
ఇద్దరం అలా MRT (రైల్వే స్టేషన్ ) వరకు కబుర్లు చెప్పుకుంటూ నడుచుకుంటూ వెళ్లి ,అక్కడే ఉన్న చిన్న మార్కెట్ లో మరుసటి రోజుకు కావలసిన కూరగాయలను కొనేవాళ్ళం.. ఒక్కో వంకాయా మోచేతి వరకు ఇంత పెద్దది ఉంటే ,అమ్మ బాబోయ్ !!!మన ఇద్దరికీ ఒక్క వంకాయ తో రెండు పూటలా కూర వచ్చేస్తుందండి అని తెగ మురిసి పోయేదాన్ని.. ఆ హైబ్రిడ్ కాయలు రుచి, పచి ఉండవని తరువాత తెలిసిందనుకోండీ ... ఆ తరువాత ఇద్దరం మళ్లీ కబుర్లేసుకుని ... మావారు తన కాలేజ్ లో ఆయన గారిని ఆరాధించిన అమ్మాయిల దగ్గరనుండి ,అనేకానేక సాహసాల వరకు .. బోలెడు కోతలు కసా బిసా మని కోసేస్తున్నా( ఏమో ఇప్పుడు తలుచుకుంటే అలాగే అనిపిస్తుంది మరి ) అమాయకం గా నమ్మేస్తూ ఇంటికోచ్చేసేదాన్ని ...
అప్పుడు ఎంచక్కా భోజనం తింటూ 'చెస్ ' ఆడుకునేవాళ్ళం .."ఎవరు గెలిచేవారు?? "లాంటి సుత్తి ప్రశ్నలు అడక్కండి..నాకు కోపం వస్తుంది..అసలు నన్ను అడిగితే ,మనం ఓడిపోతేనే కదా ఎదుటి వాళ్ళు గెలిచేది ...అదే మనం గెలిస్తే వాళ్ళు గెలవగలరేంటీ???అదీ పాయింటు ... అందుకే ఒక యాబై సార్లు ఆడితే ,నలబై తొమ్మిది సార్లు నేనే ఓడిపోయేదాన్నిఅన్నమాట .ఆ తరువాతా మళ్లీ ఎట్టి పరిస్థితుల్లో పది అయ్యేసరికి గాఢ నిద్రలో తేలియాడాల్సిందే... అమ్మాయిలందరికీ కుళ్ళు వచ్చేస్తుంది కదూ ..మరదే, ఒకానొక సమయం లో అసలు ప్రపంచం లో నా అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరేమో అని పొరపాటున అనేసుకున్నా కూడా..కాని, మళ్లీ అలాంటి మాటలు అనకుండా విధి చాలా జాగ్రత్తలు తీసుకుంది మరెందుకో ???...
సరే విషయంలో కొచ్చేస్తే అంతా బాగానే ఉంది కాని ...ఎప్పుడూ కధలో హీరో ,హీరోయిన్లే ఉంటే బోరు కొడుతుందని అనుకున్నాడో ఏమో ..నాకో విలన్ తయారయ్యాడు..వాడి పేరు సందీప్ ..గుజరాతి.. మా ఓనర్ వాళ్ళింట్లో మరొక రూం లో పేయింగ్ గెస్ట్ ...మరి అతను స్టూడెన్టో లేక జాబ్ చేసేవాడో తెలియదు కాని ఎక్కువగా ఇంట్లోనే ఉండేవాడు ... అతను ,నేను ఒక్క మాట కూడా మాట్లాడుకోకపోయినా వాడిని చూసి తెగ భయపడిపోయేదాన్ని ..ఇంతా చేసి వాడు ఏం చేసేవాడయ్యా అంటే నన్ను చూసి 'కిసుక్కున' నవ్వడం.. 'ఓస్' .. ఈ మాత్రందానికే అంత భయపడిపోవడం ఎందుకో అని అనేయకండి మరి... పూర్తిగా వినండి ...
