19, ఫిబ్రవరి 2010, శుక్రవారం

ప్రేమ కధలు పలురకాలు - 5

అలా స్వాతిని తీసుకుని బయటకు వచ్చేసాక ,ఏమైందే అన్నాను ఆత్రుతగా.. ఇందాకేమో నేను వస్తున్నానా!, అప్పుడు గీతాంజలి గాడి ఫ్రెండ్స్ లేరూ,అదేనే ఆ నల్లోడును, పొట్టి గా ఉంటాడు వాడూను వాళ్ళిద్దరూ నా దగ్గరకొచ్చి మీ ఫ్రెండ్ పేరు ఏంటండి? అని అడిగారు అంది.. అవునా చెప్పేసావా అన్నాను కంగారుగా ... నిన్నటివరకు పేరు తెలియకుండా ప్రేమేన్టిరా దొంగ మొహం గాడా అని తిట్టుకున్నా నాకే మళ్లీ భయం ..అదేంటో?? ... ఉహు ,మీకెందుకు అని గభ గభా వచ్చేసా అంది.. ఉఫ్.. హమ్మయ్యా అనిపించింది..

కాసేపాగి నాకో డవుటు వస్తుందే అంది ఏదో ఆలోచిస్తూ ..ఇదేవర్తిరా బాబు నిమిషం ,నిమిషానికి టెన్షన్ పెడుతూ అనుకుని ఏంటి ?అన్నాను నీరసం గా .. ఆ గీతాంజలి గాడి ఫ్రెండ్స్ ఉన్నారు కదా ,వాళ్ళలో ఒకళ్ళు నీకు లైన్ వేస్తున్నారు అంది ఏదో కనుగున్నట్లు పోజు పెడుతూ.. నాకు అంత టెన్షన్ లోనూ నవ్వువచ్చింది..డవుటు కాదు కన్ఫర్మేనే ,మొన్న దీపావళికి మీ ఇంటిదగ్గర పటాసులు కాల్చేరు కదా ,ఆ ముందు రోజు మన వెనుక వాళ్ళే వచ్చారు, నీ మాటలువిని మీ ఇంటి ముందు ఆ హడావుడి చేసారు..ఎంతైనా ఫ్రెండ్ కదా అందుకే గీతాంజలి గాడు వాడికి హెల్ప్ చేసి ఉంటాడు ...మనమేమో మా అమ్మమ్మకు భయపడిపోయారేమో అనేసుకున్నాం ..అది కాకుండా నేను ఎప్పుడు గమనించినా వాడు నీ వైపే చూస్తున్నట్లు అనిపిస్తుంది ..నాకు ఆ నల్లోడి మీదే పెద్ద డవుట్ ..మనం ఎలాగైనా కనిపెట్టాలి అంది సీరియస్ గా ..

ఓరి దేవుడోయ్ దీన్ని ఇలా వదిలేస్తే లేనిపోని సమస్యలు తెచ్చేలా ఉంది అనిపించింది.. మనకేందుకే ఇవన్నీ!! ...మనమేమన్నా వస్తువులమా ! ఈ అమ్మాయిని నువ్వు ఇష్టపడు, ఈ అమ్మాయిని నేను ఇష్టపడతా అని పంచేసుకోడానికి..వాళ్ళ పద్దతి ఏమి నాకు నచ్చ లేదు.. చాలు ఇన్నాళ్ళు వాళ్లకు ఇచ్చిన అలుసు ..ఇంక మన జాగ్రత్తలో మనం ఉందాం అన్నాను.. అంటే ఏం చేద్దాం అయోమయం గా అడిగింది ...

ముందు రోజు నేను వేసుకున్న ప్లాన్ లన్ని వరుసగా చెప్పేసాను ..ముందు మనం రూట్ మార్చేద్దాం ..వాళ్లకు కనబడితేనే కదా సమస్యలన్నీ అన్నాను ..అయ్యబాబోయ్!! ఇప్పటికే చాలా దూరం ..ఇంకా అంత తిప్పి నడుస్తే అయిపోతాం అంది.. ఏం పర్లేదు ఒక అరగంట ముందు రా అన్నాను.. మరి మద్యాహ్నమో ??..తిని వెంటనే బయలుదేరుతేనే టైం సరిపోదు అంది.. అందుకే బాక్స్ తెచ్చేసుకుందాం అన్నాను ..బాక్సా !!నీకేం తల్లి నువ్వు నాన్వెజ్ తింటావ్ ..మీ అమ్మగారు ఆమ్లెట్ అనో కోడి గ్రుడ్డు పులుసనో ఏదో ఒకటి వండుతారు .. నాకు ప్రొద్దున్నే కుదరదని పప్పు ,పచ్చడి-పప్పు పచ్చడి .. అదే వండుతారు ..పోనీ నువ్వన్నా నీబాక్స్ షేర్ చేస్తావా అంటే ససేమిరా అంటావ్ నేను తినలేను బాబు అంది..


స్వాతి వాళ్ళు శాకాహారులు ..వాళ్ళింట్లో ఏం ఫంక్షన్ వచ్చినా నన్ను తప్పక పిలుస్తారు .. ఇంక అక్కడ చూడాలి తతంగం.. అరటి ఆకును భోజనం చేసేటపుడు తాక కూడాదంట.. 'అంటు'.. నేనేమో పదిసార్లు ఆ ఆకును నా ముందుకు లాక్కునేదాన్ని.. అందరూ నా వైపు చూడటమే.. అదేకాదు ముందు పప్పే వేసుకుతినాలి..తరువాత ఫలానా తినాలి .. ఇలా చాలా రూల్స్ ఉండేవి.. పైగా వాళ్ళ అమ్మమ్మగారికి నేను అంటే బోలెడంత అభిమానం.. నన్ను వాళ్ళ ఇంటి అమ్మాయిలా ఫీల్ అయ్యి ఆ పద్దతులు అన్నీ నా చేత కూడా చేయించేవారు .. ఇప్పుడు స్వాతికి నేను ఇలాంటివి అన్నీ అలవాటు చేస్తే ఇంకేమన్నా ఉందా..ముఖ్యం గా నాతో పోలుస్తూ స్వాతిదాన్ని తిట్టరు కదా.. అదీ సంగతి ..

అందుకే నీకు అంతగా తినాలంటే ఇంకేవరినన్నా అడుక్కో..నేను పెట్టను అని ఖరాఖండిగా చెప్పేసేదాన్ని ..అది ఇలా సందర్భం వచ్చినపుడల్లా దెప్పేస్తూ ఉంటుంది ..ఇదిగో నువ్వు నేను చెప్పినట్లు చేస్తే నాతో రా..లేదూ ,నువ్వు వేరుగా వెళ్ళు, నేను వేరుగా వెళ్తా ..అసలే ఎక్జాంస్ వచ్చేస్తున్నాయి ..వాడు నా వెనుకాతల పడుతున్నాడా?..వీడు ఎవరిని చూస్తున్నాడు?? లాంటి వాటి తో టైం వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు ,తర్వాత నీ ఇష్టం అని ఖచ్చితం గా చెప్పేసాను.. దానికి ఎక్జాం పేరు చెప్తే చాలు సెట్ అయిపోతుందని తెలుసు.. ఇంక తప్పక సరే అనేసింది..

అక్కడినుండి మా పని దాగుడు మూతల దండాకోర్ ..పిల్లి వచ్చే ఎలకా బద్రం అన్నట్లు అయిపొయింది.. మేము కనిపించక పోయేసరికి వాళ్ళు ఊరంతా తిరిగి వెతకడం మొదలు పెట్టారు.. మద్య మద్యలో కనిపించినా ఎందుకు వచ్చిన గొడవ అని హడావుడిగా వెళ్ళిపోయేవాళ్ళం ఒక్క ముక్క కూడా మాట్లాడుకోకుండా ..ఆ తరువాత ఎక్జాంస్ గోల లో పడిపోయి,వేసవి సెలవలు వచ్చేసరికి ఆ విషయం దాదాపుగా మర్చిపోయాము..

ఒక రోజు హుషారుగా ఒక పేపర్ మీద కవితలు (??) రాసేసుకుంటుంటే అమ్మ నన్ను పక్క రూం లోకి పిలిచింది .. ఏంటమ్మా అని గదిలోకి వెళ్ళగానే తలుపులు వేసి నీతో మాట్లాడాలి అంది.. ఎప్పుడూ లేంది ఎందుకలా అంటుందో తెలియక ఏమైంది ?? అన్నాను అయోమయం గా.. ఏంటీ , నీ వెనక ఎవరో పడుతున్నారు అంట ??నిజమేనా అంది.. ఉరుములేని పిడుగులా అలా హఠాత్తుగా అనేసరికి నోరు ఎండిపోయింది దెబ్బకు..మా అమ్మ కోపంగా అంటుందో,అనుమానంగా అంటుందో నాకు తెలియడం లేదు .. అమ్మ మొహం లోకి సూటిగా చూడాలంటే భయమేస్తుంది ... మనసులో దేవుడా ..దేవుడా.. దేవుడా అనుకుంటూ ..నా వెనుకనా !! అబ్బే లేదే ..ఎవరు చెప్పారు అన్నాను.. ఎవరు చెప్తే ఏంటి ? అంత కోళ్ల ఫారం పెట్టుకోవాలని ఇష్టమున్నదానికి చదువెందుకే.. నాన్నకు చెప్పక పోయావా అంది.. కోళ్ల ఫారం ???నేను కాలేజ్ కి ఎండలో వెళుతున్నపుడు విసుగొచ్చినపుడు తరచూ స్వాతి తో అనేమాట ... 'కోళ్ల ఫారమా '!!కోళ్ల ఫారం ఏంటి??.. నాకు భయం తో అరిచేతులు నిండా,వళ్ళంతా చెమట పట్టేసి నీళ్ళు కారిపోతున్నాయి..

