30, డిసెంబర్ 2008, మంగళవారం
సొగసు చూడ తరమా!!!
మావయ్య పెళ్ళి కనీ వెళ్ళి వారం రోజులు అమ్మమ్మ ఇంటిదగ్గర బిషాణా వేసి ఇంటి కొచ్చిన నేను మా పిన్ని మాటలు విని పక్కన బాంబ్ పడినట్లు అదిరిపడ్డాను..మీ ఫ్రెండ్ స్వాతి రెండుసార్లు వచ్చి వెళ్ళింది, తనకు పెళ్ళి కుదిరింది అంటా..తాంబూళాలకు పిలుద్దామని వచ్చింది అంది..( స్వాతి ఎవరో తెలుసుకోవాలంటే ఈ అమ్మాయి చాలా మంచిది పోస్ట్ చదవాల్సిందే.. :))
స్వాతి కి అప్పుడే పెళ్ళా..ఇంటర్ ఎగ్జాంస్ అయి నెల కూడా కాలేదు.. అంత తొందరేమొచ్చింది అనుకుంటూ వాళ్ళ ఇంటికి బయలుదేరాను .దారంతా ఆలోచనలే..పాపం డాక్టర్ కావాలని ఎన్ని కలలు కన్నాది..నా వల్ల వాళ్ళ అమ్మమ్మగారితో తిట్లు తిన్నపుడల్లా ఉడుకు మోత్తనంతో ...."చూస్తూ ఉండవే ,నేను బాగా చదువుకుని మా పిన్నిలా డాక్టర్ ను అయి పేదవాళ్ళకు ఉచితం గా సేవ చేస్తూ ఒక మదర్ ధెరిస్సాలా పేరు తెచ్చుకుంటాను.. మీ నాన్న గారికి ఎలాగూ మొత్తం ఆడపిల్లలే కదా ..నీకు ఉత్తరం ముక్క రాసే పాటి చదువు రాగానే ఎలాగూ పెళ్ళి చేసేస్తారు ..నేను డాక్టర్ ను అయ్యేసరికి ,నువ్వు ఇద్దరు పిల్లలని వేసుకుని మా ఇంటికి నన్ను చూడటానికి రాకపోతావా..మా అమ్మమ్మకి ఎవరు గొప్ప అనేది తెలియకపోతుందా అని శపధాలు చేసేది..
అలాంటిది సడన్ గా ఈ పెళ్ళి ఏమిటి..అది కూడా మరీ ధారుణం గా ఇంటర్ అవ్వగానే.. ఎలాగన్నా ఆపాలి ...బ్రతిమాలో,బెధిరించో పెద్దవాళ్ళకు నచ్చ చెప్పాలి,లేకపోతే ఫ్రెండ్షిప్ కి అర్దం ఏమిటి అని చాలా ఆవేశం గా వాళ్ళ ఇంటికి వెళ్ళాను ..మెల్లిగా గేట్ తెరుచుకుని లోపలికి అడుగేస్తూ... ,నన్ను చూడగానే బోరున వాటేసుకుని ఏడ్చే స్వాతిని ఎలా ఒదార్చాలో ఆలోచిస్తూ దాని బెడ్ రూం దగ్గరకు వెళ్ళి చూద్దును కదా ... మాయా బజార్ లో సావిత్రి మల్లే .. అహనా పెళ్ళియంటా ,ఓహొ నా పెళ్ళియంటా అని డాన్స్ కడుతూ జడ అల్లుకుంటున్న స్వాతి కనబడింది ..
నన్ను చూడగానే రండి మేడం .. నేను అంటే నీకెప్పుడు పడదు.. సరిగ్గా సమయానికి ఉండవు ..మొన్న అందరూ ఉన్నారు నువ్వు తప్ప అని అలక స్టార్ట్ చేసింది ..దాని మాటలు మధ్యలోనే ఆపు చేస్తూ అదేంటే అప్పుడే పెళ్ళి ఏంటి అన్నాను ..నా వైపు చూస్తూ హూమ్మ్..అని నిట్టూర్చీ మరి తప్పదుకదా ,ఎప్పుడోకప్పుడు చేసుకోవాలి కదా.. కాకపోతే మీ అందరి కంటే కొంచం ముందు పెళ్ళి చేసుకుంటున్నా అంతే అంది.. అవును అనుకో కాని మరీ ఇంత చిన్న వయసులోనా!!!అన్నాను.
నీకో విషయం తెలుసా నేను నీకంటే పెద్దదాన్ని నాకు మొన్న 18 యేర్స్ వచ్చేసాయి అంది ...అయితేమటుకు అప్పుడే చేసేసుకోవాలా!!...మరి డాక్టర్ అన్నావ్ ,సేవ అన్నావ్ ..కనీసం నీ పేరు పక్కన డిగ్రీ అన్నా లేకుండా పెళ్ళి చేసుకుంటే ఈ రోజుల్లో ఎలాగే అన్నాను..అవుననుకో....కానీ సేవ చేయాలంటే డాక్టరే అవ్వాలాఏంటి?..ఆ మాటకొస్తే పెళ్ళికి ముందే చేయాలా సేవ? ..అయినా ఆయన పెళ్ళి అయినాకా చదువుకో అన్నారు అంది చిన్నగా సిగ్గుపడుతూ..
నాకు చిర్రెత్తుకొచ్చింది ... ఏంటీ చేసేది సేవ పెళ్ళి అయ్యాకా!!.. పతి సేవ చేద్దువుగాని..నేనింకా నిన్నేదో బలవంతంగా ఈ పెళ్ళికి ఒప్పించాసారేమొ అని పరిగెట్టుకొచ్చేసా..చూడబోతే నువ్వే చేసుకుంటా అని వాళ్ళను ఒఫ్పించినట్లు ఉంది ..అయినా నీకేం తక్కువే,ఒక్కగానొక్క అమ్మాయివి,మీ నాన్న గారికి నిన్ను చదివించే స్తోమత ఉంది మరి నీ బాధ ఏంటి చక్కగా చదువుకోక,కాస్త చదువుకుని ఏడిస్తే ఇంత కంటే మంచి సంబంధం ..మంచి జాబ్ ఉన్నవాడు వస్తాడు తెలివితక్కువదానా..పెద్దవాళ్ళు అన్నాకా పెళ్ళి చేసేస్తే బాగుంటుందనే అనుకుంటారు ..కొంచం నచ్చ చెప్పచ్చుగా వాళ్ళకు అన్నాను అలుపొచ్చి ఆగుతూ ...
అంతా విని అయ్యిందా నీ గొడవ అన్నట్లుగా ఒక చూపు చూసి ,బీరువాలో నుండి ఒక ఫొటో తీసుకొచ్చి నా చేతికిచ్చింది..ఆ ఫొటో చూడగానే నాకు నోట మాట రాలేదు .. పెళ్ళికొడుకు మన మిల్క్బోయ్ మహేష్ బాబులా తెల్లగా,అందంగా,స్టైల్ గా సినిమా హీరోలా ఉన్నాడు..ఇక అది స్తర్త్ చేసింది మాట్లాడటం ..దీనికి మల్లే ఒక్కడే కొడుకంటా..కాబట్టి ఆడపడుచుల గోల లేదు, వేరే ఊరిలో జాబ్ కాబట్టి అత్తమామల పోరులేదు ,పైగా బోలెడు ఆస్తి.. బాగా మాట్లాడుతున్నాడు ,ఇష్ట పడి చేసుకుంటున్నాడు ..పైగా ఇంట్లో అందరికి నచ్చేసాడు ఇలాంటి అబ్బాయిని వద్దంటే మా వాళ్ళు ఇంకోసారి ఇంతకంటే మంచిసంబంధం తేగలరా.... నేను మరీ నువ్వు అనుకున్నంత వెర్రి వెంగళప్పను కాదే ..అన్నీ తెలుసుకునే ఒప్పుకున్నా అంది.
అవుననుకో .. కానీ .. అదీ నాకు ఏం మాట్లాడాలో అర్దంకావడం లేదు..నాకు అప్పటికే జ్ఞానోదయం అయి చాలా సేపైంది..ఇదిగో నీకో విషయం తెలుసా ..ఈ పెళ్ళి కుదిర్చిందే మా అమ్మమ్మ.. నువ్వు ఇలా నా మనసు పాడు చేస్తున్నావని తెలిసిందనుకో .. ఏ నోటి తో నిన్ను పొగిడిందో అదే నోటి తో నిన్ను భయంకరంగా తిడుతుంది చూసుకో అంది ..దెబ్బకు కధ కంచికి నేను మా ఇంటికి ..
