2, ఏప్రిల్ 2010, శుక్రవారం

నేనూ -నా విదేశీ కలలు


మనసు భలే విచిత్రమైనది ..మనం కోరుకున్నది జరగకపోతే ఒక బాధ ,తీరా జరిగితే ఇంకొక బాధ ,సరేలే అని అదే విషయం దూరమవుతే మరొక బాధ..హూం.. మనసు గతి ఇంతే ,మనిషి బ్రతుకంతే అని ఊరికే అన్నారా!! ..హయ్యో అసలు విషయం మానేసి ఏమిటి ఈ వేదాంతం??? ...ఇంతకూ ఎక్కడున్నాం?? సారి ..ఇంకా సోది మొదలు పెట్టేలేదు కదా..

చిన్నప్పుడు ఆకాశంలో విమానం గాని ,హెలికాప్టర్ గాని వెళుతుందంటే చాలు మా మేడ పై ఎక్కేసి తెగ చేతులు ఊపేసి, టాటాలు చెప్పేసేవాళ్ళం ..కొంచెం పెద్దయ్యాకా తెలివితేటలు పెరిగిపోయి ...అవునూ! ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్లకు చేతులు ఊపుతూ మనం ఇంత సంభర పడిపోతున్నాం కదా ... అసలు వాళ్ళు మనల్ని చూస్తున్నారా? చూసినా మనం కనబడతామా ? కనబడినా మనల్ని పట్టించుకుంటారా ??? ఆ మాత్రం దానికి అప్పలమ్మాలా గాల్లో చేతులు ఊపుతూ ఎందుకు ఈ వృదా ప్రయాసా అని అనేసుకోవడమే కాకుండా ఇదే నేను గనక విమానం ఎక్కితే , కిటికీ ప్రక్కనే కూర్చుని, ఫోజులు కొట్టకుండా తప్పకుండా టాటా చెప్తాను అని తీర్మానిన్చేసుకునేదాన్ని ...

అదిగో అప్పటినుండి విమానం ఎక్కాలని ఆశ మొదలైపోయింది ...కాని విమానం ఎక్కాలంటే విదేశాలకి వెళ్ళాలి ( ప్రక్క రాష్ట్రం కి వెళ్ళాలన్నా విమానం ఎక్కచ్చు అన్న విషయం అప్పటికి నాకు తెలియదు లేండి ) ... పావుగంట జర్నీ ఉన్న అమ్మమ్మ ఊరు పంపాలంటే అరగంట ఆలోచించే మా నాన్న విదేశాలకు పంపడం సాధ్యమా!! అని భారిగా నిట్టూర్చి ఆ విషయం మర్చిపోయాగాని.. "సాధ్యమే" అని బల్ల గుద్ది మరీ చెప్పింది పడమటి సంధ్యా రాగం లో విజయ శాంతి ... ఆ రోజు టి .వి లో సినిమా చూస్తున్నంత సేపూ ఎంత గింజుకున్నా విజయ శాంతి ప్లేస్ లో నేనే కనబడ్డాను.. సంధ్య నా పేరే అనిపించింది .. అలా ఆ సినిమాలో అమెరికా అబ్బాయి ' టాం ' ని వలచాను ,వరించాను, ప్రేమించాను ... వాడు మాత్రం విజయ శాంతిని పెళ్లి చేసుకుని పిల్లని కన్నాడు గాని నన్ను మాత్రం కన్నెత్తి చూడలేదు ...

కాని సినిమా అయిపోయాకా గొప్ప అవిడియా వచ్చేసింది ... ఎంచక్కా ఒక తెల్ల తోలు పిల్లాడిని ప్రేమించేసి , అతనే నన్ను ఎక్కడో చూసి ఇష్టపడి పెళ్లి సంబంధం మాట్లాడటానికి మా ఇంటికి వచ్చినట్లు సీన్ క్రియేట్ చేస్తే ( హమ్మా..మళ్ళా నేను ఇరుక్కోకూడదు కదా ..ఊహాలు కూడా చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటా నేను ) ... 'అమెరికా 'అబ్బాయి, అందులోను బోలెడు డబ్బున్న అబ్బాయి, పైగా కట్నం గట్రా తీసుకోకుండా పెళ్లి చేసుకుంటాను అంటే నాన్న మాత్రం ఎలా కాదనగలరు??? (ఒకవేళ అలా జరిగి ఉంటే ,ఇద్దరికీ తోలు తీసి ఇంటిల్లి పాదికి చెప్పులు కుట్టిన్చేసేవారని అప్పటికి నా బుజ్జి మెదడుకి తెలియదు ) అనేసుకుని మా స్కూల్ నుండి ఇంటికి వచ్చే దారంతా జల్లెడ వేసి మరీ గాలించాను ..అబ్బే.. విదేశం నుండి కాదు కదా ,కనీసం ప్రక్క రాష్ట్రం వాడు కూడా కనబడలేదు ... అలా నా ఊహలన్నీ ఊసులు గానే మిగిలి పోయాయి..

అలా ఆ విషయం మర్చిపోతుండగా మళ్లీ గుర్తు చేస్తూ వచ్చింది మా పెద్దమ్మ గారి అక్కయ్య కూతురు 'సౌదీ' నుండి .. తనని అందరూ దేవతలా చూసేవారు ..మా వీధే కాదు..పేట మొత్తానికి విమానం ఎక్కిన మొదటి అమ్మాయి తను.. కాలేజ్ నుండి రాగానే తన ప్రక్కన చేరిపోయి తను చెప్పే విషయాలను చేటంత చెవులతో ,ఆల్చిప్పల్లా కళ్ళు పెద్దవి చేసుకుని మరీ వినేదాన్ని ... అక్కడ మాములుగా మనం వేసుకునే డ్రెస్సులతో రోడ్ మీద నడవకూడదంట... బురఖా వేసుకోవాలి అని పోటోస్ చూపిస్తే ఆ బురఖాని 10 వేల రూపాయల పట్టు చీరలా ఎంతో అపురూపం గా చూసేదాన్ని.. మన దేవుళ్ళ పటాలు తీసుకు వెళ్ళనివ్వరు అట ..అందుకే పెట్టె అడుగున చీర మడతల మద్యలో బుల్లి దేవుళ్ళ పోటోస్ ని జాగ్రత్తగా తీసుకు వెళ్ళింది అట ..ఇంకా అక్కడ పాలు ,పెరుగు గట్ర మనకులా ఇళ్ళకు వచ్చి 'అమ్మా పాలు' అని అమ్మరంట ... అన్నీ డబ్బాల్లో దొరుకుతాయంట...దొంగతనాలు జరగవుట .... ఏ వస్తువు రోడ్ మీద పడిపోయినా అలా వదిలేసి వెళ్లిపోవాలట .. ఎక్కడ తవ్వినా మనకు నీళ్ళు వచ్చినట్లు వాళ్లకు పెట్రోలు వస్తుందంట .. దారంతా కొబ్బరి చెట్లకు మల్లే ఖర్జూరం చెట్లు ఉంటాయంటా... బంగారం బోలెడు చవకట ..అబ్బో ఎన్నెన్ని విశేషాలో .... రెండు చేతుల మద్యలో ముఖాన్ని పెట్టుకుని రెప్ప వాల్చ కుండా వినేదాన్ని..

