వెళ్లి పోవచ్చు ..కాని పైన భోజనాలు పిచ్చ రేట్లు ..క్రింద ప్యాక్ చేయించుకుని తెచ్చుకు తినండి ..ఇక షాపింగ్ అయితే మన తెలివి పై ఆధారపడి ఉంటుంది..ఉదాహరణకు ఒక విషయం చేపాతాను..


కౌలాలం పూర్లో చైనా బజార్ అని ఒకటుంటుంది..మన సంతల లెక్కన టెంట్ లేసుకుని అమ్ముతారు.. మొదటి సారి వచ్చినప్పుడు మా ఆయన ఒక సంతలో ఫ్రెండ్స్ కి లైటర్స్ కొంటా అన్నారు .. మొదటి దుకాణం వాడి దగ్గర అడిగితే రివాల్వర్ మోడల్ లో ఉన్న లైటర్ ౩౦ రింగేట్స్ అన్నాడు.. మా ఆయనగారు 25 రింగేట్స్ కి బేరమాడి నా వైపో లుక్కిచ్చారు.. ఒక పది కోనేసాం ... నెక్స్ట్ షాప్ వాడి దగ్గరకు వెళ్లి ఇదెంత బాబు అనగానే ఇది 25 కాని మీకు 20 కి ఇస్తాను అన్నాడు ..ఆ నెక్స్ట్ షాప్ వాడు 15 కే ఇస్తా అన్నాడు..ఇంకో షాప్ వాడి దగ్గరకు వెళితే అయిదు కి ఇస్తా అన్నాడు.. ఇక ఆఖరి షాప్ వాడు పది రింగేట్స్ కి మూడు అన్నాడు ... ఇక ముందుకు వెళితే ఊరికే ఇస్తానంటాడేమో అని భయమేసి వెళ్ళ లేదనుకోండి..అలాగే హ్యాండ్ బ్యాగ్ 350 రింగేట్స్ కొంటే ముందు షాప్లో 50 రింగేట్స్ కి బెరమాడింది ఇంకో అమ్మాయి..:( కాబట్టి నేను చెప్పొచ్చేదేమిటంటే ఇక్కడ బేరాలు ఆడగలిగే సత్తా ఉన్నవాళ్ళు మాత్రమే ఆ షాప్స్ కి వెళ్లి లాభములు పొందగలరు..లేదా బేండ్ బజాయింపే...మామూలు పెద్ద షాప్స్ లో ఫిక్స్డ్ రేట్లే లెండి..


అదన్నమాట నేను చూసిన మలేషియా..

13, సెప్టెంబర్ 2011, మంగళవారం

పాడమని నన్నడగవలెనా!!!!

చిన్నప్పటి నుండి నాకు రెండు తీరని కోరికలు ఉండిపోయాయి ..ఒకటి .. " పంచభూతములు ముఖ పంచకమై...చతుర్వేదములు ప్రాకారములై " అంటూ సాగరసంగమం కమల్ హాసన్ లా కదక్, కూచిపూడి మణిపురి , ఒడిస్సీ ,భరతనాట్యం ఇలా అన్ని నృత్యాలు నేర్చేసుకుని స్టేజ్ ఎక్కి మరీ ఆహా ఓహో అనిపించేసుకోవాలని.. రెండోదేమో అదే స్టేజ్ మీద కుడిచేయి ఒక తిరగా, ఒక బోర్లా వేస్తూ ..సరిగమపదనిస సనిదపమగరిస అంటూ బోలెడు కచేరీలు ఇచ్చేయాలని .....

నాకు తెలుసు మీరందరూ దిగులు దిగులుగా,భయం భయంగా చూస్తున్నారని ...ఆ మాత్రం జాలి, మీ ఆరోగ్యం పట్ల శ్రద్ద నాకు లేవనుకున్నారా !! అందుకే మొదటిదాన్ని చెప్పకుండా మీకోసం త్యాగం చేస్తున్నాను..దానికి ప్రతిఫలంగా రెండోవ విషయం వినాలి ...:)


అంటే అసలు ఈ పాటలు పాడాలి అన్న కాన్సెప్ట్ నాలో ఎప్పటినుండి మొదలైంది అంటే ..శంకరాభరణం సినిమాలో సోమయాజులు వరలక్ష్మిని ..తెల్లవారుజామున పీకల్లోతు నీటిలో ముంచేసి
సా రి గ రీ గ పదా పా
స రి గ ప దా ప గ రీ
రి గ ప ద సా నీ దా పా అని .... సంగీతం నేర్పే సీన్ చూసినదగ్గరనుండి .." ఓస్ ఇంతేనా ????ఇంత సింపులా పాడటం అంటే?" అనేసుకున్నాను .. ఆ పళంగా రెండు రోజులు ప్రొద్దున్నే లేచి మా ఇంట్లో నీళ్ళ కుండీలో అమ్మ చూడాకుండా ఒక ఐదు నిమిషాలు "ఖష్ట పడి " సాధన చేసేసాను... ఇంకేముంది నాకు సంగీతం వచ్చేసింది ...

అయితే ఒట్టి సంగీతం వచ్చేస్తే సరిపోతుందేమిటీ!! .. పాటలు కూడా రావాలిగా ..అప్పట్లో అప్పుడప్పుడు రేడియో పాటలు..వారానికోసారి టీవిలో వచ్చే చిత్రలహరి తప్ప పాటలు నేర్చుకోవడానికి వేరే ప్రత్యమ్నాయం ఉండేదికాదు ... అప్పుడెలాగా?? అని ఆలోచిస్తే మా అక్క గుర్తొచ్చింది..దాని నోట్ బుక్స్ నిండా స్కూల్ లో వాళ్ళ మిస్ లు నేర్పే పాటలే.. అంతే ..మా పై మేడ ఎక్కేసి అబ్బో తెగ ప్రాక్టీస్ చేసేసాను....ఇంకేంటి కచేరి చేయడం ఒక్కటే మిగిలింది.... ఇక శ్రోతల్ని సమకూర్చుకోవడమే..

సరిగ్గా అదే టైమ్లో మా పెద్దమ్మ.. మా పెద్దక్క లెక్కల్లో క్లాస్ ఫస్ట్ వస్తుందని వద్దు వద్దని మొత్తుకున్నా బలవంతంగా ఓ ట్యూషన్ లో జాయిన్చేసేసింది.. అది ఏడుస్తుంటే నవ్విన పాపానికి నేరుగా మా అమ్మదగ్గరకు వెళ్లి .."పిన్నీ నేనైతే క్లాస్ ఫస్టే..మన బుజ్జయితే స్కూల్ ఫస్ట్ వస్తుంది "అని చెప్పిన మరుసటి రోజే దానితో పాటు నేనూ అదే ట్యూషన్లో చేరాల్సి వచ్చింది...

అలా లెక్కలేనన్ని తిట్లు తిట్టుకుంటూ లెక్కలు చేసుకుంటూ రోజులు లెక్కపెట్టుకుంటుంటే ..ఒక శుభముహుర్తాన మా సార్ వాళ్ళ పాప పుట్టినరోజు వచ్చింది ..అందరం ఎప్పటిలా పుస్తకాలు ముందేసుకోగానే సార్ వాళ్ళ అమ్మగారు .."అరే ..పండగ పూట పాఠాలేమిటిరా ఈ రోజు పిల్లల చేత నాలుగు పాటలు పాడించరాదూ" అనేసరికి ఎగిరి గెంతులేసేయాలనిపించింది .. అసలే ఆయనకు వాళ్ళ అమ్మగారంటే మహా గౌరవం (భయం?) ఉండేది.. సరే ఎవరన్నా వచ్చి మంచిపాటలు పాడండి అన్నారు..

నాకేమో నేర్చుకున్న పాటలన్నీ పాడేయాలని ఉందికాని... మరీ నాకు నేనుగా అంటే లోకువ అయిపోతానని సార్ పిలుపు కోసం ఎదురుచూస్తున్నా ..అబ్బే ..ఆయన నన్ను పట్టించుకుంటే కదా.. ఎవరెవరినో పిలుస్తున్నారు.. ఇహ లాభం లేదని నా పక్కదానితో గుస గుసగా .."హే నాకు చాలా పాటలు తెలుసు కానీ ఏమో బాబు నాకు భయం "అన్నాను సిగ్గుపడుతూ.. ఆ పిల్ల నావైపు ఓసారి చూసి "ఓహో " అనేసి మళ్లీ తలతిప్పేసుకుంది..ఎవర్తివే నువ్వు గాడిద అని కసిగా తిట్టుకుని ఇటు మా అక్క వైపు తిరిగాను.. నేనింకా విషయం చెప్పకముందే ..నీకెందుకే నోరుమూసుకుని కూర్చో అనేసింది కుళ్ళు మొహంది .... దున్నపోతా అని అనుకుంటుంటే మా గుసగుసలకు సార్ నా వైపు చూసి నువ్వు పాడతావమ్మా అన్నారు ....

ఆట్టే బెట్టు చేస్తే మొదటికే మోసం అని ' ఊ ' అని తల ఊపాను మొహమాటంగా .. ఆలోపలే సార్ వాళ్ళ అమ్మగారు ఇద్దరుముగ్గురు ఫ్రెండ్స్ని కూడా తీసుకు వచ్చేసారు షోకి ... నేను గట్టిగా ఊపిరిపీల్చి శ్రావ్యంగా మొదలుపెట్టాను .."ఏసయ్య ఇంటి ముందు సిరిమల్లె చెట్టు సిరిమల్లె చెట్టు " మొదటి లైన్ పూర్తవ్వగానే సార్ వాళ్ళ అమ్మగారు ఫ్రెండ్స్ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూడటం మొదలు పెట్టారు ...ఏదో తేడా తెలుస్తుందికాని అదేమిటో తెలియడం లేదు ... ఇంకో నాలుగైదు లైన్స్ పాడగానే వాళ్ళందరూ మూకుమ్మడిగా మా సార్ ని చూడటం మొదలు పెట్టారు...

మా సార్ మధ్యలో ఆపేసి పాప ఇంకో మంచి పాట పాడమ్మా అన్నారు.. ఓస్ అంతే కదా అనుకుని గొంతు సవరించుకుని మరొక పాట మొదలు పెట్టాను "దేవుడే నాకాశ్రయంబు " ... పాట మొదలు పెట్టిన అయిదు నిమిషాలకే వాళ్ళ అమ్మగారి ఫ్రెండ్స్ మూతి మూడు వంకర్లు తిప్పి.. వస్తాను కామాక్షిగారు పొయ్యి మీద ఎసరు మరిగిపోతుంది అని మనిషికో వంక పెట్టి వెళ్ళిపోయారు.. ఆవిడ రుస రుసలాడుతూ కొడుకు వైపు ఒక్క చూపు చూసి లోపలికి వెళ్ళిపోయింది..ఆ తరువాత మా సార్ ఇక పాటలు చాలు పుస్తకాలు తీయండి అనో గసురు గసిరి ఓ గంట ఎక్కువ వాయించేశారు .. "బుద్దుందా అసలు ..రోజంతా మడి చీరతోనే తిరుగుతూ మనం వెళ్ళగానే ఇల్లంతా కడిగేసుకునే చాదస్తం ఆవిడది ..అక్కడ ఆ పాటలు పాడుతావా " అని ఆ రోజంతా మా పెద్దక్క తిట్లతో తెల్లారిపోయింది నాకు .."

ఆ దెబ్బతో కొన్నాళ్ళు పాడుతా తీయగా కార్యక్రమం వాయిదా వేసాను ... కాని మనకి అవకాశాలు తంపానుతంపరలుగా తన్నుకోచ్చేస్తే ఏం చేసేది ??? ఓ రోజు మా స్కూల్లో ఇన్స్పెక్షనో పాడో గుర్తులేదుగాని ఒక అతను వచ్చారు.. మా సార్లు అందరూ కంగారుగా వాళ్ళ వెనుక పరుగులు పెడుతున్నారు .. అతను రావడం రావడం ఖర్మకాలి(ఎవరి ఖర్మ అనేది ముందు ముందు తెలుస్తుంది) మా క్లాస్ కు వచ్చారు.. వచ్చిరాగానే మీలో దేశభక్తి ఎంత మందికి ఉంది అన్నారు.. మొత్తం చేతులు ఎత్తేసాం.. మీలో దేశభక్తి గీతాలు ఎవరికి వచ్చు అన్నారు.. నేను ,మా స్వాతి నిన్చున్నాం.. మరి మేమే రోజు ప్రేయర్లో వందేమాతరం పాడేది.. దేశభక్తి అంటే దేశం లో ఉన్న లోపాలు కప్పేసి సుజలాం సుఫలాం అంటూ లేనివి ఉన్నట్లు పాడేయడం కాదు... లోపాలేమిటో తెలుసుకుని వాటిని పారద్రోలడం ..అసలు మన దేశం లో పేదరికం పై ఉన్న కవితలు, పాటలు ఎవరికైనా తెలుసా అన్నారు ..పాపం ఆయన ఉద్దేశం శ్రీ శ్రీ గురించో మరొకరి గురించి చెప్తామని కాబోలు... మాకు అప్పట్లో అంత నాలెడ్జ్ ఎక్కడిది...మేమందరం తీవ్రంగా ఆలోచిస్తుంటే ఆయన చూపు నా మీద పడింది..

ఏది ఓ మంచి పాట పాడు అన్నారు ఆయన నా వైపు చూస్తూ..(చెప్పానుగా తలరాత) నేనేమిటంటే నాగేశ్వరరావు పాట " పాడవోయి భారతీయుడా" పాట గుర్తుతెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాను ..ఆయన ఉన్నట్లుండి నన్ను అడిగేసరికి ఆ కంగారులో మర్చిపోయాను ..ఎంత గింజుకున్నా గుర్తురాదే ... పోనీ రాదనీ చెప్దామా అంటే రాక రాక వచ్చిన అవకాసం .. ఈ లోపల అనుకోకుండా చిన్నప్పుడు రేడియోలో విన్న ఒక పాట గుర్తు వచ్చింది.. పూర్తిగా గుర్తులేదు ఏదో పల్లవి ... ఏదైతే ఏమిటిలే అని మొదలుపెట్టేసాను ఆలోచించకుండా... ఎవరూ భయపడకండెం.. ఆ పాటేమిటంటే ....

ఇల్లూ వాకిలి లేదు...
వెనకా ముందు లేరు..( ఈ ముక్కను ఎలకల మందు లేదు అని పాడేదాన్ని ...నాకు సరిగా వినిపించకా)
ఎక్కడికని పోనూ....

పాట ఇంకా పల్లవి అవ్వనేలేదు మా సార్లు,మేడం లు గోడకి దభేల్ ధబెల్ మని మూకుమ్మడిగా తల కొట్టేసుకుని నా నోరు మూయించేసారు అంతే... మరి నాకేం తెలుసు అది ఐటం సాంగ్ అని ..పాపం ఒక అమ్మాయి బీదరికంతో ఎలకల మందు మింగిచనిపోదాం అనుకుంటూ అలా పాడేదనుకునేదాన్ని ... ఆ తరువాత మా హెడ్ మాస్టార్ నన్ను ప్రత్యేకంగా పిలిపించి స్పెషల్ గా పొగిడేసరికి మళ్లీ ఇంకోసారి అవుట్ డోర్ కచేరీలు పెట్టలేదు ...అయినా తిరిగే కాలు పాడే నోరు ఊరుకుంటాయా ??? అసలు ఇదంతాకాదు ఇంట గెలిచి రచ్చగెలవమన్నారు కాబట్టి ముందు ఇంట్లోవాళ్ళతో శభాష్ అనిపించుకోవాలాని కఠోర సాధన చేసాను ...

ఒక శుభ ముహూర్తాన నాన్న ఆదివారం పూట మధ్యాహ్నం సుబ్బరంగా తిని పడుకుంటే మెల్లగా "నన్ను దోచుకుందువటే వన్నెలదొరసాని " ఆ పాట పాడటం మొదలు పెట్టాను..మరి నాన్న ఎన్ టి రామారావు ఫేన్ కదేంటి ..తేడా రానిస్తానా!! కాసేపటికి మా నాన్న శారదా !! అంటూ ఒక్క అరుపు అరిచారు ..ఏమిటి నాన్న గారు మా అక్క పరుగున వచ్చింది ... నువ్వు పాడుతున్న రాగామేంటి ..ఎంచుకున్న తాళ మేమిటి ..అని పాపం శంకరాభరణం శాస్త్రి గారిలా క్లాస్ పీకబోయారు కాని అది మధ్యలో ఆపేసి" పాడింది నేను కాదు బుజ్జీ" అనేసి చక్కా వెళ్ళిపోయింది..గొప్ప అవమానం అయిపోయింది.. మెల్లగా మా చెల్లి పక్కకు చేరి ..మరీ అంత చండాలంగా పాడానంటావా అనుమానంగా (కొద్దిగా ఆశగా) అడిగాను..అది నావైపు ఒక సారి చూసి నిట్టూర్చీ ... చెప్తే ఏడుస్తావని ఊరుకున్నాం గాని అక్కా వారం రోజులనుండి మాకు చెవుల్లో రక్తాలు కారిపోతున్నాయి... అనేసింది (ఇప్పటికీ ఈ విషయం తలుచుకుని ఏడిపిస్తూనే ఉంటారు మా వాళ్ళు :()

ఇంకేం చేస్తాం అలా ఒక వర్ధమాన గాయినిని తూటాలవంటి మాటలతో తోక్కేసారు.. పెళ్ళయ్యాకా అసలు పాడే ప్రయత్నమే చేయలేదు ...నాకు తెలుసు మీరేమనుకుంటున్నారో..మా ఆయన వంకలు పెట్టి ఉంటారనేగా ...హి హి హి హి కాదు ...నేను మొదలు పెట్టగానే రెండో లైన్ నుండి ఆయన పాడటం మొదలెట్టేస్తారు :( ఆ బాధకంటే ఇలా బాత్ రూం సింగర్ గా మిగిలిపోవడమే ఉత్తమం అని కేవలం నా పాటకు నేనే శ్రోతనై అలా మిగిలిపోయాను ...

