4, జనవరి 2009, ఆదివారం

మన్నించు మిత్రమా !!!మా friends అందరూ ఏకగ్రీవంగా నాకు పెట్టిన బిరుదేమిటంటే నేను వొఠ్ఠీ అనుమానపు పిరికి పిశాచిని అని...పోని అంతటితో ఊరుకున్నారా??..అనేకానేక jokes వేసి ఏడిపించేవారు..అందులో మచ్చుక్కి ఒకటి ..పెళ్ళి పీటల మీద కూర్చుంటూ ..పెళ్ళికొడుకుని చూసీ ..మొన్న పెళ్ళి చూపూల్లో చూసింది ఇతనినేనా ?లేక పొరపాటున వేరే కళ్యాణ మండపానికి వెళ్ళాబోయి ఇక్కడికి వచ్చేసాడా ?అనే కంత్రీ అనుమానపు ఆలొచనలు నాకు తప్పా ఎవరికీ రావంటా ...సరే నా విషయం పక్కన పెడితే, మా సత్యవేణి నాకు పక్కా వ్యతిరేకం...తన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే .. ఎక్కడో వీధి చివరన ఎర్రరంగుచొక్కా వేసుకున్నవాడిని చూసి .."నిన్న పెళ్ళి చూపులకు వచ్చిన వాడు కూడా ఇదే రంగు షర్ట్ వేసుకున్నాడు కదా .. కాబట్టి ఇతనే అతను అని నిర్ణయించేసుకుని దగ్గరకు వెళ్ళి హాయ్ అని పలుకరించే టైపు"..

అలాంటి సత్యవేణి ఇంటికి వెళ్ళాను ఒకసారి .. తను పెళ్ళి అయ్యాక నాలుగు నెలల తరువాత పుట్టింటికి వచ్చింది.. ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటుండగా ఫొనె మోగింది..చేసిన వాళ్ళు మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్ అయిన లత అనే అమ్మాయి.విషయం ఏమిటంటే ..అనుకోకుండా ఒక NRI అబ్బాయితో పెళ్ళి కుదిరి వారం రోజుల్లో పెళ్ళి అయిపోయింది కాబట్టి ఎవరిని పిలవడానికి అవ్వలేదు ..రేపు రిసెప్షన్కి తప్పనిసరిగా రండి .. ఇంటికి వచ్చి పిలవనందుకు ఏమి అనుకోవద్దు అని రెండు ప్లీజ్లు రెండు సారీల మధ్య ఎంతో ప్రేమగా పిలిచింది ..

చెబితే మీరు నమ్మరు గాని ..మా ఇంట్లో మేమందరం ఆడపిల్లలమనో మరి ఉమ్మడి లో మాట వస్తుందనో తెలియదు కాని ఎక్కడికి పంపేవాళ్ళు కాదు .. నేనూ కూడా ఇంట్రెస్ట్ లేక సగం.. బద్దకంతో సగం ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు..ఈ కారణాల వల్ల నాకు మా ఇల్లు , స్కూల్,కాలేజ్ ,కొద్దిపాటి ఫ్రెండ్స్ఇళ్ళు తప్ప ఇంక ఎక్కడికి దారి తెలియదు .కాబట్టి .. మీ ఇల్లు తెలియదు కదే ,ఎక్కడా??? అని అడిగాను.. ఈ లోపల సత్యవేణి నా దగ్గర నుండి ఫోన్ లాక్కుని నాకు తెలుసులేవే రేపు నేను తీసుకు వెళతాగా అంది..

దాని సంగతి ముందే తెలుసుకాబట్టి.. "తల్లీ నాకసలే ఏమీ తెలియదు ..ఎందుకైనా మంచిది మళ్ళీ నువ్వు అడుగు "అన్నాను..అది చిరాకుగా లత తో అబ్బా దీనితో ఇదేనే బాబు మహా చిక్కు.. చెప్పినా నమ్మదు. మీ ఇల్లు పలనా ఫలనా దగ్గర రాములవారి గుడి వస్తుంది కదా అక్కడినుండి రెండో వీధిలో లెఫ్ట్ తిరిగితే వస్తుంది కదా అంది..అవతల అదేం అన్నాదో తెలియదు .. ఒక రెండు నిమిషాలు మాట్లాడేసి రేపు అందరికంటే ముందు మేమే వస్తాం.. నువ్వేం ఫీల్ అవ్వకు అని పెట్టేసింది.

