7, జనవరి 2009, బుధవారం

తప్పు ఎవరిదీ ???కార్తీక మాసం వచ్చిందంటే మా ఇంట్లో పిల్లలందరికీ నా మీద కోపం పీకలవరకు వచ్చేసేది..ఎందుకంటే నాకు ఆ మాసం లో అమ్మావాళ్ళతో తెల్లారకుండానే లేచి ,తల స్నానం చేసి ,చలికి వణుకుతూ ..బియ్యంపిండితో ముగ్గులు వేసి, నేతి దీపాలను నీళ్ళ పళ్ళెం లో వదులుతూ పూజ చేయాలంటే మహా ఇష్టం గా ఉండేది ..నా ఇష్టం కాస్తా మా అక్కా వాళ్ళకు యమా కష్టం గా ఉండేది . మా పిన్నులూ ,పెద్దమలూ చూసి ఊరుకుంటారా .. అదిగో దాన్ని చూసి నేర్చుకోండి .. మీరు ఉన్నారు ఎందుకూ..బారెడు పొద్దెక్కేవరకూ మంచం దిగరు .. అని ఆ మాసం అంతా తిడుతూనే ఉండేవారు..(మనలో మనమాట ..అసలు వాళ్ళను తిట్టంచడానికే సగం అలా చేసే దాన్ని అనుకోండి .. ష్..)పాపం అలా తెల్లరా గట్టానే లేవలేక ఇటు వీళ్ళ తిట్లు తినలేక నానా బాధలు పడేవారు..
అయితే మా ఇంటికి నాలుగు ఇళ్ళ అవతల సీతం పిన్ని కూతురు బంగారి ..నేనే అంటే నాకంటే నాలుగు ఆకులు .పువ్వులు ఎక్కువే తినేసింది..నేనింకా కార్తీక సొమ వారాలే చేసేదాన్ని ,అది నెల మొత్తం పూజలే..8th క్లాస్ చదువుతున్న బంగారి పేరుకు తగ్గట్టు బంగారు చాయతో మిల మిలా మెరిసిపోతూ ఉండెది ,మనిషి కాస్త పొట్టేకాని మహా కళగా ఉండేది మొహం.

ఒక సారి బంగారి మా ఇంట్కికి వచ్చి అక్కా.. రేపటినుండి కార్తీక మాసం కదా, రోజూ గుడికి వెళ్ళి దీపాలు వెలిగిస్తా ..ఈ నెల అంతా సాయంత్రాలు కాస్త గుడివరకూ తోడు రావా అని అడిగింది.ఏంటీ రోజూనా!! నా వల్ల కాదే బాబు... అయినా ఇంత చిన్న వయసులో నీకవసరం అంటావా ఈ పూజలు అన్నాను..ఏం చేయనక్కా ..మా అమ్మని చన్నీళ్ళ స్నానం చేయకూడదు అని డాక్టర్ గట్టిగా చెప్పాడు.. నేను చేయలేదంటే ఇంక తను మొదలు పెడుతుంది.. మా అమ్మ సంగతి తెలిసిందేగా ..ప్లీజక్కా ఒక్క దాన్నే వెళితే బోరు కొడుతుంది .. నువ్వురా అనేసరికి సరేలే అని ఒప్పుకోక తప్పింది కాదు..


మరుసటి రోజునుండి ఇద్దరం సాయంత్రాలు మా ఇంటికి కొంచెం దూరం లో ఉన్నశివకేశవుల గుడికి వెళ్ళడం మొదలు పెట్టాం ..రెండు రోజులయ్యాకా నేను గమనించిందేంటంటే ఆ దారిలో కొత్తగా ఎవరో ఒక అబ్బాయి మెడికల్ షాప్ పెట్టుకున్నాడు.. ఆ అబ్బాయి మమ్మల్నే చూసేవాడు అదేపనిగా మేము వెళుతుంటే ..ఇవన్నీ ఒక వయసులో సహజమే కాబట్టీ నేను గమనించనట్టు ఉన్నాను..కాని బంగారి.. అక్కా, గమనించావా ఆ అబ్బాయి మనల్నే చూస్తున్నాడు అంది..నాకు తిక్కలేసింది.. దీని వయసెంతా .. ఇవన్నీ చూడటం అవసరమా అని మనసులో తిట్టుకుని .. సరేలే మనకెందుకూ అని వేరే టాపిక్ మార్చేసా ...


