27, మార్చి 2009, శుక్రవారం

ఉగాది శుభాకాంక్షలు చెప్పుకుందాం రండి




అందరికీ ఉగాది శుభాకాంక్షలు .. చిన్నప్పటి నుండి నాకు అర్దం కాని ప్రశ్న ఉగాది పచ్చడి మీద అన్ని కార్టూన్లు ఎందుకని ..ఉగాది అంటే నాకసలు పచ్చడివల్లే ఎంత ఇష్టమో .. నిజానికి మా ఇంట్లో అమ్మతప్ప అందరూ చేసేవారు ..ఇంట్లో చేసే అవకాశం పాపం అమ్మకు అసలు ఇచ్చేవారే కాదు .. ఎందుకంటే ఉదయమే దాదాపుగా 10 కుటుంబాలనుండి పదిరకాల పచ్చళ్లు వచ్చేసేవి మా ఇంటికి ..

అందరికంటే ఎక్కువగా పంపేవారు మా రాజు పెదనాన్న గారి కుటుంబం ..ఆయన అసలు పేరు ఠాగూర్ రాజు ..రాజు పెదనాన్న గారికి మా నాన్నమ్మ యశోదలాంటిది అన్నమాట.. చిన్నపుడు మా పెదనాన్న గారు చదివే స్కూల్ లోనే ఆయనా చదివేవారంట .. పాపం వేరే ఊరిలో నుండి వచ్చి ఇక్కడ చదవడానికి చాలా కష్టం గా ఉండేదని మా ఇంటిలోనే ఉండిచదువుకుంటా అన్నారంట .. అప్పటికే గంపెడు పిల్లలతో నెట్టుకొస్తున్న మద్యతరగతి కుటుంభానికి ..కలిగిన రాజుగారి అబ్బాయి ని పోషించడం మాటలు కాదు .. కాని అవి ఈనాటి రోజులా ?? అంతకన్నానా బాబు అని మా నాన్నమ్మ ఆయనను కూడా మా ఇంటిలోనే పెట్టుకుని కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకున్నారు .. ఆ రకంగా మా వాళ్ళకు ఆయన ఇంటికి పెద్ద అన్నయ్య అయిపోయారు ..


అప్పటి నుండి ఆయన తల్లిగారు బ్రతికున్నంత కాలం వారి ఇంటిలో ఏం పండగ వచ్చినా ముందు పిండి వంటలు మా ఇంటికే వచ్చేవి.. అబ్బ జున్ను పాలు,కొబ్బరి బొండాలు,పాలు,పెరుగు ,కూరగాయలు ఒక్కటికాదు తెగ పంపేవారు ఆవిడ ..నిజం గా రాజులంటే రాజులే అన్నంత అందం గా ఉండేవారు వారి కుటుంభంలో సభ్యులందరూ.. మా రాజు పెదనాన్న గారి ముగ్గురు కూతుర్లూ అందానికి అపరంజి బొమ్మలే .. వారి మాటలు, నడక భలే హుందాగా ఉండేవి .. ముట్టుకుంటే మాసిపోతారేమో అన్నంత అందం ..


ఆయనకు మా నాన్నమ్మ అంటే అపారమైన ప్రేమ ఉండేది.. తరచూ వారి పిల్లలతో ఇలా అనేవారు ..మా అమ్మ కూడా అంత బాగా చూడలేదేమో ..అలా చూసేది నన్ను ...తన పిల్లలకి పెరుగన్నం పెట్టి నాకు మాత్రం ఆంలెట్ ,కోడి కూరా వేసి పెట్టేది.. మళ్ళా ఏ రోజన్నా వండకపోతే తెగ అలిగే వాడిని.. అయినా కోపం తెచ్చుకోకుండా వండిపెట్టేది ... అని తెగ పొగిడేవారు ...అలాగే నాన్నను ,పెదనాన్నను మిగిలిన వాళ్ళను చూపి వీరురా నిజమైన అన్నదమ్ములంటే.. రాత్రిళ్ళు చలివేస్తే నాకు పరుచుకోడానికి, కప్పుకోడానికి మొత్తం దుప్పట్లు ఇచ్చి వాళ్ళు ఊరికే పడుకునేవారు .. అలా ఎప్పుడన్నా ఎక్కడన్నా చూసారా అని చెబుతుంటే చాలా గర్వంగా ఉండేది మా వాళ్ళను చూసి ..


