
ఎప్పుడైతే వాడు నావైపుకు తిరిగాడో ఓరి దేవుడోయ్ అనుకుని నేను సువర్ణ వెనకాతలకు వెళ్ళిపోయాను ,వాడి ఫ్రెండ్స్ నా భయాన్ని చూడగానే హి.హి..హి అని ముప్పై ఆరు పళ్ళూ బయట పెట్టి నవ్వారు,మరీ ఎక్కువ నటించేయకు నువ్వు అని నన్ను అని మళ్ళీ దాన్నీ బ్రతిమాలడటం మొదలెట్టాడు..నాకు అంత ఉక్రోషం,కోపం లోనూ వాడు గబుక్కున గుర్తు వచ్చేసాడు..
వాడు బాబ్జీ గాడు ,నా 5వ తరగతిలో నా క్లాస్ మేట్ ,చిన్నపుడు తెల్లగా బూరె బుగ్గలేసుకుని క్లాసులో వెనుక బెంచీలో ఎవ్వరితో మాట్లాడకుండా ఒక బుక్ ముందేసుకుని ఒక్కడే కూర్చునేవాడు..వాడు నిజంగా చదువుతున్నాడో మరి కళ్ళు తెరిచే నిద్రపోయేవాడో తెలియదుగాని మా తెలుగు మేస్టారుకి మాత్రం మహా ఇష్టం వాడంటే ...ఎందుకో నాకూ తెలియదు.. వాడురా నిజమైన విధ్యార్ది అంటే ,నేటి బాలలే రేపటి పౌరులు ,వీడిలాంటి పౌరులే దేశానికి వెన్నుముక ,గాడిదగుడ్డు..కంకరపాసు అని రోజూ వాడిని పొగడకుండా ఉండేవారు కాదు,బాబ్జీ ఇల్లు మా ఇంటి దారిలోనే కాబట్టి తరచూ చూస్తునేదాన్ని ,తరువాత నేను స్కూల్ మారాకా మద్య మద్య లో కనబడేవాడు..మళ్ళీ ఇన్నాళ్ళకు ..మనిషి ఏ మాత్రం గుర్తుపట్టకుందా పొడవు ,లావు పైగా చేతులకు నాలుగు ఉంగరాలు, మెడలో గొలుసు ఒక హీరో హోండా ..ఎలాంటి బాబ్జీ ఎలా అయిపోయాడు.. ఇప్పుడు గనుక మా తెలుగు మాస్టారు చూస్తే ఏమయిపోయేవారో అనిపించింది ..
వీదిలో మా వాళ్ళేమైనా వస్తున్నారేమో అని అటు ఇటు చూస్తూ నడుస్తున్నా ...ఇదిగో గుర్తుంది కదా 29 ,బాగా గుర్తు పెట్టుకో నేను మాట మీద నిలబడే మనిషిని అని ఒకటికి రెండు సార్లు అని దాని చేతిలో లెటెర్ పెట్టి మరీ వెళ్ళిపోయాడు ,వాడు వెళ్ళాక హమ్మయ అని ఊపిరి పీల్చుకుని ఏమే వాడు బాబ్జీ గాడు కదా అన్నాను ..నీకెలా తెలుసు అంది .. వీడితోనె చదివి ఏడ్చానులే చిన్నపుడు,నీకెలా తెలుసు ఇంతకీ అన్నాను ..మాటల్లోనే వాళ్ళింటికొచ్చేసాం ..
నాకో ఫ్రెండు ఉందిలే లలిత అని ,దానికి వాసూ అని బోయ్ ఫ్రెండ్ ఉన్నాడు. వాడికి వీడు ఫ్రెండు ,అయితే మా ఇద్దరికీ ఇంకో ఫ్రెండు ఉంది ఆ అమ్మాయిని వీడి ఫ్రెండ్ ఏడిపిస్తుంటే నేను వాడితో గొడవపడ్డాను.. అప్పుడు వీడు వాడి వైపూ నేను ఆ అమ్మాయి వైపూ వెళ్ళి తిట్టుకున్నాం ..అప్పటి నుండి నా మీద కక్ష్య గట్టీ ఇలా ఏడిపిస్తున్నాడు అంది (ఇప్పుడు మీకు ఎంత అర్దం అయిందో నాకూ అంతే అర్దం అయింది అప్పుడు)నాకు చిరాకొచ్చింది ,అయినా నీకు పనీ పాట ఏమీ ఉండదా అందరి విషయాల్లోకి వెళతావ్ ,ఎవరు ఎవరిని ఏడిపిస్తే నీకేంటి,ఇప్పటికే నీ గురించి ఎంత బేడ్ గా చెపుతున్నారో తెలుసా ఈ అబ్బాయిలు బయట అన్నాను ..
