3, డిసెంబర్ 2009, గురువారం

నా బ్లాగ్ పుట్టినరోజు





నా బ్లాగ్ మొదలెట్టీ అప్పుడే సంవత్సరం అయిపోయింది,అబ్బా రోజులు గిర్రున ఎలా తిరుగుతున్నాయో...సరే ఈ సందర్భం గా నా బ్లాగ్ ఎలా మొదలు పెట్టానో, ఎన్ని పాట్లు పడ్డానో ఆ కధా, కమానిషు నేను రాయాల్సిందే ..మీరు చదవాల్సిందే:)

సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే నెలలో ...ఉహుహు ..ఇంతకు ఒక నాలుగైదు నెలలక్రితం తెలుగులో బ్లాగులు ఉంటాయన్న విషయం తెలియగానే, నేనూ ఒక బ్లాగ్ ఓపెన్ చేసేద్దామని మాంచి ఉత్సాహంతో blogspot.comకి వెళ్ళి అలా సైన్ ఇన్ అవ్వగానే ఇలా ఛీ,ఛీ పో అని ఏదో ఎర్రర్ వచ్చి తిట్టింది. కారణం నాకూ తెలియదు.ఒక్కసారి తిడితే పట్టించుకోకుండా దులిపేసుకునేదాన్ని కానీ, నాలుగైదు సార్లు అలాగే తిట్టేసరికి చిరాకోచ్చేసి సరేలే అందని ద్రాక్ష పుల్లన టైపు లో నేను కూడా, బ్లాగ్ రాయక పోతే వచ్చే నష్టం ఏముందిలే అని పక్కన పడేసాను.


అయితే ఈ లోపల నాకు తెలుగు బ్లాగ్ లు చదవడం మెల్లిగా అలవాటు అయ్యింది.ఆ తరువాత చక్కని పొస్ట్ లు రాసిన వారిని పొగుడుతూ వచ్చిన వ్యాఖ్య లను చదివి.... ఆహా,ఎక్కడో ఎవరో రాయడం ఏంటో ,ఇంకెక్కడో ఎవరో దాన్ని చదివి పొగడటం ఏంటో భలే ఉంది నేనూ కూడా ఇలాగే రాస్తే, నన్ను కూడా ఇలాగే పొగిడితే ఎంతబాగుంటుందో కదా అని కాసేపు కలలు కనేదాన్ని, కాని మళ్ళీ blogspoT జోలికి మాత్రం వెళ్ళలేదు.


అయితే ఒక రోజు మా ఆయన తన కొత్త లాప్ టాప్ గురించి చెప్తూ ,ఇదిగో దీనిలోంచి ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నా ఇది మాత్రం ముట్టుకోకే అని నాకు లేని పోని అవుడియా ఇచ్చేసారు .సరే ఇందులో కూడా ఒకమారు ట్రై చేద్దాం అనుకున్నా . ఇంకేంటి మా ఆయన బయటకు ,నేను లాప్ టాప్ దగ్గరకు వెళ్లడం ఒకేసారి జరిగిపోయాయి. ఇలా సైన్ ఇన్ అవ్వగానే ,అలా నీకేం బ్లాగ్ కావాలో కోరుకో అంది అది . కొండెక్కినంత సంబర పడిపోయి ఆ బ్లాగుకు 'ప్రియమైన మీకు ' అని అప్పటికి తోచిన పేరుతో నామకరణం చేసేసి, ప్రొఫైల్ లో మనసునమనసై పాటంటే నాకిష్టం అని ఇంకా ఏంటేంటో రాసేసుకుని ,చక్కగా నలుపు టెంప్లెట్ మీద తెలుపు అక్షరాలు సెలెక్ట్ చేసుకుని (అప్పటికి నాకు తెలియదన్నమాట నలుపు మీద తెలుపు అక్షరాలు కళ్ళు లాగుతాయని) మా ఆయన వచ్చేలోపల క్లోజ్ చేసేసి గప్ చిప్ సాంబార్ బుడ్డీ అయిపోయాను.

