28, మే 2011, శనివారం

అనగనగా ఒక రోజు...

ఈ మధ్యన నాకు పని ఎక్కువ అయిపోయి గొప్ప గొప్ప ఐడియాలు వచ్చేస్తున్నాయి . మీరు సరిగ్గానే విన్నారు ఖాళీ ఎక్కువ అయి కాదు పని ఎక్కువ అయ్యే....ఖాళీగా ఉంటే మనం ఎక్కడ ఆలోచిస్తాం ...ఎంచక్కా సిస్టం ఆన్ చేసి సినిమాలు,పాటలు ,సీరియళ్ళు,బ్లాగులు,కధలు అబ్బో నన్ను పట్టుకోవడం ఎవ్వరితరంకాదు....ఇంతకూ ఆ గొప్ప ఐడియా ఏమిటయ్యాంటే.... ఎప్పుడో అప్పుడప్పుడూ జరిగిన విషయాలు రాయకుండా ఒకేరోజున జరిగిన విషయాలన్నీ రాస్తే ఎలా ఉంటుందీ అని..... అదే డైరీ లెక్కన అనుకోండీ ...హేమిటో ఒక్కసారిగా మీరందరూ కసాయివాడిని నమ్మిన గోర్రేపిల్లల్లా ఎంత ముద్దుగా కనబడుతున్నారో నాకళ్లకు.....



ఇంతకూ విషయంలోకి వచ్చేస్తే కొన్ని దినాలు ఉంటాయి ..ఛీ ఛీ ఆ దినాలు కాదు రోజులన్నమాట.. కొన్ని రోజులు ఉంటాయి ....ఆ రోజుమనం పట్టుకున్నదల్లా పట్టుచీరై కూర్చుంటుంది.( ఆడపిల్లనికదా ఉపమానాలు అలాగే ఉంటాయి).... ఫర్ ఎక్జాంపుల్ మీరు చిల్లరమార్చడానికని లాటరీ టికెట్ కొన్నారనుకోండి దానికి మొదటి ప్రైజ్ వచ్చి మురిపిస్తుంది. (మా నాన్నగారికి అలాగే జరిగింది ) ఓ రెండొందలు సిల్క్ చీర కొందామని షాపుకి వెళితే లక్కీ డ్రాలో ఐదువేల రూపాయల పట్టు చీర చేతికొచ్చేస్తుంది (మా పిన్నికలా జరిగింది) ఇలా అన్నమాట.అయితే ఇలాంటిరోజులు ఎప్పుడోగాని రావు ..కానీ మరికొన్ని రోజులుంటాయి అచ్చం ఖలేజా సినిమాలో అనుష్కాలా....ఆ రోజు ఏం చేస్తే అది మటాష్ ....ఇవి తరుచూ వస్తుంటాయి ...దీనికి ఎక్జాం పుల్ ఈ పోస్ట్ అన్నమాట..



అసలేమైంది అంటే మొన్న ఆదివారం ప్రొద్దున్నే లేచి మా ఆయన ఎవరి మొహం చూసారోగాని (ఓయ్ ..ఏంటి నావైపు చూస్తున్నారు...నన్ను కాదు చూసింది ... ఆ రోజు నేను దుప్పటి నిండుగా కప్పేసుకుని పడుకున్నాను ...నాకు బాగా గుర్తుంది ) నేను రెండు రోజులకొకసారి మా సింగపూర్లో తలుపులు బార్లా తెరచి వెళ్ళిపోయినా చీపురుపుల్ల కూడా మిస్ అవ్వదు అని ఇండియాలో దొరికిన వారందరికీ దొరికినట్లుగా చెప్పే మాటల పై పెట్రోలు జల్లేసి ఒక దొంగవెధవ మా ఆయన పర్స్ ఎత్తుకుపోయాడు..అదీ పట్టపగలు ... పైగా చుట్టూరా జనాలు ఉండగా.. ఈయన గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతుంటే కిట్ ఓపెన్ చేసి మరీ ఎత్తుకుపోయాడు ... ఈ విషయం నాకు ఫోన్లో చెప్పగానే నేను భామాకలపానికి సిద్దమవుతుండగా మా ఆయన పారిజాత పుష్పం లాంటి మరొక మాట చెప్పి చల్లారబెట్టేసారు.....అంటే మా ఆయనకైతే పర్స్ ఒక్కటే పోయిందంట ....వాళ్ళ ఫ్రెండ్స్వి పర్సులు ,ఐ ఫోన్స్ తో సహా ఎత్తుకుపోయాడంట ... పర్స్లో డబ్బులెన్ని ఉన్నాయి అంటే 120 $ అని చెప్పారు ...ఈ ముక్క నేను నమ్మానంటే ఇన్నాళ్ళ మా దాంపత్య జీవితాన్ని అవమానం చేసినట్లు అవుతుంది ..అందుకే అలాంటి పాపం చేయలేదు..


సరే ..... కాసేపు వాడిని మా ఆయన్ని కలిపి ,విడి విడిగా ,హడావుడిగా తిట్టుకున్నాకా మా సార్ ఇంటికొచ్చారు .... మా ఆయన కజిన్ కూడా మా ఇంట్లోనే ఉండటం వల్ల ఎక్కడికన్నా వెళదామా అని ప్రోగ్రాం పెట్టారు.. " ఎక్కడికన్నా వెళదాం "అనే మాట అంటే చాలు నేనూ, నా కూతురు మేమురాము బాబు కాళ్ళు నెప్పులుగా ఉన్నాయి అని మంచమేక్కేసే వాళ్ళం కాస్తా ఏ కళనున్నామో సరే అనేసాం...చెప్పానుగా టైము అని ... "అడ్వెంచర్ పార్క్ వెళదామా " మా ఆయన మాట పూర్తవ్వకమునుపే.. నహీ !!!! ఆర్కిడ్ గార్డెన్ కి వెళదాం అన్నాను ఖరాకండిగా ....నా బాధ నాది ... అక్కడికి వెళ్లి బోలెడు ఫొటోస్ తీసేసి తెల్లారే పాటికల్లా బ్లాగ్లో పెట్టేసి ఆహా ఓహో అనిపించేసుకోవాలని... తన కజిన్ కూడా నన్నే సపోర్ట్ చేయడం వల్ల సరే గంటలో రెడీ అయిపోండి అని మా ఆయన ఆర్డర్ వేసేసారు ...



అయితే మన అమోఘమైన తెలివితేటలను ఉపయోగించి.. చూడండి ..అక్కడికి వెళ్ళడానికి ఎక్కవలసిన బస్సులు , గార్డెన్ టైమింగులు , గట్రాలు లాంటివి సరిగ్గా ఓ సారి ఎవరినన్నా కనుక్కోండి అని ఒక సలహా ఇచ్చాను ...అబ్బే ... "పెళ్ళాం చెప్తే వినాలి "అని టైటిల్ పెట్టి మరీ సినిమాలు తీసినా కొన్ని జీవులకు ఎక్కవు ....ఈ దిక్కుమాలిన మొబైల్స్ వచ్చిన దగ్గరనుండి ప్రక్కింటికి వెళ్ళాలన్నా గూగుల్ మేపులు పెట్టుకుని తడుముకుంటూ వెళ్ళడం ఫ్యాషన్ అయిపొయింది జనాలకు...అతి ముఖ్యంగా మా ఆయనకు ..... మాకు తెలుసులే నువ్వు పని చూసుకో ...ఎప్పుడు చూసినా బస్ అంటావ్ కేబ్ లో వెళ్ళినా అంతే అవుతుంది అని ఓ డైలాగ్ కొట్టి వెళ్ళిపోయారు ...సరే నేను, వాళ్ళ కజిన్ పోటీలు పడి మరీ మొహానికి అరంగుళం మందానా మేకప్పులు కొట్టేసి టిప్పు టాపుగా సూపర్గా తయారయిపోయాం ...



కేబ్ వాడు మమ్మల్ని చూడగానే" అయిదుగురా .. నో... కుదరదు "అన్నాడు.. నేను, ఆ అమ్మాయి ఒక క్లోజప్ ఏడ్ ఇచ్చి" ప్లీజ్ అంకుల్ "అన్నాం.....పాపం జడుసుకున్నట్లున్నాడు ఇంకేం మాట్లాడకుండా ఎక్కడికి వెళ్ళాలి అన్నాడు.....ఆర్కిడ్ గార్డెన్ మా ఆయన సీట్బెల్ట్ పెట్టుకుంటూ చెప్పారు .. ... ఓ "జూ" దగ్గర ఉంటుంది అదేనా అన్నాడు... ఎస్ అన్నారు మా సార్.... "జూ " దగ్గరా !!!! కాదు కదండీ ....అది ఇంకో చోటకదా ఆర్చాడ్ ఊరికి దగ్గరలోనే కదా నా మాట ఇంకా పూర్తికాలేదు ఇద్దరూ ఫోన్స్ లో టిక్కు టిక్కున గూగుల్ మేప్ ఓపెన్ చేసి నామొహానపడేసి నా నోరు మూయించేసారు.... సరే మనకెందుకులే అని తరువాత రోజు వేయబోయే పోస్ట్ గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను..అలా వెళుతున్నాం ...వెళుతున్నాం ..వెళుతూనే ఉన్నాం ... కాసేపటికి గమనించింది ఏమిటయ్యా అంటే "జూ " వచ్చింది ..మళ్ళీ "జూ" వచ్చింది...మళ్ళీ మళ్ళీ "జూ" వస్తూనే ఉంది వాడు దాని చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నాడు..బిల్లు చూస్తే బీపి పెరిగిపోతుంది ...... బాబు ఏమిటిదీ మా ఆయన అడిగారు....ఇక్కడే ఉండాలి ఎక్కడో మిస్ అవుతున్నాం అన్నాడు.. మళ్ళీ మావాళ్ళు ఇద్దరూ ఫోన్స్ పట్టుకున్నారు ...రైట్ సైడ్ వెళ్ళాలి అని ఈయన ...కాదు స్ట్రైట్ గా వెళ్ళాలి అని ఆవిడ .. మొత్తానికి కేబ్ వాడు ఏదో కనుక్కొని మీరు చెప్పిన గార్డెన్ క్లోజ్ చేసేసాడటండి ఇక్కడ ఆర్చాడ్ విల్లే అని ఒకటి ఉంది అక్కడికి పొండి అని దింపేసి వెనక్కి చూడకుండా పారిపోయాడు...



క్రిందకు దిగగానే మా ఆయన ముందు జాగ్రత్తగా దండకం మొదలుపెట్టేసారు ..నీవల్లే ...అంతా నీవల్లే ...అడ్వెంచర్ పార్క్ కి వేళదామే అంటే నా మాట విన్నావా అని తిట్లు...."గాడిద గుడ్డేం కాదు నేను ముందు నుండి చెప్తూనే ఉన్నాను ఇంకెవరి నైనా కనుక్కోండి అని నా మాట విన్నారా? అంత పెద్ద గార్డెన్ అలా ఎలా మూసేస్తాడు " నేనూ తిరగబడిపోయాను....మా ఆయనతో గోడవపెట్టుకునే విషయంలో నేనేమాత్రం మొహమాటపడను .. వెంటనే ఇద్దరూ మళ్ళీ సెల్ ఫోన్స్ తీసారు మెప్స్ ఓపెన్ చేయడానికి ... అక్కర్లేదు ..మీ ఫ్రెండ్స్ ని ఎవరినన్నా కనుక్కోండి అన్నాను కోపంగా... అప్పుడు తెలిసిన విషయం ఏమిటంటే ఆర్చాడ్ గార్డెన్ అనేది ఒకప్పుడు ఈ చుట్టుప్రక్కల ఉండేది అది ఇప్పుడు క్లోజ్ చేసేసారు... మేము వెళ్ళాలనుకున్న పార్కుని బొటానికల్ గార్డెన్ అనాలి( ఈ విషయం అందరికీ తెలుసుకాని టైంకి హోల్సేల్ గా మర్చిపోయాం :)) ..... అది ఇక్కడ కాదు అని వాళ్ళ ఫ్రెండ్స్ తప్పు మా ఆయనదే అని సెల్లుగుద్ది మరీ చెప్పేరు ....సో .. బాల్ నా కోర్టులో పడేసరికి ఇంటికి వెళ్ళేవరకూ ఆడుకోవలసి వచ్చింది..



