
మనసు భలే విచిత్రమైనది ..మనం కోరుకున్నది జరగకపోతే ఒక బాధ ,తీరా జరిగితే ఇంకొక బాధ ,సరేలే అని అదే విషయం దూరమవుతే మరొక బాధ..హూం.. మనసు గతి ఇంతే ,మనిషి బ్రతుకంతే అని ఊరికే అన్నారా!! ..హయ్యో అసలు విషయం మానేసి ఏమిటి ఈ వేదాంతం??? ...ఇంతకూ ఎక్కడున్నాం?? సారి ..ఇంకా సోది మొదలు పెట్టేలేదు కదా..
చిన్నప్పుడు ఆకాశంలో విమానం గాని ,హెలికాప్టర్ గాని వెళుతుందంటే చాలు మా మేడ పై ఎక్కేసి తెగ చేతులు ఊపేసి, టాటాలు చెప్పేసేవాళ్ళం ..కొంచెం పెద్దయ్యాకా తెలివితేటలు పెరిగిపోయి ...అవునూ! ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్లకు చేతులు ఊపుతూ మనం ఇంత సంభర పడిపోతున్నాం కదా ... అసలు వాళ్ళు మనల్ని చూస్తున్నారా? చూసినా మనం కనబడతామా ? కనబడినా మనల్ని పట్టించుకుంటారా ??? ఆ మాత్రం దానికి అప్పలమ్మాలా గాల్లో చేతులు ఊపుతూ ఎందుకు ఈ వృదా ప్రయాసా అని అనేసుకోవడమే కాకుండా ఇదే నేను గనక విమానం ఎక్కితే , కిటికీ ప్రక్కనే కూర్చుని, ఫోజులు కొట్టకుండా తప్పకుండా టాటా చెప్తాను అని తీర్మానిన్చేసుకునేదాన్ని ...
అదిగో అప్పటినుండి విమానం ఎక్కాలని ఆశ మొదలైపోయింది ...కాని విమానం ఎక్కాలంటే విదేశాలకి వెళ్ళాలి ( ప్రక్క రాష్ట్రం కి వెళ్ళాలన్నా విమానం ఎక్కచ్చు అన్న విషయం అప్పటికి నాకు తెలియదు లేండి ) ... పావుగంట జర్నీ ఉన్న అమ్మమ్మ ఊరు పంపాలంటే అరగంట ఆలోచించే మా నాన్న విదేశాలకు పంపడం సాధ్యమా!! అని భారిగా నిట్టూర్చి ఆ విషయం మర్చిపోయాగాని.. "సాధ్యమే" అని బల్ల గుద్ది మరీ చెప్పింది పడమటి సంధ్యా రాగం లో విజయ శాంతి ... ఆ రోజు టి .వి లో సినిమా చూస్తున్నంత సేపూ ఎంత గింజుకున్నా విజయ శాంతి ప్లేస్ లో నేనే కనబడ్డాను.. సంధ్య నా పేరే అనిపించింది .. అలా ఆ సినిమాలో అమెరికా అబ్బాయి ' టాం ' ని వలచాను ,వరించాను, ప్రేమించాను ... వాడు మాత్రం విజయ శాంతిని పెళ్లి చేసుకుని పిల్లని కన్నాడు గాని నన్ను మాత్రం కన్నెత్తి చూడలేదు ...
కాని సినిమా అయిపోయాకా గొప్ప అవిడియా వచ్చేసింది ... ఎంచక్కా ఒక తెల్ల తోలు పిల్లాడిని ప్రేమించేసి , అతనే నన్ను ఎక్కడో చూసి ఇష్టపడి పెళ్లి సంబంధం మాట్లాడటానికి మా ఇంటికి వచ్చినట్లు సీన్ క్రియేట్ చేస్తే ( హమ్మా..మళ్ళా నేను ఇరుక్కోకూడదు కదా ..ఊహాలు కూడా చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటా నేను ) ... 'అమెరికా 'అబ్బాయి, అందులోను బోలెడు డబ్బున్న అబ్బాయి, పైగా కట్నం గట్రా తీసుకోకుండా పెళ్లి చేసుకుంటాను అంటే నాన్న మాత్రం ఎలా కాదనగలరు??? (ఒకవేళ అలా జరిగి ఉంటే ,ఇద్దరికీ తోలు తీసి ఇంటిల్లి పాదికి చెప్పులు కుట్టిన్చేసేవారని అప్పటికి నా బుజ్జి మెదడుకి తెలియదు ) అనేసుకుని మా స్కూల్ నుండి ఇంటికి వచ్చే దారంతా జల్లెడ వేసి మరీ గాలించాను ..అబ్బే.. విదేశం నుండి కాదు కదా ,కనీసం ప్రక్క రాష్ట్రం వాడు కూడా కనబడలేదు ... అలా నా ఊహలన్నీ ఊసులు గానే మిగిలి పోయాయి..
