1, ఆగస్టు 2009, శనివారం

దమయంతి ,హిడింభి పాకం


నాకు వంట చేయడం రాకపోవడానికి కారణం మాది ఉమ్మడి కుటుంభం కావడమే ,చాల్లే అసలు దానికీ దీనికీ లింకేమిటీ అని అనుకుంటున్నారు కదూ ,మరదే ..ఉమ్మట్లో బోలెడన్ని రాజకీయాలు ఉంటాయన్నమాట... మేము గాని వంట చేస్తే అందరూ (ఇంకెవరూ మిగిలిన తోడికోడళ్ళు)మా అమ్మని, అమ్మో చిన్నక్క అదృష్టమే అదృష్టం ..చక్కగా ఆడపిల్లలు అన్నీ చక్క బెట్టేస్తుంటే ఈమె కాలు మీద కాలేసుకుని సీరియల్స్ చూస్తుంది అనేస్తారంట ,అందుకని మమ్మల్ని వంట మాత్రం చేయనిచ్చేది కాదు (మిగిలిన పనులు చేయకపోతే మాత్రం తోలు తీసేసేది)నన్నసలు రానిచ్చేది కాదు వంట గదిలోకి ,నేను పావలా పనికి రూపాయి హంగామా చేస్తానని ..పోనీ తను ఊరెళ్ళినపుడు వండుదామంటే మా పిన్నులు వంతులేసుకునేవారు ఈ సారి నేను చేస్తా మీకు వంట అంటే నేను చేస్తా అని ...లేకపోతే మా అమ్మ దెప్పేయదూ ...అదీ సంగతి ,అయితే వంట చేయడానికి కావలసింది కొంచెం ఇంట్రెస్టు ,బోలెడు ఓపిక ..ఈ రెండూ నాలో యే కొసనాలేవు అది వేరే విషయం ..


అవి నేను ,పెనం మీద దోసె పిండి వేసి గరిటతో ఎడమవైపు త్రిప్పాలా? కుడి వైపు త్రిప్పాలా ?అని తీవ్రంగా ఆలోచించే రోజులు..ఒక సారి మా అమ్మ,అక్క ఊరెళ్ళారు ..ఎప్పటిలాగే పిన్ని వండేస్తుంది కాబట్టి తీరికగా మంచం మీద పడుకుని ఈనాడు ఆదివారం మేగజైన్ చదువుతున్నాను ...మద్యలో వంటల పేజీ వచ్చింది ..నాకు వంట చేయడం రాకపోయినా ఆ వంటకాల పొటోలు చూడటం మహా ఇంట్రెస్ట్ ..అందులో ఒక వంటకం ఫోటొ తెగ నచ్చేసింది ..చూసి పేజీ తిప్పేయచ్చుగా ఎప్పటిలాగే ...అహా ,అది చూడగానే బుద్దుడికి బోధి వృక్షం క్రింద జ్ఙ్ఞానోదయం అయినట్లు నాకు మా మంచం మీద బోలెడంత ఙ్ఞానం వచ్చేసింది ,వంటరాని బ్రతుకు ఒక బ్రతుకేనా అని ఆవేశం గా పిన్ని దగ్గరకు వెళ్ళి పిన్నీ ఈ రోజు వంట నేనే చేసుకుంటా అన్నాను ..వద్దు అంది..కుదరదు అన్నాను..చివరకు తను అన్నం వండటానికి నేను కూర చేయడానికి ఒప్పందం చేసుకున్నాం ..


నాక్కూడా కాస్త పెట్టమ్మా అని వంటకం ఫొటొ చూస్తూ మా నాన్నమ్మ నోట్లో పావులీటర్ నీళ్ళు మింగింది ..ఓ యెస్స్ అని అభయం ఇచ్చేసి కావలసిన పదార్దాలన్నీ సేకరించాను.. చక్కగా ముక్కలు చేసాను ..బాణాలి వేడి చేసాను..ఆ సరికే నాకు విసుగొచ్చేసింది ..అందరూ హాయిగా T.v చూస్తుంటే నాకు ఇప్పుడు వంట చేయడం అవసరమా అనిపించింది..కాని తప్పదుగా, మొత్తానికి వండేసాను ... మా చెల్లి అప్పటికేఅబ్బా ఆకలి ఇంకెంత సేపు అని నస ,నస ..నేను వడ్డించగానే టక్కున కలుపుకుని ,నోట్లో పెట్టుకుని తుపుక్కున ఉమ్మేసింది .. ఛీ ఇదేంటి పిల్లా ఇంత ఛండాలం గా వండావ్..ఇప్పుడు నిన్ను ఎవరు వండమన్నారు..దీన్ని వంట అనరు పెంట అంటారు అని నానా తిట్లు తిట్టి మా పిన్ని వైపు చూస్తూ పిన్నీ కాసింత పెరుగు ,పచ్చడి ఉంటే వేయవా అంది ...అవమానం అవమానం..ఎన్ని మాటలంది గాడిద
అనుకుని మా నాన్నమ్మ వైపు చూసాను ఆశ గా , ఎందుకోనమ్మా ఇందాక నుండి ఒకటే కడుపునొప్పి,ఈ సారి మళ్ళీ వండుతావ్ కదా అప్పుడు తింటాలే అని మెల్లిగా జారుకుంది ..సరే పొండి ఎంచక్కా మొత్తం నేనే తింటా అనుకుని చక్కగా ఒక ముద్ద కలుపుకుని నోట్లో పెట్టుకున్నానో లేదో ప్రొద్దున్న తిన్నదానితో సహా కక్కేసాను.. ఇదేంటబ్బా తేడా ఎక్కడ జరిగింది? అంతా వాడు చెప్పినట్లే కదా చేసాను అని మళ్ళీ బుక్కు ముందెట్టి ఒక్కోటి చదువుతుంటే ఒక చోట కళ్ళు ఆగిపోయాయి ..పెరుగు 1/2 కప్ ,వంట సోడా 1/2 టి స్పూన్ పక్క, పక్కనే రాసి ఉన్నాయి .. అప్పుడు అర్దం అయింది ఎందుకు కక్కుకున్నానో ...


సరే తరువాత, తరువాత కూరలగురించి మా అక్క సింపుల్గా చెప్పిన ఫార్మూలా ఫాలో అయిపోయాను.. వేపుళ్ళంటే తాళింపువేసి కూరముక్కలు వేపి ఉప్పుకారం జల్లడం ..పులుసులంటే తాళింపు వేయకుండా వేపిన ముక్కల్లో చింత పండు పులుసు పోసి మరగ పెట్టడం ..ఇగుర్లంటే చింతపండు పులుసు బదులు నీళ్ళు పోసి ఇగరబెట్టడం ..అంతే సింపులు ...అలా బండి నెట్టుకొచ్చేస్తున్న తరుణం లో మా ఆయనకు నా ప్రశాంతత మీద కన్నుకుట్టింది ..ఒక రోజు రావడం, రావడం బాంబ్ లాంటి వార్త చెప్పారు ,ఏంటంటే మరుసటి రోజు ఫ్రెండ్స్ తో కలసి జూ కి వెళుతున్న సందర్భం గా అందరూ తలో అయిటం తెస్తున్నారు కాబట్టి మా వాటాకు ఆవడలు (మజ్జిగ గారెలు)తీసుకువస్తాం అని చేప్పేసారట .. కాబట్టీ రేపు అవి వండేయ్ అన్నారు చక్కగా ..నాకు తెలుగు వంటల్లో నచ్చని ఒకే ఒకే పదం వడ .. అది వండాలంటే నాకు ధడ ..ఆ పప్పు మిక్సీలో వేసి కొంచెం కొంచెం నీరు వేస్తూ గంట సేపు రుబ్బాలంటే నీరసం వచ్చేస్తుంది ..చాలా సార్లు ఓపికగా రుబ్బి ఆఖరి నిమిషం లో విసుగుతో గబుక్కున నీరు ఎక్కువ వేసి గారెల పిండి కాస్త బూరెల పిండిలా చేస్తాను.. ఆ కారణం చేత నేను అప్పటికి ఒక్కసారి కూడా గారి షేప్లో గారెలు వేయలేదు ..అలాంటిది ఆవడలా!!! ....పోనీ నాకు ఆవడలు చేయడం రాదు అన్నాననుకో ..మా వారు ,నీకు ఆవడలు చేయడం రాదా !!!!!అని ఎనిమిదో వింత చూస్తున్నట్లు ఒక ఎక్స్ ప్రెషన్ ఇస్తారు అది చాలు జీవితం మీద విరక్తి వచ్చేయడానికి..కాబట్టి ఎలాగోలా ఆవడలు చేయడమే బెటర్ అని డిసైడ్ అయిపోయి రాత్రి 12 గంటల వరకూ చా...లా ...ఓపికగా నీళ్ళు ఒక్క చుక్క వేయకుండా గారెల పిండి రుబ్బేసాను ,మొదటి సారి షేప్ ఉన్న గారెలు చేసేసి చిలికిన మజ్జిగలో వాటిని వేసేసి హమ్మయ్యా అనుకుని పడుకుండిపోయా ..

ఆ ప్రొద్దున్న అందరూ ఒక్కో అయిటెం ప్లేట్ లో వేస్తుంటే మన గారెలు డబ్బా వాళ్ళ ముందు పెట్టారు మావారు ,వాటినీ ప్లేట్స్ లో వేసి అందరికీ ఇచ్చింది ఒకామే ..చెంచాతో గుచ్చి తిందామని ఒక సారి నొక్క గానే గారె కాస్తా కప్పలా ఒక్క జంపు జంపి క్రింద పడింది ...తలెత్తి చూస్తే అందరూ ఇంచుమించుగా నా గారెలతో కప్పగెంతులాట ఆడుతున్నారు ... గొప్ప సిగ్గేసేసింది ..మరి నాకు తెలియదు కదా గారెలపిండి లో అసలు నీరు లేకుండా రుబ్బితే అలా రాళ్ళల్లా వస్తాయని.. పాపం అందరూ వాటిని తినలేక ,నా ఎదురుగా వాటిని పడేయలేక నానా పాట్లు పడి నేను అటుతిరగగానే గబుక్కున డస్ట్ బిన్లో పడేసారు..మనమసలే కంత్రీలం ..చూడకుండా ఉంటానా ...

అయితే ఆ దెబ్బకి మా ఆయనకు నా వంట మీద నమ్మకం పూర్తిగా పోయింది ..ఎంత దారుణం అంటే ఒక వేళ నేను వంట బాగా చేసినా, అది నేను చేసాను కాబట్టి అది బాగోదు అని డిసైడ్ అయిఫొయి ఇంకాస్త కారం పడుతుందేమో,ఇంకేదో తక్కువయింది అని ఒకటే వంకలు .. అక్కడితో ఊరుకునేవారా, యే పొరిగింటమ్మ పుల్ల కూర తిన్నా ..నా ఎదురుగానే ఆవిడ ఫలానా కూర సూపర్ వండింది కదా ..ఆవిడని అడిగి నేర్చుకోరాదు అని బోలెడు ఉచిత సలహాలు అన్నమాట ...దాంతో నా వంట మీద నాకే బోలెడంత డవుట్ వచ్చేసేది ..నాకు అస్సలు వంట చేతకాదు అని ..


సరే ఇలాకాదు అని ఒకరోజు చక్కగా చికెన్ బిర్యాని చేసి మా ఆయన రాగానే పక్కింటి ఆవిడ పంపింది అని ఒక ప్లేట్ లో పెట్టి ఇచ్చాను..అదే అనుకున్నా భలే ఘుమ ఘుమలు వస్తున్నాయి అని ఒక స్పూన్ నోట్లో వేసుకుని.. ఆహా,ఎలాగైనా ముస్లింలు ముస్లింలేనే ...బిర్యాని వాళ్ళు చేసినట్లు ఇంకెవరూ చేయలేరు అని ఒక్కో స్పూన్ తెగ ఆస్వాదిస్తూ తిన్నారు ..అమ్మ దొంగ మొహం అని మనసులో అనుకుని ఆయన అంతా తిన్నాకా నేనే చేసాను ఇది, పక్కింటావిడ కాదు అన్నాను గర్వం గా చూస్తూ ...అదేనే మద్యలో డవుటొచ్చింది ఉప్పు కాస్త ,అంటే కొంచెం ఎక్కువగా అనిపించిందేంటాబ్బా అని అన్నారు ప్లేట్ నా చేతికిచ్చి..ఎంత కోపం వచ్చిందంటే, పతివ్రతా శిరోమణిని కాబట్టి బ్రతికిపోయారు కాని లేకపోతేనా ఆ ప్లేట్ పెట్టి నెత్తిమీద టంగు టంగు మని నాలుగు పీకేదాన్ని ....


కొసమెరుపేంటంటే మొన్నామద్య ఫ్రెండ్స్ అందరం కలిసి బింతాన్ వెళ్ళాం ,మిగిలిన వారు అందరూ శాకాహారులు అవ్వడం చేత అక్కడ దొరకదని ఇంట్లో తయారు చేసుకుని వెళదాం అన్నారు ,నన్ను లంచ్ కి సరిపడే తీసుకురమ్మన్నారు ,ఇంచుమించుగా పదిమందికి వండాలన్నమాట ,కాని తప్పదు కదా, దేవుడా నువ్వే దిక్కు అనుకుని అన్నం ,కూరా,పప్పు,పచ్చడి అన్నీ చేసి జాగ్రత్తగా పేక్ చేసి తీసుకు వెళ్ళాను ,వంట చేసినంత సేపూ మా ఆయన ఒకటే నస ..అన్నం మెత్తగా చేసావేమో ,ఇందులో ఏదో తక్కువ అయినట్లుంది,దాన్ని ఇంకొంచం వేపాల్సింది అని...లంచ్ వడ్డించినప్పుడు మహా టెన్షన్ నాకు ,తిన్న వాళ్ళందరూ ఆహా ఎంత బాగున్నాయి,ఏం రుచి అని పొగిడేస్తుంటే నా కళ్ళలో నుండి ఒకటే ఆనంద భాష్పాలు.. వాళ్ళు అలా వాళ్ళ రూంస్ కి వెళ్ళగానే ,నా ఆనందబాష్పాలు ఇంకకముందే మా కుళ్ళు మొహం మొదలెట్టేసారు ,మరీ ఎక్కువ ఫీలయిపోకు ఎవరూ మొహం మీద బాలేదని అనరు అనుకుంటూ ... అప్పడాల కర్ర అనేది ఆడవాళ్ళకు ఎందుకు అవసరమో నాకు తెలిసొచ్చింది అప్పుడు...


కాబట్టి నేను చెప్పొచ్చేది ఏమిటంటే కడవంత గుమ్మడికాయా కత్తి పీటకు లోకువ అని బంగారంలాంటి పెళ్ళాం కత్తిలాంటి మొగుడికి ఎప్పుడూ లోకువే ..అంతే ,అంతే ,అంతే ముమ్మాటికీ అంతే

15, జులై 2009, బుధవారం

అలిగినవేళనే చూడాలి ...


ఎవరన్నారండి ,అలిగితే ఆడవాళ్ళు అందం గా ఉంటారని..నేను ఒప్పుకోను..అలిగినపుడు అబ్బాయిలే చాలా చూడ ముచ్చటగా ఉంటారు (కోపం వచ్చినపుడు కాదు సుమా ,అప్పుడు చంఢాలం గా ఉంటారనుకోండి) ఉబికి వస్తున్న నవ్వును,ప్రేమను భలవంతం గా ఆపేసి సీరియస్సుగా మొహం పెట్టినపుడు చూడాలి అయ్యగారి ముఖారవిందం భలే ఉంటుంది ...మచ్చుక్కి అలాంటి సంఘటన ఒకటి ...


నా ఊహ తెలిసినప్పటి నుండి అమ్మ కుట్టిన బట్టలు లేదా కొన్న బట్టలు వేసుకోవడం తప్ప నాకు నేనుగా బట్టల షాపుకి వెళ్లలేదు ...అదే అలవాటు పెద్దయ్యాకా కూడా వచ్చేసింది ..ఏవో ఒకటి నువ్వెళ్ళి తెచ్చేయమ్మా అనేదాన్ని ... ఆఖరికి పెళ్ళి టైములో కూడా బట్టల విషయం లో అస్సలు పట్టించుకోలేదు ...నాకసలు ఏది బాగుంటుందో ,బాగోదో తెలిసి ఏడిస్తే కదా ..మరి ఎప్పుడు కొందో ,కుట్టించిందో తెలియదు గాని అత్తారింటికి వెళ్ళినపుడు సూట్కేస్ నిండా బోలెడు చీరలు సర్ది ఇచ్చింది అమ్మ..అన్నీ కొత్తవి అయ్యేసరికి రోజుకో కొత్త చీర కడుతూ తెగ మురిసిపోయేదాన్ని అమ్మ సెలెక్షన్ చూసి.. ఆ రోజు కూడా ఉదయం ఇంట్లో పనులన్నీ అయ్యాక తీరికగా బీరువా తెరిచీ ఏం కట్టుకోనబ్బా అని చూస్తుంటే నా దృష్టి నీలం రంగు కాటన్ చీరమీద పడింది..ఆ రంగు,డిజైన్ చూస్తుంటే అబ్బో తెగ నచ్చేసాయి ..మరి నాకు తెలియదు కదా ఆ చీరే మా ఇద్దరి మద్య మొదటి గొడవకి నాంది పలుకుతుంది అని ..


హాయిగా స్నానం చేసి అది కట్టేసుకుని ఆంద్ర జ్యోతి పత్రిక తిరగవేస్తుంటే మా అత్తగారు నా గదిలో కొచ్చారు అమ్మాయ్ ఏం చేస్తున్నావ్ అనుకుంటూ..దెబ్బకు ఒక్క ఉదుటున మంచం మీద నుండి దిగి చెప్పండి అత్తయ్య గారు అన్నాను .. మన పక్క వీధిలో ఫలాన వాళ్ళ అమ్మాయి శ్రీమంతం జరుపుతున్నారు,పేరంటానికి పిలిచారు,ఆవిడ నిన్నూ తీసుకు రమ్మన్నాది తయారవ్వు అన్నారు ...పేరంటం అనగానే మనకి ఉత్సాహం వచ్చేసింది..అసలే కొత్త పెళ్ళి కూతురిని కదా, అందరూ నావైపే చూస్తారు, వాళ్ళకు నచ్చినా ,నచ్చక పోయినా మీ కోడలు బంగారు బొమ్మ అని ఒక పొగడ్త పడేస్తారు కాబట్టి తప్పదు వెళ్ళాలి అనుకుని పదండి అన్నాను ఆవిడ వెనకే వస్తూ .. ఏంటీ ఇలాగా అన్నారు మా అత్తగారు నా వైపు చూస్తూ..కొత్త చీర బాలేదా అనుకుంటూ ఆవిడ వైపు చూసాను ..ఆమెకు నా మనసులో భావం అర్ధం అయినట్లుంది,చీర బాగుంది కానీ,మన వీధిలో అమ్మలక్కలందరూ అక్కడే ఉంటారు ,కొత్తగా పెళ్ళి అయింది కదా ఇలా కాటన్ చీర కట్టుకొస్తే చెవులు కొరుక్కుంటారు నిన్ను తక్కువ చేస్తారు ,కొన్నాళ్ళు పాత బడేవరకు తప్పదు కాస్త ఖరీదైన చీర కట్టుకుని ,నీ నగలేసుకో అన్నారు ..సరే అని బుద్దిగా తల ఊపాను ..

ఆవిడ వెళుతున్న ఆవిడ మళ్ళీ వెనుకకు వచ్చీ ,ఇదిగో ఖరీదయిన చీర అంటేమరీ పట్టుచీర కట్టుకోకు కాళ్ళకు పసుపు రాస్తారు పాడవుతుంది,అందుకని పసుపు అంటుకున్నా పర్వాలేదనిపించే మంచి చీర కట్టుకో అన్నారు... నాకదేదో పజిల్ లా అనిపించింది పాడైనా పర్వాలేదనిపించే మంచి చీర అంటే ఏంటబ్బా అని బుగ్గ మీద వేలుపెట్టుకుని తీవ్రం గా ఆలోచిస్తుండగా అమ్మా,అమ్మా అంటూ మా ఆయన హడావుడి హడావుడిగా వచ్చారు మా దగ్గరకు .. అమ్మా, ఫ్రెండ్ పెళ్ళి ఈ రోజు..విజయవాడ వెళ్ళాలి ఇద్దరం అన్నారు ..ఉన్నట్టుండి ఇదేంటిరా అన్నారు మా అత్తయ్య.. గుర్తులేదమ్మా మర్చిపోయాను ,ఇంకో ఫ్రెండ్ కూడా వెళుతున్నాడు ,క్రింద కార్ లో వెయిట్ చేస్తున్నాడు ,దగ్గరేగా రాత్రికి వచ్చేస్తాం అన్నారు .మరి పేరంటం అన్నారు అత్తయ్య .అబ్బా పెళ్ళిముఖ్యమా, పేరంటం ముఖ్యమా!!! అసలే వాడు నా క్లోజ్ ఫ్రెండ్ ,మొన్న నా పెళ్ళికి కూడా వచ్చాడు, బాగోదమ్మా విసుక్కున్నారు మా ఆయన ..నీ ఇష్టం రా అంతా హడావుడి గా చెప్తావ్ మా అత్తగారు వెళ్ళిపోయారు..


