2, నవంబర్ 2009, సోమవారం

ఆహా ఏమి రుచి (కార్తీక వనభోజనాల స్పెషల్ )


జ్యోతిగారి పుణ్యామా అని మళ్లీ వంటల మీద పోస్ట్ తో మీ దగ్గర కొచ్చేసాను ..మరి కార్తికమాసం కదా ,వనభోజనాలు పెట్టు కోవలసిందే ..ఏం కూర చెప్పబోతున్నానో తెలుసా..సా..సా.. టట్ట డాయ్ ..ఈ రోజు చెప్పబోయే కూర గుత్తివంకాయ కూర..'ఓస్ 'గుత్తొంకాయ కూరా అనేయకండి..నా మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటాయ్ ..నా కొచ్చిన వంటల్లో కాసింత బాగా వచ్చినది అదేమరి.. అయితే మిగిలిన వారిలా అంత వీజీగా కూర గురించి చెప్పేస్తాననుకున్నారా ..అమ్మా ఆశ,దోస,పిజ్జా,బర్గర్ .. అసలు నేను గుత్తొంకాయ కూర ఎలా, ఎప్పుడు, ఎందుకు నేర్చుకున్నానో చెప్పక పొతే నాకు నిద్ర పట్టదు..మీరు విని తీరాల్సిందే ...తప్పదు..


మరి పుట్టింట్లో నా వంట ప్రావిణ్యం గురించి ఓ మారు దమయంతి హిడింభి పాకం అనే పోస్ట్ లో చెప్పాకదా ..అలాంటి సమయం లో ఒక శుభముహార్తాన పెళ్లి చేసుకుని అత్తగారి ఇంటికి వెళ్ళాకా ,మా అమ్మ మాటి మాటికీ, నువ్వు వంట నేర్చుకోక పొతే పెళ్ళయ్యాక అత్తవారింట్లో తెలిసొస్తుంది అని ఎందుకనేదో బాగా తెలిసొచ్చింది..రావడం ,రావడమే మా అత్తగారు అమ్మాయ్, నేను అలా బయటకు వెళ్ళొస్తా ,నువ్వు 'దోసకాయ -పెసరపప్పు' వండేయ్ అని చెప్పేసి చక్కాగా వెళ్లిపోయారు..మా ఇంట్లో అసలు దోసకాయ వండనే వండరు ..దానికి తోడు పెసరపప్పా!!.. ఎలా? అనుకునేంతలో మా ఆయన గుర్తు వచ్చారు ..ఉహు ..ఆయనగారిని అడగడం శుద్ద దండగ .. ముందు రోజు, మొదటి సారి అన్నం వారుస్తుంటే ,గంజి చేతి మీద పడి, ఏమండీ!!! నా చేతి మీద గంజి పడింది..బాబోయ్ , నా చేతి మీద గంజి పడింది.. అని కంగారుగా అంటే ..లెక్క ప్రకారం అయ్యో ,అయ్యో బర్నాల్ ఏది ,ఆయిల్ ఏది,ఎంత కష్టం వచ్చింది నీకు అని అనాలా,వద్దా??? ..అబ్బే .. అంటే నీకు అన్నం వార్చడం కూడా రాదా బుజ్జీ ??అన్నారు బోలెడు హాచ్చర్య పోతూ ..నేను 'మా టివి సుమ' లా అవాక్కయిపోయి , ఓరి 'దుర్మార్గుడా' అని అర్ధం వచ్చేలా ఒక చూపు చూడగానే ..అదీ ..ఇప్పుడు సైకిల్ నేర్చుకున్నామనుకో ,నాలుగైదు దెబ్బలు తగిలాకే నేర్చుకోగలం ..వంట కూడా అంతే..అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది ..అదేం పెద్ద విషయం కాదు అని తేల్చేసారు.. అలాంటి నా శ్రీవారిని ఈ విషయం లో సలహా అడిగితే ఇంకేమన్నా ఉందా ??..


సరే ,వంట గదిలో కాలుకాలిన పిల్లిలా కాసేపు తచ్చాడాక ,ఎదురుగా గుమ్మంలో కుర్చీలో కూర్చుని ఏదో చదువుకుంటున్న మా మరిది గారు కనిపించారు.. అతనిని అడిగితే బాగుంటుందా ??.. వండకుండా మా అత్తగారు వచ్చేవరకు కూర్చుంటే ,ఆవిడ ఏమనుకుంటారో? .. పైగా భోజనాల వేళయింది ..సరే తప్పదు అనుకుని డైరెక్ట్ గా మా మరిది గారి దగ్గరకు వెళ్లి నించున్నా .. నన్ను చూడగానే చెప్పండి వదినా అన్నాడు లేచి నించుంటూ .. ఒక సారి ' దోసకాయ పెసరప్పు' ఎలా వండాలో చెప్పవా అన్నాను ... అసలే 'ఉపోద్ఘాతం' లేకుండా డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేసరికి, మా మరిదికి అర్ధం కాక అరనిమిషం లో ఆరు ఎక్స్ ప్రేషన్స్ మార్చీ, చివరకు చిన్నగా నవ్వుకుంటూ రండి అని వంటగదిలో తీసుకు వెళ్లి ,మళ్లీ నేను ఎటువంటి షాక్ లు ఇవ్వకుండా కూర తనే వండేసి ,ఇలా వండాలి అని చెప్పి వెళ్ళిపోయాడు ...అలా ఆ గండం గట్టిక్కిన్దిరా దేవుడా అనుకుని ఊపిరి పీల్చుకుని రెండు రోజులు అవ్వక ముందే మళ్ళా మా అత్తగారు నాకు మరొక 'అగ్ని పరిక్ష ' పెట్టారు ..


ఓ రోజు ఆవిడ బయటనుండి రాగానే ఈ కూర వండేయ్ అని నా చేతిలో గులాబిరంగు జొన్నపొత్తు లాంటిది నా చేతిలో పెట్టారు.. అసలేంటో అది నాకు తెలియదు.. ఏంటండి ఇది అన్నాను అయోమయంగా..ఇది తెలియదా 'అరటిపువ్వు' అన్నారు..అసలు అరటి చెట్టుకి పువ్వు అనేది ఒకటి ఉంటుంది అని అప్పుడే తెలిసింది నాకు .. నీకీ కూర రాదా ??అన్నారు ఆమె..ఈ సారి రిస్క్ తీసుకోదలచుకోలేదు .. అత్తయ్య గారు కలలో గాని, ఇలలో గానీ ఈ కూర గురించి వినలేదు,కనలేదు, తినలేదు అని చెప్పేసాను ..మరేం పర్లేదు, నాక్కూడా తెలియదు .. మొన్నో పత్రికలో అరటి పువ్వు కూర గురించి రాసాడు ..అది తెస్తా ..చూసి వండేద్దాం ..'కమాన్ ఫాలో' మీ అనగానే ఆవిడ వెనుక బుద్దిగా వెళ్ళిపోయా ..

