4, మే 2009, సోమవారం

నా పెళ్లి చూపులు




పెళ్ళికి ముందు అందరు అమ్మాయిల్లాగే నాకూ కాబోయే శ్రీవారి మీద అనేక ఆలోచనలు వచ్చేవి ..ఎప్పుడన్నా మేడ మీద కరెంట్ పోయినపుడు వెన్నెలలో అటు ఇటు పచార్లు చేస్తూ .. ఈ వేళ లో నీవు ఏం చేస్తూ ఉంటావో ,అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేనూ .....అని ఎవరికీ వినబడకుండా పాడేసుకుంటూ ఆలోచించేదాన్ని ... ఈ టైం లో ఏం చేస్తున్నాడో ,వ్యాపారమా ? ఉద్యోగమా? లేక ఇంకా చదువుకుంటున్నాడా.. ఒక వేళ పక్కింటి అమ్మాయికో ,ఎదురింటి అమ్మయికో సైటు కొడుతూ బిజీగా ఉన్నాడా ? లాంటి వాటి తో పాటు ఎలాంటి వాడు వస్తాడో అన్న భయం కూడా ఉండేది ...


అయితే చిన్నపుడు బావిలో కప్పలాగా ఎంత సేపూ మా కాలేజ్ కి వెళ్లేదారి లో చిన్నపాటి షాపులు ,దుకాణాలు చూస్తూ పెరిగానేమో ..నా ఊహల్లో కూడా మా ఆయన పుస్తకాల షాపు ఓనర్ లాగా , బట్టల షాపు వాడిలా తప్ప ఇంకోరకం గా కనిపించేవారు కాదు ...( ఈ పోస్ట్ చదివినట్లయితే మా ఆయనకు ఈ వాక్యం కనబడ కూడదు గాక ) .. సరే తరువాత తరువాత సినిమాల్లో రిక్షా వాడు కూడా డ్రీమ్స్ విదేశాల్లో తప్ప ఇండియా లో ఊహించుకోక పోవడం చూసాకా ...అరె ...రే అని నాలుక కరుచుకుని పాపం మా ఆయనకి ఇస్త్రీ షర్టు , టై కట్టాఅనుకోండి ...


సరే మొత్తానికి నాకూ పెళ్లిచూపుల తతంగానికి టైము వచ్చేసింది.. ఒక రోజు ఉదయాన్నే ఆరు గంటలకు అమ్మ హడావుడిగా నిద్ర లేపి మొహానికి కాస్త గంధం రాసుకోవచ్చు కదమ్మా అంది ... అసలే మాంచి నిద్రలో ఉన్నానేమో పిచ్చ కోపం వచ్చింది ..కాని అరిచే ఓపిక లేక మళ్లీ ముసుగుతన్నాను ....కాని అప్పటికే మన బుర్ర పాదరసంలా పనిచేయడం మొదలు పెట్టింది .. మొహానికేమన్నా రాస్తే గయ్యిమని అరిచే అమ్మ ఇంత ప్రొద్దున్నే పిలిచి మరీ, ఏదన్నా రాయమంటుంది అంటే పెళ్లి చూపులన్నమాట .. మొన్నే ఒక ఫోటో చూపారు ... అందులో అబ్బాయిని చూడగానే ....అబ్బా ఎంత బాగున్నాడో అనిపించలేదు, పోనీ ఇలా ఉన్నాడు ఏంటబ్బా అనిపించలేదు.. అసలే ఫీలింగు కలగ లేదు ... కుదరినప్పుడు ఆలోచిద్దాం లే అనుకున్నాను.. కాని ఇలా హడావుడిగా వస్తాడు అనుకోలేదు ...ఈ లోపల మా పిన్ని బలవంతం గా లేపి తయారుచేసింది ...


అసలే నిద్ర మద్యలో లేపారు ..అందులోను నాన్న,పెదన్నాన్న, చిన్నాన్నలందరి ముందు ఎవరో అబ్బాయి ని చూడటం ఒక ఎత్తు అయితే , సంతలో పశువులా ఇప్పుడు అక్కడ కుర్చోవాలన్న ఆలోచన మరొక వైపు ఉక్రోషం తెప్పిస్తుంది ... ఇంక ,మా పిన్ని దొరికిందే చాన్స్ అన్నట్లు వీదిలో వెళ్ళే ప్రతి పువ్వు నా జడలో తురిమేస్తుంది .. ఆ విషయం మీద పేచి పెడుతున్న నాకు, పెళ్లి కొడుకు వచ్చేసాడు అంట అనే మాట వినగానే చిరాకు ప్లేసులో కొంచెం ఆసక్తి .. అప్పటి వరకు నా చుట్టూ ఉన్న జనాలు ఒక్కరు కూడా పక్కన లేకుండా చూడటానికి వెళ్లిపోయారు ... మా చెల్లి అటుగా వెళుతూ కనబడింది.. పిలిచి అడుగుదాం అనుకున్నాను ఎలా ఉన్నాడు అని .. మళ్లీ భయం ఏమనుకుటుందో అని ... ఈ లోపల మిగిలిన వాళ్ళు నా దగ్గరకు వస్తూ ఫోటో లో కంటే బయట చాలా బాగున్నాడు కదా ,అసలు ఫోటో కి బయటకు సంభందమే లేదు అనుకోవడం వినిపించింది .. వీళ్లు కావాలని అంటున్నారా .. లేక నిజమా ? నాకేం పెద్ద ఆసక్తి లేనట్లు మొహం పెట్టి కూర్చున్నాను ..


ఈ లోపల నన్ను రమ్మన్నారు.. ఇదిగో తల వంచుకుని కూర్చో ,వాళ్ళు అడిగిన వాటికి సమాధానం చెప్పు..మా అమ్మమ్మ నస.. గాడిద గుడ్డేం కాదు ..నేనెందుకు తలవంచాలి ..కుదర్దంతే .. అని విసురుగా అని లేచి ఎదురుగా మా నాన్నను చూడగానే టక్కున బుద్దిగా తల వంచేసాను ... మాదే పెద్ద కుటుంభం అంటే తనది మూడురెట్లు పెద్ద కుటుంభం అంట .. ఒకటే జనాలు ... పెళ్లి చూపులా.. పెళ్ళా ? అని ఒక డవుటు వచ్చింది ... ఎదురుగా కూర్చున్నాను గాని అబ్బాయిని ఎలా చూడాలో తెలియడం లేదు... అందరు నన్నే చూస్తున్నారేమో ??... చూస్తే ఏంటి !! .. అసలు ఒకరినొకరు చూసు కోవడానికే కదా పెళ్లి చూపులు.. అయినా ఎందుకు భయం గా ఉందొ తెలియడం లేదు , ఏదో మామూలుగా ఎక్కడో చూస్తున్నట్లు గా తల ఎత్తి ఒక్క సారి ఎదురుగా చూసాను .. దెబ్బకు అయోమయం లో పడిపోయాను.. ఎదురుగా ఒక 20 మంది .. అందులో 10 మంది మగవాళ్ళు ..ఇందులో పెళ్లి కొడుకేవరు??? పక్కకు చూస్తే నాన్న నా వైపే చూస్తూ ఉన్నారు.. ఎవరిని చూసినా ఏమనిపించదు గాని నాన్నను చూస్తే మాత్రం భయం ..


