10, అక్టోబర్ 2012, బుధవారం

తాళి


చంద్రమతి తాళి భర్త హరిశ్చంద్రుడికి మాత్రమే కనబడుతుందట..అందుకే చీకటిలో స్మసానంలో  కాటికాపరి తాళి అడిగితే అతనే హరిశ్చంద్రుడని ఇట్టే అంటే అట్టేకనిపెట్టేస్తుంది చంద్రమతి అని పురాణాలు ఘోషించాయని మా తాతయ్య చిన్నప్పుడు ఏ ముహూర్తాన చెప్పారో అప్పటి నుండి తాళి అనేడిది భర్తకు మాత్రమే  కనిపించే వస్తువని ఇతరులు ఎట్టిపరిస్తితుల్లో చూడరాదని నాకు మైండ్లో ఘా..ట్టిగా ఫిక్స్ అయిపోయింది...


అందుకేనేమో చిన్నప్పుడూ అమ్మావాళ్ళతో పాత సినిమాకి వెళ్ళినప్పుడు ఆ సినిమాల్లో గో..ప్ప పతిభక్తి కలిగిన వీరోయిన్లు తాళి బొట్టు పైకే వేసుకుని భర్త పాదాలకు నమస్కరించినా , గుళ్ళుకీ గోపురాలకి తిరిగేసి పద్దాకా కళ్ళకద్దుకుని తెగ కష్ట పడిపోతున్నా  మా గొప్ప చిరాకొచ్చేసి సినిమా మధ్యలోనే ఇంటికెళ్ళిపోదాం అంటూ పేచీ పెట్టేసేదాన్ని..

అదొక్కటేనా మా మేనత్త ఈ తాళి విషయంలో రోజుకో సెంటిమెంట్ చెప్పి తెగ భయపెట్టేసింది ...తాళి బొట్టు నిద్రపోయి లేవగానే మెడ వెనుకగా వీపు వైపుకు చేరితే భర్త రెండో పెళ్ళి చేసుకుంటాడట... తాళి బొట్టు కొత్త చైను మారుస్తున్నప్పుడు ఇలా మెడలో తీసి అలా కంసాలికి ఇవ్వగానే వాళ్ళ ఆయనకు చెయ్యి విరిగిపోయిందట ..అందుకే ఏదో పధ్యం చదవాలట.. ఎవరికన్నా తాళి బొట్టు ఎరువుగా ఇస్తే(ఇవి కూడా అప్పులు,ఎరువులు  ఇచ్చుకుంటారా !!!) గనుక దాన్ని మరగేసి వేసుకోమని వాళ్ళకు చెప్పాలట..లేకపోతే వీళ్ళ ఆయన ఆ అమ్మాయికి దాసోహం అయిపోతాడట..అబ్బో ఇలాంటివి చాలా చెప్పేసి..తాళి అనగానే తుళ్ళిపడేలా భయంపెట్టేసింది మహా తల్లి...

కాని ఈ మంగళ సూత్రం విషయంలో ఒక్కో అమ్మాయికి ఒక్కో నిర్ధిష్టమైన అభిప్రాయాలు ఉంటాయని..అందరూ  నాకులా ఎదుటివాళ్ళు ఏం చెప్తే అదివినేసే రకాలు ఉండరని  మా అక్క పెళ్ళయ్యాకే తెలిసింది ... అక్క పెళ్ళయిన కొత్తలో ఓ ఆరునెలల పాటు  అది స్నానం చేసిన గంటకి మా నాన్నకి బిపి ఓ రేంజ్లో పెరిగిపోయేది... "శారదా!!" అని ఆయన శంకరశాస్త్రి అవతారం ఎత్తగానే మేమందరం అక్క మెడవైపు చూడటం అది యధావిది గా నాలుక్కొరుక్కుని మా వైపో క్లోజ్ అప్ యాడ్ ఇవ్వడం  ఆ వెంటనే అమ్మ " పెళ్ళయిన పిల్లకి ఇంత మతిమరపు ఉండకూడదమ్మా..హవ్వా ఎవరన్నా స్నానం పేరు చెప్పి మంగళ సూత్రం కొక్కాలకు,మేకులకు తగిలించి వదిలేస్తారా..ఎవరన్నా వింటే నవ్విపోతారు..అక్కడ కూడా ఇలాగే చేస్తున్నావా.. అని క్లాస్ పీకడం  మాకు అలవాటయిపోయింది..