ఆ తరువాత ఏమని చెప్పను నా తిప్పలు .. ౩ నెలల పత్రికలన్నీ దుమ్ము దులిపి ముందేసుకుని ఏ పేజిలో ఏముందో చూసి , ఆ వంటకాన్ని వెదికి పట్టుకునే సరికి నాకు తాతలు కనిపించారు .. మా అత్తగారు ఆ పత్రిక ముందు పెట్టుకుని ..ముందు మనం అరటిపువ్వు వలిచి అందులో దొంగలని,పోలీసులని వేరు ,వేరు చేయాలన్నమాట అన్నారు.. ఒక్క నిమిషం ఏం అర్ధం కాలేదు.. ఈవిడ వంట ఎలా చెయ్యాలో చెప్తున్నారా? లేక సినిమా స్టోరి చెప్తున్నారా అనుకుని ,అత్తయ్యా ! వంట, సినిమా పేజి వెనుక వైపు ఉంది అన్నాను.. నాకు తెలుసు ..ఆ అరటి పువ్వు వలిస్తే లోపల తెల్లగా ఉంటాయ్ వాటిని పోలిసులంటాం ...వాటిని వలిస్తే లోపల నల్లగా ఉంటాయ్ అవిదొంగలన్నమాట ...అన్నారు..ఇదేం వంటరా బాబు అనుకుని , అలా కాసేపు దొంగా ,పోలీసుల ఆట ఆడాకా, ఒక కలవరాయి నా ముందు పెట్టి వేయించిన జీలకర్ర, ధనియాలు,ఎండుమిర్చి ఇంకా ఏమిటేన్టో ఒక్కొక్కటి ఇచ్చి నూరమన్నారు.. దెబ్బకు చేతులు పడిపోయి ఈ పత్రికోడిని తగలయ్యా ,ఆ వేసే వంటలేవో సింపుల్ గా అయిపోయేవి చెప్పచ్చుకదా ..ఇంత కష్టపడి తినకపోతే వచ్చే నష్టమేంటో అనుకుని, మొత్తానికి ఇద్దరం కలసి వంటకానిచ్చాం ...


తయారయిన ఆ కూర చూడగానే, నాకు అదేదేదో సినిమాలో శ్రీలక్ష్మి వంటలా " అరటికాయ లంబా,లంబా "అని దానికి పేరు పెట్టాలనిపించింది ..కాని నాకసలే పెద్దలంటే గౌరవమ్,అభిమానం మెండుకాబట్టి పైకి చెప్పలేదు..మద్యాహ్నం అందరం భోజనాలకు కూర్చోగానే మా మామ గారు నల్లటి ఆ లేహ్యాన్ని చూడగానే ,ఏంటమ్మా అది అని విషయం తెలుసుకుని ,మీ ఇద్దరు వండారా !!అయితే మీరే తినండి నాకొద్దు అని ఖరాకండిగా చెప్పేశారు ..ఆసరికే ముందు జాగ్రత్తగా మా మరిది ,ఆడపడుచు కంచాలు ప్రక్కకు పెట్టేసారు ..నాకు గాని వడ్డించారో కంచాలు లెగిసిపోతాయి మా ఆయన బాలయ్యలా పవర్ ఫుల్ వార్నింగ్ ఇచ్చారు.. పొండి బడాయి ..మీరు తినకపోతే నష్టమా ..రామ్మా మనిద్దరం ఎంచక్కా అంతా తినేద్దాం అని మా అత్తగారు నేను దీనంగా చూస్తున్నా సరే పట్టించుకోకుండా పెట్టేసారు..మొదటి ముద్ద నోట్లో పెట్టగానే నాకేంటో విశ్వ రహాస్యాన్ని చేధించిన అనుభూతి కలిగింది..ఒకటే చేదు పుట్ట...ఎలా ఉంది ?అన్న మా అత్తగారి మాటలకు ఎన్ని రకాలుగా తల ఊపచ్చో అన్ని రకాలుగాను ఊపేసా.. తరువాత తను నోట్లో పెట్టుకుని కాసేపు నాలాంటి ఎక్స్ ప్రెషన్ ఇచ్చాకా బాగుంది కాని ,కాసింత చిరు చేదు తగిలినట్లు ఉంది కదా అన్నారు.. ఏమనాలో తెలియక 'ఊ' అన్నాను ..రెండో ముద్ద నోట్లో పెట్టబోతూ ఏమనుకున్నారో ..ఈసారికి వద్దులే ,మళ్లీ బాగా చేసుకుని తిందాం అన్నారు కూర ప్రక్కకు తీసేస్తూ ..బ్రతుకు జీవుడా అనుకుని మా అత్తగారి మనసు మారక ముందే ఆ కూర డస్ట్ బిన్ లో పడేసి వచ్చేసాను.. పాపం మా అత్తగారు ఆ కూర మీద ప్రయోగాలు ఇప్పటికి చేస్తూనే ఉన్నారనుకోండి..సక్సెస్ అయ్యారా లేదా అనేది దేవరహస్యం ...


ఇదంతా సరే ,వంకాయ కూర చెప్తా అని ఈ సోది అంతా చెప్తావేంటి అంటున్నారు కదా.. సరే అక్కడికే వస్తున్నా..అలా వంట శాలను ప్రయోగ శాలలా మార్చేసి రాజ్యమేలుతున్న తరుణంలో మా అత్తగారు ఊరు వెళ్ళారు ..(అదే మా బంటిగాడు తప్పి పోయిన టైములో ) వెళ్ళేటప్పుడే చెప్పారు కూరల పాపమ్మ ఇంటికొస్తుంది తనదగ్గర కూరలు తీసుకోమని .. హమ్మయ్యా అనుకున్నా ..ఇంక నా ఇష్టా రాజ్యం కదా .. సింపుల్గా అయిపోయే ఇగుర్లు చేసిపడేద్దాం అనేసుకున్నా కాని నాకేం తెలుసు కూరలమ్మే పాపమ్మ దగ్గర నా ఆటలు సాగవని..