సరే మా ఇద్దరినీ మాట్లాడుకోమంటారుగా అప్పుడు చూద్దాం లే అనుకున్నాను .. అబ్బే.. వాళ్ళ గోల వాళ్ళదే గాని నా గొడవ ఎవరూ పట్టించుకోరు.. అటు అబ్బాయి పరిస్థితి కూడా అదే ... అందులోను అమ్మ చిన్ననాటి ఫ్రెండు వాళ్ళ బంధుగణం లో ఉంది .. ఇంకేం మా అమ్మ అక్కడ బిజీ ... నాన్న కి కూడా అందులో తెలిసిన వారున్నారు ... అబ్బాయి గుణగణాల లిస్టు సేకరించడం లో నాన్న బిజీ .. ఇంకా పెళ్లి చూపులై పోయాయి పదండి ...పదండి అన్నారు ... అటు వాళ్ళు ఇటువాళ్ళు టాటాలు బై ,బై లు చెప్పేసుకుంటున్నారు ... నాకు కంగారు వచ్చేసి హడావుడిగా తిరుగుతున్న అక్కని పిలిచి .. అక్కా ఇదన్యాయమే పెళ్లి కొడుకును చూడలేదు నేను అన్నాను.. అక్క నా వైపు విచిత్రం గా చూస్తూ మరి అంత సేపూ అక్కడేం చేసావే అంది ... నా బొంద .. అసలు ఎవరన్నా ఎదురుగా అంత మందిని కూర్చో పెడతారా .. ఎవరూ అందులో తెలియలేదు.. పైగా నాన్న ఒకరు ఎదురుగా .. నాకేమో భయం వేసింది చూడటానికి అన్నాను ....ఏడ్చినట్లుంది .. మరీ అంత సిగ్గు అయితే ఎలాగా .. సరే నాతో రా అని కటకటాల దగ్గర కు తీసుకు వెళ్లి అదిగో ఆ బిస్కెట్ కలర్ షర్ట్ వేసుకున్నాడు చూడు ఆ అబ్బాయే అని చెప్పి వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోయింది ...


ఇక నా పాట్లు చూడాలి ఒక మనిషిని చూడటం ఇంత కష్టమా అనిపించింది.. తను సినిమాలో హీరోయిన్ లా మొహానికి ఏదో ఒకటి అడ్డం గా పెట్టుకుని నించుంటాడు.. కాసేపు ఎవరో అడ్డు వస్తే ఇంకాసేపూ మందారాలో చేమంతుల కుండీలో అడ్డు వచ్చేవి ... ఇంక విసుగు వచ్చి ఎహే పో ... సంబంధం కుదిరినప్పుడు కదా సంగతి అనుకుని ఇంట్లో కొచ్చేసాను.. వాళ్ళు వెళ్ళ గానే నాన్న నన్ను రూం లోకి పిలిచి ఏమ్మా నీ అభిప్రాయం ఏమిటి అన్నారు.. ఒక్క సారిగా కంగారు వచ్చేసింది నాకు ఏం చెప్పాలో తెలియక .. అబ్బాయి చాలా మంచాడు ..చదువుకున్నాడు ..చక్కని జాబ్ ...మనలాగే మంచి పేరున్న పెద్ద కుటుంభం ..కాకపొతే ఒకే ఇంట్లో ఉండరు అన్ని పక్క పక్క ఇల్లులు ...అన్ని రకాలుగా మాకు నచ్చింది ..నువ్వేమంటావ్.. ఇదిగో చూడు నీకు నచ్చక పొతే ఇప్పుడే చెప్పేసేయి .. ఒక్క మాట కూడా ఎందుకు నచ్చలేదు అని అడగను.. కేన్సిల్ చేసేస్తాను అన్నారు ...నాకేం చెప్పాలో తెలియడం లేదు ...అబ్బాయిని చూడలేదు అంటే నమ్మరు ..నేను తలెత్తి చూసినపుడు నాన్న నన్ను చూసారు ..ఒకవేళ అన్నా సరే ఫోటోలో చూసావ్ కదా అంటారు ..బయటకు ఫొటోకు తేడా ఉంది అంట కదా అంటే చండాలం గా ఉంటుందేమో .. అయినా ఫేసులో ఏముందిలే ..అబ్బాయి తో మాట్లాడించలేదు .. ఎలాంటి వాడో ???... హుమ్ ఒక అయిదు నిముషాలు మాట్లాడితే మాత్రం ఏం తెలిసి ఏడుస్తుంది .. నీ జీతం ఎంత ..నీది ఏం కంపెని .. ఏం హాబీలు లాంటివే గా ... నా ఆలోచనలు ఆపేస్తూ .. ఏంటి అబ్బాయి నచ్చలేదా అన్నారు ఆత్రుతగా .. అబ్బే అదేం లేదు నాన్న మీ ఇష్టం నాకు మాత్రం ఇలాంటివి ఏం తెలుస్తాయి అన్నాను .. మా నాన్న మొహం వెలిగిపోయింది ...


ఎలా ఉన్నాడు అబ్బాయి అంది అక్క రాత్రి పడుకున్నపుడు ... ఏమో ,మహానుభావుడు మొహం కనబడకుండా తెగ జాగర్త పడ్డాడు .. ఏమే నిజం చెప్పు .. పర్లేదా బాగానే ఉన్నాడా అన్నాను ... ఓసి గాడిద దేనికి పనికోస్తావే .. సరేలే రేపు ఇళ్ళ చూపులకు వెళుతున్నాం గా అక్కడ ఫోటో ఏదన్నా తెస్తాలే అంది ...అయినా జాతకాలు నప్పాలి .. వాళ్ళ పద్దతులు నచ్చాలి అప్పుడు కదా సంగతి అని పడుకున్నాను ... ఆ మరుసటి రోజు అమ్మ ,నాన్న పిన్నులు, పెద్దమ్మ,చిన్ననా ,పెదనాన్న పొలోమని వెళ్లిపోయారు వాళ్ళింటికి ... ఆ రాత్రి 10 గంటలకల్లా వస్తామన్నా వాళ్ళు 12 అయినా రాలేదు ...నాకు టెన్షన్ ఇక్కడ ... తరువాత నాన్న కాల్ చేసారు .. అమ్మా.. ట్రైన్ ప్రొబ్లెమ్ వచ్చి ఆగింది .. కంగారు పడకు అని ..హమ్మయ్య దేవుడా అనుకుని దణ్ణం పెట్టుకుని పడుకున్నాను .. ఆ తెల్లవారు జామున ఎప్పుడో నిద్ర పట్టింది ...