ఓ రోజు ఈ బాధ పడలేకా..మా అక్కకు ఎలాగయినా  జ్ఞానోదయం కలిగిద్దాం అనే సంత్సంకల్పంతో  చంద్రమతి కధను అక్కకు చెప్పాలని నిర్ణయించుకుని ,ఎందుకయినా మంచిదని ఒకసారి  హరిశ్చంద్రుడి సినిమా చూసి మరీ ప్రిపేర్ అయివచ్చాను..కొద్దిగా చెప్పానో లేదో అది మధ్యలోనే ఆపేసి.." ఒసే పిచ్చ మొహమా మిగతా పురాణాలన్ని మగవాళ్ళు రాసినా ఈ చంద్రమతి స్టోరీ లో ఈ పార్ట్ మాత్రం ఖచ్చితంగా అమ్మాయే రాసింది... ఇప్పుడు తాళి బొట్టు అందరికీ కనబడేలా వేసుకుని  తిరిగామనుకో మనకి పెళ్ళయిపోయిన విషయం తెలిసిపోతుందికదా.. అప్పటివరకూ మనల్ని చూడగానే కళ్ళల్లో మతాబులు వెలిగించుకున్న అబ్బాయిలందరూ ..ఆ.. దీనికి పెళ్ళయిపోయింది ఇంకో అమ్మాయిని చూసుకుందాం అనేసుకుని వెళ్ళిపోతే మనసెంత గాయపడుతుంది ..అందుకే అన్నమాట భర్తకు తప్పించి ఇంకెవరికీ తాళి చూపకూడదని నియమం పెట్టారు..కాబట్టి నాన్నా,అన్న,తమ్ముడు లాంటి కొంతమందికి తప్పా ఇంకే మగాడికీ చూపించకూడదు అన్నమాటా.. పాపం నాన్నకు ఆ విషయం తెలియదంతే "అని నాకే జ్ఞానోదయం చేసి వెళ్ళిపోయింది.. ..



మరోసారి మా పెళ్ళయిన కొత్తలో ఒక ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే నీ తాళిబొట్టు ఏ చేత?? లక్క చేతా,జల్లెడ చేతా అని అడిగింది.."అంటే" అన్నాను అర్ధంకాక ... "ఏది నీ మోడల్ చూపించు చెప్తాను "అని బయటకు తీసి అదిరి పోయి బెదిరిపోయింది...అసలు మన తాళి అంటే ఆషా మాషీనా ఎంచక్కా ఫ్రెష్గా పౌర్ణమి  నోములు చేసుకుని కట్టుకున్న చంద్రికలు,ఇంకేదో నోముకోసం కట్టుకున్న పసుపుకొమ్ములు..,వరలక్షివ్రతం రూపులు ,చీరకోసం అని అట్టే పెట్టుకున్న ఓ అయిదారు  పిన్నులుతో కళ కళ లాడిపోతుంది .. "ఏంటే ఇది పూసలదానిలా ఈ దారాలేమిటి,కుంకాలేమిటి" అని దులిపేసింది..  "అదికాదే..సెంటిమెంట్ ... భర్త క్షేమం కోసమనీ చేయించారుగా అన్నాను "నసుగుతూ.

అది కూడా సేం మా అక్కలాగే సంబోధిస్తూ "ఓసి పిచ్చి మొహమా తాళి అంటే ఎవరు??భర్త ...భర్తకు మారు రూపం తాళి..అటువంటి  భర్తను నీట్గా ఉంచుకోవాలా వద్దా? మన అమ్మమ్మలు,నాన్నమ్మలు,అమ్మలు ఈ పురుషాధిక్య ప్రపంచంలో భర్తలను ఏమి అనలేక ఆ కసికోపం ఇలా భర్తకు మారు రూపమైన తాళికి పసుపులు కుంకాలు రాసేసి పిన్నులతో అలంకరించి మరీ తీర్చుకుంటారు..ఇప్పుడు జమనా బదల్ గయారే..కోపం వస్తే ఆ రాసేదో డైరెక్ట్గానే రాసేయచ్చు...కాబట్టి మన తాళి జిగేల్ జిగేల్మని మెరుస్తూ బాగుంటే మన బట్టలూ బాగుంటాయి ,భర్తా బాగుంటాడు.. అర్ధం అయ్యిందా అని మరో గొప్ప విషయం చెప్పింది...


ఇదిలా ఉంటే మా ఆయనకో కంప్యూటర్  ఇన్సిట్యూట్ ఉండేది ... అప్పట్లో ఒక అమ్మాయి మానస అని  వచ్చేది.... ఆ అమ్మాయి వస్తే చాలు జనాలందరూ ఎక్కడిపనులు అక్కడ వదిలేసి మరీ ఆ అమ్మాయిని తొంగి తొంగి చూసేవారు.. ఎందుకంటే మరి ఆ రోజుల్లో రెండు కోట్లు కట్నం ఇచ్చి పెళ్ళిచేసుకుందంటే ఆ మాత్రం క్రేజ్ ఉంటుందికదా .. ఏదో సామేత చెప్పినట్లు "తా దూర కంతలేదుగాని మెడకో డోలు" అని నాకొకటి కంప్యూటర్ రాదుగాని ఈ పిల్లను నాకు అప్పచెప్పారు నేర్పించమని...నేను ఎంచక్కా నాకొచ్చిన గేంస్ అన్ని నేర్పించేసి..పెయింట్ బ్రష్లో ఎడాపెడా నాలుగు బొమ్మలు గీసి చూపించేసి  ఆ తరువాత ఎంచక్కా ఇద్దరం  అత్తవారింట్లో ఆరళ్ళ గురించి ముచ్చట్లు పెట్టుకునేవాళ్ళం .. 