అయితే అసలు గొడవ అక్కడి నుండి మొదలుఅయింది నాకు .. మరుసటి రోజునుండీ ఫోన్ చేసి చంపేసేది నన్ను.. నాకు మీ అందరి కంటే ముందు పెళ్ళి అవుతున్నా సరే .. రేపు మీ అందరి పెళ్ళిళ్ళప్పుడూ నేను మిమ్మల్ని చూసి బాధ పడకూడదు.. అయ్యయ్యో వీళ్ళు నాకంటే బాగా సందడిగా చేసుకున్నారే అని..మీ అందరూ మీ పెళ్ళప్పుడు మన స్వాతిలా తయరవ్వాలి.. మన స్వాతి కొన్న చీరల్లాంటి చీరలు కొనుక్కోవాలి ..మన స్వాతి వేసుకున్న నగలు లా చేయించుకోవాలి అంతెందుకు స్వాతి లా పెళ్ళి చేసుకోవాలి అనుకోవాలి అని ఒకటే సోది..తల్లోయ్ అలాగే అంటాగాని హింసపెట్టకు అనేదాన్ని ..
అది.. అన్నట్లుగానే ప్రతీ విషయం లోను జాగర్తగా ఎంచి కొనుక్కుంది ..ఆ అబ్బాయికంటే పెళ్ళిలో తీసిపోకూడదని సగం జీవితం బ్యూటీ పార్లర్ లోనే గడిపేసింది మొహానికి ఫేషియల్స్ చేయించుకుంటూ ...
మొత్తనికి రానే వచ్చింది పెళ్ళి రోజు .. మా ఫ్రెండ్స్ మి అందరం ఉదయమే వెళ్ళాం ..మధ్యాహ్నం వరకు బాగానే ఉన్న పెళ్ళి పందిరి లో కొంచం కలకలం మొదలైంది ..విషయం ఏమిటంటే బంగాళా ఖాతం లో వాయుగుండం ..ఆ ముందురోజునుండే వర్షం వస్తున్నప్పటికీ ఉదయం మరింత జోరుగా కురవడం మొదలైంది.. మా ఫ్రెండ్స్ అందరం కబుర్లలో బయట వీచే ఈదురుగాలులను ,హోరువర్షాన్ని లెక్కచేయలేదు ..కాని మధ్యాహ్నం రావలసిన పెళ్ళికొడుకు ఇంకా రాకపోయే సరికి అందరి మొహంలో ఏదో తెలియని ఆదుర్దా కనబడటం మొదలైంది..ఈ విషయం స్వాతికి చెప్పకుండా మాలో మేమే రహాస్యంగా మాట్లాడుకునేవాళ్ళం ..
సాయంత్రం అయింది .. ఇప్పటిలా అప్పట్లో సెల్ఫోన్స్ లేవు ..సాయంత్రానికి తెలిసిన విషయం ఏంటంటే హోరుగాలివలన దారిలో చెట్ట్లు అడ్డంగా పడిపోవడం వల్ల పెళ్ళికొడుకు కార్ ,వాళ్ళ బంధువులు వస్తున్న పెళ్ళి బస్ ట్రాఫిక్ జాం లో ఇరుక్కుపోయాయి ..వచ్చేస్తారు అవి క్లియర్ అవ్వగానే అని..ఈ లోపల స్వాతి కి తెలిసిపోయి దిగాలుగా కూర్చుంది.. మేమందరం ఏం కాదులేవే వచ్చెస్తున్నారంట అని దైర్యం చెబుతున్నాం ..
ఈ లోపల ఎవరో పెద్దావిడ ముందు మంగళ స్నానాలకు ఏర్పాట్లు చేసేద్దాం... అబ్బాయి రాగానే ఆలస్యం లేకుండా పనులు అయిపోతాయి అంది .. వెంటనే స్వాతికి పాత చీర ఒకటి కట్టి (ఆ చీర చాకలికి ఇచ్చేస్తారు) నగలవి కొన్ని తీసివేసి ..తలంటు వేయాలి కాబట్టి జుట్టు విప్పదీసి కూర్చోబెట్టాం .. చీకట్లు ముసురుకుంటున్నాయి పెళ్ళికొడుకు ఇంతకీ రాడు అంతకి రాడు పెళ్ళి ముహుర్తం ఇంక దగ్గరికొచ్చేస్తుంది..ఇంక బంధువుల లో మెల్లగా గుసగుసలు మొదలైనాయి ...
నేను చెప్పలే .. ఆ పంతులితో పెట్టకన్నయ్యా ముహుర్తం అంటే విన్నాడా.. ఇప్పుడుచూడు ఏమైందో అని ఒకావిడ...పెట్టినముహుర్తం మార్చకూడదంట .. ఏం చేస్తారో ఏమో అని మరొక ఆవిడా ఇలా మాట్లాడు కోవడం మొదలెట్టారు ....ఇంక పెళ్ళి ఆగిపోయినట్లే అనుకున్న తరుణం లో సరిగ్గా ముహుర్తానికి 5 నిమిషాల ముందు పెళ్ళికొడుకు వచ్చేసాడంటా అనే వార్త గుప్పుమంది ..
ఒక్కసారిగా హడావుడి మొదలైంది ,నాదస్వరాలు మోగడం start అయింది.. అసలేం జరుగుతుందో అర్దం అయ్యే లోపు మా స్వాతిని ఎవరో హడావుడిగా తీసుకు వెళ్ళి పీటల మీద కూర్చోపెట్టేసారు ..బజంత్రీలు.. బజంత్రీలు ఎవరో అరుస్తున్నారు ...పెళ్ళికొడుకు ఆ హోరులో జీలకర్రా ,బెల్లం స్వాతి నెత్తి మీద పెట్టేసాడు.. ఒక పక్క మిగిలిన మా ఫ్రెండ్స్ ఒకరు పై పైన దువ్వి జడ అల్లుతుండగా,ఇంకెవరో కాస్త పౌడర్ అద్ది బుగ్గ చుక్క ,పెళ్ళి బొట్టు పెట్టారు ..బాసికం కూడా కట్టాకా ఒకరు పూల జడ కుడుతుండగా ..పంతులుగారు పెళ్ళిబట్టలు పై పైన వేసి తాళి కట్టేయ్ అన్నారు.
పెళ్ళికొడుకు తాళి కడుతుంటే ఆ చేతుల మధ్యలో నుండి బిక్కమొహం వేసి నా వైపు చూస్తున్న స్వాతిని చూస్తే నాకెందుకో ఏడుపొచ్చేసింది...కాని అనుకున్న సమయానికి పెళ్ళయినందుకు స్వాతి అమ్మమ్మ గారు అమ్మ ,నాన్నలు ఎంత ఆనందపడ్డారో మాటల్లో చెప్పలేను..
ఆ తరువాత స్వాతి అత్తవారింటికి వెళ్ళడం ..వాళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళు ఇల్లు మారిపోవడం వల్ల నేను చాలా రోజులు స్వాతిని చూడలేదు.ఒక సారి గుడిలో వాళ్ళ అమ్మగారు కనబడి స్వాతి వచ్చింది అని చెబితే ఇంటి అడ్రస్సు తీసుకుని వెళ్ళా ..నేను వెళ్ళేసరికి ఒక పాపను వీపున పడుకోబెట్టి ఊపుతూ ,బాబుకి అన్నం తినిపిస్తూ చిట్టీ చిలకమ్మా ,అమ్మా కొట్టిందా అని పాడుతూ మాతృమూర్తికి ప్రతీకలా ఉన్న స్వాతి నిండైన అందాన్ని చూస్తే సొగసు చూడతరమా అని పాడబుద్దేసింది
25, డిసెంబర్ 2008, గురువారం
ఎంకి పెళ్లి సుబ్బికి జీవితాన్ని ఇచ్చింది
చదువుకునే రోజుల్లో నాకు ఎక్జాంస్ అంటే చాలా భయం ,ఎంత భయం అంటే అవి అయ్యేలోపుల భయం తో నేను 10కెజీలు ,నన్ను చూసి అమ్మ నాన్న 5కెజిలు బరువు తగ్గిపోయేవాళ్ళం..ఒక్కోసారి విసుగొచ్చి నాన్న ..అలా భయపడితే ఇంక చదివించను జాగర్త అని బెదిరించిన రోజులు కూడా లేకపోలేదు ..
అవన్నీ పక్కన పెడితే ఆ టైం లో నేను చేసే మరొకపని ఏంటయ్యా అంటే .. తర తమ,పరమత బేధం లేకుండా మొక్కులు మొక్కేయడం..ఆ క్రమం లోనే ఆ సంవత్సరం కూడా విపరీతం గా మొక్కేసా .. మొక్కులంటే మొక్కడం ఈజి యే గాని వాటిని తీర్చేసరికి నాకు తీరిపోయేది.అలాంటి మొక్కుల్లోనే ఒక మొక్కు..చర్చ్ కి వెళ్ళి కొవ్వొత్తులు వెలిగిస్తా (ప్రసాదం కూడా పెట్టా అనుకుంటా)అనేది.
