10, మే 2009, ఆదివారం

అమ్మఅమ్మ గురించి ఇప్పటికి వేల వేల కవితలు,కావ్యాలు వచ్చేసి ఉంటాయి ..అయినా అమ్మ గురించి చెప్పమంటే ప్రతి ఒక్కరు తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఆనంద పడిపోతాం ... నేనెప్పుడూ అమ్మ కి మదర్స్ డేలు, అమ్మకి బర్త్ డే లు జరపలేదు .. అసలు అమ్మ,నాన్న పెళ్లి రోజు కుడా నాకు తెలియదు .. కాని అమ్మ నా జీవితం లో ఒక ముఖ్య భాగం ..

చిన్నపుడు మా అక్క ,చెల్లిళ్ళం చిన్న విషయం చెప్పాలన్నా మా నాన్న దగ్గరకు పరిగేట్టేవాళ్ళం .. పొండే మీకు మీ నాన్న ఇష్టం ..నేను కనబడను అని అమ్మ అప్పుడప్పుడు ఉడుక్కునేది ... కాని అమ్మ ప్రభావం మా మీద ఎంత ఉందో మా పెళ్ళిళ్ళు అయ్యాకా గాని తెలియలేదు..

అమ్మ దగ్గర నేర్చుకున్న అతి ముఖ్య విషయం.. పని ని ఇష్టం గా చేయాలి గాని కష్టం గా చేయకూడదు అని .. అమ్మ ని చిన్నప్పటి నుండి చూస్తున్నా .. ఏ పని అన్నా ఇట్టే చేసేస్తుంది ... అస్సలు విసుక్కోదు..పని మనిషిని పెట్టదు, నీకెంత ఒపికమ్మా అనగానే ..ఎవరికిరా చేస్తున్నా నా పిల్లలకే కదా ...అయినా ఇప్పటి నుండే మనం ఒకరి మీద ఆదారపడ్డామనుకో వయసు ఎక్కువయ్యే కొద్ది అసలు చేయలేము.. బండెడు అంట్లు చూసి భయ పడే కన్నా వాటిని ముందేసుకుని నీకు నచ్చిన నాలుగు పాటలో ,లేక మరేదన్నా పనికొచ్చిన విషయం గురించో ఆలోచిస్తూ తోమేసుకుంటే పనికి పని అయిపోతుంది , శ్రమా తెలియదు ... అనేది ... ఇప్పుడు సింకు నిండా గిన్నెలు చూడగానే ఒక సుశీల ,జానకి ని అయిపోతూ ఉంటా ఆ విషయం గుర్తు తెచ్చుకుని ...


ముఖ్యం గా అత్తింటి లో ప్రతి విషయం పుట్టింటికి చెప్పడం అసలు ఇష్ట పడేది కాదు .. మనకు వచ్చే చాలా సమస్యలు మనం పరిష్కరించుకోగలం .. వాటిని చాంతాడులా ఉహించుకుని ఎక్కడో ఉన్న అమ్మా నాన్న్నలను భయ పెట్టడం మంచిది కాదు ..సమస్య మన చేతులనుండి జారిపోతుంది అన్నపుడే చెప్పాలి అనేది.. తను పెళ్లి అయికోత్తగా మా ఇంటికొచ్చినపుడు మా నాన్న వాళ్ళ ఇల్లు తాటాకుల ఇల్లు అంటా , అది కుడా కాస్త వర్షం వస్తే కారిపోయేది .. అప్పుడు అమ్మ నగలు ,పెద్దమ్మ నగలు మొత్తం అమ్మేసి అప్పు చేసి మా ఇల్లు కట్టారు.. పైగా మరుదులందరూ చిన్నపిల్లలు,నాన్న ,పెదనాన్న సంపాదన మీదే కుటుంభం అంతా నడవాలి .. ఒక్కో సారి మాకు పాలు ఇవ్వడానికి కుడా ఇంట్లో పాలు సరిపోయేవి కావంట.. అప్పుడు పెద్దమ్మ ,అమ్మ పాలకు బదులు నీళ్ళ లో పంచదార కలిపి పట్టేవారంటా.. అమ్మా మరి నీకు కోపం రాలేదా ..నీ నగలన్నీ అమ్మేస్తే .. పైగా సొంత ఇల్లు కాదు ఇది ఉమ్మడి కదా ..మీ డబ్బులతో పిల్లలకు పాలు కుడా కొనలేక పోతున్నందుకు బాధ కలిగి అమ్మకు ,నాన్నకు చెప్పలేదా అంటే ...ఏమోనమ్మా అప్పుడు అందరం తడవకుండా ఇల్లు కట్టుకుంటున్నాం అని అనిపించేది నాకు,పెద్దమ్మకు .. అంతకు మించి ఏమి తెలిసేది కాదు ..,,, పైగా మీ చిన్నాన్నలందరూ చిన్న పిల్లలు , మేము వదిలేస్తే ఎవరు చూస్తారు , మీకు సరి అయిన తిండి పెట్టక పోవడం బాధ అనిపించేది కాని అప్పుడు మాకు సొంత కాపురాల ఆలోచనే వచ్చేది కాదు .. పోనిలే ఆ పుణ్యమేనేమో అందరం బాగున్నాం అనేది..