మళ్ళీ రెండు రోజులు పోయాకా నాకు అర్దం అయిందేంటి అంటే ఆ అబ్బాయి బంగారినే చూస్తున్నాడు ఎంతో ఆసక్తిగా.. ఈలోపల బంగారి ..అక్కా,ఆ అబ్బాయి నన్నే చూస్తున్నాడు అక్కా అంది .. ఎక్కడ మళ్ళీ నేను నన్ను చూస్తున్నాడని అనేసుకుంటానేమో అని..
దీని ఆసక్తి తగలయ్యా అని తిట్టుకోబోయి నేను మాత్రం చేస్తున్న పనేంటి.. నేనూ గమనించానుగా .అసలు అమ్మాయిలకి అబ్బాయిలు వెనుక నుండి చూసినా ముందు అద్దంలో చూసినట్లు కనబడిపోతుంది అనుకుంటా అనుకుని ఊరుకున్నా..

అప్పటి నుండి బంగారిలో మార్పు మొదలైంది .. సరిగ్గా ఆ షాప్ దగ్గరకు కి రాగానే గల గలా మాట్లాడటం,కిల కిలా నవ్వడం చేసేది..ఈ మాటలు,శబ్దాల వల్ల అతను వేరే పనిలో ఉన్నా అది ఆపు చేసి మరీ చూసేవాడు..నాకు మహా చిరాకు వచ్చేసేది ..ఈ దిక్కుమాలిన సినిమాలు, సీరియళ్ళు బాగా చెడగొడుతున్నాయి పిల్లల్ని..అరే..దీని వయసులో నాకు ఏమీ తెలిసేదే కాదు ..ఒక సారి నేను స్కూల్ కి వెళుతుంటే ఎవరో అబ్బాయి సైకిల్ మీద అటూ ఇటూ చక్కర్లు కొడుతుంటే పాపం ఈ అబ్బాయికి ఎన్ని పనులో ..ఎన్ని సార్లు అటు ఇటూ తిరుగుతున్నాడు అని తెగ జాలి పడిపోయాను..తీరా చూస్తే రెండో రోజు సాయంత్రం ఎవరూ లేని సమయం చూసి మీరంటే నాకు చాలా ఇష్టం అండి అన్నాడు ..దెబ్బకు కళ్ళనుండి నీటి కుండలను జోరు జోరుగా ఒంపేసేసరికి అడ్రస్సు లేకుండా పారి పోయాడు.. అది వేరే విషయం అనుకోండి..

సరే చిన్న పిల్ల దీనికి అంటే బుద్దిలేదు .. లోకం తెలియదు..వీడి బుద్ది ఎందుకు గడ్డితింది.. దానికంటే కనీసం 12 ..13 యేళ్ళు పెద్దవాడుంటాడు ,ఆడపిల్ల కనబడితే చాలు వయసు వరసా తెలియదు వెదవలకి అని తిట్టుకున్నాను..ఆ విసుగు అంతా కోపం రూపం లో బయటకు వచ్చేసేది..ఎహే .. ఎందుకంత గట్టిగా మాట్లాడుతావ్ నెమ్మదిగా మాట్లాడు అనో,అబ్బా కాస్తా మెల్లగా నవ్వచ్చుగా అనో తిట్టేదాన్ని..
ఒక్కోసారి ఈ కోపానికి కారణం వాడు బంగారిని చూస్తున్నాడనా???..లేక నన్ను చూడటం లేదనా అనే అనుమానం కూడా వచ్చి చచ్చేది .. నా అంతరాత్మకు నా మీదా అస్సలు నమ్మకం ఉండి ఏడవదు ..


