22, ఆగస్టు 2009, శనివారం

మా ఇంట్లో వినాయక చవితి


అసలు పండగల విషయం వచ్చేసరికి మా ఇంట్లో ఆడపిల్లలందరికీ చాలా అన్యాయం జరిగిపోయేది ..మా సమానత్వపు హక్కులన్నీ దిక్కులేకుండా పోయేవి..వినాయక చవితికి అయితే మరీనూ .. పండగ ముందురోజునుండే మా తాతయ్య ,తమ్ముళ్ళు హడావుడి మొదలు పెట్టేవారు .అటక మీద పెట్టిన పాలవెల్లి,గంధపు చెక్క పీట క్రిందకు దింపి, వాటికి స్నానాలు చేయించి, చక్కగా పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, పురికాసుని గుమ్మాలకు కొలిచి తెంపి ,మామిడాకులు మద్యలో పెట్టి, ముడివేసి తోరణాలు కట్టి అబ్బో ఇలా ఒకటేమిటీ అన్నీ వాళ్ళే చేసేవారు మమ్మలని ప్రేక్షక పాత్రలకు పరిమితం చేస్తూ..

కానీ నేను ఊరుకోను కదా ప్రతీ పండగకు గొడవే నేను చేస్తా ,నేను చేస్తా అని ,మా తాతయ్య మాత్రం నేను గొడవ చేసే ప్రతి సారీ ముందు నువ్వు పత్రి అని పలకడం నేర్చుకో అప్పుడు చేద్దువుగాని అని తాపీగా బదులు ఇచ్చేవాడు.. అంటే నాకేదో నత్తి అనుకునేరు నాకు కంగారు లో ఒక పదానికి బదులు మరొక పదం పెట్టి మాట్లాడేయడం అలవాటు.. అంటే పత్రిని ప్రత్తి అని ,ఆవేశాన్ని ఆయాసం అని ,ఆదుర్ధాని ఆరుద్ర అని ఇలా ఒకదాని బదులు ఇంకోటి పెట్టిమాట్లాడేసి అర్ధాలు మార్చేస్తూ ఉంటాను..అలా ఆ వీక్ పోయింట్ పట్టుకునే సరికి నా ఆయాసం (ఆవేశం )చప్పున చల్లారిపోయేది ..

ఇంక ఆ మరుసటి రోజు పాలవెల్లికి వెలగ కాయలు,జొన్నపొత్తులు,శీతాఫలాలు, ఇంకా అవేవో చిన్న చిన్న పసుపు రంగు పళ్ళు ఉండేవి అవేంటో మరి ..అవి ఇలా అన్నీ పురికాసుతో వ్రేలాడకట్టి ,పత్రి తో వినాయకుని అలంకరించి పూజ చేసేవారు ..మా తాతయ్య బ్రతికి ఉన్నంత కాలం ఇంటిల్లిపాది పండగలు సావిట్లోనే చేసే వాళ్ళం .. ఆ పండగ రోజు నేను చేసే ఒకే ఒక పని ఏంటయ్యా అంటే నా పుస్తకాలన్నీ వినాయకుడి దగ్గర ఒక్కటి కూడా మిస్ కాకుండా సంచితో సహా పెట్టేయడం .. మాటవరసకు ఒకటి రెండు పుస్తకాలు పెడితే సరిపోతుంది మిగతా పిల్లల పుస్తకాలు ఎక్కడ పెడతారు అని ఎవరు తిట్టినా ఒప్పుకునేదాన్ని కాదు.. నాకు అన్ని సబ్జెక్ట్లు డవుటేమరి ..మరి ఊరికే పాస్ అయ్యానా నా చదువు పూర్తి అయ్యేవరకూ ఒక్క సబ్జెక్ట్ కూడా తప్పకుండా .. అదన్నమాట

ఇక్కడివరకూ అంతా బాగానే ఉంది. అయితే వినాయక చవితి రోజున ఒక్క విషయం లో మాత్రం తలుచుకుంటేనే ఏడుపు తన్నుకొచ్చేస్తుంది.. అదే హారిది.. ఆ హరిదే అలా ఉంటుందో లేక మావాళ్ళే అంత చండాలంగా వండుతారో తెలుయదు కాని అదంటే నాకస్సలు పడదు .అసలు నాకు తెలియక అడుగుతాను వినాయకుడు కుడుములు ,ఉండ్రాళ్ళు ఇష్టము అని చెప్పాడుకానీ ..యే పురాణాల్లో అయినా మాటవరసకు హారిది ఇష్టం అని చెప్పాడా !!... ఈ విషయం మీకూ, నాకు అర్ధం అయింది కాని మా అమ్మా వాళ్ళకు ఎంత మొత్తుకున్నా అర్ధం అయ్యేది కాదు .. పోనీ ముచ్చట పడి చేసారనుకుందాం ..ఏదో వినాయకుని ప్రీత్యార్ధం నాలుగు కుడుములు ,కాసింత చిన్న గిన్నెలో హారిది వండి పెట్టచ్చుకదా అబ్బే ఆ పేరు వింటేనే వీళ్ళకు ఉత్సాహమే ఉత్సాహం అన్నమాట.. అక్కా! నువ్వు ఆ డేషా తో వండుతున్నావా అయితే నేను ఈ గంగాళం తో వండుతా అని ఒకరంటే, అక్కా!! నువ్వు బెల్లం హారిధి చేస్తున్నావా అయితే నేను పంచదారతో చేస్తాను అని ఇంకొకరు ...పైగా ఈవిడ వండిన హారిది ఆవిడ ,ఆవిడ వండినది ఈవిడ బకెట్లు బకెట్లు పంచుకోవడం ..