అలాగే పుట్టింటిని అస్సలు తేలిక చేసేది కాదు .. మా మావయ్య మా తాతగారి ఆస్తులను మొత్తం కరగపెట్టేసాడు వ్యాపారాల పేరు చెప్పి .. ఎప్పుడన్నా అక్క ఆ విషయం మాట్లాడిందో అసలు ఊరుకునేది కాదు మా ఆస్తి విషయం మా నాన్న ,తమ్ముడు చూసుకుంటారు మీకెందుకు అని కంట నీరు పెట్టేసేది .. దెబ్బకి మా నాన్న మాకు వార్నింగ్ ఇంకోసారి ఆ విషయం ఎత్తారంటే ఊరుకోను అని ...అలాగే అత్తలు ఇంటికొస్తే చిన్నపిల్లలా ఎంత సంతోష పడిపోతుందో ..వాళ్లకు తన చీరలు ఇస్తుంది .. ప్రేమ గా మాట్లాడుతుంది ... ఆడపడుచు అధికారం చూపదు..


ఇలా అమ్మదగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను ..చిన్నపుడు ఒక సారి ఏదో చిన్న తప్పు చేసాను ,వెంటనే కొంత డబ్బు నష్టపోయాను .. అప్పుడు కోపం వచ్చి ఎందుకమ్మా దేవుడు పెద్ద తప్పులు చేసిన వాళ్ళను ఏమి అనడు .. మంచి వాళ్ళు చిన్న తప్పు చేస్తే మాత్రం వెంటనే శిక్ష వేస్తాడు అనగానే ఎందుకంటే మంచివాళ్ళు మళ్లీ మళ్లీ ఆ తప్పు చేయకుండా వెంటనే చుపుతాడన్నమాట... చెడ్డ వాళ్ళకు ముందు ముందు ఉంటుంది అని అనేది ..అమ్మను చూస్తేనే దైర్యం గా ఉంటుంది ...


అమ్మకు వాణిశ్రీ అంటే చాలా ఇష్టం .. వాణిశ్రీ చాలా బాగుంటుంది కదా అనేది టి వి లో చూస్తూ .. మా చెల్లి తెగ ఏడిపిస్తుంది .. ఏం టేస్ట్ అమ్మా .. నెత్తి మీద కుండ బోర్లించినట్టు ఆ హెయిర్ స్టైల్ అదినూ .. గంగ,మంగ సినిమా చూసాక ఇంకా దాని సినిమా చూడకూడదని ఒట్టేసుకున్నా అనేది .. ఏడ్చావులే,ఈ రోజు మీరు కడుతున్న చీర స్టైల్స్ అన్ని ఆ రోజు అది కట్టినవే అని ఉడుకున్నేది ... ఇప్పటికీ చెల్లి అమ్మను వాణిశ్రీ గారు అన్నం ఉడికి పోయింది కాస్త వార్చండి అని ఆ పేరుతోనే పిలిచి ఏడిపిస్తుంది ...