ఇదిలా ఉండగా మరో రెండు రోజులకు మెల్లిగా ఇద్దరు ఫ్రెండ్స్ తయరయ్యారు వాడికి ..అప్పటి వరకూ యే మూలన ఉండి ఏడుస్తారో గాని ఇలాంటి విషయాల్లో భలే వచ్చేస్తారు.. చెల్లీ... బావా అని దిక్కుమాలిన వరసలు కలుపుకుంటూ .. వీళ్ళ ఫ్రెండ్స్ మీద వీళ్ళకే నమ్మకం ఉండదనుకుంటా అందుకే చెల్లి ని చేసేస్తారు అర్జెంటుగా కసిగా తిట్టుకున్నా ..అదిగో నేను అనుకున్నట్లుగానే అయింది .. ఒక సారి వస్తుంటే వారిలో ఒకడు ..ఎంతైనా చెల్లెమ్మ కళే వేరురా ,వస్తుంటే లక్ష్మీ దేవి నడిచి వస్తున్నట్లుగా ఉంటుంది అన్నాడు ..ఛా ..అనుకుని క్రీగంట బంగారిని చూసాను ..తల వంచుకుని కనబడకుండా ముసి ముసి నవ్వులు నవ్వేసుకుంటుంది..నాకు భయం వేసింది .. ఇలాగే కొనసాగితే కొన్నాళ్ళకు ప్రేమా దోమా అని అనడం ఖాయం..అందుకే దానికి దారంతా తల్లిదండ్రులు మనకోసం పడే కష్టాలు.. బాగా చదువు వలన వచ్చే లాభాలు .. ఇలాంటివి పని గట్టుకుని మరీ చెప్పేదాన్నీ.. చక్కగా ఇటు నేను చెప్పేవన్ని చిలకలా వినేది అటు చూస్తునే ఉండేది..

ఆ మరుసటి రోజు చక్కగా పరికిణి ,వొణి వేసుకుని తన బారు జుట్టు వదులుగా జడ అల్లుకుని వచ్చింది .. చెప్పద్దూ భలే ముచ్చటగా ఉంది.. కొంచం పొడవుగా 18 ఏళ్ళ అమ్మయిలా కనబడుతుంది..అది ఏంచేసినా నాకు మహా కోపం వచ్చేస్తుంది నాకు .. అక్కా బాగున్నానా అంది ..తెగ సిగ్గు పడిపోతూ ..ఇప్పుడు ఇదెందుకేసుకున్నావ్ .. అక్కడ నేల అంతా చిత్తడి పుత్తడిగా ఉంటుంది.. పాడై పోతుంది .. వెళ్ళి డ్రెస్ వేసుకునిరా అన్నాను.. ఎంత వద్దు అనుకున్న కోపం తొంగి చూసేస్తుంది నా మాటలో ..అది పట్టించుకోకుండా ..అక్కా .. మా అమ్మ చెప్పులేసుకున్నా బాగున్నాయా అంది దాని హై హీలు చూపిస్తూ..అదన్న మాట సంగతి అందుకే అంత పొడవు కనబడుతుంది..
అసలు నీకో విషయం తెలుసా ఎత్తు చెప్పులేసుకుంటే నడుము నెప్పి..వెన్ను నెప్పి వస్తుంది అందుకే నేను వేసుకోను అన్నాను..ఈ లోపల మా అక్క వచ్చింది .. ఎవరూ మన బంగారే!! ఎంత బాగున్నవే బాబు.. అంది.చూడక్క హీలు వేసుకుంటే నడుము నెప్పివస్తుంది అంటుంది అంది నావైపు చూస్తూ..దాని మొహం ..దానికి అలా నడవడం చేతకాదు.. నేను వేసుకోవడం లేదేంటి.. నువ్వు ఇలా కంటిన్యూ అయిపో నా మాట వినీ అంది..సర్లే నా పరువు పోయేలా ఉంది అని ఇంక బయలు దేరా..

