10, జూన్ 2009, బుధవారం

నేనూ ప్రేమించాను
చదువుకునే రోజుల్లో పెద్దవాళ్ళ ప్రభావం వల్ల ప్రేమ అంటే అదేదో నేరం ,ఘోరం ,పాపం లా ఫీల్ అయిన నేను పీకలలోతు ప్రేమలో కూరుకుపోతా అని,ప్రేమలో తీయదనాన్ని రుచి చూస్తా అని కలలో అయినా అనుకోలేదు ...నా పెళ్లి కుదిరాకా తాంబుళాలు అయిన సాయంత్రం, పాపం మా ఆయన తన ఫోన్ నెంబర్ ఉన్న విజిటింగ్ కార్డ్ నాకు ఎవరు చూడకుండా ఒక పాపతో అందించారు..అసలే భారి బరువున్న పట్టు చీరతో,నగలతో
వచ్చేపోయే జనాల తో హడావుడిగా ఉన్న నేను విసుగు వల్ల అది ఎక్కడో పెట్టేసాను..


ఆ తరువాత దాని విషయమే మర్చిపోయాను ,అందులోనూ మా పెద్దమ్మ కూతురు పెళ్ళి కూడా అదే సమయం లో కుదరడం ,తన పెళ్ళి కూడా నా పెళ్ళికి రెండు రోజుల ముందు అవ్వడం వల్ల వచ్చిన చుట్టాలు పదిసార్లు అటు ఇటు తిరగలేక మా ఇంట్లోనే ఉండిపోయారు ....అంగుళం ఖాళీ లేదు ,పైగా మా తాంబూళాలు అయిన మరుసటి రోజే తుఫాన్ వల్ల కరెంట్ పోల్స్ పడిపోయి , తీగలన్నీ తెగిపోయి మా ఏరియా అంతా పదిహేను రోజుల పాటు కరెంట్ తీసిపడేసాడు ..ఇలా పలు కారణాలవల్ల ఆయన విషయమే మర్చిపోయాను ...


ఇది ఇలా ఉండగా ఒక రోజు అమ్మ,పెద్దమ్మ, పిన్నులు అందరూ పెళ్లి బట్టలవి కొనడానికి షాప్ కి వెళ్ళారు, కుళాయి వస్తే నీళ్ళు పట్టే బాధ్యత మాకప్పగించి ....నా కంటే ముందు అక్క పెళ్లి అవ్వడం వల్ల,పెళ్లి కూతురన్న మురిపం అసలు లేనేలేదు నాకు ,అన్నీ దానికే :( అలా నేను ,మా చెల్లి ఆ చీకట్లో రాత్రి 8 గంటలకు అది నీళ్ళు పడుతుంటే నేను బిందెలతో మోస్తూ ,సగం ఒంపేస్తూ నానా పాట్లు పడుతున్నాం ... ఇదే సినిమాల్లో అయితే హీరోయిన్ ఎంత వయ్యారంగా చుక్క వలగకుండా మోస్తుంది ,అసలే కరెంట్ లేక మోటార్ పని చేయడం లేదు ఇక్కడ నా చేతులు పడిపోతున్నాయి నీళ్ళు బోరింగ్ కొట్టలేక ,సరిగ్గా తీసుకువెళ్ళు మా చెల్లి విసుక్కుంది ...ఆహా.......ఖాళీ బిందె ఇస్తే నేను అంతకన్నా వయ్యారంగా మోస్తా అని తగవు వేసుకోబోతున్నంతలో ఫోన్ రింగ్ అయింది .... ఈ దిక్కుమాలిన ఫోన్ ఒకటి పని ,పాట ఉండదు ఇప్పుడే వస్తా అని తడి బట్టలు కాళ్ళకు అడ్డం పడుతున్నా కుళాయి ఎక్కడ కట్టేస్తాడో అని పరుగు పరుగున ఇంట్లోకి వచ్చాను ...


ఇంట్లో గదిలో నలుగురైదుగురు చుట్టాలు పిచ్చా పాటి మాట్లాడుకుంటున్నారు కొవ్వొత్తి వెలుగులో , నాన్న అప్పుడే వచ్చారు ఫోన్ దగ్గరకు ..నేను తడి వల్ల పడిపోబోతూ నిలదొక్కుకున్నా ... వాళ్ళలో ఒకరు ఆ..ఆ ..ఆ అంత కంగారేమిటి పడతావ్ అంటుండగానే ఫోన్ లిఫ్ట్ చేసాను ...హలో అన్నాను , హలో అటునుండి మెల్లిగా వినబడింది ... హలో ఎవరు ...మళ్ళి రెట్టించాను ...
అటు నుండి తడ బాటుగా నా పేరు చెప్పి నువ్వేనా అన్నారు.. అవును నేనే మీరెవరు అన్నాను ....నేను.. అని తన పేరు చెప్పారు ...మా ఆయన.. ఒక్క క్షణం నా మట్టి బుర్రకు తట్టలేదు ... ఎవరు అనుకుంటుండగానే అర్ధం అయింది తను అని.. ఆ తరువాత మెదడు కాసేపు మొద్దుబారిపోయింది..ఇప్పుడేం మాట్లాడాలి???.. ఎదురుగా మా నాన్న నా వైపు చూస్తూ .. ఆ పక్కనే అమ్మలక్కలందరూ కబుర్లాపి నా మొహం లోకేచూస్తూ ఉన్నారు..

పాపం మా ఆయన అటుపక్కన నేనేదో మాట్లాడేస్తా అని చాలా ఊహించేసుకుని వచ్చిన వారు కాస్తా, నేను మౌనమ్ అయిపోయే సరికి ఏం మాట్లాడాలో తెలియక బాగున్నావా అన్నారు ..
ఊ అన్నాను..
భోజనం చేసావా ..
ఊ ..
మీకు తుఫాన్ అంట కదా

కరెంట్ లేదు అంట కదా

కష్టం కదా

ఏంటి బిజీనా
ఊ..ఉహు హు
నేను రేపు ఫోన్ చేయనా ఇదే టైం కి ???

ఉంటాను బై ..

ఎవరమ్మా నాన్న అన్నారు.. ఏమని చెప్పాలి ? అతను ఫోన్ చేసాడు అనాలా? మీ అల్లుడు గారు అననా??.. చీ.. మరి చండాలం గా ఉంటుందేమో ..మెల్లగా మా ఆయన పేరు చెప్పాను..


