3, డిసెంబర్ 2009, గురువారం

నా బ్లాగ్ పుట్టినరోజు





నా బ్లాగ్ మొదలెట్టీ అప్పుడే సంవత్సరం అయిపోయింది,అబ్బా రోజులు గిర్రున ఎలా తిరుగుతున్నాయో...సరే ఈ సందర్భం గా నా బ్లాగ్ ఎలా మొదలు పెట్టానో, ఎన్ని పాట్లు పడ్డానో ఆ కధా, కమానిషు నేను రాయాల్సిందే ..మీరు చదవాల్సిందే:)

సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే నెలలో ...ఉహుహు ..ఇంతకు ఒక నాలుగైదు నెలలక్రితం తెలుగులో బ్లాగులు ఉంటాయన్న విషయం తెలియగానే, నేనూ ఒక బ్లాగ్ ఓపెన్ చేసేద్దామని మాంచి ఉత్సాహంతో blogspot.comకి వెళ్ళి అలా సైన్ ఇన్ అవ్వగానే ఇలా ఛీ,ఛీ పో అని ఏదో ఎర్రర్ వచ్చి తిట్టింది. కారణం నాకూ తెలియదు.ఒక్కసారి తిడితే పట్టించుకోకుండా దులిపేసుకునేదాన్ని కానీ, నాలుగైదు సార్లు అలాగే తిట్టేసరికి చిరాకోచ్చేసి సరేలే అందని ద్రాక్ష పుల్లన టైపు లో నేను కూడా, బ్లాగ్ రాయక పోతే వచ్చే నష్టం ఏముందిలే అని పక్కన పడేసాను.


అయితే ఈ లోపల నాకు తెలుగు బ్లాగ్ లు చదవడం మెల్లిగా అలవాటు అయ్యింది.ఆ తరువాత చక్కని పొస్ట్ లు రాసిన వారిని పొగుడుతూ వచ్చిన వ్యాఖ్య లను చదివి.... ఆహా,ఎక్కడో ఎవరో రాయడం ఏంటో ,ఇంకెక్కడో ఎవరో దాన్ని చదివి పొగడటం ఏంటో భలే ఉంది నేనూ కూడా ఇలాగే రాస్తే, నన్ను కూడా ఇలాగే పొగిడితే ఎంతబాగుంటుందో కదా అని కాసేపు కలలు కనేదాన్ని, కాని మళ్ళీ blogspoT జోలికి మాత్రం వెళ్ళలేదు.


అయితే ఒక రోజు మా ఆయన తన కొత్త లాప్ టాప్ గురించి చెప్తూ ,ఇదిగో దీనిలోంచి ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నా ఇది మాత్రం ముట్టుకోకే అని నాకు లేని పోని అవుడియా ఇచ్చేసారు .సరే ఇందులో కూడా ఒకమారు ట్రై చేద్దాం అనుకున్నా . ఇంకేంటి మా ఆయన బయటకు ,నేను లాప్ టాప్ దగ్గరకు వెళ్లడం ఒకేసారి జరిగిపోయాయి. ఇలా సైన్ ఇన్ అవ్వగానే ,అలా నీకేం బ్లాగ్ కావాలో కోరుకో అంది అది . కొండెక్కినంత సంబర పడిపోయి ఆ బ్లాగుకు 'ప్రియమైన మీకు ' అని అప్పటికి తోచిన పేరుతో నామకరణం చేసేసి, ప్రొఫైల్ లో మనసునమనసై పాటంటే నాకిష్టం అని ఇంకా ఏంటేంటో రాసేసుకుని ,చక్కగా నలుపు టెంప్లెట్ మీద తెలుపు అక్షరాలు సెలెక్ట్ చేసుకుని (అప్పటికి నాకు తెలియదన్నమాట నలుపు మీద తెలుపు అక్షరాలు కళ్ళు లాగుతాయని) మా ఆయన వచ్చేలోపల క్లోజ్ చేసేసి గప్ చిప్ సాంబార్ బుడ్డీ అయిపోయాను.

ఇంక అక్కడి నుండి ఒకటే ఆలోచనలు ఏం రాయాలి అని? అప్పటికి బ్లాగ్స్ లో కవితల బ్లాగ్లు రాజ్యం ఏలుతున్నాయి.చిన్నపుడు నేను కూడా కొన్ని తవికలు తవికాను కాబట్టీ మనం కూడా కవితలు రాసేద్దాం అని నిర్ణయించేసుకుని పేపరు ,పెన్ను పట్టుకుని ప్రొద్దున్న నుండి రాత్రివరకు తెగ ఆలోచించేస్తే గోడ మీద బల్లి,మంచం మీద నల్లి ,వాకిట్లో పిల్లి అని భయంకరమైన కవితలు ( ?) వస్తున్నాయి కాని చక్కటి వాక్యాలు 4కూడా రావే .

అలా ఒకటా రెండా ,మూడు రోజుల నుండి గింజుకున్నా మూడు ముక్కలు రాయలేక పోయా... ఈ లోపల బయటకు వెళ్లడం,పార్టీలు,పండగలని ఆ విషయం మర్చిపోయా...ఒక రోజు వంట చేస్తూ చిన్నపుడు జరిగిన విషయం ఏదో గుర్తు వచ్చి పక్కున నవ్వుకుంటుంటే, టక్కున ఐడియా వెలిగింది.అవునూ...నేను కూడా ఎంచక్కా నా చిన్ననాటి విషయాలు రాసేయచ్చు కదా,పైగా నా శైలి ఎలా ఉందో తెలిసిపోతుంది.ఒకళ్ళో ,ఇద్దరో బాగుంది అంటే చాలు మా ఆయనకు చూపించేసి ఉడికించేయచ్చు అని ఇలా ఇలా ఉత్సాహ పడ్డానో లేదో డింగుమని నా అంతరాత్మ వచ్చి మా మిక్సీ పక్కనే కూర్చుని ,నాకు తెలియక అడుగుతాను ఇప్పుడు నువ్వు బ్లాగులు రాయడం అవసరమా ? అహా అవసరమా అంట ? మూడు ముక్కల కవిత రాయడానికి మూడు రోజుల నుండి గింజుకున్నా రాయలేనిదానివి చిన్ననాటి విషయాలు ఎలా రాస్తావ్ చెప్పు,పైగా ఆల్రెడీ బోలెడు మంది ప్రొద్దున్నలేస్తే ఇవే విషయాలు పోస్ట్ చేస్తున్నారు.అలాంటిది నువ్వు రాస్తే ఎవరు చదువుతారు ?..ఒక్కరు కూడా బాగుంది అనరు .నా మాట విని హాయిగా బ్లాగ్స్ చదువుకుని కాలక్షేపం చేసేయ్ అని ఉపదేశించి నా ఉత్సాహం మీద ఉప్పు జల్లేసింది..నిజమే కదా మనకెందుకులే అనుకుని మళ్ళా వాయిదా వేసేశాను .


కానీ అప్పటి నుండి నాకు చిన్నప్పటి విషయాలు బోలెడు నాన్ స్టాప్ గా గుర్తొచ్చేయడం మొదలయ్యాయి ...అర్రేర్రే ఇంత మంచి ,మంచి ఙ్ఞాపకాలు పెద్దయ్యాకా గుర్తుంటాయో ఉండవో ఇప్పటికే ఉప్పుడబ్బా ఫ్రిజ్ లోనూ ,కొత్తిమీర కట్ట కప్ బోర్డ్ లోనూ పెట్టేసి మర్చిపోతున్నా... వీటినన్నిటిని ఒక చోట రాసుకుని పెద్దయ్యాకా మా పిల్లలకు,మనవలకు చెప్పచ్చు కదా అనిపించేసింది.ఇంకెక్కడో ఎందుకు నా బ్లాగ్లోనే రాసేసుకుందాం .ఎదుటివాళ్ళకు అర్ధం అయినా కాకపోయినా నా శైలి నాకర్ధం అవుతుంది కదా అనేసుకుని లాప్ టాప్ ఓపెన్ చేసాను...ఇక్కడ మీకు పజిల్ ...ఏమి జరిగి ఉంటుందో ఊహించండి..


సరే నేనే చెప్పేస్తా.. మీరు నా గొప్పతనాన్ని అంచనా వేయలేరు ...సాదారణంగా అందరూ passworD మర్చిపోతుంటారు నేను వెరైటీగా user ID ని మర్చిపోయాను. అంటే ఆ రోజు కంగారులో ఏదో విచిత్రంగా పేరు పెట్టి మర్చిపోయా,అది సంగతి .... వారం రోజుల క్రితం క్రియేట్ చేసిన మెయిల్ ఐడీయే గుర్తులేదు నీ మొహానికి ఙ్ఞాపకాలు రాయడమొకటి ఛీ థూ అనేసింది నా మనసు.ఇంకేంటి కధ కంచికి ,కంప్యూటర్ క్లోజ్ కి .ఇలా మొత్తానికి చాలా రోజులు బ్లాగ్ జోలికి వెళ్లలేదు .


