25, ఏప్రిల్ 2022, సోమవారం

నేను - మెడికల్ షాపు- ఓ కోతి

 చాలా రోజుల క్రితం.. రోజులేంటిలే యేళ్ళ క్రితం మా ఆయన ఇండియా కొచ్చిన ఉత్సాహంలో పెట్టిన వెయ్యినొక్క వ్యాపారాల్లో ఒకటయిన మెడికల్ షాప్ లో నన్ను ఓ రోజు బలవంతంగా కూర్చో పేట్టేసి ఆయన శబరిమలయ్ చెక్కేసారు.... 


పారాసిటమాల్ అంటే జ్వరానికి వాడతారు అని తప్ప ఇంకేమి తెలియని నేను నా వల్ల కాదు మొర్రో అని బ్రతి మాలినా సరే... మా షాప్లో పని చేసే 'ఎం ఫార్మసి 'అమ్మాయి డెలివరీకి పుట్టింటికి వెళ్ళడం వల్ల ,వేరే దారిలేక నన్ను బెదిరించి మరీ కుర్చీలో కూర్చో పెట్టేసారు... అది కాదండి చీరల షాపో ,నగల షాపో అయితేవంద ,యాబై అటు ఇటు అయిత్టే సర్దుకుపోవచ్చు.. మందులండి మందులు..   ప్రాణాలతో చెలగాటం కాదూ అన్నాను భయం భయంగా..

ఓస్ అదా నీ గోలా ఇది పెద్ద విషయం కాదు.. ఈ రేక్ లో బి. పి కి ,ఆ రేక్ లో షుగర్ ...అందులో దానికి సంబందించినవి ...ఇందులో దీనికి సంబందించినవి.. అందులొ ఇంకేదో సంబందించినవి అని అయిదు నిమిషాల్లో అయిదువందల మందులు గురించి చెప్పేసి వెళ్ళిపోయారు... 

ఆ మొత్తం మందుల్లో నాకు అర్ధం అయిన మందు ఒక్కటే "ఓమిప్రోజోల్".. గ్యాస్ కి సంబందించింది.. ఎందుకంటే అది బ్లు కలర్ లో పే..ద్ద డబ్బా ..చక్కగా ఎదురుగా కనబడుతుంది... 


అన్నట్లు నాకో అసిస్టెంట్ని కూడా ఏర్పాటు చేసారు.. దానిపేరు దాక్షాయిని. నాకు కనీసం పారసిటమాల్ పేరన్నాతెలుసు.. దానికి జండూబాం పేరు కూడా తెలియదు... అలాంటప్పుడు నాకు మా నాన్న మీద కోపం వస్తుంది కదా.. మామూలుగా రాదు.. ఎందుకో మీలాంటి విజ్ఞులకు ప్రత్యేకంగా చెప్పక్కరలేదు.. 


ఎక్కడన్నా షాప్లో కూర్చుంటే కష్టమర్లు వస్తే సంతోషిస్తారు ..నాకు ఎవరన్నా షాప్ వైపు వస్తున్నారంటే దడదడ లాడేది.. పస్ట్ కస్టమర్ ఎంత మంచోడంటే మగాడయిపోయాడు కాబట్టి బాగోదని వదిలేసాగాని లేకపోతే ఎత్తుకుని గిర గిర తిపేసేదాన్ని... పారాసిటమాల్ అడిగాడు. ..కళ్ళ కద్దుకుని మరీ ఇచ్చాను


ఆ తర్వాత నుండి మొదలయ్యాయి కష్టాలు.మామూలు  కష్టాలు కాదు.. "మెట్ఫార్మిన్ 500 "ఇవ్వండి.. మెట్ఫార్మినా అండి.. ఒక్క నిమిషం... అని బుర్ర గోక్కుంటుంటే ...మా దాక్ష అయిపోయాయండి అంది సింపుల్ గా.. అయిపోయాయా ..పోని "ఏంలిప్ ఏటి."..అన్నాడు...  అదికూడా అయిపోయింది అంది ఏమాత్రం తొణక్కుండా... మరింకేం ఉన్నాయి అన్నాడు విసుగ్గా.. "ఓమిప్రోజోల్ " నేను గట్టిగా అరిచాను ఆనందం తట్టుకోలేక... అతను నా వైపు ఎగాదిగా చూసి వెళ్ళిపోయాడు... 