సరే మొక్కేసా..కాని నా జీవితం లో చర్చికి ఎప్పుడూ వెళ్ళలేదు ..ఎలా వెళ్ళాలో తెలియదు..లోపలికి వెళితే ఎమంటారో తెలియదు.. వెళ్ళినా వెలిగించనిస్తారో లేదొ తెలియదు..కాని తప్పదు కదా,కాబట్టి ఎలాగో నా ఫ్రెండ్ ని బ్రతిమాలి మొదటి సారి మా కాలేజ్ దగ్గరలో గల చర్చి కి వెళ్ళా, అదేంటో ఆ వీధిలో మనుషులు కర్ఫ్యూ పెట్టినట్లు ..తలుపులేసుకుని నిశ్శబ్దం గా ఉన్నారు.. ఎలాగో చర్చ్ కి వెళ్ళి కేండిల్స్ వెలిగించి వచ్చేసా ..
అదిగో సరిగ్గా ఆ తరువాత నుండి గొడవ స్టార్ట్ చేసింది .ఒక రోజంటే వస్తుంది.. మరి నేనేమో వారం రోజులని మొక్కుకున్నా నాయే ..నీ యెంకమ్మా ఇవేం మొక్కులే హిందూ దేవుళ్ళకు మొక్కినట్లు..కొబ్బరికాయలు కొడతా, ప్రసాదం పెడతా,దీపాలు వెలిగిస్తా అని..పైగా వారం రోజులా !నేను రాను.. మా నాన్న చూసారంటే మతం మార్చేసుకున్నానేమో అనుకుని నన్ను చంపేసి సంతర్పణ చేసేస్తారు ..నన్ను వదిలేయి అని నమస్కారం పెట్టేసింది రెండోరోజున .
ఎలారా బాబు అనుకుంటున్న టైంలోలో నా బుర్రకి ఒక ఐడియా వచ్చేసింది.నేను చాలా మాములుగా ,అవునే ..ఆ ఆబ్బాయి నీకు తెలుసా రోజు నిన్ను చూసి ఏదో తెలిసిన వాడిలా నవ్వుతున్నాడు అన్నాను..ఏ అబ్బాయీ అంది అయోమయం గా..అదే ఆ గ్రీన్ మేడ ఉంది చూడు ..అబ్బా.. అదేనే ఆ వీధి మలుపు తిరగగానే వస్తుంది అక్కడ ..రోజు నిన్ను చూసి నవ్వుతుంటే నీకు తెలిసిన వాడేమో అనుకున్నా అన్నాను..అవునా!ఏమోనే నేను గమనించలేదుఅంది..
ఈ సారి వెళ్ళినపుడు చూపిస్తా అని మెల్లిగా మాటల్లో పడేసి ఆ రోజు కూడా తీసుకు వెళ్ళిపోయా ...దారిలో ఎన్ని మాటలు చెప్పినా సరిగ్గా ఆ ప్లేస్కి రాగానే ఎక్కడే, నాకెవరు కనిపించడం లేదు అంది చుట్టూ చూస్తూ ..ఓర్నాయనో ఇది మర్చిపోలేదు ..లేనివాడిని ఎక్కడినుండి తీసుకురాను అని అనుకుని ఎవరో ఒకరు దొరకక పోతారా అని వెదుకుతున్నా.. అసలే ఆ వీధిలో మనుషులే కనబడరు పైగా యూత్ కావాలంటే ఎలా?
ఏమోనే ఈ రోజు రాలేదనుకుంటా అని ఒక అబధ్ధాన్ని రెడీ చేసుకునేంతలో ... ఆ అబ్బాయా!! అంది దూరంగా బైక్ మీద ఎవరికోసమో ఎదురుచూస్తున్నాడో లేక ఆ అబ్బాయి ఇల్లు అదేనో తెలియదుకాని అతనిని చూపుతూ..హమ్మయ్యా కాగల కార్యం గంధర్వులే తీర్చడం అంటే ఇదేనేమో అనుకుని అతనే అతనే అనేసా.
మరి గ్రీన్ మేడ అన్నావ్ అంది అనుమానంగా..అబ్బా అంత గుర్తులేదులేవే గ్రీన్ అనుకున్నా అని కవర్ చేసే అంతలో మేము అతని బైక్ దగ్గరకు వచ్చేసాం నడుస్తూ మా అలికిడికి అనుకుంటా తల తిప్పి చూసాడు.. మేము మాటలు ఆపి అతనిని దాటుకుని వెళ్ళి పోయాం..అవునే నాకు ఎక్కడో చూసినట్లు ఉంది అంది .. నీ బొంద ..అని మనసులో అనుకుని ఏమోలే నీకే తెలియాలి అన్నాను..మేము మళ్ళీ వస్తుంటే కూడా అక్కడే ఉన్నాడు .. ఇక అప్పటి నుండి రాను అనే మాటే అనలేదు.నా మొక్కు తీర్చడానికే పాపం పుట్టినట్లున్నాడు అనుకుని నవ్వుకునేదాన్ని.
ఆ తరువాత మా చదువుల పర్వం ముగిసిపోయాకా ఒక రోజు షాప్ లో ఏదో కొందామని వెళితే కనబడింది ..ప్రెగ్నెంట్ అనుకుంటా బొద్దుగా ముద్దుగా ఉంది .. ఎలా ఉన్నావ్ అన్నాను.. ఏదో నీదయ వల్ల బాగున్నా అంది..అబ్బో పెద్దరికం వచ్చేసింది అనుకుని.. పెళ్ళి అయిందా అన్నాను .. ఏదో నీ దయ వల్ల అంది..ఇదెవరురా బాబు అన్నిటికి నా దయ అంటుంది అనుకుంటుంటుండగా మా ఇల్లు ఈ పక్కనే నువ్వు రావాలి అని పట్టుపట్టి లాక్కుపోయింది..
ఇల్లు చూస్తేనే తెలుస్తుంది వేరు కాపురం అని .. పెళ్ళి ఫొటోస్ చూస్తూ అనుమానంగా ఏంటీ లవ్ మేరేజా అన్నాను ..ప్రెండ్స్ తప్పా మరి ఇంకెవరూ లేరు అందులో.. మరే .. తమరి దయే అంది నవ్వుతూ ...నా దయేంటి అన్నాను అయోమయం గా .. మా ఆయన్ని గుర్తుపట్టలేదా అంది.. ఉహు .. అన్నాను ..
అప్పుడు చెప్పింది.. ఆ రోజు చర్చి దగ్గర నేను చూపిన అబ్బాయినే పెళ్ళి చేసుకుంది అంటా..ఆ అబ్బాయి నన్ను చూస్తున్నాడా లేదా అని ఇది ..ఈ అమ్మాయి నన్ను ఎందుకు చూస్తుంది అని అతను కొన్నాళ్ళు చూసుకున్నాకా.. ఏదన్నా చిన్న ;చితక పనులుంటే తిను అటువైపే వెళ్ళేదట .. ఆ అబ్బాయి వీళ్ళ ఇంటి ముందర చక్కెర్లు కొట్టే వాడట .. అలా ఒక సంవత్సరం పాటు చూసుకుని ,చూసుకుని చివరకు ప్రేమించుకుని ఇంట్లో తెలిసాకా పెళ్ళి చేసుకున్నారంట.మొదట్లో ఒప్పుకోకపోయినా అబ్బాయి తరుపువాళ్ళు ముందుగా మాట్లాడినా, ఇంకా తిన నాన్న గారు మంకుపట్టు వదల లేదంటా .. ఎంత కాలం లే మనవడో ,మనవరాలో పుట్టేవరకునూ అంది ...
అంతా విన్నాకా నాకు సౌండ్ లేదు.. మాట వరసకు ..లేదా ఆపద్దర్మానికి ఏదో చెబితే ...దానికి కధ,స్క్రీన్ ప్లే ,పాటలు మాటలు అన్నీ కలిపి ఇలా సినిమా తీసేస్తుంది అనుకోలేదు ... ప్రతీ ప్రేమ కధ వెనుకా ఫ్రెండ్స్ ఉన్నారు అంటే ఇదేనేమో.. నాకు అదికాదు భయం వేసింది.. కధ సుఖాంతం అయింది కాబట్టి నేను హాయిగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నా కాని.. గొడవలు అయి ఏదన్నా అఘాయిత్యం చేసుకుంటే ఈ విషపు భీజం నాటినందుకు ఎంత కుమిలిపోయేదాన్ని.. హమ్మో పెళ్ళి చేసుకుని నన్ను బ్రతికించింది.. ఇంకెపుడు నా స్వార్దానికి అభద్దాలు చెప్పకూడదు బాబోయ్ అనుకున్నాను..