అమ్మకు బాగా చిన్న వయసులోనే పెళ్లి చేసేసారు పెళ్లి నాటికి తనకి 15 అంటా, 20 వచ్చేసరికి మేము పుట్టేసాము ... అందువల్ల ఎక్కడికి వెళ్ళినా మీ అక్క గారా అని ఎవరన్నా మమ్మల్ని అంటే అమ్మ ఫేసు ,నాన్న ఫేసు విడి విడి గా చూడాలి ... భలే నవ్వు వచ్చేది ... ఒక సారి అక్క అమ్మను బలవంతం గా కూర్చో పెట్టి బాగా మేకప్పు వేసి మంచిగా తయారు చేసి ఫోటో తీసింది ... అందులో అమ్మ ఎంత బాగుందో .. అమ్మ ఇప్పటికిని ఆ ఫోటో చూసుకుని మురిసిపోతుంది ... పాపం ఎప్పుడు తన చిన్న చిన్న కోరికలు కూడా బయట పెట్టేది కాదు ...


నా జీవితం లో మరచిపోలేని రోజు అమ్మ ,నాన్నఇక్కడకు రావడం .... అమ్మ తన పుట్టిన వూరు, మా వూరు తప్ప వేరే పట్టణానికి వెళ్ళలేదు .. ఒక సారి నాన్న హైదరాబాద్ తీసుకు వెళితే చార్మినార్ నీ కనురెప్ప ఆర్పకుండా ఎంతో ఆసక్తిగా చూసింది అంట .....అలాంటిది ఇక్కడ అంబరాన్ని తాకే భవంతులు విదేశీయులను ,ఇక్కడి జీవన స్థితిగతులను చూసి అమ్మ ఎంత సంతోషించిందో ..వణుకుతున్న చేతులతో నా చేయి పట్టుకుని అలా అన్నీ చిన్న పిల్లలా చూస్తూ ఉంది ...


అమ్మ ఇండియా వెళ్ళాకా, ఒక సారి ఫోన్ చేస్తే చెల్లి మాట్లాడింది .. అమ్మా తల్లీ నువ్వు బాగానే అన్నీ చూపావు గాని ఇక్కడ మమ్మల్ని ఒక రేంజ్ లో తినేస్తుంది అనుకో.. నువ్వు గ్రీన్ లైట్ వస్తే అమ్మ చేయి ఇలా పట్టుకుని రోడ్ దాటించావ్ అంట అని మా చేతులు పట్టుకుని రోడ్ కి అవతల తీసుకుపోయి మరి చూపిస్తుంది.. చిన్నపుడు నేను దాని చేయి పట్టుకుని నడిపిస్తే అది ఈ రోజు నా చేయి పట్టుకుని నడిపించింది అని మద్య మద్య సెంటిమెంట్ డైలాగ్స్ ఒకటి .... పోనీ అక్కడితో ఊరుకుందా పెద్ద జోకు ఒకటి పేల్చింది ... ఒకసారి ఏదో పార్టికి నువ్వు తయారు అయితే అచ్చం హేమా మాలినిలా ..ఏది , అక్షరాలా మన డ్రీం గర్ల్ హేమామాలినిలా అనిపించావంట.. పాపం మద్యలో వాళ్ళెందుకు లేమ్మా ..ఏదో ముంబాయిలో ప్రశాంతం గా బ్రతుకుతున్నారు వింటే బాధ పడతారు అన్నా వినిపిన్చుకోదు ... అని ఏడిపిస్తూ ఉంటే నోర్ముయ్యి గాడిదా నీకెందుకే అంత కుళ్ళు మా అమ్మ నన్ను పొగుడుకుంటే అని తిట్టాను ..లేకపొతే ఎంటక్కా,ఇప్పటికీ 89 సార్లు చెప్పింది ... ఇంకో 11 సార్లు చెబితే సెంచరి కొట్టేస్తుంది.. వచ్చిన వాళ్లకు, వెళ్ళిన వాళ్లకు ఆ ఫోటోలు చూపడం ,పొగడటం అంటుంటే 89 కాదు 999 సార్లు చెప్పినా వినాల్సిందే అని ఫోన్ పెట్టేసా ...


