28, సెప్టెంబర్ 2009, సోమవారం

విజయ దశమి శుభాకాంక్షలు


అందరికీ విజయ దశమి శుభాకాంక్షలు. ఇలా రాసి వదిలేద్దాం అనుకున్నాను ..కాని మా ఆయన చెప్పిన్నట్లు మిమ్మల్ని అంత ప్రశాంతం గా ఎలా వదిలెయ్యను చెప్పండి..కాబట్టి తప్పదు వినాల్సిందే ..అసలు నాకు దుర్గమ్మ తో ఉన్న అనుబంధం సామాన్యమైనది కాదు..మీకో విషయం తెలియదు దుర్గాదేవికి నేనంటే బోలెడు ప్రేమ.నమ్మడం లేదు కదు ..అయితే కాస్కోండి..

అవినేను ఇంటెర్ చదువుతున్న రోజులు ,నాకు ఎక్జాంస్ అంటే మహా భయం ,టెన్షన్ ,వణుకు ..పోనీ మావాళ్ళు సరిగ్గా రాయలేకపోతే తిట్టేస్తారు,కొట్టేస్తారు అని అనుకోడానికి అసలే లేదు వాళ్ళకు అసలు నేను ఏం చదువుతున్నానో కూడా తెలియదు ..నాకు పక్కా వ్యతిరేఖం మా అక్క.ఆ సమయంలో నేను 10 లంఖణాలు చేసినదానిలా తయరయితే,అదేమో ఏదో అందాల పోటీలకు తయారు అయినట్లు చక్కగా తయారయ్యి వెళ్ళేది.దాన్ని చూస్తేనే వళ్ళు మండిపోయేది నాకులాగా ఎంచక్కా టెన్షన్ పడట్లేదని. సరే మొత్తానికి రాత్రీ ,పగళ్ళు తెగ చదివేసి పరీక్షలన్నీ రాసేసాను ఆఖరి ఎక్జాంకి మాత్రం నిద్రలేక తల మొత్తం పట్టేసింది ..ఏం చదువుతున్నానో ఏంటో తెలియదు కాని మొత్తానికి తెల్లారిపోయింది. మెదడు అంతా శూన్యం అయిపోయినట్లు అనిపించింది ..మా అమ్మ దగ్గరకు వెళ్ళీ బోరుమని ఏడ్చాను ..అమ్మా నేను ఎక్జాం డుమ్మా కొట్టెస్తాను, అన్నీ బాగానే రాసాను ఇది మాత్రం ఖచ్చితం గా పోతుంది అని.. పోనీలేమ్మా ఇంకోసారి రాసుకుందువు అంది సింపుల్ గా ...చివరికి ఏడుపుమొహం తో బయలుదేరుతూ బయటకు వచ్చి ఎదురింటి గుమ్మం దగ్గర పెట్టిన దుర్గా దేవి ఫొటొ చూస్తూ మళ్ళీ బోరుమన్నాను నేను ఫెయి అయిపోతాను బాబోయ్ ఎలాగన్నా గండం గట్టెంకించు అని ..తీరా కాలేజ్ కి వెళ్ళగానే అవాక్కయ్యాను ..ఆ రోజు ప్రశ్నా పత్రం లీకవ్వడం వల్ల ఎక్జాంస్ పోస్ట్ పోన్ అయ్యాయహో అని ప్రకటించేసారు ఒకటి కాదు రెండుకాదు ఏకంగా నెల తరువాత జరిగింది ఆ పర్క్ష.ఇలా దుర్గా దేవి తనకు నా పై ఉన్న ప్రేమను ఇలా చూపించింది అన్నమాట..కొంచం కుళ్ళుకుంటున్నారు కదా .. అయితే ఇంకొకటి చెప్తా..

ఒక సారి పెళ్ళి అయ్యాక మా ఆయనతో విజయవాడ దుర్గాదేవి గుడికి వెళ్ళాను.. లోపల గర్బాలయంలో దగ్గరగా నిలబడి మరీ పూజ చేయించుకుంటుండగా ఎవరో ఒక పేద్ద మల్లెపూల చెండు అమ్మవారికి సమర్పించారు..వెంటనే మన కళ్ళు ఆ పూల మాల మీద పడిపోయాయి..అబ్బా ఎంత బాగుందో అది నాకు ఇస్తే బాగుండును అనుకుని వెనుకకు తిరిగాను వెళ్ళిపోడానికి..వెంటనే పూజారి అమ్మాయ్ ఈ మాల తీసుకో అని పిలిచి చేతిలో పెట్టాడు.. ఇప్పుడు చెప్పండి దుర్గాదేవికి నేనంటే ఇష్టమా కాదా.. అద్గది అలా ఒప్పేసుకోవాలి బుద్దిగా :)
హ..హ నాకు తెలుసు మీరు మనసులో ఏమనుకుంటున్నారో..పొవే అప్పలమ్మా ఇలాంటివి చాలామందికి జరుగుతాయి అనికదా.. హ..హ సరదాగా రాసినా ఆ చల్లని తల్లి కరుణా కటాక్షాలు అందరి పైనా ఉండాలని ఆశిస్తూ విజయ దశమి శుభాకాంక్షలు

15, సెప్టెంబర్ 2009, మంగళవారం

మా బంటి


ఇంతకు ముందు పోస్ట్ లో కుక్కల మీద నాకెంత అభిమానమో చెప్పాను కదా ..సరే తరువాత తరువాత నాకు యుక్త వయస్సు వచ్చేసరికి మావాళ్ళు వరుని వేట మొదలెట్టేసారు ..ఆ ఫళంగా నేనూ రెండు కండిషన్లు పెట్టేసాను పనిలో పనిగా .. ఒకటి అబ్బాయి మా వూరికి అరగంట జర్నీ మించి దూరం ఉండకూడదు .. నేను గట్టిగా నాన్నా!! అని పిలిస్తే గుమ్మం ముందు మా నాన్న కనబడాలి ... రెండవది వాళ్ళింట్లో కుక్క ఉండకూడదు ... అవన్నమాట .. అయితే అదేంటోగాని మా నాన్నకి మేము ఏం కండిషన్లు పెడతామో దానికి పక్కా ఆపోజిట్ అబ్బాయినే మాకు కట్టబెట్టేవారు .... ఈ విషయం తెలియక మా అక్క కూడా పాపం పెళ్ళికి ముందు ఒక కండిషన్ పెట్టింది ..నాన్నా మరేమో నాకు అబ్బాయి బాగున్నా ,బాగోపోయినా.. ఇల్లు పెద్దదయినా, చిన్న దయినా ... ఉద్యోగమయినా,వ్యాపారం అయినా ఏదయినా పర్లేదుకాని బాత్రుం మాత్రం విశాలం గా ఉండాలి ... అందులో స్నానం చేయడానికి పేద్ద టబ్ ఉండాలి అని .. కట్ చేస్తే వాళ్ళింటి బాత్రుం కరెక్ట్ గా స్నానం చేసే టబ్ అంత మాత్రమే ఉంది ... పాపం ....


సరే మన కధలోకోచ్చేస్తే , నేను అలా కండిషన్ పెట్టగానే మా వారితో నాకు సంబంధం కుదిరిపోయింది ... రేపు తాంబూలాలు అనగా ఈ రోజు రాత్రి తెలిసింది వాళ్ళింట్లో కుక్క ఉంది అని ..అంతే కే..వ్వు మని అరిచి వద్దు అంటే వద్దు అంతే అని గొడవ చేసే అంతలో మా ఇంట్లో వాళ్లందరూ నా నోరు నోక్కేసారు నోరుముయ్యి అని ... పైగా అబ్బాయి కుక్కను ఎత్తుకుని ఉన్న ఫోటో ను చూసి కూడా నువ్వే ఒప్పుకున్నావ్ అని మొత్తం నా మీదకు తోసేసారు ...అంటే అబ్బాయిని చూసా అన్న ఆనందం లో కుక్క పిల్లను సరిగా గమనించలేదన్నమాట ...

మొత్తానికి నేను మా ఆయనతో పెళ్ళికి ముందు , పెద్దవాళ్ళకు తెలియకుండా ఫోన్లో బోలెడు కబుర్లు చెప్పే హడావుడిలో పడిపోయి ఆ విషయం మర్చిపోయాను.. అలా మర్చిపోయిన విషయం మళ్ళా పెళ్ళయ్యాకా అన్నవరం వెళ్లి వ్రతం చేయించుకుని, దారిలో మా వారి ప్రక్కన కూర్చుని, గోరింటాకు ఎర్రగా పండాలంటే ఏమేం వేసి రుబ్బితే బాగా పండుతుంది అని సీరియస్సుగా వివరిస్తున్న సమయంలో ,కారుకి కుక్క అడ్డం రావడం వల్ల వేసిన సడన్ బ్రేక్ వల్ల గుర్తొచ్చేసిందన్తే ...దెబ్బకి మా వారితో డ్యూయట్ వేసుకోవడానికి స్విర్జర్లాండ్ కు వెళ్లడానికి రెడీగా ఉన్న నేను కుక్క తరుముతున్నట్లు ఈ లోకంలోకి వచ్చేసాను ... ఏమండి మీ ఇంట్లో కుక్క ఉందా?..అరుస్తుందా?..కరుస్తుందా? లాంటి ప్రశ్నలు వేయబోతున్నంతలో కారు మా అత్తగారి ఇంటి ముందు ఆగింది ...

ఆ వీధి లో వాళ్ళు, ఈ వీధిలో వాళ్ళు ,మా వీధిలో వాళ్ళు అందరూ ఎక్కడిపనులు అక్కడ వదిలేసి తొంగి తొంగి చూస్తున్నా సరే నా కళ్ళు మాత్రం బౌ ..బౌ మంటూ అరిచి మీద పడిపోయే కుక్క కోసం వెదుకుతున్నాయి..ఈ లోపల మా ఆడపడుచు మరికొంతమంది గుమ్మం దగ్గర రెడీ హారతి పళ్ళెం పట్టుకుని ...మీ పేర్లు చెబితే గాని లోపలకు పంపమని గొడవ.. ఏంటో వీళ్ళ పిచ్చి గాని, పెళ్ళయ్యాక ఎలాగూ ఆ పేరుతోనే ఫిక్స్ అయిపోతారు కదా ..అసలే జమానా బధల్ గయా .. అనుకోబోయే అంతలో మా అక్క మాటలు గుర్తు వచ్చాయి.. ఇదిగో అక్కడ పేర్లు చెప్పమని అడుగుతారు ..వెంటనే మీ ఆయన పేరు చెప్పయ్యకు ..నేను అలాగే నీరసం వల్ల తొందరగా ఇంట్లోకి వెళ్ళిపోదామని మీ బావ పేరు చెప్పేసాను తన కంటే ముందు.....అబ్బా!ఇప్పటి కొచ్చి అందరూ తలుచుకుని తలుచుకుని తిడుతున్నారు నన్ను ... కాసేపు సిగ్గుపడు అర్ధం అయిందా అని చేసిన ఉపదేశం గుర్తువచ్చి బోలెడు సిగ్గు పడిపోతుంటే ... స్లో మోషన్లో పరిగెత్తుకుంటూ వచ్చేసింది బౌ బౌ అనుకుంటూ బంటీ.. మా ఇంటి కుక్క పిల్ల ...