ఇంక అక్కడి నుండి ఒకటే ఆలోచనలు ఏం రాయాలి అని? అప్పటికి బ్లాగ్స్ లో కవితల బ్లాగ్లు రాజ్యం ఏలుతున్నాయి.చిన్నపుడు నేను కూడా కొన్ని తవికలు తవికాను కాబట్టీ మనం కూడా కవితలు రాసేద్దాం అని నిర్ణయించేసుకుని పేపరు ,పెన్ను పట్టుకుని ప్రొద్దున్న నుండి రాత్రివరకు తెగ ఆలోచించేస్తే గోడ మీద బల్లి,మంచం మీద నల్లి ,వాకిట్లో పిల్లి అని భయంకరమైన కవితలు ( ?) వస్తున్నాయి కాని చక్కటి వాక్యాలు 4కూడా రావే .

అలా ఒకటా రెండా ,మూడు రోజుల నుండి గింజుకున్నా మూడు ముక్కలు రాయలేక పోయా... ఈ లోపల బయటకు వెళ్లడం,పార్టీలు,పండగలని ఆ విషయం మర్చిపోయా...ఒక రోజు వంట చేస్తూ చిన్నపుడు జరిగిన విషయం ఏదో గుర్తు వచ్చి పక్కున నవ్వుకుంటుంటే, టక్కున ఐడియా వెలిగింది.అవునూ...నేను కూడా ఎంచక్కా నా చిన్ననాటి విషయాలు రాసేయచ్చు కదా,పైగా నా శైలి ఎలా ఉందో తెలిసిపోతుంది.ఒకళ్ళో ,ఇద్దరో బాగుంది అంటే చాలు మా ఆయనకు చూపించేసి ఉడికించేయచ్చు అని ఇలా ఇలా ఉత్సాహ పడ్డానో లేదో డింగుమని నా అంతరాత్మ వచ్చి మా మిక్సీ పక్కనే కూర్చుని ,నాకు తెలియక అడుగుతాను ఇప్పుడు నువ్వు బ్లాగులు రాయడం అవసరమా ? అహా అవసరమా అంట ? మూడు ముక్కల కవిత రాయడానికి మూడు రోజుల నుండి గింజుకున్నా రాయలేనిదానివి చిన్ననాటి విషయాలు ఎలా రాస్తావ్ చెప్పు,పైగా ఆల్రెడీ బోలెడు మంది ప్రొద్దున్నలేస్తే ఇవే విషయాలు పోస్ట్ చేస్తున్నారు.అలాంటిది నువ్వు రాస్తే ఎవరు చదువుతారు ?..ఒక్కరు కూడా బాగుంది అనరు .నా మాట విని హాయిగా బ్లాగ్స్ చదువుకుని కాలక్షేపం చేసేయ్ అని ఉపదేశించి నా ఉత్సాహం మీద ఉప్పు జల్లేసింది..నిజమే కదా మనకెందుకులే అనుకుని మళ్ళా వాయిదా వేసేశాను .


కానీ అప్పటి నుండి నాకు చిన్నప్పటి విషయాలు బోలెడు నాన్ స్టాప్ గా గుర్తొచ్చేయడం మొదలయ్యాయి ...అర్రేర్రే ఇంత మంచి ,మంచి ఙ్ఞాపకాలు పెద్దయ్యాకా గుర్తుంటాయో ఉండవో ఇప్పటికే ఉప్పుడబ్బా ఫ్రిజ్ లోనూ ,కొత్తిమీర కట్ట కప్ బోర్డ్ లోనూ పెట్టేసి మర్చిపోతున్నా... వీటినన్నిటిని ఒక చోట రాసుకుని పెద్దయ్యాకా మా పిల్లలకు,మనవలకు చెప్పచ్చు కదా అనిపించేసింది.ఇంకెక్కడో ఎందుకు నా బ్లాగ్లోనే రాసేసుకుందాం .ఎదుటివాళ్ళకు అర్ధం అయినా కాకపోయినా నా శైలి నాకర్ధం అవుతుంది కదా అనేసుకుని లాప్ టాప్ ఓపెన్ చేసాను...ఇక్కడ మీకు పజిల్ ...ఏమి జరిగి ఉంటుందో ఊహించండి..


