21, ఏప్రిల్ 2009, మంగళవారం

కాల మహిమనేనూ,మా అక్క ఒకే ఇంట్లో పుట్టినప్పటికీ మా ఇద్దరికీ ఏ విషయం లోనూ ఒకే అభిప్రాయం ఉండేది కాదు,ముఖ్యం గా డబ్బు విషయం లో అస్సలు లేదు... నేను చిన్నప్పటి నుండి మహా పొదుపు ( అంటే మావాళ్ళు కాస్త వక్రీకరించి పిసినారి అనేవాళ్ళు గాని అది ముమ్మాటికీ పొదుపే అన్నమాట ,మీరు వాళ్ళలా అస్సలు అలా అనుకోకండి,సరేనా ) అలా పొదుపుగా ఉండడానికి ఒక కారణం ఉంది , అది ఏంటంటే నేను ఎప్పుడు మా అమ్మా, నాన్నలు మాట్లాడుకోవడం విన్నా ఆ సంభాషణ ఇలా ఉండేది..

అమ్మ: ఏమండీ ఈ నెల ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ కావాలి ఖర్చులకి,మా తమ్మూడి కూతురు ఫంక్షన్ ,ఏదో ఒకటి కొనాలి ..
నాన్న :మొన్న 3000 ఇచ్చాను కదా, అందులో ఏం మిగల లేదా??
అమ్మ: ఇంకేం 3000 బాబు.. ఎప్పుడో అయిపోయాయి మీ పిల్లలకు పండగలకు డ్రెస్సులు కొనద్దా ..పాపం వాళ్ళకు సంవత్సరానికి కొనేదే రెండు జతలు, మద్యలో పండగలకు పుట్టినరోజులకు కొనేదే ఉండదు ..
నాన్న: మరి అంతకు మొన్న 1000 ఇచ్చాను అది??
అమ్మ: ఇంకేం వెయ్యి మీ పెద్దమ్మ గారి అమ్మాయి ఇంటికి వస్తే వాళ్ళకు బట్టలు పెట్టాము కదా
నాన్న: మరి అంతకు ముందో వెయ్యి ఇచ్చాను కదా ... ( ఈ సారి అమ్మకు కోపం ఒక రేంజ్ లో వచ్చేది )అంటే నేనేమన్నా తినేస్తున్నానా అలా అడుగుతారు ,మొన్న ఫలానా వాళ్ళ పెళ్ళి కి చదివింపులు అందులోనుండే ఇచ్చాను, మొన్న చుట్టాల తాకిడికి విపరీతమైన ఖర్చు ,ఈ నెల గ్యాసు ఇట్టే అయిపోయింది పైగా చలికాలం వేడి నీళ్ళూ కూడా కాయాలి కదా ,మీకందరికీ ఎసర్లులా మరగకపోతే స్నానం చేసినట్లే ఉండదాయే... మీకేమో లుంగీలూ సరిపోవడం లేదని రెండు తీసుకున్నాను .. కనీసం నా కోసం ఒక్క చీరన్నా కొనుక్కున్నానా ,ఆ విషయం అసలు అడిగారా మీరూ.. అంతేలేండి మీ వాళ్ళు అంటే పరిగెట్టుకుని అడగక పోయినా సరే అన్నీ చూస్తారు ఏటొచ్చీ మా వాళ్ళేకదా పై వాళ్ళూ ,,అక్కడ మాత్రం బాగా లెక్కలు అడుగుతారు ..వాళ్ళు మీకు ఎంత చేసినా అంతే .. (ఇంక కళ్ళ నీళ్ళు జర జర వచ్చేసేవి )..
నాన్న: అయ్యబాబోయి ఇప్పుడేమన్నానే బాబు ఈ నెల ఖర్చు విపరీతం గా ఉంది అందుకే అన్నాను సరేలే ఇస్తాను .. ఏంటో ప్రతి నెలా ఖర్చు పెరుగుతుందే కాని తగ్గడం లేదు ..


ఈ టైపు లో ఇంచుమించుగా ఇదే మాట్లాడుకోవడం విని విని మా నాన్న మీద విపరీతమైన జాలి వచ్చేసేది..అయ్యో పాపం ఎన్ని కష్టాలో కదా పైగా ఇంత మంది ఆడపిల్లలం ..మా చదువులు ,పెళ్ళీళ్ళు ఎలా చేస్తారో అనే భయం వల్లో మరొకటో తెలియదు కాని డబ్బులు అస్సలు ఖర్చు చేసేదాన్ని కాదు .. ఇంటికి చుట్టాలొచ్చినా, ఎవరన్నా ఏదన్నా కొనుక్కోమని డబులిచ్చినా అస్సలు ఖర్చుపెట్టేదాన్ని కాదు ..మిగిలిన వాళ్ళు అయిస్ క్రీములూ అని డ్రింకులని కొన్నా నేను అహనాపెళ్ళంట కోటా లాగా చూసి ఆనందపడిపోయేదాన్ని ,పైగా మనం మున్సిపల్ స్కూల్ విధ్యార్ధినులం కాబట్టి పుస్తకాల విషయం లో కూడా ఖర్చు చెప్పేదాన్ని కాదు ...అక్క, చెల్లెళ్ళ పుస్తకాల్లో మిగిలిన పేపర్స్ చింపేసి బైండింగు చేసుకుని మరీ రాసేదాన్ని కాని నాన్నను డబ్బులు అడిగేదాన్ని కాదు ...ఇవన్నీ కాక నాకు మరొక గొప్ప సులక్షణం ఉంది ... నేను దాచిన డబ్బులు నాకోసం కొనుక్కోను ..పెళ్ళికి ముందు మా నాన్నకి పెళ్ళయ్యాక మా ఆయనకు ఎవరికో ఒకరికి ఇస్తానుగాని నాకోసం కొనుక్కోబుద్ది కాదు ..ఇదేం అలవాటో నాకు అర్దం కాదు ...కాకపోతే వాళ్ళు ఆ డబ్బులను సద్వినియోగం చేయాలన్నమాట ..మొన్న ఎంతో కష్టపడి కూరలకిచ్చిన డబ్బులను కొంత దాచి ఒక 600 $ మా ఆయనకిస్తే ఎంచక్కా రాత్రికి ఒక క్రికెట్ బేట్ ,బాల్స్ చెత్త చెదారం కొనేసి వచ్చేసారు.. దెబ్బకి కుక్కలా ఏడ్చాను అదివేరే విషయం అనుకోండి..


