9, ఫిబ్రవరి 2009, సోమవారం

మా ఇంటి బ్లాగోతం....



మా నాన్న గారికి ఒక అలవాటు ఉండేది ..ఎక్కడికన్నా వెళితే ఇంటికి రాగానే ఆ విషయాలన్ని మా ఇంట్లో పిల్లలనందరిని కూర్చో పెట్టుకుని వర్ణించి వర్ణించి చెప్పేవారు,తన చిన్ననాటి విషయాలన్నా సరే కళ్ళముందు జరినట్లు వివరంగా చెప్పేవారు.ఏదన్నా ఊరువెళ్ళారనుకోండి ఇంటికి రాగానే ఇలా చెప్పేవారు .......అప్పుడేమైందో తెలుసామ్మా నా ఎదురుగా ఒక ఆమె చిన్నపిల్లలిని తీసుకొచ్చీ నించుందా ,ఒక్కరూ లేచి సీటు ఇవ్వరు పాపం, ఆ చిన్న పిల్ల ఒకటే ఏడుపు అంటూ మొదలు పెట్టి ట్రైన్ లో వేరుశంగ కాయలు ,జాంకాయలు అమ్మేవాళ్ళు,అడుక్కునే వాళ్ళు,ఎక్కిన వాళ్ళు దిగే వాళ్ళు ఏ ఒక్కరిని వదలకుండా చెప్పేవారు,ఇప్పటికీ అంతే అనుకోండి ..
మరి ఆ తండ్రి బిడ్డనే కదా నాకు ఆ లక్షణాలు బాగా వచ్చెసాయి .. ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతునే ఉండేదాన్ని .. పెళ్ళీకి ముందు అంటే ఫ్రెండ్స్ తో ఇంట్లో వాళ్ళతో బోలెడు కబుర్లు చెప్పేసేదాన్ని పెళ్ళి అయ్యాక ఇలా వేరు కాపురానికి వచ్చాక గాని ఒంటరితనం ఎంత భయంకరం గా ఉంటుందో తెలియలేదు,మా ఆయన నాకు పక్కా వ్యతిరేకం ..ఒక గదిలో పెట్టేసి t.v లో sporTs చానెల్ ఒకటి పెట్టి వదిలేస్తే అన్నం నీళ్ళు కూడా అడగ కుండా 2,3 రోజులు గడిపేయగలరు ..భోజనం చేసేటప్పుడు కూడా క్రికెట్ చూడక పోతే ముద్ద దిగదు ఆయనకు..
అయినా వదలకుండా ఏమండి నా చిన్నప్పుడేమైందో తెలుసా,ఒక సారి మా కాలేజ్ లో ఏమైంది అంటే అని వదలకుండా చెబుతునే ఉండేదాన్ని ..పెళ్ళికి ముందు కాల్ చెస్తే ఊ,ఉహు అని ఊ గుణితం చదివితే ఈ అమ్మాయి అసలు మాట్లాడదేమో అనుకున్నా గాని ఇలా శుభలగ్నం లో శ్రీ లక్ష్మి లా అమ్మా,ఆవు,ఇల్లు , ఈగనుండి చెప్పే టైపు అనుకోలేదే బాబు అని మా ఆయన ఒకటే సెటైర్ లు :(

ఈ సాఫ్ట్ వేర్ జాబులు తో అన్ని రోజులూ సాఫ్ట్ గా ఉండవుకదా అలాగే ఆ మద్య తనకు వర్క్ ఎక్కువ అయిపోయి అర్దరాత్రి 1 కి 2 కి రావడం మొదలు పెట్టారు,కొంచం కాళి దొరికితే అమ్మో క్రికెట్ ఆడితే గాని రిలాక్స్ అవ్వలేను ప్లీజ్ ప్లీజ్ ఎమనుకోకు ఇప్పుడే వచ్చేస్తా అంటూ శని ,ఆది వారాలు పారిపోయేవారు,,ఇంకా తోచకా ,చిరాకు వచ్చేసి మెల్లిగా కంప్యూటర్ చూడటం అలవాటు చేసుకున్నా..ఒక సారి ఎపుడో వంటలు సైట్ ల గురించి చెక్ చేస్తుంటే ఒక లింక్ దొరికింది అది అప్పట్లో సేవ్ చేసుకున్నా తరువాత తెలిసింది అది జ్యోతిగారి బ్లాగ్ అని ఆమెకు తెలుగు బ్లాగ్ లోకం లో విశిష్ట స్థానం ఉంది అని ..