నీకు బుర్ర భలే పని చేసిందేవ్..నాకు భయం తో బుర్ర పని చెయ్యలేదు తెలుసా..అన్నాను...మరి దాక్ష నా మజాకానా అంటుండగా ఇంకో కష్టమర్  టె లిస్మార్ట్ హెచ్ ఇవ్వమ్మా... అన్నాడు ...లేవు అయిపోయాయి అన్నాను సీరియస్ గా... ఆ ఎదురుగా కనబడుతుంటే అయిపోయాయి అంటావేంటి అంతకన్నా సీరియస్ గా అన్నాడు అతను... పక్కకుచూస్తే అవే డబ్బాలు... నేను బేలగా దాక్ష వైపు చూసాను... 


అంటే మేడం ప్రొద్దున్నే వచ్చాయి ఇందాకే సర్దాను కవర్ చేసింది... 

మరొకతను నన్ను చూడగానే క్రొత్తగా జాయిన్ అయ్యావమ్మా..అన్నాడు ....,,,,,"అవును సార్.".అన్నాను ...నాకు కావలసిన మందులు ఆ చివరన పింకు పెట్టె ఉందే అందులో ఉంటాయి ఇవ్వమ్మా..అన్నాడు.. థాంక్స్ అండి అన్న....  

ఇలా ఆ రోజు నేను పడ్డ కష్టాలు పగోడికి కూడా రాకూడదు బాబు...

కొంత మంది కష్టమర్లు తిట్టిన తిట్లు రాస్తే పరువు పోతుందని రాయట్లేదుగాని భగవంతుడా.. ఉఫ్ఫ్ఫ్... దాక్షా నా వల్ల కాదే మా ఆయన నన్ను వదిలేసినా సరే రేపటి నుండి నీకు అయిదురోజులు శెలవులు.. ఆ తర్వాత నువ్వు ఆయన చూసుకోండి అనేసా...   అయితే రాత్రి డబ్బులు వసూలుకు డీలర్స్ వస్తారు.. అలాంటి డీలర్స్ లో ప్రవీణ్ అని ఒక అబ్బాయి వచ్చాడు... మీకు ఒకవిషయం చెప్పడం మర్చిపోయా కదా.. నేను కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు ఎవరో రూపంలో వచ్చి కాపాడేస్తూ ఉంటాడు..ఈ సారి ప్రవీణ్ రూపం లో వచ్చాడన్నమాట.అదేంటి మేడం ఈ రోజు కలెక్షన్ ఇంత పూర్ గా ఉంది..అన్నాడు... నా మొహం నాకసలు ఏం తెలియదు ప్రవీణు.. నన్ను బలవంతంగా ఇక్కడ కూర్చో పెట్టేసారు.. అన్నా...:(

తను కొంచెం జాలిగా చూసాడు.. మీది జెనరిక్ మేడం ....కనీసం కంపెనీ పేరుతో కూడా మందులు ఇవ్వలేరు.. ఒక పని చెయ్యండి ముందు మీరు ప్రిస్క్రిప్షన్ జోలికి వెళ్ళ కండి... అందులో అర్దం చేసుకోవడం కష్టం... ఎవరయితే మెడికల్ షీట్ తెస్తారో వాళ్ళ మందులో కాంపోజిషన్ జాగ్రత్తగా చూసి ఇవ్వండి.. ఒకటికి పది సార్లు చూసుకోండి..

1mg.com... ఈ సైట్ లో ప్రతి మందు వివరం ఉంటుంది.. మీరు ఏం డవుటొచ్చినా ఇందులోగాని ,గూగుల్ లో గాని చెక్ చేసి అప్పుడు అమ్మాలి..అని ఎంతో ఇదిగా బోలెడు జాగ్రత్తలు  చెప్పి వెళ్ళాడు..


నాలో ఒక ప్రత్యేకత ఉంది.. నాకు ఇంట్రెస్ట్ లేని విషయం తలక్రిందులుగా తపస్సు చేసినా నేర్చుకోలేను... ఒక్కసారి అది నచ్చిందా..ఒక పిచ్చి పట్టినట్లు పడుతుంది అంతే.. రాత్రి పగలు ఇదే పిచ్చి.. షుగర్కి ఎన్ని రకాలు, బి. పి కి ఎన్ని రకాలు ,థైరాయిడ్ కి ఎన్ని ...ఇలా వారం రోజుల్లో మా షాపులో ఉన్న మందులన్ని అవపోసన పట్టేసాను.. ఇంకోవారం రోజులు గట్టిగా చదివి ఉంటే మన చందు శైలజగారితో కలిసి ఆపరేషన్లు కూడా చేసిపడెసేదాన్ని... ప్లిచ్ ఈ లోపల మా ఆయన వచ్చేసారు.. 