ఇలా ఎవరి అమ్మ గురించి వారు పుంఖాను పుంఖాలు గా రాయచ్చు ... కొసమెరుపేంటంటే ఎంత సేపూ మీ అమ్మ గురించేనా రాయడం ,మీ అత్తగారి గురించి ఏమీ రాయవా అన్నారు మావారు,నాకేం తెలుస్తుంది మీ అమ్మగారి గురించి మద్యలో వచ్చాను అంటే ఛా అంటూ వేటకారం చేసారు ,సరే మీరూ చెప్పండి మీ అమ్మ గారి గురించి అనగానే నవ్వేసుకుంటూ మరి చిన్నపుడు మా అమ్మ నేను ఎంత అల్లరి చేసినా ఏమీ అనేది కాదు ,నేను వీదిలో పిల్లలందరినీ కూడెసుకుని గోళీలాట ఆడి గంపలు గంపలు గోళీలూ తెచ్చి ఇంట్లో దాచేవాడిని..చెప్పేది ,చెప్పేది .. ఇల్లంతా చెత్త చేయకని.. నేను వినను కదా వాటిని తీసుకుపోయి బావిలో పడేసేది ..బావి పూడిక తీసేటపుడు తెగ వచ్చేవి.. ఇంకా పెద్ద పెద్ద తొట్టేలలో రంగు రంగుల చేప పిల్లలు వందల కొద్దీ పెంచేవాడిని ..వద్దురా అంటే వినేవాడిని కాదు ..ఇంట్లో నీళ్ళు అన్నీ వీటి కోసం వాడెసే వాడిని ... ఇంకా ఫ్రెండ్స్ అందరినీ ఇంటికి తీసుకొచ్చి అమ్మ చేసిన తినుబండారాలన్నీ పంచే వాడిని.. ఆంలెట్ లేకపోటే అన్నం తినే వాడినే కాదు.. పాపం ఓపిక లేకపోయినా వేసేది నా కోసం అని ట్రైన్ బండిలా చక చక చెపుతున్న మా ఆయన్ని ఆపి ఇంక ఇప్పుడు మా అమ్మ గురించి చెప్పండి అన్నాను .. మీ అమ్మ గురించి నేనేం చెప్పను నాకేం తెలుస్తుంది అన్నారు.. నేను నవ్వితే ,అర్దమైనట్లు హమ్మనీ నువ్వు తక్కువదానివి కాదు అని ఉడుక్కున్నారు

కాబట్టి ఎవరి అమ్మ గురించి వాళ్ళూ గ్రంధాలు రాసేయచ్చ్చన్న్నమాట :)

40 వ్యాఖ్యలు:

మరువం ఉష చెప్పారు...

అమ్మ మీద నచ్చిన పాట - "అమ్మ రాజినామా" చిత్రంలోని "ఎవరు వ్రాయగలరూ..." అలాగే నేను వ్రాసుకున్న కవిత అమ్మ అమ్మే - తను కాదా అనాది దేవత? http://maruvam.blogspot.com/2009/04/blog-post_24.html మీరిదివరకే చదివారు. వ్యాఖ్యలో దానికి ప్రేరణ ఏదో వ్రాసాను. దాదాపు 6సం. క్రితం మా అమ్మ గారు నన్ను బౌతికంగా వదిలిపోయారు, కానీ మానసికంగా చేరువైపోయారు. పిచ్చి, వెఱ్ఱి అని కొందరన్నా నేను నిత్యం మనసులోనో, కలలోనో, యోచనలోనో తనని చర్చకో, సంభాషణకో ఆహ్వానిస్తూనేవుంటాను. అయినా నిత్య జీవితంలో మాత్రం అమ్మని మరుస్తాం, ఆత్మీయుల్ని ఏమారుస్తాం ఈ బ్రతుకు బండి లాగడానికి అనిపిస్తుంది కొన్నిసార్లు. చివరి భోజనం నాచేత్తోనే పెట్టాను. చివరి యాత్రకీ నేనే ముందు నిలిచాను. అమ్మ మీద ఏ రచన చూసినా తన ఋణం పూర్తిగా తీర్చకుండానే వెళ్ళిపోయారేఅనిపిస్తుంది. మన్నించండి మీ చక్కని టపాకి నేను కన్నీటి వ్యాఖ్య వ్రాసినందుకు. ఇలా రకరకాల భావనలు కలిగాక తను ఈ గొంగళి పురుగు జీవితం నుండి రంగు రంగుల సీతాకోకచిలుకలా మనకు తెలియని లోకాల్లో విహరిస్తూవుంటారు అని తృప్తిపడుతుంటాను. అందువలన మా అమ్మ నేను వ్రాయని గ్రంధాలు ముందే చదివేసివుంటారు.

