21, మే 2011, శనివారం

అసలేం జరిగింది ?

తెల్లవారుజామునే లేచి పిల్లలను ఆదరాబాదరాగా బస్ ఎక్కించి ,తరువాత వంట చేసి, లంచ్ బాక్స్ తో భర్తగారిని ఆఫీసుకు సాగనంపీ ,గట్టిగా ఊపిరి పీల్చుకుని వెనుకకు తిరగ్గానే కిష్కిందకాండలా ఉన్న ఇల్లును చూసి, ఏడుపుమోహంతో కొంగు బిగించి చీపురు పట్టుకున్న సగటు ఇల్లాలు ఎంత తీరికగా ఉంటుందో నేనూ అంతే తీరికగా ఉన్న సమయంలో ఫోన్ ట్రింగ్ ట్రింగ్ మని ఒకటే మోత....


చెప్పొద్దూ అలాంటి సమయంలో ఫోన్ వస్తే నాకొస్తుంది కదా కోపం ...ఓ ప్రక్క అవతల పూజకు టైమైపోతూ ఉంది..అసలే మనం పూజ రూము లోకి వెళ్ళామంటే గంట బయటకు రాను..అదంతా భక్తి అనుకోకండి భయం అన్నమాట ...:)..ఈ దేవుడికి అష్టోత్తరాలు చదివి ఆదేవుడికి చదవకపోతే ఆయన ఫీలవుతాడేమో అని కొంతా ..ఆవిడకు పూజ చేసి ఈమెకు చేయకపోతే ఈమె ఏమనుకుంటుందో అని మరికొంత ...ఇదిగో అమ్మాయ్ సుందరాకాండ పంపాను చదువుతున్నావా ? విష్ణు సహస్రనామాలు ,లలితాపారాయణం మర్చిపోకేం అని నిమిషం నిమిషానికి గుర్తు చేసే అత్తగారి రూపం ఇంకొంత ఇలా ఒక్కటికాదు లెండీ. పైగా పన్నెండు దాటిన తరువాత పూజ చేస్తే రాక్షస పూజ అవుతుంది అట .అందుకే ఎట్టి పరిస్థితుల్లో అయిదినిమిషాలు తక్కువ పన్నెండుకల్ల హారతిగంట గణగణమని మోగించేస్తా ...ఇదిగో హిందూ దార్మికవాదులు నావైపుఅలా కొరకొరా చూడకండి ..నానేమీ సేయలేను :( ....


ఆ.... ఏదో చెప్తూ ఇంకేదో చెప్పేస్తున్నాకదా ..అలా పోన్ మోగుతూ ఉంటే విసుగ్గా ' హలో 'అన్నాను .... "బ్రతికే ఉన్నావా ' అటునుండి "కయ్ కయ్ " మందో కంఠం ."అమ్మో!! .. సుధ" అని మనసులో అనుకుని ...అదికాదే మరే ...నేనేమో ..ఈ మధ్య ..పిల్లలు.. బిజీ అని పదాలు వెతికేసుకుంటుంటే.." అనవే అను ...నాకంటే పిల్లా, పీచుతో ఖాళి ఉండదు కాబట్టి నీకు ఫోన్ చేసే తీరికలేదూ ,నువ్వంటే మొగుడు బయటకు వెళ్ళగానే పొద్దస్తమానం టీవి, కంప్యూటర్ ముందేసుకుని ఇలా ఫోన్స్ చేసి చావగోడతావు అనేకదా నీ ఉద్దేశం...ఆగిపోయావే అనూ " అటునుండి నిష్టూరంగా అరిచింది.ఇది ఇంత కరేస్ట్ గా నా మనసులో మాటలు ఎలా చెప్పేసిందబ్బా అని అనుకోని" అబ్బే..ఛీ ఛీ నా ఉద్దేశం అదికాదే నీకలా అర్ధం అయ్యిందా" అన్నాను కంగారుగా ....."నువ్వెలా అన్నా నాకలాగే అర్ధం అవుతుంది ...పనిపాట లేకుండా కొంపలో ఒక్కదాన్నే ఉంటే అందరికీ లోకువే" ఎడుపుగొంతుకుతో అంది... నాకు విషయం అర్ధం అయిపొయింది.. మీ ఆయనతో గొడవ అయ్యిందా అన్నాను ఫోన్ స్పీకర్ లో పడేసి పని చేసుకుంటూ ..(భర్త తో తగు వేసుకుంటే ఒకపట్టానా ఆ కబుర్లు పూర్తవ్వవులెండి ) "అవ్వదా మరి ..ఒకటి కాదు రెండుకాదు ౩౦౦౦ డాలర్లే .మంచి జాబ్ ..పైగా మెడికల్ ఎలవెన్సులు గట్రాలు అని బోలెడు ఉన్నాయి. జాయిన్ అవుతానంటే ససేమిరా వద్దు అంటున్నాడు ..చూడవే ఎంత అన్యాయమో అంది కోపంగా...