ఇంతకీ దగ్గరా ...దూరమా అన్నాను...మా అమ్మని ఎలా బ్రతిమాలుకోవాలో ఆలోచిస్తూ ..దూరం అంటే రాను అంటాననో లేక దానికి లత ఇల్లు పెద్ద దూరం అనిపించలేదో తెలియదు కాని .. అబ్బే ఇక్కడేనే ,నా బండి మీద వెళితే 10 నిమిషాలు ,నేను తీసుకు వెళతాగా ..నువ్వు అట్టే కంగారు పడకు అంది..ఇంక తప్పేది లేదు కాబట్టి సరే ..కానీ తొందరగా వచ్చేద్దామే బాబు ,మా ఇంట్లో సంగతి తెలుసుగా అన్నాను లేచివెళ్ళబోతూ ..

ఇదిగో కాస్త తొందరగా 10 గంటలకల్లారా.. మరీ.. భోజనం టైముకి వెళితే చండాలంగా ఉంటుంది..తిన్నాక ఎలాగూ నువ్వు అక్కడ ఉండనివ్వవు కదా అంది.సరే అని ఇంటి కొచ్చేసాను.మరుసటి రోజు ఇక్కదేనమ్మా ...ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాగా అని ఒప్పించి.. గిఫ్ట్ కొనగా మిగిలిన డబ్బులని పర్స్ లో వేసుకుని హడావుడిగ సత్య ఇంటికి బయలుదేరాను..అసలే తోందరగా రమ్మంది అరగంట ఆలస్యం అయింది..ఎన్ని తిట్ట్లు తినాలో అనుకుని .

తీరా వెళ్ళి చూద్దును కదా.. అమ్మగారు దుప్పటి ముసుగేసి పడుకుంది.ఓసి గాడిదా అనుకుని లేపితే అప్పుడే వచ్చేసావ ఇదిగో 5 నిమిషాల్లో తయరైపోతాను అని గంట చేసి నా తిట్ల మధ్యలో మేకప్పు పూర్తి చేసి బయటకు వచ్చి బండిని ఒక సారి చూసి పెట్రోల్ అయిపోయింది అంది మెల్లిగా నసుగుతూ ..ముందు కోపం వచ్చినా, అంతా మన మంచికే అంటారు.. ఇది బండేలా నడుపుతుందో ..ఎందుకొచ్చిన గొడవ.. ఇక్కడే అంటుందిగా అనుకుని ఆటో లో పోదాం అన్నాను.సరే అనుకుని దారిలో ఆటో అబ్బాయిని పిలిచి ఎక్కాము. నాకేలాగు ఏమి తెలియదు కాబట్టి నేను మహరాణి లా కూర్చున్నా .. ఆ తిప్పలేవో అదే పడుతుంది అని.

తను ఆటో వాడితో ఏదో చెప్పింది ..అతను ఏదో అన్నాడు .. మొత్తానికి ఆటో స్టార్ట్ అయింది ..ఇంక నిన్న సగం చెప్పి వదిలేసిన వాళ్ళ అత్తగారి గయ్యాళితనం గురించి తన బాధలు ,కష్టాల గురించి మళ్ళీ మొదలెట్టింది.నేను కూడా అయ్యో పాపం.. అలా అందా ..నీకెన్ని కష్టాలొచ్చాయి ..ఆవిడ మరీ అంత రాకాసా అని వంత పాడసాగాను .చల్లగాలి తాకుతుంటే ఆ ప్రయాణం చాలా హాయిగా అనిపించింది ..మాటల మధ్యలో ఎంత దూరం వెళుతున్నామో గమనించలేదు నేను ..ఇంతలో .." ఎంత దూరం అమ్మా ఇక్కడ అంటావ్, అక్కడ అంటావ్ సరిగా ఏది చెప్పవు, నాకు తిరుగు బేరం కూడా దొరకదేమో ఇటువెళితే "అన్నాడు ఆటో అబ్బాయి విసుగ్గా ...