సరే డబ్బు విషయం లో నేను ఇలా ఉంటే మా అక్క నాకు పక్కా వ్యతిరేఖం ...ఈ రోజంటే చిరంజీవి ప్రేమే లక్ష్యం ,సేవే మార్గం అంటున్నాడు గాని అది ఒక పదిహేనేళ్ళ ముందే ఈ స్లోగన్ ని బట్టీపట్టేసింది ... వాళ్ళ స్కూల్ లో ఎప్పుడూ రెడ్ క్రాసు ,బ్లూక్రాసు అని ఏంటో ,ఏంటో తెగ ఉండేవి ..అందులోనూ ఇది లీడర్ ఒకటీ .. దీనిపని ఏంటంటే ఎప్పుడూ డబ్బులు వసూల్ చేయడం అవి వాటికి జమ చేయడం .. ప్రొద్దున లేస్తే.. నాన్నా దానికి చారిటి ఇవ్వండి, దీనికి డబ్బులు ఇవ్వండి అని ఒకటే గొడవ.. ఇంట్లో ఎక్కడన్నా డబ్బులు దొరికాయంటే చాలు ఎవరివి ,ఏంటి అని అడిగేది కాదు తీసుకువెళ్ళీ వాటికి ఇచ్చేసేది .. దీని బాధ పడలేక నా డబ్బులు పిల్లి ముప్పై మూడు ఇళ్ళల్లో తన పిల్లలని దాచినట్లు నేనూ అలా దాచుకోవలసి వచ్చేది .. అంతటితో ఆగేదా ,విపరీతమైన దాన ధర్మాలు.. అమ్మ ఒకసారి షాప్ కి వెళ్ళి ఏదో కొనుక్కు రావే అని డబ్బులిచ్చి పంపితే దారిలో అడుక్కుంటున్న ముసలావిడకు ఇచ్చేసి వచ్చేసింది.. ఇంటికెవరన్నా వచ్చి అడుక్కుంటే వాళ్ళకు అన్నం పెట్టీ పంపేవరకూ ఊరుకునేది కాదు ..ఒక సారి ఇలాగే మండుటెండలో ఒక సోది చెప్పే అమ్మాయి చిన్నపిల్లను వేసుకుని వెళుతుంటే ..ఆవిడకు చిన్న పిల్లను అలా కష్ట పెట్టద్దు అని దారంతా బుద్దులు చెప్పి ఇంటికి తీసుకొచ్చి మరీ అన్నం పెట్టి పంపింది ..ఆవిడ వెళీపోతూ వెళిపోతూ రెండు జతల చెప్పులను కూడా తీసుకు పోయింది అక్కడ పెట్టినవి..(అంటే ఆ అమ్మాయి వచ్చేటప్పటికి ఉన్న చెప్పులు వెళ్ళగానే మాయం అయిపోయాయి ..వేరే చాన్స్ లేదు ...ఒకవేళ ఆమే కాక పోతే పాపం శమించు గాక )


సరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే నాకు మరొక జలక్ ఇచ్చేది అడపాదడపా... రాత్రిళ్ళు పడుకునేటప్పుడు ఇలా చెప్పేది.. మెరుపు కలలు సినిమాలో కాజోల్ లాగా కన్నే మేరి మాతయో ఏదోనమ్మా అది అయిపోతాదట .. అలా అయిపోయి పేదలకు,దీనులకు సేవ చేస్తుందట..అందుకని ఆ సంవత్సరం కాంగానే బస్ ఎక్కి అక్కడెక్కడో ఏదో సేవాసదన్ ఉందిట అక్కడకు వెళ్ళి సేవ చేసి తరిస్తా అనేది ..ఇక చూస్కోండి నాకు అలా ఇలా భయం వేసేది కాదు .. అది కాదక్క సేవ ఇక్కడ నుండి కూడా చేయచ్చు కదే అంటే.. నన్ను పెద్ద అఙ్ఞానిని చూసినట్లు చూసి ఆగ్నస్ ఇలాగే అనుకుంటే మధర్ ధెరిసా అయిఉండేదా ..మంచిపనులు చేయాలంటే ఇంట్లో నుండి చేయలేం అని ఒక గంట క్లాసు పీకి అమ్మావాళ్ళకు ఇవేమి చెప్పద్దు వాళ్ళను నువ్వే చూసుకోవాలమ్మా అని రెండు పెద్ద పెద్ద డయిలాగులు చెప్పి ఎంచక్కా దున్నపోతు లా పడుకునేది.. ఇక నేను జాగారమే రోజూ ఇదెక్కడ వెళ్ళిపోతుందో అని రాత్రిళ్ళు పడుకునేదాన్ని కాదు ..పగలు పొద్దెక్కేవరకు లేవకుండా నానా తిట్లు తినేదాన్ని ....


మా అక్క అంటే మా ఇంట్లో అందరికీ మహా ఇష్టం ..నాన్నకు మరీనూ ...మీ అందరికన్న ముందు ఇదేరా నాన్న అని పిలిచింది అని తెగ మురిసిపోయేవారు.. అది ఆడింది ఆట ,పాడింది పాటలా ఉండేది.. పాపం ఆ పెద్ద కూతురు బిరుదువల్లే దాని చదువు మద్యలోనే అటక ఎక్కేసింది.. ఒక సారి మా తాతగారు (అమ్మ నాన్న) హడావుడిగా ఒక సంబంధం తీసుకు వచ్చారు .. అప్పుడే నా కూతురికి పెళ్ళి ఏంటి నేను చేయను అని మా నాన్న ... అదెలా కుదురుతుంది వెనకాలా ఇంకా ఉన్నారు.. మంచిది వచ్చినపుడు వదులుకోకూడదు ..అబ్బాయి కి బోలెడు ఆస్తి ,మంచి వ్యాపారం.. చదువు దేముంది .పిల్ల సంతొషం గా ఉండాలి గాని, మొన్న రెండోదాన్ని చూసే మా ఊర్లో నీకు ఇంత పెద్ద మనవరాలు ఉందా అని తెగ ఆక్చర్య పోయారు అని ఒకటే ఊదరకొట్టేసి పాపం మా నాన్నను హడలెత్తించేసారు.. ఇంకేంటి కట్ చేస్తే మా అక్క పెళ్ళీ ఘనం గా జరిగిపోయింది ...


మా ఇంట్లో అక్క పెళ్ళికి మేము పెట్టుకున్నంత బెంగ ఇంకే మిగిలిన ఆడపిల్లల మీద ఎవరూ పెట్టుకోలేదు... తాళి కడుతున్నపుడు ఇంక మీ ఇంటి ఆడపిల్ల వారి ఇంటి పిల్ల అయిపోయింది, ఇంటిపేరుతో సహా ఇక మీ ఇంటికి సంభందం తెగిపోయింది అని ఎవరో అనంగానే ...నాన్న బాధ ,మా బాధ వర్ణించలేము ... ఎన్ని రాత్రిళ్ళు పడుకోలేదో నేను అయితే ...అందరం ఒకే సమయాని అన్నం తినడం అలవాటేమో పొరపాటున దానికి కూడా అన్నం వడ్డించేసి కళ్ల నీళ్ళు పెట్టుకునే వాళ్ళం.. నాన్న సంగతి చెప్పనక్కరలేదు అంతా మీ నాన్న వల్లే .. నా కూతురిని నా నుండి వేరుచేసాడు అని అమ్మ మీద చూపించేసేవారు .. అందులోనూ అక్క వెళ్ళే ప్రతిసారి నాన్న!!అక్కడ ఎవ్వరూ నాకు తెలియదు.. ఉండలేకపోతున్నా ..నన్ను పంపకండి నాన్న ..చాలా దిగులేస్తుంది అనగానే.. పైకి.. అదేం లేదమ్మా ..అలవాటు అయిపోతుంది ..అమ్మ చూడు నీలాగే వచ్చేయలేదా అని సర్ది చెప్పి పంపి వెక్కి వెక్కి ఏడ్చెవారు .. పైగా అక్క కూడా చిన్నపిల్లఏమో అప్పటికి , దాని లెటెర్ అంతా నాన్న,నాన్న ఎప్పుడొస్తావ్ నన్ను మన ఇంటికి ఎప్పుడు తీసుకువెళతావ్ అని చాలా దిగాలుగా రాసేది ...