అప్పటివరకూ మా ఆయనవైపూ,అత్తయ్య వైపూ మార్చి మార్చి చూస్తున్న నా వైపు చూసి ఇంక చూసింది చాలు పదండి మేడం అన్నారు ..కాస్త మొహం కడుక్కుని,చీర మార్చుకుని వస్తాను బాబు అని అటు తిరిగానో లేదో ఇంకా నయం బ్యూటిపార్లర్ కి వెళ్ళి మేకప్ వేసుకుని వస్తాననలేదు ,అవతల ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడే అంటే తాపీగా మాట్లాడతావేంటి అని కారు దగ్గరకు బర,బరా లాక్కుపోయారు ..కారులో వెయిట్ చేస్తున్న ఆయన మా ఆయనకు బాగా మంచి ఫ్రెండ్,ఇంతకు ముందే పరిచయం చేయడం వల్ల అతని భార్య నన్ను చూడగానే నవ్వుతూ పలకరించింది ..నేనూ, ఆవిడ,వాళ్ళ పాప వెనుక సీట్లో కూర్చున్నాం..మా ఆయన, అతను ముందు సీట్లో కూర్చుని తెగ మాట్లాడేసుకుంటున్నారు..


నేను ఆవిడ వైపు చూసాను.. చక్కగా ఖరీదైన చీర కట్టుకుని బోలెడు నగలతో పెళ్ళికి ఎలా వెళ్ళాలో అలా వెళుతుంది..నా వైపు చూసుకున్నాను ..ఆవిడ చీర దగ్గర నా చీర బేల మొహం వేసుకుని బిక్కు బిక్కు మని చూసింది ...ఇందాక సూపర్,డూపర్ గా
కనిపించిన చీరలో బోలెడు లోపాలు కనిపించాయి..పైగా మంగళ సూత్రం తప్ప ఒక్కటంటే ఒక్క బంగారు నగ కూడా వేసుకోలేదు ..మా అత్తగారి మాటలు గుర్తు వచ్చాయి ... అసలే పెళ్ళి కొడుకు మా ఆయనకు క్లోజ్ ఫ్రెండ్ అంట ..ఖచ్చితం గా వాళ్ళింట్లో వాళ్ళు నా వైపు చూసి ఈ అమ్మాయి ఇలా వచ్చింది ఏంటీ పెళ్ళికి అనుకుంటారు,అంత దాక ఎందుకూ ఈమె కూడా అలాగే చూస్తుంది అని ఒక్క క్షణం అనిపించింది .కాని గాడిద గ్రుడ్డులే ఆయన గారికి లేని బాధ నాకేంటీ అనుకుని పక్కన ఆవిడతో మాటలు కలిపాను..


మీరూ కూడా పెళ్ళీకేనా అండి అన్నాను.. అవును అంది ఆమె ..నేనసలు ముందు రాకూడదు అనుకున్నాను ,కాని పెళ్ళి కొడుకు మా వారికి క్లోజ్ ఫ్రెండ్, మీ వైఫ్ ని తప్పకుండా తీసుకు రండి అని మరీ మరీ చెప్పారు ఇప్పుడే ఫోన్ చేసి, అందుకే ఉన్నపళంగా లాక్కొచ్చేసారు ఆయన అన్నాను అందం గా అబద్దం చెప్పేస్తూ ..ఎంత వద్దు అనుకున్నా,నేను ఆ చీరతో ఎందుకొచ్చానో చెప్పక పోతే నాకసలు మనసు ఆగడం లేదు..ఆవిడ చిన్నగా నవ్వింది అవునా అంటూ..ఆ ముక్క చెప్పేసాక, నాకు మనసులో భారం తీరిపోయినట్లు అయిపోయి మరి మీవారికి కూడా ఆ అబ్బాయి క్లోజ్ ఫ్రెండేనా అన్నాను ... ఆవిడ నవ్వి మా తమ్ముడేఅంది ..నాకు సౌండ్ లేదు..అయినా తమాయించుకుని ,అయితే మా ఆయన,మీ తమ్ముడూ ఫ్రెండ్స్ అన్నమాట అన్నాను..నాకన్నా బుద్దిలేదు ఆవిషయాన్ని అక్కడితో వదిలేయచ్చుగా ..అబ్బే అలా అయితే అది నేను ఎలా అవుతాను ... ఫ్రెండ్స్ అంటే ,మొన్న ఒక సారి వాడు మా ఇంటికొచ్చినపుడు, మీ ఆయన వచ్చారు మా ఇంటికి, అప్పుడు పరిచయం చేసాను అంది.. నాకు ఒక్క ముక్క అర్ధం కాలేదు ...ఆయన ఏమో క్లోజ్ ఫ్రెండ్ అంటారు.. ఈవిడేమో ఒక సారి పరిచయం చేసాను అంటుంది మరి క్లోజ్ ఎలా అవుతారు???? నేను వెంటనే ఫ్రంట్ సీట్ లో సీరియస్సుగా కబుర్లలో మునిగి పోయిన మా ఆయనను భుజం మీద తట్టీ ఏమండి పెళ్ళి కొడుకు మీకు నిజంగా క్లోజేనా అన్నాను చెవిలో గుస గుస గా... మా ఆయన నా వైపు తిరిగి ఒకసారి నా కళ్ళలో చూసారు సూటిగా... ఆ చల్లని చూపుకి నాకు అర్ధం తెలుసు ...నోరు మూసుకుని కూర్చో అని.. చీ ఏదీ సరిగా చెప్పరు అని తిట్టుకుని కిటికీలో నుండి బయటకు చూస్తూ కూర్చున్నాను.


మరి ఎప్పుడు నిద్ర పోయానో తెలియదు నిద్ర లేచేసరికి ఆవిడ వళ్ళో హాయిగా పడుకుని ఉన్నాను ..గబుక్కున లేచి ఎంత సేపయింది పడుకుని అన్నాను సిగ్గుగా.. ఒక గంట అయిందేమో,వచ్చేసాం ఇంక ఊర్లోకి అంది.. మరి పెళ్ళి ఎపుడూ అన్నాను.. రాత్రి పదిగంటలకు అంది ఆవిడ.. మరి ఇప్పటి నుండీ అప్పటివరకూ ఎక్కడ ఉండాలి అన్నాను దిగులుగా ...నాకు అంతమంది తెలియని జనాలమద్య అప్పటి వరకూ ఉండాలంటే ఇష్టం లేదు అందులోనూ ఈ నలిగిపోయిన కాటన్ చీరతో..నాక్కూడా ఇష్టం లేదు ఇంత తొందరగా వెళ్ళడం.. తను మా సొంత తమ్ముడు కాదు ,వరుసకు తమ్ముడు ,కాస్త దూరం వరసే ..అందుకే పెళ్ళి టైముకు వెళదాం అనుకున్నా కాని మా ఆయన దారిలో ఏదో పని ఉంది అని ముందు గా తీసుకొచ్చెసారు..అది చూసుకుని వెళతాం అంది..


నాకు అసలు ఏం జరుగుతుందో అర్ధం కాలేదు ..తమ్ముడి పెళ్ళికి ముందుగా వెళ్ళడానికే ఈమె సంకోచిస్తుంది .. మేము ఇంత ముందుగా వెళ్ళి ఏం చేస్తాం అనుకుంటుండగా మా పిన్ని గుర్తు వచ్చింది (అమ్మ చెల్లి).. నేనంటే బోలెడు అభిమానం ,మా పెళ్ళి కుదిర్చింది వాళ్ళే ..తను కూడా ఇదే ఊరులో ఉంటుంది ..వెంటనే మా ఆయన్ని పిలిచి ఏమండీ ,మనం మా పిన్ని వాళ్ళింటికి వెళదాం సాయంత్రం వరకూ అక్కడ ఉందాం అన్నాను ఉత్సాహం గా .కాస్త ఆగుతావా, ఇప్పుడు పిన్ని ఇంటికి,పెద్దమ్మ ఇంటికి వెళ్ళడానికి కుదరదు మళ్ళీ వెళదాం అన్నారు చిరాకుగా .. చెప్పక పోవడమే నాకు చాలా కోపం వచ్చింది..ఈయనగారికి వాళ్ళ ఫ్రెండ్స్ తో ఉంటే చాలు ఎదుటివాళ్ళ గురించి అక్కరలేదు తిట్టుకున్నాను... ఇంతలో మా ఆయన ఫ్రెండ్ కారు ఆపి ఎక్కడికో వెళ్ళీ 2 నిమిషాల్లో తిరిగి వచ్చి ఈ రోజు ఆ పని అయ్యేటట్లు లేదు అప్పటి వరకూ ఏం చేద్దాం అన్నాడు ఆమెను చూస్తూ ... ఇప్పుడు ఎలా అంది ఆమె దిగులుగా..నా నోరు తిన్నం గా ఉండచ్చు కదా పోనీ సినిమాకి వెళ్ళండి అని ఒక ఉచిత సలహా పడెసాను ...ఈ సలహా ఏదో బాగుంది మరి మీ ప్లాన్ ఏంటీ అన్నారు అతను మా ఆయనను చూస్తూ ... మా ఆయన సమాధానం చెప్పే అంతలో ఆవిడ అందుకుంది, మీరు మాత్రం పెళ్ళి వరకు అక్కడేం చేస్తారు సినిమా కి మాతో పాటు రావచ్చుగా అని.. మా ఆయన ఫ్రెండ్ ఆక్చ్షర్యం తో నువ్వూ పెళ్ళికి వస్తున్నావా అన్నాడు మా ఆయన వైపు చూస్తూ ...అదేంటీ ఆయన ఫ్రెండ్ కి తెలియదా మేము పెళ్ళికొస్తున్నామని ఈ సారి నాకు అయోమయం గా అనిపించింది ... మా ఆయన నా వైపు సీరియస్ గా చూస్తూ అంటే సాయంత్రం ఒక మారు అలా వచ్చి విషెస్ చెప్దామని అనుకున్నాను అన్నారు ...మరి చెప్పవే, అప్పటి వరకు ఏం చెస్తాం సినిమాకెళదాం అన్నారు అతను.. సినిమాకా ..అదీ అని మా ఆయన నసుగుతుండగానే నేను ఏం సినిమా అయితే బాగుంటుందో లిస్ట్ చెప్పేసాను..


ఇంక అందరం కలిసి సినిమాకి వెళ్ళాం ..నాకు ఆవిడ తెగ నచ్చేసింది ..మా అక్కతో మాట్లాడినట్లుగా చక్కగా ఫ్రీగా కలసిపోయాను సినిమా హాల్ల్ లో కబుర్లు చెప్పేస్తూ ..సినిమా అయ్యాక హాల్ బయటకు వచ్చి మా అవతారాలు చూసుకున్నాం..జర్నీ వల్ల, ఇంకా బయలు దేరి చాలా సేపు అవ్వడం వల్ల జిడ్డు మొహాలతో చెదిరిన జుట్టుతో శ్రీలంక కాందీశీకుల్లా తయారు అయిపోయాము ,నేను అయితే మరీనూ మద్యలో నిద్ర పోయాకదా .... ఆవిడ కార్లో కూర్చోగానే ,ఎక్కడన్నా కాసేపు మొహం కడుక్కుని చీర మార్చుకునే వెసులుబాటు ఉంటే బాగుండును ..ఇలా వెళితే అసహ్యం గా ఉంటుంది అంది .. నాకు వెంటనే మా పిన్ని మళ్ళీ గుర్తు వచ్చింది .. ఇలా అయినా తనను చూసినట్లు ఉంటుంది అని..అందుకే మెల్లిగా ,ఇక్కడ దగ్గరలో మా పిన్ని ఇల్లు ఉంది అక్కడికి వెళదాం ,చక్కగా ఫ్రెష్ అయి వద్దాం అని ఆమెకు కీ ఇచ్చాను.. ఆవిడ చేత చెప్పిస్తే మా ఆయన ఏమి అనలేరు అని నా ప్లాన్..


మొత్తానికి అందరిని మా పిన్ని ఇంటికి బయలు దేరదీసాను .. మా పిన్ని నన్ను చూడగానే ఎంత సంబర పడిపోయిందో ... ఎలా ఉన్నావ్,ఇలా చిక్కిపోయావేంటి ఈ నాలుగు రోజులకే లాంటి పలకరింపులయ్యాక ,మేము ఈ వూరికి ఫలానా వాళ్ళ పెళ్ళికొచ్చాం అని చెప్పాను .. అదేంటే పెళ్ళికి ఇలా తయారయి వచ్చావ్ ..పైగా పెళ్ళి వాళ్ళు ఎంత ఉన్న వాళ్ళో తెలుసా .. మా వూర్లో ని వాళ్ళు తెలియని వాళ్ళు లేరు అంది ..నేను దిగులుగా మొహం పెట్టి ఏం చేయను ఉన్నట్లు ఉండి లాక్కోచ్చేసారు ,అస్సలు ఏమీ తెలియదు అనుకో
తనకు.. మొదటి సారి మా ఆయన మీద కంప్లైంట్ ఇచ్చేసాను..సరేలే మగాళ్ళకు ఏం తెలుస్తుంది ,మనమే మెల్లిగా నచ్చ చెప్పుకోవాలి ..ఒక పని చేయి, రాక రాక వచ్చావ్ మా ఇంటికి ,మీ ఆయనకు మెల్లిగా నచ్చ చెప్పి చూడు , నువ్వు ఇక్కడ ఉండిపో,తను పెళ్ళికి వెళ్ళి వస్తాడు ..తరువాత ఇద్దరు కలసి వెళ్ళిపోదురు అంది ...నాకు ఉత్సాహం వచ్చేసింది .ఒప్పుకోరెమో అన్నాను అనుమానం గా ,అసలు అడిగి చూడు కాదనరు..లేకపోతే మీ చిన్నాన్న తో అడిగించనా అంది ..వద్దులే అని నెమ్మదిగా తనను పక్కకు పిలిచి ..ఏమండీ పిన్ని ఉండమంటుంది ,నాకు కూడా ఇక్కడ కాసేపు ఉండాలని ఉంది,ఉండనా అన్నాను .. ఏం మాట్లాడుతున్నావ్ అసలు.. నోరుముసుకుని రా ,చిరాకు పెట్టకు అన్నారు..వస్తున్న కోపాన్ని అణుచుకుని మా పిన్ని దగ్గరకు వెళ్ళాను ..అదీ,తరువాత వస్తాను పిన్నీ ,చాలా క్లోజ్ ఫ్రెండ్ అంట ,నేను రాకపోతే బాధ పడతారు అని అన్నారు అన్నాను..మా పిన్ని మొహం లో కొంచెం బాధ కనపడింది ..పర్వాలేదులే ,నా చీర,నగలు ఇస్తాను వాటితో వెళ్ళు సరేనా అని నాకు నప్పే చీర,నగలు తీయడం మొదలు పెట్టింది ..నాకు మనసంతా తేలిక అయిపోయింది.. అంత మంచి అయిడియా ఇందాక నుండి రానందుకు తిట్టుకున్నాను ..


ఈ లోపల మా ఆయన ఫ్రెండ్ భార్య తయారయిపోయింది ,అందరూ నీ కోసం వెయిటింగ్ ఇంక రా మా ఆయన పిలిచారు.. ఇప్పుడే వస్తున్నా చీర మార్చుకుని వచ్చేస్తా అన్నాను ...మా ఆయనకు పిచ్చ కోపం వచ్చేసింది,వచ్చిన దగ్గర నుండి చూస్తున్నా ఎంత సేపూ చీర అంటావ్,పిన్ని అంటావ్ అంతా నీ ఇష్టమేనా..వద్దు, నువ్వు తొందరగా రా చాలు.. మీ పిన్నికి చెఫ్ఫేసి వచ్చెసేయ్ అన్నారు ...ఇంక వచ్చింది కదా నాకు కోపం .. ఇప్పుడేమయింది తన చీర కట్టుకుంటే అన్నాను ..నాకిష్టం ఉండదు అన్నాను కదా నువ్వు పరాయి వాళ్ళ బట్టలు వేసుకుంటే అన్నారు ..ఇందులో తప్పేముంది ..నా సొంత పిన్ని తను, పెళ్ళికి ముందు చాలా సార్లు తన చీరలు కట్టుకున్నా అన్నాను విసుగ్గా.. అప్పుడు వేరు,ఇప్పుడు వేరు ఇప్పుడు వస్తావా ,రావా అన్నారు ... ఏం, పెళ్ళి అయ్యాకా కొమ్ములు వస్తాయా ఇప్పుడు వేరంట వేరు అని మనసులో కచ్చగా తిట్టుకుంటూ పిన్ని దగ్గరకు వచ్చాను..పిన్నీ టైము అవుతుంది అందరూ రెడీ అయిపోయారు, వద్దులే నేను వెళతాను అన్నాను తన చీర తనకే ఇచ్చేస్తూ ...మా పిన్ని వేరుగా అర్దం చేసుకుంది..ఏమ్మా ఈ చీర నచ్చలేదా ,పోనీ ఇది బాగుంటుంది కట్టుకో నేను అసలు ఒక్కసారి కూడా కట్టుకోలేదు ,కొత్తది అని వేరేది ఇచ్చింది ..మా ఆయనకు ఇష్టం ఉండదు అని అంటే ఫీల్ అవుతుందేమో అనిపించింది ..పని లేక వాళ్ళింటికొచ్చి బాధ పెడుతున్నానా అనిపించింది .ఇంక ఆలోచించలేదు,లేదులే కట్టుకుంటాను ఇవ్వు అని మొండిగా చీర మార్చుకుని ,కాస్త మొహం కడుక్కుని ,గభ గభ జడ వేసుకుని బయటకు వచ్చాను ...


ఆ సరికే ఆయన ఫ్రెండ్ కార్ ని రివెర్స్ చేసి వీధి చివర ఆపడానికి వెళ్ళా రు.. నన్ను చూడగానే మా ఆయనకు కోపం ఆగలేదు..మొత్తానికి పంతం నెగ్గించుకున్నావ్ కదా అన్నారు,అది కాదు ,పిన్ని బాధ పడుతుందని కాస్త భయపడుతూ అన్నాను..ఒహో అయితే నేను బాధ పడినా పర్లేదన్నమాట అన్నారు ..ఏంటండి ,ఇప్పుడేమయింది అని ..పెళ్ళికి వెళుతూ అంత చండాలం గా ,జిడ్డుమొహం లా వెళితే ఏం బాగుంటుంది అన్నాను చిరాగ్గా .. ఇప్పుడు మనం పెళ్ళికి వెళుతున్నామని ఏవరు చెప్పారు నీకు అన్నారు కోపం గా ..అదేంటీ,మరి అత్తయ్యతో ప్రొద్దున్న అన్నారు గా అన్నాను అయోమయం గా ..నేనేమన్నా నీతో చెప్పానా ..అసలు పెళ్ళికొడుకు నాకు తెలియదు ,మొన్న మా ఫ్రెండ్ ఇంటికి వెళితే బాగోదని నన్ను కూడా పెళ్ళికి రమ్మన్నాడు మాటవరసకు ..ఇదిగో నీ వల్ల సిగ్గు లేకుండా వెళ్ళాల్సి వస్తుంది అన్నారు .నాకేం తెలుసు నాకు ముందు గా ఒక్క మాట అయినా చెప్పచ్చు కదా అన్నా ..నాకింకా కంఫ్యూజ్ గానే ఉంది .నిన్నేదో సర్ ప్రైజ్ చేసేద్దాం అని ,బుద్ది తక్కువ అయి, నీ గురించి తెలియకా చెప్పలేదు ముందు గా ..ఇప్పుడు తెలుసుకున్నాను గా ..అమ్మవారి గుడికి వెళ్ళి అలా అన్నీ చూసి వద్దాం అనుకున్నాను ..అంతా చెడగొట్టావ్ మా ఆయన కోపం గా కారు ముందు డోర్ తీసుకుని కూర్చున్నారు మరొక్క మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా..


మా ఇద్దరి మొహాలు చూడగానే ఆమెకు అర్ధం అయినట్లు ఉంది అయినా నవ్వుతూ మామూలుగా మాట్లాడుతుంది.. నాకసలు ఏం వింటున్నానో అర్ధం కాలేదు, ప్రొద్దున్న ఆమె అంత క్లియర్ గా చెప్పింది తన తమ్ముడిని ఒక్కసారే మా ఆయనకు పరిచయం చేసాను అని అప్పుడైనా నా మట్టి బుర్రకు అర్ధం కాలేదు,అయినా ఫ్రెండ్ భార్య తమ్ముడు మా ఆయనకు క్లోజ్ ఫ్రెండ్ ఏంటి అని కొంచమైనా అనుమానం రాలేదేంటి నాకు ,అయినా నా తప్పేముంది ..నాకు ఇక్కడ అంతా క్రొత్త ,అది ఆలోచించకుండా అలా అరుస్తారేంటి ,పోనీ ఆయన ఫ్రెండ్కి ముందు గానే చెప్పచ్చు కదా నేను పెళ్ళి కి రాలేదని ..ఎందుకంత మొహమాటం ..బోలెడు ప్రశ్నలు ..మా మొదటి గొడవ తాలూకు భయం తో పెళ్ళి మండపం లోనికి అడుగుపెట్టాను.. నా చీర ,నగలు నాకే బరువుగా అనిపించాయి ,తెలియని పెళ్ళికి వచ్చాం అన్న సిగ్గు ఒక ప్రక్క, పెళ్ళి కొడుకు మమ్మల్ని చూడగానే పలకరించి భోజనం చేసి వెళ్ళి తీరాల్సిందే అని పట్టుపట్టాడు ఎంత చెప్పినా వినకుండా ..నాకైతే మా ఆయన మొహం లో చూడాలన్నా భయం వేసింది..