మరి నువ్వు చెప్పేవని వాడు కోళ్ల ఫారం పెడుతున్నాడంట ..అనేసరికి తల గిర్రున తిరిగింది ..ఓరి వీడి నోరు పడిపోను ..బయట అందరికీ ఇలా చెప్పుతున్నాడు కాబోలు ..అయిపోయింది ...అంతా తెలుసు అమ్మకి ..అయినా ఎలా తెలిసింది ?? ఇంక జరిగింది చెప్పేయడం మంచిది అనుకుని, అమ్మా!! అసలు ఆ అబ్బాయి తో నేనసలు మాట్లాడలేదమ్మా ..వాడెవడో పేరు కూడా తెలియదు నాకు అన్నాను ..మరి ఇందాకా నా వెనుక అసలు ఎవరు పడలేదన్నావ్ అంది ..అమ్మా తల్లీ, లేడి డిటెక్టివ్ .. అసలు వాడెవడో ,ఏమిటో తెలియదు..నా వెనకపడుతున్నాడో ,స్వాతిదాని వెనుక పడుతున్నాడో అస్సలు తెలియదు.. మాతో అస్సలు ఒక్క మాట కూడా అనలేదు ఆ అబ్బాయి .. మేము మాట్లాడే మాటలన్నీ విని అలా లేని ,పోనివి ప్రచారం చేస్తున్నట్లున్నాడు..నమ్ముఅమ్మా అన్నాను దీనంగా..మరి మాకు ముందే ఎందుకు చెప్పలేదు అంది..ఏమని చెప్పమంటావ్ ?? మా వెనుక నడుస్తారు అంతే..ఎందుకని ??అడిగామనుకో ..రోడ్ మీ తాత గారిదా అంటారు అప్పుడేం చేస్తావ్ అన్నాను..

అమ్మ కాస్త మెత్తబడినట్లుగానే అనిపించింది ..హమ్మయ్యా అనుకున్నానో లేదో ..తన కళ్ళ లోనుండి నీళ్ళు జల, జలా వచ్చేస్తున్నాయి..నాకు భయం వేసింది ..అమ్మా నిజమమ్మా ..కావాలంటే స్వాతిదాన్ని అడుగు ..కాలేజ్ కి వెళుతుంటే ఇవన్ని మామూలే ..మరీ పెద్ద గొడవ అయితే చెప్దాంలే అనుకున్నా, అంతే తప్పా దాచేయాలని కాదు అన్నాను బ్రతిమాలుకుంటూ..మీకన్నీ చిన్న విషయాలలాగే ఉంటాయే.. బయటికి వెళ్ళిన పిల్లలు ఇంటికి వచ్చేవరకు మాకు గుండెలు ఎలా ఉంటాయో తెలుసా.. గట్టిగా అంటే మా మీద నమ్మకాలు లేవా అంటారు..బయటేమో రోజులు బాగుండటం లేదు.. మీ అంత చదువుకోకపోయినా మీకంటే జీవితాన్ని ఎక్కువ వడబోసిన వాళ్ళం .. ఇప్పుడుకాదు మీరు పెద్దయ్యాక ఒక ఆడపిల్ల తల్లి అవుతారు చూడు అప్పుడు తెలుస్తుంది ఆ బాధ అంది కళ్ళు తుడుచుకుంటూ..

నాకేం మాట్లాడాలనిపించలేదు..కాసేపు మౌనంగా ఉండిపోయా .. ఇదిగో మనం ఉమ్మడి కుటుంభం లో ఉన్నాం.. చిన్న మాట వచ్చిన ఫలానా వాళ్ళ కుటుంభం లో అమ్మాయి అని ఇంటి పేరు మొత్తం చెప్పి మాటలు అంటారు..మిగిలిన వాళ్ళ పిల్లలు కూడా నీకు చేల్లెళ్ళే కదా ..ఆ మాట వాళ్ళు కూడా పడాలి కదా.. అదెంత తలవంపులు చెప్పు ..తోడికోడళ్ళ దగ్గర నేను తలెత్తుకోగాలనా.. నామాట సరే ,నాన్న సంగతి తెలుసుగా ..ఒక ట్రైన్ ఎక్కినా ముప్పై మూడు భోగీలు మారుస్తారు ..మీకిదంతా చాదస్తం క్రింద అనిపిస్తుంది.. అందమంది ఆడపిల్లల తండ్రి కి ఎంత భయమో ఆలోచించరు.. మేమేం చెప్పినా విసుగ్గా అనిపిస్తుంది అంది ..

కాసేపు అలా క్లాస్ తిసుకున్నాకా సరేలే ..ఇంక వెళ్ళు అంది.. వెళ్ళబోతూ అమ్మా ,ఎలా తెలిసింది నీకు అన్నాను కొంచం భయపడుతూనే ..మళ్లీ ఏం అంటుందో అని భయం.. వాళ్ళ ఫ్రెండ్స్ లో ఒక అబ్బాయి అమ్మ కి మనం తెలుసులే..మొన్న అందరూ వాళ్ళింట్లో నీ గురించి మాట్లాడుకున్టున్నారట..ఈవిడ చాటుగా విని, ఎవరని గట్టిగా అడిగితే నీ గురించి చెప్పారంట..వాళ్ళింటి పిల్లను అల్లరి పెడతారా అని వాళ్ళను తిట్టి నాకొచ్చి చెప్పింది.. ఏమండీ 'ఇదీ సంగతి' ..రోజులు బాగుండటం లేదు ..ఫలానా వాళ్ళబ్బాయి ఇలా వెంటపడుతున్నాడంట ..జాగ్రత్త అని అంది ..ఓ ..అని బయటకు వచ్చేసాను ..

అక్కడి నుండి ఒకటే భయం ..నాన్నకు చెప్తే అందరూ కలసి వాడిని తంతారేమో అని..అసలే బక్క ప్రాణి .. నిజం చెప్పాలంటే పాపం కాస్త మంచివాడే. ఎప్పుడూ వేధించలేదు.. ఆ దిక్కుమాలిన ఫ్రెండ్స్ వెనక నుండి అలా చెయ్యి ,ఇలా చెయ్యి అని ముందుకు తోసారు తప్ప.. తనకంత ధైర్యం కూడా లేదు .. అనవసరం గా చిక్కుకు పోయాడు ..అమ్మకు చెప్పాలనిపించింది ..ఎందుకు లేమ్మా ..మరీ ఎక్కువ చేస్తే అప్పుడు చూద్దాం లే అని ..ఇంకేమన్నా ఉందా అసలు అనుకుని ఊరుకున్నా ..

ఆ తరువాత నేను ఎప్పుడు కనబడినా ఒక సారి చూసి తల వంచుకు వెళ్ళిపోయేవాడు .. ఆ గేంగ్ కుడా లేదు ..పాపం కొట్టారేమో ?? అనిపించేది.. అమ్మని అడగాలంటే భయమేసింది ...అసలు నాన్న ఈ విషయం మీద నాకు ఎక్కడ క్లాస్ తీస్తారో అని సగం భయం వేసేది కాని ,అసలు నన్ను అడగనే లేదు.. అమ్మ ఏం చెప్పిందో?.. ఆ తరువాత ఈ విషయం స్వాతికి తెలిసాక ..ఏమే .పడక పడక ఒక్కడు నా వెనుక పడితే వాడిని కొట్టిన్చేస్తావా? అంత కుళ్ళు ఏంటే బాబు నీకు అంటూ ఏడిపించేది ..

చాలానాళ్ళ తరువాత ఒక సారి అమ్మని అడిగాను ఏమైందమ్మా కొట్టారా?? అని.. లేదమ్మా ,నాన్న వెళ్లి వాళ్ళ పెద్ద వాళ్లకి విషయం చెప్పారంట ..వాళ్ళు ,నాన్న ఎదురుగానే ఆ అబ్బాయిని పిలిచి తిట్టి ,ఇంకెప్పుడు ఇలా జరగదండి అని చెప్పారంట అంది..హమ్మయ్యా అని ఉపిరి పీల్చుకున్నా ..గొడవలేకుండా సమస్య తీరిపోయినందుకు దేవుడా అని దణ్ణం పెట్టేసుకున్నా..