అలా ఆ విషయం మర్చిపోతుండగా మళ్లీ గుర్తు చేస్తూ వచ్చింది మా పెద్దమ్మ గారి అక్కయ్య కూతురు 'సౌదీ' నుండి .. తనని అందరూ దేవతలా చూసేవారు ..మా వీధే కాదు..పేట మొత్తానికి విమానం ఎక్కిన మొదటి అమ్మాయి తను.. కాలేజ్ నుండి రాగానే తన ప్రక్కన చేరిపోయి తను చెప్పే విషయాలను చేటంత చెవులతో ,ఆల్చిప్పల్లా కళ్ళు పెద్దవి చేసుకుని మరీ వినేదాన్ని ... అక్కడ మాములుగా మనం వేసుకునే డ్రెస్సులతో రోడ్ మీద నడవకూడదంట... బురఖా వేసుకోవాలి అని పోటోస్ చూపిస్తే ఆ బురఖాని 10 వేల రూపాయల పట్టు చీరలా ఎంతో అపురూపం గా చూసేదాన్ని.. మన దేవుళ్ళ పటాలు తీసుకు వెళ్ళనివ్వరు అట ..అందుకే పెట్టె అడుగున చీర మడతల మద్యలో బుల్లి దేవుళ్ళ పోటోస్ ని జాగ్రత్తగా తీసుకు వెళ్ళింది అట ..ఇంకా అక్కడ పాలు ,పెరుగు గట్ర మనకులా ఇళ్ళకు వచ్చి 'అమ్మా పాలు' అని అమ్మరంట ... అన్నీ డబ్బాల్లో దొరుకుతాయంట...దొంగతనాలు జరగవుట .... ఏ వస్తువు రోడ్ మీద పడిపోయినా అలా వదిలేసి వెళ్లిపోవాలట .. ఎక్కడ తవ్వినా మనకు నీళ్ళు వచ్చినట్లు వాళ్లకు పెట్రోలు వస్తుందంట .. దారంతా కొబ్బరి చెట్లకు మల్లే ఖర్జూరం చెట్లు ఉంటాయంటా... బంగారం బోలెడు చవకట ..అబ్బో ఎన్నెన్ని విశేషాలో .... రెండు చేతుల మద్యలో ముఖాన్ని పెట్టుకుని రెప్ప వాల్చ కుండా వినేదాన్ని..
ఇంటర్ అవ్వగానే డిగ్రి చదువుకు నాన్న ససేమిరా అన్నారు..పెద్ద చదువులు చదివితే అంతకు తగ్గ మొగుళ్ళను నేను వెదకలేను అని ఖరాకండిగా చెప్పేసరికి ... అప్పటి వరకు నేలకు రెండు అడుగుల ఎత్తులో తేలే నా పాదాలకు భూమి మీద నిలబడటం ఏంటో తెలిసొచ్చింది .. మద్య తరగతి ఆడపిల్లల తండ్రికి ప్రతీకలాంటి నాన్న కడుపున పుట్టీ ఏమిటీ ఆకాశానికి నిచ్చెనలు ..దిగు దిగు అని మనసు హెచ్చరించింది .. దెబ్బకు దిగి పోయి ఎక్కడో గంతకు తగ్గ బొంత దొరుకుతాడులే.. ఇన్ని ఊహాలు మనకేలా అని నిజ జీవితం లోకి వచ్చి పడ్డాను.. అయితే అమ్మ బలవంతం తో మళ్ళా డిగ్రీ పేరు తో కాలేజ్ లోకి అడుగు పెట్టాననుకోండి అది వేరే విషయం ...