అప్పుడు చూసా బయటకు ..రోడ్ కి అటు ఇటు చెట్లు,చేమలు దూరంగా పొలాలు ..అసలెక్కడ ఉన్నాం టైం చూసుకున్నా గబుక్కున ..బయలు దేరి 45 నిమిషాలు అయింది .ఇదేంటే చాల సేపైంది.. ఎక్కడ వాళ్ళిల్లు ఇంకా రాలేదేంటి అన్నాను కంగారుగా .
ఇక్కడేనే వచ్చేస్తుంది ఇంకో 2నిమిషాలు.. ఈ ఆటో వాడు మరీ నెమ్మదిగా వెళుతున్నాడు అంటూ తనసోది మళ్ళీ మొదలేట్టింది..ఇంక నా కళ్ళు రోడ్ కి అతుక్కుపోయాయి.. ఇంకో పది నిమిషాలయినా లత ఇల్లు కనబడలేదు..నాకు కంగారు మొదలైంది..

అడ్రెస్ కరెక్టేనా మళ్ళీ అడిగేలోపల" ఆ గుడేనా అమ్మా" అన్నాడు ఆటో వాడు.. అదే అదే అంది సత్య .హమ్మయ్య అనుకుని ఊపిరి పీల్చుకున్నా ..అప్పుడు గుర్తువచ్చింది ...నేను దగ్గరే కదా పైగా దాని బండి మీద వెళతాం కదా అన్న ధీమాతో డబ్బులు ఎక్కువ తేలేదు. ఆ మాటే అన్నాను దాని చెవిలో గుసగుసగా ..నీ పిసినారితనం సంగతి నాకు తెలియదేంటి ..నేను తెచ్చాలే అని అటు ఇటు చూసి నా బేగ్ ఏదే అంది.ఏ బేగ్ అన్నాను అయోమయం గా అప్పుడే నా కుడికన్ను అదరడం మొదలైంది..అదేనే , రెడ్ గా ఉంటుంది నా హేండ్ బేగ్ అంది మళ్ళీ వెదుకుతూ ..అయిపోయింది మర్చిపోయిందన్నమాట .. హెలో ...ఇది మైసూర్ ప్యాలేస్ కాదుతల్లీ అంతాగా వెదికేయకు ,నువ్వు వచ్చేటపుడు గిఫ్ట్ పేకేట్ తప్ప ఇంకేం తేలేదు అన్నాను ..

నాకు ఆతోవాడి మొహంలో చూడాలంటేనే భయం మొదలైంది .అప్పటికే విసిగిపోయాడు ఇది తిప్పిన తిప్పుళ్ళకు . అంతా నీవల్లే హడావుడిపెట్టేసావ్ వచ్చేటపుడు అంది ..మొత్తానికి నాదగ్గర ఉన్న డబ్బులన్నీ వెదికి వెదికి ఇచ్చినా ఇవ్వవలసిన దానికంటే తక్కువే ఉన్నాయి..ఇంకా ఆటోవాడు తిట్టిన తిట్లేమి రాయగలను లేండి ..తలుచుకుంటే ఇప్పుడు కూడా తల గోడకేసి ఢాం ..ఢాం అని కొట్టు కోవాలనిపిస్తుంది ..సరే వచ్చేటప్పుడు మన వాళ్ళను డబ్బులడుగుదాములే అనుకుని చుట్టూ చూసా.. ఏదో చిన్న ఊరులా ఉంది ,అక్కడ అక్కడ ఇళ్ళు ఉన్నాయి ..ఇంకా లోపలకు వెళితే ఎక్కువ ఇళ్ళువస్తాయేమో అనుకున్నా.. మిట్ట మధ్యాహ్నం అయిందేమో ఎండ ఎర్రగా కాస్తుంది.