మా ఇంట్లో నాలుగు బర్నర్ల స్టవ్ ఉంది అని చెప్పాకదా ... అదేమో ,బటన్స్ ఎక్కడో ఉండేవి,దాని బర్నర్లు ఎక్కడో ఉండేవి..దేనిది దేనిదో మా చెడ్డ కన్ఫ్యూజ్ అయిపోయేది నాకు...పైగా స్టవ్ వెలిగించడానికి లైటర్ రూపంలో మరొక బటన్ ..అసలే నిద్ర మత్తులో వంటేమో.. సరిఅయిన నాబ్ తిప్పి ,లైటర్ బటన్ ప్రెస్ చేసి స్టవ్ వెలిగించే సరికి, నాకు తాతలు దిగివచ్చేవారు కొద్ది రోజుల పాటు.. సరిగ్గా అదే సమయానికి కిచెన్ దగ్గర బాత్రుం లోకి వెళుతూ నా పాట్లు చూసి, అసలేమాత్రం మర్యాద లేకుండా కిచ, కిచమని నవ్వుతూ వెళ్ళేవాడు ఆ అబ్బాయి .. అదొక్కటేనా ..ఆ వాషింగ్ మిషన్ లో బట్టలు వేయడం మరొక యజ్ఞం ... దాన్ని 'ఆన్ ' చేయడానికి దాని చుట్టూ మినిమం ౩ సార్లు ప్రదిక్షణలు చేయవలసి వచ్చేది ... అన్నిటికన్నా కష్టమైన పని బట్టలు ఆరబెట్టడం ... అంత పొడవు కర్రల పైన బట్టలు ఆరబెట్టి ,దాని చివర్లు పట్టుకుని బయట ఉన్న హోల్స్ లోకి వాటిని గ్రుచ్చేసరికి కర్ర తోపాటు నేనూ .. తుఫాన్ వచ్చినపుడు తాడి చెట్టులా ఆ మూలకు ,ఈ మూలకు ఒరిగిపోయేదాన్ని... అయినా ఏ మాత్రం కరుణించకుండా ప్రతి సన్నివేశానికి ఫక్కున నవ్వుతూనే ఉండేవాడు దొంగమొహం గాడు..
అయ్యో ...వీటన్నిటిని కూడా క్షమించేయగలను ...కాని, మావారి ఫ్రెండ్స్ నుండి ఫోన్ వచ్చినపుడు మాత్రం వాడి మొహం చూస్తే ..'ఎర్రగా' పదికి తగ్గకుండా వాతలు పెట్టేయాలన్నంత కసి వచ్చేసేది ..నాకసలే A for apple .. B for boy అని అరటిపండు వలిచినట్లు ముద్దుగా ,స్పష్టం గా మాట్లాడితేనే ఒక పట్టాన ఇంగ్లీష్ అర్ధం అయ్యి చావదు ... అలాంటిది పీస్ పీస్ పావలా కాస్ టైపులో ఏదో యాసలో మాట్లాడితే అసలు అర్ధం కాదు.. అప్పుడప్పుడే మాయదారి క్రికెట్ క్లబ్బులు అలవాటు పడుతుండటం వల్ల మెల్లి,మెల్లిగా ఫ్రెండ్స్ మొదలయ్యారు మా ఆయనకు..సాయంత్రం అయిదయిందంటే చాలు .. పొలోమని 'కాల్ 'చేసి ఆయన గురించి వాకబు చేసేవారు.. అప్పటికి మొబైల్ లేకపోవడం వల్ల 'లేండ్ ఫోనే' గతి ..తప్పక హాల్లో కొచ్చి మాట్లాడేదాన్ని... అత్త తిట్టినందుకు కాదుగాని తోడికోడలు నవ్వినందుకు అని .. వాళ్ళ ఇంగ్లీష్ అర్ధమవ్వనందుకు కాదుగాని ఎక్కడ వీడు నవ్వుతాడో అని భయమేసిచచ్చేది ...
