15, సెప్టెంబర్ 2009, మంగళవారం

మా బంటి


ఇంతకు ముందు పోస్ట్ లో కుక్కల మీద నాకెంత అభిమానమో చెప్పాను కదా ..సరే తరువాత తరువాత నాకు యుక్త వయస్సు వచ్చేసరికి మావాళ్ళు వరుని వేట మొదలెట్టేసారు ..ఆ ఫళంగా నేనూ రెండు కండిషన్లు పెట్టేసాను పనిలో పనిగా .. ఒకటి అబ్బాయి మా వూరికి అరగంట జర్నీ మించి దూరం ఉండకూడదు .. నేను గట్టిగా నాన్నా!! అని పిలిస్తే గుమ్మం ముందు మా నాన్న కనబడాలి ... రెండవది వాళ్ళింట్లో కుక్క ఉండకూడదు ... అవన్నమాట .. అయితే అదేంటోగాని మా నాన్నకి మేము ఏం కండిషన్లు పెడతామో దానికి పక్కా ఆపోజిట్ అబ్బాయినే మాకు కట్టబెట్టేవారు .... ఈ విషయం తెలియక మా అక్క కూడా పాపం పెళ్ళికి ముందు ఒక కండిషన్ పెట్టింది ..నాన్నా మరేమో నాకు అబ్బాయి బాగున్నా ,బాగోపోయినా.. ఇల్లు పెద్దదయినా, చిన్న దయినా ... ఉద్యోగమయినా,వ్యాపారం అయినా ఏదయినా పర్లేదుకాని బాత్రుం మాత్రం విశాలం గా ఉండాలి ... అందులో స్నానం చేయడానికి పేద్ద టబ్ ఉండాలి అని .. కట్ చేస్తే వాళ్ళింటి బాత్రుం కరెక్ట్ గా స్నానం చేసే టబ్ అంత మాత్రమే ఉంది ... పాపం ....


సరే మన కధలోకోచ్చేస్తే , నేను అలా కండిషన్ పెట్టగానే మా వారితో నాకు సంబంధం కుదిరిపోయింది ... రేపు తాంబూలాలు అనగా ఈ రోజు రాత్రి తెలిసింది వాళ్ళింట్లో కుక్క ఉంది అని ..అంతే కే..వ్వు మని అరిచి వద్దు అంటే వద్దు అంతే అని గొడవ చేసే అంతలో మా ఇంట్లో వాళ్లందరూ నా నోరు నోక్కేసారు నోరుముయ్యి అని ... పైగా అబ్బాయి కుక్కను ఎత్తుకుని ఉన్న ఫోటో ను చూసి కూడా నువ్వే ఒప్పుకున్నావ్ అని మొత్తం నా మీదకు తోసేసారు ...అంటే అబ్బాయిని చూసా అన్న ఆనందం లో కుక్క పిల్లను సరిగా గమనించలేదన్నమాట ...

మొత్తానికి నేను మా ఆయనతో పెళ్ళికి ముందు , పెద్దవాళ్ళకు తెలియకుండా ఫోన్లో బోలెడు కబుర్లు చెప్పే హడావుడిలో పడిపోయి ఆ విషయం మర్చిపోయాను.. అలా మర్చిపోయిన విషయం మళ్ళా పెళ్ళయ్యాకా అన్నవరం వెళ్లి వ్రతం చేయించుకుని, దారిలో మా వారి ప్రక్కన కూర్చుని, గోరింటాకు ఎర్రగా పండాలంటే ఏమేం వేసి రుబ్బితే బాగా పండుతుంది అని సీరియస్సుగా వివరిస్తున్న సమయంలో ,కారుకి కుక్క అడ్డం రావడం వల్ల వేసిన సడన్ బ్రేక్ వల్ల గుర్తొచ్చేసిందన్తే ...దెబ్బకి మా వారితో డ్యూయట్ వేసుకోవడానికి స్విర్జర్లాండ్ కు వెళ్లడానికి రెడీగా ఉన్న నేను కుక్క తరుముతున్నట్లు ఈ లోకంలోకి వచ్చేసాను ... ఏమండి మీ ఇంట్లో కుక్క ఉందా?..అరుస్తుందా?..కరుస్తుందా? లాంటి ప్రశ్నలు వేయబోతున్నంతలో కారు మా అత్తగారి ఇంటి ముందు ఆగింది ...

ఆ వీధి లో వాళ్ళు, ఈ వీధిలో వాళ్ళు ,మా వీధిలో వాళ్ళు అందరూ ఎక్కడిపనులు అక్కడ వదిలేసి తొంగి తొంగి చూస్తున్నా సరే నా కళ్ళు మాత్రం బౌ ..బౌ మంటూ అరిచి మీద పడిపోయే కుక్క కోసం వెదుకుతున్నాయి..ఈ లోపల మా ఆడపడుచు మరికొంతమంది గుమ్మం దగ్గర రెడీ హారతి పళ్ళెం పట్టుకుని ...మీ పేర్లు చెబితే గాని లోపలకు పంపమని గొడవ.. ఏంటో వీళ్ళ పిచ్చి గాని, పెళ్ళయ్యాక ఎలాగూ ఆ పేరుతోనే ఫిక్స్ అయిపోతారు కదా ..అసలే జమానా బధల్ గయా .. అనుకోబోయే అంతలో మా అక్క మాటలు గుర్తు వచ్చాయి.. ఇదిగో అక్కడ పేర్లు చెప్పమని అడుగుతారు ..వెంటనే మీ ఆయన పేరు చెప్పయ్యకు ..నేను అలాగే నీరసం వల్ల తొందరగా ఇంట్లోకి వెళ్ళిపోదామని మీ బావ పేరు చెప్పేసాను తన కంటే ముందు.....అబ్బా!ఇప్పటి కొచ్చి అందరూ తలుచుకుని తలుచుకుని తిడుతున్నారు నన్ను ... కాసేపు సిగ్గుపడు అర్ధం అయిందా అని చేసిన ఉపదేశం గుర్తువచ్చి బోలెడు సిగ్గు పడిపోతుంటే ... స్లో మోషన్లో పరిగెత్తుకుంటూ వచ్చేసింది బౌ బౌ అనుకుంటూ బంటీ.. మా ఇంటి కుక్క పిల్ల ...

