మా నాన్న గారి ఆకరి తమ్ముడు పేరుకి చిన్నాన్న అనే గాని,మా పెద్దక్క కంటే ఒక నాలుగైదేళ్ళే పెద్దవాడు అవ్వడం మూలానా మా పిల్లలలో పిల్లాడిగా బాగ కలసిపోయేవాడు..మమ్మలిని కొట్టడం ,తిట్టడం,ఏడిపించడం ఇలాంటివన్నీ మహా బాగా చేసేవాడు...అయితే అందరి లాగానే ఒక వయసు వచ్చేసరికి ప్రేమలో పడ్డాడు.. మళ్ళీ ఎక్కడో అంటే కష్టం అనుకున్నాడో ఏమో మా ఇంటికి రెండు ఇళ్ళ అవతల ఉన్న మేడ మీద అమ్మాయిలో తన భానుప్రియని చూసుకున్నాడు..(తను భాను ప్రియ కి పేద్ద విసన కర్ర లేండి ..) ఇంచు మించు గా దగ్గర వయసు అవ్వడం వల్ల ఈ ప్రేమ విషయం మా ఇద్దరు అక్కలకి చెప్పేసాడు..వాళ్ళూ కూడా తెగ సపోర్ట్ ఇచ్చేవారు తనకి ..
చిన్నాన్నా! పిన్ని మేడ మీదకు ఎక్కింది అనో లేకపోతే పిన్ని ఫలానా దగ్గర కనబడింది అనో information అందించేవాళ్ళు .. వాళ్ళు అలా పిన్ని,పిన్ని అంటుంటే తన మొహం చూడాలి ఎంత వెలిగిపోయేదో .. వెంటనే తను కూడా మేడ ఎక్కేసేవాడు ఆ అమ్మాయి ఎక్కంగానే....ఆ అమ్మాయికీ ..ఎర్రగా బుర్రగా ఉన్న మా చిన్నాన్న చూడటం ఇష్టమో లేక నిజం గా పని ఉండేదో నాకు తెలియదు కాని సాయంత్రం అవ్వగానే బట్టలు ఆరబెట్టడానికో లేక ఆరిన బట్టలు మడత బేట్టడానికనో,మొక్కలకు నీళ్ళు పొయ్యడానికనో ఠంచనుగా వచ్చేసేది ..
ఎటోచ్చి అటు పెద్దాళ్ళ list లోకి ఇటూ చిన్న పిల్లల list లోకి చేరంది నేను మా తమ్ముడు ,చెల్లెలు మాత్రమే ..అందరం పిన్నమ్మ పెద్దమ్మ పిల్లలవడం చేత ఒకే వయసుకు చెందిన వాళ్ళం ....ఇక ఇంట్లో యే చిన్న తప్పు జరిగినా మా అమ్మా వాళ్ళకు దొరికేది మేమే .. గాడిదల్లా ఎదిగారు ఆ మాత్రం తెలియదా అనో.. ఆరిందల్లా అన్నిటిలోకి వస్తారు చిన్నపిల్లలు చిన్నపిల్లల్లాగ ఉండండి అనో అన్నిటికి మమ్మలనే దులిపేసేవారు..
అయితే మా వీది లో వాళ్ళు ఆవులిస్తే పేగులేం ఖర్మ నరాలు, నాడులు తో సహా లెక్క పెట్టెసే అంత గొప్ప వాళ్ళు ..కాబట్టి ఈ చోటీ సి ప్రేం కహాని కనిపెట్టేసి మరింత ఆరా కోసం స్కూల్ కి వెళుతున్న మా అక్కని ఆపి ఆ విషయం ఈ విషయం మాటాడుతూ ..మీ చిన్నాన్న రోజూ సాయంత్రాలు మేడ ఎందుకు ఎక్కుతున్నాడంటావ్ అన్నారంట..మా అక్క పైకి నోట్లో వేలు పెడితే కొరకలేనంత అమాయకం గా కనబడుతుంది కాని అదాటుగా ఉంటే వేలేం ఖర్మా చేయిమొత్తం నమిలేస్తుంది.. ఏమో ..అనేసి ..పరుగు పరుగున వచ్చి మా చిన్నాన్న చెవిలో చెప్పేసింది ..ఇంక తనకి చెమట్లు పట్టేసేయి.. దానికి కారణం ఏంటంటే అప్పటికే మార్చ్ ,సెప్టెంబర్ లో పోయిన సబ్జెక్టులనే మళ్ళీ మళ్ళీ కడుతూ .. చచ్చే చీవాట్లు తింటున్నాడు అన్నగారిల చేత ..ఇప్పుడు ఈ విషయం తెలిసిందా ..అంతే సంగతులు...