మా ఆయన ఆఫీస్ కి వెళ్ళాడు అని ఒక్క ముక్క చెప్పడానికి .. వాడు చూస్తున్నాడు అన్న టెన్షన్లో he ..she .. go ..went ..to.. office అంటూ స్త్రీ,పురుష లింగ భేదాలు లేకుండా భూత ,భవిష్య ,వర్త మాన కాలాలన్నిటిలోను సమాధానం చెప్పేదాన్ని వాడి వైపు చూస్తూ... వాడు కూడా యే మాత్రం మేనర్స్ లేకుండా అక్కడే సోఫాలో కూర్చుని నవ్వు భయటకు రాకుండా పెదాలు బిగించి నన్ను ఎంత కుళ్ల బెట్టాలో అంతా పెట్టేవాడు ... పోనీ ఎదుటి వాళ్ళన్నా ..అయ్యో పాపం ,పిల్ల మాట్లాడటానికి కష్టబడుతుంది ..మనం ఎందుకు బాధ పెట్టడం అని కొంచెమన్నా ఇంగితం తో ఆలోచించాలా!! ..అబ్బే ...మీ ఆయన ఆఫీసుకు వెళ్ళాడా ??..ఇంకా రాలేదా ?? ఎప్పుడొస్తాడు? నువ్వెవరు? అంటూ ఒకటే ప్రశ్నల వర్షం.. రోజు వచ్చే ఫోన్లే..ఎప్పుడూ అడిగే ప్రశ్నలే ..అయినా వాడిని చూడగానే నోట్లోంచి మాట వచ్చేది కాదు..
ఈ బాధ పడలేక రోజూ అర చేతిలో ముఖ్య మైన ప్రశ్నలకు సమాధానం రాసుకుని ఫోన్ రాగానే క్రీగంట వీడిని చూస్తూ .. ఒక ప్రక్క చేతిని చూస్తూ సమాధానాలు చెప్పేదాన్ని.. ఈ తెలివి తేటలు ఎక్జామ్లో చూపించి ఉంటే నా సామిరంగా కాలేజ్ ఫస్ట్ వచ్చేసేదాన్ని కదా... హుమ్(భారి నిట్టూర్పు) ... అయితే మా ఆయన ఫ్రెండ్స్ ఏమన్నా తక్కువ తిన్నారా?? ఆన్సర్ షీట్ లో లేని క్రొత్త ప్రశ్నలన్నీ కని పెట్టి మరీ అడిగేవారు .. నాలుగు రోజులయ్యే సరికి చిరాకొచ్చేసి " ఇంకోసారి మీ ఫ్రెండ్స్ నుండి ఇంటికి ఫోన్ వచ్చిందో మర్యాద దక్కదంతే "అని 'ఘాట్టిగా ' వార్నింగ్ ఇచ్చేసా మా ఆయనకు ... వెంటనే యే మాత్రం తడుముకోకుండా" కాళ్ళు విరగ కొడతా అరిచావంటే "అని ముద్దుగా సమాధానం ఇచ్చేసారు మా ఆయన కూడా..అలాంటి కధకు సంభందం లేని విషయాలను మనం పెద్దగా పట్టిన్చుకోకూడదన్నమాట ..
సరే ..ఇదిలా జరుగుతుండగా ఒక రోజు మద్యాహ్నం యధాప్రకారం నేను సుష్టుగా తిని, బెస్టుగా పడుకున్న తరుణం లో ఎవరో తలుపులను టక,టకా మని కొడుతున్న శబ్దం.. టైం చూస్తే నాలుగే అయ్యింది.. ఎవరబ్బా ??అనుకుని తలుపు తీస్తే ఎదురుగా సందీప్ ..."ఫోన్ "అని చెప్పి సోఫాలో కూర్చున్నాడు ... ఈ టైములో ఎవరూ? సాదారణంగా మా ఆయన ఆ టైమ్లో చేసేవారు కాదు నేను పడుకుంటానని.. రిసీవర్ చెవి దగ్గర పెట్టుకుని 'హలో' అన్నాను ..అంతే "కోరమండల ఎక్స్ ప్రెస్ " ఒకటి ఆడ గొంతు తో ఇటు నుండి అటు ఆగమేఘాల మీద వెళ్ళిన శబ్దం.. నాకు ఇప్పటికీ తెలియని విషయం ఏమిటంటే, ఈ "సింగపూరియన్స్" ఎవరో వెనుక తరుముకొస్తున్నట్లు అంత హడావుడిగా ఎందుకు మాట్లాడుతారో ??? ...చేసేది ఏమి లేకా ...సారి ..కమ్ ఎగైన్ అన్నాను ... మళ్లీ" కోరమండల ఎక్స్ ప్రెస్ " ఈ సారి అటు నుండి ఇటు పరిగెత్తింది కాని ఒక్క ముక్క అర్ధం కాలేదు..
