.jpg)
దూరపు కొండలు నునుపనీ ..చిన్నప్పుడు విమానం చూసి ఎంత ముచ్చట పడిపోయానో, తీరా అచ్చంగా లోపలికి వెళ్లి చూస్తే ఓస్!! ఇంతేనా అనిపించేసింది .. అచ్చంగా మన ఆర్టీసీ బస్ లాగే ఉంది ..ఇంకా అదే బెటరేమో ..ఇది మరీ ఇరుగ్గా ఉంది.. ఒకేసారి ఎదురు ,బొదురుగా మనుషులు నడిస్తే కష్టమే .. పైగా సినిమాల్లోనూ ,కధల్లోనూ చెప్పిన ప్రకారం ఎయిర్ హోస్టెస్ అంటే సన్నంగా ,తీగల్లా దేవకన్యల్లా ఉంటారని అనేసుకునేదాన్ని ... ఇక్కడ చూస్తే అందరూ నలబయ్ పైబడిన వాళ్ళే ..పైగా ఒక మోస్తరు లావుగా ,నీలం రంగు చీర కట్టుకుని అతి మాములుగా ఉన్నారు..
ఇంతలో అందులో ఒక ఆవిడ నా టికెట్ చూసి ,ఫలానా నెంబర్ సీట్ లో కూర్చో మని చెప్పేసరికి అదెక్కడో తెలియక వెదకడం మొదలు పెట్టాను ..నాతో పాటు వచ్చిన ఆయన ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదు.. అక్కడక్కడే తచ్చాడుతుంటే ఇంక దీనికి చెప్పినా లాభం లేదనుకుందేమో ..నవ్వుతూ నన్ను తీసుకెళ్ళి ఒక సీట్ చూపించి వెళ్ళిపోయింది ఒక ఎయిర్ హోస్టెస్ .. ఇదేం విమానం రా బాబు అనుకుని నా బేగ్ పెట్టడానికి ఏదైనా ప్లేస్ ఉందేమో చూసా ..ఉహు అన్ని కేబిన్లు నిండిపోయాయి..ఆ ఇరుకులోనే కాళ్ళ దగ్గర పెట్టుకుని ప్రక్కకు చూసాను ...ఒక నార్త్ ఇండియన్ అబ్బాయి తెల్లగా ,పొడవుగా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని ఉన్నాడు ... నాకు నీరసం వచ్చేసింది ...ఎవరన్నా తెలుగువాళ్ళు ఉంటే ఏదో ఒక మాటల్లో పడి కాస్త భయం తగ్గించుకునేదాన్ని.. ఆ అవకాసం లేదు ఇప్పుడు .. నీడ పట్టున కూలింగ్ గ్లాసెస్ ఏమిటిరా తింగరి మొహం అని కసిగా తిట్టుకుని ఆ ప్రక్కన చూసాను.. ఎవరో ఒక అతను కిటికీ ప్రక్కనే కూర్చుని ప్లైట్ ఎక్కిందే నిద్రపోవడానికి అన్నట్లు కళ్ళు మూసుకుని గాఢ నిద్రలో జారుకుంటున్నాడు..
నాకు మా ఆయన మాటలు గుర్తుకువచ్చాయి..బుజ్జీ, ప్లైట్ లో నుండి చూస్తే భలే ఉంటుంది తెలుసా!!! క్రింద సముద్రం ,అలలు అన్నీ మాంచి కలర్ ఫుల్ గా కనబడతాయి.. ఏదో వింత లోకం లో ఉన్నట్లు ఉంటుంది ... అని .. అవన్నీ చూడాలని ఎంతో ఆశ పడితే ఇంకెవరో అక్కడ కూర్చోవడమే కాకుండా ,హాయిగా పడుకుని ఆ సీట్ ఉపయోగం లేకుండా చేసేస్తాడా.. అసలు విమానం లో కిటికీ ప్రక్కన సీట్ లలో 80 % అమ్మాయిలకు రిజర్వేషన్ కలిపిస్తూ ఒక చట్టం చేసి పడేయాలి అనుకుని తెగ బాధపడిపోతుంటే ..మేడం ప్లైట్ స్టార్ట్ హోరాహా హై ...ఆప్ అపినీ సీట్ బెల్ట్ బాంద్ కీజియే అంది మళ్లీ నీలం రంగు చీర అమ్మాయి..