ఉండవే కాఫీ పెడతా అని వెళుతుంటే ఆపి .. ఇక్కడే ఉండి ,నేనేదో మాట వరసకు అని.. తను తూచా తప్పకుండా పాటించి ..చివరకు అంతా నీదయ వల్లే అన్నాదంటే అయిపోతా అనుకుని మళ్ళి వస్తా ఈ సారి అని చెప్పి నేను ఇంటికి పరుగో పరుగు
22, డిసెంబర్ 2008, సోమవారం
అదన్నమాట సంగతి
చిన్నపుడు మా నాన్నమ్మ ,తాతయ్యలంటే ఒక్కోసారి మహా చెడ్డ కోపం వచ్చేసేది .విషయం ఏమిటంటే మా తాతయ్య కధ చెప్పాడంటే back ground music తో సహా సినిమా చూసినట్లు చెప్పేవాడు..కాని దానికి సవాలక్ష కండిషన్లు పెట్టేవాడు .అవేంటంటే పిల్లలం అందరం పరమానందయ్య శిష్యులు లాగ కాళ్ళు,చేతులూ పంచేసుకుని వత్తు తూ .. ఊ..ఊ అని ఊ కొడుతూ వినాలి .. కధ మద్యలో ఎవరన్నా లీనమై పోయి 'ఊ' కొట్టక పోయినా ..కాళ్ళు పట్టక పోయినా ఇంక అంతే అలిగేసేవాడు .. ఇంక ఎంత బ్రతిమాలినా ఆ పూటకు చెప్పేవాడు కాదు..
పోని నాన్నమ్మ దగ్గరకు వెళ్ళి అడిగామా అదో పేద్ద చిక్కు. తను వెంటనే రెడీ అయిపోయేది చెప్పడానికి.. కాని ఏళ్ళ తరబడి ఒకటే కధ చెప్పేది ..ఒక రాజు కి 7 గురు కొడుకులున్నారంటా .. నాన్నమ్మా!! ఎన్ని సార్లు చెబుతావ్ అదే కధ కొత్త కధ చెప్పు నాన్నమ్మ అని ఎంత ముద్దుగా అడిగినా ,నాకు మా అమ్మ అదే కధ చెప్పింది .నాకు అదొక్కటే వచ్చు వింటే వినండి లేక పోతే లేదు అని ఖరాకండి గా చెప్పేసేది, ఇంక చేసేది ఏమి లేక తాతయ్యనే ఆశ్రయించేవాళ్ళం .
అలా కధలు కూడ చెప్పని నాన్నమ్మకు మా వీధి అంతా అభిమానులు ఉండటం నాకు ఎంత తల కొట్టుకున్నా అర్దం అయ్యేది కాదు .
మా ఎదురింటి వరండా చాలా విశాలంగా ఉండేది . సాయంత్రం అయ్యేసరికి నాన్నమ్మ, ఇంకొందరు ఆడవాళ్ళు అక్కడ సమావేశం అయి మాట్లాడుకునేవారు ,ఒక్క రోజు నాన్నమ్మ అక్కడకు వెళ్ళకపోతే ఇంటి కొచ్చి పరామర్శించి వెళ్ళేవారు .
ఒక రోజు ఎదురు ఇల్లు బాగు చేయిస్తూ ఉండటం తో నాన్నమ్మ మా ఇంట్లొనే ఉండి పోయింది. అందువల్ల ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళతో మా ఇంట్లోనే సమావేశం మొదలుఅయింది.. నేను అక్కడే ఉండి ఏదో హోం వర్క్ చేసుకుంటూ ఒక చెవి వేసి వింటున్నా ..
అందులో ఒక ఆవిడ ఏంటో పిన్ని గారు ఆయనేమో ఇల్లంతా అప్పులతో నింపేసారు,పిల్లేమో పెళ్ళికెదిగి కూర్చుంది,పిల్లాడేమో చేతికందలేదు ఇంకా.. రాను రాను జీవితం ఎలాగ గడపాలో తెలియడం లేదు అంది.మరేం చేస్తాం కష్టాలు మనుషులకు కాక మానుల కొస్తాయా అంది నాన్నమ్మ..ఏం కష్టాలో లేండి ,పేదవాళ్ళ లా పుట్టినా ఏదో కూలినాలి చేసి బ్రతికేయగలం ఈ మద్యతరగతి బతుకులింతే అంది .
బాగుంది.. వెనకటికి నీలాంటి వాడే ,ఇలాగే దిగాలుపడిపోయి దేవునితో ..దేవుడా ఇన్ని కష్టాలు నాకే ఇచ్చావ్.. ఆఖరికి పాలవాడు, నీళ్ళ వాడు కూడా ఒకరోజుకాకపొతే ఇంకొక రోజైనా సంతోషం గా కనబడుతున్నాడు నాకే ఎందుకు ఇలాంటి బ్రతుకిచ్చావ్ అని చాలా బాధ పడిపోయాడంట,ఆ రాత్రి కలలో దేవుడుకనబడి సరే నీకొక మేజిక్ సంచి ఇస్తాను దానిలో నీ బాధలు ,కష్టాలు, దిగుళ్ళు అన్నీ వేసుకుని ఫలానా గుడికి రా అన్నాడంటా ..వీడు సంతోషం గా అన్నీ గుర్తుతెచ్చుకుని ఆ సంచి నిండా అన్నీ నింపి బయలుదేరడంటా ,దారిలో వీడికంటే పెద్ద సంచులేసుకుని పాల వాడు, నీళ్ళ వాడు ఇంకా బాగా డబ్బులున్న సేఠ్ గారు,వ్యాపారం చేసే సుబ్బి శెట్టి ఏకంగా బస్తాలు మోసుకుని వస్తున్నారంటా ,అమ్మో వీళ్ళకు నాకంటే ఎక్కువ కష్టాలనుకుంటా అయినా మనకెందుకులే అనుకుని గుడికి చేరుకున్నాడంటా .. గుడిలో దేవుడు చిద్విలాసం గా ఎవరి ఖర్మలను బట్టి వాళ్ళ కష్టాలు ఉంటాయి కాబట్టి అనుభవించక తప్పదు కానీ ,ఒక సహాయం చేస్తాను..మీకు మీ కష్టాల కంటే మిగిలిన వాళ్ళ కష్టాలు తేలికగా అనిపిస్తున్నయి కాబట్టి ..మీ సంచులు అక్కడ ఉన్న కొక్కాలకు తగిలించండి , నేను 3 అంకెలు లెక్క పెట్టగానే ఇక్కడ చీకటి పడి పోతుంది , మీరు మీ చేతికి తగిలిన సంచి పట్టుకుని మీ ఇళ్ళకు పొండి అన్నాడంటా..
దెబ్బకు మనోడికి చమటలు పట్టేసాయంటా.. ఇదేం గోల రా బాబు, నా కంటే పెద్ద బస్తాలాంటి సంచితో ఈ సేఠ్ నా పక్కనే ఉన్నాడు .. ఎందుకొచ్చింది అని తన సంచి గట్టిగా పట్టుకుని నిలబడ్డాడంటా,విచిత్రంగా సేఠ్ కూడా భయంగా తన బస్తా జాగ్రత్తగా గట్టిగా పట్టుకున్నాడంటా,చీకటి అవ్వడం పాపం అందరూ బయటకు పరుగులు తీసారు .. అయితే వీడికి అనుమానం వచ్చి సేఠ్ తో నేను నా సంచి తో వస్తే అర్దం ఉంది, మరి నువ్వెందుకు నీ సంచే తెచ్చుకున్నావ్ అన్నాడంట ,దానికి సేఠ్ .. నా కష్టాలన్ని 30 ఏళ్ళు గా భరిస్తున్నా కొన్ని అలవాటు పడిపోయా,కొన్ని పరిష్కార మార్గాలు కనుగొన్నా ,కొన్ని పరిష్కరించ బోతున్నా .. ఇప్పుడు కొత్తగా నీవి పట్టుకుని మళ్ళీ బాధ పడలేను అందుకే నావే తెచ్చుకున్నా అన్నాడంటా ..
కాబట్టి నీ కంటె ఎక్కువ బాధలు ఉన్నవాళ్ళను తలుచుకుని ఆ స్థితి లో లేనందుకు సంతోష పడి ధైర్యంగా నీ సమస్యలు పరిష్కరించుకో అంది..ఆవిడకు ఏం అర్దం అయిందో తెలియదు కాని నాకు మాత్రం నాన్నమ్మ కు కధలు వచ్చని అర్దం అయిపోయింది ..అమ్మ నాన్నమ్మా అని అనుకుంటునంతలో మరొక ఆవిడ ...ఏమో లే అక్కా ,నాకు ఈ బాధ్యతలు ఏమి లేవు.. పిల్లల పెళ్ళి అయిపోయింది ,నా కొడుక్కి ,కోడలికి భారం అయిపోయాను ..ఇంక బ్రతికి ఏం సాధించాలి అంది ..మళ్ళీ నాన్నమ్మ రెడీ అయిపోయింది .
