20, నవంబర్ 2009, శుక్రవారం

ధన్యవాదాలు


మొన్నా మద్య మావారిని బ్రతిమాలుకుని నా పొస్టు లన్నీ ప్రింట్ ఔట్ తీయించి అమ్మావాళ్ళకు ఇప్పించాను.సరే అసలు రిజల్ట్ ఎలా ఉంటుందో అని మా ఇంటికి ఫొన్ చేసి మా చెల్లితో కాసేపు నా పొస్ట్లుల గురించి, మన బ్లాగర్ల గురించి మాట్లాడిన విషయాలు మీతో ముచ్చటించాలాని ఇలా వచ్చాను ..కొంచం అటు, ఇటుగా మా సంభాషణ..

అక్కా నువ్వా !!నీ గురించే అనుకుంటున్నాం ...

నువ్వెప్పుడొచ్చావే ఊరినుండీ ..అది సరేగాని, నేను నా బ్లాగ్ లో కొన్ని పోస్ట్లులు పంపాను చదివారా??..

అదే తల్లీ ఇప్పటివరకూ మాట్లాడుకుంటున్నది..

మా చెల్లి మాటలు పూర్తయ్యేలోపల అక్క లాక్కుని..ఒరే బుజ్జమ్మా ఎంత బాగా రాసావురా,ఎదురుగా నువ్వు కూర్చుని మాట్లాడినట్లు గానే ఉంది ..ఎంత గుర్తే బాబు నీకు ..నీ పెళ్ళి చూపుల్లో ,మీ ఆయన్ని కటకటాల దగ్గరనుండీ చూడమని చెప్పాను అదీ.. మీ కుసుమ గురించిచదివా.. ఇంకా స్వాతంటే ఆ బక్కిది ...పేరుమర్చిపోయా..దాని పేరేంటి??..ఆ.. ఇంకా సువర్ణ మీ ఫ్రెండ్స్ అందరూ గుర్తుకొచ్చేసారురా .. అయ్యో, ఇందాకా కాల్ చేయాల్సింది ..మీ బావ,నాన్న పిలుస్తున్నారు.. ఆటోలో ఉన్నారు ..ఇంకో గంటలో బండి ఉంది..నాన్న సంగతి తెలిసిందే కదా గంట ముందే ప్లాట్ఫాం దగ్గర నించోవలసిందే..ఆరోగ్యం జాగ్రతమ్మా ..మళ్ళీ మా చెల్లి దగ్గరకొచ్చింది ఫోన్..

నువ్వు మరీ మురిసిపోకు..అది చదివింది ఆ మూడు కధలే.....నువ్వొక పోస్ట్లోలో దాన్ని పిసినారి పుల్లమ్మలా రాసావని దానికి తెలిస్తే బుజ్జమ్మ కాస్తా బజ్జమ్మ అయిపోతుంది.. .

ఏ ..అన్ని పొస్ట్లు ఎందుకని చదవలేదూ ..

అంత తీరిక ఏది ..దానికీ, వాళ్ళాయనకూ ఆ షాప్ ఉంటే చాలు అన్నం,నీళ్ళు అక్కరలేదు,ఒక్క రోజు కూడా ఉండనివ్వరు బావ,తెలిసిన విషయమే కదా..

హూం..ఇంతకూ అమ్మ చదివిందా..

చదివిందా.. అని మెల్లగా అడుగుతావేంటి ..యే రోజు వాటిని చదివిందో, ఆ రోజునుండి అమ్మకు, నాన్నకు మధ్య వన్ సైడ్ యుద్దం నిరవధికంగా సాగుతూనేఉంది..అందులోనూ ఒక పోస్ట్ లో అమ్మ గురించి తెగపొగిడేసి రాసావ్ కదా,ఆ పుత్రికోత్సాహం తట్టుకోలేక పోతుంది పాపం ..అసలు నాన్న వల్లే నీ ప్రతిభ మట్టిలో మాణిక్యం లా అయిపోయిందంటా ,లేకపోతే ఈ పాటికి నా కూతురు రాధ-మదు సీరియల్ లాంటిదో, చక్రవాకం సీరియల్ లాంటిదో రాసిపడేసేది అంతా మీవల్లే,మీవల్లే అని పదే పదే చెప్పి పాపం నాన్న కూడా అంతా నావల్లే,నావల్లే అని అమాయకంగా కుమిలిపోయేలా హిప్నటైజ్ చేసిపడేస్తుంది ..

ఇంక నోరుముయ్యి గాడిదా.. కనీసం బాగా రాసావ్ అని ఒక్కమాట అన్నావే..

అంటే, ఇంక ఆప్షన్ లేదా అక్కా.. బాగా రాసావ్ అని ఒప్పేసుకోవలసిందేనా?? ..సరే కుళ్ళకు తల్లీ ..నీ పొస్ట్ లే కాదు దానికి వచ్చిన వాఖ్యలు కూడా కంఠతా వచ్చేలా చదివాను ..

నేను నమ్మను, అయితే నాకు మొదటి సారిగా వాఖ్య రాసిన వాళ్ళ పేరేమిటో చెప్పు చూద్దాం..

అరుణాంక్ ..

అంత కరెక్ట్ గా ఎలాచెప్పావే??

హి హి..చేతిలో నువ్వు పంపిన కాగితాలున్నాయి..లేకపోతే ఇదేమన్నా ఎక్జామా కంఠతా పట్టడానికి మొహం చూడు..

అరుణాంక్ గారు చాలా మంచివారు తెలుసా..

ఎందుకూ? వాఖ్య రాసినందుకా ..

నీ మొహం ..ఒక సారి తన బ్లాగ్లో వాళ్ల ఆవిడ ఊరెళితే తలుచుకుంటూ గజల్ శ్రీనివాస్ గారు పాడిన 'ఇల్లు ఇపుడు ఇల్లులా లేనేలేదు ' అనే పాట లింకిచ్చారు ఎంత బాగుందో..

మరింకేం సేవ్ చేసి నువ్వు ఇండియా వచ్చినపుడు బావగారిని వినమని చెప్పు..

ఎవరూ, మీ బావా .. నేనిలా ప్లైట్ ఎక్కంగానే ..నో నాగమణీ, ఎంజాయ్ అని ఎస్ ఎం ఎస్ లు ఇచ్చుకుంటారు..మళ్ళీ నన్ను తలుచుకుని పాటలు వినడం ఒకటి, ఆ క్రికెట్ బేట్ కి అంకితం అయిపోతారు ..

హ హ అన్నట్లు ఇంకొకటి గమనించాను అక్కోయ్ .. నీ బ్లాగ్ ని రెగ్యులర్గా చదివేవాళ్ళు కూడా ఉన్నారక్కా వేణు శ్రీకాంత్,పరిమళం,లక్ష్మి,సిరి సిరి మువ్వ ,శేఖర్ పెదగోపు ,కిషన్ అబ్బో చాలామంది.

ఆ .. వేణు శ్రీకాంత్ గారు అయితే నా ప్రతి పోస్ట్ తప్పని సరిగా చదివి వ్యాఖ్య రాస్తారు ..తనకి పాటలంటే చాల ఇష్టం అందుకని మంచి మంచి పాటలన్నీ ఒక బ్లాగ్ లో రాస్తుంటారు ..పరిమళం గారున్నారే ..ఆవిడ ఎంత మంచారో తెలుసా తన ప్రొఫైల్ లో నేను తెలుగుమాత్రమే తెలిసిన ఒక మామూలు అమ్మాయినీ అని అమాయకం గా రాసినా, ఎంత బాగా రాస్తారో తెలుసా..తనపొస్టు లన్నీ అచ్చమైన కోనసీమ అందాన్నీ కళ్ళముందు నిలుపుతాయి ..ఇంక లక్ష్మి గారు ఉన్నారు కదా తను 'ఇస్రో ' లో పే..ద్ద మేనేజర్ తెలుసా.. అయినా కొంచం కూడా గర్వం ఉండదు..మళ్ళీ పోస్ట్ లయితే అదిరిపోతాయి..ఇంక శేఖర్ అచ్చం వేణు గారిలాగే చాలా సింపుల్ గా,మంచిగా ,ఇంకా హాస్యం గా కూడా రాస్తారు .. ఇక మువ్వ గారి అసలు పేరు వరూధిని..తను బాగా వ్రాసిన ప్రతి ఒక్కరినీ అభినందిస్తారు,తన పోస్ట్లు కూడా బాగుంటాయి ..ఇంక ఆ కిషన్ ఉన్నాడే, తను కోనసీమ అమ్మాయినే కట్టుకుంటా అని కంకణం కట్టుకున్నాడు అట ,తన ప్రొఫైల్ లో రోజుకో ఫొటో మారుస్తాడు కాని పాపం ఇంకా ఎవరూ పడలేదు..

అబ్బా ఇంతమంది బ్లాగ్ పేర్లు ఎలా గుర్తు పెట్టుకున్నావు అక్కా బాబు ..కొంత మంది పేరు లయితే అచ్చం ఒకలాగే ఉన్నాయి.. సృజనలు 3 ,నరేంద్ర చెన్ను పాటి,నరేష్ నందం ..శివ బండారు ,శివ చెరువు కంఫ్యూజ్ గా లేదూ..