ఇంతకు విల్లేకి వెళ్లాం అని చెప్పాను కదా ... ఏమిటా అది అని చూస్తే ఏమీలేదు నలబై కుండీలు ,నాలుగు రకాల మొక్కలు వేసి అమ్ముతున్నాడు వాడు.. వాటిని చూడగానే నీరసం ,దుఃఖం ఒకేసారి పొంగిపొర్లాయి ... కాని ఏం చేస్తాం నాలుగు పువ్వులనే అలా అలా ఫొటోస్ తీసా..హి హి హి హి ఇప్పుడు అర్ధం అయ్యిందా ఈ పోస్ట్ ఎందుకు వేసానో... తప్పు.. మంచిపిల్లలు అలా ఏడుపు మొహాలు వేసుకుని చూడకూడదు..ఫొటోస్ లాస్ట్లో పెడాతానేం..



సరే ఈ ఫొటోస్ అన్నీ తీసాకా అర్ధం అయిన విషయం ఏమిటంటే మేము పెనం మీదనుండి పొయ్యిలో పడ్డామని ... అదో చిన్న సైజు అడవిలా ఉంది..ఎటు చూసినా వానరాలు ...నో బస్సులు, నో కేబ్స్ నతింగ్ అంతే ...మండుటెండలో అలా నడుస్తూ, నడుస్తూ మొత్తానికి ఒక బస్ స్టాప్ కొచ్చాం ... మా ప్లాన్ ఏమిటంటే అక్కడ బస్ ఎక్కేసి కాస్త సిటీలా ఉన్న ప్లేస్లో దిగిపోయి ఏదో ఒక కేబ్ పట్టుకుని ఇంటికోచ్చేద్దాం అని .... ఇంతలో బస్ వచ్చింది బ్రతుకు జీవుడా అని బస్ ఎక్కాం.... ఎక్కిన పావుగంట అయ్యాకా తెలిసొచ్చింది ఆ రోజు అట్టాంటి ఇట్టాంటి మామూలు రోజు కాదని...ఆ బస్ మళ్ళీ జూకి -విల్లేకి, విల్లేకి - జూకి గింగిరాలు కొడుతుంది.ఓర్నాయనో ఇదేక్కడ గొడవరా బాబు అని మధ్యలో వచ్చిన మరో బస్ స్టాప్లో దిగిపోయాము .... మాకు ఇక్కడ ప్రతి స్టాప్ లోనూ బస్లు ఎక్కడికి వెళతాయో మేప్ ఉంటుంది ...చూస్తే అందులో ఒక్క ఊరు తెలిస్తే ఒట్టు.. కాసేపు వెయిట్ చేసి వేరే బస్ ఎక్కి కాస్త కార్లు గీర్లు కనబడుతున్న సిటిలా ఉన్న ప్లేస్ లో దిగి కేబ్ కోసం గంట వెయిట్ చేసాం ....ఒక్క కేబ్ లేదు ఆ దారిలో ...వచ్చినా జనాలు ఉన్నారు ...దెబ్బకు నీరసం వచ్హ్చేసింది ...ఇలాక్కాదని మళ్ళీ మరో బస్ ఎక్కించి మరో ప్లేస్లో దింపారు మా ఆయన ..అక్కడ కేబ్ దొరికి "దేవుడా " అని ఒక దండం పెట్టుకుని ఊపిరి పీల్చుకున్నానో లేదో అనుష్కా మళ్ళీ నవ్వింది ..... " పాపం పిల్లలని ఊరికే తిప్పాం బీచ్ కి వెళదామా గాలిపటాలు ఎగరవేద్దాం "అన్నారు మా ఆయన ....



గాలిపటాలు వద్దు చిత్రపటాలువద్దు నావల్ల కాదు ...మర్యాదగా ఇంటికి తీసుకువెళ్ళండి అనగానే మా అబ్బాయి..." బేడ్ మమ్మీ "అని బిరుదు ప్రదానం చేసాడు..మా అమ్మాయి దిస్ ఇస్ నాట్ ఫెయిర్ మమ్మీ నువ్వు కైండ్ లెస్ అని నిష్టూరం చేసింది.. మళ్ళీ నేరుగా బీచ్ కి వెళ్లాం.. అక్కడ కాసేపు పిల్లలు ఆడారోలేదో మా వాడు ఎలా తగిలించుకున్నాడో దెబ్బ తెలియదు... కాలి నిండా రక్తం రక్తం ....అసలే మావాడికి జలుబు చేసిందంటే ఇంటిల్లిపాదికీ జ్వరాలు వచ్చేస్తాయి...ఆ రేంజ్లో వేపుకు తినేస్తాడు...మా అమ్మాయి సైకిలింగ్ సైకిలింగ్ అంటుంటే తోలు తీస్తా ఇక పదండి అని మళ్ళా కేబ్స్ పట్టుకుని ఇలా ఇంటికొస్తున్నామో లేదో అర్జెంట్గా ఆఫీస్కి రా అని మెసేజ్ .... పాపం అటు నుండి అటే మా ఆయన ఆఫిస్కి బయలుదేరారు...

అలా ఆ రోజంతా డబ్బులిచ్చి మరీ తన్నిన్చుకున్నట్లు అయిపొయింది.. కాబట్టి టైం బాగోపోతే పండు వెన్నెలలో కూర్చున్నా మండుతెండల్లో మాడిన కాకుల్లా గిల గిలలాడతాం అన్నమాట ...


ఇవన్నీ ఆర్కిడ్ పువ్వుల్లో రకాలన్నమాట



కుళ్ళుతున్నారుకదా..నేచురల్ ..మీకు అలా అనిపించడంలో పెద్దగా వింతేం లేదు ..



ఇవేమో తెల్ల ఆర్కిడ్లు... బాగున్నాయి కదా



చెప్పేనుకదా పువ్వు పుట్టగానే పరిమళించినట్లు కొంతమంది కెమెరా చేతిలోకి రాగానే గుభాళించేస్తారు అంతే....



ఈ ఫొటోస్ చూసి మా ఆయన డొక్కులా ఉంది అన్నారు...ఏం కాదుకదా బాగుందికదా



ఇవో రకం



ఇది సూపర్ వచ్చింది కదా ...అంటే ఇవినా మనసులో మామాటలు కాదు మీ మనసులోవి..నాకు వినబడిపోతున్నాయి ఇక్కడికి


పాపం ఇది పువ్వు బాగానే ఉంది..కెమేరాకే ఏదో అయ్యింది ...కొద్దిగా మసగ్గా వచ్చింది ..ఏం పర్లేదు సర్ధుకుపోండి



ఇవేమో కలర్ భలే బాగుందిలే



అంటే ఇది పర్లేదు అనుకోండి పై ఫొటోస్ కంటే పెద్ద గొప్పగా ఏమీ లేదుకదా...ఒక్కోసారి పువ్వులు బాగున్నా సరే ఫొటో బాగా వస్తుంది .. అంటే నేను తీయలేదన్నమాట ఇది ...



ఇదేమో ఇంటికి ఎలా వెళ్ళాలో మా ఆయన ఎంక్వయిరీ చేస్తున్నపుడు రోడ్ ప్రక్కన కనబడితే తీసేసా..



ఇది బస్ స్టాప్ దగ్గర .... అక్కడెక్కడో ఉంటే జూం చేసి తీసాను



నేను చెప్పానా అది అంతా అడవిలా ఉంది అని ..నేను చెప్తే నమ్మారా? అందుకే ఈ ఎవిడెన్స్


పద పదవే వయ్యారి గాలి పటమా



21, మే 2011, శనివారం

అసలేం జరిగింది ?

తెల్లవారుజామునే లేచి పిల్లలను ఆదరాబాదరాగా బస్ ఎక్కించి ,తరువాత వంట చేసి, లంచ్ బాక్స్ తో భర్తగారిని ఆఫీసుకు సాగనంపీ ,గట్టిగా ఊపిరి పీల్చుకుని వెనుకకు తిరగ్గానే కిష్కిందకాండలా ఉన్న ఇల్లును చూసి, ఏడుపుమోహంతో కొంగు బిగించి చీపురు పట్టుకున్న సగటు ఇల్లాలు ఎంత తీరికగా ఉంటుందో నేనూ అంతే తీరికగా ఉన్న సమయంలో ఫోన్ ట్రింగ్ ట్రింగ్ మని ఒకటే మోత....


చెప్పొద్దూ అలాంటి సమయంలో ఫోన్ వస్తే నాకొస్తుంది కదా కోపం ...ఓ ప్రక్క అవతల పూజకు టైమైపోతూ ఉంది..అసలే మనం పూజ రూము లోకి వెళ్ళామంటే గంట బయటకు రాను..అదంతా భక్తి అనుకోకండి భయం అన్నమాట ...:)..ఈ దేవుడికి అష్టోత్తరాలు చదివి ఆదేవుడికి చదవకపోతే ఆయన ఫీలవుతాడేమో అని కొంతా ..ఆవిడకు పూజ చేసి ఈమెకు చేయకపోతే ఈమె ఏమనుకుంటుందో అని మరికొంత ...ఇదిగో అమ్మాయ్ సుందరాకాండ పంపాను చదువుతున్నావా ? విష్ణు సహస్రనామాలు ,లలితాపారాయణం మర్చిపోకేం అని నిమిషం నిమిషానికి గుర్తు చేసే అత్తగారి రూపం ఇంకొంత ఇలా ఒక్కటికాదు లెండీ. పైగా పన్నెండు దాటిన తరువాత పూజ చేస్తే రాక్షస పూజ అవుతుంది అట .అందుకే ఎట్టి పరిస్థితుల్లో అయిదినిమిషాలు తక్కువ పన్నెండుకల్ల హారతిగంట గణగణమని మోగించేస్తా ...ఇదిగో హిందూ దార్మికవాదులు నావైపుఅలా కొరకొరా చూడకండి ..నానేమీ సేయలేను :( ....


ఆ.... ఏదో చెప్తూ ఇంకేదో చెప్పేస్తున్నాకదా ..అలా పోన్ మోగుతూ ఉంటే విసుగ్గా ' హలో 'అన్నాను .... "బ్రతికే ఉన్నావా ' అటునుండి "కయ్ కయ్ " మందో కంఠం ."అమ్మో!! .. సుధ" అని మనసులో అనుకుని ...అదికాదే మరే ...నేనేమో ..ఈ మధ్య ..పిల్లలు.. బిజీ అని పదాలు వెతికేసుకుంటుంటే.." అనవే అను ...నాకంటే పిల్లా, పీచుతో ఖాళి ఉండదు కాబట్టి నీకు ఫోన్ చేసే తీరికలేదూ ,నువ్వంటే మొగుడు బయటకు వెళ్ళగానే పొద్దస్తమానం టీవి, కంప్యూటర్ ముందేసుకుని ఇలా ఫోన్స్ చేసి చావగోడతావు అనేకదా నీ ఉద్దేశం...ఆగిపోయావే అనూ " అటునుండి నిష్టూరంగా అరిచింది.ఇది ఇంత కరేస్ట్ గా నా మనసులో మాటలు ఎలా చెప్పేసిందబ్బా అని అనుకోని" అబ్బే..ఛీ ఛీ నా ఉద్దేశం అదికాదే నీకలా అర్ధం అయ్యిందా" అన్నాను కంగారుగా ....."నువ్వెలా అన్నా నాకలాగే అర్ధం అవుతుంది ...పనిపాట లేకుండా కొంపలో ఒక్కదాన్నే ఉంటే అందరికీ లోకువే" ఎడుపుగొంతుకుతో అంది... నాకు విషయం అర్ధం అయిపొయింది.. మీ ఆయనతో గొడవ అయ్యిందా అన్నాను ఫోన్ స్పీకర్ లో పడేసి పని చేసుకుంటూ ..(భర్త తో తగు వేసుకుంటే ఒకపట్టానా ఆ కబుర్లు పూర్తవ్వవులెండి ) "అవ్వదా మరి ..ఒకటి కాదు రెండుకాదు ౩౦౦౦ డాలర్లే .మంచి జాబ్ ..పైగా మెడికల్ ఎలవెన్సులు గట్రాలు అని బోలెడు ఉన్నాయి. జాయిన్ అవుతానంటే ససేమిరా వద్దు అంటున్నాడు ..చూడవే ఎంత అన్యాయమో అంది కోపంగా...