ఒకరోజు ఎలాగైతేనేం దేవుడా దేవుడా ఈ సారి ఎలాంటి విఘ్నాలు రాకుండా చూడు స్వామీ అని దణ్ణం పెట్టుకుని, ఈ సారి ఎలా అయినా బ్లాగ్ పేరుతో సహా ముందే చక్కగా ఆలోచించి మొదలుపెట్టాలని నిర్ణయించుకుని ఏం పేరు పెడదామబ్బా ? అనుకోగానే మందారం,నందివర్ధనం,కనకాంబరం ,పారిజాతం అంటూ టకటకా ఒకటే పేర్లు గుర్తొచ్చేయడం మొదలయ్యాయి...చత్ ,నీ ఆడ బుద్ది పోనిచ్చుకోలేదు,ఎప్పుడూ పువ్వులు,చీరలు,నగలు ఇవితప్ప ఇంకేం పేర్లు నీకు తోచవా ,నీలాంటివాళ్ళ వల్లే మన ఆడవాళ్ళ పై జోకులెక్కువైపోతున్నాయి కార్టూన్స్ లో అని నాలో స్త్రీవాది నిద్రలేచి మరీ దులిపేసింది....హూం పోనీ నా ఙ్ఞాపకాలుకు సరిపోయేటట్లు పెడదాం... అంతరంగాలు,గుప్పెడంతమనస్సు,కడలి కెరటాలు...అబ్బేబ్బే మరీ సీరియల్స్ పేరుల్లా ఉన్నాయి పోనీ అన్వేషిత,అనామిక,ఆలోచన,హరి విల్లు... బాబోయ్ ,ఒక్కటీ పొంతన కుదరడంలేదు పేరుకి , రాసేదానికి..


బ్లాగ్ పేరే పెట్టలేనిదాన్ని ఇంక బ్లాగేం రాస్తాను అని దిగాలుగా దిక్కులు చూస్తుంటే అంతకు ముందే మాల కట్టిన సన్నజాజి పూలు కిటికీ ఊచల పై వ్రేళ్ళాడుతూ ఆహ్లాదం గా కనిపించాయి .. అవును ఆ సన్నజాజుల్లాగే నా ఙ్ఞాపకాలు కూడా ఒక్కొక్కటీ కూర్చి నా బ్లాగ్లో పెడతాను కదా అందుకే నా బ్లాగ్ కి సన్నజాజులని పెడదాం అనుకోగానే అదిగో మళ్ళీ పువ్వులూ ,కాయలూ అంటున్నావ్ అని మళ్లీ నిద్రలేస్తున్న స్త్రీవాదిని కాస్తా ..అయితే ఏంటి? నాది ఆడబుద్దే ..ఆడవాళ్ళకు ఆడబుద్ది కాక మగ బుద్ది వస్తుందా ఇంకనోరు మూసుకుని పడుకో అని కసిరి నిద్ర పుచ్చీ మహా ఉత్సాహంగా సన్నజాజులు అని పెట్టాబోయి అనుమానం తో ఎందుకయినా మంచిదని గూగుల్ లో సన్నజాజులు అని కొట్టాను ఆ పేరు మీద బోలెడు బ్లాగ్స్ ఉండేసరికి నీరసం వచ్చేసింది . పోనీ విరజాజులు ??అనుకుని అదీ ట్రై చేసా ఉహూ ఆ పేరుతో కూడా ఉన్నాయి ..మల్లె జాజి??? బాలే ..ఇంకేం పెట్టను నా మొహం అనుకుంటుంటే ఇంక చాల్లే, నువ్వు బ్లాగ్ మొదలుపెట్టినట్లే గాని సింకులో గిన్నెలు తోమేసి ఆ నాలుగు జతలు ఐరన్ చేయి అని కర్తవ్యం బోధించింది నా మనసు.


ఇంక అక్కడనుండి లేవబోతుంటే అప్పుడు గుర్తొచ్చింది అన్ని జాజుల పరిమళాలు కలిపి జాజిపూలని పెడితే ??? (ఏంటలా చూస్తారు 'చప్పట్లూ' ) అంతే ఆ తరువాత చక ,చకా నా బ్లాగ్ తయారయిపోయింది.నేను బ్లాగ్ మొదలు పెట్టేటప్పటికి అప్పట్లో చాలా వరకూ బొమ్మలు పెట్టేవారు కాదు నాకేమో ఎంచక్కా బొమ్మలు పెట్టి రాయాలని కోరిక ,ఎవరన్నా నవ్వుతారేమో అని భయం...చివరకు బొమ్మ పెట్టే రాసి, కూడలికిఎంతో మొహమాట పడుతూ జత చేయమని మెయిల్ పంపి రెండురోజులు ఎదురు చూసా ....అచ్చం చిన్న పిల్లల మాదిరే ....కూడలిలో నా బ్లాగ్ జత చేస్తారా? చేసినా నా పొస్ట్ అందరికీ కనబడుతుందా?ఇంత పెద్ద పెద్ద బ్లాగ్స్ మద్య నా పోస్ట్ అసలెవరన్నా చదువుతారా?ఒక్కరన్నా హాయ్ అని పలకరిస్తారా? ఇప్పటికీ నవ్వొస్తుంది తలుచుకుంటే ...


మొత్తానికి నా పోస్ట్ కూడలి లో కనబడింది ..భలే సరదా అనిపించింది ....కానీ ఆ రోజు పొస్ట్ లు ఎక్కువ రాయడం వల్ల 2 గంటల్లోనే ఆ పోస్ట్ అడుక్కి వెళ్ళిపోయింది ...ప్లిచ్ ...ఒక్కళ్ళు కూడా హాయ్ అనలేదు :)అప్పుడు డవుటొచ్చింది నా వ్యాఖ్యలు బాక్స్ పని చేస్తుందా లేదా అని అప్పుడునాకు నేనే welcome అని అఙ్ఞాత క్రింద స్వాగతం చెప్పేసుకున్నా :)ఆ తరువాత అరుణాంక్ గారు ప్రపుల్లచంద్ర గారు ఇలా అందరూ కామెంటారు భలే ఆనందంవేసింది...

అయితే నేను ఇన్ని రోజులు బ్లాగ్ రాస్తాని అనుకోలేదు ,అందులోనూ కేవలం ఙ్ఞాపకాలు మాత్రమే రాస్తానని అస్సలు అనుకోలేదు .ఏదో ఓ 3 నెలలు రాసేసి వదిలేద్దాం అనుకున్నా.మా ఫ్రెండింటికి వెళ్ళా,ముగ్గులేసా,సినిమాకి వెళ్ళా అని రాస్తే ఎవరు చదువుతారులే అనుకున్నా :)నేనెప్పుడూ ఊహించలేదు నన్ను ఇంత మంది ప్రోత్సహిస్తారని ...నిజంగా నాకు రాజకీయ,సామాజిక,సాహిత్యాల గురించి రాయడం కానీ ,కనీసం వాటి గురించి చర్చించడం కాని చేత కాదు...కాని అలాంటి చక్కని బ్లాగులకు సమానం గా నన్ను ఆదరించారు ...పైగా నన్ను మీ ఇంటి లో అమ్మాయిలా ఎంతో ఆదరణగా చూసారు అది చాలా సంతోషంగా ఉంది ....ఇక మీదట రాయను అని చెప్పను కాని కాస్తా గేప్ తీసుకోవచ్చేమో...ఇంత చక్కని ఆనందాన్ని నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాధాలు...

111 కామెంట్‌లు:

Pavan చెప్పారు...

మళ్ళి నాదే మొదటి కామెంట్.
ఇప్పుడు చదివి మల్లి కామెంట్ ఇస్ఠాను

సిరిసిరిమువ్వ చెప్పారు...

ఓ ఇంత కథ ఉందా మీ బ్లాగు పుట్టుక వెనకాల!
చక్కటి హాస్య టపాలతో అందరిని నవ్విస్తూ అల్లరల్లరి చేస్తున్న మీ బ్లాగుకి మొదటి జన్మదిన శుభాకాంక్షలు.

ఇక మీదట రాయను అని చెప్పను కాని కాస్తా గేప్ తీసుకోవచ్చేమో....????

మాలా కుమార్ చెప్పారు...

మీ బ్లాగోదయం బాగుందండి . కాని ఇక పై రాయలేనేమో అనటము బాగాలేదు .
హాపీ బ్లాగ్ ఆనివర్సరీ .