ఒకటే గల గల మని మాటలు వినబడటం తో మెలుకువ వచ్చింది ... .. అమ్మ నా చేయి పట్టుకుని తన బుగ్గకు ఆనించి మిగిలిన వాళ్ళతో మాట్లాడుతుంది ... లేచి కూర్చున్నాను .. ఏమైంది ఇంత లేటు అన్నాను.. వాళ్ళు రాత్రి పడ్డ కష్టాలన్నీ ఏకరువు పెట్టారు ... అమ్మా వాళ్ళు లాంచనాల గురించి ,పెళ్లి కానుకల గురించి మాట్లాడుకోవడం విని ఏంటి సంభందం కుదిరిపోయినట్లేనా అన్నాను అనుమానంగా.. కుదిరిపోయినట్లు కాదు కుదిరింది అంది పిన్ని ... ఎందుకో ఒక్క సారిగా మనసులో అది భయమో బెంగో మరొకటో తెలియదు గాని సన్నగా వణికాను..దేవుడిని దణ్ణం పెట్టుకున్నా.. అప్పుడే అమ్మ కళ్ళలో నీరు తెచ్చేసుకుంటూ ఇదిగో నాన్నా ... అక్కడ ఇక్కడలా చిన్న పిల్ల వేషాలు వేయకూడదు ..నువ్వే పెద్ద కోడలివి ...అందరూ పెద్ద కుటుంభాలు .. జాగ్రత్త గా ఉండాలి ... అంటూ అప్పగింతలు మొదలెట్టేసింది ....


మా బెంగను తేలిక చేయడం కోసం అనుకుంటా మా ఆఖరి చిన్నాన మొదలు పెట్టేసాడు .. ఊరుకో వదినా అది బెంగ పడటం ఏంటి .. మొన్న పెళ్లి చూపుల్లో చూసావా ఆ అబ్బాయిని ఎలా చూసిందో అన్నాడు.. ఎవరూ నేనా .. నీకో విషయం తెలుసా అసలు నేను ఆ అబ్బాయిని చూడలేదు అన్నాను కోపం గా .. ఛా.. అందుకేనేంటి వెళుతున్నపుడు కటకటాల నుండి తొంగి మరి చూస్తున్నావ్ ..నేను గమనించలేదేంటే .. అన్నీ చూస్తున్నా ...అన్నాడు ఉడికిస్తూ .. ఎహే ..పో ..నిజం గా నాన్న .. అసలు చూడలేదు ..అందుకే అక్క అక్కడినుండి చూడమంది.. అక్కడ కూడా చూడలేదు సరిగా అన్నాను ...కోయ్..కోయ్ అన్నాడు .. నీ ఎంకమ్మ నిజంగా ...చెపితే నమ్మవే .. అయినా ఎదురుగా అంత మందిని ఎవరన్నా కుర్చోపెడతారా .. పోనీ నన్ను ఏమన్నా ఆ అబ్బాయితో మాట్లడించారా .. మళ్లీ నేను చూసా అని అంటున్నారు అన్నాను కోపం గా .. అయ్యా బాబోయ్ చూసావా అక్కా .. ఆ అబ్బాయితో మాట్లాడలంటా ..మనరోజులు కావు మిగిలిన వాళ్ళు మొదలు పెట్టేసారు ...


నువ్వేమో గాని ఆ అబ్బాయి మాత్రం నిన్నే చూస్తూ కూర్చున్నాడు పాపం .. వెళ్ళేటప్పుడు కూడా నువ్వు కనబడతావేమో అని తెగ చూసాడు అన్నాడు చిన్నాన.. చెవిలో పువ్వులేమన్న కనిపిస్తున్నాయా అని పైకి అన్నా గాని మనసులో ఎక్కడో గర్వం ...మళ్లీ తనే అన్నాడు మీ ఇల్లు చాలా బాగుంది ,మీ ఆయన రూం కూడా ... అన్నట్లు మర్చిపోయానే మీ ఆయన గదిలో కాజోల్ ఫోటో ఉంది ... ఫేన్ అనుకుంటా ..ఇప్పుడు చూడండి, ఇక కాజోల్ సినిమాయే చూడదు .. పెళ్లి కాగానే ఆ ఫోటో పీకి పడేస్తుంది అన్నాడు ..అమ్మా చూడమ్మా ,ఎలా అంటున్నాడో ..నవ్వుతావేంటి అన్నాను ఉడుక్కుంటూ .... అసలు విషయం మర్చిపోయాను ... అసలు నీ గురించి ఏదన్నా చేపుతామేమో అని ఎంత ఆశగా చూసాడనుకున్నావ్... మావయ్య గారు ,మావయ్య గారు అని నా పక్కనే ఉన్నాడు తెలుసా అన్నాడు .. నేను నా ఆసక్తి తెలియ నివ్వకుండా మొహం పక్కకు పెట్టేసా.. కాసేపు అలా ఏడిపించి ఎవరి పనులు లో వాళ్ళు పడిపోయారు ..