నాక్కూడా బోలెడు కోపం వచ్చింది ..మంచి జాబే గా చేస్తే తప్పేంటి ???నువ్వేమన్నా మణులడిగావా?మాణ్యాలడిగావా ?నెల అయ్యేసరికి బోలెడు డబ్బులు చేతిలోపోస్తా అంటే ఏం నెప్పా....దీన్నే మేల్ ఇగో మరియు మగ అహంకారం అంటారు అని తనకు నచ్చ్సు రీతిలో ఒదార్చీ ఇంతకీ ఎందుకొద్దన్నారు?" అన్నాను . "హూం నీకు తెలుసుకదే నాకు కొన్ని ప్రొబ్లెంస్ వల్ల పిల్లలు పుట్టలేదని, దానికోసం అడ్డమైన మందులూ వాడేసరికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి గ్యాస్ట్రిక్ పెయిన్ మొదలైంది ఆ మధ్య..ఒక్కోసారి కడుపులో విపరీతమైన మంట ,వికారం ,కడుపుబ్బరం ఒక్కటి కాదులే ...మళ్ళీ దానికోసం హాస్పిటల్ చుట్టూ తిరగడం అవుతుంది ఈ మధ్య..ఇప్పుడు ఆ వంక పట్టుకున్నాడు ...ఇప్పటికే టైముకి తినవు ...రేపు జాబ్ వస్తే అసలు తినవు ఇక ఆ సంపాదన అంతా డాక్టర్స్ కి పెట్టాలి.పిల్లలు పుట్టేవరకు జాబ్ లేదూ ఏమీ లేదూ అని మొండికేస్తున్నాడు" అంది .


ఇందులో కూడా పాయింట్ కనబడింది..."నిజమే కదా తను చెప్పింది కూడా "అన్నాను ఆలోచిస్తూ.......పోయి ,పోయి నిన్ను అడిగాను చూడు నన్ను అనాలి..ఒక్క మాట మీద ఉండవేం...ఇక నావల్ల కాదు ఆ మందులు గట్రా ...అన్నీ మానేస్తాను ..పిల్లలు పుడితే పుట్టారు లేకపోతే లేదు..ఆరోగ్యం నాశనం అయిపోతుంది.ఇంట్లో ఒక్కదాన్నే కూర్చుంటే పిచ్చ బోర్ కొడుతుందే..అందుకే వాసూ వద్దన్నా జాబ్ చేయాలనే అనుకుంటున్నా..నీ అభిప్రాయం ఏమిటీ??" అంది.ఇదిగో ఇక్కడే వళ్లుమండుతుంది..నిర్ణయం పక్కాగా తీసేసుకుని మళ్ళీ నన్ను అడగడం ఎందుకో..నేను వద్దన్నా ఖచ్చితంగా జాబ్లో చేరుతుందికాబట్టి మర్యాద పోకుండా నువ్వే కరెక్ట్....ఎంచక్కా జాయిన్ అయిపో అని ముందుకు తోసేసాను...