ఆయన ఇంటినుండి వచ్చిన ఉగాది పచ్చడి తినకుండా మాకు ఉగాది ప్రారంభం అయ్యేది కాదు .. పెద్ద పెద్ద కేన్లతో ఇంటిల్లపాదికీ సరిపడేంత పంపేవారు .. బోలెడన్ని పిండి వంటలతో సహా ... అవి కాక మా పిన్నులు ,ఇరుగు పొరుగు కూడా తెగ పంపేవారు .. కాని ఈ పెద్దోళ్లు ఉంటారే ఏది ఇష్టమో అది మాత్రం వద్దు అనే చెబుతారు .. ఎక్కువ తినకు మంచిది కాదు ,ఎక్కువ తినకు మంచిది కాదు అని ఒకటే నస మా అమ్మ...

కాని అన్ని రోజులూ ఒకలాగే ఉండవుగా.. తప్పు ఎవరిదైతే నేమి, రాజు పెదనాన్న మా ఇంటి గుమ్మం తొక్కనని శపధం చేసి వెళ్ళి పోయారు ..ఆ తరువాత వారి పిల్లల పెళ్ళికి పిలవలేదు ..మా పెళ్ళిలకు వారూ రాలేదు ..కాని ప్రతి కార్తీక మాసం వారి పొలంలో జరిగే వనభోజనాలు ,వారి అమ్మగారి ఆప్యాయత అన్నీ మరిచిపోలేనివి ..అక్కడ నాన్న వాళ్ళు ఒక చోట అందరూ సరదాగా పేకాట ఆడుతుంటే ,అమ్మా వాళ్ళేమో చిన్న పిల్లల్లా పాటలు , ఆటలు ఆడేవారు.. పిల్లలం అందరం రకరకాల పువ్వులు ,ఆకులు ,గోరింటాకు కోసుకునేవాళ్ళం .. ఎంత బాగుండేదో ...కాని ఎంత పంతం అంటే ఆయనకు ... చివరకు నాన్నమ్మ చనిపోయినపుడు కూడా రాలేదు .. పాపం చివరి రోజుల్లో ఆయనను తలుచుకునేది తను..అప్పటి నుండి వద్దు అనుకున్నా ఆయన మీదకోపం వచ్చేది నాకు .. ఒకరిపైన కోపాన్ని ఇంటిల్లపాది పైనా ఎందుకు చూపారు .. నాన్నమ్మ కోసం అయినా రాలేదని..మొన్నామద్య మా పెదనాన్న గారు, నాన్న గారికి కనబడి చేసిన తప్పుకు బాధపడ్డారంట ...


ప్రొద్దున నుండి ఒకటే బాధగా అనిపించింది పాత రోజులన్నీ గుర్తువచ్చీ ..ఇక్కడికి వచ్చాక ఉగాది పచ్చడి లేదూ, ఆ సంభరమూ లేదూ.. వేప పువ్వు కొనాలంటే ఎక్కడికో వెళ్ళాలి .. పాపం ఆయన ఇంటికొచ్చే సరికి అర్దరాత్రి అయిపోతుంది ... వేప పువ్వు,మామిడి కాయ లేకుండా పచ్చడి చేసా గాని మొదటి సారి ఉగాది పచ్చడి మీద కార్టున్లు ఎందుకు వేస్తున్నారో నాకు అర్దం అయిపోయింది .. అసలే అత్తయ్య,అమ్మా అడుగుతారు పండగ ఎలా చేసుకున్నావు అని .. వేపపువ్వు కొనే తీరిక లేదని చెబితే అయిపోతాను..

ఇదిగో సరిగ్గా ఇప్పుడే పోన్ వచ్చింది పచ్చడి యే కాదు భోజనం తినడానికి కూడా వచ్చేయమని ఒక ఫ్రెండ్ ఆహ్వానం ...హమ్మయ్యా.. మరి మా వారికి చెప్పాలి ... చూసారా, కేవలం మీ అందరికీ శుభాకాంక్షలు చెబుదామని వస్తే ఏకంగా అదొక పోస్ట్ అయ్యి కూర్చుంది.. మరి నేను ఉగాది పచ్చడి తిని పండగ చేసుకుని వస్తా మరి .. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ...

10, మార్చి 2009, మంగళవారం

ఈ కధ కు శీర్షిక ఏమ్ పెట్టనబ్బా ??????