ఇంటికి వచ్చేవరకు సారీ చెప్పే వీలే కలగలేదు నాకు,రాగానే సారి నాకు తెలియదు కదా ,నేను పెళ్ళికి అనుకున్నాను అని అన్నాను ..నీ సారీలు నాకు అక్కరలేదు ,ఈ సారి నీ పర్మిషన్ తీసుకుంటాను ఎక్కడికి వెళ్ళాలన్నా,అంత ఎందుకు అసలు ఎక్కడికీ తీసుకు వెళ్ళను అని మొండి సమాధానాలు చెప్పి హాల్ లో టి.వీ చూస్తూ కూర్చున్నారు ...చాలా బాధగా అనిపించింది ,ఇప్పుడేంజరిగిందని అంత కోపం .పొరపాట్లు అందరికీ జరుగుతాయి కదా..దీన్నే మగ అహంకారం అంటారు ..ఎప్పుడో పుస్తకాల్లో చదివాను ఇప్పుడు చూస్తున్నాను ..ఈయనగారు మనసులో ఏదో అనుకున్నారంట ,నేను అది కనిపెట్టలేక పోయానంట ..నాకేమన్న మా వాళ్ళూ మైండ్ రీడింగ్ ట్రైనింగ్ ఇచ్చిపంపారా ..ఎంత అన్యాయం గా మాట్లాడుతున్నారు,కనీసం జాలి యే కొసనన్నా ఉందా ఈ మనిషికి ... ఇలా నాకు నచ్చినట్లుగా బోలెడు తిట్టుకున్నాను ..ఎక్కడో ఆశ ..కాసేపు అయ్యాక వచ్చి సరేలే బాధ పడకు అంటారేమో అని.. అలా ఆలోచిస్తూ,చిస్తూ ప్రయాణపు బడలిక వల్ల నిద్రలో జారుకున్నాను ...


ప్రొద్దున్న లేచేసరికి సీరియస్స్ గా షూ లేస్ కట్టుకుంటున్నారు ఎక్కడికో వెళుతూ ,రాత్రి ఉన్న కోపం నిద్ర నుండి లేచేసరికి ఎక్కడికి పోయిందో నాకు,తప్పంతా నాదే అనిపించింది ..పాపం కదా ఎంత ఇబ్బంది పెట్టాను నిన్న అనుకుని ,టిఫిన్ చేస్తారా అన్నాను.. వద్దు అని మారు మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయారు..చాలా బాధగా అనిపించింది ..కాసేపాగి ఫోన్ చేస్తే కట్ చేసి పడేసారు.. నాకు ఉక్రోషం ,ఏడుపు రెండు కలగలిపి వచ్చేసాయి.. అది కాస్త కోపం క్రింద మారిపోయింది ... ఆ కోపాన్ని అంతా వంట గదిలో గిన్నెల మీద,కూరల మీదా చూపిస్తూ ,ఈ మగాళ్ళు అందరూ ఇంతే ,దొంగ మొహాలు ..వీళ్ళనే నమ్ముకుని వస్తాం కదా అదీ చులకన .. వీళ్ళు మమ్మల్ని ఏమైనా అనేయచ్చు ,కానీ మేము మాత్రం ఒక్క ముక్క అనకూడదు ,వాళ్ళ వెనుకాలే వస్తాం కదా అదీ లోకువ ,అసలు పెళ్ళి అయితే అందరూ ఇల్లరికం వెళ్ళిపోవాలి అని ఒక రూల్ పెట్టి పడేస్తే బాగుండును గవర్నమెంట్..అసలు ఆ దేవుడు కూడా మగాడే కదా అందుకే అందుకే అమ్మాయిలకు ఇన్ని కష్టాలు పెట్టేసాడు ..ఇలా మగవాళ్ళనందరినీ కాసేపు తిట్టిపడేస్తే గానీ మనసు ప్రశాంతం గా అవ్వలేదు .. అసలు భార్య,భర్తలు ఇద్దరూ తగవులాడుకుంటే ఒకరినొకరు తిట్టుకోవడం మానేసి మొత్తం మగాళ్ళను ,ఆడవాళ్ళను కలిపి ఎందుకు తిట్టుకుంటారో నాకు అర్దం కాని మిలియన్ డాలర్ల ప్రశ్న అన్నమాట ఇప్పటికీ..


కాసేపయ్యాక ఫొన్ వచ్చింది ..నిన్న కలసిన ఆమే ఫోన్ .. మీరు నిన్న కార్లో మీ బేగ్ మర్చిపోయారు మీ వారితో పంపించమంటారా అన్నాది ఆవిడ,తను అక్కడ ఉన్నారా అన్నాను.. ఆ.. మావారు ,తను బయటకు వెళుతున్నారు అంది .. మా ఆయన మార్నింగ్ టిఫిన్ తినడం మర్చిపోయారు అన్నాను ..తనని కాస్త టిఫిన్ పెట్టమ్మా అని చెప్పకనే చెపుతూ .. ఓ పర్వాలేదు ఇప్పుడే పకోడీలు వేసాను తిన్నారు
అంది .. హమ్మయ్య అనిపించింది ..మాట్లాడుతారా తనతో అని పిలిచి ఇచ్చింది ఫోన్ ..నేను హలో అనే లోపలే ఫోన్ పెట్టేసారు .. మళ్ళీ కాసేపు మగ జాతి అందరూ బలయిపోయారు నా నోటితో..మధ్యాహనం మా అత్తగారు భోజనం తినమన్నారు ..వద్దు అత్తయ్యా తను వచ్చాక తింటాను అన్నాను ..ఇప్పుడు నేను భోజనం చేసేస్తే ఎలాగా.. మా ఆయన్ని ఏడిపించాలిగా ఆ ఆయుధం తోని..కాని మా అత్తగారి దగ్గర నా ఆటలు సాగలేదు,వాడు ఎప్పుడొస్తాడో ,వేళకు తినకపోతే నీరసం వస్తుంది అని బలవంతం గా తినిపించేసారు ..

అక్కడి నుండి నా చూపులు వీధి గుమ్మం వైపే చూస్తూ ఉండిపోయాయి ..రాత్రి అవ్వగానే మా అత్తయ్యగారు మళ్ళీ బోజనం తినమని గొడవ..ఇంక లాభం లేదు ఈ సారి తిన్నామో అంతే అనుకుని ఆకలి లేదు అని మొండికేసి పడుకున్నాను పది అయినా మనిషి రారే.. చిన్న సౌండ్ విన్నా తనేనేమో అనిపించేసేది,నా చెవులు ఎంత బాగా పని చేసేవంటే నాలుగు వీధుల అవతల బండి శబ్ధం అయినా వినబడిపోయేది ..మెల్లిగా ఆకలి మొదలయ్యింది.. ఏం చేయాలో అర్ధ కాలేదు ..అదేంటో మాములు టైములో రెండు పూటలా తినకపోయినా ఆకలి వేసేది కాదు..అందరూ నా మీద కక్ష సాధించేవారే .. అదృష్టం కొద్దీ నేను తెచ్చిన సారె బిందెలు మా రూం లోనే ఉన్నాయి .మెల్లిగా ఒక లడ్డు ఒక మైసూర్ పాక్ తినేసి కడుపునిండా నీళ్ళు తాగి పడుకున్నాను.. పన్నెండు అయినా రాలేదు ..ఎందుకో ఏడుపొచ్చింది ..ఒక్కరిదాన్నే ఉన్నాను అని బెంగగా అనిపించింది..పెళ్ళికి ముందు ఆయన పంపిన లెటెర్స్ ,చీర పక్కన పెట్టుకుని కాసేపు చదివాను ..చదివిన కొద్దీ కోపం వస్తుంది ..


ఎక్కడో చదివిన గుర్తు మగాడు ఇబ్బందిగా ఫీల్ అయ్యేది ఎప్పుడంటే పెళ్ళానికి పెళ్ళికి ముందు రాసిన లెటేర్స్ పొరపాటున మళ్ళీ చదివినపుడంట .. అందమైన అభద్దాలు ఎంత పొందిగ్గా రాసేస్తారు తిట్టుకుంటూ ఉండగానే మా ఆయన మాటలు వినబడ్డాయి హాల్లో నుండీ .. ఏంట్రా ఇప్పుడా రావడం ,నువ్వు వచ్చే వరకూ తినను అని మొండికేసి పడుకుంది ఆ పిల్ల మా అత్తగారు అంటున్నారు..ఇది మరీ బాగుంది నేనేమన్నా తినద్దు అన్నానా మా ఆయన రూం లోకి వస్తున్న చప్పుడు..గబుక్కున దిండు లో మొహం పెట్టేసుకుని నిద్ర పోతున్నట్లు పడుకున్నాను.. అసలే నాకు నిద్ర పోయినట్లు నటించడం చేతకాదు..కళ్ళు టక టకా కొట్టుకుంటుంటాను .. కాసేపు పర్స్, వాచ్ లాంటివి టేబుల్ మీద పెడుతున్న చప్పుడు వినబడి ఆగిపోయాయి.. మెల్లిగా నాకు దుప్పటి కప్పి హాల్లో క్రికెట్ చూడటానికి వెళ్ళిపోయారు.. శ్రీలంకకు ,పాకిస్తాన్ కి ఫైనల్ మేచ్ అంట..మావయ్య గారితో అంటున్న మాటలు వినబడుతున్నాయి..తిక్క కోపం వచ్చింది ...అమ్మో ఎంత బండ రాయి ,నేను అన్నం తినలేదు అన్న విషయం తెలిసి కూడా పట్టించుకోకుండా ,నన్ను తినమని అడగ కుండా వెళ్ళీ క్రికెట్ చూస్తున్నారా,బోడి ఈ దుప్పటి కప్పడం అవసరమా ..తీసి నేల కేసి కొట్టాను .ఇంకా నయం ఈ మనిషిని నమ్ముకుని ఆ స్వీట్లు కూడా తినకుండా ఉండలేదు ..ఆకలికి మాడిపోయేదాన్ని ..బోలెడు ఉక్రోషం వచ్చింది.. ఇదే మా నాన్న అయితే నేను అన్నం తినలేదంటే విని ఊరుకోగలిగేవారా .. ఏడుపొచ్చేసింది ..


ప్రొద్దున్న టిపిన్ తింటారా అని నోటి వరకు వచ్చింది గాని ఇప్పుడు అడిగితే మళ్ళీ స్టైల్ కొట్టీ వద్దు అని కడుపు మాడ్చుకుంటారు ..ఎందుకులే అని బీరువాలో బట్టలు తీసుకుంటున్నా...అసలు రాత్రే నిర్ణయించుకున్నా ఇంకోమారు బ్రతిమాల కూడదని.. టిఫిన్ తిన్నావా ఎప్పుడు వచ్చారో మా ఆయన వెనుకనించుని అడుగుతున్నారు ..లేదు ,ఆకలి వేయడం లేదు అన్నాను..వేయదు వేయదు నాలుగు పీకితే వేస్తుంది అన్నారు నవ్వుతూ.. ఆ..అదే మిగిలిపోయింది ఇంక,చిన్న విషయానికి అంత సాధిస్తారనుకోలేదు నాకు అణుచుకున్న కోపం కక్కేస్తే గాని ఫ్రీ అవ్వలేననిపించింది ..అబ్బా తప్పు నీది పెట్టుకుని రాక్షసిలా మళ్ళి నా మీద పడతావే అన్నారు నవ్వుతూ.. అసలు నేనేం చేసా చెప్పండి,నాకేమన్న పరకాయ ప్రవేశం తెలుసా మీ మనసులో ఏముందో చూడటానికి ..అరే అప్పటికీ సారీ చెప్పినా అదేదో క్షమించరాని నేరం లా అన్నం తినడం మానేసి,మాట్లాడటం మానేసి ఆ సాధింపేంటి ,మీ బాధ ఏంటి ఇప్పుడు మా పిన్ని చీర కట్టుకున్నాననేగా ..మీకు ఇంకొకళ్ళ బట్టలు నేను వేసుకోవడం ఇష్టం లేదనుకో మెల్లిగా చెప్పచ్చుకదా ..అయినా ఎంత సేపూ మీ వైపే ఆలోచిస్తారేంటీ ...నా గురించి ఆలోచించరే ..నిన్నగాక మొన్న వరకూ పిన్ని ,పిన్నీ అని తన చుట్టూ తిరిగీ ఇప్పుడు హఠాత్తుగా మా ఆయనకు మీ ఇంట్లో ఉండటం ఇష్టం లేదు,నీ బట్టలు వేసుకోవడం ఇష్టం ఉండదు అని వయ్యారంగా చెప్తే అవతలి మనుషులు ఎంత బాధ పడతారు..మీదే కరెక్ట్ కావచ్చు కాని నాకు టైం కావాలికదా మీ గురించి తెలుసుకోడానికి, అసలు అంత జాలి లేకుండా ఎలా ఉన్నారండీ ,కనీసం పాపం చిన్నపిల్ల ఇలా బాధ పెడుతున్నాను అని యే మాత్రం అనిపించలేదు కదా అని ఒక అరగంట తిట్టిపడేసాను ..

ఎవరూ నువ్వా ,చిన్నపిల్లవా, నా తల్లే మరి నాకు కోపం రాదా ..నా ఫ్రెండేమో మాటల మద్యలో విజయవాడ వెళుతున్నా అని చెప్పాడు ..సరేలే నిన్ను సరదాగా తీసుకు వెళ్ళి అలా అమ్మవారి గుడి ,ఊరు చూపిద్దాం అని అప్పటికప్పుడు ఏదో చెప్పి తీసుకు వచ్చేసా.. కానీ నువ్వెక్కడ ఆగుతావ్ ..ఆ అబ్బాయి నీకు క్లోజా,ఎంత క్లోజు అని వాళ్ళ ముందు ఆరాలు ..అక్కడితో ఊరుకున్నావా సినిమాకి వెళ్ళిపోదాం,పిన్ని ఇంటికి వెళ్ళిపోదాం అని డైరెక్షన్లు ..అసలు నన్ను చెప్పనిచ్చావా..అసలే ఆ మంట మీద ఉంటే నేను మా పిన్ని ఇంట్లో ఉండిపోతా,చీర కట్టుకొస్తా అని గొడవ ..ఎంత కోపం వచ్చిందో తెలుసా.. పోనీ సరే నాకేదో కోపం వచ్చింది ..నేను వెళ్ళి టీ.వి చూస్తుంటే మళ్ళీ వచ్చి కాసేపు బ్రతిమాలచ్చుగా ..అహా ,వీడి మొహానికి ఒకసారి సారి చెప్పడమే ఎక్కువ అన్నట్లు దున్నపోతులా పడుకున్నావ్ .. ఒక పక్క నాకేమో వేడి చేసిందో,ఆ ఫుడ్ పడలేదో తెలియదు ఒకటే కడుపునొప్పి ..మరి నువ్వు పట్టించుకోకపోతే నాకు కోపం రాదా అన్నారు..


అయ్యో కడుపునొప్పా అన్నాను కంగారుగా ..ఇప్పుడేం అడగక్కరలేదు తగ్గిపోయాకా అన్నారు..ఇదీ మరీ బాగుంది ఇవన్నీ కలగంటానా లేపచ్చుగా ..మరి పెళ్ళాన్ని బాధపెడితే ఆ పాపం ఊరికే పోతుందా అన్నాను నవ్వుతూ .. మరి ఆ మాత్రం ఏడిపించకపోతే నాకోపం తీరేదెలా ..అసలు ప్రొద్దున్నే కోపం పోయింది. టిఫిన్ తినను అనగానే నువ్వు బిక్కమొహం వేయగానే నవ్వు వచ్చింది నువ్వు అలా వెళ్ళగానే నవ్వుకునే వాడిని,అందులోనూ నిన్న నువ్వు ఆ లెటెర్ చీర ముందేసుకుని పడుకుంటే బోలెడు జాలేసింది అన్నారు..ఆ ఏడిపిస్తారు,కాలేజ్ లో నాటకాలేసే బుద్ది ఎక్కడ పోతుంది..పెళ్ళయ్యాక కూడా వేస్తున్నారు అన్నాను కోపంగా..నీకెలా తెలుసే నేను నాటకాలు వేసే వాడినని అన్నారు ఆక్చర్యం గా ..పెళ్ళికి ముందు మా అక్క మీ ఫొటో తెచ్చిందిగా ,అది నా దగ్గరే ఆల్బం లో పెట్టాను జాగ్రత్తగా అన్నాను గొప్పగా..అవునా ఏం ఫొటో అన్నారు కుతూహలం గా ..అదే మీరు అడుక్కున్న వాడిలా ఒక గడ్డం వేసుకుని ,తెల్ల విగ్ పెట్టుకుని జీవించేస్తున్నారుగా అది అన్నాను ..మా ఆయన కాసేపు ఆలోచించి అదా అని పడి పడీ నవ్వుతూ అదీ ,అది మా నాన్న దే బాబు నేను కాదు అన్నారు...ఆ... @$%^* అని ఉండిపోయాను ...

3, జులై 2009, శుక్రవారం

కలహాలు కూడా కమ్మగానే ఉంటాయి మరి



కలహాలు కమ్మగా ఉండటం ఏంటనుకుంటున్నారా,మరదే..పెళ్ళి అయిన కొత్తలో మొదటి కలహం ఒకసారి గుర్తు తెచ్చుకోండి..పెదవులపై చిరుధరహాసం వచ్చేస్తుంది చూసుకోండి.. ఆ తరువాత తరువాత జీవితమే కలహాలమయం అయిపోతుంది అది వేరే విషయం అనుకోండి...కాని మొదటి కలహం చాలా అపురూపంగా ఉంటుంది మనసు పొరల్లో గుర్తు ఉండిపోయి ,నా విషయం లో అయితే పెళ్ళి అయిన కొద్ది రోజులకే మొదలు పెట్టేసాం పోట్లాట ..

పెళ్ళి అయిన తరువాత నేను ఇక్కడకు రాకముందు కొద్దిరోజులు మా అత్తగారి ఇంట్లో ఉన్నాను .నాకిప్పటికీ బాగా గుర్తు కొత్తగా అత్తవారి ఇంట్లో అడుగుపెట్టగానే ఎంత టేన్షన్ గా,భయం గా ,మొహమాటం గా అనిపించిందో..ఆ రోజు రాత్రి నిద్రలో మెలుకువ వచ్చి చుట్టూ చూసి అసలు ఎక్కడ ఉన్నానో తెలియక దిగ్గున లేచి ఒక నిమిషం కంగారుపడిపోయి తరువాత పెళ్ళి అయిందన్న వాస్తవం గుర్తు వచ్చి గంట సేపు ఏడుస్తూ పడుకున్నాను..మావారితో అంతకు ముందు ఫోన్ లో మాట్లాడినా ఇంకా కొత్తదనం పూర్తిగా పోలేదు కాసింత గారం,కాసింత ప్రేమ ,కాసింత భయం ,కాసింత మొహమాటం అన్నీ కలగలపి ఉండేవి ..

మా వారి ఇంటి నిండా చుట్టాలు,బంధువులు,పిల్లలు ఎవరెవరో ,ఒక్కరు కూడా తెలియదు ..పైగా పది నిమిషాల కోమారు నన్ను చూడటానికి ఎవరెవరో వచ్చేవారు .. మా అత్తగారు నన్ను పిలిచి ఈమే నీకు అత్తయ్య వరస అవుతారు, ఆమె పిన్ని వరుస అవుతారు,తను ఇందాక వచ్చిన ఆవిడ ఆడపడుచు కూతురు అని పరిచయం చేసేవారు ..ఎవరు ఎవరో ,ఏమవుతారో ఏంటో కాస్త గజిబిజి గా ఉండేది , అదీ కాకుండా ఇంట్లో పెళ్ళికాని పిల్లలు ఉండటం వల్ల ,ఆ ఇల్లు కూడా మాట్లాడటానికి అనువుగా ఉండకపోవడం వల్ల మావారి తో కాసేపు సరదాగా మాటలాడాలన్నా కొంచెం భయం గా ఉండేది ..నాకు మినిమం మూడు వీదులకు వినబడేలా మాట్లాడానిదే మాట్లాడిన ఫీలీంగ్ రాదు..చిరునవ్వు నవ్వాల్సిన ప్లేస్ లో కూడా 36 పళ్ళు కనబడేలా పకాలున నవ్వుతాను .. అలాంటిది మెల్లిగా మాట్లాడాలంటే భలే కష్టం గా ఉండేది..తనదీ ఇదే పరిస్థితి ..ఇంట్లో ఉండగా ఏం మాట్లాడాలన్నా కాస్త మొహమాటం గా ఫీల్ అయ్యేవారు ..

ఇలా కాదనుకుని మరుసటి రోజు మా అత్తగారి దగ్గరకు వచ్చి అమ్మా దాన్ని హస్పిటల్ కు తీసుకు వెళతాను ..ఫ్రెండ్ కు బాబు పుట్టాడు ..పలకరించక పోతే బాగుండదు అన్నారు..నేను బెడ్ రూం లో బట్టలు మడత పెడుతూ ఒక చెవి వేసి వింటున్నాను ...అసలు ఏం మాట్లాడుతున్నావురా ,పచ్చని పారాణి ఉన్న పిల్లను హాస్పిటల్ చుట్టూతిప్పుతావా,ఇంకేమన్నా ఉందా నాలుగు రోజులు ఆగి వెళుదువులే అన్నారు మా అత్తగారు.. ఊరుకోమ్మా నీ చాదస్తం అని మా ఆయన గొడవ చేస్తున్నారు గాని మా అత్తగారు ససేమిరా అన్నారు .. నాకు భలే నవ్వు వచ్చింది.. పెళ్ళికి ముందు నాదీ ఇదే పరిస్థితి ,అయినా చెప్పినా వినిపించుకునే వారు కాదు ..బాగా అయ్యింది అనుకున్నాను ..