రెండునెలల తరువాత మళ్ళీ అది ఫోన్ చేసేవరకు దాని విషయమే మర్చిపోయాను..ఎప్పటిలాగే హలో అనగానే తిడుతుందేమో అని కంగారుపడిపోయానుగాని అదిమాత్రం నీరసంగా మాట్లాడుతుంది."ఏమైందే ఒంట్లో బాలేదా" అన్నాను . "బాలేదా అంటే అదేనే ఇంతకుమునుపులాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ..వికారంగా ,చిరాగ్గా కడుపులో మంటగా నెప్పిగా ఏంటోలా ఉంది" అంది. ....."ఏమైనా విశేషమేమో??" అన్నాను అనుమానంగా. "ఎహే ఎవరికి చెప్పినా ఇదేగోలా ..ఆ డాక్టర్స్ కూడా అంతే..వెళ్ళగానే పెద్ద పని ఉన్నట్లు స్కానింగ్ చేసిపడేసి వందల డాలర్లు బిల్లు చేతిలోపెడుతున్నారు...ఇప్పటికి నాలుగు సార్లు చేయించాను..లేటెస్ట్ గా మొన్న వారమే చూపించుకున్నాను ..ఏమీలేదు అన్నాడు" అంది దిగాలుగా.. "మందులు వాడటం మానేసాను అన్నావుగా అయినా తగ్గకపోవడం ఏమిటే అన్నాను" అయోమయంగా.... "మొన్న తగ్గినట్లే తగ్గి మళ్ళీ తిరగబెట్టింది ...అనవసరంగా జాబ్లో జాయిన్ అయ్యానంటావా" అంది ..."ఆ రోజు చెప్తే విన్నావా" మనసులో తిట్టుకుని..."చా చా అలా ఏమీ కాదులే తగ్గిపోతుంది కొద్ది రోజుల్లో" అని ధైర్యం చెప్పేసాను ....


ఇది జరిగిన మరుసటి నెల మళ్ళీ ఫోన్ ...ఇండియా వెళ్ళాలిఅనుకుంటున్నానే అని...."ఏమైంది సడన్ గా" అన్నాను."ఏమీ లేదు ఎలాగూ రెండురోజులు సెలవులు కలిసొచ్చాయి ...అమ్మావాళ్ళను చూసినట్లు ఉంటుంది ..పైగా ఈ ప్రాబ్లం ఇంకా తగ్గలేదే ఎన్ని మందులువాడినా..అమ్మ అక్కడ డాక్టర్స్ దగ్గర చూపిద్దాం రమ్మని గొడవ" అంది. హూం ,అదీ నిజమేలే ..కాని జాగ్రత్త సరిగ్గా ఎండల టైం ...మొన్న ఎండల్లో మేము ఇండియా వెళ్ళినపుడు నాకు సరదా తీరిపోయింది.వికారం, కళ్ళు తిరగడం ఒక్కటి కాదు ..పిల్లల్ని అయితే హాస్పిటల్ చుట్టూ తిప్పుతూనే ఉన్నాను ..ఎండలో అస్సలు తిరగకు" అని ఒక సలహా పారేసాను..


ఓ నెల పోయాకా నేనే ఫోన్ చేసాను గుర్తుపెట్టుకుని ..ఈ సారి గనుక చేయకపోతే చాకిరేవే మరినాకు ......."హలో" అంది నీరసంగా .ఇదేంటే ఇండియా వెళ్ళిన ఉత్సాహంలో ఒకటే ఉషారు ఉషారుగా ఉంటావనుకున్నాను ఇలా గాలితీసిన బెలూన్లా అలా వ్రేలాడిపోతున్నావేంటి అన్నాను అయోమయంగా......ఏం ముహూర్తాన అన్నావే బాబు ఇండియాలో ఎండలకు కళ్ళు తిరిగుతాయని ...వెళ్లోచ్చి రెండువారాలు పైనే అయిపోయినా ఇంకా తేరుకోలేకపోతున్నా.. ఎంత నీరసమోచ్చేసిందో తెలుసా" అంది.".అయ్యో అవునా!!.. అయినా ఇంటిపట్టున హాయిగా ఉండక ఎండలో ఎవరు తిరగామన్నారు నిన్ను...డాక్టర్ దగ్గరకు వెళ్తా అన్నావ్ వెళ్ళావా మరి "అన్నాను.."ఏంటి ఇంటిదగ్గర ఉండేది..షాపింగ్ అని అదని ,ఇదని ఏదో ఒకపని ఉంటుందిగా ...ఉన్నదే వారం రోజులు ...లాస్ట్ డే డాక్టర్ దగ్గరకు వెళ్లాను "అంది.. ఏమన్నారు మరి అన్నాను ... నా పాత రిపోర్ట్స్ అన్ని చూసి ఇంకో బుట్టెడు మందులిచ్చి అస్సలస్సలు రక్తం లేదు బాగా తిను అని చెప్పి బిల్లు బజాయించి పొమ్మన్నారు అంది విసుగ్గా...ఇంకేం చేస్తావ్ వాడు మరి అని ఫోన్ పెట్టేసాను..