ఏం ,ఇంట్లో అంతమంది ఉన్నారు కదా చక్క గా మనిషికో రకం గారెలని,బూరెలని,పులిహోర అని వండితే వినాయకుడేమన్నా వద్దు అంటాడా .. పోనీ వండిన వాళ్ళు వండి ముచ్చట తీర్చుకోవచ్చు కదా ,అహా..అది మాకు కంచాల నిండుగా వేసేసి తినమని హుకుం ..పొరపాటున వద్దు అన్నామో .. నా బుజ్జికదా, మాచిట్టికదా అని బ్రతిమాలాడుతారనుకున్నారా.. మా వాళ్ళ అమ్ములపొదిలో మరుదులనే పవర్ఫుల్ అస్థ్రాలు ఉన్నాయి వాటిని ప్రయోగించేవారు ...ఒక్క సారి పిలవగానే వెంటనే మా నాన్నగారి రెండో తమ్ముడు.. ఆలిబాబా అరడజన్ దొంగల్లో గన్ మేన్ లా ప్రతి విషయానికి వేసేమంటారా అన్న టైపులో ఏం వదినా బెల్ట్ తెమ్మంటావా అనేవాడు ...ఇంకేం చేస్తాం ఎక్కడి దొంగలు అక్కడే గప్చిప్..సాంబార్ బుడ్డి అన్నమాట అందరం .

అలా ఏడుచుకుని ,ఏడ్చుకుని..తిట్టుకుని,తిట్టుకుని మద్యాహ్నపు భోజన సమయానికి అది పూర్తి చేసే సరికి అప్పుడు ఘమ ఘమ లాడుతున్న గుత్తొంకాయ,బంగాళ దుంప పిడుపు,పప్పు చారు వగైరా,వగైరాలతో అన్నానికి పిలిచేవారు..ఇంకేం తింటాం గొంతువరకు ఉన్న హారిది నోట్లోకొస్తుంటే ..అలా చాలా చాల అన్యాయం జరిగిపోయేది..

సరే ఈ విషయం ప్రక్కన పెడితే వినాయక వ్రతకధలో నాకు చాలా ఇష్టమైన కధ ..అందులో ఒక కధలో కుమార స్వామి కి, వినాయకునికి ఎవరు గొప్ప అని పోటీ వస్తుంది ..ముల్లోకాలు తిరిగి ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళే బెస్ట్ అని ఇద్దరూ బయలు దేరుతారు ..పాపం కుమార స్వామి గభ గభా తన నెమలి వాహనం మీద అన్ని చుడుతుంటే మన వినాయకుడు తాపీగా అంటే భక్తిగా అమ్మ,నాన్నల చుట్టూ తిరిగి గెలిచేస్తాడు..ఈ కధ వినగానే ఎంత సంతొషం వేసేసేదంటే అమ్మ,నాన్నల చుట్టూ తిరిగేస్తే బోలెడు పుణ్యం అన్నమాట అని పిండి రుబ్బుతున్న మా అమ్మ చుట్టు ,స్కూటర్ తుడుస్తున్న మా నాన్న చుట్టూ ,టి.వి చూస్తు నవ్వారు మంచం మీద కూర్చున్న అమ్మా,నాన్నల చుట్టు కలిపి,విడి విడి గా చాలా సార్లు తిరిగేసి సీక్రెట్గా బోలెడు పుణ్యం సంపాదించేసాను చిన్నపుడు..

ఇంకొక కధ కృష్ణుడు చవితి నాటి చంద్రుని పూజ చేయకుండా చూసి నీలాప నిందల పాలవడం.. నేను ఇంతకు ముందే చెప్పాను కదా నాకు కృష్ణుడంటే వల్లమాలిన ప్రేమ అని..మరి నాలో ఉన్న స్త్రీవాది ఏ మూలన కూర్చుని బట్టలు ఇస్త్రీ చేసుకుంటుందో తెలియదు కాని ఆ కధ చివరలో నీలాప నిందలు పడితేనేమి చక్కని చుక్కలైన ఇద్దరు భార్యలను తెచ్చుకున్నాడు కృష్ణుడు అని చదివి తెగ మురిసిపోయేదాన్ని..అక్కడికేదో కృష్ణుడు నాకు రెండుసార్లు ఆడపడుచు కట్నం ఇచ్చినంత సంబరపడిపోయేదాన్ని ఆ కధ విని ...కానీ పూజ చేసి అక్షింతలు వేసుకున్నా నాకు మాత్రం చవితినాడు చందమామాను చూడాలంటే మహా భయం ఉండేది అప్పట్లో ..ఇప్పుడేమో ఇక్కడ తల ఎత్తితే భవనాలుతప్ప ఆకాశమే కనబడటం లేదు ఏంటో..ఇలా చెప్పుకుంటు వెళుతే వినాయక చవితి గురించి రాస్తూనే ఉండచ్చు..

గమనిక:- ఎవరండి అక్కడ చవితి రోజు చందమామను చూసి తరువాత తీరిక గా పూజ చేసి ఇద్దరు పెళ్ళాలను కొట్టేద్దామని ప్లాన్ వేస్తుంది.. నేనంటే చిన్నపుడు అమాయకత్వం వల్ల అలా అనేసుకుని సరదాగా రాసాను .. మా అమ్మాయిలకు అన్యాయం చేయాలని చూస్తే కళ్ళు ఢాం ఢాం అని పేలిపోతాయి జాగ్రత్త.. కాబట్టి బుద్దిగా లెంపలేసుకుని,10 గుంజీలు తీయండి ముందు ..

అందరూ వినాయక చవితి జరుపుకుని స్వామివారి కృపా కటాక్షాలతో ఎటువంటి విఘ్నాలు లేకుండా, ఆయురారోగ్యాలతో ,సిరి సంపదలతో తులతూగాలని ఆశిస్తున్నాను.

(ఫొటో గూగులమ్మని అడిగినది )

15, ఆగస్టు 2009, శనివారం

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకోవాలా???



అందరికీ స్వాతంత్ర్యదిన శుభాకాంక్షలు అని చెప్పాలని ఉంది కాని చెప్పలేను..అసలు ఎందుకు చెప్పుకోవాలి..మన దేశానికి మనం ఏం చేసి ఉద్దరించామని చెప్పాలి?ఇలా రొటీన్ ప్రశ్నలు వేయాలని ఉంటుంది ...ఏంటో ప్రతి ఆగస్ట్ 15 కి నా మనసెందుకో అలజడిగా ఉంటుంది .. అసలు ఈ పోస్ట్ ఇప్పటికిప్పుడు మొదలు పెడుతుండటం వల్ల ప్రారంభం ,ముగింపు సరిగా అర్దం అయ్యేలా రాయలేనేమో..

