28, మే 2020, గురువారం

కరోనా

ఓసారి జపాన్‌లో సునామి వస్తే దాని ఎఫెక్ట్ సింగపూర్ మీద  పడుతుందేమో అని నెలకు సరిపడా సరుకులు కొనేసిన ఘన చరిత్ర నాది.. అటువంటిది ఊహాన్‌లో వైరస్ గురించి వినగానే ఊరుకుంటానా... ఎందుకైనా మంచిది అని ఫిబ్రవరిలోనే మూడు నెలలకు సరిపడా సరుకులు కొనేసి ఇంట్లో పెట్టేసా..

సార్స్, మెర్స్ గురించి తెలిసినా
 పెద్దగా పట్టించుకోలేదుగాని ఈ కోవిడ్ విషయంలో ఎందుకో నా కుడికన్ను అదురుతూనే ఉంది..అదే సమయంలో ట్రంప్ ఇండియాకి రావడం... ఓ కోటిమంది నా సభకి రావాలని జోకులాంటి ఆర్డర్ వెయ్యడం.. మోదీ గారు వెంటనే వాకే అని జనాలను తోలుకొచినప్పుడే మా కుటుంభ సభ్యులందరికి కాల్ చేసి చెప్పా... నాన్నా మందులు గట్రా ముందే కొనుక్కు పెట్టుకోండి.. వంట సామాను నెలకు సరిపడా కొనుక్కోండి అని.. విన్నారా.. ఊహు.. నువ్వూ నీ ఎదవ చాదస్తం అని తిట్టారు.. ఏమైంది.. చివరకి కోవిడ్ వచ్చి మన పక్కన సెటిల్ అయ్యింది.. అందుకే నాలాంటి కాలజ్ఞానులను తక్కువ అంచనా వేయకూడదు..

ఉన్నట్లుండి మోదీగారు మంచి ముహూర్తం చూసి జనతాకర్ఫ్యూ అన్నారు...ఆ దెబ్బతో వైరస్ చైన్ లింకులు ఎక్కడివక్కడే విడిపోయి, మరసటి రోజునుండి కరోనా ఫ్రీ భారత్ అయిపోతుందని జనాలు ఎక్కడి దొంగలు అక్కడే గప్ చిప్ అని ఇళ్ళల్లో గడియలేసుకు కూర్చున్నారు..
 కొంపలో గంట సేపు ఉంటే ఓవెన్ లో పాప్ కార్న్ లా ఎగెరెగిరి పడే మా ఆయన కూడా కరోనా నుండి దేశాన్ని రక్షించడానికి కంకణం కట్టుకుని టి.వి ముందు సెటిలయ్యారు.. ఆ సమయంలోనే భయంకరమైన నిజం ఒకటి తెలిసింది... నిమిషం కూడా ఇంట్లో ఉండనివ్వరు ఈ మనిషిని అని రోజంతా నా శాపానార్ధాలకు భలయ్యే ఆయన ఫ్రెండ్స్ నాకు ఎంత మేలు చేస్తున్నారో అని..

బుజ్జి..మజ్జిగ... గ్రీన్ టీ.. కాస్త పకోడి చెయ్యకూడదూ.. బ్లాక్ టీ.. మళ్ళీ మజ్జిగ.. చల్లగా నిమ్మరసం... ఆ లిస్ట్ కి అంతూ పొంతూ లేదు.. ఇక మీదట ఆయన ఫ్రెండ్స్‌ని తిట్టకూడదని ఒట్టెట్టుకున్నాను.. సాయంత్రం కాగానే జనాలందరూ వీదుల్లోకొచ్చేసి ప్లేట్లు ,గరిటలు, గంటలు, డప్పులు దొరికింది దొరికినట్లుగా  వాయించేసి చప్పట్లు కొట్టేసాం.. ఎవరెవరు ఏ వస్తువులు వాయించారో అవే వస్తువులతో మాడు పగలగొట్టీ మరీ చెప్పారు మోడీ గారు లా..క్.. డౌ.. న్ అని..

