9, ఫిబ్రవరి 2010, మంగళవారం

ప్రేమ కధలు పలురకాలు -మూడవ భాగం



ఆ రోజు దీపావళి ..మాములుగానే ప్రతి పండగకు మల్లే తలంటు స్నానాలు ,క్రొత్త బట్టలు ,పిండివంటలు ,పూజలు అయ్యాకా సాయంత్రం తాతయ్య ఎర్రగా ఉన్న సన్నపాటి కాడకు(ఏం మొక్కో తెలియదు నాకు )నూనె లో ముంచిన నూలు గుడ్డ చుట్టి పిల్లలందరికీ ఇచ్చారు .అవి దివిటీలు అన్నమాట.వాటిని కాలుస్తూ దివ్వి దివ్వి దీపావళి, మళ్లీ వచ్చే నాగుల చవితి అంటూ ,ఎవరిది ఎక్కువ సేపు కాలితే వారిదే గొప్పఅని కొట్టుకుంటూ కాలుస్తున్నాం ..

సరిగ్గా అదే సమయానికి బయట బైకుల మీద గీతాంజలి గాడు, వాడి ఫ్రెండ్స్ తెగ హడావుడి గా తిరుగుతున్నారు అటు,ఇటు...మా ఇల్లు దాటి ముందుకు వెళితే స్వాతి ఇల్లు వస్తుంది . వీళ్ళకు పని, పాట లేదనుకుంటా తిట్టుకుంటున్న నాకు, నిన్న స్వాతి పటాసుల గురించి అన్నమాటలు గుర్తు వచ్చాయి ...ఇంకేముంది అయ్యగారు అమ్మగారిని ఎలా సంతోష పెట్టాలో తెలియక తెగ బాధపడిపోతున్నట్లున్నారు.ఇప్పుడు అక్కడ ఏం గొడవ చేస్తాడో??.. వాడి కంటే ముందు దీన్ని అనాలి ..కాస్త నోరు మూసుకుని ఉండదు ..అనుకుని లోపలి వచ్చేసాను..


ఆ రాత్రి భోజనాలు అయినతరువాత, నాన్న చెప్పే సవాలక్ష జాగ్రత్తల మద్య, ఆ నాలుగు కాకరపువ్వొత్తులు,మతాబులు కాల్చేసి 9 కల్లా నిద్ర పోవడానికి మంచం ఎక్కేసాం ..మా ఇంట్లో జనవరి 1 తప్ప మిగిలిన అన్ని రోజుల్లో తప్పని సరి 9 కల్లా పడుకోవలసిందే ..అలా నిద్రలో జారుకున్న నాకు హఠాత్తుగా మెలుకువ వచ్చేసింది ..బయట టపాసుల శబ్దాలు ..టైం చూస్తే పది దాటింది.. తమ్ముళ్ళు 11 వరకు కాలుస్తారు కాబట్టి ముందు పెద్దగా పట్టించుకోలేదు ..ఆ తరువాత ఆ శబ్దాలు మెల్ల ,మెల్లగా మరింత ఎక్కువ అవ్వడం మొదలయ్యాయి ..పెదనాన్న ఇన్ని టపాసులు కొన్నారా అని అనుకుంటుంటే నాన్న తలుపు తీసుకుని బయటకు వెళ్ళడం వినబడింది..నాకు కుతూహలం ఆగక చూద్దామని బయటకు వచ్చాను ..


ఆసరికే తమ్ముడు ..చిన్నాన్న ప్లీజ్ ,ప్లీజ్ ఈ ఒక్క రోజే కద నాన్న ,ఇంకో గంట అంతే,ప్లీజ్ నువ్వెళ్ళి పడుకో అని బ్రతిమలాడుతున్నాడు.. నాన్నా!!! వదలద్దు అంత ఎక్కువగా ఉంటే చవితికి కాల్చుకోమనండి అని అందామని గుమ్మం వరకు వచ్చి , ప్రక్కనే బాంబ్ పడినట్లు అదిరిపోయాను..ఎదురుగా గీతాంజలి గాడు వాడి ఫ్రెండ్స్ ... వాళ్ళు నన్ను చూడగానే ,వాళ్లకు కనబడకుండా గబుక్కున గోడ చాటుకి వెళ్ళిపోయి ,ఇదేంటి ఈ టైం లో వీళ్ళు ఇక్కడ?? అనుకుంటూ అటుపక్కగా ఉన్న మరో తమ్ముడిని పిలిచి ఒరే,ఎవరురా వాళ్ళు మన ఇంటి ముందు అన్నాను గుసగుసగా ..అదా ,భలే ఫన్నీ అక్కా బాబు తెలుసా ..వాళ్ళు ఆ వీధి చివరనే ఉంటారులే ..ఇందాక అందులో ఒకడేమో అన్నయ్యని 1000 సిరిస్ కాల్చగలవా దమ్ముంటే అని బెట్ కట్టాడు ..అన్నయ్య కాల్చగానే 100సిరిస్ ఇచ్చాడు ..ఇంక అక్కడి నుండి వాళ్ళను మాటల్లో పెట్టి మేమే కాల్చేస్తున్నాం ..వాళ్ళదగ్గర బోలెడు ఉన్నాయి ...తిక్కలోళ్ళు పాపం అన్నీ మాకే ఇచ్చేస్తున్నారు అన్నాడు ..హుమ్... నువ్వింకా ఎదగాలిరా జాలిగా వాడి వైపు చూసి అనుకుంటుంటే , 'ఏయ్ ఇక్కడేమి చేస్తున్నావ్ లోపలికి పద 'నాన్న అరుపుకి ఉలిక్కిపడి లోపలికి వెళ్లిదుప్పటి ముసుగేసేసాను ..