నేను మొహం లో సిగ్గుపడే ఎక్స్ ప్రషన్ మార్చేసి మా ఆయన వెనుక పారిపోయాను.. కాని అప్పటికే మా ఆయన దాని దగ్గరకు వెళ్లి ముద్దులు పెట్టేస్తూ ,ఇంకెప్పుడు నిన్ను వదిలి ఎక్కడకు వెళ్ళనమ్మా... బెంగ పెట్టుకున్నావారా .. నేను అప్పటికీ చెప్పాను నిన్ను కూడా పెళ్ళికి తీసుకు వెళదామని ,వీళ్ళు వినలేదు అని దానికి బోలెడు సారీలు చెప్పడం మొదలు పెట్టారు.. క్షణాలలో హారతి సీను మారిపోయి అక్కడ సెంటిమెంట్ సీను మొదలైపోయింది.. అందరూ వాళ్ళ ఇద్దరినీ చూసి కళ్ళు అద్దుకుని పేర్లు అడగకుండానే హారతి ప్లేటు పట్టుకుని వెళ్లిపోయారు . నాకు భయం వేసింది అమ్మో ఈయనగారికి ఇదంటే చాలా ఇష్టమల్లె ఉంది .ఇప్పుడు నాకు కుక్కలంటే భయం.. కాస్త దాన్ని దూరంగా కట్టేయండి అంటే ఏమంటారో అని.. నా ఆలోచనల్లో నేను ఉండగా అది నావైపు చూసింది .. మా ఆయన వెంటనే నవ్వుతూ అదేరా అసలు దీనికతంటికి కారణం .. తనకోసమే నిన్ను ఒక్కడిని వదిలేసి వెళ్లాను .. ఇంకెప్పుడు ఇలా చేయనమ్మా.. పోనిలే పాపం ఈ సారికి దానిని క్షమించేద్దాం ..ఎంతైనా నీకు వదిన కదా అన్నారు...అంతే 'డామ్' అని పడబోతూ నిలదొక్కుకుని వదినా ??? ఎవరికీ అని అనుమానంగా చూస్తుంటే ..మా అత్తగారు ఒరే బంటీ అన్నయ్యను ,వదినను లోపలి కి రానివ్వరా అని అంటూ లోపలి వెళ్లి పోయారు..


ఓర్నాయనో ..కుక్కల తో అన్నయ,వదిన,అక్క ,అమ్మ,తమ్ముడు అని వరసలు పెట్టికూడా పిలిపించుకుంటారా అనుకుంటూ బోలెడన్ని నక్షత్రాలు కళ్ళముందు కనబడుతుండగా లోపలకి నడిచాను ..లోపల బెడ్ రూమ్ లో మా ఆయన దాన్ని బెడ్ మీద, వడిలో కూర్చోపెట్టుకుని బిస్కెట్స్ తినిపిస్తున్నారు.. అయ్యో పాపం క్రొత్తగా వచ్చింది ఈ ఇంటికి ..ఎవరూ తెలియదు దీనికీ.. కాసేపు కబుర్లు చెబుదాం ..అదేం లేదు ఇంక..పైగా దాన్ని ఎంత మిస్ అయ్యారో ఈ రెండు రోజులు దానికి వర్ణించి చెప్తున్నారు సీరియస్సుగా ..అలా నా లైఫ్ లో ఒక కుక్కతో పోటి పడుతూ, పోల్చుకుంటూ ఉంటానని నా కలలో కూడా అనుకోలేదు.. ప్లిచ్ ..ఆ రోజు నుండి నా పాట్లు ఏమని చెప్పను ...

మా బంటికి ఒక్కటంటే ఒక్కటి మంచి లక్షణం లేదు ..దానికి తిండి మన చేతుల్లో పెడితేనే తింటుంది.. ఏదన్నా గిన్నెలో పెడితే అస్సలు తినదు.. దాని కోసం ప్రత్యేకం గా బోన్స్ తెప్పించేవారు.. వాటిని ఉప్పులేకుండా పసుపు మాత్రం వేసి ఒక గిన్నెలో ఉడక పెట్టి పెట్టేవారు ..అలా చేస్తే దానికి రోగాలు రావంట . అది ఒక్క మెతుకు తినేది కాదు ..దానికి ఉప్పు,కారం,మషాలాలు కావాలాయే ..అది అచ్చం మనిషి లాగే ఇడ్లీలు, గారెలు ,బూరెలు అన్ని తినేది మా దగ్గర కూర్చుని ...మరెందుకు వండేవారో ప్రత్యేకంగా అర్ధం అయ్యేది కాదు ..రోజూ పడేయడమే ...ఒక్కోసారి బలవంతం గా నా చేతిలో పెట్టి తినిపించేవారు ..ఎంత ఏడుపొచ్చేసేదన్టే జిగురు ,జిగురుగా అదోమాదిరి అనిపించేది కాని ఏమి అనలేని పరిస్తితి ..అసలే కొత్త కోడలినాయె ..

ఇది గాకుండా దానికి స్నానం చేశామంటే ఇంట్లో అందరం రెండు రోజులు తుమ్మడమే ..ఆ జుట్టు గాలికి వారం రోజులపాటు ఎగురుతూనే ఉండేది .. ఇది పమేరియన్ తెలుసా ,మామూలు కుక్క కాదు నక్క జాతికి చెందినది అంటూ నేను తుమ్మిన ప్రతి సారి మా ఆయన దాన్ని ఏమనకుండా కవర్ చేసేవారు .. ఇవన్ని కాకుండా దానికి ఇంకో లక్షణం ఉంది గట్టిగా ఉరుమినా ,మెరిసినా వెళ్లి సోఫా క్రింద దాక్కునేది.. అయ్యా శ్రీవారు... మీ పమేరియన్ కుక్కపిల్ల ఇలా శబ్దాలకు జడుసుకుంటే ఇంక దొంగలు గట్రా వస్తే ఎలాగా అంటే, నీ మొహం , అది ఎంత చలాకీ తెలుసా, మా ఇంట్లో ఎలుకలన్నీ అదే చంపేస్తుంది వెంటాడి అన్నారు .. ఎలుకలా ??ఇంతకీ ఇది కుక్కా, పిల్లా ?? అని అడిగితే నోర్ముయ్యి దాన్ని ఏమన్నా అంటే ఊరుకోను అని తిట్టి వెళ్ళిపోయేవారు ..


ఒకరోజు పనిమనిషి సెలవు పెడితే బట్టలన్నీ ఉతికి ఆరబెట్టి, నా బెడ్ రూంలో తెచ్చి మడతలు పెట్టి ,బీరువా ఓపెన్ చేసి వెనుకకు తిరిగి వాటిని లోపల పెడదామని చూస్తే అన్ని తడి ..ఇదేంటబ్బ ఉన్నట్లు ఉండి తడి ఎలా వచ్చింది అని నేను బోలెడు ఆక్చర్య పడిపోతుండగా, మా ఆయన వచ్చి విషయం తెలుసుకుని ..హ్హ హ్హ హ్హ అని నవ్వేస్తూ అంటే తడిపేసిందన్నమాట అన్నారు ..అంటే ?? అని నేను కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే ..మా బంటీగాడు బట్టలు అలా ఎత్తుగా పెడితే తడిపేస్తాడు ..వాడికదో అలవాటు అని సింపుల్ గా అనేసి వెళ్లిపోయారు.. అప్పుడే కుక్కలా ఎలా ఏడుస్తారో ప్రాక్టిస్ అయ్యింది నాకు ...


ఒక్కోసారి అది నేను పడుకున్న మంచం దగ్గర నా కాళ్ళ దగ్గర సైలెంట్గా పడుకునేది ..ఎవరన్నా పిలిస్తే నేను దిగ్గున లేచేదాన్ని, అప్పుడు చాలా సార్లు కాళ్ళ దగ్గర క్రింద పడుకున్న దాన్ని త్రోక్కిసేదాన్ని ... అయిపోయానురా బాబు ..వేసేసింది అనుకునేదాన్ని ..కాని ఒక్క సారిగా బౌ అని అరిచి ఒక్క నిమిషం గుర్రు మని మళ్ళి తోక ఊపుకుంటూ వెళ్ళిపోయేది ... ఒక్కోసారి దాని మీద కోపం వచ్చి..అది నా గదిలో కొచ్చినపుడు దానికి అర్ధం అవ్వకుండా నవ్వుతూ తిట్టేదాన్ని.. బుద్ధి ఉందా ,గాడిదలా ఎదిగావ్ , ఆ మాత్రం మంచి మేనర్స్ నేర్చుకోలేవా అని కోపం తీరేవరకూ తిట్టేదాన్ని .. ఒకసారి మా ఆయన అన్నారు ..అది నన్ను ఎవరన్నా తిడితే ఊరుకోదు అని ..ఏడిసింది నేను తిడతాను ఏమంటుందో చూద్దాం అని మళ్ళి ఎప్పటిలాగే నవ్వు ఫేసు పెట్టి, ఏంటే మీ అన్నను ఏదన్నా అంటే నీకు కోపం వస్తుందా.. కాళ్ళు విరక్కొడతా ఇద్దరికీ అని ఒక రెండు నిమిషాలు తిట్టాను ..అది అలా నన్నుకాసేపు చూసి బౌ బౌ అని అరవడం మొదలెట్టింది.. అమ్మో అంటేదానికి అన్ని అర్ధం అవుతాయన్నమాట ...అది తెలియక ఎలా తిట్టాను దీన్ని అనిఅనుకున్నాను...


కాని ఎన్ని తిట్టుకున్నా ,ఏం చేసినా అది నా రూంలోనే ఎక్కువ ఉండేది ..దానితోనే ఎక్కువ ఉండేదాన్ని ...ఒక రోజు మా అత్తగారు ఊరు వెళ్ళారు ..మా మామ గారు ఆఫీస్ వెళ్ళారు ..ఇదిగో నాకు పని ఉంది..సాయంత్రం వరకు రాను ఎవరొచ్చినా తలుపుతీయకు అని మా ఆయన చెప్పి బయటకు వెళ్ళబోతూ బంటి గాడు జాగ్రత్త ..అసలే ఎదురింటి కుక్క ఊరికే మా వాడికి లైన్ వేస్తుంది తలుపు తీయకు ..బయటకు వెళ్లిందంటే ఇంటికి రావడం కూడా దానికి దారి తెలియదు ..అని అన్నారు.. ఛి ,చీ మీ ఇంట్లో కుక్కలతో సహా ఒక్కరికి మంచి బుద్ధి లేదు అని తిట్టుకుని లోపలికి వచ్చాను ..

పనులన్నీ అయ్యాకా చూస్తే బయట పిట్టగోడ దగ్గర నించుని తలుపు తోసుకుని బయటకు పోవడానికి శత విధాల ట్రై చేస్తుంది .... క్రిందకు వంగి చూస్తే నిజంగానే ఒక కుక్కపిల్ల దీన్ని పిలుస్తుంది..అమ్మో ..అమ్మోఈయన నిజమే చెప్పారన్నమాట అనుకుని ,ఓయ్ నాదగ్గర కాదు ఈ వేషాలు ,తోలు తీస్తా లోపలి రా అని గదమాయించినా అది రాక పోయే సరికి, సరే అక్కడే ఉండు ..నా సంగతి తెలుసుగా నేను మాత్రం తినిపిన్చను ..అక్కడే వండిపెట్టా.. నీకు నువ్వే తినడం నేర్చుకో అనేసి టి.వి చూస్తూ కూర్చున్నా ...సాయంత్రం అయినా అది అక్కడ నుండి కదలకుండా చూస్తుంది క్రిందకు ... ఆకలి వేస్తె అదే వస్తుంది ..అన్నీ చెత్త అలవాట్లు అని తిట్టుకుని నేను పట్టించుకోలేదు ... చీకట్లు ముసురుకుంటుంటే కరెంట్ పోయింది .