ఈ విషయం తెలియగానే ఫస్ట్ వచ్చిన ఫోన్ కాల్ మా అబ్బాయి కాలేజ్ నుండి.. మేడం ఈ రోజునుండి.. బాబుకి ఆన్ లైన్ క్లాసెస్.. అప్పుడప్పుడూ కాల్ చేస్తాం ఏమనుకోకండి అన్నాడు.. మాటవరసకు అప్పుడప్పుడు అన్నాడుగాని ...ఎప్పుడూ చేస్తూఉంటాడని ఆ తర్వాతే తెలిసింది.. మీ అబ్బాయి నిద్రలేచాడా?.. ఇంకా క్లాస్ కి రాలేదేంటి.?. స్క్రీన్ మీద బాబు పేరు కనిపించట్లేదేంటి?... అందరూ ఊ కొడుతుంటే మీ వాడు అనట్లేదేంటి?.....వీడు నన్నే ఇలా తినేస్తున్నాడంటే పిల్లాడిని ఏ రేంజ్ లో వేపుకు తింటున్నాడో అని జాలేస్తూ ఉంటుంది నాకు..

మా ఆయన సంగతి చెప్పే అక్కరలేదు.. దాహంతో ఉన్న కాకి గులకరాళ్ళు కుండలో వేయడానికి దీక్షగా  గల్లీ ,గల్లీ తిరిగినట్లు ఊరంతా తిరగడమే..ఏమన్నా అంటే చూడు బుజ్జీ ఇది ఇప్పుడప్పుడే తీరేదికాదు.ముందు ,ముందు మనం కరోనాతో సహజీవనం చెయ్యాల్సిందే అని జగనన్న కంటే ముందే చెప్పేసారు నాకు..

 ఇలాంటి సమయాల్లోనే ఇంట్లో పంపు లీక్ అయిపోద్ది..వాషింగ్ మిషన్ పాడైపోతుంది.. సింకు దగ్గర ఏదో అడ్డుకుని వాటర్ స్ట్రక్కయిపోతుంది.. కుంచమంత కూతురుంటే మంచం దిగక్కరలేదని సామెత..అదెంత వరకూ నిజమో తెలియదుగాని కొడుకుంటే మాత్రం తల్లికి చేదోడు వాదోడమ్మా.. మా అబ్బాయి రెంచు.. స్క్రూ డ్రైవర్ పట్టుకుని నన్ను గండం నుండి బయట పడేస్తూ ఉంటాడు..

ఇదిలా ఉంటే అప్పటి వరకూ ఏ కలుగుల్లో వుంటారో ఎక్కడెక్కడి ఫ్రెండ్స్ బంధువులు అందరూ బయటికొచ్చేసి ప్రొద్దున లేచేసరికి పాతిక గ్రూపుల్లో నన్ను ఏడ్ చేసి ఒకటే మెసేజ్‌లు..ఇంతా చేసి అవి ఏం మెసేజ్ లయ్యా అంటే.. నేను ఈ వంట వండాను.. అని నాలుగు రకాల వంటల పోస్ట్‌లు ఒకరు పంపితే.. ఓస్ నువ్వు అవి వండావా నేను అయితే ఇవి వండాను అని ఇంకొకరు ఆరు రకాల వంటలు... వీళ్ళు ఇలా పోటీలు పడి వండేస్తుంటే మగాళ్ళందరూ సరుకుల కోసం సంచులు పట్టుకుని ఊరిమీద తిరగడం..ప్రతి మార్కెట్‌ని కోడంబాకం మార్కెట్లా తయారు చెయ్యడం..  కరోనా కేసులు పెరుగుతున్నాయి అంటే పెరగవూ మరి...