నాక్కూడా బోలెడు కోపం వచ్చింది ..మంచి జాబే గా చేస్తే తప్పేంటి ???నువ్వేమన్నా మణులడిగావా?మాణ్యాలడిగావా ?నెల అయ్యేసరికి బోలెడు డబ్బులు చేతిలోపోస్తా అంటే ఏం నెప్పా....దీన్నే మేల్ ఇగో మరియు మగ అహంకారం అంటారు అని తనకు నచ్చ్సు రీతిలో ఒదార్చీ ఇంతకీ ఎందుకొద్దన్నారు?" అన్నాను . "హూం నీకు తెలుసుకదే నాకు కొన్ని ప్రొబ్లెంస్ వల్ల పిల్లలు పుట్టలేదని, దానికోసం అడ్డమైన మందులూ వాడేసరికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి గ్యాస్ట్రిక్ పెయిన్ మొదలైంది ఆ మధ్య..ఒక్కోసారి కడుపులో విపరీతమైన మంట ,వికారం ,కడుపుబ్బరం ఒక్కటి కాదులే ...మళ్ళీ దానికోసం హాస్పిటల్ చుట్టూ తిరగడం అవుతుంది ఈ మధ్య..ఇప్పుడు ఆ వంక పట్టుకున్నాడు ...ఇప్పటికే టైముకి తినవు ...రేపు జాబ్ వస్తే అసలు తినవు ఇక ఆ సంపాదన అంతా డాక్టర్స్ కి పెట్టాలి.పిల్లలు పుట్టేవరకు జాబ్ లేదూ ఏమీ లేదూ అని మొండికేస్తున్నాడు" అంది .


ఇందులో కూడా పాయింట్ కనబడింది..."నిజమే కదా తను చెప్పింది కూడా "అన్నాను ఆలోచిస్తూ.......పోయి ,పోయి నిన్ను అడిగాను చూడు నన్ను అనాలి..ఒక్క మాట మీద ఉండవేం...ఇక నావల్ల కాదు ఆ మందులు గట్రా ...అన్నీ మానేస్తాను ..పిల్లలు పుడితే పుట్టారు లేకపోతే లేదు..ఆరోగ్యం నాశనం అయిపోతుంది.ఇంట్లో ఒక్కదాన్నే కూర్చుంటే పిచ్చ బోర్ కొడుతుందే..అందుకే వాసూ వద్దన్నా జాబ్ చేయాలనే అనుకుంటున్నా..నీ అభిప్రాయం ఏమిటీ??" అంది.ఇదిగో ఇక్కడే వళ్లుమండుతుంది..నిర్ణయం పక్కాగా తీసేసుకుని మళ్ళీ నన్ను అడగడం ఎందుకో..నేను వద్దన్నా ఖచ్చితంగా జాబ్లో చేరుతుందికాబట్టి మర్యాద పోకుండా నువ్వే కరెక్ట్....ఎంచక్కా జాయిన్ అయిపో అని ముందుకు తోసేసాను...


రెండునెలల తరువాత మళ్ళీ అది ఫోన్ చేసేవరకు దాని విషయమే మర్చిపోయాను..ఎప్పటిలాగే హలో అనగానే తిడుతుందేమో అని కంగారుపడిపోయానుగాని అదిమాత్రం నీరసంగా మాట్లాడుతుంది."ఏమైందే ఒంట్లో బాలేదా" అన్నాను . "బాలేదా అంటే అదేనే ఇంతకుమునుపులాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ..వికారంగా ,చిరాగ్గా కడుపులో మంటగా నెప్పిగా ఏంటోలా ఉంది" అంది. ....."ఏమైనా విశేషమేమో??" అన్నాను అనుమానంగా. "ఎహే ఎవరికి చెప్పినా ఇదేగోలా ..ఆ డాక్టర్స్ కూడా అంతే..వెళ్ళగానే పెద్ద పని ఉన్నట్లు స్కానింగ్ చేసిపడేసి వందల డాలర్లు బిల్లు చేతిలోపెడుతున్నారు...ఇప్పటికి నాలుగు సార్లు చేయించాను..లేటెస్ట్ గా మొన్న వారమే చూపించుకున్నాను ..ఏమీలేదు అన్నాడు" అంది దిగాలుగా.. "మందులు వాడటం మానేసాను అన్నావుగా అయినా తగ్గకపోవడం ఏమిటే అన్నాను" అయోమయంగా.... "మొన్న తగ్గినట్లే తగ్గి మళ్ళీ తిరగబెట్టింది ...అనవసరంగా జాబ్లో జాయిన్ అయ్యానంటావా" అంది ..."ఆ రోజు చెప్తే విన్నావా" మనసులో తిట్టుకుని..."చా చా అలా ఏమీ కాదులే తగ్గిపోతుంది కొద్ది రోజుల్లో" అని ధైర్యం చెప్పేసాను ....


ఇది జరిగిన మరుసటి నెల మళ్ళీ ఫోన్ ...ఇండియా వెళ్ళాలిఅనుకుంటున్నానే అని...."ఏమైంది సడన్ గా" అన్నాను."ఏమీ లేదు ఎలాగూ రెండురోజులు సెలవులు కలిసొచ్చాయి ...అమ్మావాళ్ళను చూసినట్లు ఉంటుంది ..పైగా ఈ ప్రాబ్లం ఇంకా తగ్గలేదే ఎన్ని మందులువాడినా..అమ్మ అక్కడ డాక్టర్స్ దగ్గర చూపిద్దాం రమ్మని గొడవ" అంది. హూం ,అదీ నిజమేలే ..కాని జాగ్రత్త సరిగ్గా ఎండల టైం ...మొన్న ఎండల్లో మేము ఇండియా వెళ్ళినపుడు నాకు సరదా తీరిపోయింది.వికారం, కళ్ళు తిరగడం ఒక్కటి కాదు ..పిల్లల్ని అయితే హాస్పిటల్ చుట్టూ తిప్పుతూనే ఉన్నాను ..ఎండలో అస్సలు తిరగకు" అని ఒక సలహా పారేసాను..


ఓ నెల పోయాకా నేనే ఫోన్ చేసాను గుర్తుపెట్టుకుని ..ఈ సారి గనుక చేయకపోతే చాకిరేవే మరినాకు ......."హలో" అంది నీరసంగా .ఇదేంటే ఇండియా వెళ్ళిన ఉత్సాహంలో ఒకటే ఉషారు ఉషారుగా ఉంటావనుకున్నాను ఇలా గాలితీసిన బెలూన్లా అలా వ్రేలాడిపోతున్నావేంటి అన్నాను అయోమయంగా......ఏం ముహూర్తాన అన్నావే బాబు ఇండియాలో ఎండలకు కళ్ళు తిరిగుతాయని ...వెళ్లోచ్చి రెండువారాలు పైనే అయిపోయినా ఇంకా తేరుకోలేకపోతున్నా.. ఎంత నీరసమోచ్చేసిందో తెలుసా" అంది.".అయ్యో అవునా!!.. అయినా ఇంటిపట్టున హాయిగా ఉండక ఎండలో ఎవరు తిరగామన్నారు నిన్ను...డాక్టర్ దగ్గరకు వెళ్తా అన్నావ్ వెళ్ళావా మరి "అన్నాను.."ఏంటి ఇంటిదగ్గర ఉండేది..షాపింగ్ అని అదని ,ఇదని ఏదో ఒకపని ఉంటుందిగా ...ఉన్నదే వారం రోజులు ...లాస్ట్ డే డాక్టర్ దగ్గరకు వెళ్లాను "అంది.. ఏమన్నారు మరి అన్నాను ... నా పాత రిపోర్ట్స్ అన్ని చూసి ఇంకో బుట్టెడు మందులిచ్చి అస్సలస్సలు రక్తం లేదు బాగా తిను అని చెప్పి బిల్లు బజాయించి పొమ్మన్నారు అంది విసుగ్గా...ఇంకేం చేస్తావ్ వాడు మరి అని ఫోన్ పెట్టేసాను..


ఆ తరువాత చాలా రోజులు దాని విషయమే మర్చిపోయాను....ఇక్కడ అందరమూ ప్రక్క ప్రక్క ఊరుల్లోనే ఉంటాము( మేక్జిమం అరగంట జర్నీ) కాని ఏదో ఒక అకేషన్ వస్తే గాని కలుసుకోమన్నమాట ....నా బెస్ట్ ఫ్రెండ్ నేను ప్రతి రోజూ, గంటలతరబడి ,సంవత్సరాల పాటు మాట్లాడుకుంటాం కాని నాలుగేళ్లకోమారు కూడా కలుసుకోము ...అట్టా సూడమాకండి...అదంతే ....బద్దకానికి బాధ్యతలు అని ముసుగేసి అలా రోజులు గడిపేస్తాం ... ఆ ...ఎంతవరకూ చెప్పాను.. అలా సుధ విషయం మర్చిపోయి రోజలు గడిపేస్తుండగా ఒక రోజు అమ్మతో పోన్లో పిచ్చాపాటి మాట్లాడుతుంటే పద్మక్కకు ఆపరేషన్ చేసారట ఓమారు వెళ్లి పలకరించి రావాలి అంది..అదేంటి లాస్ట్ ఇయరేగా పాప పుట్టుంది.... మళ్ళీ ఎప్పుడు ప్రెగ్నెంట్ అయ్యింది?? అన్నాను.. అదికాదులే ఆ మధ్య ఏంటో ప్రక్కకు తిరిగి పడుకుంటే ప్రేగులన్నీ ఒక వైపుకి వచ్చేస్తున్నట్లు అనిపిస్తుంది అంట... డాక్టర్ ఆపరేషన్ చేసి అలా కాకుండా సరిచేయాలన్నారట అంది.. ఇవేం రోగాలమ్మా బాబు విచిత్రంగా అన్నాను..మరే ఆడపుట్టుక అంటే అంతే ..మా అమ్మ సింపుల్గా తేల్చేసింది.. ఫోన్ పెట్టేయగానే సుధ ఫోన్ ...


కాసేపు దాని చీవాట్లకు బలి అయ్యాకా ఇప్పుడెలా ఉంది అన్నాను...పర్వాలేదు ,ఇండియా నుండి తెచ్చిన మందులు వేసుకున్నాకా తగ్గినట్లే ఉంది కానీ... అని ఆగిపోయింది..మళ్ళీ ఈ కానీలు అణాలు ఏమిటీ అన్నాను .... ఏంటో నే ఒకటి తగ్గిందంటే మరొకటి..ఈ క్రొత్త టాబ్లెట్స్ వాడుతుంటే వళ్ళంతా నీరు పట్టేస్తున్న ఫీలింగ్ .. అరికాళ్ళు మరీను ..ఇలా నొక్కితే అలా లోపలికి గుంత పడుతుంది అంది.. ఏమో బాబు ఇదేం గోలో..విచిత్రం విచిత్రమైన రోగాలు అని ప్రొద్దున్న అమ్మ మా పద్మక్క గురించి చెప్పింది అంతా దానికి చెప్పాను....అలా చెప్పి ఎంత తప్పు చేసానో తరువాత గాని తెలిసిరాలేదు ...


పది రోజులుపోయాకా సుధ నుండి ఫోన్.. "హలో" అనగానే గై గై మంది ...ఏం నోరేబాబు నీది ..అర్జెంట్గా ఒక దబ్బలమో ,సూదో తెచ్చి కుట్టిపాడేసేయ్ ముందు అంది..నేనేం చేసానే అన్నాను అర్ధం కాక...మొన్న చెప్పావ్ కదా మీ పద్మక్క గురించి ..ఇప్పుడు నాకు కూడా ప్రేగులు ప్రక్కకు వేల్లిపోతున్నట్లు అనిపిస్తుందే అంది..ఓర్నాయనో ఇదెక్కడి గోలరా బాబు అనుకుని.. "ఛీ ఛీ నీ మొహం అదెక్కడో నూటి కో కోటికో జరుగుతుందంట అన్నాను కంగారుగా..ఆ ఒక్కదాన్ని నేనేమోనే అంది ఏడుపు మొహం వేసుకుని.. ఎహే పో ...నీకెందుకు అలా జరుగుతుంది.... అంతా నీ ఊహ అంతే అన్నాను...ఊహో కల్పనో ...ఒక్క రోజు కాదు వారం రోజులనుండి అదే ఫీలింగ్ ....నాక్కూడా మీ పద్మక్కలాగే జరుగుతుందేమో .. అసలు అదేనా లేక ఇంకేమన్నా రోగమా నాకు..నాకే ఎందుకు ఇలా జరుగుతుంది..ఏం పాపం చేసానంటావ్ ..ఈ మధ్య కాలం లో ఒక్క రోజు స్థిమితంగా లేను ...అని ఏడుపుమొదలు పెట్టేసింది..కాసేపు ఓదార్చి ఫోన్ పెట్టేయగానే నాకు దిగులు పట్టుకుంది...ఎందుకిలా జరుగుతుందో అని...