నేను మొహం లో సిగ్గుపడే ఎక్స్ ప్రషన్ మార్చేసి మా ఆయన వెనుక పారిపోయాను.. కాని అప్పటికే మా ఆయన దాని దగ్గరకు వెళ్లి ముద్దులు పెట్టేస్తూ ,ఇంకెప్పుడు నిన్ను వదిలి ఎక్కడకు వెళ్ళనమ్మా... బెంగ పెట్టుకున్నావారా .. నేను అప్పటికీ చెప్పాను నిన్ను కూడా పెళ్ళికి తీసుకు వెళదామని ,వీళ్ళు వినలేదు అని దానికి బోలెడు సారీలు చెప్పడం మొదలు పెట్టారు.. క్షణాలలో హారతి సీను మారిపోయి అక్కడ సెంటిమెంట్ సీను మొదలైపోయింది.. అందరూ వాళ్ళ ఇద్దరినీ చూసి కళ్ళు అద్దుకుని పేర్లు అడగకుండానే హారతి ప్లేటు పట్టుకుని వెళ్లిపోయారు . నాకు భయం వేసింది అమ్మో ఈయనగారికి ఇదంటే చాలా ఇష్టమల్లె ఉంది .ఇప్పుడు నాకు కుక్కలంటే భయం.. కాస్త దాన్ని దూరంగా కట్టేయండి అంటే ఏమంటారో అని.. నా ఆలోచనల్లో నేను ఉండగా అది నావైపు చూసింది .. మా ఆయన వెంటనే నవ్వుతూ అదేరా అసలు దీనికతంటికి కారణం .. తనకోసమే నిన్ను ఒక్కడిని వదిలేసి వెళ్లాను .. ఇంకెప్పుడు ఇలా చేయనమ్మా.. పోనిలే పాపం ఈ సారికి దానిని క్షమించేద్దాం ..ఎంతైనా నీకు వదిన కదా అన్నారు...అంతే 'డామ్' అని పడబోతూ నిలదొక్కుకుని వదినా ??? ఎవరికీ అని అనుమానంగా చూస్తుంటే ..మా అత్తగారు ఒరే బంటీ అన్నయ్యను ,వదినను లోపలి కి రానివ్వరా అని అంటూ లోపలి వెళ్లి పోయారు..


ఓర్నాయనో ..కుక్కల తో అన్నయ,వదిన,అక్క ,అమ్మ,తమ్ముడు అని వరసలు పెట్టికూడా పిలిపించుకుంటారా అనుకుంటూ బోలెడన్ని నక్షత్రాలు కళ్ళముందు కనబడుతుండగా లోపలకి నడిచాను ..లోపల బెడ్ రూమ్ లో మా ఆయన దాన్ని బెడ్ మీద, వడిలో కూర్చోపెట్టుకుని బిస్కెట్స్ తినిపిస్తున్నారు.. అయ్యో పాపం క్రొత్తగా వచ్చింది ఈ ఇంటికి ..ఎవరూ తెలియదు దీనికీ.. కాసేపు కబుర్లు చెబుదాం ..అదేం లేదు ఇంక..పైగా దాన్ని ఎంత మిస్ అయ్యారో ఈ రెండు రోజులు దానికి వర్ణించి చెప్తున్నారు సీరియస్సుగా ..అలా నా లైఫ్ లో ఒక కుక్కతో పోటి పడుతూ, పోల్చుకుంటూ ఉంటానని నా కలలో కూడా అనుకోలేదు.. ప్లిచ్ ..ఆ రోజు నుండి నా పాట్లు ఏమని చెప్పను ...

మా బంటికి ఒక్కటంటే ఒక్కటి మంచి లక్షణం లేదు ..దానికి తిండి మన చేతుల్లో పెడితేనే తింటుంది.. ఏదన్నా గిన్నెలో పెడితే అస్సలు తినదు.. దాని కోసం ప్రత్యేకం గా బోన్స్ తెప్పించేవారు.. వాటిని ఉప్పులేకుండా పసుపు మాత్రం వేసి ఒక గిన్నెలో ఉడక పెట్టి పెట్టేవారు ..అలా చేస్తే దానికి రోగాలు రావంట . అది ఒక్క మెతుకు తినేది కాదు ..దానికి ఉప్పు,కారం,మషాలాలు కావాలాయే ..అది అచ్చం మనిషి లాగే ఇడ్లీలు, గారెలు ,బూరెలు అన్ని తినేది మా దగ్గర కూర్చుని ...మరెందుకు వండేవారో ప్రత్యేకంగా అర్ధం అయ్యేది కాదు ..రోజూ పడేయడమే ...ఒక్కోసారి బలవంతం గా నా చేతిలో పెట్టి తినిపించేవారు ..ఎంత ఏడుపొచ్చేసేదన్టే జిగురు ,జిగురుగా అదోమాదిరి అనిపించేది కాని ఏమి అనలేని పరిస్తితి ..అసలే కొత్త కోడలినాయె ..

ఇది గాకుండా దానికి స్నానం చేశామంటే ఇంట్లో అందరం రెండు రోజులు తుమ్మడమే ..ఆ జుట్టు గాలికి వారం రోజులపాటు ఎగురుతూనే ఉండేది .. ఇది పమేరియన్ తెలుసా ,మామూలు కుక్క కాదు నక్క జాతికి చెందినది అంటూ నేను తుమ్మిన ప్రతి సారి మా ఆయన దాన్ని ఏమనకుండా కవర్ చేసేవారు .. ఇవన్ని కాకుండా దానికి ఇంకో లక్షణం ఉంది గట్టిగా ఉరుమినా ,మెరిసినా వెళ్లి సోఫా క్రింద దాక్కునేది.. అయ్యా శ్రీవారు... మీ పమేరియన్ కుక్కపిల్ల ఇలా శబ్దాలకు జడుసుకుంటే ఇంక దొంగలు గట్రా వస్తే ఎలాగా అంటే, నీ మొహం , అది ఎంత చలాకీ తెలుసా, మా ఇంట్లో ఎలుకలన్నీ అదే చంపేస్తుంది వెంటాడి అన్నారు .. ఎలుకలా ??ఇంతకీ ఇది కుక్కా, పిల్లా ?? అని అడిగితే నోర్ముయ్యి దాన్ని ఏమన్నా అంటే ఊరుకోను అని తిట్టి వెళ్ళిపోయేవారు ..