అలా అప్పుడు ఎక్కడో వదిలేసి మర్చిపోయిన విషయాన్ని,మా వారు వెదికి తీసుకొచ్చి మరీ కళ్ళ ముందు నిలబెడతారని ఊహించనైనా ఊహించలేదు నేను.. ఆరు నెలల్లో రెండు సార్లు మిస్ కేరి అవ్వడం వల్ల, అమ్మా వాళ్ళింట్లో రెస్ట్ తీసుకుంటూ టివి లో పాత సినిమా చూస్తున్నాను ... తనకి పిల్లలు పుట్టరని భర్తకు మరో పెళ్లి చేయాలని ఒప్పిస్తూ ఉంటుంది ఆ మహాసాధ్వి ...టిడ..టిడ..టోయ్ ... ఇంకేంటి వీరోయిన్ ప్లేస్లో నేను ,వీరో మా ఆయన ..మా ఆయన్ని ఒప్పిస్తూ కళ్ళల్లో నీళ్ళతో నేను (కంగారు పడకండి అప్పటికింకా నా వయసు నిండా ఇరవయ్యే .. అందుకే అలా అన్నమాట ) చాలా ఉద్వేగ భరితమైన సీన్ మద్యలో మా ఆయన వచ్చి డిష్టర్బ్ చేసినందుకు గొప్ప చిరాకొచ్చింది గాని ,విషయం వినేసరికి ఏంటీ !!!!!!!!! అని ఒక్క అరుపు అరిచాను ...
అది కాదు బుజ్జి ,మొన్నటి వరకు నువ్వు ప్రెగ్నెంట్ గా ఉన్నావు కదా అప్పుడు చెబితే ఎక్కువ ఆలోచిస్తావని చెప్పలేదు ..అనుకోకుండా నాకు సింగపూర్ లో జాబ్ వచ్చింది .. వచ్చే ఆదివారమే వెళ్ళాలి అన్నారు మెల్లి గా .... అంతే కళ్ళలో నుండి నీళ్ళు జల జలా వచ్చేసాయి.. మా ఆయన నన్ను వదిలేసి వేరే దేశానికి వెళతారా ??ఇంకేమన్నా ఉందా ??? ..నేను ఉండగలనా ???? ఒక పావుగంట వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉన్నా.. మరి నా కన్నె కలలన్ని రెక్కలొచ్చి కాకుల్లా ఎక్కడికి వెళ్లిపోయాయో తెలియదు గాని ,అప్పటికి నేను సగటు భార్య స్థానం లోకి వచ్చి అర్ధ సంవత్సరం పైనే అయిపోయింది... అది కాదు బుజ్జీ ,నాకు మాత్రం నిన్ను వదిలి వెళ్ళడం ఇష్టం అనుకుంటున్నావా?? ఒక ౩ నెలల్లో నిన్ను నాతో తీసుకు వేళ్ళనూ...మనకి ఆస్తులేమున్నాయి చెప్పు .ఇపుడు సంపాదిస్తుంది మనవరకు సరిపోతుంది ...మనకు పిల్లలు పుడితే అప్పుడు వాళ్ళను బాగా చూసుకోవాలి కదా ,ఖర్చులు పెరుగుతాయి కదా ...అయినా ఎంతా, ఒక్క మూడేళ్ళు ... ఆ తరువాత వెనక్కి వచ్చేద్దాం ...సరేనా అంటూ పలు ,పలు విధంబులుగా మభ్య పెట్టగా మూడు ఉహు...హు లు ముప్పది ప్లీజ్ లమధ్య ఒప్పుకోక తప్పలేదు ....
మా ఆయన కోసం మొదటి సారి హైదరాబాద్ లో ఎయిర్ పోర్ట్ వచ్చి ,విమానం ఎలా ఉంటుందో దగ్గర నుండి చూసాను ... ఆయన విమానం ఎక్కుతున్నంత సేపు ఆనందం గా ఉన్నా దిగి అక్కడకు చేరుకున్నాను అని ఫోన్ చేసే వరకు ఒక్క నిమిషం స్థిమితం గా ఉండలేక పోయాను ...