అయితే తరువాత తరువాతా మెల్లిగా అక్కడిపరిస్థితులు అలవాటు పడినా దాని మాటల్లో చెప్పినపుడు చాల బాధ అనిపించేది.. మా అక్క అత్తవారింట్లో మహా పొదుపు.. మహా అంటే మహా అన్నమాట :) ఇక్కడ అమ్మగారు పిల్టర్ నీళ్ళు తప్ప వేరే నీళ్ళతో మొహం కూడా కడిగేది కాదు ..అక్కడ తాగేది కూడా ఆకులు అలములూ పడిపోయి ఉన్న బావి నీళ్ళాయే .. అప్పటివరకూ డ్రెస్సులలో చిన్నపిల్లలా అటు ఇటు తిరిగే పిల్ల ఒక్క సారిగా బారెడు బారెడు చీరలు కట్టుకుని ఆరిందలా కుటుంభ బాధ్యతలు అన్నీ దానివే అయిపోయినట్లు వచ్చేవారికి ,వెళ్ళేవారికి మర్యాధలు పలకరింపులు ఇలా చాలా మార్పు వచ్చేసింది దానిలో ..


అయితే పెళ్ళి అయిన చాలానాళ్ళవరకు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు ... మొన్నామద్య పట్టుబట్టీ వాళ్ళీంటికి తీసుకు వెళ్ళింది ..వాళ్ళ ఇంటి ముందే షాప్ చేసి చాల చక్కగా టక టక మంటూ అటు పనులు, ఇటు షాప్ చక్కబెట్టుకుంటున్న అక్కను చూసి మా అక్కేనా అని ఆక్చర్యపొయాను .. ఇల్లు చక్కగా పొందికగా పెట్టుకుంది అన్నీ చూస్తూ అక్కడ కృష్ణుని మెడలో వేసిన ఇత్తడి పూసల లా ఉన్న హారం చూసి ఇదేంటే ఇలా వెలిసిపోయిన హారం వేసావ్ అన్నాను.. అది చూసి అడక్కేబాబు ఏడుపు వరదగొదావరిలా పొంగుకొస్తుంది దాన్ని చూస్తే అంది .. ఏం అంటే.. ఆ మద్య ఒక సోది అమ్మాయి వచ్చీ వద్దు మొర్రో అని అంటున్నా మొహమాట పెట్టేసి సోది చెప్పిందంట ,దాని సారం ఏంటంటే దీని ఇంటికి సిరి రాబోతుంది అంట ..కాని గ్రహబలం వల్ల ఇది వాటిని అందుకోలేకపోతుంది అంట అని ఏదో ఏదో చెప్పింది అంట ....అంతకు ముందు మా బావా ఏదో క్రికెట్ మేచ్ విషయం లో బెట్ కాయాబోతే ఎందుకులే మనకు అని ఇది బలవంతం గా ఆపేస్తే చాలా మొత్తంలో లాభం ఆగిపోయిందంట .. ఇలా రెండు,మూడు జరిగాయి అంట ... అయితే మా అక్క ఇదంతా సోదిలే యాదృచ్చికం అని కొట్టి పడేసి మర్చిపోయిందంట కాని ఆ రోజునుండి ఒకటే కలలు ఇంటినిండా బంగారం ,బంగారం ....నన్ను కాదనకు అని... ఇదేంటా ఇలా వస్తున్నాయి అని అనుకున్నాకా.. ఒక నొక ముహుర్తాన ఒక అతను వచ్చీ ఏమండీ మీవారు ఉన్నారా అని అడిగి బయటకు వెళ్ళారని తెలుసుకున్నాక తెగ బాధ పడి ..మా ఇంట్లో తరతరాల నుండి ఉన్న కొన్ని నగలున్నాయండి ...ప్రస్థుతానికి చాలా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాం ..కాబట్టి వాటిని అమ్మకానికి తీసుకు వచ్చాను ... బయట అమ్మజూపితే పురాతన నగలు కాబట్టి నన్ను అనుమానించే అవకాశం ఉంది అని ఇంకేంటో ఏంటో చెప్పి ఇది ఆకు రాయి దీని మీద గీటు పెడితే బంగారమో కాదో తెలిసిపోతుంది అని మా అప్పలమ్మకు మరి ఏ విధం గా చెప్పాడో తెలియదు మొత్తానికి నమ్మించేసేడు.. ఇది వాళ్ళయనకు పోన్ చేసి చెప్పిందంట .. అసలే మా బావ గారు ఇలాంటి విషయాల్లో చాలా ఆలోచిస్తారు.. వద్దు వద్దు అని చెప్పినా మా అక్కకి ఆ సోది ఆవిడ,కలలు , సూచనలు అన్ని గుర్తు వచ్చేసి ..అమ్మ బాబోయి మనం చాలా నష్ట పోతాం ఇది తీసుకోకపోతే,.. లేకపోతే విచిత్రం కాక పొతే ఇన్ని సూచనలా అని వినకుండా ఒక పదివేలు ఇచ్చి ఒక హారం తీసుకుంది అంట ..వాడు వెళ్ళేవరకూ చేతిలో తళ తళా మెరుస్తుంది అంటా అలా వెళ్ళగానే ఇంకేంటి ...అంతా విష్ణు మాయ అయిపోయింది ...


అంతా విని నేను నోరు వెళ్ళబెట్టి అలా ఉండిపోయాను..అక్కా నువ్వు నువ్వేనా... మూఢనమ్మకాలను ఖండ ఖండాలుగా ఖండించిపారేసే నువ్వా ఈ పని చేసింది .. డబ్బు కంటే సేవా,ప్రేమా,దయ ,కరుణ ,కారం,ఉప్పు,చింతపండు ముఖ్యమని క్లాసుపీకే నువ్వా ఈ పని చేసింది ,అని బోలెడు ఆక్చర్య పోతుంటే ... అలా మళ్ళీ మళ్ళీ గుర్తుచేయకే బాబు.. టైమే టైము ... ఇదే ఇంకొకరికి జరిగితే నీకంటే ఘాటుగా వాళ్ళను తిట్టిపడేసేదాన్నీ.. ఇలా ఎలా చేసారు అని తెగ ఆక్చర్యపడిపోయేదాన్ని ... ఇంకా నయం ఎప్పుడూ ఇంట్లో వ్యాపార పని మీద ఒక యాబై వేలు తక్కువ కాకుండ ఇంట్లో పెట్టేవారు ఆయన ..ఆ రోజు నా అదృష్టం.. తక్కువే ఉన్నాయి.. అమ్మో, మా ఇంటి ఎదురుగా ఉన్న గుడి అమ్మవార్లే కాపాడారు .. లేకపోతే అదెవరో నాకేదో చెప్పడమేమిటీ,నాకు కలలు రావడం ఏమిటీ ,నేను ముందు వెనుకలు ఆలోచించకపోవడం ఏమిటీ ...అయినా ఇంత స్వార్ధం నాకు ఎక్కడినుండి వచ్చిందో ..లేక వాడి మాటల గారడీనో ..మొత్తానికి ఇదీ కధ .. హుం అందుకే మళ్ళీ ఇలాంటి పనులు చేయకుండా ఎదురుగా పెట్టుకుని ఈ గొలుసు మరీ జాగ్రత్తగా ఉంటున్నా అంది...


కాలమహిమనా లేక పెళ్ళి తరువాత బాధ్యతల పేరుతో వచ్చే స్వార్ధమా మరేంటో కాని అలాంటి కన్‌ఫ్యూజ్ పరిస్థితి మాత్రం నాకు జరగకుండా చూడు స్వామి అని దణ్ణం పెట్టేసుకున్నా .. అసలే నేను పొదుపు మరి ...( మీరు వేరే అర్ధాలు తీయకండి మరి .. అది కేవలం పొదుపుమాత్రమే ..మీరు నమ్మాలి )

61 వ్యాఖ్యలు:

asha చెప్పారు...