మరుసటి రోజు మా ఆయన మరొక మాస్టరు ప్లాన్ వేసుకుని వచ్చారు ..కాకపోతే ఏది చేసినా ముందు నాకు చెప్పరు ,ఇప్పటికీ అంతే .. సాయంత్రం ఇంటికి వస్తూనే అమ్మా ఫ్రెండ్ ఇంటికి పిలిచాడు భోజనానికి అన్నారు.. మొన్ననే కదరా పిల్ల ఇంటికొచ్చింది అప్పుడే బోజనాలేంటి ..నాలుగు రోజులాగి వస్తాను అని చెప్పు అన్నారు అత్తయ్య ..ఏంటమ్మా నువ్వు ఏం చెప్పినా అలాగే అంటావ్.. బాగోదు వెళ్ళకపోతే అన్నారు విసుగ్గా .. అది కాదురా పసుపుతాడు మెళ్ళో వెసుకుని బయటకు తీసుకు వెళితే గాలీ ,దూళి పడుతుంది..చీకట్లో అలా తీసుకు వెళ్ళకూడదు కొత్త పెళ్ళి కూతురిని అన్నారు ... దెబ్బకి నాకు భయం వేసింది,నాకసలే చిన్నపటి నుండి దెయ్యాలంటే మహా భయం ..పొరపాటున దెయ్యాల సినిమా చుసానో రెండు వారాలు పడుకునేదాన్ని కాదు ...ఊరుకోమ్మా చీకట్లో ఎవరు తీసుకు వెళతారు ,వాడేమన్నా అడవిలో ఉంటున్నాడా..దగ్గరే వాళ్ళ ఇల్లు తొందరగానే తీసుకొచ్చేస్తాను అని నాకేసి చూసి నువ్వేంటి బొమ్మలా నుంచున్నావ్ తయారవ్వు అని వెళ్ళిపోయారు .. ఏమో బాబు పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినరు కదా ..మీ మంచికేగా చెప్పేది మా అత్తగారు అనుకుంటూ వెళ్ళిపోయారు .. ఇంక తప్పేది లేక తయారయ్యాను..


మావారితో మొదటిసారిగా బైక్ మీద ఎక్కి బయటకు వెళుతుంటే భలే సరదా అనిపించింది ...ప్రపంచం అంతా నాదే అన్నంత ఆనందం .. సరిగా కూర్చో,జారిపోతావ్ అని జాగ్రత్తలు చెబుతుంటే నాకు మా నాన్నే గుర్తు వచ్చారు..బండి ఒక చోట ఆపి ఇక్కడే ఉండు బైక్ పార్క్ చేసి వస్తా అనేంతలో ఒక అతను వచ్చి హలో బాగున్నారా ,సారీ అండి మీ పెళ్ళికి రాలేక పోయాను అని మావారితో అంటూ నావైపు చూసి
బాగున్నారా ..సినిమాకి వచ్చారా అన్నారు పలకరింపుగా..కాదండి భోజనానికి పిలిస్తే వచ్చాం అన్నాను ... అతను షాక్ తిన్నట్టు ఒక సారి నావైపు చూసి ఇబ్బందిగా నవ్వాడు ..ఈ లోపల మా ఆయన నా కాలు తొక్కారు ..అబ్బా నా కాలు తొక్కారు అని అంటూ పక్కకు జరిగాను ...మా ఆయన నావైపు కౄరంగా చూసారు... నాకర్దం కాలేదు ఎందుకలా మొహం పెట్టారో ... కాసేపు మాట్లాడి అతను వెళ్ళిపోగానే కయ్యిమన్నారు నాపైన.. బుద్ది ఉందా పెద్దవాళ్ళకు అలాగేనా సమాధానం చెప్పేది అన్నారు..నేనే మన్నాను అన్నాను అయోమయం గా ..సినిమా కొచ్చారా అంటే కాదు బోజనానికి వచ్చాం అని వెటకారిస్తావేంటి ..సినిమా హాల్ ఎదురుగా నించుని అన్నారు.. అప్పుడు చూసాను ఆ పక్కన కటవ్ట్లు ..ఊరు కొత్తది అవ్వడం వల్ల ,మొదటి సారి మా ఆయనతో బయటకు వస్తున్నా అన్న సంబరం వల్ల ఏమీ సరిగా గమనించలేదు ..నాకేం తెలుసు ఇంట్లో ఫ్రెండ్ ఇంటికి భోజనానికి అంటే అక్కడికే అన్న ఆలోచనలో ఉన్నాను అన్నాను.. అప్పటికీ కాలు తొక్కితే మళ్ళీ నాకాలు తొక్కుతారేంటి అని పైకి అన్నావు చూడు ..నాకు భలే కోపం వచ్చింది ఏమీ అర్దం చేసుకోవు తిక్క మొహమా అన్నారు ప్రేమ గా నవ్వుతూ ...


హాల్లో కూర్చున్నాక అన్నారు అది కాదురా ఇంట్లో అసలు మాట్లాడటానికి అవ్వడం లేదని ఇక్కడికి తీసుకువచ్చాను ఇప్పుడు చెప్పుఅన్నారు ... మా ఆయన పెద్ద హీరోలా అనిపించేసాడు ఎందుకో ఆ క్షణం లో .. ఈ లోపల సినిమా స్టార్ట్ .కొత్త సినిమా ..అందులోనూ కామెడీ సినిమా ..జనాలు ఇసుకవేస్తె రాలనట్లు పొలోమని ఉన్నారు.. సీను సీను కీ చప్పట్లూ ,నవ్వులూ ...ఆ గోలలో ఏం మాట్లాడుకుందాం అన్నా వినబడటం లేదు..మహా బోరు అనిపించింది .. అయిదు నిమిషాలు అయిపోగానే బయటకు వెళ్ళిపోదామా అన్నారు ..సరే సరే అన్నాను ఉత్సాహంగా..బయటకు రాగానే ఎక్కడికి వెళదాం అన్నారు.. బీచ్ కి అన్నాను ఉత్సాహం గా.. దా తవ్విద్దాం మొహం చూడు అన్నారు.. హూం ..మీ ఊర్లో బీచ్ లేదుగా ..పోనీ ఏదన్నా పార్క్ కీ అన్నాను ..ఉహు సరి అయినవి లేవు అన్నారు బైక్ స్టార్ట్ చేస్తూ..ఇంకెక్కడికెళతాం నా బొంద మనసులో అనుకున్నాను ..

బండి ఎక్కి మరి ఇప్పుడు ఎక్కడికెళదాం అన్నాను నిరుత్సాహం గా ..ఊరికే కాసేపు అలా తిరుగుదాం మా ఊరు నువ్వు చూడలేదుగా అన్నారు ..సరే అన్నాను...తను చిన్నపుడు చదివిన స్కూల్ ..ఈత కొట్టిన పిల్ల కాలువలు ఏవేవో చూపించారు .క్రమం,క్రమం గా ఇళ్ళూ ,కాలువలు దాటుకుని ఎక్కడికో తీసుకువెళ్ళారు ..చుట్టూ చీకటి ...చెట్ట్లు ,తప్ప ఇంకేం లేవు ... బండి ఆపి .. ఇప్పుడు
చెప్పు ..ఊరి చివరకు వచ్చేసాం ..హాయిగా ,ప్రశాంతం గా మాట్లాడుకోవచ్చు అన్నారు ...ముందు ఉత్సాహం గా అనిపించినా తరువాతా భయమేసింది ...మా అత్తగారి మాటలు గుర్తు వచ్చాయి.. కొత్త పెళ్ళి కూతురూ ,గాలీ,దూళీ అని ...


దూరంగా భోగి మంటలు వేసినట్లు మంటలు కనబడుతున్నాయి.... కొంపదీసి శ్మశానమా??..ఊరి చివరన అదేగా ఉంటుంది .. భయపడినట్లు తెలిస్తే అలుసైపోనూ ...ఆహా చల్ల గాలీ వీస్తుంది కదా అన్నారు...పైకి చూసాను..చెట్ట్లు ఊగుతున్నాయి ..రక రకాలా ఆలోచనలు మొదలయ్యాయి ,అవునూ .. దెయ్యాలు మర్రి చెట్టు మీద ఉంటాయా లేక చింత చెట్టు పైనా ???ఎదురుగా చందమామ గుండ్రంగా కనబడుతున్నాడు.. దెయ్యాలు పౌర్ణమి రోజున వస్తాయా బయటకు ???లేక అమావాస్యా? కొంపదీసి ఈ రోజు పౌర్ణమి కాదుకదా ..అందుకేనా చందమామ గుండ్రం గా ఉన్నాడు...మెల్లిగా బయలు దేరిన భయం బీకరంగా పెద్దదయింది ...మా పెద్ద అత్త అంతకు ముందు తన చిన్నపుడు తెల్ల బట్టలు వేసుకు వెళితే దెయ్యం ఎలా మీద పడిందో చెప్పింది ...నాకలాంటివి వినడమే భయం .. నా చీర చూసుకున్నాను ..క్రీం కలర్ చీర ...కొంపదీసి చీకట్లో దెయ్యాలకు కనబడక ఇది తెల్లచీర అనుకుంటాయో ఏమో ఖర్మా ...

మా ఆయనకు చిరాకేసినట్లు ఉంది ...ఉట్టపుడు అందరితో తెగ సోది వేస్తావ్ కదా తీరా ఇక్కడకొచ్చాక ఆకాశం,భూమి చూస్తావేంటి ..ఏదన్నా మాట్లాడు అన్నారు ...ఏమండీ అక్కడ మంటలెందుకున్నాయి అన్నాను ...శీతాకాలం కదా చలివేస్తుంది కదా అందుకే ఎవరో మంటలేసుకున్నారనుకుంటా అన్నారు....ఈ రోజు తిది ఏంటి పౌర్ణమా అన్నాను ...ఏమో ..ఏ ఎందుకని అన్నారు ..ఏమీ లేదు ఊరికే అడిగా ఇది చింత చెట్టా ,రావి చెట్టా అన్నాను పైకి చూస్తూ ... రెండూ కాదు కొబ్బరి చెట్టు ..ఇప్పుడు అది అవసరమా.. ఏదన్నా మాట్లాడవే అంటే ఈ రోజు తిది ఏంటీ ,వారం ఏంటీ ,ఇది ఏం చెట్టు ,కాయలు కాస్తాయా, పువ్వులు పూస్తాయా అనుకుంటూ ఉప్పర సోది వేస్తావ్ విసుక్కున్నారు మా ఆయన ...మరి ఇంకేం మాట్లాడను ఏదో ఒకటి మాట్లాడుతున్నాను గా నేనూ అరిచాను..

పక్కన ఏదో కదలిన సౌండ్ ..ఏమండి ఇక్కడ పాములుంటాయా కొద్దిగా భయం గా చూస్తూ అన్నాను ..ఇదిగో పిచ్చి భయాలతో లేనిపోని అనుమానాలు నాకు తెప్పించకు నీ ప్రాణానికి నాప్రాణం అడ్డు సరేనా ..హూం చెప్పు ఇంకా... మొన్న రాత్రి ఏదో చెపుతూ మద్యలో ఆపేసావ్ కదా ఇప్పుడు చెప్పుఅన్నారు .. నా దృష్టి అంతా అటు వైపు వెళుతున్న లారీల మీద పడింది ..ఈ సమయం లో ఒంటరిగా ఒక్కళ్ళమే ఉండటం మంచిది కాదేమో అనిపించింది ..అప్పటి వరకూ ఉన్న దెయ్యం భయం పోయి కొత్త భయం పట్టుకుంది .. మా ఆయన ఏదో చెబుతున్నారు గాని నాకు వినిపించడం లేదు.. ఏమండీ ఈ టైంలో ఇక్కడ ఒక్కళ్ళమే ఉండటం మంచిది కాదేమో అన్నాను మెల్లగా .. మా ఆయన నవ్వుతూ నా సంగతి తెలియదు నీకు ..జిం కి వెళ్ళే బోడీ యే ఇది ఎవరన్నా వస్తే అయిపోయాడేవాడు అన్నారు .. ప్రతీ మగాడు పెళ్ళాం దగ్గర చెప్పే కామన్ డయిలాగ్ ఇది గొణుకున్నాను .. ఏంటీ అంటున్నావ్ అన్నారు.. మా నాన్న కూడా ఇలాగే అంటారు నా అంత గొప్ప భలవంతుడు లేడని అన్నాను.మీ నాన్నకూ నాకూ పోలికా.. అంటూ నాన్న మీద జోకులెయ్యడం మొదలు పెట్టారు.. మామూలుగా అయితే ఉడుక్కుంటూ ఏదో ఒకటి అనేదాన్ని ..నాకెందుకో ఆ వాతావరణం ముళ్ళ మీద కూర్చున్నట్లు ఉంది .....


ఇలా లాభం లేదని వెళ్ళిపోదాం అన్నాను ..ఎందుకు అన్నారు నావైపు చూస్తూ ..ఏం చెప్పాలో అర్ధం కాలేదు ..ఆకలేస్తుంది వెళ్ళిపోదాం ఇంటికి అన్నాను. ఇంకా ఎనిమిది కూడా కాలేదు ఇందాకా ఏమన్నా తింటవా అనంటే వద్దు అన్నావ్ అన్నారు .అప్పుడు ఆకలి వేయలేదు, ఇప్పుడు వేస్తుంది అన్నాను ..అంతే , చటుక్కున లేచి బండి స్టార్ట్ చేసి ఎక్కు అన్నారు సీరియస్సు గా.. తన మొహం చూడగానే గుండేల్లో దడ దడ మంది అయినా నేను చెప్పింది నిజమని ఒప్పించడానికి నాకు నిజంగానే ఆకలి వేస్తుంది అన్నాను .నేనేం నాకోసం ఇక్కడికి నిన్ను తీసుకురాలేదు నువ్వే నిన్నమీతో మాట్లాడడానికి కుదరడం లేదని అన్నావని తీసుకొచ్చాను, నువ్వేం పోజులు కొట్టేయక్కరలేదు అన్నారు ఆయన కోపం చూడాగానే భయం వేసింది ..అప్పటి వరకు ఎప్పుడు సరదాగా మాట్లాడే ఆయన ఒక్కసారి గా అలా మొహం పెట్టేసరికి ఏడుపొచ్చేసింది ..


దారిలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు ...హొటెల్ లో భోజనం తినబుద్ది కాలేదు అలా కలుపుతూ కూర్చున్నాను ..ఏమనుకున్నారో మరి, ఇందాక ఆకలో అని గొడవ చేసావ్ కదా ఇప్పుడేమయింది అన్నారు ..అంతే నాకు కళ్ళలో నుండి నీళ్ళు దారల్లా వచ్చేయడం మొదలు పెట్టాయి ఎంత ఆపుకుందామన్నా ఆగకుండా ..ఇప్పుడేమన్నానే బాబు ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు ..తల్లీ ఆపు చేయి కంగారుగా అని కర్చీఫ్ ఇచ్చారు ..నాకు అక్కడ భయమేసింది అన్నాను కళ్ళూ,ముక్కు తుడుచుకుంటూ ..సరేలే నువ్వన్నది కూడా నిజమే రాత్రి పూట ఒంటరిగా ఉండటం అంత మంచిది కాదు అందుకే తీసుకొచ్చెసా అన్నారు... హమ్మయ్యా ,దేవుడా నా మనసంతా తేలికైపోయింది తను నార్మల్ గా ఉండటం చూసి .. మా మొదటి కలహం అలా తప్పి పోయింది అని అనుకున్నాను కాని నాకేం తెలుసు ఆ తరువాత రెండు రోజులకే గొడవ అవుతుందని :)

10, జూన్ 2009, బుధవారం

నేనూ ప్రేమించాను




చదువుకునే రోజుల్లో పెద్దవాళ్ళ ప్రభావం వల్ల ప్రేమ అంటే అదేదో నేరం ,ఘోరం ,పాపం లా ఫీల్ అయిన నేను పీకలలోతు ప్రేమలో కూరుకుపోతా అని,ప్రేమలో తీయదనాన్ని రుచి చూస్తా అని కలలో అయినా అనుకోలేదు ...నా పెళ్లి కుదిరాకా తాంబుళాలు అయిన సాయంత్రం, పాపం మా ఆయన తన ఫోన్ నెంబర్ ఉన్న విజిటింగ్ కార్డ్ నాకు ఎవరు చూడకుండా ఒక పాపతో అందించారు..అసలే భారి బరువున్న పట్టు చీరతో,నగలతో
వచ్చేపోయే జనాల తో హడావుడిగా ఉన్న నేను విసుగు వల్ల అది ఎక్కడో పెట్టేసాను..


ఆ తరువాత దాని విషయమే మర్చిపోయాను ,అందులోనూ మా పెద్దమ్మ కూతురు పెళ్ళి కూడా అదే సమయం లో కుదరడం ,తన పెళ్ళి కూడా నా పెళ్ళికి రెండు రోజుల ముందు అవ్వడం వల్ల వచ్చిన చుట్టాలు పదిసార్లు అటు ఇటు తిరగలేక మా ఇంట్లోనే ఉండిపోయారు ....అంగుళం ఖాళీ లేదు ,పైగా మా తాంబూళాలు అయిన మరుసటి రోజే తుఫాన్ వల్ల కరెంట్ పోల్స్ పడిపోయి , తీగలన్నీ తెగిపోయి మా ఏరియా అంతా పదిహేను రోజుల పాటు కరెంట్ తీసిపడేసాడు ..ఇలా పలు కారణాలవల్ల ఆయన విషయమే మర్చిపోయాను ...


ఇది ఇలా ఉండగా ఒక రోజు అమ్మ,పెద్దమ్మ, పిన్నులు అందరూ పెళ్లి బట్టలవి కొనడానికి షాప్ కి వెళ్ళారు, కుళాయి వస్తే నీళ్ళు పట్టే బాధ్యత మాకప్పగించి ....నా కంటే ముందు అక్క పెళ్లి అవ్వడం వల్ల,పెళ్లి కూతురన్న మురిపం అసలు లేనేలేదు నాకు ,అన్నీ దానికే :( అలా నేను ,మా చెల్లి ఆ చీకట్లో రాత్రి 8 గంటలకు అది నీళ్ళు పడుతుంటే నేను బిందెలతో మోస్తూ ,సగం ఒంపేస్తూ నానా పాట్లు పడుతున్నాం ... ఇదే సినిమాల్లో అయితే హీరోయిన్ ఎంత వయ్యారంగా చుక్క వలగకుండా మోస్తుంది ,అసలే కరెంట్ లేక మోటార్ పని చేయడం లేదు ఇక్కడ నా చేతులు పడిపోతున్నాయి నీళ్ళు బోరింగ్ కొట్టలేక ,సరిగ్గా తీసుకువెళ్ళు మా చెల్లి విసుక్కుంది ...ఆహా.......ఖాళీ బిందె ఇస్తే నేను అంతకన్నా వయ్యారంగా మోస్తా అని తగవు వేసుకోబోతున్నంతలో ఫోన్ రింగ్ అయింది .... ఈ దిక్కుమాలిన ఫోన్ ఒకటి పని ,పాట ఉండదు ఇప్పుడే వస్తా అని తడి బట్టలు కాళ్ళకు అడ్డం పడుతున్నా కుళాయి ఎక్కడ కట్టేస్తాడో అని పరుగు పరుగున ఇంట్లోకి వచ్చాను ...


ఇంట్లో గదిలో నలుగురైదుగురు చుట్టాలు పిచ్చా పాటి మాట్లాడుకుంటున్నారు కొవ్వొత్తి వెలుగులో , నాన్న అప్పుడే వచ్చారు ఫోన్ దగ్గరకు ..నేను తడి వల్ల పడిపోబోతూ నిలదొక్కుకున్నా ... వాళ్ళలో ఒకరు ఆ..ఆ ..ఆ అంత కంగారేమిటి పడతావ్ అంటుండగానే ఫోన్ లిఫ్ట్ చేసాను ...హలో అన్నాను , హలో అటునుండి మెల్లిగా వినబడింది ... హలో ఎవరు ...మళ్ళి రెట్టించాను ...
అటు నుండి తడ బాటుగా నా పేరు చెప్పి నువ్వేనా అన్నారు.. అవును నేనే మీరెవరు అన్నాను ....నేను.. అని తన పేరు చెప్పారు ...మా ఆయన.. ఒక్క క్షణం నా మట్టి బుర్రకు తట్టలేదు ... ఎవరు అనుకుంటుండగానే అర్ధం అయింది తను అని.. ఆ తరువాత మెదడు కాసేపు మొద్దుబారిపోయింది..ఇప్పుడేం మాట్లాడాలి???.. ఎదురుగా మా నాన్న నా వైపు చూస్తూ .. ఆ పక్కనే అమ్మలక్కలందరూ కబుర్లాపి నా మొహం లోకేచూస్తూ ఉన్నారు..

పాపం మా ఆయన అటుపక్కన నేనేదో మాట్లాడేస్తా అని చాలా ఊహించేసుకుని వచ్చిన వారు కాస్తా, నేను మౌనమ్ అయిపోయే సరికి ఏం మాట్లాడాలో తెలియక బాగున్నావా అన్నారు ..
ఊ అన్నాను..
భోజనం చేసావా ..
ఊ ..
మీకు తుఫాన్ అంట కదా

కరెంట్ లేదు అంట కదా

కష్టం కదా

ఏంటి బిజీనా
ఊ..ఉహు హు
నేను రేపు ఫోన్ చేయనా ఇదే టైం కి ???

ఉంటాను బై ..