కొన్నాళ్ళు అయ్యాకా విషయం తెలుసుకోవాలాని ఫోన్ చేస్తే హాస్పిటల్ లో ఉన్నానే అంది..ఇంకా తగ్గలేదా అన్నాను జాలిగా.. ఉహు ... ఒక్కోరోజు ఎక్కువగా అనిపిస్తుంది ఒక్కోరోజు తక్కువగా ...అపాయింట్మెంట్ తీసుకుంటే ఈ రోజు ఇచ్చాడు అంది..ఎందుకే ఇంత నెగ్లెక్ట్ చేస్తావ్ ఇలాంటి విషయాలు అన్నాను కోపంగా .. ఆఫీస్లో చచ్చేంత పని ఉంది.. ఈ కే కే హాస్పిటల్ సంగతి తెలిసిందేగా ఈ రోజు అడిగితే నెల రోజులకు ఇస్తాడు ..మనకేమో సండే సాటర్ డేలే కావాలిగా అంది ...సరేలే ఇంటికొచ్చాక విషయం చెప్పు అని పెట్టేసాను ...


సాయంత్రం కాల్ చేస్తే ఎవరూ లిఫ్ట్ చేయరు...నాకేమో టెన్షన్ ....ఏమైందో అని ...మొబైల్ కి చేసినా అదే పరస్థితి.. దేవుడా దానికేం కాకుండా చూడు అని దణ్ణం పెట్టేసుకున్నాను.. మరుసటి రోజు ఫోన్ చేస్తే హలో అంది ఉత్సాహంగా ...కొద్దిగా ధైర్యం వచ్చింది నాకు..ఏమన్నారు అన్నాను ఆత్రుతగా..పక్కున నవ్వి .... నన్ను తిట్టాను అంటే చెప్తాను అంది..ఎహే చెప్పు... విసుగ్గా అన్నాను ...నేను ప్రెగ్నెంట్ నే అంది ..అవునా కంగ్రాట్స్ ..అందులో తిట్టడానికేముంది అన్నాను..పూర్తిగా విను ఇప్పుడు నాకు ఆరో నెల...త్వరలో ఏడో నెల వచ్చేస్తుంది అంది ..ఏంటీ ఒక్కసారిగా అరిచాను ... నిన్న స్కానింగ్ చేసి డాక్టర్ పిచ్చి మొహాన్ని చూసినట్లు చూసిందే అంది...నాకేం అర్ధం కాలేదు..ఎలా? ఆరోనెల అయితే తెలియకపోవడం ఏమిటీ నీకు అన్నాను విచిత్రంగా ..


అదే నాకు మొదట అర్ధం కాలేదు ...లాస్ట్ టైం స్కానింగ్ చేయిన్చానుగా అప్పుడు కన్సీవ్ అయినట్లు ఉంది..కాని ఎర్లీ స్టేజ్ లో ఉండటంవల్ల తెలియలేదు..ఈ పిచ్చిమొహాలు కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని మందులు ఇస్తూనే ఉన్నారు .... నేను కూడా ఆ వికారం ,కళ్ళు తిరగడాలు అన్నీ దానివల్ల ఎండలవల్ల అనుకున్నానుగాని ఈ ఐడియా రానేలేదు ...ఇండియాలో డాక్టర్ కూడా పాత రిపోర్ట్స్ చూసి మందులు ఇచ్చేసింది.. ఒక పోలిక్ ఆసిడ్ గాని ఐరన్ టాబ్లెట్స్ గాని ఏమీ వాడలేదే... వరుసగా అడ్డమైన టాబ్లెట్స్ వాడేసాను ..పైగా పెద్ద పొట్టెం రాలేదు .అంది..


అయినాకాని అంతా తెలియకుండా ఎలా ఉన్నావ్?? అన్నాను..నాకెలాగు "ఇర్రేగ్యులర్ " అనికదా హాస్పిటల్ చుట్టూ తిరిగేది ..టాబ్లెట్స్ ఎలాగూ మానేసానుగా అందుకే పెద్దగా డవుట్ రాలేదు ....నాకైతే ఇంకా కల లా ఉంది అంది... "కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడని ...అలా కలిసొచ్చింది అన్నమాట నీకు ...మాకులా రోజు రోజు టెన్షన్ పడకుండా ఎంచక్కా ఏడో నెలకొచ్చేసావ్" అన్నాను ... ఇక జాబ్ రిజైన్ చేసేస్తున్నాను ...మళ్లీ ఎనిమిదో నెలలో ఫ్లైట్ ఎక్కనివ్వడుగా అంది.. అప్పుడు గుర్తొచ్చింది నాకు ..ఏమే దొంగామోహమా.. మీ అబ్బాయి కడుపులో తిరుగుతూ ఉంటే నీవల్లే, నీ నోరు అని అన్ని తిట్లు తిడతావా నన్ను ఆయ్ అని గొడవ వేసుకున్నా...


ఇప్పుడు తను పరిగెట్టేకొడుకుతో ఆస్ట్రేలియాలో ఉంది ...అలా జరిగింది అన్నమాట :)

8, మే 2011, ఆదివారం

సరదాగా స్కై పార్క్ కి

నిన్న స్కై పార్క్ కి వెళ్ళాం.. స్కైపార్క్ అంటే ఏంటంటే.. ఊ..చాలా బాగుంటుంది అన్నమాట..ఎలా చెప్పాలో తెలియడం లేదన్నమాట.. అందుకే చూపిస్తా.. అసలుకి ఒక 500 ఫొటోస్ తీసి ఉంటాం అందులో 450 ఫొటోస్ లో మేమే ఉన్నాం.. మిగిలినవి ఒడబోయగా కొన్ని మీకు చూపిస్తున్నాను.. ముందే ఐడియాలేదు బ్లాగ్లో పెట్టాలని.. నిన్న చూసాకా వచ్చింది అన్నమాట.. చూసి కుళ్ళుకోండి :)లేకపోతే నాకు మనశ్సాంతిగా ఉండదు..

ముందుగా కేబ్లోంచి కొన్ని మా ఊరి ఫొటోస్



ఇదే బాబు స్కై పార్క్ ..దీనిలోపలకే వెళ్ళాం ...

అందులో వెళ్ళాకా కొన్ని ఫొటోస్ ....ఇవేంటనుకుంటున్నారు బుల్లి బుల్లి రెస్టారెంట్లు ..నాకేమో తీయడం రాలేదు ..చాలా చాలా సూపర్ ఉన్నయన్నమాట చూడటానికి..మీరు కూడా చాలా చాలా ఇంకా బాగా ఊహించుకోండి...ఫొటోస్ క్లిక్ చేసి పెద్దవి చేసుకుని చూడండి




ఇవి మెట్లలాగా ఉన్నాయికదా.. ఉహు.. పైన రూఫ్ అన్నమాట

ఇటువంటి శిల్పాలు చాలానే ఉన్నాయి.. ఇది పరుగులు పెడుతూ తీసా.. మరి నన్ను వదిలి వెళ్ళిపోతున్నారు..


చాలా పెద్ద బిల్డింగ్ లే ..అది అయితే స్కేటింగ్ ..మా అమ్మాయి ఒకటే గొడవ ..అమ్మా వెళదాం అని ...టైమెక్కడా.. పాపం తీసుకొచ్చేసాను..




నవ్వుకోకండేం ఇలాంటివైతే బోలెడు ఉన్నాయి....షోకేస్లో బొమ్మలు చూస్తే పిచ్చ ఇష్టం నాకు ..



లాహిరి లాహిరి లాహిరిలో ..బిల్డింగ్ లోపలే చెరువు దానిలో నౌకావిహారం ..మనిషికి 5 $..దారుణం కదా ..సుత్తిలా 10 నిమిషాలు కూడా తిప్పలేదు.. పిల్లల కోసం తప్పలేదు.. అయినా వాడు నా దగ్గర టిక్కెట్టు తీసుకోవడం మర్చిపోయాడు..ఇంకోసారి పిల్లల్ని పంపనా అంటే ..మా ఆయన.. హుఊం ఎందుకులేండి చెప్పడం..


మనిషన్నాకా కాసింత కళాపోషణ ఉండాలండి.. సూపరుంది కదా..మనమే తీసాం బిల్డింగ్ క్రింద నుండి..


ఇదిగో బాబు స్కై పార్క్ నమూనా.....దీని పైకి ఎక్కినందుకు దొంగమొహంగాడు మనిషికి 20$ బేండ్ వేసాడు..కాని.. పర్లేదులే..బాగానే ఉంది ...


దారంతా కుండీలతో ఇలా సరదా వస్తువులతో డెకరేట్ చేసారు

బిల్డింగ్ పైన అంతా చెట్లే చెట్లు ...భలే బాగుంది కదా ...
ఈ ఫారినర్స్ కి పని పాట ఏడవదు ...ఎక్కడికి వెళ్ళు సరిగంగ స్నానాలే

చేతికి కెమారా ఇస్తే ఇలాంటి పైత్యాలు పుడుతుంటాయినాకు..భరించాలి తప్పదు మీకు ..




ఈ ఫొటోస్ చూసాకా నాకో విషయం అర్ధం అయ్యింది..వేలకు వేలు పోసి కెమెరాలు కొనడం కాదు గొప్ప ..ఫొటోస్ తీయడం నేర్చుకోవాలి.. బుల్లి బుల్లి కెమెరాలతో ఎంచక్కా ఫొటోస్ తీసేస్తున్నారు అక్కడ..ఇంత పెద్ద కెమేరా వేసుకుని మనకు నచ్చినట్లు తీస్తే ఇలాగే వస్తాయన్నమాట..ఈ మాట అనేసి బోలెడు తిట్ట్లు తినేసా అన్నమాట.. కాని సూపర్ ఉంది ఈ ప్లేస్..మొత్తం సింగపూర్ కనబడింది..కాకపోతే పది నిమిషాలు కూడా కూర్చో నివ్వలేదు అక్కడ సుత్తిలా .ఇంకా చాలా ఫొటోస్ ఉన్నాయిగాని ..మరీ ఎక్కువ అయిపోతాయని పెట్టడంలేదు





ఈ place మాత్రం అల్టిమేట్ ...మొత్తం బిల్డింగ్ చూపించినప్పుడు పైనా షిప్ లా ఉందికదా ఆ ఏడ్జ్ లో అన్నమాట ఆ స్విమ్మింగ్ పూల్ ..పడిపోతాం కదా.. ఆ ఫారినర్స్ కి భయమే లేదు..ఎలా కట్టాడో అర్ధం కాలేదు..లోపల్కి వెళ్ళే ఓపికలేక బయట నుండి ఒక క్లిక్కు కిక్కాము ,,


క్రింద రెండు ఫొటోస్ ఉన్నాయికదా ..పై ఫొటో క్రింద ఫొటో తేడా చూడండి...రెండూ ఒక ప్లేస్లో తీసినవే.. మరదేమరి క్షవరం అయ్యాకా వివరం తెలియడం అంటే.... ఇప్పటికి మా ఆయనగారికి తెలుసొచ్చింది అన్నమాట బ్యాక్ గ్రౌండ్ బ్రైట్ గా ఎలా తీయాలో ..అప్పటీకీ చెప్తున్నా గైడ్ మోడ్లో పెట్టి చూడండి మహానుభావా ....అబ్బే అలా వినేస్తే ఇంకేంటి ..ఫోటొస్ అన్ని నాశనం చేసేయద్దూ ..పెద్ద జోకేమిటంటే.. మాకులాంటి కెమేరా తెచ్చుకుని అదెలా పట్టుకోవాలో తెలియకా మా ఆయన్ని సలహా అడిగే శిష్యుడు ఒకడు దొరికాడు అక్కడ ..పాపం వాడు..:P




బ్రిడ్జ్ ప్రక్కనే బోలెడు పూవులు బాగున్నాయి కదా

ఈ బ్రిడ్జ్ చాలా బాగుందికాని ఇక్కడ బాగా రాలేదు

ఇంకా కొబ్బరి చెట్ట్ల దారి


వస్తున్నప్పుడు పువ్వులాంటి బిల్డింగ్

చీకట్లో స్కయ్ పార్క్

ఆఖరికి టాక్సి స్టాండ్ ని కూడా వదల్లేదు.