బెల్టా!! ఏం బెల్టు ??అనుకుని అటు ఇటు చూసుకుంటే కనబడింది ...హమ్మయ్య అనుకుని బెల్ట్ పట్టుకుని లాగుతుంటే రాదే??? ..అది ఎలా పెట్టాలో తెలియకా అటు ,ఇటు త్రిప్పి చూస్తుంటే ..ఎక్స్ క్యూజ్ మీ ..ఆ బెల్ట్ నాది అన్నాడు ప్రక్కనున్న వాడు నాతో హిందీలో ...సారి ,అని ఒక కొస అతనికి ఇచ్చేసి నా బెల్ట్ కోసం వెదుకుతుంటే ...ఇక్కడుంది అంటూ చూపించాడు.. చిన్న చిరునవ్వు నవ్వేసి కాస్త విశ్రాంతిగా సర్దుకు కూర్చున్నా ... వెంటనే నా ముందు ఉన్న చిన్న టివి లో ఒక అమ్మాయి వచ్చింది .. ప్లైట్ లో గాలి ఆడకపోతే ఏం చేయాలి ... ప్రమాదం వస్తే ఎలా దూకాలి అంటూ .. అప్పుడప్పుడే కాస్త రిలాక్స్ అవుతున్న నాకు భయం తో మళ్లీ చమటలు పట్టేసాయి ...
మెల్లిగా ప్లైట్ బయలుదేరడం మొదలైంది.. వేగం గా.. వేగంగా ...ఇంకా వేగంగా ... పైకి వెళుతుంటే చెవి లో హోరు,గొంతు అంతా మంట ,తల కాస్త బరువుగా ..అనిపించడం మొదలైంది.. ఎందుకో చాలా భయం వేసింది.. కళ్ళు గట్టిగా మూసేసుకుని చెవులు చేత్తో మూసుకుని ..దేవుడా దేవుడా .. కాపాడవా.. ప్లీజ్ ..ప్లీజ్ ...ఏదో తెలిసీ, తెలియని వయసులో ఏదో అనుకుంటే దాన్ని ఇలా నిజం చేసి ఇంత భయం పెట్టేస్తావా .. ప్లీజ్ ప్లీజ్ కాపాడు అని ఒక అయిదు నిమిషాలు జపం చేసి మెల్లిగా కళ్ళు తెరిచాను.. చెవిలో హోరు గొంతు మంట తగ్గింది.. అసలు ఎక్కడికీ వెళుతున్న ఫీలింగే లేదు.. మెల్లిగా ఊపిరి పీల్చుకున్నాను..
పస్ట్ టైమా అన్నాడు నా ప్రక్కవాడు..కొద్దిగా సిగ్గుగా అనిపించింది.. ఇంకొంచెం కోపం గా కూడా అనిపించింది అలా అడిగేసరికి .. 'ఊ' అన్నాను సీరియస్ గా మొహం పెట్టి ... ప్లైట్ ఆకాశం లోకి వెళ్ళడం పాపం అప్పటివరకు బుద్దిగా కూర్చున్న ప్రయాణికులు అటు ,ఇటు తెగ తిరుగుతున్నారు.. వారిలో మా ఆయన ఫ్రెండ్ వాళ్ళు కనబడతారేమో అని ఆశగా చూస్తున్నా.. ఈ ఫ్లైటేనా వాళ్ళు ఎక్కింది ???..కొంప దీసి నేను హడావుడిలో వేరే ఫ్లైట్ ఎక్కేయలేదు కదా అని కూడా భయం వేసింది...