ఎవరమ్మా నాన్న అన్నారు.. ఏమని చెప్పాలి ? అతను ఫోన్ చేసాడు అనాలా? మీ అల్లుడు గారు అననా??.. చీ.. మరి చండాలం గా ఉంటుందేమో ..మెల్లగా మా ఆయన పేరు చెప్పాను..


అప్పుడు మొదలు పెట్టింది అందులో ఒక ఆమె ... నేను ముందే అనుకున్నా ఈ పిల్ల పడుతూ ,పరిగెడుతూ వస్తున్నపుడే ... నిన్నగాక మొన్న తాంబూళాలు అవ్వలేదు , అప్పుడే ఫోన్ నెంబర్లు వరకు వచ్చేసిందా !!!! అని మా వైపు చూసి అని ,మిగిలిన వాళ్ళతో మా రోజుల్లో అయితేనా పెళ్లి చూపులే ఉండేవే కావు.. నేను మీ బావగారిని పెళ్లి పీటలమీద చూడటమే ...అంది , మరొక ఆవిడ ఏమనుకుందో ,మన రోజులు వేరులేవదినా , అయినా తాంబూళాలు అయ్యాయి అంటే సగం పెళ్లి అయిపోయినట్లే కదా అని సర్దబోయింది.. ఏంటి సగం పెళ్లి అయిపోవడం ..మా ఊర్లో ఫలానా వాళ్ళ మనువరాలు ఇలాగే తాంబూళాలు అవ్వడం పాపం ఒకటే ఫోన్లు ,ఇక ఇకలు ,పక పకలు ...ఆడది నవ్వితే మగాడు ఊరుకుంటాడా ,వాడు మాట్లాడితే ఇంటికి వచ్చేయడం మొదలేట్టెసాడు ...వాళ్ళ అమ్మనాన్నకన్నా బుద్ది ఉండాలా ... వాడితో ఒకటే సినిమాలు ,షికార్లు.. హవ్వ చెప్పుకుంటే సిగ్గుగాని మొగుడూ పెళ్ళాల్లా తిరిగేసారు.. ఆ తరువాత ఇంకేముంది ఎవడో ఆకాశ రామన్న ఈ పిల్ల మంచిదికాదని లెటెర్ వేసాడంట ..సంబందం కేన్సిల్ చేసేసుకున్నారు.. ఆవిడ ఇంకా ఇంట్రెస్టింగ్ గా చెబుతుంది కాని నాకు గుండేల్లో గూడ్స్ బండి పరిగెట్టెయడం మొదలయింది మా నాన్నను చూసి ... నువ్వు బయటకు వెళ్ళూ అన్నారు నాన్న కాస్త సీరియస్సుగా ... ఇంటికొచ్చిన చుట్టాలను ఏమీ అనలేక నాన్న ఆ కోపం నా మీద చూపారని తెలుసు కానీ .. ఏంటో అవమానం క్రింద అనిపించింది.. అది కాస్త మా ఆయన మీద కోపం క్రింద మారింది ..అసలు ఈయనగారిని ఎవరు ఫోన్ చేయమన్నారు..కొద్దిరోజుల్లో పెళ్ళి అయిపోతుంది కదా ... అని అర్దంపర్దం లేకుండా కాసేపు తిట్టుకున్నాను గాని ఆయన చేసింది తప్పుకాదని తెలుసు.. అలా కోపం కాస్త జాలి క్రింద ఆ తరువాత నాకోసం ఒక అబ్బాయి ఫోన్ చేసాడన్న అదొక సరదా ఫీలింగ్ క్రింద అనిపించింది ...


ఆ మరుసటి రోజు మద్యాహ్నం అమ్మ పక్కకు పిలిచింది.. కొంచం తడబడుతూ, మోహమాట పడుతూ ఆ అబ్బాయి ఫోన్ చేసాడంట కదమ్మా..అంది. ఊ ..అన్నాను.. మన ఇంటి సంగతి తెలిసిందే కదమ్మా ...పాడు జనాలు..కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు ... పెళ్ళి ఇంట్లో అపశకునాలు మాట్లాడుతారు..వయసొచ్చిందే గాని బుద్దిలేదు ... ఉమ్మడిలో ఎందుకమ్మా నలుగురి నోట్లో పడటం ... నలుగురితో పాటు నారాయణ ...కాస్త పెళ్ళి అయ్యేంతవరకూ ఎవరి కళ్ళలో పడకు ..దిష్టికళ్ళు .. నేను చెప్పింది అర్దం అయ్యిందా .. నాన్న చెప్పమన్నారు అని వెళ్ళిపోయింది..


ఎంత ఉక్రోషం వచ్చిందంటే ఆ అబ్బాయితో ఇంక మాట్లాడకు అని ఎంత చక్కగా చెప్పింది.. అక్కడికి నేనే ఫోన్ చేసినట్లు ...ఆ అబ్బాయితో మాట్లాడలేక ఉండలేక పోతున్నట్లు ..అందరూ నన్నే అంటారేంటి ..అయినా ఈ రోజుల్లో పెళ్ళి చూపుల్లో మాట్లాడకుండా,ఫోన్ లు చెయకుండా ఎవరన్నా ఉంటారా.. మొదటి సారిగా ఉమ్మడి కుటుంభలో పుట్టినందుకు కోపం వచ్చింది ...చీమ చిటుక్కుమన్నా ఇంటిల్లిపాదికీ తెలిసిపోతుంది ..అని తిట్టుకుంటుంటే అప్పుడు గుర్తు వచ్చింది రేపు ఇదే టైముకు కాల్ చేయనా అని అనగానే ,చిలకలా ఊ అనడం .... మరి ఇప్పుడెలా.. ఇంతలా చెప్పిన తరువాత కూడా మాట్లాడితే బాగుంటుందా ... కాసేపు ఏం చేయాలో తోచలేదు ...ఆ తరువాత వచ్చింది అయిడియా ... బయట S.T.D నుండి చేస్తే...ఇంట్లో బాగా జనాలు ఉన్నారు ,నేనే తరువాత చేస్తా అని ఏదో నచ్చ చెప్పితే, ఆ తరువాత సంగతి తరువాత.. అనుకుని ఆయన ఇచ్చిన ఫోన్ నెంబర్ ఎలాగో అలా వెదికి, ప్రెండ్ ఇంటికి వెళతాను అన్నాను .. ఎందుకూ అమ్మ,అమ్మమ్మ ఒకేసారి అడిగారు .. పెళ్ళికుదిరింది కదా శుభలేఖలు ఇచ్చే టైము లేదు, మిగిలిన వాళ్ళకు ఎలాగూ పెళ్ళిళ్ళు అయిపోయాయి ,మిగిలిన ఒకరిద్దరినన్నా పిలుద్దామని అన్నాను... అయ్య బాబోయ్ విఘ్నేశ్వర బియ్యం కట్టిన ఇంట్లో పెళ్ళి కూతురు పసుపు కాళ్ళతో బయటకు వెళ్ళడమే .. ఏమనుకుంటున్నావ్..ఇంకేమన్నా ఉందా ..మా అమ్మమ్మ మొదలెట్టేసింది .. ఏంటమ్మా .. ఇంక ఫ్రెండ్స్ ని కూడా పిలుచుకోవద్దా .. ఇన్ని రూల్స్ ఏంటీ ..నేను వెళతాను విసుగ్గా అన్నాను..ఇంక నాకు ,మా అమ్మమ్మకు చిన్న పాటి యుద్దం మొదలైంది.. చివరకు అమ్మ ...కాస్త చదవాగానే పెద్దదానివి అయిపోయావనుకున్నావా ... పెద్దవాళ్ళను అలా ఎదిరించచ్చా ... ప్రతిదానికీ గారం చేస్తుంటే ఇలాగే ఉంటుంది చెప్పింది విను కావాలంటే ఫోన్ చేయి మీ ఫ్రెండ్స్ కి..అసలే ఈ రోజు లక్ష్మి పూజ ..నీ చేత చేయిస్తున్నా ...పెళ్ళి అంటే ఏమనుకున్నావ్..నాన్నకు చెబుతా మరి..అని వెళ్ళిపోయింది ...


ఇంకేం చేయలేక ఇంట్లో ఉండిపోయా ...రాత్రి అవుతుంది గాని ఎంత టెన్షన్ అనిపించిందో .. ఆ అబ్బాయి ఫొన్ చేయడం మర్చిపొతే బాగుండును ఈ రోజు ,మా ఫోన్ పాడైపోతే బాగుండును ఇలా పిచ్చ ఆలోచనలు..రాత్రి పూజలో కూర్చున్నా గాని అతి చిన్న శబ్ధం కూడా భయంకరంగా వినిపించింది నాకు ... దేవుడా దేవుడా ఫోన్ రాకుండా చూడు స్వామి అనుకున్నంతలో ట్రింగ్ ట్రింగ్ మంటు ఫోన్ రానే వచ్చింది ... నీరసం వచ్చేసింది నాకు .. మా తమ్ముడు.... అక్కా!!!, బావ గారు నీకు కాల్ చేసారు ,రమ్మంటున్నారు అని ఇంత నోరు వేసుకుని అరిచాడు ఆ రూం నుండి.. నేను ఎవరి వైపూ చూడకుండా తల వంచుకు కూర్చున్నా..అందరూ నా వైపే చూస్తున్నారని తెలుసు ... మా నాన్న ఫోన్ తీసారు ..ఆ... బాబూ అమ్మాయి పూజలో ఉంది మద్యలో లేవకూడదు .. అమ్మ ఎలా ఉంది ,మీ నాన్న గారు బాగున్నారా నాన్న మాటలు చిన్న గా వినబడుతున్నాయి ..తల వంచుకున్నా గానీ ఏదో చెప్పలేని బాధ ... ఏమని అనుకున్నాడో.. కాబోయే భార్య తో ఎవరు మాట్లాడాలని అనుకోరు..మరీ ఇంత పంతం ఏంటీ మా వాళ్ళకు .. నిన్న కూడా ఊ ,ఉహు తప్ప ఇంకేం మాట్లాడలేదు ...ఏం ఫీల్ అయ్యాడో.. ఇంకోసారి ఫోన్ చేస్తాడా బుద్దున్నవాడెవడైనా .. ఇంక అంతే ఈ ఇంట్లో .. వీళ్ళ గోల తప్ప ఎదుటివాళ్ళ గోల వినిపించుకోరు.. ఎప్పుడో వాళ్ళ చిన్నప్పటి రోజులకీ ఇప్పటి రోజులకీ ముడేసుకుని కూర్చుంటారు అంతే .. అతనికి ఇక్కడి పరిస్థితి అర్దం కాదు.. దీనికి బాగా పొగరు,పోజు .. మరీ స్టైల్ కొడుతుంది అనేసుకుని ఉంటాడు.. మనసంతా భారం గా అయిపోయింది ... అది అతనిమీద జాలో ,లేక నన్ను అపార్దం చేసుకున్నాడేమో అన్న దిగులో,మా వాళ్ళ పై కోపమో ఏంటో నాకే అర్ధం కాలేదు..


మరుసటి రోజు ఇంట్లో అందరూ పెళ్ళిమాటలు మాట్లాడుతుండగా మెల్లిగా ఫోన్ దగ్గరకు వచ్చాను.. చేయనా ,వద్దా..ఎలా మాట్లాడాలి అనుకుంటూ..ఫోన్ అప్పట్లో మద్య గదిలో ఉండేది ఎవరు ఎటు తిరిగినా ఆ గదిలో నుండే వస్తారు కాబట్టి ఏం చేయాలో తోచలేదు ...ఇంతలో హఠాత్తుగా మళ్ళీ ఫొన్ రింగ్ అయింది, మొదటి రింగ్ కే హెల్లో అన్నాను పక్కనే ఉన్నాను కాబట్టి ... ఏంటి ఫోన్ పక్కనే ఉన్నావా అన్నారు .. ఎవరూ అన్నాను ఎవరో అర్దం కాక ... నువ్వేనా అన్నారు నా పేరు చెప్పి.. అవును అనగానే హమ్మయ్యా కంగారు పెట్టెసావ్ కదా గొంతు గుర్తుపట్టలేదా అన్నారు నవ్వుతూ తన పేరు చెప్పి.. ఒక్క రోజుకే ఎలా గుర్తు పట్టెస్తాను ..నాకు కనీసం ఒక 3 నెలలు పడుతుంది ... ఈ విషయం లో గ్రేటే మీరు అన్నాను.. ఇంకా నయం సంవత్సరం అనలేదు అని నిన్న మాట్లాడలేదే అన్నారు.. అది..పూజలో ఉన్నాను మద్యలో లేవకూడదనీ అని నసిగాను.. ఒక పక్క నుండి భయం ఎవరన్నా చూస్తున్నారేమో అని ..హూం నిన్న ఏం చేసానో తెలుసా ,నా ఫ్రెండ్ వాళ్ళ పాపతో దీపావళి టపాసులు కాల్పిస్తూ నీకు ఫోన్ చేయాలన్న విషయం గుర్తువచ్చి మద్యలో వదిలేసి వచ్చేసా ..వాడు బాగా పెట్టాడు నాకు అన్నారు.. అయ్యో అవునా మరి అదేం పని అన్నాను ఈ లోపల అమ్మమ్మ(పిన్ని అమ్మ ) వచ్చింది ఎవరే అనుకుంటూ .. ఫ్రెండ్ అన్నాను .. తను మంచం మీద కూర్చుంది..ఏంటీ మీ ఫ్రెండ్ వచ్చిందా అన్నారు ... ఆ, వచ్చింది .. నేను తరువాత మాట్లాడతాను ,ఖాళీ ఉన్నపుడు నేనే కాల్ చేస్తా... ఉంటాను అన్నాను... హేయ్ ఆగు,ఏంటి తరవాతా మాట్లాడేది .. ఎన్నాళ్ళకు దొరికావ్ మాట్లాడడానికి ..మీ ఫ్రెండ్ ని తరువాత రమ్మని చెప్పు ... అన్నారు.. బాగోదు అన్నాను అమ్మమ్మకు అనుమానం రాకుండా చూసుకుంటూ.. బాగానే ఉంటుంది గాని చెప్పు ఇంకా అన్నారు.. ఇంటినిండా ఒకటే జనాలు .. మా అక్క పెళ్ళి కూడా ఇప్పుడే గా .. మాట్లాడడానికి కుదరడం లేదు అన్నాను హింట్ ఇస్తూ ..మా ఆయనది నాకన్నా మట్టి బుర్ర ..అవునా .. ఇంకా చెప్పు అన్నారు.. ఏమనాలో అర్దం కాలేదు ..సరే ఇంక ఉంటాను అన్నాను .. ఇందాక నుండి బాగానే మాట్లాడవుగా ..ఏమైంది..ఓహ్ ఫ్రెండ్ వచ్చిందన్నావుగా సరే రేపు కాల్ చేస్తాను ఈ టైం కి ఇక్కడే ఉండు .. అన్నారు వద్దు ..వద్దు అన్నాను కొంచెం కంగారుగా .. ఎందుకని అన్నారు.. నాకెక్కడ దొరికావయ్య మహానుభావా అనుకుని కొంచెం పని ఉంది అన్నాను ..సరే అయితే పని అయ్యాకా నువ్వే కాల్ చేయి లేదా నేనే కాల్ చేస్తా అన్నారు..వద్దు కుదిరితే చేస్తా అన్నాను ...తొక్కేం కాదు ..నువ్వు ఇలాగే అంటావ్ రేపు నేనే కాల్ చేస్తా .. మీ ఫ్రెండ్స్ ఎవరినీ ఇంటికి రావద్దని చెప్పు అని పెట్టేసారు... మళ్ళీ రేపు ఫోన్ కోసం టెన్షన్ పడాలీ.. ఏంటే బాబు నీకీ కష్టాలు నామీద నేనే బోలెడు జాలి పడ్డాను ...


ఆ రోజునుండి మొదలైనాయి నా పాట్లు.. అటు తనకి చెప్పలేక, ఇటు మాట్లాడలేక.. ఒక వేళ చెప్పినా తనకి అర్దం కాదు ..మా అక్కా వాళ్ళింట్లో ఫోన్ అది పడుకునే రూం లోనే ఉంటుంది కాబట్టి దానికా ప్రోబ్లెం లేదు...నాకా వీలు లేదే ...


మెల్లిగా నేను తనమాటలకు అలవాటు పడటం మొదలు పెట్టాను.. ఎక్కడ ఫోన్ వస్తుందో అని భయం ప్లేస్ లో ఈ రోజింకా ఫోన్ చేయలేదేంటి అని నాకు తెలియకుండానే ఎదురు చూడటం మొదలైంది ...ఈ లోపల మా అక్క వచ్చింది.. అదెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న నేను రాగానే దాన్ని మేడ మీదకు తీసుకువెళ్ళి నా బాధలన్నీ ఇంకో రెండు కలగలిపి మరీ చెప్పాను.. అది వెంటనే ముందు నాకు చీవాట్లు వేసేసింది.. బుద్ది ఉందా నీకు ,వాళ్ళేదో అంటే దిక్కుమాలిన మొహమాటం ఒకటి వేసుకుని అతనితో మాట్లాడటం మానేస్తావా ... మంచాడు కాబట్టి మళ్ళీ, మళ్ళీ పిలిచి మాట్లాడాడు లేక పోతే దీనికి ఈ పెళ్ళి ఇష్టం లేదనుకునేవాడు.. అయినా ఇప్పుడు మాట్లాడితేనే కదా మీ ఇద్దరికీ మద్య ఫ్రెండ్షిప్ కుదిరేది ..దేనికి పనికొస్తావే తినడానికి తప్ప.. అని దులిపేసింది..ఇది మరీ బాగుందే అందరూ నన్ను అనేవాళ్ళే అన్నాను ... ఏడ్చావ్ ఏవరేమంటారు నేనూ చూస్తా.. నాన్నకి నేను చెప్తాలే .. నన్నూ ఇలాగే... మీ బావతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా పెళ్ళి చెసేసారు.. అది సరే గాని నువ్వు అన్నా బయటకు వెళ్ళి ఫ్రీగా మాట్లాడచ్చు కదా అంది..జరిగిన ఆ ముచ్చట కూడా చెప్పాను .. ఏమనుకుంటాడే ఇదెంత పీనాసో అని అనుకునే ఉంటాడు అంది.. అలా అనలేదు కాని నువ్వు కాల్ చేయచ్చు కదా మీ ఇంట్లో అంత ఫ్రీగా లేకపోతే అన్నాడు రెండు సార్లు ..పైగా ఎల్లుండి అక్క పెళ్ళి కదా రేపు పెళ్ళి కూతురిని చేయడం అదీ ఉంటుంది కదా అందుకే కాల్ చేయద్దని మరీ,మరీ చెప్పాను అన్నాను...హూం ..సరేలే ఈ రోజు బయటకు నాతో రా శుభలేఖలు పంచడం తో పాటు ఫోన్ కూడా చేద్దువు గాని అని ఇంట్లో వాళ్ళతో గొడవ పడి మరీ నన్ను బయటకు తీసుకు వెళ్ళింది ..


పస్ట్ టైం భయం లేకుండా మా ఆయనతో మాట్లాడే చాన్స్ వచ్చేసింది నాకు ... ఏంటో నెంబర్ డైల్ చేస్తుంటే చాలా హుషార్ అనిపించింది.. అటునుండి హలో అని వినబడగానే హాయ్ ఎలా ఉన్నారు అన్నాను ..ఏవరూ అటునుండి ప్రశ్న.. చ్చా.. గొంతువినంగానే గుర్తుపట్టేసే మేధావులు కదా చెప్పుకోండి చూద్దాం అన్నాను..ఏమో అండి మీకు తెలుసా నేను అటునుండి ప్రశ్న .. మీరు కేవలం గొంతు మాత్రమే గుర్తుపట్టి మాట్లాడతారు..నేను శ్వాస విని కూడా గుర్తుపట్టేస్తా.. నాకు హుషారులో మాటలు వరదలా వచ్చేస్తున్నాయి ..మీ పేరేంటండి మళ్ళీ ప్రశ్న.. హూం ఈ మనిషికసలు కొంచెం కూడా సరదా లేదు గెస్ చేయడానికి అని కాస్త తిట్టుకుని నేనూ అని నా పేరు చెప్పాను.. ఒహ్ మీరా అండి, మావాడు ఇప్పుడే బయటకు వెళ్ళాడు ...ఇప్పుడే వచ్చేస్తాడు ..మీరు కాల్ చేసారని రాగానే చెప్తాను ...సారీ అండి మీరనుకోలేదు ఆయన ఫ్రెండ్ కంగారు పడిపోతున్నాడు ..నేను ఎప్పుడు ఫోన్ పెట్టేసానో నాకే తెలియదు.. కాసేపు అయోమయం గా అనిపించింది .. ఏం మాట్లాడాను పది సార్లు గుర్తు తెచ్చుకున్నాను.. తను అనుకుని ఎక్కువతక్కువ వాగలేదు కదా.. చాలా సిగ్గుగా అనిపించింది.. ఎవరూ అని కనుక్కోకుండా ఎందుకొచ్చిన బేషజాలు నాకు ..ఇలాగే కావాలి నాకు ..అసలు బుద్దిలేదు అని నన్ను నేను తిట్టుకుంటూనే ఉన్నాను.. ఏమనుకున్నాడో ..ఆ అబ్బాయి తనకి ఏమని వర్ణించి చెప్పాడో ...జోకులేసుకుంటున్నారేమో ...వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్పేసాడేమో అతను.. మిగిలిన వాళ్ళు నవ్వుతుంటే ఇతనికి చిన్నతనం గా అనిపించిందేమో ...ఇలాంటి ఏమోలతో చాలా చాలా అనుకుని ఇంటికొచ్చేసాను.. యెహే పో ఎక్కువ ఆలోచించక ఒక్కోసారి అలా అవుతుంది అని అక్క తిడుతున్నా వినదే నా మనసు..