అప్పుడు గుర్తువచ్చింది అవును ఫోటో తెస్తానంది ఏది అనుకుని దానికోసం వెతికాను.. మా పిన్ని రూం లో గాఢమైన నిద్ర లో ఉంది .. అక్కా ,అని బలవంతం గా నిద్ర లేపేసా .. ఎంటే అంది చిరాగ్గా ... ఫోటో తెస్తానన్నావ్ ... అన్నాను.. ఏం ఫోటో అంది మళ్లీ నిద్రలోకి వెళ్ళిపోతూ .. ఆ అబ్బాయి ఫోటో అన్నాను ... ఏమోనే ఎక్కడో పెట్టేసా ..తరువాత చూస్తాలే అంది .. తంతా... ఒక్క సారి లేచి చెప్పవే అని దాన్ని లేచేవరకు హింస పెట్టేసా ... తిట్టుకుని తిట్టుకుని లేచి వెదికి ఇచ్చింది .. గభ గభ చూసా ఎదురుగా గడ్డం తో పైన తెల్ల జుట్టుతో ,చేతిలో ఒక కర్రతో ,చేతిలో ఒక చిప్పతో ఒక ముసలాడి ఫోటో.. ఎంటే ఇది అన్నాను అయోమయం గా .... మీ ఆయన అంది మళ్లీ నిద్రపోతూ.. కాళ్ళు విరగ కొడతా ... ముందు నిద్రలే అని బలవంతం గా లేపాను .. అది విసుక్కుంటూ ..అబ్బా అది మీ ఆయనా కాలేజ్ లో నాటకం వేసినపుడు ఫోటో అంట తల్లి ... మీ అత్తగారు చెపితే చూడకుండా ఆల్బం లో నుండి దొంగ చాటుగా ఎత్తుకోచ్చా అంది ..నాకు విసుగొచ్చింది ..ఎందుకే నాతో ఇలా ఆడుకుంటారు ..ఇందులో ఏం చూడను ,అయినా అతనికి సరి అయిన ఫొటోస్ లేవా అన్నాను ... అబ్బా ఇంకొకటి తెచ్చాను కాని మీ ఆయనా కమలహాసన్ లాగ ఒక ఫోటోకి ఇంకో ఫోటోకి పోలికే లేదు,ఆ అడుగు ఫోటో చూడు అంది.. ఆ ముక్క ముందే ఏడవచ్చు కదా అన్నాను .. మళ్లీ నిద్రలేపావనుకో చితకోట్టేస్తా జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తూ అన్నట్లు మర్చిపోయానే మీ ఇంటి ఎదురుగా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు .. వాళ్ళు మీ ఆయనకు లైన్ వేస్తున్నారో ,వాళ్ళకే తను వేస్తున్నాడో కాస్త గమనించు అని నవ్వింది.. నీక్కుడా లోకువ అయిపోయానే బాబు అనుకుని , మళ్లీ తన ఫోటో చూడటం ఎవరన్నా చూసారో అయిపోతా అని పై మేడ ఎక్కి జాగ్రత్త గా అప్పుడు చూసాను ... ఒక పమేరియన్ కుక్కపిల్లను ఎత్తుకుని ,మెరూన్ టి -షర్ట్ లో చూస్తూ కనిపించారు... మరి పెళ్లి కుదిరిపోయినందుకో ,మరి నిజం గానే బాగున్నాడో తెలియదు గాని .. ఎందుకో నచ్చారు .. మిమ్మల్ని చూడటానికి ఇన్నాళ్ళు పట్టింది సార్... అయినా ఈ ఫోటోలో ఉన్నట్లైనా ఉందా మీ ఒరిజినల్ పేసు అనుకున్నా ...


ఆ వెంటనే తాంబూలాలు ముహూర్తం పెట్టేసారు ... ఇద్దరినీ ఒకరి పక్కన ఒకరిని కూర్చో పెట్టారు గాని ,నేను అసలు తల పక్కకు తిప్పలేదు భయం తో .. ఎటు చూసినా మా చిన్నానా ఆలి లాగా నోట్లో నాలుక బయట పెట్టి ఏడిపించడమే సరిపోయింది ... ఆ రోజు పాపం మా ఆయన నాతో మాట్లాడటానికి శతవిధాల ట్రై చేసారు అంట .. అమ్మో వాళ్ళింట్లో ఇలాంటివి ఒప్పుకోరని వాళ్ళ మావయ్య.. అబ్బబ్బే వాళ్ళే మనుకుంటారని మా వాళ్ళు మళ్లీ మమ్మల్ని మాట్లాడుకోనివ్వలేదు .... చివరకు వెళ్ళేటపుడు మా ఆయన పాపం తన విజిటింగ్ కార్డ్ నాకు అంద చేసి వెళ్ళారు ....
మరో సారి మళ్లీ మరికొన్ని విషయాలు :)

66 కామెంట్‌లు:

జ్యోతి చెప్పారు...

:)))))


ఈ విషయాలు మీవారకి ఇప్పటికైనా తెలుసా?? తెలీకుంటే ఫీలవుతారేమో.. ఈ టపా గురించి ఇంట్లో అస్సలు మాట్లాడకండి..

అజ్ఞాత చెప్పారు...

chala bagundi andi me chupula badhaa... elundi ma akkaki pelli chupuluu meku jariginattu kakunda ma akkaki degarundi chupista :)

asha చెప్పారు...

బాగుంది నేస్తం.
మరిన్ని విషయాలకై ఎదురుచూస్తుంటాను.

Maruti చెప్పారు...

గభ గభ చూసా ఎదురుగా గడ్డం తో పైన తెల్ల జుట్టుతో ,చేతిలో ఒక కర్రతో ,చేతిలో ఒక చిప్పతో ఒక ముసలాడి ఫోటో.. ఎంటే ఇది అన్నాను అయోమయం గా .... మీ ఆయన అంది మళ్లీ నిద్రపోతూ..

:-):-):-)
చాలా బాగుందండి :-)

indhu చెప్పారు...

హ హ హ బాగున్నాయండి మీ పెళ్ళిచూపులు :)))

నేస్తం చెప్పారు...

హ హ చాలా విషయాలు తెలుసు జ్యోతిగారు.. మీరు నాకోసం ఇలా ఎదురు చూసారంట కదా అంటే అస్సలు ఒప్పుకోరు .. :) ఒక్కోసారి మాత్రం ఒప్పుకుంటారు :)
శరత్ గారు :)
ఈ రోజుల్లో తప్పని సరిలేండి ..ముందే మాట్లాడుకోవడం.. మాదంటే ఉమ్మడి మూలానా అలా జరిగింది :)
భవాని గారు మారుతి గారు :) ధన్యవాధాలు

Srujana Ramanujan చెప్పారు...

చాలా చక్కగా రాశారు నేస్తం. అంత కష్ట పద్దారా పాపం. నాకైతే బోల్డు జాలేసింది.

మనలో మాట. ఇప్పుడు కూడా కమల్ లా గెటప్స్ మారుస్తుంటారా మీ శ్రీవారు?

ఇది నా పెళ్ళీ చూపుల తతంగం. మీకు ఎలా అనిపించిందో చెప్పండి.

Srujana Ramanujan చెప్పారు...

http://aatanemaatakardham.blogspot.com/2008/10/blog-post.html

సృజన రామానుజన్

అజ్ఞాత చెప్పారు...

iMta reserved ayitE lABaM lEdaMDi. ippuDU iMtEnA? Then One day I will stop by your home and say that I am related to your hubby and eat lunch and go away before he comes back ;-) LOL

వేణూశ్రీకాంత్ చెప్పారు...