నెనూ చిన్నప్పుడంతే. నేను రెండో తరగతి చదువుతున్నప్పుడు మా ఇల్లు కట్టించారు. మా మమ్మీ, మామ్మా ఆ అప్పుల గురించి మాట్లాడుకున్నవి విని నాకిచ్చే పాకెట్ మనీని బ్యాంక్ అకౌంట్(మా నాన్నగారు బ్యాంక్ మేనేజర్ లెండి) ఓపెన్ చేసి దాచుకునేదాన్ని. వాటితో మా నాన్నగారి అప్పులు తీర్చెయ్యాలని నాకుండేది. నేనే పెద్దదాన్ని మరి. మీ అక్క పెళ్ళి సంగతులు చెప్తుంటే నా పెళ్ళై అత్తగారింటికి వెళ్ళటం గుర్తుకు వచ్చింది. మా డాడీ ఆరోజంతా తన రూములోనే ఉండిపోయారట. ఎవరితోనూ మాట్లాడలేదట.
ఇంకెప్పుడూ మోసపోకుండా ఇలా జరిగిందనుకోవటమే. అంతకంటే ఏమీ చేయలేము.

Unknown చెప్పారు...

ఏమిటో విష్ణు మాయ !!!

అజ్ఞాత చెప్పారు...

నేను నవ్వలేక చచ్చిపోయానంటే నమ్మండి! మా పెద్దక్క మూడేళ్ళ క్రితం కేన్సర్ తో పోయింది. పెళ్ళవ్వలేదు దానికి. మూడేళ్ళు ఎవరికీ చెప్పకుండా దాచుకుంది కేన్సర్. ఒక్కసారి అది ముదిరిపోయి లింఫ్ ఎడెమా అయ్యేదాకా మాకు తెలీలేదు. ఆ తర్వాత ఆర్నెల్లు బతికిందేవో.

కొంచెం అటూ ఇటూగా మీ అక్కలాంటిదే. మీ పోస్ట్ చదూతుంటే అదే గుర్తొచ్చింది. :-(

Niru చెప్పారు...

very nice...supperrrrrrrr..nenu kooda mee type ee :-)

మంచు చెప్పారు...

Good one . మీరు రాసే శైలి మరియు అంతర్లీనంగా వుండె మెసెజ్ బావుంటుంది.

నేస్తం చెప్పారు...

భవానీ గారు ఏన్టో నన్ఢి మన మనసులు వెన్న కదూ ... ఆడపిల్లలకూ,వారీ కన్న వారికీ ఈ అప్పగిన్తల గట్టమ్ మరుపురాని బాధే..
ప్రదీప్ గారు మరే అంతా విష్ణు మయమ్ జగమన్తా విష్ణుమయం ..
అజ్ఞాత గారు మీ వాఖ్య నన్ను చాలా బాధ పెట్టింది అండి,మీ కుటుంభ సభ్యుల బాధ అర్దం చేసుకోగలను :( తన ఆత్మకు శాంతి కలగాలి అని ఆశిస్తున్నాను ..
నీరూ గారూ ,మీ బ్లాగ్ చూసా చక్కని ఫొటోలతో చాలా బాగున్ది :)

సమిధ ఆన౦ద్ చెప్పారు...

ప్రతీరోజూ ఏదో డైరీ రాసినట్టూ మా అమ్మ పడుకునేము౦దు ఓ పెద్ద పెన్ను, మరో పెద్ద బుక్కూ పట్టుకును టపాటపా ఆ రోజువో లేక ఆ వారానివో ఖర్చులు రాసేయడ౦, ఆ పుస్తకాన్ని లేచే ఓపిక లేక తన ది౦డు కి౦ద పెట్టి పడుకోబోవడ౦, మా నాన్న ఛీఛీ దీన్ని అవతల పెట్టు, ఏ౦టీ దీన్ని ఇక్కడ పెట్టి నన్ను పడుకోనిద్దామనే నీ ఆలోచన అ౦టూ సరదగా విసుక్కోడ౦ అబ్బో ఇ౦కా బోల్డెన్ని గుర్తొచ్చేసాయి. మీ అక్క గారి సిరి కథ వి౦టే శుభలగ్న౦ సినిమాలో వెయ్యి రూపాయిలకి లాటరీ టిక్కెట్లు కొనే ఆమని గుర్తొచ్చి౦ది. భలే నవ్వుకున్నాలె౦డి.

Shashank చెప్పారు...

బాఫుందండి మీ కథ. చిన్నప్పుడు ఎల ఉంటామో కొంచం పెద్దయక అల ఉండడం చాలా కష్టం కద! అయినా ఈ రోజుల్లో అప్పగింతలు అమ్మయిలకి అబ్బయిలకి ఇద్దరికి ఉన్నట్టే అనిపిస్తుంది నాకైతే. ఏమిటో..

నేస్తం చెప్పారు...

మంచు పల్లకి గారు ధన్య వాధాలు ..
ఆనంద్ గారు మద్యతరగతి కుటుంభాలన్నీ ఇంచు మించు ఇలా కూడికలు తీసివేతలతో లెక్కలు చేయడంతోనే సరిపోతుంది :)ఈ విషయం లో ఇంచుమించు ఆమని టైపే అనుకోండి ...
శశాంక్ గారు ఈ రోజుల్లో అప్పగింతలు పై చదువులకు,ఉద్యోగరిత్యా లాంటి కారణాల వల్ల పెళ్ళికి ముందే మొదలై పోతూన్నాయి ఇద్దరికీ ...

చైతన్య చెప్పారు...

నేను నమ్ముతానండి... అది పొదుపే...
నేను కుడా మీలాగే "పొదుపు"... కాకపోతే ఎందుకో పక్కవాళ్ళకే అర్థంకాదు... మీ వాళ్ళ లాగే మా కొలీగ్స్ కూడా దాన్ని వక్రీకరించి ఏవేవో జోకులు వేసుకుంటారు... (అంటే నేను జాబ్ లో జాయిన్ అయి అయిదు సంవత్సరాలైనా ఒక్కసారి కూడా నాతో పార్టీ ఇప్పించుకోలేకపోయారు... అది వాళ్ళ చేతకాని తనం అని ఒప్పుకోకుండా దాన్ని అటు ఇటు తిప్పి నా మీదకి పెట్టేస్తారు)

నేస్తం చెప్పారు...

అంతేలేండి చైతన్య గారు మంచికి రోజులు కావు.. మరే, మన అంత పొదుపు వాళ్ళకు లేదని కుళ్ళు ..మీరూ నాలా ఆట్టే పట్టించుకోకండి :)

karthika చెప్పారు...

Nestham garu mee akka mrrg taruvatha scenes baada kaliginchaayi :(.

అజ్ఞాత చెప్పారు...

రాజ్ కుమార్:

చాలా బాగుందండి.. నేను ఎప్పుడు రాస్తారా అని ఎదురు చూసే బ్లాగ్స్ లొ మీదొకటి. ఎప్పటి నుంచో మీ బ్లాగ్ చదువుతున్నా.. ఎప్పుడూ కమ్మెంట్ రాయలేదు.. కానీ ఈరోజు మీ అక్కగారి పెళ్లి ఎపిసోడ్ నా చేత రాయించింది.. నాకైతె నిజంగ కల్ల ల్లోకి నీల్లు వచెసై.. నాకు అక్కలూ చెల్లెల్లూ ఎవరూ లేరు.. ఊంటె వాళ్ళ పెళ్ళయ్యాక ఇలాగే బాధ పడెవాడి నేమూ??