మరుసటి రోజు పాపమ్మ రాగానే ఆ ములక్కాడలివ్వు చాలు అన్నాను .. ఏటి, ఈ ములక్కాడ ఓ మూలకొస్తుంది అనుకున్నావా ..నవ నవలాడే గుత్తోంకాయలు ఉన్నాయి తీసుకో మీ మామగారికి చాలా ఇట్టం అంది ఇంత నోరేసుకుని.. మనకసలు ఎలా వండాలో తెలిస్తే కదా.. అందుకని నాకొద్దు ,ఇవి చాలు అన్నాను ..ఓసోస్ ,గొప్ప బేరమే ఈ ములక్కాడలు తీసుకున్టావనా ఇన్ని మెట్లెక్కి పైకొచ్చింది ... ఎక్కడైనా కోడళ్ళు అత్తగారు అలా బయటకు ఎలితే సాలు నాలుగు రకాలు వండేసుకుని తినేద్దామనుకుంటారు.. నువ్వేటి మిగిలినోళ్ళ కడుపులు కూడా మాడ్చేసేలా ఉన్నావ్ అంది.. నువ్వెక్కడ దొరికేవే బాబు అని కంగారుగా చుట్టూ ప్రక్కల చూసాను ఎవరన్నా వింటున్నారేమో అని.. అబ్బా ,ష్..ష్.. నెమ్మదిగా మాట్లాడు ...అదికాదు పాపమ్మా నాకు గుత్తొంకాయ వండటం రాదు అన్నాను మెల్లిగా నసుగుతూ..అంతే .. పాపమ్మ వినకూడని మాట విన్న దానిలా తత్తర పడి, బిత్తర పోయి ...ఏటి, గుత్తొంకాయ వండటం రాకుండానే కాపురానికోచ్చేసావా , నాకు తెలిసి ఓల్ ఆంధ్రాలో గుత్తొంకాయ కూరా,గోంగూర పచ్చడి రాని ఆడపిల్ల లేనే లేదు అంది ... అటువంటి కారణ జన్మురాలిని నేనున్నాగాని ..అమ్మా తల్లీ ..తిట్లు ఆపి కూర ఎలా చెయ్యాలో చెప్పితే కొంటా లేదా నన్నిలా వదిలే అన్నాను.. ఇది మరీ బాగుంది ..కూరలమ్మే పెతి సోటా ఎలా సేయ్యాలో సేప్పుకుంటూ పొతే ఇంక నేను యాపారం సేసినట్టే అని కాసేపు గొణుక్కుని ఈ రెసిపి చెప్పింది .. కాబట్టి బేగెల్లి ఒక పేపరు పెన్ను అట్టుకుని లగెత్తు కొచ్చేయండి ఓ పాలి..


ముందు ఒక అరకిలో గుత్తు వంకాయాలు ఉప్పు వేసిన నీళ్ళలో నాలుగు వైపులా చీరి అందులో వేసుకుని ప్రక్కన పెట్టుకోవాలి.. బాణాలిలో ఒక స్పూన్ నూనె వేడి చేసి 5 ఎండు మిరపకాయలు ,రెండు పెద్ద చెంచాల వేరు శనగ గుళ్ళు వేసి దోరగా వేపి ప్రక్కన పెట్టుకోవాలి .. ఇప్పుడు మిక్సిలో రెండు ఉల్లిపాయాలు ( మీడియం సైజు)ముక్కలు ,అర అంగుళం అల్లం, నాలుగైదు వెల్లుల్లి ,వేపిన ఈ ఎండుమిర్చి ,వేరు శనగ వేసి ,ఉప్పు ,మషాలా పొడి ( మా ఆయనకు పడదు కాబట్టి నేను ధనియాల పొడి మాత్రమే వేసి వదిలేస్తా..అలాక్కుడా బాగుంటుంది ) వేసి మెత్తగా చేసుకోవాలి ..ఇప్పుడు ఈ వంకాయలను నీళ్ళను పిండేసి మషాలా వంకాయల్లో కూరాలి..బాణాలి వేడి చేసి నూనె వేసి ( నాన్ స్టిక్ కాకపొతే ఎక్కువ ఆయిల్ పడుతుంది) ఈ వంకాయలను జాగ్రత్త గా దానిలో వేయాలి .. వంకాయలు మగ్గుతున్నపుడే కూరాకా మిగిలిన మషాలా వేసేసి బాగా మగ్గాక ఒక చిన్న గిన్నెలో చింత పండు లో కొంచెం నీరు పోసి చిక్కగా తీసి దాన్ని వంకాయలో వేసి మగ్గనివ్వాలి చివ్వర్లో ఉప్పు,కారం సరి చూసుకుని దగ్గరకు రాగానే కొత్తిమిర జల్లి కూర దింపేయడమే ..


అయితే మరి నేనెలా వండానో ఆ రోజు అని మీరందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తూ గోళ్ళు కొరికేసుకుంటున్న విషయం మీకు తెలియక పోయినా నాకు తెలుసు ..అలా పాపమ్మ చెప్పి వెళ్ళిపోగానే 'గుత్తివంకాయ్ కూరోయ్ మామా గుట్టుగా నేను వండితిని' అని పాడేసుకుంటూ వంట చేశా ..కూర అయిపో వస్తున్నదనగా ఎలా వచ్చిందా అని ఒక వంకాయ తిన్నా ..ఉడకలేదేమో అన్న డవుటుతో ఇంకొక సారి టేస్ట్ చేశా.. ఉప్పు సరిందా? లేదా? అని ఒకసారి, కారం తక్కువైందేమో ?అని ఒకసారి ,అసలే కొత్త వంట మళ్లి తేడా చేస్తే బాగోదని మరొక సారి ఇలా ఎంతో శ్రద్దగా వంట చేసేసరికి అది పావుకిలో కూర కూడా మిగలలేదు..నాకేంటో ఎన్ని సార్లు తిన్నా బాలేదేమో ?,ఎదుటి వాళ్లకు నచ్చుతుందో లేదో? కొత్త వంట కదా అని ఫీలింగ్ అందుకే యధాప్రకారం ములక్కాడ టమాటా వండేసా..

మా మావయ్య గారు రాగానే ఆయనకు ములక్కాడ కూర పెట్టి నేను ఎంచక్కా గుత్తివంకాయ వేసుకుని తినేస్తున్నా ..పాపం మా మావయ్యగారు ఒక నిమిషం చూసి అదేంటమ్మా అన్నారు.. గుత్తివంకాయ మావయ్యగారు అన్నాను..మరి నాకు పెట్టలేదే అన్నారు ..అసలే మా మావయ్యగారికి ఆ కూర అంటే చాలా ఇష్టమంట .. బాగా రాలేదు అండి అన్నాను నా త్యాగనిరతి చూపిస్తూ..బాగుందో లేదో చెప్పాల్సింది మేము కదా అని ఆ గిన్నె తీసుకుని తిని ..భలే ఉంది ఇంకా పట్రామ్మా అన్నారు.. అంటే మావయ్యగారు ఇంక లేదు అన్నాను.. మరీ రెండువంకాయలే వండావా అన్నారు..అంటే అరకిలో వండాగాని టేస్ట్ చూసేసరికి ఇలా అయిపొయింది అన్నాను.. అబద్దం చెప్పచ్చుకాని మా పాపమ్మ చెప్పేస్తుంది కదా అన్న భయం తో నిజం చెప్పేసా.. అప్పటి నుండి మా మావయ్యగారు ఎప్పుడూ ఏడిపిస్తారు నన్ను ..కూర వండు గాని టేస్ట్ మాత్రం చూడకు అని..


కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే ..ఈ కూర వండి టేస్ట్ చూడకుండా మీ వాళ్లకు పెట్టండి ..బాగుంటే నా పేరు చెప్పుకుని పండగ చేసుకోండి.. లేదనుకోండి నాకు సంబంధం లేదు కావాలంటే మా పాపమ్మను మొహమాట పడకుండా తిట్టుకోండి.. ఏం పర్లేదు.. :)

62 వ్యాఖ్యలు:

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

ఇప్పుడే జ్యోతిగారి వంట రుచి చూసి వస్తున్నా,ఇక మీరూ వడ్డించండి మరి.
అన్నట్లు ఈ రోజు మా గృహమంత్రి కూడా గుత్తొంకాయ,జొన్నరొట్టెలు చేసిందండి.

అజ్ఞాత చెప్పారు...

quick question: onions ni fry chesi mixi lo veyala,fry cheykkarleda????

అజ్ఞాత చెప్పారు...

do we need to fry onlions before grind them?

సిరిసిరిమువ్వ చెప్పారు...

ఏదైనా హాస్యంగా చెప్పటంలో మీకు మీరే సాటి. ఇవన్నీ తిని ఇవాళ పొట్ట ఏమవుతుందో మీదే భారం!

నేస్తం చెప్పారు...

విజయ మోహన్ గారు.. ఆహా జొన్న రొట్టెలా... అవి తినాలని ఎప్పటి నుండో కోరిక..
అఙ్ఞాత గారు అక్కరలేదండి మగ్గిపోతుంది పచ్చి ఉల్లిపాయే వేస్తాను నేను..
మువ్వ గారు ఈ రోజు ఉపవాసం కాబట్టి నేను అందరి వంటలు చూడటం తోనే సరిపెడుతున్నా :)

శివరంజని చెప్పారు...

నేస్తం గారు ఇదేమి బాగా లేదండి . ఈ రోజు కార్తీక పౌర్ణమి ఉపవాసం ఇలాంటి colourful items కళ్ళ ముందు పెట్టి వివరిస్తూ మరి ఊరిస్తారా!!!

సుభద్ర చెప్పారు...

ఆహా ఏమి రుచి అన్నా౦టున్న మయమరచి.....ఇ౦కా చెప్పాలా అది మీరు వ౦డిన గుత్తువ౦కాయని.........బొమ్మా మాత్ర౦ సూపర్.నా అభిన౦దనలు పోటోగ్రాఫర్ ఎవరైతే వారికి చెప్ప౦డి.మీరు పోజ్ బాగా ఇచ్చారు.
కాని మీ పాట్లుకి భలే నవ్వుకున్నాను..నాకు వ౦ట నేర్చుకునే టై౦ లో మీకు లా సాయపడే నాధుడే లేడు.నేను గుజరాత్ లో ఉన్నాను..చూట్టు గుజరాత్సీ నాకేమొ భాషా రాదు.సో నేను వ౦డిదే వ౦టా!!!టి.వీ లు కుడా అ౦తగా లేవు.పోన్ ని నమ్ముకుని నాన్నమ్మ చెప్పగా గబగబ పేపర్ మీద బరికేసి ట్రైయల్స్ వేసేదాన్ని.కుదిరితే మేము కుదరక పోతే .....మా వారికి సరకులు ఖర్చు తో పాటు,చె౦తాడ౦త పోన్ బిల్ కూడా వచ్చేది.

dhanaveerasurakarna చెప్పారు...

Bhale undi mee vanta.

bendu appa rao చెప్పారు...

Bhale raasaru.
Meeru ye vishaynni ayina chaala funny gaa explain chestharu.
Bhale unnai posts.

Padmarpita చెప్పారు...

వంకాయ కూర అదిరింది నేస్తం.....కాని మరీ బొత్తిగా రెండేనా:):)

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

మీ టపా చదవగానే 'ఆహా ఏమి రుచి...అననా మైమరచి..రోజూ తిన్నాగానీ మోజే తీరనిది... ' అని గుత్తివంకాయ తల్చుకుని పాడేసుకున్నానండీ...
మామూలు వంకాయ కూరంటే ఎంత అసహ్యమో గుత్తి వంకాయ అంటే అంతిష్టం నాకు..అందుకే మహిళాబ్లాగర్లు ఏర్పాటు చేసిన వనబోజనంలో మొదట మీ కూరే తిందామని వచ్చేసా!!

భావన చెప్పారు...

నేస్తం: అబ్బ మీ వంటే కాదు మీ మాట కూడా సూపర్.. హ హ మొత్తానికి మీ ఇంటికి వస్తే వంకాయ కూర మాత్రం వద్దు అని చెప్పాలి మరి అన్ని మీరే తినేస్తారు కదా. ;-)

నేస్తం చెప్పారు...

శివరంజని గారు మీ బాధ నాకు తెలుసు నేను కూడా ఉపవాసమే..అచ్చం మీ లాగే వంటాకాలు అన్నీ చదివి గుటకలేస్తున్నా.. :(
సుభద్ర ఆ ఫొటొ గురించి ఏం అడుగుతారు ..బాబ్బాబు ఒక్క ఫొటొ తీసి పెట్టండి అని బ్రతిమాలితే ..ఎంత విసుక్కుని తీసారో ..పైగా ఆ చెయ్యి ఎందుకు దిష్టి బొమ్మలా అని కామెంట్స్ ..అలా కాదులెద్దు ఇలా ఎవిడెన్స్ లేకపోతే నేను వండిన వంట అని ఎవరూ నమ్మరు..గూగులమ్మది అనుకుంటారని బ్రతిమాలుకున్నా ..
ధాన వీర శూరకర్ణ గారు థేంక్స్ అండి

నేస్తం చెప్పారు...

అప్పారవు గారు మీకూ ధన్యవాధాలు..
పద్మ హహ మరి టెస్ట్ చూడద్దా..మీరు మరీనూ ..
శేఖర్ ధాంక్యూ ధాంక్యూ ...:)
భావన గారు అక్కడే పప్పులో కాలేసారు నేను ఏ వంట అయినా టేస్ట్ చూడటం తప్పని సరి :P

అజ్ఞాత చెప్పారు...

"మీరందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తూ గోళ్ళు కొరికేసుకుంటున్న విషయం మీకు తెలియక పోయినా నాకు తెలుసు "

అందరి సంగతి నాకు తెలీదు కానీ.... ఈ లైన్ చదివేసరికి అవాక్కయ్యను... నేను అల్రెడి సగం గోరు కొరికెసాను మరి..

ఎప్పటి లాగానె బాగుంది...కూర వండి చూడాలి మరి..

rajkumar

psm.lakshmi చెప్పారు...

ఏంటి, నేను వచ్చేసరికి ఆ రెండు కాయలూ కూడా టేస్ట్ చూసేశారా. మళ్ళీ మొదలెట్టండి..ఇంకా చాలామంది వస్తున్నారు.
psmlakshmi

sunita చెప్పారు...

నాకిష్టమైన కూరల్లో ఇదోకటి.వెజ్ బిరియాని ఈ కూరతో సూపర్ కాంబినేషను. ఫోటో చాలా బాగుంది.తింటానికి నేను రెడీ.

నేస్తం చెప్పారు...

రాజ్ కుమార్ గారు నేను చెప్పాను కదా మరి.. :P
లక్ష్మి గారు అంత కంటేనా ..కానీ ఈ రోజు కుదరదు ఉపవాసం...టేస్ట్ చుడటానికి అవ్వదు నాకు :)
సునీత గారు కదా..అబ్బా మీరు పెట్టిన ఫొటోలో ఆ డెకరేషన్ కి(చివరిలో ప్లేట్ మీద ) నేను పడిపోయా :)చాలా బాగుంది

Gulabi చెప్పారు...

Nestam gaaru..me blog ki nenu regular follower ni..Kudali lo unna blogs ni chusaake naku kuda oka blog undalanipinchindi..so open kuda chesasenlendi :)naa blog ni kudali lo ela jatha cheyalo cheppagalaru..inka telugu lo easy ga ela rayalo kuda ..pleaaaaaase andi..na blog..gulabipuvvu.blogspot.com..me jaajipoolu inspiration ye.. :)

Unknown చెప్పారు...

ha..ha..ha..super ga chepparu recipe..nenu eppudu cheyaledu kani vanta...ma amma cheste meelage taste lu chustuu untaa.. :)..kaani naku ippudu aa kuura thineyalani undi kadaaa..ikada nenu cheskolenu kadaa.. :(

జయ చెప్పారు...

అబ్బా! నేస్తం గారు, ఎంత మంచి కూర వండారో...కూరల్లోకే రారాజు..గుత్తి వంకాయ కూర. ఫొటో చూస్తేనే నూరూరిపోతుంది. గుత్తి వంకాయ కూరతో పాటు మీ పాట్లు కూడా చాలా బాగున్నాయి. మీరిప్పటికి అన్నిట్లోనూ ఎక్ష్పర్ట్ అయిఉంటారులే...

కొత్త పాళీ చెప్పారు...

వంటలో కూడ మీ ష్టైళే వేరు!
అమెరికా రాకముందు ఒక మేష్టారు చెప్పారు .. అక్కడకెళ్ళి గుత్తివంకాయి కూరోయి మావా లాంటి పాటలు పాడుకునే వీల్లేదు. ఒక్కో వంకాయ కిలో బరువుంటుంది అని :)
ఇప్పుడూ దొరుకుతున్నాఇ లెండి అన్ని రకాల వంకాయలూనూ. ఏం కావాలన్నా వొండేసుకోవచ్చు.

మాలా కుమార్ చెప్పారు...

మీరు చెప్పేకథలంత బాగుందండి మీ ఫొటో ! మరి నేను ఫొటో చూసే మురవాలికదా ! ఏం చేయను నేను రావటము కొంచం ఆలస్యం అయ్యి , ఆ రెండు వంకాయలూ అయిపోయాయ్ !

నేస్తం చెప్పారు...

గులాభి గారు పేరు బాగుంది.. మీరు కూడలికి జత చేయాలంటే support@koodali.org కి మీ బ్లాగ్ url ని పంపించాలి.. అంటే gulabipuvvu@blogspot.com ని మైల్ ద్వారా support@koodali.org కి పంపితే వారు 1 లేదా 2 రోజుల్లో కూడలి లో జత చేస్తారు..
ఇంకా lEkhini.org లో తెలుగు లో రాయచ్చు .. :)
కిరణ్ :) ఈ సారికి పొటోతో అడ్జస్ట్ అయిపో ..అమ్మ దగ్గరకు వెళ్ళాక తిందువు :)

నేస్తం చెప్పారు...

జయ గారు అన్ని తెలుసు కాని ఓపిక మహా తక్కువ.. అందుకే సింపుల్ వంటలు చేసేస్తుంటా అదన్నమాత
కొత్త పాళిగారు ఆ విషయం లో మాత్రం బెటర్ అండి ఇక్కడ.. ఇక్కడ దొరకని కూరలంటూ ఉండవు ..
మాలా కుమార్ గారు.. అరెరె ఎంత పని అయిపోయింది మరి అందుకే తొందరగా రావాలి .. మరేం పర్లేదు రేపు మా ఇంటికొచ్చేయండి వండేద్దాం :)

జ్యోతి చెప్పారు...

నేస్తంగారు, మీరు వంకాయకూర చెప్పడం, చేయడం ఏమో కాని అందులో ఎన్ని మినీకధలు కూరారండి..ఐతే మీ ఇంటికి ఎవరైనా వస్తే నలుగురికి వండితే ఒక్కరికి మిగులుతుందన్నమాట. ఇప్పటికీ అంతేనా?

Kiran చెప్పారు...

Evaradi oil lo veyyakunda salt vesi gutti vandedi apacharam lempalu vesukondi nestam aa ammayiki hair band enduku extra ga hamma mosam cheddamane

Shashank చెప్పారు...

హహ.. భలే భలే. నేను రెండు రకాలుగా చేస్తా అండి. ఒకటి "వెట్" ఇంకోటి "డ్రై". ఇది వెట్ తరహాది. ఈ సారి.. అంటే ఈ రోజే. కార్తీక పున్నమి కద.. ఎంచక్క ఇది, సైడ్ కి పూరి, లైట్ గా దద్దోజనం చేద్దాం అని ఆలోచిస్తున్నా. దివ్య ని త్వరగ రమ్మని బయలదేరమని చెప్పాలి.. ఇన్నేసి చేసుకొని తినాలి అంటే మరి ఓ గంట పట్టదు? బిర్యాని చేద్దాం అనుకున్నా ఈ రోజు.. అది వీకెండి కి వాయిదా.