సరిగ్గా ఎవరో గుమ్మం దగ్గర నించుని పిలుస్తున్నారు ..ఎవరూ అని బయటకు వస్తే మా పేద్ద మామయ్య గారు ..ఏమ్మా మీ మామ గారు ఉన్నారా అన్నారు .. లేరండి ఇంకా రాలేదు అన్నాను.. ఇటు చూస్తే ఇది బయటకు పారిపోడానికి రెడీగా ఉంది తలుపు తీస్తే .. అటు ఏమో ఆయనను బయట నిలబెట్టి మాట్లాడటం మర్యాద కాదు..దీన్ని లోపలి వెళ్ళమంటే వెళ్ళదు..నాకు సీతాదేవి గుర్తు వచ్చింది ..ఇలాంటి పరిస్థితుల్లోనే ఆవిడ గీత దాటి ఉంటుంది అనుకుని కాస్త తలుపుకి అడ్డుగా నిలబడి రండి లోపలకు అన్నాను తెరిచి.. అబ్బే వద్దమ్మా నేను వచ్చా అని చెప్పు మీ మామ గారికి అని ఆయన వెళ్లిపోయారు.. అంతే ఒక్క అంగలో నన్ను తప్పించుకుని బయటకు ఉరికేసింది అది.. హే.. ఆగు అన్నా సరే ఇంకెక్కడ రోడ్ మీదకు వెళ్ళిపోయింది ..

ఒక ప్రక్క ఇంటి తలుపులు తీసి ఉన్నాయి ..నేనేమో నైటీ లో ఉన్నాను ..ఎలా దాని వెనుక పడేది ..నాకొక్క నిమిషం మైండ్ పనిచేయలేదు.. గభ గభా క్రింద ఇంటి పోర్షన్ ఆంటీ దగ్గరకు పరిగెత్తి ఆంటీ బంటీ పారిపోయింది అన్నాను ..సరే ఏం కాదులే నేను చూస్తా అని ఆమె ఒక కర్ర పుచ్చుకుని దాని వెనుక పడింది ..ఆ కర్ర చూడగానే అది భయపడి వీది చివరకు పారిపోయి మలుపు తిరిగిపోయింది ... ఆవిడ అరగంట తరువాత వచ్చి లాభం లేదమ్మా ఎక్కడికో వెళ్ళిపోయింది ..వస్తుందిలే అదే అని వాళ్ళ ఇంటి లోకి వెళ్లిపోయారు ...
నాకు ఒక ప్రక్క ఏడుపోచ్చేస్తుంది..ఇంకో ప్రక్క కోపం .. మళ్ళి మా ఇంట్లోకి వెళ్లి మా మావయ్యగారికి ఫోన్ చేశా ఎవరూ లిఫ్ట్ చేయడం లేదు .. మా ఆయన గుర్తు రాగానే గుండె దడ,దడ మంది .. మరి మరీ చెప్పారు ..అది బయటకు వెళ్ళిపోయింది అని తెలిస్తే ఇంకేమన్నా ఉందా ..ఆయనకు కాల్ చేసినా దొరకలేదు..

మా పనిమనిషి వచ్చింది ... అయ్యో అని నిట్టూర్చి ..వస్తుంది లేమ్మా ... కంగారుపడద్దు అని దైర్యం చెప్పి..కాని కోడలుగారు దానికి మీరంటే ఎంత ఇష్టమోనండి ... నేను రోజు వచ్చినా అంతలా అరుస్తాదండి ..కాని మీరు వచ్చిన రోజునుండి మీ వెనుకే తిరిగేది ..మూగ జీవి అయినా దానికి తన వాళ్ళు ,బయట వాళ్ళు తెలుసండి అని దాని గురించి చెప్పడం మొదలు పెట్టింది .. నాకు ఏడుపోస్తున్నట్లు అనిపించి హాల్ లో కొచ్చాను ..దాని కోసం ప్రొద్దున పెట్టిన పాలు వెక్కిరిస్తూ కనబడ్డాయి .. మంచి నీళ్ళ పాత్ర నిండా తల వెంట్రుకలు పడి ఉన్నాయి.. అలా ఉంటే మా ఆయనకు ఎంత కోపమో ..మీకు అలాంటి నీళ్ళు త్రాగిస్తే ఎలా ఉంటుంది అని తిట్టేవారు ... 'బౌ' మా ఆయన ఎప్పుడొచ్చారో వెనుక నించుని అరిచారు చెవి దగ్గర.. ఉలిక్కిపడి వెనక్కి తిరిగితే నా మొహం చూసి ఏమైంది అన్నారు కంగారుగా ...బంటీ బయటకు వెళ్లి పోయింది అన్నాను భయం గా ..ఏంటి? ఎప్పుడు ?అన్నారు అర్ధంకానట్లు చూస్తూ ...ఒక అరగంట అయి ఉంటుంది ..అనుకోకుండా తలుపు తీస్తే నా మాటలు మద్యలో ఆపి అరగంట అయితే ఇప్పటివరకు ఏం చేస్తున్నావ్ అని బయటకు పరిగెట్టారు...

ఒక పది నిమిషాలకు మా మావయ్యగారు వచ్చారు పరవాలేదులే కంగారుపడకు దొరుకుతుంది అని ఆయనా వెతకడానికి వెళ్ళారు..
ఎక్కడో ఆశ దొరుకుతుందని ..ఒక అరగంట అయ్యాక మా ఆయన మళ్ళి వచ్చారు ...వచ్చిందా అనుకుంటూ ..ఉహు అన్నాను ...మంచం మీద తల పట్టుకుర్చున్నారు.. ఎక్కడికి వెళ్లి పోయిందో ..పాపం దానికి రోడ్ దాటడం కుడా రాదు .. ఎక్కడన్నా ఏ బస్ దగ్గరో మా ఆయన మాట వణికింది ...నా గుండెల్లో జల్లుమంది.. హఠాత్తుగా అడిగారు ఏమన్నా తిన్నాదా అని ..ప్రొద్దున నుండి ఏమి తినలేదన్న విషయం గుర్తు వచ్చింది ..ఉహు అన్నాను భయంగా.. అలా ఎలా వదిలేసావ్ ..పాపం దానికి ఎవరన్నా పిలిచి ఏమన్నా పెట్టినా తినడం రాదు..చిన్నపుడు నాలుగు నెలల పిల్లపుడు నేనే తెచ్చాను ..మా ఫ్రెండ్ ఇచ్చాడు ..ఎంత ముద్దుగా ఉండేదో తెలుసా ..మా అమ్మ వద్దన్నా వినలేదు ..దానికి నేను అంటే ఎంతిష్టమో తెలుసా ..దానికి నా మాట అంటే ఎంత ఇది అంటే నువ్వు ఈ ఇంటికి రానపుడు నీ ఫోటో చూపించి వదిన రా దీన్నిఏమనకు ..బాగా చూసుకోవాలి అనేవాడిని.చూసావా ఒక్క సారి కూడా నిన్ను కరవలేదు .. ఏ వీధి కుక్కలు దాన్ని కరిచేస్తున్నాయో ఎక్కడుందో మా ఆయన మళ్ళి బయటకు పరిగెత్తారు.. నాకు దుఃఖం తన్నుకొచ్చింది.. దేవుడా దేవుడా దొరికేలా చేయవా అనుకుంటూనే ఉన్నాను ...


ఒక గంట పోయాకా దాని అరుపులు విని పరుగు పరుగున వచ్చాను ..మా ఆయన దాన్ని ఎత్తుకుని వచ్చారు ...దారిలో ఇంకో కుక్క దీనిలాగే ఉంటే అదేమో అనుకుని అరుస్తూ పరిగెత్తారంటా.. ఈయన అరుపులు విని ప్రక్క వీధి లో నుండి ఇది వచ్చిందంట .. నన్ను చూడగానే నా మీదకు ఎక్కేసింది ..నాకు ఈసారి అస్సలు కోపం రాలేదు ..నేనే పెట్టాదానికి తిండి.. ఆ రాత్రి ..వద్దురా దుష్టులకి దూరంగా ఉండాలి ..దాని దగ్గరకు వెళ్ళకు నువ్వు అని మా ఆయన అంటుంటే మా ఆయన మీద తిరగబడి అరిచింది ..అంతేలేరా ముందు వచ్చిన చెవులకంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి అని ఊరికే అనలేదు అని మా ఆయన ఉడుక్కున్నారు కాసేపు..

కాని ఇక్కడకోచ్చాక పాపం ఒక రోజు కాలం చేసింది ..అవన్నీ ఎందుకు లేండి ..అప్పుడు మావారు పడిన బాధ అంతా ఇంతా కాదు ..ఇప్పటికీ ఏ కుక్క కనబడినా వేనుకేనుకకు చూస్తూ మన బంటిగాడు ఇలా ఉంటాడే అని తలుచుకున్టునే ఉంటారు ...

9, సెప్టెంబర్ 2009, బుధవారం

శునకానుబంధం



చిన్నప్పటి నుండి నాకు కుక్కలంటే బెదురు,హడలు, భయం,కోపం ,,చిరాకు ,విసుగు లాంటి ఇత్యాది రకాల ఫీలింగ్స్ అన్నమాట. దానికో పే..ద్ద కారణం ఉంది ..చిన్నపుడు నా క్లాస్మేట్ హర్ష గాడికి నాకు మద్య పచ్చ గడ్డివేయకుండానే బగ్గుమనేది ప్రతి విషయం లో .. ఒక రోజు ఇద్దరం టీచరుగారికి మాకు తోచినన్ని చాడీలు ఒకరి మీద ఒకరం చెప్పేసుకుని ,ఆవిడ చేత తిట్లు, దెబ్బలు తినేసి నీట్ గా ఇంటికి వచ్చేస్తున్నాం ..కాని హర్ష గాడికి నా మీద పగ చల్లారలేదు .. దారిలో వాళ్ళ ఇంటిముందు రాగానే ఒక రాయి తీసుకుని ,హాయిగా ప్రశాంతం గా పడుకున్న కుక్క మీద కు విసిరేసి ,బౌ ..బౌ అని అరిచి పారిపోయాడు .. వాడు అలా పారిపోయాడో లేదో వీధి లోకి మూల, మూలన ఉన్న కుక్కలన్నీ పరిగేట్టుకోచ్చేసాయి సాటి కుక్కకి న్యాయం చేసేయడానికి ...ఇంకేంటి, నా చుట్టూ తిరుగుతూ అప్పటి కప్పుడు రౌన్డ్ టేబుల్ సమావేశం జరిపేసి ,కదిలితే కరిచివేత చట్టం అమలు పరిచేసి నన్ను కాలు కదపనివ్వకుండా అక్షరాలా అరగంట కట్టి పడేసాయంతే ..ఆ అరగంట ఎంత మానసిక వేదన అనుభవించానంటే దెబ్బకి అదిగో కుక్కలమీద పైన పేర్కున్న ఫీలింగ్స్ కి ఫిక్స్ అయిపోయాను .


అయితే ఆ ఫీలింగ్స్ ని పెంచిపోషించేలా చేసింది మాత్రం ముమ్మాటికీ మా అమ్మే..అదెలా అంటే మా చిన్నపుడు మా వీధి లో ఆడవాళ్ళందరూ పండగలు వచ్చాయంటే చాలు 'మా ఇంటి వంట 'కార్యక్రమాన్ని నిర్వహించేవారు.. అర్ధం కాలేదా ! అంటే వీళ్ళు వండిన పిండివంటలు వాళ్ళకు ,వాళ్ళు వండిన పిండి వంటలు వీళ్ళకు పంపుకుని ఒకళ్ళనొకళ్ళు తెగ పోగిడేసుకునేవారన్నమాట ..అలాగే ఒకానొక పండగకు మా ప్రక్క వీధి ఆవిడ పంపిన గిన్నెలను తిరిగి ఆవిడకు ఇచ్చేయమని మా అమ్మ హుకుం జారి చేసింది ..నేను వెళ్లను గాక వెళ్ళను అని మొండితనం చేసాను ..దానికి కారణం వాళ్ళింట్లో కుక్క ఉండటమే .. కాని పంతం విషయం లో సేం బ్లడ్ అవ్వడం వల్ల నా వేషాలు కుదరలేదు... తప్పని సరిగా వెళ్లి వాళ్ళ ఇంటి మెట్ల మీద నించుని ఏమండి మీ గిన్నెలు అని అరిచాను .. ఆ ఇంటావిడ కంటే ముందుగా దున్నపోతు సైజులో ఒక కుక్క బౌ బౌ అంటూ వచ్చేసింది ..