మొన్న ఇండియా వెళితే ఆ అబ్బాయి కనబడ్డాడు..వాళ్ళ ఆవిడతో ..ఒక చిన్న బాబు తో .. చాలా ఆప్యాయంగా వాళ్ళ ఆవిడకు ఏదో చెప్పేస్తూ నన్ను చూసి ..నేనా ,కాదా అన్నట్లు ఒక్క క్షణం చూసి గబుక్కున తల తిప్పేసుకున్నాడు.. చిన్నప్పటి విషయాలు గుర్తు వచ్చి నవ్వు వచ్చింది :)

14, ఫిబ్రవరి 2010, ఆదివారం

ప్రేమ కధలు పలురకాలు - 4ఆ రోజంతా అలా తిరుగుతున్నానే గాని భయం భయం గా అనిపించింది..ఏవో ఆలోచనలు.. ఒక ప్రక్కనుండి దైర్యం ...'నేనేం తప్పు చేయలేదే' ..వాడు నావెనుకపడితే నాదా తప్పు ?నేనెందుకు భయపడాలి అనిపిస్తుంది..మరొక ప్రక్క ఇప్పుడే ఇంత చనువు తీసుకుంటున్నారు ,నాలుగు రోజులు ఆగితే ఇంకేం అంటారో ??ఏదో రోజున ఖచ్చితంగా నువ్వంటే నాకిష్టం అని డైరెక్ట్ గా చెప్పేస్తాడు ఏమో అని భయం..అప్పటి సంగతి కదా ,అంతవరకూ వస్తే నువ్వంటే నాకిష్టం లేదు అని చెప్పేద్దాం అని కాసేపు అనిపిస్తే , ఇన్నాళ్ళూ ఇహి హి.. హ హహ అని నవ్వుతూ వాడెదురుగా తిరిగి ,ఆనక తీరిగ్గా నువ్వంటే నాకిష్టం లేదు అని చెప్పితే, వాడు ఊరుకుంటాడా??వెనుకపడటం మానేస్తాడా ?? అని ఇంకాసేపు అనిపించేది..


చాలా మంది అమ్మాయిలు ఇదే పని చేస్తారు , వాళ్లకు ఇష్టం లేకపోయినా 'ఎవరో ఒక అబ్బాయి తన చుట్టూ తిరుగుతుంటే గర్వంగా ఎంజాయ్ చేసి 'చివరకు అబ్బే ,నాకలాంటి అభిప్రాయం లేదనో, ఇంకొందరు మరి కొంచం ఎక్కువ చేసి నేను నిన్ను అన్నయ్యలా భావిస్తున్నాననో అని చప్పున తీసి పడేసి పాపం వాళ్ళ మనసులు ఎంత గాయం చేస్తారో ఊహించరు.." ముందే నువ్వంటే నాకిష్టం లేదన్న భావన వాళ్ళలో కలిగించరు" అదే పలు సమస్యలకు కారణం అవుతుంది ..(కొంతమంది అబ్బాయిలు ఒక వేళ అలా చేసినా పట్టించుకోరు,అది మరో సమస్య అనుకోండి ) బహుసా ,అలాంటి గిల్టీ ఫీలింగ్ అనుకుంటా స్థిమితంగా ఉండనివ్వడం లేదు నన్ను ..

సరే ,ఎలాగోలా దీనిలో నుండి బయట పడాలి.. ఎవరన్నా హెల్ప్ చేస్తే బాగుండును,ఏదన్నా సలహా ఇస్తే బాగుండును అనిపించింది..ఎవరికి చెప్పాలి ??? స్వాతికి చెప్పితే? అమ్మో !!దానికా ...కొంచెం కూడా ఆలోచించదు.. సలహా కాదు కదా ,ఇన్నాళ్ళు నేను దానికి చేసినదానికి అంతకంతకు బదులు తీర్చుకుంటుంది.. నన్నేదో ఏడిపిస్తున్నాను అనుకుని పూర్తిగా ముంచేస్తుంది.. ఇప్పటి వరకు వాడికి కనీసం డవుటుండి ఉంటుంది నా కిష్టమా ?లేదా? అని ,ఇది కన్ఫర్మ్ చేసేస్తుంది ఇష్టం అని .. ఇంకేమన్నా ఉందా ...వద్దు,వద్దు ... ఇంకెవరున్నారు?? పోనీ అక్కకు చెప్తే ?? ...

అవును ,అక్క అయితే చిటికలో సమస్య తీర్చేస్తుంది అనిపించింది కాని ,అది నాన్నపార్టి..నాన్నకు చెప్పేస్తుంది ఏమో ??.. చిన్నపుడు ఎవరో దానికి లెటర్ ఇస్తే చదవడానికి అర్ధం కాక ,నాన్నకు ఇచ్చి చదవమని చెప్పిన ఘనురాలది ..దానికి బోలెడు ధైర్యం ..నాన్న అంటే అస్సలు భయం లేదు ..నాన్నా అంతే, అది ఏమన్నా ఏమనరు.. అది చేసినతప్పు మేము చేస్తే మాత్రం అక్షింతలే మాకు..ఒక సారి ఎక్కడికో వెళుతుంటే ఎవరో అబ్బాయి దాన్ని చూసి ఏదో అన్నాడట ...ఇదేమో నాన్నా వాడు చూసారా ఇలా అన్నాడు అని టక్కున పిలిచి చెప్పింది..అసలే నాన్నకు హిట్లర్ అని పేరు చిరంజీవిలా .. సైకిల్ మీద పారిపోబోతున్న వాడి చొక్కా పట్టుకుని కిందకు లాగి గూబ గుయ్యిమనిపించారు ...

సరే ఇదేదో బాగుంది కదా అని ,నేనూ ఒక మారు నాన్నతో వస్తూ ఎవరో ఏదో అంటే ( అలాంటి సందర్భం గురించి చాలానాళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చిందిలెండి..పక్కన పెద్ద వాళ్ళు ఉండగా ఎవరు ఏమనరు కదా ) నాన్నా !చూడండి వాడేదో అంటున్నాడు అనగానే ,నిన్నెవరే దిక్కులు చూడమన్నాడు ,కాళ్ళు విరక్కోడతా .. సరిగ్గా కూర్చో ..అని ఒక్క కసురు కసిరారు ..అంతే, పొరపాటున కూడా మళ్లీ అక్కను అనుకరించే సాహసం చేయలేదు.:(

'చక్కగా ఉన్న మొహానికి ఎందుకే అడ్డమైన చెత్తా రాస్తావు 'అమ్మ తిడుతూనే ఉంది అక్క పట్టించుకోకుండా ఒక గిన్నెలో పసుపు,శనగ పిండి ,రోజ్ వాటర్ ,తేనే ఏంటో ఏంటో మిక్స్ చేస్తూ గదిలోకి వచ్చింది ..ఇది ఒకర్తి ,మా అందరికన్నా తెల్లగా ఉన్నా ఇంకేంటో చేసేస్తూ ఉంటుంది ఆ మొహానికి తిట్టుకుంటుంటే సడెన్ గా లైట్ వెలిగింది.. ఇది బాగుంటుంది,తెల్లగా ఉంటుంది,బాగా చదువుతుంది ,అన్నిటికంటే ముఖ్యం గా కో ఎడ్యుకేషన్ లో చదివింది ..ఖచ్చితంగా దీనికి ఇలాంటి సమస్యలు ఎదురయ్యే ఉంటాయి ..అలా అనుకోగానే మెల్లగా దాని దగ్గరకొచ్చి అక్కా! మరి మీ కాలేజ్ లో ఎవరూ నిన్నేమనేవారు కాదా అన్నాను.. ఎందుకనే వారు కాదు ,మా సార్లకి ,మేడంస్ కి నేనంటే ఎంత ఇష్టమో తెలుసా, నా రికార్డ్స్ అందరికంటే నీట్ గా ఉండేవి ,మేత్స్ సార్ అయితే మరీ అభిమానించేవారు ..ఇది డబ్బా మొదలుపెట్టేసింది..

ఎహే!! ..అది కాదు 'అబ్బాయిలు ఎవరూ నీ వెనుక పడేవారు కాదా' అన్నాను.. అది మొహానికి ఆ పేస్ట్ పూసుకుంటూ ..అదా ,మా క్లాస్ లో వాళ్లకి అంత ధైర్యం లేదులే, మాది డిగ్రి కాలేజ్ కాదు కదా ,ఇంటర్ అబ్బాయిలకు మా సార్లంటే మహా భయం ..ప్రాక్టికల్స్ లో మార్కులు కత్తిరించేస్తారని ..పైగా సైన్స్ అబ్బాయిలు చాలా మంచోళ్ళే.. అలాంటి వెధవ వేషాలు వెయ్యరు ...ఆ ఆర్ట్స్అబ్బాయిలు ఉంటారు కదా ,వెధవలకి పని పాటా ఉండదు ,వచ్చే పోయే అమ్మాయిలని కామెంట్ చెయ్యడం తప్పా విసుక్కుంటూ అంది..

ఇది ఒకర్తి ..ఆర్ట్స్ అంటేనే పడదు..ఆ స్వాతిది కూడా అంతే ..వీళ్ళ దృష్టిలో ఆర్ట్స్ తీసుకున్న వాళ్ళంతా చదువు ,సంధ్య లేని వాళ్ళు..ఒత్తి పోకిరి వాళ్ళు ..ఇద్దరినీ ఒక చోట కూర్చో పెడితే చాలు సైన్స్ గ్రూప్ ని పొగిడేసుకుంటూ ,ఆర్ట్స్ గ్రూప్ ని తిట్టుకుంటూ గంటలు గంటలు గడిపేస్తారు .. అందుకేనేమో ఇద్దరికీ ఇంటర్ అయిపోగానే పెళ్ళిళ్ళు అయిపోయి ,చివరకు ఆ ఆర్ట్స్ నే గతి అయ్యి డిగ్రీలు గట్టెక్కించారు.. అందుకే ఊరికే ఎవరినీ అనకూడదన్నమాట . .

