17, ఫిబ్రవరి 2009, మంగళవారం

ఎదురింటి అమ్మాయి ......


'దీనికేపనీ చేత కాదు 'అని నా మీద ఒక ISI ముద్ర వేసి పడేయడమే కాకుండా వచ్చే పోయేవాళ్ళకు ఆ విషయాన్ని పిలిచిమరీ చెప్పేవారు మా ఇంట్లో వాళ్ళందరూ...అసలు ఏదన్నా పని చెబితే కదా నాకు వచ్చో రాదో నిరూపించడానికి ,ఎంత సేపూ నీకేంరాదు,నీకేం చేత కాదు అని అనేయడమే ..
అసలా పేరు రావడానికి కారణం ప్రొద్దున లేవడం పాపం మా అక్కా, చెల్లెళ్ళు అందరూ నేను ముందు స్నానం చేస్తా అంటే నేను ముందు అని ఒకటే గొడవ పడేవారు,సరేలే పాపం వాళ్ళకు మళ్ళీ నేను కూడా పోటి ఎందుకు అని ఎంతో త్యాగం చేసి వాళ్ళూ అందరూ తయారయ్యేవరకూ పడుకునేదాన్ని,ఈ నా త్యాగ నిరతి అర్దం చేసుకోకుండా బారెడు ప్రొద్దెక్కేవరకూ లేవని నిద్ర మొహం అని నాకొక బిరుదు ప్రదానం చేసేసారు, తీరా నేను తయారయ్యే సరికి అక్క వంటలో అమ్మకు సహాయం చేస్తే మిగిలిన చెల్లెళ్ళు ఒకరు గదులు శుబ్రం చేయడం ఇంకొకరు దేవుని గది లో తులసిమాలలు కడుతూ అన్నమాచార్య కీర్తనలు పాడేసుకుంటూ నాన్న గారి పూజకు సిద్దం చేసేసేవారు.. ఇంక నేను చేయడానికి ఇంకేం మిగిలింది ఈ లోపల కాలేజ్ టైం అయ్యే పోయేది ....
సరే దాని మానాన బుద్ది గా చదువు కుంటుంది అని మా అమ్మ ఊరుకునేదా .. అబ్బే... ఇంటికొచ్చిన ప్రతి ఒక్కరితో మిగితా వాళ్ళ గురించి ఏమి బెంగలేదు కానీ అండి, ఇదిగో దీనికే బొత్తిగా ఏదీ చేతాకాని రకం... కోడిగ్రుడ్లు ఉడక బెట్టమంటే గ్రుడ్డుకు ఎన్ని కప్పుల నీళ్ళు పోయాలమ్మ అని అడుగుతుంది ..అత్తారింటికి వెళితే ఎలా బ్రతుకుతుందో అని జాలి పడుతూ పరువు తీసిపడేసేది ,ఇక ఆ వచ్చేవాళ్ళు తమ కళ్ళ ముందు నేను ఒక చేతిలో గ్రుడ్డు తో మరొక చేతిలో కప్పుతో ఉన్నట్లు ఉహించేసుకుని మరీ నా వైపూ విచిత్రం గా చూసేవారు.
పోనీ ఎప్పుడన్నా కాళీ దొరికినపుడు గదులు తుడుద్దామని చీపురు తీసాననుకోండి.. వద్దులే అక్కా నువ్వు తుడిచినా మళ్ళీ మేము తుడవాల్సిందే ,ఎందుకూ డబల్ పని అని మెల్లగా నా చేతిలో చీపురు లాగేసుకునేవారు,చెప్పొద్దూ నాకు తిక్కలేచేది..దొంగ మొహాలు .. వాళ్ళ స్కూల్ లో ప్రతీ శనివారం పిల్లలకు శుబ్రత నేర్పే వంకతో స్కూల్ మొత్తం తుడిపించేవారు ,మరి నేను చదివిన గవర్నమెంట్ స్కూల్ లో మహారాణులం మేము ,పని మనిషి ఉండేది ..ఆ కుళ్ళు ఇలా తీర్చుకునేవారన్నమాట ..
సరే ఇదిలా ఉండగా ఒక రోజు మ పెద్ద చెల్లి హడావుడిగా వచ్చీ నాకు మా అక్కకు మద్య ఒక దుప్పటి పడేసింది ..తను హోం సైన్స్ చదివేది,అది క్లాస్ లో ఏం చదివేదో తెలియదు కాని రోజూ ఇంట్లో నుండి పప్పులు ,ఉప్పులూ తీసుకు వెళ్ళడం అక్కడ వండుకుని తినడం లేక పోతే ఊలు బండీలు ,బట్టలు తీసుకు వెళ్ళి స్వెటర్లు,డ్రెస్సులు కుట్టడం ఇదేపని ..ఈ మాత్రం దానికి నువ్వు అన్ని డబ్బులు పోసి హోంసైన్స్ చదవాలా !!!నాలుగు రోజులు వంటగదిలో ఉన్నా, టైలర్ దగ్గరకు వెళ్ళినా ఇంతకన్నా బాగా నేర్చుకుంటావ్ అని మా తమ్ముడు ఏడిపించేవాడనుకోండి అది వేరే విషయం ..
సరే అది వచ్చీ రాగానే అక్కా అక్కా ,ప్లీజ్,ప్లీజ్ ,ఇన్నాళ్ళూ రికార్డ్ వర్క్ లో పడి ఈ దుప్పటి కుట్టడం అశ్రద్ద చేసేసాను ,మా మేడం నాలుగు రోజుల్లో ఇచ్చి తీరాలని చంపేస్తుంది కాబట్టి మీ అందరి హెల్పూ నాకు కావాలి అంది ,