ఆవిడ తీరికగా వంట గదిలో నుండి బయటకు తొంగి చూస్తూ ..నువ్వా అమ్మా ,పనిలో ఉన్నాను కాస్త లోపలి కొచ్చి ఇచ్చేసి వెళ్ళమ్మా అంది ..కు..కు..కుక్క అండి అన్నాను భయంగా చూస్తూ .. ఆవిడ తేలిగ్గా నవ్వేస్తూ . .. అది అలాగే అరుస్తుంది కాని కరవదు..నీకు తెలియదాఅరిచేకుక్కలు కరవవు ..నువ్వు రా అంది.. .నీకేం తల్లీ కుక్క నీది కాబట్టి ఎన్నయినా చెప్తావు అనుకుని ,నాకు భయం అండీ నేను రాను అన్నాను .. అయ్యో రామా,, నీ భయం సంతకేల్లా ..అది కరవదు అంటుంటే వినవేంటి అని ఒరే టామీ నువ్వు లోపలి పో అంది.. అది మాత్రం అంగుళం కదలకుండా ,నువ్వు వచ్చ్చావో అయిపొయావే ..ఈ రోజు నీ పెతాపమో నా పెతాపమో చూసుకుందాం అన్నట్టుగా బాలయ్యలా ఓ లుక్కుచ్చింది ..అటు నుండి ఆవిడ గోల రమ్మని ..

ఈవిడ ఎవరురా బాబు నా ప్రాణానికి ఇలా తగులుకుంది అని తిట్టుకుని మెల్లిగా గేటు తీసుకుని లోపలి కి వచ్చాను ... అది నేను అనుకున్నట్లుగా అరవలేదు సైలెంట్ గా చూస్తుంది.. హమ్మయ్యా అనుకుని గబుక్కున గిన్నెలు ఆవిడ చేతిలో పెట్టేసి వెళ్లబోయాను ..అరె, ఆగు పిల్లా ఎంటా తొందర అని ఆవిడ వేస్తున్న గారెలు మళ్లీ ఇంకో గిన్నెలో వేసి మీ నాన్నమ్మకు నేను ఇచ్చానని చెప్పి ఇవ్వు అని ఇచ్చింది.. ఇంక ఈవిడకు పని ,పాట ఏమి ఉండదు కాబోలు అని తిట్టుకుని గభ,గభా బయటకు నడవబోయాను.. మరి ఆవిడ ఇంట్లో దొంగతనం చేసాననుకుందో లేకా నా ముక్కు ,మొహం దానికి నచ్చలేదో తెలియదు కాని అప్పటివరకు సైలెంటుగా ఉన్నది కాస్త ఒక్క సారిగా నా మీద పడింది ... బాబోయ్ అని అరిచి పారిపోయేంత లోనే దొరికిపోయాను.. అంతే, నా కాలు పట్టేసుకుంది గట్టిగా ..

ఒక ప్రక్క అమ్మోయ్ ,బాబోయ్ అని అరుస్తుంటే ఆవిడ రావాలా? అబ్బే ,తాపిగా వంట గదిలో నుండి ఒరే టామీ అలా అల్లరి చేయకూడదమ్మా,పాప భయపడుతుంది అని గారాలు చూపుతుంది..ఒళ్ళు మండి రాగం తారాస్థాయి కి పెంచేసరికి అప్పుడు స్టవ్ ముందు నుండి కదిలి వచ్చి నా కాలు మీద లోతుగా దిగబడిన పంటి గాట్లు చూసి కంగారు తమాయించుకుని..అబ్బే కరవలేదమ్మా,గోరుతో గిచ్చింది అంతే , అయినా కుక్క కాటుకి చెప్పుదెబ్బ అన్నారు ..చెప్పుతో కొడితే సరిపోతుంది అని నేను వద్దు మొర్రో అంటున్నా పాత చెప్పు ఒకటి తీసుకుని ఫేడిల్ ,ఫేడిల్ మని బాదేసింది ..మూలిగే నక్కమీద తాటికాయ పడినట్లు అయ్యింది నా పరిస్థితి ..

ఇంక ఏడుస్తూ ఇంటికొచ్చి.. అంతా నీ వల్లే అని మా అమ్మదగ్గర కధకళి ,కూచిపూడి చేసేసి నాన్న రాగానే బోరున ఏడుస్తూ అమ్మ మీద మొత్తం చెప్పేసాను.. ఆ తరువాత మా నాన్న ఆమెను ,మా అమ్మను బాగా తిట్టి డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్ళారనుకోండి .. కాని ఆ దెబ్బకు నాకు కుక్కంటే భయం నర, నరాన జీర్ణించుకుపోయింది .. అయితే విధి సామాన్యమైనది కాదు కుక్కను తరిమినట్లు తరుముతూనే ఉంటుంది ..

నేను కాలేజ్ లో క్రొత్తగా చేరినపుడు ఒకసారి లంచ్ టైములో అందరం బాతాకాని కొట్టుకుంటుంటే నేనూ తింటూ వింటున్నాను.. ఇంతలొ ఒక అమ్మాయి నేను ఒక్క నిమిషం లేటుగా వస్తే మా బాబి ఉండలేడే బాబు ..రాగానే ఒకటే ముద్దులు పెట్టేస్తాడు తెలుసా అంది.. దెబ్బకు నాకు మైండ్ దిమ్మదిరిగి బ్లాంక్ అయిపోయింది అంతే ..ఇదేంట్రా బాబు ఈ పిల్ల ఇలా చెప్పేస్తుంది అని చుట్టూ చూస్తున్నాను ఎవరన్నా వింటున్నారేమో అని ..హుం ..మా సన్నీ అయితేనా, నేను వచ్చేవరకు ఏది తినడు తెలుసా ,కాసేపు నా వడిలో పడుకుని లేస్తే గాని వాడికి బెంగ తీరదు ఇంకో అమ్మాయి వాపోయింది.. లాభం లేదు రోజులు మారిపోయాయి అని అనేసుకోబోయే అంతలో అర్ధం అయింది వాళ్ళు కుక్క పిల్లల గురించి మాట్లాడుకుంటున్నారని..

నేనప్పటి వరకు కుక్కలను టామీ ,జిమ్మీ లాంటి ప్రత్యెకమయిన పేర్లతోనే పిలుస్తారు అనుకునేదాన్ని,కానీ ఇలా మనుషుల పేర్లతో పిలుస్తారని తెలుయదు ..వీళ్ళు ఏమో కుక్క పిల్లలు పెంచుకోని వాళ్ళను అదేదో ఘోరంలా ,నేరంలా చూస్తున్నారు.. ఇదెక్కడ శునకానదంరా బాబు అనుకునేంతలో ఒక అమ్మాయి ..ఏమోనే బాబు నేను మాత్రం మా స్విటీని నాతొ తీసుకు రావడానికి ఒప్పుకుంటేనే మా అత్తగారి ఇంటికి వెళతా లేకపోతే రాను అని ఖచ్చితంగా చెప్పేస్తా అంది.. ఆ పని చేయి ఇద్దరినీ బయటకు తోసేస్తారు కసిగా తిట్టుకునేంతలో మరి నువ్వేమి చెప్పవేంటి ..మీ కుక్కపిల్ల పేరేంటి అంది ఒక అమ్మాయి..

మా ఇంట్లో కుక్క లేదు అన్నాను చిరాగ్గా ఫేసు పెట్టి ..అంతే ..లేదా !! అని నా వైపుకు విచిత్రం గా చూసి కాస్త దూరం జరిగారు ..ఓర్నాయనో .. ఇదేం గోల అనుకుని వెంటనే .. ఆహా ..అసలేం జరిగిందంటే నా చిన్నపుడు మా ఇంట్లో ఒక కుక్క పిల్ల ఉండేదంట ..అది అంటే నాకు ప్రాణం అంట ..అయితే అది పొతే నేను జ్వరం తెచ్చేసుకుని చాలా రోజులు బెంగ పెట్టేసుకున్నా అంట .. అప్పటి నుండి మా నాన్నకు భయం వేసి మా ఇంట్లో కుక్కపిల్లలు పెంచడం మానేశారు.. కాని నాకు ఎంత ఇష్టమో తెలుసా కుక్కలంటే .. అందుకే నేను మాత్రం పెళ్లి చేసుకుంటే కుక్క పిల్లను పెంచుకునే అబ్బాయినే చేసుకుంటా .. లేకపోతే చేసుకోను అన్నాను అబద్దాన్ని నాగార్జున సిమెంట్ తో గోడ కట్టేసి నేరోలాక్ పైంట్ వేసినంత అందంగా చెప్పేసి ... ఒక అయిడియా జీవితాన్ని మార్చేస్తుంది లాగా ఆ అయిడియాతో నేను మా గ్రూప్ కు నాయికనైపోయాను దెబ్బకు..


కాని అప్పటికి నాకు తెలియదు కదా తదాస్థు దేవతలనే వారు ఒకరు ఉంటారని ,ఆ తధాస్తు దేవతలు అప్పుడే మా పై నుండి ట్రావెల్ చేస్తూ తధాస్తు అని చక్కగా అనేసి వెళ్లిపోయారని ... ఇన్ ఫ్రంట్ డాగ్స్ పెస్టివల్ ఉంది అని ...ఆ విశేషాలు తరువాత :)

22, ఆగస్టు 2009, శనివారం

మా ఇంట్లో వినాయక చవితి


అసలు పండగల విషయం వచ్చేసరికి మా ఇంట్లో ఆడపిల్లలందరికీ చాలా అన్యాయం జరిగిపోయేది ..మా సమానత్వపు హక్కులన్నీ దిక్కులేకుండా పోయేవి..వినాయక చవితికి అయితే మరీనూ .. పండగ ముందురోజునుండే మా తాతయ్య ,తమ్ముళ్ళు హడావుడి మొదలు పెట్టేవారు .అటక మీద పెట్టిన పాలవెల్లి,గంధపు చెక్క పీట క్రిందకు దింపి, వాటికి స్నానాలు చేయించి, చక్కగా పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, పురికాసుని గుమ్మాలకు కొలిచి తెంపి ,మామిడాకులు మద్యలో పెట్టి, ముడివేసి తోరణాలు కట్టి అబ్బో ఇలా ఒకటేమిటీ అన్నీ వాళ్ళే చేసేవారు మమ్మలని ప్రేక్షక పాత్రలకు పరిమితం చేస్తూ..

కానీ నేను ఊరుకోను కదా ప్రతీ పండగకు గొడవే నేను చేస్తా ,నేను చేస్తా అని ,మా తాతయ్య మాత్రం నేను గొడవ చేసే ప్రతి సారీ ముందు నువ్వు పత్రి అని పలకడం నేర్చుకో అప్పుడు చేద్దువుగాని అని తాపీగా బదులు ఇచ్చేవాడు.. అంటే నాకేదో నత్తి అనుకునేరు నాకు కంగారు లో ఒక పదానికి బదులు మరొక పదం పెట్టి మాట్లాడేయడం అలవాటు.. అంటే పత్రిని ప్రత్తి అని ,ఆవేశాన్ని ఆయాసం అని ,ఆదుర్ధాని ఆరుద్ర అని ఇలా ఒకదాని బదులు ఇంకోటి పెట్టిమాట్లాడేసి అర్ధాలు మార్చేస్తూ ఉంటాను..అలా ఆ వీక్ పోయింట్ పట్టుకునే సరికి నా ఆయాసం (ఆవేశం )చప్పున చల్లారిపోయేది ..