గుర్తుపెట్టు కోనక్కరలేదు వాళ్ళ బ్లాగ్ మీద క్లిక్ చేస్తే వాళ్ళ బ్లాగ్ కనబడుతుంది ..అందులో ఒక సృజన ను సుజ్జి అంటారు తను చిన్న,చిన్న కవితలు రాస్తుంది బాగుంటాయ్ ..ఇంకో అమ్మాయి స్మృతుల సవ్వడి అని బ్లాగ్ లో తన పెళ్ళి అయిన తరువాత విషయాలు భలే రాస్తుంది .. ఇంకో అమ్మాయి సృజనారామానుజన్ తను కవితలు అవి రాస్తుంది కాని తన బ్లాగ్లో 50% తన ఫ్రెండ్ గీతాచార్య గురించి రాస్తుంది అన్నమాట ..

గీతాచార్యా !! ఏదో ప్రొఫెసర్ పేరులా ఉంది కదక్కా..
నిజంగా ప్రొఫెసరేనే తను..
అవునా !!ఎందులో ..
ఏమో నాకేం తెలుసూ ప్రొఫెసర్ అని తెలుసంతే ..

ఇవేం పేర్లక్కా జీడిపప్పు,జిలేబీ ,మలక్ పేట్ రౌడీ అనీ అవన్నా పర్లేదు అడ్డగాడిదా ,పిచ్చోడు అని విచిత్రంగా ..

ఓ వాళ్లా ఊరికే సరదాగా అలా పెట్టుకున్నారు..జీడిపప్పు గారు ఎక్కువగా అమెరికా గురించి రాస్తుంటారు.. ఇంకా పిచ్చోడుగారు ఎవరి పోస్ట్లు బాగున్నా వాళ్లకు ప్రొత్సాహం గా వాఖ్యను రాస్తారు తను పోస్ట్లేం రాయరు..ఇక మలక్ పేట్ రౌడీ గారు ఏవో వీడియో మిక్సింగ్ లు మామూలు పోస్ట్లు రాస్తారుగాని వాళ్ళ అమ్మ గారు తెలుగు పండిట్ అనుకుంటా ఈయనకూడా పద్యాలు రాస్తుంటారు కానీ తక్కువ ..ఇక వీకెండ్ వస్తే చాలు బ్లాగ్లోకం అంతా కిష్కింద కాండ చేసేస్తారు..ఈయనకు తోడుగా మంచుపల్లకి,ధన్రాజ్ మన్మధ ,నాగ ప్రసాద్,శశాంక్ ఇలా కొందరు ఫ్రెండ్స్ కలిసి ఇంక అల్లరే అల్లరన్నమాట..

అబ్బో ..ఈ పేర్లు బాగున్నాయి చూడక్కా నీహారికా,భావన,ప్రపుల్ల చంద్ర ,సునీత ,అన్వేషీ ...

కదా!! నేనూ అదే అనుకుంటా..ప్రపుల్ల చంద్ర గారేమో జపాన్ లో ఉంటారు ఫొటోస్ అవి తీస్తారు ..ఇంకా రాణి గారు ,మధురవాణి గారు వీళ్లందరూ ఫొటోస్ ఎంత బాగా తీస్తారు తెలుసా..నీహారిక, గారు ,నేనూ ఒకసారి అలిగిన వేళనే చూడాలి అని పేరుతో ఒకేసారి పోస్ట్లు వేసాం విచిత్రంగా ..ఇంక భావనగారు పేరు లోనే భావుకత్వం వినిపిస్తుంది ఎంత బాగారాస్తారో చెప్పడం కాదు చదివితే తెలుస్తుంది..సునీత గారు ఒక పోస్ట్లో రక రకాల మొక్కలు,పూల చెట్లు గురించి వ్రాసారే ,ఎన్నేన్ని రకాలో తెలుసా ..వెంటనే తనదగ్గర గార్డెనింగ్ నేర్చుకోవాలనిపించింది.. అమ్మో ఒక్కొక్కరిలో ఒక్కో టాలేంట్ .. ఇంక అన్వేషి ,నాకేమో అన్నయ్య లాంటివాడన్నమాట ..

ఆహా.. బ్లాగ్స్ లో సెంటిమెంట్లు కూడా నా తల్లీ .. ఇంక అక్క, తమ్ముడు ఎవరూ లేరా..

అక్క కాదుగాని వదిన వుంది హ హ ..అన్వేషి వైఫ్ లే.. ఇంకో అబ్బాయి మనోహర్ అని తను అక్కా ,అక్కా అని కామెంట్స్ రాస్తాడు చూడూ ..

ఇంకేం తమ్ముడు కూడా దొరికేసాడు నీకు..

అసలు బ్లాగ్ లోకంలో బోలెడు మంది నిజమైన అక్కా చెళ్ళెళ్ళు,భార్యా భర్తలు ఉన్నారే ..రమణి- మేధ, ప్రియ-వైష్ణవి ,జయ-మాలా కుమార్ ..అసలు ఈ మాలా కుమార్ గారు ఉన్నారు చూడూ తను పెద్దావిడే గానీ ఎంత బాగా చలాకిగా పొస్ట్లు రాస్తారో ..ఇంకా శ్రీ లలిత గారు ,భమిడి పాటి సూర్యలక్ష్మి గారు ,p.sm లక్ష్మి గారు వీళ్ళందరూ పెద్ద వాళ్ళమైపోయాం మనకెందుకు అని అనుకోకుండా భలే పోస్ట్లు రాస్తారు..ఒక్కోకరిదీ ఒక్కో శైలి ..ఒక్కో పొస్ట్ రాస్తే అమ్మో బాబోయ్ అని మళ్లీ 15 డేస్ ఇంకో పోస్ట్ వేయను నేను ..అదే తృష్ణగారు ఇంకా మురళిగారు,అమ్మ వొడీ లాంటి వారైతే రోజుకో పోస్ట్ ..మళ్ళీ బ్రహ్మాండమైన విషయాలు రాస్తారు తెలుసా ..రాజకీయాలు,నవలలు గురించి అబ్బా ఒక్కటికాదు ...కొత్త పాళిగారని ఒక ఆయన ఉన్నారు ఆయన భరతనాట్యం కళాకారులన్నమాట ..ఒక సారెప్పుడో నెట్ లో చూసా ఆయన ఫొటోస్ ..ఇంక జ్యోతిగారి సంగతి సరే సరి ఒక ప్రక్క వంటల బ్లాగ్స్ ,మరొక పక్క బ్లాగ్లో వచ్చే సందేహాలకు పరిష్కారాలు చెప్తూ మరొక బ్లాగ్ ఇంకో ప్రక్క ప్రమదావనం అని ఇలా చాలా చాలా చూస్తారు.భాస్కర్ రామరాజు గారని భలే రాస్తారులే ఆయన కూడా వంటలగురించి .

ప్రమధావనం ఏంటక్కా? ..
అంటే అమ్మాయిలందరూ అందులో మాట్లాడుకుంటారు ,మంచి పనులవి చేస్తారంటా..నేను చేరలేదు..
ఎందుకని??..
నా సంగతి తెలిసిందే కదే నేను మెయిల్ చెక్ చేయడమే అమావాస్యకో ,పున్నానికో చూస్తా నా పనులకు పోస్ట్లు రాయడానికే తీరిక ఉండటం లేదు.. అయినా ఏదైనా పోస్ట్ గురించి మాట్లాడాలంటే తను మెయిల్ ఇస్తారు కదా.

ఒహ్ ఆవిడ గురించేనా ఇంతకు ముందొక పోస్ట్లో రాసావ్..ఇంకా ఎవరో సుజాత,అబ్రకదబ్ర గారు ఉషగారు అని ...

ఆ ..ఆవిడే ..సుజాత గారైతే జర్నలిస్టో మరి ఎడిటరో తెలియదు కాని మొత్తానికి పత్రికా ఆఫిస్లో చేస్తారని తెలుసు అందుకే ఆమె అంత అలావోకగా పొస్ట్లు రాసేస్తారు.. ఇంక అబ్రకదబ్ర గారైతే అమ్మో ఆయనకు బోలెడువచ్చు పియానో అంటా,, ఇంకా ఫొటోస్ తీస్తారు ఇంకా మంచి బొమ్మ లేస్తారు..ఇంకా కధలు రాస్తారు ..బొమ్మలైతేరా... పెన్ను ఉంటుందా దాని చుక్కలతో ఒక బొమ్మ వేసారు తెలుసా భలే ఉంది ..

అంతేలేక్కా ,నేను వెంకటేశ్వర సహస్ర నామాలతో వెంకటేశ్వర స్వామిని వేస్తే ఒక్క సారన్నా పొగిడావా..

హహ ఒక అమ్మాయి ఉంటుందే కిరణ్ అని ఆ అమ్మాయి బొమ్మలు చూస్తుంటే నువ్వు చిన్నపుడు బయట మెట్లమీద నీ స్కూల్ బాక్స్ వళ్ళో పెట్టుకుని తెగ వేసేసేదానివి కదా.. అక్కేమో , అలా కాదు ఇలా అని చెప్పేది అదే సీన్ గుర్తొస్తుంది.. ఇంకా లీలామోహనం అనే బ్లాగ్ ఆయన క్రిష్ణుని బొమ్మలు బాగా వేస్తారు..
ఇంక ఉష గారి గురించి చెప్పాలంటే ఒక్క రోజు పడుతుంది..బాబోయ్ ఆమె కవితలొక్కటే కాదు, పెద్ద పూల తోట పెంచుతుంది తెలుసా ..తను 100 మంది కి ఒక్క చేత్తో వంట చేస్తుంది అంట టెన్షన్ పడకుండా..మనకు ఒక్కరికి వండటమే చేతకాదు ...

మనకి అని నన్ను కలుపుతావే..నేను బాగానే చేస్తా..

నీ మొహంలే , ఇంకా వాళ్ళిళ్ళు చా..లా పెద్దది .. ఇంటి ఎదురుగా బోలెడు పూల మొక్కలు,కొలను,బాతులూ ..అస్సలు ఆవిడకు గర్వం ఉండదు తెలుసా ఎంత టాలెంట్ ఉన్నా..