ఆ రాత్రి 12 వరకు అలా కాలుస్తూనే ఉన్నారు వాళ్ళు .అంతసేపు నిద్ర రాలేదు నాకు..ఒకటే ఆలోచనలు.. వీళ్ళు ఇక్కడకు ఎందుకు వచ్చారు? ..మరీ ఎక్స్ ట్రాలు చేస్తున్నారు కొంచెం కూడా భయం లేకుండా .. ఇక్కడే ఇంత గోల చేస్తే పాపం దాని ఇంటిదగ్గర ఇంకెంత గొడవ చేసి ఉంటారో ?..అయినా స్వాతిదాన్ని కూడా అనాలి ..ఏదో ఒకటి అంటూనే ఉంటుంది.. వాడు తూచా తప్పక చేస్తూనే ఉంటాడు ..రేపు వచ్చి ఇలా జరిగిందే అని ఏడుపు మొహం పెట్టుకుని చెప్తుంది..కాసేపు దాన్ని తిట్టుకున్నాపాపం దాని తప్పేముందిలే ,ఏది మాట్లాడినా వాళ్ళు సీరియస్సుగా తీసుకుంటే అది మాత్రం ఏం చేస్తుంది అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాను.

మరుసటి రోజు మా ఇంటి దగ్గరకు వస్తూనే బయట పేరుకున్న చెత్త చూసి ఏంటే,మొత్తం షాప్ అంతా మోసుకోచ్చేసారా ,ఇంత తుక్కుంది అన్నాది స్వాతి .. మా సంగతి సరే ,ముందు నీ సంగతి చెప్పు.. వీధి మొత్తం దద్దరిల్లిపోయి ఉండాలే ..ఎన్ని కట్టలు పార్సిల్స్ వచ్చాయమ్మ తమరికి,తెల్లార్లు పడుకుని ఉండవు వాటిని కాలుస్తూ అన్నాను వ్యంగ్యంగా ... ఏంటి కాల్చేది ,అగ్గి పుల్ల కూడా గీయలేదు ..మా నాన్న గారు వచ్చేసరికి రాత్రి రెండు అయ్యింది ...ఇంకేం తెస్తారు ..మరి మా వీధిలో వాళ్లకు ఏం వచ్చి ఏడ్చిందో తెలియదు .. దీపాలు వెలిగించేసి తలుపులు బిడాయించేసారు..ఈ దీపావళి సరదా, చట్టుబండలు ఏం లేకుండా చప్పగా జరిగింది మా ఇంట్లో అంది..

నాకు చాలా ఆక్చర్యం గా అనిపించింది..అదేంటే నిన్న వాడు ,వాడి ఫ్రెండ్స్ ఇంత హడావుడి చేసారు మా ఇంటిదగ్గర , మీ ఇంటిదగ్గరకు రాకపోవడం ఏంటి ? మీ ఇల్లు ఎక్కడో తెలియదా వాళ్లకు అంటూ నిన్న జరిగిన విషయం చెప్పాను..నిజమా!మా ఇల్లు తెలియకపోవడం ఏంటే ,చాలా సార్లు కనబడ్డారు నాకు మా వీధిలో అంటూ ముందు చాలా ఆక్చర్య పోయింది కాని తరువాత తేలిగ్గా నిట్టూరుస్తూ నాకర్ధం అయ్యిందిలే అంది.. ఏంటి ?అన్నాను ..మా అమ్మమ్మ సంగతి మా వీధే కాదు పేట మొత్తం తెలుసు.. నోరు విప్పిందంటే చాలు మళ్లీ 3 జన్మలు ఎత్తేంతవరకు ఆ తిట్లు ఎవరూ మర్చిపోలేరు.. ఒకసారి వాడి ఫ్రెండ్స్ కూడా విన్నారు ఆ తిట్లు.. నిన్న ఆవేశం లో కొనేసి ఉంటారు తరువాత మా అమ్మమ్మ గుర్తొచ్చి భయం వేసి ఉంటుంది ...అసలు నిన్నే ఫ్రెష్ గా పక్కవాళ్ళ కుక్క రాత్రిళ్ళు అరుపులతో నిద్రలేకుండా చేస్తుందని నాలుగు వీధులకు వినబడేలా గొడవపెట్టుకుంది .. అందుకని మీ ఇంటిదగ్గర కాల్చేసి ఉంటారు ..ఎలాగూ నీకు తమ్ముళ్ళు ఉన్నారు కదా ,వాళ్లకు వాళ్లకు సరిపోతుంది అంది ... ఏమోనే ,నాకు మాత్రం చాలా కోపం వచ్చింది నిన్న ,భలే భయం వేసింది తెలుసా అని కాసేపు ఆ విషయం మాట్లాడుకుని మర్చిపోయాం ..

కాని ఆ రోజు నుండి గీతాంజలి గాడు మరింత రెచ్చిపోవడం మొదలైంది.. ఇంతకుముందులా భయం భయం గా కాకుండా మేమేదో బాగా తెలిసిన వాళ్ళలాగా ప్రవర్తించేవాడు ..మేమోస్తుంటే ప్రక్కన ఫ్రెండ్తో అంటున్నట్లు నటిస్తూ ఏదో ఒకటి అనేవాడు.. నాకు కొంచెం చిరాకు అనిపించేది ఒక్కోసారి.. కాని ఎప్పుడూ మాతో మాట్లాడే దైర్యం చేయలేదు .. ఇలా ఉండగా ఒకసారి కాలేజ్ లైబ్రరీలో ఈనాడు చదువుతుంటే స్వాతి వచ్చింది ఇక్కడున్నావా అంటూ.. మాటల మద్యలో స్వాతి చెప్పింది.. అన్నట్లు మర్చిపోయాను రేపు న్యూ ఇయర్ కి మన పాత ఫ్రెండ్స్ అందరు కలుస్తున్నారు అంట.. ట్యూషన్ సార్ తప్పకుండా రమ్మన్నారు అంది..నాక్కూడా ఉత్సాహం వచ్చింది ..ఎవరెవరు వస్తున్నారుఅంటా అన్నాను ఆసక్తిగా ..ఏమో తెలియదు ,నేను రావడం లేదు అంది.. ఏ ..ఎందుకని ? నువ్వు వెళ్ళకపోతే నేనూ వెళ్ళను అన్నాను.. అది కాదే, ఈ మద్య ఆ గీతాంజలి గాడి వరస చూస్తున్నావ్ కదా ..ఖచ్చితం గా ఈ న్యూ ఇయర్ కి గ్రీటింగ్ పట్టుకు వస్తాడు.. వాడికా అవకాశం ఎందుకు ఇవ్వడం, లేనిపోని గోల.. మా పిన్ని ఇంటికి వెళుతున్నా ఆ రోజు ..పైగా నువ్వు ,నేనూ ఇద్దరం మానేస్తే సార్ ఫీల్ అవుతారు .. నువ్వు వెళ్ళచ్చుకదా అంది.. అదన్నమాట కూడా నిజమే అనిపించింది ,పాపం దాన్ని ఎందుకులే రిస్క్ లో పెట్టడం అనిపించి బలవంతం చేయలేదు .. నన్ను ఒక్కదాన్నీ పంపాలి కదా ..సరే, చూద్దాం కుదురుతుందేమో అన్నాను ..

న్యూ ఇయర్ రోజు అమ్మని ఎలాగో బ్రతిమాలి ఒక్కదాన్నే సార్ ఇంటికి వెళ్లాను ..పాత ఫ్రెండ్స్ అందరినీ కలుసుకుని కాస్సేపు కబుర్లు చెప్పి ఇంటికోచ్చేస్తుంటే దారిలో గీతాంజలి గాడి ఫ్రెండ్స్ కనబడ్డారు ఎదురుగా వస్తూ .. హీరో గారు లేరేంటో ప్రక్కన ??..ఇదన్నట్లు దానికోసం గ్రీటింగ్ పట్టుకుని తిరుగుతున్నట్లున్నాడు.. మంచిదయింది ఈ రోజు రాకపోవడం అనుకుని ముందు కెళుతుంటే వాళ్ళిద్దరూ నావైపే రావడం గమనించాను..నాకు మెల్లిగా టెన్షన్ మొదలైంది ..వీళ్లు నా వైపు వస్తున్నారేంటి?? కొంపదీసి మాట్లాడరు కదా?? చుట్టూరా చూసాను మా ఇంట్లో వాళ్ళు కనబడతారేమో అని భయంగా ..వాళ్ళు మరింత దగ్గరకొచ్చేసారు..నాకు అర్ధం అయింది వాళ్ళు నాతో మాట్లాడడానికే వస్తున్నారని ..ఇప్పుడు మొదలు పెడతారు ..' ఏమండీ ..మీ ఫ్రెండ్ అంటే మా ఫ్రెండ్ కి ఇష్టం అండి,మీ ఫ్రెండ్ లేకపోతే వాడు చస్తాడండి..మీరు మీ ఫ్రెండ్ కి చెప్పండి' అంటూ ప్రాణాలు తోడతారు ..ఇలాంటి వాళ్ళను మా కాలేజ్ చుట్టూ చూస్తూనే ఉన్నాను ...ఎలారా భగవంతుడా తప్పించుకోవడం అనుకుని నడుస్తుంటే వాళ్ళు నా దగ్గరకు వచ్చేసారు ...

'స్వాతి గారు ' మీతో మాట్లాడచ్చా వారిలో ఒకడు సిగ్గు పడుతూ అన్నాడు .. స్వాతి ??? నేను పొరపాటున విన్నానా ? లేక వాడు పొరపాటున అన్నాడా?ఎ .. ఏంటి అన్నాను అప్రయత్నంగా .. హేపీ న్యూ ఇయర్ అండి స్వాతి గారు ..మీకు కోపం రాలేదు కదండీ అన్నాడు వాడు ముసి ముసిగా నవ్వుతూ.. నాకు అయోమయం గా అర్ధం అయ్యి ,కానట్లుగా అనిపించి స్వాతేంటి ? స్వాతెవరు? అన్నాను వాళ్ళ వైపు మార్చి ,మార్చి చూస్తూ ..ఈ సారి ఆక్చర్య పోవడం వాళ్ళ వంతు అయ్యింది ...మీ పేరు స్వాతే కదా అన్నారు మోహ మొహాలు చూసుకుంటూ ...నాకు భూమి గుండ్రం గా తిరుగుతున్నట్లు అనిపించింది ..కాదు గొణుకుంటున్నట్లు అంటూ అక్కడి నుండి వచ్చేసాను ...

దారి అంతా ఒకటే ఆలోచనలు ..అంటే వీళ్ళకు నా పేరు తెలియదా ??..నన్ను స్వాతి అనుకుంటున్నారా? అయితే వాడు పడుతుంది నా వెనకాలా? లేదు ..లేదు నా కోసం కాదు ..ఎక్కడో పొరపాటు పడుతున్నాను ..మరి ఇన్నాళ్ళు వాడు స్వాతి కోసం తిరిగిన తిరుగుళ్ళు ,వేసిన వేషాల మాటేంటి??నాకు నేను దైర్యం చెప్పుకున్నాను.. కాని ఆలోచిస్తే అవన్నీ నా కోసం కూడా చేసి ఉండచ్చుకదా అనిపించింది ..ముఖ్యంగా దీపావళి రోజు ...డవుటే లేదు నా వెనుకే పడుతున్నాడు ..నా పేరు విషయంలో పొరపాటు పడి ఉంటాడు ...ఆ మాట అనుకోగానే అంతకు ముందు విషయాలన్నీ సినిమా రీలు లా కళ్ళ ముందు గింగిరాలు తిరగడం మొదలయ్యాయి..

వాడొస్తున్నాడని స్వాతి నన్ను ఇటుతోసి అది అటు వెళ్ళిపోవడం.. నన్ను కాదు కదా అనే దైర్యం తో ఎప్పటిలాగే నేను క్లోజప్ ఏడ్ లా పళ్లన్నీ బయటపెట్టి నవ్వుకుంటూ ,మాట్లాడుకుంటూ వెళ్ళడం ..ముఖ్యం గా దీపావళి రోజు చేసిన పనికి కనీసం వాడి వైపు సీరియస్సుగా ఒక్క లుక్ కూడా ఇవ్వలేదు..ఇదంతా చూసి వాడు, నాక్కూడా వాడంటే ఇష్టం అని అనేసుకున్నాడేమో?? ఖర్మ..ఇంకా అనుకోవడం ఏమిటి ? అదే అయ్యుంటుంది ..ఎంత దైర్యం లేక పొతే మమ్మల్ని చూడగానే గోడల వైపు ,మేడల వైపు చూసే వాడు కాస్త మా ఇంటికొచ్చి టపాసులు కాలుస్తాడా?? .. పైగా వాడి ఫ్రెండ్స్ నాకు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్తారా?? ... అయ్యబాబోయ్ దేవుడోయ్ ఏంటి ఈట్విస్టు ...ఇప్పుడేమి చేయాలి ??ఎలా వచ్చానో ఇంటికి నాకే తెలియదు .. బయట ఎండ వేడికో మరి వాడు ఇచ్చిన షాక్ కో తెలియదు కాని కళ్ళు తిరిగినట్లయి మంచం మీద పడిపోయాను ..

మిగిలింది తరువాత వ్రాస్తాను :))

50 కామెంట్‌లు:

viswanadh చెప్పారు...

చాల బాగుంది నేస్తం గారు . నేను మీ టపా కోసం రోజు కి కనీసం ౩ సార్లైనా ఈ URL కి వస్తున్నా . కానీ ముందు టపా లతో పోలిస్తే దీనిలో జీడి పప్పులు తగ్గి నట్లు అనిపిస్తుంది. :)

మధురవాణి చెప్పారు...

తరవాత..???మీరు టీవీ సీరియళ్ళకి కథలు రాస్తున్నారా ఏవిటీ ఈ మధ్య? ఇంత సస్పెన్సు పండిస్తున్నారు ;-) ;-)
హమ్మో నేస్తం.. ఈ ప్రేమ కథ మాములుది కాదు సుమీ.. అస్సలంటే అస్సలు ఊహించని ట్విస్టు ఇచ్చారుగా..!!
ఈ షాకుకి గీతాంజలి గాడేంచేసాడో చెప్పండి మరి..తొందరగా....

బృహఃస్పతి చెప్పారు...

నా చిన్ననాటి తలపులూ...
నా చిన్ననాటి తలపులూ, ఆ వికసించే ముఖాలూ,
అదే ఇంటి ఆవరణ...ణ... ణ... అ...ఆ...ఆఆ..
ఆ తరవాత మర్చిపోయా...!

మీ పోస్ట్ పుణ్యమా అని ఇప్పుడు మా బ్యాచ్ లో ఒకడికి గీతాంజలిగాడు అని పేరు పెట్టేసా స్వెట్టర్ వేసుకుని వస్తున్నాడని రోజూ. అందరూ అలానే పిలవటం స్టార్ట్ చేసేసారు. :)

ప్రణీత స్వాతి చెప్పారు...

అతను మీకిచ్చిన షాక్ మీరు మాకిచ్చారిప్పుడు. తరవాత ఎపిసోడ్ టెలికాస్ట్ ఎప్పుడండీ?

పవన్ చెప్పారు...

ట్విస్ట్ అదుర్స్...
తరువాతి భాగం వచ్చే వారం అని చెప్పి మళ్ళీ సస్పెన్స్ లొ పెట్టేరు.
ఈ సారి కొంచం లేట్ అయ్యినా పరువాలేదు అన్ని భాగాలు ఒకేసారి కావాలి.

శ్రీలలిత చెప్పారు...

గొప్ప ట్విస్ట్ ఇచ్చారండీ..

అజ్ఞాత చెప్పారు...

twist baagundandi... anta okesari raayochu kadandi...:):)
anyway...waiting for next episode...:)

Rajkumar

రాజ్ కుమార్ చెప్పారు...

nenu blog create cheyyadaniki karanam meerey nandi...nijam.. meeku comment pettadaniki matramey.(అజ్ఞాత ga kakunda):):)

mari mee fan kadu kadu properller ni kadaa...:):)

నేస్తం చెప్పారు...

విశ్వనాద్ గారు నేనేమొ అమ్మొయ్ బాబొయ్ అని అంత భయపడిపోతుంటే ఆ సీన్ లో ఇంక హాస్యం ఏం వ్రాస్తాను చెప్పండి :)
వాణి హి హి హి అంటే కొంచెం సస్పెన్స్ గా రాయగలనో లేదో అని ఇలా ప్రయోగాలు చేస్తున్నానన్నమాట ..మళ్ళా గబుకున్న మీరు సీరియల్ మొదలు పెట్టి నన్ను వ్రాయమంటే నేను తడబడకూడదు కదా :)
బృహఃస్పతి గారు మీ వ్యాఖ్య చూడగానే నేను నిజంగా చిన్న నాటి రోజులకు వెళ్ళిపోయా ..బాగా చిన్నపుడు వచ్చేది ఆ సోప్ ఏడ్ ..మార్గో సోప్ కదా ,ఆ అమ్మాయి చక్కగా ఒక గంగాళం నిండా వేపాకులు వేసి వాటితో స్నానం చేస్తుంది..భలే చబ్బీగా ఉటుంది నాకు ఇష్టమైన ఏడ్ :)

నేస్తం చెప్పారు...

స్వాతి తరువాత ఎపిసోడ్ నాక్కూడా సస్పెన్సే .. కాళి గా ఉంటే వ్రాసేస్తా :)
పవన్ అసలు ఈ రోజు తో అయిపోతుంది అనుకున్నా..అదేంటో మరి ఇంత పోస్ట్ అయిపోయి ఇంక ఆపేస్తున్నా.. డైలీ జీడిపాకం సీరియల్ లా అలా పెరిగిపోతుంది
లలిత గారు :)
రాజ్కుమార్ గారు :D మరి venuram ఎవరండి ..ఇంతకు మీ పేరు రెండింటిలో ఏది ..:)

అజ్ఞాత చెప్పారు...

twist super...Krishna

Shashank చెప్పారు...

ఐతే 'స్వాతి గారు ' కథ మీ వైపు తిరిగిందన్నమాట. భలే భలే... పేరులో ఏముంది లేండి.. a rose is a rose is a rose అని అనుకునేయాల్సింది. ;-)

అజ్ఞాత చెప్పారు...

దివిటీలు కొట్టే కర్రలు గోగు కర్రలు ( నార గోంగూర చెట్లు ) ఇదికూడా తెలియకపొతే ఎలా అమ్మాయ్, మరీ విడ్డూరం కాకపోతే

నేస్తం చెప్పారు...

క్రిష్ణ గారు :)
అలా అనేసుకోవడానికి నేను శశాంక్ ని కాదు కదండి
లలిత గారూ కరెస్ట్ గా చెప్పారు..అయినా కొన్ని కొన్ని తెలిసినా తెలియనట్లు ఉండాలి.. లేకపోతే మళ్ళా నేను విదేశం లో ఉన్నానని ఎవరూ నమ్మరమ్మా :)

మాలా కుమార్ చెప్పారు...

లేత లేత ప్రేమ కథ , అందులో ట్విస్ట్ సూపర్ .

రఘు చెప్పారు...

మళ్ళి తర్వాతా...చెప్తారా నేను ఒప్పుకోను అంతే

కౌటిల్య చెప్పారు...

నేస్తం గారూ,
చాలా ఆసక్తిగా టపా చదవటం మొదలెట్టా...గోగుపుల్ల దివిటీలతో ఓసారి రీలు వెనక్కితిప్పేస్కుంటున్నా...కానీ ఇలా sudden గా పేద్ద లక్ష్మీబాంబు పేల్చారేంటండీ...మీ సంగతేమో గానీ రేపు మీ స్వాతేమంటుందో, ఆ గీతాంజలిగాడి expressions ఎలా ఉంటాయో అని తెగ ఆరాటపడిపోతూ ఏంటేంటో ఆలోచించేసుకుంటున్నానండీ...

రాధిక చెప్పారు...

మీరు పోకిరి పండుగాడి కి అక్కా.ఎందుకంటే మీరిచ్చిన ట్విస్టుకి దిమ్మతిరిగి మైండ్ బ్లేకై,వైటై,గ్రీనయింది :)

sunita చెప్పారు...

హహహ!!బాగుంది.

చైతన్య చెప్పారు...

నాక్కూడా బోలెడు డౌట్స్ వస్తున్నాయి... తొందరగా మిగిలిన టపా వ్రాయండి... మీకు పుణ్యం ఉంటుంది...

వేణూశ్రీకాంత్ చెప్పారు...

కెవ్వ్.. భలే ట్విస్ట్ ఇచ్చారు కదా.. :)
తరువాయి భాగం కోసం వెయిటింగ్...

రాజ్ కుమార్ చెప్పారు...

rendoo naa perlenandi... "Venuram rajkumar Neelam" :)

Ram Krish Reddy Kotla చెప్పారు...

Chala bagundi nestam...waiting for next part..kompadeesi ee madhya TV serials choosi inspire ayyara emiti...nakento doubt vastundi :)

Ram Krish Reddy Kotla చెప్పారు...

naku oka rendu bulli doubts unnai clarify cheyyandi nestam:

--> Adedo color dress swathi vesukunte, geetanjali gadu ade color dress vesukoni enduku vachaadu? ( vadu line vestundi meeku kada...kompadeesi aa color ante meeku istam ani swathi tho cheppadam vini vesukochadu antara?? )

--> Swathi chaduvuleni vade vinta janthuvu ane level lo speech ichaka, vadu MBA cheedam ani enduku decide ayyadu ( mimmalni istapadutunte swathi matalu teligga tesukoledu enduku??)

waiting for answers.....

భావన చెప్పారు...

మొత్తానికి ప్రేమ కధా దుమారం మీ మీదకు తిరిగిందా.. అబ్బో ఏమి సస్పెన్స్ బాబు తొందర గా చెప్పకుండా. కిందటి సారి మిమ్ములను అయ్యో అనలేదని బాధడ్డారు గా ..అయ్యో పాపం మీరు ;-)

నేస్తం చెప్పారు...

రఘు గారు అయితె చెప్పందంటారా.. సరె మీ ఇష్టం .. :)
కౌటిల్యగారు నిజమె స్వాతి పాపం విషయం విని ఏమైపోతుందో కదా ..నాక్కూడా అదే అనిపించింది :P
రాధిక మరి బ్లూ,రెడ్,యెల్లో కనబడలేదా .. లాభం లేదు ఈ సారి మరింత సస్పెన్స్ గా వ్రాయాలి :D
సునీత :)

నేస్తం చెప్పారు...

చైతన్యా ఏమిటా డవుట్స్ చెప్పేయండి :)
వేణు గారు :) వ్రాస్తా త్వరలో
రాజ్, కుమార్, వేణు ,రాం అబ్బో చాలా పేర్లున్నాయండీ మీకు ఎంచక్కా ..:)
భావనా హ హ బ్రతిమాలి చెప్పించుకోవడం అంటే ఇదే :)

నేస్తం చెప్పారు...

కిషన్ అబ్బాయిల మనసు మరొక అబ్బాయికే తెలుస్తుంది.. నాకేం తెలుస్తుంది చెప్పండి :)వాళ్ళకు ఏదో రకంగా వాళ్ళ దృష్టిలో పడి మెప్పు పొందాలనో,లేక ఆ అమ్మాయిని సంతోషపెట్టాలనో ఉంటుంది అనుకుంటా ..
మొదటి డవుట్ మీరన్నదే ..బహుశా నాకు ఆ కలర్ ఇష్టం అనడంవల్ల అలా చేసి ఉండచ్చు ..రెండవ డవుట్ ఏమో ,తను చదవని వాళ్ళను తిడుతుంటే మాటవరసకు నిజమే ,నువ్వే కరెక్ట్,నాక్కూడా చిరాకు లాంటి పదాలను ఉపయోగిస్తాం కదా ప్రక్క వాళ్ళం .. :)

మంచు చెప్పారు...

మీ ట్విస్ట్ కి ఇంకా తేరుకొలేదు.. తేరుకున్నాక కామెంట్ రాస్తానే :-))

Viswanath చెప్పారు...

Sooooper twist...andi...mee narattion and use chese simple simple padhalu baaguntaayi...

Unknown చెప్పారు...

ii twist lu entandi babu....ilaa kadu ani ..na mail id isthanu..mottam story oka sari pampincheyandi.. :)

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

పాపం ఇంత షాకింక్ న్యూస్ విని మీ ఫ్రెండ్ కనీసం వారం రోజులైనా పడుకుని ఉండి ఉండదు...హన్నా నేస్తం గారూ..నేస్తానికే ద్రోహం చేస్తారా... :-)

Viswanath చెప్పారు...

Nestham garu mee peru harika na??

Psr చెప్పారు...

Chala Bagunnayi Mee Chinnanati Visesalu...
nako sandeham....
meeru appudu em chaduvuthunnaru..?

naa comment ki tirigi samadanam ivvagalarani ashistu...

Oka Reader

పరిమళం చెప్పారు...

ప్చ్ ..పాపం స్వాతి :( మీరు ఏదైనా సీరియల్ రాయకూడదూ !కరక్ట్ గా ఎక్కడ ఆపాలో అక్కడ ఆపుతారు :) పోన్లెండి కళ్ళు తిరుగుతున్నాయన్నారుగా ..కాస్త నిమ్మళించిన తర్వాతే రాయండి .

సవ్వడి చెప్పారు...

నేస్తం గారు ఏం ట్విస్ట్ ఇచ్చారండి.. అప్పుడే అనుకున్నా.. మీకు గ్రీటింగ్ ఇచ్చి స్వాతి పేరు ఎలా పచ్చబొట్టు చేయించుకున్నాడని..

ఇప్పుడు స్వాతి గారు మిమ్మల్ని ఏమన్నారో తలుచుకుంటుంటేనే నాకు నవ్వోస్తుంది. భలే ప్రేమకథ.

Amma చెప్పారు...

nestham gaaru me peru teslkovalani undi...naa peru harika
me posts ani miss avakunda chadutunanu
epudepudu kothavi rastara ani roju visiting
twarlo mali kothavi rastharani wait chestu..........

నేస్తం చెప్పారు...

మంచుపల్లకి గారు :)
విశ్వనాధ్ గారు :) థేంక్యూ నా పేరు హారిక కాదండి ..అసలా పేరులో ఒక్క అక్షరం కూడా కలవదు :) మరెందుకు మీకుడవుటొచ్చిందో
ఒక రీడర్ గారు అప్పుడు ఇంటెర్ రెండవసంవత్సరం చదువుతున్నా.. అప్పుడేగా అతిగా భయపడటం,అతిగా ఆలోచించడం..ఇలా అన్నీ అతి ఉండెవి..మెచ్యూరిటి తక్కువ ఉంటుంది ఆ వయసులో
పరిమళం గారు,మరే అందుకే కొన్నాళ్ళు ఆగి వ్రాస్తా :)
హారిక గారు మీ పేరు చాలా బాగుంది అండి ..ఇంక నా పేరా.. ఎందుకులేద్దురు నేస్తం అని సరిపెట్టేసుకొండి ఈ సారికి :)

నేస్తం చెప్పారు...

కిరణ్ అలాగే లాస్ట్ పార్ట్ రాసేసాకా అన్నీ కలిపి ఒకెసారి నీకు మెయిల్ చేసేస్తా :)
శేఖర్ గారు హ హ .. ద్రోహం కాదండి..ఎంత టేన్షన్స్ నుండి దాన్ని కాపాడాను..అలా ఆలోచించరేమిటీ :)
సవ్వడి గారు అతను నాకు గ్రీటింగ్ ఇవ్వడం ఏమిటండి ? మీరు పొరబడ్డారా? నేను పొరబడుతున్నానా :)

సవ్వడి చెప్పారు...

నేస్తం గారు! మీరే పొరబడుతున్నారు. మొదటి భాగంలో చెప్పారు కదండి.. అతను కాస్ట్-లీ గ్రీటింగ్ ఇస్తే.. స్వాతికి ఇచ్చేసారని చెప్పారుగా!

ఏంటీ నేను మొత్తం అన్నీ ఫాలో అవుతున్నానో లేదో టెస్ట్ చేస్తున్నారా! మీ ఎ.సి.ని అంత మాట అంటారా!

swapna@kalalaprapancham చెప్పారు...

abbayilu ante intha bayapadutara miru.

నేస్తం చెప్పారు...

సవ్వడి గారు అది ఫ్లాష్ బ్యాక్ అని చెప్పాను కదా ,ఆ అబ్బాయి వేరు ఈ అబ్బాయి వేరు ..అతని పేరు శ్రీను ..ఇతని పేరు తెలియక గీతాంజలి అని పెట్టాం..
స్వప్న భయం అంటే అమ్మా నాన్నలంటె భయం..:)ంస్స్ ఇంటి సంగతి చాలా సార్లు చెప్పాను కదా .. అయినా వాళ్ళు చెప్పేది కూడా మంచికే కదా..

Nobody చెప్పారు...

Hahaha. Nice serial :-)

సవ్వడి చెప్పారు...

అర్థమైంది. నేనే పొరబాటుపడ్డాను. ఒకె.. బాయ్!

TEJALANKA చెప్పారు...

hello madam bagindhi mee story...:)

TEJALANKA చెప్పారు...

hello madam bagundhi mee story...

నేస్తం చెప్పారు...

అరె తేజు నువ్వు నువ్వేనా.. అన్నట్లు అది నీ బ్లాగేనా..ఆ పోస్ట్ ఏంటిరా నాయనా..సగం చదివేసరికి భయం తో మా ఆయన వచ్చాక చదువుదాం అని ప్రక్కన పెట్టాను..అన్నట్లు నీ మెయిల్ అయిడి ఒక సారి పోస్ట్ చేయి లేదా నేను నీకు ఇచ్చిన అయిడీకి రిక్వెస్ట్ అన్నా పంపు.. :) అన్నట్లు తెలుగు ఫాంట్ ఎలా వచ్చిందిరా ?ఎలా చదివావ్ :)

జయ చెప్పారు...

అబ్బా! మళ్ళీ ఏ ట్విస్ట్ లు పెట్టకుండా, తొందరగా ముగింపు ఇచ్చేయండి బాబు. చివరిదాకా ఆగుదామనుకున్నా కాని ఇంక తాళ లేక రాసేస్తున్నాను.

Viswanath చెప్పారు...

mee peru harika ani endhuku doubt vachindhantey orkut lo harika ane ammayi...webpage option lo mee blog address pettindhi tharuvatha thelisindhi aame kuda naku laage mee blog fan ani

అజ్ఞాత చెప్పారు...

50 కామెంట్ల పండగ :)