అక్కడితో ఆగిపోతే అసలు ఈ రోజు ఈ పోస్ట్ పుట్టేదేకాదు ... మొన్నో మధ్య ఒక ఫ్రెండ్ వాళ్ళింట్లో సత్యన్నారాయణ స్వామివారి వ్రతం అని పిలిస్తే వెళ్లాను ... పూజ అయ్యాకా దంపతులను హారతి ఇచ్చి లేపాలి.. ఎవరన్నా పాడండమ్మా అంటే..అమ్మో నాకు రాదంటే నాకు రాదు అని మెలికలు తిరిగిపోతున్నారు జనాలు.. నాకు జరిగిన అనుభవాల దృష్యా నేను లేవలేదు ... ఎందుకు చెప్పండి పిలిచి తిట్టించుకోవడం..కాని అవకాసం తరుముకొస్తే ఏం చేస్తాం..అక్కడ చీరకట్టుకున్న ఏకైక మహిళను నేనే ...అందుకని అందరూ నన్ను లాక్కోచ్చేసారు ...భయం భయం గా "క్షీరాబ్ది కన్యకకు నీరాజనం" అని అన్నమాచర్య కీర్తన కొద్దిగా పాడాను..హమ్మయ్యా ఎవరూ మాట్లాడలేదు ...ఒక పనైపోయిన్దిరా బాబు అని వెళ్లిపోతుంటే పూజ చేసిన పంతులుగారు పిలిచి చాలా బాగా పాడావమ్మా" గాన సరస్వతి" లా అన్నారు...అందరూ అవునవును అన్నారు చప్పట్లు కొట్టి..

ఇంక మీకు నేను విడమరచి చెప్పక్కరలేదనుకుంటా నేను ఇంటికి వెళ్ళేంతవరకూ నేలకు నాలుగు అడుగుల పైన నడిచానని .. మా ఆయనకు చెప్తే ...అంటే బుజ్జీ ముసలాయనకదా సరిగ్గా వినిపించి ఉండదు ... పొరపాటు పడటం మానవ సహజం.. నువ్వు మామూలుగా నడిచేయచ్చు అనేసారు :( అయినా సరే నేను ఒప్పుకోనుగాక ఒప్పుకోను..చిన్నప్పుడే నాలో ఒక చిత్ర ,ఒక శ్రేయగోషల్ ,ఒక గోపికా పూర్ణిమ ఉన్నారు అంతే అంతే అంతే ...అంతే బాబు..ఇక ఎవ్వరి మాటలు నమ్మదలుచుకోలేదు నాకు తెలుసు మీరేమంటున్నారో ..మీ పాట ఒకటి మాకూ వినిపించచ్చుకదా అని కదా.. హమ్మా పొరపాట్లు అన్ని సార్లు జరుగుతాయ్ ఏంటి ....మీరు మరీను

27, జూన్ 2011, సోమవారం

ఆషాడం - 2

ఆ..ఎంతవరకూ చెప్పాను ..ఆషాడంలో మా ఆయన్ని కలుసుకోవడానికి మా అమ్మమ్మ ఊరు వెళ్లాను అని చెప్పాను కదా ... అక్కడికి వెళ్ళగానే అనుకున్న కధ మొదలైంది.."ఆషాడంలో మొక్కులేమిటే మరీ విచిత్రంగానూ" అని కాసేపు మా అమ్మమ్మ బుగ్గలు నొక్కుకుని ,ఎదురుగా అల్లుడిగారిని(మా నాన్నను) చూసి ఏమనలేక ..."అయినా ఈ రోజుల్లో ఇవన్నీ మామూలే బాబు ... మీ మావయ్య గారు షాపు వదిలి ఇంటికొచ్చేసరికి రాత్రి ఒంటిగంట అవుతుంది .. ట్రైన్ పది గంటలకు కదా ,వెనుక గుమ్మం దగ్గర నుండి మా చిన్నోడు ( చిన మావయ్య) స్టేషన్కి తీసుకు వేళతాడులే "అనేసి నన్ను గట్టున పడేసింది....

నాన్న మా వూరు వెళ్ళేవరకూ ఓపికపట్టిన మా అత్తలు నా చెరో ప్రక్కనా చేరిపోయారు ..."ఆషాడంలో బయటకు వెళుతున్నారా!!! మా తమ్ముడుగారు ఎంత డేరు, ఎంత రోమాన్టిక్కు ... మీ పెద్ద మావయ్యా ఉన్నారు దేనికీ!! .. పెళ్ళయి పదేళ్ళు అయినా ప్రక్క వీధిలో గుడికి తీసుకువెళ్ళమంటే ప్రక్కింట్లో దొంగతనం చేయమన్నట్లు జడిసిపోతారు" అని ఏడుపుమొహం పెట్టి మా పెద్దత్తా.... "ఈ నల్లపూసలు అయిదుకాసులు పెట్టి చేయించారా !!...పెళ్ళయిన మూడునెలలు కాకుండానే ఇన్ని చేయిస్తే ముందు ముందు ఏడువారాల నగలు చేయిన్చేస్తారేమో ...మీ చిన్న మావయ్యా ఉన్నారు... పావుకాసు పెట్టి ఉంగరం చేయించమంటే పందిరి గుంజలా బిగుసుకుపోతారు "అని భారంగా నిట్టూరస్తూ చిన్నావిడా గతాన్ని తలుచుకుని తలుచుకుని ,తవ్వుకుని, తవ్వుకుని బాధపడిపోవడం మొదలుపెట్టారు..

"వచ్చావా మహా తల్లీ!!! ..నువ్వు ,మీ అక్కా వచ్చారంటే మా కాపూరాల్లో నిప్పులే ... అక్కడేం ఉద్దరిస్తారో తెలియదుకాని ఇక్కడ మాత్రం మీ అత్తలకు మణిరత్నం సినిమా చూపించి వెళ్ళిపోతారు ..తర్వాతా ఓ నెల రోజులు పాటు మాకు ' కొత్తబంగారు లోకం మాకు కావాలి సొంతం ' అని పాడి వినిపిస్తారు వీళ్ళు" అని మా చిన్న మావయ్య విసుక్కుంటుంటే...... చూడంమమ్మా నీ కొడుకు అని కంప్లైంట్ చేస్తూ భోజనం తింటుంటే ఫోన్ .... పరుగు పరుగున వెళ్లి ఫోన్ తీశాను ...

"బుజ్జీ ! వచ్చేసా"వా అటునుండి మా ఆయన.." ఆ వచ్చేసాను కానీ అదేంటది ఈ పాటికి ట్రైన్లో ఉండాలి కదా మీరు..ఎక్కడి నుండి ఫోన్ చేస్తున్నారు" అయోమయంగా అడిగాను....." ట్రైన్ ఓ గంట లేటే ..అందుకని ఇంకా బయలుదేరలేదు" అన్నారు బాంబ్ పేలుస్తూ ....."అమ్మ బాబోయ్ గంట లేటా!!!రాత్రి పదిన్నర అంటేనే మా నాన్న ,అమ్మమ్మ వందసార్లు ఆలోచించారు ... ఇప్పుడు గంట లేటంటే పదకుండున్నర అవుతుంది ఇంకేమన్నా ఉందా" అన్నాను భయంగా ..." మీ అమ్మమ్మకు ,నాన్నకు పనేముంది ప్రతిదానికి భయపడటమే గాని ఇంకేదన్నా చెప్పు "అన్నారు తాపీగా...." మీకేం బాబు మిమ్మల్ని ఎవరేమంటారు ,అక్షింతలు పడేది నాకే కదా " విసుక్కున్నాను.... "అబ్బా నీతో ఇదే చిక్కు ...ఎప్పుడూ ఎలా టెన్షన్ పడదామా అని ఆలోచిస్తావ్... నాకైతే బోలెడు ప్లాన్స్ ఉన్నాయి..నువ్వు ఎప్పుడన్నా ట్రైన్ డోర్ దగ్గర నిన్చున్నావా ... మనం ఎంచక్కా డోర్ దగ్గరకు వెళ్లి కూర్చుని తెల్లవార్లు కబుర్లు చెప్పుకుందామేం"....అన్నారు పరవశంగా.." ఏంటీ డోర్ దగ్గరకా !! మా నాన్నకు తెలిస్తే అప్పుడు చేస్తారు నాకు అసలు పెళ్లి "అన్నాను విసుగ్గా.. "అవును మరి ప్రతీది వెళ్లి మీ నాన్నకు చెప్పు ... అయినా పెళ్ళయ్యాకా నా ఇష్టం .. ... నా పెళ్లానివి... తండ్రి కంటే భర్తే గొప్ప,పతియే ప్రత్యక్ష దైవం తెలుసా నీకా విషయం" అన్నారు కచ్చగా( ఈ మాట అరిగిపోయిన రికార్డులా ఇప్పటికీ అంటారులెండి) ... "తోక్కేం కాదు నాకు మా నాన్నే గొప్ప "అంటుంటే ఇంకేవరివో మాటలు ,గుసగుసలు వినిపించి ప్రక్క రూం లో తొంగి చూస్తే ,మా అత్తలు ప్రక్క రూం లో ఉన్న మరో ఫోన్ పట్టుకుని మా మాటలువింటూ తోసుకుంటూ...... దెబ్బకి ఫోన్ పెట్టేసి ఆ రూంలోకి పరుగెత్తాను ....

"ఏం పనిలేదా ,మేనర్స్ లేదా" కోపం గా అడిగాను...." అస్సలు లేదు .. అయినా ఇది మా ఇల్లు.. మా ఫోను ... మా ఇష్టం ... కొత్తగా పెళ్ళయిన వాళ్ళను మా ఊర్లో ఇంతకన్నా ఎక్కువ ఏడిపిస్తాం తెలుసా "అన్నారు ఇద్దరూ కోరస్ గా ... ఖర్మరా బాబు అనుకుని 11 ఎప్పుడవుతుందా అని ఎదురు చూడటం మొదలు పెట్టాను ... మధ్యలో ఫోన్ చేయాలని ఉన్నా మా అత్తలతో భయం ... పది అవుతుండగా నాన్న నుండి ఫోన్ .."ఇంకా బయలుదేరలేదా? రాత్రి పూట ప్రయాణాలు కాస్త ముందుగానే వెళ్లాలని తెలియదా.. మావయ్యను పిలు నేను మాట్లాడుతాను "అని ఒక్క కసురు కసిరారు.... అసలే మాంచి కోపం మీద ఒకటి ఉన్నారు... ఇప్పుడు ట్రైన్ లేటంటే ఏమంటారో అని సైలెంట్గా మా మావయ్యకు ఇచ్చేసాను ఫోన్.. పాపం విషయం వినగానే నాన్న కోపానికి మావయ్య బలి..

మొత్తానికి పదకుండు అయింది మావయ్య ఇంకా రాలేదు.... నాకు కంగారు...." నీ కొడుకు ఎప్పుడు ఇంతే అమ్మమ్మ ..ఏం ఒక్క రోజు షాప్ నుండి తొందరగా వస్తే ఏం కొంపలు మునిగిపోయాయట ,ఆ ట్రైన్ వెళ్లి పోయిందంటే ఇంక అంతే" ఏడుపు మొహం వేసి అన్నాను .... పదకొండున్నర అవుతుండగా మావయ్య ఇంటికి వచ్చాడు ...ఈ లోపల చిన్న అత్తకు, అమ్మమ్మ కు నాలుగో విడత క్లాస్ పీకేసాను.. రాగానే తాండవం చేసేయబోతుంటే" ఇక ఆపు అక్కడ ట్రైన్ గంట కాదు ... రెండు గంటల లేట్ అంట రాత్రి పన్నెండున్నరకు వస్తుంది అట... ఫోన్ చేసి కనుక్కున్నాను "అన్నాడు.. నాకు నీరసం వచ్చేసింది..." అమ్మ బాబోయ్ పన్నెండున్నరకు వస్తుందా ...నాన్నక్కు తెలిస్తే ఇంకేమన్నా ఉందా " నీరసంగా జారబడ్డాను.." నీకేం నువ్వు బాగానే ఉంటావ్ నాకు కదా మీ నాన్న క్లాస్ పీకేది "అని మావయ్య అంటుండగానే మళ్ళీ ఫోన్.."ఇంకెవరూ మీ నాన్నే వెళ్లి ఎత్తు" అన్నాడు మావయ్య నవ్వుతూ..."మావయ్యా మావయ్యా ప్లీజ్ మావయ్య నువ్వు మాట్లాడి ఏదోఒకటి చెప్పవా "బ్రతిమాలే పొజిషన్ కొచ్చేసాను ...

"అంటే బావగారు పర్వాలేదండి ..నేను ఉంటాను కదా ...పన్నెండుకి కూడా జనాలు తిరుగుతూనే ఉంటారండి ఏం పర్లేదు "...మావయ్య మాటలు మెల్లగా వినబడుతున్నాయి ... అటునుండి నాన్న కొంచెం గట్టిగానే తిడుతున్నట్లు ఉన్నారు..ఫోన్ పెట్టగానే అమ్మమ్మ మొదలు పెట్టింది .." ఏంటి అర్ధరాత్రి పూటా ఆడపిల్లను తీసుకువెళతావా ..అందునా నాన్న ఇంటికొచ్చే టైమయ్యింది.... చూసారంటే ఇంకేమయినా ఉందా అంటూ... అబ్బా ,నాన్న ఒంటిగంటకు కదమ్మా వచ్చేది నేను తీసుకు వెళ్తానుగా" మావయ్య సరిపెట్టేసాడు.. హూం గట్టిగా నిట్టూర్చి నిమిషాలు లెక్క పెట్టడం మళ్ళీ మొదలు పెట్టాను..

పన్నెండు అవుతుండగా మావయ్య మళ్ళీ కాల్ చేసాడు రైట్ టైం ఎన్ని గంటలకో కనుక్కుందామని .."దేవుడా దేవుడా ప్లీజ్ ప్లీజ్ "అనుకుంటూ ఉండగానే అటునుండి వాడు చెప్పాడు.." ఈ రోజు ఆ ట్రైన్ లేటండి రాత్రి 2 కి రావచ్చు" అని ... అయిపొయింది, ఇంక వెళ్ళినట్లే నిరాశ వచ్చేసింది ...మళ్ళీ నాన్న ఫోన్ ... "నువ్వే తీయవే ..ఇందాక నిన్ను అడిగినా ఏదో మేనేజ్ చేసాను " మావయ్య తనవల్లకాదని చెప్పేసాడు.. ఇక తప్పక 'హలో' అన్నాను.." ఏమైంది ఇంకా బయలు దేరలేదా" అన్నారు.." లేదు నాన్నా రెండుగంటలకట "అన్నాను మెల్లిగా.. "సరేలేగాని నువ్వు పడుకో ఇంక ...అంతగా అయితే రేపు నేను వచ్చి వైజాగ్ తీసుకెళతాలే "అన్నారు.. " కానీ నాన్న... మరీ ఆయన ఎదురుచూస్తారేమో" అన్నాను గునుస్తూ ... "చూడనీ.. ఇలా అర్ధం పర్ధం లేకుండా అర్ధరాత్రి ప్రయాణాలు పెడితే అలాగే అవుతుంది.. ఆడపిల్ల అనుకున్నాడా ఇంకేమన్నాన.. ప్రొద్దున్న కాల్ చేస్తాడులే అప్పుడు చెప్దాం నువ్వు పడుకో ఇక.. నేను రేపు వస్తున్నా" అని పెట్టేసారు...

"మావయ్యా!!! ఇంకోక్కసారి ఫోన్ చేయవా "ఆశ చావకా అడిగాను ...కాల్ చేయగానే ..."ట్రైన్ రాత్రి రెండు మూడు మధ్యలో రావచ్చండీ".... వాడు ఇంకొంచెం టైం పెంచేసరికి ఇక మాట్లాడకుండా పడుకున్నాను..నా కళ్ళ ముందు ప్లాట్ఫాం మీద నాకోసం వెదుకుతున్న మా ఆయన కనిపించసాగారు... జాలి ,బాధ ,భయం కలగలిపి వస్తున్నాయి ...అసలే ముక్కు మీద కోపం అయ్యగారికి ...ఎన్ని అలకలు పెట్టి సాధిస్తారో అని.. ఎప్పుడు నిద్ర పట్టేసిందో ..బుజ్జీ ,బుజ్జీ అని ఎవరో పిలుస్తుంటే కళ్ళు తెరిచాను ...ఎదురుగా చిన్న మావయ్య ...." ష్ ... ట్రైన్ కరెక్ట్ టైం నాలుగున్నర కట.. నాలుగయ్యింది వెళదామా" అన్నాడు ... "మరి నాన్న,అమ్మమ్మ ".... అంటూ ఇంకేదో చెప్పబోతుంటే ...." అబ్బా అవన్నీ నేను చూసుకుంటాలే ... నేను సందు గుమ్మం వైపు బండి తీసుకొస్తాను నువ్వు మెల్లగా వచ్చేసేయి... తాతయ్య ఇంట్లోనే ఉన్నారు జాగ్రత్త "అన్నాడు ...