వీళ్ళందరిదీ ఒక గోల అంటే నా కూతురు మరీ స్పెషలు...గబుక్కున వచ్చి బుగ్గ మీద ముద్దు పెట్టి ఐ లవ్యూ మమ్మీ.. అనగానే పుత్రికోత్సాహంతో నేను దగ్గరికి తీసుకోబోతుండగానే.." సెల్ఫీ "అని క్లిక్ మనిపిస్తుంది.. ఏంటే అదీ అంటే.... మరీ దీప్తీ వాళ్ళ డాడీతో ఫొటో తీయించుకుని పంపింది మరి నేను నీతో తీసి పంపద్దా.. ఈ రోజు ఏంవండావ్.. ఛీ...  బీరకాయా..నా ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీలు ఎన్ని మంచి వంటలు వండుతారో.. అని మొహం ముడుచుకుంది..వంటల ఫొటోలేగా..  కావలసినన్ని నీకు ఫార్వర్డ్ చేస్తా..... హేపీగా మీ ఫ్రెండ్స్‌కి పంపేసుకో అన్నాను..  అబద్దం ఆడమంటావా గొప్ప ఆశ్చర్యంగా ఫేసుపెట్టింది.. వాళ్ళు చేసేపని కూడా అదేనమ్మా...ఈ ఎండల్లో వంటలు చేయడం కూడాను విసుక్కున్నా..జనాలకు మరీ ఖాళీ ఎక్కువైపోతుంది..

బాల్కానీనుండి బయటకు చూద్దునుకదా.. జనాలు విచ్చల విడిగా తిరుగుతున్నారు.. ఒక్కళ్ళ ఫేసుకు మాస్కు ఉంటే ఒట్టు..అంటే కర్చీఫ్ లాంటిది కడతారు కాని అది మెడలో ఉంటుంది.. మూతి మీద ఉండదు. ఏ పోలీసో అటు వస్తుంటే గబుక్కున పైకి లాగుతారన్నమాట..అప్పటికీ అన్ని టీవి చానల్స్ లో మొత్తుకుంటూనే ఉంటారు.. అయినా వీళ్ళకు అర్దంకాదు..

ఇది ఇలా ఉండగా ఒక శుభముహుర్తాన  మా ఇల్లు రెడ్ జోన్ పరిధిలోకి వచ్చేసింది...ఇంకేంటి బయటకు వెళ్ళడం పూర్తిగా బంద్... కొంత విసుగన్నమాటేగాని రెడ్ జోన్ వల్ల బోలెడు లాభాలండి.. అయినదానికి ,కానిదానికి ఊరిమీద కాలుగాలిన పిల్లుల్లా తిరిగే మా ఆయన లాంటోళ్ళను  ఇంట్లో కట్టేయచ్చు.. పోలీసులు నిరంతర  కాపల వల్ల దొంగల భయం ఉండదు.. ..కూరగాయలు పాలు పెరుగు ఫ్రీగా పంచే రాజకీయ నాయకులు...అసలా లెక్కేవేరు..

ఓ అర్దరాత్రి 12 కి మా వాచ్మెన్ నుండి ఫోన్ కాల్.. మేడంగారు మీరు అర్జెంట్‌గా క్రిందకు రావాలి.. ఎందుకు అన్నాను అయోమయంగా.. మా ఆవిడకి కడుపునెప్పి మీరు వచ్చి వోదార్చండి.. కడుపు నెప్పి వస్తే టేబ్లెట్ వెయ్యాలిగాని ఓదార్చడం ఏంటి ?నేను ఆలోచనలో పడగానే తొందరగా రండి బాబోయ్ అని ఒక్క అరుపు అరిచాడు.. నేను ఉలిక్కి పడి గబుక్కున టేబ్లెట్ తీసుకుని నైటీ లోనే క్రిందకు దిగిపోయా..

లిఫ్ట్ ఎదురుగా వెనుక చేతులు కట్టుకుని అటు ఇటు పచార్లు చేస్తూ మా వాచ్మెన్  నన్ను చూడగానే ... ఇంక ఏడుపు ఆపు.. మేడంకు నీ బాధలన్ని చెప్పు ఓదారుస్తారు అన్నాడు భారంగా నిట్టూర్చి.. ఈ ఓదార్పు గోలేంటిరా నాయనా అనుకుని ఏమయ్యింది.. ఎందుకు కడుపు నెప్పి.. 'డేటా' అన్నాను అనుమానంగా.. ఉహు అంది ఎర్రని కళ్ళను తుడుచుకుంటూ.. బయట ఫుడ్ ఏమన్నా తిన్నావా అరగలేదేమో.. ఫుడ్ పోయిజన్ అయిందేమో అన్నాను ఇంకేం కారణాలు అయి ఉంటాయో అని ఆలోచిస్తూ..