మీ నెక్ష్త్ టప కోసం ఎదురు చూస్తూ ..

Shashank చెప్పారు...

nEstam mIku "lakhmipati" bAgE telisinaTTE undE.. :p


chaitanya - idi mIku vartistundi..

నేస్తం చెప్పారు...

కార్తీక గారు నిజంగా ఆ బాధ మాటల్లో చెప్పలేము,ట్రైన్ ఎక్కించినపుడు కూడా తప్పదా అన్నట్లు బిక్క మొహం వేసి వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ ఉండేదంటా .. పైగా ఆ క్రొత్త వాతావరణం ,మనుషులను ఒకటి అలావాటు పడలేక పోయింది ..అప్పటికి తన వయసు 18 ఉంటాయేమో ..దాని నుండి లెటేర్ వచ్చిందో మాకు గుబులే ఇంక నాన్నను పట్టుకోలేక పోయేవాళ్ళం ...
రాజ్ కుమార్ గారు మీరు అలా కామెంట్ పెట్టకపోతే ఎలా అండి.. మరి నాకు ఇంతమంచి అభిమానులున్నారని ఈ టపాలన్నీ ప్రింట్ తీయించి మరీ ఇండియా తీసుకు వెళ్ళి గొప్పగా చెప్పుకుందామని నేను ప్లాన్ వేసుకుంటుంటే ..మీ అభిమానానికి ధన్యవాధాలు

అజ్ఞాత చెప్పారు...

పెళ్ళి గురించి చదివిన దగ్గర ఏంటో ఏడ్చేసా..

పొదుపరి అని నమ్ముతా. పొదుపు చాలా మంచి గుణం కూడానూ :)
~C

జ్యోతి చెప్పారు...

పాపం మీ అక్కయ్య... ప్రతి అమ్మాయికి పెళ్లి కాకముందు మహారాణిలా పెరిగినా, పెళ్లయ్యాక చచ్చినట్టు మారక తప్పదుగా.. నాడైనా, నేడైనా.. ఏనాడైనా...

నేస్తం చెప్పారు...

శశాంక్ గారు ..ఉహు అర్దం కాలేదు లక్ష్మీపతి ఎవరండీ :(
~c హుం.. ఇలాంటివి చదివితే ప్రతి అమ్మాయికీ తమ పెళ్ళి అప్పగింతలు గుర్తువస్తాయి ..
జ్యోతిగారు తప్పదు కద అండి మరి.. ఎవరో అన్నట్లూ ప్రతివారినీ మార్చడానికి ప్రయత్నించేకంటే మనం మారిపోవడం సులువు అని ... అలా మార్పు వచ్చేస్తుంది :)

పిచ్చోడు చెప్పారు...

నేస్తం.. ఎప్పుడూ టపా అంతా నవ్వించి, చివరలో ఏడిపించేవారు. ఈ సారి మొదట్లోనే ఏడిపించేశారు. మీది చాలా అందమైన కుటుంబమండీ. అంత మంచి తల్లితండ్రులున్న మీరు అదృష్టవంతులు. మీ లాంటి అమ్మాయి ఉన్న మీ నాన్నగారు కుడా చాలా అదృష్టవంతులండీ. ఎప్పుడూ నవ్విస్తూ... ఈ సారి మాత్రం బాగా ఏడిపించారండీ. మీ నాన్న గారి బాధను ఊహించుకొంటే నాకు బాధేస్తోంది. నాకు పెళ్ళి అయిన తర్వాత అమ్మాయినే కనాలని బలంగా అనుకొంటుంటే మీరు ఇలా అప్పగింతలు... అవీ... చెప్పి భయపెట్టేస్తున్నారేంటండీ బాబూ.....

నేస్తం చెప్పారు...

పిచ్చోడుగారు నిజానికి నేను ముందు ఇది రాయలి తరువాత అది రాయాలి అని రఫ్ గా అనుకుని సిస్టెం ముందు కూర్చుంటా ఆ తరువాతా నాకు తెలియకుండానే ఆ సంఘటనలలోకి వెళ్ళి ఫీల్ అవుతూ రాసేస్తాను ,,అందుకే నా టపాలు చాట బారతం లా అంత అంత ఉంటాయి :) అయితే మీరన్నట్లు ఉమ్మడిలో ఎంత ఆనందం ఉందో అంత విషాదం కూడా ఉంటుంది తాతయ్య,నానమ్మ ఇలా ఒక్కో మనిషి దూరం అయినపుడు ఎంత ఆవేదన అనుభవించానో నాకే తెలుసు ..ఒక్కోసారి అవన్నీ రాసేద్దాం అనిపిస్తుంది .. కానీ మీరందరూ నా ఙ్ఞాపకాలా తోటలో హాయిగా నాతో పాటు విహరిస్తున్నారని తెలుసు ..మిమ్మల్నీ నాతో పాటు బాధ పెట్టడం ఇష్టం లేక మానేస్తుంటాను ...
అప్పగింతలకు భయపడి అమ్మాయిని కనకపోతే ఎలా అండీ బాబు ... ఇవన్నీ ఒకప్పుడు .. ఇప్పుడు పిల్లల చదువు,ఉద్యోగం నిమిత్తం ముందే అలావాటు పడాల్సిందే మరి

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

>>>మావాళ్ళు కాస్త వక్రీకరించి పిసినారి అనేవాళ్ళు గాని అది ముమ్మాటికీ పొదుపే అన్నమాట ,మీరు వాళ్ళలా అస్సలు అలా అనుకోకండి,సరేనా

హ..హా...మొన్న జావాగ్రీన్ లో మా వాళ్ళు కాఫీ నాకు ఆఫర్ చేస్తె యాభై రూపాయలు పెట్టడం ఇష్టం లేక వద్దంటే నన్ను పిసినారి, ఆ నారి, ఈ నారి అని నానా రకాలుగా అన్నారు. మీ మాటలు విన్న తర్వాత ఇప్పుడు తేలికగా ఉంది నాకు.

>>>మొన్న ఎంతో కష్టపడి కూరలకిచ్చిన డబ్బులను కొంత దాచి ఒక 600 $ మా ఆయనకిస్తే ఎంచక్కా రాత్రికి ఒక క్రికెట్ బేట్ ,బాల్స్ చెత్త చెదారం కొనేసి వచ్చేసారు

నేస్తం గారు, ఏం భాద పడకండి. మీ వారిని అ.భా.పొ.స ( అఖిల భారత పొదుపు సంఘం) లో క్లాసులకు పంపించండి. నేను అందులో మెంబర్నే.. అంతా వారే చూసుకుంటారు. :))

>>>ఆవిడ వెళీపోతూ వెళిపోతూ రెండు జతల చెప్పులను కూడా తీసుకు పోయింది అక్కడ పెట్టినవి

ఇప్పుడు నన్నెవరూ డిస్టర్బ్ చెయ్యోద్దు. నేస్తం గారు మీరు కూడా..
హ..హ్హ..హా..హ్హా...
హ..హ్హ..హా..హ్హా..

చైతన్య చెప్పారు...

నేనస్సలు పట్టించుకోనండి...
మీరు చెప్పినట్టే మంచికి రోజులు కావు...
అలా ఖర్చు చేసేవాళ్ళు కుడా ప్రస్తుతం ఈ ఆర్ధిక మాంద్యంలో మన దారికి రావాల్సిందే.. హ హా

చైతన్య చెప్పారు...