నా హైస్కూల్ చదువు గురించి ఆలోచించినట్లుగా నా పెళ్ళి గురించి కూడా ఆలోచించలేదు మా నాన్న గారు ..విషయమేమిటంటే మా తాత గారు ఇంట్లో ఆడపిల్లలను కో ఎడ్యుకేషన్ స్కూల్స్ కి పంపించడానికి లేదా దూరం గా ఉన్న స్కూల్స్ కి పంపడానికి అంతగా ఇష్టపడేవారు కాదు..పైకి అనకపోయినా మా నాన్నగారి అభిమతం కూడా అదే ..మా ఇంటికి కాస్త దగ్గరలో గర్ల్స్ హై స్కూల్స్ రెండు ఉన్నాయి ..ఒకటి సెంటాన్స్ హైస్కూల్ ,రెండోది మునిస్పల్ గర్ల్స్ హైస్కూల్ .. కాబట్టి ఈ రెండిటిలో ఏదో ఒకదానికి తప్పని సరిగా ఓటు వేయాల్సిందే ..

అయితే గవర్నమెంట్ స్కూల్స్ లో సరిగా చదువు చెప్పరు అని మా అక్కను సెంటాన్స్ లోనే జాయిన్ చేసారు.. ఏ మాటకామాట చెప్పుకోవాలి ఆ స్కూల్ చాలా విశాలంగా ,చక్కని వసతులతో ,మంచి క్రమశిక్షణ తో అంతా బాగుండేది కాని ,మత విషయం లో కాసింత ఎక్కువగా పిల్లలకు ప్రభువు గురించి చెప్పేవారనుకుంటా..ఆ ప్రభావం మా అక్క మీద బాగా పడిపోయింది ..మిగిలిన పిల్లలు బాగానే చదువుకుని ఇళ్ళకు వచ్చేవారు..ఇది మాత్రం ఇంట్లో కూడా ప్రొద్దున టిఫిన్ తినడానికి ముందు ,తరువాత,భోజనానికి ముందు, తరువాత పడుకోడానికి ముందు ,లేవగానే ఒకటే ప్రార్ధనలు చేసేది .. గాజులు వేసుకునేది కాదు,బొట్టు పెట్టుకునేది కాదు ..ఆఖరికి పండగలకు కూడా ..ఎందుకంటే అలెర్జిగా ఉంది అని సాకు చెప్పేది .. ఇంటికెవరన్నా వచ్చి ఏమ్మా నువ్వు చక్కగా పాడతావంట కదా ఒక పాట పాడమ్మా అనగానే ..నడిపించు నా నావా ..నడి సంద్రమునదేవ అని మొదలు పెట్టేది ..దానితో ఆ వచ్చేవాళ్ళు మా నాన్న వైపు దానివైపు అనుమానంగా మార్చి మార్చి చూసేవారు ..దానితో ఠారెత్తిపోయి మా నాన్న గారు తిడితే ఏడ్చుకుంటూ గదిలోకి వెళ్ళి మిస్సమ్మలో సావిత్రిలా తలపై ఒక ముసుగేసుకుని కరుణించు మేరి మాత పాట వింటూ మౌనంగా రోదించేది..

ఈ కారణాలవల్ల మా నాన్న గారు ..చదివే రాత వుంటే ఎక్కడన్నా చదువుతుందిలే అని నన్ను మున్సిపల్ స్కూల్ లో జాయిన్ చేసేస్తా అన్నారు..ఆ మాట వినగానే మా నాన్నకు చెప్పే ధైర్యం లేక అది నన్ను పక్కకు తీసుకు వెళ్ళి ఒకటే గొడవ .. నీకేమన్నా మతి పోయిందా.. పోయి పోయి ఆ చెత్త స్కూల్ లో జాయిన్ అవుతావా.. మా స్కూల్ ల్లో నుండి మొద్దులు అని తీసిపడేసిన జనాలందరూ అక్కడ జాయిన్ అవుతారే..అక్కడ చేరావో నువ్వూ కూడా ఒక మొద్దులా తయారవుతావ్.. నా మాట విని అక్కడ వద్దు అని నాన్నకు చెప్పేసేయి అని నస పెట్టేసేది .. కానీ మరేమో నేను మా అక్కకు టొటల్ గా వ్యతిరేఖం ..నా కెంత సేపూ పూల జడగుప్పెసుకుని,పట్టు పావడా వేసుకుని, కళ్ళకు కాటుకా, కాళ్ళకు పట్టీలతో చెంగు చెంగున లేడిపిల్లలా తిరగాలని మహా కోరిక .. వాళ్ళ స్కూల్ లో లా గంట గంటకూ ప్రేయర్ చేయడం నా వల్ల కాదు.. అందుకే నేను మా నాన్న పార్టీ లో చేరిపోయి గవర్నమెంట్ స్కూల్ లోనే జాయిన్ అయిపోయా..