ఆ తరువాత చాలా రోజులు దాని విషయమే మర్చిపోయాను....ఇక్కడ అందరమూ ప్రక్క ప్రక్క ఊరుల్లోనే ఉంటాము( మేక్జిమం అరగంట జర్నీ) కాని ఏదో ఒక అకేషన్ వస్తే గాని కలుసుకోమన్నమాట ....నా బెస్ట్ ఫ్రెండ్ నేను ప్రతి రోజూ, గంటలతరబడి ,సంవత్సరాల పాటు మాట్లాడుకుంటాం కాని నాలుగేళ్లకోమారు కూడా కలుసుకోము ...అట్టా సూడమాకండి...అదంతే ....బద్దకానికి బాధ్యతలు అని ముసుగేసి అలా రోజులు గడిపేస్తాం ... ఆ ...ఎంతవరకూ చెప్పాను.. అలా సుధ విషయం మర్చిపోయి రోజలు గడిపేస్తుండగా ఒక రోజు అమ్మతో పోన్లో పిచ్చాపాటి మాట్లాడుతుంటే పద్మక్కకు ఆపరేషన్ చేసారట ఓమారు వెళ్లి పలకరించి రావాలి అంది..అదేంటి లాస్ట్ ఇయరేగా పాప పుట్టుంది.... మళ్ళీ ఎప్పుడు ప్రెగ్నెంట్ అయ్యింది?? అన్నాను.. అదికాదులే ఆ మధ్య ఏంటో ప్రక్కకు తిరిగి పడుకుంటే ప్రేగులన్నీ ఒక వైపుకి వచ్చేస్తున్నట్లు అనిపిస్తుంది అంట... డాక్టర్ ఆపరేషన్ చేసి అలా కాకుండా సరిచేయాలన్నారట అంది.. ఇవేం రోగాలమ్మా బాబు విచిత్రంగా అన్నాను..మరే ఆడపుట్టుక అంటే అంతే ..మా అమ్మ సింపుల్గా తేల్చేసింది.. ఫోన్ పెట్టేయగానే సుధ ఫోన్ ...


కాసేపు దాని చీవాట్లకు బలి అయ్యాకా ఇప్పుడెలా ఉంది అన్నాను...పర్వాలేదు ,ఇండియా నుండి తెచ్చిన మందులు వేసుకున్నాకా తగ్గినట్లే ఉంది కానీ... అని ఆగిపోయింది..మళ్ళీ ఈ కానీలు అణాలు ఏమిటీ అన్నాను .... ఏంటో నే ఒకటి తగ్గిందంటే మరొకటి..ఈ క్రొత్త టాబ్లెట్స్ వాడుతుంటే వళ్ళంతా నీరు పట్టేస్తున్న ఫీలింగ్ .. అరికాళ్ళు మరీను ..ఇలా నొక్కితే అలా లోపలికి గుంత పడుతుంది అంది.. ఏమో బాబు ఇదేం గోలో..విచిత్రం విచిత్రమైన రోగాలు అని ప్రొద్దున్న అమ్మ మా పద్మక్క గురించి చెప్పింది అంతా దానికి చెప్పాను....అలా చెప్పి ఎంత తప్పు చేసానో తరువాత గాని తెలిసిరాలేదు ...