ఇవన్నీ నువ్వెక్కడ చూసావ్ ..

ఇంకెక్కడ బ్లాగ్లోనే ఒక సారి ఫొటోస్ పెట్టారులే..

అమ్మో ఆవిడ వ్యాఖ్యలు కూడా చదవడానికి కష్టం గా ఉన్నాయక్కా..చాలా గ్రాంధికం,భావుకత్వం కలిపి రాస్తారు కదా..ఇంట్లో కూడా ఇలాగే మాట్లాడుతారా??..

ఏమో ..కాని తన కవితలు చదివి చాలా మంది చర్చలకు వస్తారు ..వాళ్ళందరూ కూడా భలే రాస్తారు వాళ్లకు అర్ధం అవుతుంది ..ఈ లెక్కన మనవి మాంచి మట్టి బుర్రలన్నమాట..

ఇదిగో మళ్ళీ నన్ను కలుపుతావ్ ...

ఇంకా ఉషగారిలాగే రాధిక గారని ఒక అమ్మాయి కవితలు రాస్తుంది ఎంత హాయిగా ఉంటాయో..నిషిగంధ అని ఇంకో అమ్మాయి ఉంది..తనోసారి ఒక కవిత రాసిందే ..ఒక పువ్వేమో అయ్యో నా ఫ్రెండ్స్ అందరినీ కోసుకుని వెళ్ళిపోయారు ..ఒంటరినైపోయాను నేను దేవుని గుడిలో లేనూ ,కనీసం అమ్మాయి జడలో లేనూ అని ఫీల్ అవుతుంది ..అబ్బ ఎంత బాగుందో తెలుసా కవిత ..

మరి మిగిలిన వారివి కూడా ప్రింట్ తీసిపంపకపొయావా అక్కా ...

చాల్లే నాకే ఓ దిక్కూ దివాణా లేదు ..మళ్ళీ వాళ్ళందరివీ తెమ్మంటే మీ బావతో పడగలనా.. అయినా ఎక్కడన్నా సేవ్ చేసి పెట్టుకుంటా ..అందులోనూ పద్మార్పిత గారి కవితలు అంటే మీ బావగారికి మహా ఇష్టం..అయ్యగారు పెళ్ళికాకముందు ఇలాగే కవితలు రాసేసేవారంట ..ఆవిడ ప్రేమ మీద రాస్తుందిలే..

అమ్మో ,అయితే ఎవరైనా అమ్మాయికి ఇచ్చే ఉంటారక్కా ఈ లెక్కన..

పాపం మీ బావకో సెంటిమెంటుంది ..ఈయనగారు ఎవరిని ఇష్టపడేవారో ఆ అమ్మాయికి నెక్స్ట్ మంత్ లో పెళ్ళి అయిపోయేదంట .అలా ఆ పిల్లలు బ్రతికిపోయారన్నమాట బావ కవితలు చదవకుండా ...

హ హ బావ గారిని అనకపోతే తోచదుకదా నీకు..

నీమొహం లే అలా దిష్టి తీసుకుంటా గాని.ఇంకా శృతిగారని తను బాగా రాస్తారు..

ఏంటీ అందరూ అమ్మాయిలే రాస్తారా కవితలు..

అయ్యబాబోయ్ అబ్బాయిలు ఈ మాట వింటే కవితలతో పొడిచేస్తారు నన్ను ..బొల్లోజు బాబా గారు,దిలీప్ గారు అర్జున్ పణిప్రదీప్,బృఃహస్పతిగారు,రెడ్డి గారు,ఆనంధ్,ఆత్రేయ గారు ప్రేమికుడు ఒక్కరా ఇద్దరా అసలు 80% కవితలే రాస్తారు..ఇంకా దుర్గేశ్వరగారని ఆయన దేవుని మీద రాస్తారు.

మరి హాస్యం నువ్వు ఒక్కదానివేనా రాసేది ..

ఇంకా నయం, మహా మహులున్నారు రిషిగారు అని ఇంకా శ్రీవిద్య అని ఆ అమ్మాయి పోస్ట్లు చూస్తే నువ్వే గుర్తు వస్తావే బాబు..ఇంకా సుభద్ర అని ఒక అమ్మాయుంది, తను రాస్తే అర్జెంట్ గా మా ఇంటి ప్రక్కన ఉంటే బాగుండును ఈ అమ్మాయి బోలెడు కబుర్లు చెప్పుకోవచ్చు అనిపిస్తుంది ..ఇంకా లలితగారు అని తను రాసింది చదివితే , మా ఫ్రెండ్ కళ్యాణియే, కళ్యాణి తన పోస్ట్ చదివినపుడల్లా కళ్యాణీని ఊహించుకుంటా ..అశోక్ వర్మా అని ఆ అబ్బాయికూడా భలే రాస్తాడు ,ఇప్పుడేందుకో రాయడం లేదు.

ఇంతకీ సింగపూర్ వాళ్ళు ఎవరూ లేరా ??.

ఉన్నారు...శ్రావ్యా,మహిపాల్ ఇలా ఉన్నారు కొంతమంది .. ఇంకా అఙ్ఞాతలుగా వచ్చే వాళ్ళు చాలమంది పేర్లు రాయరు వాళ్ళు కాని రాజ్ కుమార్,పద్మ అని కొంతమంది రెగ్యులర్ గా నా పోస్ట్లు చదువుతారు .. ఇంకా వినయ్,మాఊరూ,హరేకృష్ణ ,చైతన్య ,శ్రీనివాస్,స్వప్న,కిరణ్మయి,కుమార్,బోనగిరి,శరత్,నుతక్కి,రుత్,ఆదిత్య,భవాని,సురబి,జాహ్నవి,శేఖర్,ప్రభాకర్,సందీప్,మహేష్,బ్లాగాగ్ని,సుధాకర్,శివరంజని,అభిసారిక, ...
అబ్బా ఆపక్కా బాబు శాంతి స్వరూప్ ఏమన్నా పూనాడా జాబులూ- జవాబులు కార్యక్రమంలా వరసపెట్టి పేర్లు చదువుతున్నావ్ ..ఇంక నీకు అలుపు రాదా...

ఓసి గాడిదా..

నువ్వు గాడిదా అన్నా,ఇంకేమన్నాసరే , నేను మా ఆయనకు కాల్ చేయాలి..గంటన్నర నుండి మాట్లడుకుంటున్నాం ..తను కాల్ చేసారేమో ఎంగేజ్ వస్తుండి ఉంటుంది ..

హూం సరే కాని..

అని అలా ముగించేసానన్నమాట..అదన్నమాట సంగతి.. కాబట్టి ఇన్నాళ్ళూ నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు :)

104 వ్యాఖ్యలు:

pavan చెప్పారు...

Hey Hey.
First post naade naade :)
Okkasaari matladatam modalupettaka inka aapadam chaala kastam anukunta meeku :)

జ్యోతి చెప్పారు...

భలే..బ్లాగ్లోకాన్నంతటిని చుట్టేసారే.బిల్లు పేలిపోయుండాలే? ఐనా మీరేంటండి భూమి ఎప్పుడూ గుండ్రంగా ఉంది అన్నట్టు చుట్టూ తిరిగి మీవారిని ఆడిపోసుకుంటారు. ఆయనతో ప్రంట్లేయించుకుని ఆయననే దెప్పిపొడుస్తారా?హన్నా.అప్పుడప్పుడ కాస్త జాలి చూపించండి పాపం..

లక్ష్మి చెప్పారు...

హమ్మబాబోయ్, మీ మేధోశక్తికి జోహార్లండీ నేస్తంగారు, ఎంత మంది పేర్లు వాళ్ళ వ్యాపకాలు, బ్లాగులు అన్నీ గుర్తు పెట్టుకున్నరంటే మీరు సామాన్యులు కాదు.

అన్నట్టు ఇస్రో అనేది నా గత చరిత్ర అండోయ్, ఇప్పుడేదో అలా అలా ఒక ఉద్యోగం వెలగబెడుతున్నా కానీ మీరు నన్ను అంత గుర్తు పెట్టుకున్నందుకు బోల్డు థాంకులు :)

సుజాత చెప్పారు...

భీభత్సం! దీన్నిలాగే ఈనాడుకి పంపితే వేసుకుంటారేమో అడిగేద్దాం నేస్తం!

అన్నట్లు జర్నలిస్టు అన్నది నా గత జన్మే ! ఇప్పుడెంచక్కా ఇంట్లోనే..హోమ్ మేకరని స్టైలు గా పేరెట్టుకుని...!వా

మేధ చెప్పారు...

భలే ఉందండీ... మొత్తానికి అందరినీ కవర్ చేశారు గా!!!
ఒక చిన్న సవరణ .. అక్కా-చెల్లెళ్ళు : రమణి - మేధ అని ఇచ్చారు..
రమణి గారి వాళ్ళ సిస్టర్ పేరు - వేద, నేను కాదు.. :)

జాహ్నవి చెప్పారు...

నేస్తమా...........
మీ పోస్ట్ లు బాగుంటాయి.
మీరు చెప్పిన అబద్దాలు కూడా బాగుంటాయి.
హమ్మ... హమ్మా....
మీరు చూసిన వాళ్ల పేర్లే మర్చిపోతామన్నారు........
ఇంత మంది పేర్లు.. ఎలా గుర్తు ఉంచుకున్నారు??
నాకు తెలియాలి...నాకు తెలియాలి...నాకు తెలియాలి...
ఎందుకంటే నేను గజిని టైప్ . మీ చిట్కా ఫాలో అయిపోతా నేను కూడా....
This idea can change my life :-)

పరిమళం చెప్పారు...