అన్నట్టు ఫోటో మాత్రం సూపర్ గా ఉంది...

శ్రీనివాస్ చెప్పారు...

మంచి టపా వేసారు పిసినారి గారు ( పొదుపరి గారు)

నేస్తం చెప్పారు...

శేఖర్ గారు మిగతా వాటికి నవ్వుకోండి గాని మా ఆయన చేసిన పనికి మాత్రం నవ్వడానికి ఒప్పుకోనంటే ఒప్పుకోనంతే .. తలుచుకుని తలుచుకుని బాధపడిపోతా ఇప్పటికిని
మరే చైతన్య గారు నేనూ సేం డైలాగ్ కొడతా ఆర్దికమాంద్యం విషయం లో ..
శ్రీనివాస్ గారు చూస్తున్నా చూస్తున్నా...

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

చాలా బాగుందండి. పాత రోజులు గుర్తుకు వచ్చాయి.నేను మా ఇంటిలొ పెద్దదాన్ని.మీరు నా గురించేరాసినట్లుగా వుంది. మా నాన్నగారు పెళ్ళి కుదిరి అయెవరకు రోజూ మ్యాపు తీసి మా చెల్లెళ్లకు ఇదుగో బొంబాయి, దీని పక్కన పూనా.అక్క ఇక్కడికే వెళ్ళెది అంటూ చూపించెవారు.పెళ్లియి పూనా వచ్చెటప్పడు తణుకు బస్ స్టాండు లొ ఎవరికి తెలియకుండ నాచేతిలొ 10రూ"లు పెట్టి ఏదయినా అవసరము వస్తె టెలిగ్రాము ఇవ్వమ్మా,ఎలాగయినా వచ్చేస్త్తాను అంటూ కళ్లలొనీటితొ పంపారు.అప్పుడు నా వయస్సు 19 సంవత్సరాలు. ఇప్పుడు నేను అమ్మమ్మను, నాన్నమ్మను కూడా .ఆ నొటు అలాగే వుంది(పాత కాలపు నోటు)మీ బ్లాగుతో ఆజ్ఞాపకాన్ని గుర్తు చేశారు.

నేస్తం చెప్పారు...

సుర్య లక్ష్మి గారు మీ వాఖ్య నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అండి .. మా అమ్మను గుర్తు చేసారు...అమ్మ చెప్పినట్లే చెప్పారు .. మీవంటి వారు చెప్పే కబుర్లు అంటే నాకు చాలా చాలా ఇష్టం

నిషిగంధ చెప్పారు...

:))))

నేను అచ్చు మీ అక్క టైప్.. రెడ్ క్రాస్, యునెస్కో, కేన్సర్ ఫౌండేషన్ లాంటి సంస్థలకి నేను విధేయురాలిని.. మీ టపా చదువుతుంటే చిన్నప్పుడు డొనేషన్స్ కలెక్ట్ చేయడానికి ఇంటికొచ్చిన నాన్న ఫ్రెండ్స్ ని కూడా ఎలా ఇరకాటంలో పెట్టేసేదాన్నో గుర్తొస్తుంది :-) నిజంగానే పెళ్ళయ్యాక చాలామంది అమ్మాయిలలో ఎంత మార్పు వస్తుందో కదా!

Shashank చెప్పారు...

అహా నా పెళ్ళంట లో కోట పేరు లక్ష్మీపతి. అతి పొదుపు చూపితే మేము అలనే పిలిస్తాము.. :) ఏంటొ అప్పగింతలు అవి ఇవి అంటున్నారు అంతా... మొదటి సారి ఇళ్ళు వదిలి దేశం కాని దేశం ఎవ్వరు తెలేదు, మొదటి సారి ప్లేను, బధవేసినా ఇంటికి వెళ్ళలేని పరిషిథి గుర్తొచింది నాకు. ఈ నడుమ ఎంత వేగంగా ఇంటికి చేరగలమో ఇంకంత దూరల్లొ ఉంటున్నట్టు అనిపిస్తుంది నాకు.

@జ్యోతి గారు - బోలెడు అబ్బాయిల పరిస్థితి కూడా అదే. కాదంటారా?

Narendra Chennupati చెప్పారు...

ఎప్పటిలాగే చాల బాగా రాశారు....మా ఇంట్లో మా అన్నయ్య మీ లాగ డబ్బు ని చాలా జాగర్తగా ఖర్చు పెడతాడు.. నేను అదేదో సినిమాలో చెప్పినట్లు నాదగ్గర వుంటే అయిపోతాయని తొందరగా ఖర్చుపెట్టేస్తాను ...

నేస్తం చెప్పారు...

నిషిగంధ గారు అయితే మా అక్కను తలపిస్తున్నారు మీరు .. తప్పదు కదండి మార్పు సహజం
శాశాంక్ గారు ఓహ్ ..అదా .. ఇది మరీ బాగుందండి పిసినారికి,పొదుపుకి మీకసలు ఆట్టే తేడా తెలియడం లేదు ..మళ్ళీ మీకు గంట ఈ విషయం మీద క్లాస్ తీసుకోవాల్సిందే .. శశాంక్ గారు ఇప్పుడు పరిస్థితులు వేరు ఆడ మగ ఎవరన్నా ధైర్యం గా ముందుకు సాగాలి విద్య ,ఉద్యోగాల వల్ల..కాని పెళ్ళి విషయం లో అప్పట్లో ఎవరో తెలియని ఇంట్లో ఒక్కసారిగా ఆ ఇంటి వాతావరణాన్ని ,మనుషులను అలవాటు పడాలి ..అప్పటి వరకూ తెలియని మర్యాదలు ,వంటా వార్పులు వారి అభిరుచికి తగ్గట్టు చేయాలి.. ఇంకా అనేక రకాలయిన మనస్తత్వాలను ఎదురుకోవాలి ... అది ఆడపిల్లలకు కత్తి మీద సామే ..ఇక ఇప్పుడు అంటారా వేరు కాపురాలు,ఉన్నత ఉద్యోగాలు కాబట్టి సర్దుకుపోతే సరే సరి లేదా ఇక అంతే .. ముఖ్యం గా ఈ రోజుల్లో ఇగోల గోల ఎక్కువ గా ఉంది ఇరువురి మద్య ..ముందు ముందు ఆ విషయం లో మార్పు వస్తుంది అనుకుంటున్నా ..
నరేంద్ర గారు కుటుంభం లో ఒకరు జాగ్ర్త్తపరులు మరొకరు ఖర్చు చేసేవారు అయితే పర్వాలేదు ..కాని కొద్ది పాటి గొడవలు వస్తాయి మరి (మా లాగా :)) ..కానీ పాట్నర్ కూడా ఖర్చు చేస్తే ఇక అంతే సంగతులు.. కాబట్టి మీ ఇరువురికి మీకు తగిన భార్య రావాలని ఆశిస్తున్నాను :)

కొత్త పాళీ చెప్పారు...

You're too good.

krishna rao jallipalli చెప్పారు...

బాగా రాసారు. అవసరానికి తగ్గ, అవసరమైన చోట, అవసరమైనంత ఖర్చు పెట్టడంలో తప్పులేదు. దేనికి అయినా పట్టు విడుపులు ఉండాలి మరి. మీ నాన్న గారి బాధలో అర్థం ఉంది... మరి మీ విషయంలో...

రాధిక చెప్పారు...