ఇక్కడనుండి రెండో వీధిలో వెళ్ళాలే .. ఇదేంటే ఊరు ఇలా మారిపోయింది..వీధులే కనబడటం లేదు అంది ..అటు,ఇటు చూస్తూ ."నీ ఎంకమ్మ అలా భయపెట్టకే బాబు కరెక్ట్ గానే తీసుకొచ్చావా" అన్నాను ..అబ్బా అలా కంగారు పెట్టకు గుడి వచ్చేసిందిగా ..ఇక్కడే అంది..అప్పుడు చూసా ...అది అమ్మవారి గుడి.. "రాములవారి గుడన్నావ్..అమ్మవారి గుడిఇది" అన్నాను ..నా నోరు తడి ఆరిపోయింది దెబ్బకు .

అదేం పట్టించుకోకుండా ఈ గుడేనే ,రాములవారి గుడి అనుకున్నట్లున్నా .. అని ముందుకు నడించింది .ఇదేనే .. కరెక్టే .. కాకపోతే అప్పటికి ఇప్పటికి కొంచం తేడా ఉంది ఊరు అంతే అంది.ఎన్నాళ్ళు అయింది నువు ఇక్కడకు వచ్చి అన్నాను అనుమానం గా ..ఒక సంవత్సరం అయిందేమో.. లత ఒక సారి తీసుకొచ్చింది అంది ..అయిపోయింది ఇప్పటివరకు ఉన్న కొంచం ఆశ కూడా పోయింది ..ఇంక దీనికేమి గుర్తు ఉంటుంది దారి ..ఇంక చేసేది ఏమి లేక దాని వెనుకే తిరుగుతున్నా..అలా తిరుగుతున్నామే కాని లత ఇల్లు మాత్రం కనబడటం లేదు.. ఎండకు భయపడి కాబోలు అందరు తలుపులేసుకుని ఇళ్ళలోనే ఉన్నారు ..

నాకు ఆకలి దంచేస్తుంది.. పాపం తనని కనీసం తిండి కూడ తిననివ్వకుండా తీసుకొచ్చేసా..ఇంక చేసేదేమి లేక ఎవరినన్నా అడుగుదాం అనుకుని తలుపు కొట్టాం ..చాలా మంది తలుపులు తెరవలేదు నాకు మొదటి సారిగా భయం వేసింది ఆ ప్లేస్ చూసి..ఒకరిద్దరు తలుపులు తెరిచినా ఎదో భాషలో మాట్లాడుతున్నారు.. అది తెలుగు మాత్రం కాదు.. ఎక్కడికొచ్చెసాం బాబోయ్ అనిపించింది..కొందరు తెలుగు మాట్లాడినా మేము చెప్పే అడ్రెస్స్ తెలియదంటున్నారు ..అందరూ భోజనాలు చేసి పడుకునే టైము అది.. అందుకని విసుగు కనబడుతుంది వాళ్ళ మాటల్లో..

నా గుండెల్లో ధడ మొదలైంది.. పెళ్ళికదా అని కాస్తొ,కూస్తొ బంగారం వేసుకున్నాం..అంగుళం మేరకు పౌడర్లతో నింపేసాం మోహాలకి ..ఇలా అందరి దగ్గరకు వెళ్ళి అడిగితే ఒంటరివాళ్ళం కదా అని యేపక్కకో లాక్కు పోతే ??? ఈ ఆలోచన చిన్నగా మొదలై ఇంకా నా మెదడును దొలిచెయడం స్టార్ట్ చేసింది.అసలే ఇక్కడ ఎవరూ పట్టించుకోవడం లేదు.. అరిచినా గీపెట్టినా ఎవరూ రారు ..అంతే ,ఇంక చాలు వెదికింది.. పదా పోదాం అన్నాను సత్యతో .. మన ఇంటికి ఎలా వెళ్ళాలో దారన్నా తెలియాలి కదా అంది ..నాకు కొపం తిట్ల రూపంలో వచ్చేసింది.. చంపేస్తా .. నోరు ముసుకూని నావెనుక రా.. మీ అత్తగారు ఊరికే తిట్టలేదు నిన్ను.. ఇలా తింగరి మంగరి పనులు చేసావనే తిట్టి ఉంటారు అని శుబ్బరంగా తిట్టి పడేసా..పాపం ఏమి అనకుండా నా వెనుకే వచ్చేసింది..అలా వెతుక్కుంటూ వెతుక్కుంటూ రొడ్ మీదకు వచ్చేసాం..