నాకసలు మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించారని తెలిసింది చాలా చిన్నపుడు ..వయసు తెలియదు,కాని చాలా చిన్నదాన్ని ..tv లో కహా గయే ఓ లోగ్ అని హిందిలో ఒక సీరియల్ వచ్చేది మన స్వాతంత్ర్య సమరయోధుల గురించి ..అంటే పేరు మోసిన త్యాగ వీరులు గురించి కాదు.. ఎవరికీ తెలియని మామూలు యోధులు..ఎందుకో అది చూసినప్పుడు ఏడుపొచ్చేది ..ఆ భాష కూడా తెలియదు నాకు అప్పుడు..అంత చిన్న వయసులో నా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలిసేది కాదు..

తరువాత మరొక సారి దూరదర్శన్ లో అల్లూరి సీతా రామరాజుగారి గురించి చూపించారు..ఆయన గురించి చెప్తూ ఆనాడు చూసిన ప్రత్యక్ష సాక్షులు చనిపోయే ముందు అల్లూరిగారి దైర్య సాహసాలు వర్ణించారు ..అదిగో ఆ చెట్టుకే ఆ మహానుభావుని కట్టేసి తుపాకులు గురి పెట్టారు..ఆయన బెదరలేదు ..బాగా కొట్టడం వల్ల దాహంతో మంచి నీరు అన్నాడు ..ఆ ధుర్మార్గులు వేడి,వేడి పాలు ఇచ్చారు ..ఆయన వారి వైపు ఒక చిరునవ్వు విసిరి ఆ పాలను గడ గడా తాగేసాడు అని చనిపోయేముందు విషయాన్ని వర్ణిస్తుంటే నా మనసులో ఆవేశమో,ఆవేదనో మరేమో వర్ణించలేను.. ఆయన కాకినాడ లో p.r కళాశాలలో చదివారంట ..ఆ విషయం తెలిసాక ఒక్క సారైనా ఆ కాలేజ్ కి వెళ్ళాలని ఎంత తాపత్రయ పడ్డానో ఇప్పటికీ కుదరలేదు ..ఆ మహాను భావుని చూడక పోయినా ఆ పరిసర ప్రాంతాలన్నీ ఆయనను ప్రత్యక్షం గా చూసిన మూగ సాక్షులు..ఒక్క సారి ఆ ప్రాంతం చూసినా జన్మ ధన్యమే అనిపించింది ..

నేను మరచిపోలేని రోజులు నా హై స్కూల్ రోజులే ..ఎందుకంటే నేనే ప్రతిఙ్ఞా ,వందేమాతరం చెప్పేదాన్ని రోజూ .. ఇంకా ఆగస్ట్ 15 వచ్చిందంటే చాలు ఆ రోజు దేశభక్తి గీతాలన్నీ నావే ... అవి పాడినపుడు నేనేదో దేశానికి చేసేయాలన్న పట్టుదల వచ్చేసేది..అప్పటికి నాకు తెలియదు కదా అది కేవలం ఆవేశం వరకే పరిమితం చేస్తామని ..మా తాతయ్యకు గాంధి గారంటే అసలు ఇష్టం ఉండేది కాదు..ఆయన వల్లే మనకు స్వాతంత్ర్యం రావడం ఆలశ్యం అయ్యింది అని తిట్టేవాడు..నాకు చాలా కోపం వచ్చేది.. అసలే చిన్నప్పటినుండి..కాకమ్మా ,చిలకమ్మా కధలే మాకొద్దు మా గాంధి చెప్పింది మాకెంతో ముద్దు అని పాడుకున్నదాన్ని.. అందులోనూ గాంధి జీవిత చరిత్రలో ఆయన అభద్దం చెప్పకూడదని ,నిరాడంబర జీవితాన్ని గడపాలని ఆయన ఆచరించి చూపిన విధానం ఇంకా చాలా నచ్చాయి...అలాంటిది మొదటిసారి గాంధి గారి మౌనం వల్ల భగత్ సింగ్ మరణం తీరని బాధను కలిగించింది ..భగత్ సింగ్ నా హీరో ..అలాంటిది అతని పట్ల గాంధి గారి తీరు నాకు చాల కోపం తెప్పించింది..

క్లాస్ లో హిస్టరీ అంటే విపరీతమైన ఆశక్తి గా వినేదాన్ని..అతివాదులు,మితవాదులు గురించి చదివినపుడు ఎవరికి ఓటు వేయాలో తెలిసేది కాదు..మిత వాదులైన బాల గంగాధర్ తిలక్,బిపిన్ చంద్ర పాల్,లాలా లజపతిరాయ్ లు (లాల్,బాల్, పాల్) అంటే ఎంతో గౌరవం నాకు.. జలియన్ వాలా బాగ్ దురంతం విన్నపుడు మితవాదుల సహనం నాకు చాలా కోపం వచ్చింది..అలాగే సహాయ నిరాకరణోద్యమం మంచి ఊపులో ఉండగా ఎక్కడొ పోలీసులను తగలపెట్టేసారు కోపం వల్ల ఆందోళనకారులు ...అని దాన్ని మద్యలో ఆపేసిన గాంది గారి మీద చాలా కోపం వచ్చేది ...

ఇంకా టంగుటూరి ప్రకాశం పంతులు,మాగంటి అన్నపూర్ణాదేవి,సుభాష్ చంద్ర బోస్, ఇలా ఒక్కరేమిటి ఎంతమంది గురించి చదివి ఉంటాము మనమందరం..అవి చదివినపుడు రక్తం ఉడికిపోతుంది కదూ ...కాని తరువాత ఏం చేస్తాం పుస్తకం మూసేసి Tv లో మగధీర సినిమానో ... లేకపోతే dance baby dance ,లేదా మరొకటొచూసేయడం ,మన ఆవేశం అంత ఉష్ కాకి చేసేసి బజ్జోవడం ఇంతేగా...ఇంత రాసాను నేను కూడా ఇదే చేస్తాను ... గట్టిగా అడిగితే ఇంతకంటే ఏం చేయగలం ..అని ఒక నిట్టూర్పు విడుస్తాం..