పవన్ చెప్పారు...

ముందుగా బ్లాగుకి పుట్టిన రొజు శుభాకాంక్షలు. :)

"ఇక మీదట రాయను అని చెప్పను కాని కాస్తా గేప్ తీసుకోవచ్చేమో".

యందుకని తగ్గించాలని అనుకుంటున్నారు.

manohar చెప్పారు...

meeru ela start chesaaro raasaru...mari nenu ee blog ki ela vachano cheppaliga... oka roju tired ayyi google kelli "good telugu blogs" ani kotta... chaala vachayi edhi nachaledhu...chivarlo ee blog dorikindhi... oke roju anni post lu chadivesa... endhuko teliyadhu akka ani pilavalanipinchindhi... pilichesa... ipudu follow avutoo unta.... meeru raayadam tagistanu antunaru... idhi konchem kastamey .....

durgeswara చెప్పారు...

ఏమైనా ,మీరు సరస్వతీ దేవి అనుగ్రహం మెండుగావున్నవారమ్మా . కాబట్టే ఇంత చక్కగా జనం చేత చదివించగలుగుతున్నారు .శుభాకాంక్షలు

నేస్తం చెప్పారు...

పవన్ నాకో విషయం గుర్తొస్తుంది మీ కామెంట్ చూస్తే ..అసలు ఈ పోస్ట్ లో చాలా రాద్దాం అనుకున్నా కాని ఏమిటో రాయలేదు .. ఇంతకూ ఆవిషయం ఏంటంటే తోటరాముడనే బ్లాగ్ ని మొదటి సారి చదివినపుడు ఎవరో నాదే మొదటి వాక్య నాదే అని రాస్తే ..నేనూ బ్లాగ్ మొదలుపెట్టి నాకు ఇలా ఎవరన్నా రాస్తే భలే ఉంటుంది కదా అనుకునేదాన్ని ..హ హ కానీ ఉహించలా నాకు కూడా మంచి పేరు వస్తుంది అని .. మొదటిసారి లక్ష్మి గారనుకుంటా అలా రాసింది తరువాత చాలామంది రాసినా మొన్న ఎవరో మీ ఫ్రెండ్ ఏమో(?) మా పవనే మొదటి కామెంట్ రాసాడూ కానీ తారుమారు అయ్యాయి వ్యాక్యలు గమనించండి అని సీరియస్ గా కామెంటినపుడు ఎంత సేపు నవ్వానో .. పై సంఘటన చెప్పి మా వారికి భలే సరదా పడిపోయా :) థేంక్స్ నిజంగా అందరికీ :)

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

:-):-) అనానిమస్ లాగ కామెంట్ మీరే పెట్టేసుకున్నారా...హాహ్హ్హ.హ్హ్హ..హ్హ్హ

మీరేది రాసినా కామెడీ టచ్ భలే ఇస్తారు...ఇంత స్టోరీ ఉందన్నమాట...నేస్తం మీరు చాలా విషయాలు దాచేసారు...మరి మీ బ్లాగు ఆదరణ మీ వారుకు చూపించి కాలరెగరేయటం గట్రాలాంటి విషయాలు చెప్పకుండా దాటవేశారు...అవునా?
ఏంటీ..గేప్ తీసుకుంటారా? మేం ఒప్పుకోం గాక ఒప్పుకోం...మీ బ్లాగు ముందు దర్నా చేస్తాం...
మొదట్లో మీ బ్లాగుకొచ్చే స్పందన చూసి నాకు చాలా కుళ్ళుగా ఉండేది. ఎవర్రా బాబు ఈవిడ..ఒక్కొక్క టపాతో ఇంతమందిని తన బ్లాగువైపు తిప్పుకుంటున్నారు అని అనిపించేది.

నేస్తం చెప్పారు...

సిరి సిరి మువ్వగారు ,మాల గారు థేంక్స్ అండి అంటే ఒక్కోసారి అలా అనిపించేస్తుంది అన్నమాట ,కాకపోతే ఎప్పుడన్నా మంచి విషయం గుర్తు వస్తే నేను అసలాగలేను రాసేస్తా :)
మనోహర్ నాకు భలే ఇంట్రెస్ట్ తెలుసా నా బ్లాగ్ మొదటిసారి ఎలా చదివారో తెలుసుకోవాలని ...థేంక్స్ నీ విషాలు చెప్పినందుకు :)
దుర్ఘేశ్వర్ గారు చాలా థేంక్స్ అండి మీ అభిమానానికి

శ్రీనివాస్ చెప్పారు...

ప్రమాదవనం తరపున మీ ఇంటర్వ్యూ తీసుకోవనుకుంటూన్నాం ... మీకు అంగీకారమైతే మీ ఈమైలు నా జీమైలు కు పంపండి

నాగప్రసాద్ చెప్పారు...

బాగా కష్టపడ్డారన్నమాట. మొత్తానికి కష్టానికి తగ్గ ఫలితం లభించిందన్నమాట. (ఫలితం = బ్లాగానందం :) )

మీరు నాలుగునెలలు ఆలస్యంగా బ్లాగు ఓపెన్ చెయ్యడమే మంచిది అయ్యిందిలెండి. అంతకుముందు, బ్లాగ్లోకం అంతా రాజకీయ టపాలతో, వాదోపవాదాలతో, సందడి సందడిగా, వేడి వేడిగా ఉండేది. డిసెంబరు సమయానికి, డిసెంబరు చలిలా బ్లాగ్లోకం కూడా చల్లగా, చప్పగా అయిపోయింది. :) :)

ఇందాకనే, మీ పాత పోస్టు చదివాను. నన్ను రౌడీగారి బ్యాచులోకి తోసేసి,అల్లరి పిల్లాణ్ణి చేసేశారుగా. :( :(

చివరగా, మీ బ్లాగుకి మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలు.

జ్యోతి చెప్పారు...

బ్లాగ్ వార్షికోత్సవ శుభాకాంక్షలు..
రాయను అనకుండా కాస్త విరామం తీసుకోండి.కాని ఎక్కువ రోజులు మీరు మాకు దూరంగా ఉండలేరు. ఇది మాత్రం నిజం.

లక్ష్మి చెప్పారు...

Congratulations and keep blogging!!! You rock!!!

Sorry ila hadavidiga comment pedutunna, malla detailed ga pedata

నేస్తం చెప్పారు...

శేఖర్ నిజం చెప్పాలంటే మా ఆయన అస్సలు పట్టించుకునేవారు కాదు నేను బలవంతంగా సిస్టెం ఎదురుగా చదివించేసేదాన్ని కుతూహలం ఆపుకోలేక .... కానీ ఈ మద్య పర్లేదు బాగానే రాస్తున్నవ్ అని కొంతమంది ఫ్రెండ్స్కి నా బ్లాగ్ గురించి చెప్పారంట..నాకిప్పటికీ డవుటే ఈయన నిజంగా మెచ్చుకుంటున్నారా లేక లేట్ గా వచ్చినందుకు కారణాలు అడక్కూండా ముందు జాగ్రత్త గా పొగిడేస్తున్నారా అని :)
ఏంటి శ్రీనివాస్ గారు స్త్రీవాదిని అని రాసాననా నా ఇంటెర్వ్యూ అడుగుతున్నారు హమ్మా నేను చెప్పను బాబు ..మీ సంగతి తెలిసీ అంత దైర్యమే :)
నాగ ప్రసాద్ అవునా కానీ నేనొచ్చిన తర్వాత కూడా కొన్ని గొడవలు జరుగుతుండేవి ,అయితే మరి మీరు రౌడీగారి బేచ్ కాదా ..ఎలాగూ ఈమద్య ఏడిపించడానికి అక్కడ ఎవరూ దొరకట్లేదంట మీరు ఇలా అన్నారని తెలిస్తే ....:)

నేస్తం చెప్పారు...

లక్ష్మి గారు మరి తొందరగా చదివేసేయండి :) జ్యోతిగారు అందుకేగా ముందు జాగ్రత్తగా గేప్ తీసుకుంటానేమో అని రాసింది ..థేంక్స్ :)

నిషిగంధ చెప్పారు...

జాజిపూలకి పుట్టినరోజు శుభాకాంక్షలు :-)
రాజకీయాలు, సామాజిక సాహిత్య చర్చలతో నిండిన బ్లాగుల మధ్య మీ బ్లాగు వేసవి సాయంకాలాల లో సేదతీర్చే జాజుల మరిమళంలా ఉంటుంది.. అందుకే ఎప్పుడెప్పుడు కొత్త టపా వస్తుందా అని చూస్తాను నేను :-)
ఈ గేప్ విషయమేదో అస్సలు నచ్చటంలేదు మరి!

