11, ఏప్రిల్ 2011, సోమవారం

గీతాంజలి

'భౌ 'భయపడ్డారు కదా...భయం మాట ప్రక్కన పెట్టు అసలెవరు నువ్వు అని అంటున్నారా? అయ్యబాబోయ్ అలా భయపెట్టేయకండీ ...నేను నేస్తాన్ని.మీరలా మర్చిపోతే ఒప్పుకోనంతే:) ..సరే విషయానికోచ్చేస్తే టైటిల్ చూసి గీతాంజలి సినిమా సమీక్షనో, లేక ప్రేమకధలు పలురకాలు లో గీతాంజలి గాడి గురించో రాస్తున్నాను అనుకుంటే తప్పులో కాలేసినట్లే .నిన్న అనుకోకుండా గీతాంజలి సినిమా చూస్తుంటే అలా ఏంటో ఏంటో చాలా విషయాలు గుర్తోచ్చేసాయి .సరేలే అని ఇక్కడ రాసేసుకుంటున్నా అంతే :)

ఎన్ని మంచి సినిమాలు చూసినా కొన్ని సినిమాలు మాత్రం చాలా రోజులు మనల్ని మర్చిపోనివ్వకుండా వెంటాడుతూ ఉంటాయి .అలాంటి వాటిల్లో నాకు బాగా నచ్చేసినవి స్వర్ణ కమలం ,సప్తపది ,పడమటి సంధ్యారాగం,మౌన రాగం ఇదిగో ఈ గీతాంజలి మొదలైనవి అన్నమాట .అయితే ఈ సినిమా చూడటానికి మాత్రం అబ్బో చాలా పెద్ద కధ జరిగింది .కొద్దిగా ఓపిక చేసుకోండి .మనం ప్లాష్ బ్యాక్ కి వెళ్ళామంటే సుత్తి ఓ రేంజ్ లో కొడతాం .మీకు ప్రత్యేకంగా చెప్పక్కరలేదు కదా :)

ఈ సినిమా వచ్చేసరికి నేను ఆరో ,ఏడో చదువుతున్నాను .సరిగా గుర్తులేదు .అప్పట్లో వేసవి సెలవలు వచ్చాయంటే చాలు మా ఇంట్లో అమ్మ ,పెద్దమ్మ ,పిన్నులు పోటీలు పడి మరీ ఎవరి చెల్లెళ్ళను వాళ్ళు మా ఇంటికి తీసుకోచ్చేసేవారు.అసలే మా ఇంట్లో జనాభా ముప్పై మందికి పైగా ఉండేవాళ్ళం.ఇక అందరూ వస్తే అబ్బో భలే సందడిగా ఉండేది . అలా ఒక పిన్ని చెల్లే రాజమండ్రి ' కృష్ణక్క' (అంటే తను కూడా పిన్నే అవుతుంది అయినా అక్కా అని పిలిచేవాళ్ళం) .తను మా నాన్నమ్మ కు సొంత మేనకోడలు (తమ్ముడి కూతురు) కావడం వల్ల మిగతా పిన్నుల చెల్లెళ్ళ కంటే ఈ కృష్ణక్క తో ఎక్కువ చనువు ఉండేది మాకు .అందులోనూ ఈ రాజమండ్రి వాళ్ళు కబుర్లు భలే చెప్తారేమో రాత్రిళ్ళు మేడ పై నేను, మా పెద్దక్క, కృష్ణక్క అంటరాని వాళ్ళలా దూరంగా పక్క వేసుకుని తెగ కబుర్లు చెప్పెసుకునేవాళ్ళం.

"అప్పుడేమో నేను బస్ స్టాప్ దగ్గర నిన్చున్నానా, ఆ సిరాజ్ ఏమో నా ప్రక్కనే నించున్నాడు.నాకు చాలా భయం వేసేసింది ..'కృష్ణా' నువ్వు లేకపోతే నేను బ్రతకలేనూ అన్నాడు . అసలే వాడు ముస్లిం ,నేను హిందూ .వాళ్ళింట్లో తెలిస్తే ఖైమా కొట్టేస్తారు, మా ఇంట్లో తెలిస్తే చెప్పులు కుట్టేస్తారు . దానికి తోడు మా కిరాతకుడు చంటన్నయ్య లేడూ .. డేగ కళ్ళు వేసుకుని ఎప్పుడూ నాకు కాపలా కాయడమే . వాడు గాని చూసాడో అయిపోయానే. అసలు ఈ అన్నయ్యలున్నారే .పరమ కంత్రీలు .వీళ్ళు మాత్రం ఊరందరి అమ్మాయిలకూ లైన్ వేయచ్చు .మనల్ని మాత్రం ఎవ్వరూ చూడకూడదు .దొంగ మొహం గాళ్ళు " ఇలా అది కబుర్లు చెపుతుంటే మేమిద్దరం కళ్ళ ముందు సీన్లు ఊహించుకుంటూ వినేవాళ్ళం. అప్పటికి నేను చిన్నపిల్లని కావడం వల్ల నన్ను ముందు జోకోట్టేసి తరువాత బోలెడు సీక్రెట్స్ మాట్లాడుకునేవారనుకోండి.నేను కూడా వాళ్ళను ఆట్టే ఇబ్బంది పెట్టి టైం వేస్ట్ చేయకుండా కళ్ళు మూసేసుకుని మరీ జీవించేసి వినేసేదాన్ని.

అలా ఒకరోజున "అసలు సిరాజ్ ఎలా ఉంటాడో తెలుసా అచ్చం ' నాగార్జున 'లా ఉంటాడు "అంది తన్మయంగా .అప్పటికి మాకు నాగార్జున అంటే ఎవరో తెలియదు. నాగార్జున ఎవరక్కా ??అన్నాం ఇద్దరం ఒకేసారి . " నాగార్జున " ఎవరా!!! హూం ..తప్పు మీది కాదే మీ అమ్మలది .సంవత్సరానికో మారు సినిమాకు తీసుకువెళతారు.అది కూడా వాళ్ళ తరం హీరోల పాత డొక్కు సినిమాలు ...చూసిందే చూస్తూ ,చూసిందే చూస్తూ మీ కొంపకు వచ్చినందుకు మాకూ అవే చూపిస్తూ.. ఛీ వెధవ జీవితం" అని విసుక్కుంది."నీకేంటక్కా.. మీ వూర్లో రంభ ,ఊర్వసి ,మేనక దియేటర్లో పెద్ద మావయ్య పని చేస్తున్నాడుగా.మీరు ఎంచక్కా బోలెడు సినిమాలు చూడచ్చుగా అంది మా హేమక్క కొద్దిగా కుళ్ళుతూ.. "హ్మం ..ఎంచక్కా చూడచ్చా ??? ఎంత చక్కగా చెప్పావే నా తల్లీ .,, అసలు వాడు అక్కడ ఏడుస్తున్నాడు కాబట్టే ఓ సినిమా లేదూ ,సింగినాదం లేదూ నా బతుక్కి ...మా ఊర్లో మంచి సినిమాలన్నీ అందులోనే తగలడతాయి .నేను గాని ఫ్రెండ్స్తో వెళ్ళానో ప్రతీ తలకు మాసిన వెధవా నన్ను గుర్తుపట్టేసి మా అన్నయకు చెప్పెయడమే .. వీడికి తోడు చంటన్నయ్య ఇద్దరూ కలిసి క్లాసుల మీద క్లాసులు పీకుతున్నారు" అని వాపోయింది .


అయ్యోపాపం మేము జాలిగా చూసాం."ఇదిగో ఇప్పుడే చెపుతున్నా .రేపు మీ అమ్మావాళ్ళు సినిమాకి తీసుకు వేళతారుగా ..ఏం సినిమాకి వెళదాం అనగానే నేను గీతాంజలి గీతాంజలి అంటాను .మీరు కూడా గీతాంజలి గీతాంజలి అనండి .పిల్లలం అందరం ఒక్క మాట మీద ఉంటే తప్పకుండా తీసుకువెళతారు అర్ధం అయ్యిందా!!!లేకపోతే మీతో అస్సలు మాట్లాడనే మాట్లాడను " అంది.సరే అంటే సరే అన్నాం.ప్రొద్దున్న అనుకున్నట్లుగానే అమ్మా వాళ్ళు సావిట్లో సమావేశం అయ్యారు .ఏ సినిమాకి వెళదాం అంటుండగానే మేము గీతాంజలి కి వెళదాం అని అరిచాము ."గీతాంజలియా అదేవరిది?" పెద్దమ్మ అడిగింది . "నాగార్జునది అక్కా .. నాగేశ్వరరావు కొడుకు ...చాలా బాగుంటుంది అక్కా వెళదాం" కృష్ణక్క బ్రతిమలాడటం మొదలు పెట్టింది."నాగార్జునా అంటే మజ్ను లో ఏక్ట్ చేసాడు వాడేనా ??? అచ్చే ..కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని రేపోమాపో అన్నట్లు చూస్తాడు వాడా ..వాడేం బాగుంటాడే" ఒక పిన్ని మొదట్లోనే వద్దనేసింది.పాపం ఇదేదో చెప్పాబోతుంది కరెక్ట్గా ఇంట్లోకి ఎంటర్ అయ్యారు దుర్గన్నయ్యా(మా పక్కింటబ్బాయి), మా ఆఖరుచిన్నాన.. ఏంటి వదినా ???అనుకుంటూ ..