పది రోజులుపోయాకా సుధ నుండి ఫోన్.. "హలో" అనగానే గై గై మంది ...ఏం నోరేబాబు నీది ..అర్జెంట్గా ఒక దబ్బలమో ,సూదో తెచ్చి కుట్టిపాడేసేయ్ ముందు అంది..నేనేం చేసానే అన్నాను అర్ధం కాక...మొన్న చెప్పావ్ కదా మీ పద్మక్క గురించి ..ఇప్పుడు నాకు కూడా ప్రేగులు ప్రక్కకు వేల్లిపోతున్నట్లు అనిపిస్తుందే అంది..ఓర్నాయనో ఇదెక్కడి గోలరా బాబు అనుకుని.. "ఛీ ఛీ నీ మొహం అదెక్కడో నూటి కో కోటికో జరుగుతుందంట అన్నాను కంగారుగా..ఆ ఒక్కదాన్ని నేనేమోనే అంది ఏడుపు మొహం వేసుకుని.. ఎహే పో ...నీకెందుకు అలా జరుగుతుంది.... అంతా నీ ఊహ అంతే అన్నాను...ఊహో కల్పనో ...ఒక్క రోజు కాదు వారం రోజులనుండి అదే ఫీలింగ్ ....నాక్కూడా మీ పద్మక్కలాగే జరుగుతుందేమో .. అసలు అదేనా లేక ఇంకేమన్నా రోగమా నాకు..నాకే ఎందుకు ఇలా జరుగుతుంది..ఏం పాపం చేసానంటావ్ ..ఈ మధ్య కాలం లో ఒక్క రోజు స్థిమితంగా లేను ...అని ఏడుపుమొదలు పెట్టేసింది..కాసేపు ఓదార్చి ఫోన్ పెట్టేయగానే నాకు దిగులు పట్టుకుంది...ఎందుకిలా జరుగుతుందో అని...


కొన్నాళ్ళు అయ్యాకా విషయం తెలుసుకోవాలాని ఫోన్ చేస్తే హాస్పిటల్ లో ఉన్నానే అంది..ఇంకా తగ్గలేదా అన్నాను జాలిగా.. ఉహు ... ఒక్కోరోజు ఎక్కువగా అనిపిస్తుంది ఒక్కోరోజు తక్కువగా ...అపాయింట్మెంట్ తీసుకుంటే ఈ రోజు ఇచ్చాడు అంది..ఎందుకే ఇంత నెగ్లెక్ట్ చేస్తావ్ ఇలాంటి విషయాలు అన్నాను కోపంగా .. ఆఫీస్లో చచ్చేంత పని ఉంది.. ఈ కే కే హాస్పిటల్ సంగతి తెలిసిందేగా ఈ రోజు అడిగితే నెల రోజులకు ఇస్తాడు ..మనకేమో సండే సాటర్ డేలే కావాలిగా అంది ...సరేలే ఇంటికొచ్చాక విషయం చెప్పు అని పెట్టేసాను ...


సాయంత్రం కాల్ చేస్తే ఎవరూ లిఫ్ట్ చేయరు...నాకేమో టెన్షన్ ....ఏమైందో అని ...మొబైల్ కి చేసినా అదే పరస్థితి.. దేవుడా దానికేం కాకుండా చూడు అని దణ్ణం పెట్టేసుకున్నాను.. మరుసటి రోజు ఫోన్ చేస్తే హలో అంది ఉత్సాహంగా ...కొద్దిగా ధైర్యం వచ్చింది నాకు..ఏమన్నారు అన్నాను ఆత్రుతగా..పక్కున నవ్వి .... నన్ను తిట్టాను అంటే చెప్తాను అంది..ఎహే చెప్పు... విసుగ్గా అన్నాను ...నేను ప్రెగ్నెంట్ నే అంది ..అవునా కంగ్రాట్స్ ..అందులో తిట్టడానికేముంది అన్నాను..పూర్తిగా విను ఇప్పుడు నాకు ఆరో నెల...త్వరలో ఏడో నెల వచ్చేస్తుంది అంది ..ఏంటీ ఒక్కసారిగా అరిచాను ... నిన్న స్కానింగ్ చేసి డాక్టర్ పిచ్చి మొహాన్ని చూసినట్లు చూసిందే అంది...నాకేం అర్ధం కాలేదు..ఎలా? ఆరోనెల అయితే తెలియకపోవడం ఏమిటీ నీకు అన్నాను విచిత్రంగా ..