కాబట్టి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నంతలో ఆ మహానుభావుని కంట్లో చక్కగా ఒక మూలన కబుర్లు చెప్పేసుకుని కిలకిలా నవ్వేసుకుంటున్న మేము కనబడ్డాం ..ఇంకేముంది ఒక దిక్కుమాలిన ఐడియా వచ్చేసింది అయ్యగారికి ..వెంటనే మాకు కాస్త దూరంలో బట్టలు ఉతుక్కుంటూ ఇరుగమ్మల మీద ,పొరుగమ్మల మీదా సీరియస్సుగా చాడీలు చెప్పేసుకుంటున్న వదినగార్ల దగ్గరకు వెళ్ళి .. వదినా ..ఎంత సేపూ మీ కబుర్లు మీవేనా.. పిల్లల చదువే పట్టించుకోరా...ఇప్పుడంటే చిన్న క్లాసులు చదివినా చదవక పోయినా పట్టించుకోరు ,ముందు ముందు పబ్లిక్ ఎక్జాంస్ వస్తాయి ఎంత కష్టమో తెలుసా .. వాళ్ళు చూసావా చదువూ సంద్యా లేకుండా ఎలా అల్లరి చేస్తున్నారో అన్నాడు.. ఇదేమిట్రా బాబు ఉరుము లేని పిడుగులాగా హఠత్తుగా మా చదువుల మీద పడ్డాడు అనుకున్నాం మా మొహాలు ఒకరివి ఒకరు చూసుకుంటూ..
నీ చదువు నువ్వు చూసుకోవయ్యా.. వాళ్ళ గురించి నీకెందుకు గాని అని అనాలి కదా మా అమ్మా వాళ్ళయినా .. అబ్బే ..ఎవరి భర్తలను వాళ్ళు తిట్టుకునే చాన్స్ వస్తే ఎందుకు వదులుకుంటారు వాళ్ళు ..ఏం చెస్తాం బాబు ప్రొద్దున్ననుండి అరవచాకిరి చేసినా మీ అన్నగారికి పట్టదాయే ..ఒక పనిమనిషా పాడా మా మొహాలకి (ఉత్తినే ...నాన్న పనిమనిషిని పెట్టమన్నా అది సరిగా చేయదు అని అమ్మే ఒప్పుకోదు)ఇంక వీళ్ళ చదువులు పట్టించుకునే తీరికెక్కడిదీ ..అయినా మాకేమన్నా డిగ్రీయా బొగ్రీయా ..మమ్మల్ని ఎలాగూ పట్టించుకోరూ పిల్లల చదువులన్నా పట్టించుకోపోతే ఎలాగా అంది అమ్మ ఆ కోపం అంతా బట్టల మీద చూపిస్తూ...సరేలే అక్కా ..మొన్న ఎవరో మీ పాప ఎంత చదువుతుంది అని అడిగితే మీ మరిది గారు దాన్ని పిలిచి అడిగి చెప్పారు నేనెవరికి చెప్పుకోను అంది పిన్ని..ఈ లోపల మా పెద్దమ్మ.. మీ బావగారికి మా మీదే కాదు ఆయనమీద ఆయనకే శ్రద్ద ఉండదు.. మొన్న కాయకూరలు తరిగి కడిగిన నీళ్ళు చారనుకుని అన్నం లో వేసుకు తినేసారు.. నేనెవరికి చెప్పుకోను అని వాపోయింది ..
అబ్బా మొదలెడితే ఆపరనుకున్నాడో ,ఏమో సరేలే వదినా ఏం చెస్తాం..అలా అని పిల్లలని వదిలేస్తామా ఈ రోజునుండి నేనే వాళ్ళకు సాయంత్రాలు కాసేపు నా చదువు ఆపుకుని ప్రేవేట్ చెబుతా అన్నాడు..వెంటనే మా అమ్మా వాళ్ళూ బాబు కాఫి తాగుతావా.. చలవ చేస్తుంది మజ్జిగ తాగకూడదు అని మర్యాదలు చెసేస్తుంటే మా చదువు మీద ఈ అకాల ప్రేమ ఏమిటో తెలియక జుట్టు పీక్కున్నాం మేము ..