ఇంటర్ అవ్వగానే డిగ్రి చదువుకు నాన్న ససేమిరా అన్నారు..పెద్ద చదువులు చదివితే అంతకు తగ్గ మొగుళ్ళను నేను వెదకలేను అని ఖరాకండిగా చెప్పేసరికి ... అప్పటి వరకు నేలకు రెండు అడుగుల ఎత్తులో తేలే నా పాదాలకు భూమి మీద నిలబడటం ఏంటో తెలిసొచ్చింది .. మద్య తరగతి ఆడపిల్లల తండ్రికి ప్రతీకలాంటి నాన్న కడుపున పుట్టీ ఏమిటీ ఆకాశానికి నిచ్చెనలు ..దిగు దిగు అని మనసు హెచ్చరించింది .. దెబ్బకు దిగి పోయి ఎక్కడో గంతకు తగ్గ బొంత దొరుకుతాడులే.. ఇన్ని ఊహాలు మనకేలా అని నిజ జీవితం లోకి వచ్చి పడ్డాను.. అయితే అమ్మ బలవంతం తో మళ్ళా డిగ్రీ పేరు తో కాలేజ్ లోకి అడుగు పెట్టాననుకోండి అది వేరే విషయం ...

అలా అప్పుడు ఎక్కడో వదిలేసి మర్చిపోయిన విషయాన్ని,మా వారు వెదికి తీసుకొచ్చి మరీ కళ్ళ ముందు నిలబెడతారని ఊహించనైనా ఊహించలేదు నేను.. ఆరు నెలల్లో రెండు సార్లు మిస్ కేరి అవ్వడం వల్ల, అమ్మా వాళ్ళింట్లో రెస్ట్ తీసుకుంటూ టివి లో పాత సినిమా చూస్తున్నాను ... తనకి పిల్లలు పుట్టరని భర్తకు మరో పెళ్లి చేయాలని ఒప్పిస్తూ ఉంటుంది ఆ మహాసాధ్వి ...టిడ..టిడ..టోయ్ ... ఇంకేంటి వీరోయిన్ ప్లేస్లో నేను ,వీరో మా ఆయన ..మా ఆయన్ని ఒప్పిస్తూ కళ్ళల్లో నీళ్ళతో నేను (కంగారు పడకండి అప్పటికింకా నా వయసు నిండా ఇరవయ్యే .. అందుకే అలా అన్నమాట ) చాలా ఉద్వేగ భరితమైన సీన్ మద్యలో మా ఆయన వచ్చి డిష్టర్బ్ చేసినందుకు గొప్ప చిరాకొచ్చింది గాని ,విషయం వినేసరికి ఏంటీ !!!!!!!!! అని ఒక్క అరుపు అరిచాను ...

అది కాదు బుజ్జి ,మొన్నటి వరకు నువ్వు ప్రెగ్నెంట్ గా ఉన్నావు కదా అప్పుడు చెబితే ఎక్కువ ఆలోచిస్తావని చెప్పలేదు ..అనుకోకుండా నాకు సింగపూర్ లో జాబ్ వచ్చింది .. వచ్చే ఆదివారమే వెళ్ళాలి అన్నారు మెల్లి గా .... అంతే కళ్ళలో నుండి నీళ్ళు జల జలా వచ్చేసాయి.. మా ఆయన నన్ను వదిలేసి వేరే దేశానికి వెళతారా ??ఇంకేమన్నా ఉందా ??? ..నేను ఉండగలనా ???? ఒక పావుగంట వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉన్నా.. మరి నా కన్నె కలలన్ని రెక్కలొచ్చి కాకుల్లా ఎక్కడికి వెళ్లిపోయాయో తెలియదు గాని ,అప్పటికి నేను సగటు భార్య స్థానం లోకి వచ్చి అర్ధ సంవత్సరం పైనే అయిపోయింది... అది కాదు బుజ్జీ ,నాకు మాత్రం నిన్ను వదిలి వెళ్ళడం ఇష్టం అనుకుంటున్నావా?? ఒక ౩ నెలల్లో నిన్ను నాతో తీసుకు వేళ్ళనూ...మనకి ఆస్తులేమున్నాయి చెప్పు .ఇపుడు సంపాదిస్తుంది మనవరకు సరిపోతుంది ...మనకు పిల్లలు పుడితే అప్పుడు వాళ్ళను బాగా చూసుకోవాలి కదా ,ఖర్చులు పెరుగుతాయి కదా ...అయినా ఎంతా, ఒక్క మూడేళ్ళు ... ఆ తరువాత వెనక్కి వచ్చేద్దాం ...సరేనా అంటూ పలు ,పలు విధంబులుగా మభ్య పెట్టగా మూడు ఉహు...హు లు ముప్పది ప్లీజ్ లమధ్య ఒప్పుకోక తప్పలేదు ....

మా ఆయన కోసం మొదటి సారి హైదరాబాద్ లో ఎయిర్ పోర్ట్ వచ్చి ,విమానం ఎలా ఉంటుందో దగ్గర నుండి చూసాను ... ఆయన విమానం ఎక్కుతున్నంత సేపు ఆనందం గా ఉన్నా దిగి అక్కడకు చేరుకున్నాను అని ఫోన్ చేసే వరకు ఒక్క నిమిషం స్థిమితం గా ఉండలేక పోయాను ...
పైకి నిమిషాని ఆరు సార్లు అరుస్తాను గాని మా ఆయన మీద నాకు ఎంత ప్రేమఉందో అప్పుడు గాని తెలియలేదు.. పైగా అప్పట్లో ఫోన్ బిల్ విపరీతం గా అవ్వడం వల్ల ,క్రొత్తగా జాయిన్ అవ్వడం వల్ల ఎక్కువ గా ఫోన్ చేసేవారు కాదు ..అప్పుడప్పుడు లెటర్స్ వ్రాసేవారు ..వాటినే ముప్పై సార్లు చదువుతూ ఉండేదాన్ని ...