సరే నేనే చెప్పేస్తా.. మీరు నా గొప్పతనాన్ని అంచనా వేయలేరు ...సాదారణంగా అందరూ passworD మర్చిపోతుంటారు నేను వెరైటీగా user ID ని మర్చిపోయాను. అంటే ఆ రోజు కంగారులో ఏదో విచిత్రంగా పేరు పెట్టి మర్చిపోయా,అది సంగతి .... వారం రోజుల క్రితం క్రియేట్ చేసిన మెయిల్ ఐడీయే గుర్తులేదు నీ మొహానికి ఙ్ఞాపకాలు రాయడమొకటి ఛీ థూ అనేసింది నా మనసు.ఇంకేంటి కధ కంచికి ,కంప్యూటర్ క్లోజ్ కి .ఇలా మొత్తానికి చాలా రోజులు బ్లాగ్ జోలికి వెళ్లలేదు .


ఒకరోజు ఎలాగైతేనేం దేవుడా దేవుడా ఈ సారి ఎలాంటి విఘ్నాలు రాకుండా చూడు స్వామీ అని దణ్ణం పెట్టుకుని, ఈ సారి ఎలా అయినా బ్లాగ్ పేరుతో సహా ముందే చక్కగా ఆలోచించి మొదలుపెట్టాలని నిర్ణయించుకుని ఏం పేరు పెడదామబ్బా ? అనుకోగానే మందారం,నందివర్ధనం,కనకాంబరం ,పారిజాతం అంటూ టకటకా ఒకటే పేర్లు గుర్తొచ్చేయడం మొదలయ్యాయి...చత్ ,నీ ఆడ బుద్ది పోనిచ్చుకోలేదు,ఎప్పుడూ పువ్వులు,చీరలు,నగలు ఇవితప్ప ఇంకేం పేర్లు నీకు తోచవా ,నీలాంటివాళ్ళ వల్లే మన ఆడవాళ్ళ పై జోకులెక్కువైపోతున్నాయి కార్టూన్స్ లో అని నాలో స్త్రీవాది నిద్రలేచి మరీ దులిపేసింది....హూం పోనీ నా ఙ్ఞాపకాలుకు సరిపోయేటట్లు పెడదాం... అంతరంగాలు,గుప్పెడంతమనస్సు,కడలి కెరటాలు...అబ్బేబ్బే మరీ సీరియల్స్ పేరుల్లా ఉన్నాయి పోనీ అన్వేషిత,అనామిక,ఆలోచన,హరి విల్లు... బాబోయ్ ,ఒక్కటీ పొంతన కుదరడంలేదు పేరుకి , రాసేదానికి..


బ్లాగ్ పేరే పెట్టలేనిదాన్ని ఇంక బ్లాగేం రాస్తాను అని దిగాలుగా దిక్కులు చూస్తుంటే అంతకు ముందే మాల కట్టిన సన్నజాజి పూలు కిటికీ ఊచల పై వ్రేళ్ళాడుతూ ఆహ్లాదం గా కనిపించాయి .. అవును ఆ సన్నజాజుల్లాగే నా ఙ్ఞాపకాలు కూడా ఒక్కొక్కటీ కూర్చి నా బ్లాగ్లో పెడతాను కదా అందుకే నా బ్లాగ్ కి సన్నజాజులని పెడదాం అనుకోగానే అదిగో మళ్ళీ పువ్వులూ ,కాయలూ అంటున్నావ్ అని మళ్లీ నిద్రలేస్తున్న స్త్రీవాదిని కాస్తా ..అయితే ఏంటి? నాది ఆడబుద్దే ..ఆడవాళ్ళకు ఆడబుద్ది కాక మగ బుద్ది వస్తుందా ఇంకనోరు మూసుకుని పడుకో అని కసిరి నిద్ర పుచ్చీ మహా ఉత్సాహంగా సన్నజాజులు అని పెట్టాబోయి అనుమానం తో ఎందుకయినా మంచిదని గూగుల్ లో సన్నజాజులు అని కొట్టాను ఆ పేరు మీద బోలెడు బ్లాగ్స్ ఉండేసరికి నీరసం వచ్చేసింది . పోనీ విరజాజులు ??అనుకుని అదీ ట్రై చేసా ఉహూ ఆ పేరుతో కూడా ఉన్నాయి ..మల్లె జాజి??? బాలే ..ఇంకేం పెట్టను నా మొహం అనుకుంటుంటే ఇంక చాల్లే, నువ్వు బ్లాగ్ మొదలుపెట్టినట్లే గాని సింకులో గిన్నెలు తోమేసి ఆ నాలుగు జతలు ఐరన్ చేయి అని కర్తవ్యం బోధించింది నా మనసు.