ఏమి లేదు మహేషూ! గీతాంజలి సినిమా అంట ఎలా ఉంది ?కొత్త సినిమా కదా టిక్కెట్లు దొరుకుతాయా? మా అమ్మ అడిగింది." అజ్జి బాబోయ్ వదినా గీతాంజలి సినిమాయా ?ఆ సినిమా చూడాలని ఎలా అనిపించింది ?ఇదేనా చెప్పింది "అన్నాడు కృష్ణక్క ను చూస్తూ.."ఇదిగో బావా ఇప్పుడే చెపుతున్నాను మధ్యలో వస్తే మర్యాద దక్కదు జాగ్రత్త "కృష్ణక్క తర్జని చూపిస్తూ వార్నింగ్ ఇచ్చింది. "నువ్వు నోరుముయ్యి" ...వదినా నా మాట విను .దాని అంత పరమ చెత్త సినిమా ఇప్పటివరకూ ఎవరూ తీయలేదంట .దియేటర్ మొత్తం ఖాళియే అంట .బయటకు వచ్చాకా ఇద్దరు ముగ్గురికి వాంతులు కూడా అయ్యాయంట ..తరువాత మీ ఇష్టం" అన్నాడు చిన్నాన .."వాళ్లకు కూడా నీకులాగే తిన్నది అరిగి ఉండదు ..అక్కా నువ్వు గాని ఈ సినిమాకి తీసుకు వెళ్ళకపోతే నేను ఇంక మీ ఇంటికి రాను.. ఇప్పుడే బట్టలు సర్దుకు వెళ్ళిపోతా" బెదిరించేసింది ఇది.. "మరేం పర్లేదు నేను దగ్గరుండి బస్ ఎక్కిస్తాను .ఆల్రేడి చంటిగాడికి ఫోన్ చేసే వస్తున్నాను .నువ్వు దిగగానే చూపిస్తాడు అసలు సినిమా నీకు" అన్నాడు తను కూడా తగ్గకుండా... "పోనీలే మహేషు ..ఎప్పుడో సంవత్సరానికోసారి వస్తుంది ..నువ్వు కరెక్ట్గా చెప్పు విషయం " మరో పిన్ని సమర్ధించింది క్రిష్ణక్కను ..." వదినా నా మాటలు నమ్మడం లేదుకదా...ఇక లాభం లేదు..అరే నువ్వు సినిమా స్టోరీ చెప్పరా వీళ్ళకు" అని అన్నయ్యను వైపు చూసాడు.


"ఏమీ లేదు పిన్ని.., హీరోకి, హీరోయిన్ కి భయంకరమైన రోగాలు ...అయినా ప్రేమించుకుంటారు..ఎవరు ముందు పోతారో అని ఇద్దరు భయపడి చస్తూ ఉంటారు .చివరకి హీరోయిన్నే ముందు మంచం ఎక్కేస్తుంది .చివరకు ఏమవుతుందో వెండితెరపై చూడాలి ..అదీ స్టోరి అని మా వైపు చూసాడు..అప్పటివరకూ గీతాంజలి గీతాంజలి అని గేంతులేసిన నేను, హేమక్కా స్టోరీ వినగానే దెబ్బకి సైలెంట్ .మావాళ్ళందరూ " ఛీ ఇదేం స్టోరీయే ఇంకా నయం దీని మాటలు పట్టుకుని వెళ్లాం కాదు "అని అప్పటికప్పుడు అది వెక్కి వెక్కి ఏడ్చినా సరే పట్టించుకోకుండా ముక్కు పుడకో ,మూడు ముళ్లో మొత్తానికి తీసుకు వెళిపోయారు . . అలా గీతాంజలి సినిమా మొదటి సారి చూడటం మిస్ అయిపొయింది.:)