ఎదురుగా నీలం చీర అమ్మాయి ఒక ట్రాలీ లో రక రకాల జ్యూస్ లు,స్నేక్స్ పొట్లాలు పట్టుకుని వస్తుంది.. అవి చూడగానే బాగా దాహం వేసింది.. ఏదో సినిమాలో హీరోయిన్ చాక్లెట్స్ ఇస్తే హేపీ బర్త్ డే చెప్తుంది ..అప్పుడు అందరూ నవ్వుతారు.. నేనేమన్నా అలాంటి ఎర్ర బస్సునేంటి??అలా లేకిగా తీసుకోవడానికి .. ఒక స్టైల్ మెయింటైన్ చేయాలి .. అసలే నా ప్రక్క నోడు నన్ను తిమ్మాపురం తింగరబుచ్చిలా చూస్తున్నాడు అని గాట్టిగా అనేసుకునేంతలో ఆ అమ్మాయి నా దగ్గర కొచ్చింది .. ఆరెంజ్ ,కోక్ ,ఫ్రూటి ఏం కావాలి మేడం అనగానే ..నో థేంక్స్ అన్నాను కొంచెం స్టైల్ గా .. ఆ అమ్మాయ్ నా ప్రక్కన వాడిని అడిగింది.. వాడు ఒక కోక్ ,రెండు ఫ్రూటి లు ,రెండు వేరుశనగ పేకెట్లు తీసుకున్నాడు..ఆక్చర్యం!!! ఎవరూ పట్టించుకోలేదు.. లెక్క ప్రకారం వాడిని చూసి నవ్వాలి కదా ???? అలా ఎలా వదిలేసారు అందరూ అని కాసేపు బాధ పడిపోయి నోరుమూసుకుని కూర్చున్నా.. వాడిని ఎవరూ ఏమి అనలేదు అనో ,లేక నేను అనవసరం గా లేని గొప్పలకు పోయి జ్యూస్ త్రాగాలేదనో.. ఏంటో ఒక రకమైన కోపంగా ఉంది..
కాసేపు అయ్యాకా వాడు మెల్లిగా మాట్లాడటం మొదలు పెట్టాడు..హిందీ సినిమాల ప్రభావం వల్లో ,లేక సింపుల్ ఇంగ్లిష్ వాడటం వల్లో మొత్తానికి బాగానే అర్ధం అవుతుంది నాకు భాష .. పేర్లు,ఊర్లూ చెప్పు కోవడం అయ్యాకా .. ఎక్కడికి వెళుతున్నారు? అన్నాడు ... సింగపూర్ వెళ్ళే ప్లైట్ ఎక్కి ఎక్కడికీ అంటాడేమిటి వీడి బొంద అనుకుని ..సింగపూర్ అని చెప్పి.. మళ్లీ అదే ప్రశ్న వాడిని వెయ్యకపోతే బాగోదని మరి నువ్వో అన్నాను.. నేను అమెరికా అన్నాడు గర్వం గా .. ( ఏమిటో ఈ అమెరికా వెళ్ళే వాళ్ళు తెగ పోజులు కొట్టేస్తూ ఉంటారు ..అక్కడికి మావి వేరే దేశాలు కానట్టు :)) అంతే నాకు ఒక్క సారిగా వణుకొచ్చేసింది.. ఇది ..ఇది సింగపూర్ వెళ్ళే ప్లైట్ కదా అన్నాను గొంతు తడారిపోతుంటే... వాడొక క్షణం నా వైపు అయోమయం గా చూసి .. అవును సింగపూర్ ఫ్లైట్ నే.. కాని నేను అక్కడి నుండి వేరే ఫ్లైట్ లో అమెరికా వెళ్తా అన్నాడు నా పరిస్థితి అర్ధం చేసుకుంటూ.. హమ్మయ్యా!!! అని అనుకుని అయినా మళ్లీ అడిగా .. నిజమేనా ..సింగపూర్ ఫ్లైటేనా అని..