పైకి నిమిషాని ఆరు సార్లు అరుస్తాను గాని మా ఆయన మీద నాకు ఎంత ప్రేమఉందో అప్పుడు గాని తెలియలేదు.. పైగా అప్పట్లో ఫోన్ బిల్ విపరీతం గా అవ్వడం వల్ల ,క్రొత్తగా జాయిన్ అవ్వడం వల్ల ఎక్కువ గా ఫోన్ చేసేవారు కాదు ..అప్పుడప్పుడు లెటర్స్ వ్రాసేవారు ..వాటినే ముప్పై సార్లు చదువుతూ ఉండేదాన్ని ...
ఎవరన్నా తెలిసిన వాళ్ళు కనబడితే నేను సింగపూర్ వెళుతున్నా అని గొప్ప గా చెప్పేదాన్ని కాని, ఆ తిక్క మొహాలకు సిరిపురం లా వినబడి ఏడ్చేది కాబోలు ..అది సరే గాని ఇంకేంటే విశేషాలు అనేవారు ....ఒక వేళ పట్టుబట్టి చెప్పినా అమ్మో సింగపూరే ..ఎలా పంపించావ్ ...ఇంక నీ బ్రతుకు ఇక్కడే ..ఆ దేశం లో పెళ్ళాలకు వీసా ఇవ్వరంటా..ఒక వేళ నువ్వు వెళ్ళినా ౩ నెలల తర్వాత పంపేస్తారంటా మాకు తెలిసిన వాళ్లకు ఇలాగే జరిగింది ... అని నాలుగైదు కధలు చెప్పి భయపెట్టేసే వాళ్ళు..అమ్మా వాళ్లకు చెపితే ,సరేలేమ్మా అంతగా అయితే ఇక్కడున్టావ్ ,నష్టం ఏంటి ,ఎలాగూ ౩ ఏళ్ళు తర్వాత వచ్చేస్తాడు గా అనేవారు.. నాకు చాలా దిగాలుగా అనిపించేది.. పెళ్లి మంత్రాలు ఎంత పవర్ఫుల్ కాక పొతే ..సంవత్సరం పరిచయానికే ఇంత ప్రేమ పెంచేసుకుంటామా!! అనిపించేసేది..
నా దిగులు కాదు గాని ,రోజు పాపం మా చెల్లెళ్ళకు చిరాకు తెప్పించేసేదాన్ని ... ఈ పాటికి మీ బావగారు నిద్ర లేచి ఉంటారు .. ఈ పాటికి బ్రష్ చేసి ఉంటారు .. అక్కడికి ,ఇక్కడికి రెండున్నర గంటలు తేడా అంటా ...నాకు వీసా వస్తుందంటావా ??? ఒక వేళ అక్కడికి వెళితే నేను ఉండగలనంటావా అని చెప్పిందే చెప్పి నస పెట్టేసేదాన్ని.. ఫోన్ రానంత వరకు ఒక బెంగ ,ఫోన్ పెట్టేసేక ఒక బెంగ .. ఏదన్నా అద్భుతం జరిగి మా ఆయన గంట మాట్లాడేవరకు ఫోన్ కార్డ్ అవ్వకుండా ఉంటే భలే ఉంటుంది కదా అనుకునేదాన్ని.. అద్భుతం.. అదే జరిగింది ... ఏం జరిగిందో ఏమో.. కార్డ్ లో డబ్బులు అయిపోయినా రెండున్నర గంటలకు పైనే మాట్లాడుకున్నాం ..అక్కడి విశేషాలన్ని పూస గుచ్చినట్లు చెప్పారు ..
ఇక్కడ బుజ్జీ.. అబ్బాయిలు చిటికిన వేలు కనబడకుండా బట్టలు వేసుకుంటారా ..అమ్మాయిలేమో పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటారు తెలుసా..
అవునా ..మీరు గాని చూస్తున్నారా వాళ్ళను ??..
ఛీ.ఛీ ఆ పంది మొహాలను ఎవరు చూస్తారు ..మన ఇండియన్ అమ్మాయిలు కనబడితేనే చూస్తాను ...
హమ్మయ్యా అదే కదా ... @#$%^ ఏంటి,మళ్లీ చెప్పండి !!!!!