అదే నాకు మొదట అర్ధం కాలేదు ...లాస్ట్ టైం స్కానింగ్ చేయిన్చానుగా అప్పుడు కన్సీవ్ అయినట్లు ఉంది..కాని ఎర్లీ స్టేజ్ లో ఉండటంవల్ల తెలియలేదు..ఈ పిచ్చిమొహాలు కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని మందులు ఇస్తూనే ఉన్నారు .... నేను కూడా ఆ వికారం ,కళ్ళు తిరగడాలు అన్నీ దానివల్ల ఎండలవల్ల అనుకున్నానుగాని ఈ ఐడియా రానేలేదు ...ఇండియాలో డాక్టర్ కూడా పాత రిపోర్ట్స్ చూసి మందులు ఇచ్చేసింది.. ఒక పోలిక్ ఆసిడ్ గాని ఐరన్ టాబ్లెట్స్ గాని ఏమీ వాడలేదే... వరుసగా అడ్డమైన టాబ్లెట్స్ వాడేసాను ..పైగా పెద్ద పొట్టెం రాలేదు .అంది..


అయినాకాని అంతా తెలియకుండా ఎలా ఉన్నావ్?? అన్నాను..నాకెలాగు "ఇర్రేగ్యులర్ " అనికదా హాస్పిటల్ చుట్టూ తిరిగేది ..టాబ్లెట్స్ ఎలాగూ మానేసానుగా అందుకే పెద్దగా డవుట్ రాలేదు ....నాకైతే ఇంకా కల లా ఉంది అంది... "కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడని ...అలా కలిసొచ్చింది అన్నమాట నీకు ...మాకులా రోజు రోజు టెన్షన్ పడకుండా ఎంచక్కా ఏడో నెలకొచ్చేసావ్" అన్నాను ... ఇక జాబ్ రిజైన్ చేసేస్తున్నాను ...మళ్లీ ఎనిమిదో నెలలో ఫ్లైట్ ఎక్కనివ్వడుగా అంది.. అప్పుడు గుర్తొచ్చింది నాకు ..ఏమే దొంగామోహమా.. మీ అబ్బాయి కడుపులో తిరుగుతూ ఉంటే నీవల్లే, నీ నోరు అని అన్ని తిట్లు తిడతావా నన్ను ఆయ్ అని గొడవ వేసుకున్నా...


ఇప్పుడు తను పరిగెట్టేకొడుకుతో ఆస్ట్రేలియాలో ఉంది ...అలా జరిగింది అన్నమాట :)

22 కామెంట్‌లు:

శ్రీనివాస్ చెప్పారు...

మొదటి కామెంట్??

..nagarjuna.. చెప్పారు...

అసలేం జరిగింది ?

నేను కామెంట్ పెట్టాను :)

Venkat చెప్పారు...

identi akka motham rogalmeeda rasesav.......nuvvu a topic meeda rasina keka..

KumarN చెప్పారు...

నేనప్పుడప్పుడూ వార్తల్లో చదువుతూంటాను ఇలాంటి విషయాలు, చివరి స్టేజీ కొచ్చేదాకా మదర్ కి తెలీలేదు తను ప్రెగ్నెంట్ నన్న విషయం. ఏంటో అనుకునేవాణ్ణి, నిజమే నన్న మాట.

kiran చెప్పారు...

హహహ..నేస్తం గారు..మీ ఫ్రండ్ భలే..అసలు తెలీలేద??..పోనిలెండి..అంత కష్ట పడినందుకు....తాను చివరికి హ్యాపీ...:)
కాని ఆ ట్రీట్మెంట్ మాత్రం నరకం...:(...నేను నాకు బాగా దగ్గర వ్యక్తిని చూసాను...అది చేయించుకోడం..

రాజ్ కుమార్ చెప్పారు...

హమ్మయ్యా.. అలా సుఖాంతం అయ్యిందన్న మాట.
సస్పెన్స్ థ్రిల్లర్ విత్ కామెడీపంచెస్ హిహిహిహి...
ఎప్పటిలానే బావుందండీ.. ;)

రాజ్ కుమార్ చెప్పారు...