తృష్ణ చెప్పారు...

congrats..keep blogging...(and we can't stop doing it...its my experience :) )

శ్రీనివాస్ చెప్పారు...

చెప్పరు కదూ ఉండండి చెప్తా మీ పని

సుజాత వేల్పూరి చెప్పారు...

బావుందమ్మాయి! చప్పట్లు గాఠ్ఠిగా!

kiranmayi చెప్పారు...

రాజకీయాలు, సామాజిక స్పృహ టైపు లో వ్రాసేవాళ్ళు చాలామంది ఉన్నారు కాని, మీరు ఇలానే కంటిన్యూ అయిపోండి. ఇప్పుడే గ్యాప్ తీసుకోనఖరలేదు. సరేనా?
Happy anniversary

psm.lakshmi చెప్పారు...

మీ జాజిపూలు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా సంతోషంగా, అనేక రసవత్తరమైన పోస్టులతో ఇంకా ఎన్నెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ
psmlakshmi
4psmlakshmi.blogspot.com

Apparao చెప్పారు...

పుట్టిన రొజు శుభాకాంక్షలు మీ బ్లాగ్ కి

నేస్తం చెప్పారు...

నిషి మొదట్లో మీ నుండి ఒక్క వాఖ్య వస్తే బాగుండును అనుకునేదాన్ని సరిగ్గా గుర్తులేదు పిరికిప్రేమలూ జిందాబాద్ పోస్ట్ లో అనుకుంటా మీ మొదటివ్యాఖ్య చదివాను ..ఈ రొజు మీరు అన్న మాటలు నాకు చాలా హాయినిచ్చాయి :)
తృష్ణ మిమ్మల్ని గుర్తుపెట్టుకునే గేప్ ఇస్తానేమో అని డవుటెట్టాను :)
బాబు శ్రీనివాస్ ఏంటీ ఈ అన్యాయం ,అక్రమం..నేనొప్పుకోను :)
సుజాత గారు థేంక్స్
కిర్ణ్ మయి అంతే అంటావా :)
లక్ష్మి గారు థేంక్స్ అండి

Apparao చెప్పారు...

జాజి పూలకు పుట్టిన రొజు శుభాకాంక్షలు

అశోక్ చౌదరి చెప్పారు...

చప్పట్లు..

మీ టపాలలో ఎప్పుడు ఏదో ఒక ట్విస్ట్ లేకుండా ఉండదనుకుంటాను.. నాకు ఎప్పుడన్నా బోర్ కొడితే మీ బ్లాగ్ ఓపెన్ చేసి ఓల్డ్ టపాలు చదువుతూ వుంటాను.. మీరు ఇలా రాయను అనటం ఏమీ బాగోలేదు అంది..

నేస్తం చెప్పారు...

అప్పారావు గారు థేంక్స్ అండి.
అశోక్ గారు నేను చాలాసార్లు అడ్గాలనుకుంటాను మిమంలని .. మీ నేం క్లిక్ చేస్తే శృతిగారి బ్లాగ్కి వెళతానేంటి ???

నేస్తం చెప్పారు...

అశోక్ సారీ అవి అనుసరించే బ్లాగా :D..ఇదే కాకరకాయ కీకరకాయ అవ్వడం అంటే :)

అశోక్ చౌదరి చెప్పారు...

:-)

మధురవాణి చెప్పారు...

జాజిపూలూ జిందాబాద్...జాజిపూలూ జిందాబాద్...!!
మేము జాజిపూలు అభిమాన సంఘం తరపు నుంచి వస్తున్నాం నేస్తం గారూ...అందుకే ఈ నినాదాలన్న మాట ;)
మీ..మా..మన..జాజిపూలకి పుట్టినరోజు శుభాకాంక్షలు.! ఇదే సమయంలో అభిమానుల డిమాండ్ (అభ్యర్ధన కాదండోయ్...డిమాండ్..మరి అభిమానులా..మజాకానా.!?) ఏంటంటే...
మీరు తప్పనిసరిగా అప్పుడప్పుడూ ఒక జాజిపువ్వైనా మా మీద విసురుతుండాలే తప్ప.. ఇంక రాయను..మానేస్తాను వంటి మాటలు అస్సలంటే అస్సలు అనకూడదని తెలియజేస్కుంటున్నాం అధ్యక్షా..
కావాలంటే..చిన్న చిన్న కాఫీ బ్రేకుల్లాంటివి తీస్కోని...మళ్లీ యధావిధిగా మమ్మల్ని నవ్వించి మురిపించే బృహత్కార్యాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నామహో..!

అజ్ఞాత చెప్పారు...

Puttina roju subhakankshalu nestham eenadu paper lo peru raaledana gap teesukuntunnaru mee abhimananiki thanks andee ani anoddu kaneesam mee peru comments lo ayina kanipisthe we are happy have a nice time bujjakka

పరుచూరి వంశీ కృష్ణ . చెప్పారు...

గోడ మీద బల్లి,మంచం మీద నల్లి ,వాకిట్లో పిల్లి అని భయంకరమైన కవితలు ( ?) :-)

మీ బ్లాగుకి మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలు.

మీర లా రాస్తూనే ఉండండి

sunita చెప్పారు...

బ్రౌజర్ ఫైల్యూర్ వలన వెంటనే టపా చదవలేకపోయాను. మీ జాజిపూలు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా పది కాలాల పాటు ఇలాంటి చక్కటి సరదా టపాలు మీ బ్లాగు నుండి రావాలని ఆశ.

SRRao చెప్పారు...

జాజిపూలకు హాస్యపు పరిమళాన్ని అద్దిన మీ రచనా ప్రవాహం నిరంతరం సాగాలి. శుభాకాంక్షలతో......

గీతాచార్య చెప్పారు...

Oh congrats. Happy Blirthday to you friend :-)

గీతాచార్య చెప్పారు...

మీరా ధన్యవాదాలన్నప్పుడే ఇలాంటి ట్విస్టేదో ఇస్తారనుకున్నాను. నిజమేనన్నమాట. ఒక నెల రోజులు రీఫ్రెషయి మళ్ళా సరదా కబుర్లతో రండి.

శ్రీలలిత చెప్పారు...

జాజులోయ్ జాజులు
సన్నజాజులు విరజాజులు
అందమైన అమ్మాయికి
నాజూకు జాజులు.

వినేవారు వినండోయ్
జాజిపూల కబుర్లు
చూడండోయ్ నీవీ
నావీ అందరిపేర్లూ

ఇంతకన్న ఆనందం
ఎవ్వరివ్వగలరు
అందరం ఒకటననుకునే
మన నేస్తం తప్ప.

పుట్టినరోజిది జై జై
ఏమిద్దాం బహుమతిగా
అందరి మనసూ నిండుగ
ఆనందం కాదా..

గుప్పెడు జాజులు జల్లీ
మల్లెల మాలలు కట్టీ
మరువం దవనం మరి
మధ్యన మురిపాల పెట్టీ

అందిద్దాం అందమైన
పుష్పగుఛ్ఛాన్ని
అంతకన్న ఆనందం
ఇంకేమిటి మనకు...

Anil Dasari చెప్పారు...

>> "డింగుమని నా అంతరాత్మ వచ్చి మా మిక్సీ పక్కనే కూర్చుని"

:-)

అభినందనలు + శుభాకాంక్షలు.

జయ చెప్పారు...

నేస్తం గారు, నా శుభాకాంక్షలు కూడా అందుకోండి. నేను పూర్తిగా విరుద్ధం. ఏమాత్రం, ఒక్క బ్లాగ్ కూడా చదవకుండా, మా అక్క బలవంతం మీద,ఎటువంటి ప్రయత్నాలు లేకుండానే, మొదలుపెట్టాను. కాని ఇప్పుడెందుకో ప్రేమ విపరీతంగా పెరిగిపోతోంది. చూడకుండా ఒక్క రోజు కూడా ఉండలేను. మరి మీరు మానేస్తే ఎలా! ఒద్దండి..ప్లీజ్...రాయండీ...

బృహఃస్పతి చెప్పారు...

మీ బ్లాగు వార్షికోత్సవ శుభ సందర్భంలో మీరొక కామెడీ స్కూల్ పెట్టి, నాలాంటి వాళ్ళకి కామెడీ ఎలా రాయోలో నేర్పించొచ్చుగా.... :)

Padmarpita చెప్పారు...

ఇంకా ఎన్నెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని
ఆకాంక్షిస్తూ....
మీ బ్లాగుకి మొదటి జన్మదిన శుభాకాంక్షలు....

సంతోష్ చెప్పారు...

బ్లాగ్ వార్షికోత్సవ శుభాకాంక్షలు..
naaku telisi nenu mi blog chudatam ide modatisaarandi.