ఆ స్కూల్ లో చేరగానే నా పరిస్థితి ఎలా ఉందంటే పంజరం లో ఉన్న చిలకను బయటకు వదిలినట్లే..మిగిలిన స్కూల్స్ ఎలా ఉంటాయో తెలుయదుగాని మా స్కూల్ మాత్రం అసలు సిసలు గవర్నమెంట్ స్కూల్ కి ప్రతీక లా ఉండేది.. ఒక యూనిఫాం వేసుకు తీరాలని రూల్ లేదు,టీచర్స్ సరిగా ఉండేవారు కాదు,ఉన్నా చాలా వరకు సరిగా చెప్పేవారు కాదు, 30 మంది పట్టె క్లాస్ లో 60 మందిని ఇరికించేసేవారు.. ఎంచక్క బోలెడు కబుర్లు చెప్పుకోవచ్చు ..చదివినా,మానినా అడిగే నాధుడు ఉండేవాడు కాదు .. కొంత మంది అయితే ఏకం గా గోరింటాకులు పెట్టుకొచ్చేసి వెనుక బెంచి లో కూర్చునేవాళ్ళూ.. ఇంకొందరు చక్కగా ఊలు బండిలూ తెచ్చుకుని స్వెటర్ లు గట్రా అల్లుకునేవారు.. నాకూ కూడా నేర్పమంటే నీకు నేర్పించే టైము లో 4 స్వెటర్లు అల్లుకోవచ్చు అని దొంగమొహాలు నేర్పించలేదు అది వేరే విషయం అనుకోండి.. ఇలా నా చదువు 6 మాటలు 3 ఆటలతో 10 వ తరగతి వరకు వచ్చేసింది..
అయితే ఆ స్కూల్ లో అందరూ ఆకతాయి ,మొద్దులు కాకుండా నాకులా కాసింత చదువుకునే పిల్లలు కూడా ఉండేవారు వారిలో స్వాతి ,సత్య వగైర వగైరా అందరం కలిసి ఒక బెంచిలో కూర్చునే వాళ్ళం .. ఎప్పుడూ సోది కబుర్లే కాకుండా అప్పుడప్పుడు అందరం చదువుకునే వాళ్ళం ..ఒకరి డవుట్లు మరొకరం తీర్చుకునేవాళ్ళం ,, మా టీచర్లు స్కూల్ లో అంటే సరిగా చెప్పేవారు కాదుగాని వారిదగ్గర ట్యూషన్ పెట్టించుకుంటే అరటిపండు వలిచీ పంచదార అద్దినంత బాగా చెప్పేవారు.. పిల్లలను ట్యుషన్ లకు రాబట్టడానికి అదొక టెక్నిక్ ..

అయితే మా వెనుక బెంచీలో నా వెనుక కూర్చూనేది కుసుమ.. ఈ కధలో వీరోయిన్ ఆవిడే మరి.. కుసుమ అంటే అందరికీ హడల్ ..ఎందుకంటే అది దాని కంచు కంఠం తో ఒకేసారి 10 మంది తో గొడవపడి గెలిచే గయ్యాళీ పిల్ల .. దాని నోరుకి భయపడి ఎవరూ దాని జోలికి వెళ్ళేవారు కాదు..చదవడం మినహా దానికి అన్నీవచ్చు.. స్కూల్ ఎగ్గొట్టిసినిమాలు, షికార్లూ,ఆ వయసులోనే దానికో బోయ్ ఫ్రెండ్ ..మళ్ళీ వాడి మంచికోసం పూజలూ ..మొక్కులూ..ప్రదిక్షణాలు..ఉపవాసాలు..ఇలా అన్నమాట ..మరి నా ఖర్మ కాలో,పండో తెలియదు గాని దానికి నేను అంటే మహా ఇష్టం.. నన్ను మాత్రం ఏమీ అనేది కాదు..ఎదో ఒక సోది చెబుతునే ఉండేది.. కానీ పరిక్షలొచ్చాయంటే నా వెనుకనే పడేది.. ఇంక ఇస్స్ ,,ఇస్స్ అంటూ చూపించమని ఒకటే సౌండ్స్ చేస్తూ హింస హింస పెట్టెసేది.. నేను ఎలాంటిదాన్ని అంటే రాసే టైములో ఆకు కదిలిన చప్పుడువిన్నా.. ఏం రాయలేను.. మహ చిరాకు వస్తుంది..నోరుముయ్యి వెధవ సౌండ్స్ చేసావంటే చంపేస్తా అని తిట్టానో ..ఇంక మొదలు పెట్టేసేది ..అది కాదే నిన్న ఏమైందో తెలుసా మా అమ్మగారికి ఒంట్లో బాలేదు .. మొత్తం పని అంతా నేనే చేసాను.. నీకు తెలుసు కదా మా వీదిలో ఒకటే కుళాయి .. అక్కడి నుండి నీళ్ళు పట్టుకుని మెట్లు ఎక్కి ఇంటిల్లపాదికీ నీళ్ళు తెచ్చేసరికి ఎంత అలసిపోయానో తెలుసా అంటూ మొత్తం వర్ణించి వర్ణించి ఒక సెంటిమెంట్ సినిమా చూపించేసేది.. ఇలా మొత్తానికి ఎలాగయితేనో సాధించి చూసి రాసేసేది..