తీరా దుప్పటి చూస్తే అంగుళం కాళి లేకుండా మొత్తం డిజైన్ వేసేసి ఉంది .. అయ్యబాబోయ్ నాలుగు రోజుల్లో అయ్యే పనేనా అన్నాను ..అందుకే కదక్కా మీ హెల్ఫ్ అడుగుతున్నా అంది బ్రతిమాలుతూ.. దొరికింది గాడిద అనుకుని,మరి నాకు కుట్టడం రాదని ఎప్పుడు అంటావ్ కదా ఇప్పుడు సరిగా కుట్టక పోతే తిట్టుకుంటావ్ ,నాకెందుకు బాబు అన్నాను బెట్టు చేస్తూ ... ఈ కుట్టు చాలా సులువక్కా ..దీన్ని గొలుసు కుట్టు అంటారు,ఎలా కుట్టినా పర్వాలేదు మిగిలిన రకాలు నేను ,అక్కా కుడతాం అంది బ్రతిమాలుకుంటు..
దొరికిన చాన్స్ ఎలా వదిలేస్తా, దుప్పటి ఒక కొస నా వైపు లాక్కుని ఏకాగ్రతగా కుట్టెయడం మొదలెట్టా .. కాసేపటికి నా కొస వైపు చూస్తూ కెవ్వున కేక పెట్టింది .. ఏంటి పిల్లా నా దుప్పటి నాశనం చేసేసావ్ అని ఒక్క అరుపు అరిచింది.. నువ్వే కదే కుట్టు ఎలా వచ్చినా పర్వాలేదు అన్నావ్ అన్నాను ఉక్రోషంగా .. కుట్టు ఎలా వచ్చినా పర్లేదన్నాను కాని దుప్పటి రెండు కొసలు కలిపి కుట్టెయమనలెదు .. వార్నాయనో నీ సంగతి తెలిసి కూడా ఇచ్చాను చూడు ...నన్ను అనుకోవాలి ...వద్దులే అక్కా కావలంటే రాత్రి పడుకోకుండా అయినా కుట్టుకుంటాకాని నువ్వు మాత్రం కుట్టకు అంది నేను కుట్టిన కుట్లన్నీ విప్పి పడేస్తూ..
రాక్షసి ఒక్క సారి ఏదో తప్పు చేస్తే ఇలాకాదని చెప్పచ్చుగా గాడిద అనుకుని అక్కడనుండి హాల్ లోకి వచ్చాను. మా అమ్మ కుట్టు మిషన్ దగ్గర చిరిగిన బట్టలన్ని ముందేసుకుని కళంకిత సీరియల్ స్టార్ట్ అయిపోయిందేమో ఒక సారి పిన్ని గదిలో చూసి రామ్మా అని కంగారు పడిపోతుంది ... మా T.V పాడైందిలేండి అప్పుడు..నేను విసుగ్గా వెళ్ళా బోయి ఈ అవకాశాన్ని వదులుకోకూడదు.. ఈ రోజు బట్టలు కుట్టి శబాష్ అనిపించుకోవాలి.. పైగా మిషన్ కుట్టడం చాలా వీజీ.. ఆ చక్రం ఇలా తిప్పి అలా కాళ్ళతో తొక్కితే కుట్టు పడిపోతుంది అనుకుని ..అమ్మా చక్కగా వెళ్ళి పిన్నితో హాయిగా సీరియల్ చూడచ్చు కదా ఈ బట్టలు నేను కుట్టిపెడతా అన్నాను ఎంతో ప్రేమగా ...
నువ్వా... అని అనబోయి .....ఓ కళంకితా .....కళలకే అంకితా అని టైటిల్ సాంగ్ విన బడగానే జాగర్తాగా కుట్టమ్మా మరి అని వెళ్ళిపోయింది ..హమ్మయ్యా అనుకుని చాలా హాయిగా నవ్వేసుకుని చక్రం ఒకసారి ఇలా తిప్పి కాళ్ళతో అలా తొక్కగానే మిషన్ అదేదో సౌండ్ చేస్తుంది .. ఏంటబ్బా అని చూస్తే చక్రం బెల్ట్ బయటకు వచ్చేసి ఉంది ..దాన్ని కష్టపడి పెట్టి ఎంత కుట్టినా చక్రం వెనక్కి తిరుగుతుంది కాని ముందుకు తిరగదే ...కుట్టు వంకర టింకర .. అంటే చూడటానికి ఈజీ గా అనిపించినంతమాత్రానా నిజంగా ఈజిగా ఉండవన్నమాట కొన్ని..ఈ లోపల పుటుక్కుమని సూది కాస్త విరిగిపోయింది ... అయిపోయానురా దేవుడో అనుకునేంతలో సీరియల్ అయిపోవడం ..మా అమ్మ నన్ను 2 జన్మలకు సరిపడా తిట్లు తిట్టడం అన్నీ టక టకా జరిగిపోయాయి ...
నేను ఏడుపు మొహం వేసుకుని వీది మెట్లదగ్గర కూర్చున్నా .. ఈ లోపల అమ్మ ముగ్గుచిప్ప పట్టుకుని నెలగంట స్టార్ట్ కావడం తో తన ముగ్గు ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తుంది ..ఈ లోపల మా ఆఖరు చెల్లి నా పక్కన కూర్చుని, ఎహే ఆ ఏడుపు మొహం ఏంటి..నీకంతగా ఇంట్లో సాయం చేయాలంటే ఒక మంచి అయిడియా ఇస్తా చేస్తావా అంది .. ఏంటి అన్నాను..
మా అమ్మ వైపు చూపిస్తూ చూసావా ఆ ముగ్గుచిప్ప చేతిలో ఉంది అంటే మూడో ప్రపంచ యుద్దంవచ్చినా పట్టించుకోదు ..అసలు ముగ్గు మీద కార్టూన్లు అన్నీ అమ్మను చూసే వేసారేమో అనిపిస్తుంది ..అలా వదిలేయాలే గాని ఒక k.G ముగ్గుపిండి ఇస్తే వంచిన నడుం ఎత్తకుండా మరీ ముగ్గులు వేసేస్తుంది అంది...