హ హ బాగున్నాయ్ మీ పెళ్ళి చూపులూ, ఎదురు చూపులూ నూ... తనని చూడటానికి అంత గా ఎదురు చూశారు, పైగా తాతగారి గెటప్ లో ముందు కనిపించారు కనుకే మాములు పోటో లో వెంటనే నచ్చేసి ఉంటారు :) "అంతే గానీ నేను ఒరిజినల్ గా బాగాలేనా !!" అని మీ వారి ని ఉడుక్కోవద్దు అని చెప్పండి...

పుల్లాయన చెప్పారు...

కళ్లకు కత్తినట్లు చాలా ఇంటరస్టింగ్ గా బాగుందండి మీ కధ.

నేస్తం చెప్పారు...

ఇందు గారు ధన్యవాధాలు అండి
సృజన గారు మా ఆయన మొన్నటి వరకూ కమలహాసనే అండీ బాబు .. ఉన్నట్లుండి మీసం తీసేస్తారు లేదా పెంచుతారు ... హెయిర్ స్టైల్ కూడా అంతే అలాగే మార్చేసేవారు ..
సృజన గారు మీ పోస్ట్ చదివాను ..శైలి చాలా బాగుంది ... నాకు కొంత అర్దం అయి కొంతకాలేదు ఎందుకంటే ఏదో ఒప్పందం అంటున్నారు అది చదివితే గాని మిగిలినది అర్దం కాదేమో :) ఎవరతను ? తెలుసుకోవచ్చా.. మిగిలిన పోస్ట్ లింకులు ఇవ్వగలరా :)

అశోక్ వర్మ చెప్పారు...

చాలా బాగా రాసారండి. మాకు చాలా ఉపయోగకరమైన టపా. ఈ టపిక్ పైన ఎన్ని కోట్ల బైట్స్ రాసినా చదివే ఓపిక మాకు ఉంది. దయచేసి ఈ మ్యాటర్ రిలేటడ్ టపాలు ఎన్ని వీలైతే అన్ని అతి త్వరగా రాయవలసిందిగా అఖిల భారత బ్యాచిలర్ సంఘ కీలక సభ్యుడిగా నా విన్నపం. మా లాంటి వారికి ఇలాంటి ఇన్‌ఫర్మేషన్ దొరకడం చాలా కష్టం. సో శ్రమ అనుకోకుండా రాయగలరు.

నేస్తం చెప్పారు...

అఙ్ఞాత గారు అలాంటి సంఘటనలు కూడా జరిగాయి ఒక సారి మా ఆయన పెళ్ళైన కొత్తలో ఒక ఫ్రెండ్ వస్తారు ఈ ప్రింటర్ ఆయనకు ఇచ్చేసేయి అని పేరు చెప్పకుండా బయటకు వెళ్ళారు ...నేను అడగలేదు .. ఈ లోపల కేబుల్ టి.వి అబ్బాయి వస్తే ఆ ప్రింటర్ తీసుకుపో బాబు అని అప్పచెప్పేసా ..సమయానికి మా ఆయన వచ్చారు కాబట్టి సరిపోయింది :) కాని ఇప్పుడు తెలివి తేటలు నేర్చేసుకున్నాలేండి ..
శ్రీకాంత్ గారు ఇప్పటికి ఏడిపిస్తాను ఆయనను ..మండుటెండలో క్రికెట్ ఆడి నల్లగా తయరయ్యి వస్తారు ..అప్పుడు అద్దంలో తల దువ్వుకుంటున్నపుడు పక్కన నించుని కలర్ తేడా చూపిస్తూ ఏడిపిస్తాను :)
పుల్లాయన గారు ధన్యవాధాలు అండి

జ్యోతి చెప్పారు...

మీ పెళ్లిచూపులేమోగాని,, నా పెళ్లిచూపుల తతంగం గుర్తొచ్చింది.చాలా విశేషాలున్నాయిలెండి..థాంక్స్.. ఆపాత జ్ఞాపకాలను మనసులోకి తెచ్చినందుకు...

నాగప్రసాద్ చెప్పారు...

మా అఖిల భారత బ్యాచిలర్ సంఘంలోని కీలక సభ్యుడు అశోక్ వర్మ గారు చెప్పినట్లు, ఈ మ్యాటర్ రిలేటెడ్ టపాలు ఎన్ని వీలైతే అన్ని అతి త్వరగా రాయవలసిందిగా నేను కూడా డిమాండుతున్నాను.

మధురవాణి చెప్పారు...

నేస్తం..
భలే ముచ్చటగా ఉన్నాయి మీ పెళ్లి చూపులు కబుర్లు. ఇప్పుడు హాస్యం లాగా అనిపిస్తున్నా అప్పట్లో పాపం కాస్త ఆదుర్దా పడి ఉంటారు కదా. ఏమైతేనేం, మొత్తానికి కమల్ హాసన్ లాంటి కుర్రాడిని కట్టేసుకున్నారన్న మాట!

durgeswara చెప్పారు...

iMtaki opiMchaledammaa !

ikkada vuMcite amdaru choostaaru ,aayanakoodaa parichayam ayinatlumtumdi

Anil Dasari చెప్పారు...

>> "తను సినిమాలో హీరోయిన్ లా మొహానికి ఏదో ఒకటి అడ్డం గా పెట్టుకుని నించుంటాడు"

మీవారి పేరు మనోజ్ కుమార్ కాదు కదా?

Shashank చెప్పారు...

భలే భలే మీ పెళ్ళి చూపులు. ఇంతకి పెళ్ళి కి ముందు మీ వారితో అసలు మాట్లాడారా లేదా? లేకపోతే మాత్రం మీకు మీవారికి జోహార్!!