అప్పుడు మొదలు పెట్టింది అందులో ఒక ఆమె ... నేను ముందే అనుకున్నా ఈ పిల్ల పడుతూ ,పరిగెడుతూ వస్తున్నపుడే ... నిన్నగాక మొన్న తాంబూళాలు అవ్వలేదు , అప్పుడే ఫోన్ నెంబర్లు వరకు వచ్చేసిందా !!!! అని మా వైపు చూసి అని ,మిగిలిన వాళ్ళతో మా రోజుల్లో అయితేనా పెళ్లి చూపులే ఉండేవే కావు.. నేను మీ బావగారిని పెళ్లి పీటలమీద చూడటమే ...అంది , మరొక ఆవిడ ఏమనుకుందో ,మన రోజులు వేరులేవదినా , అయినా తాంబూళాలు అయ్యాయి అంటే సగం పెళ్లి అయిపోయినట్లే కదా అని సర్దబోయింది.. ఏంటి సగం పెళ్లి అయిపోవడం ..మా ఊర్లో ఫలానా వాళ్ళ మనువరాలు ఇలాగే తాంబూళాలు అవ్వడం పాపం ఒకటే ఫోన్లు ,ఇక ఇకలు ,పక పకలు ...ఆడది నవ్వితే మగాడు ఊరుకుంటాడా ,వాడు మాట్లాడితే ఇంటికి వచ్చేయడం మొదలేట్టెసాడు ...వాళ్ళ అమ్మనాన్నకన్నా బుద్ది ఉండాలా ... వాడితో ఒకటే సినిమాలు ,షికార్లు.. హవ్వ చెప్పుకుంటే సిగ్గుగాని మొగుడూ పెళ్ళాల్లా తిరిగేసారు.. ఆ తరువాత ఇంకేముంది ఎవడో ఆకాశ రామన్న ఈ పిల్ల మంచిదికాదని లెటెర్ వేసాడంట ..సంబందం కేన్సిల్ చేసేసుకున్నారు.. ఆవిడ ఇంకా ఇంట్రెస్టింగ్ గా చెబుతుంది కాని నాకు గుండేల్లో గూడ్స్ బండి పరిగెట్టెయడం మొదలయింది మా నాన్నను చూసి ... నువ్వు బయటకు వెళ్ళూ అన్నారు నాన్న కాస్త సీరియస్సుగా ... ఇంటికొచ్చిన చుట్టాలను ఏమీ అనలేక నాన్న ఆ కోపం నా మీద చూపారని తెలుసు కానీ .. ఏంటో అవమానం క్రింద అనిపించింది.. అది కాస్త మా ఆయన మీద కోపం క్రింద మారింది ..అసలు ఈయనగారిని ఎవరు ఫోన్ చేయమన్నారు..కొద్దిరోజుల్లో పెళ్ళి అయిపోతుంది కదా ... అని అర్దంపర్దం లేకుండా కాసేపు తిట్టుకున్నాను గాని ఆయన చేసింది తప్పుకాదని తెలుసు.. అలా కోపం కాస్త జాలి క్రింద ఆ తరువాత నాకోసం ఒక అబ్బాయి ఫోన్ చేసాడన్న అదొక సరదా ఫీలింగ్ క్రింద అనిపించింది ...


ఆ మరుసటి రోజు మద్యాహ్నం అమ్మ పక్కకు పిలిచింది.. కొంచం తడబడుతూ, మోహమాట పడుతూ ఆ అబ్బాయి ఫోన్ చేసాడంట కదమ్మా..అంది. ఊ ..అన్నాను.. మన ఇంటి సంగతి తెలిసిందే కదమ్మా ...పాడు జనాలు..కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు ... పెళ్ళి ఇంట్లో అపశకునాలు మాట్లాడుతారు..వయసొచ్చిందే గాని బుద్దిలేదు ... ఉమ్మడిలో ఎందుకమ్మా నలుగురి నోట్లో పడటం ... నలుగురితో పాటు నారాయణ ...కాస్త పెళ్ళి అయ్యేంతవరకూ ఎవరి కళ్ళలో పడకు ..దిష్టికళ్ళు .. నేను చెప్పింది అర్దం అయ్యిందా .. నాన్న చెప్పమన్నారు అని వెళ్ళిపోయింది..


ఎంత ఉక్రోషం వచ్చిందంటే ఆ అబ్బాయితో ఇంక మాట్లాడకు అని ఎంత చక్కగా చెప్పింది.. అక్కడికి నేనే ఫోన్ చేసినట్లు ...ఆ అబ్బాయితో మాట్లాడలేక ఉండలేక పోతున్నట్లు ..అందరూ నన్నే అంటారేంటి ..అయినా ఈ రోజుల్లో పెళ్ళి చూపుల్లో మాట్లాడకుండా,ఫోన్ లు చెయకుండా ఎవరన్నా ఉంటారా.. మొదటి సారిగా ఉమ్మడి కుటుంభలో పుట్టినందుకు కోపం వచ్చింది ...చీమ చిటుక్కుమన్నా ఇంటిల్లిపాదికీ తెలిసిపోతుంది ..అని తిట్టుకుంటుంటే అప్పుడు గుర్తు వచ్చింది రేపు ఇదే టైముకు కాల్ చేయనా అని అనగానే ,చిలకలా ఊ అనడం .... మరి ఇప్పుడెలా.. ఇంతలా చెప్పిన తరువాత కూడా మాట్లాడితే బాగుంటుందా ... కాసేపు ఏం చేయాలో తోచలేదు ...ఆ తరువాత వచ్చింది అయిడియా ... బయట S.T.D నుండి చేస్తే...ఇంట్లో బాగా జనాలు ఉన్నారు ,నేనే తరువాత చేస్తా అని ఏదో నచ్చ చెప్పితే, ఆ తరువాత సంగతి తరువాత.. అనుకుని ఆయన ఇచ్చిన ఫోన్ నెంబర్ ఎలాగో అలా వెదికి, ప్రెండ్ ఇంటికి వెళతాను అన్నాను .. ఎందుకూ అమ్మ,అమ్మమ్మ ఒకేసారి అడిగారు .. పెళ్ళికుదిరింది కదా శుభలేఖలు ఇచ్చే టైము లేదు, మిగిలిన వాళ్ళకు ఎలాగూ పెళ్ళిళ్ళు అయిపోయాయి ,మిగిలిన ఒకరిద్దరినన్నా పిలుద్దామని అన్నాను... అయ్య బాబోయ్ విఘ్నేశ్వర బియ్యం కట్టిన ఇంట్లో పెళ్ళి కూతురు పసుపు కాళ్ళతో బయటకు వెళ్ళడమే .. ఏమనుకుంటున్నావ్..ఇంకేమన్నా ఉందా ..మా అమ్మమ్మ మొదలెట్టేసింది .. ఏంటమ్మా .. ఇంక ఫ్రెండ్స్ ని కూడా పిలుచుకోవద్దా .. ఇన్ని రూల్స్ ఏంటీ ..నేను వెళతాను విసుగ్గా అన్నాను..ఇంక నాకు ,మా అమ్మమ్మకు చిన్న పాటి యుద్దం మొదలైంది.. చివరకు అమ్మ ...కాస్త చదవాగానే పెద్దదానివి అయిపోయావనుకున్నావా ... పెద్దవాళ్ళను అలా ఎదిరించచ్చా ... ప్రతిదానికీ గారం చేస్తుంటే ఇలాగే ఉంటుంది చెప్పింది విను కావాలంటే ఫోన్ చేయి మీ ఫ్రెండ్స్ కి..అసలే ఈ రోజు లక్ష్మి పూజ ..నీ చేత చేయిస్తున్నా ...పెళ్ళి అంటే ఏమనుకున్నావ్..నాన్నకు చెబుతా మరి..అని వెళ్ళిపోయింది ...