మీ రుచి కార్యక్రమం గురించి చెప్తుంటే గుర్తొచ్చింది.. దివ్య కూడా మొదట ఇలానే సగం టేస్ట్ అని తినేది. తీరా భోజనం సమయానికి ప్రసాదం లా మిగిలేది..

తృష్ణ చెప్పారు...

మీ స్తైలే నాకిష్టం....
కానీ కూర తింటే కష్టం...
మా డాక్టరొప్పుకోరూ....

ఎప్పటిలా బాగా రాసారు..

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

అత్తగారు సక్సెస్ అయితే నాకూ చెప్పమనండి ఆ దేవరహస్యం.నేనూ ఓ అత్తగారినే!

Anil Dasari చెప్పారు...

బ్రేవ్ ..

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

లేటయిపోయింది నేస్తం. ఆదుగుబొడుగు అన్నా వుందా అదీ నాకేసారా? టపా భలేవుంది.

కొత్త పాళీ చెప్పారు...

చెప్పటం మర్చిపోయా. నాకు అరిటిపువ్వు కూరంటే చాలా ఇష్టం. అలాగే, అరటి దూట, పనసపొట్టు కూడా .. ఆవపెట్టి వందితే ఇంకా మజా.

నేస్తం చెప్పారు...

జ్యోతిగారు మరి గుత్తివంకాయ అంటేనే అనేకానేక మషాలాలు కూరి వండాలికదా..సింబాలిక్ గా ఉంటుంది అని అన్ని రకాలా కధలు కూరి పోస్టా :)
హ హ కిరణ్ దేన్ని హైర్ బేండ్ అంటూన్నావ్.. నా గాజులను చూసా అవి అచ్చమైన మట్టి గాజులే తల్లీ ..యే బేండూ కాదు.. నువ్విలా అనుమానిస్తావ్ అని తెలిస్తే నేస్తం అని యే గోరింటాకుతోనో పెన్ను తోనో చేతి పైన రాసి మరీ పోజిచ్చేదాన్ని.. అలా హడావుడిగా తీయించేదాన్ని కాదు ఫొటో :)
హ హ శశాంక్ మీ దివ్యను మాత్రం ప్రతిదానిలో దెప్పితే గాని మీకు తోచదుకదా ..హూం.. డ్రై వంకాయ నాకు అంతగా రాదు

నేస్తం చెప్పారు...

తృష్ణగారు ఏంటి డైటింగా ..నేను ఆయిలీ మషాలా ఫుడ్ లదగ్గర కాసింత జాగ్రత్తగా ఉంటాను ఎందుకైనా మంచిదని .. :)
సూర్య లక్ష్మి గారు మరి దేవరహాస్యాలు తెలుసుకోకూడదు .. :) నేను అక్కడ ఉండగానే పట్టువదలని విక్రమార్కినిలా మా అత్తగారు 3 సార్లు ట్రై చేసారు ..కుదరలేదు.. తరువాతా బాగా వచ్చిందని చెప్పినట్లు గుర్తు :)
అబ్రకదబ్ర గారు :D

నేస్తం చెప్పారు...

భాస్కర్ గారు పోనీ పులిహోర వండమంటారా :P
కొత్త పాళి గారు ఈ అరటి దూట పేరు నేనూ విన్నాను..ముఖ్యం గా బ్రాహ్మణ్స్ ఎక్కువగా ఈ పనసపొట్టు,అరటి దూట లాంటీ అనేక వంటలు చేస్తారు..వంటలలో వారిది పై చేయిలేండీ.. తెలిసిన సహోదరిలు నాకు రెసిపీ ఇవ్వమని మనవి :)

నేస్తం చెప్పారు...

కెవ్వ్ ..రెండవ కిరణ్ గారు సారీ ..మిమ్మల్ని నేను మొదటి కిరణ్ ( kiran's world బ్లాగర్ )అనుకున్నా... అందుకే తల్లీ అని సంబోధించాను ..ఒకవేళ ఇద్దరూ ఒకటైతే సమస్యే లేదు :)

సుజాత చెప్పారు...

కొత్తపాళీ గారూ,
పనసపొట్టు కూర ఆవపెట్టి నేను బ్రహ్మాండంగా చేస్తాను. కూర దింపాక కూర వడియాలు(ప్లెయిన్ మినప్పిండి తో పెట్టినవి) వేయించి వడ్డించే ముందు అందులో కలిపి వడ్డిస్తే తినే వాళ్లని ఏ కోరిక కోరినా తీరుస్తారు.

నేస్తం,ఇందాక బ్లాగాడిస్తా రవి గారు సుభద్ర గారి బ్లాగులో అనుకుంటా చిలగడ దుంపలో విషం కలిపి పెట్టినా తినేస్తానన్నారు. అంతిష్టమట! అలాగే నాక్కూడా వంకాయతో పాయసం వండి పెట్టినా కాదనలేను! మీ కూర అదుర్స్!

నేస్తం చెప్పారు...

సుజాత గారు ఎంచక్కా మీరు పనసపొట్టు కూరో ..లేక ఆవపెట్టిన అరటో..దూటో ..కనీసం మజ్జిగ చారు ..( మా వైపు మజ్జిగ చారు వేరుగా చేస్తాం నిమ్మకాయ మజ్జిగలో పచ్చిమిర్చి,అల్లం దంచి మెంతులు,ఆవలు,జీలకర్ర ఉల్లిముక్కలతో తాళింపు అన్నమాట ) ..ఇలా ఇన్ని వంటలుండగా మాటవరసకు ఒక్క వంట కూడ రాయలేదు మీరు..నేను తెగ ఎదురు చూసా :)

అడ్డ గాడిద (The Ass) చెప్పారు...

:-)

మంచు చెప్పారు...

మొదటి బంతికే రెండు వంకాయలు మిగిలితే .. చివరాకరి బంతి కి వచ్చిన మాకేమి వుంటాయి లెండి ..
ఒక్క ప్రశ్న నేస్తం గారు .. ఈ టాలెంట్ చిన్నప్పటినుండి వుందా.. ఈ మద్య (అంటే పెళ్ళయ్యాక) డెవెలప్ అయ్యిందా..

నేస్తం చెప్పారు...