నిజమే అమ్మకి ముగ్గులు వేయడమంటే ఎంత ఇష్టం అంటే తనకు రాని ముగ్గులంటూ ఉండవేమో ..నెలగంటలో వేసే చందమామ నే లతలు ,తీగలు వేసి అరగంట అలంకరిస్తుంది .. ప్రతి గురువారాలూ గదులు కడిగినపుడు గదినిండా అంగుళం కాళి లేకుండా ముగ్గువేసి తొక్కకుండా తిరగమంటుంది ..ఆ పద్మ వ్యూహంలో పొరపాటున తొక్కామో అయిపోయామే.. అసలు అందువల్లే సగం నడుం నెప్పి అని బాదపడేది..
కాబట్టి అక్కా.. నువ్వు ఆ ముగ్గువేసే బాధ్యత తీసుకున్నావనుకో ఇటు అమ్మకి బాధలేకుండా చేసేదానివి అవుతావ్ అటు నాన్న తో అమ్మకు ఈ విషయం మీద పడే తిట్ట్లు తప్పించిన దానివి ,అవుతావ్ పైగా బోలెడు సాయం చెసినదానివి అవుతావ్..ఒక వేళ ముగ్గు సరిగా వేయక పోతే గుప్పెడు ముగ్గుపిండి వేస్ట్ అంతే కదా అంది...నాకు ఆ నిమిషం లో మా చెల్లిని చూడగానే ఎంత ఎదిగిపోయావమ్మా అని పాడాలనిపించింది..
సరే మరుసటి రోజు అమ్మ మీద యుద్దం ప్రకటించి బలవంతంగా ముగ్గు చిప్ప పట్టుకుని బయటకు వచ్చాను ,కాని
...చుక్కలు పెడుతుంటే అవి వంకర టింకర వెళ్ళిపోవడం మొదలయ్యాయి ..చీ..చీ ఇది కూడా మద్యలో ఆపేస్తే అంతకన్నా అవమానం ఉండదు అనుకుని ఎలాగో అలా చుక్కలు పెట్టడం పూర్తి చేసి ముగ్గు పెట్టడం మొదలు పెట్టేసరికి ముద్దలు ముద్దలు వస్తుంది ఈను ..అమ్మ ఇలా అంటే అలా సన్నంగా పడి చస్తుందిగా నా దగ్గర ఏంటి ఇలా వేషాలు వేస్తుంది అని పంతంగా పెడుతుంటే ఒకరిద్దరు దారిన పోయేవాళ్ళు ఆగి మరీ చూసి ఏంటమ్మా ఈ రోజు మీ అమ్మగారు పెట్టడం లేదు అని ఆగి మరీ అడిగారు,ఒకరిద్దరు పిల్లకాయలు మొహం మీదే చాలా చండాలం గా ఉంది అనేసారు .. ఓయ్ పొండి ఇక్కడి నుండి అని తరిముతుంటేవాళ్ళను అప్పుడు వినబడింది మా ఎదురింటి నుండి నవ్వులు ...
మా ఎదురింటి పక్కన చిన్న సందులా ఉండి లోపల పెద్ద కుటుంభమే ఉంటుంది కాకపోతే నాకు అంతగా తెలియదు అమ్మా వాళ్లకు వాళ్ళ పెద్ద వాళ్ళు తెలుసు..ఆ ఇంటి అమ్మాయిలు రోజు ముగ్గులేస్తారు .. ఆ పిల్ల నవ్వి ఊరుకోవచ్చుగా వాళ్ళ అన్నను పిలిచి చూపి మరీ నవ్వుతుంది.. వాడికి మాత్రం బుద్ది ఉండక్కరలేదు 36 పళ్ళూ బయట పెట్టి మరీ నవ్వాడు..అత్త తిట్టినందుకు కాదు గాని తోడి కోడలు నవ్వినందుకు అని ముగ్గు సరిగా రాలేదు అనే బాధ కంటే వాళ్ళ నవ్వులు భరించలేక పోయాను ..మొత్తానికి ఏదో వేసాను అనిపించి ఇంట్లోకి వచ్చేసాను దెబ్బకు నడుం పట్టేసింది చూపుడువేలు మొత్తం రోడ్డుకు తగిలి గీరుకుపోయింది..
ఇంక ఈ ముగ్గు జోలికి వెళ్ళకూడదురా బాబు అనుకుంటుండగా నా ముగ్గు చూసి మా మేడ మీద కాపురం ఉంటున్న పిన్నులు క్రిందకు దిగీ అక్కా ఈ రోజు ముగ్గెవరు వేసారు అని అడుగుతుంటే వచ్చింది కదా కసి ..ఇక లాభం లేదు ఇప్పుడు గనుక మానేసానో నాకు చేతకానిదాన్ని అన్న పేరు సార్దకం అయిపోతుంది ..తినగ తినగ వేము తియ్యనుండు అన్నట్లు అదే వస్తుందిలే అనుకుని మరుసటి రోజు నుండి ఎదురింటి అమ్మాయి రాక మునుపే గభ గభా ముగ్గేసి పారిపోయేదాన్ని ఇంట్లోకి .....
ఏం బ్రతుకురా బాబు దాన్నెవరో చూసి నేను భయపడటం ఏంటి అని మనసులో నన్ను నేను తిట్టుకున్నా ఏదో సిగ్గు ఉండేది ..క్రమం క్రమం గా నేను గమనించింది ఏమిటంటే నాలో ముగ్గు వేసే ప్రావీణ్యం మెరుగుపడటమే కాకుండా ఆ ఎదురింటి అమ్మాయి నాతో పోటి పడటానికి చూసేది...నేను కుందేళ్ళ ముగ్గు వేస్తే తను ఏనుగులు ముగ్గు నేను సీతాకోక చిలుక లేస్తే తను తూనీగలు..నేను మందారాలేస్తే తను గులాబీలు వేసేది .. అంతే నా మీద నాకు ఫుల్లు కాన్ ఫిడెంట్ వచ్చి పడిపోయింది.. ఇక అక్కడి నుండి రోజు కాలేజ్ నుండి రాంగానే మా అమ్మ వేసిన ముగ్గుల పుస్తాకలు తెరవడం కష్టమైన ముగ్గులన్నీ ప్రాక్టీస్ చేయడం అవి వేయడం..మా మద్య ప్రచ్చన్న యుద్దం కాస్తా పబ్లిక్ యుద్దం అయి కుర్చుంది .. మా వీదిలో పిల్లలు రెండు వర్గాలు అయిపోయి అటు ఇటు ముగ్గులు జాగర్తగా పరిశిలీంచేవాళ్ళు... అటు వాళ్ళ కుటుంబం లో పిల్లలు ఆమెకు సపోర్ట్ ఇస్తే ఇటు మా ఇంట్లో పిల్లలందరూ నాకు సపోర్ట్ .. కాలేజ్ కి వెళ్ళేటప్పుడు కూడా ఎవరన్నా వాళ్ళా వాళ్ళూ మా వాళ్ళకు కనబడితే మొహాలు తిప్పేసుకునేవారు ...