అయితే ఎక్కడ పడితే అలా ,ఎలా పడితే అలా ఉన్న మందులను ఒక పద్దతి ప్రకారం ..ఎలా సర్దితే ఈజిగా తీసుకోవచ్చో మొత్తం మార్చిపడేసా... మా  ఆయన వచ్చాక జనాలు ..మీరు వచ్చారా ..అక్కరలేదులేండి మీ ఆవిడ వచ్చాకా వస్తాం.. ఆవిడయితే బాగా చెప్తారు అని వెళ్ళిపోయేవారట... ఈయన కుళ్ళు మామూలు రేంజ్లో ఉండేది కాదు... 


జనాలు అలా అనడానికి ఓ కారణం ఉండేది... నేను చక్కగా ఫెద్దోళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళకు మందులు ఇస్తూ.. ఇవిగో ఇవ్వి నెప్పుల టెబ్లెట్స్ ఎక్కువ వాడకూడదు.. కిడ్నీలకు దెబ్బ... ఇదిగో ఇది అయిరన్ టానిక్కు పెరుగన్నం తినేసివెంటనే అయిరన్ వేసుకోవద్దేం.. ఇలాంటి నా గూగుల్ నాలెడ్జి ఉపయోగించడం తో పాటు వాళ్ళ బాధలు కష్టాలు అన్ని వినేదాన్ని... 

కొందరు కొడలిని తిడితే... కొందరు అత్తల్ని దులిపేసే వారు...మరికొందరు కొడుకుల గురించి చెపితే ఇంకొందరు తండ్రుల చాదస్తం గురించి చెప్పేవారు.. అసలు భార్యభర్తల తగువులయితేనా అబ్బ్బో అబ్బో అబ్బో.. నా గొప్పలు నే చెప్పుకోకూడదబ్బా... 


ఓ రోజు నేను సీరియస్సుగా మందుల మీద రీసెర్చ్ చేస్తుంటే ,మా దాక్ష మందులన్న్ని తుడిచి సర్దుతుంటే సడన్ గా మహత్తరమైన అవిడియా ఒకటి వచ్చింది... అరే దాక్షమ్మా ఎన్నాళ్ళిలా ఇద్దరం మందులు తుడుచుకుంటు బ్రతుకుతాం.  శుబ్బరంగా ఓ కౌన్సిలింగ్ సెంటర్ పెట్టేసి ఇక్కడ భార్య భర్తల గొడవలు తీర్చబడును అని బోర్డెట్టేద్దాం.. ఈ రోజుల్లో కొట్టుకు చావని మొగుడుపెళ్ళాలు ఎక్కడున్నారు చెప్పు... ఒక్కసారి  గాని క్లిక్ అయితే నా సామిరంగా ఎలా ఉంటాది అన్నాను ఉత్సాహంగా చూస్తూ... అది కళ్ళు కూడా పైకెత్తకుండా ....మా అమ్మ ఓ సామెత చెప్తాది లెండి గురువింద గింజ గురించి..  మీకు అంకుల్ గారి మధ్య పచ్చ గడ్డి కాదు.. పారే జలపాతం ఉరికినా బగ్గున మండి ఆవిరై పోతుంది... ఈవిడ కౌన్సిలింగు సెంటరెడతాదట.. ముందు మీ ఇద్దరు ఒకరుకొకరు ఇచ్చుకోండి అని తీసి పడేసింది..

 నీ మొహం పెరటి చెట్టు వైధ్యానికి పనికి రాదని మాకు మేము ఇచ్చుకోలేము అంటూన్నాను.. బయట ఒకటే హడావుడి, గోల.. 


ఆంటీగారు వీధి చివర పేద్ద కోతి మీ అంత ఉంది అంది.. భయంగా.. చితక్కొట్టేస్తానేవ్ నాతో పోల్చావంటేఅన్నాను.. అబ్బా.. అంటే అది కాదు ఆంటీ ..మనిషంత కోతి జనాలు వెనుక పరిగెడుతున్నారు ...అది అటు అటు, ఇటు చూస్తుంది అంది వణికిపోతూ... 