వెనకటికి నీలాంటోడే బాగా సంపాదించి విసిగెత్తి పోయి అరెరే తిండితిప్పలు మానేసి నేను ఇంత సంపాదించి ఏం ఉద్ధరించాను అనుకుని ,డబ్బు అంతా మూటగట్టి ఊరి చివరన ధ్యానం చేసుకుంటున్న సాదువు దగ్గరకు వచ్చి
స్వామి, నాకు మనశ్శాంతి లేదు ,పెళ్ళాం పిల్లలు మిధ్య,ఈ సంపాదన భ్రమ అని తెలుసుకున్నా .. నన్ను మీ శిష్యుడిని చేసుకోండి అని ఆయన పాదాల ముందు డబ్బు పెట్టి నమస్కరించాడంట వంగుని..అతను అలా వంగున్నాడో లేదో ఈ సాదువు ఆ డబ్బు మూట పట్టుకుని పారిపోవడం మొదలు పెట్టాడు, దెబ్బకి భయం వేసి మొత్తానికి సాదువుని పట్టుకుని, ఓరి దొంగ వెధవ ,నువ్వు నిజం సాదువు అనుకున్నా ఇంత మోసమా అన్నాడంట అప్పుడు సాదువు నవ్వి..
ఇప్పుడేకదా డబ్బు ,సంసారం అనేది భ్రమ అన్నావు .. నీకు వచ్చింది విసుగే కాని విరక్తి కాదు నాయనా.. కాబట్టి హాయిగా ఎటువంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా ఆనందంగా జీవించు అన్నాడంటా ...
అది విన్నాక వాళ్ళందరూ మా నాన్నమ్మను తెగ పొగిడేసి వెళ్ళిపోయారు ..నేను కోపం గా రెండు చేతులు నడుము మీద వేసుకుని కధలు రావని చెప్పి వచ్చినోళ్ళందరికి సమాధానాలు కధలతో చెబుతావా ఆయ్.. ఈ విషయం అందరికీ చెపుతా అని వెళ్ళే లోపల నన్ను దొరకబుచ్చుకుని అది కాదమ్మ ఇప్పుడు నేను కధలు చెబితే పాపం తాతయ్య కాళ్ళు పట్టడం మానేస్తారు కదా.. పాపం తాతయ్య ముసలాడు అయిపోయాడు కదా .. అందుకే అంది..అమ్మో తాతయ్య మీద ఎంత ప్రేమ అనుకున్నా .. ఇప్పటికీ అనిపిస్తుంది భార్యభర్తల అనుబంధం అంటే అలా ఉండాలి అని ఏమైతేనో మా నాన్నమ్మ పేరు చెప్పి జీవితానికి పనికొచ్చే మంచి కధలు చెప్పేసా :) `
18, డిసెంబర్ 2008, గురువారం
ఈ అమ్మాయి చాలా మంచిది
అదేంటో నాకు తెలియదు కాని నా ఫ్రెండ్స్ అందరి ఇంట్లో నేను చాల మంచి ,బుద్ది మంతురాలైన అమ్మాయి అని పేరు , మా స్వాతి ఇంట్లో అయితే చెప్పక్కర్లేదు ..నేను కొంచెం దగ్గినా,తుమ్మినా ..చూసావా, ఆపిల్ల ఎంత చూడ ముచ్చటగా తుమ్ముతుందో నువ్వు ఉన్నావూ అని తిట్టి పడేసేవారు ,ఇలా నాకు మంచి పేరు రావడానికి ఒక పేద్ద కారణం ఉంది.
స్వాతి వాళ్ళింట్లో ఒక్కగానొక్క అమ్మాయి.ఆ ఇంట్లో తను,వాళ్ళ అమ్మగారు,అమ్మమ్మ గారు, కేంపుల పని మీద వెళ్ళి వారనికో,పదిరోజులకో వచ్చే వాళ్ళ నాన్న గారు. ఈ కారణాల చేత మాహ బోరు ఫీల్ అయి ఇంట్లో చెప్పకుండా (చెబితే ఎలాగు వద్దు అంటారు ) సినిమాలు ,షాపింగులు అని కష్టపడుతూ ఉండేది.నాదేమో ఉమ్మడి కుటుంబం .ఇంట్లో 20 తక్కువ కాకుండా పిల్లలమే ఉండేవాళ్ళం, పైగా మా నాన్న కు అందరం ఆడపిల్లలమే..కాబట్టి ఎక్కడకు వెళ్ళకుండా మహా సరదాగ గడిపేసేదాన్ని ఇంట్లో .. సరిగ్గా ఈ విషయం లో పడిపోయారు స్వాతి అమ్మమ్మ గారు. పాపం నాకంటే 2 మార్కులు ఎక్కువ తనకే వచ్చినా సరే నా కారణం గా చీవాట్లు తప్పేవి కావు తనకు. అలా సహజం గానే నా మీద కోపం పెంచేసుకుంది స్వాతి.
ఒక రోజు మా ఇంటికి కొత్తగా ఫొన్ పెట్టించారు ..ముందు ఎవరికి ఫొన్ చేద్దామా అనుకుంటూండగా,దాని ఖర్మకాలి నాకు స్వాతి ఫొన్ నంబర్ గుర్తు వచ్చింది. చక, చకా కాల్ చేసాను ..వాళ్ళ అమ్మమ్మ గారు తీసారు .బాగున్నారా అండి మాకు ఫొనె పెట్టించారు అని స్వాతి ఉందా అని అడిగాను . ఆవిడ అదేంటమ్మా ఈ రోజు స్కూల్కి కి వెళ్ళలేదా అన్నారు ఆక్చర్య పోతూ .(అప్పుడు 10థ్ చదువుతున్నా ).నేను అంత కంటేఆక్చర్యపోతూ... అదేంటండి ,ఈ రోజు స్చూల్ లేదుగా అన్నాను.అదేంటమ్మా ప్రేవేటు క్లాసు ఏదో ఉంది అంటగా లేటు అవుతుంది అన్నాది అన్నారు .అప్పటికే ఆమేకు అనుమానం వచ్చేస్తుంది .కనీసం ప్రేవేటు క్లాసు అన్నపుడన్న నా మట్టి బుర్రకు అర్దం కాలేదు.అబ్బే అలాంటిది ఏమి లేదండి అన్నాను ఒక వేళ నేను క్లాసు లో మెడం చెప్తున్నప్పుడు సరిగా వినలేదా అన్నట్ట్లుగా ఆలోచిస్తూ. ఆ తరువాత పడుకుంటున్నపుడు వెలిగింది లైటు ..అమ్మో, అయిపోయాను దేవుడో రేపు,అందులోను స్వాతికి విపరీతమైన కోపం ఎక్కువ.
నేను అనుకున్నట్లుగానే మరుసటి రోజు నన్ను లేఫ్ట్ అండ్ రైట్ వాయించేసింది.. అంతటి తో ఊరుకోకుండా 2 రోజులు నాతో మాట్లాడటం మానేసింది. పోని మానేసి ఊరుకుందా ..రోజు ఇద్దరం కలసేవెళ్ళి, కలిసే వస్తాం ఇంటికి .. మా ఇల్లు దాటాక తన ఇల్లు వస్తుంది,ఇక చూడాలి రోడ్ కి అటు సైడు తను ఇటు నేను ..ఒక మాట మాట్లాడకుండా శోక దేవతలా ఏడుస్తూ వచ్చేది ఇంటి వరకూ .. ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారో అని నాకు భయం ..
మూడవ రోజు మా స్కూల్ అయిపోయే టైం కి హిప్నాటిజం చేసే ఒక అబ్బాయి వచ్చాడు . మా 10th క్లాస్ అమ్మాయిలకు ప్రత్యేకం .. ముందుగా ఎవరినన్నా రమ్మన్నాడు .. అందరికీ భయమే .. అందుకే ఎవరూ రాలేదు .. ముందు గా హిప్నటిజం గొప్పదనం చెప్పాడు ,ఆ తరువాత వచ్చిన వాళ్ళ మెమరీ పవర్ పెంచి ఎక్షంస్ లో బాగ రాసేటట్లు చేస్తా అన్నాడు.. కొందరు మెల్లిగా లేచారు .. మా మేడం నా వైపు చూసింది .. నేను మహా పిరికిదాన్ని ఇలాంటి విషయాల్లో గబుక్కున చూపు తిప్పేసుకున్నా .. అప్పుడు లేచింది మా హీరోయిన్ .. వద్దులేవే మనకి తెలియదుగా అన్నాను.. నువ్వు మాట్లాడకు, ఈ సారి నీ కంటే బాగ ఎక్కువ మార్కులు తెచ్చుకుని నేను అంటే ఏమిటో చెబుతా అని శపధం చేసి వెళ్ళింది.