ఇంకేం చేయలేక ఇంట్లో ఉండిపోయా ...రాత్రి అవుతుంది గాని ఎంత టెన్షన్ అనిపించిందో .. ఆ అబ్బాయి ఫొన్ చేయడం మర్చిపొతే బాగుండును ఈ రోజు ,మా ఫోన్ పాడైపోతే బాగుండును ఇలా పిచ్చ ఆలోచనలు..రాత్రి పూజలో కూర్చున్నా గాని అతి చిన్న శబ్ధం కూడా భయంకరంగా వినిపించింది నాకు ... దేవుడా దేవుడా ఫోన్ రాకుండా చూడు స్వామి అనుకున్నంతలో ట్రింగ్ ట్రింగ్ మంటు ఫోన్ రానే వచ్చింది ... నీరసం వచ్చేసింది నాకు .. మా తమ్ముడు.... అక్కా!!!, బావ గారు నీకు కాల్ చేసారు ,రమ్మంటున్నారు అని ఇంత నోరు వేసుకుని అరిచాడు ఆ రూం నుండి.. నేను ఎవరి వైపూ చూడకుండా తల వంచుకు కూర్చున్నా..అందరూ నా వైపే చూస్తున్నారని తెలుసు ... మా నాన్న ఫోన్ తీసారు ..ఆ... బాబూ అమ్మాయి పూజలో ఉంది మద్యలో లేవకూడదు .. అమ్మ ఎలా ఉంది ,మీ నాన్న గారు బాగున్నారా నాన్న మాటలు చిన్న గా వినబడుతున్నాయి ..తల వంచుకున్నా గానీ ఏదో చెప్పలేని బాధ ... ఏమని అనుకున్నాడో.. కాబోయే భార్య తో ఎవరు మాట్లాడాలని అనుకోరు..మరీ ఇంత పంతం ఏంటీ మా వాళ్ళకు .. నిన్న కూడా ఊ ,ఉహు తప్ప ఇంకేం మాట్లాడలేదు ...ఏం ఫీల్ అయ్యాడో.. ఇంకోసారి ఫోన్ చేస్తాడా బుద్దున్నవాడెవడైనా .. ఇంక అంతే ఈ ఇంట్లో .. వీళ్ళ గోల తప్ప ఎదుటివాళ్ళ గోల వినిపించుకోరు.. ఎప్పుడో వాళ్ళ చిన్నప్పటి రోజులకీ ఇప్పటి రోజులకీ ముడేసుకుని కూర్చుంటారు అంతే .. అతనికి ఇక్కడి పరిస్థితి అర్దం కాదు.. దీనికి బాగా పొగరు,పోజు .. మరీ స్టైల్ కొడుతుంది అనేసుకుని ఉంటాడు.. మనసంతా భారం గా అయిపోయింది ... అది అతనిమీద జాలో ,లేక నన్ను అపార్దం చేసుకున్నాడేమో అన్న దిగులో,మా వాళ్ళ పై కోపమో ఏంటో నాకే అర్ధం కాలేదు..


మరుసటి రోజు ఇంట్లో అందరూ పెళ్ళిమాటలు మాట్లాడుతుండగా మెల్లిగా ఫోన్ దగ్గరకు వచ్చాను.. చేయనా ,వద్దా..ఎలా మాట్లాడాలి అనుకుంటూ..ఫోన్ అప్పట్లో మద్య గదిలో ఉండేది ఎవరు ఎటు తిరిగినా ఆ గదిలో నుండే వస్తారు కాబట్టి ఏం చేయాలో తోచలేదు ...ఇంతలో హఠాత్తుగా మళ్ళీ ఫొన్ రింగ్ అయింది, మొదటి రింగ్ కే హెల్లో అన్నాను పక్కనే ఉన్నాను కాబట్టి ... ఏంటి ఫోన్ పక్కనే ఉన్నావా అన్నారు .. ఎవరూ అన్నాను ఎవరో అర్దం కాక ... నువ్వేనా అన్నారు నా పేరు చెప్పి.. అవును అనగానే హమ్మయ్యా కంగారు పెట్టెసావ్ కదా గొంతు గుర్తుపట్టలేదా అన్నారు నవ్వుతూ తన పేరు చెప్పి.. ఒక్క రోజుకే ఎలా గుర్తు పట్టెస్తాను ..నాకు కనీసం ఒక 3 నెలలు పడుతుంది ... ఈ విషయం లో గ్రేటే మీరు అన్నాను.. ఇంకా నయం సంవత్సరం అనలేదు అని నిన్న మాట్లాడలేదే అన్నారు.. అది..పూజలో ఉన్నాను మద్యలో లేవకూడదనీ అని నసిగాను.. ఒక పక్క నుండి భయం ఎవరన్నా చూస్తున్నారేమో అని ..హూం నిన్న ఏం చేసానో తెలుసా ,నా ఫ్రెండ్ వాళ్ళ పాపతో దీపావళి టపాసులు కాల్పిస్తూ నీకు ఫోన్ చేయాలన్న విషయం గుర్తువచ్చి మద్యలో వదిలేసి వచ్చేసా ..వాడు బాగా పెట్టాడు నాకు అన్నారు.. అయ్యో అవునా మరి అదేం పని అన్నాను ఈ లోపల అమ్మమ్మ(పిన్ని అమ్మ ) వచ్చింది ఎవరే అనుకుంటూ .. ఫ్రెండ్ అన్నాను .. తను మంచం మీద కూర్చుంది..ఏంటీ మీ ఫ్రెండ్ వచ్చిందా అన్నారు ... ఆ, వచ్చింది .. నేను తరువాత మాట్లాడతాను ,ఖాళీ ఉన్నపుడు నేనే కాల్ చేస్తా... ఉంటాను అన్నాను... హేయ్ ఆగు,ఏంటి తరవాతా మాట్లాడేది .. ఎన్నాళ్ళకు దొరికావ్ మాట్లాడడానికి ..మీ ఫ్రెండ్ ని తరువాత రమ్మని చెప్పు ... అన్నారు.. బాగోదు అన్నాను అమ్మమ్మకు అనుమానం రాకుండా చూసుకుంటూ.. బాగానే ఉంటుంది గాని చెప్పు ఇంకా అన్నారు.. ఇంటినిండా ఒకటే జనాలు .. మా అక్క పెళ్ళి కూడా ఇప్పుడే గా .. మాట్లాడడానికి కుదరడం లేదు అన్నాను హింట్ ఇస్తూ ..మా ఆయనది నాకన్నా మట్టి బుర్ర ..అవునా .. ఇంకా చెప్పు అన్నారు.. ఏమనాలో అర్దం కాలేదు ..సరే ఇంక ఉంటాను అన్నాను .. ఇందాక నుండి బాగానే మాట్లాడవుగా ..ఏమైంది..ఓహ్ ఫ్రెండ్ వచ్చిందన్నావుగా సరే రేపు కాల్ చేస్తాను ఈ టైం కి ఇక్కడే ఉండు .. అన్నారు వద్దు ..వద్దు అన్నాను కొంచెం కంగారుగా .. ఎందుకని అన్నారు.. నాకెక్కడ దొరికావయ్య మహానుభావా అనుకుని కొంచెం పని ఉంది అన్నాను ..సరే అయితే పని అయ్యాకా నువ్వే కాల్ చేయి లేదా నేనే కాల్ చేస్తా అన్నారు..వద్దు కుదిరితే చేస్తా అన్నాను ...తొక్కేం కాదు ..నువ్వు ఇలాగే అంటావ్ రేపు నేనే కాల్ చేస్తా .. మీ ఫ్రెండ్స్ ఎవరినీ ఇంటికి రావద్దని చెప్పు అని పెట్టేసారు... మళ్ళీ రేపు ఫోన్ కోసం టెన్షన్ పడాలీ.. ఏంటే బాబు నీకీ కష్టాలు నామీద నేనే బోలెడు జాలి పడ్డాను ...