సరే మామూలు రోజుల్లో ఈ విషయం మీద గొడవేసుకునేదాన్ని కాని ,ప్రస్తుతానికి అవసరం నాది కదా .. అందుకే ,అదేలేక్కా ..ఆ ఆర్ట్స్ వాళ్ళే నీ వెనుకాలా పడలేదా ??ఆరాగా అడిగాను..ఏంటీ !!! ,ఆ పోకిరిగాళ్ళు ,ఆ చదువు సంధ్య లేనోళ్ళు నా వెనుక పడటమా!!! ఎంత ధైర్యం ?? .. మా సైన్స్ అమ్మాయిలను చూడటానికే భయపడేవారు తెలుసా అంది .. ఒసినీ సైన్స్ తగలబడ అని మనసులో అనుకుని .. "ఒకవేళ పడితే ??" ..మళ్లీ,మళ్లీ అదే ప్రశ్న ఓపిగ్గా అడిగాను .. " నాన్నకు చెప్పి చితక్కోట్టిన్చేసేదాన్ని "ఇంక మాట్లాడించకు..అని కళ్ళ మీద రెండు దోసకాయ ముక్కలు గుండ్రం గా కట్ చేసినవి పెట్టేసుకుని పడుకుంది ..ఇంకేం మాట్లాడిస్తాను నా మొహం అనుకుని బయటకు వచ్చేసా...

మెట్ల మీద కూర్చున్నా గాని ఏం చెయ్యాలో అర్ధం కాలేదు.. అసలే గీతాంజలి గాడు చదవడం లేదు..దీనికి చదువు ,సంధ్య లేని వాడు అని తెలిస్తే బిపి పెరిగిపోతుంది.. నాన్నకు చెప్పేస్తుంది ..వెంటనే నాకు గీతాంజలి గాడు కళ్ళ ముందు కనబడ్డాడు దీనంగా ..'గట్టిగా తూస్తే పాపం కిలో మాంసం కూడా రాదు వాడికి '.. వాడి సంగతి సరే ,నా విషయం ఏంటి?? .. పోనీ ఇంట్లో చెప్పకుండా వదిలేస్తే ,ఖచ్చితంగా ఏదో రోజున తెలుస్తుంది..అప్పుడన్నా వాడిని తంతారు ..ముందే ఎందుకు చెప్పలేదు? అంటారు ,చదువు లేదు ఏమి లేదు నోరు మూసుకుని ఇంట్లో కూర్చో అని అన్నా అంటారు ..అది కూడా ఒక తంటా ..ఇదంతా ఎందుకు నాన్నకు నేనే మెల్లిగా చెప్పేదాం అనుకున్నా..


నాన్న సంగతి నాకు బాగా తెలుసు ..లాయర్ లా సవాలక్ష ప్రశ్నలు వేస్తారు .. కనీసం వాడు నాతో ఒక్క మాట అన్నాఅనలేదు.. వాడు నన్ను ఏడిపిస్తున్నాడని ఎలా చెప్పేది???..అసలే అందరం అమ్మాయిలం అవ్వడం వల్లో,లేదా తల్లిదండ్రులకు పిల్లల మీద ఉన్న సహజ భయం వల్లో పది సార్లు చెప్తారు జాగ్రత్తలు మాకు .. అలా ఆలోచిస్తుంటే టక్కున దీపావళి రోజున అందరు పడుకుంటే ,నేనే పెద్ద పని ఉన్నట్లు బయటకు వచ్చి చూడటం గుర్తు వచ్చింది .. ఆ రోజు నాన్న లోపలకు రమ్మని కసిరారు అందరి ఎదురుగా ..దెబ్బకు గిర్రున తిరిగింది తల నాకు .. అయిపోయింది..వాడి కోసమే వచ్చాను అనుకుంటారు .. ఈ ఒక్క విషయం చాలు ..నా మీద అనుమానం రావడానికి ... వాడు నా వెనుక పడుతున్నాడన్నా విషయం ఇంట్లో వాళ్ళందరికీ తెలిస్తే ప్రతి ఒక్కరు నన్నే గమనించడం మొదలు పెడతారు..మా ఇంట్లో తుమ్మినా,దగ్గినా అందరికి తెలియాల్సిందే .. ఒక్క కుటుంభంతో ముడిపడిలేదు మా ఇల్లు ..నాలుగు రకాల మాటలు వచ్చేస్తాయి ..నాన్నకు మాట వస్తే ఇంకేమన్నా ఉందా?? ..తట్టుకోలేరు ..ఎలా?

ఎందుకో ఏడుపొచ్చేసింది..దేవుడా దేవుడా ఏం గొడవలు లేకుండా ఈ సమస్య గట్టేక్కెల చెయ్యవా అని దణ్ణం పెట్టేసుకున్నా ..గీతాంజలి గాడిమీద చాలా కోపం వచ్చేసింది.. అంతా వాడి వల్లే ..వాడిని బాగా తన్నాలి అప్పుడు గాని బుద్ది రాదు ..తిట్టుకుని ,తిట్టుకుని పడుకున్నా .. రాత్రంతా నిద్ర పట్టలేదు ..ప్రొద్దున అసలు కాలేజ్ కి వెళ్ళాలనిపించలేదు ..ఏం కారణం చెప్పి మానేయాలో తెలియలేదు..ఈ స్వాతిది టంచనుగా టైముకి వచ్చేస్తుంది ..ఒక్క రోజుకూడా మానదు..ముభావం గా ఉండి తయారవుతున్నాను ... మరి ఎప్పటి నుండి గమనిస్తున్నారో నాన్న..ఇలారా అని పిలిచారు..ఏంటి నాన్నా అన్నాను ..ఏంటమ్మా మొహం అలా ఉంది.. నీరసం గా ఉందా అన్నారు దగ్గరకు పిలిచి..ఆ మాత్రం ప్రేమకే కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసాయి.. చలేస్తుంది నాన్న .జ్వరం వచ్చిందేమో అన్నాను.. నుదిటి మీద చెయ్యి వేసి ఏమి లేదమ్మా, ఉండు ధర్మామీటర్ తెస్తా అన్నారు ..

ఏంటి జ్వరానికే ఏడ్చేస్తున్నావా ??ఇంత పిరికోళ్ళేటే బాబు ..రేపు అత్తారిళ్ళదగ్గర ఇలాగే చేస్తే మిమ్మల్ని కాదు మమ్మల్ని అంటారు ..అమ్మతిడుతుంది..నువ్వు ఇంక ఆగు ,పాపం దానికెంత బాధగా ఉందో ఏడుస్తుంది ..అది ఆలోచించవే ..నాన్న కసిరి నా నోటికి ధర్మా మీటర్ అందించారు.. ఇలాగే వెనకేసుకుని రండి ..ఇది మరీ తట్టుకోలేదు ఏ చిన్నవిషయాన్ని..అమ్మ తిడుతూ వెళ్ళిపోయింది .. హమ్మయ్యా ,అనిపించింది ..అసలే నిన్న ఎండలో బయటకు వెళ్ళకు అని ఎన్ని సార్లు చెప్పినా వినకుండా సార్ ఇంటికి వెళ్ళా ..ఆ విషయం ఎక్కడ అనేసి అందుకే జ్వరం వచ్చింది అంటుందేమో అని భయమేసింది..

ఏమి లేదమ్మా,నార్మల్ ఉంది ..పోనీ ఒక పని చేద్దాం ..ఈ రోజుకి కాలేజ్ మానేసేయ్ ..నేను స్నానం చేసి వచ్చాక మళ్లీ చెక్ చేద్దాం .. జ్వరం ఉంటే హాస్పిటల్ కి తీసుకు వెళతా సరేనా అంటూ నాన్నవెళ్ళిపోయారు..ఎందుకో టెన్షన్ తగ్గినట్లు అనిపించింది .."అనవసరం గా భయపడుతున్నానేమో " అనుకున్నాను.. ఈ లోపల స్వాతి వచ్చింది..నా నోట్లో ధర్మా మీటర్ ,ఇతర తతంగాలు చూసాకా ..ఏంటి జ్వరమా? అంది ..ఉహు ..అలా అనిపిస్తుంది అన్నాను.. అయితే రావా కాలేజ్ కి అంది.. రాను అన్నాను.. నీతో ఒక విషయం చెప్పాలి అంది గుసగుసగా .. నాకు తగ్గుతున్న టెన్షన్ మళ్ళ పెరిగిపోయింది.. గీతాంజలి గాడి గురించా?? అన్నాను భయం గా .. ఆ .. నీకెలా తెలుసు అంది ఆక్చర్యం గా .. కొంపదీసి దీనికి విషయం తెలిసిపోయిందా ??.. ఏం జరుగుంటుంది ?? అమ్మా ,నేను కాలేజ్ కి వెళతాను జ్వరం తగ్గిపోయింది అని అమ్మ వద్దన్నా ఇంపార్టెంట్ క్లాస్ ఉందని చెప్పి స్వాతిని తీసుకుని బయటకు వచ్చేసాను ..