అది నా వైపు కోపం గా చూసింది ,రేపు నిన్నెవరన్నా ఏదన్నా అంటే ..నేను నీకులా నాకెందుకు అని ఊరుకోను ,ఫ్రెండ్స్ అన్నాకా కాస్తా వేల్యూ ఇవ్వాలి ,అడ్డమైనోళ్ళకీ భయపడాల్సినపనిలేదు అంది... నాకు మనసులో గుచ్చుకుంది కొంచెం ..దొంగవెదవ యే ఫ్రెండ్ దగ్గరో బెట్ కాసి ఉంటాడు నన్ను పడేస్తానని అందుకని ఇలా చంపుతున్నాడు ,వాళ్ళ నాన్న సారా కాంట్రాక్టర్ లే ,అందుకే కొవ్వు పట్టి ఏడుస్తున్నాడు ,చూసావా పోలీసులన్నా లెక్క లేనట్లు ఎలా మాట్లాడుతున్నాడో అంది . ..ఏడ్చాడులే నిన్ను భయపెడదామని ..వంటి మీద ఆడపిల్లలా ఆ బంగారం చూసావా ..వీడు సామాన్యుడు కాదే బాబు ..అవి చూసి ప్రేమించేస్తారనుకున్నట్లున్నాడు .. . అన్నాను ,
ఈ లోపల అది లెటెర్ ఓపెన్ చేసింది మొత్తం అలికేసినట్లు ముద్దగా ఉంది ఏమి అర్దం కావడం లేదు ... ఎందుకే ఇలాంటివన్నీ రాస్తారు ,కనీసం రాసిందేంటొ అర్దం కాకుండా అన్నాను ,వాడి మొహం ఇంకు తో రాసింది మాత్రం అర్దం అయి చచ్చిందనుకున్నావా.. ఉండు చూపిస్తా ఎందుకైనా మంచిదని కొన్ని దాచా అని ఒక లెటెర్ తెచ్చి ఇచ్చింది .. రెండు లైన్లు చదివేసరికి నాకు అరగంట పట్టింది.. నాకు మళ్ళీ మా తెలుగు మాస్టార్ గుర్తు వచ్చారు... వీడి కంటే వీడు ఇచ్చిన లెటెర్స్ భరించలేకపోతున్నానే బాబు,అవి చదువుతుంటే ఒక్కో సారి నా మీద నాకే జాలేస్తుంది అంది.. నేను పడి పడి నవ్వా ..
ఉన్నట్లుండి ఏమై చచ్చిందో రక్తం తో మొదలెట్టాడు.. నేను ఒప్పుకునే వరకూ బ్లెడ్ తోనే రాస్తాడంట ,ఆ చేతి మీద ఆ ప్లాస్టర్లు చూసావా ,వీడికేమైనా అయితే నాకు చుట్టుకుంటుంది అంది దిగులుగా .. వాడి మొహం ,నమ్మేస్తున్నావా.. రోజు యే కోడి నో మేకనో వేసేస్తున్నట్లున్నాడు .. ఏం కాదులే అన్నాను... అది కాదే ఈ నెల 29 వరకూ చూస్తాడంట ఆ రోజు ఒప్పుకోకపోతే చస్తా అని బెదిరిస్తున్నాడు ,పైగా నేనే కారణం అని చెబుతాడంట అంది ...ఈ సారి దానితో పాటు నాకు భయం వేసింది ,యే ఫ్రెండ్ ప్రోద్భలం తో అన్నా అలా చేయడానికి ట్రై చేస్తే అని, కాని బయటకు చెప్పకుండా ..ఇలాంటి సినిమా కధలు చాలా చూసాం .. నమ్మకే ,అంతా ఒట్టిదే భయపెట్టడానికి అన్నాను.. మాములుగా అయితే భయ పడేదాన్ని కాదు మా అక్క పెళ్ళి కుదిరింది కదా ,వీడి బెదిరింపులు చూస్తుంటే ఒక్కోసారి భయం వేస్తుంది ,మాటంటే మాటే ..నా సంగతి నీకు తెలియదు నేను మహా మూర్ఖుడిని అని హింసపెట్టేస్తున్నాడు, చెప్పుకోడానికి కూడా ఎవరూ లేరు .. అక్క పెళ్ళి ఎలాగు అమ్మమ్మ ఇంటి దగ్గర కదా అక్కడకు వెళ్ళిపోయింది అంది దిగులుగా ..