నాకు ఎప్పుడు ఇలాంటి పెళ్ళి చూపులకి వెళ్ళాలి అని ఆశ. కాని ఏంటో నాకే కాదు మా boyses యే ఒక్కడికి ఇలా జరగలేదు. :( నా "పెళ్ళి చూపులు" ఐతే వెరైటీ లేండి. అంటే అప్పటికే ఒక 18 నెలల నుండి ఒక పట్టువదలని విక్రమార్కుడి లా, అపూర్వ సహస్ర శిరస్చేద చింతామణి లా తనని ఒప్పించే ప్రయత్నం లో మునిగి ఉండినాను. సరే ఒక్క సారి ప్రత్యక్షంగా చూస్తే కాని కంఫర్మ్ చేయలేను అని అనేసరికి ఒక వారం రోజులు సెలవు పెట్టి వేళ్ళా దేశానికి. అప్పుడు వాళ్ళ మేనమామా ఇంట్లో ఏర్పాటు చేసారు మిని-సైజ్ పెళ్ళి చూపులు. మా నాన్నా ఒక్కరే వచ్చారు నాతో. మా అమ్మ అప్పటికే చూసి - మాట్లాడి గట్ర గట్ర అవ్వడం వలన తను రాను పోరా అన్నరు. సరే అని నేను మా నాన్నా వెళ్ళాం. అక్కడ తను, వాళ్ళ అమ్మ, నాన్నా, మేన మామా & ఫామిలి ఉండె. పిల్లలు (అంటే మేమే) మాట్లాడుకోవాలి అని వాళ్ళ మామా ఆపిసులో మాట్లాడూకోండి అని చెప్పారు మాకు. మా ఆవిడ నన్ను అడిగిన ఏకైక ప్రశ్న - నువ్వు బాగా వంట చేస్తావ్ అంట కద. మీ అమ్మ చెప్పింది. నిజమేనా? అని. చుస్.. రహస్యం లీకైంది అని ఒప్పుకోకతప్పలేదు. చాలా యేళ్ళగా గంటల తరబడి మాట్లాడుకోవడం వళ్ళ అప్పుడు మాట్లాడేదానికి ఏమి లేదు.

మీ పెళ్ళి చూపుల్తో పోలిస్తే అసలు రెంటికి పోలికే లేదు కదండి.

అజ్ఞాత చెప్పారు...

కోయ్..కోయ్ అన్నాడు .. నీ ఎంకమ్మ నిజంగా ...చెపితే నమ్మవే....

This is the language you use with your family members? Wow! I have never heard any lady - let alone educated family ladies - speak such language whether with elders or siblings. Hmmm..

రాధిక చెప్పారు...

హా హా...నేస్తం గారికి చాలా పెద్ద ఫ్లాషు బేకు వుందన్నమాట.ఇంకొన్ని గుండ్రాలు తిప్పి మరిన్ని నవ్వులు పూయించమని మా మనవి.

పానీపూరి123 చెప్పారు...

> గభ గభ చూసా ఎదురుగా గడ్డం తో పైన తెల్ల జుట్టుతో ,చేతిలో ఒక కర్రతో ,చేతిలో ఒక చిప్పతో ఒక ముసలాడి ఫోటో..
:-))

నేస్తం చెప్పారు...

హ హ అశోక్ గారు ,నాగ ప్రసాద్ గారు :) అలాగే వీలు ఉన్నపుడు తప్పకుండా రాస్తాను :)
జ్యోతి గారు మరింకేం చక్కగా పోస్టచ్చు కదా ,అందులోనూ నాగ ప్రసాద్ గారు అశొక్ గారు డిమాండ్ కూడా చేస్తున్నారు :)
మధుర వాణి గారు మీరన్నట్లు కాస్త కంగారు పడిన మాట వాస్తవం :) కాని అదొక తీపి ఙ్ఞాపకం అయిపోయింది ఇప్పుడు :)

నేస్తం చెప్పారు...

అబ్రకదబ్ర గారు మీరూ మరీనూ :)
హ హ శశాంక్ గారు బాగుంది మీ పెళ్ళి చూపుల కధ..ప్రేమ వివాహానికి ,పెద్దలు కుదిర్చిన వివాహానికి తేడా ఉంటుంది మరి..కాని దేని సరదా దానిదే :)
అఙ్ఞాత గారు , మా చిన్నాన్నకు మాకూ వయసు తేడా చాలా తక్కువ , అంచేత పేరుకు చిన్నాన్న అయినా మాకు అన్నయ్య లా ఉండేవాడు ..ఈ విషయాన్ని ఇంతకు ముందు పోస్ట్ లో చెప్పాను .. అందరిని చిన్నపటి నుండి నాన్నా అని పిలవడం అలావాటు చేసేసారు ఇప్పుడు గోపీ అనుకోండి గోపీనాన్నా అనిపిలిచేవాళ్ళం అన్నమాట.. కాని మా ఆఖరు చిన్నాన్న,మేము ఎప్పుడు కొట్టుకోవడం ఒకళ్ళ మీద ఒకళ్ళం చాడీలు చెప్పుకోవడం ఉండేది.. ఆ చనువుతో నేను ఎంకమ్మా అని ఏముంది పంది, దున్నపోతా ,అని తిరగబడి కొట్టేదాన్ని కూడా :)

నేస్తం చెప్పారు...

హ హ రాధిక గారు.. అందరి జీవితం లో ఈ విషయం లో ఎంతో కొంత ప్లాష్ బేక్ ఉంటుంది :)
పానీ పూరీ గారు :)

జీడిపప్పు చెప్పారు...

హ హ్హ హ్హా బాగుంది మీ పెళ్ళి చూపుల కథ :)
ఇంత మంచి మంచి, పెద్ద పోస్టులు వ్రాస్తున్నందుకు మీ ఓపిక్కు జోహార్లు!

మేధ చెప్పారు...

nice :)

లక్ష్మి చెప్పారు...

హ హ :) భలే ఉన్నాయి మీ పెళ్ళి చూపుల విశేషాలు :)

ప్చ్...నాకు పెళ్ళి చూపుల అనుభవం అవ్వకుండానే పెళ్ళి ఐపోయింది...ఇప్పుడనిపిస్తోంది చాలా మిస్ ఐపోయాను అని :(

nuthakkis చెప్పారు...

voww..pelli choopulu antee intha andanga untayi ani naaku telidu. simple superb :)

నేస్తం చెప్పారు...

జీడిపప్పు గారు అదేనండి సమస్య కూడా .. ఒక్క సారి టైప్ చేస్తూ మద్యలో వేరే పని మీద లేచానా ఇంక రాయ బుద్ది కాదు .. ఒక్కోసారి పోస్ట్ అవ్వగానే కళ్ళు లాగెస్తాయి కూడా ..అందుకే కాళీగా ఉన్నపుడే తీరికగా పోస్ట్ తాను :)
మేధ గారు :)
లక్ష్మి గారు హహ .. అవునా :)

గీతాచార్య చెప్పారు...

అయ్యోపాపం ఇంత చన్న వయసులో ఎంత కష్టం వచ్చిందండీ మీకు. పెళిచూపులూ, ఫొటో కూడా చూడలేక పోవటం... చొచ్చొచ్చో. ఊకో అమ్మా. ఊకో. :-)

కానీ narration మాత్రం చాలా బాగుంది.

"ఫోటోలో ఉన్నట్లైనా ఉందా మీ ఒరిజినల్ పేసు అనుకున్నా ..." సంగతి సరే కానీ, కనీసం ఒక డ్రీమ్ సాంగన్నా వేసుకున్నారా లేదా?

గీతాచార్య చెప్పారు...