కాసేపు అయ్యాకా మళ్లీ వస్తుంది నీలం రంగు అమ్మాయి ట్రాలీ తోసుకుంటూ.. హమ్మయ్యా ..ఈ సారి మిస్ కాకూడదు.. రాగానే గభ గభా .. ఒక గ్లాస్ చూపించా.. నా ప్రక్కన అబ్బాయి ఒకటి తీసుకున్నాడు.. అబ్బా, వీడిది కడుపా ,కంబాల చెరువా ఏది పడితే అది తోసేస్తున్నాడు పొట్టలోకి అనుకుంటుంటే.. వాడు అనుమానం గా నా వైపు చూస్తూ 'హాట్ డ్రింక్ 'అన్నాడు .. ఇంత చల్లగా ఉంటే హాట్ అంటాడేమిటి అని వాడి వైపు చూసి ,లేదే ..నాకు చల్లగా ,కూల్ గా ఉంది అన్నాను.. ఈ సారి వాడు నాన్చ లేదు ..అది 'విస్కీ' అన్నాడు ... దెబ్బకి టక్కున ఎదురుగా ఉన్న ట్రేలో పెట్టేసా.. అప్పటి వరకు కోక్,పెప్సి లాంటివి 'సాఫ్ట్' అని వీటిని 'హాట్' అంటారని తెలియదు ..పైగా ప్లైట్ లో మందు కూడా ఇస్తారా ??? అని చూస్తుంటే .. కావాలంటే నీకు కోక్ తెప్పిస్తా ..అది నాకిచ్చేస్తావా అన్నాడు ... ఓరి నీ కక్కుర్తి తగలబడ అనుకుని.. ఓకే ..ఓకే తీసేసుకో నాకే డ్రింకులు వద్దు అన్నాను..
నాన్న గుర్తు వచ్చి నవ్వు వచ్చింది.. మమ్మలిని ఏ ట్రైన్ లోనే ఎక్కిస్తే ప్రతి బోగి కి వంక పెట్టేవారు.. ఇందులో ఎవడో సిగరెట్ కాలుస్తున్నాడు.. అందులో స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు అని నాలుగైదు బోగీలు మార్చేవారు.. ఇలా అయితే మనం గూడ్స్ బండిలో వెళ్ళాలి అని అమ్మ విసుక్కునేది.. అలాంటింది ఒక తెలియని అబ్బాయి ప్రక్కన కూర్చుని మందు కూడా తాగుతున్నాడు అని తెలిస్తే ???...హుమ్ నిట్టూర్చి మళ్లీ కిటికీ వైపు చూసాను యాదాలాపం గా ... దూరం నుంచి సరిగా కనబడటం లేదు .. మబ్బుల మద్య లో నుండి వెళుతుంది అంటే ఏవో దూది పింజలు ఎగురుతున్నట్లు కనబడుతుంది అనుకున్నా..ఉహు ఆ జాడే లేదు.. కాస్త దూరం గా ఇంకేదో కనబడుతుంది.. కొంచెం అనుమానం గా తల పైకి ఎత్తి చూసా ... అనుమానం లేదు ప్రక్కనే వేరే ప్లైట్ వెళుతుంది..
అదేంటి ప్రక్క ,ప్రక్కనే రెండు ప్లైట్లు వెళతాయా ? అమ్మో ఎంత డేంజర్.. ఎంత సేపు చూసినా ఆ ప్లైట్, ఈ ప్లైట్ ప్రక్క ప్రక్కనే వెళుతున్నాయి.. ఏదో ఒకటి ముందుకి వెళ్ళడం లేదు..కొంచెం సిగ్గుగానే అనిపించినా భయం దాన్ని అధిగమించేసింది.. మెల్లిగా ప్రక్కనున్న అతనితో .. మరి మన ఫ్లైట్ ప్రక్కనే ఇంకొక ప్లైట్ వెళుతుంది డేంజర్ కదా అన్నాను .. వాడు వెంటనే ఫైలెట్ కి చెప్తాడని.. రాబోయే ప్రమాదాన్ని ముందుగానే చెప్పినందుకు అందరూ అభినందిస్తారని మరొక వైపు సంతోషం కూడా అనుకోండి ... అతను అయోమయంగా నా వైపు చూసి కిటికీ వైపు చూసాడు.. నేను చూపించాను.. అతను హి..హి అని నవ్వుతూ అది ప్లైట్ కాదు ..ప్లైట్ వింగ్ ..అంటే రెక్క ..దాని ప్రక్కనే కూర్చున్నాం కదా అందుకే అలా అనిపించింది అన్నాడు..