సరే ..ఒక రోజు ఏదో తెలుగు సినిమాల గురించి సేర్చ్ చేస్తుంటే ఒక తెలుగు బ్లాగ్ కనబడింది, అప్పటివరకూ బ్లాగులంటే ఏంటో తెలుసుగాని ఎప్పుడూ చూడలేదు .. నేను చూసిన ఆ బ్లాగు అబ్రకదబ్ర గారిది .. ఆ టపా పేరు శ్రీ ఏసుక్రీస్తుడు ..అది చదివి ఎంత నవ్వుకున్నాను అంటే చాలా నచ్చేసింది, తెలుగు బ్లాగులు ఇంత బాగుంటాయా అమ్మో ఎంత మిస్ అయిపోయాను ఇన్నాళ్ళు అనుకుని ఆ సంతోషాన్ని వెంటనే మా ఆయనతో పంచుకోవాలని ఫోన్ చేసాను... మీటింగ్ లో ఉన్నాను పెట్టెయి ఫోను...అటు నుండి వినబడింది ... ఆ తరువాత మనం పెట్టక్కరలేదు అదే కట్ అయిపోతుంది ..
ఇంక అక్కడినుండి ఎప్పుడొస్తారా అని చూసి చూసి మొత్తానికి ఇంటికి రాగానే తలుపు తీసి ఏమండీ నేనొకటి చదివాను అన్నాను ఉత్సాహంగా ..అబ్బా కాస్త ప్రెష్ అవ్వనివ్వవే అంటూ బాత్ రూం లోకి దూరారు ..అవును నిజమే కదా బయటకు వచ్చాక చెబుదాం అనుకుని ,డైనింగ్ టేబుల్ దగ్గర అన్నం సర్దీ చూస్తుండగానే ఆయన అన్నం అక్కడ చూసి ఇక్కడ పెట్టావేంటి నేను tv చూస్తేగాని తినను అని తెలుసుగా అన్నారు ..విసుక్కుంటు.. అమ్మా..అక్కడపెడితే నేను చెప్పేది వినరు అన్నాను...అబ్బా వింటాను అన్నానుగా అని tv పెట్టి Espn చానెల్ పెట్టెసారు ఇంక తప్పదు అనుకుని అన్నీ అక్కడపెట్టి చదివిన టపా మళ్ళీ మళ్ళి గుర్తు తెచ్చుకుంటు నవ్వేసుకుంటూ ఆయన పక్కన కూర్చుని మరేమో ఏమైంది అంటే అని తెరలు తెరలుగా నవ్వేస్తున్నా..అబ్బా నవ్వన్నా చెప్పూ ,చెప్పి అయినా నవ్వు అన్నారు నా మొహంలోకి చూస్తూ..మరేమో ఎంత నవ్వువచ్చిందో తెలుసా.. అదీ ..ఒకరు సినిమా తీస్తారు అన్నమాట మరేమో చాలా బాగుంటుంది అన్నాను..ఆయన నా వైపు పిచ్చిమొహాన్ని చూసినట్లు చూసారు .. అప్పుడు అర్దం అయింది కొన్ని చదివితేనే బాగుంటాయి ,ఎదుటివాళ్ళకు చెప్పడానికి కుదరదు హాస్య కధలు చాలా వరకూ ఇలాగే ఉంటాయి..అంటే అది.. ఒక సారి మీరొచ్చీ చదవండి అన్నాను ..మా ఆయన నా వైపు ఒకరకం గా చూసారు ఆ చూపులో చాలా భావాలు అర్దం అయి కానట్టు అనిపించి ఉక్రోషం తో 'చీ' మీకసలు ఏమి చెప్పకూడదు అనుకుని వెళ్ళి పడుకున్నా..