ఒక్కోసారి అనిపిస్తుంది మన స్వాతంత్ర్య సమరయోదులందరూ బ్రతికి ఉంటే మన దేశ దుర్మార్గపు దౌర్భాగ్యాన్ని చూసి లక్ష సార్లు ఉరేసుకుని ఉంటారు తమ మనసులను ...నేను చెప్పబోయేది ఇప్పుడు జండా పట్టుకుని జండా ఊంచా రహే హమారా అని పాడమని కాదు,జాతీయ గీతం రాగానే లేచినిలబడమని కాదు.... ఆకలి తో ఉన్నవారికి మనకు చేతనైనంతలో కాస్త సహాయం చేయండి.. బలవంతం గా కాదు..చేయగలిగినంత.. రోడ్ మీద ఒక ముసలావిడ సరి అయిన బట్టలు లేక ఉంటే పాత బట్టలేమన్నా తనకు ఇవ్వండి..( మళ్ళి కొత్త బట్టలు ఇస్తే వాళ్ళు అమ్మేసుకునో మరొకరికో ఇచ్చేస్తారు అనుకుంటే ).. నెల రోజులకో రెండు నెలలకో ఇంట్లో యే పులిహారో చేసి బయట తిండికి అలమటించే నలుగురికి పొట్లాలక్రింద కట్టి ఇవ్వండి..ఇవన్ని చేయగలిగినవే... ఆలోచిస్తే బోలెడు చేయగలం ..అందరం అందరికీ సహాయం చేయలేము కదా..మనకు తోచినంతలో మన వీరుల సాక్షిగా ఎంతోకొంత చేద్దాం ..ముఖ్యం గా వీరమరణం పొందిన మన జవాన్ల కుటుంభాలు కనబడితే మన కుటుంభం కంటే ఎక్కువ గా గౌరవిద్దాం... సంవత్సరానికి ఒక 4 ,5 మంచి పనులు ఏదో రూపం లో చేస్తే మనకు తృప్తిగా ఉంటుంది ఆ మహానుభావులకు నిజమైన నివాళి ఇచ్చినట్లు అవుతుంది ....ఇప్పుడు రండి చెప్పుకుందాం అందరికీ స్వాతంత్రయ శుభాకాంక్షలు ...

12, ఆగస్టు 2009, బుధవారం

అసలు కృష్ణాష్టమి అంటే ???




చిన్నప్పటి నుండి నాకు కృష్ణుడు అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం..మరి కారణం ఏమో తెలియదు..బహుసా మా నాన్న గారు ఎన్ టి ఆర్ గారి కృష్ణుని వేషం ఉన్న సినిమాలు ఎక్కువగా చూపించడం వల్లనో,తాతయ్య చెప్పే కృష్ణ లీలల కధల వల్లో మరెంచేతో ...ఒకానొక సమయంలో కవియిత్రి మొల్లలా కృష్ణుడి మీద కవితలుకూడా రాసేసాను ఆవేశం గా చిన్నపుడు ..దెబ్బకి కృష్ణుడు భయపడినట్లున్నాడు మళ్ళీ అలాంటి ఆవేశం ఉప్పొంగకుండా జాగ్రత్త పడ్డాడు... ఆ తరువాత ఎంత గింజుకున్నా కవితలు రాయలేకపోతున్నాను.. అయితే క్రిష్ణుడిమీద ప్రేమ అక్కడితో ఆగిందా అంటే ..లేదు ...

మా అమ్మ నెలగంటు సమయంలో మంచి మంచి ముత్యాల ముగ్గులు వేసేది ,ముఖ్యం గా పల్లకీ ముగ్గు వేసినపుడు ఒకసారి మా చెల్లిని బ్రతిమాలి దానిలో కృష్ణుని బొమ్మ వేయించాను ముగ్గుతో..అక్కడితో ఊరుకున్నా బాగుండేది దానిక్రింద దయ చేసి ఈ ముగ్గును ఎవరూ చెరపకండి అని రాసాను ..అంతే మరుసటి రోజు ఆకతాయిపిల్లలందరూ కసాబిసా అని తొక్కి పడేసారు ..అది చూసి మా అమ్మ కొట్టినంత పని చేసింది అందరూ కాళ్ళతో తొక్కేలా చేస్తావా క్రిష్ణుడిని అని .. ఇలా కృష్ణునిమీద చాలా ప్రయోగాలు చేసాను ప్రేమతో ..

ఒక సారి మా ఆయనతో ఏమండి నాకు రాముడికంటే కృష్ణుడంటే చాలా ఇష్టం అన్నాను ..ఎందుకలాగా !అన్నారు..ఎందుకంటే రాముడు ఒక్క భార్యను సంతోషంగా ఉంచలేకపోయాడు ..కానీ కృష్ణుడు 16000 వేల గోపికలను ఎంతో ఆనందంగా ఉంచాడు ,ఎవ్వరినీ బాధ పెట్టలేదు అన్నాను నేను చాలా గొప్పగా చెప్పేసాను అని సంభరపడిపోతూ.. మా ఆయన వెంటనే నా కళ్ళలోకి ఆరాధనగా చూస్తూ నువ్వింత మంచిదానివని తెలియక ఎంతో అపార్ధం చేసుకున్నాను ,ఇన్నాళ్ళు నువ్వేమనుకుంటావో అని భయపడి చెప్పలేదు ..నేను అంటే ఇష్టంతో ఒక ఇద్దరు ముగ్గురు రెడిగా ఉన్నారు ఏమంటావ్ అన్నారు ..అప్పటి నుండి కృష్ణుడి మీద ప్రేమ మనసులోనే దాచేసుకున్నాను ...