ఛీ....ఛీ ఎంత అవమానం .. ఇంకో సారి వీడితో మాట్లాడకూడదు అని మూతి బిగించుకుని కూర్చున్నా ... కాసేపటి లో భోజనాలు.. అమ్మో ఫ్లైట్ లో ఎక్కితే ఎన్ని పెడతారో అనుకుంటూ వెజ్ కావాలని చెప్పాను.. ఎందుకొచ్చిన గొడవ మళ్లీ వాడెం పెడతాడో..నేనేం కంగారు పడతానో కదా అని వెజ్ నే అడిగా ... రసగుల్లా.. పప్పు అన్నం..ఏదో కూర..ఒక బన్..వెన్న ..పళ్ళ ముక్కలు..ఇంకా ఏంటో పెట్టింది.. సగం, సగం తినేసి వదిలేసా.. కాసేపటికి లైట్స్ ఆఫ్ చేసేసారు అందరూ కిటికీ లు మూసేసి పడుకుంటున్నారు.. నేను అలా టైం చూస్తూ కూర్చున్నా ... కొంచెం సేపయ్యాకా కిటికిలోనుండి బయటకు చూస్తావా అని అడిగాడు ఆ అబ్బాయి.. ఎలా?? అన్నాను..ఒక ప్రక్క నుండి భయం వీడితో వెళితే సేఫేనా ?? ఎక్కడికి తీసుకు వెళతాడు ఫ్లైట్ లోనే కదా ..ఏం కాదు అని ధైర్యం చెప్పేసుకున్నా..
కమ్.. అని వెనుక వైపు ఖాళి గా ఉన్న సీట్ల వైపు తీసుకు వెళ్లి చూడు అన్నాడు.. క్రింద అంతా మబ్బులు ..పైకి చూసా ..పైన కూడా మబ్బులే.. రెండు ఆకాశాల మద్యలో ఉన్నట్లు.. ఎలాంటి ఆధారం లేకుండా.. మనిషి ఎంత గొప్పవాడు అయిపోయాడు.. మన పూర్వికులు పుష్పక విమానం,ప్రియదర్శిని అనే లాంటి వాటినే ఇప్పుడు విమానాలు,కంప్యూటర్లు లాగా తయారు చేసారు.. అంటే వాళ్ళు గొప్పా? వీళ్లు గొప్పా? అంటే పురాణాలన్నీ భవిష్యత్తుని ఊహించే రాసినవా?? ఏంటో కాసేపు వరకు వేదాంతమో ,వైరాగ్యామో ఏంటో ఏంటో.. నాక్కూడా మొదటి సారి చూసినపుడు భలే అనిపించింది ఆ అబ్బాయి ఏంటో కబుర్లు చెప్తున్నాడు..
కాసేపయ్యాకా నీలం రంగు బెల్ట్ వేసుకోమని హెచ్చరించింది.. అబ్బ స్కూల్లో టీక్చర్ల లా వీళ్లు ఎవరురా బాబు అనుకుని మా సీట్లలోకి వచ్చిపడ్డాం.. అందరూ బ్లాంకెట్లు కప్పుకుని పడుకున్నారు.. నాక్కూడా నిద్ర వచ్చింది.. పడుకుందాం అనుకునేంతలో మళ్లీ ప్లైట్ క్రిందకు దిగుతుంది ..కాసేపట్లో వచ్చేస్తాం అన్నాడు ఆ అబ్బాయి ... ఒక్క సారిగా లైట్లు వెలిగాయి అందరూ సర్దుకుని కూర్చున్నారు..చీకటి పడిపోయింది.. టైం ఎంతో చెప్తున్నారు ఎనౌన్సుమెంట్ లో ... ఆగాకా బయటకు వస్తూ ఆ అబ్బాయి టాటా చెప్పేసి హడావుడిగా వెళ్ళిపోయాడు.. ఈ లోపల ఏ మూలన కుర్చున్నారో మా ఆయన ఫ్రెండ్ బయటకు వచ్చాడు .. ఇంక అక్కడి నుండి అతని వెనుక బయలుదేరా...
"చాంగి ఇంటెర్ నేషనల్ ఎయిర్ పోర్ట్ "అనే అక్షరాలు చూస్తేనే ..ఆ గాలి తాకితేనే నాకు ఎంతో పరిచయం ఉన్న ప్రదేశానికి వచ్చిన ఫీలింగ్ వచ్చేసింది.. ఎటు చూసినా పూల మొక్కలు,అందమైన తటాకాలు ఏదో ఉద్యానవనం లో ఉన్నట్లు.. మొదటి సారిగా escalator ఎక్కినపుడు పడబోయాను ... కొంచెం భయం వేసినా తరువాతా అది ఎక్క కుండా ప్రక్కనుండి నడిచేదాన్ని.. దారిలో అనేక దేశాల ఎయిర్ హోస్టెస్ అచ్చం గా దేవకన్యల మాదిరి.. ముట్టుకుంటే మాసిపోతారేమో అన్నట్లు ... అన్ని వింతలు చూడాలని అనిపించినా.. మళ్ళీ దారి మిస్ అయిపోటానేమో అనే టెన్షన్ లో అస్సలు చూడలేదు..
మళ్ళీ పాస్ పోర్ట్, వీసా గట్రాలు చెక్ చేసాక ..ఆ అమ్మాయి మీవారు ఏం చేస్తుంటారు? అని అడిగింది.. అప్పటి వరకు బాగానే ఉన్నా ఆ భాష మళ్ళీ క్రొత్తగా అనిపించి తడబడుతూ సమాధానం చెప్పి బయటకు వచ్చాకా హమ్మయ్యా వచ్చేసానురా భగవంతుడా అనుకుని నా బేగ్ మోసుకుంటూ లగేజ్ కలెక్ట్ చేయడానికి వెళుతుంటుంటే ఎదురుగా చేతులు ఊపుతూ గాజు తలుపుల వెనుక నించుని ఎవరో.. ఎక్కడో చూసినట్లుగా అనిపించింది .. ఇంకెవరు!! మా ఆయనే ..ఇదేంటి ?కుంపట్లో కాల్చిన కుమ్మొంకాయలా ఇలా నల్లబడి పోయారేమిటబ్బా ???పైగా సన్నబడి పోయారు కూడా ..మెట్లు దిగుతూ అనుకునేంతలో ..ఢాం, ఢాం అంటూ పెద్ద శబ్ధం ..కాసేపు ఏమైందో తెలియదు .. ఇహ లోకం లోకి వచ్చాకా ఆఖరి మెట్టు పైన కూర్చుని నేను.. ఆర్యూ ఓకే ?ఒక ఆమె అడుగుతుంది .. పడ్డాను.. కాని ఎలా? హౌ ? అని అనుకునేంతలో నా క్రొత్త చెప్పులు ఇప్పటివరకూ భరించాను ..ఈ జారుడు నేల పైన ఇంక నా వల్ల కాదు అని వెక్కిరించాయి..
ఎదురుగా అప్పటివరకూ చేతులు ఊపుతూ ప్రక్కన ఫ్రెండ్స్ అందరికీ నన్ను పరిచయం చేస్తున్న మా ఆయన ..గొప్ప పని చేసావులే ఇంక రా అన్నట్లు మొహం పెట్టారు.. బిక్క మొహం వేసుకుని బయటకు వచ్చాను .. :)