అలా రోడ్ మీదా పిచ్చి మొహాల్లా నడుస్తున్నాం .. కొంచం ముసలి వాళ్ళు దొరికితే దారి అడిగే వాళ్ళం.. కొందరు తెలియదు అనేవారు కొందరు అటు అంటే కొందరు ఇటు అనేవారు.. ఎటో తెలియకా నడుస్తునే ఉన్నాం .. అప్పుడప్పుడూ వచ్చే లారీలూ,సైకిళ్ళు తప్ప ఒక్క ఆటో కూడా కనబడదు ..సాయంత్రం అయిపోయింది కసేపటిలో చీకటి పడిపోతుంది అనే ఆలోచనే భయంకరం గా అనిపించింది.ఇంకా నయం వర్షం లేదు మా కష్టాలకి తోడుగా ..అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది..ఇంకా రాలేదు అని ..నాన్నమ్మ వీధి గుమ్మానికి అతుక్కుపోయి ఉంటుంది ..మా ఇంట్లో వాళ్ళకంటే మా వీధిలో వాళ్ళు మరీ గమనిస్తారు నా రాకపోకలు.. పనిపాటా ఉండదు..నాకు ఏడుపొచ్చేస్తుంది..ఏమికాదులేవే సత్య దైర్యం చెబుతుంది..

దూరం గా చిన్న చిన్న ఇళ్ళు ,బడ్డి కొట్ట్లు కనబడుతుంటే కొంచం ప్రాణం లేచొచ్చినట్లు అయింది..ఎవరన్నా దారి చెబుతారెమో అని..ఈ లోపల ఒకఆటోరావడం చూసి పదవే ఆటో ఎక్కేద్దాం అంది ఉత్సాహంగా సత్య..అయినా భయమే నాకు.. మొన్నే పేపర్ లో ఆటో వాడి దురాగతాలు చదివాను ...చీ ..నా ఖర్మ కాకపోతే అన్ని ఇప్పూడే గుర్తు రావాలా..నేను వద్దు అని చెప్పే లోపే తను ఆటో ఆపు చేసింది .. అడ్రెస్ చెప్పే లోపల అతను నా వైపు చూసి హే.. నీ పేరు ఫలాన ఫలానా పేరు కధా ???అన్నాడు..
ఏక వచనం తో సంబోధిన్చినందుకు కోపం వచ్చినా నా పేరు చెప్పేసరికి ఆక్చర్యపోయాను....flashbackకి వెళ్ళే ఓపిక కూడా లేదు..

హమ్మయా వీరికి ఓకరికొకరు తెలుసేమో అనుకుందేమొ ఆసరికే ఆటొఎక్కి కూర్చుంది సత్య."గుర్తు పట్టలేదానన్ను.. ఎలా గుర్తుంటాం లే .. దెబ్బలు తిన్నది మేము కదా .. కొట్టించినోళ్ళకు ఏం గుర్తుంటుంది" అన్నాడు ..ఆసరికే ఆటోలోకి లాగేసింది నన్ను సత్య..
"నేను ...ప్రసాదుని అప్పుడు మీ ఇంట్లో వాల్లందరితోను కొట్టించేవ్ కదా" అన్నాడు ఆటో నడుపుతూ..అప్పుడుగుర్తు వచ్చింది ..అదెప్పుడు సంగతీ ..నేను 7th చదివేటప్పుడు క్లాస్లీ లీడర్ గా ఉండేవాడు ..పక్క అమ్మాయితో మాట్లాడా అని నా చేతి మీదా 3 సార్లు ఫేడెల్.. ఫేడెల్ మని ఇచ్చాడు పేక బెత్తం తో లీడర్ని అనే హుషార్ లో ...

స్కూల్ మానేయడానికి దొరికిందికదా చాన్స్ అని కాస్త ఎక్కువగానే నటించేసా ఆ రోజు ..మా అమ్మ ఆ రోజు తోడికోడళ్ళ సమావేశం లో ఇంకొంచం కలిపి పాపం దాని చేయి ఇంతలావున వాచిపోయింది ..అన్నం కూడా తినలేక పోయింది అని చెప్పింది..వాళ్ళు మా చిన్నాన్నలకు రాగానే ఇంకొన్ని వేసి చెప్పారు..ఇంకేముంది మరుసటి రోజు ఒకరి తరువాత ఒకరుగా మా స్కూల్ కి రావడం ప్రసాద్ గురించి చెప్పడం..చివరకు మా నాన్న గారు వచ్చేసరికి మా హెడ్మాష్టార్ కి జీవితం మీద విరక్తి వచ్చేసి మాష్టార్ ని, ప్రసాద్ని పిలిపించి గట్టిగా తిట్టేసారు..