అమ్మో అన్ని బ్లాగులూ చుట్టేశారే ....నాగురించి కూడాచెప్పారోచ్ .....నాగురించి కూడా చెప్పారోచ్ ......కింది ఫ్లాట్ వాళ్లనుకుంటా బెల్ కొడుతున్నారు అసలే వాళ్ళింట్లో చంటిపిల్లాడున్నాడు ....మళ్ళీ వస్తా ఉండండి :) :)

Pavan చెప్పారు...

Nenu oka 2 months nunchi mee blog ni follow avutunna.
Telugulo comment raddamante anni tappulu pothunnai.
Meeru ela raastharu telugu lo??

అజ్ఞాత చెప్పారు...

:) మీరు ఏ టపా రాసినా సూపరే...నేస్తం..మీ పేరు నాగమణా?? నన్ను కూడ గుర్తు పెట్టుకున్నందుకు
Thanks....

మీ మేధా శక్తి కి జోహార్లు...
నన్ను కూడా మీ తమ్ముడి లిస్ట్ లొ చేర్చుకోండి....

Rajkumar

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

అయ్య బాబోయ్..బాబోయ్...మొత్తం బ్లాగ్మిత్రులందరినీ ఓ సారి పరిచయం చేసేశారు కదా!! అసలు ఓ టెలీఫోన్ సంభాషణని పోస్ట్ లాగ రాయాలన్న మీ ఆలోచన చాలా బాగుందండీ...అన్నట్టు పోస్ట్లో పెట్టిన బొమ్మ లంగా,ఓణీలో చూడ ముచ్చటగా ఉంది...
మిగిలిన వాళ్ళ సంగతి ఏమో గానీ నాకు మాత్రం మీ పోస్ట్లు చదువుతుంటే పండగలకి పబ్బాలకి కలిసినపుడు మా అక్క నాతో ఎలా సరదాగా ముచ్చట్లు
చెబుతుందో మీరు కూడా అలా చెబుతున్నట్టు అనిపిస్తుంది నాకు...

>>>అసలు నాన్న వల్లే నీ ప్రతిభ మట్టిలో మాణిక్యం లా అయిపోయిందంటా ,లేకపోతే ఈ పాటికి నా కూతురు రాధ-మదు సీరియల్ లాంటిదో, చక్రవాకం సీరియల్ లాంటిదో రాసిపడేసేది....
ఇప్పుడైనా మీరు ఆ దిశగా ప్రయత్నిస్తే బాగుంటుంది కదండీ...

సిరిసిరిమువ్వ చెప్పారు...

ఇంతకీ బిల్లు ఎంతయింది అమ్మడూ! నోరు నొప్పెడుతుందా! పాపం మీ వారు..తలుచుకుంటేనే జాలి వేస్తుంది!!

కానీ బ్లాగులోకం చాలా బాగా చుట్టి వచ్చారు.

"అబ్బా ఆపక్కా బాబు శాంతి స్వరూప్ ఏమన్నా పూనాడా జాబులూ- జవాబులు కార్యక్రమంలా వరసపెట్టి పేర్లు చదువుతున్నావ్"...హ్హ..హ్హ..హ్హ

అన్నట్టు రమణి- మేధ కాదు...రమణి-వేద అక్కాచెల్లెళ్లు.

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

నా బ్లాగు పేరు లీలామోహనమయితే మీరేమో లీలాహనం అన్నారు.ఇంట్లో మా లీల ఎప్పుడూ ఆ పెట్టె ముందే కూర్చుని ఉంటావు మమ్మల్నెమైనా పట్టించుకునేదేమైనా ఉందా అని ఒళ్ళు హూనం చేస్తోంది మీరేమో హనం చేసారే! వాఆఆఆఆఆఆఆఆఆఆ

బృహఃస్పతి చెప్పారు...

హే...హా... మీ పేరు తెలిసిపోయిందోచ్....

...నాగమణి...

గీతాచార్య చెప్పారు...

అంటే ఎవరో నా గురించి వ్రాయటం తప్ప నేనేమీ వ్రాయనా అండీ? :-(

శరత్ చెప్పారు...

చాలా బావుంది :)

అశోక్ చౌదరి చెప్పారు...

OMG.. ఎలా గుర్తు ఉంటాయ్ ఇన్ని పేర్లు?

sunita చెప్పారు...

భలే నేస్తం, భలే గుర్తు పెట్టుకున్నారు. నేను అన్ని టపాలు రాస్తే ఒక్క నా పూల మొక్కల టపానే నచ్చిందన్నమాట. మిగిలినవేవీ నచ్చలేదు,నేను చాలా నొచ్చుకున్నాను:-)

నిషిగంధ చెప్పారు...

It's very sweet of you, నేస్తం!

అందరినీ పేరు పేరునా తలచుకోవడమే కాకుండా వారి ఆసక్తులు, అభిరుచులు కూడా గుర్తుపెట్టుకోవడం నిజంగా గ్రేట్..

ఇదంతా మీ అక్కాచెల్లెళ్ళ సంభాషణలో చెప్పడం వెరైటీగా చాలా బావుంది.

శ్రీలలిత చెప్పారు...

జాజులన్నీ ఒక్కసారి గుప్పుమన్నాయి ...ఎంత బాగుందో..

Padmarpita చెప్పారు...

అమ్మో!!! అమ్మో..ఫోన్ బిల్లు ఎంతై వుంటుందో????
ఉండండి మీవారికి చెబుతా..ఎలాగో నా పార్టీయేగా:)

అజ్ఞాత చెప్పారు...

Nestam idi tondi sansara chakrala comment nundi cricket field positions varaku commentithe ajnatha la credit antha padma manohr laku vellindi ga :( pcch

Surabhi చెప్పారు...

నేస్తం గారు
సూపర్ మెమొరీ అండ్ ఓపిక.
Again, your way of saying Thanks is great

Rajasekharuni Vijay Sharma చెప్పారు...

బ్లాగు విఙ్ఞానం బాగా ఉందండీ మీకు. సరదాగా చాలా బాగా రాశారు.

Sravya V చెప్పారు...

భలే వ్రాసారు !ఇంతకీ ఆ బొమ్మలో ఉంది అక్కా ? చెల్లా ?:)

విశ్వ ప్రేమికుడు చెప్పారు...

ఇన్ని బ్లాగులెప్పుడు తిరిగారండీ... తిరిగిన వారు తిరిగినట్టుండక మళ్లీ వాళ్ల పూర్వాపరాలన్నీ గుర్తుంచుకోవడం... దానిమీద బాతాకానీ పెట్టి , ఓ టపా రాసేయడం... హన్నా... కాదేదీ మీ టపాకు అనర్హం ... :)

రాణి చెప్పారు...

నేస్తం, ఈ రోజుతో నా జన్మ ధన్యం.
నేను అనేదాన్ని ఈ బ్లాగ్లోకంలొ ఉన్నానని,ఫోటోలు పోస్ట్ చెస్తానని ఎవరికీ తెలీదెమో అనుకుంటుంటాను.మీ పోస్ట్ లొ నా పేరు చదివి, ఆఫీస్ లో బావుండదని సైలెంట్ గా కెవ్వ్ అని కేకెసి, చెయిర్ లోనె ఎగిరి గంతెసాను అంటె మీరు నమ్మాలి.
so sweet of you.
keep it up and keep posting :)

నేస్తం చెప్పారు...

ముందుగా పేర్లు రాయని కొందరు బ్లాగర్లు మన్నించాలి..మా ఆయన తో 2012 సినిమాకు వెళ్ళే హడావుడిలో పోస్ట్ రాయడం వల్ల మిస్ అయిపోయాను..
పవన్ గారు అవునండి ఫస్ట్ వాఖ్య మీదే..నిజమే నాకు ఈ చెత్త అలవాటు ఎలా వచ్చిందో తెలియదుకానీ ఎదుటివాళ్ళు విన్నా,వినకపోయినా నాన్ స్టాప్ గా మాట్లాడేస్తుంటా..
జ్యోతిగారు మరి పక్కింటోళ్ళను ఎదురింటోళ్ళను తిడితే ఊరుకోరేమో అని మా ఆయనన్ని తిడుతున్నానన్నమాట :)
లక్ష్మి గారు అవునా..మరేంపర్లేదు మీరూ నేనూ గప్చిప్ ...మరి గొప్పగా ఉండాలికదా ..ఈ సారికి ఇస్రో అని ఫిక్స్ అయిపోదాం..
సుజాత గారు మా ఇంటికి వచ్చేయండి కాసేపు బాధపడదాం నేను కూడా అలాగే చెప్పుకుని స్టైల్ కొడుతుంటా :)
మేధ గారు అనుకుంటునే ఉన్నా వేధ,మేధ ఒకలాగే ఉన్నాయిగా :)

నేస్తం చెప్పారు...

జాహ్నవి అదేం బ్రహ్మ విద్య కాదు ..నాకు పనిలేనపుడల్లా నా పోస్ట్లో కామెంటినవారి బ్లాగులన్నీ ఒకసారి తిరగమరగ వేస్తుంటా.. మీ పోస్ట్లో నేను కామెంటితే మీరు నాకు తిరిగి ఏం సమాధానం ఇచ్చారో కూడా చెప్పగలను కానీ అదేంటో ఒక ప్లేస్ గాని మనిషి గాని అస్సలు గుర్తుండరు..
పరిమళం గారు మీ గురించి చెప్పకపోతే ఎలా అండి ..నేను బ్లాగ్లోకం లో కొచ్చాకా ఎక్కువగా మీ బ్లాగ్నే చూసేదాన్ని మీ ప్రొఫైల్ లో ఫొటొ అలా చూస్తూ ఉండేదాన్ని
పవన్ గారు lekhini.org లో ప్రస్తుతానికి ట్రై చేయండి ..:)
రాజ్ కుమార్ గారు అక్కడే పప్పులో కాలేసారు.. నో..నాగమణి ఎంజాయ్ అనేది ఒక సినిమా డైలాగ్ ..నా పేరు కాదు...:)

సృజన చెప్పారు...