vennela చెప్పారు...

అనుభూతుల వానను అందం గా కురిపించటము మీకు సొంతం

పరిమళం చెప్పారు...

వెన్నెల గారి మాటే నాదీనూ ! happy mothers day !

సుజ్జి చెప్పారు...

baaga raasaru hemamalini garu..:)!!

చైతన్య చెప్పారు...

ఎవరి అమ్మ గురించి వాళ్ళూ గ్రంధాలు రాసేయచ్చ్చన్న్నమాట :) అవును నిజమే... అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే!
అమ్మ గురించి మొత్తం వివరంగా చెప్పాలంటే... "అమ్మ" అనే ఒక్క పదానికి మాత్రమే అది సాధ్యం!

ప్రియ చెప్పారు...

అవును చాలా బాగా చెప్పారు. ఎవరి అమ్మ గురించి వాళ్ళు పుంఖలాలు పుంఖలాలు గా చెప్తారు. మీరు చెప్పిన కబుర్లు చాలా బాగున్నాయి. భలే హాయిగా ఉంది మీరు చెప్పింది.

కానీ హోల్ మొత్తం గా అమ్మంటే చెప్పిన టపా ఒకటి ధీరసమీరే... బ్లాగ్ లో ఉంది. చూశారా? ఎవరి అమ్మ గురించి వాళ్ళు రాస్తే అక్కడ అసలు అమ్మంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం జరిగింది.

మొత్తానికీ హేమమాలిని తెలుగు బ్లాగింగ్ కి వచ్చిందన్నమాట. :-)

ప్రియ చెప్పారు...

ఫోటోలో ఏమిటండీ అంత సీరియస్ గా చూస్తున్నారు?

మాలా కుమార్ చెప్పారు...

మీ అత్తగారి గురించి కుడా రాసారుగా!
మీ పొస్ట్ లు చాలా బాగున్నాయి.
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

Shiva Bandaru చెప్పారు...

happy mothers day

గీతాచార్య చెప్పారు...

Mother's day wishes to you and your mother.

వేణూశ్రీకాంత్ చెప్పారు...

ఎప్పటి లాగానే చాలా బాగ రాసారు నేస్తం, ఇకపై మిమ్మల్ని హేమమాలిని అని పిలవచ్చనమాట :)

ఆకాశమంత సినిమా లో ఓ చిన్న సన్నివేశం ఉంటుంది. ఎప్పుడో కోపం లో తిడుతూ అలవోకగా "నాకు అర్ధరాత్రి వెన్నెల లో నది మధ్య లోకి వెళ్ళి ఓ అని అరవాలని ఉందా ఆ కోరిక తీరుతుందా.." అని అన్న తండ్రి కోరికని గుర్తు పెట్టుకుని అతని పుట్టిన రోజు కానుక గా ఆ కోరిక తీర్చే ఏర్పాటు చేస్తుంది కూతురు. ఆ సీన్ నాకు చాలా నచ్చింది.