ఆ కోపంలో మా సార్.. నేను అల్లరి చేయకుండా చూడరా అంటే కొడతావా అని పాపం వీర ఉతుకుడు ఉతికేసారు ..మరేమయిందో తెలియదు తరువాత రోజు నుండి తను స్కూల్ రావడం మానేసాడు..అందరూ నన్ను ఏడిపించేవారు నీతో పెట్టుకుంటే బ్రతుకు బస్టేండే అని..మళ్ళీ ఇన్నాళ్ళకు కనబడ్డాడు.కనబడితే కనబడ్డాడు ..నన్ను ..నే కొట్టించిన దెబ్బలను కూడా కలిపి గుర్తు పెట్టుకున్నాడు..అసలు వీడు మంచివాడేనా ..నా మీద కసి ఏమి పెట్టుకోలేదుకదా ..నా వల్లే వాడి జీవితం ఆటొకి పరిమితం అయిపోయింది అని .. ఎవో పిచ్చి ఆలోచనలు..దారిలో ఎవరినన్నా ఎక్కించుకుని ఎక్కడికన్న తీసుకు పోయి .. రామ,రామ.. ఎటు తిప్పినా అవే ఆలోచనలా..

చూడూ దారిలో ఎవరినీ ఎక్కించుకోకు అన్నాను.. నా వైపు ఒక సారి చూసి తల తిప్పుకున్నాడు ..మాట్లాడితే తంతాననుకుందొ ఏమో సైలెంట్ గా చూస్తుంది సత్య..మెల్లిగా చీకట్లు ముసురుకుంటున్నాయి చాలా సేపైంది ఆటో ఎక్కి .. దేవుడా దేవుడా అనుకుంటూ కూర్చున్నా .అసలే అలసిపోయిందేమో చల్లగాలికి నిద్ర వచ్చేసినట్లుంది నా భుజం మీద పడుకుండిపోయింది సత్య .ఒక్కరం కూడా మాట్లాడుకోలేదు దారిలో ..దూరంగా ఇళ్ళు కనబడటం స్టార్ట్ అయ్యింది.. అంటే మా ఊరు వచ్చేసిందా? మెల్లిగా అవన్నీ నాకు తెలిసిన ప్లేస్ లాగానే అనిపించసాగాయి.. అంటే మా ఊరు వచ్చేసాం అన్నమాట.. ఒక్క సారిగా మనసు దూది పింజెలా తేలికైపోయింది..

ఎప్పుడు లేచిందో సత్య ..ఇటు వెళితే మన శ్రీ లక్ష్మి ఇల్లు వస్తుంది ,అటు వెళితే మన సరోజ ఇల్లు అంటూ నా వైపు చూసి ఆగిపోయింది ..నా మనసంతా తప్పు చేసిన ఫీలింగ్ తో నిండి పోయింది .. అయ్యో పాపం ఆపదలో దేవుడు పంపినట్లు వస్తే కనీసం ఎలా ఉన్నావ్ ..ఎక్కడ ఉన్నావ్ అని కూడా అడగలేదు ..అర్దం పర్దం లేని అనుమానానలను వేసుకుని..ఇంత సేపయ్యాకా ఏం అని పలకరించను ?అని మధనపడ్డాను..ఇంతలో తనే అన్నాడు .. మీ ఇల్లు ఇటు అనుకుంటా కదా అని...ఆ అవును .. అక్కడ రైట్ తీసుకో అన్నాను..గుర్తులేదు మర్చిపోయా .. చాలా రోజులైపోయింది కదా .. నువ్వు మాత్రం ఏమి మారలేదు ..అలాగే ఉన్నావ్ .. అందుకే వెంటనే గుర్తుపట్టేసా అన్నాడు..సారీ గుర్తు పట్టలేకపోయాను నిన్ను అన్నాను ..ఎలా గుర్తుంటుందిలే బాగా లావు అయ్యాను కదా మీసాలు కూడా వచ్చేసాయి.. అన్నాడు నవ్వుతూ..ఈ లోపల మా ఇల్లు వచ్చేసింది .