AG గారు :)
మంచుపల్లకి గారు..నిస్సందేహం గా నేను వంట స్టార్ట్ చేసాకే .. అంటే పెళ్ళి అయ్యాకా ..ఇంతకూ టేస్ట్ చూడటం నాకు రాదు..ఎలా ఉన్నా బాగానే అనిపిస్తుంది ..అందులో కారం ఎక్కువైంది ఇందులో ఉప్పు తక్కువ అయ్యింది అని మా ఆయన పెట్టే వంకలకే ఇలా నా మీద నాకు నమ్మకం లేకుండా పోయి పది సార్లు టేస్ట్ చూస్తా :)

అజ్ఞాత చెప్పారు...

మీ అరటిపువ్వుకూర ప్రహసనం మా ఇంట్లో కూడా జరిగింది.
చాన్నాళ్ళ తరువాత బెంగళూరులో దొరికింది కదాని తెచ్చి నేను మా ఆవిడ మీరు వ్రాసినట్లుగానే తంటాలు పడి చేస్తే అదే రిజల్టు వచ్చింది.
మా అమ్మగారు ఇలాంటివి బాగా చేసేవారు. అప్పట్లో అరటిపువ్వు, దూట మొదలైనవి ఉచితంగా వచ్చేవి కాబట్టి చేసేవారేమో కాని అంత రుచిగా ఏమీ ఉండవు.
కాకపోతే పనసపొట్టుకూర మాత్రం అద్భుతం. అది లేందే మా గోదావరి జిల్లాల్లో ఏ శుభకార్యం జరిగేది కాదు.

Rajendra Prasad(రాజు) చెప్పారు...

మా అమ్మ ఎంచక్క మా వీధిలో అందరితో కలిసి వనభోజనానికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి వచ్చింది,నేను మిస్ అయ్యాను...ఇప్పుడు మీ వంట..ఇది కూడ మిస్...:(
"మా టీవి లో సుమ లాగా అవాక్కయాను..." మా అమ్మ సుమ గారి వీరాభిమాని...
మొత్తానికి మీ వంట సూపర్...
ఇంక జొన్న రొట్టె కాంబినేషంతో గుత్తి వంకాయ సూపర్...
ఈ సారి వీకెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు,మా అమ్మకు మీ బ్లాగు చుపించి...గుత్తి వంకాయ వండించుకొని,తిని ఎంజాయ్ చేస్తాను...

Rajendra Prasad(రాజు) చెప్పారు...

ఎప్పటి లాగే టప కెవ్వు కేక...!!!

Kiran చెప్పారు...

Ayyo ayyo enta ghoram jarigipoyindi babayya na chi.na.ba comment delete sesesinaru balayyaa:(

నేస్తం చెప్పారు...

బోనగిరి గారు మీకూ అదే రిజల్ట్ ఆ.. పాపం మా అత్తగారు అరటిపువ్వు లో ఆ తెల్లని వన్నీ మజ్జిగలో నానబెట్టి కూడా చేసారు అయినా చేదు వచ్చేసింది ..కాని పనసపొట్టు కూర నా ఫ్రెండ్ ఒక సారి వాళ్ళింటికి వెళ్ళినపుడు పెట్టింది కాని ఆ రోజు ఏదొ పని వల్ల తినడం కుదరలేదు..ఇప్పటికి అదే ఫీల్ అవుతూ ఉంటా అయ్యో అయ్యో అని.. మరి ఎప్పుడు తింటానో :)
రాజేంద్ర గారు ఈ సారి తప్పకుండా అమ్మతో చేయించుకోండి.. నాక్కూడా సుమ ఏంకరింగ్ మహా ఇష్టం.. :)
కిరణ్ గారు మీ కామెంట్ ఎక్కడకూ వెళ్ళలేదు పైనే ఉంది ఒక సారి చూడండీ :)

అజ్ఞాత చెప్పారు...

బెంగళూరులో వనభోజనాలు ఎక్కడైనా ఉన్నాయా?
ఎవరికైనా తెలిస్తే చెప్పండి.

kiranmayi చెప్పారు...

అబ్బబ్బబ్బా .... గుతి వంకాయ అని ఒకరంటే, పనసపొట్టు అని ఒకరు, ఆవపిండితో ఇంకొటేదో అని ఇంకొకరు. ఎంటండి ఇది? మేమందరమూ బ్రతకాలా ఒద్దా? అయినా చేసే కూరలేవో మీరు చేసుకుని తినేయ్యక మళ్ళి మాకు చెప్పాలా? నేనసలే జ్యోతి గారి invitation తో తెగ inspire అయిపొయ్యి ఒకలాంటి పాయసం ఇంకొకలాంటి పులిహార చేసాను. అవి బ్లాగ్ లో పెట్టాలి. మీరేమో మంచి మంచివి చేసేస్కుని తినేస్తున్నారు. నాకు మీ అందరి మీదా కుళ్ళు, కుళ్ళు, కుళ్ళు ...... ఇక పోతే, మొన్న కార్తిక సోమవారం నాడు "ఇక్కడ వనభోజనాలుండవు కదా, మన అపార్ట్మెంట్ దగ్గర ఉన్న చెట్టు కింద తిన్దామండీ" అని మా ఆయననడిగితే నన్ను ఎర్రగడ్డ నించి వచ్చిన దానిలాగా చూసారు.

వేణూశ్రీకాంత్ చెప్పారు...

ఎప్పటిలానే టపా అదరహో... గుత్తొంకాయ సూపర్ అసలు దాని రుచి గురించి ఎంత చెప్పినా తక్కువే. వంకాయ నా ఫేవరిట్ ఎలా వండినా తినేస్తాను. అంతెందుకు అసలు కూరగాయల్లో రారాజు కదుటండీ గుత్తొంకాయ అందుకే దేవుడు కూడా అలా కిరీటం తో అలంకరించాడు, ఇంకదేనికైనా ఉందా చెప్పండి.

నేస్తం చెప్పారు...

కిరణ్మయి ఏం కుళ్ళుపడద్దు ..ఆ రోజు అందరూ ఉపవాసాలతో ఫొటోలు వేసి గుటకలు మింగాం అంతే ..మరి ఒకలాంటి పాయసం ఇంకొకలాంటి పులిహార ఎప్పుడు పెడుతున్నారు బ్లాగ్లో ..
బోనగిరిగారు..కిరణ్ మయి గారు వాళ్ళ ఇంటిదగ్గర చెట్టు క్రింద వనబోజనాలు జరుపుకుంటున్నారట ..మీ ఇంటిదగ్గర చెట్టేమన్నా ఉండేమో చూడండి ..మొన్న నేను ఇక్కడ తెలుగు సమాజం వారి వన బోజనాలకు వెళ్ళాను :)
వేణూ నాకు వంకాయంటే చాలా ఇష్టం..మా ఆయనకు అస్సలు పడదు ..గుత్తొంకాయ ఒక మాదిరిగా తింటారు.. కూరల్లో వంకాయే రారాజు అని మీరిచ్చిన ఉదాహరణ చెప్పినా వినరే :(

Ram Krish Reddy Kotla చెప్పారు...