ఆ తరువాత నుండి మా తిప్పలు ఏమని చెప్పనూ .. సాయంత్రం కాగానే మమ్మల్ని బలవంతం గా లాక్కుపోయి చదువు చెప్పెవాడు..పోని శుబ్బరంగా చెప్పచ్చుగా ...ఆ అమ్మాయిని ఆకర్షించడానికి మమ్మల్ని వీర ఉతుకుడు ఉతికేసేవాడు..
మా తమ్ముడి తో ఒరే సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు జరిగింది ..?
అదా నాన్న .. మరేమో 1857 ...అంతే ఫేడిలమని వాడిని ఒక్కటి పీకీ సిఫాయిల తిరుగుబాటు 1857 లో జరిగింది అనేవాడు..ఇప్పుడు నేను అదే కదా అన్నాను వాడు ఏడుపు మొహం పెట్టగానే ఎంట్రా పెద్దోళ్ళను ఎదిరిస్తావా .. మళ్ళీ ఫేడేల్ ..ఫేడేల్ ..
అదికాదు నాన్నా వాడు అదే అన్నాడు మా చెల్లి మెల్లిగా గొణికింది.. ఏంటే నీ నోరు పైకి లేస్తుంది సరే నీ సంగతి చెబుతా 17*13 ఎంతా ?చెప్పు.. .. అదా నాన్నా ఉండు చెబుతా అదీ 17*13 కదా.. ఉండే ..అనే లోపల దానికీ వీపు మీద ఒక్కటి స్కేల్ తో ఇచ్చేవాడు.. మేము 12*12 వరకు నిద్రలో లేపినా చెప్పగలము.. 17 ఎక్కం అంటే ఎలా చెబుతాం !!ఇంత జరిగాకా ఆ మాట అనడానికి నేనేమన్నా తెలివి తక్కువదాన్నా .. నోరు మూసుకుని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టుకునే వాళ్ళం మనసులో ...
ఇలా ఆ పిల్ల తో ప్రేమ కాదు గాని మాకు ఆకాశం లో పగలే చుక్కలు చూపించేవాడు.. మమ్మల్ని ఎన్ని తిట్ట్లు తిడితే అంత బాగ చదువు చెప్పేస్తున్నాడు అనుకునే వారు మా అమాయకపు తల్లులూ .. అమ్మా మాకు ప్రేవేట్ వద్దమ్మా..మాకు మేమే బాగా చదువుకుంటున్నాం అన్నామో ,ఆపకుండా అరగంట తిట్టి పడేసేవారు.. ఇలా ఆ బలవంతపు ట్యూషన్ 3 నెలలు చెప్పాడు.. ఆ తరువాత శెలవలకు మేము మా అమ్మమ్మల ఊరికి చెక్కేసాము.. ఆ తరువాత ఏం పాట్లు పడ్డాడో నాకు అయితే తెలియదు ..
కొన్నాళ్ళు పోయాకా ఒక రోజు ఆ ఇంటి నుండి పెద్దవాళ్ళు వచ్చి ఆ అమ్మాయి పెళ్ళి శుభలేఖ ఇచ్చి బోజనాలకు పిలిచి వెళ్ళిపోయారు..పిల్లల్లందరం పెళ్ళి బోజనాలంటే అదో సరదా కాబట్టి గెంతులేసాం.. అమ్మా వాళ్ళు ఏం చీరలు కట్టుకోవాలి అనే హడావుడిలో వాళ్ళు పడిపోయారు.. కాని దేవదాసులా శూన్యంలోకి చూస్తూ బాధ పడుతున్న మా చిన్నాన్నను మాత్రం మేము పట్టించుకోలేదు..