ఒకరోజు పనిమనిషి సెలవు పెడితే బట్టలన్నీ ఉతికి ఆరబెట్టి, నా బెడ్ రూంలో తెచ్చి మడతలు పెట్టి ,బీరువా ఓపెన్ చేసి వెనుకకు తిరిగి వాటిని లోపల పెడదామని చూస్తే అన్ని తడి ..ఇదేంటబ్బ ఉన్నట్లు ఉండి తడి ఎలా వచ్చింది అని నేను బోలెడు ఆక్చర్య పడిపోతుండగా, మా ఆయన వచ్చి విషయం తెలుసుకుని ..హ్హ హ్హ హ్హ అని నవ్వేస్తూ అంటే తడిపేసిందన్నమాట అన్నారు ..అంటే ?? అని నేను కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే ..మా బంటీగాడు బట్టలు అలా ఎత్తుగా పెడితే తడిపేస్తాడు ..వాడికదో అలవాటు అని సింపుల్ గా అనేసి వెళ్లిపోయారు.. అప్పుడే కుక్కలా ఎలా ఏడుస్తారో ప్రాక్టిస్ అయ్యింది నాకు ...


ఒక్కోసారి అది నేను పడుకున్న మంచం దగ్గర నా కాళ్ళ దగ్గర సైలెంట్గా పడుకునేది ..ఎవరన్నా పిలిస్తే నేను దిగ్గున లేచేదాన్ని, అప్పుడు చాలా సార్లు కాళ్ళ దగ్గర క్రింద పడుకున్న దాన్ని త్రోక్కిసేదాన్ని ... అయిపోయానురా బాబు ..వేసేసింది అనుకునేదాన్ని ..కాని ఒక్క సారిగా బౌ అని అరిచి ఒక్క నిమిషం గుర్రు మని మళ్ళి తోక ఊపుకుంటూ వెళ్ళిపోయేది ... ఒక్కోసారి దాని మీద కోపం వచ్చి..అది నా గదిలో కొచ్చినపుడు దానికి అర్ధం అవ్వకుండా నవ్వుతూ తిట్టేదాన్ని.. బుద్ధి ఉందా ,గాడిదలా ఎదిగావ్ , ఆ మాత్రం మంచి మేనర్స్ నేర్చుకోలేవా అని కోపం తీరేవరకూ తిట్టేదాన్ని .. ఒకసారి మా ఆయన అన్నారు ..అది నన్ను ఎవరన్నా తిడితే ఊరుకోదు అని ..ఏడిసింది నేను తిడతాను ఏమంటుందో చూద్దాం అని మళ్ళి ఎప్పటిలాగే నవ్వు ఫేసు పెట్టి, ఏంటే మీ అన్నను ఏదన్నా అంటే నీకు కోపం వస్తుందా.. కాళ్ళు విరక్కొడతా ఇద్దరికీ అని ఒక రెండు నిమిషాలు తిట్టాను ..అది అలా నన్నుకాసేపు చూసి బౌ బౌ అని అరవడం మొదలెట్టింది.. అమ్మో అంటేదానికి అన్ని అర్ధం అవుతాయన్నమాట ...అది తెలియక ఎలా తిట్టాను దీన్ని అనిఅనుకున్నాను...


కాని ఎన్ని తిట్టుకున్నా ,ఏం చేసినా అది నా రూంలోనే ఎక్కువ ఉండేది ..దానితోనే ఎక్కువ ఉండేదాన్ని ...ఒక రోజు మా అత్తగారు ఊరు వెళ్ళారు ..మా మామ గారు ఆఫీస్ వెళ్ళారు ..ఇదిగో నాకు పని ఉంది..సాయంత్రం వరకు రాను ఎవరొచ్చినా తలుపుతీయకు అని మా ఆయన చెప్పి బయటకు వెళ్ళబోతూ బంటి గాడు జాగ్రత్త ..అసలే ఎదురింటి కుక్క ఊరికే మా వాడికి లైన్ వేస్తుంది తలుపు తీయకు ..బయటకు వెళ్లిందంటే ఇంటికి రావడం కూడా దానికి దారి తెలియదు ..అని అన్నారు.. ఛి ,చీ మీ ఇంట్లో కుక్కలతో సహా ఒక్కరికి మంచి బుద్ధి లేదు అని తిట్టుకుని లోపలికి వచ్చాను ..

పనులన్నీ అయ్యాకా చూస్తే బయట పిట్టగోడ దగ్గర నించుని తలుపు తోసుకుని బయటకు పోవడానికి శత విధాల ట్రై చేస్తుంది .... క్రిందకు వంగి చూస్తే నిజంగానే ఒక కుక్కపిల్ల దీన్ని పిలుస్తుంది..అమ్మో ..అమ్మోఈయన నిజమే చెప్పారన్నమాట అనుకుని ,ఓయ్ నాదగ్గర కాదు ఈ వేషాలు ,తోలు తీస్తా లోపలి రా అని గదమాయించినా అది రాక పోయే సరికి, సరే అక్కడే ఉండు ..నా సంగతి తెలుసుగా నేను మాత్రం తినిపిన్చను ..అక్కడే వండిపెట్టా.. నీకు నువ్వే తినడం నేర్చుకో అనేసి టి.వి చూస్తూ కూర్చున్నా ...సాయంత్రం అయినా అది అక్కడ నుండి కదలకుండా చూస్తుంది క్రిందకు ... ఆకలి వేస్తె అదే వస్తుంది ..అన్నీ చెత్త అలవాట్లు అని తిట్టుకుని నేను పట్టించుకోలేదు ... చీకట్లు ముసురుకుంటుంటే కరెంట్ పోయింది .

సరిగ్గా ఎవరో గుమ్మం దగ్గర నించుని పిలుస్తున్నారు ..ఎవరూ అని బయటకు వస్తే మా పేద్ద మామయ్య గారు ..ఏమ్మా మీ మామ గారు ఉన్నారా అన్నారు .. లేరండి ఇంకా రాలేదు అన్నాను.. ఇటు చూస్తే ఇది బయటకు పారిపోడానికి రెడీగా ఉంది తలుపు తీస్తే .. అటు ఏమో ఆయనను బయట నిలబెట్టి మాట్లాడటం మర్యాద కాదు..దీన్ని లోపలి వెళ్ళమంటే వెళ్ళదు..నాకు సీతాదేవి గుర్తు వచ్చింది ..ఇలాంటి పరిస్థితుల్లోనే ఆవిడ గీత దాటి ఉంటుంది అనుకుని కాస్త తలుపుకి అడ్డుగా నిలబడి రండి లోపలకు అన్నాను తెరిచి.. అబ్బే వద్దమ్మా నేను వచ్చా అని చెప్పు మీ మామ గారికి అని ఆయన వెళ్లిపోయారు.. అంతే ఒక్క అంగలో నన్ను తప్పించుకుని బయటకు ఉరికేసింది అది.. హే.. ఆగు అన్నా సరే ఇంకెక్కడ రోడ్ మీదకు వెళ్ళిపోయింది ..