ఆ రోజునుండి మొదలైనాయి నా పాట్లు.. అటు తనకి చెప్పలేక, ఇటు మాట్లాడలేక.. ఒక వేళ చెప్పినా తనకి అర్దం కాదు ..మా అక్కా వాళ్ళింట్లో ఫోన్ అది పడుకునే రూం లోనే ఉంటుంది కాబట్టి దానికా ప్రోబ్లెం లేదు...నాకా వీలు లేదే ...


మెల్లిగా నేను తనమాటలకు అలవాటు పడటం మొదలు పెట్టాను.. ఎక్కడ ఫోన్ వస్తుందో అని భయం ప్లేస్ లో ఈ రోజింకా ఫోన్ చేయలేదేంటి అని నాకు తెలియకుండానే ఎదురు చూడటం మొదలైంది ...ఈ లోపల మా అక్క వచ్చింది.. అదెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న నేను రాగానే దాన్ని మేడ మీదకు తీసుకువెళ్ళి నా బాధలన్నీ ఇంకో రెండు కలగలిపి మరీ చెప్పాను.. అది వెంటనే ముందు నాకు చీవాట్లు వేసేసింది.. బుద్ది ఉందా నీకు ,వాళ్ళేదో అంటే దిక్కుమాలిన మొహమాటం ఒకటి వేసుకుని అతనితో మాట్లాడటం మానేస్తావా ... మంచాడు కాబట్టి మళ్ళీ, మళ్ళీ పిలిచి మాట్లాడాడు లేక పోతే దీనికి ఈ పెళ్ళి ఇష్టం లేదనుకునేవాడు.. అయినా ఇప్పుడు మాట్లాడితేనే కదా మీ ఇద్దరికీ మద్య ఫ్రెండ్షిప్ కుదిరేది ..దేనికి పనికొస్తావే తినడానికి తప్ప.. అని దులిపేసింది..ఇది మరీ బాగుందే అందరూ నన్ను అనేవాళ్ళే అన్నాను ... ఏడ్చావ్ ఏవరేమంటారు నేనూ చూస్తా.. నాన్నకి నేను చెప్తాలే .. నన్నూ ఇలాగే... మీ బావతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా పెళ్ళి చెసేసారు.. అది సరే గాని నువ్వు అన్నా బయటకు వెళ్ళి ఫ్రీగా మాట్లాడచ్చు కదా అంది..జరిగిన ఆ ముచ్చట కూడా చెప్పాను .. ఏమనుకుంటాడే ఇదెంత పీనాసో అని అనుకునే ఉంటాడు అంది.. అలా అనలేదు కాని నువ్వు కాల్ చేయచ్చు కదా మీ ఇంట్లో అంత ఫ్రీగా లేకపోతే అన్నాడు రెండు సార్లు ..పైగా ఎల్లుండి అక్క పెళ్ళి కదా రేపు పెళ్ళి కూతురిని చేయడం అదీ ఉంటుంది కదా అందుకే కాల్ చేయద్దని మరీ,మరీ చెప్పాను అన్నాను...హూం ..సరేలే ఈ రోజు బయటకు నాతో రా శుభలేఖలు పంచడం తో పాటు ఫోన్ కూడా చేద్దువు గాని అని ఇంట్లో వాళ్ళతో గొడవ పడి మరీ నన్ను బయటకు తీసుకు వెళ్ళింది ..


పస్ట్ టైం భయం లేకుండా మా ఆయనతో మాట్లాడే చాన్స్ వచ్చేసింది నాకు ... ఏంటో నెంబర్ డైల్ చేస్తుంటే చాలా హుషార్ అనిపించింది.. అటునుండి హలో అని వినబడగానే హాయ్ ఎలా ఉన్నారు అన్నాను ..ఏవరూ అటునుండి ప్రశ్న.. చ్చా.. గొంతువినంగానే గుర్తుపట్టేసే మేధావులు కదా చెప్పుకోండి చూద్దాం అన్నాను..ఏమో అండి మీకు తెలుసా నేను అటునుండి ప్రశ్న .. మీరు కేవలం గొంతు మాత్రమే గుర్తుపట్టి మాట్లాడతారు..నేను శ్వాస విని కూడా గుర్తుపట్టేస్తా.. నాకు హుషారులో మాటలు వరదలా వచ్చేస్తున్నాయి ..మీ పేరేంటండి మళ్ళీ ప్రశ్న.. హూం ఈ మనిషికసలు కొంచెం కూడా సరదా లేదు గెస్ చేయడానికి అని కాస్త తిట్టుకుని నేనూ అని నా పేరు చెప్పాను.. ఒహ్ మీరా అండి, మావాడు ఇప్పుడే బయటకు వెళ్ళాడు ...ఇప్పుడే వచ్చేస్తాడు ..మీరు కాల్ చేసారని రాగానే చెప్తాను ...సారీ అండి మీరనుకోలేదు ఆయన ఫ్రెండ్ కంగారు పడిపోతున్నాడు ..నేను ఎప్పుడు ఫోన్ పెట్టేసానో నాకే తెలియదు.. కాసేపు అయోమయం గా అనిపించింది .. ఏం మాట్లాడాను పది సార్లు గుర్తు తెచ్చుకున్నాను.. తను అనుకుని ఎక్కువతక్కువ వాగలేదు కదా.. చాలా సిగ్గుగా అనిపించింది.. ఎవరూ అని కనుక్కోకుండా ఎందుకొచ్చిన బేషజాలు నాకు ..ఇలాగే కావాలి నాకు ..అసలు బుద్దిలేదు అని నన్ను నేను తిట్టుకుంటూనే ఉన్నాను.. ఏమనుకున్నాడో ..ఆ అబ్బాయి తనకి ఏమని వర్ణించి చెప్పాడో ...జోకులేసుకుంటున్నారేమో ...వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్పేసాడేమో అతను.. మిగిలిన వాళ్ళు నవ్వుతుంటే ఇతనికి చిన్నతనం గా అనిపించిందేమో ...ఇలాంటి ఏమోలతో చాలా చాలా అనుకుని ఇంటికొచ్చేసాను.. యెహే పో ఎక్కువ ఆలోచించక ఒక్కోసారి అలా అవుతుంది అని అక్క తిడుతున్నా వినదే నా మనసు..


మొదటి సారి తన ఫోన్ కోసం నిమిషం నిమిషం ఎదురు చూసాను.. నేను ఫోన్ చేసాను అని తెలియగానే తప్పకుండా ఫోన్ చేయాలి కదా.. ఇంకా ఎందుకు చేయలేదు ఒక పక్క ఉక్రోషం ....మరొక పక్క కోపం.. నిద్ర రాదు.. ఆకలి వేయదు.. ఏడుపు వస్తుంది తప్ప... మరుసటి రోజు కూడా ఎదురుచూస్తునే ఉన్నాను ...ఫోన్ చేస్తారని.. నాకు నేనే చేయాలంటే భయం వేసింది ... ఎక్కడో ....నేను ఫోన్ చేసానని తెలిసినా తను పట్టించుకోలేదన్న వళ్ళుమంట కొంచెం ... ఆ రోజంతా అలాగే గడిచిపోయింది.. మరుసటి రోజు అక్క పెళ్ళిలో అందరు కిల కిలా..కల కలా తిరుగుతున్నా నాకు మాత్రం ఎవరితో మాట్లాడ బుద్దివేయదు ..నవ్వబుద్ది వేయదు ... మనసంతా పిండేసినట్లు ఒకటే బాధ ... నేనూ కూడా పెళ్ళి పెద్దలా కూర్చున్నా కుర్చీలో ఒక్కదాన్నే విడిగా ... పెళ్ళివాళ్ళు వచ్చేసారు అన్నమాట వినగానే హడావుడి మొదలైంది .... అప్పుడు గుర్తు వచ్చింది తను మాటి మాటికీ అనే వారు మీ అక్క పెళ్ళికి వస్తాను.. పెళ్ళి కొడుకు తరుపు నుండి.. తను కూడా మా వూరే కదా.. మాకు తెలిసిన వాళ్ళే ..అని ఏడిపించే వారు ..నేను వద్దని బ్రతిమాలేదాన్ని ..ఒక వేళ
నన్ను సర్ ప్రైజ్ చేయాలని నిజంగానే వచ్చేసాడేమో ...అందుకే ఫోన్ చేయలేదేమో ...ఆ ఆలోచన రావడం పాపం పెళ్ళి పందిరి అంతా రంగుల రాట్నంలా తిరుగుతునే ఉన్నాను...ఎక్కడో ఆశ వచ్చారని.. పెళ్ళి అయిపోయి ఇంటికి వచ్చేసాం గాని తను కనబడలేదు..