మరి ఎన్నాళ్ళు బాధ పడ్డాడొ తెలియదు గాని చాలా నాళ్ళ తరువాత ఒక సారి నేను మా చెల్లీ ఒకప్పుడు తను చదివే గదిలో exams కి చదువుకుంటుంటే మా చెల్లి ఏదో book కోసం వెదుకుతూ అడుగున ఎర్రగా మెరుస్తున్న ఒక డైరీ ని బయటకు లాగింది ..పైన మా చిన్నాన్న పేరు ఉంది.. ఇద్దరం మొహామొహాలు చూసుకున్నాం ..ఎందుకు లేవే ఇతరుల డైరీ చదవ కూడదు కదా అన్నాను నసుగుతూ ..నాకూ మనసులో చదవాలన్న ఆశక్తి చాలా ఉన్నా సరే ..నీ మొహం అసలు డైరీ రాసేదే ఇతరులు చదవడానికి.. లేక పోతే రాయడం ఎందుకంటా .. పోనీ రాసారే అనుకుందాం..ఎక్కడబడితే అక్కడ పడెయడమే.. అది వాళ్ళ తప్పు మనది కాదు అని లాజిక్ లాగేసరికి ఇద్దరం మెల్లిగా అది పుచ్చుకుని మేడ ఎక్కేసి మొదటి పేజి తీయగానే "ఈ డైరీ చదివిన వాళ్ళు గాడిదలు" అని రాసుంది.. చూసావా అక్కా ఎవరన్నా చదువుతారని ముందే ఎలా రాసాడొ .. రాసిన వాడు ఇంకా పెద్ద గాడిద అని ఇంకో పేజీ తిప్పింది ..ఈ డైరీ చదివితే వచ్చే జన్మలో దున్నపోతులయి పుడతారు అని రాసుంది.. ఓర్నీ ..మొత్తం శాపనార్దాలే రాసాడా ఏంటి అని చదువుతున్నాం ... మొదట అంతా నేను పలనా చోట బట్టలు కొనుక్కున్నాను పలానా చోట అన్నం తిన్నాను.. ఇలా సోది ..అలా ఒక 20 పేజీలు విసిగించాకా ఒక చోట మా ఇద్దరి కళ్ళు ఆగిఫొయాయి.. ఈ రోజు అతనిని చూసాను ..ఎంత అందం గా ఉన్నాడో.. రోజూ చూస్తాను.. కానీ ఈ రొజు చాలా అందం గా అనిపించాడు అని రాసుంది..ఇదేంటే ఎవరితడు అనుకుని మళ్ళి చదవడం మొదలెట్టాం ...నేను అతని కోసమే పుట్టానేమో అనిపిస్తుంది.. అవి కళ్ళా కాదు నేరేడు పళ్ళూ.. అంటు ఒక అర పేజి కవిత్వం .. ఇద్దరం కాసింత అయోమయం గా చుస్తున్నాం ....అలా అతని గురించి ఒక 20 పేజీలు చదివాకా కాసింత భయం వేసింది.. ఏమి చదువుతున్నామో అర్దం కాకా.... తరువత పేజీలోచూద్దుము కదా ......ఈ రోజు అతను వాళ్ళ అమ్మ గారితో గుడికి వచ్చాడు చీరలో అతనెంత బాగున్నాడో.. రోజు అతనిని మేడ మీద చూసినా ఎప్పుడూ కొత్తగా అనిపిస్తునే ఉంటాడు ... అప్పుడు అర్దం అయింది తను ఎవరి గురించి రాస్తున్నాడో.. ఎక్కడ చదివే వాళ్ళకు అర్దం అయిపోతుందో అని 'ఆమే' అనే బదులు 'అతడు ' అని రాస్తున్నాడని....ఇంక పడి పడీ నవ్వాము... చివరిలో ఆ అమ్మాయి పెళ్ళి అయ్యాకా చాలా బాధగా ఎదొ ఎదో రాసుకుని ఇంకా ఆడైరీ ముగించేసాడు..మనసంతా ఏదోలా అయిపోయింది ఇద్దరికీ..