ఇంక ఆ మరుసటి రోజు పాలవెల్లికి వెలగ కాయలు,జొన్నపొత్తులు,శీతాఫలాలు, ఇంకా అవేవో చిన్న చిన్న పసుపు రంగు పళ్ళు ఉండేవి అవేంటో మరి ..అవి ఇలా అన్నీ పురికాసుతో వ్రేలాడకట్టి ,పత్రి తో వినాయకుని అలంకరించి పూజ చేసేవారు ..మా తాతయ్య బ్రతికి ఉన్నంత కాలం ఇంటిల్లిపాది పండగలు సావిట్లోనే చేసే వాళ్ళం .. ఆ పండగ రోజు నేను చేసే ఒకే ఒక పని ఏంటయ్యా అంటే నా పుస్తకాలన్నీ వినాయకుడి దగ్గర ఒక్కటి కూడా మిస్ కాకుండా సంచితో సహా పెట్టేయడం .. మాటవరసకు ఒకటి రెండు పుస్తకాలు పెడితే సరిపోతుంది మిగతా పిల్లల పుస్తకాలు ఎక్కడ పెడతారు అని ఎవరు తిట్టినా ఒప్పుకునేదాన్ని కాదు.. నాకు అన్ని సబ్జెక్ట్లు డవుటేమరి ..మరి ఊరికే పాస్ అయ్యానా నా చదువు పూర్తి అయ్యేవరకూ ఒక్క సబ్జెక్ట్ కూడా తప్పకుండా .. అదన్నమాట

ఇక్కడివరకూ అంతా బాగానే ఉంది. అయితే వినాయక చవితి రోజున ఒక్క విషయం లో మాత్రం తలుచుకుంటేనే ఏడుపు తన్నుకొచ్చేస్తుంది.. అదే హారిది.. ఆ హరిదే అలా ఉంటుందో లేక మావాళ్ళే అంత చండాలంగా వండుతారో తెలుయదు కాని అదంటే నాకస్సలు పడదు .అసలు నాకు తెలియక అడుగుతాను వినాయకుడు కుడుములు ,ఉండ్రాళ్ళు ఇష్టము అని చెప్పాడుకానీ ..యే పురాణాల్లో అయినా మాటవరసకు హారిది ఇష్టం అని చెప్పాడా !!... ఈ విషయం మీకూ, నాకు అర్ధం అయింది కాని మా అమ్మా వాళ్ళకు ఎంత మొత్తుకున్నా అర్ధం అయ్యేది కాదు .. పోనీ ముచ్చట పడి చేసారనుకుందాం ..ఏదో వినాయకుని ప్రీత్యార్ధం నాలుగు కుడుములు ,కాసింత చిన్న గిన్నెలో హారిది వండి పెట్టచ్చుకదా అబ్బే ఆ పేరు వింటేనే వీళ్ళకు ఉత్సాహమే ఉత్సాహం అన్నమాట.. అక్కా! నువ్వు ఆ డేషా తో వండుతున్నావా అయితే నేను ఈ గంగాళం తో వండుతా అని ఒకరంటే, అక్కా!! నువ్వు బెల్లం హారిధి చేస్తున్నావా అయితే నేను పంచదారతో చేస్తాను అని ఇంకొకరు ...పైగా ఈవిడ వండిన హారిది ఆవిడ ,ఆవిడ వండినది ఈవిడ బకెట్లు బకెట్లు పంచుకోవడం ..

ఏం ,ఇంట్లో అంతమంది ఉన్నారు కదా చక్క గా మనిషికో రకం గారెలని,బూరెలని,పులిహోర అని వండితే వినాయకుడేమన్నా వద్దు అంటాడా .. పోనీ వండిన వాళ్ళు వండి ముచ్చట తీర్చుకోవచ్చు కదా ,అహా..అది మాకు కంచాల నిండుగా వేసేసి తినమని హుకుం ..పొరపాటున వద్దు అన్నామో .. నా బుజ్జికదా, మాచిట్టికదా అని బ్రతిమాలాడుతారనుకున్నారా.. మా వాళ్ళ అమ్ములపొదిలో మరుదులనే పవర్ఫుల్ అస్థ్రాలు ఉన్నాయి వాటిని ప్రయోగించేవారు ...ఒక్క సారి పిలవగానే వెంటనే మా నాన్నగారి రెండో తమ్ముడు.. ఆలిబాబా అరడజన్ దొంగల్లో గన్ మేన్ లా ప్రతి విషయానికి వేసేమంటారా అన్న టైపులో ఏం వదినా బెల్ట్ తెమ్మంటావా అనేవాడు ...ఇంకేం చేస్తాం ఎక్కడి దొంగలు అక్కడే గప్చిప్..సాంబార్ బుడ్డి అన్నమాట అందరం .

అలా ఏడుచుకుని ,ఏడ్చుకుని..తిట్టుకుని,తిట్టుకుని మద్యాహ్నపు భోజన సమయానికి అది పూర్తి చేసే సరికి అప్పుడు ఘమ ఘమ లాడుతున్న గుత్తొంకాయ,బంగాళ దుంప పిడుపు,పప్పు చారు వగైరా,వగైరాలతో అన్నానికి పిలిచేవారు..ఇంకేం తింటాం గొంతువరకు ఉన్న హారిది నోట్లోకొస్తుంటే ..అలా చాలా చాల అన్యాయం జరిగిపోయేది..

సరే ఈ విషయం ప్రక్కన పెడితే వినాయక వ్రతకధలో నాకు చాలా ఇష్టమైన కధ ..అందులో ఒక కధలో కుమార స్వామి కి, వినాయకునికి ఎవరు గొప్ప అని పోటీ వస్తుంది ..ముల్లోకాలు తిరిగి ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళే బెస్ట్ అని ఇద్దరూ బయలు దేరుతారు ..పాపం కుమార స్వామి గభ గభా తన నెమలి వాహనం మీద అన్ని చుడుతుంటే మన వినాయకుడు తాపీగా అంటే భక్తిగా అమ్మ,నాన్నల చుట్టూ తిరిగి గెలిచేస్తాడు..ఈ కధ వినగానే ఎంత సంతొషం వేసేసేదంటే అమ్మ,నాన్నల చుట్టూ తిరిగేస్తే బోలెడు పుణ్యం అన్నమాట అని పిండి రుబ్బుతున్న మా అమ్మ చుట్టు ,స్కూటర్ తుడుస్తున్న మా నాన్న చుట్టూ ,టి.వి చూస్తు నవ్వారు మంచం మీద కూర్చున్న అమ్మా,నాన్నల చుట్టు కలిపి,విడి విడి గా చాలా సార్లు తిరిగేసి సీక్రెట్గా బోలెడు పుణ్యం సంపాదించేసాను చిన్నపుడు..

ఇంకొక కధ కృష్ణుడు చవితి నాటి చంద్రుని పూజ చేయకుండా చూసి నీలాప నిందల పాలవడం.. నేను ఇంతకు ముందే చెప్పాను కదా నాకు కృష్ణుడంటే వల్లమాలిన ప్రేమ అని..మరి నాలో ఉన్న స్త్రీవాది ఏ మూలన కూర్చుని బట్టలు ఇస్త్రీ చేసుకుంటుందో తెలియదు కాని ఆ కధ చివరలో నీలాప నిందలు పడితేనేమి చక్కని చుక్కలైన ఇద్దరు భార్యలను తెచ్చుకున్నాడు కృష్ణుడు అని చదివి తెగ మురిసిపోయేదాన్ని..అక్కడికేదో కృష్ణుడు నాకు రెండుసార్లు ఆడపడుచు కట్నం ఇచ్చినంత సంబరపడిపోయేదాన్ని ఆ కధ విని ...కానీ పూజ చేసి అక్షింతలు వేసుకున్నా నాకు మాత్రం చవితినాడు చందమామాను చూడాలంటే మహా భయం ఉండేది అప్పట్లో ..ఇప్పుడేమో ఇక్కడ తల ఎత్తితే భవనాలుతప్ప ఆకాశమే కనబడటం లేదు ఏంటో..ఇలా చెప్పుకుంటు వెళుతే వినాయక చవితి గురించి రాస్తూనే ఉండచ్చు..

గమనిక:- ఎవరండి అక్కడ చవితి రోజు చందమామను చూసి తరువాత తీరిక గా పూజ చేసి ఇద్దరు పెళ్ళాలను కొట్టేద్దామని ప్లాన్ వేస్తుంది.. నేనంటే చిన్నపుడు అమాయకత్వం వల్ల అలా అనేసుకుని సరదాగా రాసాను .. మా అమ్మాయిలకు అన్యాయం చేయాలని చూస్తే కళ్ళు ఢాం ఢాం అని పేలిపోతాయి జాగ్రత్త.. కాబట్టి బుద్దిగా లెంపలేసుకుని,10 గుంజీలు తీయండి ముందు ..

అందరూ వినాయక చవితి జరుపుకుని స్వామివారి కృపా కటాక్షాలతో ఎటువంటి విఘ్నాలు లేకుండా, ఆయురారోగ్యాలతో ,సిరి సంపదలతో తులతూగాలని ఆశిస్తున్నాను.

(ఫొటో గూగులమ్మని అడిగినది )

15, ఆగస్టు 2009, శనివారం

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకోవాలా???



అందరికీ స్వాతంత్ర్యదిన శుభాకాంక్షలు అని చెప్పాలని ఉంది కాని చెప్పలేను..అసలు ఎందుకు చెప్పుకోవాలి..మన దేశానికి మనం ఏం చేసి ఉద్దరించామని చెప్పాలి?ఇలా రొటీన్ ప్రశ్నలు వేయాలని ఉంటుంది ...ఏంటో ప్రతి ఆగస్ట్ 15 కి నా మనసెందుకో అలజడిగా ఉంటుంది .. అసలు ఈ పోస్ట్ ఇప్పటికిప్పుడు మొదలు పెడుతుండటం వల్ల ప్రారంభం ,ముగింపు సరిగా అర్దం అయ్యేలా రాయలేనేమో..

నాకసలు మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించారని తెలిసింది చాలా చిన్నపుడు ..వయసు తెలియదు,కాని చాలా చిన్నదాన్ని ..tv లో కహా గయే ఓ లోగ్ అని హిందిలో ఒక సీరియల్ వచ్చేది మన స్వాతంత్ర్య సమరయోధుల గురించి ..అంటే పేరు మోసిన త్యాగ వీరులు గురించి కాదు.. ఎవరికీ తెలియని మామూలు యోధులు..ఎందుకో అది చూసినప్పుడు ఏడుపొచ్చేది ..ఆ భాష కూడా తెలియదు నాకు అప్పుడు..అంత చిన్న వయసులో నా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలిసేది కాదు..

తరువాత మరొక సారి దూరదర్శన్ లో అల్లూరి సీతా రామరాజుగారి గురించి చూపించారు..ఆయన గురించి చెప్తూ ఆనాడు చూసిన ప్రత్యక్ష సాక్షులు చనిపోయే ముందు అల్లూరిగారి దైర్య సాహసాలు వర్ణించారు ..అదిగో ఆ చెట్టుకే ఆ మహానుభావుని కట్టేసి తుపాకులు గురి పెట్టారు..ఆయన బెదరలేదు ..బాగా కొట్టడం వల్ల దాహంతో మంచి నీరు అన్నాడు ..ఆ ధుర్మార్గులు వేడి,వేడి పాలు ఇచ్చారు ..ఆయన వారి వైపు ఒక చిరునవ్వు విసిరి ఆ పాలను గడ గడా తాగేసాడు అని చనిపోయేముందు విషయాన్ని వర్ణిస్తుంటే నా మనసులో ఆవేశమో,ఆవేదనో మరేమో వర్ణించలేను.. ఆయన కాకినాడ లో p.r కళాశాలలో చదివారంట ..ఆ విషయం తెలిసాక ఒక్క సారైనా ఆ కాలేజ్ కి వెళ్ళాలని ఎంత తాపత్రయ పడ్డానో ఇప్పటికీ కుదరలేదు ..ఆ మహాను భావుని చూడక పోయినా ఆ పరిసర ప్రాంతాలన్నీ ఆయనను ప్రత్యక్షం గా చూసిన మూగ సాక్షులు..ఒక్క సారి ఆ ప్రాంతం చూసినా జన్మ ధన్యమే అనిపించింది ..