ఈ లోపల జనవరి పస్ట్ రావడం మొదలైంది పిల్లలందరం ఈ సారి వాళ్ళ కంటే మాదే గొప్పగా ఉండాలని ప్లాన్ చేసుకున్నాం ..ఏమేం వేయాలో ముందే నిర్ణయించుకున్నాం .......సరిగ్గా రేపు ఫస్ట్ అనగా ముందురోజు ముగ్గు అయిపోయింది, అమ్మా ....ముగ్గు తెప్పించి ఉంచు అని మరీ మరీ అమ్మకు చెప్పి నేను కాలేజ్ కి వెళ్ళి రంగులు కొనుక్కుని ఇంటికి వచ్చీ ఆ రాత్రి చూద్దును కదా నిన్న మిగిలిన గుప్పెడు ముగ్గు తప్పా ఇంకేం లేదు ...అమ్మా !!ముగ్గేది అని అరిచాను... అయ్యో మర్చిపోయానే ఈ సారికి ఏదన్న చిన్న ముగ్గు పెట్టెసేయ్ .. రేపు తెప్పిస్తాలే అంది అమ్మ పెద్దమ్మతో కబుర్లు చెబుతూ.... ఎంత కోపం వచ్చిందంటే నువ్వే వేసుకో ..నీకసలు నేనంటే ఇష్టమే లేదు ...నా మాట అంటే లెక్కేలేదు అని బుగ్గల మీదనుండి వద్దాన్న కారిపోతున్న నీళ్ళను కనబడ కుండా నా గదిలో దూరి తలుపేసుకున్నా .. ఎంత వద్దనుకున్నా ఎదురింటి వైపూ మా కిటికీ కర్టెన్ వారగా తీసి లైట్ ఆపు చేసి ఎవరికీ కనబడకుండా చూస్తున్నాను.. వాళ్ళు పువ్వులూ ,రంగులూ ,మెరుపులూ ఒక్కటేమిటి తెగ అలంకరించేస్తున్నారు. ..తలుచుకుంటే ఇప్పుడు నవ్వు వస్తుంది కానీ నాకు ఆ సమయం లో ఎంత ఏడుపొచ్చింది అంటే.... అయిపోయింది ఇంక వాళ్ళే గెలిచేసారు తెల్లారగానే వాళ్ళు విజయ గర్వం తో చూస్తారు ... వీది లో పిల్లలందరికీ వాళ్ళే గొప్పోళ్ళు అయిపోతారు ఈ రోజు తరువాత ఎన్ని ముగ్గులు పెడితే ఏం లాభం .. అనుకుని ఏడ్చుకుంటూ పడుకున్నా ..
తెల్లారి చూద్దును కదా ఎదురింటి ముగ్గు అంతా భీభత్సం గా చెరిగిపోయి అసహ్యం గా ఉంది ... మా ఇంటి ఎదురుగా మాత్రం చక్కగా అందం గా బుల్లి బుల్లి ,రంగు రంగుల పువ్వులతో అందమైన ముగ్గు నీట్ గా ఉంది happy new year అని రాసి...మా వీదిలో పిల్లలందరూ ఆగి మరీ చూస్తున్నారు..రాత్రి బాగా గాలి వీచి చిన్న పాటి జల్లు పడిందంట ,అమ్మ తెల్లార గట్టా లేచి వేసింది మా ముగ్గు ....నేను సైలెంట్ గా నా గదిలోకి వెళ్ళీ తలుపు గడియ వేసుకుని హేయ్ డండనకా... డండనకా ...డన్ అని కాసేపు డాన్స్ చేసాను....
మొన్నా మద్య ఇండియా వెళితే పిన్ని నువ్వు ఇంట్లో వేసుకునే బట్టలేమన్నా కుట్టించుకోవాలంటే మన శ్రీవల్లి కి ఇస్తే తనకి సాయం చేసినట్లు అవుతుంది అంది.. యే శ్రీవల్లీ అన్నాను అయోమయంగా...అదేనమ్మా మన ఇంటి ఎదురుగా ముగ్గులేసేది మీతో పాటు ... ఎవడో వెదవను ప్రేమించిందిలే వాడితో ఇంట్లో చెప్పకుండా పెళ్ళీ చేసుకుని ఒక సంవత్సరం కాపురం వెలగపెట్టింది ..దొంగ వెదవ ఇప్పుడు కట్నం కావలని బాగా కొట్టి పంపేసాడు పుట్టింటికి ... చావో రేవో అక్కడే ఉంటా అని మొన్నా మద్య అక్కడికి వెళితే చంపబోయాడంట ..ఇంక కన్నోళ్ళు వదులుకోలేరుగా ఆ పిల్లను వాళ్ళకు పుట్టిన పసిపిల్లను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు పగలు స్కూల్ లో టీచర్ గా చేస్తుంది కాళి టైములో బట్టలు కుడుతుంది అంది ...
ఎదురింటిలో చాలా మంది పిల్లలు ఉండేవారు కాని నాతో ముగ్గులేసిన అమ్మాయి ఈమే ఒకటేనా ??? మనసంతా బాధగా అయిపోయింది... నువ్వే ఇవ్వుపిన్ని అని పిన్ని చేతనే ఇప్పించా ... ఆమె ను ఒక్క నిమిషం
కూడా బాధగా చూడటం ఊహించుకోలేక పోయాను...