ఈ లోపల స్వప్నికా ఉదంతం యాసిడ్ పోసిన వాళ్ళ ఎంకౌంటర్ వరుసగా జరిగాయి..ఆ రోజు ఈ విషయం మీద మాట్లాడుతూ బాగా జరిగింది తగిన శాస్తి జరిగింది వెదవలకు అన్నాను కోపం గా ..మా ఆయన అది వింటూ వాళ్ళను చంపడం తప్పు ఉందా,లేదా అని కాదు గాని అరిటాకు ముల్లు సామెత అమ్మయిలకు యే కాలం లో అన్నా పనికి వస్తుంది ..అమ్మాయిలు కూడా అబ్బాయిలతో కాస్త జాగర్తగా ఉండాలి...తమ పరిదులు దాటకుండా తమ చదువేదో చూసుకోవాలి గాని లేని పోని లంపటాన్ని నెత్తి మీదకు తెచ్చుకోకూడదు అన్నారు ...నేను గయ్యి మని లేచాను,, మీ మగ బుద్ది పోనిచ్చూ కోలేదు ... వాళ్ళను ప్రేమించకపోతే చంపేయడ మేనా...అమ్మాయిలు తలుచుకుంటే ....చంపలేరా.. ఏమన్నా అంటే అన్ని నీతులూ ఆడవాళ్ళకే చెబుతారు అని కోపం గా అరిచాను..
ఆ మరుసటి రోజు మళ్ళా బ్లాగు చూస్తుండగా సిరి సిరి మువ్వ గారి బ్లాగులో ఈ విషయం మీదనే టపా ఉంది అందులో సుజాత గారి కామెంట్ చూసి సుజాత గారి మనసులో మాట బ్లాగులోకి వెళ్ళాను ...వారి మాటలు కొంచెం నిజమే కదా అనిపించాయి ...సాయంత్రం మా ఆయన రాగానే ఏమండి సుజాతగారేమన్నరో తెలుసా అంటూ ఆమె టపా బలవంతంగా చదివించేసాను మా ఆయన చేత ....అంతా చదివి మా ఆయన నా వైపు సీరియస్సుగా చూస్తూ నిన్న ఇదేమాట అంటే నా మీద దెయ్యంలా పడిపోయావ్ ఇప్పుడేమో ఈమె రాసింది బాగుంది అని అంటే ఏమిటర్దం ...అన్నారు .అంటే మీరు ఆమె అంత బాగా చెప్పలేదని అర్దం అంటూ అక్కడి నుండి జారుకున్నాను ......కాబట్టి మా ఆయన నన్ను ఎలా చూసారో నాకు తెలియదు..
ఆ తరువాత రోజు సుజాత గారి టపాలన్నీ ఏకబిగిన చదివేసా.. అందులో ఒక ఫొటో నన్ను విపరీతం గా ఆకర్షించింది ..అది సచిన్ టేండుల్కర్ అమ్మాయి వేషం ఫొటో ..అది చూడగానే మళ్ళీ విపరీతం అయిన ఆనందం వేసేసి దానిని కాపీ ,పేస్ట్ చెసేసి మా ఆయన మెయిల్ ఐడి కి పంపేసి ఆ వెంటనే ఏమండీ మీకు ఒక ఫొటో పంపా ఎవరో చెప్పుకోండి చూద్దాం అన్నాను నా మాట పూర్తి అయ్యేలోపలే సచిన్ టెండుల్కర్ అన్నారు మా ఆయన తాపీగా .. ఎలా గుర్తు పెట్టెసారండీ అన్నాను చప్పగా చల్లరిపోయీ ....ఒసే పిచ్చమొహమా అంత సర్ ప్రయిజ్ చేయాలనుకుంటే దాని పేరు టెండుల్కర్.jpg అని మార్చి వేరే పేరు పెట్టి పంపాలి అన్నారు ...ఒహ్ చూసేసారా..అచ్చం ఇలాగే చేసారు సుజాత గారు కూడా ,ఆమె కొచ్చిన వాక్యల్లో అందరూ కూడా ఇలాగే కనిపెట్టేసారని చెప్పారండీ అన్నాను ..అంటే అందరూ ఎలా కనిపెట్టారో తెలిసికూడా పంపావా !!!! మా ఆయన తెరిచిన నోరు ఎప్పుడు మూసారో తెలియదుగాని నేను ఫోన్ పెట్టెసా ...అంటే మా ఆయన అలా కనిపెట్టలేరేమో అన్న ధీమాతో పంపానన్నమాట అదీ సంగతి ...
అలా మెల్లిగా అందరి టపాలు చదవడం మొదలు పెట్టాను..ఆ తరువాత నాకు బాగా నచ్చిన బ్లాగు నేను-లక్ష్మి గారు బ్లాగ్ .. ఒక సారి ఆమే బాధ గా రాసిన టపా చదివి నాకు మనసంతా ఒక మాదిరి అయిపోయింది .. మావారు రావడం పాపం ఏమండి లక్ష్మి గారి చేయి మిక్సీ లో పడిపోయింది వేళ్ళు అన్నీ కట్ అయిపోయాయంట అన్నాను బాధగా ....యే లక్ష్మి గారు మా ఆయన కంగారుగా వంటగదిలోకి వచ్చేసారు ఒక్క అంగలో..అబ్బా ..బ్లాగులో అండి అన్నాను కోపం గా ... ఆమెరాసిన టపాలన్నీ ఎంత హాస్యంగా ఉంటాయో తెలుసా కాని చాలా బాధగా రాసారు ఈ సారి అన్నాను..వాళ్ళందరూ తమ బాధలను మర్చిపోవడానికి బ్లాగులను రాస్తుంటే నువ్వు వాళ్ళ బాధలను తలుచుకుంటూ భాధ పడుతున్నావా .. నీకు అసలు ఇలా కాదు నెట్ పీకించేస్తా అన్నారు .. చీ ఈ మనిషికసలు జాలి లేదు అనుకుని తిట్టుకున్నా..అలా హాస్య టపాలు కధలు కవితలు ఏమి నచ్చితే అవి చదివేదాన్ని ..
ఒక సారి ఆయన ఇంటికి రాగానే సీరియస్సుగా కంప్యూటర్ దగ్గర కూర్చున్నాను మరువం ఉషగారి కవిత చదువుతూ ..ఏమిటీ ఈ రోజు రాగానే ఏమి చెప్పడం లేదూ అన్నారు కాళ్ళూ చేతులు కడుక్కుని బోజనానికి కూర్చుంటూ .. హమ్మయ్య ఇందాక నుండి ఈ కవిత అర్దం కావడం లేదు ఇంక అర్దం అయిపోయింది అన్నాను తేలికగా ఊపిరి పీలుస్తూ ..కవితా!! నాకు పని ఉందిరా ఇప్పుడేవస్తా మా ఆయన లేవ బోయారు ..చీ ఊరుకోండి.. కవితలు ఎంత బాగుంటాయో తెలుసా .. ఎంత మంచి గా కవితలు రాస్తారో తెలుసా రాధిక గారు,ఆత్రేయ గారు దిలీప్ గారు ఇంకా చాలా మంది మంచి మంచి కవితలు రాసేవారున్నారు .. కాని అందరిలో ఈ ఉష గారు రాసిన కవితలే క్లిష్టం గా ఉంటాయి కాని చాలా బాగుంటాయి ....ఉండండి ఒకటి చదివి వినిపిస్తా అన్నాను..
ఏమే ఇదేమన్నా బాగుందా నాకు మాములు తెలుగులో మాట్లాడితేనే సరిగా అర్దం కాదు ..అందులోనూ కవితలు,అందులోనూ క్లిష్టమైన కవితలా.. అసలే ఆకలెస్తుంది నన్ను వదలవే బాబు అన్నారు ..
.నాకు మాత్రం ఫస్టే అర్దం అయిపోయిందా ఆరు సార్లు చదివా ఈ కవితని తెలుసా అన్నాను ....
ఆరుసార్లా!!!!! ఇప్పుడు అన్ని సార్లు వినిపిస్తావా అన్నారు..
అర్దం అయ్యేంతవరకూ చదివి వినిపిస్తా అన్నాను పట్టుదలగా ..
నిజం చెప్పవే సినీ నటి శ్రీలక్ష్మి మీకు బందువులు కదా అన్నారు అనుమానంగా...అయినా పట్టించుకోకుండా చెప్పేసా అనుకోండి..అలా ఏ చిన్న విషయమన్నా ఆయనకు చెబితే గాని నాకు తోచేదికాదు ..
నీకు అంత తోచకపోతే నువ్వే ఒక బ్లాగు మొదలెట్టచ్చుగా అన్నారోసారి... ఎప్పుడొ మొదలు పెట్టేసానుగా అన్నాను .. అంటే ఒక పక్కన రాసేస్తూ ఒక పక్కన చదివెస్తున్నావా తల్లీ అంత టైము ఎక్కడిదే బాబు నీకు అన్నారు ... నేను గర్వం గా నా బ్లాగు చూపి ఎలా ఉంది అన్నాను కళ్ళు ఎగరేసి ... ఒకటి రెండు చదివీ రోజు నాకు చెప్పేవేగా పాపం మిగిలిన వాళ్ళను కూడా వదలడం లేదా అన్నారు...చీ మీ అంత కుళ్ళు మనిషిని ఎక్కడా చూడలేదు అని అలిగి వెళ్ళిపోయా అక్కడి నుండి ..