ఇంక అక్కడనుండి లేవబోతుంటే అప్పుడు గుర్తొచ్చింది అన్ని జాజుల పరిమళాలు కలిపి జాజిపూలని పెడితే ??? (ఏంటలా చూస్తారు 'చప్పట్లూ' ) అంతే ఆ తరువాత చక ,చకా నా బ్లాగ్ తయారయిపోయింది.నేను బ్లాగ్ మొదలు పెట్టేటప్పటికి అప్పట్లో చాలా వరకూ బొమ్మలు పెట్టేవారు కాదు నాకేమో ఎంచక్కా బొమ్మలు పెట్టి రాయాలని కోరిక ,ఎవరన్నా నవ్వుతారేమో అని భయం...చివరకు బొమ్మ పెట్టే రాసి, కూడలికిఎంతో మొహమాట పడుతూ జత చేయమని మెయిల్ పంపి రెండురోజులు ఎదురు చూసా ....అచ్చం చిన్న పిల్లల మాదిరే ....కూడలిలో నా బ్లాగ్ జత చేస్తారా? చేసినా నా పొస్ట్ అందరికీ కనబడుతుందా?ఇంత పెద్ద పెద్ద బ్లాగ్స్ మద్య నా పోస్ట్ అసలెవరన్నా చదువుతారా?ఒక్కరన్నా హాయ్ అని పలకరిస్తారా? ఇప్పటికీ నవ్వొస్తుంది తలుచుకుంటే ...


మొత్తానికి నా పోస్ట్ కూడలి లో కనబడింది ..భలే సరదా అనిపించింది ....కానీ ఆ రోజు పొస్ట్ లు ఎక్కువ రాయడం వల్ల 2 గంటల్లోనే ఆ పోస్ట్ అడుక్కి వెళ్ళిపోయింది ...ప్లిచ్ ...ఒక్కళ్ళు కూడా హాయ్ అనలేదు :)అప్పుడు డవుటొచ్చింది నా వ్యాఖ్యలు బాక్స్ పని చేస్తుందా లేదా అని అప్పుడునాకు నేనే welcome అని అఙ్ఞాత క్రింద స్వాగతం చెప్పేసుకున్నా :)ఆ తరువాత అరుణాంక్ గారు ప్రపుల్లచంద్ర గారు ఇలా అందరూ కామెంటారు భలే ఆనందంవేసింది...

అయితే నేను ఇన్ని రోజులు బ్లాగ్ రాస్తాని అనుకోలేదు ,అందులోనూ కేవలం ఙ్ఞాపకాలు మాత్రమే రాస్తానని అస్సలు అనుకోలేదు .ఏదో ఓ 3 నెలలు రాసేసి వదిలేద్దాం అనుకున్నా.మా ఫ్రెండింటికి వెళ్ళా,ముగ్గులేసా,సినిమాకి వెళ్ళా అని రాస్తే ఎవరు చదువుతారులే అనుకున్నా :)నేనెప్పుడూ ఊహించలేదు నన్ను ఇంత మంది ప్రోత్సహిస్తారని ...నిజంగా నాకు రాజకీయ,సామాజిక,సాహిత్యాల గురించి రాయడం కానీ ,కనీసం వాటి గురించి చర్చించడం కాని చేత కాదు...కాని అలాంటి చక్కని బ్లాగులకు సమానం గా నన్ను ఆదరించారు ...పైగా నన్ను మీ ఇంటి లో అమ్మాయిలా ఎంతో ఆదరణగా చూసారు అది చాలా సంతోషంగా ఉంది ....ఇక మీదట రాయను అని చెప్పను కాని కాస్తా గేప్ తీసుకోవచ్చేమో...ఇంత చక్కని ఆనందాన్ని నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాధాలు...