25, ఏప్రిల్ 2022, సోమవారం

నేను - మెడికల్ షాపు- ఓ కోతి

 చాలా రోజుల క్రితం.. రోజులేంటిలే యేళ్ళ క్రితం మా ఆయన ఇండియా కొచ్చిన ఉత్సాహంలో పెట్టిన వెయ్యినొక్క వ్యాపారాల్లో ఒకటయిన మెడికల్ షాప్ లో నన్ను ఓ రోజు బలవంతంగా కూర్చో పేట్టేసి ఆయన శబరిమలయ్ చెక్కేసారు.... 


పారాసిటమాల్ అంటే జ్వరానికి వాడతారు అని తప్ప ఇంకేమి తెలియని నేను నా వల్ల కాదు మొర్రో అని బ్రతి మాలినా సరే... మా షాప్లో పని చేసే 'ఎం ఫార్మసి 'అమ్మాయి డెలివరీకి పుట్టింటికి వెళ్ళడం వల్ల ,వేరే దారిలేక నన్ను బెదిరించి మరీ కుర్చీలో కూర్చో పెట్టేసారు... అది కాదండి చీరల షాపో ,నగల షాపో అయితేవంద ,యాబై అటు ఇటు అయిత్టే సర్దుకుపోవచ్చు.. మందులండి మందులు..   ప్రాణాలతో చెలగాటం కాదూ అన్నాను భయం భయంగా..

ఓస్ అదా నీ గోలా ఇది పెద్ద విషయం కాదు.. ఈ రేక్ లో బి. పి కి ,ఆ రేక్ లో షుగర్ ...అందులో దానికి సంబందించినవి ...ఇందులో దీనికి సంబందించినవి.. అందులొ ఇంకేదో సంబందించినవి అని అయిదు నిమిషాల్లో అయిదువందల మందులు గురించి చెప్పేసి వెళ్ళిపోయారు... 

ఆ మొత్తం మందుల్లో నాకు అర్ధం అయిన మందు ఒక్కటే "ఓమిప్రోజోల్".. గ్యాస్ కి సంబందించింది.. ఎందుకంటే అది బ్లు కలర్ లో పే..ద్ద డబ్బా ..చక్కగా ఎదురుగా కనబడుతుంది... 


అన్నట్లు నాకో అసిస్టెంట్ని కూడా ఏర్పాటు చేసారు.. దానిపేరు దాక్షాయిని. నాకు కనీసం పారసిటమాల్ పేరన్నాతెలుసు.. దానికి జండూబాం పేరు కూడా తెలియదు... అలాంటప్పుడు నాకు మా నాన్న మీద కోపం వస్తుంది కదా.. మామూలుగా రాదు.. ఎందుకో మీలాంటి విజ్ఞులకు ప్రత్యేకంగా చెప్పక్కరలేదు.. 


ఎక్కడన్నా షాప్లో కూర్చుంటే కష్టమర్లు వస్తే సంతోషిస్తారు ..నాకు ఎవరన్నా షాప్ వైపు వస్తున్నారంటే దడదడ లాడేది.. పస్ట్ కస్టమర్ ఎంత మంచోడంటే మగాడయిపోయాడు కాబట్టి బాగోదని వదిలేసాగాని లేకపోతే ఎత్తుకుని గిర గిర తిపేసేదాన్ని... పారాసిటమాల్ అడిగాడు. ..కళ్ళ కద్దుకుని మరీ ఇచ్చాను


ఆ తర్వాత నుండి మొదలయ్యాయి కష్టాలు.మామూలు  కష్టాలు కాదు.. "మెట్ఫార్మిన్ 500 "ఇవ్వండి.. మెట్ఫార్మినా అండి.. ఒక్క నిమిషం... అని బుర్ర గోక్కుంటుంటే ...మా దాక్ష అయిపోయాయండి అంది సింపుల్ గా.. అయిపోయాయా ..పోని "ఏంలిప్ ఏటి."..అన్నాడు...  అదికూడా అయిపోయింది అంది ఏమాత్రం తొణక్కుండా... మరింకేం ఉన్నాయి అన్నాడు విసుగ్గా.. "ఓమిప్రోజోల్ " నేను గట్టిగా అరిచాను ఆనందం తట్టుకోలేక... అతను నా వైపు ఎగాదిగా చూసి వెళ్ళిపోయాడు... 


నీకు బుర్ర భలే పని చేసిందేవ్..నాకు భయం తో బుర్ర పని చెయ్యలేదు తెలుసా..అన్నాను...మరి దాక్ష నా మజాకానా అంటుండగా ఇంకో కష్టమర్  టె లిస్మార్ట్ హెచ్ ఇవ్వమ్మా... అన్నాడు ...లేవు అయిపోయాయి అన్నాను సీరియస్ గా... ఆ ఎదురుగా కనబడుతుంటే అయిపోయాయి అంటావేంటి అంతకన్నా సీరియస్ గా అన్నాడు అతను... పక్కకుచూస్తే అవే డబ్బాలు... నేను బేలగా దాక్ష వైపు చూసాను... 


అంటే మేడం ప్రొద్దున్నే వచ్చాయి ఇందాకే సర్దాను కవర్ చేసింది... 

మరొకతను నన్ను చూడగానే క్రొత్తగా జాయిన్ అయ్యావమ్మా..అన్నాడు ....,,,,,"అవును సార్.".అన్నాను ...నాకు కావలసిన మందులు ఆ చివరన పింకు పెట్టె ఉందే అందులో ఉంటాయి ఇవ్వమ్మా..అన్నాడు.. థాంక్స్ అండి అన్న....  

ఇలా ఆ రోజు నేను పడ్డ కష్టాలు పగోడికి కూడా రాకూడదు బాబు...

కొంత మంది కష్టమర్లు తిట్టిన తిట్లు రాస్తే పరువు పోతుందని రాయట్లేదుగాని భగవంతుడా.. ఉఫ్ఫ్ఫ్... దాక్షా నా వల్ల కాదే మా ఆయన నన్ను వదిలేసినా సరే రేపటి నుండి నీకు అయిదురోజులు శెలవులు.. ఆ తర్వాత నువ్వు ఆయన చూసుకోండి అనేసా...   అయితే రాత్రి డబ్బులు వసూలుకు డీలర్స్ వస్తారు.. అలాంటి డీలర్స్ లో ప్రవీణ్ అని ఒక అబ్బాయి వచ్చాడు... మీకు ఒకవిషయం చెప్పడం మర్చిపోయా కదా.. నేను కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు ఎవరో రూపంలో వచ్చి కాపాడేస్తూ ఉంటాడు..ఈ సారి ప్రవీణ్ రూపం లో వచ్చాడన్నమాట.అదేంటి మేడం ఈ రోజు కలెక్షన్ ఇంత పూర్ గా ఉంది..అన్నాడు... నా మొహం నాకసలు ఏం తెలియదు ప్రవీణు.. నన్ను బలవంతంగా ఇక్కడ కూర్చో పెట్టేసారు.. అన్నా...:(

తను కొంచెం జాలిగా చూసాడు.. మీది జెనరిక్ మేడం ....కనీసం కంపెనీ పేరుతో కూడా మందులు ఇవ్వలేరు.. ఒక పని చెయ్యండి ముందు మీరు ప్రిస్క్రిప్షన్ జోలికి వెళ్ళ కండి... అందులో అర్దం చేసుకోవడం కష్టం... ఎవరయితే మెడికల్ షీట్ తెస్తారో వాళ్ళ మందులో కాంపోజిషన్ జాగ్రత్తగా చూసి ఇవ్వండి.. ఒకటికి పది సార్లు చూసుకోండి..

1mg.com... ఈ సైట్ లో ప్రతి మందు వివరం ఉంటుంది.. మీరు ఏం డవుటొచ్చినా ఇందులోగాని ,గూగుల్ లో గాని చెక్ చేసి అప్పుడు అమ్మాలి..అని ఎంతో ఇదిగా బోలెడు జాగ్రత్తలు  చెప్పి వెళ్ళాడు..


నాలో ఒక ప్రత్యేకత ఉంది.. నాకు ఇంట్రెస్ట్ లేని విషయం తలక్రిందులుగా తపస్సు చేసినా నేర్చుకోలేను... ఒక్కసారి అది నచ్చిందా..ఒక పిచ్చి పట్టినట్లు పడుతుంది అంతే.. రాత్రి పగలు ఇదే పిచ్చి.. షుగర్కి ఎన్ని రకాలు, బి. పి కి ఎన్ని రకాలు ,థైరాయిడ్ కి ఎన్ని ...ఇలా వారం రోజుల్లో మా షాపులో ఉన్న మందులన్ని అవపోసన పట్టేసాను.. ఇంకోవారం రోజులు గట్టిగా చదివి ఉంటే మన చందు శైలజగారితో కలిసి ఆపరేషన్లు కూడా చేసిపడెసేదాన్ని... ప్లిచ్ ఈ లోపల మా ఆయన వచ్చేసారు.. 

అయితే ఎక్కడ పడితే అలా ,ఎలా పడితే అలా ఉన్న మందులను ఒక పద్దతి ప్రకారం ..ఎలా సర్దితే ఈజిగా తీసుకోవచ్చో మొత్తం మార్చిపడేసా... మా  ఆయన వచ్చాక జనాలు ..మీరు వచ్చారా ..అక్కరలేదులేండి మీ ఆవిడ వచ్చాకా వస్తాం.. ఆవిడయితే బాగా చెప్తారు అని వెళ్ళిపోయేవారట... ఈయన కుళ్ళు మామూలు రేంజ్లో ఉండేది కాదు... 


జనాలు అలా అనడానికి ఓ కారణం ఉండేది... నేను చక్కగా ఫెద్దోళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళకు మందులు ఇస్తూ.. ఇవిగో ఇవ్వి నెప్పుల టెబ్లెట్స్ ఎక్కువ వాడకూడదు.. కిడ్నీలకు దెబ్బ... ఇదిగో ఇది అయిరన్ టానిక్కు పెరుగన్నం తినేసివెంటనే అయిరన్ వేసుకోవద్దేం.. ఇలాంటి నా గూగుల్ నాలెడ్జి ఉపయోగించడం తో పాటు వాళ్ళ బాధలు కష్టాలు అన్ని వినేదాన్ని... 

కొందరు కొడలిని తిడితే... కొందరు అత్తల్ని దులిపేసే వారు...మరికొందరు కొడుకుల గురించి చెపితే ఇంకొందరు తండ్రుల చాదస్తం గురించి చెప్పేవారు.. అసలు భార్యభర్తల తగువులయితేనా అబ్బ్బో అబ్బో అబ్బో.. నా గొప్పలు నే చెప్పుకోకూడదబ్బా... 


ఓ రోజు నేను సీరియస్సుగా మందుల మీద రీసెర్చ్ చేస్తుంటే ,మా దాక్ష మందులన్న్ని తుడిచి సర్దుతుంటే సడన్ గా మహత్తరమైన అవిడియా ఒకటి వచ్చింది... అరే దాక్షమ్మా ఎన్నాళ్ళిలా ఇద్దరం మందులు తుడుచుకుంటు బ్రతుకుతాం.  శుబ్బరంగా ఓ కౌన్సిలింగ్ సెంటర్ పెట్టేసి ఇక్కడ భార్య భర్తల గొడవలు తీర్చబడును అని బోర్డెట్టేద్దాం.. ఈ రోజుల్లో కొట్టుకు చావని మొగుడుపెళ్ళాలు ఎక్కడున్నారు చెప్పు... ఒక్కసారి  గాని క్లిక్ అయితే నా సామిరంగా ఎలా ఉంటాది అన్నాను ఉత్సాహంగా చూస్తూ... అది కళ్ళు కూడా పైకెత్తకుండా ....మా అమ్మ ఓ సామెత చెప్తాది లెండి గురువింద గింజ గురించి..  మీకు అంకుల్ గారి మధ్య పచ్చ గడ్డి కాదు.. పారే జలపాతం ఉరికినా బగ్గున మండి ఆవిరై పోతుంది... ఈవిడ కౌన్సిలింగు సెంటరెడతాదట.. ముందు మీ ఇద్దరు ఒకరుకొకరు ఇచ్చుకోండి అని తీసి పడేసింది..

 నీ మొహం పెరటి చెట్టు వైధ్యానికి పనికి రాదని మాకు మేము ఇచ్చుకోలేము అంటూన్నాను.. బయట ఒకటే హడావుడి, గోల.. 


ఆంటీగారు వీధి చివర పేద్ద కోతి మీ అంత ఉంది అంది.. భయంగా.. చితక్కొట్టేస్తానేవ్ నాతో పోల్చావంటేఅన్నాను.. అబ్బా.. అంటే అది కాదు ఆంటీ ..మనిషంత కోతి జనాలు వెనుక పరిగెడుతున్నారు ...అది అటు అటు, ఇటు చూస్తుంది అంది వణికిపోతూ... 


నువ్వు అక్కడే కూర్చుని డాన్స్ కడితే నిన్ను చూసి మనలాగే ఉందే అనుకుని మన షాప్ కే వస్తుంది.. లోపలికి రా కసిరాను.. అయబాబోయ్ నిజంగా వచ్చేస్తాదంటారా అంది నా వైపు చూసి.. నిజ్జంగా నిజం అన్నాను.. అయితే నేను లంచ్ కి అరగంట ముందే  వెళ్ళిపోతున్నా.. టా..టా బాయ్ బాయ్ అని ఒక్క అంగలో వీధిలో ఉరికేసింది.. పిరికి మాలోకం అని నేను సీరియస్సుగా నాపని చేసుకుంటుంటే  జనాల గోల ,గొడవ మా షాప్ కి దగ్గరగా వినబటం మొదలయ్యాయి... ఏంటబ్బా ఈ కోతి గోల ఓ పాలి చూద్దాం అని తల తిప్పానో లేదో కరెంట్ షాక్ కొట్టిన కోతిలా బిగుసుకుపోయా... మామూలు కోతా అది.. మనిషంత కోతి.. జెనరల్ గా దీన్ని జూలో పెట్టాలే..అలా ఎలా రోడ్ మీద వదిలేసారబ్బా... నేను ఆశ్చర్యపోతుండగా... అది నా వైపు చూసింది.. చూసి ఊరుకుందా మా షాప్ మెట్లెక్కి చిన్న  తలుపు ఉంటుంది  దానిని  తీసుకుని నా ఎదురుగా కష్టమర్ కూర్చునే కూర్చీలోకూర్చుని "దా ఏం కొన్సిలింగ్ ఇస్తావో ఇవ్వి అన్నట్లు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటం మొదలెట్టీంది... ఆ టైం లో నా పరిస్థితి ఒక్క మాటలో చెప్పాలంటే అదేం సినిమా ?ఆ... రేసు గుర్రంలో ....లిఫ్ట్లో శృతిహాసన్ లా ఒక రేంజ్ లో ఇన్సైడ్ డేన్స్ కట్టేస్తున్నా...కాని పైకి మాత్రం చాలా హుందాగా మరియు డీసెంట్గా పెళ్ళి చూపుళ్ళో పెళ్ళి కొడుకు ఎదురుగా కూర్చున్న పెళ్ళి కూతురు మాదిరి తల ఎత్తకుండా చేతిలో పోన్ ని అన్ని రకాల కోణాల్లో తీపేస్తూ దేవుడా దేవుడా కాపాడు అని ఒకటే భగవన్నామ స్మరణలో బిజిగా ఉన్నా.... 

అంత భయం లోనూ నాకో విషయం గుర్తొచ్చింది.. జంతువుల కళ్ళల్లో చూస్తే వాటికి కోపం వచ్చి మన మీద తిరగ బడతాయట.. అందుకనే నేను ఆ పెళ్ళికూతురి అవతారంలో సెటిల్ అయ్యా... విచిత్రంగా బయట జనాలు కూడా అరుపులు మానేసి మా ఇద్దరి వైపు మార్చి మార్చి చూస్తున్నారు... చాలా మంది సెల్ ఫోన్స్ తీసి ఈ తతంగం అంతా వీడియోతీయడంలో బిజీగా ఉన్నారు... 


ఓరి దొంగ సచ్చినోళ్ళారా అని తిట్టుకుంటుంటే సడంగా మా ఆయన గుర్తొచ్చారు.. ఆయనకు చేస్తే ....గజేంద్ర మోక్షం లో ఏనుగు కాపాడినట్లు కాపాడేస్తే నన్ను....  .ఏమో ఎవరికి తెలుసు అనుకుని మెల్లిగా ఆయన నెంబర్ ప్రెస్ చేసా...

హలో

హలో ఏవండీ (లో గొంతుకతో.. )

ఏంటి చెప్పు.. (విసుగ్గా)

పెద్ద కోతి నా ఎదురుగా కూర్చుంది... 

దానికి కాల్ చెయ్యాలా.. మన దేవుడి గూట్లో అరటి పండు ఉంది అది ఇచ్చి ఉస్ ఉస్ అను వెళ్ళిపోద్ది... 

మీరు చెప్పండి నా సిట్యుఎషన్లో మీరుంటే ఏం చేసేవారు.. అహా మాట వరసకు చెప్పండి అసలు.. అప్పటికి అది నా ముందు కూర్చుని పది నిమిషాల పైన అయ్యింది... 

ఒక్కసారి మీరు షాప్ దగ్గరకు వస్తే బాగుంటుంది... ఇక్కడ పరిస్థితి ఘోరం గాఉంది అని కాల్ కట్ చేసేసి ఫోన్ కుర్చి క్రింద పెట్టేసా.. 

నాకెందుకో భయం ఈ కోతికి మన భాష వచ్చేమో అని. గబుక్కున దానికి అర్ధం అయిపోతే... నా సెల్ ఫోన్ లాగేసుకొని ఢాం అని నేల కేసి కొట్టేస్తే? అదన్నమాట భయం... 

కాని అది మాత్రం నా వైపే చూస్తూ టేబుల్ మీద ఉన్న పెన్ తీసి ఆడుకోవడం మొదలెట్టింది... చుట్టూరా ఉన్న జనాలు ఆ వీధి నుండి ,ఈ వీధి నుండి పోలోమని పోగయి వీడియోలు తీసుకుంటున్నారు... 

అంత భయం లోనూ నాకో డవుటేమిటంటే  నా ఎదురుగా ఉన్న కొట్టు అరటిపళ్ళ కొట్టు... నా పక్కనే బేకరీ.. నేను సగం లావు అవ్వడానికి కారణం అదే.. ఈ పక్కన చెరుకు రసం కొట్టు.. ఇవన్ని వదిలేసి మందుల షాపులో నీకేం పనే తల్లి అని తల పట్టుకు కూర్చున్నా.. ఈ లోపల ఎవరో కోతిని కొట్టాబోయి గురి తప్పి మందుల రేక్ని కొబ్బరి చిప్పతో కొట్టాడు..అంతే సగానికి పైగా మందుల పెట్టెలు క్రింద పడి పోయాయి.. ఎవడ్రా అది నేను, కోతి ఒకేసారి అటు చూసాం... ఇంకెవరు.. మా ఆయన... జనంలో కలిసిపోయి రెండు కొబ్బరి చిప్పలు, నాలుగు అరటిపళ్ళు పట్టుకుని కోతి పై నెట్ ప్రాక్టీస్ చేస్తున్నారు... సరిపోయింది.... దేవుడా ఇప్పుడెలా అని తల పట్టుకు కూర్చుంటె ఒక అయిడియా వచ్చింది..

చాలా సినిమాల్లో జంతువులను భయపెట్టడానికి ఢంకు డమా అని డప్పుల శబ్ధం వాయిస్తూ ఉంటారుగా కోయోళ్ళు... మనం కూడా అదే పని చేస్తే..నాకు తెలిసిన ఒక గేం సైట్లో సరిగ్గా అట్టాంటి మ్యూజిక్కే వస్తుంది.. మెల్లిగా ఆ సైట్ ఓపెన్  చేసి  ఆ మ్యూసిక్ పెట్టా... అప్పటి వరకు పెన్ను పుచ్చుకుని ఆడుకుంటున్నదల్లా నా వైపు చూసింది... దేవుడా కొంపదీసి పెనం మీదనుండి పొయ్యిలో జంపుచేసానా అని భయంగా చూసా.. టేబుల్ మీద మందులు తుడవడానికి ఉపయోగించే పాత గుడ్డ తీసి ఒకసారి మొహం తుడిచి ఆ తరువాతా చెయ్యెత్తి అక్కడకూడా తుడిచి ఆ తర్వాతా ఎక్కడెక్కడొ తుడిచి దాన్ని  నా కంప్యూటర్ మీద వేసి ఒక్కసారి పళ్ళన్ని ఇకిలించి  తలుపు పై నుండి ఒక్క గెంతు గెంతి బయటకు పోయింది... జనాలందరూ మళ్ళీదాని వెనుక పరుగు... 


మీరెవరూ నాకు వంకలు పెట్టక్కరలేదు.. అంతకు వందరెట్లు మా దాక్ష రెండు నెలలు ఆడేసుకుంది..

అది కాదు ఆంటీ గారు ...కోతన్నాకా నాలుగు డబ్బాలు క్రింద పడేయాలి..లేకపోతే నాలుగు వస్తువులు చింపేయాలి... ఇంకా తిక్కరేగితే మీ కాలో ,చెయ్యో కొరికేయడమో, జుట్టు పీకేయడమో చెయ్యాలి గాని... పెళ్ళి కొడుకులా మీ ఎదురుగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడం ఏంటండి...అదీ 20నిమిషాలు పైగా.... అహా.. ఇదే కధ ఇంకెవరన్నా మీకు చెప్తే మీరునమ్ముతారా...  మీ గుండెల మీద చెయ్యేసి చెపోండి... అసలు బయట ఉన్న ఎదవలకి సెల్ఫీల మీద ఉన్న మోజు ఓ TV9 మీదో ఓ TV 5 మీదో ఏడ్చిందా... వాళ్ళయితే ఆ కోతినే ఇంటెర్వ్యూ చేసి విషయం రా బట్టేసే వారు... 


అసలు మీకు బుర్ర లేదండి ...పాపం monkey  సార్ గారు పెన్ను పట్టుకుని గంట సేపు హింటిచ్చిన్నా మీకు పేపర్ ఇద్దామన్న అయిడియా ఎక్కడ ఏడ్చింది... నన్ను అడిగితే ఈగ సినిమాలో లాగా ఈ కోతి ఒకప్పుడు మీ లవ్వర్ అయి ఉంటాడు... ఏమాత్రం కాలం చెల్లి ఇలా కోతి రూపం లో పుట్టేసి మీ కోసం వచ్చి ఉంటాడు... ఓ సారి ఒకప్పుడు మీరు ప్రేమించిన అబ్బాయిల లిస్ట్ గుర్తు తెచ్చుకోండి... అంది.. 

దాక్ష నేను ఇప్పటి కొచ్చి నరమాంసం తినలేదే.. నువ్వు ఇలాగే వాగేవనుకో సాయంత్రం లోగా ఖైమా కొట్టి కూరొండుకుని తినేస్తాను అని బెదిరించినా ఆగదే... 

పోని మీకు ఆ స్టోరి నచ్చి ఉండదు.. ఇంకొకటి చెప్తా... మే బీ ....ఒక వేళ ఆ కోతి గర్ల్ ఫ్రెండ్ పోలికలు మీలో బాగా కనిపించి ఉండి ఉంటాయండి.... 


నేను కొట్టడానికొచ్చేసరికి ఇది కూడా నచలేదా రేపు తప్ప కుండా మంచిగా గెస్ చేసి చెప్తా అని నెల రోజులు చావ గొట్టింది మహా తల్లి





   

28, మే 2020, గురువారం

కరోనా

ఓసారి జపాన్లో సునామి వస్తే దాని ఎఫెక్ట్ సింగపూర్ మీద  పడుతుందేమో అని నెలకు సరిపడా సరుకులు కొనేసిన ఘన చరిత్ర నాది.. అటువంటిది ఊహాన్లో వైరస్ గురించి వినగానే ఊరుకుంటానా... ఎందుకైనా మంచిది అని ఫిబ్రవరిలోనే మూడు నెలలకు సరిపడా సరుకులు కొనేసి ఇంట్లో పెట్టేసా..

సార్స్, మెర్స్ గురించి తెలిసినా
 పెద్దగా పట్టించుకోలేదుగాని ఈ కోవిడ్ విషయంలో ఎందుకో నా కుడికన్ను అదురుతూనే ఉంది..అదే సమయంలో ట్రంప్ ఇండియాకి రావడం... ఓ కోటిమంది నా సభకి రావాలని జోకులాంటి ఆర్డర్ వెయ్యడం.. మోదీ గారు వెంటనే వాకే అని జనాలను తోలుకొచినప్పుడే మా కుటుంభ సభ్యులందరికి కాల్ చేసి చెప్పా... నాన్నా మందులు గట్రా ముందే కొనుక్కు పెట్టుకోండి.. వంట సామాను నెలకు సరిపడా కొనుక్కోండి అని.. విన్నారా.. ఊహు.. నువ్వూ నీ ఎదవ చాదస్తం అని తిట్టారు.. ఏమైంది.. చివరకి కోవిడ్ వచ్చి మన పక్కన సెటిల్ అయ్యింది.. అందుకే నాలాంటి కాలజ్ఞానులను తక్కువ అంచనా వేయకూడదు..

ఉన్నట్లుండి మోదీగారు మంచి ముహూర్తం చూసి జనతాకర్ఫ్యూ అన్నారు...ఆ దెబ్బతో వైరస్ చైన్ లింకులు ఎక్కడివక్కడే విడిపోయి, మరసటి రోజునుండి కరోనా ఫ్రీ భారత్ అయిపోతుందని జనాలు ఎక్కడి దొంగలు అక్కడే గప్ చిప్ అని ఇళ్ళల్లో గడియలేసుకు కూర్చున్నారు..
 కొంపలో గంట సేపు ఉంటే ఓవెన్ లో పాప్ కార్న్ లా ఎగెరెగిరి పడే మా ఆయన కూడా కరోనా నుండి దేశాన్ని రక్షించడానికి కంకణం కట్టుకుని టి.వి ముందు సెటిలయ్యారు.. ఆ సమయంలోనే భయంకరమైన నిజం ఒకటి తెలిసింది... నిమిషం కూడా ఇంట్లో ఉండనివ్వరు ఈ మనిషిని అని రోజంతా నా శాపానార్ధాలకు భలయ్యే ఆయన ఫ్రెండ్స్ నాకు ఎంత మేలు చేస్తున్నారో అని..

బుజ్జి..మజ్జిగ... గ్రీన్ టీ.. కాస్త పకోడి చెయ్యకూడదూ.. బ్లాక్ టీ.. మళ్ళీ మజ్జిగ.. చల్లగా నిమ్మరసం... ఆ లిస్ట్ కి అంతూ పొంతూ లేదు.. ఇక మీదట ఆయన ఫ్రెండ్స్ని తిట్టకూడదని ఒట్టెట్టుకున్నాను.. సాయంత్రం కాగానే జనాలందరూ వీదుల్లోకొచ్చేసి ప్లేట్లు ,గరిటలు, గంటలు, డప్పులు దొరికింది దొరికినట్లుగా  వాయించేసి చప్పట్లు కొట్టేసాం.. ఎవరెవరు ఏ వస్తువులు వాయించారో అవే వస్తువులతో మాడు పగలగొట్టీ మరీ చెప్పారు మోడీ గారు లా..క్.. డౌ.. న్ అని..

ఈ విషయం తెలియగానే ఫస్ట్ వచ్చిన ఫోన్ కాల్ మా అబ్బాయి కాలేజ్ నుండి.. మేడం ఈ రోజునుండి.. బాబుకి ఆన్ లైన్ క్లాసెస్.. అప్పుడప్పుడూ కాల్ చేస్తాం ఏమనుకోకండి అన్నాడు.. మాటవరసకు అప్పుడప్పుడు అన్నాడుగాని ...ఎప్పుడూ చేస్తూఉంటాడని ఆ తర్వాతే తెలిసింది.. మీ అబ్బాయి నిద్రలేచాడా?.. ఇంకా క్లాస్ కి రాలేదేంటి.?. స్క్రీన్ మీద బాబు పేరు కనిపించట్లేదేంటి?... అందరూ ఊ కొడుతుంటే మీ వాడు అనట్లేదేంటి?.....వీడు నన్నే ఇలా తినేస్తున్నాడంటే పిల్లాడిని ఏ రేంజ్ లో వేపుకు తింటున్నాడో అని జాలేస్తూ ఉంటుంది నాకు..

మా ఆయన సంగతి చెప్పే అక్కరలేదు.. దాహంతో ఉన్న కాకి గులకరాళ్ళు కుండలో వేయడానికి దీక్షగా  గల్లీ ,గల్లీ తిరిగినట్లు ఊరంతా తిరగడమే..ఏమన్నా అంటే చూడు బుజ్జీ ఇది ఇప్పుడప్పుడే తీరేదికాదు.ముందు ,ముందు మనం కరోనాతో సహజీవనం చెయ్యాల్సిందే అని జగనన్న కంటే ముందే చెప్పేసారు నాకు..

 ఇలాంటి సమయాల్లోనే ఇంట్లో పంపు లీక్ అయిపోద్ది..వాషింగ్ మిషన్ పాడైపోతుంది.. సింకు దగ్గర ఏదో అడ్డుకుని వాటర్ స్ట్రక్కయిపోతుంది.. కుంచమంత కూతురుంటే మంచం దిగక్కరలేదని సామెత..అదెంత వరకూ నిజమో తెలియదుగాని కొడుకుంటే మాత్రం తల్లికి చేదోడు వాదోడమ్మా.. మా అబ్బాయి రెంచు.. స్క్రూ డ్రైవర్ పట్టుకుని నన్ను గండం నుండి బయట పడేస్తూ ఉంటాడు..

ఇదిలా ఉంటే అప్పటి వరకూ ఏ కలుగుల్లో వుంటారో ఎక్కడెక్కడి ఫ్రెండ్స్ బంధువులు అందరూ బయటికొచ్చేసి ప్రొద్దున లేచేసరికి పాతిక గ్రూపుల్లో నన్ను ఏడ్ చేసి ఒకటే మెసేజ్లు..ఇంతా చేసి అవి ఏం మెసేజ్ లయ్యా అంటే.. నేను ఈ వంట వండాను.. అని నాలుగు రకాల వంటల పోస్ట్లు ఒకరు పంపితే.. ఓస్ నువ్వు అవి వండావా నేను అయితే ఇవి వండాను అని ఇంకొకరు ఆరు రకాల వంటలు... వీళ్ళు ఇలా పోటీలు పడి వండేస్తుంటే మగాళ్ళందరూ సరుకుల కోసం సంచులు పట్టుకుని ఊరిమీద తిరగడం..ప్రతి మార్కెట్ని కోడంబాకం మార్కెట్లా తయారు చెయ్యడం..  కరోనా కేసులు పెరుగుతున్నాయి అంటే పెరగవూ మరి...

వీళ్ళందరిదీ ఒక గోల అంటే నా కూతురు మరీ స్పెషలు...గబుక్కున వచ్చి బుగ్గ మీద ముద్దు పెట్టి ఐ లవ్యూ మమ్మీ.. అనగానే పుత్రికోత్సాహంతో నేను దగ్గరికి తీసుకోబోతుండగానే.." సెల్ఫీ "అని క్లిక్ మనిపిస్తుంది.. ఏంటే అదీ అంటే.... మరీ దీప్తీ వాళ్ళ డాడీతో ఫొటో తీయించుకుని పంపింది మరి నేను నీతో తీసి పంపద్దా.. ఈ రోజు ఏంవండావ్.. ఛీ...  బీరకాయా..నా ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీలు ఎన్ని మంచి వంటలు వండుతారో.. అని మొహం ముడుచుకుంది..వంటల ఫొటోలేగా..  కావలసినన్ని నీకు ఫార్వర్డ్ చేస్తా..... హేపీగా మీ ఫ్రెండ్స్కి పంపేసుకో అన్నాను..  అబద్దం ఆడమంటావా గొప్ప ఆశ్చర్యంగా ఫేసుపెట్టింది.. వాళ్ళు చేసేపని కూడా అదేనమ్మా...ఈ ఎండల్లో వంటలు చేయడం కూడాను విసుక్కున్నా..జనాలకు మరీ ఖాళీ ఎక్కువైపోతుంది..

బాల్కానీనుండి బయటకు చూద్దునుకదా.. జనాలు విచ్చల విడిగా తిరుగుతున్నారు.. ఒక్కళ్ళ ఫేసుకు మాస్కు ఉంటే ఒట్టు..అంటే కర్చీఫ్ లాంటిది కడతారు కాని అది మెడలో ఉంటుంది.. మూతి మీద ఉండదు. ఏ పోలీసో అటు వస్తుంటే గబుక్కున పైకి లాగుతారన్నమాట..అప్పటికీ అన్ని టీవి చానల్స్ లో మొత్తుకుంటూనే ఉంటారు.. అయినా వీళ్ళకు అర్దంకాదు..

ఇది ఇలా ఉండగా ఒక శుభముహుర్తాన  మా ఇల్లు రెడ్ జోన్ పరిధిలోకి వచ్చేసింది...ఇంకేంటి బయటకు వెళ్ళడం పూర్తిగా బంద్... కొంత విసుగన్నమాటేగాని రెడ్ జోన్ వల్ల బోలెడు లాభాలండి.. అయినదానికి ,కానిదానికి ఊరిమీద కాలుగాలిన పిల్లుల్లా తిరిగే మా ఆయన లాంటోళ్ళను  ఇంట్లో కట్టేయచ్చు.. పోలీసులు నిరంతర  కాపల వల్ల దొంగల భయం ఉండదు.. ..కూరగాయలు పాలు పెరుగు ఫ్రీగా పంచే రాజకీయ నాయకులు...అసలా లెక్కేవేరు..

ఓ అర్దరాత్రి 12 కి మా వాచ్మెన్ నుండి ఫోన్ కాల్.. మేడంగారు మీరు అర్జెంట్గా క్రిందకు రావాలి.. ఎందుకు అన్నాను అయోమయంగా.. మా ఆవిడకి కడుపునెప్పి మీరు వచ్చి వోదార్చండి.. కడుపు నెప్పి వస్తే టేబ్లెట్ వెయ్యాలిగాని ఓదార్చడం ఏంటి ?నేను ఆలోచనలో పడగానే తొందరగా రండి బాబోయ్ అని ఒక్క అరుపు అరిచాడు.. నేను ఉలిక్కి పడి గబుక్కున టేబ్లెట్ తీసుకుని నైటీ లోనే క్రిందకు దిగిపోయా..

లిఫ్ట్ ఎదురుగా వెనుక చేతులు కట్టుకుని అటు ఇటు పచార్లు చేస్తూ మా వాచ్మెన్  నన్ను చూడగానే ... ఇంక ఏడుపు ఆపు.. మేడంకు నీ బాధలన్ని చెప్పు ఓదారుస్తారు అన్నాడు భారంగా నిట్టూర్చి.. ఈ ఓదార్పు గోలేంటిరా నాయనా అనుకుని ఏమయ్యింది.. ఎందుకు కడుపు నెప్పి.. 'డేటా' అన్నాను అనుమానంగా.. ఉహు అంది ఎర్రని కళ్ళను తుడుచుకుంటూ.. బయట ఫుడ్ ఏమన్నా తిన్నావా అరగలేదేమో.. ఫుడ్ పోయిజన్ అయిందేమో అన్నాను ఇంకేం కారణాలు అయి ఉంటాయో అని ఆలోచిస్తూ..

ఇప్పుడు బయట ఫుడ్ ఎక్కడ దొరుకుతుందండీ అది గ్యాస్ నెప్పి..రెండు రోజులనుండి అన్నం తినట్లేదు
.. టేబ్లెట్ వేసా ఇప్పుడే అన్నాడు.. మరి ఆ మాత్రం దానికి నన్ను ఎందుకు పిలిచావు అన్నాను అయోమయంగా.. అబ్బా.. అది కాదండి.. మన అపార్ట్మెంట్ ఎదురు ఇంటిలో కరోనా పోజిటివ్ వచ్చింది కదండీ.. వాళ్ళ ఇంట్లో పిల్లలతో మావోడు రోజూ ఆడేవాడు..తల్లి మనసు కదండీ వాడికెక్కడ అంటుకుంటుందో అని ఈవిడ రెండురోజులనుండి అన్నం తినట్లేదు.. మీరు బాగా మాట్లాడతారని దాని నమ్మకం కొంచెం ఓదార్చండి అన్నాడు సీరియస్సుగా..

నేను ఒక్క గెంతు గెంతా వెనక్కి. ఓరి దుర్మార్గుడా కంగారులో మాస్కు పెట్టుకోలేదు.. చున్నీ కూడా లేదు... ఎలా ఉన్నదాన్ని అలా వచ్చేసా అనుకుని.. మరి మొన్న జనాలను క్వారంటైన్ తీసుకు వెళ్ళారుగా వాళ్ళకు చెప్పలేదా నువ్వు ఈ విషయం అన్నాను భయంగా... చెప్పానండి.. అరె  ..టెస్టులు చేసేవరకు నువ్వు హోం క్వారంటైన్లో ఉండాలి ఎక్కడికి వెళ్ళొద్దు అన్నారండి..అందుకేగదండి నేను రాకుండా మిమ్మల్ని పిలిచా ఇక్కడికి అన్నాడు.. ఓరిబాబు క్వారంటైన్ అంటే మేము కూడా నీదగ్గరకు రాకూడదు.. సరే భయపడకండి.. ఏం రాదులే అని ఆ అమ్మాయికి రెండు ముక్కలు ధైర్యం చెప్పి ఇంటి కొచ్చేసా...

ఆ ప్రొద్దున్నే మళ్ళీ ఫోన్.. ఏంటి ?అన్నాను.. ఓ పాలి సార్ గారిని పిలుస్తారా అండి అన్నాడు.. దేనికీ? అన్నాను. కొబ్బరాకులుకావాలండి...అన్నాడు.కొబ్బరాకులా!! అవెందుకు? అన్నాను అయోమయంగా.. పిల్ల పెద్దది అయ్యిందండి అన్నాడు ముసి ముసి నవ్వులు నవ్వుతూ... ఇష్హ్.. అదికాదయ్యా ఇప్పుడు ఈ క్వారంటైన్ లో అవసరం అంటావా!! ఏదో ఇంట్లో ఉన్న చాప తో సరిపెట్టెసుకోరాదు అన్నాను.. అయ్యబాబోయ్ శాస్త్రం ఒప్పుకోదండి కొబ్బరాకుల మీదే కూర్చోబెట్టాలి... అన్నాడు మొండిగా.. ఐతే ప్రెసిడెంట్ని అడుగు మా ఆయన్ని కాదు అన్నాను కోపంగా... అంతే లేండి.. మీ పాప పెద్దది అయినప్పుడు నా చేతే తెప్పించారు గుర్తుందా.. అవన్ని మర్చిపోయారు..మీకేం మీ పిల్ల గట్టేక్కేసింది.. మేము పేదోళ్ళం కదండి..పెద్దోళ్ళు మీరు సాయం చెయ్యడానికి ఎనకాడితే ఎలాగండి ఒక్కగానొక్క కూతురు.. .అంటూ సెంటిమెంట్తో చావగొడుతుంటే ...అది కాదు..ఇప్పుడు రెడ్ జోన్ కదా ..బయటకు పంపరు కదా అన్నాను అనునయంగా..నాకు తెలియదేటండి.. నిన్న మీరు అంతలా చెప్పాకా.. మన వెనుక ప్రహరి గోడ ఉందికదండీ దానెనుక  కొబ్బరి చెట్టు ఉందండి..సార్ గారు అడిగితే వాళ్ళు ఇస్తారు కదండి.. మేము అడిగితే ఇవ్వరండి.. ఎందుకంటే మేము పేదోళ్ళం కదండీ.. ఒప్పుకోరండి..ఓర్నాయనా నీ పేదపురాణం చల్లగుండా..ఇక ఆపు ఆయన నిద్ర లేవగానే పంపుతా కొబ్బరి చెట్టు ఎక్కిస్తావో తాడి చెట్టు ఎక్కిస్తావో మీ ఇద్దరూ పడండి అనేసి పోన్ పెట్టేసా..

రోజూ పేపర్ ముందేసుకోవడం.. ఏదో వేక్సినో మందో కనిపెట్టారెమో అని ఆశగా చూడటం... ఈ పేపరోళ్ళు అంతకన్నాను... ఇదిగిదిగో వేక్సిన్ వచ్చేసింది.. త్వరలో కరోనా ఖతం అని హెడ్డింగ్ పెడతారు.. గబగబా మొత్తం చదివితే చివ్వర్లో  అశ్వద్దామా హతహః కుంజరహః అన్నట్లు ఇంకో సంత్సరంలో తప్పకుండా వచ్చేస్తుంది అని చల్లగా చెప్పడం.. సంవత్సరం తర్వత ఎవరికి అవసరం?..

రెడ్ జోన్ లో ఇంటిదగ్గరే కూరగాయలు అమ్ముతారు కాబట్టి కాయగూరలు కొనడానికి వెళ్ళా.. కూరలబ్బాయి అర నిమిషానికోసారి ముక్కు మీద కర్చీఫ్ తియ్యడం బరబరమని గొకడం మళ్ళీ కర్చీఫ్ పైకి లాగడం.. నా నోరు ఊరుకోదుగా.. ఇప్పుడూ.. మూతికి ఎందుకు కట్టుకున్నావ్ అది అన్నాను.. కరోనా కదండి ఇది కట్టుకుంటేనే బయటకు వెళ్ళనిస్తున్నారండి ఇప్పుడు అన్నాడు.. అది సరే ఎందుకు కట్టుకోవాలి అంటున్నా... వైరస్ ముక్కులోకి వెళ్ళిపోద్ది అండి.. అన్నాడు ఇవన్ని నన్ను ఎందుకు అడుగుతున్నావ్ అన్నట్లు చూస్తూ... కదా.. మరి నువ్వు పాతికసార్లు ఈ కూరగాయలు అన్ని ముట్టుకుని అదే చేత్తో ముక్కు బర బర గోకేవనుకో వాటి మీద ఉన్న వైరస్ ముక్కులోకి వెళుతుందిగా... అందుకే ముక్కుని చేత్తో ముట్టుకోకూడదన్నమాట ..అసలే బయట మార్కెట్లనుండే ఎక్కువగా ఇది అందరికి అంటుకుంటుంది అన్నాను.. హమ్మయ్య ఒకరికి జ్ఞానోదయం చేసా అన్న సంతృప్తితో..

తీరా చూస్తే అతను ఉల్లిపాయలు తూయడం మానేసి కరెంట్ షాక్ కొట్టినవాడిలా బిగుసుకుపోయి భయంగా చూస్తూ అంటే ఇప్పుడు నాకు కరోనా వచ్చేస్తాదా అండీ అన్నాడు.. నేను కంగారుగా.. అబ్బెబ్బే ఈ రోజు ముట్టుకుంటే వచ్చేసింది అని కాదు.. ఇకమీదట అలా చెయ్యకూడదు అని చెప్తున్నా అన్నాను... అది కాదండీ ఈ విషయం తెలియకా దురదపుట్టేస్తుందని రోజూ ఇలాగే గోకుతున్నానండి..మా ఆడదానికి అసలే వొంట్లో బాగోదు.. ఇద్దరూ ఆడపిల్లలు.. ఇంకా పెళ్ళి కూడా చెయ్యలేదమ్మా ఏడుపు గొంతుతో చెప్తున్నాడు... నాకేం చెప్పాలో అర్ధం కాలేదు.. అంటే అది.. మరి.. అందరికీ వచ్చేస్తుంది అని కాదు.. వచ్చినా ఏం కాదట.. ఎవరో బీపి ,షుగరు ఉన్న వాళ్ళకి తప్పా మామోలోళ్ళకు ఏం కాదట..  ఉల్లిపాయలు కేజి ఇవ్వవా అన్నాను.. తొందరగా అక్కడినుండి వెళ్ళిపోదామని..అసలే పొయ్యిమీద కూర పెట్టేసొచ్చా... నాకు బీపి, షుగరు రెండూ ఉన్నాయమ్మా ఈ సారి మరింత భయంగా అన్నాడు... నాకేం చెప్పాలో తెలియలేదు.. అంటే మరి నీకు ఇప్పటికిప్పుడు వచ్చేసినట్లు కాదుగా.. జలుబు, దగ్గు ,జ్వరం అట్లాంటివి వస్తే అప్పుడు ఆలోచించాలి.. ఉల్లిపాయలు కేజీ అన్నాను.. తుమ్ములొచ్చినా అది జలుబే అవుతాదా అమ్మా నాకు అస్తమాను తుమ్ములొస్తాయి  అన్నాడు. నేను దీనంగా చూసా..ఇంతలో 202 పోర్షన్ ఆయన దిగాడు ఏంటండీ కరోనా టైంలో కబుర్లా హిహిహి అని నవ్వుకుంటూ.. అరే.. డబ్బులు తేవడం మర్చిపోయా.. మీరు తీసుకుంటూ ఉండండి ఇప్పుడే వస్తా అని ఇంటికి పరిగెట్టుకొచ్చేసా...

రాత్రి బట్టలు ఆరబెడుతుంటే ఎదురుగా ఉన్న ఏడు పోర్షన్ల ఇంటి పెరడులో ఒక ఇరవైమంది జనాలు రెండు వర్గాలుగా విడిపోయి వాదించుకుంటున్నారు.. లాక్డవున్ పెట్టడం తప్పా ,ఒప్పా అనే  పోయింట్ మీద.. ఒకపక్క పేకాట ఆడి పాతిక మందికి ...అష్టా, చెమ్మా ఆడి ముప్పై మందికి వచ్చిందని టీవీల్లో ఊదరగొడుతుంటే ఈ ఉప్పర మీటింగులు ఏంటిరా బాబు అని ఒక చెవేసి వింటున్నా..

అమెరికాయే అతలాకుతలం అయిపోతుంది 134 కోట్ల జనాభా.. ఏటయిపోతారనుకున్నావ్ లాక్ డవున్ ఎత్తేస్తే ఎవరో అంటున్నారు.. ఒయబ్బో అదొచ్చి చస్తామో బ్రతుకుతామో తెల్దుగాని ఆటో కిస్తా కట్టి రెండు నెలలవుతుండి... షాపుల్లేవు మాకు వచ్చే కిరాయే ఆడ కస్టమర్ల నుండి వొత్తాది.. ఆళ్ళు ఇళ్ళల్లో కూచుంటే రేపు లాక్డవున్ ఎత్తేస్తే ఎట్టా చావాలా.. కరోనా కంటే ఆకలితో చచ్చేలా ఉన్నాం.. అతని బాధ మూడంతస్తుల పైన వరకూ స్పష్టంగా వినబడుతుంది.. ఒక పక్క వలసకూలీలు వెతలు మరోపక్క బడుగు జీవుల కతలు..అయిన వాళ్ళ దగ్గరకు కష్టంలో వెళ్ళ లేని పరిస్తితి.. ఎవరి బాధలు వారివి.. ఏం చెయ్యాలో తెలియడంలేదు..

హాల్లో టీవిలో నుండి మెల్లగా వినబడుతుంది... గత యాబయ్యేళ్ళుగా ఏ ప్రభుత్వం చెయ్యలేని పని కరోనా చేసింది...స్వచ్చమైన నీటితో ప్రవహిస్తున్న గంగా యమునా నదులు.. వేల రకాల పక్షులు తరలి వస్తున్నాయి.. ప్రకృతి తనని తాను రిపేర్ చేసుకుంటుంది...


10, అక్టోబర్ 2012, బుధవారం

తాళి


చంద్రమతి తాళి భర్త హరిశ్చంద్రుడికి మాత్రమే కనబడుతుందట..అందుకే చీకటిలో స్మసానంలో  కాటికాపరి తాళి అడిగితే అతనే హరిశ్చంద్రుడని ఇట్టే అంటే అట్టేకనిపెట్టేస్తుంది చంద్రమతి అని పురాణాలు ఘోషించాయని మా తాతయ్య చిన్నప్పుడు ఏ ముహూర్తాన చెప్పారో అప్పటి నుండి తాళి అనేడిది భర్తకు మాత్రమే  కనిపించే వస్తువని ఇతరులు ఎట్టిపరిస్తితుల్లో చూడరాదని నాకు మైండ్లో ఘా..ట్టిగా ఫిక్స్ అయిపోయింది...


అందుకేనేమో చిన్నప్పుడూ అమ్మావాళ్ళతో పాత సినిమాకి వెళ్ళినప్పుడు ఆ సినిమాల్లో గో..ప్ప పతిభక్తి కలిగిన వీరోయిన్లు తాళి బొట్టు పైకే వేసుకుని భర్త పాదాలకు నమస్కరించినా , గుళ్ళుకీ గోపురాలకి తిరిగేసి పద్దాకా కళ్ళకద్దుకుని తెగ కష్ట పడిపోతున్నా  మా గొప్ప చిరాకొచ్చేసి సినిమా మధ్యలోనే ఇంటికెళ్ళిపోదాం అంటూ పేచీ పెట్టేసేదాన్ని..

అదొక్కటేనా మా మేనత్త ఈ తాళి విషయంలో రోజుకో సెంటిమెంట్ చెప్పి తెగ భయపెట్టేసింది ...తాళి బొట్టు నిద్రపోయి లేవగానే మెడ వెనుకగా వీపు వైపుకు చేరితే భర్త రెండో పెళ్ళి చేసుకుంటాడట... తాళి బొట్టు కొత్త చైను మారుస్తున్నప్పుడు ఇలా మెడలో తీసి అలా కంసాలికి ఇవ్వగానే వాళ్ళ ఆయనకు చెయ్యి విరిగిపోయిందట ..అందుకే ఏదో పధ్యం చదవాలట.. ఎవరికన్నా తాళి బొట్టు ఎరువుగా ఇస్తే(ఇవి కూడా అప్పులు,ఎరువులు  ఇచ్చుకుంటారా !!!) గనుక దాన్ని మరగేసి వేసుకోమని వాళ్ళకు చెప్పాలట..లేకపోతే వీళ్ళ ఆయన ఆ అమ్మాయికి దాసోహం అయిపోతాడట..అబ్బో ఇలాంటివి చాలా చెప్పేసి..తాళి అనగానే తుళ్ళిపడేలా భయంపెట్టేసింది మహా తల్లి...

కాని ఈ మంగళ సూత్రం విషయంలో ఒక్కో అమ్మాయికి ఒక్కో నిర్ధిష్టమైన అభిప్రాయాలు ఉంటాయని..అందరూ  నాకులా ఎదుటివాళ్ళు ఏం చెప్తే అదివినేసే రకాలు ఉండరని  మా అక్క పెళ్ళయ్యాకే తెలిసింది ... అక్క పెళ్ళయిన కొత్తలో ఓ ఆరునెలల పాటు  అది స్నానం చేసిన గంటకి మా నాన్నకి బిపి ఓ రేంజ్లో పెరిగిపోయేది... "శారదా!!" అని ఆయన శంకరశాస్త్రి అవతారం ఎత్తగానే మేమందరం అక్క మెడవైపు చూడటం అది యధావిది గా నాలుక్కొరుక్కుని మా వైపో క్లోజ్ అప్ యాడ్ ఇవ్వడం  ఆ వెంటనే అమ్మ " పెళ్ళయిన పిల్లకి ఇంత మతిమరపు ఉండకూడదమ్మా..హవ్వా ఎవరన్నా స్నానం పేరు చెప్పి మంగళ సూత్రం కొక్కాలకు,మేకులకు తగిలించి వదిలేస్తారా..ఎవరన్నా వింటే నవ్విపోతారు..అక్కడ కూడా ఇలాగే చేస్తున్నావా.. అని క్లాస్ పీకడం  మాకు అలవాటయిపోయింది..



ఓ రోజు ఈ బాధ పడలేకా..మా అక్కకు ఎలాగయినా  జ్ఞానోదయం కలిగిద్దాం అనే సంత్సంకల్పంతో  చంద్రమతి కధను అక్కకు చెప్పాలని నిర్ణయించుకుని ,ఎందుకయినా మంచిదని ఒకసారి  హరిశ్చంద్రుడి సినిమా చూసి మరీ ప్రిపేర్ అయివచ్చాను..కొద్దిగా చెప్పానో లేదో అది మధ్యలోనే ఆపేసి.." ఒసే పిచ్చ మొహమా మిగతా పురాణాలన్ని మగవాళ్ళు రాసినా ఈ చంద్రమతి స్టోరీ లో ఈ పార్ట్ మాత్రం ఖచ్చితంగా అమ్మాయే రాసింది... ఇప్పుడు తాళి బొట్టు అందరికీ కనబడేలా వేసుకుని  తిరిగామనుకో మనకి పెళ్ళయిపోయిన విషయం తెలిసిపోతుందికదా.. అప్పటివరకూ మనల్ని చూడగానే కళ్ళల్లో మతాబులు వెలిగించుకున్న అబ్బాయిలందరూ ..ఆ.. దీనికి పెళ్ళయిపోయింది ఇంకో అమ్మాయిని చూసుకుందాం అనేసుకుని వెళ్ళిపోతే మనసెంత గాయపడుతుంది ..అందుకే అన్నమాట భర్తకు తప్పించి ఇంకెవరికీ తాళి చూపకూడదని నియమం పెట్టారు..కాబట్టి నాన్నా,అన్న,తమ్ముడు లాంటి కొంతమందికి తప్పా ఇంకే మగాడికీ చూపించకూడదు అన్నమాటా.. పాపం నాన్నకు ఆ విషయం తెలియదంతే "అని నాకే జ్ఞానోదయం చేసి వెళ్ళిపోయింది.. ..



మరోసారి మా పెళ్ళయిన కొత్తలో ఒక ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే నీ తాళిబొట్టు ఏ చేత?? లక్క చేతా,జల్లెడ చేతా అని అడిగింది.."అంటే" అన్నాను అర్ధంకాక ... "ఏది నీ మోడల్ చూపించు చెప్తాను "అని బయటకు తీసి అదిరి పోయి బెదిరిపోయింది...అసలు మన తాళి అంటే ఆషా మాషీనా ఎంచక్కా ఫ్రెష్గా పౌర్ణమి  నోములు చేసుకుని కట్టుకున్న చంద్రికలు,ఇంకేదో నోముకోసం కట్టుకున్న పసుపుకొమ్ములు..,వరలక్షివ్రతం రూపులు ,చీరకోసం అని అట్టే పెట్టుకున్న ఓ అయిదారు  పిన్నులుతో కళ కళ లాడిపోతుంది .. "ఏంటే ఇది పూసలదానిలా ఈ దారాలేమిటి,కుంకాలేమిటి" అని దులిపేసింది..  "అదికాదే..సెంటిమెంట్ ... భర్త క్షేమం కోసమనీ చేయించారుగా అన్నాను "నసుగుతూ.

అది కూడా సేం మా అక్కలాగే సంబోధిస్తూ "ఓసి పిచ్చి మొహమా తాళి అంటే ఎవరు??భర్త ...భర్తకు మారు రూపం తాళి..అటువంటి  భర్తను నీట్గా ఉంచుకోవాలా వద్దా? మన అమ్మమ్మలు,నాన్నమ్మలు,అమ్మలు ఈ పురుషాధిక్య ప్రపంచంలో భర్తలను ఏమి అనలేక ఆ కసికోపం ఇలా భర్తకు మారు రూపమైన తాళికి పసుపులు కుంకాలు రాసేసి పిన్నులతో అలంకరించి మరీ తీర్చుకుంటారు..ఇప్పుడు జమనా బదల్ గయారే..కోపం వస్తే ఆ రాసేదో డైరెక్ట్గానే రాసేయచ్చు...కాబట్టి మన తాళి జిగేల్ జిగేల్మని మెరుస్తూ బాగుంటే మన బట్టలూ బాగుంటాయి ,భర్తా బాగుంటాడు.. అర్ధం అయ్యిందా అని మరో గొప్ప విషయం చెప్పింది...


ఇదిలా ఉంటే మా ఆయనకో కంప్యూటర్  ఇన్సిట్యూట్ ఉండేది ... అప్పట్లో ఒక అమ్మాయి మానస అని  వచ్చేది.... ఆ అమ్మాయి వస్తే చాలు జనాలందరూ ఎక్కడిపనులు అక్కడ వదిలేసి మరీ ఆ అమ్మాయిని తొంగి తొంగి చూసేవారు.. ఎందుకంటే మరి ఆ రోజుల్లో రెండు కోట్లు కట్నం ఇచ్చి పెళ్ళిచేసుకుందంటే ఆ మాత్రం క్రేజ్ ఉంటుందికదా .. ఏదో సామేత చెప్పినట్లు "తా దూర కంతలేదుగాని మెడకో డోలు" అని నాకొకటి కంప్యూటర్ రాదుగాని ఈ పిల్లను నాకు అప్పచెప్పారు నేర్పించమని...నేను ఎంచక్కా నాకొచ్చిన గేంస్ అన్ని నేర్పించేసి..పెయింట్ బ్రష్లో ఎడాపెడా నాలుగు బొమ్మలు గీసి చూపించేసి  ఆ తరువాత ఎంచక్కా ఇద్దరం  అత్తవారింట్లో ఆరళ్ళ గురించి ముచ్చట్లు పెట్టుకునేవాళ్ళం .. 


ఆ అమ్మాయి ఎప్పుడూ రాత్రి ఎనిమిది గంటలకు వెళ్తూ వెళ్తూ మెట్లు ఎంత స్పీడ్గా దిగివెళ్ళేదో అంతే స్పీడ్గా పైకొచ్చేసి అమ్మో మర్చిపోయాను అని మెడలో మంగళ సూత్రం టక్కున తీసేసి బ్యాగ్లో  పడేసి  వెళ్ళేది..అలా చేసినప్పుడల్లా "అదేంటండి అలా తీయకూడదు కదా భర్త కు హాని చేసినట్లుకదా" అని బుగ్గలు నొక్కుకొనేదాన్ని... "మీరు భలే వాళ్ళండి భర్తను ఎక్కడన్నా వదిలేసి వచ్చినా సేఫ్గా ఇంటికొచ్చేస్తాడు..అదే బంగారం పోతే మళ్ళీ తిరిగి వస్తుందా ...అయినా భర్తను ఒక సారి పెళ్ళి చేసుకున్నాకా వేల్యూ తగ్గుతుందేమోగాని పెరుగదు కదండి.. అదే బంగారం అయితేనా పెరగడమే పెరగడం అందునా నా తాళి పది కాసులు పెట్టి చేయించారు ..మీరెన్నన్నా చెప్పండి భర్త కంటే తాళే గొప్పది " అని ఇంకో గొప్ప విషయాన్ని నాకు చెప్పి జ్ఞానోదయం కలిగించింది..

ఇక అన్నిటికంటే లాస్ట్ జ్ఞానోదయం మొన్న జరిగింది..మాకో బీరకాయ పీచు అత్తగారు ఉన్నారు ..మొన్న వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ఆవిడ హడావుడిగా ఎక్కడికో వెళుతూ కంగారు పడిపోతుంది.."ఏమిటి అత్తయ్య ఏమైనా హెల్ప్ కావాలా " అనగానే "ఓ ఫ్రెండ్ కూతురి పెళ్ళికి వెళ్ళాలి.. అన్ని నగలు సెలెక్ట్ చేసుకున్నా కాని తాళి బొట్టు ఏం సెలెక్ట్ చేసుకోవాలో తెలియడం లేదు అంది"...నేను విన్నది కరక్టేనా అని డవుటొచ్చి పక్కకు చూస్తే మంచం మీద ఒక అయిదారు మంగళ సూత్రాల సెట్టులు జిగేల్మంటూ కనిపించాయి...ఏంటి క్రింద  పడిపోయారా ...మరదే నేను ఈ మధ్య కాస్త ఇలాంటి వాటికి రాటుదేలాను లెండి అందుకే వెంటనే తేరుకున్నా..మూడు కాసుల నుండి పదిహేను కాసులవరకూ వివిద రకాల చైన్లతో ,మధ్య మధ్య రాళ్ళు పొదగబడిన పతకాలు కూర్చి జిగేల్మనిపించే సూత్రాలన్నమాట..


ఆగాండాగండి ఇప్పుడు మీరేం అనుకుంటున్నారో చెప్తాను..మరీ విడ్డూరం కాకపోతే ఇన్ని తాళి బొట్టులు చేయించడం ఏమిటి ..ఎక్స్ట్రాలు అనేకదా... ..తప్పుకదా ..పైన అన్ని ఉదాహరణలు ఇచ్చినా అలా నెగిటివ్గా ఆలోచిస్తారా..నా అనుభవాల దృష్యానేను దీనికి మీనింగ్ చెప్తాను..ఇప్పుడూ తాళి అంటే ఏమిటి ..భర్త ..భర్త అంటే తాళి ...ఎంత సేపూ మన సోకులకే గాని భర్తకి ఏమన్నా చేయిద్దామని ఆలోచన మన ఆడవాళ్ళకు ఏ కొసన అయినా వస్తుందా..అబ్బే ... అందుకే మన భర్త గౌరవం మన భాద్యత  కాబట్టి భర్తకు మనం ఏం చేసినా చెయ్యకపోయినా ఇలా తాళినన్నా రక రకాల మోడల్స్లో చేయించుకుని భర్త గౌరవాన్ని నలుగురిలో గొప్పగా చాటుదాం..
అదండి మగ మహారాజులు సంగతి..అందుకని తాళి కట్టడంతోనే మీ బాధ్యత అయిపోలేదు..మీ గౌరవాన్ని మేము నిలబెట్టేలా మీరు కృషి చేయాలి ..అది సంగతి ..ఏమంటారు లేడీస్ ...


 

12, మే 2012, శనివారం

సంతూర్ సంతూర్


ఎక్క్యూజ్ మీ..... ఏం కాలేజ్ చదువుతున్నారు ....
కాలేజ్ నేనా ??????
మమ్మీ!!!!!!!! ...
పసుపు చందనా గుణాల కలయికా సంతూర్
చర్మం మిల మిల మెరిసే ఇక సంతూర్ సంతూర్
.....................................

యాడ్ చూడగానే ఘాడంగా నిట్టూర్చాను ఆ రోజు  ప్రొద్దున్న జరిగిన సంఘటన గుర్తొచ్చి .....
అచ్చం ఇలాగే ఆ యాడ్లో అమ్మాయిలా  ఒక్కదాన్నే నడుచుకుంటూ వెళుతుంటే ఒక అమ్మాయి పరిగెత్తుకుని వచ్చి నా ఎదురుగా నించుని ఆయాసం తీర్చుకుంటూ "ఎక్స్క్యూజ్ మీ!!! ..ఏం కాలేజ్ చదువుతున్నారు" అంది.....చేతిలో ఏదో అడ్డ్రెస్ పుచ్చుకుని ....
"కాలేజ్ నేనా !!! " రెండో డైలాగ్ ఫర్ఫెక్ట్ గా చెప్పాను ఏడుపు మొహం వేసుకుని...
ఆ అమ్మాయికి డవుట్ వచ్చి మూడో డైలాగ్ చెప్పేవాళ్ల  కోసం చుట్టూ చూసి నా కాళ్ళ వైపు చూసింది అనుమానంగా...
గొప్ప అవమానం అయిపోయింది.."నేను తొమ్మిదో తరగతి చదువుతున్నా "కోపంగా అనేసి మా స్కూల్లోకి పరిగెత్తాను..
ఆ అమ్మాయి టైడ్ యాడ్లో మురికి  చొక్కా అబ్బాయి తెల్లషర్ట్ అబ్బాయిని చూసి అవాక్కయిపోయినట్లు  అవాక్కయిపోయింది...

రెండో సంఘటన.....

"బుజ్జీ బుజ్జీ బుజ్జీ ...నీ వళ్ళంతా గజ్జి ...."మా పెద్ద తమ్ముడు ఆరువందల అరవయ్యోసారి ఏడిపించడం మొదలెట్టాడు..
నేను చెవులు గట్టిగా మూసుకుని ..."ఆ... ఏంటో ...నాకేం వినిపించడం లేదు ...నువ్వు ఏదో పెదాలు కదుపుతున్నావు అంతే..నా కసలు వినిపించనే లేదు.." పైకి బింకంగా అనేసి మా అమ్మ దగ్గరకు పరిగెత్తుకు వెళ్లి...
రెండుకాళ్ళు నేల కేసి టప, టపా కొడుతూ .."అన్ని ముద్దు పేర్లు ఉండగా ఎందుకమ్మా నాకు బుజ్జీ అని పెట్టావు..పెద్దమ్మ చూడు ఎంచక్కా పెద్దక్కను చిన్నూ అంటుంది.. దీన్నేమో శారు అంటారు ...దాన్ని బేబి అంటారు.. నన్నే ఎందుకమ్మా బుజ్జీ,బజ్జీ అని సుత్తి పేరుతో పిలుస్తారూ.. అని  ఏడుస్తూ అడిగాను..
"ఎహే ఆపు..బుజ్జిగా  ఉండేదానివి కాబట్టి బుజ్జీ అనేవాళ్ళం.. వాళ్ళు నీకులా లేరుకాబట్టి అనలేదు " మా అమ్మ సింపుల్గా కొట్టిపడేసింది..
"అది బుజ్జిగా కాదులే వదినా బండదానిలా ఉండేది ... ఎత్తుకోలేక చచ్చేవాళ్ళం ....కదా పెద్దోదినా..  మా ఆఖరు చిన్నాన్న పెద్దమ్మను రంగంలో దింపాడు..(కావాలనే అన్నాడు నాకు తెలుసు )
"మరే...పుట్టినప్పుడు ఎంచక్కా ౩ కేజీల బరువుతో ఎంత  బొద్దుగా ఉండేదని .... మోయలేక పోయేవాళ్ళం ..పెద్దమ్మ తూకాలు, కొలతలతో సహా ఆధారాలు ఇచ్చేసింది..
"అచ్చే ..మూడు కేజీలు కాదక్కా మూడున్నర అనుకుంటా " .... మా అమ్మను చూసినప్పుడల్లా అమయాకత్వానికి  కేరాఫ్ అడ్రెస్స్ మా ఇల్లే అనుకుంటాను ...

ముచ్చటగా మూడో సంఘటన ......

"నా పెద్ద మనవరాలిని ( మా అక్క అన్నమాట) ఈ ఇంటి కోడలిని చేసుకుంటా అని నా కూతురుకి మాటిచ్చాను.. అది కాదని ఇంకేవరినయినా తీసుకొచ్చి నా కొడుక్కి ( మా చిన్న మావయ్య) చేసారో ....ఖబడ్దార్ ...." మా అమ్మమ్మ హోల్సేల్గా అందరికి కలిపి వార్నింగ్ ఇచ్చింది .....

"మేనరికాలు మంచివి కావంటా ... పిల్లలు అంగ వైకల్యంతో పుడతారంట ... రేపు జరగరానిది ఏదైనా జరిగితే అప్పుడు ఏడ్చి లాభం ఉండదు.. వాడికి బయట సంబంధమే చేస్తాను ఎవరు అడ్డం వస్తారో చూస్తాను .."మా తాతయ్య మా అమ్మమ్మకు మాత్రమే వార్నింగ్ ఇచ్చారు..

"అమ్మా ...నేను దాన్ని చిన్నప్పటి నుండి ఎత్తుకుని తిప్పాను..చిన్న పిల్ల ..దానికి నాకు పదేళ్ళు తేడా ఉంది ....పెళ్లయినా మానేస్తాను కాని దాన్ని  చేసుకోనంతే "మా మావయ్య బెదిరించాడు..

"నువ్వు నోరు ముయ్యి, దాన్ని నువ్వు చూసి నాలుగేళ్లయింది .... ఇప్పుడెంత చక్కగా ఉందో తెలుసా ....ఆడపిల్ల ఎంతలో ఎదిగిపోవాలి ... నా మాట కాదని వేరే ఎవరినైనా చేసుకున్నావో నా ఫోటో మాత్రమే చూస్తావు తర్వాతా "  ..

అంతే ఆ తరువాత పే..ద్ద...ఆ  పే..ద్ద ..ఆ  గొడవలు అయిపోయి  మా అమ్మమ్మ ఊరికి ,మాకు దాదాపు ఆరు సంవత్సరాలు రాకపోకలు లేకుండా అయిపోయాయి... చివరాఖరికి మా అమ్మమ్మను బలవంతంగా ఒప్పించేసి మా మావయ్యకు వేరే అమ్మాయితో  పెళ్లి కుదిరాక, పది రోజులు ముందుగా నన్ను పంపించారు పెళ్ళికి  ...
 
అదేంటో అమ్మమ్మ ఇల్లంటే ఆడపిల్లలకు గొప్ప అలుసు కదా.. బస్సు దిగగానే రోడ్ మీదే మొదలు పెట్టాను నా చిట్టా పద్దు కోరికలు.."మావయ్య నాకు విసిఆర్ కావాలి .. ముఖ్యంగా  అమీర్ ఖాన్   ఖయామత్ సే ఖయామతక్   సినిమా  తెప్పించాలి... ఇంకా 1942   ఏ  లవ్ స్టోరి కావాలి  ....ఇంకా  "..

"ఇంక  నోరు మూస్తావా ... ఇది పల్లెటూరు ..ఇక్కడ హిందీ సినిమాలు ఎవరు చూస్తారు ???...ఆడపిల్లన్నాకా సుబ్బరంగా పెద్ద వాళ్లకు హెల్ప్ చెయ్యాలి ..ఇలాంటి పిచ్చి సినిమాలు చూడకూడదు.." మావయ్య క్లాస్ పీకాడు...

"నాకు సినిమాలు చూపించవా!!!! ..నేను మా ఊరు వెళ్ళిపోతాను పో..నా బ్యాగ్ నాకిచ్చేసే..అమ్మమ్మ కి చెప్తాను నీ పని "...అని రోడ్ మీద చిందులు తోక్కేస్తుంటే .... అల్లం మామ్మ చూసింది దూరం నుంచి..(ఆవిడ పేరేమిటో తెలియదు అల్లం మామ్మ అంటారు)..

"ఎవర్రా చిన్నోడా నీతో ఉన్న అమ్మాయి " ఘాట్టిగా పిలిచ్చింది ....

"చూసేసిన్దిరా బాబు "విసుక్కుంటూ ...మా అక్క కూతురు మామ్మా అన్నాడు.. "ఎవరూ మన పెద్దమ్మడు కూతురే... దీన్నేనా చిన్నపిల్ల అని చేసుకోనన్నావు "నన్ను దగ్గరకు తీసుకుని అడిగింది ఆరాగా ..నేను ఎంచక్కా జామకాయ తింటూ పక్కన కూర్చున్నాను..

 మరి ఎక్కడి నుండి వచ్చిందో మా అమ్మమ్మ .... "ఇదికాదు పిన్ని దీనికంటే పెద్దది.. మహా లక్ష్మిలా ఉంటుంది ..వెధవ సచ్చినోడికి చిన్నపిల్లలా కనబడిందట "..మా అమ్మమ్మ మొటికలు విరిచేసింది..

 "ఇది చిన్నపిల్లేంటి ..బంగారు బొమ్మలా ఉంది ..చక్కగా చీరకట్టి రూపయకాసంత బొట్టు పెడితే  ఇద్దరు పిల్లల తల్లిలా ఉంటుంది ... నీకేం పోయేకాలంరా అని కయ్ మంది అల్లం మామ్మ ..

వాళ్ళ పొగడ్తలకు సంతోషించాలో ,లేక వేరే కోణంలో బాధపడాలో తేల్చుకోక మునుపే ఎంచక్కా నాలుగు వీధుల్లో ఆడవాళ్ళు  పోగయిపోయి (పల్లెటూరు కదా...ఒక ఇంటి సమస్య ఊరంతటికి  కావాలి  ) మా మావయ్యని, పనిలో పని మా తాతయ్యని బోలెడు తిట్లు, శాపనార్ధాలు పెట్టేసి మా అమ్మమ్మని ఓదార్చి వెళ్ళిపోయారు..(మా అల్లం మామ్మ మాత్రం  ఆ తరువాత దాదాపు  అయిదేళ్ళు మా మావయ్యను ఏకి, పీకి పందిరేసిందట  ..ఈ ముక్క మా చిన్నత్త వచ్చినప్పుడల్లా చెప్పి నవ్వుతుంది)

ఆ దెబ్బతో మా మావయ్య నన్ను ఇంటికి తీసుకువెళ్ళి .."నిన్నేవడే  పది రోజులు ముందు రమ్మనాడు..నీకు అమీర్ ఖాన్ ,సల్మాన్ ఖాన్  ,షారుఖ్ ఖాన్  ఏ ఖాన్ కావాలంటే ఆ సిన్మాలు ..మా వూర్లో దొరక్కపోతే పక్కూరు నుండి అయినా  తెచ్చి పడేస్తాను  కాని నువ్వు గుమ్మం దాటి బయటకురాకు తల్లో "అని దీనంగా వేడుకున్నాడు..

అక్కడితో ఊరుకున్నాడా దొంగ మొహం ....ఎంచక్కా పెళ్ళిలో కట్టుకుందామని  నేను ముచ్చట పడి  కొనుక్కున్న పరికిణి ,వోణి వేయనివ్వకుండా "అక్కా దీన్ని చూసి ఇదే పెద్దదనుకుని సంబంధాలు వచ్చేస్తున్నాయి..తర్వాత   నీఇష్టం" అని మా అమ్మ మనసు చెడగోట్టేసాడు... ఆ దెబ్బతో నేను అరిచి గీ పెట్టినా మా అక్క పెళ్లి అయ్యేంత వరకూ మహా తల్లి నన్ను పరికిణి ,వోణి వెయ్యనివ్వలేదు.. ఆ తరువాత నేను కొత్తవి కొనుక్కునేలోపే నా పెళ్లి చేసేసారు ..అలా నా జీవితంలో పరికిణి ,వోణి అనేది ఒక కల క్రింద మిగిలిపోయింది.

ఇలా ఉండగా మరి మా అమ్మకు ఎవరు ఏం చెప్పారో మరి పాపం..ఒక రోజు నా దగ్గరకొచ్చి బుజ్జీ! మరేమో ఈ రోజు నుండి రాత్రిళ్ళు నువ్వు చపాతి తిను అంది ...నేనసలు మూడు పూటలా ఆరు సార్లు అన్నం పెట్టినా తింటాను గానీ ఒక పూట టిఫిన్ తినమంటే ఏడుస్తా .." ఏంటి చపాతీయా..ఛీ ఛీ నావల్లకాదు "అని తేల్చి  చెప్పేసాను  ... అలాకాదుగాని  రాత్రిళ్ళు చపాతి తింటే చాలా మంచిదంట తినాల్సిందే అని ఆర్డరేసి వెళ్ళింది.. సరే అని చపాతి ప్లేట్ ముందు పెట్టుకోగానే మా అక్క ఎదురుగా ఆవకాయ అన్నం నెయ్యి వేసుకుని ఎంచక్కా తింటుంటే ఆగలేక ఆ పళ్ళెం పక్కన పడేసి మామూలుగానే అన్నం తినేసా..అమ్మొచ్చి ప్లేట్ చూసి "అదేంటి చపాతి తినలేదా "అంది ... "ఉహు నాకొద్దు ఆ ఆరోగ్యమేదో నువ్వే తెచ్చుకో ..అయినా వాళ్ళెవరికీ పెట్టకుండా నాకే పెడతావేంటి..వాళ్ళకు అక్కరలేదా ఆరోగ్యం  "విసుగ్గా అన్నా.."ఒసే గాడిదా..నువ్వు ఇలా అన్నం తింటే వళ్ళు తగ్గదు.. ఎవడూ నిన్ను పెళ్లి చేసుకోడు" కోపంగా అనేసి వెళ్ళిపోయింది...

అంతే మేటర్ క్లియర్గా అర్ధం అయిపోయింది.. ఆ షాక్ కి ముందు ఏడుపోచ్చ్సింది, తరువాత కోపం వచ్చింది ,ఆ తరువాత నోట్లోంచి పాట వచ్చింది..దేవుడి రూంలోకి వెళ్లి నాకు తెలిసిన దేవుడి పాటలన్నీ పాడేసుకుని ...హే భగవాన్ ..నేనేం తప్పు చేసాను... తిండి కూడా ఏం తినను కదా మరెందుకు ఇలా నన్ను లావుగా చేసేస్తున్నావు..నాకసలే ఎక్సర్ సైజులు,డైటింగు లు  గట్రాలు పడవు..నువ్వేం చేస్తావో నాకేం తెలియదు పెళ్లి అయ్యేలోపు నేను సన్నంగా మెరుపు తీగలా అయిపోవాలంతే అని కోరేసుకున్నా ...(దేవుడికి నేనంటే చాలా ఇష్టం .... నిజంగా నిజంగా నేను ఏమి చెయ్యకుండానే పెళ్లి టైంకి దాదాపు 12 కేజీలు తగ్గిపోయా ..ఆఖరికి పిల్లలు పుట్టినా సరే యాబై కేజీలు  ఇప్పటివరకు దాటలేదు ...ఇక మీదట విషయం తెలియదనుకోండి ముందు జాగ్రత్తగా చెప్పేస్తున్నా :D)

ఫ్లాష్ బ్యాకులు అయిపోయాయి..అలా నా బండతనం  వల్ల ..ఛీ ఛీ...కాదు కాదు.. నా బొద్దుతనం వల్ల ఎన్ని బాధలు పడ్డానో ఒకటా రెండా ఎన్నని చెప్పను.. ఆ దెబ్బతో పైన చెప్పిన సంతూర్ యాడ్ నా మనసుమీద తీవ్ర ప్రభావం చూపేసింది.. నేను కూడా పెళ్లయినా సరే,పిల్లలు పుట్టినాసరే...స్లిమ్ముగా ,చక్కగా మెరుపు తీగలా ఉంటే,ఆ యాడ్ లోలా నన్ను కూడా ఏం కాలేజ్ అనడిగితే ,నా కూతురు మమ్మీ అని పరిగేట్టుకొస్తే  ఎంత బాగుంటుందో కదా అని తెగ కలలు కనేసేదాన్ని..అసలందుకే నాకు ముందు అమ్మాయే పుట్టాలని కోరుకున్నాను కూడా :P
అలా పెళ్లికాకుండానే ఒక చిన్నపిల్లకి తల్లిగా  మారాకా  ఎలా ఉండాలో  అని తీవ్రంగా ఆలోచిస్తుండగానే పెళ్ళయిపోయింది..నేను సింగపూర్ వెళ్ళిపోయాను...పిల్లలు పుట్టేసారు  ..వాళ్లకు నెస్టంలు  తినిపించాడాలు,డైపర్లు మార్చడంలు ,స్కూళ్ళు,చదువులు, చట్టుబండలు   వరసపెట్టేసాయి ...ఇంకేంటి నేను ఆ గోలలో పడి యాడ్ సంగతి మర్చిపోయాను ..

ఆ తరువాత ఇన్నాళ్ళకు మొన్న టివి పెట్టి చూస్తుంటే మహేష్ బాబు  సంతూర్ యాడ్లో వచ్చి "దేవుడు వరమిచ్చినా  పూజారి పడనివ్వలేదని..నువ్వు సన్నంగా అయినా ,మొదట నీకు కూతురు పుట్టినా  నీ కోరిక తీర్చుకోలేకపోయావు..రాసి పెట్టి ఉండాలి" అని  సోప్ పుచ్చుకు కొట్టినంత పనిచేసేసరికి టక్కున ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చింది.. ఆ వెంటనే బడేలు కొంగలా నా అంత ఎత్తు ఎదిగిన నా కూతురు ని చూసి ఏడుపొచ్చింది(మా ఆడపడుచు పోలిక,పైగా ఇంతెత్తు హీలొకటి వేస్తుంది గాడిద ) ..ఎంత పనయ్యింది దేవుడా  !!!! .... ఎంచక్కా దానికి 3 ఏళ్ళ వయసు వచ్చేసరికి ఇండియా వచ్చినప్పుడల్లా   దాన్ని తీసుకుని మా కాలేజ్  వైపు తిరిగితే ఎవరో ఒకరు నా కల తీర్చేవారు కదా (మనిషి ఆశా జీవి) ఇప్పుడు ఎవరంటారు నా మొహం  అని ఘాడంగా నిట్టూర్చి  ఊరుకున్నా ...

చెప్పానుగా దేవుడికి నేనంటే   బోలెడు ఇష్టం అని ...నమ్మట్లేదుగా మీరెవరూ.. సరే వినండి...

అయితే మొన్న మా పక్క పోర్షన్ వాళ్ళ అబ్బాయి పెళ్లి జరిగిందని కొత్తకోడలితో సత్యన్నారాయణ స్వామి  వ్రతం చేస్తున్నారు .... పేరంటానికి రమ్మంటేనూ....     ఆ ....జస్ట్ తాంబూలమే కదా అని డ్రెస్ వేసుకుని  వెళ్లాను.. జనాలందరూ హడావుడిగా తిరుగుతుంటే పెళ్లి కొడుకు చెల్లెలు రెండు మూడుసార్లు నన్ను చూసి నవ్వింది ..నేను కూడా నవ్వాను..

నాకు తెలుసు నాకు తెలుసు .. ఇప్పుడేమనుకుంటున్నారో ... ఆ అమ్మాయి వచ్చ్చి" ఎక్స్క్యూజ్మీ ..మీరేం కాలేజ్ "అని అనిఉంటుంది  అనుకుంటున్నారు కదా... హిహిహి కాదు వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్లి ఎవరా అమ్మాయి నేను ఇదే చూడటం అన్నాది..ఆయనేమో ఆ హడావుడిలో నన్ను పరిచయం చేస్తూ" నువ్వు చూడలేదు కదూ  ఈ అమ్మాయిని..ఈ మధ్యనే ఇండియా వచ్చింది..మన  పక్కింటిఆవిడ మనవరాలు"..అని మా అత్తగారి వైపు నా వైపు చూపిస్తూ  పరిచయం చేసారు...  నేనేం ఢాం  అని పడిపోలేదు...అంటే పొరపాటున కోడలు అనాబోయి మనవరాలు అనేసారనుకుని ..చిన్నగా నవ్వాను...ఓ పక్కాంటీ  మనవరాలా  అని ఆ అమ్మాయి పలకరింపుగా నవ్వింది..""అవును వాళ్ళ తమ్ముడు కూడా ఉండాలి బయట ఆడుకుంటున్నట్లున్నాడు"" అన్నారు ఆయన  ...
అప్పుడు ..అప్పుడు  వెలిగింది లైటు ..అప్పుడు " ఢాం  "అని పడిపోయాను ..( చెప్పానా దేవుడున్నాడని..) మా అత్తగారి ఫేస్ ఎక్ప్రేషన్స్ గట్రాలు నేనేం చూడలేదమ్మా ..అందుకే నో కామెంట్ అన్నమాట .... ఈ లోపల రాబోయే ప్రమాదాన్ని గ్రహించిన  వాళ్ళ ఆవిడ పరిగెత్తుకొచ్చి " ఏమండోయ్ ఈ అమ్మాయి ఆవిడ  పెద్దకోడలు ....మనవరాలు కాదు  అని అరిచి సారి అండీ మా ఆయన పొరబడ్డారు" అంది...

ఆ తరువాత ఆయన కూడా నాలుగు సార్లు నా దగ్గరకోచ్చ్చి" సారి అమ్మా..పొరబడ్డాను..మీ అమ్మాయి నీ పోలికలే కదా..కాస్త పొడవు కదా.. అయినా మీ అమ్మాయిని దూరం నుండి చూసాను అందుకే సరిగ్గా గుర్తుపట్టలేక నిన్నే తను అనుకున్నా .." అని మొత్తుకున్నా సరే నా మెదడేంటో ఆయన చెప్పిన మొదటి మాటకే ఫిక్స్ అయిపోయింది ..పైగా వాళ్ళమ్మాయి అయితే ఇది మీకు బెస్ట్ కాంప్లిమెంట్ యూ నో అన్నాది కూడా...
అయితే  మిగిలినవాళ్ళు అసూయతో రక రకాల కారణాలు చెప్పి నన్ను చాలా చాలా  డిసప్పొయింట్ చెయ్యాలని చూసారుగాని (అంటే మా ఆయన , ఇతర కుటుంభ సబ్యులు వగైరాలన్నమాట )..ఇష్ష్ ..
తప్పు కదా పెదరాయుడు లాంటి పక్కింటి పెదనాన్న గారు  అబధ్దం చెప్తారా? కళ్ళుపోతాయ్.. లెంపలేసుకోండీ..
 పైగా  పెద్దవాళ్ళ మాటలు మనం తప్పు పట్టకూడదు కూడానూ   అందుకని అవన్ని ఇగ్నోర్ చేసేసాను..మీరు కూడా చేసేయండి..మనసులో అటువంటి వ్యతిరేకపు ఆలోచనలు రానివ్వకండి.. రావులేండి మంచివాళ్ళకు అటువంటి అనుమానాలు రావు......ఆ విషయం మీకు కూడా తెలుసనుకోండి..

ఇదంతా కాదుగాని నాకో గొప్ప డవుటేమిటంటే సంతూర్ సోప్ యాడ్ చూస్తేనే ఇంత చిన్నదానిలా కనబడిపోతుంటే అది వాడితే ఎలా ఉంటుందా అని.. బహుసా ఒక పాతికేళ్ళ తరువాత.. 
ఎక్స్క్యూజ్ మీ
ఏం కాలేజ్ చదువుతున్నారు మీరు
కాలేజ్ నేనా!!!!
అమ్మమ్మా.... ( నా మనవరాలు పరిగెత్తుకొస్తూ )

28, నవంబర్ 2011, సోమవారం

నేను చూసిన మలేషియా

అప్పుడెప్పుడో రాద్దామనుకున్నా పోస్ట్ అన్నమాట ఇది..నా జ్ఞాపకాల్లో ముఖ్యమైనదినూ పనిలో పని సింగపూర్ ,ఇండోనేషియ,మలేషియా చూడాలనుకునే వాళ్లకు ఉపయోగకరంగా ఉంటుంది అనీను రాస్తున్నా..

ముందు మలేషియా గురించి చెప్పుకుందాం..మేమసలు సింగపూర్ రాక మునుపు ఓ వెన్నెల రాత్రి చందమామను చూస్తూ విదేశాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ మలేషియా ప్రస్తావన వచ్చింది ...నీకు తెలుసా బుజ్జీ సింగపూర్ నుండి మలేషియాకు సముద్రంలో వంతెన కట్టేసారట ...మా ఉదయ్ లేడూ..వాడు చెప్పాడు.. టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందో కదా అనగానే నేను ఓ రేంజ్లో ఆశ్చర్యంగా నోరుతెరుచుకుని ఉండిపోయాను ...

"నిజ్జంగానా...మన గోదావరి బ్రిడ్జ్ చూసే నాకు మతిపోతుంది ఎలా కట్టారా అని..... అలాంటిది ఆ అలల్లో ఇంకో దేశానికి వంతెన కట్టేయడమే ..హ్మ్మం మానవుడు సామాన్యుడు కాదండి ...ఈ లెక్కన రామాయణం నిజమే నన్నమాట ..." అని బోలెడు బోలెడు హాచ్చర్య పడిపోయాను..

విధి విచిత్రమైనది..బోలెడు అద్భుతాలు చూపిస్తుంది... ఆ మాట అనుకున్న సంవత్సరం కూడా తిరక్కుండానే నన్ను మలేషియా ఎంబసి దగ్గర నించో పెట్టింది ...సింగపూర్ వచ్చ్సిన నెలరోజులకే నేనే నేనే వీసా తెచ్చాను.. వద్దులెండి అదో పెద్ద కధ ...ఆ విషయం తరువాత చెప్పుకుందాం..ప్యాకేజ్ లలో కాకుండా మనకు మనమే స్వయంగా వెళ్లి చూసేసోద్దాం అని మా ఆయన అనేసరికి సరే అని మరుసటి రోజు రాత్రి వుడ్ లాండ్స్ అనే ఊరికి బయలు దేరాం ...మా సింగపూర్లో ఏ మూల నుండి ఏ మూలకి వెళ్ళినా గట్టిగా గంటన్నర జర్నీ ఉంటుంది ....ఇక రాత్రే ఎందుకు బయలుదేరాం అంటే .. సింగపూర్ నుండి కౌలాలం పూర్ (మలేషియా రాజధాని ) బస్లో ఒక నాలుగు గంటలు జర్నీ ఉంటుంది అంతే ...కాబట్టి రాత్రి జర్నీ వల్ల మనకు రోజు మొత్తం కలసి వస్తుంది కదా..


అయితే ట్రైన్ లో కూడా వెళ్ళొచ్చు..కాని మీరు మాత్రం ట్రైన్లో అస్సలు వెళ్లొద్దు..పరమ ,శుద్ద వేస్ట్.. మేము నెక్స్ట్ టైం ట్రైన్ లో వెళ్లి మా చెప్పులు తెగేలా కొట్టుకున్నాం ...ఎందుకంటే ట్రైన్లో వెళితే టిక్కెట్ రేట్ త్రిబుల్ ఉంటుంది..పైగా జర్నీ వచ్చీ పన్నెండు గంటలు ...(బస్సులో ఎంత స్లో వెళ్ళినా నాలుగు గంటలే ) ఇంకా రాత్రి పడుకున్నప్పుడు ఆ కుదుపులకు ట్రైన్ పడిపోతుందేమో అన్నంత భయం వేసేసింది.. మన ఇండియాలో ట్రైన్లు లో ఎంత హాయిగా పడుకుంటాం..ఇదయితే ప్రొద్దున్న లేచ్చేసరికి ముసుగేసి చితక్కోట్టేసినట్లు ఒళ్ళంతా నెప్పులే నెప్పులు...వచ్చేప్పుడు భయపడి కూర్చుని వచ్చాం ... మరెందుకు ట్రైన్ పెట్టారో ..ఇంకెందుకు జనాలు దానిలో వెళతారో ఆ ట్రైన్ పెట్టినవాడికే తెలియాలి..



సరే ఎంత వరకూ చెప్పుకున్నాం..హా..వుడ్లాన్డ్స్ లో ఇమిగ్రేషన్ దగ్గర .. వీసాలు గట్రాలు లగేజ్లు అన్ని చెక్ చేసుకున్నకా ... అక్కడి నుండి జోహార్ బరు (JB )అనే ఊరుకి బస్ ఉంటుంది ...ఇంకేంటి అదే మలేషియా ..అంటే మలేషియా బోర్డర్ అన్నమాట ....అంటే సముద్రంలో కట్టిన వంతెన మీద మరో దేశానికి ..అచ్చంగా మరో దేశానికి వెళ్ళిపోతాం అన్నమాట..అసలు చదువుతున్న మీకే ఇంత ఒళ్ళు పులకరించిపోతుంటే వెళుతున్న నాకెలా ఉండి ఉంటుంది..ఆ అనుభూతిని సొంతం చేసుకోవడానికి ప్రిపేర్ అవుతూ గట్టిగా ఊపిరి పీల్చి తన్మయంగా కళ్ళు మూసుకుని మెల్లిగా కళ్ళు తెరిచేసరికి బస్ ఆపేసాడు ...పద పద మలేషియా వచ్చేసింది అన్నారు మా ఆయన :(... అప్పుడే వచ్చేసామా !!!! మరి వంతెనో అనగానే ..ఇందాక దాటేసాం కదా అన్నారు..అదన్నమాట సంగతి ...అంటే మన ఊర్లో గోదావరి బ్రిడ్జ్లో సగంలో సగం...ఛీ ఎందుకులెండి ఓ పిల్లకాలువ పైన ఉన్నంత బ్రిడ్జ్ ఉందన్నమాట అంతే...పాపం మా సింగపూరోళ్లు దూరమైతే కట్టేసేవాళ్ళమ్మా ..కాని ప్రక్క ప్రక్కనే ఉన్నాయి రెండు దేశాలునూ... వాళ్ళుమాత్రం ఏం చేస్తారూ!!!..



అలా జే బి బస్ స్టాండ్లో నిన్చున్నామా ...అక్కడ వరుసగా బోలెడు బస్సులున్నాయి ...కౌలాలంపూర్ కౌలాలం పూర్ అని పిలిచిమరీ టిక్కెట్స్ ఇస్తున్నారు..మేము రాత్రి ఒంటిగంటకు ఒక బస్ ఎక్కాం .... చెప్పానుగా మధ్యలో వాడు అరగంట రెస్ట్ రూమ్స్ దగ్గర ఆపినా నాలుగు గంటలే జర్నీ ...సరే సరిగ్గా అయిదింటికల్లా మలేషియాలో పుదురాయ బస్ స్టాప్లో దిగాం ...మేము మొదటి సారి మలేషియా వెళ్ళినప్పుడు హోటల్ గెంటింగ్ (జెంటింగ్) లో తీసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయాం అనుకోండి ...కాని ముందు నేను కే ఎల్ లో ముఖ్యమైన ప్లేస్లు చెప్పేస్తాను ...



కే ఎల్ లో ముఖ్య మైనవి ఊ..మామూలుగా ట్విన్ టవర్స్ ...ఇంకా కే ఎల్ టవర్ ...ఇంకా బటూ కేవ్స్ ,ఇంకా జెంటింగ్,ఇంకా సన్ వే లగూన్ ,ఇంకా అండర్ వాటర్ వరల్డ్.. ఓపిక ఉంటే బర్డ్స్ పార్క్,జూ ఇలా అన్నమాట..అయితే ఇక్కడ హోటల్ వాడు అరేంజ్ చేసిన టాక్సీ ఎక్కామో సీన్ సితారే అన్నమాట.. వాడు గంటకు 80 రింగేట్స్ అడిగాడు ...అంటే రోజులో ఒక ఏడుగంటలు తిరిగామనుకోండి ఎంతవుతుందో లేక్కేసుకోండి ... మా ఆయన సరే అనేసారు ఎంచక్కా తల ఊపేసి ...నేను ఆ అరాచకాన్ని సహించలేక మేము బయటకొచ్చి తింటున్న తమిళ్ ఫుడ్ సెంటర్ వాడిని అడిగాను..



ఇక్కడ హోటల్ అంటే గుర్తొచ్చింది ...మలేషియాలో ఫుడ్ సూపర్ డూపర్ చీప్ (అంటే మా సింగపూర్ తో పోలిస్తే )మాకు పది డాలర్లకు వచ్చేది అక్కడ ఐదు డాలర్లకే వస్తుంది..సగానికి సగం తేడా ఉంటుంది..అది ఫుడ్ అయినా బట్టలయినా సరే ... అంటే కళ్ళు చెదిరే షాపింగ్ కాంప్లెక్స్లో కొద్దిగా బేండ్ వేస్తాడు...కాబట్టి బట్టలు లాంటివి బయట షాప్స్లో కొంటే బాగా కలిసొస్తుంది.. అయితే ఇక్కడ మరొక విషయం తమిళియన్స్ ...అబ్బా నాకు తమిలియన్స్లో నచ్చేవిషయం ఏమిటంటే వాళ్ళ ప్రాంతం వారి పై ఇంకా వాళ్ళ భాష పై ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం.. ఎలాంటి సహాయం అయినా అడగకుండా చేస్తారు..అదే కొద్దిగా తమిళ్ ముక్కలు రాకపోయినా మాట్లాడటాని ట్రై చేసామనుకోండి మనకు నీరాజనాలే..



అందుకే ఆ హోటల్ తమిళ్ ఓనర్ తో " అన్నా.... ఎనకు తమిళ్ తెరియాదు ....ఆనా రొంబ పుడికం.... కొంజెం కొంజెం పురియుం.. ..హెల్ప్ పన్ను" అని ఎంతో ఇదిగా నా తమిళ్ సీరియల్స్ ప్రతిభను ఉపయోగించి అడిగేసరికి అతనే ఒక కేబ్ అబ్బాయిని పిలిచి దగ్గరుండి బేరమాడి మాకు హెల్ప్ చేసాడు .. ఎంతో చెప్పనా..... మొత్తం రోజంతటికీ ౩౦౦ రింగేట్స్ ...కాబట్టి ఎంచక్కా నేను చెప్పినట్లు చెయ్యండి ..



ఆ కేబ్ అబ్బాయి ఎంచక్కా అసలు లిస్టు లో లేని చాలా ప్లేస్లు తిప్పాడు ...ఏవో ముస్లిం భవనాలు,హైకోర్ట్ , ఇంకా ఏంటో ఏంటో లే ...మనం అవన్నీ వదిలేసి ముఖ్యమైనవి చెప్పుకుందాం...




ట్విన్ టవర్స్ ..మొదటి సారి మలేషియా వెళ్ళినప్పుడు నేను ట్విన్ టవర్స్ చూడలేదు.. సుత్తిలే ఎవడు చూస్తాడు టీవి లో చూసాం గా అని..మనకు ఏది ఓ పట్టాన ఎక్కదుగా... కౌలాలం పూర్లో ఎక్కడ తిరుగు... ఈ ట్విన్ టవర్ కనబడుతూనే ఉంటుంది ... కాని ఆ తరువాత చాలా సార్లు వీటిని చూడటానికే ప్రత్యేకంగా వెళ్లాను అంటే అర్ధం చేసుకోండి ..ఎంత బాగుంటుందో.. వీటిని పగలు చూస్తే ఏం బాగోవు మామూలుగా ఉంటుంది ...కాని రాత్రి చూస్తే మాత్రం అక్కడే కూర్చుని వాటిని చూస్తూ తెల్లార్లూ గడిపేద్దాం అనిపిస్తుంది.. ఎంత బాగుంటుందో..నాకు వర్ణించడం రావట్లేదు మరి.. ఇది కట్టించడానికి ఏదో కారణం చెప్పాడబ్బా కేబ్ వాడు ...సమయానికి నాకు గుర్తురావడం లేదు..అయితే ఈ టవర్స్ ని ఎక్కాలంటే ప్రొద్దున్నే లేచి అయిదుగంట్లకో ఎప్పుడో క్యూలో నించుంటే ఒక రెందొందలమంది పంపుతాడట... హిహిహిహి మనసంగతి తెలుసుగా ..ఇప్పటికోచ్చి ఎక్కలేదు ఎన్నిసార్లు వెళ్ళినా..




ఇంకొకటి కే ఎల్ టవర్ దీన్ని కూడా నేను ఎక్కలేదు ..దూరం నుండి చూసాను అంతే... కాబట్టి తెలియదు దీని గురించి..








ఇక బటు కేవ్స్ ..ఇది సూపర్ డూపర్ ..చాలా సినిమాల్లో ఈ గుడిని తీసారు.. పే........ద్ద సుభ్రమణ్య స్వామీ విగ్రహం ఉంటుంది ... సూపర్ అంతే ...అక్కడో నాలుగు వందల మెట్ల ఎత్తోలో గుడి ఉంటుంది పైన గుహలో ... ఆ మేట్లేక్కేసరికి కాళ్ళు పడిపోతాయి.. కాని లోపల చాలా బాగుంటుంది.. ఇంకా దారంతా కోతులు ..ఆ జనాలను చూస్తే నాకు తిరపతి గుర్తొచ్చింది.. అన్నట్లు మర్చిపోయాను ఈ పూజలు వ్రతాలూ అంటే ఏ మాటకామాట చెప్పుకోవాలి..తమిళియన్సే ...బాగా చేస్తారు...







ఇంకా సన్వే లగూన్ ....ఇదేమో పెద్ద వాటర్ వరల్డ్ అన్నమాట ...దీని దగ్గరకు వెళ్ళాలంటే అలా ఎన్ని ఫ్లోర్స్ క్రిందకు దిగాలో ...బయట నుండి చూస్తేనే సూపర్ డూపర్ బంపర్ ఉంటుంది ...అసలు పిల్లలు ఉన్నవాళ్ళు దీనికోసమే మలేషియా వెళతారు...




అండర్ వాటర్ వరల్డ్..ఇది అచ్చం సింగపూర్ లానే ఉంటుంది ...అస్సలేం తేడా ఉండదు.. ఆ చేపలు గట్రాలు అన్ని సేమ్ సేమ్ కాని ... ఆ లోపల డెకరేషన్ కి నేను పడిపోయాను..అదేదో బృందావనం లా ఇంకేదో లోకంలా ...లోపల అన్ని లతలు తీగలు ,పళ్ళు,కాయలు అబ్బబ్బబ్బా నాకయితే ఎంత నచ్చేసిందో.. నా కోసమయినా వెళ్ళండి అంతే అంతే ...

హా ఇక్కడ ఇంకొకటి చెప్పాలి ..ఇక్కడ ఎక్కడకు వెళ్ళినా చాక్లెట్ ఫ్యాక్టరీలని,లెదర్ ఫ్యాక్టరీలని అంతా ప్యూర్ చాక్లెట్ ,లెదర్ దొరుకుతుందని కేబ్ వాళ్ళు మనల్ని మొహమాటం కూడా పెట్టకుండా తీసుకు వెళ్ళిపోతారు ...వాళ్లకు వాళ్లకు ఏవో ఒప్పందాలు ఉంటాయన్నమాట..ఆ వస్తువులు ధర బయట వాటికి కనీసం అధమ పక్షం ఒక పదిహేను రేట్లు ఎక్కువ ఉంటుంది..అయినా జనాలు కోనేస్తూ ఉంటారేమిటో... నేను చెప్పేది చెప్పాను మరి..వెళ్ళేవాళ్ళు ఉంటే ఆలోచించుకోండి :)



ఇక బర్డ్స్ పార్క్ ,జూలు మిగిలినవి నేను చూడలేదు ..టైం లేదు ..మరి నాకు తెలియదు..కాకపొతే మా సింగపూర్ కి మలేషియాకి తేడా ఏమిటంటే మా వాళ్ళు ప్లేస్ లేక పది ఎకరంలో కట్టినదాన్ని మలేషియావాళ్ళు యాబై ఎకరాల్లో కడతారు అది సంగతి.. నీట్ నెస్ గాని మిగిలిన ఏ విషయమైనా సరే మా దేశం తో పోల్చుకోలేము దాన్ని ..( మా సింగపూర్ని బాగా పొగుడుకున్నా కదా) ... అయితే ఇక్కడ మేము వెళ్ళిన కొత్తలో ఎవరూ ఇంగ్లిష్ మాట్లాడక చాలా ఇబ్బంది అయ్యేది కాని ఈ మధ్య పర్లేదు..అలాగే ఇక్కడ లోకల్ ట్రైన్స్ భలే ఉంటాయి ..మొకమల్ క్లాత్ తో అదేదో రాజ్ మహల్ లో ఉన్నట్లు..కాకపొతే అబ్బ ప్రతి ట్రైన్ అరగంటకోసారి వస్తుంది ....చిరాకు బాబు ..



ఇప్పుడు జెంటింగ్ ... జెంటింగ్ కి వెళ్ళాలంటే తెల్లవారు జామున వెళితే ఉంటుంది కదా......సూ..ప..ర్ అంతే ...అసలు ఎంత బాగుంటుందో.. అక్కడకు రోప్ వే ఉంటుంది.. అంటే తెలుసుకదా కేబుల్ కార్ లో వెళ్ళడం అన్నమాట..తెల్లవారు జామున మబ్బుల్లో , ఆ చలిలో క్రింద లోయలు ,పైన ఆకాశం ..మధ్యలో ఒక్క తాడుకి వ్రేల్లాడుతున్న పెట్టెలో మనం ....ఓ సారి ఊహించుకోండి ...కొద్దిగా భయం వేసినా కాసేపటికి బాగా ఎంజాయ్ చేస్తాం.. మా సింగపూర్ తో పోలిస్తే ఇక్కడ చాలా చీప్ ...ఈ రోప్ వే మీద జర్నీ చేయడం.. అప్పుడు ..ఎంచక్కా జెంటింగ్ వెళ్ళిపోతాం ...



జెంటింగ్ లో ఏముంటుంది అంటే ఏమీ ఉండదు... పెద్ద కొండ పై బాగా డబ్బులు వదిలించుకోవడానికి కావలసిన అన్ని హంగులు ఉంటాయి..ఇండోర్ అవుట్ డోర్ గేమ్స్ ... ఇండోర్ గేమ్స్ చిన్నపిల్లలు పెదా వాళ్ళు అందరూ ఎంజాయ్ చెయ్యొచ్చు.. కాని అవుట్ డోర్ గేమ్స్ నాకులాంటి ధైర్యస్తులు మాత్రమే వెళ్ళాలి..ఏంటలా చూస్తారేంటి ..నమ్మరా.. ఇప్పుడంటే భయమేస్తుంది కాని ఓ పదేళ్ళక్రితం "నువ్వు నాకు నచ్చావ్లో బ్రహ్మానందం ఎక్కిన రోలర్ కోస్టర్ లో నాలుగు సార్లు ఎక్కేసాను తెలుసా..ఇంక ఈ గేమ్స్లోకి వెళ్ళమంటే టైం ఏం ఉండదు ...అలా ఆడుకోవడమే ఆడుకోవడమే ఆడుకోవడమే..హా మర్చిపోయాను ఇక్కడ పెద్ద జూద గృహం ఉంది.. అబ్బా...అదే ఏదో అంటారుగా కేసినో ఏదో అదన్నమాట ..నేను మొదటి సారి అందులో పది రింగెట్లు జూదమాడి గెలిచాను ...కాని మా ఆయన మళ్ళీ ఆడించి ఇంకు ఇరవై తగలేయించి బయటకు తీసుకొచ్చారు :(...


అలా మన దగ్గరున్న డబ్బులు ,ఓపిక అన్ని అయ్యేవరకూ ఆడుకుని కాసేపు ఆ కొండ ప్రాంతం అంతా తిరిగి సాయంత్రం మళ్ళీ అదే రోప్ వేలో క్రిందకు వెళ్లి పోవచ్చు ..కాని పైన భోజనాలు పిచ్చ రేట్లు ..క్రింద ప్యాక్ చేయించుకుని తెచ్చుకు తినండి ..ఇక షాపింగ్ అయితే మన తెలివి పై ఆధారపడి ఉంటుంది..ఉదాహరణకు ఒక విషయం చేపాతాను..


కౌలాలం పూర్లో చైనా బజార్ అని ఒకటుంటుంది..మన సంతల లెక్కన టెంట్ లేసుకుని అమ్ముతారు.. మొదటి సారి వచ్చినప్పుడు మా ఆయన ఒక సంతలో ఫ్రెండ్స్ కి లైటర్స్ కొంటా అన్నారు .. మొదటి దుకాణం వాడి దగ్గర అడిగితే రివాల్వర్ మోడల్ లో ఉన్న లైటర్ ౩౦ రింగేట్స్ అన్నాడు.. మా ఆయనగారు 25 రింగేట్స్ కి బేరమాడి నా వైపో లుక్కిచ్చారు.. ఒక పది కోనేసాం ... నెక్స్ట్ షాప్ వాడి దగ్గరకు వెళ్లి ఇదెంత బాబు అనగానే ఇది 25 కాని మీకు 20 కి ఇస్తాను అన్నాడు ..ఆ నెక్స్ట్ షాప్ వాడు 15 కే ఇస్తా అన్నాడు..ఇంకో షాప్ వాడి దగ్గరకు వెళితే అయిదు కి ఇస్తా అన్నాడు.. ఇక ఆఖరి షాప్ వాడు పది రింగేట్స్ కి మూడు అన్నాడు ... ఇక ముందుకు వెళితే ఊరికే ఇస్తానంటాడేమో అని భయమేసి వెళ్ళ లేదనుకోండి..అలాగే హ్యాండ్ బ్యాగ్ 350 రింగేట్స్ కొంటే ముందు షాప్లో 50 రింగేట్స్ కి బెరమాడింది ఇంకో అమ్మాయి..:( కాబట్టి నేను చెప్పొచ్చేదేమిటంటే ఇక్కడ బేరాలు ఆడగలిగే సత్తా ఉన్నవాళ్ళు మాత్రమే ఆ షాప్స్ కి వెళ్లి లాభములు పొందగలరు..లేదా బేండ్ బజాయింపే...మామూలు పెద్ద షాప్స్ లో ఫిక్స్డ్ రేట్లే లెండి..


అదన్నమాట నేను చూసిన మలేషియా..

13, సెప్టెంబర్ 2011, మంగళవారం

పాడమని నన్నడగవలెనా!!!!

చిన్నప్పటి నుండి నాకు రెండు తీరని కోరికలు ఉండిపోయాయి ..ఒకటి .. " పంచభూతములు ముఖ పంచకమై...చతుర్వేదములు ప్రాకారములై " అంటూ సాగరసంగమం కమల్ హాసన్ లా కదక్, కూచిపూడి మణిపురి , ఒడిస్సీ ,భరతనాట్యం ఇలా అన్ని నృత్యాలు నేర్చేసుకుని స్టేజ్ ఎక్కి మరీ ఆహా ఓహో అనిపించేసుకోవాలని.. రెండోదేమో అదే స్టేజ్ మీద కుడిచేయి ఒక తిరగా, ఒక బోర్లా వేస్తూ ..సరిగమపదనిస సనిదపమగరిస అంటూ బోలెడు కచేరీలు ఇచ్చేయాలని .....

నాకు తెలుసు మీరందరూ దిగులు దిగులుగా,భయం భయంగా చూస్తున్నారని ...ఆ మాత్రం జాలి, మీ ఆరోగ్యం పట్ల శ్రద్ద నాకు లేవనుకున్నారా !! అందుకే మొదటిదాన్ని చెప్పకుండా మీకోసం త్యాగం చేస్తున్నాను..దానికి ప్రతిఫలంగా రెండోవ విషయం వినాలి ...:)


అంటే అసలు ఈ పాటలు పాడాలి అన్న కాన్సెప్ట్ నాలో ఎప్పటినుండి మొదలైంది అంటే ..శంకరాభరణం సినిమాలో సోమయాజులు వరలక్ష్మిని ..తెల్లవారుజామున పీకల్లోతు నీటిలో ముంచేసి
సా రి గ రీ గ పదా పా
స రి గ ప దా ప గ రీ
రి గ ప ద సా నీ దా పా అని .... సంగీతం నేర్పే సీన్ చూసినదగ్గరనుండి .." ఓస్ ఇంతేనా ????ఇంత సింపులా పాడటం అంటే?" అనేసుకున్నాను .. ఆ పళంగా రెండు రోజులు ప్రొద్దున్నే లేచి మా ఇంట్లో నీళ్ళ కుండీలో అమ్మ చూడాకుండా ఒక ఐదు నిమిషాలు "ఖష్ట పడి " సాధన చేసేసాను... ఇంకేముంది నాకు సంగీతం వచ్చేసింది ...

అయితే ఒట్టి సంగీతం వచ్చేస్తే సరిపోతుందేమిటీ!! .. పాటలు కూడా రావాలిగా ..అప్పట్లో అప్పుడప్పుడు రేడియో పాటలు..వారానికోసారి టీవిలో వచ్చే చిత్రలహరి తప్ప పాటలు నేర్చుకోవడానికి వేరే ప్రత్యమ్నాయం ఉండేదికాదు ... అప్పుడెలాగా?? అని ఆలోచిస్తే మా అక్క గుర్తొచ్చింది..దాని నోట్ బుక్స్ నిండా స్కూల్ లో వాళ్ళ మిస్ లు నేర్పే పాటలే.. అంతే ..మా పై మేడ ఎక్కేసి అబ్బో తెగ ప్రాక్టీస్ చేసేసాను....ఇంకేంటి కచేరి చేయడం ఒక్కటే మిగిలింది.... ఇక శ్రోతల్ని సమకూర్చుకోవడమే..

సరిగ్గా అదే టైమ్లో మా పెద్దమ్మ.. మా పెద్దక్క లెక్కల్లో క్లాస్ ఫస్ట్ వస్తుందని వద్దు వద్దని మొత్తుకున్నా బలవంతంగా ఓ ట్యూషన్ లో జాయిన్చేసేసింది.. అది ఏడుస్తుంటే నవ్విన పాపానికి నేరుగా మా అమ్మదగ్గరకు వెళ్లి .."పిన్నీ నేనైతే క్లాస్ ఫస్టే..మన బుజ్జయితే స్కూల్ ఫస్ట్ వస్తుంది "అని చెప్పిన మరుసటి రోజే దానితో పాటు నేనూ అదే ట్యూషన్లో చేరాల్సి వచ్చింది...

అలా లెక్కలేనన్ని తిట్లు తిట్టుకుంటూ లెక్కలు చేసుకుంటూ రోజులు లెక్కపెట్టుకుంటుంటే ..ఒక శుభముహుర్తాన మా సార్ వాళ్ళ పాప పుట్టినరోజు వచ్చింది ..అందరం ఎప్పటిలా పుస్తకాలు ముందేసుకోగానే సార్ వాళ్ళ అమ్మగారు .."అరే ..పండగ పూట పాఠాలేమిటిరా ఈ రోజు పిల్లల చేత నాలుగు పాటలు పాడించరాదూ" అనేసరికి ఎగిరి గెంతులేసేయాలనిపించింది .. అసలే ఆయనకు వాళ్ళ అమ్మగారంటే మహా గౌరవం (భయం?) ఉండేది.. సరే ఎవరన్నా వచ్చి మంచిపాటలు పాడండి అన్నారు..

నాకేమో నేర్చుకున్న పాటలన్నీ పాడేయాలని ఉందికాని... మరీ నాకు నేనుగా అంటే లోకువ అయిపోతానని సార్ పిలుపు కోసం ఎదురుచూస్తున్నా ..అబ్బే ..ఆయన నన్ను పట్టించుకుంటే కదా.. ఎవరెవరినో పిలుస్తున్నారు.. ఇహ లాభం లేదని నా పక్కదానితో గుస గుసగా .."హే నాకు చాలా పాటలు తెలుసు కానీ ఏమో బాబు నాకు భయం "అన్నాను సిగ్గుపడుతూ.. ఆ పిల్ల నావైపు ఓసారి చూసి "ఓహో " అనేసి మళ్లీ తలతిప్పేసుకుంది..ఎవర్తివే నువ్వు గాడిద అని కసిగా తిట్టుకుని ఇటు మా అక్క వైపు తిరిగాను.. నేనింకా విషయం చెప్పకముందే ..నీకెందుకే నోరుమూసుకుని కూర్చో అనేసింది కుళ్ళు మొహంది .... దున్నపోతా అని అనుకుంటుంటే మా గుసగుసలకు సార్ నా వైపు చూసి నువ్వు పాడతావమ్మా అన్నారు ....

ఆట్టే బెట్టు చేస్తే మొదటికే మోసం అని ' ఊ ' అని తల ఊపాను మొహమాటంగా .. ఆలోపలే సార్ వాళ్ళ అమ్మగారు ఇద్దరుముగ్గురు ఫ్రెండ్స్ని కూడా తీసుకు వచ్చేసారు షోకి ... నేను గట్టిగా ఊపిరిపీల్చి శ్రావ్యంగా మొదలుపెట్టాను .."ఏసయ్య ఇంటి ముందు సిరిమల్లె చెట్టు సిరిమల్లె చెట్టు " మొదటి లైన్ పూర్తవ్వగానే సార్ వాళ్ళ అమ్మగారు ఫ్రెండ్స్ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూడటం మొదలు పెట్టారు ...ఏదో తేడా తెలుస్తుందికాని అదేమిటో తెలియడం లేదు ... ఇంకో నాలుగైదు లైన్స్ పాడగానే వాళ్ళందరూ మూకుమ్మడిగా మా సార్ ని చూడటం మొదలు పెట్టారు...

మా సార్ మధ్యలో ఆపేసి పాప ఇంకో మంచి పాట పాడమ్మా అన్నారు.. ఓస్ అంతే కదా అనుకుని గొంతు సవరించుకుని మరొక పాట మొదలు పెట్టాను "దేవుడే నాకాశ్రయంబు " ... పాట మొదలు పెట్టిన అయిదు నిమిషాలకే వాళ్ళ అమ్మగారి ఫ్రెండ్స్ మూతి మూడు వంకర్లు తిప్పి.. వస్తాను కామాక్షిగారు పొయ్యి మీద ఎసరు మరిగిపోతుంది అని మనిషికో వంక పెట్టి వెళ్ళిపోయారు.. ఆవిడ రుస రుసలాడుతూ కొడుకు వైపు ఒక్క చూపు చూసి లోపలికి వెళ్ళిపోయింది..ఆ తరువాత మా సార్ ఇక పాటలు చాలు పుస్తకాలు తీయండి అనో గసురు గసిరి ఓ గంట ఎక్కువ వాయించేశారు .. "బుద్దుందా అసలు ..రోజంతా మడి చీరతోనే తిరుగుతూ మనం వెళ్ళగానే ఇల్లంతా కడిగేసుకునే చాదస్తం ఆవిడది ..అక్కడ ఆ పాటలు పాడుతావా " అని ఆ రోజంతా మా పెద్దక్క తిట్లతో తెల్లారిపోయింది నాకు .."

ఆ దెబ్బతో కొన్నాళ్ళు పాడుతా తీయగా కార్యక్రమం వాయిదా వేసాను ... కాని మనకి అవకాశాలు తంపానుతంపరలుగా తన్నుకోచ్చేస్తే ఏం చేసేది ??? ఓ రోజు మా స్కూల్లో ఇన్స్పెక్షనో పాడో గుర్తులేదుగాని ఒక అతను వచ్చారు.. మా సార్లు అందరూ కంగారుగా వాళ్ళ వెనుక పరుగులు పెడుతున్నారు .. అతను రావడం రావడం ఖర్మకాలి(ఎవరి ఖర్మ అనేది ముందు ముందు తెలుస్తుంది) మా క్లాస్ కు వచ్చారు.. వచ్చిరాగానే మీలో దేశభక్తి ఎంత మందికి ఉంది అన్నారు.. మొత్తం చేతులు ఎత్తేసాం.. మీలో దేశభక్తి గీతాలు ఎవరికి వచ్చు అన్నారు.. నేను ,మా స్వాతి నిన్చున్నాం.. మరి మేమే రోజు ప్రేయర్లో వందేమాతరం పాడేది.. దేశభక్తి అంటే దేశం లో ఉన్న లోపాలు కప్పేసి సుజలాం సుఫలాం అంటూ లేనివి ఉన్నట్లు పాడేయడం కాదు... లోపాలేమిటో తెలుసుకుని వాటిని పారద్రోలడం ..అసలు మన దేశం లో పేదరికం పై ఉన్న కవితలు, పాటలు ఎవరికైనా తెలుసా అన్నారు ..పాపం ఆయన ఉద్దేశం శ్రీ శ్రీ గురించో మరొకరి గురించి చెప్తామని కాబోలు... మాకు అప్పట్లో అంత నాలెడ్జ్ ఎక్కడిది...మేమందరం తీవ్రంగా ఆలోచిస్తుంటే ఆయన చూపు నా మీద పడింది..

ఏది ఓ మంచి పాట పాడు అన్నారు ఆయన నా వైపు చూస్తూ..(చెప్పానుగా తలరాత) నేనేమిటంటే నాగేశ్వరరావు పాట " పాడవోయి భారతీయుడా" పాట గుర్తుతెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాను ..ఆయన ఉన్నట్లుండి నన్ను అడిగేసరికి ఆ కంగారులో మర్చిపోయాను ..ఎంత గింజుకున్నా గుర్తురాదే ... పోనీ రాదనీ చెప్దామా అంటే రాక రాక వచ్చిన అవకాసం .. ఈ లోపల అనుకోకుండా చిన్నప్పుడు రేడియోలో విన్న ఒక పాట గుర్తు వచ్చింది.. పూర్తిగా గుర్తులేదు ఏదో పల్లవి ... ఏదైతే ఏమిటిలే అని మొదలుపెట్టేసాను ఆలోచించకుండా... ఎవరూ భయపడకండెం.. ఆ పాటేమిటంటే ....

ఇల్లూ వాకిలి లేదు...
వెనకా ముందు లేరు..( ఈ ముక్కను ఎలకల మందు లేదు అని పాడేదాన్ని ...నాకు సరిగా వినిపించకా)
ఎక్కడికని పోనూ....

పాట ఇంకా పల్లవి అవ్వనేలేదు మా సార్లు,మేడం లు గోడకి దభేల్ ధబెల్ మని మూకుమ్మడిగా తల కొట్టేసుకుని నా నోరు మూయించేసారు అంతే... మరి నాకేం తెలుసు అది ఐటం సాంగ్ అని ..పాపం ఒక అమ్మాయి బీదరికంతో ఎలకల మందు మింగిచనిపోదాం అనుకుంటూ అలా పాడేదనుకునేదాన్ని ... ఆ తరువాత మా హెడ్ మాస్టార్ నన్ను ప్రత్యేకంగా పిలిపించి స్పెషల్ గా పొగిడేసరికి మళ్లీ ఇంకోసారి అవుట్ డోర్ కచేరీలు పెట్టలేదు ...అయినా తిరిగే కాలు పాడే నోరు ఊరుకుంటాయా ??? అసలు ఇదంతాకాదు ఇంట గెలిచి రచ్చగెలవమన్నారు కాబట్టి ముందు ఇంట్లోవాళ్ళతో శభాష్ అనిపించుకోవాలాని కఠోర సాధన చేసాను ...

ఒక శుభ ముహూర్తాన నాన్న ఆదివారం పూట మధ్యాహ్నం సుబ్బరంగా తిని పడుకుంటే మెల్లగా "నన్ను దోచుకుందువటే వన్నెలదొరసాని " ఆ పాట పాడటం మొదలు పెట్టాను..మరి నాన్న ఎన్ టి రామారావు ఫేన్ కదేంటి ..తేడా రానిస్తానా!! కాసేపటికి మా నాన్న శారదా !! అంటూ ఒక్క అరుపు అరిచారు ..ఏమిటి నాన్న గారు మా అక్క పరుగున వచ్చింది ... నువ్వు పాడుతున్న రాగామేంటి ..ఎంచుకున్న తాళ మేమిటి ..అని పాపం శంకరాభరణం శాస్త్రి గారిలా క్లాస్ పీకబోయారు కాని అది మధ్యలో ఆపేసి" పాడింది నేను కాదు బుజ్జీ" అనేసి చక్కా వెళ్ళిపోయింది..గొప్ప అవమానం అయిపోయింది.. మెల్లగా మా చెల్లి పక్కకు చేరి ..మరీ అంత చండాలంగా పాడానంటావా అనుమానంగా (కొద్దిగా ఆశగా) అడిగాను..అది నావైపు ఒక సారి చూసి నిట్టూర్చీ ... చెప్తే ఏడుస్తావని ఊరుకున్నాం గాని అక్కా వారం రోజులనుండి మాకు చెవుల్లో రక్తాలు కారిపోతున్నాయి... అనేసింది (ఇప్పటికీ ఈ విషయం తలుచుకుని ఏడిపిస్తూనే ఉంటారు మా వాళ్ళు :()

ఇంకేం చేస్తాం అలా ఒక వర్ధమాన గాయినిని తూటాలవంటి మాటలతో తోక్కేసారు.. పెళ్ళయ్యాకా అసలు పాడే ప్రయత్నమే చేయలేదు ...నాకు తెలుసు మీరేమనుకుంటున్నారో..మా ఆయన వంకలు పెట్టి ఉంటారనేగా ...హి హి హి హి కాదు ...నేను మొదలు పెట్టగానే రెండో లైన్ నుండి ఆయన పాడటం మొదలెట్టేస్తారు :( ఆ బాధకంటే ఇలా బాత్ రూం సింగర్ గా మిగిలిపోవడమే ఉత్తమం అని కేవలం నా పాటకు నేనే శ్రోతనై అలా మిగిలిపోయాను ...

అక్కడితో ఆగిపోతే అసలు ఈ రోజు ఈ పోస్ట్ పుట్టేదేకాదు ... మొన్నో మధ్య ఒక ఫ్రెండ్ వాళ్ళింట్లో సత్యన్నారాయణ స్వామివారి వ్రతం అని పిలిస్తే వెళ్లాను ... పూజ అయ్యాకా దంపతులను హారతి ఇచ్చి లేపాలి.. ఎవరన్నా పాడండమ్మా అంటే..అమ్మో నాకు రాదంటే నాకు రాదు అని మెలికలు తిరిగిపోతున్నారు జనాలు.. నాకు జరిగిన అనుభవాల దృష్యా నేను లేవలేదు ... ఎందుకు చెప్పండి పిలిచి తిట్టించుకోవడం..కాని అవకాసం తరుముకొస్తే ఏం చేస్తాం..అక్కడ చీరకట్టుకున్న ఏకైక మహిళను నేనే ...అందుకని అందరూ నన్ను లాక్కోచ్చేసారు ...భయం భయం గా "క్షీరాబ్ది కన్యకకు నీరాజనం" అని అన్నమాచర్య కీర్తన కొద్దిగా పాడాను..హమ్మయ్యా ఎవరూ మాట్లాడలేదు ...ఒక పనైపోయిన్దిరా బాబు అని వెళ్లిపోతుంటే పూజ చేసిన పంతులుగారు పిలిచి చాలా బాగా పాడావమ్మా" గాన సరస్వతి" లా అన్నారు...అందరూ అవునవును అన్నారు చప్పట్లు కొట్టి..

ఇంక మీకు నేను విడమరచి చెప్పక్కరలేదనుకుంటా నేను ఇంటికి వెళ్ళేంతవరకూ నేలకు నాలుగు అడుగుల పైన నడిచానని .. మా ఆయనకు చెప్తే ...అంటే బుజ్జీ ముసలాయనకదా సరిగ్గా వినిపించి ఉండదు ... పొరపాటు పడటం మానవ సహజం.. నువ్వు మామూలుగా నడిచేయచ్చు అనేసారు :( అయినా సరే నేను ఒప్పుకోనుగాక ఒప్పుకోను..చిన్నప్పుడే నాలో ఒక చిత్ర ,ఒక శ్రేయగోషల్ ,ఒక గోపికా పూర్ణిమ ఉన్నారు అంతే అంతే అంతే ...అంతే బాబు..ఇక ఎవ్వరి మాటలు నమ్మదలుచుకోలేదు నాకు తెలుసు మీరేమంటున్నారో ..మీ పాట ఒకటి మాకూ వినిపించచ్చుకదా అని కదా.. హమ్మా పొరపాట్లు అన్ని సార్లు జరుగుతాయ్ ఏంటి ....మీరు మరీను

27, జూన్ 2011, సోమవారం

ఆషాడం - 2

ఆ..ఎంతవరకూ చెప్పాను ..ఆషాడంలో మా ఆయన్ని కలుసుకోవడానికి మా అమ్మమ్మ ఊరు వెళ్లాను అని చెప్పాను కదా ... అక్కడికి వెళ్ళగానే అనుకున్న కధ మొదలైంది.."ఆషాడంలో మొక్కులేమిటే మరీ విచిత్రంగానూ" అని కాసేపు మా అమ్మమ్మ బుగ్గలు నొక్కుకుని ,ఎదురుగా అల్లుడిగారిని(మా నాన్నను) చూసి ఏమనలేక ..."అయినా ఈ రోజుల్లో ఇవన్నీ మామూలే బాబు ... మీ మావయ్య గారు షాపు వదిలి ఇంటికొచ్చేసరికి రాత్రి ఒంటిగంట అవుతుంది .. ట్రైన్ పది గంటలకు కదా ,వెనుక గుమ్మం దగ్గర నుండి మా చిన్నోడు ( చిన మావయ్య) స్టేషన్కి తీసుకు వేళతాడులే "అనేసి నన్ను గట్టున పడేసింది....

నాన్న మా వూరు వెళ్ళేవరకూ ఓపికపట్టిన మా అత్తలు నా చెరో ప్రక్కనా చేరిపోయారు ..."ఆషాడంలో బయటకు వెళుతున్నారా!!! మా తమ్ముడుగారు ఎంత డేరు, ఎంత రోమాన్టిక్కు ... మీ పెద్ద మావయ్యా ఉన్నారు దేనికీ!! .. పెళ్ళయి పదేళ్ళు అయినా ప్రక్క వీధిలో గుడికి తీసుకువెళ్ళమంటే ప్రక్కింట్లో దొంగతనం చేయమన్నట్లు జడిసిపోతారు" అని ఏడుపుమొహం పెట్టి మా పెద్దత్తా.... "ఈ నల్లపూసలు అయిదుకాసులు పెట్టి చేయించారా !!...పెళ్ళయిన మూడునెలలు కాకుండానే ఇన్ని చేయిస్తే ముందు ముందు ఏడువారాల నగలు చేయిన్చేస్తారేమో ...మీ చిన్న మావయ్యా ఉన్నారు... పావుకాసు పెట్టి ఉంగరం చేయించమంటే పందిరి గుంజలా బిగుసుకుపోతారు "అని భారంగా నిట్టూరస్తూ చిన్నావిడా గతాన్ని తలుచుకుని తలుచుకుని ,తవ్వుకుని, తవ్వుకుని బాధపడిపోవడం మొదలుపెట్టారు..

"వచ్చావా మహా తల్లీ!!! ..నువ్వు ,మీ అక్కా వచ్చారంటే మా కాపూరాల్లో నిప్పులే ... అక్కడేం ఉద్దరిస్తారో తెలియదుకాని ఇక్కడ మాత్రం మీ అత్తలకు మణిరత్నం సినిమా చూపించి వెళ్ళిపోతారు ..తర్వాతా ఓ నెల రోజులు పాటు మాకు ' కొత్తబంగారు లోకం మాకు కావాలి సొంతం ' అని పాడి వినిపిస్తారు వీళ్ళు" అని మా చిన్న మావయ్య విసుక్కుంటుంటే...... చూడంమమ్మా నీ కొడుకు అని కంప్లైంట్ చేస్తూ భోజనం తింటుంటే ఫోన్ .... పరుగు పరుగున వెళ్లి ఫోన్ తీశాను ...

"బుజ్జీ ! వచ్చేసా"వా అటునుండి మా ఆయన.." ఆ వచ్చేసాను కానీ అదేంటది ఈ పాటికి ట్రైన్లో ఉండాలి కదా మీరు..ఎక్కడి నుండి ఫోన్ చేస్తున్నారు" అయోమయంగా అడిగాను....." ట్రైన్ ఓ గంట లేటే ..అందుకని ఇంకా బయలుదేరలేదు" అన్నారు బాంబ్ పేలుస్తూ ....."అమ్మ బాబోయ్ గంట లేటా!!!రాత్రి పదిన్నర అంటేనే మా నాన్న ,అమ్మమ్మ వందసార్లు ఆలోచించారు ... ఇప్పుడు గంట లేటంటే పదకుండున్నర అవుతుంది ఇంకేమన్నా ఉందా" అన్నాను భయంగా ..." మీ అమ్మమ్మకు ,నాన్నకు పనేముంది ప్రతిదానికి భయపడటమే గాని ఇంకేదన్నా చెప్పు "అన్నారు తాపీగా...." మీకేం బాబు మిమ్మల్ని ఎవరేమంటారు ,అక్షింతలు పడేది నాకే కదా " విసుక్కున్నాను.... "అబ్బా నీతో ఇదే చిక్కు ...ఎప్పుడూ ఎలా టెన్షన్ పడదామా అని ఆలోచిస్తావ్... నాకైతే బోలెడు ప్లాన్స్ ఉన్నాయి..నువ్వు ఎప్పుడన్నా ట్రైన్ డోర్ దగ్గర నిన్చున్నావా ... మనం ఎంచక్కా డోర్ దగ్గరకు వెళ్లి కూర్చుని తెల్లవార్లు కబుర్లు చెప్పుకుందామేం"....అన్నారు పరవశంగా.." ఏంటీ డోర్ దగ్గరకా !! మా నాన్నకు తెలిస్తే అప్పుడు చేస్తారు నాకు అసలు పెళ్లి "అన్నాను విసుగ్గా.. "అవును మరి ప్రతీది వెళ్లి మీ నాన్నకు చెప్పు ... అయినా పెళ్ళయ్యాకా నా ఇష్టం .. ... నా పెళ్లానివి... తండ్రి కంటే భర్తే గొప్ప,పతియే ప్రత్యక్ష దైవం తెలుసా నీకా విషయం" అన్నారు కచ్చగా( ఈ మాట అరిగిపోయిన రికార్డులా ఇప్పటికీ అంటారులెండి) ... "తోక్కేం కాదు నాకు మా నాన్నే గొప్ప "అంటుంటే ఇంకేవరివో మాటలు ,గుసగుసలు వినిపించి ప్రక్క రూం లో తొంగి చూస్తే ,మా అత్తలు ప్రక్క రూం లో ఉన్న మరో ఫోన్ పట్టుకుని మా మాటలువింటూ తోసుకుంటూ...... దెబ్బకి ఫోన్ పెట్టేసి ఆ రూంలోకి పరుగెత్తాను ....

"ఏం పనిలేదా ,మేనర్స్ లేదా" కోపం గా అడిగాను...." అస్సలు లేదు .. అయినా ఇది మా ఇల్లు.. మా ఫోను ... మా ఇష్టం ... కొత్తగా పెళ్ళయిన వాళ్ళను మా ఊర్లో ఇంతకన్నా ఎక్కువ ఏడిపిస్తాం తెలుసా "అన్నారు ఇద్దరూ కోరస్ గా ... ఖర్మరా బాబు అనుకుని 11 ఎప్పుడవుతుందా అని ఎదురు చూడటం మొదలు పెట్టాను ... మధ్యలో ఫోన్ చేయాలని ఉన్నా మా అత్తలతో భయం ... పది అవుతుండగా నాన్న నుండి ఫోన్ .."ఇంకా బయలుదేరలేదా? రాత్రి పూట ప్రయాణాలు కాస్త ముందుగానే వెళ్లాలని తెలియదా.. మావయ్యను పిలు నేను మాట్లాడుతాను "అని ఒక్క కసురు కసిరారు.... అసలే మాంచి కోపం మీద ఒకటి ఉన్నారు... ఇప్పుడు ట్రైన్ లేటంటే ఏమంటారో అని సైలెంట్గా మా మావయ్యకు ఇచ్చేసాను ఫోన్.. పాపం విషయం వినగానే నాన్న కోపానికి మావయ్య బలి..

మొత్తానికి పదకుండు అయింది మావయ్య ఇంకా రాలేదు.... నాకు కంగారు...." నీ కొడుకు ఎప్పుడు ఇంతే అమ్మమ్మ ..ఏం ఒక్క రోజు షాప్ నుండి తొందరగా వస్తే ఏం కొంపలు మునిగిపోయాయట ,ఆ ట్రైన్ వెళ్లి పోయిందంటే ఇంక అంతే" ఏడుపు మొహం వేసి అన్నాను .... పదకొండున్నర అవుతుండగా మావయ్య ఇంటికి వచ్చాడు ...ఈ లోపల చిన్న అత్తకు, అమ్మమ్మ కు నాలుగో విడత క్లాస్ పీకేసాను.. రాగానే తాండవం చేసేయబోతుంటే" ఇక ఆపు అక్కడ ట్రైన్ గంట కాదు ... రెండు గంటల లేట్ అంట రాత్రి పన్నెండున్నరకు వస్తుంది అట... ఫోన్ చేసి కనుక్కున్నాను "అన్నాడు.. నాకు నీరసం వచ్చేసింది..." అమ్మ బాబోయ్ పన్నెండున్నరకు వస్తుందా ...నాన్నక్కు తెలిస్తే ఇంకేమన్నా ఉందా " నీరసంగా జారబడ్డాను.." నీకేం నువ్వు బాగానే ఉంటావ్ నాకు కదా మీ నాన్న క్లాస్ పీకేది "అని మావయ్య అంటుండగానే మళ్ళీ ఫోన్.."ఇంకెవరూ మీ నాన్నే వెళ్లి ఎత్తు" అన్నాడు మావయ్య నవ్వుతూ..."మావయ్యా మావయ్యా ప్లీజ్ మావయ్య నువ్వు మాట్లాడి ఏదోఒకటి చెప్పవా "బ్రతిమాలే పొజిషన్ కొచ్చేసాను ...

"అంటే బావగారు పర్వాలేదండి ..నేను ఉంటాను కదా ...పన్నెండుకి కూడా జనాలు తిరుగుతూనే ఉంటారండి ఏం పర్లేదు "...మావయ్య మాటలు మెల్లగా వినబడుతున్నాయి ... అటునుండి నాన్న కొంచెం గట్టిగానే తిడుతున్నట్లు ఉన్నారు..ఫోన్ పెట్టగానే అమ్మమ్మ మొదలు పెట్టింది .." ఏంటి అర్ధరాత్రి పూటా ఆడపిల్లను తీసుకువెళతావా ..అందునా నాన్న ఇంటికొచ్చే టైమయ్యింది.... చూసారంటే ఇంకేమయినా ఉందా అంటూ... అబ్బా ,నాన్న ఒంటిగంటకు కదమ్మా వచ్చేది నేను తీసుకు వెళ్తానుగా" మావయ్య సరిపెట్టేసాడు.. హూం గట్టిగా నిట్టూర్చి నిమిషాలు లెక్క పెట్టడం మళ్ళీ మొదలు పెట్టాను..

పన్నెండు అవుతుండగా మావయ్య మళ్ళీ కాల్ చేసాడు రైట్ టైం ఎన్ని గంటలకో కనుక్కుందామని .."దేవుడా దేవుడా ప్లీజ్ ప్లీజ్ "అనుకుంటూ ఉండగానే అటునుండి వాడు చెప్పాడు.." ఈ రోజు ఆ ట్రైన్ లేటండి రాత్రి 2 కి రావచ్చు" అని ... అయిపొయింది, ఇంక వెళ్ళినట్లే నిరాశ వచ్చేసింది ...మళ్ళీ నాన్న ఫోన్ ... "నువ్వే తీయవే ..ఇందాక నిన్ను అడిగినా ఏదో మేనేజ్ చేసాను " మావయ్య తనవల్లకాదని చెప్పేసాడు.. ఇక తప్పక 'హలో' అన్నాను.." ఏమైంది ఇంకా బయలు దేరలేదా" అన్నారు.." లేదు నాన్నా రెండుగంటలకట "అన్నాను మెల్లిగా.. "సరేలేగాని నువ్వు పడుకో ఇంక ...అంతగా అయితే రేపు నేను వచ్చి వైజాగ్ తీసుకెళతాలే "అన్నారు.. " కానీ నాన్న... మరీ ఆయన ఎదురుచూస్తారేమో" అన్నాను గునుస్తూ ... "చూడనీ.. ఇలా అర్ధం పర్ధం లేకుండా అర్ధరాత్రి ప్రయాణాలు పెడితే అలాగే అవుతుంది.. ఆడపిల్ల అనుకున్నాడా ఇంకేమన్నాన.. ప్రొద్దున్న కాల్ చేస్తాడులే అప్పుడు చెప్దాం నువ్వు పడుకో ఇక.. నేను రేపు వస్తున్నా" అని పెట్టేసారు...

"మావయ్యా!!! ఇంకోక్కసారి ఫోన్ చేయవా "ఆశ చావకా అడిగాను ...కాల్ చేయగానే ..."ట్రైన్ రాత్రి రెండు మూడు మధ్యలో రావచ్చండీ".... వాడు ఇంకొంచెం టైం పెంచేసరికి ఇక మాట్లాడకుండా పడుకున్నాను..నా కళ్ళ ముందు ప్లాట్ఫాం మీద నాకోసం వెదుకుతున్న మా ఆయన కనిపించసాగారు... జాలి ,బాధ ,భయం కలగలిపి వస్తున్నాయి ...అసలే ముక్కు మీద కోపం అయ్యగారికి ...ఎన్ని అలకలు పెట్టి సాధిస్తారో అని.. ఎప్పుడు నిద్ర పట్టేసిందో ..బుజ్జీ ,బుజ్జీ అని ఎవరో పిలుస్తుంటే కళ్ళు తెరిచాను ...ఎదురుగా చిన్న మావయ్య ...." ష్ ... ట్రైన్ కరెక్ట్ టైం నాలుగున్నర కట.. నాలుగయ్యింది వెళదామా" అన్నాడు ... "మరి నాన్న,అమ్మమ్మ ".... అంటూ ఇంకేదో చెప్పబోతుంటే ...." అబ్బా అవన్నీ నేను చూసుకుంటాలే ... నేను సందు గుమ్మం వైపు బండి తీసుకొస్తాను నువ్వు మెల్లగా వచ్చేసేయి... తాతయ్య ఇంట్లోనే ఉన్నారు జాగ్రత్త "అన్నాడు ...

తల కూడా దువ్వుకోలేదు ....అలాగే నా బ్యాగ్ పట్టుకుని చీకట్లో దొంగలా తడుముకుంటూ మెల్లిగా బయటకు వచ్చేసాను .... దారంతా మావయ్యా,నేను ప్లాన్స్ వాళ్లకు ఏం చెప్పాలి అని .... అక్కడ చేరుకున్నాకా ఇంకో అరగంట లేట్ చేసి అయిదుగంటలకు వచ్చింది ట్రైన్ .... మావయ్య కు టాటా చెప్పేసి ట్రైన్ లో కూర్చున్నాను ... మా ఆయన ఫ్రెండ్, వాళ్ళ ఆవిడ పలకరించారు ... ఆ సరికే కొంపలు మునిగిపోయినట్లు జనాలు పొలోమని లేచి అటు ఇటు తిరగడం మొదలు పెట్టారు ...నేను, మా ఆయన ట్రైన్ డోర్ వైపు,మొహా మొహాలు చూసుకుని గాడం గా నిట్టూర్చాం ...

హోటల్ మేఘాలయ... అప్పటివరకూ తిరపతిలో రూమ్స్ తప్ప ఇలా హోటల్స్ లో డీలక్స్ రూమ్స్ అవి చూడలేదేమో ...నాకు అదేదో భలే బాగా నచ్చేసింది ...పరుపెక్కి గెంతులే గెంతులు..అప్పడే నాకు ఎ.సి అనే పరికరం గురించి తెలిసింది.... కావాలంటే మీరందరూ బయటకు పొండి ...నేను రానంటే రాను అని భీష్మించుకు కూర్చున్నా లాక్కునిపోయారు ....ఆ తరువాత మహా మహా హోటల్స్కి వెళ్ళినా ఆ సరదా అస్సలు రావడం లేదు :(... అనుకుంటాం గాని మన ప్రక్కన ఉన్న చిన్న చిన్న ఊర్లే బోలెడు బాగుంటాయి... నాకు వైజాగ్ పిచ్చ పిచ్చగా నచ్చేసింది.. ఉడా పార్క్ ,కనక మహా లక్ష్మి గుడి ..అక్కడ ఒక వినాయకుడి గుడి ఉంటుంది ...చిన్న గుడే కాని చాలా ఫేమస్ ..పేరు గుర్తురావడం లేదబ్బా.. ఆ గుడి ..ఇంకా సింహా చలం ..కైలాస గిరి ..చాలా చూసాం ...రామ కృష్ణా బీచ్ లో అలలు చూడగానే నేను రాను బాబోయ్ అన్నా వాటి మధ్యలోకి వెళ్లి నిన్చోపెట్టేసారు మా ఆయన..టీవిలో చూడటమే అలా మధ్యలోకి వెళ్లి చూడటం భలే బాగుంది.. ( ఇక్కడ ఆరెంజ్ సినిమాలో జేనిలియాలా నేను సింహాన్ని చూసాను అన్న రేంజ్లో ఎక్స్ ప్రెషన్ ఇచ్చాను అప్పట్లో ) నిజం చెప్పాలంటే ఆ రోజు ఎంత హేపీ ఫీల్ అయ్యానంటే ఇప్పటికీ ప్రతి నిమిషం గుర్తుంది :)

ఆ తరువాత అన్నవరం వచ్చేసాం.. ఆషాడం కదా జనాలు అస్సలు లేరు ..( గమనిక :ఆషాడం లో అన్నవరం వెళితే మీకు దర్సనం తొందరగా అవుతుంది ) వ్రతం అది అవ్వగానే మావారి ఫ్రెండ్ని వాళ్ళ ఊరు వెళ్ళిపొమ్మని చెప్పి , మా ఊరి స్టేషన్ లో నన్ను దిగబెట్టేసి నెక్స్ట్ ట్రైన్కి తను వెళ్లి పోయేట్లుగా ప్లాన్ .... నాన్నను స్టేషన్ కి రమ్మని ఫోన్ చేసి ట్రైన్ ఎక్కేసాం..కాసేపట్లో తను వాళ్ళ ఊరు వెళ్లిపోతున్నారంటే మళ్ళీ దిగులు... ఏవో మాట్లాడుతూ మధ్యలో..." మొన్నో సారి మా బావ ఏం చేసారో తెలుసా.. అక్కను తీసుకుని తెలియక ఒక ట్రైన్ ఎక్కబోయి మరొక ట్రైన్ ఎక్కేసారట ... మధ్యలో గమనించి దిగిపోయారట ...కాని పర్స్ తేవడం మర్చిపోయారట ... లక్కీగా మా నాన్న ఫ్రెండ్ అక్కడ కనబడితే ఆయన్నిడబ్బులు అడిగి ఊరు వెళ్ళారు ...ఇప్పటికీ నాన్న తలుచుకుని తలుచుకుని తిడతారు " అన్నాను.." అయినా మీ బావ అలా ఎలా చేసారు బుజ్జీ ..ఏ ట్రైన్ ఏదో తెలుసుకోకపోతే చాలా చిక్కుకదా..ఒంటరిగా అయితే ఎలా అయినా పర్వాలేదు.. ఆడవాళ్ళు ఉండగా చాల కష్టం తెలుసా అన్నారు మా ఆయన గొప్ప ఆశ్చర్యంగా మొహం పెట్టి ....

అప్పటి వరకూ మమ్మల్ని గమనిస్తున్న మా ప్రక్కనున్నాయన "అమ్మా మీరు ఎక్కడి వరకూ వెళ్ళాలి "అన్నాడు ... నేను చెప్పాను.." ఈ ట్రైన్ వైజాగ్ వెళుతుంది మీరు ఎక్కినది కరెక్ట్ ట్రైన్ కాని చివరి రెండు బోగీలు వేరే బండికి కలుపుతాడు" అన్నాడు.. దెబ్బకి నాకు,మా ఆయనకు నో సౌండ్ ... తరువాతి స్టాప్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరే ... వెంటనే దిగిపోయాం ...దూరం నుండి టీ.సి మావైపు చూస్తున్నాడు.."అమ్మో రాంగ్ టిక్కెట్ ..పెనాల్టి అంటాడేమో" అన్నారు మా ఆయన ..." ఏం చేస్తాం తప్పదుగా కట్టండి" అన్నాను విసుగ్గా .. " బుజ్జీ ఒక విషయం చెప్తే తిట్టవు కదా "కొంచెం నసుగుతూ అన్నారు మా ఆయన ..." ఏంటీ "అన్నాను కోపంగా ...." నాకొక్కడికే కదా టిక్కెట్టు కావలసింది అని నిన్న మొత్తం ఖర్చు పెట్టేసాను" అన్నారు మెల్లగా....ఓరి దేవుడా ఏం చేద్దాం.. అనుకుంటుండగానే టీ.సి మా వైపు వచ్చాడు.."ఏంటి తప్పు ట్రైన్ ఎక్కి వచ్చేసారా .. చాలా మంది అలా పొరపాటు పడతారులెండి ...చీకటి పడుతుంది బస్ స్టాప్కి వెళ్లి మీ వూరు వెళ్ళిపొండి" అని పంపేశాడు.. బ్రతుకు జీవుడా అనుకుని బయటకు వచ్చేసాం..

"ఇప్పుడేం చేద్దాం నాన్న ఎదురు చూస్తారేమో ముందు నాన్నకు ఫోన్ చేసి విషయం చెప్పండి స్టేషన్ కి బయలుదేరి ఉంటారు "అన్నాను .. "అమ్మో !మీ నాన్నకా!! నీకు పుణ్యం ఉంటుందే బాబు... మీ బావని నాలుగేళ్లే తిట్టారు..నన్ను వదులుతారా .. అసలే వద్దంటే తీసుకువచ్చా అని కచ్చ మీద ఉండి ఉంటారు పరువుపోతుంది చెప్పకు ప్లీజ్ "అన్నారు .. "ఇప్పుడెలా మరి " అన్నాను విసుగ్గా .... " అంటే ఇది మీ అమ్మమ్మ వాళ్ళ ఊరే కదా ..మొన్న చెప్పకుండా వచ్చేసావ్ కదా ... అందుకని మీ అమ్మమ్మ మీద బెంగ పెట్టుకుని నువ్వు ఏడుస్తుంటే నిన్ను ఇక్కడకు తీసుకు వచ్చేసా అని చెప్తాను ఏమంటావ్ "అన్నారు.." ఏడ్చినట్లు ఉంది అస్సలు నమ్మరు "అన్నాను.. "నమ్మకపోయినా అదే చెప్పాలి పదా "అని మా అమ్మమ్మ ఇంటికి తీసుకువెళ్ళిపోయారు...

ఇంటికి వెళ్ళగానే అమ్మమ్మను చూడగానే" అమ్మమ్మా "అని చెప్పబోతుండగా లోపల భోజనం చేస్తూ తాతయ్య ఉన్నారు...దెబ్బకు నూటొకటి... ఏం చెయ్యాలి???.. వెంటనే అమ్మమ్మా మొన్న తాతయ్యను చూడకుండా వెళ్లిపోయానుగా బెంగ వచ్చేసింది .... కలలో కూడా తాతయ్యే ... అని మా తాతయ్య ప్రక్కకు చేరిపోయాను వెక్కేస్తూ ... అప్పుడు పడిపోయిన మా తాతయ్య ఇప్పటికీ అలాగే నన్ను తలుచుకుంటారు.. మా బుజ్జోడికి నేనంటే ఎంత ప్రాణమో ...సింగపూర్ వెళ్ళినా నన్నే కలవరిస్తుంది అని.. నేను అంటే చాలా ప్రాణం పెట్టేస్తారు (అమ్మో ఇప్పుడు మా తాతయ్య మీద బెంగోచ్చేస్తుంది నాకు :(......) అలా అనేకానేక సాహసాలు చేసుకుంటూ మా ఇంటికి చేరాను ఆషాడంలో..