ఇప్పుడు తనకి పెళ్ళి అయింది మా పిన్ని ఎంతో మంచిది.. కాని ఎప్పూడన్నా ఆ అమ్మాయి పుట్టింటికి వచ్చినపుడు చూస్తె తన కళ్ళల్లో ఒక్క మెరుపులాంటిది మెరిసి మాయ మవుతుంది.. నిజమే తన ప్రేమ పిరికిది కావచ్చు..(అది ప్రేమ అనుకోండి ఆకర్షణ అనుకోండి) ఆ అమ్మాయి కూడా మా చిన్నాన్న ప్రేమ ఇంట్లో ఒప్పుకోరని తెలిసి కూడా మేడ ఎక్కి ఉండవచ్చు .. కానీ ఇప్పటి ఈ కాలపు యువత లాగా అప్పటి వాళ్లు తల్లిదండ్రుల గురించి,భవిష్యత్ గురించీ ఆలోచించకుండా ప్రాణాలు తీసుకోనూ లేదూ ధైర్యం గా ఇంకొకరి ప్రాణాలు తీసేయనూ లేదూ...ఒకప్పటి భాధని తీపి ఙ్ఞాపకాలుగా మనసులో నింపుకుని భవిష్యత్ వైపు అడుగు వేసేవారు ఆ కాలం లో చాలా మంది.. ఏమో ఒకరకం గా ఈనాటి ఈ ఆవేశపు ప్రేమలకంటే ఆనాటి పిరికి ప్రేమలే మంచివేమో అనిపిస్తుంది
50 కామెంట్లు:
నేస్తం..
ప్రేమల సంగతేమో గానీ నేను చెప్పలేను గానీ.. మీరు రాసే విధానం మాత్రం మరీ మరీ చదివించేలా ఉంటుంది.
"అతను చీరలో గుడికి వచ్చాడు వాళ్ళ అమ్మతో.." ఇది మాత్రం సూపర్. నవ్వలేక చచ్చాను. :))))))))
హ్హ హ్హ హ్హ బాగుంది మీ చిన్నాన్న పంబలడికిజంబ లవ్ స్టోరి !!!
మొన్న కాయకూరలు తరిగి కడిగిన నీళ్ళు చారనుకుని అన్నం లో వేసుకు తినేసారు.. నేనెవరికి చెప్పుకోను !!
hahaha.. chala baaga raastunnaru.
Too good nEstam :)
@మధుర వాణి గారు ధన్య వాదాలు .. మీ ప్రోత్సాహానికి నికి
@అశోక్ గారు ధన్యవాదాలండి
@సుజ్జి పెదనాన్నే కాదు మా నాన్నగారు కూడా అలాగే తినేసారంట ఒక సారి.. అమ్మ దెప్పితే రెండింటికీ పెద్ద తేడా లేదులే అని ఏడిపిస్తారు :)
@లక్ష్మి గారు ధన్యవాదాలండి
నేస్తం, మీ చిన్నాన్న గారి లవ్ స్టోరీ, డైరీ ఆఫ్ చిన్నాన్న సూపర్....... :-))) చివరలో మంచి మెసేజ్ తో ముగింపు పలికారు. చాలా బాగుంది
నిజంగా ఆ రోజులని తల్చుకుంటుంటే "ప్రేమకు అంత విలువుందా" అనిపిస్తుంది. ఈ రోజుల్ని చూస్తుంటే "ప్రేమకసలు విలువే లేదా" అని బాధపడాలనిపిస్తుంది. సున్నితమైన విషయాన్ని హాస్య ధోరణిలో బాగా చెప్పారు నేస్తం!
పిచ్చోడు గారు ధన్యవాదాలండి.. సుజాత గారు మొదటి సారి నా బ్లాగుకు విచ్చేసినందుకు దన్యవాదాలు ..మీ టపాలు వాక్యలతో సహా చదివేస్తాను :)
చాలా బాగా రాశారు. మీకు కథని నాటకీయంగా చెప్పే నేర్పు ఉంది.
"ఈనాటి ఈ ఆవేశపు ప్రేమలకంటే ఆనాటి పిరికి ప్రేమలే మంచివేమో అనిపిస్తుంది."
I'm totally with you on this!
Good post :-)
నిషి గంధ గారు కొత్త పాళి గారు మీ వాక్యలు మనసుకు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయి :)మీ అభిమాని ని నేను
mi Postlu anni chala baguntai nestham garu
"ఇప్పటి ఈ కాలపు యువత లాగా అప్పటి వాళ్లు తల్లిదండ్రుల గురించి,భవిష్యత్ గురించీ ఆలోచించకుండా ప్రాణాలు తీసుకోనూ లేదూ ధైర్యంగా ఇంకొకరి ప్రాణాలు తీసేయనూ లేదూ"... చాలా బాగా చెప్పారు.