మొదటి సారి తన ఫోన్ కోసం నిమిషం నిమిషం ఎదురు చూసాను.. నేను ఫోన్ చేసాను అని తెలియగానే తప్పకుండా ఫోన్ చేయాలి కదా.. ఇంకా ఎందుకు చేయలేదు ఒక పక్క ఉక్రోషం ....మరొక పక్క కోపం.. నిద్ర రాదు.. ఆకలి వేయదు.. ఏడుపు వస్తుంది తప్ప... మరుసటి రోజు కూడా ఎదురుచూస్తునే ఉన్నాను ...ఫోన్ చేస్తారని.. నాకు నేనే చేయాలంటే భయం వేసింది ... ఎక్కడో ....నేను ఫోన్ చేసానని తెలిసినా తను పట్టించుకోలేదన్న వళ్ళుమంట కొంచెం ... ఆ రోజంతా అలాగే గడిచిపోయింది.. మరుసటి రోజు అక్క పెళ్ళిలో అందరు కిల కిలా..కల కలా తిరుగుతున్నా నాకు మాత్రం ఎవరితో మాట్లాడ బుద్దివేయదు ..నవ్వబుద్ది వేయదు ... మనసంతా పిండేసినట్లు ఒకటే బాధ ... నేనూ కూడా పెళ్ళి పెద్దలా కూర్చున్నా కుర్చీలో ఒక్కదాన్నే విడిగా ... పెళ్ళివాళ్ళు వచ్చేసారు అన్నమాట వినగానే హడావుడి మొదలైంది .... అప్పుడు గుర్తు వచ్చింది తను మాటి మాటికీ అనే వారు మీ అక్క పెళ్ళికి వస్తాను.. పెళ్ళి కొడుకు తరుపు నుండి.. తను కూడా మా వూరే కదా.. మాకు తెలిసిన వాళ్ళే ..అని ఏడిపించే వారు ..నేను వద్దని బ్రతిమాలేదాన్ని ..ఒక వేళ
నన్ను సర్ ప్రైజ్ చేయాలని నిజంగానే వచ్చేసాడేమో ...అందుకే ఫోన్ చేయలేదేమో ...ఆ ఆలోచన రావడం పాపం పెళ్ళి పందిరి అంతా రంగుల రాట్నంలా తిరుగుతునే ఉన్నాను...ఎక్కడో ఆశ వచ్చారని.. పెళ్ళి అయిపోయి ఇంటికి వచ్చేసాం గాని తను కనబడలేదు..


మరుసటి రోజు డల్ గా కూర్చున్నా ... కొత్త ఆలోచనలేం రాక నా మెదడు కాసేపు నిశ్శబ్ధంగా ఉంది.. మా ఇంట్లో వాళ్ళందరూ అమ్మానాన్నల మీద బెంగనేమో అనుకుని అంతకుముందే బోలెడు ధైర్యం చెప్పారు..మా నాన్న నా చిన్నప్పటినుండి వాడుతున్న బజాజ్ స్కూటర్ మీద కూర్చుని ఆలోచిస్తున్నాను.. ఎప్పటి నుండో ప్రేమగా చూసుకున్న వారినందరినీ వదిలి వెళుతున్నందుకు బాధ పడకుండా నిన్నగాక మొన్న వచ్చిన అతని గురించి అలా ఎదురుచూడటం నామీద నాకే కోపం వచ్చేస్తుంది ... సరిగ్గా అప్పుడు ఎవరో తలుపు తీసుకు వచ్చి, నా పేరు చెప్పి మీరేనా అండి అన్నారు..నేనే అన్నాను ఎవరూ అని చూస్తూ ..మీకు కొరియర్ అని ఒక పేకెట్ ఇచ్చారు..నేను అది ఓపెన్ చేస్తుండగానే అక్కకు బావగారు కొరియర్ పంపారూ అని మా పిన్ని కొడుకు లాక్కుని ఒకటె పరుగు ...మొదటి సారి పీ .టి ఉషలా పరిగెట్టి అందరిమీదా ఇష్టం వచ్చినట్లు అరిచేసి దాన్ని పట్టుకుని రూంలోకి పోయి తలుపు వేసుకుని ఓపెన్ చేస్తె మావారు నాకు మొదటి సారి పంపిన కానుక ముదురు ఆరెంజ్ కలర్ చీర ... చిన్న లెటెర్ ..అది అందుకున్న తరువాత ,చదివిన తరువాత మనసులో భారం అంతా తీరిపోయినట్లు వెక్కి వెక్కి ఏడ్చాను... అలా నేనూ ప్రేమించాను ... ప్రతి ప్రేమికులూ అనుభవించే ఆనందాన్ని, బాధను అనుభవించాను ఆ చీర ఇప్పటికీ నా దగ్గరే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా ... ఆ తరువాతా ఆయన నాకు ఎన్నికొన్నా దాని స్థానం దానిదే ...

10, మే 2009, ఆదివారం

అమ్మ



అమ్మ గురించి ఇప్పటికి వేల వేల కవితలు,కావ్యాలు వచ్చేసి ఉంటాయి ..అయినా అమ్మ గురించి చెప్పమంటే ప్రతి ఒక్కరు తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఆనంద పడిపోతాం ... నేనెప్పుడూ అమ్మ కి మదర్స్ డేలు, అమ్మకి బర్త్ డే లు జరపలేదు .. అసలు అమ్మ,నాన్న పెళ్లి రోజు కుడా నాకు తెలియదు .. కాని అమ్మ నా జీవితం లో ఒక ముఖ్య భాగం ..

చిన్నపుడు మా అక్క ,చెల్లిళ్ళం చిన్న విషయం చెప్పాలన్నా మా నాన్న దగ్గరకు పరిగేట్టేవాళ్ళం .. పొండే మీకు మీ నాన్న ఇష్టం ..నేను కనబడను అని అమ్మ అప్పుడప్పుడు ఉడుక్కునేది ... కాని అమ్మ ప్రభావం మా మీద ఎంత ఉందో మా పెళ్ళిళ్ళు అయ్యాకా గాని తెలియలేదు..

అమ్మ దగ్గర నేర్చుకున్న అతి ముఖ్య విషయం.. పని ని ఇష్టం గా చేయాలి గాని కష్టం గా చేయకూడదు అని .. అమ్మ ని చిన్నప్పటి నుండి చూస్తున్నా .. ఏ పని అన్నా ఇట్టే చేసేస్తుంది ... అస్సలు విసుక్కోదు..పని మనిషిని పెట్టదు, నీకెంత ఒపికమ్మా అనగానే ..ఎవరికిరా చేస్తున్నా నా పిల్లలకే కదా ...అయినా ఇప్పటి నుండే మనం ఒకరి మీద ఆదారపడ్డామనుకో వయసు ఎక్కువయ్యే కొద్ది అసలు చేయలేము.. బండెడు అంట్లు చూసి భయ పడే కన్నా వాటిని ముందేసుకుని నీకు నచ్చిన నాలుగు పాటలో ,లేక మరేదన్నా పనికొచ్చిన విషయం గురించో ఆలోచిస్తూ తోమేసుకుంటే పనికి పని అయిపోతుంది , శ్రమా తెలియదు ... అనేది ... ఇప్పుడు సింకు నిండా గిన్నెలు చూడగానే ఒక సుశీల ,జానకి ని అయిపోతూ ఉంటా ఆ విషయం గుర్తు తెచ్చుకుని ...


ముఖ్యం గా అత్తింటి లో ప్రతి విషయం పుట్టింటికి చెప్పడం అసలు ఇష్ట పడేది కాదు .. మనకు వచ్చే చాలా సమస్యలు మనం పరిష్కరించుకోగలం .. వాటిని చాంతాడులా ఉహించుకుని ఎక్కడో ఉన్న అమ్మా నాన్న్నలను భయ పెట్టడం మంచిది కాదు ..సమస్య మన చేతులనుండి జారిపోతుంది అన్నపుడే చెప్పాలి అనేది.. తను పెళ్లి అయికోత్తగా మా ఇంటికొచ్చినపుడు మా నాన్న వాళ్ళ ఇల్లు తాటాకుల ఇల్లు అంటా , అది కుడా కాస్త వర్షం వస్తే కారిపోయేది .. అప్పుడు అమ్మ నగలు ,పెద్దమ్మ నగలు మొత్తం అమ్మేసి అప్పు చేసి మా ఇల్లు కట్టారు.. పైగా మరుదులందరూ చిన్నపిల్లలు,నాన్న ,పెదనాన్న సంపాదన మీదే కుటుంభం అంతా నడవాలి .. ఒక్కో సారి మాకు పాలు ఇవ్వడానికి కుడా ఇంట్లో పాలు సరిపోయేవి కావంట.. అప్పుడు పెద్దమ్మ ,అమ్మ పాలకు బదులు నీళ్ళ లో పంచదార కలిపి పట్టేవారంటా.. అమ్మా మరి నీకు కోపం రాలేదా ..నీ నగలన్నీ అమ్మేస్తే .. పైగా సొంత ఇల్లు కాదు ఇది ఉమ్మడి కదా ..మీ డబ్బులతో పిల్లలకు పాలు కుడా కొనలేక పోతున్నందుకు బాధ కలిగి అమ్మకు ,నాన్నకు చెప్పలేదా అంటే ...ఏమోనమ్మా అప్పుడు అందరం తడవకుండా ఇల్లు కట్టుకుంటున్నాం అని అనిపించేది నాకు,పెద్దమ్మకు .. అంతకు మించి ఏమి తెలిసేది కాదు ..,,, పైగా మీ చిన్నాన్నలందరూ చిన్న పిల్లలు , మేము వదిలేస్తే ఎవరు చూస్తారు , మీకు సరి అయిన తిండి పెట్టక పోవడం బాధ అనిపించేది కాని అప్పుడు మాకు సొంత కాపురాల ఆలోచనే వచ్చేది కాదు .. పోనిలే ఆ పుణ్యమేనేమో అందరం బాగున్నాం అనేది..


అలాగే పుట్టింటిని అస్సలు తేలిక చేసేది కాదు .. మా మావయ్య మా తాతగారి ఆస్తులను మొత్తం కరగపెట్టేసాడు వ్యాపారాల పేరు చెప్పి .. ఎప్పుడన్నా అక్క ఆ విషయం మాట్లాడిందో అసలు ఊరుకునేది కాదు మా ఆస్తి విషయం మా నాన్న ,తమ్ముడు చూసుకుంటారు మీకెందుకు అని కంట నీరు పెట్టేసేది .. దెబ్బకి మా నాన్న మాకు వార్నింగ్ ఇంకోసారి ఆ విషయం ఎత్తారంటే ఊరుకోను అని ...అలాగే అత్తలు ఇంటికొస్తే చిన్నపిల్లలా ఎంత సంతోష పడిపోతుందో ..వాళ్లకు తన చీరలు ఇస్తుంది .. ప్రేమ గా మాట్లాడుతుంది ... ఆడపడుచు అధికారం చూపదు..


ఇలా అమ్మదగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను ..చిన్నపుడు ఒక సారి ఏదో చిన్న తప్పు చేసాను ,వెంటనే కొంత డబ్బు నష్టపోయాను .. అప్పుడు కోపం వచ్చి ఎందుకమ్మా దేవుడు పెద్ద తప్పులు చేసిన వాళ్ళను ఏమి అనడు .. మంచి వాళ్ళు చిన్న తప్పు చేస్తే మాత్రం వెంటనే శిక్ష వేస్తాడు అనగానే ఎందుకంటే మంచివాళ్ళు మళ్లీ మళ్లీ ఆ తప్పు చేయకుండా వెంటనే చుపుతాడన్నమాట... చెడ్డ వాళ్ళకు ముందు ముందు ఉంటుంది అని అనేది ..అమ్మను చూస్తేనే దైర్యం గా ఉంటుంది ...


అమ్మకు వాణిశ్రీ అంటే చాలా ఇష్టం .. వాణిశ్రీ చాలా బాగుంటుంది కదా అనేది టి వి లో చూస్తూ .. మా చెల్లి తెగ ఏడిపిస్తుంది .. ఏం టేస్ట్ అమ్మా .. నెత్తి మీద కుండ బోర్లించినట్టు ఆ హెయిర్ స్టైల్ అదినూ .. గంగ,మంగ సినిమా చూసాక ఇంకా దాని సినిమా చూడకూడదని ఒట్టేసుకున్నా అనేది .. ఏడ్చావులే,ఈ రోజు మీరు కడుతున్న చీర స్టైల్స్ అన్ని ఆ రోజు అది కట్టినవే అని ఉడుకున్నేది ... ఇప్పటికీ చెల్లి అమ్మను వాణిశ్రీ గారు అన్నం ఉడికి పోయింది కాస్త వార్చండి అని ఆ పేరుతోనే పిలిచి ఏడిపిస్తుంది ...


అమ్మకు బాగా చిన్న వయసులోనే పెళ్లి చేసేసారు పెళ్లి నాటికి తనకి 15 అంటా, 20 వచ్చేసరికి మేము పుట్టేసాము ... అందువల్ల ఎక్కడికి వెళ్ళినా మీ అక్క గారా అని ఎవరన్నా మమ్మల్ని అంటే అమ్మ ఫేసు ,నాన్న ఫేసు విడి విడి గా చూడాలి ... భలే నవ్వు వచ్చేది ... ఒక సారి అక్క అమ్మను బలవంతం గా కూర్చో పెట్టి బాగా మేకప్పు వేసి మంచిగా తయారు చేసి ఫోటో తీసింది ... అందులో అమ్మ ఎంత బాగుందో .. అమ్మ ఇప్పటికిని ఆ ఫోటో చూసుకుని మురిసిపోతుంది ... పాపం ఎప్పుడు తన చిన్న చిన్న కోరికలు కూడా బయట పెట్టేది కాదు ...


నా జీవితం లో మరచిపోలేని రోజు అమ్మ ,నాన్నఇక్కడకు రావడం .... అమ్మ తన పుట్టిన వూరు, మా వూరు తప్ప వేరే పట్టణానికి వెళ్ళలేదు .. ఒక సారి నాన్న హైదరాబాద్ తీసుకు వెళితే చార్మినార్ నీ కనురెప్ప ఆర్పకుండా ఎంతో ఆసక్తిగా చూసింది అంట .....అలాంటిది ఇక్కడ అంబరాన్ని తాకే భవంతులు విదేశీయులను ,ఇక్కడి జీవన స్థితిగతులను చూసి అమ్మ ఎంత సంతోషించిందో ..వణుకుతున్న చేతులతో నా చేయి పట్టుకుని అలా అన్నీ చిన్న పిల్లలా చూస్తూ ఉంది ...


అమ్మ ఇండియా వెళ్ళాకా, ఒక సారి ఫోన్ చేస్తే చెల్లి మాట్లాడింది .. అమ్మా తల్లీ నువ్వు బాగానే అన్నీ చూపావు గాని ఇక్కడ మమ్మల్ని ఒక రేంజ్ లో తినేస్తుంది అనుకో.. నువ్వు గ్రీన్ లైట్ వస్తే అమ్మ చేయి ఇలా పట్టుకుని రోడ్ దాటించావ్ అంట అని మా చేతులు పట్టుకుని రోడ్ కి అవతల తీసుకుపోయి మరి చూపిస్తుంది.. చిన్నపుడు నేను దాని చేయి పట్టుకుని నడిపిస్తే అది ఈ రోజు నా చేయి పట్టుకుని నడిపించింది అని మద్య మద్య సెంటిమెంట్ డైలాగ్స్ ఒకటి .... పోనీ అక్కడితో ఊరుకుందా పెద్ద జోకు ఒకటి పేల్చింది ... ఒకసారి ఏదో పార్టికి నువ్వు తయారు అయితే అచ్చం హేమా మాలినిలా ..ఏది , అక్షరాలా మన డ్రీం గర్ల్ హేమామాలినిలా అనిపించావంట.. పాపం మద్యలో వాళ్ళెందుకు లేమ్మా ..ఏదో ముంబాయిలో ప్రశాంతం గా బ్రతుకుతున్నారు వింటే బాధ పడతారు అన్నా వినిపిన్చుకోదు ... అని ఏడిపిస్తూ ఉంటే నోర్ముయ్యి గాడిదా నీకెందుకే అంత కుళ్ళు మా అమ్మ నన్ను పొగుడుకుంటే అని తిట్టాను ..లేకపొతే ఎంటక్కా,ఇప్పటికీ 89 సార్లు చెప్పింది ... ఇంకో 11 సార్లు చెబితే సెంచరి కొట్టేస్తుంది.. వచ్చిన వాళ్లకు, వెళ్ళిన వాళ్లకు ఆ ఫోటోలు చూపడం ,పొగడటం అంటుంటే 89 కాదు 999 సార్లు చెప్పినా వినాల్సిందే అని ఫోన్ పెట్టేసా ...


ఇలా ఎవరి అమ్మ గురించి వారు పుంఖాను పుంఖాలు గా రాయచ్చు ... కొసమెరుపేంటంటే ఎంత సేపూ మీ అమ్మ గురించేనా రాయడం ,మీ అత్తగారి గురించి ఏమీ రాయవా అన్నారు మావారు,నాకేం తెలుస్తుంది మీ అమ్మగారి గురించి మద్యలో వచ్చాను అంటే ఛా అంటూ వేటకారం చేసారు ,సరే మీరూ చెప్పండి మీ అమ్మ గారి గురించి అనగానే నవ్వేసుకుంటూ మరి చిన్నపుడు మా అమ్మ నేను ఎంత అల్లరి చేసినా ఏమీ అనేది కాదు ,నేను వీదిలో పిల్లలందరినీ కూడెసుకుని గోళీలాట ఆడి గంపలు గంపలు గోళీలూ తెచ్చి ఇంట్లో దాచేవాడిని..చెప్పేది ,చెప్పేది .. ఇల్లంతా చెత్త చేయకని.. నేను వినను కదా వాటిని తీసుకుపోయి బావిలో పడేసేది ..బావి పూడిక తీసేటపుడు తెగ వచ్చేవి.. ఇంకా పెద్ద పెద్ద తొట్టేలలో రంగు రంగుల చేప పిల్లలు వందల కొద్దీ పెంచేవాడిని ..వద్దురా అంటే వినేవాడిని కాదు ..ఇంట్లో నీళ్ళు అన్నీ వీటి కోసం వాడెసే వాడిని ... ఇంకా ఫ్రెండ్స్ అందరినీ ఇంటికి తీసుకొచ్చి అమ్మ చేసిన తినుబండారాలన్నీ పంచే వాడిని.. ఆంలెట్ లేకపోటే అన్నం తినే వాడినే కాదు.. పాపం ఓపిక లేకపోయినా వేసేది నా కోసం అని ట్రైన్ బండిలా చక చక చెపుతున్న మా ఆయన్ని ఆపి ఇంక ఇప్పుడు మా అమ్మ గురించి చెప్పండి అన్నాను .. మీ అమ్మ గురించి నేనేం చెప్పను నాకేం తెలుస్తుంది అన్నారు.. నేను నవ్వితే ,అర్దమైనట్లు హమ్మనీ నువ్వు తక్కువదానివి కాదు అని ఉడుక్కున్నారు

కాబట్టి ఎవరి అమ్మ గురించి వాళ్ళూ గ్రంధాలు రాసేయచ్చ్చన్న్నమాట :)

4, మే 2009, సోమవారం

నా పెళ్లి చూపులు




పెళ్ళికి ముందు అందరు అమ్మాయిల్లాగే నాకూ కాబోయే శ్రీవారి మీద అనేక ఆలోచనలు వచ్చేవి ..ఎప్పుడన్నా మేడ మీద కరెంట్ పోయినపుడు వెన్నెలలో అటు ఇటు పచార్లు చేస్తూ .. ఈ వేళ లో నీవు ఏం చేస్తూ ఉంటావో ,అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేనూ .....అని ఎవరికీ వినబడకుండా పాడేసుకుంటూ ఆలోచించేదాన్ని ... ఈ టైం లో ఏం చేస్తున్నాడో ,వ్యాపారమా ? ఉద్యోగమా? లేక ఇంకా చదువుకుంటున్నాడా.. ఒక వేళ పక్కింటి అమ్మాయికో ,ఎదురింటి అమ్మయికో సైటు కొడుతూ బిజీగా ఉన్నాడా ? లాంటి వాటి తో పాటు ఎలాంటి వాడు వస్తాడో అన్న భయం కూడా ఉండేది ...


అయితే చిన్నపుడు బావిలో కప్పలాగా ఎంత సేపూ మా కాలేజ్ కి వెళ్లేదారి లో చిన్నపాటి షాపులు ,దుకాణాలు చూస్తూ పెరిగానేమో ..నా ఊహల్లో కూడా మా ఆయన పుస్తకాల షాపు ఓనర్ లాగా , బట్టల షాపు వాడిలా తప్ప ఇంకోరకం గా కనిపించేవారు కాదు ...( ఈ పోస్ట్ చదివినట్లయితే మా ఆయనకు ఈ వాక్యం కనబడ కూడదు గాక ) .. సరే తరువాత తరువాత సినిమాల్లో రిక్షా వాడు కూడా డ్రీమ్స్ విదేశాల్లో తప్ప ఇండియా లో ఊహించుకోక పోవడం చూసాకా ...అరె ...రే అని నాలుక కరుచుకుని పాపం మా ఆయనకి ఇస్త్రీ షర్టు , టై కట్టాఅనుకోండి ...