తల కూడా దువ్వుకోలేదు ....అలాగే నా బ్యాగ్ పట్టుకుని చీకట్లో దొంగలా తడుముకుంటూ మెల్లిగా బయటకు వచ్చేసాను .... దారంతా మావయ్యా,నేను ప్లాన్స్ వాళ్లకు ఏం చెప్పాలి అని .... అక్కడ చేరుకున్నాకా ఇంకో అరగంట లేట్ చేసి అయిదుగంటలకు వచ్చింది ట్రైన్ .... మావయ్య కు టాటా చెప్పేసి ట్రైన్ లో కూర్చున్నాను ... మా ఆయన ఫ్రెండ్, వాళ్ళ ఆవిడ పలకరించారు ... ఆ సరికే కొంపలు మునిగిపోయినట్లు జనాలు పొలోమని లేచి అటు ఇటు తిరగడం మొదలు పెట్టారు ...నేను, మా ఆయన ట్రైన్ డోర్ వైపు,మొహా మొహాలు చూసుకుని గాడం గా నిట్టూర్చాం ...

హోటల్ మేఘాలయ... అప్పటివరకూ తిరపతిలో రూమ్స్ తప్ప ఇలా హోటల్స్ లో డీలక్స్ రూమ్స్ అవి చూడలేదేమో ...నాకు అదేదో భలే బాగా నచ్చేసింది ...పరుపెక్కి గెంతులే గెంతులు..అప్పడే నాకు ఎ.సి అనే పరికరం గురించి తెలిసింది.... కావాలంటే మీరందరూ బయటకు పొండి ...నేను రానంటే రాను అని భీష్మించుకు కూర్చున్నా లాక్కునిపోయారు ....ఆ తరువాత మహా మహా హోటల్స్కి వెళ్ళినా ఆ సరదా అస్సలు రావడం లేదు :(... అనుకుంటాం గాని మన ప్రక్కన ఉన్న చిన్న చిన్న ఊర్లే బోలెడు బాగుంటాయి... నాకు వైజాగ్ పిచ్చ పిచ్చగా నచ్చేసింది.. ఉడా పార్క్ ,కనక మహా లక్ష్మి గుడి ..అక్కడ ఒక వినాయకుడి గుడి ఉంటుంది ...చిన్న గుడే కాని చాలా ఫేమస్ ..పేరు గుర్తురావడం లేదబ్బా.. ఆ గుడి ..ఇంకా సింహా చలం ..కైలాస గిరి ..చాలా చూసాం ...రామ కృష్ణా బీచ్ లో అలలు చూడగానే నేను రాను బాబోయ్ అన్నా వాటి మధ్యలోకి వెళ్లి నిన్చోపెట్టేసారు మా ఆయన..టీవిలో చూడటమే అలా మధ్యలోకి వెళ్లి చూడటం భలే బాగుంది.. ( ఇక్కడ ఆరెంజ్ సినిమాలో జేనిలియాలా నేను సింహాన్ని చూసాను అన్న రేంజ్లో ఎక్స్ ప్రెషన్ ఇచ్చాను అప్పట్లో ) నిజం చెప్పాలంటే ఆ రోజు ఎంత హేపీ ఫీల్ అయ్యానంటే ఇప్పటికీ ప్రతి నిమిషం గుర్తుంది :)

ఆ తరువాత అన్నవరం వచ్చేసాం.. ఆషాడం కదా జనాలు అస్సలు లేరు ..( గమనిక :ఆషాడం లో అన్నవరం వెళితే మీకు దర్సనం తొందరగా అవుతుంది ) వ్రతం అది అవ్వగానే మావారి ఫ్రెండ్ని వాళ్ళ ఊరు వెళ్ళిపొమ్మని చెప్పి , మా ఊరి స్టేషన్ లో నన్ను దిగబెట్టేసి నెక్స్ట్ ట్రైన్కి తను వెళ్లి పోయేట్లుగా ప్లాన్ .... నాన్నను స్టేషన్ కి రమ్మని ఫోన్ చేసి ట్రైన్ ఎక్కేసాం..కాసేపట్లో తను వాళ్ళ ఊరు వెళ్లిపోతున్నారంటే మళ్ళీ దిగులు... ఏవో మాట్లాడుతూ మధ్యలో..." మొన్నో సారి మా బావ ఏం చేసారో తెలుసా.. అక్కను తీసుకుని తెలియక ఒక ట్రైన్ ఎక్కబోయి మరొక ట్రైన్ ఎక్కేసారట ... మధ్యలో గమనించి దిగిపోయారట ...కాని పర్స్ తేవడం మర్చిపోయారట ... లక్కీగా మా నాన్న ఫ్రెండ్ అక్కడ కనబడితే ఆయన్నిడబ్బులు అడిగి ఊరు వెళ్ళారు ...ఇప్పటికీ నాన్న తలుచుకుని తలుచుకుని తిడతారు " అన్నాను.." అయినా మీ బావ అలా ఎలా చేసారు బుజ్జీ ..ఏ ట్రైన్ ఏదో తెలుసుకోకపోతే చాలా చిక్కుకదా..ఒంటరిగా అయితే ఎలా అయినా పర్వాలేదు.. ఆడవాళ్ళు ఉండగా చాల కష్టం తెలుసా అన్నారు మా ఆయన గొప్ప ఆశ్చర్యంగా మొహం పెట్టి ....

అప్పటి వరకూ మమ్మల్ని గమనిస్తున్న మా ప్రక్కనున్నాయన "అమ్మా మీరు ఎక్కడి వరకూ వెళ్ళాలి "అన్నాడు ... నేను చెప్పాను.." ఈ ట్రైన్ వైజాగ్ వెళుతుంది మీరు ఎక్కినది కరెక్ట్ ట్రైన్ కాని చివరి రెండు బోగీలు వేరే బండికి కలుపుతాడు" అన్నాడు.. దెబ్బకి నాకు,మా ఆయనకు నో సౌండ్ ... తరువాతి స్టాప్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరే ... వెంటనే దిగిపోయాం ...దూరం నుండి టీ.సి మావైపు చూస్తున్నాడు.."అమ్మో రాంగ్ టిక్కెట్ ..పెనాల్టి అంటాడేమో" అన్నారు మా ఆయన ..." ఏం చేస్తాం తప్పదుగా కట్టండి" అన్నాను విసుగ్గా .. " బుజ్జీ ఒక విషయం చెప్తే తిట్టవు కదా "కొంచెం నసుగుతూ అన్నారు మా ఆయన ..." ఏంటీ "అన్నాను కోపంగా ...." నాకొక్కడికే కదా టిక్కెట్టు కావలసింది అని నిన్న మొత్తం ఖర్చు పెట్టేసాను" అన్నారు మెల్లగా....ఓరి దేవుడా ఏం చేద్దాం.. అనుకుంటుండగానే టీ.సి మా వైపు వచ్చాడు.."ఏంటి తప్పు ట్రైన్ ఎక్కి వచ్చేసారా .. చాలా మంది అలా పొరపాటు పడతారులెండి ...చీకటి పడుతుంది బస్ స్టాప్కి వెళ్లి మీ వూరు వెళ్ళిపొండి" అని పంపేశాడు.. బ్రతుకు జీవుడా అనుకుని బయటకు వచ్చేసాం..

"ఇప్పుడేం చేద్దాం నాన్న ఎదురు చూస్తారేమో ముందు నాన్నకు ఫోన్ చేసి విషయం చెప్పండి స్టేషన్ కి బయలుదేరి ఉంటారు "అన్నాను .. "అమ్మో !మీ నాన్నకా!! నీకు పుణ్యం ఉంటుందే బాబు... మీ బావని నాలుగేళ్లే తిట్టారు..నన్ను వదులుతారా .. అసలే వద్దంటే తీసుకువచ్చా అని కచ్చ మీద ఉండి ఉంటారు పరువుపోతుంది చెప్పకు ప్లీజ్ "అన్నారు .. "ఇప్పుడెలా మరి " అన్నాను విసుగ్గా .... " అంటే ఇది మీ అమ్మమ్మ వాళ్ళ ఊరే కదా ..మొన్న చెప్పకుండా వచ్చేసావ్ కదా ... అందుకని మీ అమ్మమ్మ మీద బెంగ పెట్టుకుని నువ్వు ఏడుస్తుంటే నిన్ను ఇక్కడకు తీసుకు వచ్చేసా అని చెప్తాను ఏమంటావ్ "అన్నారు.." ఏడ్చినట్లు ఉంది అస్సలు నమ్మరు "అన్నాను.. "నమ్మకపోయినా అదే చెప్పాలి పదా "అని మా అమ్మమ్మ ఇంటికి తీసుకువెళ్ళిపోయారు...

ఇంటికి వెళ్ళగానే అమ్మమ్మను చూడగానే" అమ్మమ్మా "అని చెప్పబోతుండగా లోపల భోజనం చేస్తూ తాతయ్య ఉన్నారు...దెబ్బకు నూటొకటి... ఏం చెయ్యాలి???.. వెంటనే అమ్మమ్మా మొన్న తాతయ్యను చూడకుండా వెళ్లిపోయానుగా బెంగ వచ్చేసింది .... కలలో కూడా తాతయ్యే ... అని మా తాతయ్య ప్రక్కకు చేరిపోయాను వెక్కేస్తూ ... అప్పుడు పడిపోయిన మా తాతయ్య ఇప్పటికీ అలాగే నన్ను తలుచుకుంటారు.. మా బుజ్జోడికి నేనంటే ఎంత ప్రాణమో ...సింగపూర్ వెళ్ళినా నన్నే కలవరిస్తుంది అని.. నేను అంటే చాలా ప్రాణం పెట్టేస్తారు (అమ్మో ఇప్పుడు మా తాతయ్య మీద బెంగోచ్చేస్తుంది నాకు :(......) అలా అనేకానేక సాహసాలు చేసుకుంటూ మా ఇంటికి చేరాను ఆషాడంలో..

17, జూన్ 2011, శుక్రవారం

ఆషాడం

అమ్మకు ఫోన్ చేసి ఏదో పిచ్చాపాటి మాట్లాడుతూ" ఆషాడం వస్తుందిగా మరి, ఆ అమ్మాయిని పుట్టింటికి తీసుకు వచ్చేసారా అమ్మా" అన్నాను......"ఈ రోజుల్లో ఇంకా ఆషాడం ,కార్తీకం ఏమిటే నీ మొహం పెళ్ళయిన మూడోరోజే సెలవు లేదని అబ్బాయి ఢిల్లీ కి అమ్మాయి బెంగుళూరికి వెళ్ళిపోయారు" అంది.....అసలు ఈ ఆషాడం ఎందుకు పెడతారో తెలియదుకాని ... ఆషాడం అంటే ఎన్నెన్ని సరదాలు, ఎన్నెన్ని విరహాలు ,ఇంకెన్ని సాహసాలు మొత్తం వెరసి బోలెడు జ్ఞాపకాలు .... అవన్నీ ఈ బిజీ రోజుల్లో చాలామంది మిస్ అయిపోతున్నారే పాపం అనిపించింది...అసలు నా జాజిపూలలో ఎప్పుడో రాసుకోవలసిన పేజీ ఇది ....అమ్మ గుర్తుచేసేవరకూ అలా ఎలా మర్చిపోయానో... నేను వెలుగు వెనుకకు వెళుతున్నాను మీరు జాగ్రత్తగా రండి..:)


పెళ్ళయిన నాలుగు నెలలకు మాకూ ఆషాడం నెల వచ్చేసింది ....అప్పటివరకు తనని విడిచీ ఎక్కడికీ వెళ్ళలేదు.. డిగ్రీ ఎక్జాంస్ కని పది రోజులు మా ఇంట్లో ఉన్నాను కాని అందులో వారం రోజులు తను కూడా మా ఇంట్లో ఉండటం వల్ల అంత ఏమీ తెలియలేదు ..కానీ ఈసారి ఆషాడం ...ముప్పై రోజులు.... దాదాపు నెల ...అమ్మో అని దిగులోచ్చేసింది ...నేను లేకపోతే పాపం తను ఎలా తింటారో ?ఎలా ఉంటారో? అని ఒకటే బెంగ (అక్కడికేదో నేనే చిన్నప్పటినుండి పెంచి పోషించినట్లు అబ్బో తెగ ఫీల్ అయిపోయేదాన్ని) ఇంతకీ ఇదంతా నా సైడే... మా ఆయనగారు మాత్రం ఎంచక్కా అసలేం పట్టనట్లు ఉల్లాసంగా, ఉత్సాహంగా తిరుగుతున్నారు.. ... నాకు గొప్ప ఆశ్చర్యం వేసేసింది..... లెక్కప్రకారం ....ముప్పై రోజులు నిన్ను వదిలి నేను ఎలా ఉండగలను.... నువ్వు నా ఊపిరి ..నువ్వే నా జీవతం..నిన్ను విడిచి నిమషం అయినా నేను ఉండలేను బుజ్జీ ఉండలేను ...అక్కడ నీ ఆరోగ్యం జాగ్రత్త ...సరిగ్గా తినకపోతే నా మీద ఒట్టే .... ఇలాంటి మాటలు చెప్పాలికదా... అబ్బే... అసలేం తెలియనట్లు ... ఇది పెద్ద విషయం కానట్లు చాలా మామూలుగా ఉన్నారు .. (ఇప్పటికర్ధం అయ్యిందా నా బాధేంటో)


సరే మొత్తానికి నాన్న నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చారు ...రైల్వేస్టేషన్ లో నిన్చున్నాం ... ఉహు ..మా ఆయనమాత్రం ఎప్పటిలాగే జోక్స్ ,కబుర్లు నాన్నతో... వొళ్ళు మండిపోతుంది గాని ట్రైన్ వచ్చే టైం అవుతుంది అని నేనే ముందు మొదలుపెట్టేసాను అప్పగింతలు ...." ఏమండీ ,మరీ ...అన్నం వేళకు తినండి "అంటూ .... "అబ్బా అదంతా నేను చూసుకుంటానులేవే ..నువ్వు హేపీగా మీ వాళ్ళతో ఎంజాయ్ చేసిరా "అన్నారు... ఇహ ఆలసించినా ఆశాభంగం అనుకుని "మరి మీకేమి అనిపించడం లేదా నేను వెళుతుంటే "అన్నాను... "అనిపిస్తుంది ..ఎంచక్కా మేడ ఎక్కి నా పెళ్ళాం ఊరెళ్ళి పోయిందోచ్ "అని అరవాలని ఉంది అన్నారు నవ్వుతూ ...నాకు తిక్కరేగిపోయింది అయినా తమాయించుకుని ' నిజంగానా' ఒక కనుబొమ్మ పైకి ఎత్తి మరీ అన్నాను ...." నిజంగానే ..లేకపోతే ఒక్కటే నస అత్తాకోడళ్ళు ఇద్దరు.. అమ్మాయి ఎదురు చూస్తుంది ఎప్పుడు ఇంటికోస్తావు అని ఆవిడా.. స్నానం ఎప్పుడు చేస్తారు ? టిఫిన్ చల్లారిపోతే బాగోదు ఇప్పుడే తినండి ...బ్రెష్ చేయకుండా టీలు కాఫీలేంటి చండాలంగా ... ఈ రోజు ఎందుకు లేటుగా వచ్చారు ...అని నువ్వు ... ఇలాంటి సుత్తి గోల ఉండదు హాయిగా నాకు నచ్చిన టైముకి రావచ్చు , నచ్చినపుడు తినొచ్చు అసలు ఈ ఆషాడం పెట్టేదే పెళ్ళయిన తరువాత కోల్పోయిన స్వేచ్చను మళ్ళీ రుచి చూపించడానికి" అన్నారు... పదండి నాన్నా విసురుగా అనేసి ట్రైన్ ఎక్కేసి కూర్చున్నాను ....


దారంతా ఏడుపోచ్చేస్తుంది కానీ నాన్న ఎదురుగా బయటపడితే మరీ చండాలంగా ఉంటుంది అని కళ్ళు మూసుకుని పడుకున్నాను ....అసలు నేతి బీరకాయలో నేయి ఎంతో మా ఆయనగారి దగ్గర బావుకత్వం అంత ... ఇంటికి వెళ్ళగానే మా గ్యాంగ్ అందరినీ చూడగానే ఓ నాలుగు రోజులు అసలు నాకు టైమే తెలియలేదు ....పైగా అదే సమయంలో నాఫ్రెండ్స్ చాలా మంది ఆషాడం పేరుతో మా ఊరు వచ్చేయడం వల్ల ఒకటే కబుర్లు ....వారం రోజులకు మా ఆయన నుండి ఫోన్ ..." అక్కడికి వెళ్ళగానే నన్ను మర్చిపోయావా ఒక ఫోన్ లేదు, ఏమీ లేదు "అన్నారు కోపంగా.... దెబ్బకి మనకో భయంకరమైన సత్యం తెలిసిపోయింది.....