మళ్లీ రెండేళ్ళకో, మూడేళ్ళ తరువాతో మరి ఒక సారి మా స్కూల్లో నేను ,స్వాతి సీరియస్ గా మా వెనుక బెంచ్ లో కబుర్లు చెప్పుకుంటుంటే శ్రీను వచ్చాడు .(ఈ శ్రీను ఎవరంటే ఒక సారి ప్రేమ కధలు పలురకాలు పోస్ట్ వేసా చూడండి అందులో నాకు గ్రీటింగ్ ఇచ్చాడు చిన్నపుడు అని చెప్పానే ...వాడన్న మాట ) "ఏంటి శ్రీను నిన్న రాలేదే స్కూల్ కి "అన్నాం ఇద్దరం. 'గీతాంజలి సినిమా మళ్ళీ వచ్చింది చూడటానికి వెళ్లాను 'అన్నాడు .నాకు వెంటనే గత చరిత్ర గుర్తొచ్చి .."ఛీ !ఆ సినిమాయా అస్సలు బాగోదంటగా" అన్నాను."ఎవరు చెప్పారు?? నాలుగోసారి తెలుసా నేను చూడటం "అన్నాడు ..."మా అన్నయ్య చెప్పాడు సినిమా ఏం బాలేదని" అన్నాను నేనూ ఒప్పుకోకుండా.."అదీ అలా చెప్పు అన్నయ్యలకు ఇలాంటి సినిమాలు నచ్చవులే" అన్నాడు తాపీగా . నాకు, స్వాతి కి అదేదో పజిల్లా అనిపించింది ".ఏం ఎందుకని " ???ఒకేసారి అడిగాం .వాడు అటుఇటు చూస్తూ "అందులో ఒక భయంకరమైన పాటుంది "అన్నాడు మెల్లగా.."ఏం హర్రర్ సినిమాయా??" అన్నాను అనుమానంగా.."కాదు కాని అమ్మాయిలు చూడకూడదు" అన్నాడు సీరియస్సుగా.. వెంటనే మా స్వాతిదానికి కోపం వచ్చేసింది ..అమ్మాయిలను తక్కువ చేస్తే అది అసలు భరించలేదు.....అంటే.. అబ్బాయిలు చూడచ్చా???అమ్మాయిలు మాత్రమే ఎందుకు చూడకూడదు ???ఒక్క అరుపు అరిచింది .."ఎందుకంటే ..ఎందుకంటే.... అమ్మాయిలు చిన్నపిల్లలు కాబట్టి ..అందుకే చూడకూడదు" అనేసి ఎందుకొచ్చిన గొడవనుకున్నాడో అక్కడినుండి వెళ్ళిపోయాడు ..ఈ లాజిక్ ఏమిటో ఎంత బుర్ర గోక్కున్నా అర్ధం కాలేదు ఇద్దరికీ ..