ఒక సారి వంట చెసుకుని బెడ్ రూం వైపు వస్తుంటే మా ఆయన ఎవరితోనో మాట్లాడుతున్నారు ఫొన్లో ఆ మావయ్యగారు బాగున్నారా..మీ అమ్మాయి బాగుందండి ఈ మద్య వర్క్ ఎక్కువగా ఉంటుంది అండి ,బాగ లేట్ అవుతుంది ఇంటికొచ్చేసరికి ,పాపం దేశం కాని దేశం లో ఒక్కర్తే అలా తోచకా మిమ్మల్ని అందరినీ తలుచుకుంటునే ఉంటుంది ....అన్నట్లు మర్చిపోయా కంప్యూటర్ లో ఈ మద్య ఒక బ్లాగు తయారు చేసి అందులో ఎప్పుడూ మీ గురించే రాస్తుంది...అక్కడ కూడా మిమ్మల్ని ఎవరినీ మర్చిపోవడం లేదు ..అటు మా నాన్న కళ్ళల్లో ప్రేమ ఇటు మా ఆయన కళ్ళల్లో కనబడుతుంది నాకు ..అప్పుడు అర్దం అయింది నాకు ...పెళ్ళాయ్యాక అందరినీ వదిలేసి ఆయనతో ఇంతకాలం ఎలా ఉన్నానో ... వాళ్ళకంటే రెట్టింపు ప్రేమ అందిస్తున్నారు నాకు ఆయన ...