ఎవరన్నా తెలిసిన వాళ్ళు కనబడితే నేను సింగపూర్ వెళుతున్నా అని గొప్ప గా చెప్పేదాన్ని కాని, ఆ తిక్క మొహాలకు సిరిపురం లా వినబడి ఏడ్చేది కాబోలు ..అది సరే గాని ఇంకేంటే విశేషాలు అనేవారు ....ఒక వేళ పట్టుబట్టి చెప్పినా అమ్మో సింగపూరే ..ఎలా పంపించావ్ ...ఇంక నీ బ్రతుకు ఇక్కడే ..ఆ దేశం లో పెళ్ళాలకు వీసా ఇవ్వరంటా..ఒక వేళ నువ్వు వెళ్ళినా ౩ నెలల తర్వాత పంపేస్తారంటా మాకు తెలిసిన వాళ్లకు ఇలాగే జరిగింది ... అని నాలుగైదు కధలు చెప్పి భయపెట్టేసే వాళ్ళు..అమ్మా వాళ్లకు చెపితే ,సరేలేమ్మా అంతగా అయితే ఇక్కడున్టావ్ ,నష్టం ఏంటి ,ఎలాగూ ౩ ఏళ్ళు తర్వాత వచ్చేస్తాడు గా అనేవారు.. నాకు చాలా దిగాలుగా అనిపించేది.. పెళ్లి మంత్రాలు ఎంత పవర్ఫుల్ కాక పొతే ..సంవత్సరం పరిచయానికే ఇంత ప్రేమ పెంచేసుకుంటామా!! అనిపించేసేది..

నా దిగులు కాదు గాని ,రోజు పాపం మా చెల్లెళ్ళకు చిరాకు తెప్పించేసేదాన్ని ... ఈ పాటికి మీ బావగారు నిద్ర లేచి ఉంటారు .. ఈ పాటికి బ్రష్ చేసి ఉంటారు .. అక్కడికి ,ఇక్కడికి రెండున్నర గంటలు తేడా అంటా ...నాకు వీసా వస్తుందంటావా ??? ఒక వేళ అక్కడికి వెళితే నేను ఉండగలనంటావా అని చెప్పిందే చెప్పి నస పెట్టేసేదాన్ని.. ఫోన్ రానంత వరకు ఒక బెంగ ,ఫోన్ పెట్టేసేక ఒక బెంగ .. ఏదన్నా అద్భుతం జరిగి మా ఆయన గంట మాట్లాడేవరకు ఫోన్ కార్డ్ అవ్వకుండా ఉంటే భలే ఉంటుంది కదా అనుకునేదాన్ని.. అద్భుతం.. అదే జరిగింది ... ఏం జరిగిందో ఏమో.. కార్డ్ లో డబ్బులు అయిపోయినా రెండున్నర గంటలకు పైనే మాట్లాడుకున్నాం ..అక్కడి విశేషాలన్ని పూస గుచ్చినట్లు చెప్పారు ..

ఇక్కడ బుజ్జీ.. అబ్బాయిలు చిటికిన వేలు కనబడకుండా బట్టలు వేసుకుంటారా ..అమ్మాయిలేమో పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటారు తెలుసా..

అవునా ..మీరు గాని చూస్తున్నారా వాళ్ళను ??..

ఛీ.ఛీ ఆ పంది మొహాలను ఎవరు చూస్తారు ..మన ఇండియన్ అమ్మాయిలు కనబడితేనే చూస్తాను ...

హమ్మయ్యా అదే కదా ... @#$%^ ఏంటి,మళ్లీ చెప్పండి !!!!!

లేకపోతే నాకింక ఇదే పనే ...ఆఫీస్ లో పనిమానేసి వాళ్ళను వీళ్ళను చూస్తూ ఉంటా.. పైగా ఇక్కడ చట్టాలన్నీ అమ్మాయిలకు అనుకూలం గా ఉంటాయి..వెధవ వేషాలేస్తే కేన్ దెబ్బలే ..

అంటే???..
అంటే సన్నటి పేక బెత్తం లాంటి దానితో కొడతారంట...

ఓస్ అంతే కదా..

ఆగు ..పూర్తిగా విను .. ఆ దెబ్బకు వాడి వీపు అర అంగుళం మేరకు విడిపోతుంది అంట ..

అమ్మో !!!!..

అది తగ్గాకా మళ్లీ మిగిలిన దెబ్బలు కొడతారు ..

ఇంక చెప్పకండి బాబు ...

ఇక్కడ రోడ్లు ఎంత నీట్ గా ఉంటాయో తెలుసా... అద్దం లా ఉంటాయి.. మనదేశం లా ఉమ్ములు ,చెత్త పోస్తే బోలెడు డబ్బులు పైన్ వేస్తారు ...

చిన్నపిల్లలు ,ముసలి వాళ్ళు చేసినా అలాగే వేస్తారా??? ...

అవును వాళ్ళ ఇంట్లో వాళ్ళు కట్టాల్సిందే ...

ఇది మరీ బాగుంది ... చేతిలో చెత్త ఉంటే??

ఎక్కడికక్కడ డస్ట్ బిన్లు ఉంటాయి రోడ్ పొడవునా ...

ఓ ..మరీ ..ఉమ్మోస్తే ...

చెప్పాగా డస్ట్ బిన్లు ఉంటాయి అని ..

మరీ బాత్రుం కొస్తే??

.......
చెప్పండీ ...చిన్నపిల్లలు ,షుగర్ పేషంట్లు ఉంటారు ..మరి అప్పుడూ..దారి పొడవునా బాత్రుమ్లు ఉంటాయా ??..నేను రెట్టించాను ..

ఆహా.. ఇక్కడ ఎటు చూసినా అపార్ట్మెంట్లు ఉంటాయి కదా ..మనకు దగ్గర లో ఉన్న ఇంటికి వెళ్లి ,మీ ఇంట్లో బాత్రుం కి వెళతాను అని చెప్పడమే..