9, ఫిబ్రవరి 2010, మంగళవారం

ప్రేమ కధలు పలురకాలు -మూడవ భాగంఆ రోజు దీపావళి ..మాములుగానే ప్రతి పండగకు మల్లే తలంటు స్నానాలు ,క్రొత్త బట్టలు ,పిండివంటలు ,పూజలు అయ్యాకా సాయంత్రం తాతయ్య ఎర్రగా ఉన్న సన్నపాటి కాడకు(ఏం మొక్కో తెలియదు నాకు )నూనె లో ముంచిన నూలు గుడ్డ చుట్టి పిల్లలందరికీ ఇచ్చారు .అవి దివిటీలు అన్నమాట.వాటిని కాలుస్తూ దివ్వి దివ్వి దీపావళి, మళ్లీ వచ్చే నాగుల చవితి అంటూ ,ఎవరిది ఎక్కువ సేపు కాలితే వారిదే గొప్పఅని కొట్టుకుంటూ కాలుస్తున్నాం ..

సరిగ్గా అదే సమయానికి బయట బైకుల మీద గీతాంజలి గాడు, వాడి ఫ్రెండ్స్ తెగ హడావుడి గా తిరుగుతున్నారు అటు,ఇటు...మా ఇల్లు దాటి ముందుకు వెళితే స్వాతి ఇల్లు వస్తుంది . వీళ్ళకు పని, పాట లేదనుకుంటా తిట్టుకుంటున్న నాకు, నిన్న స్వాతి పటాసుల గురించి అన్నమాటలు గుర్తు వచ్చాయి ...ఇంకేముంది అయ్యగారు అమ్మగారిని ఎలా సంతోష పెట్టాలో తెలియక తెగ బాధపడిపోతున్నట్లున్నారు.ఇప్పుడు అక్కడ ఏం గొడవ చేస్తాడో??.. వాడి కంటే ముందు దీన్ని అనాలి ..కాస్త నోరు మూసుకుని ఉండదు ..అనుకుని లోపలి వచ్చేసాను..


ఆ రాత్రి భోజనాలు అయినతరువాత, నాన్న చెప్పే సవాలక్ష జాగ్రత్తల మద్య, ఆ నాలుగు కాకరపువ్వొత్తులు,మతాబులు కాల్చేసి 9 కల్లా నిద్ర పోవడానికి మంచం ఎక్కేసాం ..మా ఇంట్లో జనవరి 1 తప్ప మిగిలిన అన్ని రోజుల్లో తప్పని సరి 9 కల్లా పడుకోవలసిందే ..అలా నిద్రలో జారుకున్న నాకు హఠాత్తుగా మెలుకువ వచ్చేసింది ..బయట టపాసుల శబ్దాలు ..టైం చూస్తే పది దాటింది.. తమ్ముళ్ళు 11 వరకు కాలుస్తారు కాబట్టి ముందు పెద్దగా పట్టించుకోలేదు ..ఆ తరువాత ఆ శబ్దాలు మెల్ల ,మెల్లగా మరింత ఎక్కువ అవ్వడం మొదలయ్యాయి ..పెదనాన్న ఇన్ని టపాసులు కొన్నారా అని అనుకుంటుంటే నాన్న తలుపు తీసుకుని బయటకు వెళ్ళడం వినబడింది..నాకు కుతూహలం ఆగక చూద్దామని బయటకు వచ్చాను ..


ఆసరికే తమ్ముడు ..చిన్నాన్న ప్లీజ్ ,ప్లీజ్ ఈ ఒక్క రోజే కద నాన్న ,ఇంకో గంట అంతే,ప్లీజ్ నువ్వెళ్ళి పడుకో అని బ్రతిమలాడుతున్నాడు.. నాన్నా!!! వదలద్దు అంత ఎక్కువగా ఉంటే చవితికి కాల్చుకోమనండి అని అందామని గుమ్మం వరకు వచ్చి , ప్రక్కనే బాంబ్ పడినట్లు అదిరిపోయాను..ఎదురుగా గీతాంజలి గాడు వాడి ఫ్రెండ్స్ ... వాళ్ళు నన్ను చూడగానే ,వాళ్లకు కనబడకుండా గబుక్కున గోడ చాటుకి వెళ్ళిపోయి ,ఇదేంటి ఈ టైం లో వీళ్ళు ఇక్కడ?? అనుకుంటూ అటుపక్కగా ఉన్న మరో తమ్ముడిని పిలిచి ఒరే,ఎవరురా వాళ్ళు మన ఇంటి ముందు అన్నాను గుసగుసగా ..అదా ,భలే ఫన్నీ అక్కా బాబు తెలుసా ..వాళ్ళు ఆ వీధి చివరనే ఉంటారులే ..ఇందాక అందులో ఒకడేమో అన్నయ్యని 1000 సిరిస్ కాల్చగలవా దమ్ముంటే అని బెట్ కట్టాడు ..అన్నయ్య కాల్చగానే 100సిరిస్ ఇచ్చాడు ..ఇంక అక్కడి నుండి వాళ్ళను మాటల్లో పెట్టి మేమే కాల్చేస్తున్నాం ..వాళ్ళదగ్గర బోలెడు ఉన్నాయి ...తిక్కలోళ్ళు పాపం అన్నీ మాకే ఇచ్చేస్తున్నారు అన్నాడు ..హుమ్... నువ్వింకా ఎదగాలిరా జాలిగా వాడి వైపు చూసి అనుకుంటుంటే , 'ఏయ్ ఇక్కడేమి చేస్తున్నావ్ లోపలికి పద 'నాన్న అరుపుకి ఉలిక్కిపడి లోపలికి వెళ్లిదుప్పటి ముసుగేసేసాను ..

ఆ రాత్రి 12 వరకు అలా కాలుస్తూనే ఉన్నారు వాళ్ళు .అంతసేపు నిద్ర రాలేదు నాకు..ఒకటే ఆలోచనలు.. వీళ్ళు ఇక్కడకు ఎందుకు వచ్చారు? ..మరీ ఎక్స్ ట్రాలు చేస్తున్నారు కొంచెం కూడా భయం లేకుండా .. ఇక్కడే ఇంత గోల చేస్తే పాపం దాని ఇంటిదగ్గర ఇంకెంత గొడవ చేసి ఉంటారో ?..అయినా స్వాతిదాన్ని కూడా అనాలి ..ఏదో ఒకటి అంటూనే ఉంటుంది.. వాడు తూచా తప్పక చేస్తూనే ఉంటాడు ..రేపు వచ్చి ఇలా జరిగిందే అని ఏడుపు మొహం పెట్టుకుని చెప్తుంది..కాసేపు దాన్ని తిట్టుకున్నాపాపం దాని తప్పేముందిలే ,ఏది మాట్లాడినా వాళ్ళు సీరియస్సుగా తీసుకుంటే అది మాత్రం ఏం చేస్తుంది అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాను.

మరుసటి రోజు మా ఇంటి దగ్గరకు వస్తూనే బయట పేరుకున్న చెత్త చూసి ఏంటే,మొత్తం షాప్ అంతా మోసుకోచ్చేసారా ,ఇంత తుక్కుంది అన్నాది స్వాతి .. మా సంగతి సరే ,ముందు నీ సంగతి చెప్పు.. వీధి మొత్తం దద్దరిల్లిపోయి ఉండాలే ..ఎన్ని కట్టలు పార్సిల్స్ వచ్చాయమ్మ తమరికి,తెల్లార్లు పడుకుని ఉండవు వాటిని కాలుస్తూ అన్నాను వ్యంగ్యంగా ... ఏంటి కాల్చేది ,అగ్గి పుల్ల కూడా గీయలేదు ..మా నాన్న గారు వచ్చేసరికి రాత్రి రెండు అయ్యింది ...ఇంకేం తెస్తారు ..మరి మా వీధిలో వాళ్లకు ఏం వచ్చి ఏడ్చిందో తెలియదు .. దీపాలు వెలిగించేసి తలుపులు బిడాయించేసారు..ఈ దీపావళి సరదా, చట్టుబండలు ఏం లేకుండా చప్పగా జరిగింది మా ఇంట్లో అంది..