50 కామెంట్‌లు:

చైతన్య చెప్పారు...

బాగుందండి మీ బ్లాగోతం... మధ్య మధ్యలో ఉన్నా కిసుక్కులు ఇంక బాగున్నాయి :)
సర్ ప్రయిజ్ చేయాలనుకుంటే దాని పేరు టెండుల్కర్.jpg అని మార్చి వేరే పేరు పెట్టి పంపాలి
హి హి హి :D

oremuna చెప్పారు...

బాగా వ్రాశారు.

ప్రపుల్ల చంద్ర చెప్పారు...

ఎప్పటిలా చాలా బాగా వ్రాశారు.
అచ్చు మా నాన్నగారు కూడా మీ నాన్న గారిలానే కబుర్లు చెబుతారు.. ఆ కబుర్లు వినడం నాకెంతో ఇష్టం.

నేస్తం చెప్పారు...

చైతన్య గారు :D పేరు చూసి చెప్పేస్తారనుకోలేదు.. ఫొటో చూసి ఆలోచిస్తారనుకున్నా,,ధన్య వాదాలు
oremuna గారు ధన్యవాధాలండి
@ప్రపుల్ల చంద్ర గారు మీలాగే నాకు చాలా ఇష్టం మా నాన్న చెప్పే కబుర్లు.

లక్ష్మి చెప్పారు...

బాగుందండీ మీ బ్లాగోతం. నన్ను కూడా మీ బ్లాగు రామాయణం లో తల్చుకున్నందుకు బోల్డన్ని థాంకూ లు :)

సుజాత వేల్పూరి చెప్పారు...

తల్చుకుంటే నవ్వొస్తుంది కానీ నేను కూడా మొదట్లో ఇలాగే...వేపుకు తిన్నాను.

నేస్తం చెప్పారు...

లక్ష్మి గారు :) ..సుజాత గారు మీరూ అంతేనా :D

పిచ్చోడు చెప్పారు...

cute couple :-)

పరిమళం చెప్పారు...

బాగుందండీ! మా నాన్నగారు కూడా మీ నాన్న గారిలాగే న0డీ!:)

మధురవాణి చెప్పారు...

నేస్తం గారూ.. మీ బ్లాగోతం బాగుందండీ :)
సున్నితమైన హాస్యం.. మీకే సొంతమండీ..!
భలేగా రాస్తారు.. మరి మాలాంటి అభిమానుల వ్యాఖ్యలను కూడా మీ వారికి చూపిస్తున్నారా లేదా?

నేస్తం చెప్పారు...

పరిమళం గారు అందుకే ఆ ఆప్యాయతలను అంత తొందరగా మర్చిపోలేము...
మదురవాణి గారు అందరి గురించీ చెబితే టపాపెద్దది అయిపోతుంది అని రాయలేదు గాని భలేవారే మీ గురించి చెప్పక పోవడమా ..అసలే జాంచెట్టు పైన కొమ్మ మీద కూర్చున్న రాణి గారాయే .. ఆ టపా లో ఆ సన్నివేశం మాత్రం నాకు చాలా బాగా నచ్చింది :)

నేస్తం చెప్పారు...

పిచ్చోడు గారు మీ గురించి కొంత చెప్పుకోవాలి అందరి టపాలు చదివీ చక్కని వాక్యలు రాసి ఇచ్చే మీ ప్రోత్సాహం అభినందనీయం

సిరిసిరిమువ్వ చెప్పారు...

చాలా ఆహ్లాదంగా వుంది మీ టపా చదువుతుంటే. ఏ విషయమైనా చెప్పే విధానంలో మాత్రం మీకు మీరే సాటి.

నేస్తం చెప్పారు...