నిజ్జమ్మా!!! (బోలెడు ఆక్చర్యం ..ఇంకా బోలెడు అనుమానం గా)

నిజమేనే ..అది గవర్నమెంట్ రూలు .. మరి శుభ్రం గా ఉండాలంటే ఎలా.. మొన్న నేను అలాగే వెళ్లి వచ్చా..

అవునా !!!! మిమ్మల్ని ఏమి అనలేదా..

ఎందుకంటారు ...పైగా వాళ్ళ దేశాన్ని శుభ్రం గా ఉంచుతున్నందుకు మనల్ని కొత్త అల్లుడిలా గౌరవం గా చూస్తారు..

సరే ,ఆయన సంగతి తెలిసి నమ్మేసాను ...నమ్మేసినదాన్ని ఉరుకున్నానా !!!.. నాలాంటి పది మందికి చెప్పి నమ్మించాను.. వాళ్ళు ఇంకో పదిమందికి చెప్పి 'ఛీ' అనిపిచుకుని 'ధూ' అనేసారు నన్ను అది వేరే సంగతి అనుకోండి.. అలా బోలెడు విశేషాలు చెప్పుకున్నాకా వీసా గురించి అందరూ అనే మాటలు అన్నీ చెప్పాను ...అలా నా భయాలు బాధలు అన్నీ ఓపిగ్గా విన్నాకా చివర్లో మెల్లిగా చెప్పారు నీకు వీసా వచ్చింది ... మరుసటి నెలలోనే నువ్వు రావాల్సి ఉంటుంది అని.. భయం ,ఆనందం ,బెంగ అన్ని కలగలిపి ఏంటో నాకే తెలియదు ... అలా ఇరవై ఏళ్లకే నేను విదేశాలకు వెళ్ళే చాన్స్ వచ్చింది ..

59 వ్యాఖ్యలు:

Unknown చెప్పారు...

nice & cute & excellent...

rays చెప్పారు...

ఎప్పటిలాగే చాలా బాగున్నాయి మీ కబుర్లు...తర్వాత భాగమ్ కోసమ్ ఆత్రమ్గా ఎదురు చూస్తున్నాను...

కౌటిల్య చెప్పారు...

"భలేభలే తీపికబుర్లు, మా నేస్తం బుజ్జితెర జాజిపూలు"అని మా అక్కకి చెప్తూ ఉంటా..ఎందుకంటే మా అక్కవాళ్ళవి కూడా మీలాటి అనుభవాలే...మా చిన్నక్క పెళ్ళిచూపులప్పుడు మా బావతో "మేం విమానమొస్తే మేడమీదకి పరిగేట్ఠుకుంటూ వెళ్ళిపోయి,టాటా చెప్తాం తెలుసా"అని చెప్పింది..మా బావ దానికి"ఇక అలా చూడొద్దు..నిన్ను పెళ్ళవ్వగానే మాంఛి luxury flight ఎక్కిస్తా" అన్నారు..అన్నట్టుగానే పెళ్ళయ్యిన రెండు నెలలకే ఎంచక్కా finland తీసుకెళ్ళాడు...మా అక్క foreign tours బాగా ఎంజాయ్ చేస్తుంటుంది.....

" పెళ్లి మంత్రాలు ఎంత పవర్ఫుల్ కాక పొతే ..సంవత్సరం పరిచయానికే ఇంత ప్రేమ పెంచేసుకున్టామా అనిపించేసేది.." మీరు సరదాగా కబుర్లు చెప్తూనే మంచి touching truths భలే చెప్తారు....అందుకే నేను మీ వీర విసనకఱ్రని...

ఏంటీ? "టాం"ని వరించారా?తెల్లతోలోళ్ళే కావాలనుకున్నారా? మీకు బొత్తిగా దేశభక్తి లేకుండా పోతోంది...ఉండండి,మీవారికి చెప్తా...."నేస్తం గారి శ్రీవారూ!ఇది విన్నారా!!!"......

Srujana Ramanujan చెప్పారు...

hahaha.

Nice account. I too have to write on my foreign experiences

భావన చెప్పారు...

బాగున్నాయి కలలు. కలలు కనక పోతే అవి నిజం ఐనప్పుడూ అనుభవించే థ్రిల్ మిస్ అవుతాము కదా, కాబట్టి కలలు వెరీ గుడ్.సింగపూర్ కాకుండా ఏ అమెరికా నో ఐతే మొదటి ప్రయాణానికే నీరసం వచ్చి ఎందుకొచ్చిన విమానం రా బాబు మన ఎర్ర బస్ వుత్తమం అనుకునే వారు. :-)

అజ్ఞాత చెప్పారు...

పాత template కొత్త బాక్గ్రౌండ్
కళ్ళు లాగేస్తున్నాయ్ నేస్తం
నవ్వోచ్చేసింది మీ పోస్ట్ చదివి
కన్నీరోచ్చేసింది స్క్రీన్ ని చూడలేక

హరే కృష్ణ చెప్పారు...

భలే రాసారు నేస్తం
సింగపూర్ ఎయిర్ లైన్స్ ఫోటో కూడా :)

రాధిక చెప్పారు...

మీకెలాగన్నా బాగా మాట్లాడడం వచ్చండి.అందుకే ఆ పది మందినీ నమ్మించగలిగారు.ఆ చీ,ధూ అన్నవాళ్ళని మీ దగ్గరకి పంపమనండి.అవునా..అలాగా అనుకుంటూ ఇంతింత కళ్ళతో వెళ్ళకపోతే మీపేరు మార్చేస్త్రాను.నేనూ మీలాగే చిన్నప్పుడు ఫ్లైటెక్కితే తప్పకుండా అందరికీ టాటా చెప్పాలి అనుకునేదాన్ని.ఫ్లైటెక్కడం చిరాకేగానీ ఇప్పటికీ ఫ్లైట్ కనపడితే చెయ్యూపుతాను :)

అజ్ఞాత చెప్పారు...

పవన్ కుమార్ ఈరోజు మనం లేట్ అయ్యాం
వచ్చే పోస్ట్ లో విజయం మనదే

నాగప్రసాద్ చెప్పారు...