..ఆవిడకు పూజ చేసి ఈమెకు చేయకపోతే ఈమె ఏమనుకుంటుందో అని మరికొంత >>>>
సరిగ్గా ఇలాగే నేను కూడా..భయం భయంగా గంటసేపు పూజ చేసేవాణ్ణి..;)

బిల్లు బజాయించి పొమ్మన్నారు>>>>
ప్రతి రోజూ, గంటలతరబడి ,సంవత్సరాల పాటు మాట్లాడుకుంటాం కాని నాలుగేళ్లకోమారు కూడా కలుసుకోము>>>

హిహిహిహి.. కేకలు నేస్తంగారూ..

నేను చెప్పారు...

:)

సుజాత వేల్పూరి చెప్పారు...

సరిగ్గా ఇలాంటి సంఘటనే మా ఇంట్లో జరిగింది. మా మామయ్య కూతురికి పెళ్ళయిన పదేళ్ళ దాకా పిల్లలు పుట్టలేదు. దానికి పొట్ట పెరుగుతుంటే అది "లావైపోతున్నా" (పైగా దానికి నీరసాలు, వాంతులు ఏమీ లేవు) అని యోగా క్లాసులకెళ్ళి,, జిం కెళ్ళి బాగా పొట్ట తగ్గే ఆసనాలు, ఎక్సర్ సైజులు చేసింది.

ఐనా పెరుగుతూ ఉండేసరికి డాక్టర్ దగ్గరికెళితే అప్పుడు తెల్సింది. చాలా భయపడింది పిల్లాడు ఎలా పుడతాడో అని(వాడిని కడుపులోనే ఉతికారేసింది కదా మరి)! కానీ బాగానే పుట్టాడు.ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు.

భావన చెప్పారు...

you must be kidding. నిజం గా జరిగిందా, వూరికె సరదా గా రాసేరా? మరీ ఆరునెలలు తెలియకుండానా? నిజం చెప్పండి.

మాలా కుమార్ చెప్పారు...

మాకు తెలిసిన అమ్మాయైతే డెలివరీ పేన్స్ వస్తుంటే కడుపులో నొప్పనుకొని డాక్టర్ దగ్గరకు వెళ్ళి కూతురు నెత్తుకొని వచ్చింది . మీ ఫ్రెండ్ ఇంక నయం :)

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

ఆర్నెల్లదాకా ఆవిడకు తెలియక పోవడమే ఆశ్చర్యం గా ఉంది. సినిమాల్లో అయితే చేయ పట్టుకొని చెప్పేస్తారు డాక్టరమ్మలు. పాత రిపోర్ట్స్ మీద మందులు ఇచ్చే డాక్టర్స్ ఇంకా ఉన్నారా? అంతా నేస్తం గారి మాయా, అసలేం జరిగింది ?

:):)

హరే కృష్ణ చెప్పారు...

గుక్కతిప్పుకోకుండా చదివించి నాలా కాకుండా కధని సుఖాంతం చేసేసారు అక్కా
మనలో మనమాట ఎండింగ్ రాసుండక పొతే ఇంకా సూపర్ ఉండేది :))

హరే కృష్ణ చెప్పారు...

"అసలేం జరిగింది ?"
జరుగుతుంది
జరగబోతోంది
నాకు తెలియాలి తెలియాలి

నేస్తం చెప్పారు...