పోనీ ఇలాంటివి ఎంత కాలం దాస్తావ్ ,మీ అమ్మగారికి చెప్పేసేయి ఎందుకైనా మంచిది అన్నాను... ఎక్కడే తను ఇంటికొచ్చేసరికే రాత్రి అయిపోతుంది ,పైగా ఒక్కరే పెళ్ళి పనులు చూసుకోవాలి..ఇప్పుడు ఇలాంటివి చెపితే ఏమన్నా ఉందా అంది.. సరే కంగారుపడకు ఏం కాదులే కొన్నాళ్ళు తిరిగి వాడే పోతాడులే అనేసి ఇంటికి వచ్చేసాను ..కాని నాకు దానికంటే ఎక్కువ భయం పట్టుకుంది .. అలా చేస్తాడేమో ,ఇలా చేస్తాడేమో అని ఒకటే ఆలోచనలు ...అందులోనూ ఫ్రెండ్స్ కి వేల్యూ ఇవ్వాలే అని అది అన్నమాటలొకటి గుచ్చుకునేవి పోనీ నాన్నకు చెపితే వాడి పని నాన్న చెబుతారు ,చిన్నపుడు ఒకసారి ట్రైన్ లో ఒక అమ్మాయిని ఎవరో అబ్బాయి ఏడిపిస్తే వాడి వీపు చెళ్ళూమనిపించారు ,అప్పటి నుండి నాన్న నాకు హీరో లా కనబడేవారు..కాని ఇప్పుడు ఏమని చెప్పను?? ఇది అడ్డమైన గోడవల్లో ఈ సమస్య తెచ్చుకుందని చెబితే ముందు నన్ను తిడతారు ఇలా సాగిపోయేవి నా ఆలోచనలు ..
రోజూ కాలేజ్ కి వచ్చినపుడు దాన్ని అడిగేదాన్ని ఇంకా ఏడిపిస్తున్నాడా ,ఇంకా లెటెర్స్ ఇస్తున్నాడా అని ..చివరకు 29 వచ్చేసింది ఆ రోజు అది కాలేజ్ కి రాలేదు .. ఆ మరుసటి రోజుకూడా .. ఇంక చూసుకోండీ నాకు టెన్షన్ .. వాడి బాధ పడలేక మానేసిందా లేక నిజం గా ఏదన్నా చేసుకున్నాడా వాడు ..ఉండబట్టలేక మరుసటి రోజు వాళ్ళింటికి వెళ్ళాను .. నేను వెళ్ళేసరికి ఫుల్ల్ జ్వరం తో ఉంది ....ఎవరూ లేరు ఇంట్లో .. నన్ను చూడగానే వాడికి ఇష్టం అని చెప్పేసానే అంది ఏడుస్తూ ,అదేంటే ఎందుకు అలా చెప్పావ్ అన్నాను సగం అర్దం అయి కానట్టు ఉంది ... 29 న బ్లేడ్ పట్టుకుని మరీ వచ్చాడంట చెప్పకపోతే ఇక్కడే నరం కోసేసుకుంటా అని,ఒకవేళ ఫ్రెండ్ ఎవరితో అన్న బెట్ కాసేడేమో చెబితే పీడా పోతుంది అని ఒప్పేసుకుంది అంట ... ఇంక అక్కడి నుండి పెళ్ళెపుడు ,లేచిపోదామా అని ఇంటి చుట్టూ అరుస్తూ తిరుగుతున్నాడంట ,వీదిలో వాళ్ళందరూ ఏమనుకుంటారే అంది ..నాకేం చెప్పాలో అర్దం కాలేదు.. మా నాన్నగారికి చెపుతా భయపడకు.. వాడిని బాగా తంతారు అని ఎదో ధైర్యం చెబుతున్నా గాని ఇవన్నీ జరగని పనులని తెలుసు ...