ఇప్పుడు బయట ఫుడ్ ఎక్కడ దొరుకుతుందండీ అది గ్యాస్ నెప్పి..రెండు రోజులనుండి అన్నం తినట్లేదు
.. టేబ్లెట్ వేసా ఇప్పుడే అన్నాడు.. మరి ఆ మాత్రం దానికి నన్ను ఎందుకు పిలిచావు అన్నాను అయోమయంగా.. అబ్బా.. అది కాదండి.. మన అపార్ట్మెంట్ ఎదురు ఇంటిలో కరోనా పోజిటివ్ వచ్చింది కదండీ.. వాళ్ళ ఇంట్లో పిల్లలతో మావోడు రోజూ ఆడేవాడు..తల్లి మనసు కదండీ వాడికెక్కడ అంటుకుంటుందో అని ఈవిడ రెండురోజులనుండి అన్నం తినట్లేదు.. మీరు బాగా మాట్లాడతారని దాని నమ్మకం కొంచెం ఓదార్చండి అన్నాడు సీరియస్సుగా..

నేను ఒక్క గెంతు గెంతా వెనక్కి. ఓరి దుర్మార్గుడా కంగారులో మాస్కు పెట్టుకోలేదు.. చున్నీ కూడా లేదు... ఎలా ఉన్నదాన్ని అలా వచ్చేసా అనుకుని.. మరి మొన్న జనాలను క్వారంటైన్ తీసుకు వెళ్ళారుగా వాళ్ళకు చెప్పలేదా నువ్వు ఈ విషయం అన్నాను భయంగా... చెప్పానండి.. అరె  ..టెస్టులు చేసేవరకు నువ్వు హోం క్వారంటైన్లో ఉండాలి ఎక్కడికి వెళ్ళొద్దు అన్నారండి..అందుకేగదండి నేను రాకుండా మిమ్మల్ని పిలిచా ఇక్కడికి అన్నాడు.. ఓరిబాబు క్వారంటైన్ అంటే మేము కూడా నీదగ్గరకు రాకూడదు.. సరే భయపడకండి.. ఏం రాదులే అని ఆ అమ్మాయికి రెండు ముక్కలు ధైర్యం చెప్పి ఇంటి కొచ్చేసా...

ఆ ప్రొద్దున్నే మళ్ళీ ఫోన్.. ఏంటి ?అన్నాను.. ఓ పాలి సార్ గారిని పిలుస్తారా అండి అన్నాడు.. దేనికీ? అన్నాను. కొబ్బరాకులుకావాలండి...అన్నాడు.కొబ్బరాకులా!! అవెందుకు? అన్నాను అయోమయంగా.. పిల్ల పెద్దది అయ్యిందండి అన్నాడు ముసి ముసి నవ్వులు నవ్వుతూ... ఇష్హ్.. అదికాదయ్యా ఇప్పుడు ఈ క్వారంటైన్ లో అవసరం అంటావా!! ఏదో ఇంట్లో ఉన్న చాప తో సరిపెట్టెసుకోరాదు అన్నాను.. అయ్యబాబోయ్ శాస్త్రం ఒప్పుకోదండి కొబ్బరాకుల మీదే కూర్చోబెట్టాలి... అన్నాడు మొండిగా.. ఐతే ప్రెసిడెంట్‌ని అడుగు మా ఆయన్ని కాదు అన్నాను కోపంగా... అంతే లేండి.. మీ పాప పెద్దది అయినప్పుడు నా చేతే తెప్పించారు గుర్తుందా.. అవన్ని మర్చిపోయారు..మీకేం మీ పిల్ల గట్టేక్కేసింది.. మేము పేదోళ్ళం కదండి..పెద్దోళ్ళు మీరు సాయం చెయ్యడానికి ఎనకాడితే ఎలాగండి ఒక్కగానొక్క కూతురు.. .అంటూ సెంటిమెంట్‌తో చావగొడుతుంటే ...అది కాదు..ఇప్పుడు రెడ్ జోన్ కదా ..బయటకు పంపరు కదా అన్నాను అనునయంగా..నాకు తెలియదేటండి.. నిన్న మీరు అంతలా చెప్పాకా.. మన వెనుక ప్రహరి గోడ ఉందికదండీ దానెనుక  కొబ్బరి చెట్టు ఉందండి..సార్ గారు అడిగితే వాళ్ళు ఇస్తారు కదండి.. మేము అడిగితే ఇవ్వరండి.. ఎందుకంటే మేము పేదోళ్ళం కదండీ.. ఒప్పుకోరండి..ఓర్నాయనా నీ పేదపురాణం చల్లగుండా..ఇక ఆపు ఆయన నిద్ర లేవగానే పంపుతా కొబ్బరి చెట్టు ఎక్కిస్తావో తాడి చెట్టు ఎక్కిస్తావో మీ ఇద్దరూ పడండి అనేసి పోన్ పెట్టేసా..