ఆ అబ్బాయి ఇప్పుడు మీరు నామాటలే వింటున్నారు వింటున్నారు, వింటున్నారు అని 20 సార్లు అంటూ మొత్తానికి అందరినీ నిద్రలో పంపేసాడు.. అందరికంటే మా స్వాతికి బాగా ఎక్కేసింది.మీ ముందు పేద్ద తోట ఉంది పువ్వులు కోసుకురండి అన్నాడు ,అందరూ ఎగిరెగిరి కోసేసారు గాలిలో,శత్రువులు వస్తున్నారు మీ చేతిలో గన్నులతో పేల్చేయండి అన్నాడు ,ధడ ధడ లాడించేసారు..వాళ్ళకు ఇష్టం అయినవాళ్ళ హీరో లు ,పాటలు ఒకటేమిటి అన్నీ చెప్పించాడు ,చివర్లో స్వాతి ని ఒక్కదాన్నే పడుకోబెట్టి ఈ అమ్మాయిని ఇనుప ముక్క అంత ధ్రుడం గా చేసేస్తా చూడండి అన్నాడు .. అలాగే నువ్వు చాలా భలంగా అయిపోతున్నావూ ,పోతున్నవూ అని మొత్తానికి కడ్డీలా చేసేసి, అంతటి తో ఊరుకున్నాడా దాని కాళ్ళు ఒక కుర్చీకి అంచుల దగ్గర ,తల ఇంకో కుర్చీ అంచు దగ్గర పెట్టి ఒక లావు పాటి అమ్మాయిని పిలిచి అటు ,ఇటు నడిపించాడు .. ఆ పిల్ల దొరికిందే చాన్సు అన్నట్లు కసా బిసా తొక్కి పడేసింది.. అంతా అయ్యాకా తిరిగి అందరినీ మామూలు గా చేస్తూ ,మీ అందరూ బాగా చదువుతారు, అన్నీ గుర్తుంటాయి అని అనేసి చక్కగా వెళ్ళిపోయాడు .
ఇంక ఇంటి కొస్తున్నప్పుడు ఎప్పటిలాగే రోడ్ కి అటూ ,ఇటు నడుస్తున్నాం .. మధ్యలో మెల్లిగా నా దగ్గరకు వచ్చి ఒళ్ళు అంతా నెప్పిగా ఉంది అంటూ మెల్లిగా మొదలెట్టి ఇంక అమ్మో ,బాబోయ్ అని ఏడుపు .. ఇంటికి జాగ్రత్తగా తీసుకువెళ్ళి అప్పజెప్పి వచ్చాను ..ఆ రోజు వాళ్ళింట్ట్లో రాత్రి ఎవరినీ పడుకోనివ్వలేదంటా ..పాపం హాస్పిటళ్ళ చుట్టూ తిరగడమే సరిపోయిందంటా .. రెండు రోజులయ్యాక ఎలా ఉందో చూద్దామని వెళ్ళా వాళ్ళింటికి .. వాళ్ళ అమ్మమ్మ గారు మా హెడ్మష్టారుని, ఆ హిప్నాటిజం అబ్బాయిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి ,చివర్లో ఏమ్మా నువ్వన్నా చెప్పలేక పోయావా అన్నారు .. స్వాతి అప్పటికే కళ్ళతో సైగ చేస్తుంది వద్దు చెప్పకు అన్నట్లు అది అర్దం అయ్యేలోపలే చెప్పేసాను.. చెప్పాను అండి అయినా వెళ్ళింది అని ..నాకు లైటు వెలిగేలోపల వాళ్ళ అమ్మమ్మ గారు మొదలెట్టేసారు .. తోటి పిల్ల ని చూసి నేర్చుకో ,బుద్ది ఉందా .. తెలియక వెళితే అదొక పద్దతి.. ఆ పిల్ల వద్దు అని చెప్పినా వెళ్ళవంటే ఏం చేయాలి నిన్ను అని .. నేను మెల్లిగా జారుకున్నా
(పై ఫోటో http://www.acclaimimages.com/_gallery/_pages/0449-0609-2506-1352.html వారి సౌజన్యం తో )
11, డిసెంబర్ 2008, గురువారం
ఔను నేను తప్పు చేసాను
ష్.. ఎవరికీ చెప్పనంటే నీకు ఒకటి చూపిస్తా అంది లల్లి . చెప్పను ..చెప్పను అన్నాను తల ఊపుతూ.. మెల్లిగా దాని బేగ్ నుండి బయటకు తీసి చూపింది .. బొట్టు బిళ్ళల పేకెట్లు ..అమ్మో ఎంత బాగున్నాయో పైకి అనకుండా ఉండలేక పోయా . రంగు రంగులవి, పొళ్లు అతికించినవి , ఇంకా మువ్వలు పొదిగినవి ఒక్కటి కాదు రకరకాలు ఉన్నాయి.నాకు ఒకటి ఇవ్వా అని అడగాలనిపించింది .. కాని ఇవ్వదు అని తెలిసి ..ఎక్కడ కొన్నావ్ అన్నాను.కొనలేదు కొట్టుకోచ్చాను అంది .అమ్మో షాపు వాడు చూడలేదా అన్నాను కళ్లు పెద్దవి చేసి .చూస్తే ఎలా కొట్టు కోస్తా అంది. దొంగతనం తప్పు కదా అన్నాను (మనసులో దానికి ఊరికే వచ్చేసాయనే బాధ ఉంది )ఏడిసాడు.. రెండు రూపాయల వస్తువు మనకి పది రూపాయలకు అమ్ముతాడు దొంగ వెధవ ... వాడిని మోసం చేయడం తప్పుకాదులే అంది..
ఈ లాజిక్ నచ్చింది నాకు.. నిజమే మోసం చేసిన వాళ్ళను మోసం చేస్తే తప్పేలా అవుతుంది ? ఇదే నీతి తో ఉన్నచాలా సినిమాలు గుర్తువచ్చాయి ..ఒక రోజు సావిట్లో కూర్చుని హోంవర్క్ చేసుకుంటున్నా .. తోట కూర తరుగుతూ అమ్మా, కొబ్బరి తురుముతూ పిన్ని మాట్లాడు కుంటున్నారు .. అవునూ కరివేపాకు మామ్మ ఇటు గాని వెళ్ళిందా అంది అమ్మ..వచ్చే వేళ అయింది అక్కా ,ఇంకా రాలేనట్టుంది.. ఏం మామ్మోలే అక్కా ఈ మధ్య అన్నీ చచ్చులు ,పుచ్చులు ఉన్నవి తెస్తుంది ,ముసలోళ్ళు అని జాలి పడతామా చివరకు మనకే ఎసరు పెడతారు అంది పిన్ని.మరే కలికాలం అమ్మ వంత పాడే అంతలో మామ్మ అరుపు వినబడింది..
చిట్టితల్లి కొంచం మామ్మను పిలిచి కరివే పాకు అడుగమ్మా అంది అమ్మ నా వైపు చూస్తూ ..ఎప్పుడూ నాకే చెబుతావ్ అనుకుంటూ బయటకు వెళ్ళా ..కరివేపాకు మామ్మ ఒక్క కరివేపాకే కాదు కొద్దిపాటి ఆకు కూరలు ,కూరగాయలు ,రేగు, నేరేడు పళ్ళు లాంటివి కూడా అమ్ముతుంది . మరి అందరూ ఆమెను కరివేపాకు మామ్మ అని ఎందుకంటారో నాకు అర్ధం కాదు. వయసు యాబై , యాబై అయిదు మధ్యలో ఉంటుంది అంతే.. కాని తల అంతా ముగ్గుబుట్టలా తెల్లగా ఉంటుంది ,అందుకే ఆమె కంటే పెద్దవాళ్ళు కూడా మామ్మా అనే పిలుస్తారు. మొహం మాత్రం చాలా కళగా ఉంటుంది.
బుట్ట నెత్తిపైన పెట్టుకుని ఎవరన్నా పిలవక పోతారా అని చెవులు రిక్కించి అరుచుకుంటూ వెళుతున్న మామ్మ నా పిలుపు వినగానే వస్తున్నా అమ్మా అని వడివడి గా మా ఇంటికొచ్చింది.. కరివేపాకు ఇచ్చి వెళ్ళే అంతలో మా పక్క ఇంటి ఆవిడ పిట్టగోడ నుండి తొంగి చూస్తూ మామ్మా నాకు ఒక కట్ట ఇవ్వు అంది . మామ్మ బుట్ట అక్కడే పెట్టి ఆమె దగ్గరకి వెళ్ళేసరికి వచ్చింది నాకు ఆ ఆలోచన..మామ్మ అందరినీ మోసం చేస్తుంది కదా నేను చేస్తే తప్పేముంది.. అసలు దొంగతనం చేయగలనా ? ఒకసారి చేసి చూస్తే ?.. ఒక సారి చుట్టూరా చూసి మెల్లిగా ఒక కట్ట కొత్తిమీర ,ఇంకేదో చేతికి దొరికింది తీసుకుని పక్కన దాచేసి దానిపై ఆ పక్కగా పడి ఉన్న తువ్వాలును కప్పెసా.. గుండెల్లో ధడ ధడ మంది .. మామ్మ మామూలుగా వచ్చి తన బుట్ట తీసుకుపోయింది .. మెల్లిగా వాటిని ప్రిజ్ తెరిచి అందులో వెజిటబుల్స్ ఉన్న ప్లేస్ లో పెట్టేసి చాలా ఆనంద పడిపోయా..అమ్మకు తెలిస్తే చంపేస్తుంది కాబట్టి చెప్పలేదు .