లేకపోతే నాకింక ఇదే పనే ...ఆఫీస్ లో పనిమానేసి వాళ్ళను వీళ్ళను చూస్తూ ఉంటా.. పైగా ఇక్కడ చట్టాలన్నీ అమ్మాయిలకు అనుకూలం గా ఉంటాయి..వెధవ వేషాలేస్తే కేన్ దెబ్బలే ..
అంటే???..
అంటే సన్నటి పేక బెత్తం లాంటి దానితో కొడతారంట...
ఓస్ అంతే కదా..
ఆగు ..పూర్తిగా విను .. ఆ దెబ్బకు వాడి వీపు అర అంగుళం మేరకు విడిపోతుంది అంట ..
అమ్మో !!!!..
అది తగ్గాకా మళ్లీ మిగిలిన దెబ్బలు కొడతారు ..
ఇంక చెప్పకండి బాబు ...
ఇక్కడ రోడ్లు ఎంత నీట్ గా ఉంటాయో తెలుసా... అద్దం లా ఉంటాయి.. మనదేశం లా ఉమ్ములు ,చెత్త పోస్తే బోలెడు డబ్బులు పైన్ వేస్తారు ...
చిన్నపిల్లలు ,ముసలి వాళ్ళు చేసినా అలాగే వేస్తారా??? ...
అవును వాళ్ళ ఇంట్లో వాళ్ళు కట్టాల్సిందే ...
ఇది మరీ బాగుంది ... చేతిలో చెత్త ఉంటే??
ఎక్కడికక్కడ డస్ట్ బిన్లు ఉంటాయి రోడ్ పొడవునా ...
ఓ ..మరీ ..ఉమ్మోస్తే ...
చెప్పాగా డస్ట్ బిన్లు ఉంటాయి అని ..
మరీ బాత్రుం కొస్తే??
.......
చెప్పండీ ...చిన్నపిల్లలు ,షుగర్ పేషంట్లు ఉంటారు ..మరి అప్పుడూ..దారి పొడవునా బాత్రుమ్లు ఉంటాయా ??..నేను రెట్టించాను ..
ఆహా.. ఇక్కడ ఎటు చూసినా అపార్ట్మెంట్లు ఉంటాయి కదా ..మనకు దగ్గర లో ఉన్న ఇంటికి వెళ్లి ,మీ ఇంట్లో బాత్రుం కి వెళతాను అని చెప్పడమే..
నిజ్జమ్మా!!! (బోలెడు ఆక్చర్యం ..ఇంకా బోలెడు అనుమానం గా)
నిజమేనే ..అది గవర్నమెంట్ రూలు .. మరి శుభ్రం గా ఉండాలంటే ఎలా.. మొన్న నేను అలాగే వెళ్లి వచ్చా..
అవునా !!!! మిమ్మల్ని ఏమి అనలేదా..
ఎందుకంటారు ...పైగా వాళ్ళ దేశాన్ని శుభ్రం గా ఉంచుతున్నందుకు మనల్ని కొత్త అల్లుడిలా గౌరవం గా చూస్తారు..
సరే ,ఆయన సంగతి తెలిసి నమ్మేసాను ...నమ్మేసినదాన్ని ఉరుకున్నానా !!!.. నాలాంటి పది మందికి చెప్పి నమ్మించాను.. వాళ్ళు ఇంకో పదిమందికి చెప్పి 'ఛీ' అనిపిచుకుని 'ధూ' అనేసారు నన్ను అది వేరే సంగతి అనుకోండి.. అలా బోలెడు విశేషాలు చెప్పుకున్నాకా వీసా గురించి అందరూ అనే మాటలు అన్నీ చెప్పాను ...అలా నా భయాలు బాధలు అన్నీ ఓపిగ్గా విన్నాకా చివర్లో మెల్లిగా చెప్పారు నీకు వీసా వచ్చింది ... మరుసటి నెలలోనే నువ్వు రావాల్సి ఉంటుంది అని.. భయం ,ఆనందం ,బెంగ అన్ని కలగలిపి ఏంటో నాకే తెలియదు ... అలా ఇరవై ఏళ్లకే నేను విదేశాలకు వెళ్ళే చాన్స్ వచ్చింది ..