నువ్వు అక్కడే కూర్చుని డాన్స్ కడితే నిన్ను చూసి మనలాగే ఉందే అనుకుని మన షాప్ కే వస్తుంది.. లోపలికి రా కసిరాను.. అయబాబోయ్ నిజంగా వచ్చేస్తాదంటారా అంది నా వైపు చూసి.. నిజ్జంగా నిజం అన్నాను.. అయితే నేను లంచ్ కి అరగంట ముందే  వెళ్ళిపోతున్నా.. టా..టా బాయ్ బాయ్ అని ఒక్క అంగలో వీధిలో ఉరికేసింది.. పిరికి మాలోకం అని నేను సీరియస్సుగా నాపని చేసుకుంటుంటే  జనాల గోల ,గొడవ మా షాప్ కి దగ్గరగా వినబటం మొదలయ్యాయి... ఏంటబ్బా ఈ కోతి గోల ఓ పాలి చూద్దాం అని తల తిప్పానో లేదో కరెంట్ షాక్ కొట్టిన కోతిలా బిగుసుకుపోయా... మామూలు కోతా అది.. మనిషంత కోతి.. జెనరల్ గా దీన్ని జూలో పెట్టాలే..అలా ఎలా రోడ్ మీద వదిలేసారబ్బా... నేను ఆశ్చర్యపోతుండగా... అది నా వైపు చూసింది.. చూసి ఊరుకుందా మా షాప్ మెట్లెక్కి చిన్న  తలుపు ఉంటుంది  దానిని  తీసుకుని నా ఎదురుగా కష్టమర్ కూర్చునే కూర్చీలోకూర్చుని "దా ఏం కొన్సిలింగ్ ఇస్తావో ఇవ్వి అన్నట్లు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటం మొదలెట్టీంది... ఆ టైం లో నా పరిస్థితి ఒక్క మాటలో చెప్పాలంటే అదేం సినిమా ?ఆ... రేసు గుర్రంలో ....లిఫ్ట్లో శృతిహాసన్ లా ఒక రేంజ్ లో ఇన్సైడ్ డేన్స్ కట్టేస్తున్నా...కాని పైకి మాత్రం చాలా హుందాగా మరియు డీసెంట్గా పెళ్ళి చూపుళ్ళో పెళ్ళి కొడుకు ఎదురుగా కూర్చున్న పెళ్ళి కూతురు మాదిరి తల ఎత్తకుండా చేతిలో పోన్ ని అన్ని రకాల కోణాల్లో తీపేస్తూ దేవుడా దేవుడా కాపాడు అని ఒకటే భగవన్నామ స్మరణలో బిజిగా ఉన్నా.... 

అంత భయం లోనూ నాకో విషయం గుర్తొచ్చింది.. జంతువుల కళ్ళల్లో చూస్తే వాటికి కోపం వచ్చి మన మీద తిరగ బడతాయట.. అందుకనే నేను ఆ పెళ్ళికూతురి అవతారంలో సెటిల్ అయ్యా... విచిత్రంగా బయట జనాలు కూడా అరుపులు మానేసి మా ఇద్దరి వైపు మార్చి మార్చి చూస్తున్నారు... చాలా మంది సెల్ ఫోన్స్ తీసి ఈ తతంగం అంతా వీడియోతీయడంలో బిజీగా ఉన్నారు... 


ఓరి దొంగ సచ్చినోళ్ళారా అని తిట్టుకుంటుంటే సడంగా మా ఆయన గుర్తొచ్చారు.. ఆయనకు చేస్తే ....గజేంద్ర మోక్షం లో ఏనుగు కాపాడినట్లు కాపాడేస్తే నన్ను....  .ఏమో ఎవరికి తెలుసు అనుకుని మెల్లిగా ఆయన నెంబర్ ప్రెస్ చేసా...

హలో

హలో ఏవండీ (లో గొంతుకతో.. )

ఏంటి చెప్పు.. (విసుగ్గా)

పెద్ద కోతి నా ఎదురుగా కూర్చుంది... 

దానికి కాల్ చెయ్యాలా.. మన దేవుడి గూట్లో అరటి పండు ఉంది అది ఇచ్చి ఉస్ ఉస్ అను వెళ్ళిపోద్ది... 