ఒక సారి మా హేడ్మాస్టర్ మన స్కూల్ కి కొత్త సైన్స్ టీచర్ వచ్చారని చెప్పీ ఒక ఆమెను పరిచయం చేసారు.. ఆమె బాగా పొట్టిగా తెల్లగా ఉన్నారు.. ఆవిడను చూడగానే కొందరు పక్కున నవ్వితే ఇంకొందరు పెదాల చాటున నవ్వును దాచుకున్నారు.. ఆవిడ అదేం పట్టనట్లుగా సీరియస్సుగా లెస్సెన్ చెప్పడం మొదలు పెట్టారు.. ఇంక వెనుక నుండి కుసుమ గొడవ స్టార్ట్ అయింది నాకు..ఏమే అడ్డుగా ఉండవా భయం గా ఉంది.... అడ్డుగా ఉండవా ఆవిడ చూస్తుంది అని నా వెనుక దాక్కుంటూ గోల గోల..నాకేమో చక్కిలి గింతలు వచ్చేసి కోపం వచ్చేస్తుంది.. యెహే.. వెధవ ఓవెర్ ఏక్షన్ చేయకు.. ఆవిడను చూసి నువ్వెందుకు భయపడటం అని ఒక్క గసురు గసిరాను చిరాకుతో .. ఆవిడ మా గుసగుసలకు వెనుకకు తిరిగి ఏమిటి మీరు సరిగా కూర్చోలేరా అని తిట్టి మళ్ళీ పాఠం మొదలు పెట్టింది.. ఆవిడ వెళ్ళేవరకు ఓపిక పట్టి కయ్యిమని లేచాను కుసుమ మీద.. అప్పుడు తాపీగా చెబుతుంది. అదికాదే ఈవిడ మొన్నే మా వీదిలోకి కొత్తగా అద్దెకు వచ్చారు .. కుళాయిదగ్గర నా వంతు అవ్వకుండానే ఆవిడ బిందె పెట్టింది.. నాకేం తెలుసూ ఆవిడే మనకి సైన్స్ టీచరుగా వస్తుంది అని.. అసలే చిరాకుగా ఉన్నాను ఆ బిందే ఎత్తి గిరాటేసి నాలుగు తిట్ట్లు తిట్టాను అందుకే కాసింత భయం వేసింది అంది .. నా..లు....గు తిట్లా ఏం తిట్టావ్ అన్నాను నోరు తడి ఆరిపోతుంటే .. అదే..ఏమన్నానబ్బా ..అని ఆలోచించి ..ఏమే పొట్టిదానా భూమికి జానెడు లేవు.. మద్యలో వచ్చావంటే బిందెతో పాటు నిన్నూ గిరాటేస్తాను అని అది ఇంకా చెప్ప బోతుండగా .. ఇంకా ఆపవే తల్లోయ్ .. నీ ఎంకమ్మా నువ్వు ఇలా తగులుకున్నావేంటే బాబు నాకు .. మొదటి రోజే నీతో చూసి నా మీద చెడ్డ అభిప్రాయాని కొచ్చేసి ఉంటుంది ఆవిడ ..ఇంక నీతో పాటు నేను ప్రతి చిన్న దానికి చీవాట్లు తినాలి అని తెగ బాధ పడిపోయాను..