ఎంటీ....నేను కూడా ఉన్నానా మీ లిస్ట్ లో!!!

నేస్తం చెప్పారు...

హ హ శేఖర్ ఈ మాత్రం దానికే సీరియల్ రాయడం అంత గొప్పదాన్ని అయిపోతానా ..ఏదో కాకిపిల్ల కాకికి ముద్దు అని..తన కన్న కూతురినికదా ఆ మాత్రం అనేసుకోవడం లో తప్పులేదు :)
మువ్వ గారు మరేం పర్లేదు ... ఇప్పుడు ఇండియాకు పోన్ కార్డ్స్ బలే చీప్ అయిపోయాయి.. 8$ (240 రూ) కు 500 నిమిషాలు మాట్లాడచ్చు మేము ..అదన్నమాట సంగతి..
విజయమోహన్ గారు పోస్ట్ కూడలి లో వచ్చాకా చూసాను కాని టైం లేక అలా వదిలేసా.. మారుస్తాను.. ఈ సారికి క్షమించేయండి :)
బృహఃస్పతి గారు నా పేరేం నాగమణి కాదోచ్ ..అది సినిమా డయిలాగోచ్ ..

తృష్ణ చెప్పారు...

నా పేరు కూడా గుర్తున్నందుకు ధాంక్స్ అండీ.

నేస్తం చెప్పారు...

గీతాచార్య గారు ప్రతీ మగవాని విజయం వెనుకాలా ఒక స్త్రీ ఉంటుందనే మాట నిజం చేయాలని మీ బ్లాగ్ గురించి సృజన ద్వారా చెప్పా..అర్ధం చెసుకోరూ ..:)
శరత్ గారు :)
అశోక్ గారు మీ పేరు కూడా గుర్తుంది కాని రాయలేకపోయా హడావుడిలో :(
సునీత గారు అసలు మీ పూల మొక్కల పోస్ట్ తోనే మీ విసినకర్రని అయ్యాను నేను.. కాబట్టి దాన్నే రాసా :)
నిషి నిజం చెప్పాలంటే నేను ఏ పొస్ట్ రాసినా ఆలోచించను ..పలాన విషయం రాస్తే ఎలా ఉంటుంది ప్రారంభం ,ముగింపు ఇలా రాస్తే బాగుంటుంది అని అనేసుకుని సిస్టెం ఎక్కేస్తా..కాని ఈ పొస్ట్ కి కొంచెం కష్టపడ్డా, మా సంబాషణలో స్టెప్ బై స్టెప్ ఇలా వస్తే బాగుంటుంది అని ఒక గంట ముందే నా పోస్ట్లో వాఖ్యలు గమనించి దీని తరువాత ఇలా రాస్తే బాగుంటుంది.. అన్ని పేర్లూ కవరవ్వాలి అని రాసా:)ఇక బ్లాగర్ల గురించి మాట్లాడిన విషయాలు ఒక 4 రోజులనుండి మా చెల్లికి వాయిస్తున్నా కాబట్టి అవి నిజమే..

నేస్తం చెప్పారు...

శ్రీ లలిత గారు థేంక్స్ అండి :)
పద్మ గారు ఇలా బ్లాక్మెయిల్ చెయదం ఏమన్నా బాగుందా అసలు..
అజ్ఞాత గారు ఏం చేయను చెప్పండీ మీరేమో పేర్లు రాయరు..చాలా సార్లు మొత్తుకున్నా పేర్లు రాయండీ అని :) అసలు మిగిలిన వారి కంటే అజ్ఞాత లగా రాసిన వారి గురించే ఎక్కువ అనుకుంటా ఎవరై ఉంటారా అని
సురభి థేంక్స్..
శేఖర్ గారు థేంక్స్ అండీ..
శ్రావ్యా ఇంకెవరూ నువ్వే..ధన్యావాధాలు మాత్రం నావి :)

Anil Dasari చెప్పారు...

పిహెచ్‌డి ఇచ్చేయొచ్చు మీకు. పరిశోధన బాగుంది. పరికిణీలోని సిక్స్‌టీన్ సెంట్స్ టెల్గూ బార్బీ ఇంకా బాగుంది.

మీరు బ్లాగుల్లో అడుగు పెట్టక ముందు క్రాంతి గాయం (ఉప్మా పురాణం ఫేమ్) అనే అమ్మాయి మీలాగే అల్లరి కబుర్లు, సరదా సంగతులు రాసేస్తూ సందడి చేస్తుండేది. ఆమె లేని లోటు మీరు తీరుస్తున్నారు (పోలిక పెట్టానని చిన్నబుచ్చుకోకండి. రాయటంలో ఎవరి శైలి వారిదే. కానీ ఎందుకో గుర్తొచ్చిందంతే)

నేస్తం చెప్పారు...

ప్రేమికుడు గారు మరి నా పోస్ట్ లు చదవడమే కాకుండా ఓపికగా వాఖ్య రాసిన అందరికి ధన్య వాధాలు చెప్పకపోతే ఎలా అండి..
రాణి గారు మిమ్మల్ని ఎలా మర్చిపొతా అండి.. నా మొదటి పోస్ట్ లో మొదటి కామెంట్ మీదే ఆడవారిలో
మీరు లేక పోతే ఎలా సృజన గారు ఎంత చక్కని పొస్ట్లు రాస్తారో నాకు తెలుసు కదా :)
తృష్ణ గారు థేంక్స్ :)

రాధిక చెప్పారు...

:) అదరగొట్టేసారు. మీరు వోనేజ్ ఫోను తీసుకోండి.మనకి బోరుకొట్టేదాకా అక్కడివాళ్ళ బుర్రని తినొచ్చు.

నేస్తం చెప్పారు...

అబ్రక దబ్ర గారు భలేవారే క్రాంతి తెలియక పోవడం ఏమిటీ.తన పోస్ట్ హమార బజాజ్ ,ఉప్మా పురాణం ఎన్ని సార్లు చదివానో..బాగా రాస్తారు తను:)
రాధిక గారు అలాగే చేద్దాం అయితే :)

Srini చెప్పారు...

అయ్య బాబోయ్, అసలు మొత్తం బ్లాగ్ లోకాన్ని చుట్టేసారు కదా, మీ టపా చదువుతుంటే అసలు పక్కనే కూర్చొని మాట్లాడుతున్నట్టే ఉంది. మీ బ్లాగ్లో అన్ని టపాలు చదువుతాను కాని వ్యాఖ్యలు వ్రాయడానికి బద్ధకం. కాని మీరు ఇలా వ్యాఖ్యలు రాసిన వాళ్ళ పేర్లు కూడా గుర్తు పెట్టుకొని వాళ్ళ గురించి చెప్తారని తెలిసాక వ్యాఖ్య రాయకుండా ఎలా ఉండగలరు ఎవరైనా? మొత్తానికి మీ టపా మాత్రం అదుర్స్. అసలు ఫోన్ సంభాషణ ని ఇంత అందంగా ఒక పోస్ట్ లాగ రాయడం నిజంగా అద్భుతం.

Telugu Movie Buff చెప్పారు...

మీ ఆసక్తికి, మేధాశక్తికి, ఓపికకు జోహార్లు నేస్తం గారు.
నాలాంటి కొత్తవాళ్ళకు ఒక సంభాషణ టపాలో అందరిని భలే పరిచయం చేసేసారు.
ఆ పదహారు అణాల తెలుగు బొమ్మెంటండి మరీ అంత బావుంది. ఆ బొమ్మ ఎక్కడవుందో చెప్పగలరు.

భావన చెప్పారు...

నేస్తం మీరు అసలు ఎందుకు లే చెప్పాలంటే మాటలు కూడా రావటం లేదు. సూపరంటే సూపరు.. ఎలా వస్తాయి ఇంత సంతోషమైన అవుడియాలు.. ఈ రోజంతా ఇంక నవ్వుకుంటూనే వుంటా నేనైతే మీ పోస్ట్ తలుచుకుని. జ్యోతి అన్నట్లు మీ ఆయనకు చురకెయ్యకుండా వదలరు కదా.. నేస్తం వాళ్ళ ఆయన మన్చోరు పాపమ్..;-)

అజ్ఞాత చెప్పారు...

నీ ఓపిక కి మా జోహార్లు :)

~C !

మంచు చెప్పారు...

నేస్తం.. లాస్ట్ పొస్ట్ లొ నాకేవి గుర్తుండవ్ అంటూ గజిని ఫొజు ఇచ్చి, ఇప్పుడు ఇంత ఎనాలసిస్ తొ వచ్చి మైండ్ బ్లాక్ చేసారు కదా.. మీ పోస్టుల్లొ టాపిక్ ఎదయినా కామెడి కామనే అన్నమాట ... ;-) సూపర్ పొస్ట్

నాగమణి - ఎంజాయ్ అన్నది ఎదొ మణిరత్నం సినిమాలొ జనక్ రాజ్ వాళ్ళావిడని బస్సు ఎక్కించిన తరువాత అంటాడు కదా..

మా ఊరు చెప్పారు...