బాగున్నాయండి మీ విదేశీ కలల కబుర్లు. బహుశా ఎవరు ఏది కావాలని బలంగా కోరుకుంటే, ఖచ్చితంగా అది ఏదో ఒక రోజు జరిగిపోతుందేమో. నా పక్క రూమ్మేటు గాడు కూడా విదేశాల్లోనే జాబ్ చెయ్యాలని తెగ కలలు కనేవాడు. ఒకరోజు వాడి అదృష్టం పండి, వాడు కోరుకున్న జాబ్ వచ్చింది. :).

ఇక నాలాంటోడికి విదేశాలకెళ్ళే ఛాన్స్ ఎలాగూ లేదు కాబట్టి, ఏదో ఒకరోజు కనీసం చెన్నై నుంచి బెంగుళూరుకైనా విమానంలో వెళ్ళాలని తెగ కలలు కంటున్నా. :)). అయినా 300 రూపాయల ఛార్జీతో అయిపోయేదానికి 3000 తగలెయ్యాలంటే కొంచెం కష్టమే. :))).

sunita చెప్పారు...

Good one! baagundi.

కొత్త పాళీ చెప్పారు...

This is absolutely your best.
కాసిని నవ్వులు, మరి కాసిని పువ్వులు పైపైన చల్లేసుకోడం కాకుండా మానవజీవతంలోని ఓ అంతస్సూత్రాన్ని ఆవిష్కరించారు ఈ టపాలో.
Would like to see more in a similar vein from you.

వేణూశ్రీకాంత్ చెప్పారు...

హ హ బాగున్నాయ్ నేస్తంగారు కబుర్లు మరిన్ని విశేషాల కోసం ఎదురు చూస్తున్నాను :-)

నేస్తం చెప్పారు...

రాజా గారు థెంక్స్ అండి
rays గారు థేంక్ యూ
కౌటిల్యా మీకు మీ అక్కయ్యలంటే చాలా ఇష్టం అనుకుంటా :)ఎప్పుడూ తల్చుకుంటునే ఉంటారు.. మరి వీజీ గా విదేశాలకు వెళ్ళాలంటే తెల్లవాడిని చేసుకుంటేనే గా ఏం గోల లేకుండా వెళ్ళాచ్చు ..
సృజన మరి మొదలు పెట్టు :)
అమ్మో భావన గారు అమెరికా ప్రయాణం గురించి చెప్పద్దు.. నాలుగంటలకే నేను అమ్మొ,బాబోయ్ అంతున్నా.. మీకు నా ప్రగాఢ సానుభూతి

నేస్తం చెప్పారు...

అఙ్ఞాత గారు అవునా ..ఏంటోనండి మొన్నటి నుండి రక రకాల టెంప్లెట్స్ చూసి,మార్చి నా కళ్ళు లాగేసి నీరసం వచ్చేసింది కాని టెంప్లెట్ కుదరడం లేదు.. కొన్ని రోజులు ఆగండి ..:)
హరే క్రిష్ణ :)
రాధికా కదా ..ఆ నమ్మని వాళ్ళను నా దగ్గరకు తీసుకొస్తే నమ్మించేదాన్ని కదా...అనవసరం గా ఆవేశపడిపోతారు కొందరు :/
అఙ్ఞాత :)
నాగ ప్రసాద్ దూరపు కొండలు నునుపు అని .. క్రింద నుండి ఆకాశం లో ప్లయిట్ ని చూసిన ఆనందం పై నుండి క్రిందకు చూస్తే కలగదు.. :) కనీసం ఈ ముక్క అనుకోడానికన్నా విమానం ఎక్కాల్సిందే మీరు ..:)
సునీతా :)
కొత్తపాళి గారు ధన్య వాదాలు అండి :)
వేణు అలాగలాగే :)

మాలా కుమార్ చెప్పారు...

మీ విదేశీ కలలు బాగున్నాయండి . మీ పోస్ట్ అంత బాగా మీరు పెట్టే పిక్చర్స్ వుంటాయి .అంత మంచి పిక్చర్స్ ని ఎక్కడ పడతారండి ?

pardhasaradhi చెప్పారు...

అనుకోకుండా కలలు నిజం అవుతున్నయనమాట....... మీ విదేశి పయనముని ENJOY చేయండి

శివరంజని చెప్పారు...

నాకు ఇలాంటి పగటి కలలు చాలా ఉన్నాయక్క . ఎప్పుడు తీరతాయో ఏమిటో

అజ్ఞాత చెప్పారు...

ఏమైంది
కంమెంట్లు ఎవరూ రాయడం లేదా
నేస్తం మీరు అనుమతిన్చాట్లేడా
ఇరవయ్యే వున్నాయి ఇంకా

మంచు చెప్పారు...

సున్నితమయిన ఎమొషన్స్ ఎం రాసారు.. అందుకే అండి మీరు నా ఫేవొరెట్ బ్లాగర్..

Padmarpita చెప్పారు...

బాగున్నాయి మీ కబుర్లు:)

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

నేస్తం,
నేను ఏదో జోక్ వెయ్యబోయాను. బాధ పెట్టి ఉంటే i am sorry!

Unknown చెప్పారు...

:D..
ilaaa andarnii navvinchestunnaru... :)

same pinch...pinky pinky...

na blog kuda pink lo ne undi ippudu.. :)

నేస్తం చెప్పారు...

మాలా కుమార్ గారు థెంక్స్ అండి.. అసలు ఈ పోస్ట్ కి అయితే ప్రచురించాకా బొమ్మ కోసం వెదికా.. ఇంకెక్కడ గూగుల్ లోనే ..
పార్ధ సారధి గారు ఒక్కోసారి అంతే అనుకోనివి అలా జరిగిపోతాయి..ఇంకా ఎంజాయ్ చెయ్యడం అంటారా ...విదేశాలకు రావాలని కోరుకున్నా గాని ఎంజాయ్ చెయ్యాలి ఇక్కడ అని అనుకోవడం మర్చిపోయా అప్పట్లో :)
శివరంజని కలలు కనాలి అవి తీరినా తీరక పోయినా ..అప్పుడే జీవితం మీద ఆసక్తి ఉంటుంది ..లేక పోతే వేదాంతమే
అఙ్ఞాత గారు కదా.. ఎందుకలా అబ్బా ??? ( ఎందుకేమిటీ బోలెడు బోరు కొట్టేసి ..అని నా చేత అనిపించేద్దామనా ..హమ్మా అలా అననుగా )

నేస్తం చెప్పారు...