మీరు చెప్పండి నా సిట్యుఎషన్లో మీరుంటే ఏం చేసేవారు.. అహా మాట వరసకు చెప్పండి అసలు.. అప్పటికి అది నా ముందు కూర్చుని పది నిమిషాల పైన అయ్యింది... 

ఒక్కసారి మీరు షాప్ దగ్గరకు వస్తే బాగుంటుంది... ఇక్కడ పరిస్థితి ఘోరం గాఉంది అని కాల్ కట్ చేసేసి ఫోన్ కుర్చి క్రింద పెట్టేసా.. 

నాకెందుకో భయం ఈ కోతికి మన భాష వచ్చేమో అని. గబుక్కున దానికి అర్ధం అయిపోతే... నా సెల్ ఫోన్ లాగేసుకొని ఢాం అని నేల కేసి కొట్టేస్తే? అదన్నమాట భయం... 

కాని అది మాత్రం నా వైపే చూస్తూ టేబుల్ మీద ఉన్న పెన్ తీసి ఆడుకోవడం మొదలెట్టింది... చుట్టూరా ఉన్న జనాలు ఆ వీధి నుండి ,ఈ వీధి నుండి పోలోమని పోగయి వీడియోలు తీసుకుంటున్నారు... 

అంత భయం లోనూ నాకో డవుటేమిటంటే  నా ఎదురుగా ఉన్న కొట్టు అరటిపళ్ళ కొట్టు... నా పక్కనే బేకరీ.. నేను సగం లావు అవ్వడానికి కారణం అదే.. ఈ పక్కన చెరుకు రసం కొట్టు.. ఇవన్ని వదిలేసి మందుల షాపులో నీకేం పనే తల్లి అని తల పట్టుకు కూర్చున్నా.. ఈ లోపల ఎవరో కోతిని కొట్టాబోయి గురి తప్పి మందుల రేక్ని కొబ్బరి చిప్పతో కొట్టాడు..అంతే సగానికి పైగా మందుల పెట్టెలు క్రింద పడి పోయాయి.. ఎవడ్రా అది నేను, కోతి ఒకేసారి అటు చూసాం... ఇంకెవరు.. మా ఆయన... జనంలో కలిసిపోయి రెండు కొబ్బరి చిప్పలు, నాలుగు అరటిపళ్ళు పట్టుకుని కోతి పై నెట్ ప్రాక్టీస్ చేస్తున్నారు... సరిపోయింది.... దేవుడా ఇప్పుడెలా అని తల పట్టుకు కూర్చుంటె ఒక అయిడియా వచ్చింది..

చాలా సినిమాల్లో జంతువులను భయపెట్టడానికి ఢంకు డమా అని డప్పుల శబ్ధం వాయిస్తూ ఉంటారుగా కోయోళ్ళు... మనం కూడా అదే పని చేస్తే..నాకు తెలిసిన ఒక గేం సైట్లో సరిగ్గా అట్టాంటి మ్యూజిక్కే వస్తుంది.. మెల్లిగా ఆ సైట్ ఓపెన్  చేసి  ఆ మ్యూసిక్ పెట్టా... అప్పటి వరకు పెన్ను పుచ్చుకుని ఆడుకుంటున్నదల్లా నా వైపు చూసింది... దేవుడా కొంపదీసి పెనం మీదనుండి పొయ్యిలో జంపుచేసానా అని భయంగా చూసా.. టేబుల్ మీద మందులు తుడవడానికి ఉపయోగించే పాత గుడ్డ తీసి ఒకసారి మొహం తుడిచి ఆ తరువాతా చెయ్యెత్తి అక్కడకూడా తుడిచి ఆ తర్వాతా ఎక్కడెక్కడొ తుడిచి దాన్ని  నా కంప్యూటర్ మీద వేసి ఒక్కసారి పళ్ళన్ని ఇకిలించి  తలుపు పై నుండి ఒక్క గెంతు గెంతి బయటకు పోయింది... జనాలందరూ మళ్ళీదాని వెనుక పరుగు... 


మీరెవరూ నాకు వంకలు పెట్టక్కరలేదు.. అంతకు వందరెట్లు మా దాక్ష రెండు నెలలు ఆడేసుకుంది..