సంతోష్ చెప్పారు...

మీరు రాసే విధానం నాకు చాలా నచ్చింది.
నేను కూడా కూడలి కి రిక్వెస్ట్ పంపినపుడు ఇలాగే అనుకున్నానండి..
నేనింకా శైశవ దశ లోనే వున్నా ...
ఇప్పుడు నాకు బ్లాగ్ లు చూడటం ,రాయటం నా అయిపొయింది .

అనుకుంటాం గాని ఈ బ్లాగ్లోకాన్ని విడిచిపెట్టటం చాలా కష్టం అండి.

రాధిక చెప్పారు...

పిల్లలూ అందరూ అక్కయ్యకి జేజేలు చెప్పండర్రా.ఏమిటీ... నేనే లేటంటారా?సరే.

అద్దిరిపోయింది నేస్తం.`

అజ్ఞాత చెప్పారు...

g missing in blogspot.com plz sari cheyyandi thota ramudu leni lotu mee dwara teerindi anukunte meeru rayadam aapestunnaru :( all the best nestam

అజ్ఞాత చెప్పారు...

Sehwag 400 score chesthe new post rasthara :)

విశ్వ ప్రేమికుడు చెప్పారు...

ఆలస్యంగా చెబుతున్నా.., అయినా మనస్ఫూర్తిగా చెబుతున్నా... మీ బ్లాగుకు వార్షికోత్సవ శుభాకాంక్షలు. సంవత్సరంలోనే ఎంతో మంది స్నేహితులను సంపాదించుకున్నారు. అభినందనలు. :)

నేస్తం చెప్పారు...

బాబోయ్ అఙ్ఞాత గారు మీరా విషయం ఇంకా మర్చిపోలేదా :) భలేవారే తప్పక కామెంట్స్ రాస్తుంటా
హ హ మధురా అసలు నా పోస్ట్స్లో నీ కామెంట్స్ ని చూసి తెగ పొంగిపోయిన సంధర్బాలు బోలెడు,వాటి కోసమన్నా రాయాలి మానేయను :)
పరుచూరిగారు థేంక్స్ అండి
సునీత ,ra0 గారు థేంక్స్ :)

నేస్తం చెప్పారు...

గీతాచార్య మరి ఊరికే ప్రొపెసర్ అయిపోయారేటి మీరు ...ఏంటో అన్నీ నాలాంటి తెలివితేటలే మీకు :)
శ్రీ లలిత గారు భలే భలే చాలా బాగారాసారు బోలెడు థేంక్స్ లు మీకు :)
అబ్రకదబ్ర గారు ఆ లైన్ రాస్తున్నపుడు ఎందుకో మిరు ఇదే వాక్యం పొయింట్ చేస్తారనిపించింది....ఇంతకు ముందు ఇలాంటివి యాదృచ్చికంగా జరిగితే నవ్వుకునేదాన్ని కాని మీ గడియారం చదివిన దగ్గరనుండి ఒక్కటే భయం వేస్తుంది ఆ మధ్య నా కలలు రెండు నిజమయ్యాయి మరి :(

నేస్తం చెప్పారు...

బృహఃస్పతి గారు నా దగ్గర కామెడీ రాయడం నేర్చుకునే లోపు మీరు నవ్వడం మర్చిపోతారు :)
జయ గారు నేను మొదట్లో మీ పోస్ట్లు చూసి ఎవరబ్బా ఈవిడ ఎప్పుడూ మా అక్కా మా అక్కా అంటారు ,ఎవరా అక్కా అనుకునేదాన్ని :) ఒక రోజు పరిశోదించి తెలుసుకున్నా మాలాగారు అని :)
సంతోష్ మొదటిసారి అలాగే ఉంటుంది అనుకుంటా అందరికీ :)మీ బ్లాగ్ ఇప్పుడే చూస్తున్నా చక్కని పాట వినడానికి చాలా బాగుంది..అది వింటూనే సమాధానాలు వ్రాస్తున్నా ..

అజ్ఞాత చెప్పారు...

జాజిపూలకి జేజేలు.
మీ బ్లాగు కొచ్చే కామెంట్స్ చూస్తే నాకెంత కుళ్ళోనమ్మాయ్....సర్ఫ్ ఏడ్ లో, తెల్ల చొక్కా అబ్బాయిని చూసే కుళ్ళు చొక్కా అబ్బయిలా ......! జాజుల పరిమళాన్ని గుప్పెట్లో దాయగలమా ! మీ జ్ఞాపకాల పరిమళాలు కూడా అలానే ఘుబాళిస్తూ వుండాలని దీవిస్తూ ......ఒక అప్పడాల కర్ర బహుమతిగా పంపేదా!

నేస్తం చెప్పారు...

రాధిక నాకు కవితలంటే ఆశక్తి మీవల్లా ,బాబా గారివల్లే మొదలయ్యింది..ఒక రోజు అనుకోకుండా బాబా గారు ఎవరో పోస్ట్ లో మీ 'ప్రయాణం 'కవిత మీద జరిగిన చర్చ చదవమని లింక్ ఇచ్చారు ... అప్పటివరకూ కవితలంటే ఏముందిలే అనుకునేదాన్ని ఆ చర్చ చదివాకా అప్పుడే తెలిసింది కవితలంటే ఏంటో ..అప్పటి నుండి మీ విసనకర్ర ని అయిపోయా ..
అఙ్ఞాత గారు అవునా మా కీ బోర్డ్ తో భలే చిరాకొచ్చేస్తుంది .. యే కీ సరిగా పని చేయడంలేదు అందుకే అన్ని తప్పులు వస్తున్నాయి..ఇంకా నా బద్దకం కూడా అనుకోండి..తప్పక సరి చేస్తా థేంక్స్ :)

నేస్తం చెప్పారు...

హ హ అఙ్ఞాతగారు మనోళ్ళు ఆడుతున్నారా ... మా ఆయన క్రికెట్ పెట్టగానే నేను ప్రక్క రూం లో ఏదన్నా మేగజైన్ పట్టుకుంటా .... అబ్బా 400 చేసాడా అయితే ... :)
ప్రేమికుడుగారు థేంక్స్ అండి :)
లలిత గారు అచ్చం నేను మీ బ్లాగ్ ను చూసి కుళ్ళు పడేలాగా కదా... అబ్బా మీ పోస్ట్లు అంటే ఎంత ఇష్టమో . ఆయనను ఎన్నిసార్లు బ్రతిమాలుతానో మీ సుందరీ సుబ్బారవుల కధలు చదవమని...అస్సలు నా మాట వినరు :(లాభం లేదు మీరు అప్పడాల కర్ర పంపాల్సిందేనండి ,,

padmarpita థేంక్స్:)

శివరంజని చెప్పారు...

Congratulations అక్క . మీ బ్లాగుకి మొదటి జన్మదిన శుభాకాంక్షలు...ఇంకా ఎన్నెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ....

పరుచూరి వంశీ కృష్ణ . చెప్పారు...

లేదండి థేంక్స్ కాదు మాకు కావాల్సింది ఒక్కసారి క్రికెట్ ని పొగుడుతూ ఒక పోస్ట్ రాసెయ్యండి
అప్పుడు మేమే చెప్తాం 1000 థేంక్స్ లు

జాహ్నవి చెప్పారు...

జాజులకి జన్మదిన శుభాకాంక్షలు.

అజ్ఞాత చెప్పారు...

Jai jaajipoolu jai jai jaajipoolu
nestham jindabad blog rayadam konasaginchali

అజ్ఞాత చెప్పారు...

ur post is so pleasent just like Wake up sid lo iktaraa song chaala bavundi

Kiran చెప్పారు...

Forgot to wrote my name

PBVSN Raju చెప్పారు...

మీ బ్లాగ్ రాయడానికి మీరు పడ్డ తిప్పలు చూస్తే మొదటి సారి బ్లాగ్ రాసిన ప్రతి ఒక్కరి తపన అందులో కనిపిస్తోంది.నేను కూడలికి వెల్లి బ్లాగ్స్ చూడను. నెను మొదటి సారిగా ఇష్టపడి చదివిన బ్లాగ్ వేణు శ్రీకాంత్ గారిదయితే, ఆయన అభిమానించే బ్లాగ్స్ నుండి మీ బ్లాగ్లోకం సందర్సించే అవకాశం, అద్రుష్టం కలిగింది. మీ నుండి మరిన్ని టపాలు రావాలని మేము కొరుకుంటుంటే మీరెమో..... ఉత్సాహంతో మరిన్ని రచనల్ని అవేనండి అహ్లాదకరమైన జ్ఞాపకాల జాజులు మాతో పంచుకొంటారుగా....