అమ్మాయిలూ దగ్గరకు రండి మీకు మాత్రమే చెప్తాను( ఈ మగవాళ్ళు ఉన్నారే ..వీళ్ళను పట్టించుకోనంత సేపు మన చుట్టూ బొంగరం తిరిగినట్లు తిరుగుతారు ....అబ్బో మనం నవ్వినా ,దగ్గినా ,తుమ్మినా భావుకత్వం భారీ లెవల్లో ఉప్పొంగిపోతుంది వాళ్లకు ..... ఒక్కరోజు కనబడకపోయినా ,మాట్లాడకపోయినా బోనులోపడిన ఎలాకపిల్లలా గిల గిల లాడిపోతారు.... ఒక్క సారి తలవొంచుకుని తాళి కట్టించుకున్నామా అంతే సంగతులు ...మళ్లీ మన మొహం చూడరు.... ఎందుకంటే ఇప్పుడు మనం వాళ్ళ చుట్టూ తిరుగుతాం కదా అదీ లోకువ... కొన్నాళ్ళకు విసుగొచ్చి ఎహే పో అని వదిలేస్తాం చూడండి అప్పుడు మళ్ళీ నువ్వు అసలు నన్నుపట్టిన్చుకోవడంలేదు అని ఏడుపుమొహం పెడతారు.. అదీ సంగతి)


సరే గ్రహాలూ మనకు అనుకూలంగా ఉండటం వల్ల మనం చెలరేగిపోయాం .... "ఆహా..మీరు మేడలూ, గోడలు ఎక్కడంలో బిజీగా ఉన్నారుకదా డిస్టర్బ్ చేయడం ఎందుకనీ "అన్నాను తాపీగా...." ఏడ్చావులే గాని బట్టలు సర్దుకో మనం హనీమూన్ కి వెళ్ళలేదుగా అందుకే ఎల్లుండి వైజాగ్ వెళుతున్నాం" అన్నారు సంబరంగా .... "ఆషాడంలో హనీ మూన్ ??అదీ వైజాగ్ కి "...అన్నాను వ్యంగ్యంగా .... "అబ్బా అది కాదు బుజ్జీ మా ఇన్స్టిట్యూట్ ఉందికదా ,దాని తరుపున ఏవో మొక్కులున్నాయి అట ...మా ఫ్రెండ్ ,వాళ్ళ భార్యా వైజాగ్ ,అన్నవరం వెళుతున్నారు .. అందుకే నీకు కూడా టిక్కెట్ బుక్ చేసేసా" అన్నారు...."అయ్యా మహాశయా ... ఇలా ఫ్రెండ్స్ తోని పక్కింటి వాళ్లతోని గుళ్ళు, గోపురాలు చూడటానికి వెళితే దాన్ని హనీమూన్ అనరు... తీర్ధ యాత్రలు అంటారు "అన్నాను కోపంగా .... "అబ్బా ఏదో ఒకటిలే... ఈ సమయంలో హనీమూన్ అంటే మీ నాన్నా అదిరి అల్లాడిపోయి ,ఏంటీ అల్లుడూ !!!ఆషాడంలో అమ్మాయిని పంపాలా అని జజ్జనకజ్జనక డాన్స్ వేస్తారు... ఇలా గుళ్ళు గోపురాలు అంటేనే సేఫ్ ... ఎల్లుండి రెడీగా ఉండు "అన్నారు .... "ఏంటి ఉండేది , ఆషాడం లో మీరు మా ఇంటికి, నేను మీ ఇంటికి రాకూడదు తెలుసా ఆ విషయం ... పైగా ఆ ట్రైన్ మా ఊరినుండి వెళ్ళదు ఎలా కుదురుతుంది .." అన్నాను ..." అందుకే ఇంకో ప్లాన్ ఉంది ...నువ్వు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో ...అక్కడ ఈ ట్రైన్ ఆగుతుంది" అన్నారు .... "ఆహా ....ఇలా పిచ్చి ప్లాన్లు గట్రా వేసి మీరు సేఫ్ గా ఉండండి, నేను మా నాన్న దగ్గర పిచ్చి తిట్లన్నీ తింటాను... ఏం అక్కరలేదు ....మీరు ఎంచక్కా మీ మేడ ఎక్కి అరుచుకోండి నేనురాను "అన్నాను విసురుగా..."బుజ్జీ బుజ్జీ బుజ్జీ ......ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ఇది నీకు నేను పెడుతున్న ప్రేమ పరీక్ష అనుకో ... మీ నాన్నను ఒప్పించి ఎల్లుండి అమ్మమ్మ ఇంటిదగ్గరకు వస్తే నువ్వు పాస్ అయినట్లు "అన్నారు... "అయితే నేను ఫెయిల్ అయ్యా అనుకోండి ఏం పర్లేదు" అని ఫోన్ పెట్టేసి ఆలోచనలో పడ్డాను ఎలా నాన్నకు ఈ విషయం చెప్పాలా అని...


ఆ రాత్రి భోజనాల దగ్గర మెల్లగా విషయం కదిపాను.."నాన్నా మరీ ఆయన ఫోన్ చేసారు నాన్నా , ఏవో ఇంపార్టెంట్ మొక్కులున్నాయట అన్నవరం వైజాగ్ వెళుతున్నారట" అన్నాను ..." ఓ ...మంచిదే కదమ్మా మొక్కులు తీర్చుకుంటే... వెళ్లి రానీ" అన్నారు ..." అది కాదునాన్న వ్రతానికి ప్రక్కన నేను ఉండాలిగా.. నాకూ కూడా టిక్కెట్ తీసేసారట" అన్నాను మెల్లిగా ..."ఏంటీ !! నిన్నా!! ఈ ఆషాడంలోనా !! నలుగురూ ఏమనుకుంటారు వొద్దొద్దు కావాలంటే వచ్చే నెల వెళ్ళండి ..అయినా ఆషాడంలో అబ్బాయి మన ఇంటికి రాకూడదు "అన్నారు ..." అబ్బే ఆయన రారు నాన్నా ..అమ్మమ్మ ఇంటికి వెళ్ళమన్నారు ..ట్రైన్ అక్కడ ఎక్కమన్నారు "అన్నాను నన్ను ఇలాంటి పరిస్థితిలో పడేసినందుకు మా ఆయన్ని కచ్చగా తిట్టుకుంటూ ....


అప్పటి వరకూ సైలెంట్ గా మా ఇద్దరినీ చూస్తున్న అమ్మ ఒక్కసారిగా కయ్ మంది.."ఏంటీ!!!! మా అమ్మ ఇంటికా !!!నేను ఒప్పుకోను...మా నాన్నకు తెలిసిందంటే ఇంకేమన్నా ఉందా ,అసలు మా పెళ్ళిళ్ళు అయ్యేవరకూ మా నాన్నకు ముగ్గురు కూతుళ్ళు అన్న విషయం ఎవరికీ తెలియదు ..అంత గుట్టుగా పెంచారాయన... మీరిద్దరూ ఆషాడం లో ఇలా తిరుగుతున్నారంటే నాకు చీవాట్లు పడిపోతాయి తల్లీ ....పైగా మీ అత్తలు చాలు ఊరువాడా మోసేస్తారు ఈ విషయాన్ని.... అసలే వాళ్ళది పల్లెటూరు "అంది ..... "అందుకే ఈ సారి మీ ఆయన్ని వెళ్లి వచ్చేయమను ..తర్వాత వెళ్ళుదురుగాని "అనేసి ఆ టాపిక్ మార్చేసారు ఇద్దరూ ..

ఓరి భగవంతుడా ఇదేంగోలరా బాబు అని తలపట్టుకున్నాను ....సరిగ్గా ఆపధ్భాందవి లా మా అక్క ఫోన్ చేసింది .... హమ్మయ్యా అని అక్కకు చెప్పేసాను ఎలాగైనా గట్టేక్కిన్చవే అని.."ఏంటీ వెళ్ళద్దు అన్నారా? మరీ వీళ్ళ చాదస్తం ఎక్కువ అయిపోతుంది..మొగుడూ పెళ్లాలేగా మీ ఇద్దరూ ... నాన్నకు ఇవ్వు ఫోన్" అంది ..హమ్మయ్యా అని నాన్నను పిలిచి నేను నిశ్చింతగా పడుకున్నాను.. పాపం మా అక్క దాదాపు ముప్పావుగంట బుర్ర తినేసి ఒప్పించేసింది .... మొత్తానికి మరుసటి రోజు బట్టలు సర్దుకుని మా నాన్న హమారా బజాజ్ స్కూటర్ ఎక్కి 'జాం జాం ' అంటూ మా అమ్మమ్మ ఇంటికి వెళ్లాను ...కాని అక్కడే మొదలవుతుంది అసలు కధ అని అప్పటికి తెలియదు
(తర్వాత రాస్తానేం )

8, జూన్ 2011, బుధవారం

ఇరుగు-పొరుగు


ఏంటలా చూస్తారు!!!.......బొమ్మల కొలువులా పర్సులు,హ్యాండ్ బ్యాగుల కొలువు పెట్టిందేమిటిరా బాబు అనే కదా ...అవి అన్నీ నా హ్యాండ్ బ్యాగులే .... ఇంకా కొన్ని ఉన్నాయి లోపల ...ఆగండాగండాగండి .... ఇప్పుడేమనుకుంటున్నారో కూడా నాకు తెలుసు ... ఆడవాళ్ళయితే.." ఎంచక్కా నేస్తం వాళ్ళాయన ఏంకావాలంటే అవి కొనిపెట్టేస్తారు కాబోలు" అని, మగవాళ్లయితే.." ఈ ఆడవాళ్ళు అందరూ ఇంతే వీరు ఈ జన్మకు మారరు" .... అని కదా :) ....అలా అయితే మీరు హ్యాండ్ బ్యాగులో చెయ్యి పెట్టినట్లే.... నేనసలే బద్దకానికి కేరాఫ్ అడ్రెస్ ని...అలాంటి నేను హ్యాండ్ బ్యాగ్ మోయడం కూడానా ...నా బస్ కార్డ్ కూడా మా ఆయన జేబులో పడేసి హాయిగా చేతులు ఊపుకుంటూ బయటకు వెళతాను.... మరి అవన్నీ ఎలా వచ్చాయంటే ... బోలెడు సోది వింటే తెలుస్తుంది ....



అవి మేము "యిషున్ "అనే ఊర్లో ఉన్న రోజులు... అయిదు నెలల మా బాబుని తీసుకుని ఇండియా నుండి తిరిగి సింగపూర్ వస్తుంటే దారిలో మాఆయన ..."బుజ్జీ!! మరే..ఇల్లు కొద్దిగా డర్టీగా ఉంది క్లీన్ చేసుకోవాలి ,ఏమనుకోకేం" అన్నారు...అసలే సంవత్సరం ఎడబాటేమో ప్రేమ పొంగిపోర్లిపోతుంది నాకు ...అందుకే " మురికి కాలువ ప్రక్కన మడతమంచం వేసుకున్నా ప్రశాంతంగా నిద్రపోగలిగే మా ఆయన" ఆ మాట అన్నప్పుడు ఏ మాత్రం అనుమానం రాలేదు...... "ఏం పర్వాలేదు నేను వచ్చేస్తున్నానుగా అదంతా నేను చూసుకుంటాను "అని అభయం ఇచ్చేసాను...అదెంత తప్పో ఇంటికి వచ్చాకాగాని తెలిసిరాలేదు నాకు .... ఇలా తలుపు తీయడం పాపం ఒక బ్రెడ్ ప్యాకెట్టు ,ఒక వాటర్ బాటిల్ చేతిలో పెట్టేసి ఆఫీస్కు పారిపోయారు ...ఇల్లు చూడగానే కళ్ళమ్మట నీళ్ళు రావడం ఒక్కటే తక్కువ నాకు..నేల పైన అరంగుళం మందాన పేరుకుపోయిన మురికి ,గోడల నిండా బూజులు ...సోఫాలు ,మంచాల క్రింద తిని పారేసిన చెత్త.. కడగని ప్లేట్లు ..సింకులో నెలల తరబడి పేరుకుపోయిన అంట్లు ...హాలు నిండా దుప్పట్లు ఇలా ఒక్కటి కాదు ...అప్పటి నుండి మా ఆయన కొంచెం మురికిగా అన్నారంటే చాలు కళ్ళుతిరిగి పడిపోతూ ఉంటాను ...



ఏం చేస్తాం... నా పరిధిలో నాకొచ్చిన తిట్లన్నీ తిట్టుకుంటూ ఇల్లంతా కడిగిన ముత్యంలా చేసి సాయంత్రం తనోచ్చేసరికి ప్రొద్దున్న వల్లేవేసిన తిట్లు అప్పగించాబోతుంటే "ఎవరు నిన్ను సర్ధమన్నారు...సర్దిన సామానంత ప్యాక్ చేయి మనం ఇల్లు మారుతున్నాం ఈ నెలాఖరుకి" అన్నారు ...." ఇల్లు చూసారా? నాకు చెప్పకుండానే? అయినా నేను రాను..... నాకిక్కడ అలవాటయింది ఇక్కడ బోలెడు ఫ్రెండ్స్ ఉన్నారు.. ఉహుహు" అన్నాను భయంగా ..." ఫ్రెండ్స్ అనేవారు ఎక్కడైనా ఉంటారు మనం నడుచుకునే పద్దతిబట్టి ఉంటుంది ...రోజూ "యిషున్" నుండి "టేంపనీస్" కి వెళ్ళిరావాలంటే నాకు తీరిపోతుంది.. అందుకే ఆఫీస్కి దగ్గరగా ఇల్లు తీసుకున్నాను ...అడ్వాన్స్ కూడా ఇచ్చేసా "అన్నారు .... మళ్ళీ ఈసురోమంటూ సామాను అంతా సర్ది ఇల్లుమారాం ...



క్రొత్త ఇల్లు ఆఫీసుకు,ఆయనగారి ఫ్రెండ్స్ కి దగ్గర గా ఉందికాబట్టి తనకి బాగానే ఉందికాని ఎటొచ్చి నా పరిస్థితే మండే ఎడారిలో ఒంటరి ఒంటెలా ఎటూ తోచకుండా అయిపొయింది... అటుఇటు ఇరుగుపొరుగు ఉన్నారుగాని ఎవరు ఎవరో ఏం తెలియదు.. తలుపులన్నీ వేసేసి నిశ్శబ్దం గా ఉండేవారు...ప్రొద్దున 8 కి తను ఆఫీస్ కి వెళ్తే మళ్లీ రాత్రి పది కే రావడం ...ఇక ఎవరితోనూ ఒక మాటలేదు మంతి లేదు ....అప్పట్లో ఇంట్లో నెట్ కనెక్షన్ అసలు లేదు.. దానికి తోడు ఇద్దరూ చిన్నపిల్లలేమో(మాటలు కూడా రావు ) ప్రతిచిన్న విషయానికీ గట్టిగా ఏడుస్తూ ఉండేవారు ...నాకూ వయసు చిన్నది అవ్వడం వల్ల ఎందుకేడుస్తున్నారో అర్ధం కాక ఎలా సంభాళించాలో తెలిసేదికాదు ...ఒక్కోసారి భయంతో నేనూ కూడా వాళ్ళతోపాటు ఏడ్చేసేదాన్ని .... :)



ఇలా ఉండంగా ఒక రోజునాకు తెల్లవారుజామున బ్రహ్మాండమైన కల వచ్చింది ...నన్ను పక్కింటి ఆంటీ వీరలెవల్లో తిట్టేస్తున్నట్లు ....అప్పటికి పక్కింట్లో ఎవరున్నారో కూడా తెలియదునాకు.. లేచి లేవగానే భయంగా... "ఏమండీ నాకు ఇలా కలొచ్చింది ప్రొద్దున వచ్చిన కలలు నిజమవుతాయా "అని అడిగాను.. "అవుతాయి ...అసలే ఆఫీస్కి టైమయిపోతుందే అంటే ఇలా చెత్త ప్రశ్నలు వేస్తే మనిద్దరికీ గొడవ అవుతుంది ముందు" అని నా మాటలు కొట్టిపడేశారు ....మా వాడు ఎప్పటిలాగే స్నానం చేయిస్తున్నపుడు బోరున ఏడుస్తుంటే,మా అమ్మాయి సోఫా పై నుండి క్రిందపడి శృతి తగ్గకుండా వాడితో జత కలుపుతుంటే.. ఓరి దేవుడోయ్ అని హాల్లోకి వచ్చాను ఇంతలో తలుపు దభ దభ అని ఎవరో బాదేస్తున్నారు...



తీయగానే ఒక మలయ్ ఆవిడ కయ్ కయ్ మంది..."మీరు వచ్చిన దగ్గరనుండి చూస్తున్నాను..ఏంటి ..ఈ గోలేంటి ..ఈ ఏడుపులేమిటి ..... ఈ అపార్ట్మెంట్లో ఇంతమంది పిల్లలు ఉన్నారు ఎప్పుడన్నా ఒక్క అరుపు వినిపించిందా... నా పిల్లలు ఇక చదువుకోవద్దా....కష్టంగా ఉంటే ఒక మెయిడ్ ని పెట్టుకో..లేదా మీవాళ్లను పిలిపించుకో....పెంచడం చేతకానపుడు పిల్లల్ని ఎందుకు తీసుకోచ్చావ్ ఇక్కడికి...మీమీద కంప్లైంట్ ఇవ్వవలసి వస్తుంది" ....ఇలా ఒక్కటికాదు ...దాదాపు ఓ గంట సేపు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిపడేసింది.... నా కల నిజమైపోతున్నందుకు ఆశ్చర్యం ...అన్ని తిట్లు పడుతున్నందుకు ఏడుపు కలగలిపి వచ్చేసాయి .. సాయంత్రం నాకున్న ఒకేఒక శ్రోతైన మా ఆయనకి కక్ష తీరేలా ఇంకోనాలుగు వేసి బోలెడు చెప్పేసాను.. ఆ ఆవేశంలో ఒక అతిముఖ్యమైన విషయం మర్చిపోయాను ... మా ఆయన మామూలుగా ఉన్నపుడు శాంతి స్వరూప్ని మరిపిస్తారు.... కోపం వచ్చినపుడు దుర్వాస మహామునిని తలపిస్తారు...