ఆ అమ్మాయి ఎప్పుడూ రాత్రి ఎనిమిది గంటలకు వెళ్తూ వెళ్తూ మెట్లు ఎంత స్పీడ్గా దిగివెళ్ళేదో అంతే స్పీడ్గా పైకొచ్చేసి అమ్మో మర్చిపోయాను అని మెడలో మంగళ సూత్రం టక్కున తీసేసి బ్యాగ్లో  పడేసి  వెళ్ళేది..అలా చేసినప్పుడల్లా "అదేంటండి అలా తీయకూడదు కదా భర్త కు హాని చేసినట్లుకదా" అని బుగ్గలు నొక్కుకొనేదాన్ని... "మీరు భలే వాళ్ళండి భర్తను ఎక్కడన్నా వదిలేసి వచ్చినా సేఫ్గా ఇంటికొచ్చేస్తాడు..అదే బంగారం పోతే మళ్ళీ తిరిగి వస్తుందా ...అయినా భర్తను ఒక సారి పెళ్ళి చేసుకున్నాకా వేల్యూ తగ్గుతుందేమోగాని పెరుగదు కదండి.. అదే బంగారం అయితేనా పెరగడమే పెరగడం అందునా నా తాళి పది కాసులు పెట్టి చేయించారు ..మీరెన్నన్నా చెప్పండి భర్త కంటే తాళే గొప్పది " అని ఇంకో గొప్ప విషయాన్ని నాకు చెప్పి జ్ఞానోదయం కలిగించింది..

ఇక అన్నిటికంటే లాస్ట్ జ్ఞానోదయం మొన్న జరిగింది..మాకో బీరకాయ పీచు అత్తగారు ఉన్నారు ..మొన్న వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ఆవిడ హడావుడిగా ఎక్కడికో వెళుతూ కంగారు పడిపోతుంది.."ఏమిటి అత్తయ్య ఏమైనా హెల్ప్ కావాలా " అనగానే "ఓ ఫ్రెండ్ కూతురి పెళ్ళికి వెళ్ళాలి.. అన్ని నగలు సెలెక్ట్ చేసుకున్నా కాని తాళి బొట్టు ఏం సెలెక్ట్ చేసుకోవాలో తెలియడం లేదు అంది"...నేను విన్నది కరక్టేనా అని డవుటొచ్చి పక్కకు చూస్తే మంచం మీద ఒక అయిదారు మంగళ సూత్రాల సెట్టులు జిగేల్మంటూ కనిపించాయి...ఏంటి క్రింద  పడిపోయారా ...మరదే నేను ఈ మధ్య కాస్త ఇలాంటి వాటికి రాటుదేలాను లెండి అందుకే వెంటనే తేరుకున్నా..మూడు కాసుల నుండి పదిహేను కాసులవరకూ వివిద రకాల చైన్లతో ,మధ్య మధ్య రాళ్ళు పొదగబడిన పతకాలు కూర్చి జిగేల్మనిపించే సూత్రాలన్నమాట..


ఆగాండాగండి ఇప్పుడు మీరేం అనుకుంటున్నారో చెప్తాను..మరీ విడ్డూరం కాకపోతే ఇన్ని తాళి బొట్టులు చేయించడం ఏమిటి ..ఎక్స్ట్రాలు అనేకదా... ..తప్పుకదా ..పైన అన్ని ఉదాహరణలు ఇచ్చినా అలా నెగిటివ్గా ఆలోచిస్తారా..నా అనుభవాల దృష్యానేను దీనికి మీనింగ్ చెప్తాను..ఇప్పుడూ తాళి అంటే ఏమిటి ..భర్త ..భర్త అంటే తాళి ...ఎంత సేపూ మన సోకులకే గాని భర్తకి ఏమన్నా చేయిద్దామని ఆలోచన మన ఆడవాళ్ళకు ఏ కొసన అయినా వస్తుందా..అబ్బే ... అందుకే మన భర్త గౌరవం మన భాద్యత  కాబట్టి భర్తకు మనం ఏం చేసినా చెయ్యకపోయినా ఇలా తాళినన్నా రక రకాల మోడల్స్లో చేయించుకుని భర్త గౌరవాన్ని నలుగురిలో గొప్పగా చాటుదాం..
అదండి మగ మహారాజులు సంగతి..అందుకని తాళి కట్టడంతోనే మీ బాధ్యత అయిపోలేదు..మీ గౌరవాన్ని మేము నిలబెట్టేలా మీరు కృషి చేయాలి ..అది సంగతి ..ఏమంటారు లేడీస్ ...