సాధారణంగా మనం ఫ్రెండ్స్, లవర్స్ విషయం లో ఇలా ప్రత్యేకంగా సెలెబ్రేట్ చేయడానికి ప్రయత్నిస్తాం కానీ అమ్మ, నాన్న విషయం లో చేయం, we just take them for granted. అయినా వాళ్ళ ప్రేమ లో ఇసుమంత కూడా లోటు ఉండదు. ఎపుడైనా ప్రయత్నించినా కూడా నాకెందుకు రా ఇవన్ని అంటూ ప్రేమగానే తిరస్కరిస్తుంది అమ్మ.

ఫోటో గా ఉపయోగించిన గ్రీటింగ్ కార్డ్ కూడా చాలా బాగుంది. మాతృదినోత్సవ శుభాకాంక్షలు...

manohar చెప్పారు...

hi akka.....mee blog choosaakey modati saarigaa pelli aalochanalu vachaay......u rock akka.......
Life antey intha andam ga untundhaa...anipinchindhi...ee andhalanni naa life lonoo unnayi. but never thought about them......
love u akkaaaaaaaaaa.......

మధురవాణి చెప్పారు...

ఏమండీ హేమామాలిని గారూ..
ఇన్ని రోజులు నేస్తం గారి పేరు తెలీదే అని అనుకుంటున్నాం కదా.. మొత్తానికి మా మొర ఆలకించి చెప్పెసారన్న మాట ;) మీ టపా చాలా చాలా బాగుందండి. ISI మార్కు లాగా మీ టపాలన్నీ చదివినప్పుడు ఒక ప్రత్యేకమైన భావం కలుగుతుంది. అది మీకు మాత్రమే సొంతం.

నేస్తం చెప్పారు...

సిస్టెం ప్రోబ్లెం వల్ల ఈ రెండు రోజులూ వాక్యలు ఇవ్వడానికి కుదరలేదు క్షమించాలి ..
ఉష గారు మీ వాక్య చదవగానే మనసు అంతా ఒక మాదిరిగా అయిపోయిందండి .. నాకు ఉందండి ఈ అలవాటు మా అమ్మో ,అక్కో ఎవరో ఒకరు తో మాట్లాడుతూ పని చేసుకోవడం ...
వెన్నెల గారు మీ అభినందనల జల్లు మాత్రం చాలా హాయిగా ఉంది ..
పరిమళం గారు మీకూ శుభాకాంక్షలు :)
సుజ్జి :) మీరు మరీనూ

నేస్తం చెప్పారు...

చైతన్య గారు నిజమే మీరన్నది కూడా
ప్రియ గారు ధీర సమీరే గీతాచార్య గారిదా ?? క్షమించాలి నాకు బ్లాగు పేరు తెలుసు కాని గుర్తురావడం లేదు గీతాచార్యగారి బ్లాగులో అమ్మ గురించి చదివాను ..చాలా బాగా రాసారు ..
మాలా కుమార్ గారు మీకూ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు

నేస్తం చెప్పారు...

శివ బండారు గారు మీకూ మాతృ దినొత్సవ శుభాకాంక్షలు
గీతా చార్య గారు మీకూ మాతృ దినొత్సవ శుభాకాంక్షలు
వేణు శ్రీకాంత్ గారు చాలా బాగా చెప్పారు అండి .. మీకూ మాతృ దినొత్సవ శుభాకాంక్షలు

మనోహర్ మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది ఒక్కోసారి.. అందరి జీవితం లో మంచి చెడు రెండూ ఉంటాయి .. కాని చిన్న చిన్న ఆనందాలను సైతం గమనించలేని పరిస్థితులలో మనం ఉన్నాం ..చాలా మంచి వాక్య రాసారు ,ఈ ఆనందాలన్నీ నా జీవితం లో కూడా ఉన్నాయి అని .. good :)

నేస్తం చెప్పారు...