వేణూశ్రీకాంత్ చెప్పారు...

మీ బ్లాగుకు జన్మదిన శుభాకాంక్షలు నేస్తం. గ్యాప్ విషయం లో నాది అందరి మాటే... ఇప్పుడు మీరు ఇస్తున్న గ్యాప్ నే తగ్గించాలి అని కోరుకుంటుంటే మేమంతా, మీరు ఇంకా గ్యాప్ అంటే కుదరదు.

నేస్తం చెప్పారు...

శివరంజని ,జాహ్నవి థేంక్స్
అఙ్ఞాతలూ మిఈరు పేరు రాయకపొతే ఎలా అండి ..కానీ చాల థేంక్స్ :)
పరుచూరిగారు హ హ..బలే తిరకాసు పెట్టారు కదా :) కిం కర్తవ్యం
కిరణ్ అర్ధం కాలా :(
రాజు గారు అలా తెలుసుకున్నారా నా బ్లాగ్ గురించి, అయితే మీతో పాటుగా వేణుగారికి కూడా ధన్యవాధాలు చెప్పాలి నేను:)
వేణూ :D

మంచు చెప్పారు...

మీకు , మీ వాషింగ్ మెషిన్ కి ఆనుకుని చూస్తున్న మీ అంతరాత్మకి మీ బ్లాగు జన్మదిన శుభాకాంక్షలు.. అలాగే మీరు సిగరెట్ నిజంగా కాల్చేరా సరదాగా అన్నారా అని అలొచిస్తూ ఈమద్య ఒకటే కలవట్లు పలుకుతూ , క్రికెట్లొ ఈజీ కాచ్ లు కూడా వదిలేసున్న మీ హస్బండ్ కి ధన్యావాదాలు చెప్పండి :-) ( మీరు బ్లాగు రాస్తూ కూర్చున్నప్పుడు మీకు వంటచేసి పెడితూ ఒపిగ్గా మీకు ప్రొత్సాహం అందిస్తున్నందుకు ) ..

సంతోష్ చెప్పారు...

కృతజ్ఞతలు..
ఆ పాటంటే నేను చెవి కోసుకుంటానండి.

అజ్ఞాత చెప్పారు...

happy birthday nestham....mee blog ki :)....blog spot ki thsnks..final ga work ainanduku...leka pothe memu manchi manchi post lu miss ayye vaallamu.. :)

swapna@kalalaprapancham చెప్పారు...

naku kullu pudutundi akka, enthina akka kada oorukuntunna hehe :)
anyways "HAPPY BIRTHDAY MY DEAR JAAJIPOOLU BLOG".
na blog birthday epudu
vastundo....

cartheek చెప్పారు...

నాగమణి అక్క (ఉహూ మీ పేరు "నవ్వులగని " :) :) )...
మీ బ్లాగు పుట్టిన రోజు శుబాకాంక్షలు... మీకు తెలుసో లేదో నే చదివిన రెండో తెలుగు బ్లాగు మీదే..మొదటిది రాధిక అక్క గారి స్నేహమా ...
కొంచం రెస్ట్ తీసుకోండి. తర్వాత మళ్లీ నవ్వుల పువ్వులు బ్లాగులో విరబూయిన్చేయండి...
అంతేకాని ఇంకా రాయను అంటే మాతం కుదరదు అక్కోయ్ :) :)

Ruth చెప్పారు...

అయ్ బాబోయ్ చాలా లేట్ అయ్యి పోయాను!! హ్మ్మ్..... నేను కూడా మీ కామెడీ ఇస్కూల్ లో జాయిన్ అవ్వడానికి రెడీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మరి?

మీకు బ్లాగు పుట్టినరొజు శుభాభినందనలు!

Srujana Ramanujan చెప్పారు...

సన్నజాజి పూవులోయ్...

ఎంత మంచి పాట! విన్నారా నేస్తం. అలాంటి విరజాజుల పరిమళాల్ని అందించే మీరు ఇలా బ్రేక్ తీసుకుంటామంటం న్యాయమా? మీరుగానీ టీవీ నైన్ ఎక్కువ చూస్తున్నారా ఏమి?

త్వరగా వచ్చేయండి.

Srujana Ramanujan చెప్పారు...

ఇంకో విషయం. మీరు కొత్త టపా వేస్తేనే మీ బ్లాఉకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేది. I am kopaginchen.

నేస్తం చెప్పారు...

శివ ,శివా ...మంచుపల్లకి గారు ఎంత మాట అనేసారు.నేను బ్లాగ్ రాస్తుండగా మా ఆయన వంట చేయడమా,ఆ ముచ్చటే ఉంటే నా బ్లాగ్ లో ఈ పాటికి 500 పోస్ట్లు ఉండేవి ...:)
సంతోష్ :)
కిరణ్ :D
స్వప్నా నీ బ్లాగ్ బర్త్ డే జనవరి లో వస్తుంది :P
హ హ కార్తీక్ నా పేరు నాగమణి చేసేసావా ...సరే కానీయ్ పేరులో నేముంది :)
రుత్ ముందు నేను నేర్చుకున్నాకా అప్పుడూ స్టార్ట్ చేస్తా :)
సృజనా ఎందుకొచ్చిన కోపగిన్చెన్ ఎంచక్కా నవ్వేసేయి , వీలున్నపుడు వ్రాస్తాను ...మళ్ళీ మీరందరూ(మొహమాట పడి) పొగడక పోతే ఎలా :)

ప్రియ చెప్పారు...

Hmm. :-D

హరే కృష్ణ చెప్పారు...

mee Favourite Anil kumble retire ayyadu ani meeru kooda gap teesukuntunnara :(

IPL la ayina vachipothoo vundandi :)

any ways great post
nestam post miss avadama devuda entha pani chesav...

మరువం ఉష చెప్పారు...

అభినందనలు నేస్తం. సమయాభావం వలన ఆలస్యమైంది. కానీ మనసు లోని అభిమానం మాత్రం అదే. మీరింకా శతకోటి టపాలతో విరాజిల్లాలి. నేను కూడా డిశంబర్ మాసంలోనే కవితాస్రవంతి మొదలుపెట్టాను.

సవ్వడి చెప్పారు...

నేస్తం గారు మీ టపా అదుర్స్..

ఒకసారి జల్లెడని చూస్తుంటే " నా బ్లాగు పుట్టినరోజు " అని కనిపించింది. ఎప్పటి నుంచి రాసేస్తున్నారో అని మనసులో అనుకున్నాను. బాగుంటే చదువుదామని క్లిక్ చేసాను. చదివాక అయినంతవరకూ వదలలేదు. ఎంత నవ్వానో నాకే తెలీదు. తరువాత నవంబర్ లోని టపా చదివాను. అది కూడా మొత్తం చదివేసాను. ఆ తరువాత వాఖ్యలు చూసాక మీ ఫేన్లు ఎంతమంది ఉన్నారో అర్థమైంది. అప్పుడే నిర్ణయం తీసుకున్నా.. మొత్తం మీ బ్లాగులో ఉన్న టపాలు అన్నీ చదివేయాలని. ఇక చదవడం ప్రారంభించాక అన్నీ నచ్చేస్తున్నాయి. ఒక్కటి కూడా వదలబుద్ధి కాలేదు. పోనీ వెంటనే చదివేద్దామంటే అన్నీ పెద్ద టపాలే! గత వారం రోజుల నుంచీ ఖాలీ దొరికినప్పుడల్లా మీ బ్లాగే చూస్తున్నాను. ఇంకా మూడు నెలల టపాలు బాకి ఉన్నాయి. నిజం చెప్తున్నా ఒక్కటీ కూడా బోర్ కొట్టలేదు.

ఇప్పుడు నేను మీకొక పెద్ద ఎ.సి.ని.. ఎంత పెద్ద అంటారా చెప్తా చూడండి. చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా.... ఇలా ఇంకెన్ని పెట్టాలో నాకు కూడా అర్థం కాక నీరసం వచ్చి వదిలేసాను. త్వరలోనే మిగతావి చదివేస్తాను.

చిన్న విన్నపం ఏంటంటే.. ఒక్కసారి నాబ్లాగుని చూడండి.

ఉంటాను.. బాయ్!

నేస్తం చెప్పారు...

ప్రియ :D
హరే కృష్ణగారు మొత్తానికి మగపురుషులు చాలా మంది క్రికెట్ పేరు కలపకుండా కామెంట్ పెట్టడం లేదు.ఇదేం కుట్ర అని అడుగుతున్నాను అధ్యక్షా ..
ఉషా గారు అవునా.. అదే మరి డిసెంబర్ మాసం బ్లాగర్లకు అచ్చొచ్చిన నెల అనుకుంటా.. సెంటిమెంట్ పెట్టెసాను క్రొత్తగా వచ్చే బ్లాగర్లకు :)
సవ్వడిగారు అంత పెద్ద a.c అయిపోయారా... ఏంటబ్బా ఇంత చలేసేస్తుంది అనుకుంటున్నా..:) మీ వ్యాఖ్య లే కదా నాకు ప్రోత్సాహం ..థేంక్యూ థేంక్యూ :)

Sundeep Borra చెప్పారు...