రోజూ పేపర్ ముందేసుకోవడం.. ఏదో వేక్సినో మందో కనిపెట్టారెమో అని ఆశగా చూడటం... ఈ పేపరోళ్ళు అంతకన్నాను... ఇదిగిదిగో వేక్సిన్ వచ్చేసింది.. త్వరలో కరోనా ఖతం అని హెడ్డింగ్ పెడతారు.. గబగబా మొత్తం చదివితే చివ్వర్లో  అశ్వద్దామా హతహః కుంజరహః అన్నట్లు ఇంకో సంత్సరంలో తప్పకుండా వచ్చేస్తుంది అని చల్లగా చెప్పడం.. సంవత్సరం తర్వత ఎవరికి అవసరం?..

రెడ్ జోన్ లో ఇంటిదగ్గరే కూరగాయలు అమ్ముతారు కాబట్టి కాయగూరలు కొనడానికి వెళ్ళా.. కూరలబ్బాయి అర నిమిషానికోసారి ముక్కు మీద కర్చీఫ్ తియ్యడం బరబరమని గొకడం మళ్ళీ కర్చీఫ్ పైకి లాగడం.. నా నోరు ఊరుకోదుగా.. ఇప్పుడూ.. మూతికి ఎందుకు కట్టుకున్నావ్ అది అన్నాను.. కరోనా కదండి ఇది కట్టుకుంటేనే బయటకు వెళ్ళనిస్తున్నారండి ఇప్పుడు అన్నాడు.. అది సరే ఎందుకు కట్టుకోవాలి అంటున్నా... వైరస్ ముక్కులోకి వెళ్ళిపోద్ది అండి.. అన్నాడు ఇవన్ని నన్ను ఎందుకు అడుగుతున్నావ్ అన్నట్లు చూస్తూ... కదా.. మరి నువ్వు పాతికసార్లు ఈ కూరగాయలు అన్ని ముట్టుకుని అదే చేత్తో ముక్కు బర బర గోకేవనుకో వాటి మీద ఉన్న వైరస్ ముక్కులోకి వెళుతుందిగా... అందుకే ముక్కుని చేత్తో ముట్టుకోకూడదన్నమాట ..అసలే బయట మార్కెట్లనుండే ఎక్కువగా ఇది అందరికి అంటుకుంటుంది అన్నాను.. హమ్మయ్య ఒకరికి జ్ఞానోదయం చేసా అన్న సంతృప్తితో..