నేను పొదుపరిని .అలాగే పొదుపరిని కాదు :) డబ్బులు దాచి దాచి అందరికీ ఇచ్చేదానిని.ఇప్పుడు నా చేతుల్లో ఏమీలేక మావారిని సతాయించి నెల నెలా చారిటీకని కొంత పెట్టిస్తున్నాను.హమ్మయ్యా పెళ్ళయ్యాకా కూడా నేను మారలేదు :)

నేస్తం చెప్పారు...

కొత్త పాళి గారు :)
కృష్ణా రావు గారు మా అక్క విషయం లో మా నాన్నగారు పడ్డ బాధ మళ్ళీ మా విషయం లో పడకూడదని నేను ముందుగానే చాలా ప్రిపేర్ అయ్యాను.. మా అక్కా,బావ గారు పెళ్ళికి ముందు అసలు మాట్లాడుకోకపోవడం వల్ల ,చిన్న వాళ్ళు అవ్వడం వల్ల వారు ఒకరినొకరు అర్దం చేసుకోవడానికి టైము పట్టింది .. నేనూ మావారితో పెద్దగా మాట్లాడకపోయినా ఆయన అంటే చాలా ఇష్టపడుతున్న ఫీలింగ్ మావాళ్ళలో ముందు నుండి కల్పించాను ... ఇదంతా చాలా మాములులే అన్నట్లుగా చాలా జాగ్రత్త గా వాళ్ళను ప్రిపేర్ చేసాను..అసలు నేను విదేశానికి వెళుతున్నా అనగానే బెంగలాంటిది వాళ్ళు పడకుండా అబ్బో ఇలాంటి అవకాశం ఎంతమందికి వస్తుంది.. నాకు వచ్చింది అన్న సంభరాన్ని పది సార్లు వారికి వినిపించాను ...ఖచ్చితం గా ఇప్పుడు నేను వారి సమక్షాన్ని ఎంత మిస్ అవుతున్నానో వాళ్ళూ అంతే నన్ను మిస్ అవుతారు కాని నేను హాయిగా ఉన్నాను అనే తలపు వారికి కాసింత ఊరట..ముఖ్యం గా మావారు నా తల్లిదండ్రులకు నన్ను బాగా చూసుకుంటారు అనే భరోసా కూడా బాగా కల్పించారు :)

నేస్తం చెప్పారు...

హ హ రాధిక గారు ..good :) మంచి పని చేసే చోట మనం మారనక్కరలేదు.. నేను మాత్రం దాచిన మొత్తం లో కొంత చారిటికి ఇచ్చి మిగిలింది మా వారికి ఇస్తాను :)

ప్రియ చెప్పారు...

ammo. maree intha podupa? avunu mari pellaithe inthe mari. maa akka koodaa anthe. ante paapam redcrosslo, bluecrosloo kaadu. meelaagannamaata.

నరేష్ నందం (Naresh Nandam) చెప్పారు...

నేస్తం.. జాజిపూల వాసన నా బ్లాగుదాకా వస్తే ఒక్కసారి చుసొద్దామని వచ్చా. ఇక్కడ మొక్క కాదు పేద్ద వృక్షమే ఉందని తెలిసింది. అందుకే.. మీ జాజిచెట్టుకింద ఇక నుంచి అప్పుడప్పుడు సేద తీరుదామనుకుంటున్నాను. అభినందనలు.

నేస్తం చెప్పారు...

ప్రియ గారు :)
నరేష్ గారు మీరు ఇంకా పోస్టు లేమీ రాయనట్లున్నారు.. మీ అభిమానానికి ధన్యవాధాలు :)

Shashank చెప్పారు...

@ రాధిక గారు - ఈ మధ్యలో ఎమైన డబ్బు దాచారేంటి?

Shashank చెప్పారు...

"కుటుంభం లో ఒకరు జాగ్ర్త్తపరులు మరొకరు ఖర్చు చేసేవారు అయితే పర్వాలేదు ..కాని కొద్ది పాటి గొడవలు వస్తాయి మరి (మా లాగా :))" - ఇది మాత్రం 100% కరెష్టండి. opposites attract అని ఊరికే అనరు కద! మా ఇంట్లో మా ఆవిడ మీ టైపే పొదుపరికి ఎక్కువ పిసినారి కి తక్కువ అంటే నాకు gift కూడా నా డబ్బుతోనే కొనిస్తుంది.. కొననిస్తుంది అదే గొప్ప అనుకోండి. నేను మాత్రం జేబులో డబ్బుంటే అది ఖర్చయ్యే దాకా చాలా టెన్షన్ పడుతూ ఉంటా. గమ్మున ఏదో ఒక electronic item కొని తిట్లు తింటూ ఉంటా.

rishi చెప్పారు...

puvvuluu,mokkalu ani eminaa perundo..vellakunaa undaleni..jaajipoolu kaadu..poola thote kanpinchindi.....

గీతాచార్య చెప్పారు...

పొదుపా? భలే. మీదెంత జాలి గుండె? నా అభినందనలు. నేను నమ్ముతున్నాను. మీది పొదుపే. పిసినారితనం కాదు. హహహ.

నేస్తం చెప్పారు...

హ..హ శశాంక్ గారు చాలా మంది ఇంట్లోలానే అన్నమాట ..మా వారూ అంతే 6 నెలలకోమారు మొబైల్ మార్చకపోతే ఉండలేరు.. ఏది అయినా సరే క్రొత్తగా వస్తే ముందు మా ఇంట్లోనే ఉండాలి.. ఈ విషయంలో అపర కాళి నే ఒక్కోసారి :)
రిషి గారు దేంక్స్ అండి :)
గీతాచార్య గారు హమ్మయ మీరు అర్దం చేసుకున్నారు అదిచాలు :)

Sirisha చెప్పారు...

chala bagundhi andi...mee blog really too good to resist...nenu inka mee blog ni regular ga follow avuta...dont mind...

కారుణ్య చెప్పారు...

నేస్తంగారూ.. చాలా బాగా రాశారండీ.. ఎప్పటికప్పుడు మంచి పోస్ట్‌లు, వాటిలోపల దాగిఉండే ఏదో ఒక మెసేజ్‌ను మాకు అందిస్తున్నందుకు ధన్యవాదాలు.

arunank చెప్పారు...

ఇలాంటి మోసాలు ఇంకా జరుగుతూనేఉన్నాయ్, జరుగుతుంటాయ్ .
మనిషికి ఆశ అనేది అంతర్థనం గా ఉంటుంది.దాన్ని కాష్ చేసుకొవటం మార్కెటింగ్.discount offers,ఒకటి కొంటే ఒకటి ఫ్రీ,షేర్ మార్కెట్ ఇవన్ని "గాలాలే".ఈ ప్రపంచంలో బ్రతకాలంటే డబ్బు అనేది చాలా అవసర మయి పోయింది.దానికోసం ఎన్నో వేషాలు ,మోసాలు ,దౌర్జన్యాలు.ఈ ప్రక్రియ లో అందరం ఎక్కడొ ఒకచోట ఎప్పుడో ఒకసారి మోసపొతుంటాం.

జీడిపప్పు చెప్పారు...

ఎప్పటిలాగే మరో మంచి టపా అందించారు. చదువుతుంటే చాలా గుర్తుకొచ్చాయి. ఒకప్పుడు పొదుపరులుగా పేరు తెచ్చుకున్నవాళ్ళు ఇప్పుడు దుబారా చేసేస్తుంటారు. అంతా కాల మహిమ!!

నేస్తం చెప్పారు...