అది కాదు ఆంటీ గారు ...కోతన్నాకా నాలుగు డబ్బాలు క్రింద పడేయాలి..లేకపోతే నాలుగు వస్తువులు చింపేయాలి... ఇంకా తిక్కరేగితే మీ కాలో ,చెయ్యో కొరికేయడమో, జుట్టు పీకేయడమో చెయ్యాలి గాని... పెళ్ళి కొడుకులా మీ ఎదురుగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడం ఏంటండి...అదీ 20నిమిషాలు పైగా.... అహా.. ఇదే కధ ఇంకెవరన్నా మీకు చెప్తే మీరునమ్ముతారా...  మీ గుండెల మీద చెయ్యేసి చెపోండి... అసలు బయట ఉన్న ఎదవలకి సెల్ఫీల మీద ఉన్న మోజు ఓ TV9 మీదో ఓ TV 5 మీదో ఏడ్చిందా... వాళ్ళయితే ఆ కోతినే ఇంటెర్వ్యూ చేసి విషయం రా బట్టేసే వారు... 


అసలు మీకు బుర్ర లేదండి ...పాపం monkey  సార్ గారు పెన్ను పట్టుకుని గంట సేపు హింటిచ్చిన్నా మీకు పేపర్ ఇద్దామన్న అయిడియా ఎక్కడ ఏడ్చింది... నన్ను అడిగితే ఈగ సినిమాలో లాగా ఈ కోతి ఒకప్పుడు మీ లవ్వర్ అయి ఉంటాడు... ఏమాత్రం కాలం చెల్లి ఇలా కోతి రూపం లో పుట్టేసి మీ కోసం వచ్చి ఉంటాడు... ఓ సారి ఒకప్పుడు మీరు ప్రేమించిన అబ్బాయిల లిస్ట్ గుర్తు తెచ్చుకోండి... అంది.. 

దాక్ష నేను ఇప్పటి కొచ్చి నరమాంసం తినలేదే.. నువ్వు ఇలాగే వాగేవనుకో సాయంత్రం లోగా ఖైమా కొట్టి కూరొండుకుని తినేస్తాను అని బెదిరించినా ఆగదే... 

పోని మీకు ఆ స్టోరి నచ్చి ఉండదు.. ఇంకొకటి చెప్తా... మే బీ ....ఒక వేళ ఆ కోతి గర్ల్ ఫ్రెండ్ పోలికలు మీలో బాగా కనిపించి ఉండి ఉంటాయండి.... 


నేను కొట్టడానికొచ్చేసరికి ఇది కూడా నచలేదా రేపు తప్ప కుండా మంచిగా గెస్ చేసి చెప్తా అని నెల రోజులు చావ గొట్టింది మహా తల్లి





   

15 కామెంట్‌లు:

PBVSN Raju చెప్పారు...

Welcome back. Thank you very much for your presence and new post.చాలా మంది అభిమానులకు మల్లె నాకు కూడా కోపం అంత కంటే ఎక్కువ బాధ కలిగింది.మనం ఇష్టపడేవాళ్ళు బాగుండాలనే అందరు కోరుకుంటారు కదా..క్షేమ సమాచారాన్ని అయినా తెలియ చేస్తా అని ఆశించే.

నేస్తం చెప్పారు...

ఇది ఎప్పుడో రాసిన post..అనుకోకుండా నిన్న draft లో చూసి ప్రచురించా.. ఇంతకు ముందులా పోస్ట్ రాసే శక్తి లేదండి.. ఇదిగాని ఇప్పుడు రాసానని తెలిస్తే మా అబ్బాయి తో నాకు మామూలుగా ఉండదు..thank you :)

PBVSN Raju చెప్పారు...

మీ క్షేమ సమాచారాన్ని అయిన తెలియ చేస్తాrani ఆశించే..ఎప్పటిలాగే మీ రచనలో సున్నితమైన హాస్యం తొణికిసలాడింది మనలో మన మాట ఆ వానరం మిమ్మల్ని చూడటానికి మరల వచ్చిందా..

రాజ్ కుమార్ చెప్పారు...

వెల్కమ్‌ బ్యాక్ అక్క.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

మరేం ఫరవాలేదు. పాతవన్ని మళ్ళీ వెయ్యండి. చదవటానికి మేమున్నాం. ................. మహా

నేస్తం చెప్పారు...