ఒక ప్రక్క ఇంటి తలుపులు తీసి ఉన్నాయి ..నేనేమో నైటీ లో ఉన్నాను ..ఎలా దాని వెనుక పడేది ..నాకొక్క నిమిషం మైండ్ పనిచేయలేదు.. గభ గభా క్రింద ఇంటి పోర్షన్ ఆంటీ దగ్గరకు పరిగెత్తి ఆంటీ బంటీ పారిపోయింది అన్నాను ..సరే ఏం కాదులే నేను చూస్తా అని ఆమె ఒక కర్ర పుచ్చుకుని దాని వెనుక పడింది ..ఆ కర్ర చూడగానే అది భయపడి వీది చివరకు పారిపోయి మలుపు తిరిగిపోయింది ... ఆవిడ అరగంట తరువాత వచ్చి లాభం లేదమ్మా ఎక్కడికో వెళ్ళిపోయింది ..వస్తుందిలే అదే అని వాళ్ళ ఇంటి లోకి వెళ్లిపోయారు ...
నాకు ఒక ప్రక్క ఏడుపోచ్చేస్తుంది..ఇంకో ప్రక్క కోపం .. మళ్ళి మా ఇంట్లోకి వెళ్లి మా మావయ్యగారికి ఫోన్ చేశా ఎవరూ లిఫ్ట్ చేయడం లేదు .. మా ఆయన గుర్తు రాగానే గుండె దడ,దడ మంది .. మరి మరీ చెప్పారు ..అది బయటకు వెళ్ళిపోయింది అని తెలిస్తే ఇంకేమన్నా ఉందా ..ఆయనకు కాల్ చేసినా దొరకలేదు..

మా పనిమనిషి వచ్చింది ... అయ్యో అని నిట్టూర్చి ..వస్తుంది లేమ్మా ... కంగారుపడద్దు అని దైర్యం చెప్పి..కాని కోడలుగారు దానికి మీరంటే ఎంత ఇష్టమోనండి ... నేను రోజు వచ్చినా అంతలా అరుస్తాదండి ..కాని మీరు వచ్చిన రోజునుండి మీ వెనుకే తిరిగేది ..మూగ జీవి అయినా దానికి తన వాళ్ళు ,బయట వాళ్ళు తెలుసండి అని దాని గురించి చెప్పడం మొదలు పెట్టింది .. నాకు ఏడుపోస్తున్నట్లు అనిపించి హాల్ లో కొచ్చాను ..దాని కోసం ప్రొద్దున పెట్టిన పాలు వెక్కిరిస్తూ కనబడ్డాయి .. మంచి నీళ్ళ పాత్ర నిండా తల వెంట్రుకలు పడి ఉన్నాయి.. అలా ఉంటే మా ఆయనకు ఎంత కోపమో ..మీకు అలాంటి నీళ్ళు త్రాగిస్తే ఎలా ఉంటుంది అని తిట్టేవారు ... 'బౌ' మా ఆయన ఎప్పుడొచ్చారో వెనుక నించుని అరిచారు చెవి దగ్గర.. ఉలిక్కిపడి వెనక్కి తిరిగితే నా మొహం చూసి ఏమైంది అన్నారు కంగారుగా ...బంటీ బయటకు వెళ్లి పోయింది అన్నాను భయం గా ..ఏంటి? ఎప్పుడు ?అన్నారు అర్ధంకానట్లు చూస్తూ ...ఒక అరగంట అయి ఉంటుంది ..అనుకోకుండా తలుపు తీస్తే నా మాటలు మద్యలో ఆపి అరగంట అయితే ఇప్పటివరకు ఏం చేస్తున్నావ్ అని బయటకు పరిగెట్టారు...

ఒక పది నిమిషాలకు మా మావయ్యగారు వచ్చారు పరవాలేదులే కంగారుపడకు దొరుకుతుంది అని ఆయనా వెతకడానికి వెళ్ళారు..
ఎక్కడో ఆశ దొరుకుతుందని ..ఒక అరగంట అయ్యాక మా ఆయన మళ్ళి వచ్చారు ...వచ్చిందా అనుకుంటూ ..ఉహు అన్నాను ...మంచం మీద తల పట్టుకుర్చున్నారు.. ఎక్కడికి వెళ్లి పోయిందో ..పాపం దానికి రోడ్ దాటడం కుడా రాదు .. ఎక్కడన్నా ఏ బస్ దగ్గరో మా ఆయన మాట వణికింది ...నా గుండెల్లో జల్లుమంది.. హఠాత్తుగా అడిగారు ఏమన్నా తిన్నాదా అని ..ప్రొద్దున నుండి ఏమి తినలేదన్న విషయం గుర్తు వచ్చింది ..ఉహు అన్నాను భయంగా.. అలా ఎలా వదిలేసావ్ ..పాపం దానికి ఎవరన్నా పిలిచి ఏమన్నా పెట్టినా తినడం రాదు..చిన్నపుడు నాలుగు నెలల పిల్లపుడు నేనే తెచ్చాను ..మా ఫ్రెండ్ ఇచ్చాడు ..ఎంత ముద్దుగా ఉండేదో తెలుసా ..మా అమ్మ వద్దన్నా వినలేదు ..దానికి నేను అంటే ఎంతిష్టమో తెలుసా ..దానికి నా మాట అంటే ఎంత ఇది అంటే నువ్వు ఈ ఇంటికి రానపుడు నీ ఫోటో చూపించి వదిన రా దీన్నిఏమనకు ..బాగా చూసుకోవాలి అనేవాడిని.చూసావా ఒక్క సారి కూడా నిన్ను కరవలేదు .. ఏ వీధి కుక్కలు దాన్ని కరిచేస్తున్నాయో ఎక్కడుందో మా ఆయన మళ్ళి బయటకు పరిగెత్తారు.. నాకు దుఃఖం తన్నుకొచ్చింది.. దేవుడా దేవుడా దొరికేలా చేయవా అనుకుంటూనే ఉన్నాను ...