సరే ఇదిలా ఉంచితే మొన్న జ్యోతిగారినుండి ఒక మెయిల్ వచ్చింది కృష్ణాష్టమి కదండి కాబట్టి ఏదన్నా రాస్తే బాగుంటుంది ఆ రోజు అని.. అబ్బో కృష్ణుడి మీద అంటే చాలా వీజీ రాసేద్దాం అనుకుని ok చెప్పేసాను ... సరే వంట మొదలు పెట్టాను కాని ఒక్కటంటే ఒక్క వాఖ్యం కూడా తట్టడం లేదు ..అంటే నేను ఏదన్నా రాయాలనుకున్నపుడు వంట చేస్తూ ఆలోచించి వంట అవ్వగానే పోస్ట్ తానన్నమాట ..నేను ముందే చెప్పాను కదా కృష్ణుడికి నా రాతలంటే బెంగ అని..అందుకే కాబోలు అన్నం వండేసి,పప్పు తాళింపు పెట్టి,కూర వండేసి ఆఖరికి అంట్లు కూడా తోమేసాను కాని అసలేమి రాయలో తోచడం లేదు ..ఇంకో ముఖ్య కారణం ఏంటంటే మా ఇంట్లో అసలు కృష్ణాష్టమి పెద్దగా చేయరు ..కాబట్టి ఒక్క సంఘటన కూడా గుర్తు రావడం లేదు ..ఏం చేయాలబ్బా అనుకుంటుండగా మా ఆయన గుర్తు వచ్చారు.. నా కనులు నీవిగా చేసుకుని చూడూ అన్నట్లు నీ ఙ్ఞాపకాలే నావిగా మలుచుకుని రాస్తా అనుకుని ఆయనకోసం వేయి కళ్ళతో ఎదురు చూసాను..

మా ఆయన వచ్చి సుష్టుగా తిని ప్రశాంతం గా ఉన్న మూడ్ చూసుకుని ఏమండీ అసలు కృష్ణాష్టమి అంటే ఏమిటీ అన్నాను గోముగా ...మా ఆయన ఉలిక్కిపడి వద్దే బాబు ,నువ్వు పండగల గురించి మాట్లాడకు..ఇలాగే అచ్చికబుచ్చికలాడి మొన్న నా చేత వరలక్ష్మీ వ్రతం చేయించావ్ ..అసలు వోల్ ఆంద్రాలో వరలక్ష్మీ వ్రతం చేసే మగాళ్ళు ఎవరన్నాఉంటారా ,అసలు నేను ఇంట్లో ఎంత పెద్ద పండగయినా ఉండేవాడిని కాదు ,మా అమ్మ ఉండమంటే కయ్యిమనేటోడినీ.. కాని నువ్వు గయ్యాళి గంపవి,రాకాసి రంపవి .. అరిచి,ఏడ్చి సాధిస్తావ్ ..అని ఆవేశపడిపోతుంటే మహా ప్రభో ఆపండి అమ్మవారికి అష్టోత్తరాలు చదవడం వల్ల మీకు వచ్చిన నష్టం ఏమీ లేదు కాని ముందు కృష్ణాష్టమి అంటే ఏమిటొ చెప్పండి..బ్లాగ్ లో రాయాలి అన్నాను సీరియస్సుగా .

ఛా..కృష్ణాష్టమి అంటే ఏమిటో తెలియకుండా పోస్ట్ రాసేద్దామనే ..హూం..ఎవరే నీ పోస్ట్లు మెచ్చుకుంటూ వాఖ్యలు రాసేది ఒక సారి ఇలా పిలు అమ్మా అన్నారు..పీకలవరకూ కోపం వచ్చినా అవసరం నాది కదా,కాబట్టి నవ్వుతూ మీరు కొంచం చెప్పండి నేను అల్లుకుపోతాను అన్నాను ..అల్లడానికి,కుట్టడానికి ఇవి బట్టలు కావమ్మా పురాణాలు..సరే విను ..కృష్ణాష్టమి అంటే కృష్ణుడి పండగ అంటే కృష్ణుడి బర్త్ డే అన్నమాట ఈ పోయింట్ మీద పోస్ట్ అల్లేసుకో అని నా వైపు చూసి సరే సరే శాంతించు ..ఇంకా చెప్తాను ..ఆ రోజు కృష్ణుడి బుజ్జి బుజ్జి పాదాలు ఇంటినుండి బయటకు వేస్తారన్నమాట అన్నారు.. ఇంటినుండి బయటకు కాదు బయటనుండి ఇంటిలోకి అన్నాను సరి చేస్తూ ..అదేలే మొత్తానికి పాదాలు వేస్తారు ..తరువాత ఒక కుండలోకి అటుకులు,మరమరాలు,కారం,ఉప్పు ,ఉల్లిపాయలు,నిమ్మరసం మా ఆయన నోట్లో నీళ్ళు ఊరుతుండగా మద్యలో ఆపు చేసి అదేమీ పిడతకందిపప్పు కాదు అన్ని వేయరనుకుంటా ,అటుకులు ,పెరుగు వేస్తారు అన్నాను..అబ్బా అదేలే,అవి వేసి ఉట్టి పైకి కట్టి నాలాంటి హీరో కి చేతికి కర్రనిచ్చి కొట్టమంటారు అన్నారు..

ఇలాగాని రాస్తే చదివేవాళ్ళు నన్ను కొడతారు ముందు ఇదేమన్నా ఆవు మీద వ్యాసం అనుకున్నారా కృష్ణుడు వెన్న తిన్నాడు,మన్ను తిన్నాడు అని ఒకటొ క్లాసు పిల్లాడు చెప్పినట్లు రాయడానికి..బ్లాగు బాబు ..అక్కడ ఏమన్నా చిన్నా చితక వాళ్ళు ఉంటారనుకున్నారా ..మహా మహులుంటారు..మొన్న అమ్మ మీద వ్యాసాలు అదరగొట్టారు తెలుసా అన్నాను..మరి పెద్ద రచయిత్రి లా పోజులుకొడతావ్ కదే నాదగ్గరా..ఇప్పుడు నేను కావలసివచ్చానా అన్నారు ..ఎంత గొప్పోళ్ళు అయిన్నా నేల ఆసరా కావల్సిందే కదండి నిలబడటానికి అన్నాను ..అంటే ఇప్పుడు నీ కాళ్ళక్రింద ఉన్నాను అని ఉదాహరణతో సహా చెప్తున్నావా అన్నారు అనుమానంగా .. అబ్బా!! అపార్దాల చక్రవర్తి ఏదో ఒక ఉపాయం చెప్పండి సార్ అని వేడుకుంటే ఒక అయిడియా అన్నారు..ఏంటి అన్నాను ఉత్సాహంగా ..

నా చిన్నపుడు హింది ఎక్జాం అప్పుడు నాకసలు హింది రాదుకదా అప్పుడు ఏంచేసేవాడినంటే అన్ని ప్రశ్నలను కలిపి తిరగమరగ రాసి ఆన్సర్ దగ్గర రాసేసేవాడిని..దెబ్బకి 100 మార్కులు వచ్చేసేవి ..అలాగా నువ్వు కూడా అందరూ కృష్ణుడి గురించి రాసేవరకూ ఆగి అన్నిటిలోనూ ఒక్కో లైను తీసి నీ పోస్ట్లో రాసేయి అన్నారు... హమ్మో మీ సారు మరి ఆన్సర్ చదివేవారు కాదా అన్నాను ఆక్చర్యం గా .. మా సార్ చదివేవారు కాదు స్కేల్ తో కొలిచేవారు ఆన్సర్లను అన్నారు నవ్వుతూ..సరేలే గొప్ప సలహా ఇచ్చారు ,అప్పటికి గాని నన్ను కూడలి నుండి బయటకు తరిమేయరు ..వాఖ్యం కాదు ఒక్క పదం కాపీ కొట్టినా బూతద్దంతో వెతికి మరీ పట్టేసి చూపుతారు ఏమనుకున్నారో అన్నాను ...అందుకే కదే ఆ సలహా ఇచ్చాను..అప్పుడు ప్రశాంతం గా ,హాయిగా ఉంటుంది నీ గొడవలేకుండా వాళ్ళకు ,నాకు ఇద్దరికీ అన్నారు..

మీ కుళ్ళు బుద్ది పోనిచ్చుకోలేదు కదా అని సీరియస్సుగా లేస్తుంటే నన్ను బలవంతం గా కూర్చోపెట్టి ,ఒసే పిచ్చిమొహం ఎలాగూ మిగిలినవాళ్ళు బాగా రాస్తారు కదా నువ్వు ఏమీ తెలియకుండా పుడింగిలా మద్యలో ఏదో రాసేయడం ఎందుకు ..కాబట్టి చక్కగా ఒక కృష్ణుడి బొమ్మ పెట్టేసి కృష్ణాష్టమి శుభాకాంక్షలు అని ఒక హెడ్డింగ్ పెట్టేసి పొస్టేసేయి నా మాటవిని ..అప్పుడు వాళ్ళు హేపి,నువ్వూ హేపి,కృష్ణుడు హేపీ ఏమంటావ్ అన్నారు.. హూం..అవుననుకోండి కాని అసలేమీ రాయకపోతే నా పోస్ట్ కోసం చూసేవాళ్ళు ఫీల్ అవుతారేమో అన్నాను (లోపల బోలెడంత గర్వం మా ఆయనను ఉడికించే చాన్స్ వచ్చిందని )...అబ్బా ఛా , మరి నువ్వు యండమూరివీ ,యద్దన పూడి సులోచనా రాణివి ..నీ పోస్ట్లకోసం ఎదురుచూడటానికి .. మొహం చూడు...ఏదో పాపం కొత్తగా వచ్చావు ,బాగుంది అని ఒక వాఖ్య రాసేస్తే సంతోష పడతావ్ అని వాళ్ళేదో రాస్తే అది చూసి ఫీల్ అయిపోవడమే అని ఏడిపించడం మొదలుపెట్టారు..

దీన్నే పిలిచి తన్నించుకోవడం అంటారు..మీ గురించి తెలిసి కూడా అడిగాను చూడండి ..మాములు చెప్పు కాదు కాస్త స్ట్రాంగుగా ఉన్న చెప్పుతో కొట్టుకోవాలి అని కయ్యమేసుకుని ఇలా వచ్చాను..కాబట్టి అదండి సంగతి ..రేపు కాస్త పని ఉండి ముందుగానే చెప్పేస్తున్నాను అన్నమాట ..మీకూ మీ కుటుంభ సభ్యులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు :)

1, ఆగస్టు 2009, శనివారం

దమయంతి ,హిడింభి పాకం


నాకు వంట చేయడం రాకపోవడానికి కారణం మాది ఉమ్మడి కుటుంభం కావడమే ,చాల్లే అసలు దానికీ దీనికీ లింకేమిటీ అని అనుకుంటున్నారు కదూ ,మరదే ..ఉమ్మట్లో బోలెడన్ని రాజకీయాలు ఉంటాయన్నమాట... మేము గాని వంట చేస్తే అందరూ (ఇంకెవరూ మిగిలిన తోడికోడళ్ళు)మా అమ్మని, అమ్మో చిన్నక్క అదృష్టమే అదృష్టం ..చక్కగా ఆడపిల్లలు అన్నీ చక్క బెట్టేస్తుంటే ఈమె కాలు మీద కాలేసుకుని సీరియల్స్ చూస్తుంది అనేస్తారంట ,అందుకని మమ్మల్ని వంట మాత్రం చేయనిచ్చేది కాదు (మిగిలిన పనులు చేయకపోతే మాత్రం తోలు తీసేసేది)నన్నసలు రానిచ్చేది కాదు వంట గదిలోకి ,నేను పావలా పనికి రూపాయి హంగామా చేస్తానని ..పోనీ తను ఊరెళ్ళినపుడు వండుదామంటే మా పిన్నులు వంతులేసుకునేవారు ఈ సారి నేను చేస్తా మీకు వంట అంటే నేను చేస్తా అని ...లేకపోతే మా అమ్మ దెప్పేయదూ ...అదీ సంగతి ,అయితే వంట చేయడానికి కావలసింది కొంచెం ఇంట్రెస్టు ,బోలెడు ఓపిక ..ఈ రెండూ నాలో యే కొసనాలేవు అది వేరే విషయం ..


అవి నేను ,పెనం మీద దోసె పిండి వేసి గరిటతో ఎడమవైపు త్రిప్పాలా? కుడి వైపు త్రిప్పాలా ?అని తీవ్రంగా ఆలోచించే రోజులు..ఒక సారి మా అమ్మ,అక్క ఊరెళ్ళారు ..ఎప్పటిలాగే పిన్ని వండేస్తుంది కాబట్టి తీరికగా మంచం మీద పడుకుని ఈనాడు ఆదివారం మేగజైన్ చదువుతున్నాను ...మద్యలో వంటల పేజీ వచ్చింది ..నాకు వంట చేయడం రాకపోయినా ఆ వంటకాల పొటోలు చూడటం మహా ఇంట్రెస్ట్ ..అందులో ఒక వంటకం ఫోటొ తెగ నచ్చేసింది ..చూసి పేజీ తిప్పేయచ్చుగా ఎప్పటిలాగే ...అహా ,అది చూడగానే బుద్దుడికి బోధి వృక్షం క్రింద జ్ఙ్ఞానోదయం అయినట్లు నాకు మా మంచం మీద బోలెడంత ఙ్ఞానం వచ్చేసింది ,వంటరాని బ్రతుకు ఒక బ్రతుకేనా అని ఆవేశం గా పిన్ని దగ్గరకు వెళ్ళి పిన్నీ ఈ రోజు వంట నేనే చేసుకుంటా అన్నాను ..వద్దు అంది..కుదరదు అన్నాను..చివరకు తను అన్నం వండటానికి నేను కూర చేయడానికి ఒప్పందం చేసుకున్నాం ..