మంచు పల్లకి గారు :D
పద్మార్పిత :)
మందాకినీ ఇంతకూ నువ్వేం జోకెసావు ??నేనెందుకు బాధ పడాలి??రెండు పేజీలకు మించకుండా వివరింపుము ..ఇలా పజిల్ లా వ్యాఖ్య ఇస్తే ఎలా అమ్మాయ్ ..????
kiran భలే బాగుంది నీ టెంప్లెట్..సేం పించ్ :)

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

నేనింతకు ముందు ఓ వ్యాఖ్య రాశాను కదా!
(హమ్మయ్య, రెండో భాగం, ఇరవయ్యైదో భాగం అని లేదు.
ఇంతకీ మీ ఇంట్లో వాళ్ళకు తెల్ల తోలు, నల్లతోలు చెప్పులు మిస్ అయిపోయాయి పాపం )
అని రాశాను. తర్వాత అలా రాసి తెలిసో తెలియకో నిన్ను బాధపెట్టానేమో అనిపించింది. వ్యాఖ్య ప్రచురించబడకపోవటం చూసి. అందుకే సారీ చెప్పాను.
పేజీలకు పేజీలు టపా రాయడమే బోరు. ఇంకా వ్యాఖ్య కూడా రెండు పేజీలా? నా వల్ల కాదు బాబోయ్!

Manasa Chamarthi చెప్పారు...

mee back ground super ga undi..
:):) and blog kuda chala bagundi.:)

3g చెప్పారు...

ఫొటో బాగుందండీ........ఇంతకీ మీరు ఫ్లైట్ లోఎక్కి వెళ్లారా ఫ్లైటుని లాక్కుంటూ వెళ్లారా ఫొటోలో అమ్మయి లాగ.

నేస్తం చెప్పారు...

మందాకిని అలా రాసావా.. నాకా వ్యాఖ్య రాలేదు..అయినా సరే నాకు లెని పోని అయిడియా ఇచ్చావ్.. నేను అలిగేసాను ...(ఇంతకూ ఆ వ్యాఖ్యలో మొదటి లైనుకి నేను బాధ పడాలా, రెండో లైనుకా ??? :))
మానస హమ్మయ్యా ఒకరికి నచ్చేసింది టెంప్లెట్
3G గారు రెండూనూ ..నిజం గా అయితే ఎక్కి,ఊహల్లో లాక్కుంటూ :)

రాజ్ కుమార్ చెప్పారు...

మీ కొత్త Template చాల బాగుందండి..మీ పోస్ట్ లాగానే..

నేను ఎప్పుడు ఎక్కుతానో విమానం...! అయినా 300 రూపాయల ఛార్జీతో అయిపోయేదానికి 3000 తగలెయ్యాలంటే కొంచెం కష్టమే .. మనది కూడా ఇదే కాన్సెప్ట్...

మీ వీరాభిమానిగా... ఆరు రక్త దాన శిబిరాలు, నాలుగు నేత్ర దాన శిబిరాలు ఏర్పాటు చెద్దామనుకుంటున్నా.. ఎతంతారు ??:):)

Rajkumar

Rajendra Prasad(రాజు) చెప్పారు...

నేస్తం గారూ! కలలని అతి పిన్న వయసు లో నెరవేర్చుకున్నారు. ఇప్పుడు ఉన్న కలల గురించి కూడా రాయండి..

Rajendra Prasad(రాజు) చెప్పారు...

ఇంతకీ ఈ ఘనత మీ కలలను నెరవేర్చే భర్తను తెచ్చిపెట్టిన మీ నాన్న గారిదా,లేక మీ కలలను తీర్చిన మీ భాగస్వామిదా..?

మంచు చెప్పారు...

డార్క్ బేక్గ్రౌండ్ మీద లైట్ కలర్ అక్షరాలు.. ' మా కళ్ళు లాగుతున్నాయ్ " అన్న కంప్లైంట్స్ వస్తాయ్ చూడండి.. :-))
నాకూ నచ్చింది

అజ్ఞాత చెప్పారు...

అఛీ అఛీ అఛీ అఛీ
ఎంత పని చేసావు నేస్తం
నీ బ్లాగుకి వచ్చేదే ఆ పసి పాపని చూసి మా చిన్నతనం లోనికి వెళ్ళిపోవడానికి
చివరికి మిగిలింది జిప్పు లెదరు దానికున్న దారం

తెల్ల రంగు అక్షరాలూ కళ్ళు లాగేస్తున్నాయి
ఈ కొత్త థీం వల్ల చూడండి ఎంత చిన్న ఫోటో వుందో
ఫ్లైట్ కనిపించకపోయినా సరే కనీసం ఆ అమ్మాయి కూడా సరిగ్గా కనిపించడం లేదే??

Sai Praveen చెప్పారు...

చాలా బావుందండి టపా. ఎప్పటిలాగే. :)

నేను ఈ మధ్యనే బ్లాగ్లు చూడడం, రాయడం మొదలు పెట్టాను. క్రిందటి వారం మీ బ్లాగ్ చూసాను. 'ప్రేమ కథలు పలురకాలు'మొదటి భాగం చదివే నేను నీకు అభిమానిని అయిపోయాను. మిగతావి చదివే కొద్ది కొంచెం కొంచెం గా వీరాభిమాని అయిపోయాను. జ్ఞాపకాలను రాసి దాచుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. మీరు అదే పని చేస్తున్నారు. పైగా దానికి చక్కని హాస్యం జోడించి సున్నితమైన భావాలను ఎంతో అందంగా ప్రెజెంట్ చేస్తుంటారు. ఇలాగే మా కోసం రాస్తూ ఉండండి.
నేస్తం అన్న పేరు వల్లో మీ సంగతులు అన్ని మాతో పంచుకోవడం వల్లో తెలియదు కాని మీరు నా చిన్ననాటి నేస్తం ఏమో అన్న ఫీలింగ్ వచ్చేస్తోంది :)
@వేణురాం గారు...
మీతో పాటు నన్ను కూడా లేక్కేస్కోండి :)

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

:-)
మొత్తానికి మీ కలను అతి చిన్న వయసులోనే నిజం చేసేసుకున్నారు....నేను, నా దోస్తులు కూడా చిన్నప్పుడు విమానం పైనుండి వెలుతుంటే పోటీలు పడీ మరీ టాటా చెప్పేవాళ్ళం....
మీ బ్లాగుకు తొడిగిన కొత్త డ్రెస్ బాగుందండీ...:-)
ఈ టపా ఎందుకో నేను మిస్సయ్యాను ముందే చదవటం...