ఒక గంట పోయాకా దాని అరుపులు విని పరుగు పరుగున వచ్చాను ..మా ఆయన దాన్ని ఎత్తుకుని వచ్చారు ...దారిలో ఇంకో కుక్క దీనిలాగే ఉంటే అదేమో అనుకుని అరుస్తూ పరిగెత్తారంటా.. ఈయన అరుపులు విని ప్రక్క వీధి లో నుండి ఇది వచ్చిందంట .. నన్ను చూడగానే నా మీదకు ఎక్కేసింది ..నాకు ఈసారి అస్సలు కోపం రాలేదు ..నేనే పెట్టాదానికి తిండి.. ఆ రాత్రి ..వద్దురా దుష్టులకి దూరంగా ఉండాలి ..దాని దగ్గరకు వెళ్ళకు నువ్వు అని మా ఆయన అంటుంటే మా ఆయన మీద తిరగబడి అరిచింది ..అంతేలేరా ముందు వచ్చిన చెవులకంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి అని ఊరికే అనలేదు అని మా ఆయన ఉడుక్కున్నారు కాసేపు..

కాని ఇక్కడకోచ్చాక పాపం ఒక రోజు కాలం చేసింది ..అవన్నీ ఎందుకు లేండి ..అప్పుడు మావారు పడిన బాధ అంతా ఇంతా కాదు ..ఇప్పటికీ ఏ కుక్క కనబడినా వేనుకేనుకకు చూస్తూ మన బంటిగాడు ఇలా ఉంటాడే అని తలుచుకున్టునే ఉంటారు ...

41 కామెంట్‌లు:

తృష్ణ చెప్పారు...

మీరు చదివే ఉంటారు..ఆ మధ్యన కొందరు వాళ్ల వాళ్ళ పెంపుడు కుక్కల గురించి కొన్ని టపాలు రాసారు...చాలా టచ్చింగ్ గా అనిపించాయి చదువుతూంటే..!
మీ బంటి గురించి చాలా బాగా రాసారు మీరు కూడా..ఎంత పెద్ద టపా అయినా అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది...

Vennela చెప్పారు...

Nenu mavarini pelli chupulone adiganu..meeku eppudanna kukka ni penche udessam vunda ani...ippatiki gurtutechukoni navutuntaru..

medha చెప్పారు...

soooooooooooooooooper

swapna@kalalaprapancham చెప్పారు...

అయ్యో పాపం అండి కుక్క . కుక్కలు ఇంతకీ ఎన్ని yrs బతుకుతాయి? మీ ఇక్కట్లు చుసిన బాధ అనిపించింది అండి. ఎన్ని కష్టాలు మీకు. ఇంతకి మీరు ఇపుడు ఎక్కడ ఉంటున్నారు. వేరే place కి వెళ్ళినప్పుడు కూడా దాన్ని తిసుకేల్లర? మాములుగా అమ్మాయిలకి వాళ్ళ husbands ఎవరితో మాట్లాడిన చాల సేపు, friendly గ ఉన్న కోపం వస్తుంది కానీ ఇక్కడ మీ situation దారుణం. ఏంటి నేను చాల సార్లు అండి అని use చేస్తున్న నాకు తెలీకుండానే, మిది ఆంధ్ర న? అయిన మీరు బాగానే ఓపిక పట్టరండి మిమ్మల్ని తిడుతూ మీ కుక్కను బాగా కేర్ చేస్తుంటే పాపం :) నాకు నవ్వు, బాధ రెండు వచ్చాయి మిమల్ని చూస్తే. లాస్ట్ లో మీ ఆయన మిద కూడా జాలి వేసింది ముందు తిట్టుకున్నా ఏంటి వైఫ్ ని అల careless చేస్తారెంటి అని. నాకు ఎక్కువ లైన్స్ ఉంటె చదవబుద్ది కాదు మహా బద్ధకం ఇంత ఉందా అని చదవడం స్టార్ట్ చేస్తూ మొత్తానికి మొత్తం complete చేస్తా మీరు రాసే speciality అలాంటిది మరి :)

సుభద్ర చెప్పారు...

naaku kukkalamtE bhayam...kaani maa baabu pemcheteerutaanu amtaadu.
bagunmdi mee banti kadha.

Vinay Chakravarthi.Gogineni చెప్పారు...

mmm కొంచం లెంగ్త్ అనిపించింది....కాని ...టచ్ చేసింది. బాగా రాస్తారు మీరు.మా ఇంట్లో కూడ ఒకటి వుంది.త్వరలో రాస్తా దాని గురించి.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

నేస్తం గారు,
భలే ఉన్నాయి మీ బంటి గాడి విశేషాలు..ఒక దశలో అది మీకు సవతి అయి కూర్చొందన్నమాట.

>>>మా ఇంట్లో ఎలుకలన్నీ అదే చంపేస్తుంది వెంటాడి అన్నారు .. ఎలుకలా ??ఇంతకీ ఇది కుక్కా, పిల్లా ?? అని అడిగితే.....
>>>.. అప్పుడే కుక్కలా ఎలా ఏడుస్తారో ప్రాక్టిస్ అయ్యింది నాకు ...
:)))

చివరిలో మీమీద ఏమాత్రం కోపం లేకుండా ఎంత ప్రేమ చూపించింది. ఆ చివరి పేరాలో దాని స్పందన చదువుతున్నప్పుడు బంటిగాడి మీద తెగ లవ్వు పుట్టేసింది నాకు.

పాపం కాలం చేసిందా...పెంపుడు జంతువులు పెంపకంలో ఈ ఒక్క దశే విపరీతమైన భాద పుట్టే సందర్భం. అందుకే నాకు అవంటే ఎంత ఇష్టం ఉన్నా ఇప్పటి వరకు వాటి జోలికిపోలేదు.

Ram Krish Reddy Kotla చెప్పారు...

నేస్తం అద్భుతంగా రాసారు. కుక్కలంటే నాకు మీకంటే మహా చిరాకు...కనీ మీ టపా చదివాక నా నిర్ణయాన్నికొంచెం మార్చుకుంటున్నా...టోటల్ గా సూపర్ అండి....

మా ఊరు చెప్పారు...

బావుంది .అంత చదివాక మీ బంటి క్లెవరో కాదో తెలియడం లేదు

గీతాచార్య చెప్పారు...

naaku te;iyakundaaa rendu tapaalaa? annyaayam nestham. sare. repu poddunne chaduvuthaa. Manchi praarambham rojuki.

అజ్ఞాత చెప్పారు...