ఆ రోజు ఆ అబ్బాయి మొహం చూడాలి సుర్యా బల్బు లా ఎలా వెలిగిపోయిందో..అసలు ఆ చూపుల్లో భావాలు నాకర్దం కాలేదు..ఇంక విసుగొచ్చి బంగారి మనం వేరే వీదీ లో వెళదామే ఈ రోడ్ అంతా గతుకులే అన్నాను..అక్కా ఇదే బెటెర్ .. దగ్గర అంది ..ఇంక నిన్ను బాగు చేయడం నావల్ల కాదు అని ఊరుకున్నా..ఇక అది పరికిణి,వోణీ లకు పరిమితం అయిపోయింది..

ఒక రోజు మా కాలేజ్ నుండి వస్తుంటే ఆ అబ్బాయి ఫ్రెండ్స్ కనబడ్డారు..మనకెందుకులే అనుకుని నేను వెళుతుంటే .. నా వైపుకొచ్చీ చెల్లెమ్మ మీ ఫ్రెండా అండీ అన్నాడు..నేను కోపం గా ఒక్క చూపు చూసా.. అయినా పట్టించుకోకుండా చెల్లెమ్మ పేరేమిటండీ అన్నాడు ..
నాకోపక్క భయం గా కూడా ఉంది .. మా ఇంట్లో చిన్నానలో, తమ్ముళ్ళో ఎవరో ఒకరు దారిలో నాకు కనబడుతునే ఉంటారు.. మల్లీ ఇదో ఇష్యూ అవుతుంది .అయినా కోపం తట్టుకోలేకా మీకో విషయం తెలుసా వాళ్ళ నాన్న S.I అన్నాను ..అన్నాక గాని సిగ్గువేయలేదు.. చిన్న పిల్లలకు బూచివస్తాడు అన్నం తినమ్మా టైపులో అలా అంటే వాళ్ళు ఎలా నమ్ముతారు ..అవునా అండీ..యే ఏరియా.. వీళ్ల నాన్న గారు కూడా s.I నే.. అన్నాడు..పక్కోడిని చూపిస్తూ..వాళ్ళు నన్ను ఆట పట్టిస్తున్నారో లేదా నిజమో తెలియదుకాని నాకు పోలీసు ని చూస్తేనే మహా భయం..ఇంక ఇంటికి పరుగులాంటి నడకతో వచ్చేసా.

ఆ తరువాత బంగారికి చెప్పాను నీ గురించి ఇలా అడుగుతున్నారు .. వాళ్ళ ఫ్రెండ్ నాన్న అసలే s.i అంటా అని ..అది కూడా భయ పడినట్లు ఉంది దెబ్బకు అక్కడికొచ్చేసరికి ఏమీ మాట్లాడకుండా తల వంచుకునేది..ఎమైందో తెలియకా ..కిలకిలలు,గల గలలు ఆగిపోయే సరికి నా వైపు అనుమానం గా చూసేవారు..

ఒక రోజు మేము వస్తుంటే ఆ అబ్బాయి గభ గభ గా షాప్ దిగి మా ఎదురుగా వచ్చాడు..ఇద్దరికి గుండెల్లో ధడే.. చెల్లెమ్మా అన్నాడు.. నా వైపు చూసి కాదు బంగారిని చూసి .. నేను నోట మాట రాకా అలా చూస్తూ ఉండిపోయా ..soRRy అమ్మా ఇలా పిలచ్చో లేదో ..మా చెల్లి నీకు లాగే ఉంటుంది ..అతని గొంతు గద్గద మయ్యింది..(మరేం అయిందో..?) వేరేగా అనుకోకమ్మా అని వెళ్ళి పోయాడు.