సరే మొత్తానికి నాకూ పెళ్లిచూపుల తతంగానికి టైము వచ్చేసింది.. ఒక రోజు ఉదయాన్నే ఆరు గంటలకు అమ్మ హడావుడిగా నిద్ర లేపి మొహానికి కాస్త గంధం రాసుకోవచ్చు కదమ్మా అంది ... అసలే మాంచి నిద్రలో ఉన్నానేమో పిచ్చ కోపం వచ్చింది ..కాని అరిచే ఓపిక లేక మళ్లీ ముసుగుతన్నాను ....కాని అప్పటికే మన బుర్ర పాదరసంలా పనిచేయడం మొదలు పెట్టింది .. మొహానికేమన్నా రాస్తే గయ్యిమని అరిచే అమ్మ ఇంత ప్రొద్దున్నే పిలిచి మరీ, ఏదన్నా రాయమంటుంది అంటే పెళ్లి చూపులన్నమాట .. మొన్నే ఒక ఫోటో చూపారు ... అందులో అబ్బాయిని చూడగానే ....అబ్బా ఎంత బాగున్నాడో అనిపించలేదు, పోనీ ఇలా ఉన్నాడు ఏంటబ్బా అనిపించలేదు.. అసలే ఫీలింగు కలగ లేదు ... కుదరినప్పుడు ఆలోచిద్దాం లే అనుకున్నాను.. కాని ఇలా హడావుడిగా వస్తాడు అనుకోలేదు ...ఈ లోపల మా పిన్ని బలవంతం గా లేపి తయారుచేసింది ...


అసలే నిద్ర మద్యలో లేపారు ..అందులోను నాన్న,పెదన్నాన్న, చిన్నాన్నలందరి ముందు ఎవరో అబ్బాయి ని చూడటం ఒక ఎత్తు అయితే , సంతలో పశువులా ఇప్పుడు అక్కడ కుర్చోవాలన్న ఆలోచన మరొక వైపు ఉక్రోషం తెప్పిస్తుంది ... ఇంక ,మా పిన్ని దొరికిందే చాన్స్ అన్నట్లు వీదిలో వెళ్ళే ప్రతి పువ్వు నా జడలో తురిమేస్తుంది .. ఆ విషయం మీద పేచి పెడుతున్న నాకు, పెళ్లి కొడుకు వచ్చేసాడు అంట అనే మాట వినగానే చిరాకు ప్లేసులో కొంచెం ఆసక్తి .. అప్పటి వరకు నా చుట్టూ ఉన్న జనాలు ఒక్కరు కూడా పక్కన లేకుండా చూడటానికి వెళ్లిపోయారు ... మా చెల్లి అటుగా వెళుతూ కనబడింది.. పిలిచి అడుగుదాం అనుకున్నాను ఎలా ఉన్నాడు అని .. మళ్లీ భయం ఏమనుకుటుందో అని ... ఈ లోపల మిగిలిన వాళ్ళు నా దగ్గరకు వస్తూ ఫోటో లో కంటే బయట చాలా బాగున్నాడు కదా ,అసలు ఫోటో కి బయటకు సంభందమే లేదు అనుకోవడం వినిపించింది .. వీళ్లు కావాలని అంటున్నారా .. లేక నిజమా ? నాకేం పెద్ద ఆసక్తి లేనట్లు మొహం పెట్టి కూర్చున్నాను ..


ఈ లోపల నన్ను రమ్మన్నారు.. ఇదిగో తల వంచుకుని కూర్చో ,వాళ్ళు అడిగిన వాటికి సమాధానం చెప్పు..మా అమ్మమ్మ నస.. గాడిద గుడ్డేం కాదు ..నేనెందుకు తలవంచాలి ..కుదర్దంతే .. అని విసురుగా అని లేచి ఎదురుగా మా నాన్నను చూడగానే టక్కున బుద్దిగా తల వంచేసాను ... మాదే పెద్ద కుటుంభం అంటే తనది మూడురెట్లు పెద్ద కుటుంభం అంట .. ఒకటే జనాలు ... పెళ్లి చూపులా.. పెళ్ళా ? అని ఒక డవుటు వచ్చింది ... ఎదురుగా కూర్చున్నాను గాని అబ్బాయిని ఎలా చూడాలో తెలియడం లేదు... అందరు నన్నే చూస్తున్నారేమో ??... చూస్తే ఏంటి !! .. అసలు ఒకరినొకరు చూసు కోవడానికే కదా పెళ్లి చూపులు.. అయినా ఎందుకు భయం గా ఉందొ తెలియడం లేదు , ఏదో మామూలుగా ఎక్కడో చూస్తున్నట్లు గా తల ఎత్తి ఒక్క సారి ఎదురుగా చూసాను .. దెబ్బకు అయోమయం లో పడిపోయాను.. ఎదురుగా ఒక 20 మంది .. అందులో 10 మంది మగవాళ్ళు ..ఇందులో పెళ్లి కొడుకేవరు??? పక్కకు చూస్తే నాన్న నా వైపే చూస్తూ ఉన్నారు.. ఎవరిని చూసినా ఏమనిపించదు గాని నాన్నను చూస్తే మాత్రం భయం ..


సరే మా ఇద్దరినీ మాట్లాడుకోమంటారుగా అప్పుడు చూద్దాం లే అనుకున్నాను .. అబ్బే.. వాళ్ళ గోల వాళ్ళదే గాని నా గొడవ ఎవరూ పట్టించుకోరు.. అటు అబ్బాయి పరిస్థితి కూడా అదే ... అందులోను అమ్మ చిన్ననాటి ఫ్రెండు వాళ్ళ బంధుగణం లో ఉంది .. ఇంకేం మా అమ్మ అక్కడ బిజీ ... నాన్న కి కూడా అందులో తెలిసిన వారున్నారు ... అబ్బాయి గుణగణాల లిస్టు సేకరించడం లో నాన్న బిజీ .. ఇంకా పెళ్లి చూపులై పోయాయి పదండి ...పదండి అన్నారు ... అటు వాళ్ళు ఇటువాళ్ళు టాటాలు బై ,బై లు చెప్పేసుకుంటున్నారు ... నాకు కంగారు వచ్చేసి హడావుడిగా తిరుగుతున్న అక్కని పిలిచి .. అక్కా ఇదన్యాయమే పెళ్లి కొడుకును చూడలేదు నేను అన్నాను.. అక్క నా వైపు విచిత్రం గా చూస్తూ మరి అంత సేపూ అక్కడేం చేసావే అంది ... నా బొంద .. అసలు ఎవరన్నా ఎదురుగా అంత మందిని కూర్చో పెడతారా .. ఎవరూ అందులో తెలియలేదు.. పైగా నాన్న ఒకరు ఎదురుగా .. నాకేమో భయం వేసింది చూడటానికి అన్నాను ....ఏడ్చినట్లుంది .. మరీ అంత సిగ్గు అయితే ఎలాగా .. సరే నాతో రా అని కటకటాల దగ్గర కు తీసుకు వెళ్లి అదిగో ఆ బిస్కెట్ కలర్ షర్ట్ వేసుకున్నాడు చూడు ఆ అబ్బాయే అని చెప్పి వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోయింది ...


ఇక నా పాట్లు చూడాలి ఒక మనిషిని చూడటం ఇంత కష్టమా అనిపించింది.. తను సినిమాలో హీరోయిన్ లా మొహానికి ఏదో ఒకటి అడ్డం గా పెట్టుకుని నించుంటాడు.. కాసేపు ఎవరో అడ్డు వస్తే ఇంకాసేపూ మందారాలో చేమంతుల కుండీలో అడ్డు వచ్చేవి ... ఇంక విసుగు వచ్చి ఎహే పో ... సంబంధం కుదిరినప్పుడు కదా సంగతి అనుకుని ఇంట్లో కొచ్చేసాను.. వాళ్ళు వెళ్ళ గానే నాన్న నన్ను రూం లోకి పిలిచి ఏమ్మా నీ అభిప్రాయం ఏమిటి అన్నారు.. ఒక్క సారిగా కంగారు వచ్చేసింది నాకు ఏం చెప్పాలో తెలియక .. అబ్బాయి చాలా మంచాడు ..చదువుకున్నాడు ..చక్కని జాబ్ ...మనలాగే మంచి పేరున్న పెద్ద కుటుంభం ..కాకపొతే ఒకే ఇంట్లో ఉండరు అన్ని పక్క పక్క ఇల్లులు ...అన్ని రకాలుగా మాకు నచ్చింది ..నువ్వేమంటావ్.. ఇదిగో చూడు నీకు నచ్చక పొతే ఇప్పుడే చెప్పేసేయి .. ఒక్క మాట కూడా ఎందుకు నచ్చలేదు అని అడగను.. కేన్సిల్ చేసేస్తాను అన్నారు ...నాకేం చెప్పాలో తెలియడం లేదు ...అబ్బాయిని చూడలేదు అంటే నమ్మరు ..నేను తలెత్తి చూసినపుడు నాన్న నన్ను చూసారు ..ఒకవేళ అన్నా సరే ఫోటోలో చూసావ్ కదా అంటారు ..బయటకు ఫొటోకు తేడా ఉంది అంట కదా అంటే చండాలం గా ఉంటుందేమో .. అయినా ఫేసులో ఏముందిలే ..అబ్బాయి తో మాట్లాడించలేదు .. ఎలాంటి వాడో ???... హుమ్ ఒక అయిదు నిముషాలు మాట్లాడితే మాత్రం ఏం తెలిసి ఏడుస్తుంది .. నీ జీతం ఎంత ..నీది ఏం కంపెని .. ఏం హాబీలు లాంటివే గా ... నా ఆలోచనలు ఆపేస్తూ .. ఏంటి అబ్బాయి నచ్చలేదా అన్నారు ఆత్రుతగా .. అబ్బే అదేం లేదు నాన్న మీ ఇష్టం నాకు మాత్రం ఇలాంటివి ఏం తెలుస్తాయి అన్నాను .. మా నాన్న మొహం వెలిగిపోయింది ...


ఎలా ఉన్నాడు అబ్బాయి అంది అక్క రాత్రి పడుకున్నపుడు ... ఏమో ,మహానుభావుడు మొహం కనబడకుండా తెగ జాగర్త పడ్డాడు .. ఏమే నిజం చెప్పు .. పర్లేదా బాగానే ఉన్నాడా అన్నాను ... ఓసి గాడిద దేనికి పనికోస్తావే .. సరేలే రేపు ఇళ్ళ చూపులకు వెళుతున్నాం గా అక్కడ ఫోటో ఏదన్నా తెస్తాలే అంది ...అయినా జాతకాలు నప్పాలి .. వాళ్ళ పద్దతులు నచ్చాలి అప్పుడు కదా సంగతి అని పడుకున్నాను ... ఆ మరుసటి రోజు అమ్మ ,నాన్న పిన్నులు, పెద్దమ్మ,చిన్ననా ,పెదనాన్న పొలోమని వెళ్లిపోయారు వాళ్ళింటికి ... ఆ రాత్రి 10 గంటలకల్లా వస్తామన్నా వాళ్ళు 12 అయినా రాలేదు ...నాకు టెన్షన్ ఇక్కడ ... తరువాత నాన్న కాల్ చేసారు .. అమ్మా.. ట్రైన్ ప్రొబ్లెమ్ వచ్చి ఆగింది .. కంగారు పడకు అని ..హమ్మయ్య దేవుడా అనుకుని దణ్ణం పెట్టుకుని పడుకున్నాను .. ఆ తెల్లవారు జామున ఎప్పుడో నిద్ర పట్టింది ...


ఒకటే గల గల మని మాటలు వినబడటం తో మెలుకువ వచ్చింది ... .. అమ్మ నా చేయి పట్టుకుని తన బుగ్గకు ఆనించి మిగిలిన వాళ్ళతో మాట్లాడుతుంది ... లేచి కూర్చున్నాను .. ఏమైంది ఇంత లేటు అన్నాను.. వాళ్ళు రాత్రి పడ్డ కష్టాలన్నీ ఏకరువు పెట్టారు ... అమ్మా వాళ్ళు లాంచనాల గురించి ,పెళ్లి కానుకల గురించి మాట్లాడుకోవడం విని ఏంటి సంభందం కుదిరిపోయినట్లేనా అన్నాను అనుమానంగా.. కుదిరిపోయినట్లు కాదు కుదిరింది అంది పిన్ని ... ఎందుకో ఒక్క సారిగా మనసులో అది భయమో బెంగో మరొకటో తెలియదు గాని సన్నగా వణికాను..దేవుడిని దణ్ణం పెట్టుకున్నా.. అప్పుడే అమ్మ కళ్ళలో నీరు తెచ్చేసుకుంటూ ఇదిగో నాన్నా ... అక్కడ ఇక్కడలా చిన్న పిల్ల వేషాలు వేయకూడదు ..నువ్వే పెద్ద కోడలివి ...అందరూ పెద్ద కుటుంభాలు .. జాగ్రత్త గా ఉండాలి ... అంటూ అప్పగింతలు మొదలెట్టేసింది ....


మా బెంగను తేలిక చేయడం కోసం అనుకుంటా మా ఆఖరి చిన్నాన మొదలు పెట్టేసాడు .. ఊరుకో వదినా అది బెంగ పడటం ఏంటి .. మొన్న పెళ్లి చూపుల్లో చూసావా ఆ అబ్బాయిని ఎలా చూసిందో అన్నాడు.. ఎవరూ నేనా .. నీకో విషయం తెలుసా అసలు నేను ఆ అబ్బాయిని చూడలేదు అన్నాను కోపం గా .. ఛా.. అందుకేనేంటి వెళుతున్నపుడు కటకటాల నుండి తొంగి మరి చూస్తున్నావ్ ..నేను గమనించలేదేంటే .. అన్నీ చూస్తున్నా ...అన్నాడు ఉడికిస్తూ .. ఎహే ..పో ..నిజం గా నాన్న .. అసలు చూడలేదు ..అందుకే అక్క అక్కడినుండి చూడమంది.. అక్కడ కూడా చూడలేదు సరిగా అన్నాను ...కోయ్..కోయ్ అన్నాడు .. నీ ఎంకమ్మ నిజంగా ...చెపితే నమ్మవే .. అయినా ఎదురుగా అంత మందిని ఎవరన్నా కుర్చోపెడతారా .. పోనీ నన్ను ఏమన్నా ఆ అబ్బాయితో మాట్లడించారా .. మళ్లీ నేను చూసా అని అంటున్నారు అన్నాను కోపం గా .. అయ్యా బాబోయ్ చూసావా అక్కా .. ఆ అబ్బాయితో మాట్లాడలంటా ..మనరోజులు కావు మిగిలిన వాళ్ళు మొదలు పెట్టేసారు ...


నువ్వేమో గాని ఆ అబ్బాయి మాత్రం నిన్నే చూస్తూ కూర్చున్నాడు పాపం .. వెళ్ళేటప్పుడు కూడా నువ్వు కనబడతావేమో అని తెగ చూసాడు అన్నాడు చిన్నాన.. చెవిలో పువ్వులేమన్న కనిపిస్తున్నాయా అని పైకి అన్నా గాని మనసులో ఎక్కడో గర్వం ...మళ్లీ తనే అన్నాడు మీ ఇల్లు చాలా బాగుంది ,మీ ఆయన రూం కూడా ... అన్నట్లు మర్చిపోయానే మీ ఆయన గదిలో కాజోల్ ఫోటో ఉంది ... ఫేన్ అనుకుంటా ..ఇప్పుడు చూడండి, ఇక కాజోల్ సినిమాయే చూడదు .. పెళ్లి కాగానే ఆ ఫోటో పీకి పడేస్తుంది అన్నాడు ..అమ్మా చూడమ్మా ,ఎలా అంటున్నాడో ..నవ్వుతావేంటి అన్నాను ఉడుక్కుంటూ .... అసలు విషయం మర్చిపోయాను ... అసలు నీ గురించి ఏదన్నా చేపుతామేమో అని ఎంత ఆశగా చూసాడనుకున్నావ్... మావయ్య గారు ,మావయ్య గారు అని నా పక్కనే ఉన్నాడు తెలుసా అన్నాడు .. నేను నా ఆసక్తి తెలియ నివ్వకుండా మొహం పక్కకు పెట్టేసా.. కాసేపు అలా ఏడిపించి ఎవరి పనులు లో వాళ్ళు పడిపోయారు ..

అప్పుడు గుర్తువచ్చింది అవును ఫోటో తెస్తానంది ఏది అనుకుని దానికోసం వెతికాను.. మా పిన్ని రూం లో గాఢమైన నిద్ర లో ఉంది .. అక్కా ,అని బలవంతం గా నిద్ర లేపేసా .. ఎంటే అంది చిరాగ్గా ... ఫోటో తెస్తానన్నావ్ ... అన్నాను.. ఏం ఫోటో అంది మళ్లీ నిద్రలోకి వెళ్ళిపోతూ .. ఆ అబ్బాయి ఫోటో అన్నాను ... ఏమోనే ఎక్కడో పెట్టేసా ..తరువాత చూస్తాలే అంది .. తంతా... ఒక్క సారి లేచి చెప్పవే అని దాన్ని లేచేవరకు హింస పెట్టేసా ... తిట్టుకుని తిట్టుకుని లేచి వెదికి ఇచ్చింది .. గభ గభ చూసా ఎదురుగా గడ్డం తో పైన తెల్ల జుట్టుతో ,చేతిలో ఒక కర్రతో ,చేతిలో ఒక చిప్పతో ఒక ముసలాడి ఫోటో.. ఎంటే ఇది అన్నాను అయోమయం గా .... మీ ఆయన అంది మళ్లీ నిద్రపోతూ.. కాళ్ళు విరగ కొడతా ... ముందు నిద్రలే అని బలవంతం గా లేపాను .. అది విసుక్కుంటూ ..అబ్బా అది మీ ఆయనా కాలేజ్ లో నాటకం వేసినపుడు ఫోటో అంట తల్లి ... మీ అత్తగారు చెపితే చూడకుండా ఆల్బం లో నుండి దొంగ చాటుగా ఎత్తుకోచ్చా అంది ..నాకు విసుగొచ్చింది ..ఎందుకే నాతో ఇలా ఆడుకుంటారు ..ఇందులో ఏం చూడను ,అయినా అతనికి సరి అయిన ఫొటోస్ లేవా అన్నాను ... అబ్బా ఇంకొకటి తెచ్చాను కాని మీ ఆయనా కమలహాసన్ లాగ ఒక ఫోటోకి ఇంకో ఫోటోకి పోలికే లేదు,ఆ అడుగు ఫోటో చూడు అంది.. ఆ ముక్క ముందే ఏడవచ్చు కదా అన్నాను .. మళ్లీ నిద్రలేపావనుకో చితకోట్టేస్తా జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తూ అన్నట్లు మర్చిపోయానే మీ ఇంటి ఎదురుగా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు .. వాళ్ళు మీ ఆయనకు లైన్ వేస్తున్నారో ,వాళ్ళకే తను వేస్తున్నాడో కాస్త గమనించు అని నవ్వింది.. నీక్కుడా లోకువ అయిపోయానే బాబు అనుకుని , మళ్లీ తన ఫోటో చూడటం ఎవరన్నా చూసారో అయిపోతా అని పై మేడ ఎక్కి జాగ్రత్త గా అప్పుడు చూసాను ... ఒక పమేరియన్ కుక్కపిల్లను ఎత్తుకుని ,మెరూన్ టి -షర్ట్ లో చూస్తూ కనిపించారు... మరి పెళ్లి కుదిరిపోయినందుకో ,మరి నిజం గానే బాగున్నాడో తెలియదు గాని .. ఎందుకో నచ్చారు .. మిమ్మల్ని చూడటానికి ఇన్నాళ్ళు పట్టింది సార్... అయినా ఈ ఫోటోలో ఉన్నట్లైనా ఉందా మీ ఒరిజినల్ పేసు అనుకున్నా ...


ఆ వెంటనే తాంబూలాలు ముహూర్తం పెట్టేసారు ... ఇద్దరినీ ఒకరి పక్కన ఒకరిని కూర్చో పెట్టారు గాని ,నేను అసలు తల పక్కకు తిప్పలేదు భయం తో .. ఎటు చూసినా మా చిన్నానా ఆలి లాగా నోట్లో నాలుక బయట పెట్టి ఏడిపించడమే సరిపోయింది ... ఆ రోజు పాపం మా ఆయన నాతో మాట్లాడటానికి శతవిధాల ట్రై చేసారు అంట .. అమ్మో వాళ్ళింట్లో ఇలాంటివి ఒప్పుకోరని వాళ్ళ మావయ్య.. అబ్బబ్బే వాళ్ళే మనుకుంటారని మా వాళ్ళు మళ్లీ మమ్మల్ని మాట్లాడుకోనివ్వలేదు .... చివరకు వెళ్ళేటపుడు మా ఆయన పాపం తన విజిటింగ్ కార్డ్ నాకు అంద చేసి వెళ్ళారు ....
మరో సారి మళ్లీ మరికొన్ని విషయాలు :)

21, ఏప్రిల్ 2009, మంగళవారం

కాల మహిమ



నేనూ,మా అక్క ఒకే ఇంట్లో పుట్టినప్పటికీ మా ఇద్దరికీ ఏ విషయం లోనూ ఒకే అభిప్రాయం ఉండేది కాదు,ముఖ్యం గా డబ్బు విషయం లో అస్సలు లేదు... నేను చిన్నప్పటి నుండి మహా పొదుపు ( అంటే మావాళ్ళు కాస్త వక్రీకరించి పిసినారి అనేవాళ్ళు గాని అది ముమ్మాటికీ పొదుపే అన్నమాట ,మీరు వాళ్ళలా అస్సలు అలా అనుకోకండి,సరేనా ) అలా పొదుపుగా ఉండడానికి ఒక కారణం ఉంది , అది ఏంటంటే నేను ఎప్పుడు మా అమ్మా, నాన్నలు మాట్లాడుకోవడం విన్నా ఆ సంభాషణ ఇలా ఉండేది..