మరిన్ని వివరాలకు :
http://www.marinabaysands.com/SandsSkypark/Sands_Sky_Park.aspx

11, ఏప్రిల్ 2011, సోమవారం

గీతాంజలి

'భౌ 'భయపడ్డారు కదా...భయం మాట ప్రక్కన పెట్టు అసలెవరు నువ్వు అని అంటున్నారా? అయ్యబాబోయ్ అలా భయపెట్టేయకండీ ...నేను నేస్తాన్ని.మీరలా మర్చిపోతే ఒప్పుకోనంతే:) ..సరే విషయానికోచ్చేస్తే టైటిల్ చూసి గీతాంజలి సినిమా సమీక్షనో, లేక ప్రేమకధలు పలురకాలు లో గీతాంజలి గాడి గురించో రాస్తున్నాను అనుకుంటే తప్పులో కాలేసినట్లే .నిన్న అనుకోకుండా గీతాంజలి సినిమా చూస్తుంటే అలా ఏంటో ఏంటో చాలా విషయాలు గుర్తోచ్చేసాయి .సరేలే అని ఇక్కడ రాసేసుకుంటున్నా అంతే :)

ఎన్ని మంచి సినిమాలు చూసినా కొన్ని సినిమాలు మాత్రం చాలా రోజులు మనల్ని మర్చిపోనివ్వకుండా వెంటాడుతూ ఉంటాయి .అలాంటి వాటిల్లో నాకు బాగా నచ్చేసినవి స్వర్ణ కమలం ,సప్తపది ,పడమటి సంధ్యారాగం,మౌన రాగం ఇదిగో ఈ గీతాంజలి మొదలైనవి అన్నమాట .అయితే ఈ సినిమా చూడటానికి మాత్రం అబ్బో చాలా పెద్ద కధ జరిగింది .కొద్దిగా ఓపిక చేసుకోండి .మనం ప్లాష్ బ్యాక్ కి వెళ్ళామంటే సుత్తి ఓ రేంజ్ లో కొడతాం .మీకు ప్రత్యేకంగా చెప్పక్కరలేదు కదా :)

ఈ సినిమా వచ్చేసరికి నేను ఆరో ,ఏడో చదువుతున్నాను .సరిగా గుర్తులేదు .అప్పట్లో వేసవి సెలవలు వచ్చాయంటే చాలు మా ఇంట్లో అమ్మ ,పెద్దమ్మ ,పిన్నులు పోటీలు పడి మరీ ఎవరి చెల్లెళ్ళను వాళ్ళు మా ఇంటికి తీసుకోచ్చేసేవారు.అసలే మా ఇంట్లో జనాభా ముప్పై మందికి పైగా ఉండేవాళ్ళం.ఇక అందరూ వస్తే అబ్బో భలే సందడిగా ఉండేది . అలా ఒక పిన్ని చెల్లే రాజమండ్రి ' కృష్ణక్క' (అంటే తను కూడా పిన్నే అవుతుంది అయినా అక్కా అని పిలిచేవాళ్ళం) .తను మా నాన్నమ్మ కు సొంత మేనకోడలు (తమ్ముడి కూతురు) కావడం వల్ల మిగతా పిన్నుల చెల్లెళ్ళ కంటే ఈ కృష్ణక్క తో ఎక్కువ చనువు ఉండేది మాకు .అందులోనూ ఈ రాజమండ్రి వాళ్ళు కబుర్లు భలే చెప్తారేమో రాత్రిళ్ళు మేడ పై నేను, మా పెద్దక్క, కృష్ణక్క అంటరాని వాళ్ళలా దూరంగా పక్క వేసుకుని తెగ కబుర్లు చెప్పెసుకునేవాళ్ళం.

"అప్పుడేమో నేను బస్ స్టాప్ దగ్గర నిన్చున్నానా, ఆ సిరాజ్ ఏమో నా ప్రక్కనే నించున్నాడు.నాకు చాలా భయం వేసేసింది ..'కృష్ణా' నువ్వు లేకపోతే నేను బ్రతకలేనూ అన్నాడు . అసలే వాడు ముస్లిం ,నేను హిందూ .వాళ్ళింట్లో తెలిస్తే ఖైమా కొట్టేస్తారు, మా ఇంట్లో తెలిస్తే చెప్పులు కుట్టేస్తారు . దానికి తోడు మా కిరాతకుడు చంటన్నయ్య లేడూ .. డేగ కళ్ళు వేసుకుని ఎప్పుడూ నాకు కాపలా కాయడమే . వాడు గాని చూసాడో అయిపోయానే. అసలు ఈ అన్నయ్యలున్నారే .పరమ కంత్రీలు .వీళ్ళు మాత్రం ఊరందరి అమ్మాయిలకూ లైన్ వేయచ్చు .మనల్ని మాత్రం ఎవ్వరూ చూడకూడదు .దొంగ మొహం గాళ్ళు " ఇలా అది కబుర్లు చెపుతుంటే మేమిద్దరం కళ్ళ ముందు సీన్లు ఊహించుకుంటూ వినేవాళ్ళం. అప్పటికి నేను చిన్నపిల్లని కావడం వల్ల నన్ను ముందు జోకోట్టేసి తరువాత బోలెడు సీక్రెట్స్ మాట్లాడుకునేవారనుకోండి.నేను కూడా వాళ్ళను ఆట్టే ఇబ్బంది పెట్టి టైం వేస్ట్ చేయకుండా కళ్ళు మూసేసుకుని మరీ జీవించేసి వినేసేదాన్ని.

అలా ఒకరోజున "అసలు సిరాజ్ ఎలా ఉంటాడో తెలుసా అచ్చం ' నాగార్జున 'లా ఉంటాడు "అంది తన్మయంగా .అప్పటికి మాకు నాగార్జున అంటే ఎవరో తెలియదు. నాగార్జున ఎవరక్కా ??అన్నాం ఇద్దరం ఒకేసారి . " నాగార్జున " ఎవరా!!! హూం ..తప్పు మీది కాదే మీ అమ్మలది .సంవత్సరానికో మారు సినిమాకు తీసుకువెళతారు.అది కూడా వాళ్ళ తరం హీరోల పాత డొక్కు సినిమాలు ...చూసిందే చూస్తూ ,చూసిందే చూస్తూ మీ కొంపకు వచ్చినందుకు మాకూ అవే చూపిస్తూ.. ఛీ వెధవ జీవితం" అని విసుక్కుంది."నీకేంటక్కా.. మీ వూర్లో రంభ ,ఊర్వసి ,మేనక దియేటర్లో పెద్ద మావయ్య పని చేస్తున్నాడుగా.మీరు ఎంచక్కా బోలెడు సినిమాలు చూడచ్చుగా అంది మా హేమక్క కొద్దిగా కుళ్ళుతూ.. "హ్మం ..ఎంచక్కా చూడచ్చా ??? ఎంత చక్కగా చెప్పావే నా తల్లీ .,, అసలు వాడు అక్కడ ఏడుస్తున్నాడు కాబట్టే ఓ సినిమా లేదూ ,సింగినాదం లేదూ నా బతుక్కి ...మా ఊర్లో మంచి సినిమాలన్నీ అందులోనే తగలడతాయి .నేను గాని ఫ్రెండ్స్తో వెళ్ళానో ప్రతీ తలకు మాసిన వెధవా నన్ను గుర్తుపట్టేసి మా అన్నయకు చెప్పెయడమే .. వీడికి తోడు చంటన్నయ్య ఇద్దరూ కలిసి క్లాసుల మీద క్లాసులు పీకుతున్నారు" అని వాపోయింది .


అయ్యోపాపం మేము జాలిగా చూసాం."ఇదిగో ఇప్పుడే చెపుతున్నా .రేపు మీ అమ్మావాళ్ళు సినిమాకి తీసుకు వేళతారుగా ..ఏం సినిమాకి వెళదాం అనగానే నేను గీతాంజలి గీతాంజలి అంటాను .మీరు కూడా గీతాంజలి గీతాంజలి అనండి .పిల్లలం అందరం ఒక్క మాట మీద ఉంటే తప్పకుండా తీసుకువెళతారు అర్ధం అయ్యిందా!!!లేకపోతే మీతో అస్సలు మాట్లాడనే మాట్లాడను " అంది.సరే అంటే సరే అన్నాం.ప్రొద్దున్న అనుకున్నట్లుగానే అమ్మా వాళ్ళు సావిట్లో సమావేశం అయ్యారు .ఏ సినిమాకి వెళదాం అంటుండగానే మేము గీతాంజలి కి వెళదాం అని అరిచాము ."గీతాంజలియా అదేవరిది?" పెద్దమ్మ అడిగింది . "నాగార్జునది అక్కా .. నాగేశ్వరరావు కొడుకు ...చాలా బాగుంటుంది అక్కా వెళదాం" కృష్ణక్క బ్రతిమలాడటం మొదలు పెట్టింది."నాగార్జునా అంటే మజ్ను లో ఏక్ట్ చేసాడు వాడేనా ??? అచ్చే ..కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని రేపోమాపో అన్నట్లు చూస్తాడు వాడా ..వాడేం బాగుంటాడే" ఒక పిన్ని మొదట్లోనే వద్దనేసింది.పాపం ఇదేదో చెప్పాబోతుంది కరెక్ట్గా ఇంట్లోకి ఎంటర్ అయ్యారు దుర్గన్నయ్యా(మా పక్కింటబ్బాయి), మా ఆఖరుచిన్నాన.. ఏంటి వదినా ???అనుకుంటూ ..

ఏమి లేదు మహేషూ! గీతాంజలి సినిమా అంట ఎలా ఉంది ?కొత్త సినిమా కదా టిక్కెట్లు దొరుకుతాయా? మా అమ్మ అడిగింది." అజ్జి బాబోయ్ వదినా గీతాంజలి సినిమాయా ?ఆ సినిమా చూడాలని ఎలా అనిపించింది ?ఇదేనా చెప్పింది "అన్నాడు కృష్ణక్క ను చూస్తూ.."ఇదిగో బావా ఇప్పుడే చెపుతున్నాను మధ్యలో వస్తే మర్యాద దక్కదు జాగ్రత్త "కృష్ణక్క తర్జని చూపిస్తూ వార్నింగ్ ఇచ్చింది. "నువ్వు నోరుముయ్యి" ...వదినా నా మాట విను .దాని అంత పరమ చెత్త సినిమా ఇప్పటివరకూ ఎవరూ తీయలేదంట .దియేటర్ మొత్తం ఖాళియే అంట .బయటకు వచ్చాకా ఇద్దరు ముగ్గురికి వాంతులు కూడా అయ్యాయంట ..తరువాత మీ ఇష్టం" అన్నాడు చిన్నాన .."వాళ్లకు కూడా నీకులాగే తిన్నది అరిగి ఉండదు ..అక్కా నువ్వు గాని ఈ సినిమాకి తీసుకు వెళ్ళకపోతే నేను ఇంక మీ ఇంటికి రాను.. ఇప్పుడే బట్టలు సర్దుకు వెళ్ళిపోతా" బెదిరించేసింది ఇది.. "మరేం పర్లేదు నేను దగ్గరుండి బస్ ఎక్కిస్తాను .ఆల్రేడి చంటిగాడికి ఫోన్ చేసే వస్తున్నాను .నువ్వు దిగగానే చూపిస్తాడు అసలు సినిమా నీకు" అన్నాడు తను కూడా తగ్గకుండా... "పోనీలే మహేషు ..ఎప్పుడో సంవత్సరానికోసారి వస్తుంది ..నువ్వు కరెక్ట్గా చెప్పు విషయం " మరో పిన్ని సమర్ధించింది క్రిష్ణక్కను ..." వదినా నా మాటలు నమ్మడం లేదుకదా...ఇక లాభం లేదు..అరే నువ్వు సినిమా స్టోరీ చెప్పరా వీళ్ళకు" అని అన్నయ్యను వైపు చూసాడు.