మా పిన్నిగారింట్లో ఒక కుక్క ఉండేది. అది ఏమి పెట్టినా తింటుంది అని చెప్తే నేను నమ్మలేదు. కానీ జామకాయ తినిపించి టీ తాగించారు నా ఎదురుగా. ఒప్పుకోక తప్పలేదు. ఎవరొచ్చినా ఒక్కసారి కూడ మొరగదు. పైగా ఎవరేనా పెద్దగా మాట్లాడితే వాళ్ళకేసి ఉరుముతున్నట్టు చూసేది. అప్పుడు పిన్ని చెప్పేది - జాగ్రత్తొరే, ఇక్కడ సైలెంట్ గా ఉండాలి అని. మరి దొంగ వస్తే కూడా అంతేనా? అని అడిగేను. "ఆ! రండి దొంగ గారు, డబ్బులు ఇక్కడ ఉంటాయి, నగలు ఇక్కడా, తీసుకోండి. తీసుకుని మాట్లాడాకుండా వెళ్ళిపోండీ" అని చెప్తుంది ఈ కుక్క అని సమాధానం వచ్చింది. ;-)

దానికి అన్నం పెట్టేసి బయటకి తోలేసేవారు. ఊరు మీద తిరిగి తిరిగి మూడు రోజులకోసారి వెనక్కి వచ్చేది. వస్తూనే పిన్ని మీదకి ఒక్క గెంతు, తోక ఊపుకుంటూ. అలా ఊరు మీద తిరుగుళ్ళలో ఏదో బండి కింద పడి చచ్చిపోయింది(ట).

అడ్డ గాడిద (The Ass) చెప్పారు...

Hmm very nice style of writing. Am new to blogs. hw to announce my blog to others? Help me plz

భావన చెప్పారు...

ఎంతో టచింగ్ గా అనిపించింది. పాపం మీ బంటి బాబు... ముద్దొచ్చేసేడు... చాలా బాగా రాసేరు.... చాలా ఇంటరస్టింగ్ గా, టచ్చింగ్ గా, ఫన్నీ గా సాగింది పోస్ట్... very nice

కొత్త పాళీ చెప్పారు...

sweet.

కొత్త పాళీ చెప్పారు...

నేడెంత సుదినం! గోగినేని వినయ్ చక్రవర్తిగారి వ్యాఖ్య నాకు తెలుగు లిపిలో కనిపిస్తోంది!! నాకొక్కడికేనా, మీక్కూడానా?

నేస్తం చెప్పారు...

అవునండి తృష్ణ సిరి.. సిరి మువ్వగారు రాసారు ..అప్పట్లో నేను తనకు వాక్య పెట్టాను ఇదే విషయం మీద రాద్దాం అనుకున్నా గాని కుదరలేదు అని ఇన్నాళ్ళకు కుదిరిందన్నమాట ..
వెన్నెలా హ హ మీరూ నాలాంటివారే
మేధ ధన్యవాధాలు
హూం స్వప్న ఎన్నాళ్ళు బ్రతుకుతాయి అంటే చెప్పలేము కొంతమంది 14 ఇయర్స్ అంటారు కొంతమంది 7 అంటారు.. కుక్కను బట్టి ఉంటుంది ..థేంక్స్ మెచ్చుకున్నందుకు :)
సుభద్ర గారు ఇంట్రెస్ట్ లేకుండా పెంచలేరండి బాబు.. చాలా పని ఉంటుంది దానితో :)

kiranmayi చెప్పారు...

నాకు ఫస్ట్ నించి వేరే వాళ్ళ పెట్స్ ని దూరం నించి చూడడమే కాని దగ్గరకి వెళ్ళడం కాని, నాకంటూ ఒక పెట్ ఉండాలని కాని ఎప్పుడు లేదు (నేను చిన్నప్పుడు ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్తే వాళ్ళ కుక్క నన్ను వీర లెవెల్ లో చేజ్ చేసింది. అందుకని). గత మూడు నాలుగేళ్ళుగా, మా ఫ్రెండ్ ఒకమ్మాయి "guiding eyes" అన్న సంస్థలో volunteer గా జాయిన్ అయ్యింది. వాళ్ళు ఆ అమ్మాయికి ఒక కుక్కనిచ్చి బేసిక్ ట్రైనింగ్ చెయ్యమన్నారు. ఇలాంటి వాలంటీర్లు చాల మందే ఉన్నారట. ఆ కుక్కలు వాళ్ళ దగ్గర దాదాపు సంవత్సరంపాటు ఉంటాయి. ఆ కుక్కలకి ఏమేమి చెప్పాలో, ఎలా చెప్పాలో ప్రతి వీకెండ్ వాలంటీర్ లకి సెమినార్ సెషన్స్ ఉంటాయి. ట్రైనింగ్ అయ్యాక, కుక్కలన్నీ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెషన్స్ కి వెళ్తాయి. తరవాత ఎగ్జామ్స్ పాస్ అయ్యాక వాటిని blind people కి గైడ్ డాగ్స్ గా నియమిస్తారట. ఆ అమ్మాయిని నేను దాదాపు ప్రతి వీకెండ్ కలిసేదాన్ని. ప్రతి సారి ఆ అమ్మాయి కుక్క గురించి "she has a very strong personality" అనో లేక "she is not in a good mood today" అనో అంటుంటే, ఆశ్చర్యం అనిపించేది. పోయిన నెల ఆ అమ్మాయి దగ్గరున్న కుక్కకి bladder ప్రాబ్లం ఉండదని తెలిసి ప్రోగ్రాం లోంచి తేసేసారు. అప్పుడు తను ఆ కుక్కని తనే పెంచుకుందామని డిసైడ్ చేసుకుంది. చాలా ఖర్చు అవుతుందని తెలిసి కూడా అలా డిసైడ్ చేసుకుందంటే ఆ అమ్మాయికి దాని మీద ఎంత ప్రేముందో అర్ధమవుతుంది. కొన్ని సంబంధాలు అంతేనేమో.
సారీ చాల పెద్ద కామెంట్ వ్రాసాను.

నేస్తం చెప్పారు...

హూం వినయ్ గారు అప్పటికీ నాలుగైదు పేరాలు కుదించి కుదించి రాసాను అయినా ఇంత వచ్చేసింది ..ఒక్కోసారి టైప్ చేయలేక కూడా చాలా విషయాలు వదిలేస్తాను :) ఈ సారి భాగాలు రాస్తాను లెండి గొడవలేకుండా..కాకపోతే కంటిన్యుటి దెబ్బ తింటుంది :)
శేఖర్ మరే ఒక టైం లో సవతి మల్లే అనిపించింది :)నిజమే నన్ను ఎప్పుడూ ఏమనలేదు చాలా సార్లు తొక్కేసాను దాన్ని ..
కిషన్ నాకు మొదట్లో అస్సలు నచ్చేవి కావు కుక్కలు.. ఇప్పుడు కూడా వీధి కుక్కలంటే భయమే గాని మామూలు కుక్కపిల్లలను ముద్దు గానే చుస్తాను :)
రాహుల్ గారు మా బంటి క్లవరో కాదో తెలియదుగాని పాపం చాల అమాయకత్వం :)

నేస్తం చెప్పారు...