మదుర వాణి గారు హ ..హా .. మీ వాఖ్యలు చదివిన ప్రతి సారి నాదీ అదే ప్రత్యేక మైన ఫీలింగ్ :)

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

మీ టపా చదివిన తర్వాత అదేంటి నేస్తం గారు మా అమ్మ గురించి రాశారు అని అనిపించింది. మా అమ్మ కూడా అలాగే ఉంటుంది. అమ్మలు అందరూ చాలా విషయాల్లో ఒకేలా ఉంటారేమో.... మీరన్నట్టు అమ్మ గురించి గ్రంధాలు రాసేయొచ్చు...మీరు ఈ పోస్ట్ ని ప్రింట్ తీసి మీ అమ్మగారికి పంపించండి. మళ్ళీ మీ అక్కయ్య మీకు ఫోన్ చెయ్యకపోతే నన్ను అడగండి.

నేస్తం చెప్పారు...

శేఖర్ గారు నిజమే అమ్మలందరూ ఇంచు మించు గా ఒకలాగే ఉంటారేమో , హ హ తప్పకుండా పంపుతా అమ్మకు.. ఇంకా వాళ్ళకు నా బ్లాగు గురించి తెలియదు :)

Bolloju Baba చెప్పారు...

బాగా వ్రాసారు.

అభిసారిక చెప్పారు...

అమ్మ గురించి బాగా రాశారు :) Happy Mother's Day !

నేస్తం చెప్పారు...

బాబా గారు అభిసారిక గారు థేంక్స్ అండి

Ajay :) చెప్పారు...

ammoo...intha pedda post aa :)
chala baaundi :)

విరజాజుల పరిమళం చెప్పారు...

నేస్తం... నిజంగా అమ్మ గురించి ఎంత చెప్పినా, ఏమి రాసినా తక్కువే అవుతుంది. మనసుకు హత్తుకునేలా రాశారు. చివర్లో మీవారిని వాళ్ల అమ్మగారి గురించి చెప్పడం ఆపి, మీ అమ్మగారి గురించి మీరు చెప్పమనడం భలే నవ్వు తెప్పించింది. కాసేపు అలా నవ్వుకుంటూ ఉండిపోయా... చాలా బాగా రాశారు.

Kishen Reddy చెప్పారు...

Nestam garu, pratyekam ga cheppakkarleru...adbhutam ga rasaru...me blog gurunchi ma friends ki kooda cheppanu...vallu me posts chadivi chala bagundi, chala talented meeru ani annaru...nijame talent ekkada unte akkade aadarana untundi...keep rocking...
--Kishen Reddy

Varunudu చెప్పారు...

ఎందుకో తెలీదు గానీ, ఈ పోస్ట్ చూశాక మీ అమ్మ గారిని చూడాలని బలంగా అనిపించింది. హృద్యంగా వ్రాశారు !

నేస్తం చెప్పారు...

అజయ్ గారు నా ఇదేం చూసారు నా పోస్ట్ లన్నీ అలానే ఉంటాయి
విరజాజుల పరిమళం గారు థేంక్స్ అండి

నేస్తం చెప్పారు...

కిషన్ గారు,వరుణుడు గారు మీ అబిమానానికి ధన్యవాదాలండి

manu చెప్పారు...

hello akka..idhi anyayam...meeru prathi week new post lu rayandi.Gatha 2 weeks ga eduru choostunanu. post lu emi levu. Nenu naakey teliyakunda badhapadutunta, naalanti vaallu kaasepu haayiga undalantey meeru prathi week pedha post lu raayali.

శ్రుతి చెప్పారు...

ఎదో చెప్పాలని అనిపిస్తుంది, కాని భాష రావడం లేదే...
నేస్తం గారు, చాలా అదృష్టవంతులండి. మా అమ్మ మాత్రం ఎవరి దగ్గరకు రాకుండానే, అందరి అవసరాలు తీర్చేసి, తిరిగి తీర్చే అవకాశమివ్వకుండానే విశ్రమిచేసింది.
ఏమో నాకు మాత్రం తను మాట్లాడుతున్నట్లే ఉంటుంది(నేను మాట్లాడేస్తాగా మరి).
తన భుజంపై చేయివేసి నడుస్తున్నత్లే ఉంది(నా కంటే పొట్ట్ లెండి. చూశారా మీకు చెప్పానని ఇప్పుడే అలిగేసింది)
అమ్మ కిష్టం అని ప్రతి పనిలో తననే చూస్తూ ఉండటం వల్లనేమో తను లేదన్న ఆలోచనే రాదు. మీ టపా చూశాక తనకు చెప్పాను, చూశావా నీకే కాదు, నేస్తం వాళ్ళ అమ్మకు కూడా మంచి కూతురుంది అని. కదా!