50 వ్యాఖ్యలు:

పిచ్చోడు చెప్పారు...

హహ్హహహ..... నేస్తం మొత్తానికి కష్టపడి ఒక రంగంలో ప్రావీణ్యాన్ని సంపాదించేశారన్న మాట. టపా మొదటి నుంచి సరదాగా నవ్వించి చివరలో మనసు భారం చేసేశారండీ. ఏంటో ఈ ప్రేమలు

పిచ్చోడు చెప్పారు...

అన్నట్టు చెప్పడం మరిచేపోయా.... ప్రొఫైల్ లో బొమ్మ భలే ఉందండోయ్......

Padmarpita చెప్పారు...

బాగుంది కాని ఆ అమ్మాయిని తలచుకుంటే భాధగా వుందండి.

లక్ష్మి చెప్పారు...

ఎప్పటిలానే చక్కటి టపా తొ అలరించారు. చివరిలో బాధ అనిపించింది కానీ....హ్మ్

నవ్వులాట శ్రీకాంత్ చెప్పారు...

నేస్తం,

మీరు టపా రాసే విధానం బాగుంది

నేస్తం చెప్పారు...

లక్ష్మి గారు పిచ్చొడు గారు పద్మార్పిత గారు ధన్యవాదాలు ..నాకు ఆ అమ్మయి గురించి వింటే చాలా బాదగా అనిపించింది .. చక్కటి భవిష్యత్ ఉన్నపిల్ల ...ప్రేమా దోమా అని ఎందుకూ పనికిరాని ,పనీ పాటాలేని అబ్బాయిని పెళ్ళి చేసుకుంది అట ,
@ నవ్వులాట శ్రీకాంత్ గారు ధన్యవాదాలండి ..మీ బ్లాగు నవ్యలో పడినందుకు అభినందనలు :)

ప్రపుల్ల చంద్ర చెప్పారు...

మొత్తానికి ఒక విషయంలో నిష్ణాతులయ్యారన్నమాట.. అభినందనలు... చివరి విషయం చదవగానే భాధగా అనిపించింది.

అరుణాంక్ చెప్పారు...

మీరు ఉమ్మడి కుటుంబం లో బాగా ఎంజాయ్ చేసారనుకుంటా.
శుభం కార్డ్ అనుకున్నా కానీ శాడ్ ఎండింగ్.

చైతన్య చెప్పారు...

హమ్మయ్య ఎలాగోలా ఒక పని నేర్చేసుకున్నారన్న మాట... మా అమ్మ కూడా నన్ను చూసి తెగ బాధపడిపోతుంటుంది... ఎలా బ్రతుకుతానో అని... ఏ పనీ చేయను అనీ(రాదు అని కాదు) ...

నేస్తం చెప్పారు...

ప్రపుల్ల చంద్ర గారు ఆ నేర్చేసుకున్నా అండి మొత్తానికి..అరుణాంక్ గారు అవును అసలు ఎండింగ్ నేను గెలిచిన విషయం వరకూ రాసి వదిలేద్దాం అనుకున్నా కాని జరిగిన విషయం ఇది,ఆ అమ్మాయి పేరు నాకు తెలియదు అందుకే ఆ అమ్మయా కాదా అనేది తెలియదు ..తనే నేమో ..చైతన్య గారూ మరే ఈ అమ్మలందరూ అంతే అర్దం చేసుకోరు :(

అనిర్విన్ చెప్పారు...

మీరెప్పుడూ ఇంథె, ట్విస్ట్ లేకుండా టపా రాయరు కదా. బాగుంది.

కొత్త పాళీ చెప్పారు...

అవును, న్యూయియర్ నించీ సంక్రాంతి దాకా ఈ ముగ్గుల యుద్ధాలు జరుగుతుండేవి. ఏంటో ఈ రోజుల్లో కూడా కట్నం కావాలని పెళ్ళాన్ని కొట్టి తరిమేయడాలు!

నేస్తం చెప్పారు...

మదు గారు :)
కొత్తపాళి గారు అసలు ఈ రోజుల్లోనే ఎక్కువ అండి కట్నాల గొడవలు.. నేను 3, 4 చూసాను నా కళ్ళతో ..విన్నవి ఎన్నో

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

ఏమీ గమనించకుండా ప్రేమించెయ్యడం,పెళ్ళిచేసుకోవడం తర్వాత జీవితాంతం బాధపడడం....
బాగా రాశారు.

మురళి చెప్పారు...

బాగా రాశారు. ముగ్గులు వేయడం చాలా తొందరగా నేర్చేసుకున్నారు..ధనుర్మాసం మొదట్లో మొదలుపెట్టి, సగం అయ్యేసరికి నిపుణత సాధించేశారు. ఇక, ముగింపు విషయానికి వస్తే ప్రేమ పెళ్ళైనా, పెద్దలు కుదిర్చిందైనా సమస్యలు ఒకేలా ఉంటున్నాయి. నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి అన్నమాటకి అర్ధం వివరించాలంటే మీ పోస్ట్ చదివిస్తే చాలు..

మురళి చెప్పారు...

అన్నట్టు ఫోటో, ప్రొఫైల్ ఫోటో రెండూ బాగున్నాయండి

నేస్తం చెప్పారు...