గీతాచార్య గారు అంతే అండి అంతే రాయకపోతే రాయలేదంటారు రాస్తే చదవరు ..అబ్బే లాభం లేదు రోజులు మారిపోయాయి :P
అఙ్ఞాత గారు అయ్యోపాపం .. హూం కాని కుక్కలు అన్నీ తింటాయండీ బాబు నేను మొదట్లో నమ్మేదాన్ని కాదు :)
అడ్డ గాడిదగారు అయ్ బాబోయ్ అదేం పేరండి ..koodali.org కి లింక్ వేసి పోస్టితే మీ పోస్ట్లు అన్నీ అందరికీ కనబడతాయి :)
భావన థేంక్స్ :)

నేస్తం చెప్పారు...

కొత్త పాళి గారు థేంక్స్ అండి :)
కిరణ్మయి గారు అబ్బా ఎన్ని విషయాలు చెప్పారండి.. అలాంటి వాళ్లు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు..నన్ను చూడండి ఒక్క సారి కరిచినందుకే గై గై మంటూ తెగ బాధ పడిపోయాను

అడ్డ గాడిద (The Ass) చెప్పారు...

అయ్ బాబోయ్ బాబోయ్... మీదీ గోదారేటండీ?

లక్ష్మి చెప్పారు...

:))

sunita చెప్పారు...

Baagundi.

నేస్తం చెప్పారు...

@ గాడిద గారు ఆయ్ మాది గోదారేనండీ
లక్ష్మి :)
సునితా థేంక్స్ అండి

అజ్ఞాత చెప్పారు...

super ga raasarandi...ee madya entaa sariga post lu raavatledanukontunnaaa...inthalo idhi....pokiri...magadheera range lo hit ichesaarandi....

నీ నేస్తం చెప్పారు...

చ్చాలా బాగుంది. నాకు కూడా చాలా భయం. కానీ మా అమ్మకు మాత్రం ఇట్టే దగ్గరయిపోతాయి. ఎంతలా అంటే వెళ్ళి ఒక్కసారి తల నిమురుతుంది అంతే నెక్ట్ టైమ్ తోక ఊపుతాయి.. కానీ నేను భయపడడానికి తగ్గట్టే నేను కనబడితే అరుస్తాయి. :-( వాఅఅఅఅఅఅఅ...

గీతాచార్య చెప్పారు...

ఇంత గొప్పగా శునకానందాన్ని హెవరు చెప్పగలరు నేస్తం మీరు తప్ప.

నాకూ పెంపుడు జంతువుల మీద అంత ఆసక్తి లేదు కానీ, కొన్ని చిత్రమైన అనుబంధాలున్నాయి. మా కాలేజ్ లో ఒక కుక్క ఉంది. అదంటే మా మహేష్ బాబుకి (అదే ప్రిన్స్ + పాల్ గారికి) చాలా ఇష్టం. ఒక రోజు నేను పాఠం చెప్తూ కుక్కల గురించి ప్రస్తావన వస్తే "కుక్క తమ్ముళ్ళూ, పాము పాపాయిలూ" అన్నాను.

కొంతమంది సన్నాసి రాయుళ్ళు... అప్పుడే ఆ కుక్క రావటం చూసి, "సార్! మీ తమ్ముడు వచ్చాడు," అన్నారు. దానికి నా రిటార్ట్... "అవును బ్రదర్. వెళ్ళి మన తమ్ముడికి ఒక బిస్కెట్ ఇచ్చిరా." పాపం మొహాలు చూడాలి.

అలాగే మరికొన్ని అనుబంధాలు.

ఆవు పిన్ని, నక్క చెల్లి, తోడేలు అన్నయ్య, శ్రీమాన్ మార్జాలం, పంది పాపాయిలు... హిహిహి. మొత్తానికీ అన్నింటినీ గుర్తకు తెచ్చారు.
*** *** ***
అవునండి రోజులు మారిపోయాయి. ఆగస్టు వెళ్ళి సెప్టెంబరు వచ్చింది, నిన్న పోయి ఇవాళొచ్చింది. హేం చేస్తాం? అంతే మరి.

అయినా మీరు రాస్తుంటే అంతకన్నానా? మన బ్లాగ్లోకపు యండామూరి సులోచనా రాణి, యద్దనపూడి వీరేంద్రనాథ్, ముళ్ళపూడి బాపూ మీరే కదా. ;-)

మాలా కుమార్ చెప్పారు...

మీ బంటీ కథ బాగుంది.
సో, నా గెస్ కరెక్ట్ అన్నమాట !
మీరు ఎంత పెద్దగా రాసినా ఏకబిగిన చదివిస్తారు. కాబట్టి పెద్దగా వుందని కుదించకండి. మీ పొస్ట్ లు చదువుతుంటే 70 లలోకి వెళ్ళి , ఆహ్లాదకరమైన ,సాంఘికనవలలు చదువుతున్నట్లుగా వుంది.

నేస్తం చెప్పారు...

నీ నేస్తం:- హ హ హ అంతే మరి కొంతమంది మొహాలను చూస్తే కొట్ట బుద్దేస్తుంది అంట ..మీరు నేనూ ఈ విషయం లో ఒకే పోలిక అన్నమాట :)
@ గీతాచార్య 'అప్పుడే ఆ కుక్క రావటం చూసి, "సార్! మీ తమ్ముడు వచ్చాడు," అన్నారు. దానికి నా రిటార్ట్... "అవును బ్రదర్. వెళ్ళి మన తమ్ముడికి ఒక బిస్కెట్ ఇచ్చిరా." పాపం మొహాలు చూడాలి.' హ హ సూపరూ ...
'యండామూరి సులోచనా రాణి, యద్దనపూడి వీరేంద్రనాథ్, ముళ్ళపూడి బాపూ మీరే కదా'
ఏంటోనండి మీరందరూ ఇంత పొగిడినా మా కళా హృదయం లేని శ్రీవారికి కొంచం కూడా అర్ధం అవ్వదు :)
మాల గారు థేంక్స్ అండి మీ అబిమానానికి :)

Srujana Ramanujan చెప్పారు...