BTW పిక్చర్ చాలా బాగుంది.

Shashank చెప్పారు...

పోస్టు వ్రాసే సరికి కళ్ళు నెప్పా? స్క్రీన్ కి అంటుకుపోయి మరి చదువుతారా / వ్రాస్తారా? కళ్ళజోడు టైం అయ్యిందేమో మాడం. at least reading glasses.

నేస్తం చెప్పారు...

sumna nutakki గారు :)
హ హ గీతాచార్య గారు డ్రీం సాంగ్ వేసుకోవడమా.. తరువాతా చెపుతా ఆ విశేషాలు :) హమ్మయ్యా ఇందాక నుండి ఫొటో ఎవరన్నా పొగుడుతారా లేదా అని చూస్తున్నా.. థేంక్స్ అండి :)
శశాంక్ గారు మరే నాకు ఆ డవుటొచ్చి తెగ భయం వేస్తుంది .. కళ్ళ జోడు నాకు అసలు పడదు ..మావారు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోమని బలవంతం చేసినా ఏదో ముక్కుమీద మోసినట్లు బరువుగా ఫీల్ అవుతా :( .. కాస్త తగ్గించాలి ఈ కంప్యూటర్ చూడటం

Shashank చెప్పారు...

మీలాగే నేను కూడా నేనేంటీ కల్లజోడేంటి నాన్సెన్సె అని అనుకున్నా ఒక రెండేళ్ళు సీన్ కట్ చేస్తే ఇదిగో ఇప్పుడు కొంచం భారీ కళ్ళజోడు తగిలిచ్చుకొని కూచ్చున్నా. అందుకే మాట విని వెళ్ళండి చెక్-అప్ కి.

Dhanaraj Manmadha చెప్పారు...

నేస్తం నైసో నైసు.

ఇంత కూల్ గా బ్లాగ్స్ లో ఎక్కడా నేను చూడలేదు. ఆప్యాయతానురాగాలని రంగరించినట్లు మీరు రాసే రాతలు ఎండాకాలంలో మలయ మారుతంలా హాయిగా ఉన్నాయి. Keep writing.....

Dhanaraj Manmadha

Anil Dasari చెప్పారు...

నేస్తం కామెంట్ల శైలి కాపీ కొట్టటం శానా వీజీ. 'హ హ'తో మొదలెట్టి రెండు స్మైలీలతో ముగించటమే.

మొత్తానికి మీ మనోజ్ కుమారుడు మిమ్మల్ని సదా ఆనందంలో ముంచుతున్నట్లున్నాడు. ఎప్పుడూ సరదా టపాలు, వ్యాఖ్యలే. Keep it that way.

సుజాత వేల్పూరి చెప్పారు...

అయ్యో, నేస్తం,
జీవితంలో నేనొక మంచి ఘట్టం మిస్సైపోయానన్నమాట.

నేస్తం చెప్పారు...

శశాంక్ గారు అయితే వేళ్ళాల్సిందే
ధనరాజ్ గారు ధన్యవాదాలండి
అబ్రకదబ్ర గారు ..హ హ :))
ఎక్కడ సరదాలెద్దురు ఈ సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళ తో, పైగా మా ఆయనకు క్రికెట్ పిచ్చి ఒకటి కదా .. ఎంత బ్రతిమాలినా ఆదివారం,శనివార బేట్ ,బాల్ పట్టుకుని రెడీ గా ఉంటారు :(
సుజాత గారు హ హ

Srujana Ramanujan చెప్పారు...

అబ్రకదబ్రగారు,

హహ. :) :)

ఇంతేనా? :-)

పరిమళం చెప్పారు...

ఇదన్యాయం ఇదే విషయం నేను రాద్దామనుకున్నా ! ( అపార్ధం చేసుకోకండి నా పెళ్లి చూపులు ) రెండు రోజులు నెట్ ప్రోబ్లం ! మీరు రాశేసారు . అయినా మీలా అద్భుతంగా రాయలేనండీ .....

Narendra Chennupati చెప్పారు...

నేస్తం గారు , బాగున్నాయి మీ పెళ్లిచూపుల కబుర్లు..........

నేస్తం చెప్పారు...

పరిమళం గారు ఇదే పోస్ట్ లో అశోక్,నాగ ప్రసాద్ ల వాక్యను చూసి కూడా ఇలా రాస్తే ఎలాగా .. :) ముందు మీరు రాయండి ...ఎలా ఉందో చెపుతాం చదివి ...
నరేంద్ర గారు :)

గీతాచార్య చెప్పారు...

మీకు కళ్ళ జోడుని ఊహించలేమండీ. పాపం అనిపిస్తుంది. నేనో తవికాను. చూడండి. ట్రిపుల్ ధమాకా అన్నమాట. నా ఇంగ్లీషు కవితకి రెండు అనువాదాలు. నేను చేసినవి కాదు.

http://thinkquisistor.blogspot.com/2009/05/blog-post.html

నేస్తం చెప్పారు...

మీ ధమాకా అదిరింది ..చాలా బాగా రాసారు ముగ్గురును మీకు,మహేష్ గారికి ప్రత్యేక అభినందనలు

పిచ్చోడు చెప్పారు...

అయ్య బాబోయ్ ఈ సారి మేం చాలా ఆలస్యంగా వచ్చినట్లున్నాం!! మీ పెళ్ళి చూపుల ఙాపకాలు చాలా బాగున్నాయి. ఒక డౌటు... జాతకాలు పొంతనలు అన్నీ చూసుకొన్న తరువాత కదా పెళ్ళి చూపులు ఉంటాయి!! మీరు రివర్స్ లో చెప్పారేంటి? మాకు అనుభవం లేదు కదా కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది :)


"బావిలో కప్పలాగా ఎంత సేపూ మా కాలేజ్ కి వెళ్లేదారి లో చిన్నపాటి షాపులు ,దుకాణాలు చూస్తూ పెరిగానేమో ..నా ఊహల్లో కూడా మా ఆయన పుస్తకాల షాపు ఓనర్ లాగా , బట్టల షాపు వాడిలా తప్ప ఇంకోరకం గా కనిపించేవారు కాదు ...సరే తరువాత తరువాత సినిమాల్లో రిక్షా వాడు కూడా డ్రీమ్స్ విదేశాల్లో తప్ప ఇండియా లో ఊహించుకోక పోవడం చూసాకా ...అరె ...రే అని నాలుక కరుచుకుని పాపం మా ఆయనకి ఇస్త్రీ షర్టు , టై కట్టాఅనుకోండి ..."