సురభి గారు,సిరి సిరి మువ్వ గారు ధన్యవాధాలండి :)
మరో సారి మీకు తిరుగు లేదని నిరూపించుకున్నారు.
బాగా రాస్తున్నారు, చాలా మందికి ఉండే టీనేజీ ప్రేమకధే అయినా మీరు రాసిన తీరు బాగుంది.
నేస్తం గారూ,
మీరు వ్రాసిన తీరు ఫన్నీగా ఉండి నవ్వు తెప్పించింది. బాగుంది.
:)
మిరు చివరలో అన్న ఈ మాటలని మాత్రం సమర్ధించలేను.
'ఏమో ఒకరకం గా ఈనాటి ఈ ఆవేశపు ప్రేమలకంటే ఆనాటి పిరికి ప్రేమలే మంచివేమో అనిపిస్తుంది.'
ఈ నాటి హింసాత్మక ఆవేశపు ప్రేమల్లో, ఇరువైపుల నుంచి ప్రేమ లేదు. ఏకపక్షం గా ఉంటుంది. ఒకరికి ఇష్టం ఉండి, మరొకరికి లేకపోయినా నన్ను ప్రేమించాల్సిందే అనే ఉన్మాదాన్ని నేను సహించను.
కానీ, మీరు వ్రాసిన పోస్ట్ లో ఇరువైపుల నుంచి కొంతవరకు ఇష్ఠం ఉంది, ఆకర్షణ ఉంది. అలాంటప్పుడు పిరికిగా ఎందుకు మౌనం గా ఉండిపోవాలి. నిజమైన ప్రేమైతే, ఇరువురికీ ఇష్ఠమైతే దాన్ని సాధించుకోవాలి. సమ్యమనం తో, సహనం తో, పెద్దలని వప్పించి సాధించుకోవచ్చు. మనల్ని ప్రేమించే పెద్దవాళ్ళు మనం చెప్పగలిగే రీతిలో చెప్తే తప్పక వింటారు.
నేను పిరికి ప్రేమలని ఎంత మాత్రమూ సమర్ధించను. ప్రేమని సాధించలేక, అదేదో తీపి జ్ఞాపకం లా తలచుకుంటూ, ఎక్కడ ఉన్నా ఏమైనా నీ సుఖమేలే కోరుకున్నా అనుకునే వాళ్ళు ప్రేమకి అర్హులు కానే కారు.
చాలా కొంతమంది వ్రాయగలరు, చదువరులను ఆద్యంతం కట్టిపడేసా లాగా. మీ narration చాలా బావుంటుంది
chala bagundi , super,keka
బావుంది. చివర్లో చెప్పిన మాట ఇంకా బావుంది. Really good post.
వేణు గారు నేను చెప్పేది మరొక సారి చదవండి.. ఆ అమ్మాయి కూడా మేడ ఎక్కి నన్ను రెచ్చ గొట్టి ఇప్పుడు calm గా పెళ్ళి చేసేసుకుంది అని తన మీద అర్దం లేని ఆవేశం పెంచుకోకుండా అదొక ఙ్ఞాపకం గా మార్చుకుని తన భవిష్యత్ చూసుకున్నాడు ...అందుకే అప్పటి ప్రేమలే బెటర్ ఈ నాటి ఆవేశపు ప్రేమల కంటే అన్నాను..ఇక పిరికి ప్రేమ అంటారా.. పెద్దవాళ్ళ మనసుని నొప్పించే దైర్యం అందరికీ ఉండదు కదా ..పెద్దవారి కనుసన్నలలో మెలిగే ఆ రోజుల్లో అసలు ఉండేది కాదు.. అలా ఉండబట్టే ఉమ్మడిలో అంత కాలం ఉండగలిగారు .. అంతే కాకుండా ఆడపిల్లలు ,మగ పిల్లలూ ఒక పరిదులు దాటడానికి భయపడెవారు.. ఇప్పుడు ఎవరు కాస్త మంచి గా మాట్లాడినా అమాయకత్వం వల్లో మరే కారణం చేతనో అది ప్రేమా అనుకోవడం.. అతనిని నమ్మి వెళ్ళడం ఘోరం గా మోసపోవడం.. అలాగే అబ్బాయిలు ఆత్మ హత్యలు చేసుకోవడం..అయితే పూర్తిగా ఈ రోజుల్లో అందరూ అలాగే ఉంటున్నారనుకోను .. ప్రేమించి పెళ్ళి చేసుకుని హాయిగా బ్రతికేవాళ్ళను చూసాను కాని.. ఈ మద్య కాలం లో యే పేపర్ చూసినా ఇటువంటి నేరాలు ఎక్కువగా కనబడి మనసును కలచి వేస్తున్నాయి..