రెండు రోజులయినాక లల్లి క్లాస్ లో ఏడుస్తూ కనబడింది .. ఏమైంది అన్నాను..నిన్న మా మావయ్య కొనిచ్చిన గోల్డ్ పెన్ను కనబడటం లేదు అంది.. ఇద్దరం చాలా సేపు వెదికాం .. అదిగో ఆ సుందరే తీసి ఉంటుంది మేడం కి చెబుతా అంది..దాని దగ్గర లేకపోతే నిన్నే తిడతారు .. ముందు పోయింది అని చెప్పు అన్నాను.మేడం కి చెప్పాకా, ఆమె ఒక సారి అందరిని చూస్తూ ఇదిగో మన లలిత పెన్ను ఎవరో దొంగిలించారట .. స్కూల్ అయ్యే లోపల ఎక్కడినుండి తీసారో అక్కడ పెట్టకపోయారో నేను అందరిని చెక్ చేసి కనుక్కుంటా ..ఒక్క సారి దొంగా అని పేరు వచ్చిందో ఇక ఏం పోయినా మిమ్మల్నే అనుకుంటారు.. మీ అమ్మ, నాన్న చదువుకోండీ అని పంపితే మీరు నేర్చుకుంటుంది ఇదా.. వాళ్లకు తెలిస్తే ఎంత బాధ పడతారు?..
మేడం అంటున్న మాటలన్నీ నన్నే అంటున్నట్లుగా అనిపించింది.. లల్లి దొంగతనం చేసేటప్పుడు ఎంత ఆనంద పడినా.. తన వస్తువైయ్యేసరికి ఏడ్చేస్తున్నది .. తప్పు చేశా కదా నేను ..బాధ గా అనిపించింది..
మొత్తానికి లల్లి పెన్ను మాత్రం దొరకలేదు.. దారంతా సుందరిని తిడుతూనే ఉంది లల్లి. మరి నువ్వు కూడా మొన్న దొంగతనం చేసావ్ కదా అందాం అనుకున్నా.అంటే మాట్లాడటం మానేస్తుందని భయం .. భారంగా స్కూల్ బేగ్ మోసుకుంటూ ఇంటికోస్తున్న నాకు వీధి మలుపు తిరుగుతూ మామ్మ కనబడింది .
ఇంట్లో చూస్తే పిన్ని నవనవలాడే పాలకూర కట్టలు పట్టుకుని .. విన్నావా అక్కా ఎంత అన్యాయమో ,పాపం కరేపాకు మామ్మ కొడుకులిద్దరూ మామ్మను వాళ్ల ఆయన్ని బయటకు తరిమేసారంట , అతనికి ఒంట్లో బాగోకపోతే మామ్మే ఇలా ఎండనక, వాన అనక కష్ట పడి ఇల్లు గడుపుతుంది అంట .. ఇల్లు కూడా చాలా దూరంఅంట అక్కా .. పైకి అలా కనబడుతుంది కాని పాపం ఎన్ని రోగాలు చెప్పిందో.. పాపం ఏం కష్ట పడతావులే రోజు ఇంత అన్నం ఎక్కువ వండుతా తీసుకుపో అన్నాను, వద్దమ్మా నా రెక్కల బలం ఉన్నంత కాలం కష్ట పడతా ఆ తరువాత ఎలాగూ మీలాంటి తల్లులు చూడక పోతారా అని వెళ్ళిపోయింది ఈ రోజుల్లో అలాంటి నిక్కచ్చిమనిషిని ఎక్కడా చూడలేదనుకో అంది పిన్ని . మరే కలికాలం అంది అమ్మ .నాకో విషయం అర్దం అయింది ఎవరు ఏది అంటే అది వినేయకుండా సొంతంగా ఏది మంచి ఏది చెడో ఆలోచించాలి అని. విచిత్రంగా ఆ తరువాతా కరేపాకు మామ్మ మా వీధిలో రాలేదు ..ఇప్పటికీ కరివేపాకు చూస్తే మామ్మే గుర్తువస్తుంది
9, డిసెంబర్ 2008, మంగళవారం
అమ్మ ప్రేమ అర్ధం కాదు
ఏమో.... నాకైతే అమ్మ ప్రేమ లో తీయదనం అర్ధం కాలేదు అప్పట్లో .మా ఇంట్లో అందరం ఒకే సమయానికి భోజనం చేయడం అలవాటు.కాని ఆ రోజు అందరూ బయటకు వెళ్ళారు ఏదో పని మీద..ఒక్కదానినే ఉన్నా ఇంట్లో ..బాగా ఆకలి వేసింది...ఏమున్నాయా అని వెతికి చూస్తే టమోటా పప్పు ,పొట్లకాయ వేపుడు కనిపించాయి..
ఒక వారగా చిన్న గిన్నెలో రెండు కోడిగ్రుడ్లు టమోటా కూర కనబడింది ..ఇంకేం అన్నీ వేసుకుని చక్కగా ఒక పట్టు పట్టాను.కాసేపటికి అమ్మా వాళ్లు వచ్చారు..అయ్యో అనుకోకుండా లేట్ అయింది.. అన్నం తినకపోయావా అంది అమ్మ రాగానే..తినేసా అన్నాను..అమ్మ వంటగదిలో అన్నీ వెదికి ఇక్కడ గ్రుడ్ల కూర పెట్టా తినేసావా అంది కంగారుగా నావైపు చూస్తూ... ఎంచక్కా అన్నీ వేసుకుని తిన్నా అన్నాను తాపీగా..
ఒక్కటి ఇచ్చింది చెంప మీద..గూబ గుయ్యిమనేటట్లు... ఊహించలేదు కొడుతుందని.. కళ్ళ వెంట నీళ్లు గిర్రున తిరిగాయి..ఇంకేమి ఆలోచించావా .. నాన్న కోసం పెట్టా ఆ కూర.. అయినా అంత తొందరేమోచ్చింది ,వచ్చేవరకూ ఆగలేకపోయావ్ అని కోపం గా వెళ్లి పోయింది..నాకు ఏడుపు ఆగలేదు బాత్ రూమ్ లోకి పోయి ఎవరికీ చెప్పకుండా ఏడుస్తూ కూర్చున్నా ..
మనసులో ఏంటో బాధ ..ఏమి చేశా ఇప్పుడు ? కడుపునిండా తిన్నాఅంతే కదా .. ఏ తల్లి అయినా తింటే సంతోషిస్తారు గాని అమ్మలా తిడతారా ?ఛీ ..అమ్మకు నేను అంటే ఇష్టం లేదు .. ఇక నుండి అన్నం తినకూడదు ఇంట్లో.. బ్రతి మాలిన సరే.. ఒక వేళ తిన్నా ఎక్కువ తినకూడదు .. ఇలా చాలా అనుకుని బయటకు వచ్చా..పిన్ని గది నుండి అమ్మ మాటలు వినబడుతుంటే ఆగి పోయా..ఏమి కాదు కదా అమ్మ కళ్లు తుడుచుకుంటుంది ..నీదంతా ఒట్టి భయం లే అక్కా ఏమీ కాదు అని పిన్ని ఓదారుస్తుంది ..
ఏమో చిన్నప్పుడు అందరూ అనుకునేవారు.. పొట్లకాయ ,గ్రుడ్లు కలిపి తింటే విషం అయిపోతుంది అంటా.. పొట్లకాయ రాహు,కేతులంటా ,చందమామ గ్రుడ్డు అంటా ...రెండింటికీ పడవు కదా .. అసలే రాత్రి .. పిల్లకు నిద్రలో ఏదన్నా అయితే ..అమ్మ మళ్ళీ ఏడుస్తుంది ..ఊరుకో అక్కా నీదంతా చాదస్తం .. మహా అయితే ఆ రెండూ కలిపి తింటే అరగదు అనో ఏమిటో మన పెద్ద వాళ్లు అలా చెప్పి ఉంటారు .. నేను చాలా సార్లు తిన్నా అలాగ ..నాకేం కాలేదు .. కనీసం కడుపు నెప్పి కూడా రాలేదు అంటుంది పిన్ని..
అంతా మీ బావ గారివల్లె వచ్చింది ..ఆయనకు పొట్లకాయ ఇష్టం ఉండదు అందుకే అది వండా.. పోనీ వెళ్ళే టపుడన్నా దానికి చెప్పి వెళ్ళ లేదు .. పాపం భయం వల్ల కొట్టేసా కూడా ..ఏమీ కాదులే అక్కా మన పిల్లలు ఏదన్నా ఇట్టే మర్చిపోతారు .. నువ్వు భయపడి దాన్ని భయపెట్టకు పిన్ని అంటుంది.కొద్ది సేపటి క్రితం అమ్మను ఎన్ని మాటలు అనుకున్నాను ,అమ్మది చాదస్తం కావచ్చు ,భయం వల్ల కొట్టచ్చు..చదువుకున్న దాన్ని నా బుద్ధి ఏమైంది ? అంటే అప్పటికి నేను చిన్నపిల్లనే అనుకోండి .. ఇక ఆ రాత్రి అమ్మకు శివరాత్రే .. అస్తమాను వచ్చి చూసుకోవడమే .. ఏది ఏమైనా అమ్మ అమ్మే ..