అయితే నేను అనుకున్నట్లుగా ఆవిడ నన్ను ఎప్పుడూ తిట్టలేదు ...ఆ మాట కొస్తే కుసుమనూ ఏమీ అనలేదు..ఆ కారణం చేతనో మరి పాఠాలు బాగ చెప్పడం వల్లనో తెలియదుకాని ఆమే అంటే నాకు చాలా గౌరవం ఉండేది ... ఒక సారి క్వాటర్లీ పరిక్షలు వచ్చాయి .. ఆ రోజు సైన్స్ .. నేను చక చక రాసుకుంటున్నాను.. కుసుమ యధావిధిగా చూసి కాపి కొడుతుంది..నేను పేపర్ అంతా అయిపోగానే ఇంక సార్ కి ఇచ్చేద్దామని లేవ బోతుండగా ఏమే ప్లీజే ప్లీజే నేను సరిగా రాయలేదు నువ్వు టక టకా రాసేసావు ఆ లాస్ట్ ప్రశ్నకు జవాబు చెప్పవా అని నస ..ఆ ప్రశ్న ఏంటంటే మొక్కలకు నీరూ ,గాలి కావాలని ప్రయోగత్మకం గా వివరింపుము..ఇంక దీని బాధ పడలేక దాని ప్రశ్నా పత్రం తీసుకుని ఇలా రాసాను... అదేనే ఒక బీకరు తీసుకుని దానిలో ఒక పుల్ల కు మూడు విత్తనాలు కట్టి ఏడుస్తాం కదా ఒకటి నిండాగా మునుగుతుంది... ఒకటి గాలి లో ఉంటుంది... మద్యలోది గాలి నీరు తగిలేట్టుగా పెడతాం..అదే పెరుగుతుంది అది రాసి పడేయ్ అని రాసి దాని చేతికి ఇచ్చేసి వచ్చేసా..

ఆ తరువాతా మా సైన్స్ మేడం మార్క్స్ చెబుతూ క్లాస్లో ఒకరు చూసికాపీ కొట్టారు.. చూడటం ఎంత నేరమో దానికి సహకరించినవాళ్ళది కూడా అంతే నేరం కాబట్టి ఇద్దరు లేచి నిలబడండి.. అన్నారు.. నాకు గుండేల్లో రాయిపడింది .. అయినా బింకం గా ఆ రోజు నేను ఈవిడ క్లాసులో పడలేదు కదా నేను కాదులే అనుకున్నాను.. ఇంక లాభం లేదనుకున్నట్లు ఉన్నారు ఆవిడ ..కుసుమా లేచి నిలబడు నీకెవరు చూపారు చెప్పు అన్నారు.. ఎలా తెలిసింది ఈవిడకు అనుకుంటూ తప్పక లేచి నిలబడ్డాను ..ఆవిడ నన్ను చూసి ఏమనుకున్నారో సరే ఇంకెప్పుడూ ఇలా చేయకు అనేసి ఏ అమ్మాయ్ ఏంటి ఈ రాయడం అని పేపర్ ఇచ్చారు.. తీరా దాని పేపర్ చూద్దును కదా .. దానిలో నేను ఏమిరాసానో అదే మక్కీకి మక్కీ రాసేసింది.. విత్తనాలు కట్టి ఏడు ..అలా రాసి పడేయ్ వగైరాలన్నమాటా.. నాకు అది చూడగానే కళ్ళు అంటుకిపోయాయి.. ఏమే నువ్వు పనికి మాలినదానివని తెలుసుగాని ఈ రేంజ్ లో అనుకోలేదు ... నీకో నమస్కారమే బాబు అని దణ్ణం పెట్టేసా..

ఈ లోపల పబ్లిక్ ఎక్జాంస్ రానే వచ్చాయి.. అందరికీ టెన్షన్ యే .. రాత్రీ పగళ్ళు కష్ట పడి చదువుతున్నాం .. రేపు ఎక్జాం అనగానే ఈ రోజు రాత్రి నాకు మా అక్క హిత బోధ మొదలెట్టింది.. పబ్లిక్ పరిక్షలు అంటే ఏమనుకున్నావ్ .. మీ స్కూల్ లో రాసినట్లు అల్లాటప్పా గా ఉండవు.. ఏ మాత్రం చూపు తిప్పినా మాట్లాడినా పేపర్ లాగేసుకుంటారు.. ఎవరి స్లిప్ అన్నా పొరపాటున నీ బెంచ్ క్రింద కనబడినా డిబార్ చేసేస్తారు .. అని భయపెట్టెయడం మొదలెట్టింది.. నువ్వు ఆగవే బాబు అసలే టేన్షన్ తో ఏడుస్తుంటే అని విసుక్కున్నా ...