వద్దు ,వద్దు అనుకుంటూనే భయం భయం గా సోఫా వైపు చూసాను ..వాడు మాత్రం తన పాత్రకు ఏ మాత్రం అన్యాయం చేయకుండా తెగ నవ్వేసుకుంటున్నాడు 'టివి' చూస్తూ ...దొంగ సచ్చినోడా నీకేం పనిరా ఇక్కడ ?లోపలి పోయి ఏడచ్చుగా అని తిట్టుకున్నాగాని.. ఏం చేయాలో అర్ధం కాలేదు ... పోనీ ,ఫోన్ పెట్టేస్తే? ఉహు లాభం లేదు ..మళ్లీ కాల్ చేస్తుంది.. ఏం చేయాలి ఇప్పుడు?? ... అనుకుంటుండగానే అయిడియా తళుక్కుమంది ...
ఇందాకా ఆ అమ్మాయి ' బేంక్ ఆఫ్ ఇండియా' నుండి కాల్ చేస్తున్నా అంది..అంటే ' ఇండియన్' అయి ఉండచ్చు... కాబట్టి కొద్దో గొప్పో హిందీ తెలిసి ఉండచ్చు..మనకసలే హిందీ సినిమాలు చూసిన లోక జ్ఞానం సూపరు ఉంది కాబట్టి.. విషయం ఏంటో అర్ధం అయితే చాలు మేనేజ్ చేసేద్దాం అనుకుని చీకట్లో రాయి విసురుతూ .."ఆప్ కో హిందీ మాలుమ్ హై" అన్నాను గుస గుసగా ... నా మాట ఇంకా పూర్తి కానే లేదు ..ఇందాక చెప్పిన స్పీడ్ కి 'డబల్ 'వేసుకుని మరీ మాట్లాడింది ఆపకుండా పదినిమిషాలు ...చివర్లో హై ,హో ,హు లు తప్పించి ఒక్క ముక్క అర్ధం అయితే ఒట్టు ... సైన్స్ ఎక్జాం రోజున సోషల్ చదువుకు వెళ్ళిన విధ్యార్దిలా తయారయ్యింది నా పరిస్థితి.. ఓరి దేవుడోయ్ ..నాకెక్కడ దొరికావే బాబు ...అనుకుని ,సోఫా వైపు చూసే ధైర్యం లేక, చివరకు నా ఓటమి అంగీకరిస్తూ... నాకు అర్ధం కావడం లేదు ..మా ఆయన ఫోన్ నెంబర్ ఇస్తా ఆయనకు చెయ్యండి అని చెప్పి గదిలో కొచ్చి ఒక గంట కుళ్లిపోయి,ఉడికి పోయి ఆ ఫళంగా కళ్ళల్లో నీళ్లు పెట్టేసుకున్నా ...
సాయంత్రం మా ఆయన రాగానే ఏమండీ ..ఇందాకా ఎవరో అమ్మాయి ఫోన్ చేసింది.. మీ నెంబర్ ఇచ్చాను ..ఏమిటండి సంగతి అన్నాను .. ఆ ..అవునే మర్చిపోయా..బేంక్ లో NRI ఎకౌంటు ఒకటి ఓపెన్ చేశా ..దానికి సంబంధించి ఏదో లెటర్ పంపిందంట ...అది అడ్రెస్స్ సరిగ్గా లేకపోవడం వల్ల వెనక్కు వచ్చేసిందంట ...వచ్చి కలెక్ట్ చేసుకోమంది.. రేపు నువ్వు వెళ్లి తీసుకొచ్చేయి అన్నారు సింపుల్ గా ... ఒక్కోసారి మా ఆయనను చూస్తే ..క్షణం క్షణం లోని వెంకటేష్ గుర్తు వస్తాడు ...అందులో హీరో గోడలు,మేడలు,మిద్దెలు ఎక్కేసి ..శ్రీదేవిని ..ఆ వచ్చేయి ,దూకేయ్, ఎక్కేయ్ అని సింపుల్గా చెప్పేస్తుంటాడు....