తీరా చూస్తే అతను ఉల్లిపాయలు తూయడం మానేసి కరెంట్ షాక్ కొట్టినవాడిలా బిగుసుకుపోయి భయంగా చూస్తూ అంటే ఇప్పుడు నాకు కరోనా వచ్చేస్తాదా అండీ అన్నాడు.. నేను కంగారుగా.. అబ్బెబ్బే ఈ రోజు ముట్టుకుంటే వచ్చేసింది అని కాదు.. ఇకమీదట అలా చెయ్యకూడదు అని చెప్తున్నా అన్నాను... అది కాదండీ ఈ విషయం తెలియకా దురదపుట్టేస్తుందని రోజూ ఇలాగే గోకుతున్నానండి..మా ఆడదానికి అసలే వొంట్లో బాగోదు.. ఇద్దరూ ఆడపిల్లలు.. ఇంకా పెళ్ళి కూడా చెయ్యలేదమ్మా ఏడుపు గొంతుతో చెప్తున్నాడు... నాకేం చెప్పాలో అర్ధం కాలేదు.. అంటే అది.. మరి.. అందరికీ వచ్చేస్తుంది అని కాదు.. వచ్చినా ఏం కాదట.. ఎవరో బీపి ,షుగరు ఉన్న వాళ్ళకి తప్పా మామోలోళ్ళకు ఏం కాదట..  ఉల్లిపాయలు కేజి ఇవ్వవా అన్నాను.. తొందరగా అక్కడినుండి వెళ్ళిపోదామని..అసలే పొయ్యిమీద కూర పెట్టేసొచ్చా... నాకు బీపి, షుగరు రెండూ ఉన్నాయమ్మా ఈ సారి మరింత భయంగా అన్నాడు... నాకేం చెప్పాలో తెలియలేదు.. అంటే మరి నీకు ఇప్పటికిప్పుడు వచ్చేసినట్లు కాదుగా.. జలుబు, దగ్గు ,జ్వరం అట్లాంటివి వస్తే అప్పుడు ఆలోచించాలి.. ఉల్లిపాయలు కేజీ అన్నాను.. తుమ్ములొచ్చినా అది జలుబే అవుతాదా అమ్మా నాకు అస్తమాను తుమ్ములొస్తాయి  అన్నాడు. నేను దీనంగా చూసా..ఇంతలో 202 పోర్షన్ ఆయన దిగాడు ఏంటండీ కరోనా టైంలో కబుర్లా హిహిహి అని నవ్వుకుంటూ.. అరే.. డబ్బులు తేవడం మర్చిపోయా.. మీరు తీసుకుంటూ ఉండండి ఇప్పుడే వస్తా అని ఇంటికి పరిగెట్టుకొచ్చేసా...

రాత్రి బట్టలు ఆరబెడుతుంటే ఎదురుగా ఉన్న ఏడు పోర్షన్ల ఇంటి పెరడులో ఒక ఇరవైమంది జనాలు రెండు వర్గాలుగా విడిపోయి వాదించుకుంటున్నారు.. లాక్‌డవున్ పెట్టడం తప్పా ,ఒప్పా అనే  పోయింట్ మీద.. ఒకపక్క పేకాట ఆడి పాతిక మందికి ...అష్టా, చెమ్మా ఆడి ముప్పై మందికి వచ్చిందని టీవీల్లో ఊదరగొడుతుంటే ఈ ఉప్పర మీటింగులు ఏంటిరా బాబు అని ఒక చెవేసి వింటున్నా..

అమెరికాయే అతలాకుతలం అయిపోతుంది 134 కోట్ల జనాభా.. ఏటయిపోతారనుకున్నావ్ లాక్ డవున్ ఎత్తేస్తే ఎవరో అంటున్నారు.. ఒయబ్బో అదొచ్చి చస్తామో బ్రతుకుతామో తెల్దుగాని ఆటో కిస్తా కట్టి రెండు నెలలవుతుండి... షాపుల్లేవు మాకు వచ్చే కిరాయే ఆడ కస్టమర్ల నుండి వొత్తాది.. ఆళ్ళు ఇళ్ళల్లో కూచుంటే రేపు లాక్‌డవున్ ఎత్తేస్తే ఎట్టా చావాలా.. కరోనా కంటే ఆకలితో చచ్చేలా ఉన్నాం.. అతని బాధ మూడంతస్తుల పైన వరకూ స్పష్టంగా వినబడుతుంది.. ఒక పక్క వలసకూలీలు వెతలు మరోపక్క బడుగు జీవుల కతలు..అయిన వాళ్ళ దగ్గరకు కష్టంలో వెళ్ళ లేని పరిస్తితి.. ఎవరి బాధలు వారివి.. ఏం చెయ్యాలో తెలియడంలేదు..

హాల్లో టీవిలో నుండి మెల్లగా వినబడుతుంది... గత యాబయ్యేళ్ళుగా ఏ ప్రభుత్వం చెయ్యలేని పని కరోనా చేసింది...స్వచ్చమైన నీటితో ప్రవహిస్తున్న గంగా యమునా నదులు.. వేల రకాల పక్షులు తరలి వస్తున్నాయి.. ప్రకృతి తనని తాను రిపేర్ చేసుకుంటుంది...