"ఆయ్..నిన్ను,పిల్లల్ని ఇన్నిమాటలు అందా? పిల్లలన్నాకా ఏడవరా? శుక్రవారం, ఆదివారం వాళ్ళ ఆయన చెవులు చిల్లులు పడేటట్లు ఖురాన్ చదువుతారు ..అప్పుడేం పరవాలేదా....మన ఇండియన్స్ అంటేనే ఏడుపు వీళ్ళకు ... మనదగ్గరే అన్ని రూల్స్ గుర్తొస్తాయి ...ఊరికే ఉంటున్నామా??? బోలెడు రెంట్ కట్టి ఉంటున్నాం ..రేపు విషయం తెల్చేస్తా" అని గై గై మన్నారు .....ఇదెక్కడి గోలరా బాబు అసలే ఫ్రెండ్స్ లేరో అని బెంగ పడుతుంటే శత్రువులు తయారయ్యేలా ఉన్నారు.. ఈయనకేమి ఆఫీస్కి వెళ్ళిపోతారు తరువాత నేను పడాలి అని భయపడి మెల్లిగా ..." ఎందుకులేద్దూ చిన్నవిషయం ... వాళ్ళ తరుపున కూడా ఆలోచించాలి కదా ..ఇక్కడ అందరికీ సైలెంట్గా ఉండటం అలవాటుకదా ...పైగా ఆవిడ పిల్లల ఎక్జామ్సో... ఏమో పాపం ... అయినా దేశంకాని దేశంలో మనకెందుకొచ్చిన గొడవలూ !!" అని చల్లారబెట్టేయబోయాను ...." ఏంటి దేశంకాని దేశం ..ఇక్కడ అందరూ వలస వచ్చిన వాళ్ళే ...మనల్నేమన్నా ఊరికే పోషిస్తున్నారా? ఈ దేశం సగానికి పైగా మన ఇండియన్స్ పైన ఆధారపడే ఉంది ...అందుకే అంతంత జీతాలు ఇచ్చి రప్పించుకుంటున్నారు" ...అని సింగపూర్ ఆర్ధిక వ్యవస్థా దానిలో ఇండియన్స్ పాత్ర అనే విషయం మీద అర్ధరాత్రి పన్నెండుగంటలకు క్లాస్ పీకుతుండగా మళ్ళీ దభ దభా అని తలుపు చప్పుడు ... తీస్తే.. ప్రక్కింటి అంకుల్... "మీరింత సౌండ్ పెట్టి టీవి చూస్తుంటే మేము పడుకోవాలా వద్దా" అనుకుంటూ ... ఆ రోజు ఆయుద్ద వాతావరణాన్ని చల్లారబెట్టడానికి నాకు తాతలు దిగోచ్చినంత పనైంది .....



ఇక అక్కడినుండి మా ఆయనా, పక్కింటివాళ్ళు ఒకరికొకరు ఎదురైతే చాలు చూపుల చురకత్తులు దూసేసేవారు..ఏ క్షణం యుద్ధ భేరి మోగుతుందో అని గొప్ప టెన్షన్గా ఉండేది .. అలాంటి సమయంలో ఒక రోజు బయట వర్షం వస్తున్నట్లు అనిపించి తరుగుతున్న టమోటాలు అక్కడే పడేసి ఆరబెట్టిన దుప్పట్లు తేవడానికి బయటకు పరుగులు పెట్టాను...అంతే ...గాలికి దబ్బున తలుపు పడిపోయింది ... మావి ఆటోమేటిక్ గా లాక్ అయిపోయే డోర్లు... ఇంకేంటి ..బయట నేను, లోపల పిల్లలు... పైగా కిటికీ తలుపులతో సహా అన్ని క్లోజ్ చేసిపడేసాను...పిల్లలకు నేను కనబడే అవకాశమే లేదు.. బాబుగాడికి నడక కూడా రాదు ...వాడు నిద్ర లేచి క్రింద పడిపోతే ?అసలే బేబీ కాట్ చాలా ఎత్తుగా ఉంటుంది .... కూరగాయలు తరుగుతూ ఆ కత్తి అక్కడే పడేసి వచ్చాను.. పాప అది తీసి ఆడితే ? నా పై ప్రాణాలు పైనే పోయాయి ... ఇప్పుడేం చేయాలి ?



మా పాప నేను దొంగాట ఆడుతున్నానేమో అనుకుని తలుపు కొట్టి నవ్వుతుంది తీయమని ...పాపం దానికి మాట్లాడటం కూడారాదు అప్పటికి ...తలుపు కీస్ పైన కొక్కానికి తగిలించాను అందే చాన్స్ లేదు ...ఏం చెయ్యాలి ఇప్పుడు ...ఇటు మలయ్ ఆంటీ దగ్గరకు వెళ్ళాలంటే భయం... అటు పోర్షన్లో చైనా అమ్మాయి ఉండేది కాని తను ప్రొద్దున్నే జాబ్ కి వెళ్ళిపోతుంది ...పాప కాసేపు నవ్వాక ఇక మొదలుపెట్టింది ఆరునోక్క రాగం..... దాని ఏడుపుకి వీడు ఎక్కడ లేస్తాడో అని సగం భయం .... ఇక తప్పక ఆంటీ ఇంటివైపు అడుగులు వేసాను ..."ఎగైన్ స్టార్టెడ్" ..లోపల ఆంటీ అరుపు... దబ్బున తలుపువేసిన సౌండ్ వినిపించాయి..చేసేది లేక పాపని సంభాళిస్తూనే కాలుకాలిన పిల్లిలా తిరుగుతుంటే ..సరిగ్గా దిగివచ్చిన చైనా దేవతలా ప్రక్కింటి చైనా అమ్మాయి ఫోన్ లో మాట్లాడుతూ తన పోర్షన్ తలుపులు తీసుకుంటూ లోపలికి వెళ్ళింది... పరుగు పరుగున తన గుమ్మంలోకి వెళ్లి "మా తలుపు లాక్ అయిపొయింది ..పిల్లలు ఇంట్లో ఉండిపోయారు ..ఒక సారి సెల్ ఇస్తే మా ఆయనకు కాల్ చేస్తాను "అని వచ్చీరాని భాషలో వివరించాను ...దానికి ఒక్క ముక్క అర్ధమవ్వలేదనుకుంటా 'వాట్'? అంది.. నాకు నీరసం వచ్చేసింది ...ఆ అమ్మాయి చేయి పట్టుకుని మా పోర్షన్ కి తీసుకువెళ్ళి అభినయం చేస్తూ వివరించాను .... ఆ అమ్మాయికి విషయం అర్ధం అయి వెంటనే సెల్ నా చేతికి ఇచ్చేసి ... పాపం కిటికీ తలుపులు ఓపెన్ చేయడానికి ట్రై చేసి..రాకపోయేసరికి .. చాక్లెట్స్ తీసి తలుపు క్రింద నుండి లోపలకు విసిరి "హాయ్ బేబీ "అంటూ దాన్ని సముదాయించడం మొదలుపెట్టింది ..



గభ గభా మా ఆయన నెంబర్ కి కాల్ చేయడానికి నెంబర్ నోక్కాబోయాను ... అప్పుడు అర్ధం అయ్యింది నేను ఎంత టెన్షన్లో ఉన్నానో .. తన నెంబర్ మర్చిపోయాను ....9848 ..... తర్వాత ? తర్వాతా ఎంత తల బ్రద్దలు కొట్టుకున్నా గుర్తురావడం లేదు ... అప్పుడొచ్చింది ఏడుపు వరదలా ....పాపం ఆ అమ్మాయి బెదిరిపోయింది .... "నాకు నెంబర్ గుర్తురావడం లేదు" అన్నాను వెక్కేస్తూ ....అసలే ఒక ప్రక్క నా కూతురుని సముదాయిస్తూ ఉంది..దానికి తోడుగా ఇప్పుడు నేను తయారయ్యాను ... నా భుజం చుట్టూ చేయి వేసి.... "ఒకే..ఒకే రిలాక్స్ ... ఏం కాదు టెన్షన్ పడకు ...ఇంకెవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా "అని అడిగింది .."ఉహు "అన్నాను అడ్డంగా తల ఊపి ...."కొంచెం రిలాక్స్ అవ్వు గుర్తొస్తుంది" అంది...ఒక అయిదు నిమిషాలకు ఆయన సెల్ నెంబర్ గుర్తురాలేదుగాని ఎప్పుడో చెప్పిన ఆఫీస్ నెంబర్ గుర్తొచ్చింది విచిత్రంగా ...



వెంటనే ఆ నెంబర్ కి కాల్ చేసాను.. లక్కీగా మా ఆయన" హలో" అన్నారు... "అర్జెంట్గా ఇంటికి రండి... తలుపు లాక్ అయిపొయింది ...పిల్లలు ఇంట్లో ఉన్నారు" అన్నాను అరుస్తూ ... "ఇప్పుడా !!!చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది బుజ్జీ... ఒక వన్ అవర్ మేనేజ్ చేయగలవా "అన్నారు.. ఎంత కోపం వచ్చిందంటే సెల్ ఆ అమ్మాయిది అయ్యింది కాబట్టి సరిపోయింది.. ..."సరే.. అలాగే.. వచ్చేటప్పుడు నాకు, పిల్లలకు టిక్కెట్స్ తీసుకురండి నేను మా ఊరు వెళ్ళిపోతాను ... తొక్కలో మీటింగ్ ...పది నిమిషాల్లో ఇంటికి రాకపోతే చూడండి "అని మొబైల్ ఆ అమ్మాయికిచ్చేసి మా గుమ్మం దగ్గరే ఏడుస్తూ కూర్చున్నాను.. కాసేపటికి లోపల మా అమ్మాయి ఏడుపు ఆపేసింది ... ఎంత పిలిచినా పలకదు..ఏమైందో తెలియదు ...బిక్కు బిక్కుమని కూర్చున్నా ...పావుగంటలో మా ఆయన ఆదరాబాదరాగా పరిగెత్తుకొచ్చి కీస్ నా చేతిలో పెట్టేసి ..సారీ బుజ్జీ చాలా అర్జెంట్ పని అని వచ్చిన కేబ్ లోనే వెనక్కు వెళ్ళిపోయారు ...ఆ చైనా అమ్మాయికి థాంక్స్ చెప్పి గభ గభా తలుపు తీసి చూసాను ...



ఇల్లంతా పావనం చేసేసి, దానిపై నాలుగు దుప్పట్లు తెచ్చి పడేసి, వాటిపై నోట్లో వేలు పెట్టుకుని పడుకుని హాయిగా నిద్రపోతుంది...బాబుగాడు అప్పుడే నిద్ర లేచి ఏడుస్తూ మంచం దిగడానికి ట్రై చేస్తున్నాడు .... అమ్మో కాసేపు లేటు అయితే ఏమయ్యేది అనిపించేది ...ఇరుగుపొరుగు ఉండాలని ఇందుకే అనుకుంటా అంటారు ...సమయానికి చైనా అమ్మాయి వచ్చింది కాబట్టి సరిపోయింది ... లేకపోతే పరిస్థితి ఏంటి అని దిగాలుగా అనిపించింది .... "లేకపోతే ఏమవుతుంది బుజ్జి ...లాక్ స్మిత్ ని పిలిచి తాళం తీయిస్తావు ...ప్రతీది ఎదుటివాళ్ళ పై ఆధారపడకూడదు ... ధైర్యంగా ఉండాలి " మా ఆయన రాత్రి క్లాస్ పీకారు .."ఆ తాళాలు తీసే అబ్బాయికి అయినా కాల్ చేయాల్సిందే కదా ...అప్పుడన్నా ఇంకో వ్యక్తి అవసరం వస్తుందిగా" అన్నాను కోపంగా ..."సరేలే ,అలా లేనిపోని విషయాలు ఆలోచించడం దేనికిలే ...ఇక్కడ అందరూ ఇంతే ...మన జాగ్రత్తలో మనం ఉండాలి .. నువ్వు నీ సెల్ ఎప్పుడు దగ్గర పెట్టుకో .. ఇక మన ప్రక్కింటి వైపు అస్సలు చూడకు "అని పనిలోపనిగా వార్నింగ్ ఇచ్చేసారు..



మరి కొన్ని రోజులకు లెటర్ బాక్స్లో బిల్ల్స్ ఏమయినా వచ్చాయేమో చెక్ చేయడానికి ఓపెన్ చేసి చూస్తుంటే దానిలో ఎవరిదో పేరుమీద లెటర్ ...చూస్తే ప్రక్కవాళ్ళ ఇంటి అడ్రెస్స్ ...పొరపాటున మా బాక్స్లో వేసేసాడన్నమాట .. వాళ్ళ లెటర్ బాక్స్లో వేసేద్దామని చూస్తే వాళ్ళ బాక్స్ క్లోజ్ చేసేసి ఉంది ... ఇప్పుడేం చేయాలి ఇవ్వాలా ?వద్దా ? ఆవిడను తలుచుకుంటేనే భయంగా,కోపంగా ఉంది... పోనీలే ఏం ఇంపార్టెంట్ లెటర్నో అనుకుని మెల్లిగా వాళ్ళింటికి వెళ్లి తలుపు కొట్టాను ...వాళ్ళ అమ్మాయి తలుపుతీసింది .."వాట్ " అంది కొద్దిగా చిరాకుగా ..."మీ లెటర్ మా బాక్స్ లో పడింది" అని చెప్తుంటే వాళ్ళ అమ్మ వచ్చేసింది లోపలి నుండి" వాట్ హేప్పెండ్ ? "అనుకుంటూ ... ఆ లెటర్ వాళ్ళ చేతులో పెట్టేసి మా ఇంటికి పరిగెత్తుకు వచ్చేసాను ...."వద్దంటే వినవుకదా.. నీకు సిగ్గులేదంతే "మా ఆయన ఆ రాత్రి కన్ఫర్మ్ చేసేసారు ...



మరుసటి రోజు బాబుకి స్నానం చేయించి ,షెల్ఫ్ లో బట్టలు తీసి వెనుకకు చూస్తే వాడులేడు ...అవి ఇవి పుచ్చుకుని నడక నేర్చేసుకున్నాడేమో ఒక్క చోట కుదురుగా ఉండేవాడు కాదు ..తలుపు తీసి ఉండేసరికి పరుగున బయటకు వెళ్లాను ...ప్రక్కింటి మెట్లపై నిల్చుని, వాళ్ళను చూసి నవ్వుతూ దాగుడు మూతలు ఆడుతున్నాడు ... వాళ్ళందరూ నవ్వుతున్నారు... మళ్ళీ ఏం గొడవలే అనుకుని గభ గభా ఎత్తుకోచ్చేసాను .... ఇక అక్కడి నుండి వాళ్ళు కాలేజ్ కి వెళ్ళినప్పుడల్లా మా ఇంటి వైపు తొంగి చూడటం.. వీడు కేరింతలు కొట్టడం ... వాళ్ళు నవ్వడం.. వీడు బయటకు విసిరేసిన వస్తువులన్నీ తిరిగి మా గుమ్మమ్మ దగ్గర పెట్టడం చేసేవారు ....పాపం మా ఆయనకు ఈ విషయాలన్నీ తెలియక తన ప్రచ్చన్న యుద్ధం తను ఒంటరిగా కొనసాగించేవారు..



ఒకరోజు దీపావళి ... నేను ముగ్గువేసి దీపాలు అవి వెలిగించి లోపలికి వచ్చాను .. మా ఆయన వస్తుంటే తనని పిలిచి" హేపీ దీపావళి "అని చెప్పిందట ఆంటీ ... పాపం అంత సడన్ షాక్ తట్టుకోలేక పరిగెత్తుకుని నాదగ్గరకొచ్చి" ఇదేంటే నాకు హేపీ దీపావళి చెప్తుంది" అన్నారు ..." ఏమో నాకేం తెలుసు" అన్నాను నేనూ ఆశ్చర్యపడుతూ ......"నాకు డవుటే ..ఆవిడ హిహిహి అందిఅని నువ్వు హహహాహ అని వెళ్ళకు..మళ్ళీ తేడా వస్తే నువ్వే ఏడుస్తావ్ ...ఎందుకొచ్చిన గోలా చెప్పు "అన్నారు..సరే అన్నాను గాని మనం వింటామా? ... మరేం చేయను ??? నేను బయటకు రావడం తోనే నవ్వడం.. వాళ్ళింట్లో ఏం పండగ జరిగినా నాకు ఆ వంటకాలన్నీ పంపడం చేసేది ....ఎక్కడ ఆవు మాంసమో ,గేదే మాంసమో పెట్టేస్తుందో అని నీట్గా ధేంక్స్ చెప్పి ఇంట్లోకి వెళ్ళగానే ఒంపేసేదాన్ని...మరి ఎందుకు అనుమానం వచ్చిందో "నాకు తెలుసు మీ హిందువులు కౌ మాంసం తినరని అది గోట్ మీట్ "అని చెప్పిందోసారి.. మెల్లిగా మా కబుర్లు మొదలయ్యాయి.. ..ఇక్కడ మలయ్ వాళ్ళు హిందీ సినిమాలంటే పడి చస్తారు..హృతిక్ రోషన్ ,షారుక్ అంటే చెప్పనే అక్కరలేదు.. ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో హిందీ సినిమాల సిడిలు వందలు వందలు ఉంటాయి ..కాని ఆంటీ మాత్రం తమిళ్ సినిమాలంటే ప్రాణం పెట్టేసేది ....ఆఖరికి విజయకాంత్ ,శరత్ కుమార్లకు కూడా అన్యాయం చేసేది కాదు పాపం.. ప్రతి శనివారం వచ్చే తమిళ్ సినిమా ఎక్కడన్నా అర్ధం కాకపొతే మరుసటి రోజు నాతో చర్చ .... తన కోసం నేను తమిళ్ సినిమాలు చూడటం అలవాటు చేసుకున్నాను :)



మన ఇండియన్ కల్చర్ ,మన అలవాట్లు అన్నీ అడిగి తెలుసుకునేది....." చిన్నమ్మాయి పర్వాలేదు ఒక బాయ్ ఫ్రెండ్ ని వెదికేసుకుంది ..పెద్దదే ఇంకా ఎవరినీ చూసుకోలేదు బెంగగా ఉంది" లాంటి కబుర్లు మొదట్లో చాలా విచిత్రంగా అనిపించేవికాని ,ఆ తర్వాత అక్కడి వారి పద్దతులు వగైరా నాకు అర్ధం అయ్యేవి.... ఆ తరువాత ఆంటీ నాకెంత క్లోజ్ అయిపోయిందంటే పైన ఫోటో చూసారుగా అవన్నీ తను కొన్నవే ...అవనే కాదు బెడ్ షీట్లు,టవల్స్ ,డిన్నర్ సెట్లతో సహా ఇవని అవని లేవు ..... అన్నీ నాకు ఒక సెట్ తెచ్చి ఇస్తుంది...ప్లీజ్ నీకు ఇస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది కాదనకు అంటుంది...