ఎక్జాం హాల్ చూడగానే ఏదో భయం.. అసలే కొత్త స్కూల్ కొత్త ప్లేస్ ఇంకా వేరే స్కూల్ పిల్లలు ,టీచర్లూ అని కంగారుపడుతుంటే యదావిదిగా నా వెనక నెంబరే వచ్చి హాయ్ అంది కుసుమ నవ్వుతూ .. అయిపోయానురా దేవుడో అనుకుని అయినా బింకంగా ఇదిగో రాసేటప్పూడు గాని విసిగించావో అయిపోయావే ... నీ పాట్లేవో నువ్వు పడు.. పిచ్చి కహానీలు చెప్పకు .. ఎక్కువ చేస్తే సార్ కి చెబుతా డిబార్ చేసి పడేస్తారు అని బెదిరించాను.. ఈ లోపల పరీక్ష మొదలైంది ..ఎన్ని చెప్పినా అది మళ్ళీ మొదలు పెట్టింది ప్లీజ్ వే అనుకుంటూ ..ఈ లోపల ఎవరో వచ్చీ గుమ్మం దగ్గర సార్ తో ఏదో మాట్లాడుతున్నారు.. దీని నస భరించలేక మెల్లిగా లేచాను సార్ అంటూ .. ఆయన లోపలకు వచ్చి నన్ను ఆగు అన్నట్లుగా సైగ చేసి ఓరే ఎస్.ఆంజనేయులు ఎవరురా అన్నారు.. ఒక అబ్బాయి లేచి నేనే సార్ అన్నాడు .. అతని దగ్గరకు వచ్చీ సరే ఇది రాయి అని అతనికో చిన్న పేపర్ ఇచ్చీ ఆ చెప్పమ్మా ఏంటి అన్నాడు నా వైపు చూస్తూ ...నాకు నోట మాట రాలేదు అంత పబ్లిక్ గా అతనికి సార్ నే స్లిప్ లు అందించడం చూసి .. అయినా తమాయించుకుని సార్.. ఈ అమ్మాయి ..మరేమో .. డిస్టర్బ్ చేస్తుంది అన్నాను నసుగుతూ .. మా కుసుమ సార్ని చూడగానే టప టపా రెండు కన్నీళ్ళ చుక్కలు కార్చీ మరేమో సార్ నిన్న అంతా జ్వరం అంటుండగానే ఆయన ఆపమన్నట్లు సైగ చేసి ఏమ్మా మీ ఫ్రెండేగా మళ్ళీ ఈ పరిక్షలయ్యాకా కలుసుకుంటారా ,పాపం కొంచం హెల్ప్ చేయండీ మరీ అంత స్వార్దం కూడదు.. అని తిరిగి నాకే చీవాట్లు.. అసలే టైం అయిపోతుంది .. తిట్టుకుంటూ కూర్చున్నా .. ఈలోపల సార్ ఆంజనేయుల వైపు చూసి ఏంట్రా నేను భిట్ పేపర్ ఇస్తే కొచ్చన్ పేపర్ లో ఎక్కించేస్తున్నావ్..అని పక్కన ఉన్న మరో మాస్టార్ తో చూసారా మాస్టారు ఇలా చదువుతున్నారు వీళ్ళు. వీళ్ళ నాన్న ఏమో ఎలాగన్నా పాస్ చేయించేమంటారు ఎలా చచ్చేది అన్నారు విసుక్కుంటూ .. మా దెయ్యం లాగే మహ పండితుడు అని తిట్టుకుంటూ పరిక్ష రాయడం లో పడిపోయాను ..