ఆ తరువాత రెండు రోజులకు నేను మా ప్రక్క వీధిలో ఉండే చిన్న అమ్మమ్మ ఇంటికి వెళ్లాను ..వాళ్ళ పెద్ద అమ్మాయి భావనక్కా నేను ఒక జట్టు... అది కూడా వరుసకు పిన్నే అవుతుంది కాని అక్కా అనే అంటాను ...తనకి సినిమాల పిచ్చి..కాని తన ప్రత్యేకత ఏమిటంటే సినిమా దియేటర్ లో చూడటం కంటే దాని దగ్గర స్టోరీ వింటే భలే ఉంటుంది. అదేదో సినిమాలో శ్రీ లక్ష్మిలా టైటిల్ నుండి మొదలుపెట్టి మాటలు, పాటలు ,దుస్తులు తో సహా భలే చెప్పేది.. " నిన్నోచ్చా అక్కా నువ్వు సినిమాకి వెళ్ళా వంట కదా "అన్నాను బుద్దిగా కూర్చుని వినడానికి రెడి అయిపోతూ.."ఆ ..గీతాంజలికి వెళ్లాను ...మీ అమ్మమ్మకు చెప్పకే.. ఇది మూడో సారి చూడటం" అంది గుస గుసగా ...ఎటు చూసినా అందరూ గీతాంజలి గీతాంజలి అంటుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసేసింది.పైగా మూడు సార్లు, నాలుగు సార్లు అని పోటీలు పడి చూస్తున్నారు.."అక్కా.. సినిమా ఏమి బాగోదంటగా ..వాళ్ళిద్దరికీ బోలెడు రోగాలు అంటగా " అన్నాను నేను విన్న లోపాలు వినిపిస్తూ.."నీ మొహం... ఎవరు చెప్పారు ... డిఫరెంట్ లవ్ స్టోరీ ..అసలు నేను చిరంజీవి సినిమాలు తప్పించి ఇంకో సినిమాను పొగడటం చూసావా? అలాంటిది నేనే మూడు సార్లు చూసానంటే ఆలోచించు" అంది ..సర్లే గాని నాకు స్టోరీ చెప్పు అన్నాను ఆసక్తిగా మొహం పెట్టేసి ..."మొహం చూడు ..కొన్ని సినిమాలు చూడాలిఅంతేనే వింటే మజా ఉండదు ..ప్రొద్దున్న లేస్తే గీతాంజలి డ్రెస్సులు వేసి అటు ఇటు తిరిగేస్తూ ఉంటావు ..దాని కోసమైనా సినిమా చూడాల్సిందే" అంది ..అప్పట్లో గీతాంజలి డ్రెస్ లు ,ప్రేమ పావురాలు డ్రెస్ లు అని ఏం సినిమా వస్తే అవి తెగ కోనేసేది అమ్మ .." మరీ... మరి ఏదో భయంకరమైన పాట ఉంటుంది అటగా " అన్నాను భయంగా ..." ఆ ... పాట అంటావా ...ఊ ..చిన్నపిల్లలు చూడకూడదులే మరి "అంది మెల్లగా ...


అందరూ చిన్నపిలలు చూడకూడదు చూడకూడదు అంటుంటే నాకేమో అదేదో భయం పెట్టేసే పాటేమో అని పెద్ద డవుటు.."మరి పెద్దవాళ్ళు ప్రక్కన ఉంటే చూడచ్చా?' అన్నాను ధైర్యం తెచ్చుకుని..."తిక్కదానా తిక్కదానా ..అసలు పెద్దవాళ్ళతో కూర్చుని చూడ కూడనిదే ఆ పాట ..కానీరా బుజ్జీ ..ఆ సినిమా చూస్తున్నంత సేపూ మనం థియేటర్లో ఉన్నట్లు ఉండదు .యే కొడైకేనాలో ,కులుమనాలియో వెళ్ళిన ఫీలింగ్ వచ్చేస్తుంది ...భలే ఉంటాయిలే లోకేషన్లు ..అసలు ఎవరైనా లోపలికి వచ్చారంటే హీరోకి ఎలా తెలుస్తుంది అనుకున్నావ్..తలుపు తీయగానే లోపలకి పొగలు పొగలుగా వచ్చే పొగమంచును బట్టి వెనుకకు తిరుగుతాడు ...ఆ పర్వతాలు ,ఆ వానా ...ఎంత బాగుంటాయో ..పైగా హీరోయిన్ ఎంత అల్లరి తెలుసా..ఎవరన్నాఅబ్బాయిలు ఏడిపిస్తున్నారనుకో వాడి దగ్గరకు వెళ్లి నువ్వంటే ఇష్టం ..పెళ్లి చేసుకుందామా అని రాత్రి చర్చ్ వెనక్కి రమ్మని చెప్పి .. తెల్ల డ్రెస్ వేసుకుని భయం పెట్టేస్తూ ఉంటుంది"... అని రెండు, మూడు సీన్లు చెప్పి మరీ ఊరిన్చేసింది..అదేంటో నాకు సూపర్ నచ్చేసేయి ఆ సీన్లన్నీ ..ఇక తప్పదు సినిమాకి వెళ్ళాల్సిందే అనుకుని ఎలా? అని ఆలోచిస్తుంటే మా పెద్దక్క కనబడింది..నేనూ, అది చిన్నప్పటి నుండి ఒకే స్కూల్ ఒకే కాలేజ్ ..అందుకే మా అక్కకంటే దానితోనే నేను ఎక్కువ ఉండేదాన్ని..