శిరీష గారు మీలాంటివారి అభినందనలే కదండి నాలంటివారికి ప్రోత్సాహం.. తప్పని సరిగా చదివి మీ అభిప్రాయాన్ని తెలియ చేయగలరు
కారుణ్య గారు మీ అభిమానానికి ధన్యవాధాలు
హూం.. నిజమే అరుణాంక్ గారు బాగా చెప్పారు
జీడిపప్పు గారు ఇప్పటికే నాలోనూ చాలా మార్పు వచ్చింది .. కాస్త జోరు వస్తుంది ఖర్చులో :)

Shashank చెప్పారు...

అరుణాంక్ గారు - పాపాం షేర్ మార్కేట్ ఏం చేసిందండి. మోసం అనేసారు.
@జీడిపప్పు - మనది ఇదే బాపతా?

నేస్తం - నిజం చెప్పండి పర్లేదు. లక్ష్మీపతి మారడంటారా? :-D

పరిమళం చెప్పారు...

పెళ్ళయ్యాక మారాలండీ ...మారకపోతే అక్షింతలు వేయించుకోవాలి నాలాగ :(
మీ అక్కగారన్నట్టు ఆగ్నస్ ఇలాగే అనుకుంటే మధర్ ధెరిసా అయిఉండేదా :)

నేస్తం చెప్పారు...

శశాంక్ గారు నిజం చెపితే నమ్మాలి..
పరిమళం గారు ఆగ్నస్ ఆ రోజుల్లో కాబట్టి ఒంటరిగా వచ్చినా అనుకున్నది సాధించారు .. కాని ఈ రోజుల్లో ఆమె వస్తే ?? కాని ఒకటిలేండి ... అనుకున్నది సాధించే పట్టుదల ఉంటే ఎలాగన్నా సాధించి తీరుతాం .. కాని మనలో చాలామంది అనుకునే వరకే సరిపెట్టుకుంటాం

వేణూశ్రీకాంత్ చెప్పారు...

మరో హాయయిన టపా... చాలా బాగుంది నేస్తం.. కాల మహిమ ఎవరూ తప్పించుకోలేం...

sivaprasad చెప్పారు...

నేను అహనాపెళ్ళంట కోటా లాగా చూసి ఆనందపడిపోయేదాన్ని.chala bagundi

నేస్తం చెప్పారు...

వేణు శ్రీకాంత్ గారు నేను అదే అనుకుంటుంటాను
శివ ప్రసాద్ గారు ధన్యవాదాలండి

శ్రుతి చెప్పారు...

అసలే నేను పొదుపు మరి ...( మీరు వేరే అర్ధాలు తీయకండి మరి .. అది కేవలం పొదుపుమాత్రమే ..మీరు నమ్మాలి )

పూర్తిగా వ్యతిరేకార్దమేమో?

నేను మాత్రం పొదుపే మీరి నమ్మాలి మరి

Varunudu చెప్పారు...

నేస్తం గారూ,

జీడి పప్పు బ్లాగ్ లో జాజి పూలు అనే బ్లాగ్ చూసి, ఏంటో చూద్దాం అని వచ్చాను. ఒక్క పోస్ట్ చదివాక మిగతా అన్నీ చదవకుండా ఉండలేక పోయాను.

విశ్లేషణ కాదు కానీ... మీ బ్లాగ్ లో నాకు నచ్చిన అంశాలు..

1) మీ సరళమైన భాష చాలా బాగుంది.
2) సున్నితమైన భావజాలానికి చక్కటి నాటకీయత జోడించ బడింది
3) పోస్ట్ చదూతుంటే, ఎక్కడో ఒక చోట .. అరే మనకు కూడా ఇలాగే జరిగిందే అనిపించడం రచయిత(త్రి) (అంటే మీరే) విజయానికి నిదర్శనం.
4) అంతర్లీనంగా ఉండే భావుకత
5) చక్కటి బొమ్మలు
6) చదివాక మనసంతా హాయి.
7) సున్నితమైన హాస్యం

అలాగే నచ్చని అంశాలు

నాకు నచ్చనిది ఒకటే ఉంది. ఏమీ అనుకోరుగా..? కొన్ని కొన్ని పోస్టుల్లో ( ఉదాహరణకు "నేను భారతీయురాలిగా తప్ప పుట్టాను" ) మీరు చేసిన పని తప్పు కాదు అని పది మంది దగ్గర అప్రూవల్ తీసుకొనే తపన కనిపించింది. చాలా తీవ్రమైన విమర్శ చేసానేమో. నొప్పించి ఉంటే మన్నించండి.

మొత్తమ్మీద ఒక్క మాటలో చెప్పాలంటే.. ఒక్క సారి నా గతానికెళ్ళి నా డైరీ ( మీ చిన్నాన్న లాంటిది కాదండోయ్) నేనే చదూకుంటే కలిగే నోస్టాల్జియా కలిగింది.

తదుపరి పోస్ట్ కోసం చూస్తున్నా... ఎప్పుడు వ్రాస్తున్నారు?

నేస్తం చెప్పారు...

శృతిగారు ఇది అన్యాయమండి ..నాకేమో వ్యతిరేకార్దమేమో అని మీ వరకూ వచ్చేసరికి నమ్మండి అంటారా ..నన్ను నమ్మితేనే మిమ్మలినీ నమ్మేది మరి :)
వరుణుడు గారు ముందు గా దన్యవాధాలు.. మీరన్నది కూడా నిజమే .. నేను భారతీయురాలిగా తప్ప పుట్టానేమో రాయడానికి ముందు తీవ్రమైన మానసిక అశాంతికి లోనయ్యాను.. ఇంత పిరికిదాన్నా..ఇంత దేశభక్తి లేదా నాకు అని చాలా విపరీత ఆలోచనలు వచ్చేసాయి.. అలాంటి సమయం లోనే మన సైనికుల వీరమరణాలు కూడా కలవర పెట్టాయి .. ఆ బాధ మీతో పంచుకుంటే ఖచ్చితం గా మీరందరూ అదేంలేదులే..మీ పరిస్థితులలో ఎవరన్నా ఇలాగే చేస్తారు అని ధైర్యం ఇస్తారని ఆశించి రాసాను ..అలాగే మన్నించు మిత్రమా లో కూడా అనుమానం తో స్నేహితునిని పలకరించకుండా బాధ పెట్టిన వైనాన్ని మళ్ళీ గుర్తు చేసుకున్నాను..అవును నేను తప్పు చేసాను లో ముసలి కరివేపాకు మామ్మను ఎలా మోసం చేసానో చెప్పాను.. అయితే ఇందులో నేను చేసినది తప్పు అయినా ఆయా పరిస్థితుల ప్రభావాన్ని మీకు వివరించే నేపధ్యం లో నాకు అనుకూలం గా రాసి ఉండచ్చు :) ..

అజ్ఞాత చెప్పారు...

baavundi.

మరువం ఉష చెప్పారు...

నేస్తం, మీ టపాలన్ని మనసు మూలల్లో పదిలంగా దాచుకున్న ఏదో ఒక జ్ఞాపకాన్ని తట్టి లేపి కళ్ళలో నీరు నింపేంత గాఢంగా వుంటాయి. సమయాభావం వలన వ్యాఖ్య వ్రాయలేకపొతున్నా వతనుగా చదువుతాను, కొన్ని మళ్ళీ మళ్ళీ చదువుతాను. మీది చక్కని సరళమైన శైలి. నిజానికీ మధ్య నేను తెప్పించుకునే పత్రికలేవీ చూడటం లేదు, మీవంటి వారి టపాలు సరిపోతున్నాయి.

సుధ చెప్పారు...

అక్కా సూపర్