మరుసటి రోజు డల్ గా కూర్చున్నా ... కొత్త ఆలోచనలేం రాక నా మెదడు కాసేపు నిశ్శబ్ధంగా ఉంది.. మా ఇంట్లో వాళ్ళందరూ అమ్మానాన్నల మీద బెంగనేమో అనుకుని అంతకుముందే బోలెడు ధైర్యం చెప్పారు..మా నాన్న నా చిన్నప్పటినుండి వాడుతున్న బజాజ్ స్కూటర్ మీద కూర్చుని ఆలోచిస్తున్నాను.. ఎప్పటి నుండో ప్రేమగా చూసుకున్న వారినందరినీ వదిలి వెళుతున్నందుకు బాధ పడకుండా నిన్నగాక మొన్న వచ్చిన అతని గురించి అలా ఎదురుచూడటం నామీద నాకే కోపం వచ్చేస్తుంది ... సరిగ్గా అప్పుడు ఎవరో తలుపు తీసుకు వచ్చి, నా పేరు చెప్పి మీరేనా అండి అన్నారు..నేనే అన్నాను ఎవరూ అని చూస్తూ ..మీకు కొరియర్ అని ఒక పేకెట్ ఇచ్చారు..నేను అది ఓపెన్ చేస్తుండగానే అక్కకు బావగారు కొరియర్ పంపారూ అని మా పిన్ని కొడుకు లాక్కుని ఒకటె పరుగు ...మొదటి సారి పీ .టి ఉషలా పరిగెట్టి అందరిమీదా ఇష్టం వచ్చినట్లు అరిచేసి దాన్ని పట్టుకుని రూంలోకి పోయి తలుపు వేసుకుని ఓపెన్ చేస్తె మావారు నాకు మొదటి సారి పంపిన కానుక ముదురు ఆరెంజ్ కలర్ చీర ... చిన్న లెటెర్ ..అది అందుకున్న తరువాత ,చదివిన తరువాత మనసులో భారం అంతా తీరిపోయినట్లు వెక్కి వెక్కి ఏడ్చాను... అలా నేనూ ప్రేమించాను ... ప్రతి ప్రేమికులూ అనుభవించే ఆనందాన్ని, బాధను అనుభవించాను ఆ చీర ఇప్పటికీ నా దగ్గరే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా ... ఆ తరువాతా ఆయన నాకు ఎన్నికొన్నా దాని స్థానం దానిదే ...

69 వ్యాఖ్యలు:

శ్రీనివాస్ చెప్పారు...

నా విషయం లో కూడా తాంబూలాలకి పెళ్ళికి రెండు నెలలు ఉండడం తో కాస్త ఒకరి నొకరు అర్ధం చేస్కునే వెసులుబాటు.. పన్లోపని ప్రేమించేస్కునే అవకాశం రెండు కలిగాయి.

కాకపోతే మీది ల్యాండ్ ఫోన్ కనుక కొన్ని ఇబ్బందులు వచ్చినట్టున్నాయి మాకు సెల్ ఫోన్ ఉండడం వలన ఏ ఇబ్బంది రాలేదు.

రెండు నెలల్లో మేము మంచి ఫ్రెండ్స్ అవడం వాళ్ళ పెళ్లి పీటల మీద మమ్మల్ని చూసిన వాళ్ళకి వీళ్ళది లవ్ మ్యారేజా అన్న డౌటు కూడా వచ్చింది.

మొత్తానికి తాంబూలాలకి పెళ్ళికి మద్య ఉండే టైము ప్రతి జంట జీవితం లో ఒక మధురానుభూతి కదా .

హరే కృష్ణ చెప్పారు...

సస్పెన్స్ లో పెట్టారు కదండీ..ఆఫీసు లో ఉన్నాను అని మర్చిపోయి మొత్తం చదివాకనే వెనక్కి చూసాను..ఇంటరెస్టింగ్ గా చక్కగా రాసారు..అభినందనలు

Unknown చెప్పారు...

బాగుంది

Vinay Chakravarthi.Gogineni చెప్పారు...

chaala chaala baagundi

లక్ష్మి చెప్పారు...

ఎంత బాగా రాసారు నేస్తం. నిజంగా సీన్ మొత్తం అలా కళ్ళకు కట్టినట్టు. చాలా అదృష్టవంతురాలు మీరు, చక్కటి అనుభవాలు మీ సొంతం. I wish you all the best

నాగప్రసాద్ చెప్పారు...

చాలా బాగా వ్రాశారు. :)

ఇందుమూలముగా పెళ్ళికాని అబ్బాయిలకి, అమ్మాయిలకి తెలియజేయడం ఏమనగా తాంబూలాలకి, పెళ్ళికి మధ్య మినిమం రెండు, మూణ్ణెళ్ళు సమయం ఉండేటట్లు ప్లాన్ చేసుకోవలసిందిగా బ్యాచిలర్ల సంఘం నుంచి జీవో పాస్ చేయడం జరిగినది. నిబంధనలను అతిక్రమించిన వారు శిక్షార్హులు. :):)

నేస్తం గారు, ఈ టపా చదివి మా సంఘం నుంచి జీవో పాస్ చేశాము. నెనర్లు.

నేస్తం చెప్పారు...

శ్రీనివాస్ గారు ఆ అనుభూతి ఎన్నాళ్ళు అయినా మరిచిపోలేము...
హరే క్రిష్ణ గారు మీ అబినందనలకు ధన్యవాధాలు
ప్రదీప్ గారు థేంక్స్ అండి.. మర్చిపోయాను మీ బ్లాగు ఓపెన్ చేస్తుంటే ఎర్రొర్ వస్తుంది అండి ఒక్కోసారి అర్జున్ గారు ప్రదీప్ గారు

నేస్తం చెప్పారు...

చక్రవర్తి గారు థేంక్స్ అండి
లక్ష్మి గారు థేంక్స్ అండి :)

నేస్తం చెప్పారు...

ప్రసాద్ గారు హ ..హ .. నవ్వులాట కన్నా అది నిజమే ... :)

మరువం ఉష చెప్పారు...