"హేమక్కా గీతాంజలి సినిమా అంట..చాలా బాగుంది అంటక్కా" ..అన్నాను దాని ప్రక్కనే చేరి.".అవునంట నా ఫ్రెండ్ కూడా చెప్పింది" అంది .."అయితే పెద్దమ్మను అడగచ్చుగా "అన్నాను ఉత్సాహంగా."ఎవరూ.. మీ పెద్దమ్మా !! కూతురని కూడా చూడదు.. చెప్పుతీసుకుని కొట్టేస్తుంది ..మొన్నేగా ఇంగ్లీష్ ,మేత్స్ మళ్లీ తన్నేను.. రోజు తలుచుకుని ,తలుచుకుని అక్షింతలు వేస్తుందే బాబు ..ఇప్పుడుగాని సినిమా అంటే ఏకంగా తలంబ్రాలే నాకు ..నువ్వే మీ అమ్మను అడగచ్చుగా " అదే సలహా నాకు పడేస్తూ అంది.. "హూం పెద్దమ్మ కనీసం తాలంబ్రాలతో ఆగిపోతుంది ..మా అమ్మ అస్సలు మొహమాట పడదు నాన్నకు చెప్పి దగ్గరుండి మరీ ఆకాశంలో అరుంధతి నక్షత్రం తో సహా చూపించిగాని వదలదు "నిట్టూర్చాను నేను. "పోనీ.. మీ అక్క చేత చెప్పిస్తే?? ..మన ఇంటి మహారాణి కదా...అది తందనాన అంటే తానతందనాన అంటారుగా అందరూ .. అందులోనూ మొన్న ఫస్ట్ క్లాస్ కూడా వచ్చింది" తప్పకుండా ఒప్పుకుంటారు అంది ..".ప్లిచ్ ..వాళ్ళు ఒప్పుకున్నా ఇది ఒప్పుకోవద్దూ ..దానికి మదర్ ధేరిసా...మేరీ మాత..పరలోక ప్రభువు లాంటి సినిమాలు తప్ప ఇంకేవి నచ్చవు ..తిరిగి మనకు క్లాస్ పీకుతుంది" అన్నాను నిరాశగా .."నిజమేనే బాబు మొన్న షాప్ కి తోడు రమ్మంటే దారంతా బైబిల్ చదివి వినిపించేసింది..మరి ఇంకేం చేద్దాం? పోనీ మా అమ్మను నువ్వు, మీ అమ్మను నేను బ్రతిమాలుకుంటే ?"కళ్లెగరేసింది ... అంతే ఆ సాయంత్రం నుండి మరుసటి రోజు ప్రొద్దున్న వరకూ పెద్దమ్మా పెద్దమ్మ పెద్దమ్మా ..పిన్ని పిన్ని పిన్ని అంటూ మా వాళ్ళ చుట్టూ ప్రదిక్షణాలు చేసి మరుసటి రోజు మధ్యాహ్నం కల్లా దియేటర్లో కూర్చోపెట్టాం..


సినిమా మొదలైంది ...హీరోయిన్ ఎంటర్ అయ్యేవరకూ అబ్బో సూపరు ... ఉన్నట్లుండి హీరోయిన్ ఒక అబ్బాయిదగ్గరకు వెళ్లి లేచి పోదామా అనేసరికి నాకు, మా అక్కకు నూట రెండు ..."ఇదేం సినిమాయే బాబు ..వాడేమో పెద్దా చిన్నా తేడా లేకుండా ఐ లవ్ యూ చెప్పేస్తున్నాడు .ఇదేమో ఏకంగా లేచిపోదామా అంటుంది..చితక్కోట్టేస్తారేబాబు మనోళ్ళు " ...నన్ను గిచ్చేస్తూ చెవిదగ్గర గుసగుసగా అంది ..ఇస్స్ ..అబ్బా ..నాకు మాత్రం ఏం తెలుసు ..చేతిని రుద్దుకుంటూ ప్రక్కకు తిరిగి చూసేసరికి మా అమ్మ నా వైపు కొరకొరా చూస్తూ కనబడింది. గొంతు తడారిపోయింది .".అంటే అమ్మా ...అదినిజంగా లేచిపోదామని పిలవదమ్మా..ఉత్తుత్తినే అలా ఏడిపిస్తుంది అంతే "అన్నాను బలవంతంగా నవ్వుతూ... "నోర్ముయ్ ..ఇంకోసారి ఆ మాట మాట్లాడావంటే కాళ్ళు విరక్కోడతాను "మా అమ్మ ఘాట్టిగా వార్నింగ్ ఇచ్చేసే సరికి సైలెంట్ అయిపోయాను ..ఈ లోపల "నంది కొండ వాగుల్లోనా "పాట మొదలైంది .."అక్కా .. ఈ పాటేనేమోనే చాలా భయంకరంగా ఉంటుంది అంట "అన్నాను ఒక చేత్తో దాని చెయ్యి గట్టిగా పట్టేసుకుని ...ఎహే వదులు పిరికిదానా ..దీనికే భయపడిపోతారా ,,అది విసుక్కుంటూ సినిమా లో లీనమైపోయింది...నేను మాత్రం బోలెడు భయపడిపోవాలని ముందే ప్రిపేరైపోయాను కాబట్టి చెవులు మూసేసుకుని,కళ్ళు మూసేసుకుని మధ్య ,మధ్యలో చూస్తూ ఎలాగోలా పాట అయ్యింది అనిపించాను.. ఏంటో అంత భయపడిపోయారు పిచ్చి మొహాలు ..మామూలుగానే ఉంది కదా అని తెగనవ్వేసుకున్నాను కాని సినిమా సగం అయ్యాకా మొదలైన" ఓం నమః" పాట చూసాక గాని అర్ధం కాలేదు వాళ్ళు అలా ఎందుకన్నారో..