మీ శ్రీవారికి మిమ్మల్ని తనే పొగిడితే మీకు దిష్టి కొడుతుందని భయమేమో???

నేస్తం మీ టపా మాత్రం కేక. టపా కట్టేసినోళ్ళూ కూడా లేచి కూచూని మరీ చదువుతారు

మంచు చెప్పారు...

సూపర్ గా వుంది బంటి కథ.
ఎలుకలా ??ఇంతకీ ఇది కుక్కా, పిల్లా ?? -- డైలాగు కేక
ఇంతకీ మీది గొదారికి ఏవైపు. తూ.గొ.నా..ప.గొ.నా ?

వేణూశ్రీకాంత్ చెప్పారు...

బాగుందండీ మీ బంటి కథ. పోస్ట్ లెంగ్త్ విషయంలో నాదీ మాల గారి మాటే.. కుదించకండి. ఎంత పెద్ద పోస్ట్ అయినా ఏకబిగిని చదివించేస్తారు, ఎక్కడా బోరు కొట్టనివ్వరు. అలా ఉంటేనే బాగుంటుంది.

పరిమళం చెప్పారు...

కుక్కల చేత వరసలు పెట్టి పిలిపించుకుంటారా ....అని అనుకున్నారా ....ఎంతమాట ! మా బాబాయి ఒకరు వాళ్లమ్మగారి పేరు జానకమ్మ ఐతే వాళ్లకుక్కపిల్లకి ఆపేరు పెట్టుకొని ముద్దుగా జానీ అంటూ పిలిచేవారు ...దాన్ని ఎవ్వర్నీ ఏమీ అననిచ్చేవారు కాదు ....అప్పుడప్పుడూ మాపిన్ని అత్తగారిమీద అక్కసు దానిమీద వెళ్లగక్కుతూ ఉండేది :) :)
మరోసారి మా పింకీని గుర్తుకుతెచ్చారు . మొత్తానికి కదా సుఖాంతమైందని అనుకొంటుంటే బంటీ ఇప్పుడు లేదన్నారు :(

శ్రీ చెప్పారు...

మా స్నేహితుడు ఇంట్లో ఉండేది snowy మాకు టిన్ టిన్ కామిక్స్ పిచ్చి లెండి ఆ వయసులో .. అలాగే ఉంటుంది కదా అని దీనికి ఆ పేరు మేమే పెట్టాం... మాతో పాటే పెరిగింది అది దాదాపుగా .నేను అంత ఎక్కువగా చేర తియ్యక పోయిన పాపం నన్ను బాగానే చూసుకునేది ... మేము అందరం అమెరికా వచ్చేసాక మా స్నేహితుడు తల్లి తండ్రులకి అదే చాల కాలం కాలక్షేపం ... దాని ఫొటోస్ కూడా చాల నే ఉన్నాయ్ వాళ్ళ ఇంట్లో ... (మా కన్నా అదే బెటర్ వాళ్ళని వదిలి ఉండలేదు బతికినంత కాలం )

మీరు బాగా రాస్తున్నారు ... ఓపిక ఎక్కువ మీకు ...

అన్ని బాగున్నై కాని, ... టైటిల్ లో ప్లాస్టిక్ పువ్వులు నచ్చలేదు .. అలాగే పక్కన ఫోటో కూడా... చాల artificial గా ఉంది.. మీ భావాలకి అది నప్పలేదు ... మిమ్మల్ని నొప్పిస్తే క్షంతవ్యుడిని

అజ్ఞాత చెప్పారు...

" చేసుకున్నోళ్ళకు చేసుకున్నంత మహాదేవ " అన్నారు. పూర్వం రాజులకు ఏనుగులు , జాతి గుర్రాలు అంటే మక్కువ వుండేదిట. మీకు కుక్కలంటే మక్కువ! అంతే!
ఏమిటో ఈ శునకానందం !

హరే కృష్ణ చెప్పారు...

మీ పొస్ట్ చదివాక నేనూ మార్గదర్సి లొ చేరాను ఒక కుక్కను పెంచుకుంటున్నాను ..భలే రాసారండీ!

నేస్తం చెప్పారు...

సృజన థేంక్స్ :)
మంచు పల్లకి గారు ఉభయ గోదావరులు నావే ఒకటి పుట్టునిల్లు అయితే ఇంకొకటి మెట్టినిల్లు :)
వేణు గారు థేంక్స్ అండీ అలాగే కానిస్తాను అయితే :)
పరిమళం గారు నాకు పెళ్ళి అయ్యేంత వరకూ తెలియదు అలా పిలుస్తారని ..:)

నేస్తం చెప్పారు...

సృజన థేంక్స్ :)
శ్రీ గారు నిజమే ఈ కాలం లో పిల్లలకంటే అవే చివరికంటూ తోడుగా ఉంటున్నాయి పెద్దవారికి..నిజమే హెడ్డెర్ మార్చాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను.. జ్యోతి గారు ఒక హెడ్డెర్ చెప్పారు కూడా.. అయినా అంత కాళీ లేక ఇంకా బద్దకం చేతా అలా వదిలేసా ..త్వరలో మారుస్తాను :)
@అఙ్ఞాత మీరన్నది కూడా నిజమే లేండి..మనుషులు పలురకాలు..ఎవరి శునకానందం వారిది ..
హరే కృష్ణ గారు హహ :D

Shashank చెప్పారు...

మా పిల్లి కథ లా ఉందండి ఇంచు మించుగా. దానికి మా ఫ్రెండ్ ఇష్టం. వాడు పడుకొని ఉంటే టేబల్ పైకి ఎక్కి వాడి మీద దూకేది. రాత్రంతా.. పాపాం వాడు ఏమీ అనేవాడు కాదు (అంటే వాడికి తెలిసేది కాదు మా పిల్లి దూకింది అని...) ప్రొదున్న లేచి నేతి దోస తినేది. ఫ్రెష్ చిప్స్ తప్ప ఓ రెండు రోజులు పాతదైన ముట్టేది కాదు.ప్చ్.. ఇప్పుడెందుకు లేండి.

అజ్ఞాత చెప్పారు...

నేస్తం,
మీ బంటి గురించి చదివి చాలా బాధేసింది ! నిష్కల్మషంగా ప్రేమిస్తాయి, పెంపుడు జంతువులు ! ఫోటో మీ బంటిదేనా?
- పద్మ.

HarshaBharatiya చెప్పారు...

nice..