అది కళ్ళు తుడుచుకుని నేను ఇంక కాలేజ్ కి రానే మా అక్క పెళ్ళి అయ్యేవరకు,ఆ తరువాత చెప్తా వాడి పని,నేనే చంపేస్తా వాడిని అని కసేపు అంటుంది కసేపు దిగాలుగా అయిపోతుంది ... సరిగ్గా అప్పుడు వచ్చారు వాళ్ళ అమ్మమ్మ గారు .. దీని ఏడుపు చూడగానే ఏమైంది అని కంగారుగా అడిగారు.. నేను,అది ఒకదానికి ఒకటి సంభందం లేకుండా మాట్లాడేసి సర్ది చెపుతున్నాం,అవిడ నమ్మీనమ్మనట్లు చూస్తుంది .. నాకెందుకొచ్చిందో ధైర్యం ఉన్నట్లు ఉండి ..ఇలా నానిస్తే పెద్ద గొడవలు అయిపోతాయేమో అనిపించింది అసలే ఎదర పెళ్ళి ఒకటి ఉంది బోలెడు అప్పులు చేసారు పైగా.. అందుకే కొన్ని కొన్ని కట్ చేసి వాడు ఏడిపించడం ,పెళ్ళి చేసుకుంటా అని వేదించడం వరకూ చెప్పేసాను..
అంతా విని ఆమె నాకులా ఆవేశపడిపోలేదూ ,దాన్ని తిట్టనూలేదూ .. ఏం చేస్తున్నాడు లెటెర్స్ ఏమన్నా ఉన్నాయా లాంటివి అడిగీ వాళ్ళ ఇల్లు చూపిస్తావా అమ్మా అని అడిగారు,ఒక పక్క మా ఇంట్లో తెలిస్తే అని భయం గా ఉన్నా ఆ మాత్రం కష్టం లో ఫ్రెండ్ ని ఆదుకోపోతే ఎలా అని సరే అండి అన్నాను .. దారంతా ఆలోచనలే ఈవిడ మాటలు వాళ్ళు లెక్క చేస్తారా,వాళ్ళు గాని ఇలా అంటే మేము అలా అనాలి ..వాడు రాసిన లెటెర్స్ చూపించాలి ,బెదరకూడదు,తడబడ కూడదు ,తప్పు వాడిదే అని తేల్చి మళ్ళీ వెనుక పడకుండా చూడాలి ఇలా యమా సీరియస్సుగా ఆలోచిస్తున్న నాకు ఆ పసుపు రంగు చీర కు పచ్చ బోర్డర్ ఉంటే ఎంత బాగుంటుందో ,ఆవిడ ఎరుపు రంగు వేసుకుంది అన్న మాటలకు ఈ లోకం లో వచ్చాను .. నాకు ఇదివరకు పోచంపల్లి లో అలాంటి డిజైన్ ఉండేది.. ఆ పారిజాతం పూల చెట్టు ఉన్న ఇల్లు చూసావా ఆవిడకు ఎంత గోరోజనం అనుకున్నావ్ పూలన్నీ నేల పాలు చేస్తుంది గాని బయట వాళ్ళకు ఒక్క పువ్వు ఇవ్వదు , ఇక్కడంటే పూలకు కరువు గాని మా ఊర్లో పారిజాతలు,సన్నజాజులు,కనకాంబరాలు,మందారాలు,నిత్యమల్లులు లేని ఇల్లు ఇల్లుకాదనుకో ....అంటూ పెళ్ళికో ,పేరాంటానికో వెళుతున్నంత కూల్ గా వస్తున్న ఆవిడను చూసి నాకు మాట రాలేదు ...దారంతా ఇదే సోది ..