విజయమోహన్ గారు,మురళి గారు ధన్య వాదాలు అండి అవును మీరు అన్నది కరెక్టే అండి ఏమి ఆలోచించకుండా ప్రేమించేయడం ఘోరంగా దెబ్బ తినడం ఏమన్నా అంటే ఆస్తి పాస్తి ని చూసి ప్రేమిస్తామా అంటారు,అలా అంటే ఏమనగలం ..నిజమే మురళి గారు సమస్యలనేవీ ఎలా అయినా రాగలవు ..ఆ ఫొటో ఎక్కడో చూసా అండి బాగా నచ్చి సేవ్ చేసుకున్నా ..అది ఇలా ప్రొఫైల్ లో పెట్టేసా :)

నిషిగంధ చెప్పారు...

అనుకున్నట్టే చివర్లో మెలి(క) పెట్టేశారు.. బాగా రాశారు.. నాకొచ్చిన అతి పెద్ద ముగ్గు ఐదు చుక్కలు ఐదు వరుసలు :))

నేస్తం చెప్పారు...

హ హ నిషి గారు ధన్యవాదాలు

శ్రుతి చెప్పారు...

నేస్తం మీరింకా నయం సొంతగా నేర్చుకున్నారు. మా ఇంట్లో అదే దో మహా ఘోరమైన్ నేరం అన్నట్లు చిన్నప్పుడే కదలకుండా కూర్చో పెట్టి నేర్పించింది అమ్మమ్మ. అదే లెండి నా మనవరాలు సూపర్ అని చెప్పటనికన్న మాట. నిజం చెప్పొద్దూ నా కంటే మా బుడంకాయ్ (తేజు) భలే వేస్తుంది. వారం వరకు ముగ్గు తొక్కితే కాళ్ళిరగతీస్తా అని ఓ పేద్ద వార్నింగ్ మళ్ళీ.
మీ దగ్గర మళ్ళీ నేర్చేసుకోనా? మా బుడంకాయ్ తో పోటీ పడొచ్చ్చు, నాకూ వచ్చని ఫోజు కొట్టొచ్చు. కదా!

asha చెప్పారు...

ఆఖరుగా చదివినది అసలు ఊహించకపోవటం వల్ల చాలా బాధనిపించింది.
ఇక మీదట, అలాంటి మలుపులు చెప్పొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను.
మీ విషయాలన్నీ నాకెంతో ఇష్టమైన నా బాల్యాన్ని గుర్తు చేస్తాయి.
కృతజ్ఞతలు.

నేస్తం చెప్పారు...

హ హ హ శృతిగారు ...ఇప్పటి తరం తో పోటి పడగలమా చెప్పండి ..ఇద్దరం మీ తేజూ దగ్గర నేర్చుకోవలసిందే ...
భవానీ గారు అసలు ఆ విషయం చెప్పకుండా వదిలేద్దాం అనిపించింది..కాని జరిగిన విషయం ..జీవితం ఎలా మలుపు తిరుగుతుందో తెలియదు .. అందుకేనేమో భాల్యం అంత తీయగా ఇంకేదీ ఉండదు ఎదిగే కొద్ది సమస్యల వలలో చిక్కుకుంటాం

జీడిపప్పు చెప్పారు...

simply superb narration!!!

madhu చెప్పారు...

మీరు చాల బాగా రాస్తారు. మీ శైలి కి నేను ఒక అభిమానిని. బాల్యాన్ని, జ్ఞాపకాల్ని తట్టి లేపారు.

పేరాలు గా విడగొట్టి రాస్తే, మరింత బాగుంటుంది, చదవటానికి . పేరాకి 5-6 లైన్లు, ఉండేట్టు. నా సలహా పాటిస్తారని ఆశిస్తాను.

నేస్తం చెప్పారు...

జీడిపప్పు గారు ధన్యవాధాలు,
శ్రీ గారు మీ అభిమానానికి ధన్య వాదాలు,ఇక పేరాగ్రాఫ్ ల గురించి ఏం చెప్పమంటారులెండి,నేను లేఖిని లో రాసిన కధ అంతా నోట్ పేడ్ లో పేస్ట్ చేసి పేరా లు గా విభజించి మరీ టపాగా పోస్ట్ చేస్తానా ,మరేంటో ప్రోబ్లెం ....నేను చేసినంది అంతా పోయి దానికి నచ్చినట్లు విభజించి బ్లాగులో పడుతుంది .. ఇంకా తప్పులు కూడా సరి చేద్దామని 'పోస్ట్ సవరించూ'కు వెళ్ళాను అనుకోండి సిస్టెం గంట సేపు హేంగ్ అయి పోతుంది ...ఒక వేళ ఫొటొ పెట్టడం వల్లనేమో, అయినా ఈ సారి తప్పని సరిగా మళ్ళీ బాగా రాయడానికి ట్రై చేస్తాను

ఆయుర్వేదం చెప్పారు...

మీ టపాలో ఫొటోలు బాగుంటాయి. చ్చాలా మంచి టేస్ట్..ఎక్కడనుండి తెస్తారో చెబితే మీకు లేకుండా అనే నేనే తీసేసుకుంటా ;-)

నేస్తం చెప్పారు...

హ..హ వాణి గారు చాలా వరకు గూగులమ్మనే అడుగుతా..కాని ఈ టపాలో ఫొటో నేను అతికించాను సంక్రాంతి గ్రీటింగ్స్ లో అమ్మాయిలను కాపీ చేసి ,ఆ చిన్న ఇల్లు ని కూడా పెద్దగా చేసాను .. :)

cbrao చెప్పారు...

ఈ కథ చివర twist అకస్మాత్తుగా విచారాన్ని నింపింది.

నేస్తం చెప్పారు...

hmm రావు గారు .. :(

మధురవాణి చెప్పారు...