నేను మరచిపోలేని రోజులు నా హై స్కూల్ రోజులే ..ఎందుకంటే నేనే ప్రతిఙ్ఞా ,వందేమాతరం చెప్పేదాన్ని రోజూ .. ఇంకా ఆగస్ట్ 15 వచ్చిందంటే చాలు ఆ రోజు దేశభక్తి గీతాలన్నీ నావే ... అవి పాడినపుడు నేనేదో దేశానికి చేసేయాలన్న పట్టుదల వచ్చేసేది..అప్పటికి నాకు తెలియదు కదా అది కేవలం ఆవేశం వరకే పరిమితం చేస్తామని ..మా తాతయ్యకు గాంధి గారంటే అసలు ఇష్టం ఉండేది కాదు..ఆయన వల్లే మనకు స్వాతంత్ర్యం రావడం ఆలశ్యం అయ్యింది అని తిట్టేవాడు..నాకు చాలా కోపం వచ్చేది.. అసలే చిన్నప్పటినుండి..కాకమ్మా ,చిలకమ్మా కధలే మాకొద్దు మా గాంధి చెప్పింది మాకెంతో ముద్దు అని పాడుకున్నదాన్ని.. అందులోనూ గాంధి జీవిత చరిత్రలో ఆయన అభద్దం చెప్పకూడదని ,నిరాడంబర జీవితాన్ని గడపాలని ఆయన ఆచరించి చూపిన విధానం ఇంకా చాలా నచ్చాయి...అలాంటిది మొదటిసారి గాంధి గారి మౌనం వల్ల భగత్ సింగ్ మరణం తీరని బాధను కలిగించింది ..భగత్ సింగ్ నా హీరో ..అలాంటిది అతని పట్ల గాంధి గారి తీరు నాకు చాల కోపం తెప్పించింది..

క్లాస్ లో హిస్టరీ అంటే విపరీతమైన ఆశక్తి గా వినేదాన్ని..అతివాదులు,మితవాదులు గురించి చదివినపుడు ఎవరికి ఓటు వేయాలో తెలిసేది కాదు..మిత వాదులైన బాల గంగాధర్ తిలక్,బిపిన్ చంద్ర పాల్,లాలా లజపతిరాయ్ లు (లాల్,బాల్, పాల్) అంటే ఎంతో గౌరవం నాకు.. జలియన్ వాలా బాగ్ దురంతం విన్నపుడు మితవాదుల సహనం నాకు చాలా కోపం వచ్చింది..అలాగే సహాయ నిరాకరణోద్యమం మంచి ఊపులో ఉండగా ఎక్కడొ పోలీసులను తగలపెట్టేసారు కోపం వల్ల ఆందోళనకారులు ...అని దాన్ని మద్యలో ఆపేసిన గాంది గారి మీద చాలా కోపం వచ్చేది ...

ఇంకా టంగుటూరి ప్రకాశం పంతులు,మాగంటి అన్నపూర్ణాదేవి,సుభాష్ చంద్ర బోస్, ఇలా ఒక్కరేమిటి ఎంతమంది గురించి చదివి ఉంటాము మనమందరం..అవి చదివినపుడు రక్తం ఉడికిపోతుంది కదూ ...కాని తరువాత ఏం చేస్తాం పుస్తకం మూసేసి Tv లో మగధీర సినిమానో ... లేకపోతే dance baby dance ,లేదా మరొకటొచూసేయడం ,మన ఆవేశం అంత ఉష్ కాకి చేసేసి బజ్జోవడం ఇంతేగా...ఇంత రాసాను నేను కూడా ఇదే చేస్తాను ... గట్టిగా అడిగితే ఇంతకంటే ఏం చేయగలం ..అని ఒక నిట్టూర్పు విడుస్తాం..

ఒక్కోసారి అనిపిస్తుంది మన స్వాతంత్ర్య సమరయోదులందరూ బ్రతికి ఉంటే మన దేశ దుర్మార్గపు దౌర్భాగ్యాన్ని చూసి లక్ష సార్లు ఉరేసుకుని ఉంటారు తమ మనసులను ...నేను చెప్పబోయేది ఇప్పుడు జండా పట్టుకుని జండా ఊంచా రహే హమారా అని పాడమని కాదు,జాతీయ గీతం రాగానే లేచినిలబడమని కాదు.... ఆకలి తో ఉన్నవారికి మనకు చేతనైనంతలో కాస్త సహాయం చేయండి.. బలవంతం గా కాదు..చేయగలిగినంత.. రోడ్ మీద ఒక ముసలావిడ సరి అయిన బట్టలు లేక ఉంటే పాత బట్టలేమన్నా తనకు ఇవ్వండి..( మళ్ళి కొత్త బట్టలు ఇస్తే వాళ్ళు అమ్మేసుకునో మరొకరికో ఇచ్చేస్తారు అనుకుంటే ).. నెల రోజులకో రెండు నెలలకో ఇంట్లో యే పులిహారో చేసి బయట తిండికి అలమటించే నలుగురికి పొట్లాలక్రింద కట్టి ఇవ్వండి..ఇవన్ని చేయగలిగినవే... ఆలోచిస్తే బోలెడు చేయగలం ..అందరం అందరికీ సహాయం చేయలేము కదా..మనకు తోచినంతలో మన వీరుల సాక్షిగా ఎంతోకొంత చేద్దాం ..ముఖ్యం గా వీరమరణం పొందిన మన జవాన్ల కుటుంభాలు కనబడితే మన కుటుంభం కంటే ఎక్కువ గా గౌరవిద్దాం... సంవత్సరానికి ఒక 4 ,5 మంచి పనులు ఏదో రూపం లో చేస్తే మనకు తృప్తిగా ఉంటుంది ఆ మహానుభావులకు నిజమైన నివాళి ఇచ్చినట్లు అవుతుంది ....ఇప్పుడు రండి చెప్పుకుందాం అందరికీ స్వాతంత్రయ శుభాకాంక్షలు ...

12, ఆగస్టు 2009, బుధవారం

అసలు కృష్ణాష్టమి అంటే ???




చిన్నప్పటి నుండి నాకు కృష్ణుడు అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం..మరి కారణం ఏమో తెలియదు..బహుసా మా నాన్న గారు ఎన్ టి ఆర్ గారి కృష్ణుని వేషం ఉన్న సినిమాలు ఎక్కువగా చూపించడం వల్లనో,తాతయ్య చెప్పే కృష్ణ లీలల కధల వల్లో మరెంచేతో ...ఒకానొక సమయంలో కవియిత్రి మొల్లలా కృష్ణుడి మీద కవితలుకూడా రాసేసాను ఆవేశం గా చిన్నపుడు ..దెబ్బకి కృష్ణుడు భయపడినట్లున్నాడు మళ్ళీ అలాంటి ఆవేశం ఉప్పొంగకుండా జాగ్రత్త పడ్డాడు... ఆ తరువాత ఎంత గింజుకున్నా కవితలు రాయలేకపోతున్నాను.. అయితే క్రిష్ణుడిమీద ప్రేమ అక్కడితో ఆగిందా అంటే ..లేదు ...

మా అమ్మ నెలగంటు సమయంలో మంచి మంచి ముత్యాల ముగ్గులు వేసేది ,ముఖ్యం గా పల్లకీ ముగ్గు వేసినపుడు ఒకసారి మా చెల్లిని బ్రతిమాలి దానిలో కృష్ణుని బొమ్మ వేయించాను ముగ్గుతో..అక్కడితో ఊరుకున్నా బాగుండేది దానిక్రింద దయ చేసి ఈ ముగ్గును ఎవరూ చెరపకండి అని రాసాను ..అంతే మరుసటి రోజు ఆకతాయిపిల్లలందరూ కసాబిసా అని తొక్కి పడేసారు ..అది చూసి మా అమ్మ కొట్టినంత పని చేసింది అందరూ కాళ్ళతో తొక్కేలా చేస్తావా క్రిష్ణుడిని అని .. ఇలా కృష్ణునిమీద చాలా ప్రయోగాలు చేసాను ప్రేమతో ..

ఒక సారి మా ఆయనతో ఏమండి నాకు రాముడికంటే కృష్ణుడంటే చాలా ఇష్టం అన్నాను ..ఎందుకలాగా !అన్నారు..ఎందుకంటే రాముడు ఒక్క భార్యను సంతోషంగా ఉంచలేకపోయాడు ..కానీ కృష్ణుడు 16000 వేల గోపికలను ఎంతో ఆనందంగా ఉంచాడు ,ఎవ్వరినీ బాధ పెట్టలేదు అన్నాను నేను చాలా గొప్పగా చెప్పేసాను అని సంభరపడిపోతూ.. మా ఆయన వెంటనే నా కళ్ళలోకి ఆరాధనగా చూస్తూ నువ్వింత మంచిదానివని తెలియక ఎంతో అపార్ధం చేసుకున్నాను ,ఇన్నాళ్ళు నువ్వేమనుకుంటావో అని భయపడి చెప్పలేదు ..నేను అంటే ఇష్టంతో ఒక ఇద్దరు ముగ్గురు రెడిగా ఉన్నారు ఏమంటావ్ అన్నారు ..అప్పటి నుండి కృష్ణుడి మీద ప్రేమ మనసులోనే దాచేసుకున్నాను ...

సరే ఇదిలా ఉంచితే మొన్న జ్యోతిగారినుండి ఒక మెయిల్ వచ్చింది కృష్ణాష్టమి కదండి కాబట్టి ఏదన్నా రాస్తే బాగుంటుంది ఆ రోజు అని.. అబ్బో కృష్ణుడి మీద అంటే చాలా వీజీ రాసేద్దాం అనుకుని ok చెప్పేసాను ... సరే వంట మొదలు పెట్టాను కాని ఒక్కటంటే ఒక్క వాఖ్యం కూడా తట్టడం లేదు ..అంటే నేను ఏదన్నా రాయాలనుకున్నపుడు వంట చేస్తూ ఆలోచించి వంట అవ్వగానే పోస్ట్ తానన్నమాట ..నేను ముందే చెప్పాను కదా కృష్ణుడికి నా రాతలంటే బెంగ అని..అందుకే కాబోలు అన్నం వండేసి,పప్పు తాళింపు పెట్టి,కూర వండేసి ఆఖరికి అంట్లు కూడా తోమేసాను కాని అసలేమి రాయలో తోచడం లేదు ..ఇంకో ముఖ్య కారణం ఏంటంటే మా ఇంట్లో అసలు కృష్ణాష్టమి పెద్దగా చేయరు ..కాబట్టి ఒక్క సంఘటన కూడా గుర్తు రావడం లేదు ..ఏం చేయాలబ్బా అనుకుంటుండగా మా ఆయన గుర్తు వచ్చారు.. నా కనులు నీవిగా చేసుకుని చూడూ అన్నట్లు నీ ఙ్ఞాపకాలే నావిగా మలుచుకుని రాస్తా అనుకుని ఆయనకోసం వేయి కళ్ళతో ఎదురు చూసాను..