నేస్తం చెప్పారు...

వేణు రాం ఆరు రక్త దానా శిబిరాలా???మీరు ,నేను ,ఆ క్రింద సాయ్ ప్రవీణ్ నెలకు రెండేసి శిబిరాలకు రక్త దానం చేయాలి... మనలో మన మాట నేను ఈ రోజు రక్తం దానం చేసి మరుసటి రోజు అదే రక్తాన్ని ఎక్కించుకోవాలనుకోండి ...కాబట్టి నా మీద దయ ఉంచి ఇంకోసారి ఆలోచించడానికి వీలుందేమో చూద్దురు ..
రాజేంద్రా రెండూ కాదు కలలు రప్పించిన దేవుడిది :)
వచ్చేసింది మంచుపల్లకి గారు ఆ క్రింద చూడండీ ఎన్ని తిట్లు తిట్టారో వా..ఆ..ఆ

నేస్తం చెప్పారు...

అఙ్ఞాత గారు మీరు అబ్బాయి కదా ..చూసారా ఎంత షార్పో నేను.. లేక పోతే అమ్మాయి పొటొ కనిపించడం లేదని ఇన్ని తిట్లు తిడతారా..ఆయ్య్...కదా చిన్ని బాబు ఫొటో బాగుంది కదా ...నాక్కూడా అలానే అనిపించింది ..ఏం ముహార్తానా నా టెంప్లెట్ మార్చానో నాకు అసలు టెంప్లెట్ కుదరడం లేదు.. ఆఖరికి పాత టెంప్లెట్ పెట్టినా కళ్ళు లాగేస్తున్నాయి అంటున్నారు... :( ..కొన్నాళ్ళు ఆగండి.. మంచి గా టెంప్లెట్ పెడతా..
శేఖర్ ఇంకా రాలేదేంటి చెప్మా అనేసుకుంటున్నా నేను కూడా..అన్నట్లు సానియా పెళ్ళి పై పోస్ట్ భలే బాగుంది.. విభిన్నమైన శైలి చూసా మీలో

నేస్తం చెప్పారు...

సాయ్ ప్రవీణ్ నా బ్లాగ్ పేరు ఆలోచించినంత గా నేస్తం అని పెట్టడానికి ఆలో చించనేలేదు .. పెట్టాకా గాని ఆ పిలుపులో కమ్మదనం తెలిసి రాలేదు..ఇప్పుడు ఎక్కడ నేస్తం అని చదివినా అది నన్నేనేమో అన్నంతగా ఆ పిలుపుకి అలవాటు పడిపోయాను

పవన్ కుమార్ చెప్పారు...

భలా నెస్తమా భలా..
మీకు నచ్చిన బ్లాగ్ పోస్ట్ లు అన్ని చదువుతున్నా.. భలె ఉన్నాయి

సవ్వడి చెప్పారు...

నేస్తం గారు! మనసును టచ్ చేసారుగా! మీ టపాలలో ఏదో... నాకు తెగ నచ్చే విషయం ఒకటుంది. అదేంటో ఇప్పటివరకూ అర్థం కాలేదు. కాని ఇప్పుడు అర్థమైంది. సున్నితత్వం ఉంది. మీ ప్రతీ టపాలోనూ ఇది కనిపిస్తుంది.

ఈ టపాలో నాకు నచ్చిన విషయాలు చాలా ఉన్నాయి. అవి చెప్పాలంటే ఓ పెద్ద టపా అవుతుంది. కాబట్టి చెప్పట్లేదు.మీ తరువాత టపా కోసం చూస్తుంటాను.ఏంటో ఎప్పుడూ నేనే ఆలస్యంగా చూస్తాను.

first of all change this template. i did not like it. i like previous two. do it fast..

సవ్వడి చెప్పారు...

నేస్తం గారు! మధ్యలో ఓ సందేహం కలిగింది. అది తీర్చేయండి. సౌదీలో మన హిందువులు కూడా బురఖా వేసుకోవాలా! మరో సందేహం... మీ డిగ్రీ పూర్తి ఐయ్యిందా లేదా!

అజ్ఞాత చెప్పారు...

ఏంటండీ సవ్వడి గారు సున్నితత్వం అంటే అంత ఇష్టం అని చెప్పి కాస్త సున్నితంగా చెప్పొచ్చు కదండీ పాపం ఎంత గాయపడిందో మా అక్క మనసు
మాకు కూడా ఈ టెంప్లేటు నచ్చలేదు మరి మేము ఎప్పుడైనా బయటపడ్డామా
కొన్నాళ్ళు ఆగండి.. మంచి గా టెంప్లెట్ పెడతా..అని ఆ అజ్ఞాత కి సమాధానం చెప్పారు కదా మా నేస్తం మీద మాకు ఆ నమ్మకం వుంది

priya చెప్పారు...

mee blog ippude chadivanu.mee shaili bavundi.anni chaduvutanu.chinnappati gnapakalu nemaru vesukunnattundi.

నేస్తం చెప్పారు...

పవన్ ఖాళీ దొరకడంలేదు ..చాలా పోస్ట్ లు నచ్చినవి ఉన్నాయి..ఒక్కోక్కటీ పెడతాను :)
సవ్వడి కాసింత ఖాళీ దొరికాక మారుస్తా ..సౌదీ లో అందరూ బురఖా వేసుకోవలసిందే నండీ (ఏ దేశం అమ్మాయిలైన సరే)..నేను పెళ్ళి అయ్యాకా కంప్లీట్ చేసాను డిగ్రీ .. :)
అఙ్ఞాత :D
ప్రియా :) థేంక్యూ

ప్రణీత స్వాతి చెప్పారు...

చాలా బాగుందండీ మీ టపా..!! ఎంతైనా మీరు లేడీ రాజేంద్ర ప్రసాదండీ..ఎప్పుడూ ఇలాగే నవ్విస్తూ వుండండి.

kiranmayi చెప్పారు...

ఓహో ఈవిడ ఈమధ్య template మార్చినట్టున్నారు అని అనుకుంటూ ఉండగానే మళ్ళి ఇంకో template ! సరే ఇదీ బానే ఉంది. మీ కబుర్లు బలే ఉన్నాయి.

అజ్ఞాత చెప్పారు...

చాలా బావుంది నేస్తం ఈ టెంప్లేట్ విమానం పక్కన ఆ అమ్మాయి ఇప్పుడు చాలా బాగా కనిపిస్తోంది

అజ్ఞాత చెప్పారు...