నేస్తం, చిర కాలానికి చక్కని దృశ్యాన్ని కళ్ళకు కట్టినట్ట్లు చూపారు. ప్రతి పలుకు జీవం వుట్టిపడుతున్నాయి. ఇకపై తరుచుగా వ్రాసే వీలు చిక్కిందని అనుకుంటున్నాను. అభినందనలు.

ప్రపుల్ల చంద్ర చెప్పారు...

ఎప్పటిలా చాలా బాగా వ్రాసారు...

మురళి చెప్పారు...

బాగుంది మీదైన శైలిలో...

నీ నేస్తం చెప్పారు...

cute love story :)

Viswanadh. BK చెప్పారు...

చాలా బాగా రాసారు. మొదలెట్టిందగ్గిరినించి చివరవరకూ ఏకబిగిన చదివించేసారు.

Unknown చెప్పారు...

బాగా రాసారండి. మా "పెళ్ళికాని కొత్తలో" రోజులు గుర్తుకొచ్చాయి :-)
అర్థం చేసుకోడం మాట ఎలా ఉన్నా, జీవితాంతం గుర్తుండిపోయే మధురానుభూతులు మిగులుస్తాయవి.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

నేస్తం గారు,
మీ టపా వల్ల ఒక అమ్మాయికి పెళ్ళి కుదిరిన తర్వాత తన భావోద్వేగాలు ఎలా ఉంటాయో తెలిసింది. నా లాంటి బ్రహ్మచారికి ఇది ఎంతో ఉపయోగం.
మీ మార్కు మిస్ చేయకుండా టపా బాగా రాశారు.

శివ చెరువు చెప్పారు...

No words... really really really great...

asha చెప్పారు...

చాలా బాగా ఉంది నేస్తం మీ ప్రేమకధ. ఎప్పటిలానే హాయిగా ఉంది మీ టపా.

Padmarpita చెప్పారు...

ఉ...ఊ..లతో ఊసులాడిన మీ ప్రేమ కథ బహుబాగున్నది..నేస్తం!

Surabhi చెప్పారు...

Nestham Gaaru,
Exactly Exactly the same happened to me when my Husband called me for the first time after our marriage was fixed.
It was night 8.15 PM and there was no Power and in those days we use to get municipal water alternate days that to in the night and as we lived in the 2nd floor I was taking water from downstairs and phone was ringing.No one was near by to take the call I had to take it and since I was coming from down stairs with nilla bindha I was not able to speak on the other side my husband was saying nenu, nenu it took me few min to get him and say a word.
I'am sorry to type in english as I have to leave immediately and also want to post the comment immediately.

uma చెప్పారు...

nestam gaaru, chala thanks anDi, adaggane tapaa rasaaru !

Chala baaga rasaaru, chala saarlu navvukunnaa , prathi ammai ki edurayye sanghatanale ainaa , meeru raasina saili fresh gaa undi !

అరుణాంక్ చెప్పారు...

catchy title and interesting narration.
we have 6 months gap after pelli chupulu.Gap should be there to know each other.We used to read the love letters now (many leters written that time).we had less telephonic talk.
some times I surprise ,really I have written thse leters.

నేస్తం చెప్పారు...

థేంక్స్ అండి ఉష గారు మీ అభినందనలకు.. కాని నాకు ఇంకో రెండు,మూడునెలలు తీరికలేదు ... పోస్ట్ లు రాయకపోయినా పలకరిస్తూ ఉంటాలెండి
ప్రపుల్ల చంద్ర గారు,మురళి గారు థేంక్స్ అండి

నేస్తం చెప్పారు...

నీ నేస్తం గారు పేరు బాగుందండి ... మీ అభిమానానికి ధన్యవాదాలు...
విశ్వనాధ్ గారు ,కామేశ్వర్ రావు గారు చాలా ధేంక్స్ అండి

నేస్తం చెప్పారు...

శేకర్ గారు పెళ్ళికుదిరన తరువాత ప్రతి అమ్మాయి ఇంచుమించు నాకులాగే ఆలోచిస్తుంది .. :)
శివ గారు ,భవాని గారు ,పద్మార్పిత గారు ధన్యవాధాలు

నేస్తం చెప్పారు...

సురభి గారు నిజమా భలే ఉందండి.... సేం పించ్ చెప్పుకుందాం రండి మొత్తానికి ఒకసారి వెనకు వెళ్ళిపోయి ఉంటారు
ఉమ గారు మీ అభిమానానికి ధన్యవాధాలు

నేస్తం చెప్పారు...

అరుణాంక్ గారు నిజమే ప్రేమలేఖలు ఎంత అందంగా ఉంటాయి .. మళ్ళి మళ్ళీ చదువుకున్ననంత సేపు ఆ రోజులకు వెళ్ళిపోతాం ... పెద్దవాళ్ళు కుదిర్చిన పెళ్ళిలలో కూడా ప్రేమ ఉంటుంది మరి :)

అజ్ఞాత చెప్పారు...

రాజ్ కుమార్

మీ టపా కోసం కళ్ళు కాయలు కాసేల ఎదురు చూస్తున్నానండి. కాస్త త్వర త్వర గా రాయొచు కదా నాలాంటి అభిమానుల కొసం :)
ఛాలా బాగా రాసారు నేస్తం గారు.

కథాసాగర్ చెప్పారు...

అమ్మ గురించి రాసిన టపా తరువాత అదే రీతి లో మరో మంచి టపా రాసారు. థాంక్స్

నేస్తం చెప్పారు...

థేంక్స్ రాజ్ కుమార్ గారు ..కొంచెం బిజిగా ఉన్నదటం వల్ల బ్లాగ్ని ఓపెన్ చేయడం లేదు..
కధా సాగర్ గారు ధన్యవాదాలండి

Ramani Rao చెప్పారు...

బాగుందండి ప్రేమాయణం... ప్రేమలో అప్పుడు పడి నిలదొక్కుకొని.... ఇప్పుడు నిలబడ్డారన్నమట :)

Ramani Rao చెప్పారు...

బాగుందండి ప్రేమాయణం... మీరలా ప్రేమిస్తూఊఉ ఉండాలని....

నిషిగంధ చెప్పారు...

మీ ప్రేమకధ చాలా బావుంది నేస్తం.. కాస్త ఆలశ్యమైనా మంచి టపా అందించారు.. ఎంగేజ్ మెంట్ తర్వాత పెళ్ళికి ముందు వచ్చే ఆ కొన్ని రోజులూ చాలా మంది జీవితంలో మరపురాని రొజులవుతాయి.. తర్వాత జీవితాంతం కలిసి ఉంటాము, అలుపొచ్చేవరకూ కబుర్లు చెప్పుకోవచ్చని తెల్సినా ఆ నాలుగు రోజుల్లో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి ఎంత తహతహగా ఉంటుందో! ఒక అవకాశం మిస్ అయితే అదేంటో లైఫ్ టైం ఛాన్స్ మిస్ అయినంత దిగులేస్తుంది :-)

Sudhakar చెప్పారు...

చాలా బాగా రాసారు.

నేస్తం చెప్పారు...

రమణి గారు :)
నిషి గంద గారు " అలుపొచ్చేవరకూ కబుర్లు చెప్పుకోవచ్చని తెల్సినా ఆ నాలుగు రోజుల్లో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి ఎంత తహతహగా ఉంటుందో! ఒక అవకాశం మిస్ అయితే అదేంటో లైఫ్ టైం ఛాన్స్ మిస్ అయినంత దిగులేస్తుంది .."
అబ్బా నా గోడంతా ఒక్క ముక్కలో చెప్పేసారుగా ... ఇప్పుడు ఎంత మాట్లాడినా ఆ సరదా రాదుగా

సిరిసిరిమువ్వ చెప్పారు...