మువ్వ గారు మీఅందరి ప్రోత్సాహం... ఆ పైన దేవుడిచ్చిన ఆశిర్వాదమే నాకు కొండంత బలం

నిషిగంధ చెప్పారు...

మీ బ్లాగోతం చదువుతుంటే అంతా ఒక గూటివాళ్ళమే అనిపిస్తుంది.. చాలా బాగా రాశారు!

మా ఇంట్లో కూడా సేమ్ టు సేమ్ :-)
"భోజనం చేసేటప్పుడు కూడా క్రికెట్ చూడక పోతే ముద్ద దిగదు ఆయనకు.. "

నేస్తం చెప్పారు...

నిజమే నిషి గారు ఈ క్రికెట్ విషయం లో అందరం ఒక గూటి పక్షులమే నేమో :)

సూర్యుడు చెప్పారు...

బాగుంది మీ బ్లాగోతం :-)

Anil Dasari చెప్పారు...

అయితే మీవారు మీలా బ్లాగులు చదవట్లేదంటారు + ఆయనకి క్రికెట్ పిచ్చి. ఇంకేం, నా క్రికెట్ బాంబు చదివించండి.

సుభద్ర చెప్పారు...

abba super ,
meeru nammutaaro ledo maa intlo
rojuu jarugu thunna vishyam pollu
pokundaaa rasinnattu undi.
nenu same to same raadam ani prepare avvuttunna.
eelopu meere rasaaru.nenu maa ayana eppati ki okasari kudaa chudaledu.nenu appudappu cheppi
aayanato naa meda jokes veinchukuntaa.
all the best.

నేస్తం చెప్పారు...

అబ్రకదబ్ర గారు తప్పకుండా చూపిస్తానండి ...మొదటి సారి నా బ్లాగులో వాక్య రాసారు ధన్యవాదాలు
సుభద్ర గారు మరి ఇంకేం మొదలు పెట్టేయండి ...మీ టపాకోసం ఎదురుచూస్తు ఉంటా ...

నేస్తం చెప్పారు...

సూర్యుడుగారు ధన్యవాదాలు అండి :)

అజ్ఞాత చెప్పారు...

భలే చెప్పారు. మా ఇంట్లో కూడా ఇంతే.నేను పది మాటలు మాట్లాడితే మా వారు ఒక్క మాట మాట్లాడతారు. అయినా తగ్గేది ఏమి వుండదు అలా మాట్లాడుతూ వుండడమే వింటారో వినరో తెలీదు మరి:-).
అబ్రకదబ్ర గారి శ్రీ ఏసుక్రీస్తుడు టపా చదివి నేను కూడా మా వారిని కూర్చోబెట్టి చదివి వినిపించాను.

cbrao చెప్పారు...

"ఆరు సార్లు చదివా ఈ కవితని తెలుసా అన్నాను ....
ఆరుసార్లా!!!!! ఇప్పుడు అన్ని సార్లు వినిపిస్తావా అన్నారు..
అర్దం అయ్యేంతవరకూ చదివి వినిపిస్తా అన్నాను పట్టుదలగా ..
నిజం చెప్పవే సినీ నటి శ్రీలక్ష్మి మీకు బంధువులు కదా అన్నారు అనుమానంగా." -పడి పడి నవ్వా చదువుతున్నప్పుడు.

కొత్త పాళీ చెప్పారు...

still laughing .. ha ha ha.
good one.

మధురవాణి చెప్పారు...

నేస్తం గారూ..
ఆ జాంచెట్టు పోస్టు నచ్చడమే కాకుండా.. గుర్తు పెట్టుకున్నందుకు ధన్యవాదాలు :))
కానీ.. నేను అడిగింది మా అందరి టపాలు మీ వారికి చూపించడం గురించి కాదండీ..
మీరు మాకు చెప్పే కబుర్లు విని.. మేము మీకు రాసే వ్యాఖ్యలని చదివి వినిపిస్తున్నారా అని..
ఇవ్వాళ నా పోస్ట్ కి మధుర ఇలా అంది, సుజాత గారు ఇలా అన్నారు etc.. అలాగన్నమాట :))

జీడిపప్పు చెప్పారు...

బాగుంది మీ బ్లాగోతం :-)

నేస్తం చెప్పారు...

స్నేహ గారు మీరూ నేనూ ఆ టపా అలా చదివించేసామన్న మాట అయితే ఏది ఒక Hai-5 వేసుకోండి
c.bరావు గారు ,కొత్త పాళి గారు ,జీడి పప్పు గారు ధన్యవాదాలు...
మదురవాణి గారు అదే నేను చెబుతున్నా మీ వాక్యలే కాదు మీ టపాల గురించికూడా చెబుతాను ..భలే వారండి నన్ను పొగుడుకునే సందర్భం మా ఆయన దగ్గర మిస్ అవుతానా ఏంటి :)

asha చెప్పారు...