నాకు పాతాళం లోకి కూరుకుపోతున్నట్లు అనిపించింది..చీ ఎంత తప్పుగా ఆలోచించాను..ఒక అమ్మాయిని అబ్బాయి చూస్తే ఇంక అదేనా?ప్రస్తుత సమాజం లో పరిస్తితి బట్టి అలా ఆలోచించానా?లేకా నా ఆలోచనలే సరిగా గా లేవా??.. ఇంకెప్పుడూ అనవసర విషయాలు అతిగా ఆలోచించకూడదు అనుకున్నా.. ఆ రోజంతా ఎదో బాధగా అనిపించింది.. మరుసటి రోజు వెళుతుంటే అక్కా ఈ వీది లో నుండి వద్దు వేరే వీది నుండి వెళదాం అంది బంగారు..ఎందుకు అని అడగలేదు,, ఎందుకంటె ఎక్కువగా ఆలోచించడం మానేసి నేను చాలా సేపయ్యింది ..

23 వ్యాఖ్యలు:

సిరిసిరిమువ్వ చెప్పారు...

మీ కథలన్ని భలే ట్విస్టులతో వుంటాయండి.

మరువం ఉష చెప్పారు...

అయినా తప్పు నీది కాదులే నేస్తం. మననలా తయారుచేస్తున్న మిగిలిన మగ పుంగవులదీనూ, లేదా ఈ సమాజానిదీనూ, అథమం మరీ స్పందించి అతి ఆలోచనలు చేసే మన మనసుదీన్ను. అయినా పశ్చాత్తాపపడ్డాక ఇక అది తప్పేంకాదని మా నానమ్మ చెప్పింది. కనుక తప్పులు చేయొచ్చు తిరిగి అవే చేయనంత కాలం ఇదో పరిహారం ;)

karthik చెప్పారు...

ప్రస్తుత సమాజం లో ఒక అబ్బాయి అమ్మాయి ని చూస్తున్నాదు అంటే, మనం ఒకే రకంగా ఆలోచిస్తాం. చిన్నప్పటి నుంచి చూసిన సినిమాలు, మరియు మన చుట్టు పక్కల సంఘటన్లు మనల్ని అలా చేశాయి.

-కార్తీక్

నేస్తం చెప్పారు...

అంతే అంటారా ఉష గారు..అయితే o.k ..మువ్వ గారు :) మీ అభిమానం.. జీవితమే మలుపుల మయం కదండి ..

లక్ష్మి చెప్పారు...

వరూధినిగారి కామెంటే నా కామెంటూ.... అమ్మో మీ కథలన్నీ ఒక మంచి పుస్తకంలా రాసేయచ్చండీ నేస్తంగారు

Sarath చెప్పారు...

కిల కిలలూ, గల గలలూ అని భలే రాసారు. మీ తెలుగు వాడకం చక్కగా ఉంది.

నేస్తం చెప్పారు...

అవును కార్తీక్ గారు అమ్మాయిలూ అబ్బాయిలూ అనేవాళ్ళు ప్రేమ కోసమే పుట్టారు అనేదాని లో యువతే మార్పు తేవాలి .. లక్ష్మి గారు మీ అభిమానానికి ధన్యవాధాలు అండి ..శరత్ గారు నెనర్లు :)

GIREESH K. చెప్పారు...

:)))))

సుజ్జి చెప్పారు...

well writen . comeady tho paatu sandesam kooda baagundi.

నేస్తం చెప్పారు...

gireesh gaaru :).. sujji thanks :)

Kottapali చెప్పారు...

హ హ హ. బాగుంది.
మే కథ చెప్పే తీరు కూడా బాగుంది. మీరు పర్లేదు అనుకుంటే కొన్ని సూచనలు.
1. వాలు అచ్చు (italics)లో మొత్తం పాఠం చదవడం కష్టం.
2. మొదట్లే పేరాలు బానే ఉన్నాయి గానీ, రాను రాను ప్రతి వాక్యము కొత్త పేరాగా మొదలవుతూ వచ్చింది. ఇలా ఉంటే కూడా చదవడానికి కష్టమే. కథని పేరాలుగా విభజించుకుని రాయండి. పేరాకి మూడు నాలుగు వాక్యాలుంటే నిండుగా ఉంటుంది.