గుత్తివంకాయ అదిరింది...దేవుడా రేపు నాకు భార్య కాబోయే కోనసీమ అమ్మాయికి(hope so) గుత్తివంకాయ నేస్తంలా వండటం వచ్చేలా చూడు స్వామి.....imp notice: taste చూడకుండా అనమాట

శ్రీలలిత చెప్పారు...

ఆలస్యంగా వచ్చాను కాని మీ కూర తప్పకుండా వండి చూస్తాను.

cartheek చెప్పారు...

ఆహ ఏమి రుచి అనరా మైమరచి
రొజూ తిన్న మరీ మొజే తీరనిది
తాజా కూరలలో రాజా ఎవరంటె
ఇంకా చెప్పలా నేస్తం గారు చేసిన వంటె :) :)

నాకూ వంటవచ్చండొయ్ అప్పుడప్పుదు అమ్మ పక్కన నుంచొని అవి ఇవి అందించెస్తుంటాను ఇంక నేనే ఆ వంట చెసినట్టు ఫీలైపొతాను :)

swapna@kalalaprapancham చెప్పారు...

నాకు మహా బద్ధకం పెద్ద పోస్ట్స్ ఏమినా ఉంటె చదివే ఓపిక ఉండదు. మీరేమో ఎ పోస్ట్ రాసిన చాల పెద్ద గ రాస్తారు. కానీ మా నేస్తం పోస్ట్ కాబ్బట్టి వీలు చూసుకొని మరీ చదువుతాను. మరి అల అందం గ రాస్తారు పోస్ట్స్.
చాల బాగా రాస్తారు ఎదిన. మిమ్మల్ని మించిన వాళ్ళు ఉండరు అసలు. అలాగే మీ పేస్ కూడా కూడా ఫోటో లో పెడితే బాగుండేది కదా. ఎంచక్కా చూసే వాళ్ళము. ఫోటో చూసినపుడు డౌట్ వచ్చింది ఇది మీదేనా లేక గూగుల్ ల్లూడ అని. కామెంట్స్ చదివాకా అర్ధమయింది. మీరు ఎపుడు ఇలాగె నవ్వుతు అందర్నీ నవ్విస్తూ ఉంటారా. మీకు ఏమి బాధలు ఉండవా, ఏమి అనుకోకండి నాకు ఎందుకో ఇలా డౌట్ వచ్చింది ఇప్పుడే. మీతో మాట్లాడం అంటే మీరేమో ఇండియా లో లేరు. ఎలాగండి? he he he

నేస్తం చెప్పారు...

కిషన్ కోన సీమ అమ్మాయిలు టేస్ట్ చూడకుండా వంట చేయలేరు మరి నీ ఇష్టం .. :)
లలిత గారు థేంక్స్ అండి
కార్తీక్ నేనూ అంతే :)
స్వప్న పోస్ట్లు నచ్చినందుకు థేంక్స్..ఎవరు ఎక్కువ నవ్విస్తారో వాళ్ళ కే బాధలు ఎక్కువ అని అంటారు.. :) హ హ నిజ జీవితంలో ఎక్కువగా నవ్వుతూ నవ్విస్తునే ఉంటాను నేను ..అలాగే నాది చాలా సున్నితమనస్సు..చిన్న బాధ కలిగినా కోలుకోవడం నాకు నెలలు పడుతుంది ..అన్నీ ఉంటేనే కదా జీవితం

sreenika చెప్పారు...

మీరిలా నోరూరించే వంటలు
చేసేస్తూన్నారు..బాగానే ఉందమ్మా..బ్లాగుల్లో చదివి మావారు బజార్న పడ్డారు... ఇక కూరలు కె.జి. వంద రూపాయలు ఖాయం.

గీతాచార్య చెప్పారు...

చాలా రోజులైంది నేస్తం. హవార్యూ?

గుత్తి అనే కాదు. అసలే వంకాయా నాకు నచ్చదు. కనుక టపా మీద నో కామెంట్. మీ ఉపవాసానికి ఫలం దక్కిందో లేదో అర్జంటుగా చెప్పండి మరి

నేస్తం చెప్పారు...

హూం గీతాచార్య గారు అవును ఈ మద్య కాళీ లేదు.. :) ఈ సారి నేను కటిక ఉపవాసం చేయలేదు జ్యూస్ తాగేసా.. :) కాబట్టి ఫలం సంగతి నాకు తెలియదు ..
శ్రీనిక గారు థేంక్స్ అండి :)

హరే కృష్ణ చెప్పారు...

మీ పాపమ్మ ని రడీ గా ఉండమనండి తిట్టించు కోవడానికి వీకెండ్ కి వంకాయ ట్రై చేస్తున్నాం రూంలో
బాబోయ్ ఆవిడ మాటలు ఊర మాస్ అనుకుంటా
good one

కౌటిల్య చెప్పారు...

నేస్తం గారూ,,
ఏకబిగిన కూర్చుని మీ పోస్టులన్నీ చదివేస్తున్నా..ఎంత సున్నితమైన హాస్యాన్ని వండి,వడ్డిస్తున్నారండీ....చదుతున్నంతసేపూ హాయిగా నవ్వుకుంటూనే ఉన్నానండీ..అమ్మ భానుమతి గారి అత్తగారికథల్ని తలపుకుతెస్తున్నారు..ఈ టపా చదుతున్నంతసేపూ భానుమతిగారి అరటిపొడి కథే గుర్తుకొచ్చింది...ఇంకో విషయం...నేను గుత్తొంకాయంటే నాలుక,చెవీ అన్నీ కోసేసుకుంటా...చిన్నప్పుడే పెద్దమ్మ దగ్గర నేర్చుకున్నా..అప్పట్నుంచీ, దాని మీద రకరకాల ప్రయోగాలు చేసేస్తుంటా..నాకు మాంఛిగా ఉల్లికారంపెట్టి(మషాళా లేకుండా) చేస్తేనే ఇష్టం...ఇప్పుడు వంకాయల్ని ముందు దోరగా నూనెలో వేయించి,తీసి,అప్పుడు కారంకూరి,తర్వాత తాలింపులో మళ్ళావేస్తున్నా....స్వర్గానికి బెత్తెడెత్తులో ఉంటోంది...

HarshaBharatiya చెప్పారు...

నాకు గుత్తి వంకాయ్ చాలా ఇష్టం దానికి తోడు పులిహోర ఉంటె అదుర్స్ ...
నైస్ పోస్టింగ్