నేస్తం,
ఇంత చెప్పిన అభిప్రాయాలు చెప్పాకా ఇంక నేను చెప్పడానికి ఏమీ మిగిలినట్టు లేదు ;)
ఫోటో భలేగా తయారు చేసారండీ.. సూపర్..
మీ టపాలు చదివేప్పుడు ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. అదే మీకే సొంతం.. జాజి పూల తీగ దగ్గర మంచం వేసుకుని కూర్చున్నప్పుడు.. చల్లగాలి వస్తే ఎలా ఉంటుందో అలాగన్నమాట.. మొత్తానికి ఆవిషయం మీక్కూడా తెలుసులా ఉంది. అందుకే సరిగ్గా జాజిపూలు అనే పేరు పెట్టారు :)
చాలా చాలా బావుంది. నాక్కూడా చివరలో మనసు చివుక్కుమనిపించింది :(
ఇలాంటి చక్కటి కబుర్లు చెప్పి.. మాకు సంతోషాన్ని కలుగజేస్తున్నందుకు ధన్యవాదాలు.

నేస్తం చెప్పారు...

మదుర వాణి గారు నా టపా సంగతేమో గాని మీ వాక్య మాత్రం నాకు అలాంటి అనుభూతిని ఇచ్చింది,ధన్య వాదాలు

మరువం ఉష చెప్పారు...

బాగుంది నేస్తమీ కథా కమామీషూ. సమయాభావం వలన మునుపంతగా బ్లాగ్లోకంలో మెసలలేకపోతున్నా,అయినా కానీ ఈ బ్లాగ్వాతావరణ గాలి పడక అనారోగ్యం పాలై కాస్త గాలి పీల్చను ఇటు వచ్చాను. హమ్మయ్యా, బాగుంది మనసుకీ, వంటికీ నూ. తిరిగి త్వరలో కలుద్దాం.

నేస్తం చెప్పారు...

usha gaaru :)

వేణూశ్రీకాంత్ చెప్పారు...

ఎప్పటి లానే చాలా బాగుంది నేస్తం. చివరి లో ఇచ్చిన ట్విస్ట్ తప్ప, కానీ అదే జీవితం కదా !! We can't escape from it !!

వేణూశ్రీకాంత్ చెప్పారు...

ఆన్నట్లు మీరు తెలుగు లో టైప్ చేయడానికి బరహ.కామ్ ప్రయత్నించారా.. దాని సహాయం తో బ్రౌజర్ లో బ్లాగర్ లోనే టైప్ చేయచ్చు. లేఖిని కాపీ పేస్ట్ లేకుండా. ఒక సారి ప్రయత్నించి చూడండి.

నేస్తం చెప్పారు...

బరహ మొన్న ఒకసారి డవున్లోడ్ చేద్దామని అనుకుని మర్చిపోయా ఈ సారి ట్రై చేస్తాను అండి ..థెంక్స్ అండి..బహుకాలా దర్శనం మీరు

Unknown చెప్పారు...

Read my review on your blog at http://pradeepblog.miriyala.in/2009/03/blog-post.html

నేస్తం చెప్పారు...

ప్రదీప్ గారు ఒక్కో సారి మన భావాలను వ్యక్తపరచడం సాద్యం కాదు :) మీరు రాసినది చదివాకా ప్రస్తుతం నాకు ధన్యవాదాలు అని మనస్పూర్తిగా చెప్పడం మినహా ఇంకేం చెప్పలేను.. అతి తక్కువ కాలం లో ఇంత మంది అభిమానాన్ని సొంతం చేసుకోవడం తలుచుకుంటే ఒక్కోసారి మనసు ఎంత ఆనందం తో నిండి పోతుందో .. ధన్యవాదలు అండి మరొక్కసారి :)

సమిధ ఆన౦ద్ చెప్పారు...

నేను ఇ౦టర్ చదివే రోజుల్లో మా ఇ౦టి ఓనరు కొడుకు పొద్దున్నే యుద్దానికి వెళ్ళేవాడిలా నాలిగి౦టికి లేచి చదవడ౦ మొదలెట్టేవాడు. వాడ౦టే నాకు ఇ౦త వయసొచ్చి ఇప్పుడు కూడా పరమద్వేష౦. ఎ౦దుక౦టే వాడ్ని చూసి మా అమ్మతో పడేవి చూడ౦డి ప్రతి రోజూ, అబ్బో భరి౦చలేక ఓ రోజు స్నేహితులతో మాట్లాడి మనుషుల్ని పెట్టి కొట్టి౦చెద్దామన్న౦త కోప౦ వచ్చి బ్రతికిపోరా అని వదిలేసాను. కాబట్టి బ్రతికిపోయాడు. ఈరోజు వరకూ నేను మీబ్లాగుని చూడకపోవడ౦ ఎ౦త పెద్ద నేరమో అర్ధమయ్యి౦ది. ఈరోజు ను౦చి మీబ్లాగుని చూడకపోతే ఇ౦కె౦త పెద్ద ఘోరమో తెలిసి౦ది. ఇహ వదలను మీరాతలని, మీరు ప౦చే నవ్వులని. నమస్తే నా పేరు, ఆన౦ద్.

నేస్తం చెప్పారు...

హ హ హ ఆనంద్ గారు .. చూసారా ద్వేషం తో అయినా గుర్తు పెట్టుకుని మీ ఓనర్ గారి అబ్బాయి గురించి తలుచుకుంటునే ఉన్నారు .. మీ అభిమానానికి దన్యవాదాలు :)

అనూ చెప్పారు...

నేను మీలానే మా వీది వాళ్ళ తో ముగ్గుల్లో పోటి పడేద్దాన్ని........అచం గా నేను పొందిన బావాలనే చదివినట్లు వుంది.......కానీ చివరన పాపం........అసలు కొన్ని ప్రేమల్లో నిజాయితే లేకుండా పోతోంది...మనిషిని నమ్మలంటేనే భయం గా వుంది......ఎం చేస్తాం..కొన్ని జీవితాలు అంతే....

నేస్తం చెప్పారు...

hmm.. అను గారు .. నిజమే కొన్ని సార్లు ఏమీ చేయలేము.. మీ వాక్యకు ధన్యవాదాలు

amma odi చెప్పారు...