ఇది చాలా దారుణం అండీ అమ్మాయిలు ఇలా ఆలోచిస్తే మాలాంటి వ్యాపారస్తులు ఏమైపోవాలి? వా.........:((

Ramani Rao చెప్పారు...

చదువుతుంటే పెళ్ళి చూపుల గురించి ఏదో ఒకటి రాసేయ్యాలని నాకు ఆవేశం వచ్చేసింది కాని, నాకసలు పెళ్ళి చూపులనేవి జరగకపోవడం వల్ల ఏమి రాయాలో తెలీడం లేదు. (హ హ రాధిక గారు.. అందరి జీవితం లో ఈ విషయం లో ఎంతో కొంత ప్లాష్ బేక్ ఉంటుంది :) ) అస్సలు ఫ్లాష్ బేక్ లేకపోడమే పెద్ద ఫ్లాష్ బేక్. :(

Srividya చెప్పారు...

Hi nestam.

your blog is very nice.enjoyed reading it.inta pedda posts raastunnanduku mee sahanaanni mechchukovaali. Keep writing...
Waiting 4 ur next post :)

నేస్తం చెప్పారు...

@ పిచ్చోడు గారు మా ఆయన తరుపువాళ్ళు అన్నీ చూసుకుని హడావుడిగా ఆ రాత్రి చెప్పారనుకుంటా రేపు పెళ్ళీ చూపులకు వస్తామని.. అన్నీ నాకు చెప్పరు కదండీ :( మరి పుస్తకాల షాప్ వాళ్ళూ ,బట్టల షాప్ వాళ్ళు చిన్నపాటి వ్యాపారస్తులే కదండి ..కాని చాలా మంది పెళ్ళి కొడుకంటే ఒక కారు ,టై గట్రాలు ఉహించుకుంటారు ప్రస్తుత పరిస్తితి బట్టి అయితే సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను ఊహిస్తారు చదువుకున్నపుడు నాకు అంత తెలివితేటలు ఏడవలేదు అదన్నమాట ..
ఏంటండి రమణి గారు అందరూ నాకు పెళ్ళి చూపులు జరగలేదంటే నాకు జరగలేదని అంటున్నారు..ప్రేమ వివాహం మిస్ చేసుకుని ఈ లెక్కన నేనెంత మిస్ అయిపోయి ఉంటాను :(
శ్రీ విద్య గారు ధేంక్స్ అండి :)

........................ చెప్పారు...

hammaya sadivesa , o panai poindi , next post epulu?

మరువం ఉష చెప్పారు...

బావుంది, పెళ్ళిసందడి సినిమాలో మాదిరిగా ;) తరువాయి సంచిక కొరకు ప్రతీక్షిస్తూ..

నేస్తం చెప్పారు...

అన్నట్లు శ్రీవిద్య గారు మీ పోస్ట్ లు చాలా బాగుంటాయి.. నేను ఒక సారి చదివాను :) అలా మద్యలో ఆపేస్తే ఎలా అండి మాలంటి అభిమానులు ఏమైపోవాలి
కుమార్ గారు త్వరలో :)
ఉషగారు థేంక్స్ అండి

chaitanya చెప్పారు...

బాగుంది మీ పెళ్లి చూపుల ప్రహసనం సరదాగా.... :D

అసలు పెళ్ళిచూపులు ఎలా ఉంటాయో చూడాలని... నాకు కోరిక... నిజంగా సినిమాలో చుపించేట్టుగానే ఉంటాయా...!

arunank చెప్పారు...

నవ్వొస్తుందండి మీ పెళ్ళి చూపుల తతంగం చూస్తుంటే.అంతమంది లో తల ఎత్తి చూడటం కస్టమే కాని....some how u must have seen .sisters,brothers ,బాబైస్ సహాయం చేయవలసింది.ఈ విషయం లో మాత్రం మీరు చాలా మిస్ అయ్యారు.
ofcourse Marriages are made in heaven అంటారు కదా.
చూసిన చూడకపొఇనా థ్రిల్లె .అందరిలా కాకుండా మీరు కాబోయే శ్రీ వారిని చూడకుండా థ్రిల్ల్ అనుభవించారు.

swapna@kalalaprapancham చెప్పారు...

mi photo kuda petti unte bagundedi. andaram chusevallamu mi kamalhassan and mimmalni :)

నేస్తం చెప్పారు...

అరుణాంక్ గారు :)
స్వప్న గారు హ హ :D

Ajay :) చెప్పారు...

bale bale.....mottaniki anni baaga gurtu petukunnaruu :)

Vinay Chakravarthi.Gogineni చెప్పారు...

arun gaaru ashok gaaru cheppinatluga...........ilantivi raayaalani andari blogers ni requesting.......ilanti topics chaduvutunte...........ado lokam loki vellipotunnam brhmachaarulam...........challa baagundi..........

Jammy చెప్పారు...

Hi Friend, nenu motham chadhavaledhu kaani, happy anipinchindhi. Naaku kooda pelli fix ayyindhi. 5th July Vijayawadalo pelli an reception 6th July. ee message check chesukuntey, please naa reception ki thappaka ragalaru... mee email id isthey card pampisthanu. anyways good luck friend.

నేస్తం చెప్పారు...

చక్రవర్తి గారు ధన్యవాధాలండి
జిమ్మి గారు మీ అభిమానానికి ధన్యవాదాలండి ,కాని నేను ఇండియాలో లేను ,మీకు శుభాకంక్షలు మనస్పూర్తిగా తెలియ చేస్తున్నాను :)

అజ్ఞాత చెప్పారు...

చదువుతూ ఉన్నంత సేపు సమయం గడిచినది తెలవలేదు. ఆఖరిలో మీరు "to be continued..." అని మన t.v. serials లాగా ముగించడం, నన్ను చాలా అసంతృప్తికి గురిచేసింది.

durgeswara చెప్పారు...

అమ్మా

హైందవ సంస్కృతి ,ధర్మాలను గూర్చిన సందేహాలను తీర్చుకోవటం కొరకు ఒక వేదిక ఏర్పాటు చేయబడినది . మీరు మీ మెయి అడ్రెస్స్ ఇస్తే మీకు ఆహ్వానం పంపుతాము ,మనవాల్లంతా వచ్చి చేుతున్నారు.
durgeswara@gmail.com

నేస్తం చెప్పారు...

దుర్గేశ్వర గారు నేను ఇండియాలో ఉండటం లేదు అయినా మీ అభిమానానికి ధన్య వాదాలు :)

Munna చెప్పారు...

chala bagundi me description.professional kind of narration.keep it up..

అజ్ఞాత చెప్పారు...

పెళ్లి సందడి సినిమా గుర్తొచ్చిందండి... నిజంగానే సినిమా చూపించారు.