నాక్కూడా కాస్త పెట్టమ్మా అని వంటకం ఫొటొ చూస్తూ మా నాన్నమ్మ నోట్లో పావులీటర్ నీళ్ళు మింగింది ..ఓ యెస్స్ అని అభయం ఇచ్చేసి కావలసిన పదార్దాలన్నీ సేకరించాను.. చక్కగా ముక్కలు చేసాను ..బాణాలి వేడి చేసాను..ఆ సరికే నాకు విసుగొచ్చేసింది ..అందరూ హాయిగా T.v చూస్తుంటే నాకు ఇప్పుడు వంట చేయడం అవసరమా అనిపించింది..కాని తప్పదుగా, మొత్తానికి వండేసాను ... మా చెల్లి అప్పటికేఅబ్బా ఆకలి ఇంకెంత సేపు అని నస ,నస ..నేను వడ్డించగానే టక్కున కలుపుకుని ,నోట్లో పెట్టుకుని తుపుక్కున ఉమ్మేసింది .. ఛీ ఇదేంటి పిల్లా ఇంత ఛండాలం గా వండావ్..ఇప్పుడు నిన్ను ఎవరు వండమన్నారు..దీన్ని వంట అనరు పెంట అంటారు అని నానా తిట్లు తిట్టి మా పిన్ని వైపు చూస్తూ పిన్నీ కాసింత పెరుగు ,పచ్చడి ఉంటే వేయవా అంది ...అవమానం అవమానం..ఎన్ని మాటలంది గాడిద
అనుకుని మా నాన్నమ్మ వైపు చూసాను ఆశ గా , ఎందుకోనమ్మా ఇందాక నుండి ఒకటే కడుపునొప్పి,ఈ సారి మళ్ళీ వండుతావ్ కదా అప్పుడు తింటాలే అని మెల్లిగా జారుకుంది ..సరే పొండి ఎంచక్కా మొత్తం నేనే తింటా అనుకుని చక్కగా ఒక ముద్ద కలుపుకుని నోట్లో పెట్టుకున్నానో లేదో ప్రొద్దున్న తిన్నదానితో సహా కక్కేసాను.. ఇదేంటబ్బా తేడా ఎక్కడ జరిగింది? అంతా వాడు చెప్పినట్లే కదా చేసాను అని మళ్ళీ బుక్కు ముందెట్టి ఒక్కోటి చదువుతుంటే ఒక చోట కళ్ళు ఆగిపోయాయి ..పెరుగు 1/2 కప్ ,వంట సోడా 1/2 టి స్పూన్ పక్క, పక్కనే రాసి ఉన్నాయి .. అప్పుడు అర్దం అయింది ఎందుకు కక్కుకున్నానో ...


సరే తరువాత, తరువాత కూరలగురించి మా అక్క సింపుల్గా చెప్పిన ఫార్మూలా ఫాలో అయిపోయాను.. వేపుళ్ళంటే తాళింపువేసి కూరముక్కలు వేపి ఉప్పుకారం జల్లడం ..పులుసులంటే తాళింపు వేయకుండా వేపిన ముక్కల్లో చింత పండు పులుసు పోసి మరగ పెట్టడం ..ఇగుర్లంటే చింతపండు పులుసు బదులు నీళ్ళు పోసి ఇగరబెట్టడం ..అంతే సింపులు ...అలా బండి నెట్టుకొచ్చేస్తున్న తరుణం లో మా ఆయనకు నా ప్రశాంతత మీద కన్నుకుట్టింది ..ఒక రోజు రావడం, రావడం బాంబ్ లాంటి వార్త చెప్పారు ,ఏంటంటే మరుసటి రోజు ఫ్రెండ్స్ తో కలసి జూ కి వెళుతున్న సందర్భం గా అందరూ తలో అయిటం తెస్తున్నారు కాబట్టి మా వాటాకు ఆవడలు (మజ్జిగ గారెలు)తీసుకువస్తాం అని చేప్పేసారట .. కాబట్టీ రేపు అవి వండేయ్ అన్నారు చక్కగా ..నాకు తెలుగు వంటల్లో నచ్చని ఒకే ఒకే పదం వడ .. అది వండాలంటే నాకు ధడ ..ఆ పప్పు మిక్సీలో వేసి కొంచెం కొంచెం నీరు వేస్తూ గంట సేపు రుబ్బాలంటే నీరసం వచ్చేస్తుంది ..చాలా సార్లు ఓపికగా రుబ్బి ఆఖరి నిమిషం లో విసుగుతో గబుక్కున నీరు ఎక్కువ వేసి గారెల పిండి కాస్త బూరెల పిండిలా చేస్తాను.. ఆ కారణం చేత నేను అప్పటికి ఒక్కసారి కూడా గారి షేప్లో గారెలు వేయలేదు ..అలాంటిది ఆవడలా!!! ....పోనీ నాకు ఆవడలు చేయడం రాదు అన్నాననుకో ..మా వారు ,నీకు ఆవడలు చేయడం రాదా !!!!!అని ఎనిమిదో వింత చూస్తున్నట్లు ఒక ఎక్స్ ప్రెషన్ ఇస్తారు అది చాలు జీవితం మీద విరక్తి వచ్చేయడానికి..కాబట్టి ఎలాగోలా ఆవడలు చేయడమే బెటర్ అని డిసైడ్ అయిపోయి రాత్రి 12 గంటల వరకూ చా...లా ...ఓపికగా నీళ్ళు ఒక్క చుక్క వేయకుండా గారెల పిండి రుబ్బేసాను ,మొదటి సారి షేప్ ఉన్న గారెలు చేసేసి చిలికిన మజ్జిగలో వాటిని వేసేసి హమ్మయ్యా అనుకుని పడుకుండిపోయా ..