ఆ సరికే మా అమ్మ, నాన్న్నమ్మ బయట చూస్తున్నారు నా కోసం.. ఎలాగూ అక్షింతలు తప్పవు ..ఎంతైంది అన్నాను తనతో .. భలేదానివే ఫ్రెండ్స్ దగ్గర డబ్బులేంటి.. అసలు నేను ఇటు రాను.. నువ్వు కదా అని వచ్చాను. చాలా ఆనందంగా ఉంది.. చిన్నప్పటి ఫ్రెండ్స్ కలుసుకుంటే బాగుంటుంది అన్నాడు..అప్పటికే నాన్నమ్మ ఎక్కడికెళ్ళావ్? అమ్మ భయపడిపోయింది .. అంటుంటే ..తను ఇంక మాట్లాడే సీను లేదని అనుకున్నాడు కాబోలు మరైతే నేను వెళ్తా అని నవ్వి వెళ్ళిపోయాడు ..నాకు అప్రయత్నంగా కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి.. ఆటో వీధి మలుపు తిరిగేవరకు చూస్తూ ఉండిపోయా.. మన్నించు మిత్రమా అనుకుంటూ ...

22 వ్యాఖ్యలు:

మరువం ఉష చెప్పారు...

నేస్తం, చదువుతున్నంతసేపూ, ఏవేవో జ్ఞాపకాలు. మదినొదిలి వెళ్ళం, మరుగునపడం, మమ్ము కాస్త వెలుగుచూడనీ అంటున్న కొన్ని ఇవి.

ఒకసారి pink shirt వేసుకున్న మరొకరితో కలిసి ఒక పావుమైలు నడిచేసాను, నేనేమైపోయానా అని అదే వీధికి అవతలిప్రక్క వెదుకుతున్న మా ఇంటిమనిషిని వదిలి - మరి ఇక మీ సత్యకి అక్కనే కదా!
తెలిసిన addressకి వెళ్ళటానికి పగలు, రాత్రి వ్యత్యాసం లేకుండా అదే తప్పుదార్లు పట్టి తిప్ప తీగ తొక్కివచ్చిన చందంగా నేనూ చాలా సార్లు నా పట్లవున్న అపనమ్మకాన్ని బలపరుస్తూవుంటాను. మరిక్కడా సత్యకి తాతనే కదా1
ఇక మీకు ప్రసాదు, నాకు మా నాని. మీది ఆటో, నాది కారు కథ. నిజానికి ఇంకా ఎక్కువే మా నానీ ఉదార వ్యక్తిత్వం.
కొంపదీసి మా పిల్లకాయలు నా ఆటొగ్రాఫ్ చింపి చేసిన కాగితపు పడవలు కానీ మీ గుమ్మం ముందుకొచ్చి నిలిచాయా ఏమిటి? ;)

చాలా బాగుంది మీ శైలి, శిల్పం. అభినందనలు.

నేస్తం చెప్పారు...

హ..హ్హ,,హ్హ..ఉష గారు :) నా టపా మీ ఙాపకాల తేనేతుట్టను కదిలించి మీతో పాటు నాకూ కొంత తేనేని పంచింది.. మీ వాక్య నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది అండి

సుజ్జి చెప్పారు...

:))

సుజ్జి చెప్పారు...

:)

పరిమళం చెప్పారు...

బాగుంది నేస్తం!

వేణూశ్రీకాంత్ చెప్పారు...

చాలా బాగా రాస్తున్నారు నేస్తం.. ముందంతా అయ్యో పాపం ఎన్ని కష్టాలో అనుకున్నా.. చివరికి వచ్చేసరికి మరీ ఇంత అనుమానమా అనుకున్నా. మొత్తంగా మధురమైన ఙ్ఞాపకాలని కదిలించారు.

నేస్తం చెప్పారు...