మా ఆయన వచ్చి సుష్టుగా తిని ప్రశాంతం గా ఉన్న మూడ్ చూసుకుని ఏమండీ అసలు కృష్ణాష్టమి అంటే ఏమిటీ అన్నాను గోముగా ...మా ఆయన ఉలిక్కిపడి వద్దే బాబు ,నువ్వు పండగల గురించి మాట్లాడకు..ఇలాగే అచ్చికబుచ్చికలాడి మొన్న నా చేత వరలక్ష్మీ వ్రతం చేయించావ్ ..అసలు వోల్ ఆంద్రాలో వరలక్ష్మీ వ్రతం చేసే మగాళ్ళు ఎవరన్నాఉంటారా ,అసలు నేను ఇంట్లో ఎంత పెద్ద పండగయినా ఉండేవాడిని కాదు ,మా అమ్మ ఉండమంటే కయ్యిమనేటోడినీ.. కాని నువ్వు గయ్యాళి గంపవి,రాకాసి రంపవి .. అరిచి,ఏడ్చి సాధిస్తావ్ ..అని ఆవేశపడిపోతుంటే మహా ప్రభో ఆపండి అమ్మవారికి అష్టోత్తరాలు చదవడం వల్ల మీకు వచ్చిన నష్టం ఏమీ లేదు కాని ముందు కృష్ణాష్టమి అంటే ఏమిటొ చెప్పండి..బ్లాగ్ లో రాయాలి అన్నాను సీరియస్సుగా .

ఛా..కృష్ణాష్టమి అంటే ఏమిటో తెలియకుండా పోస్ట్ రాసేద్దామనే ..హూం..ఎవరే నీ పోస్ట్లు మెచ్చుకుంటూ వాఖ్యలు రాసేది ఒక సారి ఇలా పిలు అమ్మా అన్నారు..పీకలవరకూ కోపం వచ్చినా అవసరం నాది కదా,కాబట్టి నవ్వుతూ మీరు కొంచం చెప్పండి నేను అల్లుకుపోతాను అన్నాను ..అల్లడానికి,కుట్టడానికి ఇవి బట్టలు కావమ్మా పురాణాలు..సరే విను ..కృష్ణాష్టమి అంటే కృష్ణుడి పండగ అంటే కృష్ణుడి బర్త్ డే అన్నమాట ఈ పోయింట్ మీద పోస్ట్ అల్లేసుకో అని నా వైపు చూసి సరే సరే శాంతించు ..ఇంకా చెప్తాను ..ఆ రోజు కృష్ణుడి బుజ్జి బుజ్జి పాదాలు ఇంటినుండి బయటకు వేస్తారన్నమాట అన్నారు.. ఇంటినుండి బయటకు కాదు బయటనుండి ఇంటిలోకి అన్నాను సరి చేస్తూ ..అదేలే మొత్తానికి పాదాలు వేస్తారు ..తరువాత ఒక కుండలోకి అటుకులు,మరమరాలు,కారం,ఉప్పు ,ఉల్లిపాయలు,నిమ్మరసం మా ఆయన నోట్లో నీళ్ళు ఊరుతుండగా మద్యలో ఆపు చేసి అదేమీ పిడతకందిపప్పు కాదు అన్ని వేయరనుకుంటా ,అటుకులు ,పెరుగు వేస్తారు అన్నాను..అబ్బా అదేలే,అవి వేసి ఉట్టి పైకి కట్టి నాలాంటి హీరో కి చేతికి కర్రనిచ్చి కొట్టమంటారు అన్నారు..

ఇలాగాని రాస్తే చదివేవాళ్ళు నన్ను కొడతారు ముందు ఇదేమన్నా ఆవు మీద వ్యాసం అనుకున్నారా కృష్ణుడు వెన్న తిన్నాడు,మన్ను తిన్నాడు అని ఒకటొ క్లాసు పిల్లాడు చెప్పినట్లు రాయడానికి..బ్లాగు బాబు ..అక్కడ ఏమన్నా చిన్నా చితక వాళ్ళు ఉంటారనుకున్నారా ..మహా మహులుంటారు..మొన్న అమ్మ మీద వ్యాసాలు అదరగొట్టారు తెలుసా అన్నాను..మరి పెద్ద రచయిత్రి లా పోజులుకొడతావ్ కదే నాదగ్గరా..ఇప్పుడు నేను కావలసివచ్చానా అన్నారు ..ఎంత గొప్పోళ్ళు అయిన్నా నేల ఆసరా కావల్సిందే కదండి నిలబడటానికి అన్నాను ..అంటే ఇప్పుడు నీ కాళ్ళక్రింద ఉన్నాను అని ఉదాహరణతో సహా చెప్తున్నావా అన్నారు అనుమానంగా .. అబ్బా!! అపార్దాల చక్రవర్తి ఏదో ఒక ఉపాయం చెప్పండి సార్ అని వేడుకుంటే ఒక అయిడియా అన్నారు..ఏంటి అన్నాను ఉత్సాహంగా ..

నా చిన్నపుడు హింది ఎక్జాం అప్పుడు నాకసలు హింది రాదుకదా అప్పుడు ఏంచేసేవాడినంటే అన్ని ప్రశ్నలను కలిపి తిరగమరగ రాసి ఆన్సర్ దగ్గర రాసేసేవాడిని..దెబ్బకి 100 మార్కులు వచ్చేసేవి ..అలాగా నువ్వు కూడా అందరూ కృష్ణుడి గురించి రాసేవరకూ ఆగి అన్నిటిలోనూ ఒక్కో లైను తీసి నీ పోస్ట్లో రాసేయి అన్నారు... హమ్మో మీ సారు మరి ఆన్సర్ చదివేవారు కాదా అన్నాను ఆక్చర్యం గా .. మా సార్ చదివేవారు కాదు స్కేల్ తో కొలిచేవారు ఆన్సర్లను అన్నారు నవ్వుతూ..సరేలే గొప్ప సలహా ఇచ్చారు ,అప్పటికి గాని నన్ను కూడలి నుండి బయటకు తరిమేయరు ..వాఖ్యం కాదు ఒక్క పదం కాపీ కొట్టినా బూతద్దంతో వెతికి మరీ పట్టేసి చూపుతారు ఏమనుకున్నారో అన్నాను ...అందుకే కదే ఆ సలహా ఇచ్చాను..అప్పుడు ప్రశాంతం గా ,హాయిగా ఉంటుంది నీ గొడవలేకుండా వాళ్ళకు ,నాకు ఇద్దరికీ అన్నారు..

మీ కుళ్ళు బుద్ది పోనిచ్చుకోలేదు కదా అని సీరియస్సుగా లేస్తుంటే నన్ను బలవంతం గా కూర్చోపెట్టి ,ఒసే పిచ్చిమొహం ఎలాగూ మిగిలినవాళ్ళు బాగా రాస్తారు కదా నువ్వు ఏమీ తెలియకుండా పుడింగిలా మద్యలో ఏదో రాసేయడం ఎందుకు ..కాబట్టి చక్కగా ఒక కృష్ణుడి బొమ్మ పెట్టేసి కృష్ణాష్టమి శుభాకాంక్షలు అని ఒక హెడ్డింగ్ పెట్టేసి పొస్టేసేయి నా మాటవిని ..అప్పుడు వాళ్ళు హేపి,నువ్వూ హేపి,కృష్ణుడు హేపీ ఏమంటావ్ అన్నారు.. హూం..అవుననుకోండి కాని అసలేమీ రాయకపోతే నా పోస్ట్ కోసం చూసేవాళ్ళు ఫీల్ అవుతారేమో అన్నాను (లోపల బోలెడంత గర్వం మా ఆయనను ఉడికించే చాన్స్ వచ్చిందని )...అబ్బా ఛా , మరి నువ్వు యండమూరివీ ,యద్దన పూడి సులోచనా రాణివి ..నీ పోస్ట్లకోసం ఎదురుచూడటానికి .. మొహం చూడు...ఏదో పాపం కొత్తగా వచ్చావు ,బాగుంది అని ఒక వాఖ్య రాసేస్తే సంతోష పడతావ్ అని వాళ్ళేదో రాస్తే అది చూసి ఫీల్ అయిపోవడమే అని ఏడిపించడం మొదలుపెట్టారు..

దీన్నే పిలిచి తన్నించుకోవడం అంటారు..మీ గురించి తెలిసి కూడా అడిగాను చూడండి ..మాములు చెప్పు కాదు కాస్త స్ట్రాంగుగా ఉన్న చెప్పుతో కొట్టుకోవాలి అని కయ్యమేసుకుని ఇలా వచ్చాను..కాబట్టి అదండి సంగతి ..రేపు కాస్త పని ఉండి ముందుగానే చెప్పేస్తున్నాను అన్నమాట ..మీకూ మీ కుటుంభ సభ్యులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు :)

1, ఆగస్టు 2009, శనివారం

దమయంతి ,హిడింభి పాకం


నాకు వంట చేయడం రాకపోవడానికి కారణం మాది ఉమ్మడి కుటుంభం కావడమే ,చాల్లే అసలు దానికీ దీనికీ లింకేమిటీ అని అనుకుంటున్నారు కదూ ,మరదే ..ఉమ్మట్లో బోలెడన్ని రాజకీయాలు ఉంటాయన్నమాట... మేము గాని వంట చేస్తే అందరూ (ఇంకెవరూ మిగిలిన తోడికోడళ్ళు)మా అమ్మని, అమ్మో చిన్నక్క అదృష్టమే అదృష్టం ..చక్కగా ఆడపిల్లలు అన్నీ చక్క బెట్టేస్తుంటే ఈమె కాలు మీద కాలేసుకుని సీరియల్స్ చూస్తుంది అనేస్తారంట ,అందుకని మమ్మల్ని వంట మాత్రం చేయనిచ్చేది కాదు (మిగిలిన పనులు చేయకపోతే మాత్రం తోలు తీసేసేది)నన్నసలు రానిచ్చేది కాదు వంట గదిలోకి ,నేను పావలా పనికి రూపాయి హంగామా చేస్తానని ..పోనీ తను ఊరెళ్ళినపుడు వండుదామంటే మా పిన్నులు వంతులేసుకునేవారు ఈ సారి నేను చేస్తా మీకు వంట అంటే నేను చేస్తా అని ...లేకపోతే మా అమ్మ దెప్పేయదూ ...అదీ సంగతి ,అయితే వంట చేయడానికి కావలసింది కొంచెం ఇంట్రెస్టు ,బోలెడు ఓపిక ..ఈ రెండూ నాలో యే కొసనాలేవు అది వేరే విషయం ..


అవి నేను ,పెనం మీద దోసె పిండి వేసి గరిటతో ఎడమవైపు త్రిప్పాలా? కుడి వైపు త్రిప్పాలా ?అని తీవ్రంగా ఆలోచించే రోజులు..ఒక సారి మా అమ్మ,అక్క ఊరెళ్ళారు ..ఎప్పటిలాగే పిన్ని వండేస్తుంది కాబట్టి తీరికగా మంచం మీద పడుకుని ఈనాడు ఆదివారం మేగజైన్ చదువుతున్నాను ...మద్యలో వంటల పేజీ వచ్చింది ..నాకు వంట చేయడం రాకపోయినా ఆ వంటకాల పొటోలు చూడటం మహా ఇంట్రెస్ట్ ..అందులో ఒక వంటకం ఫోటొ తెగ నచ్చేసింది ..చూసి పేజీ తిప్పేయచ్చుగా ఎప్పటిలాగే ...అహా ,అది చూడగానే బుద్దుడికి బోధి వృక్షం క్రింద జ్ఙ్ఞానోదయం అయినట్లు నాకు మా మంచం మీద బోలెడంత ఙ్ఞానం వచ్చేసింది ,వంటరాని బ్రతుకు ఒక బ్రతుకేనా అని ఆవేశం గా పిన్ని దగ్గరకు వెళ్ళి పిన్నీ ఈ రోజు వంట నేనే చేసుకుంటా అన్నాను ..వద్దు అంది..కుదరదు అన్నాను..చివరకు తను అన్నం వండటానికి నేను కూర చేయడానికి ఒప్పందం చేసుకున్నాం ..