అమ్మ: ఏమండీ ఈ నెల ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ కావాలి ఖర్చులకి,మా తమ్మూడి కూతురు ఫంక్షన్ ,ఏదో ఒకటి కొనాలి ..
నాన్న :మొన్న 3000 ఇచ్చాను కదా, అందులో ఏం మిగల లేదా??
అమ్మ: ఇంకేం 3000 బాబు.. ఎప్పుడో అయిపోయాయి మీ పిల్లలకు పండగలకు డ్రెస్సులు కొనద్దా ..పాపం వాళ్ళకు సంవత్సరానికి కొనేదే రెండు జతలు, మద్యలో పండగలకు పుట్టినరోజులకు కొనేదే ఉండదు ..
నాన్న: మరి అంతకు మొన్న 1000 ఇచ్చాను అది??
అమ్మ: ఇంకేం వెయ్యి మీ పెద్దమ్మ గారి అమ్మాయి ఇంటికి వస్తే వాళ్ళకు బట్టలు పెట్టాము కదా
నాన్న: మరి అంతకు ముందో వెయ్యి ఇచ్చాను కదా ... ( ఈ సారి అమ్మకు కోపం ఒక రేంజ్ లో వచ్చేది )అంటే నేనేమన్నా తినేస్తున్నానా అలా అడుగుతారు ,మొన్న ఫలానా వాళ్ళ పెళ్ళి కి చదివింపులు అందులోనుండే ఇచ్చాను, మొన్న చుట్టాల తాకిడికి విపరీతమైన ఖర్చు ,ఈ నెల గ్యాసు ఇట్టే అయిపోయింది పైగా చలికాలం వేడి నీళ్ళూ కూడా కాయాలి కదా ,మీకందరికీ ఎసర్లులా మరగకపోతే స్నానం చేసినట్లే ఉండదాయే... మీకేమో లుంగీలూ సరిపోవడం లేదని రెండు తీసుకున్నాను .. కనీసం నా కోసం ఒక్క చీరన్నా కొనుక్కున్నానా ,ఆ విషయం అసలు అడిగారా మీరూ.. అంతేలేండి మీ వాళ్ళు అంటే పరిగెట్టుకుని అడగక పోయినా సరే అన్నీ చూస్తారు ఏటొచ్చీ మా వాళ్ళేకదా పై వాళ్ళూ ,,అక్కడ మాత్రం బాగా లెక్కలు అడుగుతారు ..వాళ్ళు మీకు ఎంత చేసినా అంతే .. (ఇంక కళ్ళ నీళ్ళు జర జర వచ్చేసేవి )..
నాన్న: అయ్యబాబోయి ఇప్పుడేమన్నానే బాబు ఈ నెల ఖర్చు విపరీతం గా ఉంది అందుకే అన్నాను సరేలే ఇస్తాను .. ఏంటో ప్రతి నెలా ఖర్చు పెరుగుతుందే కాని తగ్గడం లేదు ..


ఈ టైపు లో ఇంచుమించుగా ఇదే మాట్లాడుకోవడం విని విని మా నాన్న మీద విపరీతమైన జాలి వచ్చేసేది..అయ్యో పాపం ఎన్ని కష్టాలో కదా పైగా ఇంత మంది ఆడపిల్లలం ..మా చదువులు ,పెళ్ళీళ్ళు ఎలా చేస్తారో అనే భయం వల్లో మరొకటో తెలియదు కాని డబ్బులు అస్సలు ఖర్చు చేసేదాన్ని కాదు .. ఇంటికి చుట్టాలొచ్చినా, ఎవరన్నా ఏదన్నా కొనుక్కోమని డబులిచ్చినా అస్సలు ఖర్చుపెట్టేదాన్ని కాదు ..మిగిలిన వాళ్ళు అయిస్ క్రీములూ అని డ్రింకులని కొన్నా నేను అహనాపెళ్ళంట కోటా లాగా చూసి ఆనందపడిపోయేదాన్ని ,పైగా మనం మున్సిపల్ స్కూల్ విధ్యార్ధినులం కాబట్టి పుస్తకాల విషయం లో కూడా ఖర్చు చెప్పేదాన్ని కాదు ...అక్క, చెల్లెళ్ళ పుస్తకాల్లో మిగిలిన పేపర్స్ చింపేసి బైండింగు చేసుకుని మరీ రాసేదాన్ని కాని నాన్నను డబ్బులు అడిగేదాన్ని కాదు ...ఇవన్నీ కాక నాకు మరొక గొప్ప సులక్షణం ఉంది ... నేను దాచిన డబ్బులు నాకోసం కొనుక్కోను ..పెళ్ళికి ముందు మా నాన్నకి పెళ్ళయ్యాక మా ఆయనకు ఎవరికో ఒకరికి ఇస్తానుగాని నాకోసం కొనుక్కోబుద్ది కాదు ..ఇదేం అలవాటో నాకు అర్దం కాదు ...కాకపోతే వాళ్ళు ఆ డబ్బులను సద్వినియోగం చేయాలన్నమాట ..మొన్న ఎంతో కష్టపడి కూరలకిచ్చిన డబ్బులను కొంత దాచి ఒక 600 $ మా ఆయనకిస్తే ఎంచక్కా రాత్రికి ఒక క్రికెట్ బేట్ ,బాల్స్ చెత్త చెదారం కొనేసి వచ్చేసారు.. దెబ్బకి కుక్కలా ఏడ్చాను అదివేరే విషయం అనుకోండి..


సరే డబ్బు విషయం లో నేను ఇలా ఉంటే మా అక్క నాకు పక్కా వ్యతిరేఖం ...ఈ రోజంటే చిరంజీవి ప్రేమే లక్ష్యం ,సేవే మార్గం అంటున్నాడు గాని అది ఒక పదిహేనేళ్ళ ముందే ఈ స్లోగన్ ని బట్టీపట్టేసింది ... వాళ్ళ స్కూల్ లో ఎప్పుడూ రెడ్ క్రాసు ,బ్లూక్రాసు అని ఏంటో ,ఏంటో తెగ ఉండేవి ..అందులోనూ ఇది లీడర్ ఒకటీ .. దీనిపని ఏంటంటే ఎప్పుడూ డబ్బులు వసూల్ చేయడం అవి వాటికి జమ చేయడం .. ప్రొద్దున లేస్తే.. నాన్నా దానికి చారిటి ఇవ్వండి, దీనికి డబ్బులు ఇవ్వండి అని ఒకటే గొడవ.. ఇంట్లో ఎక్కడన్నా డబ్బులు దొరికాయంటే చాలు ఎవరివి ,ఏంటి అని అడిగేది కాదు తీసుకువెళ్ళీ వాటికి ఇచ్చేసేది .. దీని బాధ పడలేక నా డబ్బులు పిల్లి ముప్పై మూడు ఇళ్ళల్లో తన పిల్లలని దాచినట్లు నేనూ అలా దాచుకోవలసి వచ్చేది .. అంతటితో ఆగేదా ,విపరీతమైన దాన ధర్మాలు.. అమ్మ ఒకసారి షాప్ కి వెళ్ళి ఏదో కొనుక్కు రావే అని డబ్బులిచ్చి పంపితే దారిలో అడుక్కుంటున్న ముసలావిడకు ఇచ్చేసి వచ్చేసింది.. ఇంటికెవరన్నా వచ్చి అడుక్కుంటే వాళ్ళకు అన్నం పెట్టీ పంపేవరకూ ఊరుకునేది కాదు ..ఒక సారి ఇలాగే మండుటెండలో ఒక సోది చెప్పే అమ్మాయి చిన్నపిల్లను వేసుకుని వెళుతుంటే ..ఆవిడకు చిన్న పిల్లను అలా కష్ట పెట్టద్దు అని దారంతా బుద్దులు చెప్పి ఇంటికి తీసుకొచ్చి మరీ అన్నం పెట్టి పంపింది ..ఆవిడ వెళీపోతూ వెళిపోతూ రెండు జతల చెప్పులను కూడా తీసుకు పోయింది అక్కడ పెట్టినవి..(అంటే ఆ అమ్మాయి వచ్చేటప్పటికి ఉన్న చెప్పులు వెళ్ళగానే మాయం అయిపోయాయి ..వేరే చాన్స్ లేదు ...ఒకవేళ ఆమే కాక పోతే పాపం శమించు గాక )


సరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే నాకు మరొక జలక్ ఇచ్చేది అడపాదడపా... రాత్రిళ్ళు పడుకునేటప్పుడు ఇలా చెప్పేది.. మెరుపు కలలు సినిమాలో కాజోల్ లాగా కన్నే మేరి మాతయో ఏదోనమ్మా అది అయిపోతాదట .. అలా అయిపోయి పేదలకు,దీనులకు సేవ చేస్తుందట..అందుకని ఆ సంవత్సరం కాంగానే బస్ ఎక్కి అక్కడెక్కడో ఏదో సేవాసదన్ ఉందిట అక్కడకు వెళ్ళి సేవ చేసి తరిస్తా అనేది ..ఇక చూస్కోండి నాకు అలా ఇలా భయం వేసేది కాదు .. అది కాదక్క సేవ ఇక్కడ నుండి కూడా చేయచ్చు కదే అంటే.. నన్ను పెద్ద అఙ్ఞానిని చూసినట్లు చూసి ఆగ్నస్ ఇలాగే అనుకుంటే మధర్ ధెరిసా అయిఉండేదా ..మంచిపనులు చేయాలంటే ఇంట్లో నుండి చేయలేం అని ఒక గంట క్లాసు పీకి అమ్మావాళ్ళకు ఇవేమి చెప్పద్దు వాళ్ళను నువ్వే చూసుకోవాలమ్మా అని రెండు పెద్ద పెద్ద డయిలాగులు చెప్పి ఎంచక్కా దున్నపోతు లా పడుకునేది.. ఇక నేను జాగారమే రోజూ ఇదెక్కడ వెళ్ళిపోతుందో అని రాత్రిళ్ళు పడుకునేదాన్ని కాదు ..పగలు పొద్దెక్కేవరకు లేవకుండా నానా తిట్లు తినేదాన్ని ....


మా అక్క అంటే మా ఇంట్లో అందరికీ మహా ఇష్టం ..నాన్నకు మరీనూ ...మీ అందరికన్న ముందు ఇదేరా నాన్న అని పిలిచింది అని తెగ మురిసిపోయేవారు.. అది ఆడింది ఆట ,పాడింది పాటలా ఉండేది.. పాపం ఆ పెద్ద కూతురు బిరుదువల్లే దాని చదువు మద్యలోనే అటక ఎక్కేసింది.. ఒక సారి మా తాతగారు (అమ్మ నాన్న) హడావుడిగా ఒక సంబంధం తీసుకు వచ్చారు .. అప్పుడే నా కూతురికి పెళ్ళి ఏంటి నేను చేయను అని మా నాన్న ... అదెలా కుదురుతుంది వెనకాలా ఇంకా ఉన్నారు.. మంచిది వచ్చినపుడు వదులుకోకూడదు ..అబ్బాయి కి బోలెడు ఆస్తి ,మంచి వ్యాపారం.. చదువు దేముంది .పిల్ల సంతొషం గా ఉండాలి గాని, మొన్న రెండోదాన్ని చూసే మా ఊర్లో నీకు ఇంత పెద్ద మనవరాలు ఉందా అని తెగ ఆక్చర్య పోయారు అని ఒకటే ఊదరకొట్టేసి పాపం మా నాన్నను హడలెత్తించేసారు.. ఇంకేంటి కట్ చేస్తే మా అక్క పెళ్ళీ ఘనం గా జరిగిపోయింది ...


మా ఇంట్లో అక్క పెళ్ళికి మేము పెట్టుకున్నంత బెంగ ఇంకే మిగిలిన ఆడపిల్లల మీద ఎవరూ పెట్టుకోలేదు... తాళి కడుతున్నపుడు ఇంక మీ ఇంటి ఆడపిల్ల వారి ఇంటి పిల్ల అయిపోయింది, ఇంటిపేరుతో సహా ఇక మీ ఇంటికి సంభందం తెగిపోయింది అని ఎవరో అనంగానే ...నాన్న బాధ ,మా బాధ వర్ణించలేము ... ఎన్ని రాత్రిళ్ళు పడుకోలేదో నేను అయితే ...అందరం ఒకే సమయాని అన్నం తినడం అలవాటేమో పొరపాటున దానికి కూడా అన్నం వడ్డించేసి కళ్ల నీళ్ళు పెట్టుకునే వాళ్ళం.. నాన్న సంగతి చెప్పనక్కరలేదు అంతా మీ నాన్న వల్లే .. నా కూతురిని నా నుండి వేరుచేసాడు అని అమ్మ మీద చూపించేసేవారు .. అందులోనూ అక్క వెళ్ళే ప్రతిసారి నాన్న!!అక్కడ ఎవ్వరూ నాకు తెలియదు.. ఉండలేకపోతున్నా ..నన్ను పంపకండి నాన్న ..చాలా దిగులేస్తుంది అనగానే.. పైకి.. అదేం లేదమ్మా ..అలవాటు అయిపోతుంది ..అమ్మ చూడు నీలాగే వచ్చేయలేదా అని సర్ది చెప్పి పంపి వెక్కి వెక్కి ఏడ్చెవారు .. పైగా అక్క కూడా చిన్నపిల్లఏమో అప్పటికి , దాని లెటెర్ అంతా నాన్న,నాన్న ఎప్పుడొస్తావ్ నన్ను మన ఇంటికి ఎప్పుడు తీసుకువెళతావ్ అని చాలా దిగాలుగా రాసేది ...


అయితే తరువాత తరువాతా మెల్లిగా అక్కడిపరిస్థితులు అలవాటు పడినా దాని మాటల్లో చెప్పినపుడు చాల బాధ అనిపించేది.. మా అక్క అత్తవారింట్లో మహా పొదుపు.. మహా అంటే మహా అన్నమాట :) ఇక్కడ అమ్మగారు పిల్టర్ నీళ్ళు తప్ప వేరే నీళ్ళతో మొహం కూడా కడిగేది కాదు ..అక్కడ తాగేది కూడా ఆకులు అలములూ పడిపోయి ఉన్న బావి నీళ్ళాయే .. అప్పటివరకూ డ్రెస్సులలో చిన్నపిల్లలా అటు ఇటు తిరిగే పిల్ల ఒక్క సారిగా బారెడు బారెడు చీరలు కట్టుకుని ఆరిందలా కుటుంభ బాధ్యతలు అన్నీ దానివే అయిపోయినట్లు వచ్చేవారికి ,వెళ్ళేవారికి మర్యాధలు పలకరింపులు ఇలా చాలా మార్పు వచ్చేసింది దానిలో ..


అయితే పెళ్ళి అయిన చాలానాళ్ళవరకు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు ... మొన్నామద్య పట్టుబట్టీ వాళ్ళీంటికి తీసుకు వెళ్ళింది ..వాళ్ళ ఇంటి ముందే షాప్ చేసి చాల చక్కగా టక టక మంటూ అటు పనులు, ఇటు షాప్ చక్కబెట్టుకుంటున్న అక్కను చూసి మా అక్కేనా అని ఆక్చర్యపొయాను .. ఇల్లు చక్కగా పొందికగా పెట్టుకుంది అన్నీ చూస్తూ అక్కడ కృష్ణుని మెడలో వేసిన ఇత్తడి పూసల లా ఉన్న హారం చూసి ఇదేంటే ఇలా వెలిసిపోయిన హారం వేసావ్ అన్నాను.. అది చూసి అడక్కేబాబు ఏడుపు వరదగొదావరిలా పొంగుకొస్తుంది దాన్ని చూస్తే అంది .. ఏం అంటే.. ఆ మద్య ఒక సోది అమ్మాయి వచ్చీ వద్దు మొర్రో అని అంటున్నా మొహమాట పెట్టేసి సోది చెప్పిందంట ,దాని సారం ఏంటంటే దీని ఇంటికి సిరి రాబోతుంది అంట ..కాని గ్రహబలం వల్ల ఇది వాటిని అందుకోలేకపోతుంది అంట అని ఏదో ఏదో చెప్పింది అంట ....అంతకు ముందు మా బావా ఏదో క్రికెట్ మేచ్ విషయం లో బెట్ కాయాబోతే ఎందుకులే మనకు అని ఇది బలవంతం గా ఆపేస్తే చాలా మొత్తంలో లాభం ఆగిపోయిందంట .. ఇలా రెండు,మూడు జరిగాయి అంట ... అయితే మా అక్క ఇదంతా సోదిలే యాదృచ్చికం అని కొట్టి పడేసి మర్చిపోయిందంట కాని ఆ రోజునుండి ఒకటే కలలు ఇంటినిండా బంగారం ,బంగారం ....నన్ను కాదనకు అని... ఇదేంటా ఇలా వస్తున్నాయి అని అనుకున్నాకా.. ఒక నొక ముహుర్తాన ఒక అతను వచ్చీ ఏమండీ మీవారు ఉన్నారా అని అడిగి బయటకు వెళ్ళారని తెలుసుకున్నాక తెగ బాధ పడి ..మా ఇంట్లో తరతరాల నుండి ఉన్న కొన్ని నగలున్నాయండి ...ప్రస్థుతానికి చాలా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాం ..కాబట్టి వాటిని అమ్మకానికి తీసుకు వచ్చాను ... బయట అమ్మజూపితే పురాతన నగలు కాబట్టి నన్ను అనుమానించే అవకాశం ఉంది అని ఇంకేంటో ఏంటో చెప్పి ఇది ఆకు రాయి దీని మీద గీటు పెడితే బంగారమో కాదో తెలిసిపోతుంది అని మా అప్పలమ్మకు మరి ఏ విధం గా చెప్పాడో తెలియదు మొత్తానికి నమ్మించేసేడు.. ఇది వాళ్ళయనకు పోన్ చేసి చెప్పిందంట .. అసలే మా బావ గారు ఇలాంటి విషయాల్లో చాలా ఆలోచిస్తారు.. వద్దు వద్దు అని చెప్పినా మా అక్కకి ఆ సోది ఆవిడ,కలలు , సూచనలు అన్ని గుర్తు వచ్చేసి ..అమ్మ బాబోయి మనం చాలా నష్ట పోతాం ఇది తీసుకోకపోతే,.. లేకపోతే విచిత్రం కాక పొతే ఇన్ని సూచనలా అని వినకుండా ఒక పదివేలు ఇచ్చి ఒక హారం తీసుకుంది అంట ..వాడు వెళ్ళేవరకూ చేతిలో తళ తళా మెరుస్తుంది అంటా అలా వెళ్ళగానే ఇంకేంటి ...అంతా విష్ణు మాయ అయిపోయింది ...


అంతా విని నేను నోరు వెళ్ళబెట్టి అలా ఉండిపోయాను..అక్కా నువ్వు నువ్వేనా... మూఢనమ్మకాలను ఖండ ఖండాలుగా ఖండించిపారేసే నువ్వా ఈ పని చేసింది .. డబ్బు కంటే సేవా,ప్రేమా,దయ ,కరుణ ,కారం,ఉప్పు,చింతపండు ముఖ్యమని క్లాసుపీకే నువ్వా ఈ పని చేసింది ,అని బోలెడు ఆక్చర్య పోతుంటే ... అలా మళ్ళీ మళ్ళీ గుర్తుచేయకే బాబు.. టైమే టైము ... ఇదే ఇంకొకరికి జరిగితే నీకంటే ఘాటుగా వాళ్ళను తిట్టిపడేసేదాన్నీ.. ఇలా ఎలా చేసారు అని తెగ ఆక్చర్యపడిపోయేదాన్ని ... ఇంకా నయం ఎప్పుడూ ఇంట్లో వ్యాపార పని మీద ఒక యాబై వేలు తక్కువ కాకుండ ఇంట్లో పెట్టేవారు ఆయన ..ఆ రోజు నా అదృష్టం.. తక్కువే ఉన్నాయి.. అమ్మో, మా ఇంటి ఎదురుగా ఉన్న గుడి అమ్మవార్లే కాపాడారు .. లేకపోతే అదెవరో నాకేదో చెప్పడమేమిటీ,నాకు కలలు రావడం ఏమిటీ ,నేను ముందు వెనుకలు ఆలోచించకపోవడం ఏమిటీ ...అయినా ఇంత స్వార్ధం నాకు ఎక్కడినుండి వచ్చిందో ..లేక వాడి మాటల గారడీనో ..మొత్తానికి ఇదీ కధ .. హుం అందుకే మళ్ళీ ఇలాంటి పనులు చేయకుండా ఎదురుగా పెట్టుకుని ఈ గొలుసు మరీ జాగ్రత్తగా ఉంటున్నా అంది...


కాలమహిమనా లేక పెళ్ళి తరువాత బాధ్యతల పేరుతో వచ్చే స్వార్ధమా మరేంటో కాని అలాంటి కన్‌ఫ్యూజ్ పరిస్థితి మాత్రం నాకు జరగకుండా చూడు స్వామి అని దణ్ణం పెట్టేసుకున్నా .. అసలే నేను పొదుపు మరి ...( మీరు వేరే అర్ధాలు తీయకండి మరి .. అది కేవలం పొదుపుమాత్రమే ..మీరు నమ్మాలి )