బుజ్జక్కా
అదేంటి వారం అయిపోయే ఇంకా రెండో భాగం రాయరా

మొన్నఎప్పుడో
అప్పుడే నూరేళ్ళు నిండిపోయాయా నేస్తం అని జల్లెడలో ఏదో టపా చూసాను
ఆ టపా మీగురుంచేనేమో ani కంగారుగా అనుకోని చూసా
ఆ పోస్ట్ లో నేస్తం అంటే సెల్ ఫోన్ అని తర్వాత తెలిసింది
మాకందరికీ తెలిసి నేస్తం అంటే మీరే కదా
మీరు ఇస్తానన్న డబ్బులేదో వాళ్ళకి పంచిపెట్టేయ్యండి తొందరగా

నేస్తం చెప్పారు...

ప్రణితా థేంక్యూ :)
కిర్ణ్ మయి నచ్చిందా హమ్మయ్యా .. ఈ టెంప్లెట్స్ మార్చడం కాదు గాని HTML కోడ్ కాస్తా వచ్చి చచ్చింది
అఙ్ఞాత నాకు తెలుసండీ నాకు తెలుసు ... ఇలాగే అంటారని మీరు... ఈసారసలు అమ్మాయిలు లేని పొటోస్ పెడతాను :) ...
అఙ్ఞాత అస్సలు తీరిక ఉండట్లేదు.. అందులోను శని ,ఆది వారాల్లో అసలు రాయను .. త్వరలొ వ్రాస్తాను :) ..

అజ్ఞాత చెప్పారు...

నేస్తం,
ఇంత బాగా ఎలా రాస్తారు ఎవరైనా అనుకుంటూ ఉంటాను చాలా సార్లు. మీకు వాక్చాతుర్యం బహుసా పుట్టుకతో వచ్చి ఉండాలి, అన్నట్టు మీ పోస్ట్ చదివినంత శ్రద్ధగా మీ కామెంట్స్ చదువుతా నేను - నాకు తెలిసి బ్లాగర్స్ అందర్లో మీ సమాధానాల శైలి భలే ఉంటుంది. మన మనసుకి దగ్గరైన నేస్తం లాగే అనిపిస్తుంది.ఇంకా పొగడను బాబు,మీరు నాకంటే చిన్న వారేమో అని డౌట్ గా కూడా ఉంది, ఈ టపా చూసాక. :-)
అన్నట్టు, ఇది వరకు నేను పంపిన లింకులు చూసారా ? :-?
- పద్మ.

Unknown చెప్పారు...

మళ్ళి template మార్చారా.. హుహ్.. ఈ template ఎవరకీ అన్నా నన్చిందేమో నాకు తెలియదు గాని.. నాకు ఆ పాపా ని చూడగానే కాస్త భయం వేసింది అండి.., రామ్ గోపాల్ వర్మ సినిమా గుర్తుకు వచ్చింది , ఫారిన్ బుడ్డది లా వుంది , కాస్త మన అమ్మాయి ని అన్నా పెట్టండి.., ఆ కళ్ళు మరి సిల్వర్ కలర్ లో .... జాజిపూల మధ్య లో నుండి అలా చూస్తుంటే ..... ఏదో లా వుందండి.

Unknown చెప్పారు...

పాప కి బొట్టు కూడా మీరే పెట్టినట్లు వున్నారు...

నేస్తం చెప్పారు...

పద్మా సింగపూర్ వచ్చేసరికి నా వయసు 20 అన్నాను గాని ఇప్పుడు అనలేదుకదా.. అల్లాంటి డవుట్స్ ఏం పెట్టుకోకు :)మనం ఇలాగే కంటిన్యూ అయిపోదాం.. నేనే పెద్దదాన్ని ..నువ్వే చిన్నదానివి :)
రాజా గారు ఇంక నావల్ల కాదండి.. కాదంటే కాదంతే.. ఇంక మార్చను గాక మార్చను ...ఇదే చివరాఖరి ఫైనల్ :)

Ram Krish Reddy Kotla చెప్పారు...

Post is excellent and alage blog template kuda iragadeesindi just like godavari ammai...hehe...next post epudu madam?

సవ్వడి చెప్పారు...

హలో నేస్తం! ఎవరో అఙాత నన్ను బాగా తిట్టారే! నేను ఇంతవరకూ చూడలేదు. ఇప్పుడే చూసాను. బాధపడి ఉంటే సోరీ!
ఈ టెంప్లేట్ బాగుంది. కాని ఇంకా మంచిదానికోసం ప్రయత్నించండి.

నేస్తం చెప్పారు...

ఎంటి కిషన్ ఏమైపోయారు ఇన్నాళ్ళూ.. గోదావరి పిల్లనే చేసుకుంటా అనే శపధం నెరవేర్చుకోవడానికి వెళ్ళారనుకున్నాను..
సవ్వడి అమ్మో ఇంక నావల్ల కాదు ఇప్పట్లో టెంప్లెట్ మార్చడం .. విసుగొచ్చేసింది :)

Ram Krish Reddy Kotla చెప్పారు...

ఏమైపోలేదు ఇక్కడే ఉన్నాను నేస్తం...గోదావరి అమ్మాయిని నేను వెతకడం కాదు, ఆ అమ్మాయే నన్ను వెతుక్కుంటూ రావాలి...ఆదనమాట...అలా అయితే ఈ జన్మలో నాకు పెళ్లి కాదు అని మాత్రం అనకండే...నా మనోభావాలు తీవ్రంగా దెబ్బ తింటాయి...ఈ మధ్య కొంచెం బిజీ..కొంచెం బద్ధకం వాళ్ళ టపాలు పెద్దగా రాయలేదు..ఈ మధ్యే ఒకటి రాసాను..మీరింకా అటేపు ఓ లుక్కు వెయ్యలేధనుకుంటా...ఎంత బిజీ అయినా మీ బ్లాగ్ ని మాత్రం వదలను కాబట్టి రెగ్యులర్ గా ఫాలో అవుతున్నా....

నేస్తం చెప్పారు...

kishan...మనోభావాలు దెబ్బతింటాయి అని అలా గట్టిగా చెప్పేసేకా ఇంక నిజం ఏమి చెప్తాం.. సరే సరే ఆ అమ్మాయే వస్తుందిలే వెదుక్కుని :)