ఏం ఈ కరోనా టైం లో పరలోకప్రభువును పలకరించడానికి వెళ్ళాననుకున్నారా:)..కాని. హెల్త్ పరం గా చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చింది... సో అందుకే కామెంట్స్కి రిప్లయ్ ఇవ్వలేకపోయా... ఇప్పుడు కూడా పావుగంట మొబైల్ చూస్తేవొక రోజంతా కళ్ళు మండుతాయి... అదన్నమాట... :)

రాజు థంక్యూ రాజు...
బులుసు గారు నిజంగా ఒక మాట చెప్పనా.. మొన్న ఏదో హాస్పిటల్కి వెళూతూ దారిలో అక్కినేని టవర్స్ చూసి.. మా బులుసుగారు ఇందులోనే కదా ఉండేవారు అని అక్కడే అయిదు నిమిషాలు నించుండి పోయా.. వాచ్ మేన్ ఎవరు కావాలమ్మా అని అడిగేసరికి ఇంటికొచ్చేసా.. మీకు తప్పకుండా పొలమారి ఉండాలండి..:)

Vasu చెప్పారు...

Welcome back Neshta
m gaaru

నీహారిక చెప్పారు...

మా ఇంట్లో కూడా కోతుల బెడద ఎక్కువగా ఉంది. ఆ మ్యూజిక్ లింక్ ఇవ్వండి.ఎప్పటిలాగానే మీ కలం పదును తగ్గలేదు. Keep writing !
మిమ్మల్ని బెదిరించే అంత పెద్దవాడయ్యాడా మీ అబ్బాయి 🤔

నేస్తం చెప్పారు...

Vasu గారు ధాంక్యు
నీహారికా...నా మొహం ..ఆ కోతి ఆ మ్యూజిక్కి ఏం భయపడి పారిపోలేదు... సర్లే ఏదొ భయపడుతుంది ఇంకా ఏం ఏడిపిస్తాంలే అని జాలిపడి వెళ్ళిపోయింది...అదేదో చైనా గేం అండి గుర్తు కూడా లేదు..
ఇంక మా అబ్బాయి అంటారా.. నేను ఇండియా వచ్చి పదకొండేళ్ళు దాటిందండి.. ఇప్పుడు... బి టెక్..ఆరడుగులు అది చాలదండి అమ్మని నీకేం తెలియదు అని ఒక ఆట ఆడించడానికి..

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

నేస్తం గారూ .............. ధన్యవాదాలు.

బులుసుని మరిచిపోయినా అక్కినేని టవర్స్ గుర్తుంచుకున్నారన్నమాట. ............ మహా

sphurita mylavarapu చెప్పారు...

నేస్తం గుర్తున్నానా? స్ఫురిత...

చాలా రోజులకి ఏదో గుర్తొచ్చి బ్లాగు తెరిస్తే మీ పోస్టు కనపడింది. చదువుతున్నంత సేపూ నేస్తం ఈజ్ బాక్ అని తెగ సంబరపడిపోయా... కామెంట్స్ లో మీ రిప్లయ్ లు చూసి తుస్సు మంది. ఇప్పటికీ మీ చాలా పోస్టులు గుర్తొస్తూనే వుంటాయి. పిల్లలు అలాగే అంటారు...ఇంకొన్నాళ్ళల్లో రెక్కలొచ్చి ఎగిరిపోయాక మనం మౡ బిజీ ఐపోదాం సరేనా :)

నేస్తం చెప్పారు...

హహ స్పురిత నిన్ను మర్చిపోవడమా...ఈ ఒమెక్రాన్ వల్లో కరోనాయో గాని హెల్త్ బాగా పాడయ్యింది ఆ మధ్య.. ఎక్కువ మొబైల్ చూస్తే కళ్ళ నరాలు నెప్పులు అన్నమాట.. అందుకే పిల్లలు పావుగంట కంటే ఎక్కువ సేపు చూడ నివ్వరు..కాస్త తగ్గగానే మళ్ళీ మొదలెట్టేద్దాంలే.. మీరెలా ఉన్నారు ఇంతకూ..

నేస్తం చెప్పారు...

Bulusu gaaru :)

అజ్ఞాత చెప్పారు...

chala rojula tharvatha mee post choosi chala haayiga anipinchindi. super ga vundi mee story :)

నేస్తం చెప్పారు...

Thanks andi