నాకు చాలా ఆక్చర్యం గా అనిపించింది..అదేంటే నిన్న వాడు ,వాడి ఫ్రెండ్స్ ఇంత హడావుడి చేసారు మా ఇంటిదగ్గర , మీ ఇంటిదగ్గరకు రాకపోవడం ఏంటి ? మీ ఇల్లు ఎక్కడో తెలియదా వాళ్లకు అంటూ నిన్న జరిగిన విషయం చెప్పాను..నిజమా!మా ఇల్లు తెలియకపోవడం ఏంటే ,చాలా సార్లు కనబడ్డారు నాకు మా వీధిలో అంటూ ముందు చాలా ఆక్చర్య పోయింది కాని తరువాత తేలిగ్గా నిట్టూరుస్తూ నాకర్ధం అయ్యిందిలే అంది.. ఏంటి ?అన్నాను ..మా అమ్మమ్మ సంగతి మా వీధే కాదు పేట మొత్తం తెలుసు.. నోరు విప్పిందంటే చాలు మళ్లీ 3 జన్మలు ఎత్తేంతవరకు ఆ తిట్లు ఎవరూ మర్చిపోలేరు.. ఒకసారి వాడి ఫ్రెండ్స్ కూడా విన్నారు ఆ తిట్లు.. నిన్న ఆవేశం లో కొనేసి ఉంటారు తరువాత మా అమ్మమ్మ గుర్తొచ్చి భయం వేసి ఉంటుంది ...అసలు నిన్నే ఫ్రెష్ గా పక్కవాళ్ళ కుక్క రాత్రిళ్ళు అరుపులతో నిద్రలేకుండా చేస్తుందని నాలుగు వీధులకు వినబడేలా గొడవపెట్టుకుంది .. అందుకని మీ ఇంటిదగ్గర కాల్చేసి ఉంటారు ..ఎలాగూ నీకు తమ్ముళ్ళు ఉన్నారు కదా ,వాళ్లకు వాళ్లకు సరిపోతుంది అంది ... ఏమోనే ,నాకు మాత్రం చాలా కోపం వచ్చింది నిన్న ,భలే భయం వేసింది తెలుసా అని కాసేపు ఆ విషయం మాట్లాడుకుని మర్చిపోయాం ..

కాని ఆ రోజు నుండి గీతాంజలి గాడు మరింత రెచ్చిపోవడం మొదలైంది.. ఇంతకుముందులా భయం భయం గా కాకుండా మేమేదో బాగా తెలిసిన వాళ్ళలాగా ప్రవర్తించేవాడు ..మేమోస్తుంటే ప్రక్కన ఫ్రెండ్తో అంటున్నట్లు నటిస్తూ ఏదో ఒకటి అనేవాడు.. నాకు కొంచెం చిరాకు అనిపించేది ఒక్కోసారి.. కాని ఎప్పుడూ మాతో మాట్లాడే దైర్యం చేయలేదు .. ఇలా ఉండగా ఒకసారి కాలేజ్ లైబ్రరీలో ఈనాడు చదువుతుంటే స్వాతి వచ్చింది ఇక్కడున్నావా అంటూ.. మాటల మద్యలో స్వాతి చెప్పింది.. అన్నట్లు మర్చిపోయాను రేపు న్యూ ఇయర్ కి మన పాత ఫ్రెండ్స్ అందరు కలుస్తున్నారు అంట.. ట్యూషన్ సార్ తప్పకుండా రమ్మన్నారు అంది..నాక్కూడా ఉత్సాహం వచ్చింది ..ఎవరెవరు వస్తున్నారుఅంటా అన్నాను ఆసక్తిగా ..ఏమో తెలియదు ,నేను రావడం లేదు అంది.. ఏ ..ఎందుకని ? నువ్వు వెళ్ళకపోతే నేనూ వెళ్ళను అన్నాను.. అది కాదే, ఈ మద్య ఆ గీతాంజలి గాడి వరస చూస్తున్నావ్ కదా ..ఖచ్చితం గా ఈ న్యూ ఇయర్ కి గ్రీటింగ్ పట్టుకు వస్తాడు.. వాడికా అవకాశం ఎందుకు ఇవ్వడం, లేనిపోని గోల.. మా పిన్ని ఇంటికి వెళుతున్నా ఆ రోజు ..పైగా నువ్వు ,నేనూ ఇద్దరం మానేస్తే సార్ ఫీల్ అవుతారు .. నువ్వు వెళ్ళచ్చుకదా అంది.. అదన్నమాట కూడా నిజమే అనిపించింది ,పాపం దాన్ని ఎందుకులే రిస్క్ లో పెట్టడం అనిపించి బలవంతం చేయలేదు .. నన్ను ఒక్కదాన్నీ పంపాలి కదా ..సరే, చూద్దాం కుదురుతుందేమో అన్నాను ..

న్యూ ఇయర్ రోజు అమ్మని ఎలాగో బ్రతిమాలి ఒక్కదాన్నే సార్ ఇంటికి వెళ్లాను ..పాత ఫ్రెండ్స్ అందరినీ కలుసుకుని కాస్సేపు కబుర్లు చెప్పి ఇంటికోచ్చేస్తుంటే దారిలో గీతాంజలి గాడి ఫ్రెండ్స్ కనబడ్డారు ఎదురుగా వస్తూ .. హీరో గారు లేరేంటో ప్రక్కన ??..ఇదన్నట్లు దానికోసం గ్రీటింగ్ పట్టుకుని తిరుగుతున్నట్లున్నాడు.. మంచిదయింది ఈ రోజు రాకపోవడం అనుకుని ముందు కెళుతుంటే వాళ్ళిద్దరూ నావైపే రావడం గమనించాను..నాకు మెల్లిగా టెన్షన్ మొదలైంది ..వీళ్లు నా వైపు వస్తున్నారేంటి?? కొంపదీసి మాట్లాడరు కదా?? చుట్టూరా చూసాను మా ఇంట్లో వాళ్ళు కనబడతారేమో అని భయంగా ..వాళ్ళు మరింత దగ్గరకొచ్చేసారు..నాకు అర్ధం అయింది వాళ్ళు నాతో మాట్లాడడానికే వస్తున్నారని ..ఇప్పుడు మొదలు పెడతారు ..' ఏమండీ ..మీ ఫ్రెండ్ అంటే మా ఫ్రెండ్ కి ఇష్టం అండి,మీ ఫ్రెండ్ లేకపోతే వాడు చస్తాడండి..మీరు మీ ఫ్రెండ్ కి చెప్పండి' అంటూ ప్రాణాలు తోడతారు ..ఇలాంటి వాళ్ళను మా కాలేజ్ చుట్టూ చూస్తూనే ఉన్నాను ...ఎలారా భగవంతుడా తప్పించుకోవడం అనుకుని నడుస్తుంటే వాళ్ళు నా దగ్గరకు వచ్చేసారు ...

'స్వాతి గారు ' మీతో మాట్లాడచ్చా వారిలో ఒకడు సిగ్గు పడుతూ అన్నాడు .. స్వాతి ??? నేను పొరపాటున విన్నానా ? లేక వాడు పొరపాటున అన్నాడా?ఎ .. ఏంటి అన్నాను అప్రయత్నంగా .. హేపీ న్యూ ఇయర్ అండి స్వాతి గారు ..మీకు కోపం రాలేదు కదండీ అన్నాడు వాడు ముసి ముసిగా నవ్వుతూ.. నాకు అయోమయం గా అర్ధం అయ్యి ,కానట్లుగా అనిపించి స్వాతేంటి ? స్వాతెవరు? అన్నాను వాళ్ళ వైపు మార్చి ,మార్చి చూస్తూ ..ఈ సారి ఆక్చర్య పోవడం వాళ్ళ వంతు అయ్యింది ...మీ పేరు స్వాతే కదా అన్నారు మోహ మొహాలు చూసుకుంటూ ...నాకు భూమి గుండ్రం గా తిరుగుతున్నట్లు అనిపించింది ..కాదు గొణుకుంటున్నట్లు అంటూ అక్కడి నుండి వచ్చేసాను ...

దారి అంతా ఒకటే ఆలోచనలు ..అంటే వీళ్ళకు నా పేరు తెలియదా ??..నన్ను స్వాతి అనుకుంటున్నారా? అయితే వాడు పడుతుంది నా వెనకాలా? లేదు ..లేదు నా కోసం కాదు ..ఎక్కడో పొరపాటు పడుతున్నాను ..మరి ఇన్నాళ్ళు వాడు స్వాతి కోసం తిరిగిన తిరుగుళ్ళు ,వేసిన వేషాల మాటేంటి??నాకు నేను దైర్యం చెప్పుకున్నాను.. కాని ఆలోచిస్తే అవన్నీ నా కోసం కూడా చేసి ఉండచ్చుకదా అనిపించింది ..ముఖ్యంగా దీపావళి రోజు ...డవుటే లేదు నా వెనుకే పడుతున్నాడు ..నా పేరు విషయంలో పొరపాటు పడి ఉంటాడు ...ఆ మాట అనుకోగానే అంతకు ముందు విషయాలన్నీ సినిమా రీలు లా కళ్ళ ముందు గింగిరాలు తిరగడం మొదలయ్యాయి..

వాడొస్తున్నాడని స్వాతి నన్ను ఇటుతోసి అది అటు వెళ్ళిపోవడం.. నన్ను కాదు కదా అనే దైర్యం తో ఎప్పటిలాగే నేను క్లోజప్ ఏడ్ లా పళ్లన్నీ బయటపెట్టి నవ్వుకుంటూ ,మాట్లాడుకుంటూ వెళ్ళడం ..ముఖ్యం గా దీపావళి రోజు చేసిన పనికి కనీసం వాడి వైపు సీరియస్సుగా ఒక్క లుక్ కూడా ఇవ్వలేదు..ఇదంతా చూసి వాడు, నాక్కూడా వాడంటే ఇష్టం అని అనేసుకున్నాడేమో?? ఖర్మ..ఇంకా అనుకోవడం ఏమిటి ? అదే అయ్యుంటుంది ..ఎంత దైర్యం లేక పొతే మమ్మల్ని చూడగానే గోడల వైపు ,మేడల వైపు చూసే వాడు కాస్త మా ఇంటికొచ్చి టపాసులు కాలుస్తాడా?? .. పైగా వాడి ఫ్రెండ్స్ నాకు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్తారా?? ... అయ్యబాబోయ్ దేవుడోయ్ ఏంటి ఈట్విస్టు ...ఇప్పుడేమి చేయాలి ??ఎలా వచ్చానో ఇంటికి నాకే తెలియదు .. బయట ఎండ వేడికో మరి వాడు ఇచ్చిన షాక్ కో తెలియదు కాని కళ్ళు తిరిగినట్లయి మంచం మీద పడిపోయాను ..