శివ గారు ఉమా శంకర్ గారు బాట సారి గారు మీ అభిమానానికి ధన్యవాదాలు అండి.
citakoTTesav nestam :D
ఫేడేల్ ..ఫేడేల్ haha :))
చాలా బాగుంది మీ చిన్నాన్న లవ్ స్టోరీ. మీరు చెప్పిన విధానం చాలా బాగుంది.
"సాయంత్రం అవ్వగానే బట్టలు ఆరబెట్టడానికో లేక ఆరిన బట్టలు మడత బేట్టడానికనో,మొక్కలకు నీళ్ళు పొయ్యడానికనో ఠంచనుగా వచ్చేసేది .. " అప్పుడు సైట్ కొట్టడమే సరదాగా ఉంటుంది :)
@anveshi :P
జీడి పప్పు గారు యువతి యువకుల మద్య అలాంటి సరదా సంఘటనలు జీవితాంతం గుర్తు ఉండిపొతాయి..ఎప్పుడో ...ఏ పని అలసట మద్యలోనో విశ్రాంతి తీసుకుంటూ కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నపుడు గుర్తువస్తే చిన్న చిరునవ్వు పెదవుల పై కదలాడి మనసు పాత ఙ్ఞాపకాలతో తేలికైపోతుంది ఎవరికయినా
మిరియాల ఫణి ప్రసాద్ గారు ధన్యవాధాలండి
మీరు పోస్ట్ రాసే విధానమే కాదు,కామె౦ట్స్ కి వివరరణ కూడా చాలా బాగా రాసారు.మధ్య మధ్యలో హాస్యాన్ని బాగా ప౦డి౦చారు నేస్త౦.
వేద గారు చాలా ధన్యవాదాలండి మీ అబిమానానికి
బాగుంది :)
చైతన్య గారు ధన్యవాదాలండి
బాగుంది బాగుంది,,,,, మీ కొత్త పొస్ట్ కొసం నేను వెయిట్ చేయడం , మీరు పొస్ట్ చెయడం ఇక్కడ మేం చదవడం కూడా ఐపోయింది ..... ఈసారి కామెంట్స్ ఎమీ లేవు ...... కొత్త పొస్ట్ ఎపుడండి?
కుమార్ గారు ధన్యవాధాలు..మొన్నే కదండి రాసాను .. త్వరలో రాస్తాను :)
ఐతె మాత్రం .....
:)
కానీ ఈ రొజు చాలా అందం గా అనిపించాడు అని రాసుంది..
Hahahaha...too much.Baaundi .
~C
నిజానికి నాకు మీ శైలి నచ్చింది ..... నాకు తెలుగుని వేగంగా అర్థం చేసుకుంటూ చదవడం చిన్నప్పటినుండి అలవాటు.... మీరు రాసే సింగిల్ పేజ్ కథలు మహా అంటే 3-4 నిమిషాల్లో అయిపోతున్నాయి, ఎం చేయాలి చాలా రోజులనుండి ఆకలేస్తుంది కానీ కడుపునిండా తిందాం అంటే ఎవరూ పెట్టరు , ఏమి సాధనం ? కల్పితం అయినా కాస్త లేటెగా అయినా పరవాలేదు కానీ మీరొకరోజుమాత్రం ఒక సూపర్ డూపర్ నవల లాంటిది రాసి పంపితే మొత్తం చదివి మా అముల్యమైన అభిప్రాయాల్ని తెలియజెస్తాం .....