బ్లాగ్లు రాయటం తగ్గిస్తారా?
ఎం అంతా మీ ఇష్టమేనా?
మొదట్లో మంచి టపాలు టపా టపా రాసేసి
మంచి కామెంట్లు కమ్మగా కొట్టేసి
ఇప్పుడు పొయ్యి మీద కూరుంది, పెనం మీద దోశ మాడిపోతోంది అంటే
బ్లాగ్ కోసం వ్యాఖ్యలు వరదలై పారతాయి.
అసలే రాజకీయాలు రౌడిజాలు బ్లోగ్లేలుతుంటే రెండు రెళ్ళ గౌతం కాశీ యాత్రకెళ్ళాడు, ఇక మీరు కూడా బ్లాగను అంటారా? ఏది చెయ్యి పట్టండి

"ఇంకెప్పుడూ బ్లాగను అని అనను" అని ౧౦౦ సార్లు ఇంపోజిషన్ రాయండి

గీతాచార్య చెప్పారు...

సందీప్ గారూ,

ఆయ్! మా బా సెప్పారండి. :-D

నేస్తం, కమాన్ కమాన్...!

అజ్ఞాత చెప్పారు...

आदाब नेसतम hi hi hi hindi lo first comment nade

నేస్తం చెప్పారు...

సందీప్ హ హ హ ...సరే అయితే
ఇంకెప్పుడూ బ్లాగను అని అనను *100 taimse =:P
గీతాచార్యగారు మరే, ఇంపోజిసన్ నన్ను కదండి రాయమన్నది,తవరికిబాగా సెప్పినట్లే అనిపిత్తాదండి.ఆయ్

నేస్తం చెప్పారు...

धन्यवाद जी .. అజ్ఞాత గారు నేను కుడా హిందీలో జవాబు చెప్పేసా నోచ్ :D

గీతాచార్య చెప్పారు...

ఐ బాబోయ్ అలా అనేసినారేటండీ. నన్నుగానీ రాసెట్టమంటారేటండీ? :-P

అజ్ఞాత చెప్పారు...

ये तो'डि है! इदर आईये tappa emi radu ani cheppi inni mataludutunnara

Rajendra Prasad(రాజు) చెప్పారు...

మరాఠి:తుంచ బ్లాగ్స్ లై బరో రాతాతు.మై regular నే ఫాలో హోతాము.తుమె లువాచా stop కరానక please
తెలుగు: మీ బ్లాగ్స్ చాల బాగుంటాయి.నేను regular గా ఫాలో అవుతాను.మీరు రాయటం ఆపకండి please..... :)

నేస్తం చెప్పారు...

ఆయ్ బాబో గీతాసార్యగారో తవరది మా సెడ్డ మంచి మనసండి.దర్మ పెభువులు తవరిలాంటి వాళ్ళ వల్లే పెపంచకం లో ధర్మమం ఈ మాత్రెమన్నా మిగిలిందండే బాబు.కరెస్ట్ గా రేపు నైటు నేను ఇండియా ఎలుతున్నా ఇంపోజిసన్ ఎట్టా రాయాలా భగమంతుడా అని బెంగెట్టేసుకున్నానండే ఆయ్. ఇంకెవళ్ళకి డౌటింగ్స్ రాకుండా బేగి రాసి పంపేయండి నాకు ...పోస్టేత్తా

నేస్తం చెప్పారు...

రాజేంద్ర ప్రసాద్ గారు క్రింద తెలుగులో రాసి బ్రతికించేసారు.లేకపోతె అర్జెంట్గా ఒక మరాటి ఫ్రెండ్ని వెతుక్కోవలసి వచ్చేంది... :)
అఙ్ఞాత గారు మాట్లాడాటం రాదు అన్నా కాని వ్రాయడం రాదు అనలేదు కదా... :P... అర్ధం చేసుకోరూ
అసలే ఈ మద్య లేడిస్ టైలర్ లో రాజేంద్ర ప్రసాద్ ని చూసి ...సుజాత మై తుమ్హారా చుట్టూ ఫిర్ జాతా లాంటి హింది బోలెడు నేర్చేసుకున్నా....అవన్నీ గుర్తు చేయకండి. హింది లో పోస్ట్ రాసేస్తాను తర్వాత మీ ఇష్టం. :)

Rajendra Prasad(రాజు) చెప్పారు...

చెప్పటం మరిచాను "పుట్టిన రోజు శుభాకాంక్షలు"...:)

Rajendra Prasad(రాజు) చెప్పారు...

ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకొవాలని మనసారా కొరుకుంటోంది మీ నీ కోసం...ఓహ్! అలవాటు లో పొరపాటు...మీ విసనకర్ర.....:)

sreenadu చెప్పారు...

evaru talli iragadeestunnav. cheyi tirigina maga rachayita raatallaagaa unnai. yerram shetti???

సవ్వడి చెప్పారు...

ayite ippatinunci nenu mee a.c.ni annamaata. jajjanaka...jajjanaka...

పరిమళం చెప్పారు...

జాజిపూలకు పుట్టినరోజు జేజేలు....దొంగలు పడ్డ ఆరునెల్లకి ......అనుకోరుకదా ...అనుకోకండి ప్లీజ్ కొద్దిరోజులుగా బ్లాగులకి దూరంగా ఉండటం వల్ల ఈ ఆలస్యం .అందుకోండి నేస్తం !శుభాకాంక్షలు !

Viswanath చెప్పారు...

Mundhuga Mee blog varshika subhakankshalu...Naaku Blogs nachinavi Moodu

thotaramudu garidhi ayana frequent raayatam ledhu,nishigandha gari usulaade oka jabilata novel adhi ayipoyindhi moododhi mee blog meeru kuda thaggisthaa anadam bhaavyam kaadhu

అజ్ఞాత చెప్పారు...

My hearty congratulations..

I am a big fan of your blog. Please don't stop writing. I read all the posts in your blog but didn't comment till now.

నరేష్ నందం (Naresh Nandam) చెప్పారు...

నేనేనేనేనొప్పుకోనంతే..
హన్నా.. మధ్యలో వదిలేద్దామనే?
ఇది బ్లాగ్లోకం.. రావటం, రాయటం వరకూ మీ ఇష్టం..
ఆతర్వాత అభిమానుల మాటలు వినాల్సిందే!!

ఈ నెల రోజులనుంచీ.. ఉన్న ఇంటిని పడేస్తామనీ, పాత ఇంటికే వెళ్లమంటూ.. ఇక్కడ ఒకటే గోల.. పాత ఇంటికి పోవచ్చు.. కాని, కష్టపడి కట్టుకున్న కొత్త ఇల్లయిపోయే.. !! దానితో వేడి పుట్టి బ్లాగులోకంలోకి రావటం లేదు. వచ్చినా ఎక్కువసేపు ఉండటం లేదు.

అబ్బ, మీడియాలో పని చేసేకంటే.. మీదగ్గర శిష్యరికం చేయటం బెటర్ నేస్తం.. కొంచెం స్క్రీన్‌ప్లే ఐనా నేర్చుకోవచ్చు.

నెలవుతోంది.. కొత్త పోస్ట్ మొదలుపెట్టూ...!!


మనలోమన మాట వంద కామెంట్లు దాటేశాయి కాని(ఇప్పటికి కనిపిస్తున్నవి 91), త్వరగా మోడరేట్ చెయి నేస్తం!

Gulabi చెప్పారు...

Nestam garu,
meku orkut unte e community lo join aipondi..sandadi cheddam :)

http://www.orkut.co.in/Main#Community?rl=cpn&cmm=47584910

విశ్వ ప్రేమికుడు చెప్పారు...

Happy new year 2010 :)

మాలా కుమార్ చెప్పారు...