మిగిలింది తరువాత వ్రాస్తాను :))

6, ఫిబ్రవరి 2010, శనివారం

ప్రేమకధలు పలురకాలు - రెండవ భాగంఅప్పటి వరకు లెటెర్ నాకిస్తాడేమో అంటే నాకిస్తాడేమో అని మేము టెన్షన్ పడిపోతున్నాం కాని పాపం ఇచ్చేవాడు ఇంకెంత టెన్షన్ పడతాడో ఆలోచించనేలేదు. కరెక్ట్ గా వాడి దగ్గరకు రాగానే ,పాపం మాకు ఇచ్చే దైర్యం లేక,మాకు అడ్డం గా నించుని ఒరే 'హేపీ వేలంటైన్స్ డే' రా అంటూ ఎదురుగా ఉన్న ఫ్రెండ్ కి గబుక్కున ఆ లెటెర్, గులాబీ ఇచ్చేసాడు తలవంచుకుని .. అప్పటివరకు ఏంటేంటో ఊహించుకుంటూ భయపడిపోతున్న నాకు, అతను చేసిన పనికి పక్కున నవ్వు వచ్చేసి నవ్వాబోయి ,అతని చేతి పై చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాను.. మణికట్టు పై చక్కగా ' స్వాతి ' అని పచ్చగా ఫ్రెష్ గా పచ్చబొట్టు..

గబుక్కున తేరుకుని మా స్వాతి చూసిందో ,లేదో అని దానివైపు చూసాను ..పాపం అది ఇంకా తేరుకోలేదు. బిగుసుకు పోయి పదినిమిషాలు మాట్లాడలేదు..సస్పెన్స్ వీడీ పోయింది,మబ్బులు తొలగిపోయాయి...హమ్మయ్యా నేను బ్రతికిపోయాను పైకి అనుకున్నాను గాని మనసులో కొంచెం కుళ్ళు ..ఈ లెక్కన ఇది నాకన్నా అందంగా ఉందన్నమాట..

అయ్యబాబోయ్ దేవుడోయ్.. ఎంత దేవాంతకుడే పైకి అమాయకం గా కనబడతాడు కాని ఎంత తెలివిగా ,సేఫ్ గా ప్రపోజ్ చేసేసాడు అంది కాసేపాగి ఈ లోకం లోకి వచ్చాకా.. అలవాటుగా ధైర్యం చెప్పాబోయేను కాని అది ఇన్నాళ్ళు నన్ను పెట్టిన టార్చర్ గుర్తుకొచ్చింది..అయిపోయింది ఇంక దీని పని అనుకుని ..'పచ్చ బొట్టు చెరిగీ పోదులే' అని పాడటం మొదలు పెట్టాను..ఉండవే బాబు నీకు పుణ్యం ఉంటుంది వాడు ఇచ్చిన షాక్ నుండి ఇంకా బయటకు రాలేదు హింస పెట్టకు అని దణ్ణం పెట్టేసింది..కానీ నేను వదులుతానా..అంతకంత తీర్చుకోవద్దూ ....కానీ ఎంత ఏడిపించినా ,ఎవరూ లేనప్పుడు మాత్రమే అనేదాన్ని..వాళ్ళ దగ్గర మాత్రం మాకేం తెలియనట్లు మామూలు విషయాలుమాట్లాడుకునేవాళ్ళం..


అయితే ఆ అబ్బాయి రవితేజా టైపులో ' ఏం ..కమీష్నర్ కూతుళ్ళకు పెళ్ళి అక్కరలేదా ' అని గదమాయించే టైపు కాదు ,సుస్వాగతం సినిమాలో పవన్ లాగా ఎంత కాలం అన్నా మూగగా ఆరాధించే టైపు అని తెలుసుకున్నాకా కొంచెం ధైర్యం వచ్చింది.. పాపం ఆ అబ్బాయి తనకు స్వాతంటే చాలా ఇష్టం అని చెప్పడానికి చాలా ట్రై చేసేవాడు..ఎలా అంటే మేము వస్తుంటే ,ఒక వేళ ఆ రోజు ఉగాదో మరొకటో అనుకోండి ...పైన ఆకాశమో, క్రింద నేలనో లేక పక్కింటి మేడనో చూస్తూ' హేపీ ఉగాదీ 'అని అరిచేవాడు ..లేకపోతే ఒక్కో సారి సరిగా క్లాసెస్ లేకా కాలేజ్ డుమ్మా కొట్టాం అనుకోండి..' ఏంటిరా హెల్త్ బాలేదా నిన్న రాలేదు' అని తన ఫ్రెండ్ తో అన్నట్లు అంటూ తెగ కలవరపడిపోయేవాడు.. బాబూ, నువ్వలా ఎదురింటి మేడలను ,పక్కింటి గోడలను చూసి మాట్లాడుతుంటే ఆ ఇంట్లో అమ్మాయిలకు లైన్ వేస్తున్నావ్ అనుకుని అనుమానపడే టైపు మీ స్వాతి కొంచెం జాగ్రత్త అని మెల్లిగా అంటూ ఏడిపించేదాన్ని స్వాతిని ... పైకి తేలేది కాదు కాని దీనికో ప్రక్కనుండీ మహా గర్వం గా ఉండేది ..ఇలాంటివి సినిమాల్లో చూడటం తప్ప ,నిజ జీవితం లో చూసేసరికి భలే సర్దాగా ఉండేది నాకు.. నాది కాదు కదా ప్రోబ్లెం ..పైగా దాన్ని తనివి తీరా ఏడిపించచ్చు అదన్నమాట సంగతి.. కొన్ని సంఘటనలు భలే ఉండేవి మచ్చుక్కి కొన్ని..

ఒక రోజు స్వాతి ,నేను మాట్లాడుకుంటూ వస్తున్నాం ..దాని డ్రెస్స్ చూస్తూ అబ్బా నాకీ కలర్ అంటే ఎంత ఇష్టమో నీకు భలే దొరుకుతాయే అన్నాను ...నిన్ను అలా కుళ్ళబెట్టడానికేనే వేసుకున్నాను ..మొన్న షబ్నం లో షోకేస్ లో పెట్టాడు ..వెంటనే మా డాడీకి చెప్పి రాత్రే కొనేసుకున్నాను అంది పోజుకొడుతూ ..షబ్నం లో కొన్నావా తల్లీ, హమ్మయ్యా నేను హేపీ ..వాడు ఎలాగూ 100 రూపాయల వస్తువు 1000 రూపాయలకు అమ్ముతాడు..బాగా బేండ్ అయ్యి ఉంటుంది భలే భలే అన్నాను.. అంత లేదు, రేట్ తక్కువ చెప్పడానికి ఇవేమన్నా ప్లాట్ ఫాం డ్రెస్స్ అనుకున్నావా క్వాలిటీ ఉంటుందమ్మా ..అయినా నాకేదన్నా నచ్చితే కొనేస్తాను ,నీలాగా లెక్కలేసుకోను అంటూ నాతో గొడవపడుతుండగానే ఎదురుగా గీతాంజలి గాడు అదే కలర్ టీ షర్ట్ లో వస్తూ చిన్నగా నవ్వుతున్నాడు.. ఇది తెల్లబోతూ ఇప్పుడే కదే వేరే డ్రెస్స్ లో మనముందు వెళ్ళాడూ అంది..ఏమో తల్లీ మీ ఇద్దరూ ఇలా కోడ్ భాషలో ఏం సందేశాలు పంపుకుంటున్నారో నాకేం తెలుస్తుంది చెప్పు అని కాసేపు ఆడుకున్నాను ..మరీ, నాతో గొడవ పెట్టుకుంటుందా ..