చుక్కలు చుపించారండి పోస్ట్ కి
మీరు ముందుకి వచ్చి ఆయాసపడుతూ చిప్పినట్టే అనిపిస్తుంది.
అంత గబగబా చదివేసాను.

నా బ్లాగ్ పేరు కూడా వచ్చింది
జింగుచక జింగుచక

manohar చెప్పారు...

Good morning akka.....
mothaaniki post lu raasey vallani kooda ice chesesaaru :p !!!!
memantha gadda kattesey la unnam!! :P already ikkada kerala lo vasrhaalatho chalesthondhi :(

oka chinna salaha... meeku telisey untundhi.. blog lo ads pettukontey, money vasthundhi.. edho oka pakka readers ki ibbandhi lekundaa unchadaaniki prayathninchandi... dabbukosam ani kaadhanukondi... naa blog ki dabbu vachindhi....emanukonnarani meeru baava gaarini aatapattinchochu... evarikina help cheyyochu daantho... okkasaari alochinchaali ani manavi....

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

మస్కా(జున్ను కాని జున్ను)కొట్టి నేను మీ లిస్టు లో చేరానని అంటున్నారు.మా యిద్దరికి మధ్య జాజిపుడక వచ్చేసిందంటున్నారు.(మాశ్రీవారు)
చాలా చాలా బాగా రాసావమ్మలూ--

అజ్ఞాత చెప్పారు...

Thanks for remembering me.

మురళి చెప్పారు...

బ్లాగ్లోక ప్రదక్షిణం భలేగా చేయించారే.. మొత్తానికి ఇంట్లో వాళ్లకి చెప్పేశారన్న మాట మీ బ్లాగు గురించి...

నేస్తం చెప్పారు...

శ్రీనివాస్ గారు థేంక్స్ అండి
పణి గారు ఎప్పుడో గూగుల్ లో దొరికింది ..నిన్న అలా బ్లాగ్ల్లో పెట్టెసానన్నమాట
భావనగారు మీరిలా వెనకేసుకొస్తే ఇంక నా పని అయిపోతుంది..
~c :)
మంచు పల్లకి గారు ఇప్పుడు మాత్రం గజనీని కాదని ఎవరన్నారు ..మీ పేర్లు రోజూ చూస్తాకాబట్టి గుర్తుపట్టా:)
మా ఊరుగారు థేంక్స్ :)

నేస్తం చెప్పారు...

మనోహర్ థేంక్స్ .. అన్నట్లు బ్లాగ్స్ లో ads పెడతారా??..నేను ఎప్పుడూ చూడలేదే :)అలాంటిదేమన్నా ఉంటే చెప్పేసేయి వివరాలు .. :)
హ హ సూర్య లక్ష్మి గారు :)
బోనగిరిగారు మురళి గారు థేంక్స్ అండి :)

అడ్డ గాడిద (The Ass) చెప్పారు...

Oh remembered me too? Nice.

శిశిర చెప్పారు...

ఒక్క పోస్ట్ లో మొత్తం బ్లాగ్లోకాన్ని పరిచయం చేసేశారు.చాలా బాగా రాశారు.

Unknown చెప్పారు...

నేస్తం పేరులోనే గాని నా బ్లాగ్ గుర్తు పెట్టుకోవడం లో చూపించలేదు , నే వప్పుకోను తీవ్రం గా ఖండిస్తున్నా .మీ సిస్టర్ కి మా బ్లాగర్స్ లో సినిమాల్లో నటించిన వాళ్ళు కూడా వున్నారు తెలుసా అని చెపితే మీ సొమ్మేం పోయిందని నిలదీస్తున్న . యి విషయం లో ఇంతకంటే ఏమి చెప్పలేను . సేలవ్ నమస్కారం .

హరే కృష్ణ చెప్పారు...

హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే

థాంక్స్ నేస్తం
50 comments :)

హరే కృష్ణ చెప్పారు...

మీ మంచి మనసుకి జోహార్లు

వేణూశ్రీకాంత్ చెప్పారు...

నేస్తం గారు, మీరు నాకు అగ్ర తాంబూలం ఇచ్చి గౌరవిస్తే నేను అర్దశతమయ్యే వరకూ కామెంట్ రాయలేకపోయినందుకు నిరంతర వార్తాస్రవంతి విలేఖరి రేంజ్ లో చింతిస్తున్నాను :-) గత రెండు రోజులుగా బాగా బిజీగా ఉండి మీటపా మిస్ అయ్యాను. ఇప్పుడు కూడా ఇక ఆలశ్యం చేయకూడదని నిద్ర కళ్ళతో రాస్తున్నాను :-)

మిగిలిన బ్లాగర్స్ అంతా చెప్పినదే అయినా మళ్ళీ చెప్తున్నాను. బ్లాగ్ లోకం అంతా భలే రౌండ్ వేయించారు పేర్లు వాళ్ళ బ్లాగులు గుర్తుంచుకోడం ఒక ఎత్తైతే వాళ్ళ ఇతర అభిరుచులు కూడా గుర్తుంచుకుని రాయడం బహుబాగు. ఇదివరకు చెప్పినదే అయినా మళ్ళీ నొక్కి ఒక్కాణిస్తున్నా.. మీరు ఏ అంశం తీసుకున్నా మీ తరహాలో అదరగొట్టేస్తారండీ... కేకంటే కేక అంతే...

PBVSN Raju చెప్పారు...

మీ బ్లాగ్ ద్వారా మరెన్నో మంచి బ్లాగ్స్ పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు. మీ రచనల్లో ఉన్న హాస్యం సున్నితంగా ఉండి మనసుకి హద్దుకుంటుంది. మీ నుంచి మరెన్నో రచనలను తక్కువ కాల వ్యవదిలో రావాలని ఆశిస్తాం.

cartheek చెప్పారు...

అయ్య బాబో..................య్ ఇన్ని పేర్లు ఎలా గుర్తు పెట్టుకున్నారండి.
హ నేను కూడ నాబ్లాగులో కామెంటినప్పుడు మిమ్మల్ని అక్క అనేసానోచ్.
మొథ్థానికి టపా
కెవ్వువ్వువువ్వువ్వువ్వు....కేక

Ram Krish Reddy Kotla చెప్పారు...

నేస్తం గారు మీకు చాల జ్ఞాపకశక్తి ఉండండి బాబు.....మీరు భలే వారే, రోజుకో ఫోటో మార్చినంత మాత్రాన కోనసీమ అమ్మాయిలు పడతారనుకున్నారా??..అంత లేదండి..కోనసీమ అమ్మాయిలు చాల తెలివైన అమ్మాయిలే..అంత ఈజీ కాదు...అంటే అంటారా??...సర్లెండి ఇక నుండి ఫోటో మార్చాను...చూద్దాం...హహ..ఇంకేంటి...కొన్ని పర్సనల్ పనుల వాళ్ళ మీ పోస్ట్ ఈరోజే చూసా, అందుకే వ్యాక్య లేట్ అయింది..

నేస్తం చెప్పారు...

గాడిద గారు థేంక్స్ అండి
శిశిర గారు థేంక్స్ :)
రవి గారు ..నేను బ్లాగ్లోకం మొత్తాన్ని పరిచయం చేయలేదు..అలా చేయాలంటే కనీసం ఇలాంటి పోస్ట్లు 6,7 పోస్ట్లు వేయాలేమో ..నాకెంతో ఇస్ట మైన బ్లాగులు అశ్విన్ బూదరాజు ,క్రాంతి,తోట రాముడు ఇలా చాలామంది బ్లాగులగురించి రాయనేలేదు..నా బ్లాగ్ గురించి, దానిలో వాక్యలు రాసిన బ్లాగర్లకు ధన్యవాదాలు చెప్పడానికి మాత్రమే ఈ పోస్ట్ వేసాను..ఒక సారి నా పోస్ట్లో వ్యాక్యలు రాసిన వారిని చూసి గభా గభా రాయడం వల్ల చాలా మంది వ్యాక్యలు రాసిన అంటే కన్నగాడు,ప్రతాప్,బాటసారి,కారుణ్య ,కార్తిక్ వంటి వారిగురించి కూడా రాయలేకపోయా.. మీరు ఇదే మొదటి వాక్య ..అందువల్ల మీ గురించి రాయాలేకపోయా ..:) కానీ మామూలు గా ఇంట్లో అయితే మీ విలోజ్ లో వినాయకుని సినిమా చూద్దామని చాలా ట్రై చేసాకాని నాకు నెట్లో గాని, cd గాని దొరకలేదు

నేస్తం చెప్పారు...

హరే క్రిష్ణ గారు ,వేణు ,రాజు గారు ,కిషన్,కార్తీక్ మీ అబిమానానికి థేంక్స్ :)

నీహారిక చెప్పారు...

nestam gaaru,

tika-maka annappude anukunnaa ilaanti post vraastaarani,Thankyou.

గీతాచార్య చెప్పారు...

Meeru illa raasthunte cheppaa kadaa mullapudi bapu, yaddanapudi veerendranath gurthosthunnaarani. edannaa katha modalettandi nestham ;-)

Seriously u must publish something.

జయ చెప్పారు...

థాంక్యూ నేస్తం గారు. అన్ని బ్లాగ్ లు చాలా బాగా వివరించారు.

నరేష్ నందం (Naresh Nandam) చెప్పారు...

నేస్తం..
నేను అలిగాను. ఎందుకో సరైన కారణం కనుక్కుని సరిచేస్తే సరే.. లేక పోతే అదే కారణంతో ఇక్కడ అందరూ అలుగేస్తారు మరి!

అవునూ నాగమణి ఎవరో! బాగుంటుందా?