"ఏమీ లేదు పిన్ని.., హీరోకి, హీరోయిన్ కి భయంకరమైన రోగాలు ...అయినా ప్రేమించుకుంటారు..ఎవరు ముందు పోతారో అని ఇద్దరు భయపడి చస్తూ ఉంటారు .చివరకి హీరోయిన్నే ముందు మంచం ఎక్కేస్తుంది .చివరకు ఏమవుతుందో వెండితెరపై చూడాలి ..అదీ స్టోరి అని మా వైపు చూసాడు..అప్పటివరకూ గీతాంజలి గీతాంజలి అని గేంతులేసిన నేను, హేమక్కా స్టోరీ వినగానే దెబ్బకి సైలెంట్ .మావాళ్ళందరూ " ఛీ ఇదేం స్టోరీయే ఇంకా నయం దీని మాటలు పట్టుకుని వెళ్లాం కాదు "అని అప్పటికప్పుడు అది వెక్కి వెక్కి ఏడ్చినా సరే పట్టించుకోకుండా ముక్కు పుడకో ,మూడు ముళ్లో మొత్తానికి తీసుకు వెళిపోయారు . . అలా గీతాంజలి సినిమా మొదటి సారి చూడటం మిస్ అయిపొయింది.:)


మళ్లీ రెండేళ్ళకో, మూడేళ్ళ తరువాతో మరి ఒక సారి మా స్కూల్లో నేను ,స్వాతి సీరియస్ గా మా వెనుక బెంచ్ లో కబుర్లు చెప్పుకుంటుంటే శ్రీను వచ్చాడు .(ఈ శ్రీను ఎవరంటే ఒక సారి ప్రేమ కధలు పలురకాలు పోస్ట్ వేసా చూడండి అందులో నాకు గ్రీటింగ్ ఇచ్చాడు చిన్నపుడు అని చెప్పానే ...వాడన్న మాట ) "ఏంటి శ్రీను నిన్న రాలేదే స్కూల్ కి "అన్నాం ఇద్దరం. 'గీతాంజలి సినిమా మళ్ళీ వచ్చింది చూడటానికి వెళ్లాను 'అన్నాడు .నాకు వెంటనే గత చరిత్ర గుర్తొచ్చి .."ఛీ !ఆ సినిమాయా అస్సలు బాగోదంటగా" అన్నాను."ఎవరు చెప్పారు?? నాలుగోసారి తెలుసా నేను చూడటం "అన్నాడు ..."మా అన్నయ్య చెప్పాడు సినిమా ఏం బాలేదని" అన్నాను నేనూ ఒప్పుకోకుండా.."అదీ అలా చెప్పు అన్నయ్యలకు ఇలాంటి సినిమాలు నచ్చవులే" అన్నాడు తాపీగా . నాకు, స్వాతి కి అదేదో పజిల్లా అనిపించింది ".ఏం ఎందుకని " ???ఒకేసారి అడిగాం .వాడు అటుఇటు చూస్తూ "అందులో ఒక భయంకరమైన పాటుంది "అన్నాడు మెల్లగా.."ఏం హర్రర్ సినిమాయా??" అన్నాను అనుమానంగా.."కాదు కాని అమ్మాయిలు చూడకూడదు" అన్నాడు సీరియస్సుగా.. వెంటనే మా స్వాతిదానికి కోపం వచ్చేసింది ..అమ్మాయిలను తక్కువ చేస్తే అది అసలు భరించలేదు.....అంటే.. అబ్బాయిలు చూడచ్చా???అమ్మాయిలు మాత్రమే ఎందుకు చూడకూడదు ???ఒక్క అరుపు అరిచింది .."ఎందుకంటే ..ఎందుకంటే.... అమ్మాయిలు చిన్నపిల్లలు కాబట్టి ..అందుకే చూడకూడదు" అనేసి ఎందుకొచ్చిన గొడవనుకున్నాడో అక్కడినుండి వెళ్ళిపోయాడు ..ఈ లాజిక్ ఏమిటో ఎంత బుర్ర గోక్కున్నా అర్ధం కాలేదు ఇద్దరికీ ..


ఆ తరువాత రెండు రోజులకు నేను మా ప్రక్క వీధిలో ఉండే చిన్న అమ్మమ్మ ఇంటికి వెళ్లాను ..వాళ్ళ పెద్ద అమ్మాయి భావనక్కా నేను ఒక జట్టు... అది కూడా వరుసకు పిన్నే అవుతుంది కాని అక్కా అనే అంటాను ...తనకి సినిమాల పిచ్చి..కాని తన ప్రత్యేకత ఏమిటంటే సినిమా దియేటర్ లో చూడటం కంటే దాని దగ్గర స్టోరీ వింటే భలే ఉంటుంది. అదేదో సినిమాలో శ్రీ లక్ష్మిలా టైటిల్ నుండి మొదలుపెట్టి మాటలు, పాటలు ,దుస్తులు తో సహా భలే చెప్పేది.. " నిన్నోచ్చా అక్కా నువ్వు సినిమాకి వెళ్ళా వంట కదా "అన్నాను బుద్దిగా కూర్చుని వినడానికి రెడి అయిపోతూ.."ఆ ..గీతాంజలికి వెళ్లాను ...మీ అమ్మమ్మకు చెప్పకే.. ఇది మూడో సారి చూడటం" అంది గుస గుసగా ...ఎటు చూసినా అందరూ గీతాంజలి గీతాంజలి అంటుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసేసింది.పైగా మూడు సార్లు, నాలుగు సార్లు అని పోటీలు పడి చూస్తున్నారు.."అక్కా.. సినిమా ఏమి బాగోదంటగా ..వాళ్ళిద్దరికీ బోలెడు రోగాలు అంటగా " అన్నాను నేను విన్న లోపాలు వినిపిస్తూ.."నీ మొహం... ఎవరు చెప్పారు ... డిఫరెంట్ లవ్ స్టోరీ ..అసలు నేను చిరంజీవి సినిమాలు తప్పించి ఇంకో సినిమాను పొగడటం చూసావా? అలాంటిది నేనే మూడు సార్లు చూసానంటే ఆలోచించు" అంది ..సర్లే గాని నాకు స్టోరీ చెప్పు అన్నాను ఆసక్తిగా మొహం పెట్టేసి ..."మొహం చూడు ..కొన్ని సినిమాలు చూడాలిఅంతేనే వింటే మజా ఉండదు ..ప్రొద్దున్న లేస్తే గీతాంజలి డ్రెస్సులు వేసి అటు ఇటు తిరిగేస్తూ ఉంటావు ..దాని కోసమైనా సినిమా చూడాల్సిందే" అంది ..అప్పట్లో గీతాంజలి డ్రెస్ లు ,ప్రేమ పావురాలు డ్రెస్ లు అని ఏం సినిమా వస్తే అవి తెగ కోనేసేది అమ్మ .." మరీ... మరి ఏదో భయంకరమైన పాట ఉంటుంది అటగా " అన్నాను భయంగా ..." ఆ ... పాట అంటావా ...ఊ ..చిన్నపిల్లలు చూడకూడదులే మరి "అంది మెల్లగా ...


అందరూ చిన్నపిలలు చూడకూడదు చూడకూడదు అంటుంటే నాకేమో అదేదో భయం పెట్టేసే పాటేమో అని పెద్ద డవుటు.."మరి పెద్దవాళ్ళు ప్రక్కన ఉంటే చూడచ్చా?' అన్నాను ధైర్యం తెచ్చుకుని..."తిక్కదానా తిక్కదానా ..అసలు పెద్దవాళ్ళతో కూర్చుని చూడ కూడనిదే ఆ పాట ..కానీరా బుజ్జీ ..ఆ సినిమా చూస్తున్నంత సేపూ మనం థియేటర్లో ఉన్నట్లు ఉండదు .యే కొడైకేనాలో ,కులుమనాలియో వెళ్ళిన ఫీలింగ్ వచ్చేస్తుంది ...భలే ఉంటాయిలే లోకేషన్లు ..అసలు ఎవరైనా లోపలికి వచ్చారంటే హీరోకి ఎలా తెలుస్తుంది అనుకున్నావ్..తలుపు తీయగానే లోపలకి పొగలు పొగలుగా వచ్చే పొగమంచును బట్టి వెనుకకు తిరుగుతాడు ...ఆ పర్వతాలు ,ఆ వానా ...ఎంత బాగుంటాయో ..పైగా హీరోయిన్ ఎంత అల్లరి తెలుసా..ఎవరన్నాఅబ్బాయిలు ఏడిపిస్తున్నారనుకో వాడి దగ్గరకు వెళ్లి నువ్వంటే ఇష్టం ..పెళ్లి చేసుకుందామా అని రాత్రి చర్చ్ వెనక్కి రమ్మని చెప్పి .. తెల్ల డ్రెస్ వేసుకుని భయం పెట్టేస్తూ ఉంటుంది"... అని రెండు, మూడు సీన్లు చెప్పి మరీ ఊరిన్చేసింది..అదేంటో నాకు సూపర్ నచ్చేసేయి ఆ సీన్లన్నీ ..ఇక తప్పదు సినిమాకి వెళ్ళాల్సిందే అనుకుని ఎలా? అని ఆలోచిస్తుంటే మా పెద్దక్క కనబడింది..నేనూ, అది చిన్నప్పటి నుండి ఒకే స్కూల్ ఒకే కాలేజ్ ..అందుకే మా అక్కకంటే దానితోనే నేను ఎక్కువ ఉండేదాన్ని..


"హేమక్కా గీతాంజలి సినిమా అంట..చాలా బాగుంది అంటక్కా" ..అన్నాను దాని ప్రక్కనే చేరి.".అవునంట నా ఫ్రెండ్ కూడా చెప్పింది" అంది .."అయితే పెద్దమ్మను అడగచ్చుగా "అన్నాను ఉత్సాహంగా."ఎవరూ.. మీ పెద్దమ్మా !! కూతురని కూడా చూడదు.. చెప్పుతీసుకుని కొట్టేస్తుంది ..మొన్నేగా ఇంగ్లీష్ ,మేత్స్ మళ్లీ తన్నేను.. రోజు తలుచుకుని ,తలుచుకుని అక్షింతలు వేస్తుందే బాబు ..ఇప్పుడుగాని సినిమా అంటే ఏకంగా తలంబ్రాలే నాకు ..నువ్వే మీ అమ్మను అడగచ్చుగా " అదే సలహా నాకు పడేస్తూ అంది.. "హూం పెద్దమ్మ కనీసం తాలంబ్రాలతో ఆగిపోతుంది ..మా అమ్మ అస్సలు మొహమాట పడదు నాన్నకు చెప్పి దగ్గరుండి మరీ ఆకాశంలో అరుంధతి నక్షత్రం తో సహా చూపించిగాని వదలదు "నిట్టూర్చాను నేను. "పోనీ.. మీ అక్క చేత చెప్పిస్తే?? ..మన ఇంటి మహారాణి కదా...అది తందనాన అంటే తానతందనాన అంటారుగా అందరూ .. అందులోనూ మొన్న ఫస్ట్ క్లాస్ కూడా వచ్చింది" తప్పకుండా ఒప్పుకుంటారు అంది ..".ప్లిచ్ ..వాళ్ళు ఒప్పుకున్నా ఇది ఒప్పుకోవద్దూ ..దానికి మదర్ ధేరిసా...మేరీ మాత..పరలోక ప్రభువు లాంటి సినిమాలు తప్ప ఇంకేవి నచ్చవు ..తిరిగి మనకు క్లాస్ పీకుతుంది" అన్నాను నిరాశగా .."నిజమేనే బాబు మొన్న షాప్ కి తోడు రమ్మంటే దారంతా బైబిల్ చదివి వినిపించేసింది..మరి ఇంకేం చేద్దాం? పోనీ మా అమ్మను నువ్వు, మీ అమ్మను నేను బ్రతిమాలుకుంటే ?"కళ్లెగరేసింది ... అంతే ఆ సాయంత్రం నుండి మరుసటి రోజు ప్రొద్దున్న వరకూ పెద్దమ్మా పెద్దమ్మ పెద్దమ్మా ..పిన్ని పిన్ని పిన్ని అంటూ మా వాళ్ళ చుట్టూ ప్రదిక్షణాలు చేసి మరుసటి రోజు మధ్యాహ్నం కల్లా దియేటర్లో కూర్చోపెట్టాం..