అందరికి పెళ్లికాని కొత్తలో రోజులు గుర్తుకు తెచ్చారుగా:). చాలా రోజులకి వ్రాసినా ఓ తియ్యటి టపా వ్రాసారు.

నిషిగంధ గారి కామెంటు ఇంకా హైలైటు.

రాధిక చెప్పారు...

ఒక్క గుక్కలో చదివేసాను.[ఇలా అనొచ్చా?]ప్రదేశాలు వేరు గానీ సన్నివేశాలవే.పరీక్షల ముందు రోజు నిశ్చితార్ధాలు అయ్యాయి.తరువాత రోజు కాలేజీకొస్తారని తెగ ఎదురు చూసా.నాకు చాలా ఇష్టమైన బోటనీ పరీక్షని గంటలో రాసి పడేసి వాళ్ళెంత తొందరగా పేపరు తీసుకుంటారా అని ఒకటే ఎదురు చూపులు.అరగంట ముందుగా పేపరిచ్చేసి బయటకొచ్చేసా.మా గేంగ్ అందరూ తెగ ఆడుకున్నారు నన్ను.ముద్ద పప్పు రావాలని కూడా తెలియదని తెగ తిట్టుకున్నాను.ఫోన్ల విషయం లో కొన్నాళ్ళు మీలానే ఇబ్బంది పడ్డాను.తరువాత ఇంటికి ఫోను చేసేవాళ్ళందరూ తెగ తిట్టుకునేవారు.నాన్నగారికి ఫోను చేసి మీ అమ్మాయి ని ఫోను పెట్టమని చెప్పండని జోకులేసేవారట.

శ్రుతి చెప్పారు...

నేస్తం! మాటలకే అందనంత సంతోషమేసింది. నిజంగా ఇంట్లో వాళ్ళను, మీ భావాలను కళ్లముందు నిలిపారు.
నాకైతే ఇంకా అలా కళ్ళాముందు, మీరు ఫోన్లో ఊ.. ఊ.. అనడమే వినిపిస్తుంది(కనిపిస్తుంది).

నిజంగా అదృష్టవంతులు.

Shiva Bandaru చెప్పారు...

నిజంగా సీన్ మొత్తం అలా కళ్ళకు కట్టినట్టు రాసారు.బావుంది.

అజ్ఞాత చెప్పారు...

Nestham gaaru , chaala baaga raasaru. Arranged marriage loo intha thrill untundi ani ippudee telisind.. :)

నేస్తం చెప్పారు...

సుధాకర్ గారు ధన్యవాదాలండి
మువ్వ గారు :)
రాధిక గారు చక్కగా క్లుప్తంగా చాలా బాగా చెప్పారు మీ కధను :)

నేస్తం చెప్పారు...

శ్రుతి గారు మీ అభినందనలకు ధన్యవాదాలు
శివ గారు థేంక్స్ అండి
ఆంధ్ర పిల్లగారు నా అభిప్రాయం అదే పెద్దలు కుదిర్చిన వాటిలోనూ ప్రేమ ఉంటుంది :)

Shashank చెప్పారు...

చాల బాగుందమ్మ మీ ఫోనాయనం. మొదట్లొ అందరికి (అంటే ఆల్మోస్ట్ అందరికి) ఇలా ఒకరితో ఒకరు మాట్లాడేదానికి ఇబ్బందిగానే ఉంటుందనుకుంటా. తర్వత తర్వత ఆ టైం కోసం వేచి చూడ్డం .. ప్చ్ విష్ణు చక్రం తిరుక్కుంటు గతం గుర్తొచిందండి. దినసరి జీవితాంలో పడి మర్చిపోయిన మా లాంటి వాళ్ళాకి (అంటే నాకు) అర్రెర్రె మనకీ ఇల ఒకప్పుడు జరిగిందే అని గుర్తుతెచినందుకు చాలా థాంక్స్.

మొదటి సారి మా ఆవిడ కి కాల్ చేసినప్పుడు నాకేం మాట్లాడాలో తెలీలేదు - ఉన్నావా అని అడిగా. తర్వత ఏం మాట్లాడలేదు. అటు నుండి దివ్య - ఉన్నావా? పోయావా? అని అన్నది. దెబ్బకి మైండ్ సెట్ అయ్యింది నాకు. నాకు పెద్దగ ఏం మాట్లాడామో గుర్తుండదు.. ఈ ఒక్క విషయం మాత్రం అలా నా ROM లో నిక్షిప్తమైపోయింది. వారాంటం వస్తే ప్రొదున్న 5 కి అల లేచి వెబ్ క్యాం తెరిచి చాట్ చేసేవాళ్ళం. టంచన్ గా ఐదైతే లేచేసేవాడ్ని. ఇప్పుడైతే ఏదు ముందు చచ్చినా లేవలేను. ఆ రోజుల్లో...

పరిమళం చెప్పారు...

నేస్తం ! తాంబూలాల తర్వాత మాట్లాడటానికి ఇంత భయమా అని ఇప్పుడు చాలామంది అనుకొని ఉంటారు కదూ ....
ఆ భయంలోని ..బిడియం ....పెద్దలపట్ల గౌరవం ...మీ అనుభవాన్ని చదివిన తర్వాత యువతకు తెలుస్తుందని అనుకొంటున్నాను . ఫాస్ట్ కల్చర్ లోనే ఆనందం ...అనుభూతీ ఉంటాయనుకొనే వారికి కనువిప్పు కలిగేలా ఉంది మీ ప్రేమ కధ !

వేణూశ్రీకాంత్ చెప్పారు...

నేస్తం, శీర్షిక చూసి ఇంతకు ముందు మీ ద్వారా విన్న మీ స్నేహితుల ప్రేమకధలు మీ సవాలక్ష అనుమానాలు నా కళ్ళ ముందు సినిమా రీల్ గా తిరగుతుండగా... అహా అవునా !! అనుకుంటూ మీ టపా మొదలు పెట్టాను. అద్భుతంగా ఉంది మీ ప్రేమ కధ...
నిషిగంధ గారి కామెంట్ కూడా చాలా బాగుంది.

నేస్తం చెప్పారు...

హ హ శశాంక్ గారు మరి అదే కదా... పెళ్ళికిముందు ఎప్పుడు ఫోన్ చేద్దామా అనిపిస్తుంది పెళ్ళి అవ్వగానే ఫోన్ చేయగానే మీటింగ్ లో ఉన్నాను పెట్టెయ్ అంటారు,,,
పరిమళం గారు నిజంగా అనుభూతి చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకు తెలియకుండా దొంగ పోన్లు చేసుకున్నా తల్లిదండ్రులను మోసం చేస్తున్నామేమో అని బాధ,భయం ఉండదు
వేణు గారు నాకు తెలుసు అలా అనుకుంటారని అందుకే అలా టైటిల్ పెట్టాను :P

Srujana Ramanujan చెప్పారు...

మిస్సయ్యాను నేస్తం మీ కొత్త టపా బిజీగా ఉండి. మొత్తానికీ వచ్చేశారన్నమాట. :-)

మీది లవ్ స్టోరీ 1999 నా?

భలే రాశారు.

గీతాచార్య చెప్పారు...