బ్లాగర్లందరినీ పేరు పేరునా గుర్తుంచుకునీ, వారి ప్రొఫైల్స్‌ని ఫోన్‌లో చెప్పాలంటే.. చాలా కష్టం!
టోపీ ఎత్తాం!

మాలా కుమార్ చెప్పారు...

రోజూ మీ పోస్ట్ కోసం ఎదురుచూస్తూ వుంటే నేను ఊళ్ళో లేనఫ్ఫుడే చటుక్కున రాసేసారు . చూడండి అందరికంటే ఎంత వెనుక పడిపోయానో !
నాకు తెలియని చాలా బ్లాగుల గురించి కుడా తెలుసుకున్నాను . దేనికైనా సరిలేరు మీకెవ్వరు .
కొంచం ఆగండి ఎప్పుడూ నీరసంగా వుంటావు అని రోజూ నస పెట్టే మావారికి మీరు నాగురించి రాసింది చూపించాలి .

అజ్ఞాత చెప్పారు...

Eyy manohar enti OA chestunnav chanuvisthe unnamati povadamaa? em nestam garu ma pavan gadu 1st comentadu kavalante time checkchesukondi 3rd name vachindi ani vila vilaladi pothunnadu

నేస్తం చెప్పారు...

నీహారిక గారు థేంక్స్ అండి..
గీతా చార్య గారు :) రాస్తాను తప్పకుండా..
జయ గారు థేంక్స్ అండి..
నరేష్ ఎందుకబ్బా :( చాలా ఆలోచించాను కాని గుర్తు రావడం లేదు ..చెప్పేయండి మీరే :)

నేస్తం చెప్పారు...

మాలా కుమార్ గారు నిజం చెప్పాలంటే నేను చాలా రాయలేదు..చాలామంది గురించి రాయలేదు..అదో బాధ మిగిలిపోయింది ..అది సరే గాని మిమ్మల్ని అంత మాట అన్నారా మరి వెళ్ళి అడిగేయండి :)
అఙ్ఞాత గారు మీరు మనోహర్ ని ఎందుకు తిట్టారో అర్ధం కాలేదు..ఇంక వాక్యలు మీరు చెప్పాకే గమనించాను ..నిజమేనండి తారుమారయ్యాయి..నాకు తెలియదు ఎందుకో ..అయినా నేను రిప్లయ్ ఇచ్చినపుడు చెప్పాను కద పవన్ కు మీదే మొదటి వాక్య అని ..:)

manohar చెప్పారు...

actual ga naaku kooda konchem chanuvu ekkuvinatte anipinchindhi aa reply ichepudu.. just in flair it came out.... but appatikey post chesesaanu.. sarey akkaku nachakapothey teesestundhiley ani vadhilesaa...
kandhaku lendhi kathipeetaku vachindhi laa undhi nee badha..

dayachesi mee comments and akka reply la gurinchi chooskontey chaala healthy ga untundhi...

sorry akka...ikada personal ga inkokarni analsi vachindhi...inkepudu post cheyyanu ila...

నేస్తం చెప్పారు...

ఇంతకీ మీ ఇద్దరూ ఎందుకు కొట్టుకుంటున్నారు నాకర్ధం కాలే :)..అఙ్ఞాత గారు.. మనోహర్ నాకు ads గురించి చెప్పినందుకా??..బ్లాగ్ లో ads ఏంటా ఒక వేళ ఎవరికన్నా సహాయం చేయచ్చా అనే ఆశక్తితో అడిగాను .. ఒక వేళ అటువంటి వాటిలో ఏదన్నా ప్రోబ్లెంస్ ఉన్నా ,జాగ్ర్త్తలు తీసుకోవలసినా డైరెక్ట్ గా నాకు వాక్య ఇస్తే నాకు తెలుసుతుంది కదండి.. :D ఇంక మనోహర్ ఇంత కోపం అవసరమా :) నా ఎదురుగానే నా పేరు చెప్పి మీ ఇద్దరూ కొట్టేసుకుందామనే హన్నా.. ఇంతకూ ఈ గొడవలో మీరు నిమిత్తమాత్రులు మాత్రమే..అసలు జరిగిన విషయం ఏమిటంటే ప్రొద్దిన్నే మా ఆయనతో నా బ్లాగ్లో ఇప్పటి కొచ్చి ఎటువంటి గొడవ జరగకుండా ప్రశాంతంగా పొస్ట్ లు రాసాను చూసారా అన్నాను ..టంగు మహిమ .. :)

Narendra Chennupati చెప్పారు...

నేస్తం గారు, మీ జ్ఞాపకశక్తి సూపర్ అండి...అయినా నాపేరు confusing గా ఉందనటం ఏమి బాగోలేదు :-( ....

శివ చెరువు చెప్పారు...

Photo baagundi...

పరుచూరి వంశీ కృష్ణ . చెప్పారు...

bagundandi....

Pavan చెప్పారు...

నేను కూడా మొదటిసారి తెలుగులొ కామెంట్ ఇస్తున్నా.
మీరు రాసిన అన్ని పొస్ట్ లు చదివేశా. అన్ని చాల బాగున్నై.

నేస్తం చెప్పారు...

నరేంద్ర గారు నేను కాదు కంఫ్యూజ్ అయ్యింది :) మా చెల్లి..అయినా నరేంద్ర ,నరేష్ కొంచం తికమకే నాకు కూడా ఒక్కోసారి, మా తోడి కోడలి తమ్ముళ్ళిద్దరి పేర్లూ అవే ..ఎప్పుడూ కంఫ్యూజ్ అయిపోతుంటా తను చెబుతున్నపుడు :)
శివ గారు ,వంశీ గారు థేంక్స్ అండీ.
పవన్ గారు మంచిపని చేసారు.. తెలుగులో చదవడం కొంచెం ఈజీ గా ఉంటుంది .

నరేష్ నందం (Naresh Nandam) చెప్పారు...

ఎందుకు అలిగానో అర్ధం కాలేదా?
సరే... నా పేరు చెప్పారే కానీ, నా గురించి చెప్పలేదు కదా.. అందుకు!
అఫ్‌కోర్స్.. అసలు కొంతమంది పేర్లు చెప్పలేదనుకోండీ..
ఐనా అంత మంది పేర్లూ.. వాళ్ల గురించి తెలుసుకోవటం.. మళ్లీ గుర్తుపెట్టుకోవటం.. ఆపైన పాఠంలా అప్పచెప్పటం.. చాలా బాగుంది.. టోపీ ఎత్తాం(హ్యాట్సాఫ్)!
మీరు సరేనంటే మా ఆఫీసులో పీఆర్ఓ పోస్టుకి రికమెండు చేస్తాను నేను.. చక్కగా అప్పుడు నిజంగా పక్కనే ఉన్నట్లు మాట్లాడుకోవచ్చు!

నేస్తం చెప్పారు...

నరేష్ గారూ నిజమే ..చక్కని ఫొటోలతో అలరించే మీ బ్లాగ్ అంటే నాకు చాలా ఇష్టం కానీ పోస్ట్ మరీ పెద్దదయిపోతుందేమో ,సరిగ్గా రాయలేనేమో,చదివే వాళ్ళకు విసుగొస్తుతుందేమో అన్న డవుట్లు సగం కారణం అయితే ఏదో పెద్ద కొంపలు మునిగిపోతున్నట్లు సినిమాకు వెళ్ళడానికి ముందు హడావుడిగా రాసి పొస్ట్ చేసేయడం మరొక కారణం .. చాలామంది గురించి రాయలేక పోయాను .. ఈసారికి క్షమించేయండి :)

Rajendra Prasad(రాజు) చెప్పారు...

మీ వల్ల మంచి మంచి బ్లాగు మిత్రులు దొరికారు.
మీరు కేక...అందరు అన్నట్టు ఒక కథ మొదలు పెట్టండి...
ఆల్ ది బెస్ట్

అనిర్విన్ చెప్పారు...

Ha Ha, great.

Now everybody knows why they should leave a comment in your blog.

నేను బ్లాగులకి కొత్తండీ. మీ పోస్టులన్నీ చదివాను. చాలా బాగున్నాయి.

అజ్ఞాత చెప్పారు...

థేంక్యూ నేస్తం. నువ్వల్లిన ఈ మనోహరమైన పూమాలలో నాకూ స్థానం కల్పించినందుకు .

swapna@kalalaprapancham చెప్పారు...

మీ మేధా శక్తి కి జోహార్లు. మోత్హానికి బ్లాగ్ ని మోత్హం తిప్పెసారు ఒక్క సారిగా.
అందరు వాళ్ళ వాళ్ళ బ్లాగ్ వచ్చిందా మీ మాటల్లో అని అనేటట్టు చేసారు ఒక్క పోస్ట్ తో . హేహే
ఇంతకి స్వప్న అంటే నేనేనా లేక ఇంకో స్వప్న న ?
నాకు ఇదావారికి మీ లాగే మంచి మేధా శక్తి ఉండేది. బ్రెయిన్ చాల sharp గ ఉండేది. కానీ ఇపుడు లేదు. ఇంకా పూర్తి విరుద్దం గ పూర్ మైండ్ అయిపొయింది :( పని
చేసి చేసి , ఏమి చేయాలో ఏమో. ఇంటర్ లో ఉనపుడు ఒక గేమ్ ఆడం. అందరు పూల పేరు చెప్పాలి. ఒక్కక్కోక్కల్లు ఒక పూల పేరు చెప్పాలి ముందు ఉన్న వాళ్ళ పూల పేర్లు అన్ని చెప్పాలి. అపుడు నేను ఫైనల్ దాక ఉన్నాను. అదే ఇపుడు ఆడితే ముందు ౩, 4 లోనే పోతాను. ఒక సారి మీ పర్సనల్ మెయిల్ id ఇస్తారా?

swapna@kalalaprapancham చెప్పారు...

inthaki miru akka chella mi intlo?

kiranmayi చెప్పారు...