సినిమా మొదలైంది ...హీరోయిన్ ఎంటర్ అయ్యేవరకూ అబ్బో సూపరు ... ఉన్నట్లుండి హీరోయిన్ ఒక అబ్బాయిదగ్గరకు వెళ్లి లేచి పోదామా అనేసరికి నాకు, మా అక్కకు నూట రెండు ..."ఇదేం సినిమాయే బాబు ..వాడేమో పెద్దా చిన్నా తేడా లేకుండా ఐ లవ్ యూ చెప్పేస్తున్నాడు .ఇదేమో ఏకంగా లేచిపోదామా అంటుంది..చితక్కోట్టేస్తారేబాబు మనోళ్ళు " ...నన్ను గిచ్చేస్తూ చెవిదగ్గర గుసగుసగా అంది ..ఇస్స్ ..అబ్బా ..నాకు మాత్రం ఏం తెలుసు ..చేతిని రుద్దుకుంటూ ప్రక్కకు తిరిగి చూసేసరికి మా అమ్మ నా వైపు కొరకొరా చూస్తూ కనబడింది. గొంతు తడారిపోయింది .".అంటే అమ్మా ...అదినిజంగా లేచిపోదామని పిలవదమ్మా..ఉత్తుత్తినే అలా ఏడిపిస్తుంది అంతే "అన్నాను బలవంతంగా నవ్వుతూ... "నోర్ముయ్ ..ఇంకోసారి ఆ మాట మాట్లాడావంటే కాళ్ళు విరక్కోడతాను "మా అమ్మ ఘాట్టిగా వార్నింగ్ ఇచ్చేసే సరికి సైలెంట్ అయిపోయాను ..ఈ లోపల "నంది కొండ వాగుల్లోనా "పాట మొదలైంది .."అక్కా .. ఈ పాటేనేమోనే చాలా భయంకరంగా ఉంటుంది అంట "అన్నాను ఒక చేత్తో దాని చెయ్యి గట్టిగా పట్టేసుకుని ...ఎహే వదులు పిరికిదానా ..దీనికే భయపడిపోతారా ,,అది విసుక్కుంటూ సినిమా లో లీనమైపోయింది...నేను మాత్రం బోలెడు భయపడిపోవాలని ముందే ప్రిపేరైపోయాను కాబట్టి చెవులు మూసేసుకుని,కళ్ళు మూసేసుకుని మధ్య ,మధ్యలో చూస్తూ ఎలాగోలా పాట అయ్యింది అనిపించాను.. ఏంటో అంత భయపడిపోయారు పిచ్చి మొహాలు ..మామూలుగానే ఉంది కదా అని తెగనవ్వేసుకున్నాను కాని సినిమా సగం అయ్యాకా మొదలైన" ఓం నమః" పాట చూసాక గాని అర్ధం కాలేదు వాళ్ళు అలా ఎందుకన్నారో..



'అయ్యబాబోయ్ బుజ్జోయ్ ..వీడెవడే పాట అంతా అదే సీను చూపిస్తున్నాడు.. వద్దు వద్దన్నా తీసుకొచ్చాం కదా ..ఈ రోజు రాత్రి ఇంటి దగ్గరమనకి సామజవరగమనే ...మీ పెద్దమ్మ నన్నేనా చూస్తుంది?" అంది మెల్లిగా .."ఊ ..నిన్నే చూస్తుంది ..మరి మా అమ్మో ?"అన్నాను భయం భయంగా .."మీ అమ్మ నిన్ను చూస్తుంది కాబట్టే మా అమ్మ గురించి అడిగాను ..అంతా నీవల్లే ..రేపటి నుండి నాతో మాట్లాడకు "అంది కోపంగా .."నన్నంటావేంటి..నువ్వు కూడా బాగుంది అనే కదా అన్నావు "నేను ఏడుపుమొహం పెట్టేసాను..పాట అయ్యేంతవరకూ ఇద్దరం వంచినతల ఎత్తితే ఒట్టు .. కాసేపు ఇంటిదగ్గర మాకు జరిగే సన్మానం తలుచుకుని భయపడ్డాను కాని కొద్దిసేపటికే మళ్లీ సినిమాలో లీనమైపోయాను..నిజంగా నాకు ఆ సినిమా ,స్క్రీన్ ప్లే ,లోకేషన్లు ,డైలాగ్స్ అన్నీ పిచ్చ పిచ్చ గా నచ్చేసాయి...సినిమా చూసిన వారం రోజులవరకూ ఆ సీన్లన్నీ కళ్ళ ముందే కనబడేవి..మొత్తానికి సినిమా అయిపోయింది .


మేమిద్దరంటెన్షన్ టెన్షన్ గా మా వాళ్ళ వెనుకే హాల్ బయటకు వచ్చేసాం ...అప్పుడు చూసాం ...మొత్తం మా బేచ్,బేచ్ కళ్ళు అన్నీ ఎర్రగా ఉబ్బిపోయి ఉండటం." ఆ పిల్ల ని చంపేస్తాడేమో అని భయపడిపోయాను " పెద్దమ్మ కళ్ళు ఒత్తుకుంటూ అంటుంది.."అంతే అక్కా మంచివాళ్ళకే దేవుడు అలాంటి కష్టాలు పెడతాడు "అని ముక్కు ఎగబీలుస్తూ మా అమ్మ. "కాని అక్కా ....అమెరికాలోని ఇలాంటి జబ్బులకు బోలెడు మందులు ఉంటాయంటకదా ??/అవి వేస్తే ఆ పిల్లకు తగ్గదంటావా?పిన్ని డవుటు.. ఆ రోగానికి మందులే లేవని వాళ్ళ నాన్న చెప్పాడుగా మరో పిన్ని నిరాశ... "ఎందుకు తగ్గదూ ..మొన్న మా వూర్లో అక్కా ఒక ఆవిడకు ఇలాగే ,,,,,,," అంటూ బోలెడు కధలు ...


హమ్మయ్యా బ్రతుకు జీవుడా అనుకుని ఊపిరి పీల్చుకుని ఇంటికొచ్చేసాము :)

6, డిసెంబర్ 2010, సోమవారం

అంచేత విషయం ఏమిటంటే

చదువుకునేటప్పుడు అర్ధశాస్త్రం లో క్షీణోపాంత ప్రయోజన సూత్రం అని ఒక పాఠం ఉంది ... దాని ప్రకారం ఏదైనా ఒక వస్తువు మనకు గరిష్ట స్థాయిలో లబించినట్లయితే దాని నుండి వచ్చే ప్రయోజనం క్రమంగా క్షీణిస్తూ ఉంటుంది ...ఉదాహరణకు (మీరు దీనంగా చూసినా ,కోపంగా చూసినా నేను వదిలే ప్రసక్తి లేదు ... అసలే నాకు గుర్తున్న ఒకే ఒక పాఠం అది.. తప్పదు మర్యాదగా వినండి ).. మనకు ఆకలేసినపుడు తిన్న మొదటి యాపిల్ నుండి మనకు లభించు ప్రయోజన మొత్తం ను వరుసగా తిన్న 5 వ యాపిల్ పండుతో లభించు ప్రయోజన మొత్తం తో పోల్చి చూసిన యెడల అది క్రమముగా క్షీనించును ...


అయ్యబాబోయ్ అలా కంటి చూపుతో చంపేసే కార్యక్రమాలు ఏవీ పెట్టుకోకండి ... అసలే మా ఆయనకు నేను ఒక్కదాన్నే పెళ్ళాన్ని..మీరు ఆవేశ పడకండి ... నేను వేరే టాపిక్ మార్చేస్తున్నా కదా..... సరే ఎప్పుడూ నా విషయాలేగా చెప్పుతున్నా... ఈ రోజు మా పిల్లల గురించి చెప్పేద్దాం అని డిసైడ్ జేసినా..ప్రపంచం లో బిన్న ద్రువాలు రెండే రెండు ..ఒకటి నేను-మా ఆయన ...రెండు మా అబ్బాయి -మా అమ్మాయి ...ఒక్కటంటే ఒక్క అభిప్రాయం మాకు ఏ కోశానా కలవదు... ఏదో విజాతి ద్రువాలు ఆకర్షించుకుంటాయి అనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఇలా ఒక చూరు క్రింద బ్రతెకేస్తున్నాం గాని లేకపోతేనా ...ఎందుకులెండి..



మా పాప.. ఇప్పుడు నాలుగు చదువుతుంది (తప్పు .. మీరలా అలా నా వయసు లేక్కవేయకండి.. కళ్ళు డాం అని పేలిపోతాయి.. ) దానికి అన్నీ నా పోలికలే (ట) రూపం లో మాత్రమే... ఒక్క లక్షణం నాది రాలేదు.. ఎంచక్కా నేను అయితే నిమిషానికి ౬౦ పదాల స్పీడ్ తో మాట్లాడుతానా....అది మాత్రం మహా సైలెంట్... ఎప్పుడూ ఒక బుక్ ముందేసుకుని కూర్చుంటుంది..అలా చదువుతూనే ఉంటుంది ... చదువుతూనే ఉంటుంది ...ఏమి దొరకక పొతే టెలిఫోన్ డైరెక్టరి కూడా చదివేసే రకం..ఇంకా డ్రాయింగ్ బాగా వేస్తుంది.. రెండు సార్లు ఇక్కడ తెలుగు సమాజం నిర్వహించిన పోటీల్లో ప్రైజ్ తెచ్చేసుకుంది కూడా... అయితే మా మేడం మాట్లాడితే మాత్రం అన్ని పంచ్ డైలాగ్స్ నే ...

ఓ రోజు నేను సీరియస్ గా ఫ్రెండ్ తో బాతాఖాని కొడుతున్నా .. నా దగ్గర కొచ్చి ఏదో డౌట్ అడిగింది వెంటనే విషయం వినకుండా నాకు ఇంగ్లిష్ రాదు అమ్మా ...డాడీని అడుగు అన్నాను ... నీకు 60 % ఇంగ్లీష్ వచ్చమ్మా 40% రాదు... వచ్చిన 60 % గురించి ఆలోచించవు రాని 40% మాత్రం గుర్తు చేసుకుంటావ్ అంది .. అప్పటి నుండి ముందు ప్రశ్న విని నాకు రాకపోతే రాదు అని చెప్పడం అలవాటు చేసుకున్నా...

ఇంకోసారి ఒక ఫ్రెండ్ నువ్వు పెద్దయ్యాకా ఏమవుతావమ్మా అంది..మా మేడం టక్కున టీచర్ అంది ...ఆవిడ కాసింత వికారం గా మొహం పెట్టి టీచర్ యా ..అలా అనకూడదు ఎంచక్కా కలెక్టర్ యో, డాక్టరో అవుతాను అని చెప్పాలి అంది ....ఇది వెంటనే డాక్టర్ కి ,కలెక్టర్ కి టీచరే కదా ఆంటీ చదువు చెప్పాలి అంది...ఆ ఫ్రెండ్ పాపం మళ్లీ మాట్లాడలేదు..

ఒక్కో సారి మనకు బాగా తిక్క తిక్కగా ఉన్నపుడు చిన్న తప్పు చేసినా దభ దభా నాలుగు వేసేస్తూ ఉంటాను ... పోనీ తన్నిన దాన్ని తన్నినట్లు నోరుమూసుకుని ఉంటానా నైట్ అవ్వగానే అది పడుకుంది అనుకుని ..ఏంటో పాపిష్టిదాన్ని కొట్టేశాను అనవసరం గా ..అని తెగ బాధ పడిపోతూ మా ఆయనకు నా మీద నాలుగు అక్షింతలు వేసే మాహద్భాగ్యాన్ని కల్పిస్తానా !! అప్పుడు తీరిగ్గా కళ్ళు తెరిచి ప్రొద్దున్న నువ్వు కొట్టినపుడే తెలుసు రాత్రి ఈ ప్రోగ్రాం పెడతావని...అందుకే నిద్రపోలేదు ..ఇక పడుకో అని చెప్పి పడుకుంటుంది..


ఇక మా అబ్బాయి..వీడు అచ్చం గా అమ్మ కూచి ...అంటే అమ్మ చెప్పినట్లు వాడు వినడు ..అమ్మే వాడు చెప్పినట్లు వినాలి..వీడి గురించి ఒకటి రెండు వ్యాఖ్యాల లో చెప్పడానికి కుదరదు ఏకంగా గ్రంధాలు రాసేయాలి..ఏదో ఒక మేరగా చెప్పడానికి ప్రయత్నిస్తాను..
ఏం ముహార్తనా మా అమ్మ వీడికి పవన్ అని పేరు పెట్టిందో అసలు కుర్రాడు సార్ధక నామదేయుడు అయిపోయాడు.. ఇప్పటికీ మా తోడికోడలు అంటూనే ఉంటుంది అక్కా వీడు గోడలు,కుర్చీలు,టేబుళ్ళ పై కాకుండా నేల మీద నడుస్తుండగా చూడాలని ఉంది అని.. ...