ఆ ప్రొద్దున్న అందరూ ఒక్కో అయిటెం ప్లేట్ లో వేస్తుంటే మన గారెలు డబ్బా వాళ్ళ ముందు పెట్టారు మావారు ,వాటినీ ప్లేట్స్ లో వేసి అందరికీ ఇచ్చింది ఒకామే ..చెంచాతో గుచ్చి తిందామని ఒక సారి నొక్క గానే గారె కాస్తా కప్పలా ఒక్క జంపు జంపి క్రింద పడింది ...తలెత్తి చూస్తే అందరూ ఇంచుమించుగా నా గారెలతో కప్పగెంతులాట ఆడుతున్నారు ... గొప్ప సిగ్గేసేసింది ..మరి నాకు తెలియదు కదా గారెలపిండి లో అసలు నీరు లేకుండా రుబ్బితే అలా రాళ్ళల్లా వస్తాయని.. పాపం అందరూ వాటిని తినలేక ,నా ఎదురుగా వాటిని పడేయలేక నానా పాట్లు పడి నేను అటుతిరగగానే గబుక్కున డస్ట్ బిన్లో పడేసారు..మనమసలే కంత్రీలం ..చూడకుండా ఉంటానా ...

అయితే ఆ దెబ్బకి మా ఆయనకు నా వంట మీద నమ్మకం పూర్తిగా పోయింది ..ఎంత దారుణం అంటే ఒక వేళ నేను వంట బాగా చేసినా, అది నేను చేసాను కాబట్టి అది బాగోదు అని డిసైడ్ అయిఫొయి ఇంకాస్త కారం పడుతుందేమో,ఇంకేదో తక్కువయింది అని ఒకటే వంకలు .. అక్కడితో ఊరుకునేవారా, యే పొరిగింటమ్మ పుల్ల కూర తిన్నా ..నా ఎదురుగానే ఆవిడ ఫలానా కూర సూపర్ వండింది కదా ..ఆవిడని అడిగి నేర్చుకోరాదు అని బోలెడు ఉచిత సలహాలు అన్నమాట ...దాంతో నా వంట మీద నాకే బోలెడంత డవుట్ వచ్చేసేది ..నాకు అస్సలు వంట చేతకాదు అని ..


సరే ఇలాకాదు అని ఒకరోజు చక్కగా చికెన్ బిర్యాని చేసి మా ఆయన రాగానే పక్కింటి ఆవిడ పంపింది అని ఒక ప్లేట్ లో పెట్టి ఇచ్చాను..అదే అనుకున్నా భలే ఘుమ ఘుమలు వస్తున్నాయి అని ఒక స్పూన్ నోట్లో వేసుకుని.. ఆహా,ఎలాగైనా ముస్లింలు ముస్లింలేనే ...బిర్యాని వాళ్ళు చేసినట్లు ఇంకెవరూ చేయలేరు అని ఒక్కో స్పూన్ తెగ ఆస్వాదిస్తూ తిన్నారు ..అమ్మ దొంగ మొహం అని మనసులో అనుకుని ఆయన అంతా తిన్నాకా నేనే చేసాను ఇది, పక్కింటావిడ కాదు అన్నాను గర్వం గా చూస్తూ ...అదేనే మద్యలో డవుటొచ్చింది ఉప్పు కాస్త ,అంటే కొంచెం ఎక్కువగా అనిపించిందేంటాబ్బా అని అన్నారు ప్లేట్ నా చేతికిచ్చి..ఎంత కోపం వచ్చిందంటే, పతివ్రతా శిరోమణిని కాబట్టి బ్రతికిపోయారు కాని లేకపోతేనా ఆ ప్లేట్ పెట్టి నెత్తిమీద టంగు టంగు మని నాలుగు పీకేదాన్ని ....


కొసమెరుపేంటంటే మొన్నామద్య ఫ్రెండ్స్ అందరం కలిసి బింతాన్ వెళ్ళాం ,మిగిలిన వారు అందరూ శాకాహారులు అవ్వడం చేత అక్కడ దొరకదని ఇంట్లో తయారు చేసుకుని వెళదాం అన్నారు ,నన్ను లంచ్ కి సరిపడే తీసుకురమ్మన్నారు ,ఇంచుమించుగా పదిమందికి వండాలన్నమాట ,కాని తప్పదు కదా, దేవుడా నువ్వే దిక్కు అనుకుని అన్నం ,కూరా,పప్పు,పచ్చడి అన్నీ చేసి జాగ్రత్తగా పేక్ చేసి తీసుకు వెళ్ళాను ,వంట చేసినంత సేపూ మా ఆయన ఒకటే నస ..అన్నం మెత్తగా చేసావేమో ,ఇందులో ఏదో తక్కువ అయినట్లుంది,దాన్ని ఇంకొంచం వేపాల్సింది అని...లంచ్ వడ్డించినప్పుడు మహా టెన్షన్ నాకు ,తిన్న వాళ్ళందరూ ఆహా ఎంత బాగున్నాయి,ఏం రుచి అని పొగిడేస్తుంటే నా కళ్ళలో నుండి ఒకటే ఆనంద భాష్పాలు.. వాళ్ళు అలా వాళ్ళ రూంస్ కి వెళ్ళగానే ,నా ఆనందబాష్పాలు ఇంకకముందే మా కుళ్ళు మొహం మొదలెట్టేసారు ,మరీ ఎక్కువ ఫీలయిపోకు ఎవరూ మొహం మీద బాలేదని అనరు అనుకుంటూ ... అప్పడాల కర్ర అనేది ఆడవాళ్ళకు ఎందుకు అవసరమో నాకు తెలిసొచ్చింది అప్పుడు...


కాబట్టి నేను చెప్పొచ్చేది ఏమిటంటే కడవంత గుమ్మడికాయా కత్తి పీటకు లోకువ అని బంగారంలాంటి పెళ్ళాం కత్తిలాంటి మొగుడికి ఎప్పుడూ లోకువే ..అంతే ,అంతే ,అంతే ముమ్మాటికీ అంతే