ఇక బాబుగాడి సంగతి చెప్పనే అక్కరలేదు .... మావాడు రోజులో సగం పైగా వాళ్ళింట్లోనే ఉండేవాడు.... వాడి చదువు నేను పట్టించుకునేదాన్నే కాదు ...వాళ్ళే చెప్పేవారు ....ఒక్కోసారి మావారు ఇంటికి రావడం లేటయినపుడు బాబుగాడు నిద్రలో అక్కడ నెప్పని ,ఇక్కడ నెప్పని ఏడుస్తుంటే తను వచ్చి నిద్రపుచ్చేది ... ఒక్కోసారి మార్నింగ్ అలారం పెట్టుకోవడం మర్చిపోయి నిద్ర పోతే ,తనే ఫోన్ చేసి నిద్ర లేపేది స్కూల్ బస్ వస్తుంది మీ ఇంట్లో అలికిడి లేదు అని చెప్పి....ఆఖరికి ఇండియా వెళుతుంటే "అమ్మో రెండు నెలలు ఉంటావా ...బాబు లేకపోతే పిల్లలు బెంగపెట్టుకుంటారు ..వాడి షర్ట్ నాకు ఇవ్వవా ...మా మలయ్స్ బెంగతగ్గాలంటే వాళ్ళ బట్టలు దగ్గర పెట్టుకుంటాం" అని తీసుకునేది ... ఇలా ఒక్కటికాదు మా అమ్మ తర్వాత అమ్మలా చెప్పుకోవచ్చు....తనకోసమే ఇల్లు మారేటప్పుడు ప్రక్క అపార్ట్మెంట్లోనే ఇల్లు వెతుక్కున్నా రెంట్ ఎక్కువ అయినా సరే..... ఒక్కోసారి అనిపిస్తుంది అమ్మో అంత భీష్మించుకుని కూర్చుంటే ఆంటీ ప్రేమను మిస్ అయ్యేదాన్నేమో అని ..


కాబట్టి చెప్పొచ్చేదేమిటంటే భర్తమాట వినకపోతే మనకు బోలెడు లాభాలన్నమాట :)

28, మే 2011, శనివారం

అనగనగా ఒక రోజు...

ఈ మధ్యన నాకు పని ఎక్కువ అయిపోయి గొప్ప గొప్ప ఐడియాలు వచ్చేస్తున్నాయి . మీరు సరిగ్గానే విన్నారు ఖాళీ ఎక్కువ అయి కాదు పని ఎక్కువ అయ్యే....ఖాళీగా ఉంటే మనం ఎక్కడ ఆలోచిస్తాం ...ఎంచక్కా సిస్టం ఆన్ చేసి సినిమాలు,పాటలు ,సీరియళ్ళు,బ్లాగులు,కధలు అబ్బో నన్ను పట్టుకోవడం ఎవ్వరితరంకాదు....ఇంతకూ ఆ గొప్ప ఐడియా ఏమిటయ్యాంటే.... ఎప్పుడో అప్పుడప్పుడూ జరిగిన విషయాలు రాయకుండా ఒకేరోజున జరిగిన విషయాలన్నీ రాస్తే ఎలా ఉంటుందీ అని..... అదే డైరీ లెక్కన అనుకోండీ ...హేమిటో ఒక్కసారిగా మీరందరూ కసాయివాడిని నమ్మిన గోర్రేపిల్లల్లా ఎంత ముద్దుగా కనబడుతున్నారో నాకళ్లకు.....



ఇంతకూ విషయంలోకి వచ్చేస్తే కొన్ని దినాలు ఉంటాయి ..ఛీ ఛీ ఆ దినాలు కాదు రోజులన్నమాట.. కొన్ని రోజులు ఉంటాయి ....ఆ రోజుమనం పట్టుకున్నదల్లా పట్టుచీరై కూర్చుంటుంది.( ఆడపిల్లనికదా ఉపమానాలు అలాగే ఉంటాయి).... ఫర్ ఎక్జాంపుల్ మీరు చిల్లరమార్చడానికని లాటరీ టికెట్ కొన్నారనుకోండి దానికి మొదటి ప్రైజ్ వచ్చి మురిపిస్తుంది. (మా నాన్నగారికి అలాగే జరిగింది ) ఓ రెండొందలు సిల్క్ చీర కొందామని షాపుకి వెళితే లక్కీ డ్రాలో ఐదువేల రూపాయల పట్టు చీర చేతికొచ్చేస్తుంది (మా పిన్నికలా జరిగింది) ఇలా అన్నమాట.అయితే ఇలాంటిరోజులు ఎప్పుడోగాని రావు ..కానీ మరికొన్ని రోజులుంటాయి అచ్చం ఖలేజా సినిమాలో అనుష్కాలా....ఆ రోజు ఏం చేస్తే అది మటాష్ ....ఇవి తరుచూ వస్తుంటాయి ...దీనికి ఎక్జాం పుల్ ఈ పోస్ట్ అన్నమాట..



అసలేమైంది అంటే మొన్న ఆదివారం ప్రొద్దున్నే లేచి మా ఆయన ఎవరి మొహం చూసారోగాని (ఓయ్ ..ఏంటి నావైపు చూస్తున్నారు...నన్ను కాదు చూసింది ... ఆ రోజు నేను దుప్పటి నిండుగా కప్పేసుకుని పడుకున్నాను ...నాకు బాగా గుర్తుంది ) నేను రెండు రోజులకొకసారి మా సింగపూర్లో తలుపులు బార్లా తెరచి వెళ్ళిపోయినా చీపురుపుల్ల కూడా మిస్ అవ్వదు అని ఇండియాలో దొరికిన వారందరికీ దొరికినట్లుగా చెప్పే మాటల పై పెట్రోలు జల్లేసి ఒక దొంగవెధవ మా ఆయన పర్స్ ఎత్తుకుపోయాడు..అదీ పట్టపగలు ... పైగా చుట్టూరా జనాలు ఉండగా.. ఈయన గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతుంటే కిట్ ఓపెన్ చేసి మరీ ఎత్తుకుపోయాడు ... ఈ విషయం నాకు ఫోన్లో చెప్పగానే నేను భామాకలపానికి సిద్దమవుతుండగా మా ఆయన పారిజాత పుష్పం లాంటి మరొక మాట చెప్పి చల్లారబెట్టేసారు.....అంటే మా ఆయనకైతే పర్స్ ఒక్కటే పోయిందంట ....వాళ్ళ ఫ్రెండ్స్వి పర్సులు ,ఐ ఫోన్స్ తో సహా ఎత్తుకుపోయాడంట ... పర్స్లో డబ్బులెన్ని ఉన్నాయి అంటే 120 $ అని చెప్పారు ...ఈ ముక్క నేను నమ్మానంటే ఇన్నాళ్ళ మా దాంపత్య జీవితాన్ని అవమానం చేసినట్లు అవుతుంది ..అందుకే అలాంటి పాపం చేయలేదు..


సరే ..... కాసేపు వాడిని మా ఆయన్ని కలిపి ,విడి విడిగా ,హడావుడిగా తిట్టుకున్నాకా మా సార్ ఇంటికొచ్చారు .... మా ఆయన కజిన్ కూడా మా ఇంట్లోనే ఉండటం వల్ల ఎక్కడికన్నా వెళదామా అని ప్రోగ్రాం పెట్టారు.. " ఎక్కడికన్నా వెళదాం "అనే మాట అంటే చాలు నేనూ, నా కూతురు మేమురాము బాబు కాళ్ళు నెప్పులుగా ఉన్నాయి అని మంచమేక్కేసే వాళ్ళం కాస్తా ఏ కళనున్నామో సరే అనేసాం...చెప్పానుగా టైము అని ... "అడ్వెంచర్ పార్క్ వెళదామా " మా ఆయన మాట పూర్తవ్వకమునుపే.. నహీ !!!! ఆర్కిడ్ గార్డెన్ కి వెళదాం అన్నాను ఖరాకండిగా ....నా బాధ నాది ... అక్కడికి వెళ్లి బోలెడు ఫొటోస్ తీసేసి తెల్లారే పాటికల్లా బ్లాగ్లో పెట్టేసి ఆహా ఓహో అనిపించేసుకోవాలని... తన కజిన్ కూడా నన్నే సపోర్ట్ చేయడం వల్ల సరే గంటలో రెడీ అయిపోండి అని మా ఆయన ఆర్డర్ వేసేసారు ...



అయితే మన అమోఘమైన తెలివితేటలను ఉపయోగించి.. చూడండి ..అక్కడికి వెళ్ళడానికి ఎక్కవలసిన బస్సులు , గార్డెన్ టైమింగులు , గట్రాలు లాంటివి సరిగ్గా ఓ సారి ఎవరినన్నా కనుక్కోండి అని ఒక సలహా ఇచ్చాను ...అబ్బే ... "పెళ్ళాం చెప్తే వినాలి "అని టైటిల్ పెట్టి మరీ సినిమాలు తీసినా కొన్ని జీవులకు ఎక్కవు ....ఈ దిక్కుమాలిన మొబైల్స్ వచ్చిన దగ్గరనుండి ప్రక్కింటికి వెళ్ళాలన్నా గూగుల్ మేపులు పెట్టుకుని తడుముకుంటూ వెళ్ళడం ఫ్యాషన్ అయిపొయింది జనాలకు...అతి ముఖ్యంగా మా ఆయనకు ..... మాకు తెలుసులే నువ్వు పని చూసుకో ...ఎప్పుడు చూసినా బస్ అంటావ్ కేబ్ లో వెళ్ళినా అంతే అవుతుంది అని ఓ డైలాగ్ కొట్టి వెళ్ళిపోయారు ...సరే నేను, వాళ్ళ కజిన్ పోటీలు పడి మరీ మొహానికి అరంగుళం మందానా మేకప్పులు కొట్టేసి టిప్పు టాపుగా సూపర్గా తయారయిపోయాం ...



కేబ్ వాడు మమ్మల్ని చూడగానే" అయిదుగురా .. నో... కుదరదు "అన్నాడు.. నేను, ఆ అమ్మాయి ఒక క్లోజప్ ఏడ్ ఇచ్చి" ప్లీజ్ అంకుల్ "అన్నాం.....పాపం జడుసుకున్నట్లున్నాడు ఇంకేం మాట్లాడకుండా ఎక్కడికి వెళ్ళాలి అన్నాడు.....ఆర్కిడ్ గార్డెన్ మా ఆయన సీట్బెల్ట్ పెట్టుకుంటూ చెప్పారు .. ... ఓ "జూ" దగ్గర ఉంటుంది అదేనా అన్నాడు... ఎస్ అన్నారు మా సార్.... "జూ " దగ్గరా !!!! కాదు కదండీ ....అది ఇంకో చోటకదా ఆర్చాడ్ ఊరికి దగ్గరలోనే కదా నా మాట ఇంకా పూర్తికాలేదు ఇద్దరూ ఫోన్స్ లో టిక్కు టిక్కున గూగుల్ మేప్ ఓపెన్ చేసి నామొహానపడేసి నా నోరు మూయించేసారు.... సరే మనకెందుకులే అని తరువాత రోజు వేయబోయే పోస్ట్ గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను..అలా వెళుతున్నాం ...వెళుతున్నాం ..వెళుతూనే ఉన్నాం ... కాసేపటికి గమనించింది ఏమిటయ్యా అంటే "జూ " వచ్చింది ..మళ్ళీ "జూ" వచ్చింది...మళ్ళీ మళ్ళీ "జూ" వస్తూనే ఉంది వాడు దాని చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నాడు..బిల్లు చూస్తే బీపి పెరిగిపోతుంది ...... బాబు ఏమిటిదీ మా ఆయన అడిగారు....ఇక్కడే ఉండాలి ఎక్కడో మిస్ అవుతున్నాం అన్నాడు.. మళ్ళీ మావాళ్ళు ఇద్దరూ ఫోన్స్ పట్టుకున్నారు ...రైట్ సైడ్ వెళ్ళాలి అని ఈయన ...కాదు స్ట్రైట్ గా వెళ్ళాలి అని ఆవిడ .. మొత్తానికి కేబ్ వాడు ఏదో కనుక్కొని మీరు చెప్పిన గార్డెన్ క్లోజ్ చేసేసాడటండి ఇక్కడ ఆర్చాడ్ విల్లే అని ఒకటి ఉంది అక్కడికి పొండి అని దింపేసి వెనక్కి చూడకుండా పారిపోయాడు...



క్రిందకు దిగగానే మా ఆయన ముందు జాగ్రత్తగా దండకం మొదలుపెట్టేసారు ..నీవల్లే ...అంతా నీవల్లే ...అడ్వెంచర్ పార్క్ కి వేళదామే అంటే నా మాట విన్నావా అని తిట్లు...."గాడిద గుడ్డేం కాదు నేను ముందు నుండి చెప్తూనే ఉన్నాను ఇంకెవరి నైనా కనుక్కోండి అని నా మాట విన్నారా? అంత పెద్ద గార్డెన్ అలా ఎలా మూసేస్తాడు " నేనూ తిరగబడిపోయాను....మా ఆయనతో గోడవపెట్టుకునే విషయంలో నేనేమాత్రం మొహమాటపడను .. వెంటనే ఇద్దరూ మళ్ళీ సెల్ ఫోన్స్ తీసారు మెప్స్ ఓపెన్ చేయడానికి ... అక్కర్లేదు ..మీ ఫ్రెండ్స్ ని ఎవరినన్నా కనుక్కోండి అన్నాను కోపంగా... అప్పుడు తెలిసిన విషయం ఏమిటంటే ఆర్చాడ్ గార్డెన్ అనేది ఒకప్పుడు ఈ చుట్టుప్రక్కల ఉండేది అది ఇప్పుడు క్లోజ్ చేసేసారు... మేము వెళ్ళాలనుకున్న పార్కుని బొటానికల్ గార్డెన్ అనాలి( ఈ విషయం అందరికీ తెలుసుకాని టైంకి హోల్సేల్ గా మర్చిపోయాం :)) ..... అది ఇక్కడ కాదు అని వాళ్ళ ఫ్రెండ్స్ తప్పు మా ఆయనదే అని సెల్లుగుద్ది మరీ చెప్పేరు ....సో .. బాల్ నా కోర్టులో పడేసరికి ఇంటికి వెళ్ళేవరకూ ఆడుకోవలసి వచ్చింది..



ఇంతకు విల్లేకి వెళ్లాం అని చెప్పాను కదా ... ఏమిటా అది అని చూస్తే ఏమీలేదు నలబై కుండీలు ,నాలుగు రకాల మొక్కలు వేసి అమ్ముతున్నాడు వాడు.. వాటిని చూడగానే నీరసం ,దుఃఖం ఒకేసారి పొంగిపొర్లాయి ... కాని ఏం చేస్తాం నాలుగు పువ్వులనే అలా అలా ఫొటోస్ తీసా..హి హి హి హి ఇప్పుడు అర్ధం అయ్యిందా ఈ పోస్ట్ ఎందుకు వేసానో... తప్పు.. మంచిపిల్లలు అలా ఏడుపు మొహాలు వేసుకుని చూడకూడదు..ఫొటోస్ లాస్ట్లో పెడాతానేం..