పేరెంట్స్ మీటింగ్ వచ్చిందంటే చాలు మా ఆయన నేను ఎంత బ్రతిమాలినా జాలి పడకుండా వాడిని నాకు అప్ప చెప్పేసి మా అమ్మాయిని తీసుకుని వాళ్ళ స్కూల్ కి వెళ్ళిపోతారు.. ఆ టీచర్ ఎంచక్కా దాన్ని పొగుడుతుంటే ఈయనగారు హప్పీగా వింటారు..ఇక మా వాడిని తీసుకుని వాళ్ళ టీచర్ దగ్గరకు వెళ్ళుతుంటేనే నాకు... విన్నావా యశోదమ్మా మీ చిన్ని కృష్ణుడు చేసిన అల్లరి చిల్లరి పనులు అని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ దారంతా వినబడుతూనే ఉంటుంది.. గుమ్మం లో అడుగు పెట్టేసరికి ఒక అర బస్తా ఫ్రెష్ గడ్డి రెడీగా పెట్టుకుని వాళ్ళ టీచర్ నాకోసం చూస్తూ ఉంటుంది .. నేను వద్దు వద్దు అని ఎంత మొత్తుకున్నా కొసరి కొసరి తినిపిస్తూ.. అసలు మీ అబ్బాయి ఏం చేసాడో తెలుసా ..నిన్న వాడి ఫ్రెండ్ తూజా గాడితో కలిసి గోడల నిండా పెయింట్ పూసాడు.. మొన్న జరీనా నోట్ బుక్ చిన్చేసాడు.. అంతకు ముందు షర్ట్ విప్పేసి నేల మీద పడుకున్నాడు.. క్లాస్ అయ్యేవరకూ నిన్చోపెడతా అంటే రైట్ సైడ్ నా లెఫ్ట్ సైడ్ నిన్చోనా అన్నాడు.. అస్సలు భయం లేదు.. మొన్న బోర్డ్ మీద యాపిల్ అని అందంగా రాయమంటే అరగంట A చెరిపి రాస్తూనే ఉన్నాడు.. ఎందుకురా అలా చెరుపుతావు అంటే అది అందంగా రావడం లేదు ..వచ్చేవరకూ అలా చేరుపుతా అన్నాడు..ఇలా ఒకటా ..రెండా... ఇంటి కొచ్చి డబ్బాడు అమృతాంజన్.. సీసాడు నవరత్న కేశ తైలం తలకు రాస్తే గాని ఆ సంఘటన ఎఫ్ఫెక్ట్ తగ్గ లేదు నాకు..

ఇక మా అమ్మాయి చక్కగా ఇంగ్లిష్, తెలుగు మాట్లాడుతుందా.. వీడిది సంకర జాతి బాష ..అంటే సింగ్లీష్ అనుకునేరు..ఎక్కువగా ఫ్రెండ్స్ తో ఇంగ్లిష్ లో మాట్లాడి మాట్లాడి ఇంట్లో కన్ప్యూజ్ అయిపోతూ ఉంటాడు.. మమ్మీ , ఇఫ్ నేను లంచ్ ఈట్ చేస్తే నువ్వు నాకు టూ బొమ్మలు బయ్ చేస్తావా? మమ్మీ నీ స్టమక్ నుండి నేను ఎప్పుడు బోర్న్ అయ్యాను..ఇలా అన్నమాట.. ఒరేయ్ నాయనా మనకసలే భాషా పరిజ్ఞానం మెండు.. నువ్వు పూర్తిగా మున్చేయకురా అని వేడుకున్తూనే ఉంటాను రోజు ..


అదేంటో మా అమ్మాయికి నేను చెప్పే కధలన్నా ,జోల పాటలన్నా ఎంత ఇష్టమో వీడికి అస్సలు నచ్చదు.. వీడికి మూడేళ్ళ వయసులో నిద్ర పోతాడని జోల పాట పాడుతుంటే .. అమ్మా ఆ పాట ఆపితే నేను నిద్రపోతాను అని విసుక్కున్న ఘనుడు వాడు.. అక్కడితో ఊరుకుంటాడా..ఒక్కోసారి వాడికి నిద్రపోయే ముందు కధ చెప్పే మూడ్ వస్తుంది..వెంటనే నేను కధ చెప్తా అంటాడు..ఆ దెబ్బతో మా అమ్మాయి ప్రక్క బెడ్ రూం లోకి ,మా ఆయన హాల్లోకి పారిపోతారు ... ఇక ఆ అంతం లేని కధ అలా సాగుతూనే ఉంటుంది... అది రాత్రి పన్నెండు అవ్వచ్చు ఒంటిగంట అవ్వచ్చ్చు మన అదృష్టం మరీ పండితే తెల్లవారు జాము ౩ అవ్వచ్చు ... అలా చెప్పుతూనే ఉంటాడు.. మధ్య మధ్యలో వాడికి డౌట్ వచ్చినప్పుడల్లా ప్రశ్నోత్తర కార్యక్రమాలు నిర్వహిస్తాడు ... నేను గాని సరిగ్గా సమాధానం చెప్పలేదో ఇక కొంప కీకీకారణ్యం మే ....

పైగా వీడికి తెలివి తేటలు అపారం.. ఓ మారు సీరియస్ గా వచ్చి అమ్మా డేనియల్ వాళ్ళ డాడీ డేనియల్ కి ఒక psp వాళ్ళ అక్క కి ఒక psp ,రియాన్ కి ఒక psp కొన్నారు తెలుసా అన్నాడు.. అది బోలెడు ఖరీదు ..మన దగ్గర అంత డబ్బు లేదు .. ..తప్పు నువ్వు అలాంటివి అడగకూడదు అన్నాను..అప్పటికి వాడు సైలెంట్ అయ్యేసరికి శభాష్ అని నన్ను నేను తెగ మేచ్చేసుకున్నానా.. సాయంత్రం మా ఆయన ౪౦౦$ పెట్టి కొన్న psp తో రెడీ..ఇదెందుకు కొన్నారు ఇప్పుడు అని కయ్ మనగానే ... మద్యాహ్నం ఫోన్ చేసి డాడీ డేనియల్ వాళ్ళ డాడీ రిచ్ కదా వాళ్ళ పిల్లలికి psp కొన్నారు ..నువ్వు బాగా పూర్ వి కదా నువ్వు మాకోసం ఏమి కొనలేవు కదా వద్దులే డాడీ అన్నాడంట .. ఇంకేంటి సీన్ కట్ చేస్తే మా ఆయన రాత్రి నాకు క్లాస్ ..నా చిట్టి తండ్రి గాడి మనసులో నన్ను తక్కువ చేసేస్తావా దుర్మార్గురాలా అని..

ఇక వెటకారం లో వాడిని మించినవాడు ఉండడు..ఒక్కో సారి నాకు ఉన్నట్లు ఉండి జ్ఞానోదయం అవుతూ ఉంటుంది లెండి ... అలా ఒక శుభ ముహుర్తానా మా అమ్మాయిని ,అబ్బాయిని పిలిచి... నాకు అమ్మా అని పిలిపించు కోవడం ఇష్టం చిన్నపుడు అలాగే పిలిచేదానివి.. ఎలా అలవాటు అయ్యిందో మమ్మీ అని అనడం .. ప్లీజ్ నన్ను మమ్మీ అని పిలవద్దు ..అమ్మా అనిపిలవారా అని అడిగాను..మా మేడం వెంటనే ఒక ఆవలింత తీసి .. అబ్బా ఏదైతే ఏమిటి మమ్మీ .. ప్రేమగా పిలుస్తున్నాం గా ..ఉన్నట్లు ఉండి ఎలా మారుస్తా అనేసింది..మా వాడు నా వైపు చూసి అమ్మా ,అమ్మా,అలాగే అమ్మా.. అమ్మా ఆకలి వేస్తుంది ఏమైనా పెడతావా అమ్మా... అమ్మా నీ నైటీ చాలా బాగుందమ్మా..అమ్మా క్రిందకు వెళ్లి ఫుట్ బాల ఆడుకోనా అమ్మా ? అమ్మా మంచి నీళ్ళు అమ్మా.. అని ఆ రోజంతా నా చుట్టూ తిరగడం నవ్వడం.. బాబు బుద్ధి తక్కువ అయి అన్నాను .. నీకు నచ్చినట్లే పిలవరా బాబు అనేవరకూ ఎడిపించడమే... కాని ఒక్కటి లెండి ఇద్దరూ నా పార్టీయే ... ముందు అమ్మే కావాలి..మా ఆయన కుళ్ళుతూ ఉంటారు అన్ని నేను కొని పెడుతూ ఉంటే పట్టించుకోరు కాని రోజు బాగా తిట్టే మమ్మీ యే కావాలి మీకు అని..

ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా రాసేయచ్చు.. కాకి పిల్ల కాకి కి ముద్దు కదా.. అదన్న మాటా..సరే మళ్లీ పైన చెప్పిన క్షీణోపాంత ప్రయోజన సూత్రం విషయానికి వద్దాం .. హి హి హి..... నువ్వు ఇక మరచిపోవా అని బెంగ పెట్టేసుకోకండి.. విషయమేమిటంటే నా బ్లాగ్ పుట్టి ఈ నెలకు రెండు సంవత్సరంలు అయ్యింది...( మీరు చప్పట్లు గట్రా పది నిమిషాల కంటే ఎక్కువ కొట్టొద్దు.. నాకు కూసింత మొహమాటం ఎక్కువ మరి..ఆట్టే ఇట్టాంటివి నచ్చవు )... ఈ రెండేళ్ళల్లో ఏమి రాసానో ఏమి మానానో తెలియదు గాని బోలెడంత అభిమానాన్ని మాత్రం సొంతం చేసుకున్నాను .. అందుకు చాలా గర్వం గాను ఇంకా బోలెడు ఆనందం గాను ఉంది.. నిజానికి ఈ బ్లాగ్ లో నా సొంత డబ్బా తప్పా ఇంకేం రాయలేదు ..దానికి కారణం .. నా విషయాలు అన్ని రాసి మా పిల్లలు పెద్దయ్యాకా మీ మమ్మీ ఆటోబయోగ్రపి అని ఈ బ్లాగ్ లింక్ ఇద్దాం అనుకున్నా..కాని నేను ఊహించనంత ఆదరణ లభించింది..ఇది చాలు నాకు.. ఇంకేం పెద్దగా ఆశలు లేవు..పైన చెప్పిన సూత్రాన్ని అనుసరించి ఈ మధ్య ఎందుకో అంత ఇష్టం గా పోస్ట్లు రాయాలి అనిపించడం లేదు.. అందుకే కొంత గ్యాప్ తీసుకుందాం అనుకుంటున్నా :) (హమ్మయ్యా అని గుండెల పై చేయి వేసుకున్తున్నారా ..అలాంటి పనులు మనసులోనే చేయాలి ..పైకి చేయకూడదు ..అబ్బబ్బా అన్నీ నేనే చెప్పాలి..)నేను అతి మామోలు సగటు అమ్మాయిని..( ఆంటీ మత్ కహోనా) ఇక ఇక్కడ పరిచయ మైన స్నేహితులు, తమ్ముళ్ళు చెల్లెళ్ళ విషయాని కొస్తే ...అక్కా వచ్చే జన్మలో నాకు అమ్మలా పుట్టవా అని ఒకరు, అక్కా ఇంతకు ముందు జన్మలో నువ్వు నా అక్కవేమో, అప్పుడు నిన్ను బాగా చూసుకుని ఉండను ఈ జన్మలో అందుకే దూరం అయిపోయావ్ అని ఒకరు.. అలాగే ఇది పబ్లిష్ చేయద్దు అని తమ విషయాలు అన్ని ఒక స్నేహితురాలిగా భావించి చెప్పుకునే అనేక మంది నేస్తాలు ..ఇక చాలు ..ఒక్కోసారి ఎక్కువ అభిమానాన్ని తట్టుకోవడం కూడా చాలా కష్టం తెలుసా ...

దేవుడి దయవల్ల మీరందరూ హాయిగా ,సంతోషం గా ఉండాలని కోరుకుంటూ
మీ నేస్తం
(కామెంట్స్ పబ్లిష్ చేయడం లేదు ..అవి అన్ని అచ్చం గా నాకే సొంతం )