నూతన సంవత్సర శుభాకాంక్షలు .

priya... చెప్పారు...

hi hi hi....nestam garu sorry andi chala rojula tarvata me blog chadiva...ela unnaru??? emanukokandi kasta busy ipoya...nijam cheppalante me blog chadute inka vadalanu chaduvutune unta. anduke sudden ga apesa kani malli enduko na manasu ela lagesi me blog chadivela chesindi...anyway manam edina pani chese tappudu elantivi mamule kada...nijaniki memalni encourage chesina valaku na tarapuna kuda thanq nadi oka vidanga melage..blogs chadivinappudanta blog nen kuda star cheyalani bt telusukadandi intlo teluste "chale ne chaduvu nuv chaduvuko..blogs tokka tolu avasarama..." antaru anduke prastutaniki nen kuda vayida vestu...vastunna..kani nijaniki na chinnapati vishalu marchipotanemo anna bhayam.mottaniki eppudu stat chestano teledu..anyways me blog chusi malli nak chala anadamesindi...medi blog chadivinantakalam nen a position lo njoy chesta ok na...inkovishayam andoi nen kuda me blog peru tappukotta tarvata malli correct type chesa...ok andi ela meto chala matladalani undi kani edi comment box mail box kadu...me id chepandi mek istamite ok na...nd last HAPPY NEW YEAR nestam garu meku me family valandariki ok na...untanandi..

నేస్తం చెప్పారు...

ముందుగా అందరికీ పే...ద్ద సోరీ ...రిప్లయ్ లేట్ గా ఇస్తున్నందుకు రాజేంద్ర ప్రసాద్ గారు థేంక్స్ అండి..
శ్రీనాద్ గారు :)
సవ్వడి గారు అలా అయితే ఆ జజ్జనకలేవో నేనే పాడుకోవాలి న్యాయం గా :)
పరిమళం గారు నేనూ సేం టూ సేం సామెత ...ఇన్నాళ్ళకు మీకు రిప్లయ్ ఇస్తున్నా :)
విశ్వనాద్ గారు థేంక్స్ అండి :)
అజ్ఞాత గారు హమ్మయ్యా మొత్తానికి కామెంటేసారు థేంక్యూ

నేస్తం చెప్పారు...

నరేష్ గారు ప్రచిరించేసాను ...:) ఇండియా రావడం మూలానా ఈ మద్య నెట్ జోలికి రాలేదు ..అదన్నమాట సంగతి.. :)నాదే 100 కామెంట్ :)
గులాభిగారు మరి నాకు orkut లేదుగా :)
ప్రేమికుడు గారు మాలా కుమార్ గారు థేంక్స్ అండీ...మీకు కూడా శుభాకాంక్షలు

నేస్తం చెప్పారు...

ప్రతిభ గారు మీ మెయిల్ అయిడి ఇవ్వడం వల్ల మీవ్యాఖ్య ప్రచురించలేదు ...నేను ఇండియాలో ఉన్నాను.మీ పేరు విన్నట్లు ఉంది :) బహుసా మనం ఇంతకు ముందు యే తెలుగు సమాజం వనబోజనాలలోనో,లేక పర్టీలలోనో తప్పక కలిసే ఉండొచునేమో :) ..
ప్రియ అయితే మీ బ్లాగ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం..happy new year

priya... చెప్పారు...

hey nijama...meru india ki vachara???ite welcom 2 india andi...hav a nice tym over here...njoy with ur family..nd na blog kosama...ayyo chepalem andi..nxt year nunde nen patients to busy ipota eka e blog rase avakasham nakostundani anukonu..anyways nen kuda a tym kosam eduruchusta ok na..untanu..

సవ్వడి చెప్పారు...

ఆంధ్రాలో ఉన్నారా! చాలా సంతోషం.

సంక్రాంతి అంటే ఇక్కడే.. అదంతే!

మీరు ఏమీ అనుకోకుండా నా "అమ్మబాబోయ్" చదవండి.

SRRao చెప్పారు...

ఈనాటి ఆనందమయ మకర సంక్రాంతి
అందించాలి అందరి జీవితాలకు నవ్య క్రాంతి
*** మీకు, మీ కుటుంబానికి, మీ మిత్రులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ***
SRRao
శిరాకదంబం
http://sirakadambam.blogspot.com/2010/01/blog-post_13.html

Surabhi చెప్పారు...

Nestam gaaru,
Hearty congratulations.
I love your posts soooooooooooo much.
Please keep writing.
given the present situation in the blogworld, your posts are very much needed for people.

anveshi చెప్పారు...

అమ్మాయీ !ఎట్లా వున్నావు?ఏం అయ్యావ్ ?ఎం కబుర్స్?? బ్లాగు update చేసే అలోచన వుందా లేదా? హన్నా....

ప్రణీత స్వాతి చెప్పారు...

నేస్తంగారూ..నవ్వీ నవ్వీ కన్నీళ్లు వచ్చేశాయండీ. అద్భుతం..చాలా చక్కగా రాసేస్తున్నారు.కాస్త ఆలస్యంగా జన్మదిన శుభాకాంక్షలు.
మరి మీ చెల్లి "స్నిగ్ధకౌముది" ని..చూడరా ఒక్కసారైనా..

Ashok Varma చెప్పారు...

మొన్న మొగలిరేకులు సీరియల్ చూస్తుంటే అనిపించింది మీ బ్లాగ్ పేరు ' జాజి రేకులు ' అయ్యుంటే ఇంకా బావుండేదని :)

అజ్ఞాత చెప్పారు...

నేస్తం,
మీ బ్లాగు ప్రస్థానం చూసి చాల ఆనందంగా ఉంది.మీరు రాసే విషయం ఏమిటన్నది కాదు, మీ శైలి సరదాగా, అమాయకంగా అలా కట్టి పడేస్తుంది, ఎంత పెద్ద పోస్ట్ అయినా అప్పుడే అయిపోయిందా అనిపించేలా చేస్తుంది? ఏమైనా మీ జాజిపూలు (బ్లాగు) రాజకీయాలకు, సీరియస్ విషయాలకి దూరంగా హాయి గొలుపుతుంది.మీరు, నేను ఒకే టైంకి బ్లాగులకి విరామం తీసుకున్నామేమో.లేకుంటే, మీ సుస్పెన్సె సీరియల్ ఒకే సారి చదివితే బీపీ పెరిగేది టెన్షన్ తట్టుకోలేక, ఒక రకంగా నా గ్యాప్ మంచిదే అయ్యింది గా. :-)
- పద్మ.

అజ్ఞాత చెప్పారు...

nija jevithaani entha daggiraga raasthunnaarandi..
addham lo nannu nenu choosukunnattundi..
ilaa kathalu cheppatam koodaa oka kale.. All the best andi

Sonia

Ravi చెప్పారు...

Mee blog ni 3 days nunchi chaduvutunna. but total ga super ga rastunnaru. Keep going.

Jayati చెప్పారు...

ఈ రోజెందుకో కొత్తగా తెలుగు బ్లాగ్స్ కోసం సెర్చ్ చేసాను. ఏదో కనిపించిన బ్లాగు చదువుదామనేసరికి ...... అదంతా చప్పగా అనిపించింది. అక్కడ ఆకర్షించిందండీ మీ 'జాజి పూలు' (ల) పరిమళం.. .. అది సంగతి! ఈ రోజు పొద్దుటినుండీ మీ బ్లాగు చదువుతున్నాను. . ఇక కదిలితే ఒట్టు ఇక్కడి నుండి!!ఇప్పటికి చాలా పోస్టులే చదివేసాను. భలే గున్నాయి మీ జ్ఞాపకాలు, ముచ్చట్లు, అల్లరులు.. అవునూ మీరు సింగపూరులో అద్దె ఇంటి గురించి రాసినది చదువుతూ మీతో పాటూ నాకు ఏడుపొచ్చేసిందండీ ! ఇలోగా కనిపించింది మీ పోస్ట్ 'నా బ్లాగు పుట్టిన రోజు' అని! నా బ్లాగు కథ కూడా దాదాపుగా అలాగే ఉన్నాట్టుంది..
ఈ మధ్య ఓ బ్లాగు మొదలు పెట్టాలనుకుంటున్నాను (పెట్టడానికి ఎప్పుడో పెట్టాను లెండి ఆరు నెలల క్రితమే!).. అప్పుడే చక్కగా అలకరించుకుని, ఓ పేరు పెతుకిని (ఇప్పుడు మార్చే ఆలోచనలో ఉన్నాలెండి) నేను తీసే ఫోటోలతో (Nature Photographer) అప్పుడప్పుడూ వాటిపై రాసే నా అనుభవాలతో ఆక్కడంతా ప్రకృతి అందాలతో నిమ్పెయాలని నా ఆశ! .. అయినా ఆరు నెలలుగా ఓ అడుగైనా సాగలేదండి నా బ్లాగు! మీ బ్లాగు చదివాక చాలా విషయాలు తెలుసుకున్నానుబ్లాగుల గురించి బ్లాగులకి కొత్త అయిన నేను!
Thank you very much అండి.. keep sharing!
ఇంకొన్ని చదవాల్సినవి ఉన్నాయి.............మళ్ళీ వస్తాను....(మీ పోస్టులే నండీ..!!)