సరే ఈ ఫొటోస్ అన్నీ తీసాకా అర్ధం అయిన విషయం ఏమిటంటే మేము పెనం మీదనుండి పొయ్యిలో పడ్డామని ... అదో చిన్న సైజు అడవిలా ఉంది..ఎటు చూసినా వానరాలు ...నో బస్సులు, నో కేబ్స్ నతింగ్ అంతే ...మండుటెండలో అలా నడుస్తూ, నడుస్తూ మొత్తానికి ఒక బస్ స్టాప్ కొచ్చాం ... మా ప్లాన్ ఏమిటంటే అక్కడ బస్ ఎక్కేసి కాస్త సిటీలా ఉన్న ప్లేస్లో దిగిపోయి ఏదో ఒక కేబ్ పట్టుకుని ఇంటికోచ్చేద్దాం అని .... ఇంతలో బస్ వచ్చింది బ్రతుకు జీవుడా అని బస్ ఎక్కాం.... ఎక్కిన పావుగంట అయ్యాకా తెలిసొచ్చింది ఆ రోజు అట్టాంటి ఇట్టాంటి మామూలు రోజు కాదని...ఆ బస్ మళ్ళీ జూకి -విల్లేకి, విల్లేకి - జూకి గింగిరాలు కొడుతుంది.ఓర్నాయనో ఇదేక్కడ గొడవరా బాబు అని మధ్యలో వచ్చిన మరో బస్ స్టాప్లో దిగిపోయాము .... మాకు ఇక్కడ ప్రతి స్టాప్ లోనూ బస్లు ఎక్కడికి వెళతాయో మేప్ ఉంటుంది ...చూస్తే అందులో ఒక్క ఊరు తెలిస్తే ఒట్టు.. కాసేపు వెయిట్ చేసి వేరే బస్ ఎక్కి కాస్త కార్లు గీర్లు కనబడుతున్న సిటిలా ఉన్న ప్లేస్ లో దిగి కేబ్ కోసం గంట వెయిట్ చేసాం ....ఒక్క కేబ్ లేదు ఆ దారిలో ...వచ్చినా జనాలు ఉన్నారు ...దెబ్బకు నీరసం వచ్హ్చేసింది ...ఇలాక్కాదని మళ్ళీ మరో బస్ ఎక్కించి మరో ప్లేస్లో దింపారు మా ఆయన ..అక్కడ కేబ్ దొరికి "దేవుడా " అని ఒక దండం పెట్టుకుని ఊపిరి పీల్చుకున్నానో లేదో అనుష్కా మళ్ళీ నవ్వింది ..... " పాపం పిల్లలని ఊరికే తిప్పాం బీచ్ కి వెళదామా గాలిపటాలు ఎగరవేద్దాం "అన్నారు మా ఆయన ....



గాలిపటాలు వద్దు చిత్రపటాలువద్దు నావల్ల కాదు ...మర్యాదగా ఇంటికి తీసుకువెళ్ళండి అనగానే మా అబ్బాయి..." బేడ్ మమ్మీ "అని బిరుదు ప్రదానం చేసాడు..మా అమ్మాయి దిస్ ఇస్ నాట్ ఫెయిర్ మమ్మీ నువ్వు కైండ్ లెస్ అని నిష్టూరం చేసింది.. మళ్ళీ నేరుగా బీచ్ కి వెళ్లాం.. అక్కడ కాసేపు పిల్లలు ఆడారోలేదో మా వాడు ఎలా తగిలించుకున్నాడో దెబ్బ తెలియదు... కాలి నిండా రక్తం రక్తం ....అసలే మావాడికి జలుబు చేసిందంటే ఇంటిల్లిపాదికీ జ్వరాలు వచ్చేస్తాయి...ఆ రేంజ్లో వేపుకు తినేస్తాడు...మా అమ్మాయి సైకిలింగ్ సైకిలింగ్ అంటుంటే తోలు తీస్తా ఇక పదండి అని మళ్ళా కేబ్స్ పట్టుకుని ఇలా ఇంటికొస్తున్నామో లేదో అర్జెంట్గా ఆఫీస్కి రా అని మెసేజ్ .... పాపం అటు నుండి అటే మా ఆయన ఆఫిస్కి బయలుదేరారు...

అలా ఆ రోజంతా డబ్బులిచ్చి మరీ తన్నిన్చుకున్నట్లు అయిపొయింది.. కాబట్టి టైం బాగోపోతే పండు వెన్నెలలో కూర్చున్నా మండుతెండల్లో మాడిన కాకుల్లా గిల గిలలాడతాం అన్నమాట ...


ఇవన్నీ ఆర్కిడ్ పువ్వుల్లో రకాలన్నమాట



కుళ్ళుతున్నారుకదా..నేచురల్ ..మీకు అలా అనిపించడంలో పెద్దగా వింతేం లేదు ..



ఇవేమో తెల్ల ఆర్కిడ్లు... బాగున్నాయి కదా



చెప్పేనుకదా పువ్వు పుట్టగానే పరిమళించినట్లు కొంతమంది కెమెరా చేతిలోకి రాగానే గుభాళించేస్తారు అంతే....



ఈ ఫొటోస్ చూసి మా ఆయన డొక్కులా ఉంది అన్నారు...ఏం కాదుకదా బాగుందికదా



ఇవో రకం



ఇది సూపర్ వచ్చింది కదా ...అంటే ఇవినా మనసులో మామాటలు కాదు మీ మనసులోవి..నాకు వినబడిపోతున్నాయి ఇక్కడికి


పాపం ఇది పువ్వు బాగానే ఉంది..కెమేరాకే ఏదో అయ్యింది ...కొద్దిగా మసగ్గా వచ్చింది ..ఏం పర్లేదు సర్ధుకుపోండి



ఇవేమో కలర్ భలే బాగుందిలే



అంటే ఇది పర్లేదు అనుకోండి పై ఫొటోస్ కంటే పెద్ద గొప్పగా ఏమీ లేదుకదా...ఒక్కోసారి పువ్వులు బాగున్నా సరే ఫొటో బాగా వస్తుంది .. అంటే నేను తీయలేదన్నమాట ఇది ...



ఇదేమో ఇంటికి ఎలా వెళ్ళాలో మా ఆయన ఎంక్వయిరీ చేస్తున్నపుడు రోడ్ ప్రక్కన కనబడితే తీసేసా..



ఇది బస్ స్టాప్ దగ్గర .... అక్కడెక్కడో ఉంటే జూం చేసి తీసాను



నేను చెప్పానా అది అంతా అడవిలా ఉంది అని ..నేను చెప్తే నమ్మారా? అందుకే ఈ ఎవిడెన్స్


పద పదవే వయ్యారి గాలి పటమా



21, మే 2011, శనివారం

అసలేం జరిగింది ?

తెల్లవారుజామునే లేచి పిల్లలను ఆదరాబాదరాగా బస్ ఎక్కించి ,తరువాత వంట చేసి, లంచ్ బాక్స్ తో భర్తగారిని ఆఫీసుకు సాగనంపీ ,గట్టిగా ఊపిరి పీల్చుకుని వెనుకకు తిరగ్గానే కిష్కిందకాండలా ఉన్న ఇల్లును చూసి, ఏడుపుమోహంతో కొంగు బిగించి చీపురు పట్టుకున్న సగటు ఇల్లాలు ఎంత తీరికగా ఉంటుందో నేనూ అంతే తీరికగా ఉన్న సమయంలో ఫోన్ ట్రింగ్ ట్రింగ్ మని ఒకటే మోత....


చెప్పొద్దూ అలాంటి సమయంలో ఫోన్ వస్తే నాకొస్తుంది కదా కోపం ...ఓ ప్రక్క అవతల పూజకు టైమైపోతూ ఉంది..అసలే మనం పూజ రూము లోకి వెళ్ళామంటే గంట బయటకు రాను..అదంతా భక్తి అనుకోకండి భయం అన్నమాట ...:)..ఈ దేవుడికి అష్టోత్తరాలు చదివి ఆదేవుడికి చదవకపోతే ఆయన ఫీలవుతాడేమో అని కొంతా ..ఆవిడకు పూజ చేసి ఈమెకు చేయకపోతే ఈమె ఏమనుకుంటుందో అని మరికొంత ...ఇదిగో అమ్మాయ్ సుందరాకాండ పంపాను చదువుతున్నావా ? విష్ణు సహస్రనామాలు ,లలితాపారాయణం మర్చిపోకేం అని నిమిషం నిమిషానికి గుర్తు చేసే అత్తగారి రూపం ఇంకొంత ఇలా ఒక్కటికాదు లెండీ. పైగా పన్నెండు దాటిన తరువాత పూజ చేస్తే రాక్షస పూజ అవుతుంది అట .అందుకే ఎట్టి పరిస్థితుల్లో అయిదినిమిషాలు తక్కువ పన్నెండుకల్ల హారతిగంట గణగణమని మోగించేస్తా ...ఇదిగో హిందూ దార్మికవాదులు నావైపుఅలా కొరకొరా చూడకండి ..నానేమీ సేయలేను :( ....


ఆ.... ఏదో చెప్తూ ఇంకేదో చెప్పేస్తున్నాకదా ..అలా పోన్ మోగుతూ ఉంటే విసుగ్గా ' హలో 'అన్నాను .... "బ్రతికే ఉన్నావా ' అటునుండి "కయ్ కయ్ " మందో కంఠం ."అమ్మో!! .. సుధ" అని మనసులో అనుకుని ...అదికాదే మరే ...నేనేమో ..ఈ మధ్య ..పిల్లలు.. బిజీ అని పదాలు వెతికేసుకుంటుంటే.." అనవే అను ...నాకంటే పిల్లా, పీచుతో ఖాళి ఉండదు కాబట్టి నీకు ఫోన్ చేసే తీరికలేదూ ,నువ్వంటే మొగుడు బయటకు వెళ్ళగానే పొద్దస్తమానం టీవి, కంప్యూటర్ ముందేసుకుని ఇలా ఫోన్స్ చేసి చావగోడతావు అనేకదా నీ ఉద్దేశం...ఆగిపోయావే అనూ " అటునుండి నిష్టూరంగా అరిచింది.ఇది ఇంత కరేస్ట్ గా నా మనసులో మాటలు ఎలా చెప్పేసిందబ్బా అని అనుకోని" అబ్బే..ఛీ ఛీ నా ఉద్దేశం అదికాదే నీకలా అర్ధం అయ్యిందా" అన్నాను కంగారుగా ....."నువ్వెలా అన్నా నాకలాగే అర్ధం అవుతుంది ...పనిపాట లేకుండా కొంపలో ఒక్కదాన్నే ఉంటే అందరికీ లోకువే" ఎడుపుగొంతుకుతో అంది... నాకు విషయం అర్ధం అయిపొయింది.. మీ ఆయనతో గొడవ అయ్యిందా అన్నాను ఫోన్ స్పీకర్ లో పడేసి పని చేసుకుంటూ ..(భర్త తో తగు వేసుకుంటే ఒకపట్టానా ఆ కబుర్లు పూర్తవ్వవులెండి ) "అవ్వదా మరి ..ఒకటి కాదు రెండుకాదు ౩౦౦౦ డాలర్లే .మంచి జాబ్ ..పైగా మెడికల్ ఎలవెన్సులు గట్రాలు అని బోలెడు ఉన్నాయి. జాయిన్ అవుతానంటే ససేమిరా వద్దు అంటున్నాడు ..చూడవే ఎంత అన్యాయమో అంది కోపంగా...


నాక్కూడా బోలెడు కోపం వచ్చింది ..మంచి జాబే గా చేస్తే తప్పేంటి ???నువ్వేమన్నా మణులడిగావా?మాణ్యాలడిగావా ?నెల అయ్యేసరికి బోలెడు డబ్బులు చేతిలోపోస్తా అంటే ఏం నెప్పా....దీన్నే మేల్ ఇగో మరియు మగ అహంకారం అంటారు అని తనకు నచ్చ్సు రీతిలో ఒదార్చీ ఇంతకీ ఎందుకొద్దన్నారు?" అన్నాను . "హూం నీకు తెలుసుకదే నాకు కొన్ని ప్రొబ్లెంస్ వల్ల పిల్లలు పుట్టలేదని, దానికోసం అడ్డమైన మందులూ వాడేసరికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి గ్యాస్ట్రిక్ పెయిన్ మొదలైంది ఆ మధ్య..ఒక్కోసారి కడుపులో విపరీతమైన మంట ,వికారం ,కడుపుబ్బరం ఒక్కటి కాదులే ...మళ్ళీ దానికోసం హాస్పిటల్ చుట్టూ తిరగడం అవుతుంది ఈ మధ్య..ఇప్పుడు ఆ వంక పట్టుకున్నాడు ...ఇప్పటికే టైముకి తినవు ...రేపు జాబ్ వస్తే అసలు తినవు ఇక ఆ సంపాదన అంతా డాక్టర్స్ కి పెట్టాలి.పిల్లలు పుట్టేవరకు జాబ్ లేదూ ఏమీ లేదూ అని మొండికేస్తున్నాడు" అంది .


ఇందులో కూడా పాయింట్ కనబడింది..."నిజమే కదా తను చెప్పింది కూడా "అన్నాను ఆలోచిస్తూ.......పోయి ,పోయి నిన్ను అడిగాను చూడు నన్ను అనాలి..ఒక్క మాట మీద ఉండవేం...ఇక నావల్ల కాదు ఆ మందులు గట్రా ...అన్నీ మానేస్తాను ..పిల్లలు పుడితే పుట్టారు లేకపోతే లేదు..ఆరోగ్యం నాశనం అయిపోతుంది.ఇంట్లో ఒక్కదాన్నే కూర్చుంటే పిచ్చ బోర్ కొడుతుందే..అందుకే వాసూ వద్దన్నా జాబ్ చేయాలనే అనుకుంటున్నా..నీ అభిప్రాయం ఏమిటీ??" అంది.ఇదిగో ఇక్కడే వళ్లుమండుతుంది..నిర్ణయం పక్కాగా తీసేసుకుని మళ్ళీ నన్ను అడగడం ఎందుకో..నేను వద్దన్నా ఖచ్చితంగా జాబ్లో చేరుతుందికాబట్టి మర్యాద పోకుండా నువ్వే కరెక్ట్....ఎంచక్కా జాయిన్ అయిపో అని ముందుకు తోసేసాను...


రెండునెలల తరువాత మళ్ళీ అది ఫోన్ చేసేవరకు దాని విషయమే మర్చిపోయాను..ఎప్పటిలాగే హలో అనగానే తిడుతుందేమో అని కంగారుపడిపోయానుగాని అదిమాత్రం నీరసంగా మాట్లాడుతుంది."ఏమైందే ఒంట్లో బాలేదా" అన్నాను . "బాలేదా అంటే అదేనే ఇంతకుమునుపులాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ..వికారంగా ,చిరాగ్గా కడుపులో మంటగా నెప్పిగా ఏంటోలా ఉంది" అంది. ....."ఏమైనా విశేషమేమో??" అన్నాను అనుమానంగా. "ఎహే ఎవరికి చెప్పినా ఇదేగోలా ..ఆ డాక్టర్స్ కూడా అంతే..వెళ్ళగానే పెద్ద పని ఉన్నట్లు స్కానింగ్ చేసిపడేసి వందల డాలర్లు బిల్లు చేతిలోపెడుతున్నారు...ఇప్పటికి నాలుగు సార్లు చేయించాను..లేటెస్ట్ గా మొన్న వారమే చూపించుకున్నాను ..ఏమీలేదు అన్నాడు" అంది దిగాలుగా.. "మందులు వాడటం మానేసాను అన్నావుగా అయినా తగ్గకపోవడం ఏమిటే అన్నాను" అయోమయంగా.... "మొన్న తగ్గినట్లే తగ్గి మళ్ళీ తిరగబెట్టింది ...అనవసరంగా జాబ్లో జాయిన్ అయ్యానంటావా" అంది ..."ఆ రోజు చెప్తే విన్నావా" మనసులో తిట్టుకుని..."చా చా అలా ఏమీ కాదులే తగ్గిపోతుంది కొద్ది రోజుల్లో" అని ధైర్యం చెప్పేసాను ....


ఇది జరిగిన మరుసటి నెల మళ్ళీ ఫోన్ ...ఇండియా వెళ్ళాలిఅనుకుంటున్నానే అని...."ఏమైంది సడన్ గా" అన్నాను."ఏమీ లేదు ఎలాగూ రెండురోజులు సెలవులు కలిసొచ్చాయి ...అమ్మావాళ్ళను చూసినట్లు ఉంటుంది ..పైగా ఈ ప్రాబ్లం ఇంకా తగ్గలేదే ఎన్ని మందులువాడినా..అమ్మ అక్కడ డాక్టర్స్ దగ్గర చూపిద్దాం రమ్మని గొడవ" అంది. హూం ,అదీ నిజమేలే ..కాని జాగ్రత్త సరిగ్గా ఎండల టైం ...మొన్న ఎండల్లో మేము ఇండియా వెళ్ళినపుడు నాకు సరదా తీరిపోయింది.వికారం, కళ్ళు తిరగడం ఒక్కటి కాదు ..పిల్లల్ని అయితే హాస్పిటల్ చుట్టూ తిప్పుతూనే ఉన్నాను ..ఎండలో అస్సలు తిరగకు" అని ఒక సలహా పారేసాను..


ఓ నెల పోయాకా నేనే ఫోన్ చేసాను గుర్తుపెట్టుకుని ..ఈ సారి గనుక చేయకపోతే చాకిరేవే మరినాకు ......."హలో" అంది నీరసంగా .ఇదేంటే ఇండియా వెళ్ళిన ఉత్సాహంలో ఒకటే ఉషారు ఉషారుగా ఉంటావనుకున్నాను ఇలా గాలితీసిన బెలూన్లా అలా వ్రేలాడిపోతున్నావేంటి అన్నాను అయోమయంగా......ఏం ముహూర్తాన అన్నావే బాబు ఇండియాలో ఎండలకు కళ్ళు తిరిగుతాయని ...వెళ్లోచ్చి రెండువారాలు పైనే అయిపోయినా ఇంకా తేరుకోలేకపోతున్నా.. ఎంత నీరసమోచ్చేసిందో తెలుసా" అంది.".అయ్యో అవునా!!.. అయినా ఇంటిపట్టున హాయిగా ఉండక ఎండలో ఎవరు తిరగామన్నారు నిన్ను...డాక్టర్ దగ్గరకు వెళ్తా అన్నావ్ వెళ్ళావా మరి "అన్నాను.."ఏంటి ఇంటిదగ్గర ఉండేది..షాపింగ్ అని అదని ,ఇదని ఏదో ఒకపని ఉంటుందిగా ...ఉన్నదే వారం రోజులు ...లాస్ట్ డే డాక్టర్ దగ్గరకు వెళ్లాను "అంది.. ఏమన్నారు మరి అన్నాను ... నా పాత రిపోర్ట్స్ అన్ని చూసి ఇంకో బుట్టెడు మందులిచ్చి అస్సలస్సలు రక్తం లేదు బాగా తిను అని చెప్పి బిల్లు బజాయించి పొమ్మన్నారు అంది విసుగ్గా...ఇంకేం చేస్తావ్ వాడు మరి అని ఫోన్ పెట్టేసాను..