చాలా బాగుంది.
ఇప్పటికే చాలా మంది చెప్పేశారు.
కానీ, మా ఇంట్లో కూడా ఇంతే. కాకపోతే
మా హజ్బెండ్ కి నేను చెప్పే విషయాలు
కంఠతా వచ్చేశాయి. మరోసారి చెప్పటానికి
తయారయ్యే లోపే మొత్తం విషయం చెప్పేస్తారు.

నేస్తం చెప్పారు...

హ..హ భవాని గారు..ఈ విషయంలో మాకంటే ఒక్క అడుగు ముందు ఉన్నారన్నమాట మీరు :)

మరువం ఉష చెప్పారు...

నేస్తం, ఆవకాయ పెట్టక మునుపు, ఇంకా టెంక పట్టని కాయలతో జీడావకాయ అని చేస్తారు. అది చాలా రుచిగా వుంటుంది, మీ ఈ టపా దాన్ని జ్ఞప్తికితెచ్చింది. ఈ ఒక్కమాట నా భావాన్ని మీకు తెలిపిందనుకుంటా. మన తెలుగు నాట అందునా గోదావరి జిల్లాల్లో ఆవకాయ ఎంత ప్రీతిపాత్రమైనదో మీకు తెలుసు కదా!

మా నాన్న గారు అలాగే కబుర్లు చెప్పేవారు, ఇప్పటికీ సగం ఫోనులో సంభాషణ అదే ధోరణిలో సాగుంతుంది. పైగా ఎన్నెన్నో క్రొత్త పద్ధతలు ఆరోగ్యానికి మంచివి, సంస్కృతికి సంబంధించినవి, పద్యాలు వల్లెవేయించటం, భజనలు చేయించటం, పాటలు పాడించటం, తనువేసిన నాటకాలు అభినయించిచూపటం, హిట్లరంత నిరంకుశత్వం (ప్రేమ చూపటంలోనే సుమీ!)..చెప్పాలంటే ఈ టపాకన్నా ఎక్కువౌతది - ఆయన పాత్ర నిడివి చాలా ఎక్కువ. అమ్మది మౌనం, వంట, వినటం వంటి పాత్ర. ఆ రెండిటి మధ్యనా నాన్నగారి ఏకైక చెడు లక్షణం కోపాన్ని నేనూ సగం పుణికిపుచ్చుకుని అచ్చంగా ఇపుడు నా పిల్లల్ని ఆయన్ని అనుసరిస్తూ పెంచేస్తూ, అమ్మ నాకు friend అనిపించుకుంటాను అస్తమాను.

ఇకపోతే మన్మధుడు సినిమాలో ఒక సన్నివేశం వుంది - కోటా శ్రీనివాస రావు, బ్రహ్మానందం చేత పదే పదే ఒక dialogue "ఈ వయసులోనే ఇలా వుంటే.." అన్నది తన స్టాఫుకి చెప్పిస్తాడు. అలా మీరు నా పట్ల వ్రాసిన ఆ భావాన్ని నాకతి సన్నిహితమైన అందరకూ చూపి ఆ రెండు పాత్రల్నీ నేనే అభినయించేసుకున్నాను. కొన్ని భావనలు పూర్తిగా మాటల్లో వ్యక్తపరచలేము. ప్రయత్నించినా కొంతే పొందుపరచగలం. ఇదీ అంతే, అందుకే ఆ చిక్కని సంతసాన్ని, ఆకసమంత సంతృప్తినీ, మీవంటి నేస్తాన్ని అన్నిటిని నా గుండెలోనే పదిలపరుచుకుంటున్నాను. మీకు పలు మార్లు చెపాను, మీ వ్యాఖ్యలేని నా టపాలు తక్కువ, అవి చాలా బేలగా కనిపిస్తాయి నాకు, మీ మాటల భరోసా లేకనేమో.

మరోమారు హృదయపూర్వక దన్యవాదాలు.

PS: The folks (just he- JK) at home are so lost to cricket that not only in kitchen and bed room, but even in bathroom and everywhere else they breathe in and breathe out cricket. So, నిజమే ఈ క్రికెట్ విషయం లో అందరం ఒక గూటి పక్షులమే నేమో :)

మురళి చెప్పారు...

మనిద్దరం బ్లాగులు చదవడం ఇంచుమించు ఒకేసారి మొదలుపెట్టాం. కాకపొతే మీరు ముందుగా రాయడం మొదలుపెట్టి నాకు సీనియర్ అయిపోయారు. ఎప్పటిలాగే చక్కగా రాశారు.