నేస్తం చెప్పారు...

మనోహర్ గారు మా అత్తగారు మామ గారు వచ్చారు అందువల్ల కొంచెం బిజీ..అదన్న మాట సంగతి :)
శృతి గారు కళ్ళు చమర్చాయి మీ వాక్యకు

మరువం ఉష చెప్పారు...

అదన్నమాట సంగతి, బహుశా వేసవి విడిదికి, జాజిపూలకనో, రసం మామిడికనో కన్నోరింటికి చలో మన్నారనుకున్నాను. లేదూ విహారాల్లో తేలుతున్నారేమో అనుకున్నాను. కానీ నేస్తం, మీరు లేని లోటు కొట్టొచ్చినట్లుకనపడుతుంది సుమా! :)

నేస్తం చెప్పారు...

ఉష గారు :)

మంచిబాలుడు-మేడిన్ ఇన్ వైజాగ్. చెప్పారు...

ప్రపంచం లో అన్నింటి కన్నా గొప్పది అమ్మ ప్రేమే నేమో
అదే నిజం
అమ్మ ప్రేమ ను దేని తోను పోల్చలేము

మీ టపా చూసాక అమ్మ గురించి మల్లెమాల గారు రాసిన ఓ కవిత గుర్తుకు వస్తుంది.

అంతులేని మూలధనం అమ్మమనసు
అలలు లేని పాలకడలి అమ్మమనసు
ఇంటి లోని హిమాలయం అమ్మమనసు
వెంట నడుచు శివాలయం అమ్మమనసు

మంచి టపా రాసారు
కృతజ్ఞతలు

అజ్ఞాత చెప్పారు...

Missing your posts :(
~C

నేస్తం చెప్పారు...

మంచి బాలుడు గారు చక్కని కవిత తో చక్కని అభినందన :) thanks
~c :) త్వరలో రాస్తాను ,ఎలావున్నారు ? :)

ఉమ చెప్పారు...

నేస్తం, మీ కొత్త పోస్ట్ కోసం waiting అండీ !

సరళమైన భాష లో, మంచి మంచి కథలు చెప్తారు మీరు నిజ జీవితం లోవి, అందుకే మీ రచనలు అంటే అందరికి బోల్డు ఇష్టం !

నేస్తం చెప్పారు...

ఉమ గారు ధన్య వాదాలండి.. కొత్తది రాసాను కాని ఇప్పటికి మొదలుపెట్టి వారం రోజులయింది .. తీరిక లేక పోవడం వల్ల అసలు ముగించలేక పోతున్నా.. ఎప్పుడూ ఇలా ఆపి ఆపి రాయలేదు త్వరలో ప్రచురిస్తా :) మీ అభిమానానికి ధన్యవాదాలు ..

తృష్ణ చెప్పారు...

చాలా చాలా బాగా రాసారు.అమ్మ గొప్పతనానికి కొలత ఏదీ లేదండి.అమ్మకు అమ్మే సాటీ.ఒక వారం క్రితం ఈ పోస్టు చదివి నేనూ మా అమ్మ గురించి రాయాలని ఉబలాటపడిపోయి మొన్నొక రోజు 'అమ్మే నా బెస్టు ఫ్రెండ్ ' అని ఒక టపా రాసాను.వీలుంటే చదవండి.

నేస్తం చెప్పారు...

మీ అమ్మగారి గురించి రాసిన పోస్ట్ చాలా బాగుంది... కంటిన్యూ చేయండి అలాగే ..మీ అబిమానానికి ధన్యవాదాలండి