ఆ తరువాత చాలా రోజులు దాని విషయమే మర్చిపోయాను....ఇక్కడ అందరమూ ప్రక్క ప్రక్క ఊరుల్లోనే ఉంటాము( మేక్జిమం అరగంట జర్నీ) కాని ఏదో ఒక అకేషన్ వస్తే గాని కలుసుకోమన్నమాట ....నా బెస్ట్ ఫ్రెండ్ నేను ప్రతి రోజూ, గంటలతరబడి ,సంవత్సరాల పాటు మాట్లాడుకుంటాం కాని నాలుగేళ్లకోమారు కూడా కలుసుకోము ...అట్టా సూడమాకండి...అదంతే ....బద్దకానికి బాధ్యతలు అని ముసుగేసి అలా రోజులు గడిపేస్తాం ... ఆ ...ఎంతవరకూ చెప్పాను.. అలా సుధ విషయం మర్చిపోయి రోజలు గడిపేస్తుండగా ఒక రోజు అమ్మతో పోన్లో పిచ్చాపాటి మాట్లాడుతుంటే పద్మక్కకు ఆపరేషన్ చేసారట ఓమారు వెళ్లి పలకరించి రావాలి అంది..అదేంటి లాస్ట్ ఇయరేగా పాప పుట్టుంది.... మళ్ళీ ఎప్పుడు ప్రెగ్నెంట్ అయ్యింది?? అన్నాను.. అదికాదులే ఆ మధ్య ఏంటో ప్రక్కకు తిరిగి పడుకుంటే ప్రేగులన్నీ ఒక వైపుకి వచ్చేస్తున్నట్లు అనిపిస్తుంది అంట... డాక్టర్ ఆపరేషన్ చేసి అలా కాకుండా సరిచేయాలన్నారట అంది.. ఇవేం రోగాలమ్మా బాబు విచిత్రంగా అన్నాను..మరే ఆడపుట్టుక అంటే అంతే ..మా అమ్మ సింపుల్గా తేల్చేసింది.. ఫోన్ పెట్టేయగానే సుధ ఫోన్ ...


కాసేపు దాని చీవాట్లకు బలి అయ్యాకా ఇప్పుడెలా ఉంది అన్నాను...పర్వాలేదు ,ఇండియా నుండి తెచ్చిన మందులు వేసుకున్నాకా తగ్గినట్లే ఉంది కానీ... అని ఆగిపోయింది..మళ్ళీ ఈ కానీలు అణాలు ఏమిటీ అన్నాను .... ఏంటో నే ఒకటి తగ్గిందంటే మరొకటి..ఈ క్రొత్త టాబ్లెట్స్ వాడుతుంటే వళ్ళంతా నీరు పట్టేస్తున్న ఫీలింగ్ .. అరికాళ్ళు మరీను ..ఇలా నొక్కితే అలా లోపలికి గుంత పడుతుంది అంది.. ఏమో బాబు ఇదేం గోలో..విచిత్రం విచిత్రమైన రోగాలు అని ప్రొద్దున్న అమ్మ మా పద్మక్క గురించి చెప్పింది అంతా దానికి చెప్పాను....అలా చెప్పి ఎంత తప్పు చేసానో తరువాత గాని తెలిసిరాలేదు ...


పది రోజులుపోయాకా సుధ నుండి ఫోన్.. "హలో" అనగానే గై గై మంది ...ఏం నోరేబాబు నీది ..అర్జెంట్గా ఒక దబ్బలమో ,సూదో తెచ్చి కుట్టిపాడేసేయ్ ముందు అంది..నేనేం చేసానే అన్నాను అర్ధం కాక...మొన్న చెప్పావ్ కదా మీ పద్మక్క గురించి ..ఇప్పుడు నాకు కూడా ప్రేగులు ప్రక్కకు వేల్లిపోతున్నట్లు అనిపిస్తుందే అంది..ఓర్నాయనో ఇదెక్కడి గోలరా బాబు అనుకుని.. "ఛీ ఛీ నీ మొహం అదెక్కడో నూటి కో కోటికో జరుగుతుందంట అన్నాను కంగారుగా..ఆ ఒక్కదాన్ని నేనేమోనే అంది ఏడుపు మొహం వేసుకుని.. ఎహే పో ...నీకెందుకు అలా జరుగుతుంది.... అంతా నీ ఊహ అంతే అన్నాను...ఊహో కల్పనో ...ఒక్క రోజు కాదు వారం రోజులనుండి అదే ఫీలింగ్ ....నాక్కూడా మీ పద్మక్కలాగే జరుగుతుందేమో .. అసలు అదేనా లేక ఇంకేమన్నా రోగమా నాకు..నాకే ఎందుకు ఇలా జరుగుతుంది..ఏం పాపం చేసానంటావ్ ..ఈ మధ్య కాలం లో ఒక్క రోజు స్థిమితంగా లేను ...అని ఏడుపుమొదలు పెట్టేసింది..కాసేపు ఓదార్చి ఫోన్ పెట్టేయగానే నాకు దిగులు పట్టుకుంది...ఎందుకిలా జరుగుతుందో అని...


కొన్నాళ్ళు అయ్యాకా విషయం తెలుసుకోవాలాని ఫోన్ చేస్తే హాస్పిటల్ లో ఉన్నానే అంది..ఇంకా తగ్గలేదా అన్నాను జాలిగా.. ఉహు ... ఒక్కోరోజు ఎక్కువగా అనిపిస్తుంది ఒక్కోరోజు తక్కువగా ...అపాయింట్మెంట్ తీసుకుంటే ఈ రోజు ఇచ్చాడు అంది..ఎందుకే ఇంత నెగ్లెక్ట్ చేస్తావ్ ఇలాంటి విషయాలు అన్నాను కోపంగా .. ఆఫీస్లో చచ్చేంత పని ఉంది.. ఈ కే కే హాస్పిటల్ సంగతి తెలిసిందేగా ఈ రోజు అడిగితే నెల రోజులకు ఇస్తాడు ..మనకేమో సండే సాటర్ డేలే కావాలిగా అంది ...సరేలే ఇంటికొచ్చాక విషయం చెప్పు అని పెట్టేసాను ...


సాయంత్రం కాల్ చేస్తే ఎవరూ లిఫ్ట్ చేయరు...నాకేమో టెన్షన్ ....ఏమైందో అని ...మొబైల్ కి చేసినా అదే పరస్థితి.. దేవుడా దానికేం కాకుండా చూడు అని దణ్ణం పెట్టేసుకున్నాను.. మరుసటి రోజు ఫోన్ చేస్తే హలో అంది ఉత్సాహంగా ...కొద్దిగా ధైర్యం వచ్చింది నాకు..ఏమన్నారు అన్నాను ఆత్రుతగా..పక్కున నవ్వి .... నన్ను తిట్టాను అంటే చెప్తాను అంది..ఎహే చెప్పు... విసుగ్గా అన్నాను ...నేను ప్రెగ్నెంట్ నే అంది ..అవునా కంగ్రాట్స్ ..అందులో తిట్టడానికేముంది అన్నాను..పూర్తిగా విను ఇప్పుడు నాకు ఆరో నెల...త్వరలో ఏడో నెల వచ్చేస్తుంది అంది ..ఏంటీ ఒక్కసారిగా అరిచాను ... నిన్న స్కానింగ్ చేసి డాక్టర్ పిచ్చి మొహాన్ని చూసినట్లు చూసిందే అంది...నాకేం అర్ధం కాలేదు..ఎలా? ఆరోనెల అయితే తెలియకపోవడం ఏమిటీ నీకు అన్నాను విచిత్రంగా ..


అదే నాకు మొదట అర్ధం కాలేదు ...లాస్ట్ టైం స్కానింగ్ చేయిన్చానుగా అప్పుడు కన్సీవ్ అయినట్లు ఉంది..కాని ఎర్లీ స్టేజ్ లో ఉండటంవల్ల తెలియలేదు..ఈ పిచ్చిమొహాలు కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని మందులు ఇస్తూనే ఉన్నారు .... నేను కూడా ఆ వికారం ,కళ్ళు తిరగడాలు అన్నీ దానివల్ల ఎండలవల్ల అనుకున్నానుగాని ఈ ఐడియా రానేలేదు ...ఇండియాలో డాక్టర్ కూడా పాత రిపోర్ట్స్ చూసి మందులు ఇచ్చేసింది.. ఒక పోలిక్ ఆసిడ్ గాని ఐరన్ టాబ్లెట్స్ గాని ఏమీ వాడలేదే... వరుసగా అడ్డమైన టాబ్లెట్స్ వాడేసాను ..పైగా పెద్ద పొట్టెం రాలేదు .అంది..


అయినాకాని అంతా తెలియకుండా ఎలా ఉన్నావ్?? అన్నాను..నాకెలాగు "ఇర్రేగ్యులర్ " అనికదా హాస్పిటల్ చుట్టూ తిరిగేది ..టాబ్లెట్స్ ఎలాగూ మానేసానుగా అందుకే పెద్దగా డవుట్ రాలేదు ....నాకైతే ఇంకా కల లా ఉంది అంది... "కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడని ...అలా కలిసొచ్చింది అన్నమాట నీకు ...మాకులా రోజు రోజు టెన్షన్ పడకుండా ఎంచక్కా ఏడో నెలకొచ్చేసావ్" అన్నాను ... ఇక జాబ్ రిజైన్ చేసేస్తున్నాను ...మళ్లీ ఎనిమిదో నెలలో ఫ్లైట్ ఎక్కనివ్వడుగా అంది.. అప్పుడు గుర్తొచ్చింది నాకు ..ఏమే దొంగామోహమా.. మీ అబ్బాయి కడుపులో తిరుగుతూ ఉంటే నీవల్లే, నీ నోరు అని అన్ని తిట్లు తిడతావా నన్ను ఆయ్ అని గొడవ వేసుకున్నా...


ఇప్పుడు తను పరిగెట్టేకొడుకుతో ఆస్ట్రేలియాలో ఉంది ...అలా జరిగింది అన్నమాట :)

8, మే 2011, ఆదివారం

సరదాగా స్కై పార్క్ కి

నిన్న స్కై పార్క్ కి వెళ్ళాం.. స్కైపార్క్ అంటే ఏంటంటే.. ఊ..చాలా బాగుంటుంది అన్నమాట..ఎలా చెప్పాలో తెలియడం లేదన్నమాట.. అందుకే చూపిస్తా.. అసలుకి ఒక 500 ఫొటోస్ తీసి ఉంటాం అందులో 450 ఫొటోస్ లో మేమే ఉన్నాం.. మిగిలినవి ఒడబోయగా కొన్ని మీకు చూపిస్తున్నాను.. ముందే ఐడియాలేదు బ్లాగ్లో పెట్టాలని.. నిన్న చూసాకా వచ్చింది అన్నమాట.. చూసి కుళ్ళుకోండి :)లేకపోతే నాకు మనశ్సాంతిగా ఉండదు..

ముందుగా కేబ్లోంచి కొన్ని మా ఊరి ఫొటోస్



ఇదే బాబు స్కై పార్క్ ..దీనిలోపలకే వెళ్ళాం ...

అందులో వెళ్ళాకా కొన్ని ఫొటోస్ ....ఇవేంటనుకుంటున్నారు బుల్లి బుల్లి రెస్టారెంట్లు ..నాకేమో తీయడం రాలేదు ..చాలా చాలా సూపర్ ఉన్నయన్నమాట చూడటానికి..మీరు కూడా చాలా చాలా ఇంకా బాగా ఊహించుకోండి...ఫొటోస్ క్లిక్ చేసి పెద్దవి చేసుకుని చూడండి




ఇవి మెట్లలాగా ఉన్నాయికదా.. ఉహు.. పైన రూఫ్ అన్నమాట

ఇటువంటి శిల్పాలు చాలానే ఉన్నాయి.. ఇది పరుగులు పెడుతూ తీసా.. మరి నన్ను వదిలి వెళ్ళిపోతున్నారు..


చాలా పెద్ద బిల్డింగ్ లే ..అది అయితే స్కేటింగ్ ..మా అమ్మాయి ఒకటే గొడవ ..అమ్మా వెళదాం అని ...టైమెక్కడా.. పాపం తీసుకొచ్చేసాను..




నవ్వుకోకండేం ఇలాంటివైతే బోలెడు ఉన్నాయి....షోకేస్లో బొమ్మలు చూస్తే పిచ్చ ఇష్టం నాకు ..



లాహిరి లాహిరి లాహిరిలో ..బిల్డింగ్ లోపలే చెరువు దానిలో నౌకావిహారం ..మనిషికి 5 $..దారుణం కదా ..సుత్తిలా 10 నిమిషాలు కూడా తిప్పలేదు.. పిల్లల కోసం తప్పలేదు.. అయినా వాడు నా దగ్గర టిక్కెట్టు తీసుకోవడం మర్చిపోయాడు..ఇంకోసారి పిల్లల్ని పంపనా అంటే ..మా ఆయన.. హుఊం ఎందుకులేండి చెప్పడం..


మనిషన్నాకా కాసింత కళాపోషణ ఉండాలండి.. సూపరుంది కదా..మనమే తీసాం బిల్డింగ్ క్రింద నుండి..


ఇదిగో బాబు స్కై పార్క్ నమూనా.....దీని పైకి ఎక్కినందుకు దొంగమొహంగాడు మనిషికి 20$ బేండ్ వేసాడు..కాని.. పర్లేదులే..బాగానే ఉంది ...


దారంతా కుండీలతో ఇలా సరదా వస్తువులతో డెకరేట్ చేసారు

బిల్డింగ్ పైన అంతా చెట్లే చెట్లు ...భలే బాగుంది కదా ...
ఈ ఫారినర్స్ కి పని పాట ఏడవదు ...ఎక్కడికి వెళ్ళు సరిగంగ స్నానాలే

చేతికి కెమారా ఇస్తే ఇలాంటి పైత్యాలు పుడుతుంటాయినాకు..భరించాలి తప్పదు మీకు ..




ఈ ఫొటోస్ చూసాకా నాకో విషయం అర్ధం అయ్యింది..వేలకు వేలు పోసి కెమెరాలు కొనడం కాదు గొప్ప ..ఫొటోస్ తీయడం నేర్చుకోవాలి.. బుల్లి బుల్లి కెమెరాలతో ఎంచక్కా ఫొటోస్ తీసేస్తున్నారు అక్కడ..ఇంత పెద్ద కెమేరా వేసుకుని మనకు నచ్చినట్లు తీస్తే ఇలాగే వస్తాయన్నమాట..ఈ మాట అనేసి బోలెడు తిట్ట్లు తినేసా అన్నమాట.. కాని సూపర్ ఉంది ఈ ప్లేస్..మొత్తం సింగపూర్ కనబడింది..కాకపోతే పది నిమిషాలు కూడా కూర్చో నివ్వలేదు అక్కడ సుత్తిలా .ఇంకా చాలా ఫొటోస్ ఉన్నాయిగాని ..మరీ ఎక్కువ అయిపోతాయని పెట్టడంలేదు





ఈ place మాత్రం అల్టిమేట్ ...మొత్తం బిల్డింగ్ చూపించినప్పుడు పైనా షిప్ లా ఉందికదా ఆ ఏడ్జ్ లో అన్నమాట ఆ స్విమ్మింగ్ పూల్ ..పడిపోతాం కదా.. ఆ ఫారినర్స్ కి భయమే లేదు..ఎలా కట్టాడో అర్ధం కాలేదు..లోపల్కి వెళ్ళే ఓపికలేక బయట నుండి ఒక క్లిక్కు కిక్కాము ,,


క్రింద రెండు ఫొటోస్ ఉన్నాయికదా ..పై ఫొటో క్రింద ఫొటో తేడా చూడండి...రెండూ ఒక ప్లేస్లో తీసినవే.. మరదేమరి క్షవరం అయ్యాకా వివరం తెలియడం అంటే.... ఇప్పటికి మా ఆయనగారికి తెలుసొచ్చింది అన్నమాట బ్యాక్ గ్రౌండ్ బ్రైట్ గా ఎలా తీయాలో ..అప్పటీకీ చెప్తున్నా గైడ్ మోడ్లో పెట్టి చూడండి మహానుభావా ....అబ్బే అలా వినేస్తే ఇంకేంటి ..ఫోటొస్ అన్ని నాశనం చేసేయద్దూ ..పెద్ద జోకేమిటంటే.. మాకులాంటి కెమేరా తెచ్చుకుని అదెలా పట్టుకోవాలో తెలియకా మా ఆయన్ని సలహా అడిగే శిష్యుడు ఒకడు దొరికాడు అక్కడ ..పాపం వాడు..:P




బ్రిడ్జ్ ప్రక్కనే బోలెడు పూవులు బాగున్నాయి కదా

ఈ బ్రిడ్జ్ చాలా బాగుందికాని ఇక్కడ బాగా రాలేదు

ఇంకా కొబ్బరి చెట్ట్ల దారి


వస్తున్నప్పుడు పువ్వులాంటి బిల్డింగ్

చీకట్లో స్కయ్ పార్క్

ఆఖరికి టాక్సి స్టాండ్ ని కూడా వదల్లేదు.


మరిన్ని వివరాలకు :
http://www.marinabaysands.com/SandsSkypark/Sands_Sky_Park.aspx