నేస్తం చెప్పారు...

మురళి గారు ధన్యవాదాలండి ....ఎప్పుడు మొదలు పెట్టారని కాదన్నయ్యా చక్కని టపాలు రాసి మమ్మలిని మీ అభిమానులను చేసేసుకున్నారన్నది పాయింట్ ...మరిన్ని మంచి టపాలు రాయాలి మీరు
@ఉష గారు నా టపా మాట తెలియదు కాని మీ వాక్యలు మాత్రం కొత్త ఆవకాయే సుమా :) చక్కని మీ వాక్యకు ధన్యవాదాలు

అజ్ఞాత చెప్పారు...

అరె...... నేను చాలా ఆలస్యం చేసినట్టున్నాను.
మా ఇంట్లో పరిస్తితి కూడా ఇంచుమించు ఇదే.( బ్లాగుల గురించి చెప్పీ చెప్పీ మా వారి బుర్ర రామకీర్తన పాడించేస్తూ వుంటాను.) పాపం ఆయన బ్లాగుల మాట ఎత్తనని ఒట్టేస్తేనే భోజనానికి వస్తానంటున్నారు. ఇదిఏమైనా బావుందా నేస్తం.

నేస్తం చెప్పారు...

నిజమేనండి అన్ని కష్టాలు మనకే :P
మీ వాక్యకు ధన్యవాదాలు lalita గారు

మురళి చెప్పారు...

'ఎప్పుడు మొదలు పెట్టారని కాదన్నయ్యా..'
..నీ పాదం మీద పుట్టుమచ్చనై...:)

Padmarpita చెప్పారు...

నేస్తమా!!!! బాగుందే బాగుందే మీ ఇరువురి బందమే....

నేస్తం చెప్పారు...

మురళి గారు :)
padmarpita గారు ధన్య వాదాలు

విశ్వ ప్రేమికుడు చెప్పారు...

నమస్కారం.
నేస్తం గారూ మీ రచనలు సున్నితమైన హాస్యంతో చక్కగా ఆకట్టుకుంటున్నాయండీ.. :)

నేస్తం చెప్పారు...

thanks andi premikudu gaaru

భావకుడన్ చెప్పారు...

పైన ముప్పై తొమ్మిదీ చూడకుండా ముందు చెప్పాలనుకున్నది చెప్పేస్తున్నానండి, కాబట్టి రిపీట్ అయినా భరించక తప్పదు :-)


సూపర్....ముఖ్యంగా ఆ శ్రీలక్ష్మి బంధుత్వమూ, బ్లాగ్బందువుల కష్టాలకు మీ స్ఫందన సీను, మీ వారి తెలివిపై మీకున్న అపారమైన నమ్మకం.....నిజంగా సూపర్....మా ఆవిడ తన పని పూర్తీ చేసుకొని వచ్చాక చదివి వినిపిస్తా...

అరుణాంక్ చెప్పారు...

నేను తరచుగా చూసే బ్లాగుల్లొ మీ బ్లాగు ఒకటి.

నేస్తం చెప్పారు...

భావకుడన్ గారు ధన్య వాదాలండి మీ అభిమానానికి...
@అరుణాంక్ గారు .. ఒక సారి మీ టపాలో ఈ విషయం చెప్పారు.. నా టపా నవ్యలో పడినంత ఆనందంగా మా వారికి మీ బ్లాగు చూపించా .. ఎలా మర్చిపోగలను

Bhadrasimha చెప్పారు...

చాలా బాగుంది మీ బ్లాగు..

నేస్తం చెప్పారు...

Bhadrasimha గారు ధన్య వాదాలండి

వేణూశ్రీకాంత్ చెప్పారు...

హ హ చాలా బాగుంది నేస్తం.

అనూ చెప్పారు...

చాలా బాగుంది అండి మీ బ్లాగు,బాగా నవ్విస్తారు.......చివరికి వచ్చేసరికి హృదయం బరువేక్కేలా సెంటిమెంట్ తో కొడతారు..........మీకు మిరే సాటి.......

నేస్తం చెప్పారు...

వేణు గారు అను గారు ధన్యవాదాలు

sreeviews చెప్పారు...

simply superb...

నేస్తం చెప్పారు...

sreeviews గారు thanks :)

sreedevi చెప్పారు...

నేను చాల బ్లాగ్స్ చదువుతూ ఉంటాను. కానీ మీ అంత బాగా నవించేది ఇంకొకటి లేదు. Enjoyed all your tapas.