'అయ్యబాబోయ్ బుజ్జోయ్ ..వీడెవడే పాట అంతా అదే సీను చూపిస్తున్నాడు.. వద్దు వద్దన్నా తీసుకొచ్చాం కదా ..ఈ రోజు రాత్రి ఇంటి దగ్గరమనకి సామజవరగమనే ...మీ పెద్దమ్మ నన్నేనా చూస్తుంది?" అంది మెల్లిగా .."ఊ ..నిన్నే చూస్తుంది ..మరి మా అమ్మో ?"అన్నాను భయం భయంగా .."మీ అమ్మ నిన్ను చూస్తుంది కాబట్టే మా అమ్మ గురించి అడిగాను ..అంతా నీవల్లే ..రేపటి నుండి నాతో మాట్లాడకు "అంది కోపంగా .."నన్నంటావేంటి..నువ్వు కూడా బాగుంది అనే కదా అన్నావు "నేను ఏడుపుమొహం పెట్టేసాను..పాట అయ్యేంతవరకూ ఇద్దరం వంచినతల ఎత్తితే ఒట్టు .. కాసేపు ఇంటిదగ్గర మాకు జరిగే సన్మానం తలుచుకుని భయపడ్డాను కాని కొద్దిసేపటికే మళ్లీ సినిమాలో లీనమైపోయాను..నిజంగా నాకు ఆ సినిమా ,స్క్రీన్ ప్లే ,లోకేషన్లు ,డైలాగ్స్ అన్నీ పిచ్చ పిచ్చ గా నచ్చేసాయి...సినిమా చూసిన వారం రోజులవరకూ ఆ సీన్లన్నీ కళ్ళ ముందే కనబడేవి..మొత్తానికి సినిమా అయిపోయింది .


మేమిద్దరంటెన్షన్ టెన్షన్ గా మా వాళ్ళ వెనుకే హాల్ బయటకు వచ్చేసాం ...అప్పుడు చూసాం ...మొత్తం మా బేచ్,బేచ్ కళ్ళు అన్నీ ఎర్రగా ఉబ్బిపోయి ఉండటం." ఆ పిల్ల ని చంపేస్తాడేమో అని భయపడిపోయాను " పెద్దమ్మ కళ్ళు ఒత్తుకుంటూ అంటుంది.."అంతే అక్కా మంచివాళ్ళకే దేవుడు అలాంటి కష్టాలు పెడతాడు "అని ముక్కు ఎగబీలుస్తూ మా అమ్మ. "కాని అక్కా ....అమెరికాలోని ఇలాంటి జబ్బులకు బోలెడు మందులు ఉంటాయంటకదా ??/అవి వేస్తే ఆ పిల్లకు తగ్గదంటావా?పిన్ని డవుటు.. ఆ రోగానికి మందులే లేవని వాళ్ళ నాన్న చెప్పాడుగా మరో పిన్ని నిరాశ... "ఎందుకు తగ్గదూ ..మొన్న మా వూర్లో అక్కా ఒక ఆవిడకు ఇలాగే ,,,,,,," అంటూ బోలెడు కధలు ...


హమ్మయ్యా బ్రతుకు జీవుడా అనుకుని ఊపిరి పీల్చుకుని ఇంటికొచ్చేసాము :)