అలాగా.. దేశం కాని దేశం లో ..వచ్చి పది రోజులు కాక మునుపే ..ఒక్కదాన్నీ బయటకు వెళ్లి రమ్మంటే అసలేమనుకోవాలి ఈ మనిషిని ... పైగా నా అంత ధైర్యవంతురాలితో అనవలసిన మాటలేనా అవి అని అడుగుతున్నా... అంతే.. అదేమాట మాట అడిగేశాను ఆవేశంగా ఆయన్ని ...మా ఆయనేమన్నా తక్కువ తిన్నారేంటి ... ఛీ నోర్ముయ్ ..ఎప్పుడు నాకేం తెలియదు తెలియదు అనుకుంటే ఎప్పటికీ ఏమీ తెలియదు ...ఇంకెప్పుడు నేర్చుకుంటావ్.. మొన్న ఫలానా ఫ్రెండ్ వాళ్ళ ఆవిడ శ్రీలంక ఎయిర్ లైన్స్ లో ఇద్దరు పిల్లలతో రెండు విమానాలు మారి మరీ వచ్చేసింది ఇక్కడకు తెలుసా ..మళ్లీ ఒక్క ఇంగ్లీష్ ముక్కరాదు...వాళ్ళందరూ రావడం లేదూ... ఇక్కడ నాకు తెలియదు ..రాదు అంటే కుదరదు ... రేపు వెళ్లి తీసుకు వచ్చేసేయ్ అని కరాఖండిగా చెప్పేసారు ...(ఆ ఫ్రెండ్ కూడా ప్రతిదానికి నాతో పోల్చి ఆ అమ్మాయితో పనులు చేయిన్చేసు కుంటాడంట..ఒకసారి ఆ అమ్మాయే చెప్పింది )
ఇంకొక అమ్మాయితో పోల్చేసరికి పౌరుషం వచ్చేసింది కాని భయం దాన్ని అదిగమించేస్తుంది .తిరగబడి లాభం లేదని ..అది కాదండి,మరి... నాకు బొత్తిగా దారి తెలియదు ..ఒక్కసారేగా ట్రైన్ ఎక్కించారు..ఎటు వెళ్ళాలో ఏమో అన్నాను బ్రతిమాలే పొజిషన్ కొచ్చేసి ... ఇక్కడ అడ్రెస్స్ కనుక్కోవడం చాలా ఈజీ బుజ్జి.. ఇప్పుడు మనం రైల్వే స్టేషన్కి వెళ్తామా ...అక్కడ ఎక్కడ పడితే అక్కడ మేప్ లు ఉంటాయి .. అప్పుడు 'బూన్ లే 'కు( ఇప్పుడు లాస్ట్ స్టాప్ 'జూ కూన్' వరకు పెంచాడు) వెళ్ళే వైపు వచ్చిన ట్రైన్ ఎక్కావనుకో ' టాన్జుంగ్ పాగర్ ' దగ్గర దిగిపో... అక్కడ 'స్టేషన్ కంట్రోల్ 'దగ్గర కేపిటల్ టవర్ కు వెళ్ళే దారి ఎక్కడో కనుక్కుని ,అటు నుండి తిన్నంగా వెళ్ళిపోతే ' బేంక్ ఆఫ్ ఇండియా 'అని బోర్డ్ కనబడుతుంది.. వెళ్లి తెచ్చేసేయ్ ..సరేనా అన్నారు ...
చెప్పద్దూ... నాకు అరచేయి పిడికిలి బిగించి మా ఆయన్ని వంగో పెట్టి గిబుక్కు ,గిబుక్కుమని కొట్టాలన్నంత కసి వచ్చేసింది కాని ,పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం తో ఈ సారి ఏడుపు మొహం తో ..ఒక వేళ 'తప్పిపొతే' ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించాను... ఎహే ఎందుకు తప్పిపోతావ్ ... అంతగా అయితే దారిలో ఏదో ఒక టాక్సీ పట్టుకుని ఇంటి అడ్రెస్ చెప్పి వచ్చేసేయ్ అన్నారు ముసుగుతన్ని ... కలకంటి కంట కన్నీరు ఒలికినా కనికరం కలగదే ఈ కఠిన మానవుడికి అని అతిలోక సుందరి రేంజ్ లో తిట్టుకుని ఏమ్ చేయాలా అని ఆలోచనలో పడ్డాను ...