మొత్తానికి లెక్కల పరిక్ష వచ్చేసింది ..ఆంజనేయులకు మాత్రం అన్ని ఎక్జాంస్ లోనూ ఠంచనుగా స్లిప్ లు అందుతున్నాయి.. నాకు లెక్కలంటే మహ వణుకు.. ఏదో కష్టపడి రాస్తుంటే వెనుక నుండి అబ్బా సరిగా కనిపించడంలేదు .. కాస్త పక్కకు పెట్టి రాయి అని ఇది దిక్కుమాలిన డైరెక్షనులు ఇస్తుంది .. కాసేపటికి దానికి చిరాకు వచ్చేసి ఇలా కాదు గాని ఆ రాసిన పేపర్ ఇలా ఇచ్చెసేయి నేను ఎక్కించుకున్నాక నీకు ఇస్తా అంది తాపీగా.. నాకు తిక్క నషాళానికి అంటింది.. మొన్న అంటే ఒక చెత్త మాస్టర్ వచ్చారు.. అందరూ అలా ఉండరుగా అనుకుని విసురుగా లేవబోయాను.. ఈ లోపల మొదటి ఎక్జాం అప్పుడు వచ్చిన సార్ వచ్చారు ..ఈయన ఎవరురా బాబు నా ప్రాణానికి సరిగ్గా సమయానికి వస్తాడు అనుకున్నాను.. ఈ లోపల ఆయన మా క్లాస్ సార్ తో ఏదో మాట్లాడి ఎస్.ఆంజనేయులు ఒకాసారి లే అన్నారు ..ఆ అబ్బాయి లేచాడు .. ఏరా బాగానే రాసావు కదరా ఇంటిదగ్గర మీ నాన్నకు ఏమీ హెల్ప్ చేయలేదన్నావంట కదా అన్నారు కోపంగా.. ఆ పక్కన ప్యూన్ అనుకూంటా ఇతను కాదు సార్ ఆ అబ్బాయి అని మూలన బిక్కు బిక్కు మని చూస్తున్న మరో అబ్బాయిని చూసి ఈ అబ్బాయి నాన్న సార్ మొన్న వచ్చింది అన్నాడు .. అతని ని లేపి ఏరా నీ పేరు ఏమిటీ అనగానే ఎస్.ఆంజనేయులు అన్నాడు భయం భయం గా .. మరి ఇన్నాళ్ళు ఏం చెసావురా .. ఇదిగో అండీ ఇలా ఉంటారు అయోమయాలు .. అనుకుని గొణుక్కుని వెళ్ళీపోయాడు ... మా సార్ నా వైపు చూస్తూ ఏంటమ్మా అన్నారు.. దెబ్బకి నాకు ఏమనాలో తోచక మంచినీళ్ళు సార్ అని తప్పించుకున్నాను.. ఎలా అయితేనో మొత్తానికి ఎక్జాంస్ రాసా అనిపించి చివరకు ఫస్ట్ క్లాస్ కొట్టేసాను ..

చాలా నాళ్ళ తరువాత మా చదువులు పూర్తి అయ్యాక ఒక సారి ఆంజనేయ స్వామిగుడి దగ్గర కనబడింది కుసుమ ... చాలా ఆనందం వేసింది.. నువ్వేనా ..ఇలా చిక్కి పోయావ్ ఏమిటి..ఎలా ఉన్నావ్ అంటూ అని తెగ సంతోషం పడిపోయింది.. అది సరే గాని ఏమి చేస్తున్నావ్..ఇంతకీ నీ హీరో ని పెళ్ళి చేసుకున్నావా అన్నాను.. సామాన్యం గా అలాంటి పిచ్చి ప్రేమలు సక్సెస్ కావని నాకు తెలుసు ..ఏం చెప్పమంటావే ..మా చెల్లీ వాడు నన్నూ మోసం చేసారు ... ఇద్దరూ ఒకరోజు ఇంట్లోంచి పారిపోయి పెళ్ళి చేసుకున్నారు అని బాంబ్ పేల్చింది.. ఇద్దరూ చనువుగా మాట్లాడుకుంటుంటే మా చెల్లే కదా అనుకున్నాను ఇలా చేస్తుంది అనుకోలేదు అంది నీరసంగా మొహం పెట్టి.. కాని నాకు అప్పట్లోనె డౌటొచ్చింది అది చెప్పే మాటలు బట్టి.. సరేలే అలాంటి వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోకు ..ఇంతకూ నువ్వేం చేస్తున్నావ్ అన్నాను అనునయంగా ..బాగా పేద కుటుంభం వారిది మరి.. పాపం వాళ్ళకు ఇంత కాలం అయినా పిల్లలు పుట్టలేదే అందుకే 108 ప్రదిక్షణాలు చేస్తాను అని మొక్కుకున్నా అంది పేపర్ పెన్ పట్టుకుని చూపిస్తూ ....ఎందుకో నాకా సమయం లో దాని మీద జాలి కాదు నాలుగు తన్నాలనిపించింది ...