హ..హ.. కుమారుగారు మీ అబిమానానికి ధన్య వాదాలు..నవల రాయాలంటే మొదట కావలసింది ఓపిక.. నాకు కొంచెం కూడా లేనిది అదే.. పైగా నేను ఏదన్నా రాస్తున్నపుడు 10 నిమిషాలు అటు వెళ్ళి పని చెసుకొచ్చి ఇటు వెళ్ళి పనిచేసుకొచ్చి అస్సలు రాయలేను..ఏక బిగిన రాస్తేనే కధ పట్టులోకి వస్తుంది.. చాలా సార్లు అందుకే నవల మొదలు పెట్టి ముగింపు ఇచ్చేదాన్ని కాదు .. నా పెళ్ళి అయ్యాకా బాద్యతలు పెరగడం వలన తీరిక ఉండటం లేదు .. మీ అభిమానానికి మరొక్కసారి ధన్యవాదాలు... అయితే మీకు నవలలు చదవాలంటే ఇక్కడ నిషిగంద గారు.. ఇంకా మాలతి గారు (చాతక పక్షులు )అనేక నవలలు రాస్తున్నారు ..చదివి మీ ఆకలి తీర్చుకోండి.. ఇంకా నాతోటి బ్లాగర్లు లక్ష్మి గారు (నేను_లక్ష్మి)సుజాత గారు (మనసులోమాట) ఇంకా చాలా చక్కని హాస్య రచయితలు కూడా చక్కని టపాలు రాసారు... మీకున్న ఆసక్తిని బట్టి ఇవన్నీ చెప్పాను..ఎక్కువగా చెప్పాను అనుకుంటే క్షమించగలరు ..
@ C :D thanku thanku :P
ఇలాంటి సంఘటనలు అందరి జీవితాలలో సహజం అనుకుంటాను
వాటిని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు
ప్రసాద్ గారు ధన్య వాదాలు
నేస్తం గారూ నమస్కారమండీ... :) మీ కలం పేరు చాలా బాగుంది. దానికి తగ్గ్ట్టుగానే మీవ్యాసాలూ అందరినీ అలరించే విధంగా ఉన్నాయి. అందుకు అభినందనలు.
మీ టపా చాలా బాగుంది. డైరీ చాలా బాగా రాశారు బాబాయిగారు. పిరికి ప్రేమలు అనడం అన్నివిధాలా సబబే అనిపించినా.., బాధ్యతెరిగిన ప్రేమలు అంటే బాగుంటుందేమో...? ఇప్పటి ప్రేమికులలో ఆ బాధ్యతే కరువయ్యింది. ఎవరెలా పోయినా వాళ్ల ప్రేమ వాళ్లకు దక్కితే చాలు.
@వేణు- మీరన్నట్టు మనసుంటే మార్గముండక పోదు. కానీ అప్పటి వాళ్లు ఆమాత్రం ఇబ్బందిని కూడా ఇంట్లో వాళ్లకి కలిగించకూడదు అనుకునే వారు. అందుకె అప్పట్లో ఇలా మనసు మాటునే దాగి వుండి పోయిన ప్రేమలు ఎన్నో... ఎన్నెన్నో...
ప్రేమికుడు గారు ధన్యవాదాలు :)
ఆ యువతకు తెగువ లేదనికాదు ,సంస్కారం కూడా ఉంది .
ఆఖరిన చూసినందుకు వ్యాఖ్యలు మిగిలితేగా వ్రాయడానికి......
బ్లాగ్ లొ ఒక మంచి నేస్తం వుందని గొప్పగాచెప్పగలను అంతే......
అరుణాంక్ గారు నిజమే మీరన్నది కూడా పద్మార్పిత గారు :) ధన్యవాదాలు
మీరు వ్రాసిన విషయం విదానం మాత్రం చాలా చాలా భాగుంది ముఖ్యంగా ఆ బొమ్మలు ఎంతో అంధంగా వున్నాయి
శ్రీ గారు ధన్యవాదాలు అండి
సూపర్...చిన్న విరామం కూడా తీసుకోనీయకుండా ఆసాంతం చదివించారు. :)
రమ్యగారు ధన్యవాదాలండి
..నీ మొహం అసలు డైరీ రాసేదే ఇతరులు చదవడానికి.. haha
chaala baagundi........meer narration excellent........ilanti anubhavalu naku vunnayi..nijam ga chala hayaina badhaga vuntundi gurtuku vaste.........
vinay గారు :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి