14, ఫిబ్రవరి 2010, ఆదివారం

ప్రేమ కధలు పలురకాలు - 4



ఆ రోజంతా అలా తిరుగుతున్నానే గాని భయం భయం గా అనిపించింది..ఏవో ఆలోచనలు.. ఒక ప్రక్కనుండి దైర్యం ...'నేనేం తప్పు చేయలేదే' ..వాడు నావెనుకపడితే నాదా తప్పు ?నేనెందుకు భయపడాలి అనిపిస్తుంది..మరొక ప్రక్క ఇప్పుడే ఇంత చనువు తీసుకుంటున్నారు ,నాలుగు రోజులు ఆగితే ఇంకేం అంటారో ??ఏదో రోజున ఖచ్చితంగా నువ్వంటే నాకిష్టం అని డైరెక్ట్ గా చెప్పేస్తాడు ఏమో అని భయం..అప్పటి సంగతి కదా ,అంతవరకూ వస్తే నువ్వంటే నాకిష్టం లేదు అని చెప్పేద్దాం అని కాసేపు అనిపిస్తే , ఇన్నాళ్ళూ ఇహి హి.. హ హహ అని నవ్వుతూ వాడెదురుగా తిరిగి ,ఆనక తీరిగ్గా నువ్వంటే నాకిష్టం లేదు అని చెప్పితే, వాడు ఊరుకుంటాడా??వెనుకపడటం మానేస్తాడా ?? అని ఇంకాసేపు అనిపించేది..


చాలా మంది అమ్మాయిలు ఇదే పని చేస్తారు , వాళ్లకు ఇష్టం లేకపోయినా 'ఎవరో ఒక అబ్బాయి తన చుట్టూ తిరుగుతుంటే గర్వంగా ఎంజాయ్ చేసి 'చివరకు అబ్బే ,నాకలాంటి అభిప్రాయం లేదనో, ఇంకొందరు మరి కొంచం ఎక్కువ చేసి నేను నిన్ను అన్నయ్యలా భావిస్తున్నాననో అని చప్పున తీసి పడేసి పాపం వాళ్ళ మనసులు ఎంత గాయం చేస్తారో ఊహించరు.." ముందే నువ్వంటే నాకిష్టం లేదన్న భావన వాళ్ళలో కలిగించరు" అదే పలు సమస్యలకు కారణం అవుతుంది ..(కొంతమంది అబ్బాయిలు ఒక వేళ అలా చేసినా పట్టించుకోరు,అది మరో సమస్య అనుకోండి ) బహుసా ,అలాంటి గిల్టీ ఫీలింగ్ అనుకుంటా స్థిమితంగా ఉండనివ్వడం లేదు నన్ను ..

సరే ,ఎలాగోలా దీనిలో నుండి బయట పడాలి.. ఎవరన్నా హెల్ప్ చేస్తే బాగుండును,ఏదన్నా సలహా ఇస్తే బాగుండును అనిపించింది..ఎవరికి చెప్పాలి ??? స్వాతికి చెప్పితే? అమ్మో !!దానికా ...కొంచెం కూడా ఆలోచించదు.. సలహా కాదు కదా ,ఇన్నాళ్ళు నేను దానికి చేసినదానికి అంతకంతకు బదులు తీర్చుకుంటుంది.. నన్నేదో ఏడిపిస్తున్నాను అనుకుని పూర్తిగా ముంచేస్తుంది.. ఇప్పటి వరకు వాడికి కనీసం డవుటుండి ఉంటుంది నా కిష్టమా ?లేదా? అని ,ఇది కన్ఫర్మ్ చేసేస్తుంది ఇష్టం అని .. ఇంకేమన్నా ఉందా ...వద్దు,వద్దు ... ఇంకెవరున్నారు?? పోనీ అక్కకు చెప్తే ?? ...

అవును ,అక్క అయితే చిటికలో సమస్య తీర్చేస్తుంది అనిపించింది కాని ,అది నాన్నపార్టి..నాన్నకు చెప్పేస్తుంది ఏమో ??.. చిన్నపుడు ఎవరో దానికి లెటర్ ఇస్తే చదవడానికి అర్ధం కాక ,నాన్నకు ఇచ్చి చదవమని చెప్పిన ఘనురాలది ..దానికి బోలెడు ధైర్యం ..నాన్న అంటే అస్సలు భయం లేదు ..నాన్నా అంతే, అది ఏమన్నా ఏమనరు.. అది చేసినతప్పు మేము చేస్తే మాత్రం అక్షింతలే మాకు..ఒక సారి ఎక్కడికో వెళుతుంటే ఎవరో అబ్బాయి దాన్ని చూసి ఏదో అన్నాడట ...ఇదేమో నాన్నా వాడు చూసారా ఇలా అన్నాడు అని టక్కున పిలిచి చెప్పింది..అసలే నాన్నకు హిట్లర్ అని పేరు చిరంజీవిలా .. సైకిల్ మీద పారిపోబోతున్న వాడి చొక్కా పట్టుకుని కిందకు లాగి గూబ గుయ్యిమనిపించారు ...

సరే ఇదేదో బాగుంది కదా అని ,నేనూ ఒక మారు నాన్నతో వస్తూ ఎవరో ఏదో అంటే ( అలాంటి సందర్భం గురించి చాలానాళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చిందిలెండి..పక్కన పెద్ద వాళ్ళు ఉండగా ఎవరు ఏమనరు కదా ) నాన్నా !చూడండి వాడేదో అంటున్నాడు అనగానే ,నిన్నెవరే దిక్కులు చూడమన్నాడు ,కాళ్ళు విరక్కోడతా .. సరిగ్గా కూర్చో ..అని ఒక్క కసురు కసిరారు ..అంతే, పొరపాటున కూడా మళ్లీ అక్కను అనుకరించే సాహసం చేయలేదు.:(

'చక్కగా ఉన్న మొహానికి ఎందుకే అడ్డమైన చెత్తా రాస్తావు 'అమ్మ తిడుతూనే ఉంది అక్క పట్టించుకోకుండా ఒక గిన్నెలో పసుపు,శనగ పిండి ,రోజ్ వాటర్ ,తేనే ఏంటో ఏంటో మిక్స్ చేస్తూ గదిలోకి వచ్చింది ..ఇది ఒకర్తి ,మా అందరికన్నా తెల్లగా ఉన్నా ఇంకేంటో చేసేస్తూ ఉంటుంది ఆ మొహానికి తిట్టుకుంటుంటే సడెన్ గా లైట్ వెలిగింది.. ఇది బాగుంటుంది,తెల్లగా ఉంటుంది,బాగా చదువుతుంది ,అన్నిటికంటే ముఖ్యం గా కో ఎడ్యుకేషన్ లో చదివింది ..ఖచ్చితంగా దీనికి ఇలాంటి సమస్యలు ఎదురయ్యే ఉంటాయి ..అలా అనుకోగానే మెల్లగా దాని దగ్గరకొచ్చి అక్కా! మరి మీ కాలేజ్ లో ఎవరూ నిన్నేమనేవారు కాదా అన్నాను.. ఎందుకనే వారు కాదు ,మా సార్లకి ,మేడంస్ కి నేనంటే ఎంత ఇష్టమో తెలుసా, నా రికార్డ్స్ అందరికంటే నీట్ గా ఉండేవి ,మేత్స్ సార్ అయితే మరీ అభిమానించేవారు ..ఇది డబ్బా మొదలుపెట్టేసింది..

ఎహే!! ..అది కాదు 'అబ్బాయిలు ఎవరూ నీ వెనుక పడేవారు కాదా' అన్నాను.. అది మొహానికి ఆ పేస్ట్ పూసుకుంటూ ..అదా ,మా క్లాస్ లో వాళ్లకి అంత ధైర్యం లేదులే, మాది డిగ్రి కాలేజ్ కాదు కదా ,ఇంటర్ అబ్బాయిలకు మా సార్లంటే మహా భయం ..ప్రాక్టికల్స్ లో మార్కులు కత్తిరించేస్తారని ..పైగా సైన్స్ అబ్బాయిలు చాలా మంచోళ్ళే.. అలాంటి వెధవ వేషాలు వెయ్యరు ...ఆ ఆర్ట్స్అబ్బాయిలు ఉంటారు కదా ,వెధవలకి పని పాటా ఉండదు ,వచ్చే పోయే అమ్మాయిలని కామెంట్ చెయ్యడం తప్పా విసుక్కుంటూ అంది..

ఇది ఒకర్తి ..ఆర్ట్స్ అంటేనే పడదు..ఆ స్వాతిది కూడా అంతే ..వీళ్ళ దృష్టిలో ఆర్ట్స్ తీసుకున్న వాళ్ళంతా చదువు ,సంధ్య లేని వాళ్ళు..ఒత్తి పోకిరి వాళ్ళు ..ఇద్దరినీ ఒక చోట కూర్చో పెడితే చాలు సైన్స్ గ్రూప్ ని పొగిడేసుకుంటూ ,ఆర్ట్స్ గ్రూప్ ని తిట్టుకుంటూ గంటలు గంటలు గడిపేస్తారు .. అందుకేనేమో ఇద్దరికీ ఇంటర్ అయిపోగానే పెళ్ళిళ్ళు అయిపోయి ,చివరకు ఆ ఆర్ట్స్ నే గతి అయ్యి డిగ్రీలు గట్టెక్కించారు.. అందుకే ఊరికే ఎవరినీ అనకూడదన్నమాట . .

సరే మామూలు రోజుల్లో ఈ విషయం మీద గొడవేసుకునేదాన్ని కాని ,ప్రస్తుతానికి అవసరం నాది కదా .. అందుకే ,అదేలేక్కా ..ఆ ఆర్ట్స్ వాళ్ళే నీ వెనుకాలా పడలేదా ??ఆరాగా అడిగాను..ఏంటీ !!! ,ఆ పోకిరిగాళ్ళు ,ఆ చదువు సంధ్య లేనోళ్ళు నా వెనుక పడటమా!!! ఎంత ధైర్యం ?? .. మా సైన్స్ అమ్మాయిలను చూడటానికే భయపడేవారు తెలుసా అంది .. ఒసినీ సైన్స్ తగలబడ అని మనసులో అనుకుని .. "ఒకవేళ పడితే ??" ..మళ్లీ,మళ్లీ అదే ప్రశ్న ఓపిగ్గా అడిగాను .. " నాన్నకు చెప్పి చితక్కోట్టిన్చేసేదాన్ని "ఇంక మాట్లాడించకు..అని కళ్ళ మీద రెండు దోసకాయ ముక్కలు గుండ్రం గా కట్ చేసినవి పెట్టేసుకుని పడుకుంది ..ఇంకేం మాట్లాడిస్తాను నా మొహం అనుకుని బయటకు వచ్చేసా...

మెట్ల మీద కూర్చున్నా గాని ఏం చెయ్యాలో అర్ధం కాలేదు.. అసలే గీతాంజలి గాడు చదవడం లేదు..దీనికి చదువు ,సంధ్య లేని వాడు అని తెలిస్తే బిపి పెరిగిపోతుంది.. నాన్నకు చెప్పేస్తుంది ..వెంటనే నాకు గీతాంజలి గాడు కళ్ళ ముందు కనబడ్డాడు దీనంగా ..'గట్టిగా తూస్తే పాపం కిలో మాంసం కూడా రాదు వాడికి '.. వాడి సంగతి సరే ,నా విషయం ఏంటి?? .. పోనీ ఇంట్లో చెప్పకుండా వదిలేస్తే ,ఖచ్చితంగా ఏదో రోజున తెలుస్తుంది..అప్పుడన్నా వాడిని తంతారు ..ముందే ఎందుకు చెప్పలేదు? అంటారు ,చదువు లేదు ఏమి లేదు నోరు మూసుకుని ఇంట్లో కూర్చో అని అన్నా అంటారు ..అది కూడా ఒక తంటా ..ఇదంతా ఎందుకు నాన్నకు నేనే మెల్లిగా చెప్పేదాం అనుకున్నా..


నాన్న సంగతి నాకు బాగా తెలుసు ..లాయర్ లా సవాలక్ష ప్రశ్నలు వేస్తారు .. కనీసం వాడు నాతో ఒక్క మాట అన్నాఅనలేదు.. వాడు నన్ను ఏడిపిస్తున్నాడని ఎలా చెప్పేది???..అసలే అందరం అమ్మాయిలం అవ్వడం వల్లో,లేదా తల్లిదండ్రులకు పిల్లల మీద ఉన్న సహజ భయం వల్లో పది సార్లు చెప్తారు జాగ్రత్తలు మాకు .. అలా ఆలోచిస్తుంటే టక్కున దీపావళి రోజున అందరు పడుకుంటే ,నేనే పెద్ద పని ఉన్నట్లు బయటకు వచ్చి చూడటం గుర్తు వచ్చింది .. ఆ రోజు నాన్న లోపలకు రమ్మని కసిరారు అందరి ఎదురుగా ..దెబ్బకు గిర్రున తిరిగింది తల నాకు .. అయిపోయింది..వాడి కోసమే వచ్చాను అనుకుంటారు .. ఈ ఒక్క విషయం చాలు ..నా మీద అనుమానం రావడానికి ... వాడు నా వెనుక పడుతున్నాడన్నా విషయం ఇంట్లో వాళ్ళందరికీ తెలిస్తే ప్రతి ఒక్కరు నన్నే గమనించడం మొదలు పెడతారు..మా ఇంట్లో తుమ్మినా,దగ్గినా అందరికి తెలియాల్సిందే .. ఒక్క కుటుంభంతో ముడిపడిలేదు మా ఇల్లు ..నాలుగు రకాల మాటలు వచ్చేస్తాయి ..నాన్నకు మాట వస్తే ఇంకేమన్నా ఉందా?? ..తట్టుకోలేరు ..ఎలా?

ఎందుకో ఏడుపొచ్చేసింది..దేవుడా దేవుడా ఏం గొడవలు లేకుండా ఈ సమస్య గట్టేక్కెల చెయ్యవా అని దణ్ణం పెట్టేసుకున్నా ..గీతాంజలి గాడిమీద చాలా కోపం వచ్చేసింది.. అంతా వాడి వల్లే ..వాడిని బాగా తన్నాలి అప్పుడు గాని బుద్ది రాదు ..తిట్టుకుని ,తిట్టుకుని పడుకున్నా .. రాత్రంతా నిద్ర పట్టలేదు ..ప్రొద్దున అసలు కాలేజ్ కి వెళ్ళాలనిపించలేదు ..ఏం కారణం చెప్పి మానేయాలో తెలియలేదు..ఈ స్వాతిది టంచనుగా టైముకి వచ్చేస్తుంది ..ఒక్క రోజుకూడా మానదు..ముభావం గా ఉండి తయారవుతున్నాను ... మరి ఎప్పటి నుండి గమనిస్తున్నారో నాన్న..ఇలారా అని పిలిచారు..ఏంటి నాన్నా అన్నాను ..ఏంటమ్మా మొహం అలా ఉంది.. నీరసం గా ఉందా అన్నారు దగ్గరకు పిలిచి..ఆ మాత్రం ప్రేమకే కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసాయి.. చలేస్తుంది నాన్న .జ్వరం వచ్చిందేమో అన్నాను.. నుదిటి మీద చెయ్యి వేసి ఏమి లేదమ్మా, ఉండు ధర్మామీటర్ తెస్తా అన్నారు ..

ఏంటి జ్వరానికే ఏడ్చేస్తున్నావా ??ఇంత పిరికోళ్ళేటే బాబు ..రేపు అత్తారిళ్ళదగ్గర ఇలాగే చేస్తే మిమ్మల్ని కాదు మమ్మల్ని అంటారు ..అమ్మతిడుతుంది..నువ్వు ఇంక ఆగు ,పాపం దానికెంత బాధగా ఉందో ఏడుస్తుంది ..అది ఆలోచించవే ..నాన్న కసిరి నా నోటికి ధర్మా మీటర్ అందించారు.. ఇలాగే వెనకేసుకుని రండి ..ఇది మరీ తట్టుకోలేదు ఏ చిన్నవిషయాన్ని..అమ్మ తిడుతూ వెళ్ళిపోయింది .. హమ్మయ్యా ,అనిపించింది ..అసలే నిన్న ఎండలో బయటకు వెళ్ళకు అని ఎన్ని సార్లు చెప్పినా వినకుండా సార్ ఇంటికి వెళ్ళా ..ఆ విషయం ఎక్కడ అనేసి అందుకే జ్వరం వచ్చింది అంటుందేమో అని భయమేసింది..

ఏమి లేదమ్మా,నార్మల్ ఉంది ..పోనీ ఒక పని చేద్దాం ..ఈ రోజుకి కాలేజ్ మానేసేయ్ ..నేను స్నానం చేసి వచ్చాక మళ్లీ చెక్ చేద్దాం .. జ్వరం ఉంటే హాస్పిటల్ కి తీసుకు వెళతా సరేనా అంటూ నాన్నవెళ్ళిపోయారు..ఎందుకో టెన్షన్ తగ్గినట్లు అనిపించింది .."అనవసరం గా భయపడుతున్నానేమో " అనుకున్నాను.. ఈ లోపల స్వాతి వచ్చింది..నా నోట్లో ధర్మా మీటర్ ,ఇతర తతంగాలు చూసాకా ..ఏంటి జ్వరమా? అంది ..ఉహు ..అలా అనిపిస్తుంది అన్నాను.. అయితే రావా కాలేజ్ కి అంది.. రాను అన్నాను.. నీతో ఒక విషయం చెప్పాలి అంది గుసగుసగా .. నాకు తగ్గుతున్న టెన్షన్ మళ్ళ పెరిగిపోయింది.. గీతాంజలి గాడి గురించా?? అన్నాను భయం గా .. ఆ .. నీకెలా తెలుసు అంది ఆక్చర్యం గా .. కొంపదీసి దీనికి విషయం తెలిసిపోయిందా ??.. ఏం జరుగుంటుంది ?? అమ్మా ,నేను కాలేజ్ కి వెళతాను జ్వరం తగ్గిపోయింది అని అమ్మ వద్దన్నా ఇంపార్టెంట్ క్లాస్ ఉందని చెప్పి స్వాతిని తీసుకుని బయటకు వచ్చేసాను ..

29 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

ఆహా..., మళ్ళీ టపా అదుర్స్ ..., మళ్ళీ ఇంకో ట్విస్ట్.., ఇంకా ఎన్ని పార్ట్స్ వున్నాయండి బాబు, ఎప్పటి లానే చాలా బావుంది టపా...

సవ్వడి చెప్పారు...

ఏ భావాన్ని చెప్పాలనుకున్నా మీకు మీరే సాటి. నేను మీలాగే బాధ పడ్డాను. బాగా రాసారు. నా మాట విని కథలు రాయడం ప్రారంభించండి. నేను మిమ్మల్ని రచయిత్రిని చేస్తాను. ఫిక్స్ ఐపోయాను. చిన్న చిన్న కథలు రాయండి... ఓ నాలుగు ఐదు రాసేసరికి ఎలా రాయాలో అర్థమైపోతుంది. మనం మాట్లాడే మాటలను ఇన్వెర్టడ్ కామాస్(" ")లో పెట్టండి చాలు. అంతే రాయడం వస్తుంది. ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పండి.

గీతాచార్య చెప్పారు...

ఏంటి నేస్తం? నేను లేకుండా చూసి ఇన్ని వ్రాశారు? :D

రాజ్ కుమార్ చెప్పారు...

kevvvvv....keka....
Inkaa enni bhaagalandi...?? ina parledu...ila weekly serial la kaakunda..dialy serial gaa raayochukadandi....

Rajkumar

రఘు చెప్పారు...

ఎందుకండీ మా మీద ఇంత కక్ష.ఎంత బిజిగా వున్న మీ బ్లాగు కి వచ్చేలా చేస్తున్నారు,చిన్నప్పుడేప్పుడో DD1లో శుక్రవారం చిత్రలహరి కోసం ఎదురు చూసినట్టుగా ఉందండి మా పరిస్తితి.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

బాగా రాస్తున్నారు...బాగుంది టపా...కధ అంటే ఇలా రాయాలి..అలా రాయాలి లాంటి చట్రంలో బిగిసిపోకుండా మీ సహజశైలిలో అందర్ని మెప్పించి రాస్తున్న మీకు నిజంగా అభినందనలు.

శ్రీలలిత చెప్పారు...

ఆర్ట్స్ గ్రూప్, సైన్స్ గ్రూప్ వాళ్ళ గురించి సరిగ్గా చెప్పారండీ. నిజంగానే సైన్స్ గ్రూప్ తీసుకుంటే చాలా గొప్పగా ఫీల్ అవుతుంటారు.కదా...

వేణూశ్రీకాంత్ చెప్పారు...

బాబోయ్ ఇలా సస్పెన్స్ లో పెట్టి ఆడుకుంటే ఎలాగండీ బాబు :-)

నాగప్రసాద్ చెప్పారు...

మిమ్మల్ని "బ్లాగు హింస చట్టం" కింద అరెస్టు చెయ్యాలి. ప్రకెబ్లాస కోర్టులో విచారించి, మిమ్మల్ని ఆర్నెల్ల పాటు బ్లాగుల వంక కన్నెత్తి కూడా చూడకూడదని కఠిన బ్లాగాకార శిక్ష విధించాలి. :)))

Narendra Chennupati చెప్పారు...

మీరు ఇలా ముక్కలు ముక్కలు గా చెప్పటాన్ని తీవ్రం గా కండిస్తున్నానండి నేస్తం గారు...
టపాలు ఎప్పటిలాగే చాలా బాగున్నాయి.......

భావన చెప్పారు...

రామచంద్రా... ఎన్ని కష్టాలండీ బాబు... మేము మాత్రం చదువుకునేప్పుడు ఆర్ట్స్ వాళ్ళను చూసి కుళ్ళుకునే వాళ్ళం, క్లాస్ లో వినక పోతే ప్రాక్టికల్స్ లో మార్కు లు తగ్గిస్తారన్న బాధ లేదు, ఎప్పుడు చూడూ సినిమాలన్నివాళ్ళ పాలే మేమేమో లెక్కల క్లాస్ లోనే అని. ;-) మొత్తానికి పెద్ద ఎత్తునే కష్టం వచ్చింది పాపం

Karthika చెప్పారు...

esariki ayipotundi anukunnaa..nestham garu :).

anyway me anni posts la idi baagundi kaani anitikante peddadi ide anukuntta.

రాజ్ కుమార్ చెప్పారు...

@nagaprasaad gaaru..
మిమ్మల్ని ఆర్నెల్ల పాటు బ్లాగుల వంక కన్నెత్తి కూడా చూడకూడదని కఠిన బ్లాగాకార శిక్ష విధించాలి

Siksha... Nestam gaariki kaadu.. Manaki...:):)

Ram Krish Reddy Kotla చెప్పారు...

haha..bagundi...5th part epudu...6th epudu..7th epudu...Nth part epudu...enti madam, novel raddamani try chestunnara??..edo oka idea ivvochuga maaku...oka 50 parts raseyyandi..anni parts kalipi print outs teesi novel ga chesi..publish cheddam...vachina money lo 50% naku...sarena??..:)

Sirisha చెప్పారు...

chala bagundhi andi...continue cheyyandi ippatlo apakandi....

నేస్తం చెప్పారు...

ముందుగా అందరికి పెద్ద సోరీ ..ఈ రెండురోజులు అస్సలు తీరిక లేక సమాధానాలు ఇవ్వలేదు

రాజ గారు థేంక్యూ థేంక్యూ..
సవ్వడి గారు రాద్దాం రాద్దాం..ఏంటి రచయిత్రిని చేసేస్తారా ..మీరు నేను చదువుకోవాలి ఇంక ఆ కధలు :)
గీతాచార్య గారు మీరున్నారేమో అనేసుకుని వ్రాసేసా..అడ్డెడ్డే ..హెంత పని అయ్యింది ..అదే ఏంటబ్బా పొఫెసర్ గారు బొత్తిగా శీతకన్నేసారు నా బ్లాగ్ వైపు అనుకున్నా :)
రాజ్ కుమార్ గారు డైలీ సీరియలా ... భలెవారే .. అసలు ఈ కధ టకటకా పోస్ట్ చేసేసా.. లెకపోతే నా సంగతి తెలుసుగా నెలకోపోస్ట్ అంటేనే బద్దకం చూపిస్తున్నా

నేస్తం చెప్పారు...

రఘు గారు చిత్రలహరి తో నా పోస్ట్ పోల్చారంటే ...నన్ను నేను శబాష్ అని మెచ్చెసుకొవాలి :)
శేఖర్ నిజమే అసలేమాత్రం ఉహించలేదు ఇలా వ్రాద్దాం అలా వ్రాద్దాం అని ..మొదటిపోస్ట్ లోనే అంతా ఇరికించి వ్రాసేద్దాం అనుకున్నా కాని కుదరలేదు.. అలా ఎపిసోడ్లు ఎపిసోడ్లు వచ్చేస్తున్నాయి సీరియల్లా..
శ్రీలలిత గారు నిజమేనండి బాబు .. వాళ్ళకు వీళ్ళకు అస్సలు పడేది కాదు
వేణు అబ్బెబ్బే మీకసలు సస్పెన్స్ బొత్తిగా అలవాటు లేదనుకుంటా.. మన తెలుగు డైలీ సీరియల్స్ ఓ రెండు వరుసగా చూపించాల్సిందే.. :)

నేస్తం చెప్పారు...

నాగ ప్రసాద్ :D మరీ అంత కోపమే, సరే నెక్స్ట్ ఎపిసోడ్ తో ముగించేస్తా..
నరేంద్ర గారు అలా తొందరపడి ఖండించకండి.. తరువాత ఎపిసోడ్ తో ఎండ్ చేసేస్తా :)
భావన గారు ఆర్ట్స్ వాళ్ళు అలా సినిమాలకు ,షికార్లకు తిరుగుతుంటే సైన్స్ వాళ్ళు లాబ్స్ లోను,రికార్డ్ వర్క్ లోను పడి కోవలసి వస్తుందనే సగం కోపం..అది కాకుండా మా కాలేజ్ లో అయితే ఆ ఆర్ట్స్ వాళ్ళల్లా చదువుసంద్య లేకుండా పనికిమాలిన వాళ్ళల్లా తిరగకండి అని సైన్స్ టీచర్స్ యె అనేవారు పిల్లలతో.. :)
నిజమే కార్తీక అలా సా....గి పోతుంది పోస్ట్ :)

నేస్తం చెప్పారు...

వేణు రాం :D
కిషన్ ఇంక ఒకటే పార్ట్ లో అవ్వగొట్టేస్తా.. ఈ కధని నవలగా పబ్లిష్ చేసేద్దామనే ..మొదటి, ఆఖరి రీడర్ మీరే అవుతారు.. ఎందుకంటే నేను కూడా చదవను :P
శిరిషా ..హ హ నీకెంత ఓపిక నువ్వొక్కదానివే ఈ మాట అన్నది :)

గీతాచార్య చెప్పారు...

శీత కన్నే కాదు, రాముడి పన్ను కూడా తెలియదు నేస్తం వెయ్యటానికి. ఒక భీకరమైన ట్రిప్ ముగిసిందీ మధ్యనే :D

పవన్ చెప్పారు...

ఇదొవ బాగం ఎప్పుడు అండి

Viswanath చెప్పారు...

baagundhi andi...chaala interesting ga undhi

కౌటిల్య చెప్పారు...

హ్మ్...నేస్తం గారూ..
ఊరెళ్ళానండీ....ఇప్పుడే చదివా మీ టపా...మళ్ళా సస్పెన్సా???....స్వాతి,గీతాంజలిగాడు వీళ్ళ సంగతేమోగాని,నేను,మన బ్లాగ్లోకమంతా..చా..లా..టెన్షన్ పడిపోతున్నామండీ...ఇంకో విషయం....నేను పక్కా సైన్సు స్టూడెంటునైనా,నాకు ఆర్టు అంటేనే ఇష్టం...వాళ్ళు కాలేజ్ లైఫ్ ని ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో....

సవ్వడి చెప్పారు...

నేస్తం గారు ముందు మీరు రాయండి. చదివేవాళ్లు ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది. మీ అన్ని టపాలు చదివాక ఎవరూ అలా అనరు. ముందు దాసేయండి. తరువాత సంగతి తరువాత చూద్దాం.

సవ్వడి చెప్పారు...

నేను ఆర్ట్స్ గ్రూప్ వాడినే ఐనందువల్లో ఎందుకో తెలీదు కాని ఆర్ట్స్ గ్రూప్ వాళ్లే ఇష్టం. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఆర్ట్స్ గ్రూప్ వాళ్లే గొప్పవారంటాను. దేశ చరిత్ర గురించి రాజ్యాంగం గురించి ఇలా చాలా విషయాలు తెలుస్తాయి. మీరేమంటారు.

మా కాలేజ్ లో మాత్రం మాకన్నా సైన్స్ గ్రూప్ వాళ్లే ఎక్కువ ఎంజాయ్ చేసారు. కారణం ఏమంటారు..

Rajendra Prasad(రాజు) చెప్పారు...

నేను ఈ రోజే నాలుగు భాగాలు చదివాను.లేటుగా చదివినందుకు నెను చాలా హ్యాపీ,ఎందుకంటే

Rajendra Prasad(రాజు) చెప్పారు...

అందరి లాగా నాకు టెన్షన్ కొన్ని రోజులు తగ్గింది కాబట్టి..:)
మీకు ఏమి తెలుసండి...ఇష్టపడే అమ్మాయి కోసం దారిలో ఎదురు చూడటం,తనకు నచ్చిన కలర్ లో డ్రెస్స్ వేసుకోవటం,తనకు చెప్పాలనుకొనే మాటలు తనకి వినపడేటట్టుగా ఫ్రెండ్స్తో,గోడలతో చెప్పటం...ఇవన్నీ తిరిగిరాని,మరపురాని గురుతులే.
మీరు ఏమన్న అనుకోండి నా ఓటు గీతాంజలి గాడికే...
నా ఇంటెర్మీడీట్ రోజులు అంటే 6 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి వచ్చేసాను... :)
ఆఖరి ఎపిసోడ్ అని సగం టెన్షన్ తగ్గించారు... :)

నేస్తం చెప్పారు...

పవన్ అయిదవ బాగం ఈ రోజే :)
కౌటిల్య గారు :)
గీతాచార్యా ఏంటండి అంత హ్హీకరమైన ట్రిప్
విశ్వనాద్ :)
రాజేంధ్ర గారు అయిదవ బాగం కూడా రాసేసా..
>>> మీకు ఏమి తెలుసండి...ఇష్టపడే అమ్మాయి కోసం దారిలో ఎదురు చూడటం,తనకు నచ్చిన కలర్ లో డ్రెస్స్ వేసుకోవటం,తనకు చెప్పాలనుకొనే మాటలు తనకి వినపడేటట్టుగా ఫ్రెండ్స్తో,గోడలతో చెప్పటం...ఇవన్నీ తిరిగిరాని,మరపురాని గురుతులే..
:) నేను కాదన్నానా.. ఇవన్నీ సహజమే ఒక వయసులో..కాకపోతే అంత స్వచ్చమైన.అమాయకమైన మనసులు ఈ రోజుల్లో ఆడపిల్లలు,మగపిల్లలు ఇద్దరికీ లేవూ చాలా వరకు

పరిమళం చెప్పారు...

హ్మ్మ్.....ఈ మధ్య కాస్త నెట్ కి అందుబాటులో లేను ఉండండి రెండోదికూడా చదివేసి అప్పుడు కామెంట్ రాస్తా :) :)