Padmarpita చెప్పారు...

ఒక్కో కధతో ఒక్కో మెట్టూ ఎక్కుతున్నారు నేస్తం.... Keep it up.....

నేస్తం చెప్పారు...

కొత్త పాళి గారు మీ సూచనలు తప్పకుండా పాటిస్తాను ..ధన్యవాధాలు.. పద్మార్పిత గారు thanksఅండి

వేణూశ్రీకాంత్ చెప్పారు...

నేస్తం, నేను మరి అమాయకంగా అడుగుతున్నాను అనుకోకపోతే మీ కధలు నిజం గా నిజాలేనా... ఇవేవో శ్రద్దగా మంచి ట్విస్ట్ లతో ఏ కాశీమజిలీ కధలు లాంటి పుస్తకమో రాసే క్రమంలో రాస్తున్నవేమో అని అనిపిస్తుంది. అంత బాగా చెప్తున్నారు. కానీ మొత్తానికి మళ్ళీ అనుమానం భయం కలిసి వచ్చేసాయనమాట. S.I super.

నేస్తం చెప్పారు...

శ్రీకాంత్ గారు చాలావరకు నిజంగా జరిగినవే.. స్వాతి గురించి రాసినవన్ని మొత్తం నిజాతి నిజాలు .. మిగిలిన వాటిలొ హాస్యం కాస్త జోడించినా అవి కూడా జరిగిన సంఘటనలే .. కాక పోతే అసలు విషయాన్ని సాగ దీసి ఒక కధలా రాస్తున్నా :)మీకు అబినందనలు ఇప్పూడే చదివా మీ వ్యాసం నవ్యలో పడటం :)

వేణూశ్రీకాంత్ చెప్పారు...

ఏదేమైనా మీరు చాలా బాగా రాస్తున్నారు నేస్తం, కధ చెప్తున్న పద్దతి చాలా బాగుంది..

మీ అభినందనలకు నెనర్లు... నా చేత అటువంటి టపా రాయించేలా ఙ్ఞాపకాలను పంచిన మా నాన్నకి చెందాలి ఈ అభినందనలు అన్నీ...

అజ్ఞాత చెప్పారు...

Your stories (orzinal) are very good.painting seletion is opt.

Try another template for more working space (line length will increase).

anveshi చెప్పారు...

:D :D :D bAvundi !

నేస్తం చెప్పారు...

anveshi :D... arunaaku gaaru thanks andi :)

అజ్ఞాత చెప్పారు...

hehe..baaundi :)
naa criminal mind ki doubt kuda vachindi..nijam ga ye durbudhhi(kshaminchali) lekundaane aa abbai unnada mari emaina bhayapadi chellemma anesaada aakhariki ani..
edi emaina..baaundi :)
~C

నేస్తం చెప్పారు...

నాకు మాత్రం రాలేదేంటి :P ష్.......

కన్నగాడు చెప్పారు...

ఈ కథలో ఎంతవదకు నిజముందో తెలీదు కాని కథ వరకైతే బాగుంది. ఇది నిజమైతే ఆ చివరి సన్నివేశంలో మీరున్నారు కాబట్టి అతడు చెప్పింది నిజమో కాదో మీరే బాగా నిర్ణయించగలరు, నా మటుకు ఎస్. ఐ. అనే మాట పనిచేసిందనిపించింది.

నేస్తం చెప్పారు...

మీరు చెప్పింది కూడా కరెక్టే అయి ఉండచ్చు.. :) నేను నేరుగా అతని మొహం లో చూడలేదు కాబట్టి నిజం అతని మనసుకే తెలియాలి.. ధన్య వాధాలు కన్న గారు :)