ఆ చీర ఇప్పటికీ నా దగ్గరే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా ... ఆ తరువాతా ఆయన నాకు ఎన్నికొన్నా దాని స్థానం దానిదే ...
*** *** ***
That is what is called love. పాపం ఎన్ని కష్టాలు అనుభవించారో అంత చిన్న వయసులో. :-) ’బహు’ కాల దర్శనం. బిజీగా ఉన్నదా మా నేస్తం?

గీతాచార్య చెప్పారు...

మర్చేపోయాను నేస్తం... కనీసం కిలో గోళ్ళు కొరికేశారా ఏమి?

నరేష్ నందం (Naresh Nandam) చెప్పారు...

బాగుంది నేస్తం..
అయ్యో.. పెద్దల మాట దాటలేక.. పెళ్లికి ముందు ప్రేమించలేక చాలా మిస్ అయ్యామనుకునే వాళ్లని ఇంకా అసూయపడేలా చేస్తున్నారు మీరు.

Narendra Chennupati చెప్పారు...

నేస్తం గారు, బాగున్నాయండి మీ ప్రేమ కబుర్లు..

Rajendra Prasad(రాజు) చెప్పారు...

ప్రతి సీను కళ్ళకు కట్టినట్టు రాసారండి....
మీ రచనా శైలి చాలా బాగుంది...
ఒక బ్రహ్మచారిగా ఇవన్ని మనసులో పెట్టుకుంటాను..

నేస్తం చెప్పారు...

స్రుజన గారు మీరు పిలవడం నేను రాకపోవడమూనా .. ఎంత మాట :)
గీతాచార్య గారు అవునండి కొంచెం బిజినే ఈ మద్య ..మీరు మరీనూ కిలో ఎక్కడ కొరికాను ఒక పావు కిలో వేసుకోండి :)
నరేష్ గారు :)
నరేంద్ర గారు,రాజేంద్ర గారు థేంక్స్ అండి

Dhanaraj Manmadha చెప్పారు...

Heartening to see a simple narration. I enjoyed it thoroughly.

So, u have a long and memorable love story. Congrats.

Unknown చెప్పారు...

chala baga rasaru. okkasariga system ki atukkupoyi mari chadivanu.

నేస్తం చెప్పారు...

ధన రాజ్ గారు ,tj గారు ధన్యవాధాలండి

జీడిపప్పు చెప్పారు...

చాలా బాగా వ్రాసారు. మీ ఫోను కష్టాలు చదువుతుంటే చాలా జాలేసింది, ముఖ్యంగా ఫోన్ వచ్చినపుడు ఇంట్లో ఉన్నవారి మాటలు చూసి :)

Ram Krish Reddy Kotla చెప్పారు...

నేస్తం చాలా బాగా రాసారు..నిజంగా పెళ్ళికి నిశ్చితార్ధనికి మధ్య ఉన్న సమయం జీవితం లో మరచిపోలేనిది...మే పోస్ట్ చదివాక, ఎంత తొందరగా నాకు ఎంత తొందరగా నిశ్చితార్ధం జరిగితే అంత బెటర్ అనిపిస్తుంది..హ హ...మే స్ఫూర్తి తో చివరికి నేను నా బ్లాగ్ కి రూపాంతరం కల్పించాను..మొదటి పోస్ట్ పబ్లిష్ చేసాను నిన్నే...మీకు వీలు చిక్కినప్పుడు, ఓ సరి మా బ్లాగ్ ని దర్శించండి..its http://akasaveedhilo.blogspot.com ..మీ తదుపరి పోస్ట్ కోసం ఎదురు చూస్తుంటా...ఇక ఉంటాను

నేస్తం చెప్పారు...

జీడి పప్పు గారు :)
కిషెన్ గారు చదివాను చాలా బాగా రాసారు, మీ అభిమానానికి ధన్యవాదాలండి :)

dj చెప్పారు...

Simply superb... chala chala baaga rasaru :)

అజ్ఞాత చెప్పారు...

నేను మామూలుగా పెద్ద పెద్ద టపాలు చదవను.....మీవి మాత్రం చదువుతా...బోర్ కొట్టవు....

నేస్తం చెప్పారు...

dj గారు ,హరిష్ గారు థేంక్స్ అండి :)

పేరు చెప్తే గుర్తుపట్టేంత గొప్పవాడిని కాను చెప్పారు...

hello nestam garu....

nenu eevale mee blog ni first time choosanu...ala ala pipina blogs chadavagane chala intresting ga anipinchindi...so blogs to follow lo add chesukunnanu....naaku monne maa vallu shock icharu inka tvaraga cheduvu complete chesi pelli chesuko ani....

ilati sweet memories untai ante chesukovali ane undhi...kani settle avakunda nte bayamganu undhi....anduke no cheppanu....kani mee blog chadivaka aha malli thoughts tho brain baddalu ayipotundi...naaku peeli sambandhalu choodaka munde ila undhi inka choosi engagement aithe naaa saami ranga.....(anipistundhi)

ento ee feeling....antha mee blog mahima....

నేస్తం చెప్పారు...

హ హ ..ఇలాంటివి చదివి సెటిల్ అవ్వకుండా పెళ్ళీ చేసుకోకండేం ..హాయిగా జాబ్ చేసి సంపాదన మొదలెట్టాకా అప్పుడు పెళ్ళి చేసుకోండి. మనం మనసు ఆనందం గా ఉండాలే గాని అన్నీ అందంగానే ఉంటాయి ఏమంటారు :)

అజ్ఞాత చెప్పారు...

Bhale post andi. Pch.. Okka 5 years mundu meeru raasi vunte, nenu chadivi vunte, naa wife baadha naaku appudu artham ayyedi. Pelliki mundu nenu call chesthe ilaa relatives vunnaru ani chepthe... aa valla viseshalu yenti ani peekku tine vaadini. papam my wife.

Thanks for taking me back in time,
- Oka matti burra :-)

Raja చెప్పారు...

బుజ్జక్కా, ఈ ఫొటోస్ ఎక్కడ దొరుకుతాయి అక్కా, భలే భలే ఫొటోస్ పెడుతున్నావు.

రాజా

Sai Praveen చెప్పారు...

ఈ పోస్ట్ నేను ఇంతకుముందు చదివాను కానీ, ఇందాక మీ బ్లాగ్ గురించి మా ఫ్రెండ్ కి చెప్తూ ఈ పోస్ట్ మళ్ళీ చదివాను.
Very beautiful. ఇంత కంటే నా దగ్గర మాటలు లేవు.

ఏంటో నాకు వెంటనే ఎవరినైనా ప్రేమించాలనిపిస్తోంది ;) :P

అజ్ఞాత చెప్పారు...

akka me post super.... entha andanga chupincharu me prema kathani... chala chala bavundhi :)

రామ చెప్పారు...

మాక్కూడా నిశ్చితార్దానికి, పెళ్ళికి మధ్యలో ఐదు నెలలు ఉంది. మొదట్లో ఫోన్ చేసుకున్నప్పుడు ఏమి మాట్లాడుకోవాలో తోచేది కాదు. ఒక నాలుగైదు సార్లు మాట్లాడేక ఎన్ని గంటలయినా సరిపోయేవి కాదు. మా కథలో ట్విస్ట్ ఏమిటంటే, అనేక గంటల ఫోన్లతో బాటు పాత కాలం లో లాగ పాతిక ముఫ్ఫై చక్కటి తెలుగు ఉత్తరాలు కూడా రాసుకున్నాం :).