నేను ఊరికెళ్లడం చూసి, టకా మని పోస్ట్ పెట్టేస్తారా? మొన్ననే అనుకున్నా అన్ని బ్లాగ్స్ బుక్ మార్క్ చేసి పెట్టుకోవాలి లేకపోతే కొన్ని మంచి పోస్ట్లు మిస్ అయిపోతా అని. కాని ఇప్పుడు ఎంచక్కా మీ పోస్ట్ ని బుక్ మార్క్ చేసి పెట్టేసుకుని కావాల్సినప్పుడు చూసుకుని, కావాల్సిన బ్లాగ్ లోకి వెళ్ళొచ్చు. నేను మహా బద్ధకిస్ట్ ని. అసలు మీరు ఎంచక్కా అందరి బ్లాగ్స్ కి లింక్ ఇవ్వాల్సింది. హి హి హి హి హి

నేస్తం చెప్పారు...

అనిర్విన్ గారు పేరు భలే ఉందండీ థేంక్స్ పోస్ట్లు నచ్చినందుకు
ప్రసాద్ గారు థేంక్స్ అండి :)
లలిత గారు :D
స్వప్నా నేను అక్కని చెల్లిని రెండూనూ.. అంటే నాకు అక్క,చెల్లి ఇద్దరూ ఉన్నారన్నమాట :) మీ మెయిల్ అడ్రెస్స్ ఇవ్వండి ఇస్తా ..కాకపోతే నేను నెలకోసారో రెండుసార్లో మెయిల్స్ చెక్ చేస్తా.. అంత బద్దకస్తురాలిని :)ఇక ఆ స్వప్న మీరే
కిరణ్మయి సరేలే నన్నే అడిగారూ ..అసలు ఆ ఉద్దేశం తోనే పోస్ట్ మొదలు పెట్టా ..ఈ రోజూ రేపు అని ఇన్ని రోజులు చేసేసా.. ఎప్పుడో ఒకప్పుడు లింకులు ఇస్తా :)

శివరంజని చెప్పారు...

మీ post ఈ రోజే చదివాను అక్క .మీ మేధాశక్తికి జోహార్లు అక్క. కొత్త బ్లాగర్ ని అయినా భలేగా గుర్తుపెట్టుకున్నందుకు ధన్యవాదాలు post కి మీకు నా ధన్యవాదాలు .

జాన్‌హైడ్ కనుమూరి చెప్పారు...

బాగుంది మీ ప్రయత్నం
అభినందనలు

నన్ను మరిచారండోయ్!

నేస్తం చెప్పారు...

కనుమూరి గారు మర్చిపోలేదు గుర్తున్నారు కాని ఆరోజు మీ పేరు రాయలేక పోయా కంగారులో :)
శివరంజని :)
మనోహర్ నీ వ్యాఖ్య ప్రచురించలా ...అదిగాని అందరూ మనస్పూర్తిగా వ్రాయాలని ,ఏమనుకోకేం :)

manohar చెప్పారు...

:) anukodanikemundhi....
naa aasa 100 comments choodalani...
ee saarikooda miss ayyela undhi :(
kotha post raasesaru ga....
:) mundhu adhi chadhavali...

నేస్తం చెప్పారు...

హహ మనోహర్ అప్పుడు తిడుతూ వస్తాయి ఈ అమ్మాయి వ్యాక్యలకోసం చూస్తుంది అని ..అయినా చాలా థేంక్స్ మనోహర్ నీ అభిమానానికి :)

మధురవాణి చెప్పారు...

నేస్తం గారూ,
మీది బుర్రా..మెమరీ కార్డా..!?? ఎంత బాగా గుర్తుపెట్టుకున్నారండీ.! అయినా సరే..గుర్తున్నా గానీ మళ్ళీ అందరి గురించి ఒకే సారి చెప్పడం..అది కూడా ఫోనులో అప్పటికప్పుడే...
వావ్...అనకుండా ఉండలేకపోతున్నానండీ.! నా ఫోటోలు కూడా మీకు గుర్తున్నందుకు చాలా సంతోషం. గుర్తు పెట్టుకుని అందరినీ మీ ఇంట్లో వాళ్లకి పరిచయం చేసినందుకు ధన్యులం :)

నేస్తం చెప్పారు...

మదుర థేంక్స్ మరి మీ ఫొటొస్ భలే ఉంటాయి ,అప్పుడప్పుడూ పొటోస్ బ్లాగ్స్ చూస్తూ ఉంటా తోచకపోతే :)

మరువం ఉష చెప్పారు...

నేస్తం, "ఇంక ఉష గారి గురించి చెప్పాలంటే ఒక్క రోజు పడుతుంది..బాబొయ్ ఆమె కవితలొక్కటే కాదు, పెద్ద పూల తోట పెంచుతుంది తెలుసా ..తను 100 మంది కి ఒక్క చేత్తో వంట చేస్తుంది అంట టెన్షన్ పడకుండా..మనకు ఒక్కరికి వండటమే చేతకాదు ...

మనకి అని నన్ను కలుపుతావే..నేను బాగానే చేస్తా..

నీ మొహంలే , ఇంకా వాళ్ళిళ్ళు చా..లా పెద్దది .. ఇంటి ఎదురుగా బోలెడు పూల మొక్కలు,కొలను,బాతులూ ..అస్సలు ఆవిడకు గర్వం ఉండదు తెలుసా ఎంత టాలెంట్ ఉన్నా..

ఇవన్నీ నువ్వెక్కడ చూసావ్ ..

ఇంకెక్కడ బ్లాగ్లోనే ఒక సారి ఫొటొస్ పెట్టారులే..

అమ్మో ఆవిడ వాక్యలు కూడా చదవడానికి కష్టం గా ఉన్నాయక్కా..చాలా గ్రాంధికం,భావుకత్వం కలిపి రాస్తారు కదా..ఇంట్లో కూడా ఇలాగే మాట్లాడుతారా??..

ఏమో ..కాని తన కవితలు చదివి చాలా మంది చర్చలకు వస్తారు ..వాళ్ళందరూ కూడా భలే రాస్తారు వాళ్లకు అర్ధం అవుతుంది ..ఈ లెక్కన మనవి మాంచి మట్టి బుర్రలన్నమాట.."

నా గురించి ఇంతకు మునుపు కూడా "మీవారితో మీ సంభాషణల్లో ప్రస్తావించిన విషయం" గుర్తుకు వచ్చింది. ఏకంగా ఇంత అంటే అదిగో అంత లావైపోయాను.

చాలా థాంక్స్. నేను కూడా నాక్కావల్సిన వారికి చూపాలి ఇది. :) నిజానికి చర్చల్లో నన్ను పెంచిన వారికే క్రెడిట్.

మీరిలాగే మీదైన అందరినీ ఆకట్టుకునే వూసుల గొలుసుకట్టుతో మమ్మల్నింకా అలరించాలి.

mahipal చెప్పారు...

Hai nestham garu...
India lo undadam mulanga me blog chudadam kudaraledu...india ki velli vachee first me blog open chesa... chala bagundhi gurthu pettukunandhuku dhanyavadhalu.
India velli vachakka chala badhaga untundhi... kani me blog open chesaka nijanga hai ga undhi.... chala thanks akka...

నేస్తం చెప్పారు...

ఉష :D
మహిపాల్ అవునా.. నేను ఈ వీక్ ఎండ్ వెళతానేమో.మీకింకా వచ్చాకా బెంగ నేను ఇప్పటినుండే బెంగ పెట్టేసుకుంటున్నా :(

Amma చెప్పారు...

hiiii
naku mee peru telskovalani undi
cheptarani ankuntunanu
me way of xpressing nak chala baga nachindi

Malakpet Rowdy చెప్పారు...

Wow I missed this post ... cool one

Malakpet Rowdy చెప్పారు...

Lemme make it 100

Malakpet Rowdy చెప్పారు...

2 more to go

Malakpet Rowdy చెప్పారు...

THis is the 99th comment

Malakpet Rowdy చెప్పారు...

And Yahoo!!! 100th comment!!!!!

నేస్తం చెప్పారు...

malakpet rowdy gaaru :)

రాంగోపాల్ చెప్పారు...

నేస్తమా...
మీ memory card ఎంత GBఅండి బాబోయ్!!!!! అంత మంది బ్లాగర్స్‌ని భలే గుర్తుపెట్టుకున్నారు. నేను మీకు తెలుసా నాగమణి గారు? మీ కొత్త నేస్తాన్ని. చంద్రుడికో నూలుపోగులాగ మీ బ్లాగుకి నానవ్వు పోగు.

అజ్ఞాత చెప్పారు...

నేస్తం,
నన్ను గుర్తుపెట్టుకుని మీ పోస్ట్లో రాసినందుకు, ఏకంగా గంతులే గంతులు ! :-)
అన్నట్టు మీరు ధన్యవాదాలు చెప్పటం కాదు నేస్తం, మేమే ఒక్కో సారి యాంత్రికంగా అనిపించే రోజుల్లో, ఇలా మమ్మల్ని నవ్విస్తున్నందుకు మీకు ధన్యవాదాలు చెప్పాలి.
-పద్మ.

HarshaBharatiya చెప్పారు...

నాకు తెలియని చాలా బ్లాగ్స్ ని పరిచయం చేసారు థాంక్స్ నైస్ పోస్టింగ్..