మీ "ఎదురింటి అమ్మాయి ......" టపా చదివాను. రోజంతా మాటిమాటికీ మనస్సులో మెదులుతూనే ఉంది. పొద్దున్నే వాకిలి ఊడ్చి ముగ్గుపెడుతుంటే మరీమరీ గుర్తొచ్చింది. చాలా బాగా వ్రాసారండి. మీబ్లాగు మొన్న ప్రదీప్ వ్రాసిన తరువాతే మొదటిసారిగా చూడడం. మీబ్లాగు పరిచయం చేసిన ప్రదీప్ కి ధన్యవాదాలు.

నేస్తం చెప్పారు...

ఆది లక్ష్మి గారు మీ అభిమానానికి ధన్య వాధాలు.. మీ అమ్మవోడి బ్లాగు కు నేను అఙ్ఞాత చదువరిని ...నాకు చిన్నప్పటి నుండి రాజకీయాలు పెద్దగా తెలియదు.. మీ బ్లాగు చదివిన తరువాతే చాలా విషయాలు అర్దం అయ్యాయి.. మీ బ్లాగులొ వాక్య రాయాలన్నా రాజకీయాల పై ఒక అవగాహన ఉంటేనే రాయగలం.. అంత చక్కని బ్లాగును నిర్వహిస్తున్నందుకు అభినందనలు.. చివరిగా అమ్మ కడుపు చల్లగా అందరు బాగుండాలని అంటున్నపుడు మా అమ్మ బరోసాగా వెనుక నించున్న ఫీలింగ్ కలుగుతుంది నాకు .. :) మరొక్క మారు ధన్యవాధాలు

శ్రీనివాస్ చెప్పారు...

అసలు నాలుగు లైన్లకి మించిన కధనాలు చదవాలంటే బద్ధకం నాకు అలాంటిది మీ కధ కాస్త చదివాకా ఆసాంతం చదవాలన్పించింది మీ బ్లాగును పరిచయం చేసిన చైతన్య గారికి ధన్యవాదములు

కధలు రాయడం లో మీ సృజనాత్మకతను మెచ్చుకుంటూ ముందు ముందు మరెన్నో రచనల తో మమ్మల్ని ఆకట్టుకుంటారని బావిస్తూ సెలవు

నేస్తం చెప్పారు...

శ్రినివాస్ గారు ధన్యవాధాలు చైతన్య గారికి నా తరుపున కూడా ధన్యవాధాలు :)

మరువం ఉష చెప్పారు...

చెప్పండి నేస్తం, ఏ ఒక్క మాటగానో లేదా ఏ ఒక్క వ్యాఖ్యగానో అభిప్రాయం చెప్పేటిదా ఈ టపా? ఎన్ని జ్ఞాపకాల పుణ్యతీర్థాల్లో మునకలేసానో. నేను ఏడాది పొడుగుతా కాదు కాని, 10-20 సం. వయసులో సంక్రాంతికి మా ఇంటి ఆస్థాన ముగ్గులరాణీని. కాకపోతే మేమున్నది అఫీషియల్ కాలనీ కనుక ముందు జాగా లేదు, సగం రోడ్డు మీద వేసేదాన్ని. పూలు, రంగులు అద్దటం. గొబ్బెమ్మలు పెట్టించటం, అదొక్కటి మాత్రం నాచేత్తో చేయలేకపోయాను ఎంచేతో. దాదాపుగా 4 కి లేచి, చిన్న qఊర్టెర్స్లో వుండే నరసమ్మని వాళ్ళాయన ప్రక్కనుండి ఆ చలివేకువల్లో లేపుకొచ్చి, కళ్ళాపు వేయించి, దాదాపు 7 గంటల వరకు రోజుకొక 3-5 ముగ్గులు వేసేదాన్ని. ఉదయపు వాకింగుకి వెళ్ళే అంకుల్స్ వస్తూ పోతూ "బాగుందమ్మా!" అంటుంటే అదో తృప్తి. ఎదురింటి వెలుగుకుమారి టీచరు గారు క్రిస్మస్, న్యూఇయర్ రోజుల్లో వాళ్ళ గుమ్మం కూడా నాతోనే అలంకరింపచేసేవారు. అమ్మమ్మా వాళ్ళింట్లో కూడా కొన్ని అనుభవాలు, కొంత పల్లెటూరు రుచులు కలుపుకుని వున్నాయి. ఎదో అన్ని జ్ఞాపకాల్లో కొన్నివి.

మీరన్న అటువంటి ఎదురింటి అమ్మాయిల కథలు ఇక పునరావృతం కాకూడదనే ఏదో ఆలోచనతో ముందుకువెళ్ళబోతున్నాం. ముందుగా అక్ష్యరాస్యత మీద ధ్యాస పెట్టాం. త్వరలో దీనికీ పూనుకుంటాం.

అరుణాంక్ చెప్పారు...

నేస్తం ఏమైపొయారు ?.
నేను చాల రొజుల తర్వాత కూదలికి వచ్చాను .మీ బ్లొగ్ లో కొత్తగా పొస్తులు ఏమి లేవు.

నేస్తం చెప్పారు...

అరుణాంక్ గారు నా బ్లాగ్ గుర్తు పెట్టుకుని పలుకరించినందుకు ధన్యవాదాలు..అవునండి ఈ మద్య రాయలేదు ..కాసింత పని ఒత్తిడి.. ఇంకా ఈ బ్లాగులకు మరీ అడిక్ట్ అవుతున్నానేమో అన్న భయం వెరసి కంప్యూటర్ కి కొంచెం దూరం అయ్యాను .. మరో పోస్ట్ తొ తప్పని సరిగా మీ అందరినీ కలుసుకుంటాను..మీ అభిమానానికి మరొక్క మారు ధన్యవాదాలు :)

Shashank చెప్పారు...

చాలా బాగా రాసారండి. చివర్లో twist కకపోయిన జీవితం అనే చెప్పలి. కాని మరి మీరు ప్రేమ దోమ అనడం ఏమి బాగోలేదు. అందరు ఒకేలా ఉండరు కదండి... ;-)