చివరకు వాళ్ళింటి కొచ్చాం ... ఇల్లు పెద్దదే ..ఉయ్యాల బల్ల కూడా పెద్దది బాగుంది అన్నారు లోపలికి వస్తూ .. ఈ లోపల బాబ్జి వాళ్ళ అమ్మగారు బయటకు వచ్చారు.. ఈవిడ పలాన పలాన అని పరిచయం చేసుకున్నారు.. ఆవిడ ఏమనుకుందో లోపలికి రండి అంది పిలాలా, మానాల అన్నట్లు..లోపలికి వచ్చాకా మమ్మల్ని చూడగానే బాబ్జిగాడి గుండెల్లో కిలో రాయి పడిపోయింది ..నాకు వాడి మొహం లో భయం చూడగానే ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది..ఆవిడకు మాత్రమే వినిపించేలా వాడే వాడే అన్నాను.. అదిగో అబ్బాయి కూడా వచ్చేసాడు .. ఏమీ లేదమ్మా మీ అబ్బాయికి మా మనవరాలు నచ్చిందంటా ,రోజూ ఇదిగో రక్తం తో కూడా లెటెర్స్ రాసి ఇస్తున్నాడు.. చూసావా ఆ చేతినిండా ఆ ప్లాస్టర్స్ ..నిన్న చేయి కూడా కోసుకోబోయాడంట ..చివరకు మా పిల్ల ఆపింది కాని ఏమయ్యి ఉండేది ఆవిడ అదే కూల్ గా మాట్లాడుతుంది ...
బాబ్జి వాళ్ళ అమ్మ ఏం మాట్లాడాలో తెలియక ఏమ్రా ,నిజమా అని నిలదీసింది ...దాని సంగతి నీకు తెలియదమ్మా..దానికి నేను అంటే ఇష్టం వాడేదో అర్దం పర్దం లేకుండా పొగరుగా మాట్లాడుతున్నాడు..పోనీలేమ్మా అబ్బాయిని అనడానికేముంది ఈ కాలం పిల్లలందరూ అలాగే ఉన్నారు.. చివరకు మా పిల్ల కూడా ఇష్టపడింది అని చెపుతున్నాడు కదా.. మా పెద్ద మనవరాలి పెళ్ళి కుదిరిందీ ,పిల్లలు ఎలాగూ ఇష్టపడుతున్నారుగా మాకు కుల పట్టింపు పెద్దగా లేదు జాతకం ఇస్తే ఒకేసారి ముహర్తం పెట్టించేస్తాము ...ఖర్చులో ఖర్చు ... పెళ్ళయ్యాక చదువుకుంటారు తప్పేముంది తేలిగ్గా అనేసింది ఆవిడ ...నాకు సౌండ్లేదు ..అటు బాబ్జి వాళ్ళమ్మ ఏం మాట్లాడుతున్నారు మీరు, మీ వయసుకు మర్యాద ఇస్తుంటే... ఆయన్ని పిలిపిస్తాను ,విషయం తేల్చెస్తారు అని ఫోన్ తీసి ఫైటింగ్ మొదలు పెట్టేసింది .. నేను చల్లగా వచ్చేసాను అక్కడినుండి..
ఆ తరువాత ఏమైందో ఏంటో నాకు తెలియదు మళ్ళీ సోమవారం కాలేజ్ కి వెళ్ళాక సువర్ణను అడిగాను ఏంటే ఆవిడ పెళ్ళి కుదిర్చేసారా అని.. ఏం పెళ్ళీ అంటుంది తెల్లబోయి.. మొన్న ఇలా జరిగింది అంటే... అవునా, మాకేం చెప్పలేదే ,వెళ్ళి వాళ్ళకు విషయం చెప్పి వచ్చాను అన్నారు అంతే అంది ...నాకిప్పటికీ మిస్టరీయే అక్కడేం జరిగిందో అని,ఒక వేళ వాళ్ళను భయపెట్టడానికి అలా అన్నారో,లేక ఎలాగో కలిగిన కుటుంభం కదా పెళ్ళి కుదిర్చేద్దాం అనుకున్నారో ,అసలేం జరిగిందో ,ఏమో కాని ఆ తరువాత బాబ్జీ గాడు లేడు వాడి బేచ్ లేదు వాడి హోండా బండిలేదు..