ఒక సారి కష్ట పడి అమ్మ వచ్చే లోపల పిండి రుబ్బేసి అమ్మతో గొప్ప అనిపించు కోవాలనుకున్నా .. రుబ్బు రోలు బండ అమ్మా వాళ్లకు అలవాటు కాబట్టి అయిదు నిమిషాలలో రుబ్బేసేవారు .. నాకేమో చేతులు ఎర్రగా కందిపోయాయి .. అయినా విడవకుండా గంట కష్ట పడి రుబ్బేసా ..అమ్మ రాగానే గొప్పగా చూసావా ఎంత కష్టపడి రుబ్బానో అన్నాను .అసలు నిన్నెవడు రుబ్బమన్నారు, ఇడ్లీ కని వేస్తే గారెలు పిండి లా రుబ్బావ్.. పెద్ద అయ్యాక చేసే పనులు ఇప్పటి నుండి చేస్తే ఇలాగే ఉంటుంది .. ఇంకెప్పుడు రుబ్బకు అంది..
నాకు కోపం వచ్చేసింది ... ఛీ..ఛీ ఇంత కష్ట పడి రుబ్బితే కనీసం మెచ్చుకోలేదు సరి కదా తిడుతుంది అనుకుని.. మళ్ళీ అమ్మకు నేను అంటే ఇష్టం లేదు ఇలా చాలా అనేసుకుని పడుకున్నా ... కాసేపు అయ్యాకా పిన్ని వచ్చి అదేంటక్కా అలా అనేసావ్ పాపం నీ కోసం అంత ఇదిగా కష్ట పడితే అంది ..నీకు తెలియదు నువ్వు ఊరుకో ,దాన్ని కొంచెం పొగిడామన్టే అదే పట్టుకుంటుంది ..రోజు రుబ్బుతాను అంటుంది అంది . మరి ఇంకేం నీకు పని తప్పుతుంది కదా అంది పిన్ని.దాని చేతులు చూడు తోట కూర కాడల్లా ఎలా ఉన్నాయో .. పాపం మన కష్టాలు అదేందుకులే .. అంది .
మళ్ళి నేను షరా మామూలే అయ్యో అమ్మను అపార్ధం చేసుకున్నా అని. ఇలా చాల జరిగాయి ..నాకు ఒక విషయం అర్ధం అయింది.. అమ్మ ప్రేమ అర్ధం కాదు .. ఏదో ఆశించి చేయదు అమ్మ.. నిస్వార్దమైనది అమ్మ ప్రేమ
( ఫోటో http://www.bollywoodsargam.com/ వారి సోజన్యం తో )
7, డిసెంబర్ 2008, ఆదివారం
గ్రీకు వీరిణి
అవి నేను ఇంటర్ చదివే రోజులు.. మాది ఉమ్మడి కుటుంబం.. వరండా పక్క గదిలో పిల్లలం పరిక్షల సమయములో చదువుకునే వాళ్ళం .మా పిన్ని కొడుకు పదవతరగతి చదివేవాడు .. ఫ్రెండ్స్ తో తను కూడా అదే గదిలో చదివేవాడు .
తను కొంచెం సిగ్గరి . ఆడ పిల్లలకు ఆమడ దూరం లో ఉండేవాడు . మేము నిద్రవచ్చే వరకు అదే గదిలో చదివి వెళ్ళిపోయేవాళ్ళం . తరువాత తను ఫ్రెండ్స్ తో అక్కడే పడుకునే వాడు.వాళ్లు కూడా అక్కా ,అక్కా అంటూ చనువుగా అన్నీ తెలుసుకుని చదివేవారు.ఒక రోజు నేను చదువుతూ ,చదువుతూ నిద్రలో జారుకున్నాను , మధ్య రాత్రిలో లేచి చూస్తే ముగ్గురు ఒకటే గుస గుసలు .. సరే ఏమి మాట్లాడుకుంటున్నారో అని ఒక చెవి వేసి వింటున్నా.
అరే.. అలా చేస్తే మనకు కాబోయె పెళ్ళాం ఎలా ఉంటుందో ముందే చూడచ్చు అంటున్నాడు తమ్ముడి ఫ్రెండ్స్ లో ఒకడు...సరే ఏమి చేయాలి? ...మిగిలిన వారు ఉత్సాహం గా అడుగుతున్నారు.కాకి దుమ్ము ఒకటి వెతికి ,దాన్ని చెంబుడు నీళ్ళలో కలిపి ,మనం పడుకునే దిండు పక్కన పెట్టుకుని పడుకుంటే ,నిద్రలో మన కాబోయే పెళ్ళాం కనబడుతుంది అంటా .. అన్నాడు .
మిగిలినవాళ్ళు అప్పటికి వాడిని ఏడిపించినప్పటికినీ వాడు బాగా నమ్మపలికే సరికి కొంచం మెత్తపడి అప్పటికి పడుకున్నారు..
రెండు రోజులు పోయాక చూద్దును కదా ..మా తమ్ముడు ఏదో చిన్న బొమిక లాంటిది ఎక్కడినుండి తెచ్చాడో అరగదీయడం మొదలు పెట్టాడు..
అప్పటికి ఊరుకుని మరునాడు ఉదయం ఏరా నీ పెళ్ళాం బాగుందా అన్నాను నవ్వు ఆపుకుంటూ వీలైనంత సీరియస్సు గా మొహం పెట్టి ,ఏం పెళ్ళాం .. అని ముందు ఒప్పుకోకపోయినా ... నేను అన్ని చుసాలేరా అనేసరికి ముసి ముసి నవ్వులు నవ్వి అన్నీ అబద్దాలే అక్కా నిద్రలో వంతెన మీదనుండి పడిపోయినట్లు వచ్చింది కల అన్నాడు కోపం గా..
ఓరే కనబడవు కాని పెద్ద దొంగవి రా నువ్వు అని ఏడిపించా..అలా బయట పడిపోతాం ఏంటి అని నవ్వి .. మా అమ్మకు చెప్పకు అక్కా బాబు నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు .ఇప్పుడువాడు బెంగుళూరులో మంచి జాబ్ చేసుకుంటున్నాడు.. అప్పుడప్పుడు అడుగుతూ ఉంటా .. ఏరా నీ గ్రీకు వీరిణి ఎలా ఉంది అని ..
6, డిసెంబర్ 2008, శనివారం
ప్రియమైన మీతో
చాలా సంతోషం గా ఉందండి ఇలా మీ ముందుకు రావడం. తొలిసారి కదండి కొంచెం తికమక గా ఉన్నాను.. పొరపాట్లు ఏమన్నా ఉంటే క్షమించాలి మరి..ఇక నా గురించి నేను..పదహారు అణాల ఆంధ్రా ఆడపడుచుని, గోదావరి తల్లి ముద్దు బిడ్డని.. ఉండేది మాత్రం సింగపూర్..
తెలుగన్నా,తెలుగుదనమన్నా ,చెవులు ముక్కు కోసుకునేంత (శూర్ఫణఖ అనుకునేరు సుమా)ఇష్టం ఉన్నదాన్ని. తెల తెల వారుతుండగా అమ్మా పాలు అని పిలిచే పాల వాడి అరుపులన్నా, రాముల వారి గుడినుండి వచ్చే కమ్మని భక్తి పాటలు విన్నా,సందెపొద్ద్దు దాటాకా అమ్మ వాకిలి చిమ్మి ముగ్గు పెడుతుంటే చూస్తూ కూర్చొవడం అన్నా చాలా చాలా ఇష్టం. ప్లిచ్...ఇక్కడ అన్నీ కోల్పోతున్నానేమో అనిపిస్తుంది ఒక్కో సారి..ఎన్ని ఉన్నా ఏదో తెలియని వెలితి.. అలా అని ఇక్కడి జీవితం ఏదో ధుర్బలం అని కాదు ...అమ్మ ఇంటి నుండి అత్తగారి ఇంటికి వచ్చి నట్లు ఉంది.
అమ్మ దగ్గర ఆప్యాయత,ప్రేమా ఎలా అందుకుంటామో.. అత్తవారి ఇంటి దగ్గర వాటిని అలాగే పంచడం నేర్చుకుంటాం.. నేనూ అంతే.. చాలా విషయాలు ఇక్కడ నేర్చుకున్నా..ఇంకా నేర్చుకుంటూ ఉన్నా..
మొత్తానికి జీవితం ఆవకాయ బిర్యానిలా గడిచిపోతుంది అనుకోండి.మీ అందరి స్నేహం తో మరింత రుచిగా ఉంటుందని ఆశిస్తూ మీ..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)