నాక్కూడా కాస్త పెట్టమ్మా అని వంటకం ఫొటొ చూస్తూ మా నాన్నమ్మ నోట్లో పావులీటర్ నీళ్ళు మింగింది ..ఓ యెస్స్ అని అభయం ఇచ్చేసి కావలసిన పదార్దాలన్నీ సేకరించాను.. చక్కగా ముక్కలు చేసాను ..బాణాలి వేడి చేసాను..ఆ సరికే నాకు విసుగొచ్చేసింది ..అందరూ హాయిగా T.v చూస్తుంటే నాకు ఇప్పుడు వంట చేయడం అవసరమా అనిపించింది..కాని తప్పదుగా, మొత్తానికి వండేసాను ... మా చెల్లి అప్పటికేఅబ్బా ఆకలి ఇంకెంత సేపు అని నస ,నస ..నేను వడ్డించగానే టక్కున కలుపుకుని ,నోట్లో పెట్టుకుని తుపుక్కున ఉమ్మేసింది .. ఛీ ఇదేంటి పిల్లా ఇంత ఛండాలం గా వండావ్..ఇప్పుడు నిన్ను ఎవరు వండమన్నారు..దీన్ని వంట అనరు పెంట అంటారు అని నానా తిట్లు తిట్టి మా పిన్ని వైపు చూస్తూ పిన్నీ కాసింత పెరుగు ,పచ్చడి ఉంటే వేయవా అంది ...అవమానం అవమానం..ఎన్ని మాటలంది గాడిద
అనుకుని మా నాన్నమ్మ వైపు చూసాను ఆశ గా , ఎందుకోనమ్మా ఇందాక నుండి ఒకటే కడుపునొప్పి,ఈ సారి మళ్ళీ వండుతావ్ కదా అప్పుడు తింటాలే అని మెల్లిగా జారుకుంది ..సరే పొండి ఎంచక్కా మొత్తం నేనే తింటా అనుకుని చక్కగా ఒక ముద్ద కలుపుకుని నోట్లో పెట్టుకున్నానో లేదో ప్రొద్దున్న తిన్నదానితో సహా కక్కేసాను.. ఇదేంటబ్బా తేడా ఎక్కడ జరిగింది? అంతా వాడు చెప్పినట్లే కదా చేసాను అని మళ్ళీ బుక్కు ముందెట్టి ఒక్కోటి చదువుతుంటే ఒక చోట కళ్ళు ఆగిపోయాయి ..పెరుగు 1/2 కప్ ,వంట సోడా 1/2 టి స్పూన్ పక్క, పక్కనే రాసి ఉన్నాయి .. అప్పుడు అర్దం అయింది ఎందుకు కక్కుకున్నానో ...


సరే తరువాత, తరువాత కూరలగురించి మా అక్క సింపుల్గా చెప్పిన ఫార్మూలా ఫాలో అయిపోయాను.. వేపుళ్ళంటే తాళింపువేసి కూరముక్కలు వేపి ఉప్పుకారం జల్లడం ..పులుసులంటే తాళింపు వేయకుండా వేపిన ముక్కల్లో చింత పండు పులుసు పోసి మరగ పెట్టడం ..ఇగుర్లంటే చింతపండు పులుసు బదులు నీళ్ళు పోసి ఇగరబెట్టడం ..అంతే సింపులు ...అలా బండి నెట్టుకొచ్చేస్తున్న తరుణం లో మా ఆయనకు నా ప్రశాంతత మీద కన్నుకుట్టింది ..ఒక రోజు రావడం, రావడం బాంబ్ లాంటి వార్త చెప్పారు ,ఏంటంటే మరుసటి రోజు ఫ్రెండ్స్ తో కలసి జూ కి వెళుతున్న సందర్భం గా అందరూ తలో అయిటం తెస్తున్నారు కాబట్టి మా వాటాకు ఆవడలు (మజ్జిగ గారెలు)తీసుకువస్తాం అని చేప్పేసారట .. కాబట్టీ రేపు అవి వండేయ్ అన్నారు చక్కగా ..నాకు తెలుగు వంటల్లో నచ్చని ఒకే ఒకే పదం వడ .. అది వండాలంటే నాకు ధడ ..ఆ పప్పు మిక్సీలో వేసి కొంచెం కొంచెం నీరు వేస్తూ గంట సేపు రుబ్బాలంటే నీరసం వచ్చేస్తుంది ..చాలా సార్లు ఓపికగా రుబ్బి ఆఖరి నిమిషం లో విసుగుతో గబుక్కున నీరు ఎక్కువ వేసి గారెల పిండి కాస్త బూరెల పిండిలా చేస్తాను.. ఆ కారణం చేత నేను అప్పటికి ఒక్కసారి కూడా గారి షేప్లో గారెలు వేయలేదు ..అలాంటిది ఆవడలా!!! ....పోనీ నాకు ఆవడలు చేయడం రాదు అన్నాననుకో ..మా వారు ,నీకు ఆవడలు చేయడం రాదా !!!!!అని ఎనిమిదో వింత చూస్తున్నట్లు ఒక ఎక్స్ ప్రెషన్ ఇస్తారు అది చాలు జీవితం మీద విరక్తి వచ్చేయడానికి..కాబట్టి ఎలాగోలా ఆవడలు చేయడమే బెటర్ అని డిసైడ్ అయిపోయి రాత్రి 12 గంటల వరకూ చా...లా ...ఓపికగా నీళ్ళు ఒక్క చుక్క వేయకుండా గారెల పిండి రుబ్బేసాను ,మొదటి సారి షేప్ ఉన్న గారెలు చేసేసి చిలికిన మజ్జిగలో వాటిని వేసేసి హమ్మయ్యా అనుకుని పడుకుండిపోయా ..

ఆ ప్రొద్దున్న అందరూ ఒక్కో అయిటెం ప్లేట్ లో వేస్తుంటే మన గారెలు డబ్బా వాళ్ళ ముందు పెట్టారు మావారు ,వాటినీ ప్లేట్స్ లో వేసి అందరికీ ఇచ్చింది ఒకామే ..చెంచాతో గుచ్చి తిందామని ఒక సారి నొక్క గానే గారె కాస్తా కప్పలా ఒక్క జంపు జంపి క్రింద పడింది ...తలెత్తి చూస్తే అందరూ ఇంచుమించుగా నా గారెలతో కప్పగెంతులాట ఆడుతున్నారు ... గొప్ప సిగ్గేసేసింది ..మరి నాకు తెలియదు కదా గారెలపిండి లో అసలు నీరు లేకుండా రుబ్బితే అలా రాళ్ళల్లా వస్తాయని.. పాపం అందరూ వాటిని తినలేక ,నా ఎదురుగా వాటిని పడేయలేక నానా పాట్లు పడి నేను అటుతిరగగానే గబుక్కున డస్ట్ బిన్లో పడేసారు..మనమసలే కంత్రీలం ..చూడకుండా ఉంటానా ...

అయితే ఆ దెబ్బకి మా ఆయనకు నా వంట మీద నమ్మకం పూర్తిగా పోయింది ..ఎంత దారుణం అంటే ఒక వేళ నేను వంట బాగా చేసినా, అది నేను చేసాను కాబట్టి అది బాగోదు అని డిసైడ్ అయిఫొయి ఇంకాస్త కారం పడుతుందేమో,ఇంకేదో తక్కువయింది అని ఒకటే వంకలు .. అక్కడితో ఊరుకునేవారా, యే పొరిగింటమ్మ పుల్ల కూర తిన్నా ..నా ఎదురుగానే ఆవిడ ఫలానా కూర సూపర్ వండింది కదా ..ఆవిడని అడిగి నేర్చుకోరాదు అని బోలెడు ఉచిత సలహాలు అన్నమాట ...దాంతో నా వంట మీద నాకే బోలెడంత డవుట్ వచ్చేసేది ..నాకు అస్సలు వంట చేతకాదు అని ..


సరే ఇలాకాదు అని ఒకరోజు చక్కగా చికెన్ బిర్యాని చేసి మా ఆయన రాగానే పక్కింటి ఆవిడ పంపింది అని ఒక ప్లేట్ లో పెట్టి ఇచ్చాను..అదే అనుకున్నా భలే ఘుమ ఘుమలు వస్తున్నాయి అని ఒక స్పూన్ నోట్లో వేసుకుని.. ఆహా,ఎలాగైనా ముస్లింలు ముస్లింలేనే ...బిర్యాని వాళ్ళు చేసినట్లు ఇంకెవరూ చేయలేరు అని ఒక్కో స్పూన్ తెగ ఆస్వాదిస్తూ తిన్నారు ..అమ్మ దొంగ మొహం అని మనసులో అనుకుని ఆయన అంతా తిన్నాకా నేనే చేసాను ఇది, పక్కింటావిడ కాదు అన్నాను గర్వం గా చూస్తూ ...అదేనే మద్యలో డవుటొచ్చింది ఉప్పు కాస్త ,అంటే కొంచెం ఎక్కువగా అనిపించిందేంటాబ్బా అని అన్నారు ప్లేట్ నా చేతికిచ్చి..ఎంత కోపం వచ్చిందంటే, పతివ్రతా శిరోమణిని కాబట్టి బ్రతికిపోయారు కాని లేకపోతేనా ఆ ప్లేట్ పెట్టి నెత్తిమీద టంగు టంగు మని నాలుగు పీకేదాన్ని ....


కొసమెరుపేంటంటే మొన్నామద్య ఫ్రెండ్స్ అందరం కలిసి బింతాన్ వెళ్ళాం ,మిగిలిన వారు అందరూ శాకాహారులు అవ్వడం చేత అక్కడ దొరకదని ఇంట్లో తయారు చేసుకుని వెళదాం అన్నారు ,నన్ను లంచ్ కి సరిపడే తీసుకురమ్మన్నారు ,ఇంచుమించుగా పదిమందికి వండాలన్నమాట ,కాని తప్పదు కదా, దేవుడా నువ్వే దిక్కు అనుకుని అన్నం ,కూరా,పప్పు,పచ్చడి అన్నీ చేసి జాగ్రత్తగా పేక్ చేసి తీసుకు వెళ్ళాను ,వంట చేసినంత సేపూ మా ఆయన ఒకటే నస ..అన్నం మెత్తగా చేసావేమో ,ఇందులో ఏదో తక్కువ అయినట్లుంది,దాన్ని ఇంకొంచం వేపాల్సింది అని...లంచ్ వడ్డించినప్పుడు మహా టెన్షన్ నాకు ,తిన్న వాళ్ళందరూ ఆహా ఎంత బాగున్నాయి,ఏం రుచి అని పొగిడేస్తుంటే నా కళ్ళలో నుండి ఒకటే ఆనంద భాష్పాలు.. వాళ్ళు అలా వాళ్ళ రూంస్ కి వెళ్ళగానే ,నా ఆనందబాష్పాలు ఇంకకముందే మా కుళ్ళు మొహం మొదలెట్టేసారు ,మరీ ఎక్కువ ఫీలయిపోకు ఎవరూ మొహం మీద బాలేదని అనరు అనుకుంటూ ... అప్పడాల కర్ర అనేది ఆడవాళ్ళకు ఎందుకు అవసరమో నాకు తెలిసొచ్చింది అప్పుడు...


కాబట్టి నేను చెప్పొచ్చేది ఏమిటంటే కడవంత గుమ్మడికాయా కత్తి పీటకు లోకువ అని బంగారంలాంటి పెళ్ళాం కత్తిలాంటి మొగుడికి ఎప్పుడూ లోకువే ..అంతే ,అంతే ,అంతే ముమ్మాటికీ అంతే