మరో రోజు ఇద్దరం వస్తుండగా ' ఈ ఎండలో కాలేజ్ కి ఇన్నిసార్లు తిరిగి చదవడం కంటే నీడ పట్టున కోళ్ళ ఫాం పెట్టుకుని బ్రతికేయడం బెటరు ' విసుగ్గా అన్నాను..ఇంక మా మేడం మాట్లాడటం మొదలు పెట్టింది .ఛీ నీలాంటి వాళ్ళ వల్లేనే దేశం ఇలా అయిపోతుంది .కష్ట పడకుండా కాసులు వచ్చేయాలి అంటారు అంటూ చదువు, దాని ఆవశ్యకత మీద ఒక అరగంట సోది చెప్పి నేను మాత్రం డాక్టర్ని అవుతాను..పేదలకుసహాయం చేస్తాను .. చదువురాని వాడికి ఎంత ఆస్తిపాస్తులున్నా గౌరవం ఇవ్వరు ..చులకనగా చూస్తారు ,అదే చదువుకున్నవాడికి బోలెడు గౌరవం విలువనిస్తారు..చదువుకోనివాడు వింత పశువు నా దృష్టిలో అని ఆవేశపడిపోతుంటే ..అబ్బా!! దీనిదగ్గర బుద్దితక్కువ అయి అన్నానురా బాబు అనుకుని ప్రక్కకు చూసాను. మా వెనుకనే గీతాంజలి గాడు వాడి ఫ్రెండ్స్ ...మరి ఎప్పటినుండి ఫాలో అవుతున్నారో..నేను దాన్ని ఇంక ఆపు అన్నట్లూ గా మోచేతిని గిల్లాను ..అబ్బా ఏంటీ అని కోపంగా అంటూ వాడిని చూసి నాలుక కరుచుకుంది..

వాళ్ళు వెళ్ళగానే ,వినేసాడంటావా అంది గుసగుసగా.. ఆ.. శుబ్బరంగా అన్నాను..నేను కావాలని అనలేదే బాబు ,ఏదో మాటవరసకి అన్నాను ..తను చదవడం లేదుగా ,తనని అన్నానేమో అనుకున్నాడంటావా?? అంది నొచ్చుకుంటూ ..పోనీ ఓ పని చేయి రేపు వాడు వస్తున్నపుడు ,'చదువురాని వాడవని దిగులు చెందకు' అని పాడేసేయి గొడవుండదు అన్నాను..అప్పటికి గాని నాకు బుద్ది రాదు.. మా వాళ్ళు గాని విన్నారనుకో ఆ పాట ..వద్దులేమ్మా అంత కష్టపడటం అని ఇంట్లో కూర్చో పెట్టెస్తారు ఇంక రోజూ అదే పాడుకోవాలి అంది..మేమేదో సరదాగా తీసుకున్నాం కాని ఆ విషయం తను సీరియస్సుగా తీసుకుంటాడు అనుకోలేదు..మరుసటి రోజు ఇద్దరం వస్తుంటే ఒరేయ్ మామ ఏంటిరా ఎం బి ఎ చేద్దాం అనుకుంటున్నావా!! మాకినబడేటట్లుగా ప్రక్కనోడు అరిచాడు..అవునురా ముందు డిగ్రీ కంప్లీట్ చేసేసి అది చేద్దాం అనుకుంటున్నాఅన్నాడు ఆ అబ్బాయి మొహం జాలిగా పెట్టి.. నాకు నవ్వు ఆగలేదు అక్కడ మొహం సీరియస్సుగానే పెట్టి ఇద్దరం వాళ్ళను దాటుకొచ్చేసాము..అంటే నిన్న అన్నది విన్నాడన్నమాట అంది అది .. అమ్మో, స్వాతి నువ్వు తక్కువదానివి కాదేవ్ ..మెల్లిగా అన్నీ క్లియర్ చేసుకుంటున్నావ్ అన్నమాట అన్నాను నవ్వుతూ ..నాకింకెవరూ శత్రువులు అక్కర లేదే నువ్వు చాలు అంది నవ్వుతూ.. ఎలాగూ తెల్లగా ,పొడుగ్గా బాగానే ఉన్నాడు ,ఇంక డబ్బులు గట్రా బాన్నే ఉన్నాయి వాళ్ళకు..ఒక్క చదువే లోపం.. అది కూడా ఒక్క మాటతో కవర్ చేసేసావ్ ..నేను అంటునే ఉన్నాను అది నన్ను కొడుతునే ఉంది..


ఆ అబ్బాయి ఎలాగూ అంతకు మించి ధైర్యం చేయడనుకుందో ఏమో అది కూడా ఒక్కోసారి జోకులు వేసేది ఎవరూ లేనపుడు.. ఏంటీ ఈ రోజు మా హీరో ఇంకా రాలేదూ మేచింగ్ డ్రెస్స్ దొరకలేదా అనో,వాడు నిజంగా పచ్చ బొట్టు వేయించుకున్నాడా లేక రుధ్రవీణలో శోభన లా అడగ్గానే చేతికి తీసి ఇచ్చేస్తాడా అని ఇలా అన్నమాట.. కాని ఆ అబ్బాయి కనబడితే చాలు భయం తో నన్ను అటు తోసేసి ఇది ఇటు వచ్చేసేది ..

ఇది ఇలా ఉండగా ఒక సారి దీపావళి వచ్చింది..ఆ ముందు రోజు ఇద్దరం మాట్లాడుకుంటూ వస్తున్నాం..ఈ సారి దీపావళికి ఏం కొంటున్నారేంటి మీ నాన్నగారు అంది..ఏంటీ కొనేది ,ఇంకా చిన్నపిల్లలం అనుకుంటున్నావా..అయినా నాకు టపాసులంటే చిన్నప్పటినుండి భయం బాబు ..చిచ్చు బుడ్లు,భూచక్రాలు కొన్నా భయమే కాల్చడానికి,మన లెవల్ కి సాదాకాకర పువ్వొత్తులు,పాం బిళ్ళలు ,అగ్గి పెట్టెలు ,మతాబాలు వంటి వాటితో సరిపెట్టేసుకుంటాం అన్నాను..ఛీ,ఛీ ఎవర్తివే బాబు నువ్వు,నాతో రాకు రేపటి నుండి ..అస్సలా అర్హతే లేదు నీకు అంది..ఏడ్చేవ్లే.. నాకు టపాసులు కాల్చడం కంటే ఆ మరుసటి రోజు అందరి ఇళ్ళముందూ పోగైన చెత్త చూడటం అంటే మహా ఇష్టం ..చిన్నపుడు నేనూ, మా తమ్ముడూ అన్ని ఇళ్ళముందూ ఉన్న తుక్కుని చూస్తూ ,ఎవరు ఎక్కువ కాల్చి ఉంటారో లెక్కలు వేసి వచ్చేవాళ్ళం ..అదో ఆట అన్నమాట ..భలే సరదాగా ఉండేది అన్నాను ఓమారు వెనక్కి వెళ్ళిపోతూ.. కోటా శ్రీనివాస్ లా కోడిని ముందుపెట్టి అన్నం తిన్నట్లా ..మొహం చూడూ అంది.. సరేలే నా సంగతి ఎందుకు గాని నీ సంగతి చెప్పుఅన్నాను..

నేను నీకులా కాదు చిన్నపుడే 1000 సిరీస్ కాల్చేను తెలుసా అంది..ఏంటి నిజమే అన్నాను నోరెళ్ళ బెడుతూ ...మరేమనుకున్నావ్ అసలు దీపావళి సాహస గాధలు బోలెడు నాకు ...ఒక సారి తారాజువ్వ వేస్తే ప్రక్కన గుడిసెల్లో వెళ్ళిపోయి నానా హంగామా చేసారు ..సిసింద్రీలు,తాటాకు టపాలు ,జింకాలు అబ్బో ఒకటేమిటీ నేను కాల్చని టపాసులేదంతే అంది ...ఇది నిజం చెప్తుందా లేక వెనుక ఫాలో అవుతున్న వాడి ఫ్రెండ్ దగ్గర కోతలా అనుకుంటూ వింటున్నా ..మరి ఈ సారి ఎంత డబ్బు,ఎన్ని ఇళ్ళు తగలబెట్టబోతున్నావేంటీ అన్నాను..హూం ఏంటీ తగలెట్టేది ..మా నాన్న గారు ఊర్లో లేరు రేపు రాత్రికి వస్తారు ..ఆయన ఎన్నింటికి వస్తారో ,అసలు కొంటారోలేదో.. మా అమ్మను అడిగితే ఎప్పుడో చిన్నపుడు కాల్చుకున్న గాయాలన్నీ గుర్తుతెచ్చుకుని తెచ్చుకుని తిట్టిపోస్తుంది తప్ప పట్టించుకోవడంలేదు..ఈ దీపావళి కి ఇంక ఇంతే అంది..

ఈ లోపల ఆ అబ్బాయి ఫ్రెండ్ వెళ్ళిపోయాడు..ఇంకేం కాకితో సందేశం పంపేసావ్ కదా రేపు ప్రొద్దున్న మీ ఇంటికి లక్ష్మీ బాంబులతో సహా పార్సిల్ పంపేస్తాడు.. బాగానే ఉందే నీపని ఎంచక్కా అన్నాను.. బాబోయ్ ,నిజంగా పంపుతాడు అంటావా అంది భయం గా..అంత ఫీల్ అయి చెప్పావ్ కదా నాకైతే అస్సలు డవుట్ లేదు అన్నాను.. అలా భయపెట్టకే బాబు ..మా నాన్నకు తెలిస్తే నన్ను కైమా చేసేసి, కిలో రెండు రూపాయలకు అమ్మేస్తారు అంది.. నేను మాత్రం పట్టించుకోకుండా ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా సాంగ్ పాడుతూ నవ్వుతున్నా..కానీ నాకేం తెలుసు ఆ తరువాత రోజు ఇద్దరికీ గొప్ప షాక్ ఎదురవుతుందని..

తర్వాత రాస్తానే :)