అందరికీ బోలెడు బోలెడు ధాంక్యూలు ,
బులుసుగారు ఈ రోజుల్లో నాడి చూసి ప్రెగ్నెన్సీ ఎవరు కంఫర్మ్ చేస్తున్నారండి...ఎక్కడికి వెళ్ళినా స్కానింగులే ...లేదా ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ పరికరాలు .....
భావనగారు నిజ్జంగా నిజమండి.ఈ పోస్ట్ లో తన పేరు తప్పించీ అంతా మక్కీకి కి మక్కీ నిజం ...
మాలగారు మీరు చెప్పిందే నేనోసారి పేపర్లో చదివాను ...అసలు నేను మా పద్మక్క గురించి చెప్పకపోతే అది భయపడి హాస్పిటలకి వెళ్ళకుండా 9 నెలల తరువాత మీరు చెప్పినట్లుగా కడుపునెప్పని వెళ్ళేది..:)
సుజాతగారు అవునండి కొంతమందికి ఏదో కొద్దిగా వికారంతప్పా వాంతులు,పొట్టరావడం ఉండవు (నేనూ ఆ కోవకు చెందినదాన్నే) నా ఫ్రెండ్కి కూడా అంతే కొద్దిగా వికారం ఉండేది..ఇండియాలో ఎండలవల్లా అనుకున్నాం తను నాకు చెప్పినపుడు..తను కూడా చాలామందులు గ్యాస్ట్రిక్ పెయిన్ అని వాడేసింది ...తర్వాత చాలా భయపడింది... ఈ విషయం చెప్పినపుడు ఎవ్వరూ నమ్మరనుకున్నా...చాలామంది ఉన్నారన్నమాటా...హమ్మయ్యా :)

మనసు పలికే చెప్పారు...

టైటిల్ చూసి ఏదో థ్రిల్లర్ స్టోరీ అనుకున్నా :)))))
కంగారు పెట్టేశారు అక్కయ్యా;) నడిచే కొడుకున్నాడా అయితే ఇప్పుడు మీ ఫ్రెండ్ కి? హెల్త్ బాగుంది కదా ఇప్పుడు. అంటే ప్రెగ్నెన్సీ అప్పుడు పాపం ఏవేవో టాబ్లెట్స్ వాడారన్నారు కదా. మొత్తానికి కథ సుఖాంతమయి కంచికెళ్లిందనమాట. బాగుంది టపా.

చిరుజల్లులు చెప్పారు...

అయితే అంతా మా అక్కా నోటి మహాత్యమన్నమాట

శివరంజని చెప్పారు...

సస్పెన్స్ థ్రిల్లర్ విత్ కామెడీపంచెస్ >>>>>>> హహహ అక్కా ఏ విషయాన్నైనా కామెడీగా రాయడం లో నువ్వే ఫస్ట్ అక్కా

నేస్తం చెప్పారు...

chiru navvutO :)...Siva ranjani :)

అజ్ఞాత గారు మీరు రాసిన చాలా చాలా పెద్ద కామెంట్ చూసాను ....చాలా చాలా హేపీ అనిపించింది...ప్రచురించద్దు అన్నారుగా కాపీ చేసుకుని దాచుకున్నానులెండి...హా తెలుగింటి ఆడపడుచును ఎవరిని చూసినా నేనేనేమో అని అడుగుతారా :) ఇది బాగుంది... అమ్మో అయితే ముస్తఫా వెళ్ళినపుడు గుడికి వెళ్ళినపుడు చీరలే కట్టుకుని వెళతాను ఈసారి :) ...ఏదోరోజున తప్పక కలుస్తామేమో ...మరి మీ జాబ్ ఎలా ఉంది ? ఏదో ఏమీ తోచకరాసుకునే విషయాలేనండి... నా వివరాలెందుకు రాయలేదంటే దూరంగా ఉన్నంత సేపూ ఇలా ఎంతో అభిమానం అందుకోగను ఒక్కసారి దగ్గరయ్యామనుకోండి మామూలుగా అనిపించేస్తాను ...అందుకే అన్నమాట ..నా స్వార్ధం నాది :) బట్ నేను ఇండియావెళ్ళేలోపల కలుస్తానేమోలెండి... మరోసారి ధన్యవాధాలు మీ అభిమానానికి ...

అజ్ఞాత చెప్పారు...

>> "బద్దకానికి బాధ్యతలు అని ముసుగేసి అలా రోజులు గడిపేస్తాం ... " అవును .. మీరు బాగా చెప్పారు

రామ చెప్పారు...

కథ సుఖాంతం కావడం చాలా బాగా అనిపించింది. ఏమిటో మాకు పిల్లలు పుట్టినప్పటినుంచీ ఈ మధ్య ఏ పిల్లల కథలు చదివినా, పిల్లలకి సంబంధించిన కష్టాలు ఎవరికీ చదివినా అవేవో మాకే వచ్చేసినట్టు ఫీల్ అయిపోతునాము :( :)

raaam చెప్పారు...

hi