ధన్యవాదాలు పరిమళం గారు.. శ్రీకాంత్ గారు భయం వల్ల అనుమానం వస్తుందో ,అనుమానం వల్ల భయం వేస్తుందో తెలియదుగాని..నా విషయం లో అవి రెండు కలగలిపి వచ్చేస్తాయి :) thanks అండి

లక్ష్మి చెప్పారు...

Wonderful narration :) KUDOS!!!

పిచ్చోడు చెప్పారు...

హహ్హహ్హ.... నేస్తం గారూ,, మీ టపా చదివి ఒక సారి నాకూ కళ్ళ ముందు వృత్తాలు తిరుగుతున్నాయండీ అదేనండీ ఫ్లాష్ బ్యాక్. మీరన్నా నయం. నేను, మా స్నేహితులు, మా అక్క, వాళ్ళ స్నేహితులు అందరం తిరుమల కు వెళ్ళాం.
అక్కడ మా అక్క, ఆమె స్నేహితురాలు ఇద్దరూ తప్పి పోయారు. వాళ్ళు దొరికేటప్పటికి రాత్రి పన్నెండు దాటింది. వాళ్ళు దొరికేప్పటికి వాళ్ళ చేతిలో ఉన్నది కేవలం రెండున్నర రూపాయలు.
మమ్మల్ని చూస్తూనే వాళ్ళ కళ్ళలో ఆనందం,కన్నీళ్ళు కలిసిన ఒక నవ్వు....... ఇప్పటికీ మరచి పోలేను.
ఇలా ఎన్నో ఙాపకాలను తట్టి లేపి, మనసుని ఆనందంతో నింపుతున్న మీలాంటి రచయితలు, రచయిత్రులకు నా ధన్యవాదాలండీ

నేస్తం చెప్పారు...

లక్ష్మి గారు ,పిచ్చోడు గారు(క్షమించాలి ఇలా సంబోదించినందుకు..మీ పేరు తెలియదుగా )మీ అభిమానానికి నెనర్లు ..అవునండి ఆ బాధ అనుభవిస్తే గాని తెలియదు ...:)

Rani చెప్పారు...

baavundi nestham!
mee nickname inka chaala bavundani ippudu sambhodisthunte thelusthundi :)

అజ్ఞాత చెప్పారు...

:)

Wishing you a very happy and prosperous New Year

~TC

నేస్తం చెప్పారు...

ధన్యవాదాలు rani గారు.. :)
thank u same to u @tc ...:)))

అజ్ఞాత చెప్పారు...

:) baaundi.
~C

........................ చెప్పారు...

bagundi kadu chala bagundi...........

నేస్తం చెప్పారు...

మీ అభినందనలకు ధన్యవాదాలు

Sankeerthana చెప్పారు...

చాలా బాగా రాసారు నేస్తం గారూ!

చదువుతున్నంత సేపు ఏవో జ్ఞాపకాలు...

స్నేహ భావాన్ని బాగా వర్ణించారు

నేస్తం చెప్పారు...

sankeertana మీ అభినందనలకు ధన్యవాదాలు

మెహెర్ చెప్పారు...

మీ నేరేషన్ చాలా బాగుంది. ఈ పోస్టు చాలా నచ్చింది.

నేస్తం చెప్పారు...

meher గారు మీ అభినందనలకు ధన్యవాదాలు

అజ్ఞాత చెప్పారు...

ee jajipoolammayi baga rasthundani ee madhya maa friend okaru chepithe.. daadapu annee postlu chadivesanu .. kaani aa tharvahtha mee meeda naaku chaala kopam vachindandi babu.. indenti anukuntunnara .. marade .. nenu oka pani modalu pedithe inthe mari. naa pani motham apesi gatha naalugu rojuluga chaduvuthune unnanu.. ippudu gurthuku vachi choosthe naa pani chala pending lo undi... sare sare ... nenu velli naa pani chesukovali mari..bye

అజ్ఞాత చెప్పారు...

namaskarm
meku chala thanks e blog pettinanduku

endulo unnna kadhalu chusi chala anandam kaligindi
me creativity mind ki evi na joharulu

me vanta kathalu ma ammagari kuda chala istham